<!-- Pramāṇa, a library of Indian primary sources · https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2 -->

[Pramāṇa](https://indike.org/pramana/) › [Indian literature](https://indike.org/pramana/in) › [Epic, Poetry, Drama & Narrative](https://indike.org/pramana/in.lit) › [The Mahābhārata and its versions](https://indike.org/pramana/in.lit.mahabharata) › [Mahābhāratas in Indian regional languages](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa) › [Andhra Mahabharatamu](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra) › 2.2

# Andhra Mahabharatamu 2.2: సభాపర్వము — ద్వితీయాశ్వాసము

Āndhra Mahābhāratamu 2.2

- **Language:** Telugu

### సభాపర్వము — ద్వితీయాశ్వాసము

### [2.2.1](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.1)

క. శ్రీరమణీప్రియ! ధర్మవి | శారద! వీరావతార! సౌజన్యగుణా  
ధార! భువనైక సుందర! | వీరశ్రీరమ్య! బుధ వివేక నిధానా!

### [2.2.2](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.2)

వ. అ క్కథకుండు శౌనకాది మహామునులకుం జెప్పె; నట్లు రాజసూయ మహోత్సవంబు నొప్పును ధర్మరాజు ధర్మనిత్యతయును స్తుతియించి నారదుం డా సదంబున సకలరాజసమూహంబును రాజలోకంబులో మనుష్యసామాన్యుండయి యున్న జగన్మాన్యు జనార్దనుం జూచి తొల్లి బ్రహ్మాదిసురగణప్రార్థితుండయి యఖిల మహీభారావతరణార్థంబు నారాయణుండు యదువంశంబున నుదయించుటయు, నయ్యయి క్షత్త్రియ కులంబుల సురదైత్య దానవ యక్ష రాక్షస గంధర్వాదుల యంశావతారంబులుం దలంచి భవిష్యద్భారత రణంబునకు సంహృష్ట హృదయుండయి యుండు నంత.

### [2.2.3](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.3)

క. శాంతనవుఁడు భీష్ముండు ప్ర | శాంతుఁడు దత్క్రతువు సూచి సంతుష్టుండై  
యంతక తనూజునకు ధృతి | మంతున కత్యంత ధర్మమతి కి ట్లనియెన్‌.

### [2.2.4](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.4)

మత్తకోకిల స్నాతకుండును ఋత్విజుండును సద్గురుండును నిష్టుఁడున్‌  
భూతలేశుఁడు సంయుజుండును బూజనీయులు; వీరిలోఁ  
బ్రీతి నెవ్వఁడు సద్గుణంబులఁ బెద్ద యట్టి మహాత్ము వి  
ఖ్యాతుఁ బూజితుఁ జేయు మొక్కనిఁ గౌరవాన్వయవర్ధనా!

### [2.2.5](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.5)

వ. అనిన ‘నట్టివాఁ డెవ్వండు నా కెఱిఁగింపు’ మనిన ధర్మరాజునకు భీష్ముం డి ట్లనియె.

### [2.2.6](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.6)

సీ. రోదసీకుహరంబు రుచిరాంశుతతిఁ జేసి | యర్కుండు వెలిఁగించు నట్టు; లమృత  
సందోహ నిష్యంద చంద్రికఁ జేసి శీ | తాంశుఁ డానందించు నట్టు; సకల  
జనులకుఁ దనదైన సదమలద్యుతిఁ జేసి | తనరంగఁ దేజంబుఁ దనుపుఁ దాన  
చేయుచునున్న సత్సేవ్యుండు పుండరీ | కాక్షుండు గృష్ణుఁ డనాదినిధనుఁ  
ఆ. డబ్జనాభుఁ డుండ; నర్ఘ్యంబునకు నిందు | నర్హు లొరులు గలరె? యజ్ఞపురుషు  
నఖిలలోకపూజ్యు నచ్యుతుఁ బూజింపు | మధిప! యదియ చూవె యజ్ఞఫలము.

### [2.2.7](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.7)

వ. అనిన భీష్మువచనంబున నప్పుడు సహదేవోపనీతంబయిన యర్ఘ్యం బర్ఘణీయుండయిన వాసుదేవునకు శాస్త్రదృష్ట విధానంబున ధర్మతనయుం డిచ్చిన, దానింజూచి సహింపక శిశుపాలుం డుపాలంభనపరుం డయి యధోక్షజు నాక్షేపించుచు ధర్మరాజున కిట్లనియె.

