<!-- Pramāṇa, a library of Indian primary sources · https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7 -->

[Pramāṇa](https://indike.org/pramana/) › [Indian literature](https://indike.org/pramana/in) › [Epic, Poetry, Drama & Narrative](https://indike.org/pramana/in.lit) › [The Mahābhārata and its versions](https://indike.org/pramana/in.lit.mahabharata) › [Mahābhāratas in Indian regional languages](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa) › [Andhra Mahabharatamu](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra) › 1.7

# Andhra Mahabharatamu 1.7: ఆదిపర్వము — సప్తమాశ్వాసము

Āndhra Mahābhāratamu 1.7

- **Language:** Telugu

### ఆదిపర్వము — సప్తమాశ్వాసము

### [1.7.1](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.1)

క. శ్రీ రాజరాజ! వీర | శ్రీరమణీరమ్య గంధసింధుర హయ శి  
క్షారూఢిదక్ష! దక్ష మ | ఖారిదయాలబ్ధ సుస్థిరైశ్వర్యపదా!

### [1.7.2](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.2)

వ. అ క్కథకుండు శౌనకాదిమహామునులకుం జెప్పె; నట్లు పాండవులు విప్రవేషంబున నేకచక్రపురంబునందు వేదాధ్యయనంబు సేయుచు విప్రగృహంబున నున్న కొన్ని దినంబులకు నొక్కబ్రాహ్మణుండు ద్రుపదు పురంబున నుండి చనుదెంచి విశ్రమార్థి యైన, నాగృహస్థుండు వాని నభ్యాగతపూజల సంతుష్టుం జేసి యున్నంతఁ, గుంతీదేవి గొడుకులుం దాను నవ్విప్రు నతిప్రీతి నుపాసించి ‘యయ్యా! మీర లెందుండి వచ్చితి? రే దేశంబులు రమ్యంబు? లెందుల రాజులు గుణవంతు? లని యడిగిన’ న వ్విప్రుం డి ట్లనియె.

### [1.7.3](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.3)

చ. సొలయక యెల్ల దేశములుఁ జూచితి; నందుఁ బ్రసిద్ధు లైన రా  
జుల సుచరిత్ర సంపదలుఁ జూచితి; నా ద్రుపదేశుదేశముం  
బొలుపున నొండు దేశములు పోల్పఁగ నెవ్వియు లేవు; సద్గుణం  
బులఁ బరు లెవ్వరున్‌ ద్రుపదుఁ బోలఁగ లేరు ధరాతలంబునన్‌.

### [1.7.4](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.4)

వ. ‘ఆ ద్రుపదుండు దన కూఁతు నగ్నికుండసముద్భవ యైనదాని నయోనిజ నగణ్యపుణ్యలావణ్యగుణసమన్విత ననురూపుఁ డైన రాజపుత్రునకు వివాహంబు సేయంగానక, స్వయంవరంబు రచియించుచున్నవాఁ’ డనినం, గుంతియు ధర్మ తనయుండును విస్మితులై ‘యది యేమి కారణంబున నయోనిజ యయ్యె? నక్కన్య నెవ్విధంబున ద్రుపదుండు వడసె? దీని సవిస్తరంబుగాఁ జెప్పు’ మనిన నవ్విప్రుండు వారల కి ట్లనియె.

### [1.7.5](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.5)

సీ. ఆది భరద్వాజుఁ డను ముని కలశంబు | నం దుద్భవించిన యనఘమూర్తి  
ద్రోణుండు మఱి పృషతున కుద్భవించిన | ద్రుపదుండు నొక్కటఁ దొడఁగి యిష్ట  
సఖు లయి వేదముల్‌ సదివి, ధనుర్వేద | మగ్నివేశులతోడ నర్థిఁ గఱచి  
చని, ద్రుపదుండు పాంచాలభూములకు రా | జైన, భారద్వాజుఁ డతని కడకు.  
ఆ. నరిగి, వానిచేత నవమానితుం డయి | హస్తిపురికి వచ్చి, యఖిలకురుకు  
మారవరుల నెల్ల మానుగా శస్త్రకో | విదులఁ జేసె లోకవిదితయశుఁడు.

### [1.7.6](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.6)

వ. ఇట్లు దనవలన విలువిద్య గఱచిన పాండవ కౌరవ కుమారులం జూచి ద్రోణుండు’ నా కవమానంబు సేసిన య ప్పాంచాలు నోడించి పట్టికొని తెం; డిదియ నాకు గురుదక్షిణ యగు’ నని పంచిన, వల్లె యని యందఱు నా ద్రుపదుపయిం బోయి, వానిచేత నిర్జితు లయిన, నర్జునుండు ద్రుపదుతోడ మహాయుద్ధంబుసేసి, వానిం బట్టికొని వచ్చి, ద్రోణున కొప్పించిన నతండును.

### [1.7.7](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.7)

ఆ. ఉల్లసంబు లాడి యోడకు పొ మ్మని | ద్రుపదు విడిచి పుచ్చె; ద్రోణుచేత  
నట్లు విడువఁబడి తదవమాన తప్తుఁడై | పృషతనందనుండు పెద్ద యలిగి

### [1.7.8](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.8)

వ. రణరంగంబున ద్రోణు వధియించునట్టి కొడుకును, నర్జునునకు దేవి యగునట్టి కూఁతునుం బడయుదు నని బ్రహ్మవిదు లయిన బ్రాహ్మణులనివాసంబులకుం జని, నిత్యంబును బ్రాహ్మణోపాస్తి సేయుచు, నొక్కనాఁడు గంగాకూలంబునందు వానప్రస్థవృత్తి నున్న యాజోపయాజు లనువారి నిద్దఱ ననవరతవ్రతవ్యాసక్తులం గాశ్యపగోత్రులం గని వారికి నమస్కరించి, యందుఁ గొండుక యయ్యును దపోమహిమ నెవ్వరికంటెఁ బెద్దయైన వాని నుపయాజు నుపాసించి యి ట్లనియె.

### [1.7.9](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.9)

క. మునినాథ! నాకు సత్సుత | జననం బగునట్టి క్రతువు సద్విధిఁ గావిం  
చినఁ గృతకృత్యుఁడ నగుదుం; | గొను మిచ్చెద నీకు లక్ష గోధేనువులన్‌.

### [1.7.10](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.10)

వ. అనిన నుపయాజుం ‘డే నిట్టి ఫలంబు నపేక్షింప; నెవ్వరేని ఫలార్థు లగుదు రందుల కేఁగు’ మనిన ద్రుపదుండు వెండియు వానిన యొక్క సంవత్సరం బారాధించిన నమ్ముని వాని కి ట్లనియె.

### [1.7.11](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.11)

తే. అనఘచరితుఁడు మాయన్న వనములోనఁ | జనుచు నొక్కనాఁ డొక్కపం డొనరఁ గాంచి  
కొనియె శుచి యగు శుచియుఁ గా దని యెఱుంగఁ | బడని భూమితలంబుపైఁ బడిన దాని.

### [1.7.12](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.12)

వ. ‘ఫలార్థి యయినవాఁడు తత్ఫలానుబంధంబు లయిన దోషంబులు పరికింపండు గావున నమ్మునివరుండు నీ కభిమతంబు సేయుం బొ’ మ్మనిన ద్రుపదుం డరిగి, సంహితాధ్యయనాది పంచమహాయజ్ఞంబులు సేయుచు, శిలోంఛవృత్తి భైక్షసంపాదిత కుటుంబభారుం డై, ఘోరతపోవృత్తి నున్న యాజుం గని, నమస్కరించి యి ట్లనియె.

### [1.7.13](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.13)

క. మునినాథ! నాకు సత్సుత | జననం బగునట్టి క్రతువు సద్విధి గావిం  
చినఁ గృతకృత్యుఁడ నగుదుం | గొను మిచ్చెద నీకు లక్ష గో ధేనువులన్‌.

### [1.7.14](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.14)

వ. అని ప్రార్థించి వెండియు నా ద్రుపదుండు యాజున కి ట్లనియె.

### [1.7.15](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.15)

క. భారతవంశాచార్యుఁడు | భారద్వాజుండు నా కపాయము సేసెన్‌  
ఘోరాజి నతని నోర్చున | పారపరాక్రమసుపుత్త్రుఁ బడయఁగ వలయున్‌.

### [1.7.16](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.16)

క. ష డరత్ని ధనుర్ధరుఁ డె | య్యెడ నజితుఁడు గాన వాని హీనుంగాఁ జే  
యుఁడు నాకుఁ జతుర్వర్గము | వడయుట యని పృషతసుతుఁడు ప్రార్థించె మునిన్‌.

### [1.7.17](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.17)

వ. అ య్యాజుండును యాజకత్వంబున కొడంబడి ‘నీ కోర్కికిం దగినయట్టి కొడుకునుం గూఁతురుం బుట్టుదు; రోడకుండు మని యజ్ఞోపకరణద్రవ్యంబులు సమకట్టికొని; యథావిధి నుపయాజుండు సహాయుండుగా సౌత్రామణి యయిన కోకిలాదేవి పత్నిగా ద్రుపదుం బుత్రకామేష్టి సేయించిన, నందు మంత్రాహుతులం దృప్తుం డయిన యగ్నిదేవుని వలన.

### [1.7.18](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.18)

క. జ్వాలాభీలాంగుఁడు కర | వాల బృహచ్చాపధరుఁడు వరవర్మ కిరీ  
టాలంకారుఁడు వహ్నియ | పోలె రథారూఢుఁ డొక్క పుత్త్రుఁడు పుట్టెన్‌.

### [1.7.19](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.19)

వ. మఱియు

### [1.7.20](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.20)

తరలము. కుల పవిత్ర, సితేతరోత్పలకోమలామలవర్ణ, యు  
త్పలసుగంధి, లసన్మహోత్పలపత్త్రనేత్ర, యరాళకుం  
తల విభాసిని, దివ్యతేజముఁ దాల్చి యొక్క కుమారి త  
జ్జ్వలనకుండమునందుఁ బుట్టెఁ బ్రసన్నమూర్తి ముదంబుతోన్‌.

### [1.7.21](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.21)

వ. ఇట్లు పుట్టిన యక్కొడుకునకుం గూఁతునకు ధృష్టద్యుమ్నుండును గృష్ణయు నను నామంబు లాకాశవాణి జన విదితంబుగా నుచ్చరించె; నట్లు ద్రుపదుండు లబ్ధసంతానుం డయి, సంతసిల్లి యాజునకు యథోక్త దక్షిణ లిచ్చి, బ్రాహ్మణులం బూజించి, ధృష్టద్యుమ్నుని ధనుర్వేదపారగుం జేయించి యున్నంత, నక్కన్య యిపుడు వివాహసమయప్రాప్త యయిన.

### [1.7.22](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.22)

ఉ. మానితు లైన పాండవకుమారులుఁ గుంతియు లక్కయింట ను  
గ్రానలదగ్ధు లై రని ధరామరముఖ్యు లెఱింగి చెప్పఁగా  
నా నరనాయకుండు విని యాతత శోకమహానలజ్వల  
న్మానసుఁ డయ్యె బంధుజనమంత్రిపురోహిత విప్రసన్నిధిన్‌.

### [1.7.23](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.23)

వ. మఱియును.

### [1.7.24](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.24)

సీ. ‘ఇంద్రసమానున కిందీవరశ్యామ | సుందరాంగున కింద్రనందనునకు  
దేవిఁగాఁ బ్రీతితో దీని నీఁ గాంచితి | నని యున్నచో విధాతృనకు నిట్లు  
పాడియే విఘ్న మాపాదింప; నమ్మహా | ధ్వరమునఁ బుట్టిన సరసిజాక్షి  
నే నెట్టు లొరులకు నీ నేర్తు’ నని దుఃఖ | పరవశుఁడయి యున్న ధరణిపతికిఁ  
ఆ. దత్పురోహితుండు దా నిట్టు లనియె ‘న | ప్పాండవులనుగుఱిచి బహువిధంబు  
లగు నిమిత్తములు నయంబునఁ జూచితి; | నెగ్గు లేదు; వారి కెల్ల లగ్గు’.

