<!-- Pramāṇa, a library of Indian primary sources · https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2 -->

[Pramāṇa](https://indike.org/pramana/) › [Indian literature](https://indike.org/pramana/in) › [Epic, Poetry, Drama & Narrative](https://indike.org/pramana/in.lit) › [The Mahābhārata and its versions](https://indike.org/pramana/in.lit.mahabharata) › [Mahābhāratas in Indian regional languages](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa) › [Andhra Mahabharatamu](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra) › 1.2

# Andhra Mahabharatamu 1.2: ఆదిపర్వము — ద్వితీయాశ్వాసము

Āndhra Mahābhāratamu 1.2

- **Language:** Telugu

### ఆదిపర్వము — ద్వితీయాశ్వాసము

### [1.2.1](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.1)

క. శ్రీవనితావల్లభ! వేం | గీవిషయాధీశ! కావ్యగీతప్రియ! నా  
నావనినాథకిరీటత | టీవిలసద్రత్నసంఘటితపదకమలా!

### [1.2.2](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.2)

వ. అక్కథకుండు శౌనకాదిమహామునులకుంజెప్పె: నాదియుగంబునం గశ్యపప్రజాపతిభార్యలయిన కద్రువయు వినతయు ననువారలు పుత్త్రార్థినులైయనేక సహస్రవర్షంబులు కశ్యపు నారాధించినం, గశ్యపుండు ప్రసన్నుం డై ‘మీకోరినవరంబు లిచ్చెద వేఁడుం’ డనిన.

### [1.2.3](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.3)

తరలము. అనలతేజులు, దీర్ఘదేహులు నైనయట్టి తనూజులన్‌  
వినుతసత్త్వులఁ గోరెఁ గద్రువ వేవురం గడువేడ్కతో;  
వినత గోరె సుపుత్త్రులన్‌ భుజవీర్యవంతుల, వారికం  
టెను బలాధికు లైన వారిఁ, గడిందివీరుల, నిద్దఱన్‌.

### [1.2.4](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.4)

వ. కశ్యపప్రజాపతి తొల్లి పెద్దకాలంబు తపంబు సేసి, పుత్త్రకామేష్టిఁ జేసెఁ గావునఁ గద్రువకు వేవురుకొడుకులను, వినతకు నిద్దఱుకొడుకులను వారికోరినయట్ల యిచ్చి, గర్భంబు లిమ్ముగా రక్షింపంబనిచిన నయ్యిద్దఱును దద్దయు సంతసిల్లి యున్నంత, గర్భంబులు గొండొకకాలంబునకు నండంబు లైన, నయ్యండంబులు ఘృతకుండంబులం బెట్టి రక్షించుచున్నంత, నేనూఱేండ్లకుఁ గద్రూగర్భాండంబులు తరతరంబ యవిసిన నందు శేష వాసుక్యైరావత తక్షక కర్కోటక ధనంజయ కాళియ మణినాగాపూరణ పింజర కైలాపుత్త్ర వామన నీలానీల కల్మాష శబలార్య కోగ్రక కలశపోతక సురాముఖ దధిముఖ విమలపిండ కాప్త కర్కోటక శంఖవాలి శిఖ నిష్ఠానక హేమగుహ నహుష పింగళ బాహ్యకర్ణ హస్తిపద ముద్గర పిండక కంబలాశ్వతర కాళీయక వృత్త సంవర్తక పద్మశంఖముఖ కూష్మాండక క్షేమక పిండారక కరవీర పుష్పదంష్ట్ర బిల్వక బిల్వపాండర మూషకాద శంఖశిరః పూర్ణభద్రహరిద్రకాపరాజిత జ్యోతిక శ్రీవహ కౌరవ్య ధృతరాష్ట్ర శంఖపిండ వీర్యవ ద్విరజస్సుబాహు శాలిపిండ హస్తిపిండ పిఠరక సుముఖ కౌణపాశన కుఠర కుంజర ప్రభాకర కుముద కుముదాక్ష తిత్తిరి హలిక కర్దమ బహుమూలక కర్కరాకర్కర కుండోదర మహోదరు లాదిగాఁగల వేవురు నాగముఖ్యులు పుట్టిన.

### [1.2.5](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.5)

క. తన గర్భాండంబులరెం | టను బ్రియనందనులు వెలువడమి, నతిలజ్జా  
వనత యయి వినత పుత్త్రా | ర్థిని యొకయండంబు విగతధృతి నవియించెన్‌.

### [1.2.6](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.6)

క. దాన నపరార్ధకాయవి | హీనుఁడు, పూర్వార్ధతనుసహితుఁ డరుణుఁ డనం  
గా నుదయించె సుతుండు, మ | హానీతియుతుండు తల్లి కప్రియ మెసఁగన్‌.

### [1.2.7](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.7)

వ. ఇట్లు వికలాంగుం డై పుట్టిన యనూరుండు వినతకు నలిగి ‘నన్ను సంపూర్ణశరీరుం గానీక యండం బవియించిన యవినీతవు కావున నీవు నీసవతికి దాసివై యేనూఱేం డ్లుండు’ మని శాపం బిచ్చి, ‘యింక నీ రెండవయండంబు తనకుఁ దాన యవియునంతకు నుండని; మ్మిందుఁ బుట్టెడు పుత్త్రుండు మహాబలపరాక్రమసంపన్నుండు నీ దాసీత్వంబు వాపు’ నని సెప్పి సూర్యరథసూతుండయి యరిగె; వినతయు నయ్యండం బతిప్రయత్నంబున రక్షించుకొనియుండె; నంత.

### [1.2.8](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.8)

క. అమరాసురవీరులు ము | న్నమల పయోరాశిఁ ద్రచ్చి, యమృతము వడయన్‌  
సమకట్టి, సురేంద్రపురో | గము లై హరిహరహిరణ్యగర్భులతోడన్‌.

### [1.2.9](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.9)

ఉ. మేరుమహామహీధరముమీఁదికి నందఱుఁ బోయి, ‘యేక్రియన్‌  
వారిధిఁ ద్రచ్చువారము? ధ్రువంబుగ దానికిఁ గవ్వ మెద్ది? యా  
ధారము దాని కెద్ది?’ యని తద్దయు వెన్బడియున్న, నచ్యుతాం  
భోరుహగర్భులిద్దఱును బూనిరి సర్వము నిర్వహింపఁగన్‌.

### [1.2.10](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.10)

చ. అరుదుగ సర్వశైలములయంత తనర్పును నార్జవంబు సు  
స్థిరతయు నోషధీరసవిశేషతయుం గల దుత్తమంబు మం  
థరకుధరంబు గవ్వ మగు దానికి నంచును నిశ్చయించి, య  
య్యిరువురుఁ బంపఁగాఁ బెఱికి యెత్తె ననంతుఁడు తద్గిరీంద్రమున్‌.

### [1.2.11](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.11)

వ. ఇట్లు పదునొకండువేలయోజనంబులతనర్పును, నంతియపాఁతునుం గల మంథరనగం బనంతుం డనంత శక్తిం బెఱికి యెత్తిన, నందఱును నప్పర్వతంబు దెచ్చి, సముద్రంబులో వైచి, దానిక్రింద నాధారంబుగాఁ గూర్మరాజు నియమించి, యోక్త్రంబుగా వాసుకి నమర్చి.

### [1.2.12](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.12)

శా. క్షోణీచక్రభరంబు గ్రక్కదల దిక్కుల్‌ మ్రోయఁగా నార్చి, య  
క్షీణోత్సాహసమేతు లై రయమునన్‌ గీర్వాణులుం, బూర్వగీ  
ర్వాణవ్రాతము నభ్ధిఁ ద్రచ్చునెడఁ దద్వ్యాకృష్టనాగానన  
శ్రేణీప్రోత్థవిషాగ్నిధూమవితతుల్‌ సేసెం బయోదావలిన్‌.

### [1.2.13](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.13)

క. ఉరగపతితలలవల నురు | తరజవమున నసురు లూఁది, తత్పుచ్ఛము ని  
ర్జరవరు లూఁది మహామ | త్సరమున వడిఁ ద్రచ్చి త్రచ్చి జవమఱియున్నన్‌.

### [1.2.14](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.14)

క. నారాయణుండు వారి క | వారితజవసత్త్వములు ధ్రువంబుగ నిచ్చెన్‌;  
వారును దొల్లిటికంటె న | పారప్రారంభు లై రపరిమితశక్తిన్‌.

### [1.2.15](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.15)

చ. ఉడుగక యొండొరుం జఱచి యొక్కబలంబున దేవదానవుల్‌  
వడిగొని వార్ధి నిట్లు దరువం దరువన్‌ విష ముద్భవిల్లి నల్‌  
గడలను విస్ఫులింగములు గప్పఁగఁ బర్విన, దానిఁ జెచ్చెరన్‌  
మృడుఁడు గడంగి పట్టుకొని మ్రింగి గళంబున నిల్పెఁ బొల్పుగన్‌.

### [1.2.16](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.16)

వ. మఱియు జ్యేష్ఠయుఁ జంద్రుండును శ్రీయును నుచ్చైశ్శ్రవంబును గౌస్తుభంబును నైరావణగజంబును నమృతపూర్ణశ్వేతకమండలు ధరుండైన ధన్వంతరియు నాదిగా ననేకంబు లుద్భవిల్లిన, నందుఁ ద్రిభువనవంద్య యయిన శ్రీదేవియు నిజప్రభాపటలపర్యుదస్త ప్రభాకరగభస్తివిస్తరం బయిన కౌస్తుభంబును నారాయణు వక్షఃస్థలంబున విలసిల్లె; నుచ్చైశ్శ్రవం బను యుగ్యంబు నైరావణగజంబును సురరాజయోగ్యంబు లయ్యె; నంత నయ్యమృతంబు నసురులు చేకొనిన.

### [1.2.17](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.17)

క. నారాయణుండు కృత్రిమ | నారీరూపమునఁ దన్మనంబుల కతి మో  
హారంభకారుఁ డై, యమ | రారులచేఁ గ్రమ్మఱంగ నమృతము గొనియెన్‌.

### [1.2.18](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.18)

వ. ఇ ట్లుపాయంబున నసురుల వంచించి యమృతంబు గొని విష్ణుదేవుండు దేవతల కిచ్చిన, నయ్యమృతంబు దేవత లుపయోగించుచోదేవరూపంబు దాల్చి రాహువు వేల్పులబంతి నయ్యమృతం బుపయోగించుచున్నఁ దత్సమీపంబున నున్న చంద్రాదిత్యులు వాని నెఱింగి నారాయణునకుం జెప్పిన, నయ్యమృతంబు వాని కంఠబిలంబు సొరకముందఱ.

### [1.2.19](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.19)

క. అమరారిమర్దనుఁడు చ | క్రము గ్రక్కున నేయ, రాహుకంఠము దెగి దే  
హము ధరణిఁ బడియెఁ, దన్ముఖ | మమృతస్పర్శమున నక్షయం బై నిలిచెన్‌.

### [1.2.20](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.20)

వ. నాఁటంగోలె రాహువునకుఁ జంద్రాదిత్యులతోడి విరోధంబు శాశ్వతం బై ప్రవర్తిల్లుచుండె.