### [2.2.8](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.8)

మ. అవనీనాథు లనేకు లుండఁగ విశిష్టారాధ్యు లార్యుల్‌ మహీ  
దివిజుల్‌ పూజ్యులు పల్వు రుండఁగ ధరిత్రీనాథ! గాంగేయు దు  
ర్వ్యవసాయంబునఁ గృష్ణుఁ గష్టచరితున్‌ వార్‌ష్ణేయుఁ బూజించి నీ  
యవివేకం బెఱిఁగించి తిందఱకు; దాశార్హుండు పూజార్హుఁడే?

### [2.2.9](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.9)

చ. కడుకొని ధర్మతత్త్వ మెఱుఁగంగ నశక్యము; ధర్మబాహ్యు ని  
న్నొడఁబడ నిష్టుఁడై కఱపి యుత్తము లుండఁగ వాసుదేవుఁ డ  
న్జడునకుఁ బూజ యిమ్మని విచారవిదూరుఁడు భీష్ముఁ డెంతయున్‌  
వెడఁగుఁదనంబునం బనిచె; వృద్ధులబుద్ధులు సంచలింపవే.

### [2.2.10](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.10)

చ. ఇతనికిఁ గూర్తురేని ధనమిత్తు రభీష్టములైన కార్యముల్‌  
మతి నొనరింతు రిష్టుఁడని మంతురుగాక, మహాత్ములైన భూ  
పతులయు విప్రముఖ్యులసభన్‌ విధిదృష్ట విశిష్ట పూజనా  
యతికి ననర్హు నర్హుఁ డని యచ్యుతు నర్చితుఁ జేయఁ బాడియే?

### [2.2.11](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.11)

సీ. ఈతని వృద్ధని యెఱిఁగి పూజించితే | వసుదేవుఁ డుండంగ వసుమతీశ!  
ఋత్విజుం డని విచారించి పూజించితే | ద్వైపాయనుం డుండ ధర్మయుక్తి;  
యాచార్యుఁ డని వినయమునఁ బూజించితే | కృతమతుల్‌ ద్రోణుండుఁ గృపుఁడు నుండ;  
భూనాథుఁ డనియెడు బుద్ధిఁ బూజించితే | యాదవుల్‌ రాజులే యవనిమీఁదఁ;  
ఆ. బూజనీయులైన పురుషులలోపల | నెవ్వఁడయ్యెఁ గృష్ణుఁ? డిట్టు లేల  
పూజ్యులయినవారిఁ బూజింపనొల్లక | భీష్ము పనుపుఁ జేసి బేల వయితి.

### [2.2.12](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.12)

చ. పురుష విశేష విత్తముఁడు పూజ్యుఁడు రాజులలోన నీయుధి  
ష్ఠిరుఁ డని నీ గుణాళి ప్రకటించి మనంబులలోన ధారుణీ  
శ్వరులు భవన్మఖంబునకు వచ్చిన నిందఱ కివ్విధంబునం  
బరఁగ నవజ్ఞ సేయు టిది పాడియె ధర్మువె ధర్మనందనా!

### [2.2.13](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.13)

క. నీ వెఱుఁగక యిచ్చిన నిది | నా విషయమె యని మనంబునం దలఁపక ల  
జ్జా విరహితుఁ డయి యర్ఘ్యము | గోవిందుఁడు గొనియెఁ; దనకుఁ గొను టుచితంబే?

### [2.2.14](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.14)

క. చనఁ బేడికి దారక్రియ | యును, జెవిటికి మధురగీతియును, జీకునక  
త్యనుపమ సురూపదర్శన | మును జేయుటఁ బోలుఁ గృష్ణుఁ బూజించు టిలన్‌.

### [2.2.15](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.15)

ఉ. ‘ఈ యవనీశ్వర ప్రవరు లిందఱు నిన్ను నగంగ నిట్లుగాఁ  
జేయుదె ధర్మరా జను విశేషసమాఖ్య నిరర్థకంబుగా  
ధీయుత!’ యంచు ధర్మజ నదీసుత కృష్ణుల నెగ్గులాడుచుం  
బోయె సదంబు వెల్వడి సపుత్త్రబలుండయి చైద్యుఁ డల్కతోన్‌.

### [2.2.16](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.16)

వ. ఆ శిశుపాలు పిఱుందన చని ధర్మనందనుండు వానిం బ్రియవచనంబుల ననునయించుచు ని ట్లనియె.

### [2.2.17](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.17)

క. భూరిగుణోన్నతు లనఁదగు | వారికి ధీరులకు ధరణివల్లభులకు వా  
క్పారుష్యము చన్నె? మహా | దారుణ మది విషముకంటె దహనముకంటెన్‌.