### [1.7.25](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.25)

వ. ‘తొల్లి దేవేంద్రుండు గొండొకకాలం బదృశ్యుం డై యుండిన, నతనిం గానక శచీదేవి శోకింపం బోయిన నుపశ్రుతిం జేసి బృహస్పతి దానికి దేవేంద్రాగమనంబు సెప్పె నని వేదంబుల వినంబడుం; గావున నేను నుపశ్రుతిం జూచితి; నిది దప్పదు; పాండవులు పరలోకగతులు గారు; పరమానందంబున నున్నవారు; వార లెందుండియు నిందులకు వత్తురు; నీవును సుచిత్తుండ వయి స్వయంవరం బిప్పురంబున ఘోషింపం బంపు; మిది కన్యాదానంబునందు రాజులకు శాస్త్రచోదితం’ బనినం బురోహితువచనంబునంజేసి, యూఱడి ద్రుపదుండు నేఁటికి డెబ్బదియేనగు దివసంబునం బౌషమాసంబున శుక్లపక్షంబున నష్టమియు రోహిణినాఁడు స్వయంవరం బని ఘోషింపం బంచి.

### [1.7.26](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.26)

క. ఎవ్వరికిని మోపెట్టను | దివ్వను శక్యంబు గాని దృఢకార్ముకమున్‌  
దవ్వై దివమునఁ దిరిగెడు | నవ్విలసత్కనకమత్స్వ యంత్రముఁ జేసెన్‌.

### [1.7.27](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.27)

క. ‘ధరణిఁ గల రాజులెల్లను | బురుడునఁ గాంపిల్య నగరమున కరిగెద రొం  
డొరులం గడవఁగ, నని భూ | సురువరుఁ డెఱిఁగించెఁ బృషతసుతుకథయెల్లన్‌.

### [1.7.28](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.28)

వ. దాని విని పాండునందను లందులకుం బోవనున్నఁ గొడుకుల యభిప్రాయం బెఱింగి కుంతీదేవి యి ట్లనియె.

### [1.7.29](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.29)

క. కడుఁబెద్దకాల ముండితి | మొడఁబడి; యిం దెంతకాల మున్నను మన క  
య్యెడు లాభ మేమి? మఱి యె | ప్పుడు నుచితమె యొరుల యిండ్ల పొత్తున నుండన్‌.

### [1.7.30](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.30)

వ. దక్షిణపాంచాలంబు గరంబు రమ్యం బనియును, బాంచాలపతి పరమధార్మికుం డనియును వింటిమి; మఱి యట్లుం గాక.

### [1.7.31](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.31)

క. అడుగకయు విప్రవరులకు | నడరఁగ నద్దేశమున గృహస్థులు భక్తిం  
గుడువఁగఁ బెట్టుదు రెప్పుడుఁ | గడు హృద్యము లయిన మోదకంబులతోడన్‌.

### [1.7.32](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.32)

వ. ‘అందులకుం బోవుద’ మనినం గొడుకులెల్ల వల్లె యని ‘మీ పంచిన విధంబ చేయం గలవార’ మని యొడంబడి తమయున్న యింటిబ్రాహ్మణునకుం జెప్పి వీడ్కొని.

### [1.7.33](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.33)

చ. ఉరుసరసీవనంబులు మహోగ్రనగంబులు నేఱులున్‌ సుదు  
స్తరవిపినంబులుం గడచి ధన్యులు పాండుకుమారకుల్‌ నిరం  
తరగతి నేఁగుచుం గనిరి ధర్మసమేతుఁ బితామహుం దమో  
హరు హరిమూర్తి నార్తిహరు నాదిమునీంద్రుఁ బరాశరాత్మజున్‌.

### [1.7.34](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.34)

వ. కని వినయమ్మున నమ్మునీంద్రునకు నందఱు నమస్కారంబు సేసిన వారలం జూచి కరుణారస పూరితాంతః కరణుం డయి వ్యాసభట్టారకుం డి ట్లనియె.

### [1.7.35](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.35)

క. ధర్మసుతుఁ డున్న చోటను | ధర్మువునకు హాని గలదె ధారుణి; నైనన్‌  
ధర్మువ తాత్పర్యముగా | నిర్మలమతి నెగడునది వినీతాత్ముల రై.

### [1.7.36](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.36)

సీ. తా నొక్క మునికన్య దన కర్మవశమునఁ | బతిఁ బడయంగ నోపక యుపేత  
దౌర్భాగ్య యై ఘోరతప మొనరించిన | దానికి శివుఁడు ప్రత్యక్షమయ్యు,  
‘వేఁడుము వర’ మన్న వేడ్కతోఁ బతిదాన | మని యేనుమాఱు లయ్యబల వేఁడె;  
‘నట్లేని నీకు దేహాంతరంబునఁ బతు | లగుదు రేవురు పరమార్థ’ మనియు  
ఆ. హరుఁడు కరుణ నిచ్చె; నది యిప్డు పాంచాల | పతికిఁ గృష్ణ యనఁగఁ బంకజాక్షి  
యుద్భవిల్లి పెరుఁగుచున్నది; తత్స్వయం | వరము సేయుచున్నవాఁడు నేఁడు.

### [1.7.37](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.37)

వ. ‘మీరు ద్రుపదపురంబునకుం జక్క నరుగునది; యందు మీకు ల గ్గగు’ నని చెప్పి కృష్ణద్వైపాయనుం డరిగినఁ బాండునందనులు జననీసహితం బనవరతంబు రాత్రులుం బగళ్ళును బయనంబు వోవువా రొక్కనాఁ డర్ధరాత్రంబున గంగయందు సోమశ్రవం బను తీర్థంబున స్నానార్థు లై, యర్జునుండు ప్రకాశార్థంబును రక్షణార్థంబునుంగా నొక్కకొఱవి సేతఁ బట్టుకొని ముందఱం బోవ, నందఱు నరుగునెడ, నంగారపర్ణుఁ డను గంధర్వుం డంగనాసహితంబు గంగకు నంతప్రొద్దు జలక్రీడార్థంబు వచ్చిన; వాఁ డప్పాండవుల పాదధ్వని విని యలిగి, విల్లుగొని గుణధ్వనిం జేసి వారి కి ట్లనియె.

### [1.7.38](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.38)

క. ఇల నర్ధరాత్రమును, సం | ధ్యలు రెండును, భూత యక్ష దానవ గంధ  
ర్వులు గ్రుమ్మరియెడు ప్రొద్దులు; | వెలయఁగ నిం దవనిచరులు వెఱతురు నడవన్‌.

### [1.7.39](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.39)

వ. ‘ఇ వ్వేళయందుఁ గ్రుమ్మరియెడువారి నెంత బలవంతుల నైనను రాజుల నయినను నిగ్రహింతుము; నన్ను డాయకుం; డెడగలిగి పొం; డే నంగారపర్ణుం డను గంధర్వుండఁ, గుబేరుసఖుండ; నెప్పుడు నిందు విహరించుచుండుదు; న న్నె ఱుంగరె! యి వ్వనంబును గంగాతీరంబును నంగారపర్ణంబులు నా జగద్విదితంబులు; దీని మానవులు సొర నోడుదు’ రనిన వాని కర్జునుం డి ట్లనియె.

### [1.7.40](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.40)

క. నడురేయి సంధ్యలందును | నడవఁగ నోడుదు రశక్తనరు లొరులు; భయం  
పడుదుమె యే మెయ్యెడ నె | ప్పుడు నడతుమ యధికశక్తి పురుషుల మగుటన్‌.

### [1.7.41](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.41)

క. అడవులు నేఱులు నివి నీ | పడసిన యవి యట్టె; పుణ్య భాగీరథి యి  
ప్పుడమిఁ గల జనుల కెల్లను | నెడపక సేవ్యంబ కాక యిది నీయదియే?

### [1.7.42](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.42)

సీ. హైమవతోత్తుంగ హేమశృంగంబున | నుండి భూమికి వచ్చి యుదధిఁ గూడె  
గంగనా; మూఁడు దెఱంగుల నదియు; మం | దాకిని నా సత్పథంబునందు  
సురసిద్ధముని వియచ్చర సేవ్య యయ్యె; న | య్యధమలోకంబునయందు భోగ  
వతి యన నొప్పె నున్నతి; నిట్లు త్రిభువన | పావని యైన యిప్పరమమూర్తిఁ  
ఆ. బార్వతీశమకుటబంధబంధురతరా | వాస గంగ నాడ వచ్చి నీవు  
వలవ దనిన నుడుగువారము గాము; నీ | విఘ్నవచనములకు వెఱతు మెట్లు?

### [1.7.43](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.43)

వ. అనుచు నిజ జననీ భ్రాతృ సహితుం డయి గంగాభిషేకార్థంబు చనుదెంచు న య్యర్జునునిపయి నంగారపర్ణుం డతినిశిత సాయకంబు లేసిన, నర్జునుం డలిగి తనచేతికొఱవి విదిర్చి యయ్యమ్ములు దన్నుం దాఁకకుండం గాచి కొని వాని కి ట్లనియె.

### [1.7.44](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.44)

ఆ. వెడఁగ! యిట్టి పాటి వెఱపించుటలును మా | యలును నేమి సేయు నస్త్రవిదులఁ;  
బెక్కులయ్యు నీ బిభీషికల్‌ నుఱువులు | విరియునట్టు లిందు విరియుఁ జూవె.

### [1.7.45](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.45)

సీ. అగ్నిదేవుండు బృహస్పతి కిచ్చె ము, | న్నతఁడు భరద్వాజుఁ డనఁగఁ బరఁగు  
ముని కిచ్చె, నమ్మహాముని భార్గవున కిచ్చె | భార్గవుండును గుంభభవున కిచ్చె  
నమ్మహాత్ముండు నా కతిదయ నిచ్చె ని | య్యనలాస్త్ర మని దాని నమ్మహోగ్ర  
గంధర్వుపై వైచె ఘనుఁ డింద్రసుతుఁ డంతఁ | దద్రథం బప్పుడ దగ్ధ మయిన,  
ఆ. నగ్నిదాహభీతి నంగారపర్ణుండు | బమ్మరిల్లి నేలఁబడిన, వానిఁ  
గొప్పు వట్టి యీడ్చికొని వచ్చె ధర్మజు | కడకు నింద్రసుతుఁడు కడిమి మెఱసి.

### [1.7.46](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.46)

క. వాని మనోవల్లభ కుం | భీనసి యనునది గరంబు భీతి ‘నశేషో  
ర్వీనాథులార! దయఁ బతి | దానము నా కిండు మీకు ధర్మువు పెరుఁగున్‌’.

### [1.7.47](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.47)

క. అని యఱచుచున్నదానికి | ననఘుఁడు గరుణించి పాండవాగ్రజుఁ డయ్య  
ర్జునుఁ జూచి ‘వీని విడువుమ | యని నోడినవాని హీను నపగతశౌర్యున్‌’.

### [1.7.48](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.48)

ఆ. అనిన నరుఁడు వల్లె యని వాని కనియె ‘గం | ధర్వ! నిన్నుఁ గరుణ ధర్మరాజు  
కురుకులేశ్వరుం డశరణశరణ్యుండు | విడువఁ బనిచె నింక వెఱవకుండు’.

### [1.7.49](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.49)

వ. అని వాని నాశ్వాసించి విడిచిన నట్లు నిర్జితుండై యర్జునున కంగారుపర్ణుం డి ట్లనియె.

### [1.7.50](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.50)

మ. అని నీచేతఁ బరాజితుండ నయి నా యంగారపర్ణత్వ మిం  
కను దాల్పన్‌ మది నంత నిస్త్రపుఁడనే; గర్వం బడంగన్‌ రణం  
బున మున్నోడియుఁ బూర్వనామమున బెంపున్‌ గర్వముం దాల్చువాఁ  
డనఘా! సత్సభలందు మెచ్చఁబడునే హాసాస్పదీభూతుఁ డై.

### [1.7.51](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.51)

వ. నీ యాగ్నేయాస్త్రంబున దగ్ధరథుండ నయ్యును గంధర్వమాయ ననేక రత్నవిచిత్రం బైన రథంబు వడసి, యిది మొదలుగాఁ జిత్రరథుండ నయ్యెద; నీ పరాక్రమంబునకు మెచ్చితి; నీతోడి సఖ్యంబు నా కభిమతం బయిన యది; నా తపంబునం బడయంబడిన చాక్షుషి యనువిద్య నీ కిచ్చెద; దీనిం దొల్లి మనువువలన సోముండు పడసె; సోమునివలన గంధర్వపతి యయిన విశ్వావసుండు వడసె; నాతనివలన నేనుఁ బడసితి; నెవ్వండేని మూఁడులోకంబులుం జూడ నిచ్చగించు నాతండు దనయిచ్చకుం దగ నివ్విద్యపెంపున సర్వస్వంబును గంజూచు; నేము దీనన చేసికాదె మానవులకు విశేషుల మై వేల్పులచేత శాసింపంబడక జీవించెద; మిది కాపురుషప్రాప్తం భైఫలియింపదు; నీవు తాపత్యవంశవర్ధ నుండవు; మహాపురుషుండవు; నీకు సఫలంబగు, నీదివ్యవిద్యఁ గొను మిచ్చెద; దీనిఁ గొనునప్పుడు షణ్మాసవ్రతంబు సేయవలయు; నీవు నాకు నాగ్నేయాస్త్రం బిచ్చునది; మఱి మహా జవసత్త్వంబులుఁ గామగమనంబులు నయిన గంధర్వహయంబుల మీ కేవురకుం జెఱు నూఱేసి యిచ్చెద.