### [1.2.21](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.21)

సీ. అంత దేవాహితు లమృతంబు గానక | యెంతయు నలిగి బలీంద్రుఁ గూడి  
మంతనం బుండి ‘యమర్త్యులతోడి పొ | త్తింతియ చాలు, నింకేల?’ యనుచు  
సంతనకట్టి, యుత్సాహసమేతులై | యంతంబులేని రథాశ్వములను  
దంతుల నమితపదాతుల నొడఁగూర్చి!| యంతకాకారు లై యార్చి, యమర  
ఆ. వరులఁ దాఁకి యేసి రురుతరశరపక్ష | జాతవాతరయవిధూత మగుచుఁ  
జెదర జలదపంక్తి, బెదర వజ్రాయుధు | హృదయ, ముదిలకొనఁగఁ ద్రిదశగణము.

### [1.2.22](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.22)

మహాస్రగ్ధర. అమరేంద్రారాతు లిట్లాహవముఖమున నేయంగఁ దత్తీక్ష్‌ణబాణౌ  
ఘము ఘోరం బై సురానీకముపయిఁ బెలుచం గప్పినం జూచి, దైత్యో  
త్తములం గోదండచక్రోద్యతభుజులు మహాదారుణుల్‌ వీరలక్ష్మీ  
రమణుల్‌ దుర్వారవాత్యారయమున నరనారాయణుల్‌ దాఁకి రల్కన్‌.

### [1.2.23](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.23)

మ. నరచాపప్రవిముక్తదారుణబృహన్నారాచధారల్‌ భయం  
కరదైతేయనికాయకాయములపైఁ గప్పెన్‌ దిశల్‌ నిండ బం  
ధురధాత్రీధరతుంగశృంగతటసందోహంబుపైఁ గప్పు దు  
ర్ధర ధారాధర ముక్తసంతతపయోధారావళిం బోలుచున్‌.

### [1.2.24](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.24)

మ. పతదుర్వీధరధాతునిర్ఝరజలాభం బై మహాదేహని  
ర్గత సాంద్రారుణపూర మొక్కమొగి నొల్కం ద్రెస్సి, నారాయణో  
న్నతదోర్దండవిముక్తచక్రనిహతిన్‌ నాకద్విషన్మస్తక  
ప్రతతుల్‌ ఘోరరణంబునం బడియె భూభాగంబు కంపింపఁగన్‌.

### [1.2.25](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.25)

వ. ఇట్లు సముద్రతీరంబున నమరాసురులకు నతిఘోరయుద్ధం బయ్యె; నందు నరనారాయణు లపారపరాక్రము లై యసురవీరులఁ బెక్కండ్రం జంపిన నుక్కడంగి, దెసచెడి, యసురులు సముద్రంబు సొచ్చిన, నమరులు సమరలబ్ధవిజయు లై యమరపతి నమృతరక్షణార్థంబు ప్రార్థించి, యథాస్థానంబున మంథరనగంబు ప్రతిష్ఠాపించి, తమతమనివాసంబులకుం జని సుఖంబుండి రంత.

### [1.2.26](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.26)

క. అమృతముతో నుద్భవ మై | యమరేశ్వరయోగ్య మైన హయరత్నము త  
ద్విమలోదధితీరంబునఁ | గొమరుగ నేకతమ యిచ్చఁ గ్రుమ్మరుచున్నన్‌.

### [1.2.27](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.27)

వ. కద్రువయు, వినతయు వినోదార్థంబు విహరించువారు కరిమకరనికరాఘాతజాత వాతోద్ధూత తుంగతరంగాగ్రసముచ్చలజ్జలకణాసారచ్ఛటాచ్ఛాదిత గగనతలం బైనదాని, నుద్యానవనంబునుంబోలె బహువిద్రుమలతాలంకృతం బైనదాని, నాటకప్రయోగంబునుంబోలె ఘనరసపాత్రశోభితరంగరమ్యం బైనదాని, దివంబునుం బోలె నహిమకరభరితం బైనదాని మఱియు.

### [1.2.28](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.28)

చ. అలఘుఫణీంద్రలోకకుహరాంతరదీప్తమణిస్ఫురత్ప్రభా  
వలి గలదాని, శశ్వదుదవాసమహావ్రతశీతపీడితా  
చలమునిసౌఖ్యహేతువిలసద్బడబాగ్ని శిఖాచయంబులన్‌  
వెలిఁగెడిదానిఁ గాంచి రరవిందనిభానన లమ్మహోదధిన్‌.

### [1.2.29](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.29)

మ. వివిధోత్తుంగ తరంగ ఘట్టన చలద్వేలావనైలావలీ  
లవలీలుంగలవంగ సంగతలతాలాస్యంబు లీక్షించుచున్‌  
ధవళాక్షుల్‌ సని కాంచి రంత నెదురం దత్తీరదేశంబునం  
దవదాతాంబుజ ఫేనపుంజనిభు నయ్యశ్వోత్తముం దవ్వులన్‌.

### [1.2.30](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.30)

వ. కని, కద్రువ వినతం జూచి ‘చూడవె యల్ల యతిధవళంబైన యశ్వంబునందు సంపూర్ణచంద్రునందు నల్లయుంబోలె వాలప్రదేశంబునందు నల్ల యై యున్నది’ యనిన విని వినతనగి ‘నీ వే కన్నులం జూచితే యక్క! యెక్కడిది నల్ల? యీయశ్వరాజుమూర్తి మహాపురుషకీర్తియుంబోలె నతినిర్మలం బై యొప్పుచున్నయది’ యనిన విని నవ్వి వినతకుఁ గద్రువ యి ట్లనియె.

### [1.2.31](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.31)

తే. ‘అమ్మహాశ్వంబుధవళదేహంబునందు | నల్ల గలిగిన నీ విపు నాకు దాసి  
వగుము; మఱి యందు నల్లలే దయ్యె నేని | నీకు నే దాసి నగుదుఁ; బన్నిదము సఱుము.’

### [1.2.32](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.32)

వ. అని యి ట్లిద్దఱు నొండొరులకు దాసీత్వంబు పణంబుగా నొడివి పన్నిదంబు సఱచిన, వినత ‘యయ్యశ్వంబు డాసి చూతము ర’ మ్మనినఁ గద్రువయు ‘నిపుడు ప్రొద్దు లేదు, పతిపరిచర్యాకాలంబు నయ్యె; ఱేపకడయ చూత’ మని యిద్దఱు మగుడివచ్చి తమ నివాసంబులకుం బోయి యున్న యప్పుడు.

### [1.2.33](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.33)

సీ. కద్రువ కొడుకులకడ కేఁగి ‘యేను మి | మ్మందఱ వేఁడెద నన్నలార!  
నాపంపు సేయుండు, నన్ను రక్షింపుఁడు | కామచారులకు దుష్కరము కలదె!  
యుల్ల తెల్లని తురగోత్తము వాలంబు | నల్ల సేసితిరేని నాకు దాసి  
యగు మన వినత, మీ రట్లు సేయనినాఁడు | దానికి మఱి యేను దాసి నగుదు;  
ఆ. జంట పన్నిదంబు సఱచితి మిట్లుగా’ | ననినఁ బాములెల్ల ‘ననయ మిదియుఁ  
దల్లి పనిచె నని యధర్మువు సేయంగ | నగునె? యెఱుక గలరె మగువ లెందు’!

### [1.2.34](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.34)

వ. అని యందఱుఁ దమలో విచారించి యధర్మారంభంబునకు సుముఖులు గాకయున్నఁ, గద్రువ కోపోద్దీపితముఖి యై.

### [1.2.35](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.35)

క. ‘అనుపమముగ జనమేజయుఁ | డను జనపతి సేయు సర్పయాగ నిమిత్తం  
బునఁ బాములు పంచత్వము | సనియెడు’ మని యురగములకు శాపం బిచ్చెన్‌.

### [1.2.36](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.36)

వ. అందు శాపానుభవభీతచిత్తుం డై కర్కోటకుం డనువాఁడు తల్లి పంచినరూపంబున నుచ్చైశ్శ్రవంబువాలంబు నీలంబుగాఁ బట్టి వ్రేలుచున్న, మఱునాఁడు ఱేపకడయ కద్రువయు వినతయుం జని, యత్తురంగంబుఁ జూచి వినత యోటువడి, కద్రువకు దాసి యై, నోసి పనులు సేయుచున్నంతఁ, బంచశత వర్షంబులు నిండి రెండవయండం బవిసిన నందు.

### [1.2.37](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.37)

ఉ. ఆతతపక్షమారుత రయ ప్రవికంపిత ఘూర్ణితాచల  
వ్రాత మహార్ణవుండు, బలవన్నిజదేహసముజ్జ్వల ప్రభా  
ధూత పతంగతేజుఁ డుదితుం డయి తార్‌క్ష్యుఁడు తల్లికిన్‌ మనః  
ప్రీతి యొనర్చుచున్‌ నెగసె భీమజవంబున నభ్రవీథికిన్‌.

### [1.2.38](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.38)

క. దారుణకల్పాంతమరుత్‌ | ప్రేరిత హవ్యవహశిఖల పెల్లిది యని బృం  
దారకమునిబృందస్తుతి | బోరనఁ దా నగ్నిసూక్తములతో నెసఁగెన్‌.

### [1.2.39](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.39)

వ. అంత.

### [1.2.40](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.40)

క. హరికులిశక్షతి యెఱుఁగని | గురుతరపక్షములతోడి కులగిరివోలెన్‌  
గరుడండు గగనగతి నురు | తరజవమున నరుగుదెంచి తల్లికి మ్రొక్కెన్‌.

### [1.2.41](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.41)

వ. ఇట్లు నిజజననికి మ్రొక్కి కద్రువపాలికిం బోయి.

### [1.2.42](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.42)

చ. తడయక మ్రొక్కియున్న వినతాసుతు నప్పుడు సూచి, యాత్మలో  
నిడుగడఁ జేయుచుం గడు సహింపక కద్రువ వానిఁ బిల్చి ‘నా  
కొడుకుల నెల్ల నెత్తికొని క్రుమ్మరుచుండుమ, యేమి పంచినన్‌  
మడవక చేయు మీ’ వని సమర్పణ సేసెఁ బ్రభుత్వ మేర్పడన్‌.

### [1.2.43](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.43)

వ. గరుడండును గద్రువ పంచిన పనులెల్లను వినత యనుమతంబున నతివినయపరుం డై చేయుచు.

### [1.2.44](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.44)

క. ఆ పన్నగముఖ్యులఁ దన | వీఁపునఁ బెట్టికొని పఱచి, విపినములు, మహా  
ద్వీపములు, గిరులు, నఖిల ది | శాపాలపురములుఁ జూపెఁ జన వారలకున్‌.

### [1.2.45](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.45)

వ. ఒక్కనాఁడు సప్తమారుతజవంబున సప్తాశ్వమండలంబుదాఁక నెగసిన, నమ్మార్తాండు చండకిరణంబుల వేఁడిమిఁ దాఁకి, మాఁడి, గరుడని వీఁపున నున్నయురగులు దొరఁగి నేలంబడి మూర్ఛవోయినంజూచి, కద్రువ కడునలిగి, గరుడనిం బదరి, యతిభక్తి నింద్రు నారాధించి.

### [1.2.46](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.46)

చ. నరసురసిద్ధకింపురుషనాగనభశ్చరముఖ్యు లెల్ల నీ  
కరుణయ వేచి మండ్రు, త్రిజగంబులు నీ కులిశాభిరక్షణ  
స్ఫురణన చేసి సుస్థిరతఁ బొందుఁ బురందర! సర్వలోకసుం  
దర! శరణంబు నా కగుము దానవసూదన! పాకశాసనా!

### [1.2.47](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.47)

వ. అని స్తుతియించి పర్జన్యప్రసాదంబున మహావృష్టి గొడుకులపయిం గురియించి, యయ్యురగుల విగత పరితాపులంజేసి కద్రువ గర్వంబున నుఱక గరుడని వినతనుం బనులుగొనుచున్నంత, నొక్కనాఁడు గరుడండు తల్లి కి ట్లనియె.