### [2.2.18](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.18)

ఉ. ఆదిజుఁడైన బ్రహ్మయుదయంబున కాస్పదమైనవాఁడు, వే  
దాది సమస్త వాఙ్మయములందుఁ బ్రశంసితుఁడైన వాఁడు,లో  
కాది, త్రిలోకపూజ్యుఁ డని యాత్మ నెఱింగి పితామహుండు దా  
మోదరుఁ జెప్పెఁ బూజ్యుఁ డని; యుక్తమ కా కిది యేమి దోసమే?

### [2.2.19](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.19)

క. పరమార్థ ప్రతిభఁ దమో | హరు నచ్యుతు భీష్ముఁ డెఱిఁగిన ట్లెఱుఁగఁగ నీ  
కరిది శిశుపాల! పెద్దల | చరితం బల్పులకు నెఱుఁగ శక్యమె యెందున్‌?

### [2.2.20](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.20)

క. గురుఁ డని సమస్తలోకో | త్తరుఁ డని నీకంటె వృద్ధతములైన నరే  
శ్వరు లచ్యుతు నర్చన నెడఁ | గర మభినందింప నీకుఁ గాదనఁ దగునే.

### [2.2.21](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.21)

వ. అని యా శిశుపాలుం బట్టువఱుచుచున్నంత ధర్మరాజునకు భీష్ముం డి ట్లనియె.

### [2.2.39](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.39)

ఉ. ‘ఇమ్ముదివెఱ్ఱి వీనిఁ బరమేశ్వరుఁగాఁ గొనియాడె; ధర్మత  
త్త్వమ్ములు పాండవేయులును దానునుగాని యెఱుంగరట్టె; సా  
మమ్మున నెల్లవారి నవమాన్యులఁ జేసె నమాన్యుఁడంచు రూ  
క్షమ్మున భీష్ముఁ జూచి బలగర్వితుఁ డి ట్లని పల్కె నల్కతోన్‌.

### [2.2.40](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.40)

ఉ. నెట్టన ధర్మనందనుఁడు ని న్నవలంబము సేసి యోడతోఁ  
గట్టినయోడవోలె గతగౌరవుఁడై కడుఁదూలెఁ గృష్ణుఁ జే  
పట్టి బిభీషికల్‌ ధరణిపాలుర కిప్పుడు సూపి; తెందు నీ  
యట్టి దురాత్ములుం గలరె; యంత యధీరులె ధారుణీపతుల్‌?

### [2.2.41](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.41)

సీ. పూతనాఘాతంబుఁ, జేతనేతరమైన | శకటంబు త్రోపును జరణనిహతి,  
వీఁకతోఁ గడుఁబూచుమ్రాకుల విఱుపును, | వల్మీకమాత్రపర్వతము నెత్తి  
కొని, లావుగలఁడు వీఁ డన నేఁడు దివసంబు | లునికియు, వృషవధయును ననంగఁ  
బమ్మిన కృష్ణుబీరమ్ములు వొగడుచు | నున్న నీ నాలుక యొక్కఁడయ్యు  
ఆ. వ్రయ్యవలయు నూఱు వ్రయ్యలుగాఁగ; న | ట్లయినఁ గాని చాల వతనిఁ బొగడ;  
నెల్లదాని నేన యెఱుఁగుదు; నెందు వాఁ | డర్ఘ్యదానయోగ్యుఁ డయ్యెఁ జెపుమ.

### [2.2.42](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.42)

వ. స్త్రీలను గోబ్రాహ్మణులం గూడువెట్టువారిని విశ్వసించినవారిని వధియించుట మహాపాతకం బని పెద్దలు సెప్పుదు; రట్టివానియందు గోవిందుఁడు స్త్రీవధయును గోవధయునుం జేసె; నీవునుం గడు ధర్మువెఱింగినవాఁడ వయి వీని కర్ఘ్యం బిప్పించి; తదియునుంగాక యన్యకామ యయిన యంబ యను కన్యక నపహరించి నీవు దెచ్చిన నెఱింగి నీ తమ్ముండు విచిత్రవీర్యుండు ధర్ము వెఱిఁగినవాఁడై దాని విడిచి పుచ్చె.

### [2.2.43](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.43)

క. జననిందిత మయి నీయం | దనపత్యత యను నధర్మ మది యుండఁగ ధ  
ర్మనివృత్తచరిత్రక! నీ | యనుశాసన మెట్లు నమ్మ నగు జనములకున్‌?