### [1.7.52](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.52)

సీ. వృత్రుపై గీర్వాణవిభుఁ డల్గి వజ్రంబు | వైచిన నది వాని వజ్ర కఠిన  
పటు మస్తకంబునఁ బడి పాతరయమునఁ | బదివ్రయ్యలైనఁ దద్భాగచయము  
క్రమమున బ్రాహ్మణ క్షత్ర విట్ఛూద్రుల | యందు వేదంబులు నాయుధములు  
హలము శుశ్రూషయు నయ్యె వజ్రంబులు | వాహంబులందు జవంబు నయ్యె  
తే. నట్టి జవమున నభిమతం బగుచు నున్న | యట్టి హయసమూహం బయ్యె నవనిపతుల  
కఖిల భువనముల్‌ రక్షించునపుడు సకల | సాధనములలో నుత్తమసాధనంబు.

### [1.7.53](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.53)

వ. అనిన వాని కర్జునుం డి ట్లనియె.

### [1.7.54](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.54)

ఆ. ఎంత మిత్రు లైన నెన్నండు నొరులచే | విద్యయును జయంబు విత్తచయము  
గొనఁగ నొల్ల! నాకుఁ గూర్తేని యనలాస్త్ర | మనఘ! నీవు గొనుము హయము లిమ్ము.

### [1.7.55](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.55)

వ. ‘నీతోడ సఖ్యంబుఁ జేసెద; మఱి మమ్ముఁ బరమధార్మికులం బరమబ్రహ్మణ్యుల నేమి కారణంబున నుదరి పలికి?’ తనిన గంధర్వుం డి ట్లనియె.

### [1.7.56](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.56)

క. విమలము లయి లోకత్రిత | యమునఁ బ్రవర్తిల్లు మీ మహాగుణములు ని  
త్యము విందు నారదప్రము | ఖ మునీశ్వర సిద్ధసాధ్య గణములవలనన్‌.

### [1.7.57](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.57)

క. మేరునగోత్తంసమహీ | భారధురంధరుల మిమ్ముఁ బాండవుల గుణో  
దారుల ధీరుల నెఱుఁగని | వా రెవ్వరుఁ గలరె భరతవంశోత్తములన్‌.

### [1.7.58](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.58)

వ. ఏను మిమ్ము నెఱింగియు, మీకు నగ్నిపరిగ్రహంబును, బ్రాహ్మణసంగ్రహంబును లేమింజేసి పరుసంబులు పలికితి; మఱియును.

### [1.7.59](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.59)

ఉ. ఇంతుల గోష్ఠి నున్నయతఁ డెంత వివేకము గల్గెనేని య  
త్యంత మదాభిభూతుఁ డగు; ధర్మువు దప్పుఁ; బ్రియం బెఱుంగఁ; డే  
నెంత వివేకి నయ్యును సహింపక యింతుల యొద్దఁ బల్కితిన్‌;  
వింతయె? కాము శక్తి యుడివింపఁగ శక్యమె యెట్టివారికిన్‌!

### [1.7.60](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.60)

క. సుర గరుడ విషోరగ య | క్ష రాక్షస పిశాచ, భూత గంధర్వులు నో  
పరు ధిక్కరింప బ్రాహ్మణ | పురస్కృతులఁ బుణ్యమతుల భూతలపతులన్‌.

### [1.7.61](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.61)

సీ. అనవద్యు వేదవేదాంగ విశారదు | జప హోమ యజ్ఞ ప్రశస్తు సత్య  
వచను విప్రోత్తము వర్గచతుష్టయ | సాధనసఖు సదాచారు సూరి  
సేవ్యుఁ బురోహితుఁ జేసిన భూపతి | యేలు నుర్వీతలం బెల్ల; నిందుఁ  
బరలోకమునఁ బుణ్యపరుల లోకంబులు | వడయు; జయస్వర్గఫలము సూవె  
ఆ. రాజ్య; మదియు నుర్వరాసురవిరహితుఁ | డయిన పతికిఁ గేవలాభిజాత్య  
శౌర్యమహిమఁ బడయ సమకూరునయ్య తా | పత్య! నిత్యసత్యభాషణుండ!.

### [1.7.62](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.62)

వ. మీరు ధర్మానిలశక్రాశ్వినులవరంబునం బాండురాజునకుం గుంతీమాద్రులకుం బుట్టినవారలు ధర్మవిదులరు; వేదవేదాంగ ధనుర్వేదపారగుం డయిన భారద్వాజు శిష్యుల; రఖిలలోకహితులరుం గావునం బురోహిత రహితులరై యుండఁ దగదు.

### [1.7.63](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.63)

ఆ. పాండుపుత్త్ర! నీవు బ్రహ్మచర్యస్థుండ | వగుటఁ జేసి మన్మథార్తు నన్ను  
నొడిచి తిందు రాత్రి యుద్ధంబు సేసి; కా | మోపభోగనిరతుఁ డోటు వడఁడె?

### [1.7.64](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.64)

వ. మఱియుఁ గామ ప్రవృత్తుం డయ్యును మహీపతి మహీసురవరపురస్సరుం డగు నేని యెల్ల యుద్ధంబుల శత్రుల జయించు.

### [1.7.65](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.65)

ఉ. వేదము వేదియుం గలుగు విప్రవరేణ్యుఁ డగణ్యపుణ్య సం  
పాది పురోహితుం డయినఁ బాపము పొందునె భూపతిం బ్రతా  
పోదయ! కాన మీదగు గుణోన్నతికిం దగ ధర్మతత్త్వ సం  
వేదిఁ బురస్కరింపుఁడు పవిత్రచరిత్రు మహీసురోత్తమున్‌.

### [1.7.66](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.66)

తే. అనిన వానికి నర్జునుం డనియె ‘మమ్ము | ననఘ! తాపత్యు లని పల్కి తతిముదమున  
నేము కౌంతేయులము మఱి యెట్లు సెప్పు | మయ్య తపతి కపత్యుల మైన తెఱఁగు’.

### [1.7.67](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.67)

వ. అనిన నర్జునునకు నంగారపర్ణుం డి ట్లనియె.

### [1.7.68](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.68)

సీ. ఆదిత్యునకుఁ బుత్త్రి యనఘ సావిత్రికిని | ననుజ యుత్తమలక్షణామలాంగి  
తపతి; యక్కన్య ధవళాయతేక్షణ | యౌవనసంప్రాప్త యైన, దానిఁ  
జూచి యక్కన్యక సురుచిరగుణముల | కనుగుణుం డగు నిర్మలాభిజాత్యుఁ  
బతి నెవ్విధంబునఁ బడయుదునో యని | తలఁచుచు నున్న యత్తపనుగుఱిచి  
ఆ. భక్తిఁ దపము సేసెఁ బ్రభుఁ డజామీఢనం | దనుఁడు భరతకులుఁడు ధర్మవిదుఁడు  
సర్వగుణయుతుండు సంవరణుం డను | వాఁడు కృతజపోపవాసవిధుల.

### [1.7.69](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.69)

చ. ‘గగనమునందు నెందు నధికప్రభ నేను వెలుంగు నట్టు లి  
జ్జగతిఁ బ్రసిద్ధుఁడై వెలుఁగు సంవరణుండ మదీయపుత్త్రికిం  
దగుపతి; వీని కిచ్చెద ముదంబున నీలలితాంగి’ నంచు మా  
నుగ నెడ నిశ్చయించెఁ దపనుండు దదీయతపః ప్రసన్నుఁడై.

### [1.7.70](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.70)

వ. అంత నొక్కనాఁడు సంవరణుండు మృగయావినోదార్థి యయి వనంబునఁ బరిభ్రమించి అధికక్షుత్పిపాసాపీడిత పతితతురంగుం డయి యేకతంబ పాదచారి యై చని యొక్క పర్వతవనోద్దేశంబునందు.

### [1.7.71](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.71)

క. కనియె నొక కన్యఁ గోమలిఁ | గనకప్రభ నిజ శరీరకాంతి నుపాంతం  
బున వృక్షలతావలిఁ గాం | చనమయముగఁ జేయుచున్న చంద్రనిభాస్యన్‌.

### [1.7.72](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.72)

వ. కని యనిమిషలోచనుం డయి మనంబున ని ట్లని వితర్కించె.

### [1.7.73](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.73)

సీ. త్రిభువనలక్ష్మి యేతెంచి యేకాంత మి | ట్లేలొకో యున్నది యివ్వనమున,  
గగనమణిప్రభ గగనంబునం దుండి | యవనీతల ప్రాప్త మయ్యె నొక్కొ  
శంభుండు లావణ్యసద్గుణసముదాయ | మింద యిమ్ముగ సంగ్రహించె నొక్కొ  
దీని యంగములఁ బొందిన యివ్విభూషణ | శ్రీ యేమి పుణ్యంబుఁ జేసె నొక్కొ  
ఆ. యమరకన్యయొక్కొ యక్షకన్యక యొక్కొ | సిద్ధకన్య యొక్కొ శ్రీసమృద్ధి  
సర్వలక్షణ ప్రశస్తాంగి యిది దివ్య | కన్య యగు ననంతకాంతిపేర్మి.

### [1.7.74](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.74)

చ. నెఱికురులున్‌ విలోలసితనేత్రయుగంబును నొప్పులొల్కు వా  
తెఱయును దీని యాననముతెల్వి కరంబు మనోహరంబు; నా  
యెఱిఁగిన యంతనుండి సతి నిట్టిలతాలలితాంగిఁ జూచి యే  
నెఱుఁగ; సురేంద్రకన్యకలు నిట్టిరె రూపవిలాససంపదన్‌.

### [1.7.75](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.75)

వ. అని వితర్కించుచు మదనకర్కశమార్గణలక్షీభూతచేతస్కుం డయి తదీయగుణమయపాశబద్ధుండునుం బోలెఁ గదలనేరక తన్నివేశితచేతనుండునుంబోలెఁ ద న్నెఱుంగక తద్రూపామృతపానంబున ననిమిషత్వంబునం బొందిన తన నయనంబుల దానియంద నిలిపి సంవరణుం డక్కన్యక కి ట్లనియె.

### [1.7.76](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.76)

ఆ. ఎఱుఁగఁ జెప్పు మబల! యెవ్వరి దాన; వి | ట్లేల యున్నదాన వేకతంబ;  
క్రూర వన మృగములు గ్రుమ్మరుచున్న యీ | విజన విషమ శైల విపిన భూమి.

### [1.7.77](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.77)

క. అని పలుకుచున్న నృపనం | దనునకు మఱుమాట యీక తామరసనిభా  
నన మేఘమధ్యసౌదా | మనివోలె నడంగె దృష్టిమార్గము గడవన్‌.

### [1.7.78](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.78)

వ. ఇ ట్లదృశ్యం బయిన యక్కన్యకం గానక మానవపతి మానరహితుం డయి మహీతలంబు పయిం బడి ప్రలాపించు చున్న, నాతని నభినవయౌవనవిభ్రమోద్భాసితు నంగజాకారుం జూచి తపతి తానును మదనబాణబాధిత యై, తన రూపంబుఁ జూపి మధురవచనంబుల ‘ని ట్లేల మోహగతుండ వయి?’ తని పలికిన, దానికి సంవరణుం డి ట్లనియె.

### [1.7.79](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.79)

చ. ధరణి నతిప్రతాపబలదర్పములన్‌ విన నేన పెద్ద; నె  
వ్వరికిని మున్‌ భయంపడనివాఁడ; భయార్తుఁడ నైతి నిపు;; పం  
కరుహదళాయతాక్షి! దయఁ గావుము నన్ను; భవన్నిమిత్త దు  
ర్భరతర పంచబాణహతిఁ బంచతఁ బొందకయుండునట్లుగన్‌.

### [1.7.80](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.80)

వ. ‘నన్ను గాంధర్వవివాహంబున వరియింపు’ మనిన సంవరణునకుఁ దపతి యి ట్లనియె.

### [1.7.81](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.81)

క. భువనైకదీపకుం డగు | సవితృనకుఁ దనూజ; మఱియు సావిత్రికి నే  
నవరజ, నవినయవర్జిత | నవనీశ్వర! వినుము తపతి యను సురకన్యన్‌.