### [1.2.48](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.48)

ఉ. ఆయతపక్షతుండహతి నక్కులశైలము లెల్ల నుగ్గుగాఁ  
జేయు మహాబలంబును బ్రసిద్ధియునుం గల నాకు నీపనిం  
బాయక వీఁపునం దవడుఁ బాముల మోవను, వారికిం బనుల్‌  
సేయను నేమి కారణము సెప్పుము దీనిఁ బయోరుహాననా!

### [1.2.49](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.49)

వ. అని యడిగిన వినత తనకుం గద్రువతోడి పన్నిదంబున నైన దాసీత్వంబును, తత్కారణం బైన యనూరుశాపంబును గొడుకున కేర్పడం జెప్పి యి ట్లనియె.

### [1.2.50](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.50)

క. నీ కతమున నా దాస్యము | ప్రాకటముగఁ బాయు ననిన పలు కెడలోనం  
జేకొని, యూఱడి నిర్గత | శోకస్థితి నున్నదానఁ జూవె ఖగేంద్రా!

### [1.2.51](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.51)

వ. ‘కొడుకులు సమర్థులైనం దల్లిదండ్రులయిడుమలు వాయుట యెందునుంగలయది, గావున నీయట్టిసత్పుత్త్రుం బడసియు దాసి నై యుండుదాననే’ యనిన విని వైనతేయుండు తద్దయు దుఃఖితుం డై, యొక్కనాఁడు కాద్రవేయుల కి ట్లనియె.

### [1.2.52](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.52)

క. మా యీ దాస్యము వాయు ను | పాయము సేయుండు, నన్నుఁ బనుపుం డిష్టం  
బేయది దానిన తెత్తు న | జేయుఁడ నై యమరవరులఁ జేకొని యైనన్‌.

### [1.2.53](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.53)

వ. అనిన నయ్యురగులు కరుణించి గరుడని కి ట్లనిరి.

### [1.2.54](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.54)

చ. ‘అమితపరాక్రమంబును, రయంబును, లావును గల్గు ఖేచరో  
త్తముఁడవు నీవు; నీదయినదాస్యముఁ బాచికొనంగ నీకుఁ జి  
త్తము గలదేని, భూరిభుజదర్పము శక్తియు నేర్పడంగ మా  
కమృతముఁ దెచ్చియి’ మ్మనిన నవ్విహగేంద్రుఁడు సంతసంబునన్‌.

### [1.2.55](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.55)

వ. ‘అట్ల చేయుదు; నమృతంబు దెచ్చి మీ కిచ్చి, యేనునుం దల్లియు దాస్యంబువలన విముక్తుల మగువార’ మని నొడివి, తద్వృత్తాంతం బంతయుం దల్లికింజెప్పి ‘యమృత హరణార్థం బరిగెద’ నని మ్రొక్కిన, వినత సంతసిల్లి కొడుకుం గౌఁగిలించుకొని.

### [1.2.56](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.56)

చ. ‘అనిలుఁడు పక్షయుగ్మ, మమృతాంశుఁడు వీఁపనలుండు మస్తకం,  
బినుఁడు సమస్తదేహమును నెప్పుడుఁ గాచుచు నీ కభీష్టముల్‌  
ఘనముగఁ జేయుచుండెడు జగన్నుత! యున్నతియున్‌ జయంబుఁ జే  
కొను’ మని యిచ్చె దీవనలు గోరి ఖగేంద్రునకుం బ్రియంబునన్‌.

### [1.2.57](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.57)

వ. గరుడండును దల్లిదీవనలు గైకొని గమనోన్ముఖుం డై ‘యమృతంబు దెచ్చునపుడు లావు గలుగవలయు, నా కాహారంబు ప్రసాదింపు’ మనిన వినత యి ట్లనియె.

### [1.2.58](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.58)

క. విషనిధికుక్షి నసంఖ్యము | నిషాదగణ ముండి ధారుణీప్రజకుఁ గడున్‌  
విషమమును జేయు, దాని ని | మిషమున భక్షించి చను మమిత్రవిఘాతీ!

### [1.2.59](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.59)

వ. ‘భక్షణవిషయంబున బ్రాహ్మణునిం బరిహరించునది’ యనిన గరుడండు ‘నాకు బ్రాహ్మణు నెఱుంగు తెఱంగెఱింగింపు’ మనిన వినత యి ట్లనియె.

### [1.2.60](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.60)

క. రయమున మ్రింగుడు గాలము | క్రియ నెవ్వఁడు కంఠబిలముక్రిందికిఁ జన క  
గ్నియపోలె నేర్చుచుండును | భయరహితా! వాని నెఱుఁగు బ్రాహ్మణుఁ గాఁగన్‌.

### [1.2.61](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.61)

తే. కోపితుం డైన విప్రుండు ఘోరశస్త్ర | మగు, మహావిష మగు, నగ్ని యగు; నతండ  
యర్చితుం డైన జనులకు నభిమతార్థ | సిద్ధికరుఁ డగు, గురుఁడగుఁ, జేయుఁ బ్రీతి.

### [1.2.62](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.62)

వ. అని బ్రాహ్మణస్వరూపంబుఁ జెప్పిన నెఱింగి, వినతకు మ్రొక్కి వీడ్కొని, గరుడం డతిత్వరితగతిం బఱచి, సముద్రోదరంబున నున్న నిషాదు లనేక శతసహస్రసంఖ్యలవారిం బాతాళవివరంబునుంబోని తనకంఠబిలంబుఁ దెఱచి యందఱ నొక్కపెట్ట మ్రింగిన, నం దొక్క విప్రుం డుండి కుత్తుకకు డిగక నిప్పునుంబోలె నేర్చుచున్న నెఱింగి, ‘నాకంఠబిలంబున విప్రుం డున్నవాఁడేని వెలువడి వచ్చునది’ యనిన గరుడని క వ్విప్రుం డి ట్లనియె.

### [1.2.63](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.63)

ఉ. ‘విప్రుఁడ నున్నవాఁడ, నపవిత్రనిషాది మదీయభార్య, కీ  
ర్తిప్రియ! దీనిఁ బెట్టి చనుదెంచుట ధర్మువె నాకు?’ నావుడున్‌  
‘విప్రులఁ బొంది యున్న యపవిత్రులుఁ బూజ్యులు గారె; కావునన్‌  
విప్రకులుండ! వెల్వడుము వేగమ నీవును నీ నిషాదియున్‌.’

### [1.2.64](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.64)

వ. అనిన నాగరుడని యనుగ్రహంబున బ్రాహ్మణుండు నిషాదీసహితుం డై వెలువడి వచ్చి, గరుడని దీవించి, యథేచ్ఛం జనియె; గరుడండును గగనపథంబునం బఱచి, కశ్యపుం గని నమస్కరించి, ‘యస్మజ్జననీ దాస్యనిరాసార్థం బురగుల కమృతంబుఁ దేర నరిగెద, నిషాదఖాదనంబున నాఁకలి వోవకున్నయది, నా కాహారంబు ప్రసాదింపు’ మనిన కొడుకుకడంకకు మెచ్చి కశ్యపప్రజాపతి యి ట్లనియె.

### [1.2.65](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.65)

క. అనలనిభుండు విభావసుఁ | డను విప్రుఁడు నియమవంతుఁ డర్థాఢ్యుం డై  
తనరి సుఖ మున్న, నాతని | యనుజన్ముఁడు సుప్రతీకుఁ డనువాఁ డతనిన్‌.

### [1.2.66](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.66)

క. ‘మనపితృవర్గము వడసిన | ధనము విభాగించి యిమ్ము ధర్మస్థితి నా’  
కని యడుగంబోయిన య | య్యనుజునకు విభావసుం డహంకారమునన్‌.

### [1.2.67](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.67)

క. తా నలిగి యిచ్చె శాపం | ‘బేనుఁగ వై యుండు’ మని, సహింపక వాఁడున్‌  
మానుగఁ ‘గూర్మమ వగు’ మని | వానికిఁ బ్రతిశాప మిచ్చె వసులోభమునన్‌.

### [1.2.68](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.68)

వ. ‘ఇ ట్లన్నయుం దమ్ముండును నన్యోన్యశాపంబులం జేసి యోజనత్రయోత్సేధంబు గలిగి దశయోజనవృత్తం బైన కూర్మంబును, షడ్యోజనోత్సేధంబు గలిగి ద్వాదశ యోజన విస్తృతం బైన గజంబును నై సరోవర విపినంబుల నుండి యర్థనిమిత్తం బైన పూర్వవైరంబునఁ దమలో నిత్యంబు నొండొంటితోడం బెనంగి పోరుచుండు; నవి నీకాహారంబు సు; మ్మరుగుము, కార్యసిద్ధి యయ్యెడు’ మనిన గరుడండును మనోవేగంబునం బఱచి యారెంటినిం గాంచి.

### [1.2.69](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.69)

క. చఱచి యొకచేతఁ గూర్మముఁ | బెఱచేత గజంబుఁ బట్టి పెనఁచి ఖగేంద్రుం  
డిఱికికొని గగనవీథిం | బఱచె వియచ్చరవిమానపంక్తులు దూలన్‌.

### [1.2.70](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.70)

క. కనకవ్రతతీవితతులఁ | బెనఁగిన సురభూరుహములఁ బెద్దయు బెడఁగై  
తనరిన యలంబతీర్థం | బున కరిగె నగంబు లొక్కమొగి గ్రక్కదలన్‌.

### [1.2.71](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.71)

వ. అందు రోహిణంబను పాదపోత్తమంబు గరుడనిం గని సంభావించి ‘శతయోజనాయతంబైనమదీయ శాఖపై నుండి యిగ్గజకచ్ఛపంబుల భక్షించి పొ’ మ్మనిన గరుడండు ‘నట్ల చేయుదు’ నని యమ్మహాశాఖపై నూఁద సమకట్టి, యందు.

### [1.2.72](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.72)

క. పాదంబులు పెట్టుడుఁ ద | త్పాదపఘనశాఖ విఱిఁగి బల్లన నుచ్చై  
ర్నాదమున దిక్కు లద్రువఁగ | భేదిల్లె విహంగతతులు భీతిం బఱవన్‌.

### [1.2.73](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.73)

వ. అమ్మహాశాఖ నవలంబించి తలక్రిం దై యాదిత్యకిరణంబులు తమ కాహారంబుగాఁ దపంబు సేయుచున్న వాలఖిల్యమహామునిగణంబులం జూచి, యిది భూమిపయింబడిన నిమ్మునులకు బాధయగు నని దానిం గఱచికొని, గజకచ్ఛపంబులం గరంబుల నిఱికికొని, గరుడండు గగనంబునం బఱచి, తనకు నూఁద నిమ్మగు ప్రదేశం బెందునుం గానక గంధమాదనంబునకుం జని, యందుఁ దపంబు సేయుచున్న కశ్యపుం గనుంగొని మ్రొక్కిన.

### [1.2.74](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.74)

చ. కనకమహీధరప్రతిమకాయు, మహాజవనిర్జితప్రభం  
జను, నవిచింత్య భూరిబలసత్త్వసమన్వితు, దీప్తహవ్యవా  
హనసము, వైనతేయునిఁద దాస్యగతద్రుమశాఖ నున్న య  
త్యనఘుల వాలఖిల్యులను, నమ్మునినాథుఁడు చూచి నెమ్మితోన్‌.