### [2.2.44](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.44)

వ. తొల్లి సముద్రతీరంబున నుండి యొక్క వృద్ధహంస ధర్మాధర్మంబులు సెప్పుచు ధర్మమార్గంబున వర్తిల్లుచుండుఁ డని పక్షుల నెల్ల శిక్షించుచుఁ బ్రాణిహింస సేయక తపోవృత్తి నున్న దానికి సముద్రజలచరంబు లయిన పక్షులు రుచ్యంబు లగు భక్ష్యంబులు దెచ్చి పెట్టుచుం దత్సమీపంబునం దమ తమ యండంబుల నెల్ల నిక్షేపించి భక్షణార్థం బొక్కనాఁ డతిదూరం బరిగిన, నిట యాహంసయు నయ్యండంబుల భక్షించిన దాని నొక్క పక్షి గని యా పక్షులకెల్లం జెప్పిన, నవి దద్దయు దుఃఖించి యా యంచను వధియించెం గావున నట్ల నీవు నధర్మప్రవృత్తుండవై ధర్మశిక్ష సేయుచుఁ గౌరవుల కాపద యాపాదించుచున్నవాఁడవు.

### [2.2.45](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.45)

క. విదితముగ నధికబలసం | పద నోర్చె నుపేంద్రుఁ డవనిపాలుర నంచున్‌  
మదిఁ బొగడితి; నా యెఱుఁగని | యదియె జనార్దనుబలంబు నత్యున్నతియున్‌?

### [2.2.46](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.46)

క. సకలక్షత్త్రభయంకరు | నకు బార్హద్రథికి ననిమొనన్‌ మార్కొన నో  
పక వలియం బాఱఁడె యీ | ముకుందుఁడు భయాతిరేకమునఁ బదిమాఱుల్‌.

### [2.2.47](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.47)

వ. అమ్మహాసత్త్వు జరాసంధుం బరమబ్రహ్మణ్యు బ్రాహ్మణవేషంబున భీమార్జునులం దోడుసేసికొని వధియించె; నవి యెల్లం ద్రివిక్రము పరాక్రమంబులుగా నశ్రాంతవచనుండ వయి.

### [2.2.48](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.48)

ఆ. బూతు వొగడినట్లు వొగడెదు; పొగడంగ | వలయునేని సుగుణవంతు లయిన  
కర్ణ శల్యు లాదిగాఁ గల వీరులఁ | బొగడుచుండరాదె ప్రొద్దువోక.

### [2.2.49](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.49)

ఆ. అన్యకీర్తనంబు నన్యనిందయుఁ దన్నుఁ | బరఁగఁ బొగడికోలుఁ బ్రబ్బికోలు  
నాపగాతనూజ! యార్యవృత్తములు గా | వనిరి వీని నాద్యులయిన మునులు.

### [2.2.50](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.50)

వ. అని రూక్షాక్షరవచనంబుల నాక్షేపించుచున్న శిశుపాలుం జూచి సహింపనోపక భీమసేనుం డతిరౌద్రాకారంబున నలిగిన.

### [2.2.51](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.51)

చ. ప్రకటితకోపవేగమునఁ బద్మదళాయతనేత్రముల్‌ భయా  
నకతర లీలఁ దాల్చె నరుణద్యుతి నుద్యతమై త్రిశాఖ మై  
భ్రుకుటి లలాటదేశమునఁ బొల్చెఁ ద్రికూటతటిత్రిమార్గగా  
నుకృతిఁ బ్రభంజనప్రియతనూజున కంతకమూర్తి కచ్చటన్‌.

### [2.2.52](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.52)

వ. ఇట్లు నిఖిల క్షత్త్రియత్రాసజననంబుగా నలిగి దంతసందష్ట దారుణ ముఖుండై శిశుపాల నిర్మూలనాభీల సంరంభంబున నున్న భీమసేను వారించి భీష్ముం డిట్లని చెప్పె ; ‘నిద్దురాత్ముండు తొల్లి చేదివంశంబున దమఘోషుం డనువానికి సాత్వతికిం జతుర్భుజ లలాట నేత్రంబులతో నుదయించి. రాసభరవంబున నేడ్చుచున్నం జూచి తల్లిదండ్రులు భయవిస్మయాధీనమనస్కులయి యున్న వారికి నొక్క యశరీరభూతం బిట్లనియె.’

### [2.2.53](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.53)

ఆ. వీని నొరులు చంపఁగా నోప రెవ్వరు; | నెవ్వరేని వీని నెత్తికొనుడు  
మిగిలియున్న బాహుయుగళంబుఁ గన్నును | నడఁగు వీని కతఁడ యంతకుండు.