### [1.7.82](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.82)

వ. ‘నాయందు నీకుం బ్రియంబు గలదేని మదీయ జనకు నడుగుము; న న్నిచ్చు; నింతులకు స్వాతంత్ర్యంబు లేమి నీ వెఱుంగుదువు గాదె! కావున ననవరతజపనియమప్రణిపాతంబుల నాదిత్యు నారాధింపు’ మని చెప్పి తపతి యాదిత్యమండలంబున కరిగె; నంత సంవరణుండు మూర్ఛాగతుం డయి పడియున్న, నాతని యమాత్యుండు వచ్చి శీతలపరిషేచనంబు సేసిన మూర్ఛదేఱి యమ్మహీపతి మహాభక్తి నప్పర్వతంబున నుండి సూర్యు నారాధించుచు.

### [1.7.83](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.83)

చ. ప్రతిహత రాగ కోపభయుఁ బంకరుహప్రభవప్రభావు దూ  
రితదురితున్‌ మునీశ్వరవరిష్ఠు వసిష్ఠమహామునిం బురో  
హితు నతిభక్తితోఁ దలఁచె; నిష్ట మెఱింగి వసిష్ఠుఁడున్‌ సమా  
హితమతి నేఁగుదెంచి కనియెం బ్రభు సంవరణుం బ్రియంబునన్‌.

### [1.7.84](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.84)

వ. ఇట్లు దలంచిన పండ్రెం డగు దివసంబునకు వచ్చి వసిష్ఠుం డవిరతవ్రతోపవాసకృశీభూతశరీరుం డయి యున్న సంవరణుం జూచి యాతండు తపనసుత యయిన తపతియందు బద్ధానురాగుం డగుట తన యోగ దృష్టి నెఱింగి.

### [1.7.85](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.85)

చ. జగదభివంద్యుఁ డాక్షణమ సమ్మతి సంవరణ ప్రయోజనం  
బొగి నొనరింపఁగా నయుతయోజనముల్‌ చని లోకలోచనుం  
డగు దిననాథు నాతతసహస్రకరుం గని సంస్తుతించె న  
త్యగణితవేదమంత్రముల నమ్మునినాథుఁ డతిప్రియంబునన్‌.

### [1.7.86](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.86)

వ. సూర్యుండును వసిష్ఠమహాముని నతిగౌరవంబున సంభావించి ‘భవదాగమన ప్రయోజనంబు సెప్పు’ మనిన వసిష్ఠుం డి ట్లనియె.

### [1.7.87](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.87)

సీ. ‘అలఘుండు పౌరవకులశేఖరుండు సం | వరణుఁ డన్వాఁ డనవరత కీర్తి  
విదితుండు ధర్మార్థవిదుఁడు నీ పుత్త్రికి | నగణిత గుణములఁ దగు వరుండు  
గావున నతనికి దేవిఁగాఁ దపతి నీ | వలయుఁ; గూఁతులఁ గన్నఫలము దగిన  
వరులకు సద్ధర్మచరితుల కీఁ గాన్ప | కాదె!’ నావుడు సూర్యుఁ డాదరించి  
ఆ. ‘వరుఁడు రాజవంశకరుఁడు సంవరణుండ | యనుగుణుండు దీని’ కని కరంబు  
గారవమున నిచ్చి యా ఋషితోడఁ బు | త్తెంచెఁ దపతిఁ గురుకులాంచితునకు.

### [1.7.88](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.88)

వ. ఇ ట్లొక్కనిమిషంబున మున్నూటయఱువదినాలుగు యోజనంబులు పఱచు నాదిత్యురథంబుతో నశ్రమంబున నరిగి, తపనదత్త యయిన తపతిం దోడ్కొని వచ్చి, వసిష్ఠుండు విధివంతంబుగా సంవరణునకుం దపతి వివాహంబు సేయించెఁ; గావున మహాత్ము లయిన పురోహితులం బడసిన రాజుల కభీష్టంబు లయిన శుభంబు లగుట నిశ్చయం; బిట్లు సంవరణుండు దపతి వివాహంబయి.

### [1.7.89](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.89)

క. ఆ తరుణియందుఁ జేతో | జాత సుఖప్రీతిఁ దగిలి శైలాటవులన్‌  
వీతనృపకార్యధర్మ | వ్రాతుం డయి పదియురెండువర్షము లుండెన్‌.

### [1.7.90](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.90)

వ. ‘దానం జేసి మహీతలంబున కనావృష్టి యయిన నెఱింగి వసిష్ఠుండు శాంతికపౌష్టికవిధు లొనరించి, సంవరణుం దోడ్కొని హస్తినాపురంబున కరిగిన నఖిలప్రజకు ననురాగం బయ్యె; ననావృష్టి దోషంబునుం బాసె; నంత సంవరణునకుఁ దపతికిం దాపత్యుండై వంశకరుండు కురుండు పుట్టె, నది మొదలుగా మీరును దాపత్యుల రయితి’ రని గంధర్వుండు చెప్పిన నర్జునుండు వెండియు ని ట్లనియె.

### [1.7.91](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.91)

క. నుతముగ నస్మత్కుల భూ | పతులకు నాద్యులకుఁ బుణ్యభాగులకుఁ బురో  
హితుఁ డయిన వసిష్ఠ మహా| త్మతఁ జెప్పుము వినఁగ వలతు మది నేర్పడఁగన్‌.

### [1.7.92](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.92)

వ. అనిన గంధర్వుం డి ట్లనియె.

### [1.7.93](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.93)

క. ధృతి నెవ్వని నేని పురో | హితుఁగాఁ బుణ్యమునఁ బడసి యిక్ష్వాకుకులో  
దితు లైన పతులు రాజ్యో | న్నతి నొప్పం జేసి రుర్వి నానాక్రతువుల్‌.

### [1.7.94](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.94)

క. బలమఱి కామక్రోధం | బులు రెండు జయింపఁబడి తపోవీర్య బలం  
బులఁ జేసి చేయునవి ని | చ్చలు నెవ్వనియేని పాద సంవాహంబుల్‌.

### [1.7.95](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.95)

సీ. ‘శమహీనుఁ డైన విశ్వామిత్రు చేసిన | యపకారమునఁ జేసి యాత్మసుతులు  
యమసదనంబున కరిగిన, వారలఁ | దనతపోవీర్యసత్త్వముల పేర్మిఁ  
గ్రమ్మఱింపఁగ శక్తి కలిగియు, వేల న | య్యంబుధి గడవనియట్ల శాంతుఁ  
డయి యెవ్వఁడేని కృతాంతకుఁ గడవంగ | నొల్లండ, యట్టి యత్యుగ్రతేజుఁ  
ఆ. డగు వసిష్ఠముని మహాత్మతఁ జెప్ప నా | యలవియయ్య’! యనిన నవ్వసిష్ఠ  
గాధిసుతుల కేమికారణంబున నిట్టి | వైర మయ్యె నెఱుఁగ వలతు దీని.

### [1.7.96](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.96)

వ. చెప్పు మని యర్జునుం డడిగిన గంధర్వుం డి ట్లని చెప్పెఁ; దొల్లి కన్యాకుబ్జంబున గాధిపుత్త్రుండు విశ్వామిత్రుం డనురాజు నిరమిత్రంబుగా ధాత్రి నేలుచు, నొక్కనాఁడు మృగయార్థం బరిగి, యపారబలసమేతుం డయి ఘోరారణ్యంబున గ్రుమ్మరి, వడంబడి కడు డస్సి వసిష్ఠునాశ్రమం బాశ్రయించిన, నమ్మునివరుండు విశ్వామిత్రు నతిప్రీతిం బూజించి, వానికిని వానిసేనకు నభిమతంబు లైన యాహారంబులు గురియ నందిని యను తన హోమధేనువుంబంచిన నదియు.

### [1.7.97](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.97)

క. ఘృతనదులును, నోదన ప | ర్వతములు, దధి కుల్యములు, నవారిత రసపూ  
రిత బహువిధోపదంశో | న్నత పుంజంబులును దత్‌క్షణంబునఁ గురిసెన్‌.

### [1.7.98](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.98)

వ. ఇట్లు చతుర్విధాహారంబుల నందఱం దృప్తులం జేసి యున్న యా నందినిం జూచి విశ్వామిత్రుండు విస్మితుం డయి యాత్మగతంబున.

### [1.7.99](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.99)

మధ్యాక్కర. మృదురోమములును, శంకునిభకర్ణముల్‌, మెత్తని వలుఁద  
పొదుగును, నిడుదచన్నులును గుఱుచలై పొలుచు కొమ్ములును,  
సదమలశరదిందుశంఖనిభ మైన చాయయుఁ గలుగు  
మొద విది నిధి చేరినట్లు చేరె నిమ్మునికిఁ బుణ్యమున.

### [1.7.100](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.100)

వ. అని పెద్దయుం బ్రొద్దు చింతించి తత్‌పరిగ్రహకుతూహలహృదయుం డయి విశ్వామిత్రుండు వసిష్ఠున కి ట్లనియె.

### [1.7.101](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.101)

తే. దీనికంటెను నొప్పెడి వాని నొక్క | లక్ష మొదవుల నిచ్చెద నక్షయముగ  
రాజ్యమయిన నిచ్చెద జగత్పూజ్య! నాకు | నిమ్ము నీ హోమధేనువు నెమ్మితోడ.

### [1.7.102](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.102)

చ. అనిన వసిష్ఠుఁ డి ట్లనియె; ‘నంత ధనంబును నట్టి రాజ్యముం  
గొననగు నయ్య యిచ్చిడిపికుఱ్ఱికి? నీ కిది యేల? యేను దీ  
నన పితృదేవతాతిథిజనంబులఁ దృప్తులఁ జేయుచుండుదున్‌;  
జననుత! దీనిఁ బ్రోచుటయ చాలుఁ దపస్వుల కేల సంపదల్‌?’

### [1.7.103](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.103)

వ. ‘దీని నొరున కీఁ గా’ దనిన నలిగి విశ్వామిత్రుండు ‘నేను క్షత్త్రియుండ నిగ్రహానుగ్రహసమర్థుండ, నీవు బ్రాహ్మణుండవు శాంతుండ; వేమి సేయ నోపుదు? దీనికి లక్షమొదవుల నీఁబోయిన నొల్లవ యిమ్మొదవు నవశ్యంబును బలిమి నైనం బరిగ్రహింతు’ నని నందినిం బట్టికొనఁ బంచినం బలుకక వసిష్ఠుండు చూచుచుండె.

### [1.7.104](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.104)

ఆ. పరులవలన బాధ పొరయకుండఁగ సాధు | జనుల ధనము గాచు జనవిభుండు  
కరుణ తప్పి తాన హరియించువాఁ డగు | నేని సాధులోక మేమి సేయు?

### [1.7.105](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.105)

వ. ఇట్లు విశ్వామిత్రుండు వసిష్ఠు హోమధేనువుం బట్టికొనఁ బంచిన పట్టీక జనులవలని కశాదండతాడనంబులం బీడింపం యఱచుచు వసిష్ఠునొద్దకు వచ్చి యి ట్లనియె.

### [1.7.106](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.106)

క. ‘న న్నేల యుపేక్షించితి? | రిన్నరుల కధర్మపరుల కిచ్చితిరే? వి  
ద్వన్నాథ! యిదియు ధర్మువె?’ | యన్నను విని పలుకకుండె నమ్ముని యంతన్‌.

### [1.7.107](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.107)

వ. తదీయాభిప్రాయం బెఱింగి నందినియుఁ దనవత్సంబుఁ బట్టికొన వచ్చిన జనుల కలిగి చిందఱరేఁగి నిదాఘ సమయమధ్యందినదినకరమూర్తియుం బోలె దుర్నిరీక్ష్య యయి, యంగవిక్షేపంబున నంగారవృష్టిఁ గురియుచు, వాలంబున శబరులను, శకృన్మూత్రంబుల శక యవన పుండ్ర పుళింద ద్రవిళ సింహళులను, ఫేనంబున దరదబర్బరు లను బుట్టించిన.

### [1.7.108](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.108)

క. నలి రేఁగి కడఁగి తద్బల | ములు విశ్వామిత్రు సైన్యముల కేనుమడుం  
గులు పెరిఁగి మూఁడుయోజన |ములు వాఱఁగ నెగిచె నొక్కమొగిఁ బ్రతిబలమున్‌.

### [1.7.109](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.109)

వ. అట్టి బ్రహ్మతేజోజనితం బయిన ప్రభావంబుఁ జూచి విశ్వామిత్రుండు విలక్షముఖుం డై, క్షాత్రబలంబు నిందించి, యెల్ల బలంబులకు మిక్కిలి తపోబలంబ యని.