### [1.2.75](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.75)

వ. ‘ఇగ్గరుడండు భువనహితమహారంభుండు బలసమన్వితుండు, మీకు బాధయగునని యిత్తరుశాఖ విడువనేరకున్న వాఁడు; వీనిం గరుణించి మీరొండుకడ కరుగుం’ డనిన వాలఖిల్యులు కశ్యపుప్రార్థనం జేసి దాని విడిచి హిమవంతంబునకుం జనిరి; గరుడండును ముఖనిక్షిప్తశాఖాస్ఖలితవచనుం డగుచుఁ దండ్రి కిట్లనియె.

### [1.2.76](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.76)

క. ధరణీసురవిరహిత మగు | నరణ్యదేశంబు నాకు నానతియిం డి  
త్తరుశాఖ విడువవలయును | కరము నిరోధ మిది యనినఁ గశ్యపుఁ డనియెన్‌.

### [1.2.77](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.77)

క. హిమశైలకందరాభా | గముకడ నిష్పురుషనగము కల దచ్చో నీ  
ద్రుమశాఖ విడువు మది దా | నమానుష మగమ్య మీశ్వరాదుల కైనన్‌.

### [1.2.78](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.78)

వ. ‘అది యిచ్చటికి లక్షయోజనంబులు గల దరుగు’ మనిన గరుడండును మనోవేగంబునం బఱచి యా నిష్పురుషనగంబునం దత్తరుశాఖ విడిచి హిమవంతంబుమీఁదికిం బోయి గజకచ్ఛపంబుల భక్షించి, మహాసత్త్వసంపన్నుం డై నాకలోకంబున కెగయ సమకట్టి పక్షవిక్షేపంబుఁ జేసిన.

### [1.2.79](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.79)

క. ఘనపక్షానిలచలితా | వనిరుహములవలనఁ దొరఁగు వరపుష్పచయం  
బనిమిషజయార్థ మరిగెడు | వినతాసుతుమీఁదఁ బుష్పవృష్టియ పోలెన్‌.

### [1.2.80](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.80)

వ. ఇట్లమృతహరణార్థంబు గరుడండు గగనంబున కెగసిన, నట దేవలోకంబునందు.

### [1.2.81](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.81)

మాలిని. సురపతిసభఁ జూడం జూడ నంగారవృష్టుల్‌  
గురిసెఁ గులిశధారల్‌ గుంఠితం బయ్యె, దిక్కుం  
జరమదము లడంగెన్‌, సర్వదిక్పాలకాంతః  
కరణములు భయోద్వేగంబునన్‌ సంచలించెన్‌.

### [1.2.82](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.82)

వ. ఇట్టి మహోత్పాతంబులు పుట్టిన, సురపతి బృహస్పతిం జూచి, ‘యిది యేమి నిమిత్తం?’ బని యడిగిన, దాని నంతయు నెఱింగి బృహస్పతి సురపతి కి ట్లనియె.

### [1.2.83](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.83)

సీ. బ్రహ్మణ్యుఁ డగు కశ్యపబ్రహ్మవరమున | వినతకుఁ బుట్టిన యనఘమూర్తి  
వాలఖిల్యులదయ వరపక్షికులమున | క్రిందుఁ డై పరఁగిన యిద్ధతేజుఁ,  
డుదధిలో నున్న యత్యుగ్రనిషాదుల | నారంగ మ్రింగిన ఘోరవీరుఁ,  
డిభకచ్ఛపముల రోహిణశాఖతో నెత్తి | కొని దివిఁ బఱచిన యనిలవేగి.  
తే. వీఁగి తనతల్లిదాస్యంబు నీఁగఁబూని | తడయ కమృతంబు గొనిపోవఁ గడఁగి వచ్చెఁ;  
గామరూపసంపన్నుండు, గామగమనుఁ | డతఁడు నీకు నసాధ్యుండు శతమఖుండ!

### [1.2.84](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.84)

వ. అగ్గరుడని మాహాత్మ్యంబు నీవు నెఱుంగుదు; వది యెట్లనినఁ దొల్లి కశ్యపప్రజాపతి పుత్త్రార్థి యై భవత్ప్రభృతులైన దేవగణంబులను, వాలఖిల్యప్రముఖు లైన మహామునిగణంబులను దనకు సహాయులనుగాఁ బడసి పుత్త్రకామేష్టి సేయునాఁడు నీవు నీబలంబునకుం దగినయిద్మభారంబు మోచికొని యశ్రమంబున వచ్చువాఁడ వై, యల్పకుశపలాశేధ్మభారంబులు మోచికొని వడవడ వడంకుచు వచ్చువారి, నల్పసత్త్వుల, నంగుష్ఠప్రమాణ దేహుల; ననవరతోపవాస కృశీభూత శరీరుల, వాలఖిల్యమహామునులం జూచి నగిన, నమ్మునులు సిగ్గుపడి కడు నలిగి.

### [1.2.85](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.85)

క. రణవిజయుఁ డనల తేజుం | డణిమాదిగుణాఢ్యుఁ డుదితుఁ డయ్యెడు వీరా  
గ్రణి శతమఖుకంటెను శత | గుణవీర్యుం డైన పుత్త్రకుం డజితుం డై.

### [1.2.86](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.86)

వ. వాఁడు రెండవయింద్రుం డయ్యెడు మని మహావీర్యవంతంబు లైన మంత్రంబుల వేల్చుచున్నంత, నంతయు నెఱింగి నీవు కశ్యపుపాలికిం బోయి నాకుం గరుణింపుండని వారిం బ్రార్థించినఁ గశ్యపప్రజాపతి యమ్మునుల కి ట్లనియె.

### [1.2.87](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.87)

ఉ. ఉండు నితండు పద్మజు నియోగమునం ద్రిజగంబులందు నిం  
ద్రుం డయి భూతరాశిఁ దన దోర్బలశక్తిఁ గడంగి కాచుచున్‌;  
రెండవయింద్రుఁ డైన విపరీత మగున్‌ భువనప్రవృత్తి; మీ  
రొండువిధంబు సేయు టిది యుక్తమె బ్రహ్మనియుక్తి యుండఁగన్‌.

### [1.2.88](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.88)

వ. ‘మీవచనం బమోఘంబు గావున నింక నాకు నుద్భవిల్లెడు పుత్త్రుండు పక్షికులంబున కెల్ల నింద్రుం డయ్యెడు’ మనికశ్యపుండు వారల నొడంబఱిచి నీయింద్రత్వంబేకాధిష్ఠితంబు సేసె; నట్టి కశ్యపప్రజాపతి యజ్ఞమహిమను, వాలఖిల్యులతపోమహిమను వినతకుం బుట్టి విహగేంద్రుం డయిన యా గరుడం డిప్పు డమృతహరణార్థం బరుగుదెంచుటంజేసి స్వర్గలోకంబున మహోత్పాతంబులు పుట్టె’ నని సురపతికి బృహస్పతి చెప్పిన విని, యింద్రుం డమృతరక్షకుల నెల్ల రావించి, ‘మీర లతిప్రయత్నంబున నమృతంబు రక్షించుకొని యుండుం’ డని పంచిన ‘వల్లె’ యని.

### [1.2.89](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.89)

క. వారలు బహుప్రకారా | కారులు, వీరులు, నిశాతఖడ్గాదిమహా  
దారుణ శస్త్రధరులు, కృ | ష్ణారుణ సితపీతఘనతరాంగత్రాణుల్‌.

### [1.2.90](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.90)

క. సమకట్టి యొక్కమొగి న | ప్రమాదు లై నిలిచి రేయుఁబవలును రక్షా  
క్షము లై యమృతము చుట్టును | నమేయబలు లుండి రంత నతిరభసమునన్‌.

### [1.2.91](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.91)

మ. వితతోల్కాశనిపుంజమొక్కొ యనఁగా విన్వీథివిక్షిప్తప  
క్షతివాతాహతిఁ దూలి తూలశకలాకారంబు లై వారిద  
ప్రతతుల్‌ సాల్పడి నల్గడం జెదరఁగాఁ బాఱెన్‌ మనోవేగుఁ డై  
పతగేంద్రుం డమృతాంతికంబునకుఁ దత్పాలుర్‌ భయం బందఁగన్‌.

### [1.2.92](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.92)

వ. అంత.

### [1.2.93](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.93)

క. కల్పాంతానలకీలా | కల్పాయతపక్షుఁ, బక్షిగణవిభు, శౌర్యా  
కల్పుఁ గని, యమృతరక్షు ల | నల్పక్రోధు లయి తాఁకి రార్చి కడంకన్‌.

### [1.2.94](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.94)

క. తడఁబడ నేసియు వైచియుఁ | బొడిచియు వివిధాస్త్రశస్త్రముల నుద్ధతు లై  
కడుకొని యుద్ధము సేసిరి | కడిమిమెయిన్‌ విబుధవరులు గరుఁడనితోడన్‌.

### [1.2.95](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.95)

వ. గరుడండును నిజపక్ష విక్షిప్తరజోవృష్టి నమరవరుల దృష్టిపథంబుఁ గప్పి స్వర్గలోకంబు నిరాలోకంబుగాఁ జేసిన, నమరేంద్రుపనుపునం బవనుం డా రజోవృష్టి చెదర వీచె నంత.

### [1.2.96](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.96)

మాలిని. పరశు కులిశ కుంత ప్రాస బాణాసనోద్య  
త్పరిఘ కణప చక్ర ప్రస్ఫుర ద్బాహు సేనా  
పరివృతుఁ డయి తాఁకెన్‌ భౌమనుం డన్మహాకిం  
కరుఁడు సమరకేళీగర్వితున్‌ వైనతేయున్‌.

### [1.2.97](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.97)

క. బలవత్‌ఖగేంద్రకోపా | నలభస్మీభూతుఁ డై క్షణంబున వాఁడున్‌  
బలమఱి క్రాఁగె నుదగ్ర | జ్వలన జ్వాలావలీఢశలభమపోలెన్‌.

### [1.2.98](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.98)

సీ. పక్షతుండాగ్ర నఖక్షతదేహు లై | బోరన నవరక్తధార లొలుక  
విహగేంద్రునకు నోడి నిహతు లై సురవరుల్‌ | సురరాజు మఱువు సొచ్చిరి కలంగి;  
సాధ్యు లనాయాససాధ్యులై పాఱిరి | పూర్వాభిముఖు లయి గర్వ ముడిఁగి;  
వసువులు రుద్రులు వసుహీనవిప్రుల | క్రియ దక్షిణాశ్రితు లయిరి భీతి  
ఆ. వంది; యపరదిక్కుఁ బొంది రాదిత్యు; లా | శ్వినులు నుత్తరమున కొనరఁ బఱచి;  
రనల వరుణ పవన ధనద యమాసురుల్‌ | వీఁక దఱిఁగి కాందిశీకు లయిరి.

### [1.2.99](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.99)

క. తలరఁగ రేణుక్రథన | ప్రలిహప్రరుజాశ్వకృంతపదనఖులను ర  
క్షులఁ గులిశనిశాతనఖా | వలిఁ బక్షీంద్రుండు వ్రచ్చివందఱలాడెన్‌.

### [1.2.100](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.100)

వ. ఇట్లు నిర్జరవరుల నెల్ల నిర్జించి, యూర్జితుం డై గరుడం డమృతస్థానంబున కరిగి, దానిం బరివేష్టించి ఘోరసమీరప్రేరితం బై దుర్వారశిఖాజిహ్వల నంబరంబు నాస్వాదించుచున్న యనలంబుం గని, తత్‌క్షణంబ సకలనదీజలంబుల నెల్లఁ బుక్కిలించుకొని వచ్చి యయ్యనలంబు నాఱంజల్లి, తీక్ష్‌ణధారం బై దేవనిర్మితం బై పరిభ్రమించుచున్న యంత్రచక్రంబు నారాంతరంబున సంక్షిప్తదేహుం డై చొచ్చి యచ్చక్రంబుక్రింద.