### [1.7.110](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.110)

చ. పొలుపగు రాజ్యసంపదుపభోగములెల్లఁ దృణంబుగా మదిం  
దలఁచి విరక్తుఁ డై విడిచి, దారుణశైలవనాతరంబులన్‌  
వెలయఁ దపంబు సేసి, గుణవిశ్రుతుఁడై పడసెన్‌ మహాతపో  
బలమున సర్వసంపదలు బ్రహ్మఋషిత్వము దివ్యశక్తియున్‌.

### [1.7.111](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.111)

వ. ఆ విశ్వామిత్రుం డిక్ష్వాకు కుల సంభవు డైన కల్మాషపాదుం డను రాజునకు యాజకత్వం బపేక్షించి తత్పురోహితుం డైన వసిష్ఠుతో బద్ధవైరుం డయి, తదపకారంబు రోయుచున్నంత, నొక్కనాఁడు కల్మాషపాదుండు వేఁట పోయి, రమ్యారణ్య భ్రమణ ఖిన్నుం డయి, విశ్రమార్థంబు వసిష్ఠాశ్రమంబునకుం జనువాఁడు దన కభిముఖుం డయి వచ్చువాని వసిష్ఠు పుత్త్రుం బుత్త్రశతాగ్రజు నధికతపశ్శక్తియుక్తు శక్తియనుమహామునిం గని, తెరువు దొలంగు మని రాజాభిమానంబున మెచ్చక పలికిన, నమ్మునివరుం డి ట్లనియె.

### [1.7.112](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.112)

ఆ. ఎట్టి రాజులును మహీసురోత్తము లెదు | రరుగుదెంచు నప్పు డధికభక్తిఁ  
దెరలి ప్రియము వలికి తెరువిత్తు రిట్టిద | ధర్ము; వీవు దీనిఁ దలఁప వెట్టు?

### [1.7.113](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.113)

వ. ‘ఏను ధర్మపథంబున నున్నవాఁడ; నేల తొలంగుదు’? ననిన నలిగి కల్మాషపాదుండు దనచేతి కశకోలనమ్మునీంద్రుని వ్రేసిన నవమానితుం డయి కోపారుణితనయనంబుల నతనిం జూచి ‘నీవు రాక్షసభావంబున నకారణంబ నాకు నికారంబు సేసితి కావున రాక్షసుండ వయి మనుష్యపిశితం బశనంబుగా నుండు’ మని శాపం బిచ్చినఁ, గల్మాషపాదుం డమ్మహామునివరు వసిష్ఠతనయుంగా నెఱింగి ‘నాకు శాపవ్యపాయంబు ప్రసాదింప వలయు’ నని ప్రార్థించుచున్న నచ్చోటికి విశ్వామిత్రుండు వచ్చి వారలు దన్నెఱుంగకుండ నంతర్హితుం డయి కల్మాషపాదు నంతర్గతుం డయి యుండ, నొక్కరక్కసుం గింకరుం డను వానిం బంచిన వాఁడు విశ్వామిత్రునాదేశంబునను, శక్తిశాపంబుననుం జేసి కల్మాషపాదునంతరాత్మ నావేశించి యున్నంత.

### [1.7.114](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.114)

తే. రాక్షసావిష్టుఁ డైనప్డు రాజ్యలీల | విడిచి త న్నెఱుంగక, తదావేశరహితుఁ  
డైన యప్పుడు రాచకార్యంబులందు | బద్ధబుద్ధి యై కల్మాషపాదుఁ డుండె.

### [1.7.115](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.115)

వ. ఆ కల్మాషపాదు నొక్కనాఁ డొక్కబ్రాహ్మణుం డధిక క్షుధార్తుం డయి వచ్చి సమాంసంబయిన భోజనం బడిగిన నిచ్చి, పోయిన వాఁ డంతఃపురంబున నుండి మఱచి యర్ధరాత్రంబునప్పుడు దలంచికొని తన బానసంబు వానిం బిలిచి ‘యే నొక్కబ్రాహ్మణునకుం గుడువ నిచ్చి వచ్చి మఱచియుండితిం; జెచ్చెర నవ్విప్రునకు మాంసంబుతోఁ గుడువంబెట్టు’ మని పంచిన, వాఁడు నింతప్రొద్దు మాంసంబు వడయనేర ననిన నప్పు డారాజు రాక్షసాధిష్ఠితుం డగుటం చేసి ‘మనుష్యమాంసంబుతో నయినం గుడువం బెట్టు’ మనిన సూపకారుండు వధ్యస్థానంబునకుఁ జని మనుష్య మాంసంబు దెచ్చి యిమ్ముగా వండి పెట్టిన, నవ్విప్రుండు దన దివ్యదృష్టిం జూచి దాని మానవమాంసంగా నెఱింగి కడు నలిగి.

### [1.7.116](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.116)

క. ‘తివిరి యభోజ్యం బగు మా | నవ మాంసముతోడ భోజనము పెట్టినవాఁ  
డవు నీవు మనుష్యాదుఁడ | వవు’ మని వాఁ డిచ్చె శాప మన్నరపతికిన్‌.

### [1.7.117](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.117)

వ. ఇట్లు బ్రాహ్మణ శాపంబునం గల్మాషపాదుండు మానుష భావంబు విడిచి, రాక్షసుం డై శక్తి యొద్దకు వచ్చి ‘నీ కారణంబున నిట్టి శాపవ్యాపారంబు సంభవించె; దీని ఫలంబు ముందఱ నీవ యనుభవింపు’ మని శక్తి నపగత ప్రాణుం జేసి, విశ్వామిత్రుచేతఁ బ్రచోదితుం డయి పదంపడి వసిష్ఠపుత్త్రుల నందఱ వధియించిన.

### [1.7.118](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.118)

తే. సుతుల రాక్షసనిహతులఁ జూచి పరమ | యోగధరుఁ డయ్యుఁ బుత్త్ర వియోగశోక  
భరము దాల్చె వసిష్ఠుం డపారభూరి | ధరణిభరము నగేంద్రుండు దాల్చునట్లు.

### [1.7.119](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.119)

చ. అమిత వివృద్ధ శోక వివశాత్మకుఁ డై మది నాత్మఘాతదో  
షమును దలంప కెంతయు విషాదమునన్‌ బలవద్దవాగ్ని మ  
ధ్యము వడిఁ జొచ్చినన్‌ బృహదుదగ్రశిఖానల మాక్షణంబ యు  
ష్ణము చెడి శీత మయ్యె మునినాథున కుగ్రతపంబుపెంపునన్‌.

### [1.7.120](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.120)

ఉ. పంబిన శోక భారమునఁ బ్రాణ విమోక్షముఁ గోరి కంఠ దే  
శంబున రాయి గట్టికొని సన్మునినాథుఁడు నిశ్చితాత్ముఁడై  
యంబుధిఁ జొచ్చినం గడు భయంపడి వార్ధి లసత్తరంగ హ  
స్తంబుల నెత్తిపట్టె నుచితస్థితిఁ దీరముఁ జేర నమ్మునిన్‌.

### [1.7.121](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.121)

చ. సుతశతవర్జితాశ్రమము చూడఁగ నోపక మేరుపర్వతో  
న్నతపృథుశృంగ మెక్కిపడినన్‌, మునివల్లభుదేహబంధ మ  
క్షత మయి తూలసంచయనికాశత నొప్పె; ననంత సంతత  
వ్రతనియమప్రభావు లగువారలఁ బొందునె దేహదుఃఖముల్‌.

### [1.7.122](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.122)

మధ్యాక్కర. వదలక మరణార్థి యగుచు మునినాథవరుఁడు దా నొక్క  
నది నుదగ్రగ్రాహవతిఁ బ్రవేశించినను ముని నంట  
నది యోడి శతవిధంబులఁ బరిద్రుతయయి స్థలం బయిన  
నది యాదిగాఁగ శతద్రునామ యై యన్నది యొప్పె.

### [1.7.123](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.123)

మధ్యాక్కర. ఘనపాశములఁ జేసి యెల్ల యంగముల్‌ గలయ బంధించి  
కొని యొక్కనదిఁ జొచ్చి మునిఁగినను వంతఁ గూరి యన్నదియుఁ  
దన దివ్యశక్తి నప్పాశముల విడిచి తన్మునినాథుఁ  
బనుగొనఁ దీరంబు చేరఁ బెట్టి విపాశనాఁ బరఁగె.

### [1.7.124](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.124)

వ. ఇట్లు పెక్కువిధంబుల నాత్మపరిత్యాగంబునందుఁ గృతనిశ్చయుం డయ్యును నప్రాప్తమరణుం డయి వసిష్ఠుండు నిజాశ్రమంబునకు వచ్చువాఁడు దన పిఱుంద వచ్చు కోడలి నదృశ్యంతి యను దాని శక్తిభార్య నప్పు డెఱింగి, దాని యుదరంబుననుండి షడంగాలంకృత వేదధ్వని గరంబు మధురం బై వీతెంచిన విని విస్మితుం డయి.

### [1.7.125](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.125)

తే. శక్తి చదువును బోలె సువ్యక్త మగుచు | వీనులకు నిది యమృతోపమాన మయ్యె  
వేదనాదంబు; దీని పుణ్యోదరమున | నున్నవాఁడు సుతుండు విద్వన్నుతుండు.

### [1.7.126](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.126)

వ. ‘అనవరత వేదాధ్యయనశీలుం డయిన శక్తిచదువు వినుచుం బండ్రెండేఁడులు గర్భంబునుండి సకల వేదంబులు ధరియించినవాఁ డీ పౌత్రుముఖంబు చూచి యేను గృతార్థుండ నగుదు’ నని వసిష్ఠుండు మరణ వ్యవసాయ నివృత్తుం డై నిజాశ్రమంబున నుండునంత; నొక్కనాఁడు రాక్షసరూపధరుం డై రౌద్రాకారంబున వచ్చు కల్మాషపాదుం జూచి యదృశ్యంతి వెఱచిన దాని నోడుకుండు మని మునివరుండు హుంకారంబున రాక్షసు వారించి, వానిపయి మంత్రపూతంబు లైన కమండలుజలంబు లొలికిన.

### [1.7.127](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.127)

క. భూపాలకుండు బ్రాహ్మణ | శాపంబునఁ బదియురెండుసంవత్సరముల్‌  
పాపమతి నుండి రాక్షస | రూపము చెడి యపుడు మనుజరూపముఁ దాల్చెన్‌.

### [1.7.128](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.128)

వ. ఇట్లు శాపవిముక్తుం డై కల్మాషపాదుండు వసిష్ఠునకు నమస్కరించి ముకుళితకరకమలుఁ డై ‘మునీంద్రా! నీ ప్రసాదంబున శాపంబువలనం బాసి కృతార్థుండ నయితి’ ననిన వానికి వసిష్ఠుం డి ట్లనియె.

### [1.7.129](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.129)

చ. గుణముల నొప్పి బ్రాహ్మణులకుం గడుభక్తుఁడ వై సమస్త ధా  
రుణి ప్రజ గూర్పఁగా విగతరోషుఁడ వై సుఖ ముండు మింక బ్రా  
హ్మణుల కవజ్ఞసేయక శమంబును చేకొను; మింద్రుఁడైన బ్రా  
హ్మణుల కవజ్ఞసేసి యవమానముఁ బొందుఁ బ్రతాపహీనుఁడై.

### [1.7.130](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.130)

వ. అని కఱపిన నట్లచేయుదు నని యమ్మహీపతి వసిష్ఠుం దోడ్కొని, యయోధ్యాపురంబున కరిగి, సకల ప్రజానురాగ కరుం డయి యమ్మునివరు నతిభక్తిం బూజించుచుఁ, దొల్లి రాక్షసుం డయి మదయంతీ సహితంబు వనంబునం గ్రుమ్మరియెడి కాలం బొక్క బ్రాహ్మణ మిథునంబు ఋతుకాలప్రవృత్తి నున్నం గని యాఁ కంటి పెలుచన నందు బ్రాహ్మణుం బట్టికొని భక్షించిన, నతిదుఃఖిత యై యాబ్రాహ్మణభార్య పరమ పతివ్రత యాంగిరసి యనునది పురుషవియోగంబునం బుత్త్రార్థంబయిన నిజప్రయత్నంబు విఫలం బగుటకు శోకించి, ‘వనితాసంభోగంబున నీవును నా పురుషునట్లు పంచత్వంబునుం బొందు’ మని శాపం బిచ్చి వసిష్ఠువలన నీకుఁ బుత్త్రలాభం బగు నని చెప్పి, యగ్నిప్రవేశంబు సేసినం, బదంపడి దీని నంతయు మదయంతివలన నెఱింగినవాఁ డై, తనకుఁ బుత్త్రోత్పాదన సామర్థ్యంబు లేమిం దలంచి కల్మాషపాదుండు పుత్త్రార్థి యయి వసిష్ఠున కి ట్లనియె.

### [1.7.131](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.131)

క. మనుకుల పవిత్రుఁ బుత్త్రకు | నినసన్నిభు! నాకుఁ బడయు; మే నట్లయినన్‌  
మునినాథ! నీ ప్రసాదం | బునఁ బితరులవలన ఋణవిముక్తుఁడ నగుదున్‌.

### [1.7.132](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.132)

వ. అని తన భార్యయైన మదయంతి యనుదానిని ఋతుమతి సమర్పించిన, నదియు వసిష్ఠుప్రసాదంబున గర్భిణి యయి పండ్రెండేఁడులు గర్భంబు మోచి వేసరి, యొక్క యశ్మశకలంబున నుదరభేదనంబుఁ జేసిన నశ్మకుం డను రాజర్షి పుట్టె; నట యదృశ్యంతికిం బరాశరుం డుదయించి వసిష్ఠ నిర్మిత జాతకర్మాదికుండయి పెరుఁగుచు నొక్క నాఁడు రాక్షసభక్షణంబునం దనజనకు పంచత్వంబు దల్లివలన విని కోపదహనదందహ్యమాన హృదయుం డయి ‘తపోమహత్త్వంబున నఖిలలోకసంహారంబు సేయుదు’ నని యున్న మనుమని వారించి వసిష్ఠుం డి ట్లనియె.

### [1.7.133](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.133)

సీ. వినవయ్య! కృతవీర్యుఁ డను జనపతి దొల్లి | భృగు వంశ యాజ్యుఁ డై పెక్కుక్రతువు  
లొనరించి, యగణిత ధనదానముల వారిఁ | దృప్తులఁ గావించి దివికిఁ జనిన,  
నతనివంశమున వా రతిధనలుబ్ధులై | కృత్యవీర్యు ధనమెల్లఁ గ్లప్తి సేసి  
కొని డాఁచియున్న వా రని భార్గవుల నెల్లఁ | బలికిన భార్గవుల్‌ భయము వొంది.  
తే. కొంద ఱర్థము వారిక కూర్చి యిచ్చి; | రవనిసురవంశ్యులకు నిచ్చి రందుఁ గొంద,  
ఱెవ్వరికి నీక తమ తమ యిండ్లఁ బాఁతి | కొని సుఖం బుండి రధము లై కొంద ఱందు.

### [1.7.134](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.134)

వ. అంత నా క్షత్త్రియు లొక్క భార్గవుని యిల్లు గ్రొచ్చి యనంతం బయిన యర్థంబు గని యలిగి, రాజధన వంచకులై రని భార్గవుల నెల్ల నిగ్రహించి, గర్భంబుల నున్న యర్భకులు మొదలుగా వధించిన, వెఱచి భార్గవుల భార్యలెల్ల హిమవంతంబునకుం బాఱిన; నం దొక్క భృగుపత్ని భయంపడి, తన యూరుదేశంబున గర్భంబు ధరియించిన, నెఱింగి క్షత్రియులు దాని భేదింప సమకట్టి వచ్చిన నంతకు ముందఱ.

### [1.7.135](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.135)

క. భువనోపప్లవసమయో | ద్భవ భానునిభప్రభావిభాసితుఁ డయి భా  
ర్గవుఁ డూరుదేశమున ను | ద్భవించె మహి వెలుఁగుచుండఁ బ్రభ నౌర్వుఁ డనన్‌.

### [1.7.136](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.136)

మ. అమితౌజుం డగు వానిఁ జూచి కృతవీర్యామ్నాయజ క్షత్త్రియా  
ధములెల్లన్‌ హతదృష్టు లై కృపణతం దత్పర్వతారణ్యదే  
శములం గ్రుమ్మరుచుండి రంధు లయి; నిశ్శంకం బ్రతిక్రూరక  
ర్మములం దుద్యతు లైన వారికి నశర్మప్రాప్తి గాకుండునే.

### [1.7.137](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.137)

వ. అ ట్లా క్షత్రియు లందఱు నంధు లై భృగుపత్ని యొద్దకు వచ్చి, మాకు దృష్టిదానంబుఁ బ్రసాదింపవలయు నని వేఁడిన నది వారల కి ట్లనియె.

### [1.7.138](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.138)

మధ్యాక్కర. ఏను మీ దృష్టులు గొన్నదానఁ గా; నిక్కుమారుండు  
భానుతేజుండు మీచేఁ దనగురులు పరిభూతు లయిన  
దానికి నలిగి మీ పాపబుద్ధికిఁ దగ నిట్లు సేసె;  
వీని మే రెఱుఁగరె భార్గవకులము వెలిఁగించువాని.

### [1.7.139](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.139)

వ. ‘ఇ క్కుమారుండు నూఱు సంవత్సరములు నా యూరు గర్భంబున నుండి సకల వేదవేదాంగంబులు నేర్చినవాఁడు, మహాతపోనిధి; మీకుం గరుణించు నితనిం బ్రార్థింపుం’, డనిన, నాక్షత్త్రియులు నతిభక్తులై యౌర్వుం బ్రార్థించి తత్ప్రసాదంబున దృష్టులు వడసి చని; రంత నౌర్వుండు దన పితృబంధుజనులెల్ల నొక్కటం బరలోక గతు లగుటకు దుఃఖించి, సకలలోక ప్రలయార్థంబుగా ఘోరతపంబు సేయందొడంగిన.

### [1.7.140](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.140)

చ. అతని తపంబు పెంపునఁ జరాచరసంభృతమైన విష్టప  
త్రితయము భీతిఁ బొందిన, ధృతిం బితృలోకనివాసు లైన త  
త్పితృవరు లెల్ల వచ్చి కడుఁ బ్రీతి నపాకృత గర్వు నౌర్వు న  
ప్రతిమతపోవిభాసిఁ గని పల్కిరి తద్దయు శాంతచిత్తులై.

### [1.7.141](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.141)

వ. ‘అయ్యా! నీ తపో మహత్త్వంబుఁ జూచి లోకంబు లెల్ల భయంపడియెడు; లోకానుగ్రహంబుగా నీరోషంబు విడువుము; మే మసమర్థుల మై క్షత్రియులచేత వధియింపం బడిన వారము గాము; ధనలుబ్ధుల మయి ధనంబు దాఁచినవారము గాము; ధనము వలసినం గుబేరుండు దాన మాకుఁ దెచ్చి యిచ్చుం; దపోమహత్త్వంబున మాకు నాయువు గడుంబెద్దయైన నిర్వేదించి మనుష్యలోకంబున నుండ నొల్లక యాత్మఘాతంబునం బుణ్యలోకంబులు లేమిం జేసి దానిం బరిహరించి యా క్షత్త్రియులతో వైరం బమర్చికొని తన్నిమిత్తంబున దేహంబులు విడిచితిమి; భార్గవులతేజంబు నొరులు పరిభవింప నోపుదురె? కావున నీవు దీనికింగా సర్వజనోప్రదవంబు సేయవల; దిది మా కభీష్టం’ బనిన నౌర్వుండు వారల కి ట్లనియె.

### [1.7.142](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.142)

మత్తకోకిల. మానితం బగు నా తపోమహిమం ద్రిలోక పరాభవం  
బేను జేయఁగఁ బూని చేసితి నిట్టి దొక్క ప్రతిజ్ఞ మున్‌,  
దీని నెట్టులు గ్రమ్మఱింతు మదీయ భాషిత మెన్నఁడు  
న్నేని మోఘము గాదు దిగ్ధరణీరవీందు లెఱుంగఁగన్‌.

### [1.7.143](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.143)

క. మతి మఱచి యనిస్తీర్ణ | ప్రతిజ్ఞుఁ డగు వాని కోపపటుదహన మని  
ర్గత మయి వడి నరణి సము | త్థిత దహనమపోలె నాత్మదేహము నేర్చున్‌.

### [1.7.144](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.144)

క. అలయక నిమిత్తజంబగు | నలుకను క్షమియించి శాంతుఁ డగు పురుషుం డి  
మ్ముల రక్షింపఁగ నోపునె | పొలుపుగ ధర్మార్థకామములు సమములుగన్‌.

### [1.7.145](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.145)

తే. పాపు లై క్షత్త్రియాధముల్‌ భార్గవులకు | నట్లు హింస గావించు నాఁ డార్తనాద  
మూరుగర్భగతుండనై యుండి వినిన | నాఁడ కోప మసహ్యమై నన్నుఁ బొందె.

### [1.7.146](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.146)

తే. ఎఱుక గలఁ డేని మఱి శక్తుఁ డేని యన్యు | లన్యులకు హింస గావించునపుడు దానిఁ  
బూని వారింపకున్న నప్పురుషుఁ డేఁగు | హింస చేసినవారల యేఁగుగతికి.

### [1.7.147](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.147)

వ. ‘కావున లోకంబులయందు సామర్థ్యంబు గలిగి పాప ప్రతిషేధంబు సేయని వారల నుద్దేశించి యలిగితి; నేనును మీ వచనంబతిక్రమింప నోడుదు; నఖిలలోకదహనోద్యతం బయిన నా కోపదహనంబు నిగృహీతం బయిన నన్ను దహించు; నేమి సేయు వాఁడ? మీరు సర్వలోకహితులరు; నాకును లోకంబులకును హితం బగునట్లుగా నుపదేశింపుఁ’ డనిన నౌర్వునకుం బితరు లి ట్లనిరి.

### [1.7.148](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.148)

ఆ. జలములంద యుండు సర్వలోకంబులు | గాన నీ మహోగ్ర కలుష వహ్ని  
జలధిలోన విడిచి సత్యప్రతిజ్ఞుండ | వగుము; జలధి జలము నది దహించు.

### [1.7.149](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.149)

వ. ‘అనిన నౌర్వుండు పితృదేవతాదేశంబునఁ దన కోపానలంబు సముద్రంబులో వైచిన, నది యౌర్వానలంబు నా నశ్వముఖంబున నబ్ధిజలంబులఁ ద్రావుచుండు; నిది వేదంబులయందు వినంబడియెడుకథ గావున నీవును నౌర్వునట్ల ధర్మవిదుండవు భువనపరిభావి యైన యీ క్రోధంబు విడువు’ మనిన వసిష్ఠు వచనంబునం బరాశరుండు గోపం బుపసంహరించి, రాక్షసవినాశార్థంబుగా సత్త్రయాగంబు సేయం గడంగిన.

### [1.7.150](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.150)

తే. శక్తి రాక్షసనిహతుఁ డై చనిన శోక | దహనహతుఁ డై వసిష్ఠుండు దానిఁ దలఁచి  
కడుఁ బ్రశాంతాత్ముఁ డయ్యు రాక్షసవినాశ | మొలసి మనుమని వారింపకుండె నంత.

### [1.7.151](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.151)

క. ఘోరాకారులు కృతహా | హారవులు సబాలవృద్ధు లయి పడిరి దురా  
చారులు రాక్షసులు ముని | ప్రారబ్ధాధ్వరసమిద్ధపావకశిఖలన్‌.

### [1.7.152](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.152)

వ. ఇట్లు పరాశరుండు గావించు సత్త్రయాగంబున నైన రాక్షసుకులప్రళయంబుఁ జూచి పులస్త్యపులహక్రతువులు మహామునిసంఘంబులతో వసిష్ఠాశ్రమంబునకు వచ్చి.

### [1.7.153](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.153)

క. అగ్నిహతిఁ జేసి మానవ | భుగ్నివహము మరణబాధఁ బొందించుచు మూఁ  
డగ్నులయొద్దను నాలవ | యగ్నియనన్‌ వెలుఁగుచున్న యమ్మునినాథున్‌.

### [1.7.154](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.154)

క. పరమతపోనిలయు దినే | శ్వరదీప్తిసహస్రతేజు శాక్తేయుఁ బరా  
శరుఁ గని యందఱుఁ బ్రార్థిం | చిరి రాక్షసమారణంబు సేయకు మనుచున్‌.

### [1.7.155](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.155)

వ. ‘పరాశరుండును బులస్త్యాదిమహామునిప్రార్థితుం డై రాక్షససత్త్రయాగం బుపసంహరించి, తన్నియోగంబున నయ్యగ్ని హిమవదుత్తరపార్శ్వంబున వైచిన, నదియును బర్వంబుల నందు వృక్షలతా గుల్మ శిలాభక్షణంబు సేయుచుండె’ నని యిట్లు గంధర్వుండు తాపత్యవసిష్ఠౌర్వోపాఖ్యానంబు చెప్పిన విని యర్జునుండు వాని కి ట్లనియె.