### [1.2.101](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.101)

ఉ. ఘోరవికార సన్నిహిత కోపముఖంబులు, దీప్తవిద్యుదు  
ల్కారుణ దారుణాక్షములు నై, నిజదృష్టి విషాగ్ని నన్యులం  
జేరఁగనీక యేర్చుచుఁ బ్రసిద్ధముగా నమృతంబు చుట్టు ర  
క్షారతి నున్న యుగ్రభుజగంబుల రెంటిని గాంచి చెచ్చెరన్‌.

### [1.2.102](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.102)

వ. అయ్యురగంబులం దనపక్షరజోవృష్టినంధంబులంజేసి, వాని శిరంబులు ద్రొక్కి పరాక్రమం బెసంగనమృతంబు కొని గరుడండు గగనంబున కెగసిన.

### [1.2.103](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.103)

క. కలహమున నిట్లు సురవీ | రులఁ బల్వుర నోర్చి, యొక్కరుఁడ యమృతముఁ దె  
క్కలికొని, యాస్వాదింపక | యలోలుఁ డగు వానిఁ జూచి హరి యి ట్లనియెన్‌.

### [1.2.104](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.104)

క. నీ విజయోత్సాహమునకు, | లావునకు, జవంబునకు, నలౌల్యమునకు, స  
ద్భావమునకు మెచ్చి, వరం | బీ వచ్చితి, వేఁడు మెద్ది యిష్టము నీకున్‌.

### [1.2.105](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.105)

వ. అని ప్రసన్నుం డై యానతిచ్చిన యాదిదేవుం డగు శ్రీమన్నారాయణునకు నమస్కరించి గరుడం డి ట్లనియె.

### [1.2.106](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.106)

సీ. ‘అమృతాశనంబు చేయకయును దేవ! నా | కజరామరత్వంబు నందుటయును,  
అఖిలలోకంబుల కగ్రణి వైన నీ | యగ్రంబునందు ని న్నధికభక్తిఁ  
గొలుచుచు నునికియుఁ గోరితిఁ, గరుణతో | దయసేయు ముద్ధతదైత్యభేది!’  
యనవుడు వానికి నభిమతంబులు ప్రీతుఁ | డై యిచ్చి హరి యిట్టు లనియె: ‘నాకు  
ఆ. ననఘ! వాహనంబ వై మహాధ్వజమ వై | యుండు’ మనినఁ బక్షియును ప్రసాద  
మనుచు మ్రొక్కిపఱచె; నంత నాతనిమీఁద | వజ్ర మెత్తి వైచె వాసవుండు.

### [1.2.107](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.107)

వ. అదియును నంబరంబున నగ్నికణంబులు చెదరం బఱతెంచి పక్షిరాజుపక్షంబులు దాఁక వచ్చినం జూచి గరుడండు నగి, ‘నీచేయువేదన నన్నుం దాఁక నోపదు; నీవు మహాముని సంభవంబ వగుటను, దేవేంద్రునాయుధంబ వగుటను నిన్ను నవమానింపంగాదు, గావున మదీ యైకపర్ణశకలచ్ఛేదంబు సేయుము; నాయందు నీశక్తి యింతియ’ యనిన సకలభూతసంఘం బెల్ల నాతనిపర్ణంబులసుస్థిరత్వంబునకు మెచ్చి సుపర్ణుం డని పొగడిరి. సురేంద్రుండును నవ్విహగేంద్రుమాహాత్మ్యంబునకు మెచ్చి యచ్చెరు వంది యి ట్లనియె

### [1.2.108](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.108)

ఆ. నిరుపమానశౌర్య! నీతోడఁ జెలిమి సే | యంగ నా కభీష్ట మైనయదియు;  
నిట్టి విక్రమంబు, నిట్టి సామర్థ్యంబుఁ | గలదె! యొరుల కిజ్జగంబునందు.

### [1.2.109](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.109)

క. అమరుఁడ వజరుఁడ వజితుఁడ | వమేయుఁడవు; నీకు నమృత మది యేల ఖగో  
త్తమ! దీని నొరుల కిచ్చిన | నమరులకును వా రసాధ్యు లగుదురు పోరన్‌.

### [1.2.110](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.110)

క. ‘నీ వొరులకు నీయమృతం | బీ వలవదు; నాకు మగుడ నిచ్చిన నీ కి  
ష్టావాప్తి యగు విధం బేఁ | గావించెద’ ననిన హరికి గరుడం డనియెన్‌.

### [1.2.111](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.111)

వ. ‘ఏను మదీయమాతృదాసీత్వనిరాసార్థం బురగుల కమృతంబుఁ దెచ్చియిత్తు నని కాద్రవేయులతో నొడివి వచ్చినవాఁడ; నీ యమృతంబు గొనిపోయి వారల కిచ్చి మదీయజననీదాస్యంబుఁ బాచికొనిన, నురగు లీ యమృతం బుపయోగింపకుండ ముందఱ నీవు గొనిచను’ మనిన, నగ్గరుడని మహానుభావంబునకు మెచ్చి ‘నీబలపరాక్రమంబులు వినవలతుం జెప్పు’ మనిన నయ్యింద్రునకు గరుడం డి ట్లనియె.

### [1.2.112](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.112)

క. పరనిందయు, నాత్మగుణో | త్కరపరికీర్తనముఁ జేయఁగా నుచితమె స  
త్పురుషుల? కైనను, నీ క | చ్చెరువుగ నా కలతెఱంగుఁ జెప్పెదఁ బ్రీతిన్‌.

### [1.2.113](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.113)

ఉ. స్థావరజంగమప్రవితతం బగు భూవలయంబు నెల్ల నా  
లావునఁ బూని తాల్తు, నవిలంఘ్యపయోధిజలంబు లెల్ల ర  
త్నావళితోన చల్లుదు బృహన్ని జపక్షసమీరణంబునన్‌,  
దేవగణేశ! యీక్షణమ త్రిమ్మరి వత్తుఁ ద్రివిష్టపంబులన్‌.

### [1.2.114](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.114)

వ. అని చెప్పిన గరుడని జవసత్త్వసామర్థ్యంబులకు మెచ్చి సంతసిల్లి ‘నీవు నాతో నెప్పుడు బద్ధసఖ్యుండ వై యుండవలయు’ నని, వెండియు దేవేంద్రుండు గరుడని కి ట్లనియె.

### [1.2.115](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.115)

క. ‘నా కభిమత మొనరించితి | నీ కిష్టము చెప్పికొను’ మనిన ‘దుర్మదు లై  
మా కి ట్లహితముఁ జేసిన | యా కద్రువపుత్త్రు లశన మయ్యెడు నాకున్‌’.

### [1.2.116](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.116)

క. భవదభిరక్ష్యము లగు నీ | భువనంబులయందు సర్పములు ద్రిమ్మరుటన్‌  
దివిజాధిప! నీ కెఱిఁగిం | పవలసె; నీయాజ్ఞ నాకుఁ బడయఁగ వలసెన్‌.

### [1.2.117](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.117)

వ. అని గరుడండు దనకు నురగభోజనత్వంబు సురపతిచేతం బడసి, తదనుగమ్యమానుం డై, యురగుల యొద్దకు వచ్చి, మరకతహరితం బైన కుశాస్తరణంబున నమృతకలశంబు నిలిపి, యురగులకుం జూపి యి ట్లనియె.

### [1.2.118](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.118)

క. అనిమిషనాథ సుగుప్త మ | యిన యమృతము దెచ్చి మీకు నిచ్చితి; నస్మ  
జ్జననీదాస్యము వాసెను | దినకరపవనాగ్నితుహినదీప్తుల కరిగాన్‌.

### [1.2.119](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.119)

వ. ‘మీరలు స్నాతాలంకృతుల రై వచ్చి దీని నుపయోగింపుం’ డని పంచి, తల్లిం దనవీఁ పెక్కించుకొని విహగేంద్రుం డురగుల కదృశ్యుండైయున్న సురేంద్రు వీడ్కొని చనియె; నిట యురగులును నమృతోపయోగకు తూహలంబున నొండొరులం గడవఁ గృతస్నానాలంకృతు లై చనుదెంచుటకు ముందఱ.

### [1.2.120](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.120)

క. అమరాధిపుఁ డమృతముఁ గొని | యమరావతి కరిగి, తొంటియట్టుల సుస్థా  
నమున నవిచలిత రక్షా | క్షముఁ డై రక్షించుకొని సుఖస్థితి నుండెన్‌.

### [1.2.121](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.121)

వ. అంత నయ్యురగులు నమృతం బుపయోగింపం గానక దానియున్నస్థానం బని దర్భలు నాకిన నాలుకలు రెండుగా వ్రయ్యుటంజేసి, నాటంగోలె ద్విజిహ్వులు నాఁ బరఁగిరి; యమృతస్థితింజేసి దర్భలు పవిత్రంబు లయ్యె.

### [1.2.122](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.122)

క. ఈ సౌపర్ణాఖ్యానము | భాసురముగ వినిన పుణ్యపరులకు నధిక  
శ్రీ సంపద లగు; దురితని | రాసం బగుఁ; బాయు నురగరక్షోభయముల్‌.

### [1.2.123](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.123)

వ. ఇట్లురగు లమృతం బుపయోగింపం గానక చనిన, శేషుండు తనతల్లియుం దమ్ములుఁజేసిన యధర్మంబునకు నిర్వేదించి, వారల విడిచి కడునిష్ఠతో గంధమాదన బదరీవన గోకర్ణ పుష్కరారణ్య హిమవంతంబు లాదిగాఁ గల పుణ్యస్థానంబులం దనేక సహస్రవర్షంబులు బ్రహ్మ నుద్దేశించి తపంబు సేసిన, బ్రహ్మయుఁ బ్రత్యక్షం బై వరంబు వేడు మనిన శేషుం డి ట్లనియె.

### [1.2.124](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.124)

సీ. ‘తల్లియు నాసహోదరులును మూర్ఖు లై | ధర్మువు నుచితంబుఁ దప్పి వినత  
కావైనతేయున కపకారములు సేసి, | రెప్పుడు వారు సహింప కెగ్గు  
సేయుదు, రేను రోసితి, వారితోడిపొ | త్తొల్లఁ, దపంబు సేయుచు శరీర  
భారంబు విడిచెదఁ బరమేష్ఠి!’ యనవుడు | నాతని సమబుద్ధి కజుఁడు మెచ్చి  
ఆ. నిత్యసత్యధర్మనిరతుండ వఖిలంబు | దాల్పనోపు నట్టి ధైర్యయుతుఁడ,  
విది యనన్యవిషయ; మిమ్మహీభారంబు | నీవ తాల్పవలయు నిష్ఠతోడ.

### [1.2.125](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.125)

చ. వినతకు నాత్మజుం డయిన వీరుఁడు, కశ్యపవాలఖిల్యస  
న్మునులవరంబు గన్న ఖగముఖ్యుఁడు, వాసవు నోర్చియున్న స  
ద్వినుతబలుండు కావున వివేకమునన్‌ వినతాతనూజుతో  
ఘనముగఁ జెల్మి సేయు; మిది కార్యము నీకు భుజంగమేశ్వరా!