### [1.7.156](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.156)

ఉ. మాకు నతిప్రియుండవు సమస్తవిదుండవు చెప్పుమయ్య! యీ  
లోకములోని వర్తనములుం దగువారి నెఱుంగు; దెవ్వనిం  
బ్రాకటధర్మతత్త్వవిదు బ్రాహ్మణముఖ్యుఁ బురోహితుండుగాఁ  
జేకొనువార? మట్టి బుధసేవితుఁ గానఁగ మాకు నెం దగున్‌?

### [1.7.157](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.157)

వ. అనిన గంధర్వుండు పెద్దయుంబ్రొద్దు విచారించి ‘యిచ్చోటికిం గుఱంగట నుత్కచం బను పుణ్యతీర్థంబునం దపంబు సేయుచున్నవాని ధౌమ్యుం డను బ్రాహ్మణునిఁ బురోహితుఁగాఁ బ్రార్థింపుం; డమ్మహాత్ముండు మీకుఁ బురోహితుం డైన సర్వార్థసిద్ధి యగు’ ననిన సంతసిల్లి వానికి నాగ్నేయాస్త్రంబు విధ్యుక్తంబుగా నిచ్చి ‘మాకు నీ యిచ్చిన హయంబుల నీయంద సంగ్రహించి యుండుము; ప్రయోజనంబు గలనాఁడు గొనిపోయెద’ మని గంధర్వు వీడ్కొని పాండవులు భాగీరథి నుత్తరించి యుత్కచం బను పుణ్యతీర్థంబున కరిగి యందు.

### [1.7.158](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.158)

ఉ. వీత సమస్త దోషుఁ డయి వేడ్క దపం బొనరించుచున్న వి  
ఖ్యాతుఁ బురోహితప్రవరుఁగా వరియించిరి భక్తితో జగ  
త్పూతచరిత్రు సాధుజనపూజితు ధార్మికు ధౌమ్యు దేవల  
భ్రాతృవరున్‌ మహాత్ము హితభాషణు భూసురవంశభూషణున్‌.

### [1.7.159](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.159)

వ. ధౌమ్యుండును వారి నతిప్రీతిం బూజించి పురోహితత్వంబుం బరిగ్రహించె; నట్లు తేజోరూపబుద్ధివిభవంబుల బృహస్పతిసదృశుం డై వేదవేదాంగవిదుం డైన ధౌమ్యుం బురోహితుంగాఁ బడసి, పాండునందను లశేష మహీరాజ్యంబు వడసినంతియ సంతసిల్లి, తత్కృతస్వస్త్యయను లయి, జననీ సహితంబు దక్షిణ పాంచాలం బున కరుగువారు ముందఱ ద్రుపదుపురంబునకుఁ బోయెడు బ్రాహ్మణులం గని ‘మీ రెందులకుం బోయెద’? రని యడిగిన వా రి ట్లనిరి.

### [1.7.160](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.160)

సీ. యజ్ఞసేన ప్రభు యజ్ఞమహావేదిఁ | గవచశరాసనఖడ్గబాణ  
రథయుక్తుఁ డై మహారథుఁడు ధృష్టద్యుమ్నుఁ | డన నుదయించిన, నతనితోడ  
నొక్కటఁ బుట్టిన యక్కన్యకను గృష్ణ | నసితోత్పల శ్యామలామలాంగి  
మెఱుపునుం బోలెను వఱలు నుత్పలగంధి | బంధుర తను సౌరభంబు గలుగు  
ఆ. దాని ద్రుపదరాజుతనయఁ దదీయ స్వ | యంవరోత్సవంబు నపుడు చూడఁ  
గనినవారు దృష్టు గ్లనిన ఫలం బెల్లఁ | గనినవారు పరమకౌతుకమున.

### [1.7.161](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.161)

వ. అట్టి మహోత్సవంబు చూడ ద్రుపదు పురంబునకుం బోయెద; మందులకు నుత్సవ దర్శనోత్సుకు లై దర్శనీయులుం దరుణులును నపారభూరిదక్షిణయజ్ఞకరులును ననేకశ స్త్రాస్త్రవిదులును నయిన నానాదేశాధిపతులు నింతకుఁ జనుదెంతు; రనంతధనంబును బ్రాహ్మణులకు వా రిత్తు; రట్టె మీరును వారిం జూడ వచ్చెదరేని యొక్కటఁ బోదము రండు.

### [1.7.162](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.162)

క. మీ యం దీ కృష్ణు నుదం | సాయతభుజుఁ జూచి తాన హర్షముతోడం  
దోయజముఖి వరియించును | మా యెఱిఁగినకార్య మిది సమంజసబుద్ధిన్‌.

### [1.7.163](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.163)

వ. అని మాటలాడుచు వచ్చు బ్రాహ్మణులతోడఁ బాండవులు ద్రుపదుపురంబున కరుగు వా రెదుర.

### [1.7.164](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.164)

క. కృష్ణమృగాజినధరుఁ దరు | ణోష్ణద్యుతితేజుఁ బంకజోద్భవసదృశుం  
గృష్ణద్వైపాయను గత | తృష్ణామయుఁ గాంచి రరుగుదెంచు మహాత్మున్‌.

### [1.7.165](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.165)

వ. కని వినయమ్మున న మ్మునీంద్రునకు నందఱు నమస్కరించి కృతాంజలు లై యున్న వారికి హృదయానందంబుగా సత్యవతీనందనుం డాగామి శుభంబు లావేదించి చనినఁ; బాండవులును గతిపయ దినంబులకు ద్రుపదుపురంబు సొచ్చి నాలుగు సముద్రంబులుం బోలె ఘూర్ణిల్లి మ్రోయుచుం బురంబు నాలుగుదిక్కుల విడిసియున్న నానాదేశాగత మహీనాథుల బహువిధస్కంధావారంబులఁ జూచుచుం జని, యొక్కకుంభకారగృహంబున విడిసి, త మ్మెవ్వరు నెఱుంగకుండ బ్రాహ్మణవృత్తి నుండు నంతఁ, బాంచాలపతి పార్థునకుఁ గూఁతు నీ సమకట్టి పాండవుల నన్వేషించి యెందునుం గానక.

### [1.7.166](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.166)

సీ. వైహాయసం బైన వరమత్స్యయంత్రంబు | ని వ్విల్లు మోపెట్టి యెవ్వఁ డేను  
శరముల నేయు నశ్రమమున నతఁడ నా | తనయకు వరుఁ డగు ధర్మయుక్తి  
నని చాటఁ బంచిన నా ఘోషణము విని | యుర్వీశులెల్ల నొండొరులఁ గడవఁ  
గడువేడ్కఁ దొడి పూసి కట్టి విభూతితోఁ | దమతమచిహ్నముల్‌ దనరి యెఱుక  
ఆ. పడఁగ వేఱువేఱ పన్ని భూతలము గ్ర | క్కదల సైన్యపాదఘట్టనమునఁ  
బొలుచు ద్రుపదరాజపుత్త్రీస్వయంవర | రంగమునకుఁ జనిరి రమణతోడ.

### [1.7.167](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.167)

వ. అదియును బురంబు పూర్వోత్తరదిగ్భాగంబునం జందనోదకసంసిక్త సమీకృతస్థలం బయి, యగాధోన్నత పరిఖాప్రాకారంబులను విశాలద్వారతోరణంబులను గైలాసశైలవిలాసాపహాసిభాసురగగనతలోల్లేఖిశిఖర రమ్యహర్మ్యతలంబులను బహుప్రకారంబు లైన సారువులనుం జేసి యొప్పుచున్న, నందు యథాస్థానంబుల నానాదేశాధిపతుల నుండంబంచి ద్రుపదుండు వారల నెల్లం బూజించెఁ; బరమబ్రహ్మణ్యు లగు బ్రాహ్మణులతోడం గలసియున్న పాండవులును బ్రాహ్మణసమూహంబులో నుండి పాంచాలరాజు సమృద్ధినిం జూచి సంతసిల్లి రంత.

### [1.7.168](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.168)

సీ. ధవళవిభూషణ దామానులేపనా | మలినాంగి సితపుష్పమాల చేతఁ  
గొని పుష్పసాయకు కుసుమేతరం బైన | యాఱగు సాయకం బనఁగ జనులు  
ధవళాక్షి రంగమధ్యంబునఁ దనుమధ్య | దా నొప్పి పాంచాలతనయ యున్న  
భూసురప్రవరుల పుణ్యాహఘోషంబు | విలసిల్లె నాశీర్వివృద్ధితోడ  
ఆ. ద్రుపదపతి పురోహితుండును గృతపరి | స్తరణుఁ డై ప్రయోగదక్షుఁ డగ్ని  
ముఖము సేసి వేల్వ మొనసి వివాహోప | కరణ వస్తుచయము గాచియుండె.

### [1.7.169](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.169)

వ. అట్టి యవసరంబున బోరన మ్రోయు జనులయులివును వాదిత్రనాదంబును వారించి ధృష్టద్యుమ్నుండు మూఁగినరాజలోకంబు నెల్లం జూచి యగ్నిసమీపంబున గంధపుష్పధూపదీపార్చితం బైన విల్లును నమ్ములను వైహాయసం బైన లక్ష్యంబును వారలకుం జూపి యి ట్లనియె.

### [1.7.170](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.170)

తరువోజ. ఈ విల్లు మోపెట్టి యేను బాణముల | నీ యంత్రమత్స్యంబు నేసినవాఁడ  
భావజప్రతిముఁ డిబ్బాలకుఁ దగిన | పతి; యిది మునిశక్తిఁ బడసిన విద్య;  
గావున మీ రిప్డు గావింపుఁ డిదియ | ఘనతర కార్ముక కౌశలోన్నతియు  
లావును గలవారలకు నవసరము | లలితయశంబుఁ గల్యాణంబుఁ బడయ.

### [1.7.171](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.171)

వ. అని ధృష్టద్యుమ్నుండు మూఁగిన రాజపుత్త్రులకు నెల్ల నెఱుంగ జెప్పి, ద్రుపదరాజపుత్రిం జూచి ‘యఖిలజలధి వేలావలయవలయిత మహీతలంబునం గల రాజనందను లెల్ల నీస్వయంవరంబునకు వచ్చినవారు; వీరలం జూడు’ మని దుర్యోధనదుశ్శాసనదుర్ముఖప్రముఖు లయిన ధృతరాష్ట్రనందనుల నూర్వురం, దత్సమీపంబున నున్న కర్ణాశ్వత్థామ సోమదత్త భూరిశ్రవశ్శ్రుతసేనాదులను, బుత్త్రభ్రాతృసమేతు లయి యున్న శల్య విరాట జరాసంధ గాంధారపతులను, నక్రూర సారణ సాత్యకి సాంబ సంకర్షణ ప్రద్యుమ్న కృష్ణ కృతవ ర్మానిరుద్ధ యుయుధాన ప్రముఖులైన యదువృష్ణి భోజాంధకవరులను, సుమిత్ర సుకుమార సుశర్మ సుదక్షిణ సుషేణ సేనాబిందు చంద్రసేన సముద్రసే నౌశీనర చేకితాన శిశుపాల శ్రేణిమ జ్జనమేజయ జయద్రథ బృహద్రథ సత్యవ్రత చిత్రాంగద శుభాంగద భగీరథ భగదత్త పౌండ్రకవాసుదేవ వత్సరాజ ప్రభృతు లయిన నానాదేశాధీశులను వేదధ్వని సనాథం బై యొప్పుచున్న బ్రాహ్మణసమూహంబునుం జూపి.

### [1.7.172](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.172)

ఆ. ‘ఇందు లక్ష్య మెవ్వఁ డేసె నాతని వరి | యింపు నెమ్మితోడ నిందువదన!’  
యనిన రాజపుత్త్రు లవ్విల్లు మోపెట్టి | యేయఁ గడఁగి కదలి రెల్లవారు.

### [1.7.173](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.173)

సీ. అమ్మహోత్సవము నెయ్యమ్మునఁ జూడంగఁ | దివిరి యేతెంచిన దివిజ ఖచర  
గరుడ గంధర్వ కిన్నరుల విమానముల్‌ | విలసిల్లె నంబరతలమునందుఁ;  
బణవవీణావేణురణితానుసార మై | రసగీతరవ మెల్ల దెసల నెసఁగె;  
బోరన వివిధతూర్యారవంబులు మహా | వననిధిధ్వానంబు ననుకరించె;  
ఆ. దివ్యమాల్యములయు దివ్యానులేపన | ములయు సౌరభంబు వెలయఁ దాల్చి  
రంగమధ్యజనులకుం గడు తనుపుగాఁ | జేరి వీచె దివ్య మారుతంబు.

### [1.7.174](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.174)

చ. అవిరళభస్మమధ్యమున నగ్నికణంబుల పోలె బ్రాహ్మణ  
ప్రవరులలోన నేర్పడక పాండవు లేవురు నున్నఁ జూచి యా  
దవ వృషభుండు కృష్ణుఁడు ముదంబున వారి నెఱింగి, పార్థుఁ డీ  
యువతిఁ బరిగ్రహించు ననియుం దలఁచెన్‌ హృదయంబులోపలన్‌.

### [1.7.175](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.175)

వ. అంత నా రాజనందనులు ద్రుపదరాజనందనం జూచి కందర్పబాణబాధితు లయి తమ్మును దమ సామర్థ్యము నెఱుంగక యర్థిత్వంబున నవ్విల్లు మోపెట్టఁ బోయి.

### [1.7.176](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.176)

క. వడి నౌడు గఱచి, వలకేల్‌ | నిడుచన గనయమునఁ బెనఁచి, నీల్గి, బలం బే  
ర్పడ విల్లు వంపనోపక | యుడిగిరి నృపసుతులు గొంద ఱొయ్యన లజ్జన్‌.

### [1.7.177](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.177)

క. బలవంతుల బలమఱఁగా | మలువక మ్రాన్మ్రానిపాట మాయాధను వి  
మ్ములఁ జేసిన మోపెట్టఁగఁ | గొలఁదియె యని డాయ రైరి కొందఱు దానిన్‌.

### [1.7.178](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.178)

మ. ‘ఇది యెట్లున్‌ సమకూర దెవ్వరికి; ము న్నీ విల్లు మోపెట్టఁ బో  
లదు; మోపెట్టియు నంతరిక్షమున నా లక్ష్యంబు భేదింపఁగా  
నది బ్రహ్మాదుల కైన నిం దలవిగా’ దంచున్‌ విచారించి ని  
ర్ముదు లై కొందఱు రాజు లేఁగిరి నిజక్ష్మామార్గముల్‌ చూచుచున్‌.

### [1.7.179](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.179)

వ. ఇట్లు రాజపుత్త్రు లవ్విల్లు మోపెట్ట నోపక నివృత్తు లయిరి; మఱి యదు వృష్ణి భోజాంధకులు కృష్ణానుమతంబున సజ్య కర్మంబునం దనారంభు లయి మిన్నకుండి; రంత శిశుపాల జరాసంధ శల్యకర్ణులు దర్పితు లై తమ తమ లావులు మెఱసి క్రమంబున నలువురు మాష యవముద్గరోమమాత్రంబులు దక్క గొనయం బెక్కించియు మోపెట్ట నశక్యంబయిన నుక్కుసెడి స్రుక్కిన; వారలం జూచి యగ్రజు ననుమతంబున విప్రసభ వెలువడి విజయుండు ధనుస్సమీపంబున కరిగిన, నాతని యుత్సాహంబున కచ్చెరువడి కొందఱు బ్రాహ్మణులు దమలో ని ట్లనిరి.

### [1.7.180](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.180)

ఉ. ఇ మ్మనుజేంద్రనందను లహీనబలుల్‌ దృఢదీర్ఘ బాహువీ  
ర్యమ్ములవార లోపర శరాసనకర్మమునం; దయుక్త ద  
ర్పమ్మున నిప్డు నవ్వు పఱుపన్‌ సమకట్టె నితండు విప్రవం  
శమ్మునవారినెల్లఁ దనశక్తి యెఱుంగక దుర్విదగ్ధుఁ డై.

### [1.7.181](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.181)

క. అనువారు, నందుఁ గొందఱు | ‘ఘనుఁ డీతఁడు; వీరికంటెఁ గార్ముక విద్యం  
దనరిన వాఁ డయి దీనికి | మొనసెంగా; కన్యుఁ డిట్లు మొనయం గలఁడే!

### [1.7.182](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.182)

మ. అమితోత్సాహుఁడు దీర్ఘ బాహుపరిఘుం డత్యంతతేజస్వి స  
ద్విమలాచారుఁడు విప్రభక్తిపరుఁ డీ విప్రుండు విప్రప్రసా  
దమునన్‌ విప్రుల కెల్ల సంతసముగాఁ దత్కర్మసంసిద్ధి ను  
త్తముఁడై పొందెడు మంచు నుండిరి దయన్‌ ధాత్రీసురుల్‌ ప్రీతు లై.

### [1.7.183](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.183)

వ. అంత న య్యర్జునుండు న వ్వింటిసమీపంబునకు వచ్చి గురువులం దలంచి నమస్కారంబు సేసి, ధనువునకుఁ బ్రదక్షిణంబుఁ జేసి మ్రొక్కి దాని నెత్తికొని పూర్వపరిచితం బైనవిల్లు మోపెట్టిన ట్లశ్రమంబున మోపెట్టి, జను లాశ్చర్యంబునుం బొందుచుండ, నే నమ్ముల న మ్మత్స్యయంత్రంబు నాక్షణంబ యురుల నేసినం జూచి బ్రాహ్మణ క్షత్త్రియ ప్రముఖు లయిన జనులెల్ల విస్మితు లయి.

### [1.7.184](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.184)

చ. ఫలపవనాంబుభోజన శుభవ్రతవృత్తులఁ జేసి చూడ దు  
ర్బలతను లయ్యు బ్రాహ్మణు లపారతపోబలసంపదన్‌ మహా  
బలయుతు; లట్టి వారలకు భవ్యుల కెందు నసాధ్య మెద్దియుం  
గలదె? చరాచరాఖిలజగంబులఁ బెద్దల కారె సద్ద్విజుల్‌.

### [1.7.185](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.185)

క. నిమిషాంతరమున ని ట్ల | శ్రమమున మర్త్యులకు నేయ సమకూరునె యు  
త్తముఁ డీతఁడు బ్రాహ్మణ రూ | పమున సురేశ్వరుఁడొ హరుఁడొ భానుఁడొ గుహుఁడో!

### [1.7.186](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.186)

క. అని ధరణి నుండి పొగడెడు | జనుల నిరంతరరవంబు, జలధరమార్గం  
బున నుండి పొగడు దివ్యుల | యనవరతరవంబు నొక్కఁ డయి కడు నొప్పెన్‌.

### [1.7.187](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.187)

క. చెలఁగె సురదుందుభిస్వన | ములు ముదమున భూసురోత్తములు పయిపుట్టం  
బులు వీచివీచి యార్చిరి | వెలయఁగ నరుమీఁదఁ బుష్పవృష్టియుఁ గురిసెన్‌.

### [1.7.188](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.188)

వ. అ య్యవసరంబున ధర్మనందనుండు నకుల సహదేవానుగమ్యమానుం డయి నిజనివాసంబునకుం జనియె; నిట ధృష్టద్యుమ్న సహితుం డయి యజ్ఞసేనుండు మహాసేనతో నర్జునునకు సహాయుండుగా నరిగె; నంత.

### [1.7.189](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.189)

సీ. ధరణీశ నందనుల్‌ ద న్నతిప్రీతితోఁ | జూచుచు నుండంగ సుందరాంగి  
తోయజదళనేత్ర ద్రుపదరాజాత్మజ | కమనీయ గజరాజగమనలీలఁ  
జనుదెంచి సురరాజసన్నిభు నభినవ | యౌవనోద్భాసితు నసితరత్న  
రుచిరాంగు నంగజరూపు ధనంజయుఁ | దనచేతి సితపుష్పదామకమునఁ  
ఆ. బొలఁతి ముదముతోడఁ బూజించె; నట్టియు | త్సవముఁ జూచి దాని సైఁప కపుడు  
కౌరవేంద్రుఁ డాదిగాఁ గల భూపతు | లెల్ల నలిగి కలయు నేపు రేఁగి.

### [1.7.190](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.190)

మత్తకోకిల. ఏల రాఁ బనిచెన్‌ మహీశుల నెల్లఁ జుట్టమపోలె ము  
న్నేల సత్కృతిఁ జేసె నిందఱ? కిమ్మహారథు లుండఁగా  
నేల కన్యక నిచ్చె విప్రున కిందు నేఁడు శఠుండు పాం  
చాలుఁ, డిప్పుడ వీని నిర్గతసత్త్వుఁ జేయుద మాజిలోన్‌.

### [1.7.191](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.191)

క. తన విద్య పేర్మి నృపనం | దనఁ బడసెను విప్రుఁ; డితని తప్పే? కడుదు  
ర్జునుఁ డీ ద్రుపదుఁడు నృపతుల | ననయంబున మెచ్చఁ డయ్యె నతిగర్వితుఁడై.

### [1.7.192](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.192)

వ. ‘ఏమిదోషంబు సేసియు బ్రాహ్మణుండు వధ్యుండు గాఁడు; మన రాజ్యంబును నర్థంబును బ్రాహ్మణార్థంబ; కావున న వ్విప్రుతోడి దేమి? యని ద్రుపదుపయి నెత్తుదెంచిన, ద్రుపదుండును కడుభీతుం డై బ్రాహ్మణుల మఱువు సొచ్చె; నిట్లు శరణాగతుం డయిన ద్రుపదు నోడకుండు మని బ్రాహ్మణులు దమ తమ దండాజినంబు లెత్తికొని ప్రతిబలంబులపయి వీచుచున్నంత, వారలం జూచి నగుచు నర్జునుం డి ట్లనియె.

### [1.7.193](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.193)

క. కడఁగి మదీయాస్త్రము లని | యెడు పటుమంత్రముల నిప్పు డీ నృపురిపుల  
న్కడిఁది విషాహుల దర్పం | బుడిగించెదఁ దొలఁగి చూచుచుండుఁడు మీరల్‌.

### [1.7.194](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.194)

వ. అని తానును భీమసేనుండును గడఁగి రిపుబలంబుపయి నపరిమితశరంబు లేసె; భీమసేనుండు నొక్క వృక్షంబు వెఱికికొని దండ హస్తుం డయిన దండధరుండునుంబోలె నర్జునునకు సహాయుం డయి నిలిచె; నంత న య్యిద్దఱ మహా సంరంభంబుఁ జూచి విస్మితుఁ డై కృష్ణుండు బలదేవుని కి ట్లనియె.

### [1.7.195](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.195)

సీ. ‘తాలాభ మగు విల్లు దాల్చి విరోధుల | నెగచుచున్నవాఁ డింద్రతనయుఁ;  
డాతని కెలన మహావృక్షహస్తుఁడై | యున్న వీరుండు వృకోదరుండు;  
యంత్రంబు నరుఁ డేసి నప్పుడు పోయిన | యగ్గౌరవర్ణుండు యమతనూజుఁ;  
డాతనితోడన యరిగిన యిరువురుఁ | గవల వా రర్కప్రకాశ తేజు’  
ఆ. లనిన ‘లక్కయింట నగ్నిదాహంబున | నెట్లు బ్రదికి రొక్కొ! యిమ్మహాత్ము;  
లెట్టి పుణ్యదినమొ యేవురఁ జూచితి’ | మనుచు సంతసిల్లె హలధరుండు.

### [1.7.196](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.196)

వ. అంత.

### [1.7.197](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.197)

క. కురుపతి సూడఁగఁ గర్ణుఁడు | నరుఁ దాఁకెను; శల్యుఁ డనిల నందనుఁ దాఁకెన్‌  
సరభసమున, విస్మయ మం | దిరి ధరణీదేవమనుజదేవప్రవరుల్‌.

### [1.7.198](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.198)

శా. కర్ణుండున్‌ విజయుండు నొండొరులఁ జుల్కం దాఁకి; చాపంబు లా  
కర్ణాంతం బగుచుండఁగాఁ దిగిచి యుగ్రక్రోధులై యేసి; రా  
పూర్ణంబయ్యెఁ దదీయ బాణతతి నంభోభృత్పథం బెల్ల; నా  
స్తీర్ణం బయ్యె ధరిత్రి యెల్ల; నవిసెన్‌ దిక్చక్ర మెల్లన్‌ వడిన్‌.

### [1.7.199](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.199)

క. వీరుఁడగు నరుని యేయు న | పార శరావలుల నడుమ వారింపంగా  
నేరక యే టుడిగి మహా | శూరుఁడు రాధేయుఁ డింద్రజున కి ట్లనియెన్‌.

### [1.7.200](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7.200)

క. నా యెదురఁ జక్కనై యని | సేయఁగ భార్గవునకును శచీవరునకుఁ గౌం  
తేయుఁ డగు విజయునకుఁ గా | కాయతభుజశక్తి నొరుల కలవియె ధరణిన్‌.

_First 200 of 292 passages. [Read on](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7)_

---
Source: [https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.1.7) · Pramāṇa