### [1.2.126](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.126)

వ. అని బ్రహ్మ నియోగించిన శేషుం డశేషమహీభారంబు దాల్చి గరుడనితో బద్ధసఖ్యుం డై యుండె; నిట వాసుకియుం దల్లిశాపంబున జనమేజయు చేయు సర్పయాగంబునం దయ్యెడుసర్పకులప్రళయంబునకు వెఱచి, తనబాంధవుల నైరావతాది సహోదరుల రావించి విషణ్ణహృదయుం డై యి ట్లనియె.

### [1.2.127](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.127)

చ. చిరముగ బ్రహ్మకుం దపము సేసి, యనంతుఁ డనంతధారుణీ  
భరగురుకార్యయుక్తుఁ డయి, పన్నగముఖ్యులపొత్తు వాసి, చె  
చ్చెరఁ దనయంత నుండి, మదిఁ జేర్చి తలంపఁడ యొక్కనాఁడు దు  
ర్భరతర దందశూకకుల భావిభయప్రవిఘాతకృత్యముల్‌.

### [1.2.128](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.128)

వ. ‘మఱి యమృతమథనంబునాఁడు మంథరమహానగంబునకు నేత్రంబ నయిన నాక్లేశంబునకు మెచ్చి యమరులెల్లఁ బితామహుం బ్రార్థించి నాకు నవ్యయత్వంబును, సకలభయవిమోక్షణంబునుగా వరం బిప్పించి; రైనను జననీశాపంబున నురగకులప్రళయం బగుటకు మనోదుఃఖంబు దుస్సహం బై యుండు; దాని నుడిగించు నుపాయంబెద్ది? యేమిసేయువార?’ మని చింతించుచున్న యన్నాగరాజునకు నాగకుమారు లత్యుద్ధతు లై యి ట్లనిరి.

### [1.2.129](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.129)

సీ. జనమేజయునిచేయు సర్పయాగమునకు | విఘ్న మందఱము గావింత; మతఁడు  
ధర్మార్థి గావున ధారుణీసురుల మై | యడుగుద మిదియుఁ జేయకు మనియును;  
గొందఱ మతనికిఁ గూర్చు మంత్రులము నై | యీక్రతుక్రియఁ జేసి యిహపరముల  
కగుఁ బెక్కుదోషంబు లని హేతువులు సూపి | యుడిగింత; మందఱు నొక్కమొగిన  
ఆ. భక్ష్యభోజ్యలేహ్య పానీయములమీఁద | సదములోని విప్రజనులమీఁద  
వెగడుపడఁగఁ బాఱి వెఱపింత మొజ్జలు | తత్ప్రయోగవిధులు దప్పి పఱవ.

### [1.2.130](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.130)

వ. అనిన వారలలోఁ గొందఱు బుద్ధిమంతు లయిన భుజంగముఖ్యు లి ట్లనిరి.

### [1.2.131](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.131)

క. ఇవి మీ కన్నియుఁ జేయఁగ | నవు నని తలఁపకుఁడు; భూసురాహుతి మంత్రో  
ద్భవ దారుణదహనశిఖల్‌ | గవిసిన నెద్దియును జేయఁగా నెడ గలదే!

### [1.2.132](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.132)

వ. అనిన విని నాగరాజానుజుం డైన యేలాపుత్త్రుం డి ట్లనియె.

### [1.2.133](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.133)

ఆ. శాప మిచ్చునాఁడు జననియుత్సంగంబు | నందు నిద్రవోయి నట్ల యుండి  
యమరవరుల కజున కైన యన్యోన్యసం | భాషణంబు లెఱుకపడఁగ వింటి.

### [1.2.134](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.134)

వ. అప్పలుకులు సవిస్తరంబుగాఁ జెప్పెదవినుండు; ‘శాపానంతరంబ యమరులెల్ల నజున కిట్లని రయ్యా! కద్రువ కడు నిర్దయురాలై యిట్టి యనంతబలవీర్యసంపన్ను లయిన కొడుకులం బడసి, వారి కకారణంబ దారుణం బైన శాపం బిచ్చె; మీరును వారింపక యుపేక్షించితిరి; దీనికిం బ్రతీకారంబు గలదే? ‘యనిన నమరులకుఁ గమలసంభవుం డి ట్లనియె.

### [1.2.135](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.135)

క. క్రూరాకారుల, జగదప | కారులఁ, బన్నగులఁ దాల్పఁగా నోపని యి  
ద్ధారుణికి హితంబుగ దు | ష్టోరగసంహార మిప్పు డొడఁబడ వలసెన్‌.

### [1.2.136](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.136)

వ. ‘మఱియు సకలలోకహితాచారంబు లై ప్రసిద్ధులైన నాగముఖ్యుల నెల్ల వాసుకి చెలియ లైన జగత్కారువునకు జగత్కారుం డను మహామునికిఁ బుట్టెడువాఁడధికతేజస్వి యాస్తీకుం డను మహాముని జనమేజయసమారబ్ధ సర్పసత్త్రప్రళయంబువలన రక్షించు’ నని పితామహుండు దేవతలకుం జెప్పిన తెఱంగు సెప్పిన, వాసుకి ప్రముఖనాగముఖ్యులెల్ల సంతసిల్లి యేలాపుత్త్రు నెత్తుకొని సాధువాదంబుల నభినందించిరి; వాసుకియు నాఁటంగోలె జరత్కారుమునీంద్రుం డెన్నండు దార పరిగ్రహంబు సేయునో యని తత్సమయ సమాగమం బపేక్షించి యుండు నంత.

### [1.2.137](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.137)

క. పరమతపోనిధి, యాయా| వరవంశోత్తముఁడు, నియమవంతుఁడు, లోకో  
త్తరుఁడు, జరత్కారుఁడు నాఁ | బరఁగిన ముని బ్రహ్మచర్యపరిపాలకుఁ డై.

### [1.2.138](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.138)

క. ఘోరవ్రతములు సలుపుచు | దారపరిగ్రహము సేయఁ దా నొల్లక, సం  
సారపునర్భవభీతి న | పారవ్యామోహపాశబంధచ్యుతుఁ డై.

### [1.2.139](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.139)

వ. తపస్స్వాధ్యాయ బ్రహ్మచర్యవ్రతంబులం జేసి ఋషులఋణంబుల నీఁగుచుఁ బరిభ్రమించువాఁడు వనంబులో నొక్కపల్వలంబు గని, యందు మూషికవిలూనం బయి యొక్కమూలంబు తక్కియున్న వీరణతృణస్తంబంబు నవలంబించి తలక్రిం దై యాదిత్యకిరణంబు లాహారంబుగా వ్రేలుచున్న ఋషులం గొందఱం జూచి డాయంబోయి జరత్కారుం డి ట్లనియె.

### [1.2.140](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.140)

క. ‘కడునుగ్రము దలక్రిందుగఁ | బడి వ్రేలుట; యిదియు నొక తపంబొకొ; నా కే  
ర్పడఁ జెప్పుఁ డీ తపం, బేఁ | దొడఁగెద’ ననవుడును నయ్యధోముఖవిప్రుల్‌.

### [1.2.141](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.141)

క. అనఘ! యిది యేటి తప, మే | మనుపమ దుఃఖితుల మగుట, నాధారము లే  
కను సంతానోచ్ఛేదం | బున వ్రేలెద మధమలోకమున తెరువు చనన్‌.

### [1.2.142](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.142)

వ. మందభాగ్యుల మయిన మావంశంబున జరత్కారుం డను పాపకర్ముండు పుట్టి దారపరిగ్రహంబు సేయను, సంతానంబు వడయను నొల్లకున్నవాఁ; డే మాతని పితృపితామహులము; మాపట్టిన యవురుగంటవేళ్ళెల్లం గాలుండు మూషికవ్యాజంబునం దరతరంబ కొఱికిన నొక్కవేర తక్కియున్నయిది; యదియును జరత్కారుం డనపత్యుం డయినం దెగు; నే మధఃపాతుల మగుదు; మాతం డపత్యంబు వడసెనేని యూర్ధ్వగతుల మగుదుము.

### [1.2.143](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.143)

తే. నీవు మాచుట్టమవపోలె నెమ్మితోడ | నవహితుండ వై మాపల్కు లాదరించి;  
తా జరత్కారుఁ గని చెప్పవయ్య వాని | నెఱుఁగుదేని మాపడియెడు నీయవస్థ.

### [1.2.144](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.144)

వ. అనిన విని జరత్కారుం డతికారుణ్యచిత్తుం డయి, యపత్యార్థం బవశ్యంబు వివాహంబు గావలయు నని యెంతయుం బ్రొద్దు చింతించి తన పితృవర్గంబున కి ట్లనియె.

### [1.2.145](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.145)

క. మీరలు నాపితృదేవత | లారాధ్యుల; రేను మీకు నాత్మజుఁడ; జర  
త్కారుఁ డనువాఁడ; ముందఱ | దారపరిగ్రహము సేయఁ దగులదు బుద్ధిన్‌.

### [1.2.146](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.146)

క. మి మ్మిట్లు చూచి, మీకు హి | త మ్మెట్లగు నట్లకా ముదంబున దారా  
ర్థమ్ము ప్రవర్తింపఁగఁ జి | త్తమ్మిప్పుడు పుట్టె నాకు ధర్మస్థితి మై.

### [1.2.147](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.147)

వ. అనిన నమ్మహామునులు జరత్కారుపల్కులకు సంతసిల్లి యి ట్లనిరి.

### [1.2.148](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.148)

చ. తగియెడు పుత్త్రులం బడసి, ధర్మువు దప్పక, తమ్ము నుత్తముల్‌  
పొగడఁగ మన్మహామతులు పొందుగతుల్‌ గడుఘోరనిష్ఠతోఁ  
దగిలి తపంబు సేసియును, దక్షిణ లిమ్ముగ నిచ్చి యజ్ఞముల్‌  
నెగడఁగఁ జేసియుం, బడయనేర రపుత్త్రకు లైన దుర్మతుల్‌.

### [1.2.149](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.149)

వ. ‘కావున నీవు కృతదారపరిగ్రహుండ వై సంతానంబు వడసి, మమ్ము నూర్ధ్వలోకగతులం జేయు’ మనిన, జరత్కారుం ‘డట్లేని నాకు సనామ్ని యయినదాని వివాహంబు గావలయు’ నని వారికి నమస్కరించి వీడ్కొని, సనామ కన్యాన్వేషణపరుం డై భూవలయం బెల్లఁ గలయం గ్రుమ్మరి.

### [1.2.150](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.150)

తరువోజ. అనవరతవ్రతాయాసఖేదమున నతికృశం బగుచున్న యంగంబునందుఁ  
దనరి యేర్పడ సిరల్‌, దద్దయు ముదిమిఁ దల వడంకుచునుండఁ, దన పితృవరుల  
ఘనముగా నూర్ధ్వాభిగమనులఁ జేయఁగడఁగి వివాహంబుగా జరత్కారుఁ  
డనఘుండు దనకోర్కి కనురూప యైనయట్టి కన్యకఁ గానఁ డయ్యె మర్త్యమున.

### [1.2.151](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.151)

వ. ఇట్లు జరత్కారుండు వివాహాపేక్షం బ్రతీక్షించుచున్న వాసుకియుం దనచారులవలన నంతయు నెఱింగి, నిజసహోదరి యైన జరత్కారుం దోడ్కొని జరత్కారుమహామునిపాలికిం బోయి యి ట్లనియె.

### [1.2.152](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.152)

శా. ధన్యం బయ్యె భవత్కులం, బతి కృతార్థం బయ్యె నస్మత్కులం,  
బన్యోన్యానుగుణాభిధానములఁ జిత్తానంద మొందెన్‌ వివే  
కన్యాయాన్విత భూసురోత్తమ! జరత్కారూ! జగన్మాన్య! యి  
క్కన్యాభిక్షఁ బరిగ్రహింపుము జరత్కారున్‌ మదీయానుజన్‌.

### [1.2.153](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.153)

వ. అనిన నొడంబడి, జరత్కారుండు సనామ యగుటంజేసి యక్కన్యకను వివాహం బై, ప్రథమసమాగమంబునం దన ధర్మపత్నికి సమయంబు సేసె; ‘నాకు నీ వెన్నండేని యవమానంబు దలంచితి, నాఁడ నిన్నుం బాసి పోవుదు’ ననిన నాఁటంగోలె.

### [1.2.154](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.154)

క. వాలుపయి నడచున ట్ల | బ్బాలిక నడునడ నడుంగి భయమున నియమా  
భీలుఁ డగు పతికిఁ బవళుల్‌ | రేలును నేమఱక పరిచరించుచు నుండెన్‌.

### [1.2.155](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.155)

క. అనవరతభక్తిఁ బాయక | తనపతికిం బ్రియము సేసి, తద్దయు గర్భం  
బనురక్తిఁ దాల్చి యొప్పెను | దినకరగర్భ యగు పూర్వదిక్సతివోలెన్‌.

### [1.2.156](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.156)

వ. అక్కోమలి యొక్కనాఁడు దనకుఱువు దలయంపిగాఁ గృష్ణాజినాస్తరణంబున నిజనాథుండు నిద్రితుండై యున్న యవసరంబున నాదిత్యుం డస్తగిరిశిఖరాసన్నుం డగుటయు, సంధ్యాసమయోచితక్రియలు నిర్వర్తింపఁ దదాశ్రమవాసు లైన మునులు గడంగుటం జూచి యాత్మగతంబున.

### [1.2.157](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.157)

సీ. ‘సంధ్యలం దొనరించు సద్విధుల్‌ గడచిన | ధర్మలోపం బగుఁ దడయ కేల  
బోధింప వై తని భూసురప్రవరుండు | పదరునో, బోధింపఁబడి యవజ్ఞ  
దగునె నా కిట్లు నిద్రాభంగ మొనరింప | నని యల్గునో, దీని కల్గెనేని  
యలుకయ పడుదుఁ గా, కగునె ధర్మక్రియా | లోపంబు, హృదయంబులో సహింప’  
ఆ. నని వినిశ్చితాత్మ యై నిజపతిఁ బ్రబో | ధించె; మునియు నిద్ర దేఱి యలిగి  
‘యేల నిద్రఁ జెఱిచి తీవు’ నావుడు జర | త్కారు విట్టు లనియెఁ గరము వెఱచి.

### [1.2.158](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.158)

క. ‘ఇనుఁ డస్తమింపఁ బోయిన | ననఘా! బోధింపవలసె’ ననవుడు, ‘నామే  
ల్కను నంతకు నుండక యినుఁ | డొనరఁగ నస్తాద్రి కేఁగ నోడఁడె చెపుమా!’

### [1.2.159](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.159)

వ. ‘నీవు నా కవమానంబు దలంచితివి; నీయొద్దనుండ నొల్లఁ; దొల్లి నీకు నాచేసిన సమయంబు నిట్టిద; నీగర్భంబున నున్నవాఁడు సూర్యానలసమప్రభుం డైన పుత్త్రుం; డుభయకులదుఃఖోద్ధరణ సమర్థుండు సుమ్ము; నీవు వగవక నీయగ్రజునొద్ద నుండు’ మని జరత్కారువు నూరార్చి జరత్కారుండు తపోవనంబునకుం జనియె; నిట జరత్కారువును తనయగ్రజుం డైన వాసుకి యొద్దకు వచ్చి తద్వృత్తాంతంబంతయు నెఱింగించి యుండునంత.

### [1.2.160](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.160)

క. ఆపూర్ణతేజుఁ డపగత | పాపుఁ డపాకృతభవానుబంధుఁడు, నిజమా  
తాపితృపక్షప్రబల భ | యాపహుఁ డాస్తీకుఁ డుదితుఁ డై పెరిఁగెఁ బ్రభన్‌.

### [1.2.161](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.161)

తే. చ్యవనసుతుఁ డైన ప్రమతితోఁ జదివె సకల | వేదవేదాంగములు, నిజవిమలబుద్ధి  
నెఱిఁగె సకలశాస్త్రంబుల, నెల్లయందు | నధికసాత్త్వికుఁ డాస్తీకుఁ డనఁగ జనులు.

### [1.2.162](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.162)

వ. అటజనమేజయుండు దక్షకవిషానలంబునం దన జనకు పంచత్వం బుదంకువలన నెఱింగి, మంత్రులం జూచి, ‘యిది యేమినిమిత్తంబు? దీని సవిస్తరంబుగాఁ జెప్పుం’ డనిన మంత్రు లి ట్లనిరి.

### [1.2.163](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.163)

సీ. అభిమన్యునకు విరాటాత్మజ యైన యు | త్తరకును బుట్టిన ధర్మమూర్తి,  
కౌరవాన్వయపరిక్షయమున నుదయించి | ప్రథఁ బరీక్షితుఁడు నాఁ బరఁగువాఁడు,  
ధర్మార్థకామముల్‌ దప్పక సలుపుచుఁ | బూని భూప్రజ నెల్లఁ బుణ్యచరిత  
ననఘుఁ డై రక్షించి యఱువదియేఁడులు | రాజ్యంబు సేసిన రాజవృషభుఁ,  
ఆ. డధికధర్మమార్గుఁ డైన నీయట్టి స | త్పుత్త్రుఁ బడసియున్న పుణ్యుఁ, డన్య  
నాథ మకుటమణిగణప్రభారంజిత | పాదపంకజుండు భరతనిభుఁడు.

### [1.2.164](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.164)

వ. భవత్పితృప్రపితామహుం డైన పాండురాజునుంబోలె మృగయాసక్తుం డై యొక్కనాఁడు మహాగహనంబులఁ బెక్కుమృగంబుల నెగచి చంపి, తనచేత నేటువడి పాఱినమృగంబు వెంటఁ దగిలి మహాధనుర్ధరుం డై యజ్ఞమృగంబు పిఱుందం బఱచు రుద్రుండునుం బోలె.

### [1.2.165](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.165)

పృథ్వీవృత్తము. అమిత్త్రమదభేది యొక్కరుఁడ యమ్మృగాన్వేషణ  
భ్రమాకులితచిత్తుఁ డై తగిలి పాఱుచున్‌ ముందటన్‌  
శమీకుఁ డనువాని నొక్కమునిసత్తమున్‌ సంతత  
క్షమాదమసమన్వితుం గనియెఁ గాననాంతంబునన్‌.

### [1.2.166](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.166)

వ. కని ‘మునీంద్రా! నాచేత నేటువడి మృగం బమ్ముతోన యిటవచ్చె, నది యెక్కడంబాఱె? నీ వెఱుంగుదేని చెప్పుమనిన, నమ్ముని మౌనవ్రతుండు గావునఁ బలుకకున్నం గినిసి, తత్సమీపంబున నపగతప్రాణం బై పడియున్నపాముం దనవింటికొప్పున నెత్తి, యమ్మునియఱుతం దగుల వైచి, క్రమ్మఱి హస్తిపురంబునకు వచ్చియున్నంత.

### [1.2.167](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.167)

ఆ. ఆశమీకుపుత్త్రుఁ డంబుజసంభవు | గుఱిచి భక్తితోడ ఘోరతపము  
సేయుచున్న సుప్రసిద్ధుండు శృంగి య | న్వాఁడు భృంగిసముఁడ వంధ్యకోపి.

### [1.2.168](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.168)

క. తనజనకు నఱుతఁ బవనా | శనశవముఁ దగిల్చి రాజసమునఁ బరీక్షి  
జ్జనపాలు చనుట, కృశుఁ డను | మునివలన నెఱింగి కోపమూర్ఛాన్వితుఁ డై.

### [1.2.169](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.169)

వ. శాపజలంబు లెత్తికొని ‘విజనం బైన విపినాంతరంబున విజితేంద్రియుం డై, మొదవుల చన్నులు వత్సంబులు గుడుచునప్పు డుద్గతం బగు పయఃఫేనంబ తనకాహారంబుగా మౌనవ్రతంబునం దపంబు సేయుచున్న మహావృద్ధు మదీయజనకు నవమానించిన పరీక్షితుండు నేఁడు మొదలుగా సప్తదివసంబులలోనఁ దక్షక విషాగ్నిదగ్ధుం డై యమసదనంబున కరిగెడు’ మని శాపం బిచ్చి తండ్రిపాలికిం జని.

### [1.2.170](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.170)

క. ఉరగకళేబర మంసాం | తరమునఁ బడి వ్రేలు చునికిఁ దలఁపక యచల  
స్థిరుఁ డై పరమధ్యానా | వరతేంద్రియవృత్తి నున్నవాని శమీకున్‌.

### [1.2.171](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.171)

వ. కని యయ్యురగకళేబరంబుఁ బాఱవైచి, తత్‌క్షణంబ ప్రబుద్ధనయనుం డైనతండ్రి కభివాదనంబు సేసి, బాష్పపూరితనయనుం డై శృంగి పరీక్షితు నుద్దేశించి తన చేసిన శాపస్థితి సెప్పిన విని, శమీకుండు గరంబడలి యి ట్లనియె.

### [1.2.172](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.172)

క. క్రోధమ తపముం జెఱుచును; | గ్రోధమ యణిమాదు లైన గుణములఁ బాపుం:  
గ్రోధమ ధర్మక్రియలకు | బాధ యగుం; గ్రోధిగాఁ దపస్వికిఁ జన్నే?

### [1.2.173](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.173)

క. క్షమ లేని తపసితపమును, | బ్రమత్తుసంపదయు, ధర్మబాహ్యప్రభురా  
జ్యము భిన్నకుంభమున తో | యములట్టుల యధ్రువంబు లగు నివి యెల్లన్‌.

### [1.2.174](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.174)

వ. క్షమ విడిచి నీవు దృష్టాదృష్టవిరుద్ధం బైనక్రోధంబుఁ జేకొని సకలక్షమారక్షకుం డైన పరీక్షిత్తునకుం బరీక్షింపక శాపం బిచ్చి చెట్ట సేసితివి; రాజరక్షితు లై కాదె మహామును లతిఘోరతపంబు సేయుచు, వేదవిహిత ధర్మంబులు నడుపుచు మహాశక్తిమంతు లయి యున్నవా; రట్టిరాజుల కపకారంబు దలంచు నంత కంటె మిక్కిలిపాతకం బొం డెద్ది? మఱియు భరతకుల పవిత్రుం డైన పరీక్షితు రాజసామాన్యుంగా వగచితే?

### [1.2.175](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.175)

ఉ. క్షత్త్రియవంశ్యు లై ధరణిఁ గావఁగ బుట్టినవారు బ్రాహ్మణ  
క్షత్త్రియవైశ్యశూద్రు లనఁగాఁ గల నాలుగుజాతులన్‌ స్వచా  
రిత్రము దప్పకుండఁగఁ బరీక్షితు కాచినయట్లు రామమాం  
ధాతృరఘుక్షితీశులు ముదంబునఁ గాచిరె యే యుగంబులన్‌!

### [1.2.176](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.176)

వ. ‘అతండు మృగయావ్యసనంబున నపరిమితక్షుత్పిపాసాపరిశ్రాంతుం డయి యెఱుంగక నా కవజ్ఞఁ జేసె; నేనును దాని సహించితి; నమ్మహాత్మునకు నీయిచ్చిన శాపంబుఁ గ్రమ్మరింపనేర్తేని లగ్గగు’ ననిన శృంగి యి ట్లనియె.

### [1.2.177](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.177)

క. అలుకమెయి మున్న పలికితి | నలుకని నా పలుకు తీక్ష్‌ణ మై యింతకు ను  
జ్జ్వలదహనాకృతిఁ దక్షకుఁ | దలరఁగఁ బ్రేరేప కేల తానెడ నుడుగున్‌.

### [1.2.178](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.178)

వ. ‘నావచనం బమోఘం’ బనిన, శమీకుండు శోకాకులితచిత్తుండై, తన శిష్యున్‌ గౌరముఖుం డనువానిం బిలిచి, ‘దీని నంతయుఁ బరీక్షితునకెఱింగించి తక్షకువలనిభయంబు దలంగునట్టి యుపాయంబు సేసికొమ్మని చెప్పి ర’ మ్మనిన; వాఁడు నప్పుడ పరీక్షితుపాలికిం జని యి ట్లనియె.

### [1.2.179](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.179)

సీ. అడవిలో నేకాంతమతి ఘోరతపమున | నున్న మా గురులపై నురగశవము  
వైచుట విని యల్గి, వారి తనూజుండు | శృంగి యన్వాఁడు కార్చిచ్చునట్టి  
శాపంబు నీ కిచ్చె, సప్తాహములలోన | నా పరీక్షితుఁడు నాయలుకఁ జేసి  
తక్షకవిషమున దగ్ధుఁ డయ్యెడు మని, | దానికి గురులు సంతాప మంది  
ఆ. భూతలేశ! నన్నుఁ బుత్తెంచి రిప్పుడు, | తద్భయంబులెల్లఁ దలఁగునట్టి  
మంత్రతంత్రవిధు లమర్చి యేమఱకుండు | నది నిరంతరంబు ననియుఁ గఱప.

### [1.2.180](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.180)

వ. అని చెప్పి గౌరముఖుం డరిగినం, బరీక్షితుండు పరిక్షీణహృదయుం డై తనచేసిన వ్యతిక్రమంబునకు సంతాపించి, శమీకు నుపశమనంబునకు మెచ్చి శృంగి శాపంబునకు వెఱచి మంత్రివర్గంబుతో విచారించి యాత్మరక్షయం దప్రమాదుం డై.

### [1.2.181](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.181)

మ. సకలోర్వీశుఁ డతిప్రయత్నపరుఁ డై, సర్వక్రియాదక్ష త  
క్షకకోటుల్‌ పనిసేయఁగా, ఘనతరైకస్తంభహర్మ్యంబుఁ ద  
క్షకభీతిన్‌ రచియింపఁ బంచి, దృఢరక్షన్‌ దానిలో నుండెఁ బా  
యక రాత్రిందివజాగరూకహితభృత్యామాత్యవర్గంబుతోన్‌.

### [1.2.182](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.182)

వ. మఱియు విషాపహరంబులయి వీర్యవంతంబు లయిన మంత్రతంత్రంబులు గలిగి యాజ్ఞాసిద్ధులైన విషవైద్యుల నొద్దఁ బెట్టికొని పరీక్షితుం డుండునంత, నట తక్షకుండు విప్రవచన ప్రచోదితుం డయి పరీక్షితునొద్దకు నెవ్విధంబునఁ బోవనగునో యని చింతించుచుండె; నటఁ దొల్లి.

### [1.2.183](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.183)

మధ్యాక్కర. ధరణిఁ జరాచరభూతసంఘంబుఁ దమవిషవహ్ని  
నురగంబు లేర్చుచు నునికి కలిగి, పయోరుహగర్భుఁ  
డురగవిషాపేతజీవ సంజీవనోపదేశంబు  
గరుణఁ గశ్యపునకు నిచ్చె నఖిలలోకహితంబు పొంటె.

### [1.2.184](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.184)

వ. అట్టి కశ్యపుం డను బ్రహ్మర్షి ‘శృంగిశాపంబునఁ బరీక్షితుండు తక్షకదష్టుం డగు నేఁడు సప్తమదివసం బటె! యేను వాని నపేతజీవు సంజీవితుం జేసి నావిద్యాబలంబు మెఱయుదు; మఱి యదియునుంగాక.’

### [1.2.185](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.185)

తే. ధరణియెల్లను రక్షించు ధర్మచరితు | నా పరీక్షితు రక్షించి, యతనిచేత  
నపరిమితధనప్రాప్తుండ నగుదుఁ; గీర్తి | యును ధనంబు ధర్మముఁ గొను టుఱదె నాకు.

### [1.2.186](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.186)

వ. అని విచారించి హస్తిపురంబునకుం బోవువానిఁ దక్షకుండు వృద్ధవిప్రుం డయి వనంబులో నెదురంగని ‘మునీంద్రా! యెట వోయె, దేమి కార్యంబున’ కనిన వానికిం గశ్యపుం డి ట్లనియె.

### [1.2.187](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.187)

క. తక్షకుఁ డను పన్నగుఁడు ప | రీక్షితుఁ గఱచునటె నేఁ; డరిందము నతనిన్‌  
రక్షింపఁగఁ బోయెద శుభ | దక్షిణు నా మంత్ర తంత్ర దాక్షిణ్యమునన్‌.

### [1.2.188](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.188)

క. అనిన విని నగుచు వాఁ డి | ట్లనియెను ‘దక్షకుఁడ నేన, యశనినిపాతం  
బున బ్రదుకఁగ నగు నేనియు | ననఘా! మద్విషనిహతుల కగునే బ్రదుకన్‌.

### [1.2.189](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.189)

వ. ‘నీమందులు మంత్రంబులు నాయందుం బనిసేయవు క్రమ్మఱి పొమ్ము; కాదేని నీవ చూడ నివ్వట వృక్షంబుఁ గఱచి నావిషానలంబున భస్మంబు సేసెద; నోపుదేని దీనిని సంజీవితంబుఁజేయు’ మని తక్షకుం డా వృక్షంబుఁ గఱచిన.

### [1.2.190](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.190)

ఆ. అయ్యహీంద్ర విష మహానల దగ్ధ మై | విపుల పత్త్ర దీర్ఘ విటపతతుల  
గగనమండలంబుఁ గప్పిన యవ్వట | తరువు భస్మ మయ్యెఁ దత్‌క్షణంబ.

### [1.2.191](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.191)

వ. కశ్యపుండును నప్పుడ యాభస్మ చయంబు గూడఁ ద్రోచి, తన మంత్రతంత్రశక్తింజేసి యెప్పటియట్ల వృక్షంబుగాఁ జేసినం జూచి, తక్షకుం డతివిస్మయం బంది ‘మునీంద్రా! నీవిద్యాబలంబున నిది సంజీవితం బయ్యె నేనియు నతికుపిత విప్రశాప వ్యపగతాయుష్యుం డైన పరీక్షితుండు సంజీవితుండు గానోపండు; వాని యిచ్చు ధనంబు కంటె నాయం దధికధనంబు గొనిపొ’ మ్మనినఁ గశ్యపుండును దన దివ్యజ్ఞానంబున నట్లకా నెఱింగి, తక్షకుచేత ననంతం బైన యర్థంబు గొని క్రమ్మఱి చనియె; విజనం బైన విపినాంతరంబున నైన యయ్యిరువుర వృత్తాంతంబు మీ రె ట్లెఱింగితి రంటేని వినుము.

### [1.2.192](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.192)

తే. ఇప్పురంబున బ్రాహ్మణుం డింధనార్థ | మేఁగి, మున్న యావృక్షంబు నెక్కి, దాని  
తోన దగ్ధుఁ డై, మఱి దానితోన లబ్ధ | జీవుఁడై వచ్చి జనులకుఁ జెప్పె దీని.

### [1.2.193](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.193)

వ. అట్లు కశ్యపుం గ్రమ్మఱించి తక్షకుండు తత్‌క్షణంబ నాగకుమారులం బిలిచి ‘మీరలు విప్రుల రయి సురభి కుసుమ స్వాదు వన్యఫలంబులు పలాశపర్ణపుటికలం బెట్టికొని పరీక్షితు పాలికిం జని యిం’ డని పంచి, తానును వారితోడన యదృశ్యరూపుం డయి వచ్చిన.

### [1.2.194](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.194)

చ. ద్విజవరులం గుమారుల నతిప్రియదర్శను లైనవారి ఋ  
గ్యజుషపదక్రమంబులు క్రియన్‌ గుణియించుచు వచ్చువారి న  
గ్గజపురవల్లభుండు గని, గ్రక్కున డాయఁగఁ బిల్చి మెచ్చి, భా  
వజసుభగుండు చేకొనియె వారలు దెచ్చినవాని నన్నిటిన్‌.

### [1.2.195](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.195)

క. వారల నర్హప్రియ స | త్కారులఁ గావించి పుచ్చి, కాలనియోగ  
ప్రేరితుఁ డై, యమరేంద్రా | కారుఁడు తద్వన్యఫలజిఘత్సాపేక్షన్‌.

### [1.2.196](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.196)

ఉ. సూరెల నున్న మంత్రులను జుట్టములం గడుఁ గూర్చుమిత్త్రులన్‌  
సారబలుండు చూచి ‘మునిశాపదినంబులు వోవుదెంచె, నం  
భోరుహమిత్త్రుఁ డస్తగిరిఁ బొందెడు’ నం చొగిఁ దత్ఫలావలుల్‌  
వారల కెల్లఁ బెట్టి, యనవద్యుఁడు దా నొకపండు చెచ్చెరన్‌.

### [1.2.197](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.197)

క. కొని వ్రచ్చుడు, లోపల న | ల్లనిక్రిమి యై తోఁచి, చూడ లత్తుక వర్ణం  
బునఁ బామై, విషవహ్నులు | దనుకఁగఁ గురువీరుఁ గఱచి తక్షకుఁ డరిగెన్‌.

### [1.2.198](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.198)

వ. తత్పరిజనంబు లందఱు నశనిపాతంబున బెదరి చెదరినట్లు గనుకనిం బఱచి; రయ్యేకస్తంభహర్మ్యంబును దక్షకవిషాగ్ని దగ్ధంబయ్యె; నట్లు భవజ్జనకుండు పరలోకగతుండైనం, బురోహిత పురస్సరానేకభూసురవరులు యథావిధిం బరలోకక్రియలు నిర్వర్తించి రంత.

### [1.2.199](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.199)

క. ఆయుష్మంతుఁడ వై, ల | క్ష్మీయుత! బాల్యంబునంద మీయన్వయరా  
జ్యాయత్తమహీభారం | బాయతభుజ! నీవు దాల్చి తభిషిక్తుఁడ వై.

### [1.2.200](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2.200)

ఉ. పెంచితి ధర్మమార్గమునఁ బ్రీతి యొనర్చుచు ధారుణీప్రజన్‌;  
మంచి తనేకయాగముల మానుగ దక్షిణ లిచ్చి విప్రులన్‌;  
నించితి సజ్జనస్తుతుల నిర్మల మైన యశంబు దిక్కులన్‌;  
సంచితపుణ్య! సర్వగుణసంపద నెవ్వరు నీసమానులే!

_First 200 of 239 passages. [Read on](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2)_

---
Source: [https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.2) · Pramāṇa