### [2.2.54](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.54)

వ. అనిన నయ్యశరీరివచనంబులు విని వార లాశ్చర్యమానసులయి, యా కుమారుం జూడవచ్చిన వారికెల్ల నెత్తికొన నిచ్చుచున్నంత.

### [2.2.55](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.55)

చ. అతివికృతస్వరూపధరుఁ డైన కుమారకుఁ బ్రీతితోడ సా  
త్వతిఁ దమ మేనయత్తను ముదంబునఁ జూడఁగఁగోరి యద్భుత  
ప్రతిభులు రామకేశవులు పన్నుగ నేఁగిరి చేదిధారుణీ  
పతిపురి కొక్కనాఁ డఖిల బాంధవ మంత్రిసుహృత్సమేతులై.

### [2.2.56](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.56)

వ. ఇట్లు వచ్చిన రామకేశవులం బ్రియసత్కారంబులఁ బూజించి సాత్వతియు నబ్బాలు బలదేవుచేతికి నెత్తికొననిచ్చి తదనంతరంబ నారాయణుచేతికి నిచ్చిన.

### [2.2.57](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.57)

క. అక్కొడుకు నబ్జనాభుం | డక్కజముగ నెత్తికొనుడు నందఱుఁ జూడన్‌  
గ్రక్కున నొక్కట నడఁగెను | మిక్కిలి చేతులును వానిమిక్కిలి కన్నున్‌.

### [2.2.58](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.58)

వ. దానిం జూచి సాత్వతి యద్భుతచిత్తయై యశరీరిపలుకు లప్పుడు దలంచి తన పుత్త్రునకు మురవైరివలన మరణం బగుట యెఱింగి యతని కి ట్లనియె.

### [2.2.59](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.59)

క. కుపథప్రవృత్తుఁ డయి వీఁ | డపనయమున నీ కనిష్టుఁ డయినను గరుణా  
నిపుణుఁడవై నీ మఱఁదికి | నపరాధశతంబు సైఁపుమయ్య యుపేంద్రా!

### [2.2.60](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.60)

వ. అని వీనితల్లి తొల్లి జగద్వల్లభుండైన జనార్దనుం బ్రార్థించి తత్ప్రసాదంబున వరంబు వడయుటం జేసి శతాపరాధంబులు నిండునంతకు వీఁ డన్యులచేత నప్రతిహతుండు; కృష్ణునిచేత నిహతుండగు; నది కారణంబుగా.

### [2.2.61](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.61)

చ. ఇతనికి నిట్లు న న్నుఱక యెగ్గులు వల్కఁగఁ బోలెఁగాక, యు  
ద్ధతమతి నన్యు లీతని విధంబునఁ బల్కి మదీయచాప ని  
ర్గత చటులోగ్రమార్గణ నికాయ పయోధి మునుంగ కిట్లు ద  
ర్పితులయి పోవనేర్తురె గభీరపరాక్రమ! మారుతాత్మజా!

### [2.2.62](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.62)

వ. అని పలుకుచున్న భీష్మభీముల నతిక్రమించి శిశుపాలుండు జనార్దనున కభిముఖుండయి యి ట్లనియె.

### [2.2.63](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.63)

మ. అవమాన్యున్‌ సభలోన మాన్యుఁ డని సౌహార్దంబునం గౌరవ  
స్థవిర ప్రేరణ నిన్నుఁ బాండుతనయుల్‌ తప్పంగఁ బూజించి ర  
య్యవివేకాస్పదు లైన పాండవులు మోహాంధుండు భీష్ముండుఁ గే  
శవ! నీవుం గడఁగుండు నాకు నెదురై సంగ్రామరంగంబునన్‌.

### [2.2.64](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.64)

వ. అని శిశుపాలుండు గర్వించి పలికిన విని చక్రధరుం డఖిల రాజచక్రంబు విన నిట్లనియె.

### [2.2.65](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.65)

సీ. ప్రాగ్జ్యోతిషంబున భగదత్తుపయి నేము | వోయిన నీతఁ డన్యాయవృత్తి  
నిట బాలవృద్ధుల కెల్ల భయంబుగా | ద్వారకాపురిఁ గాల్చె, వీరులైన  
భోజరాజన్యులు పొలఁతులతోడ రై | వతకాద్రిఁ గ్రీడాభిరతిఁ బ్రమత్తు  
లయియున్న వారల నదయుఁడై వధియించె; | దేవాభుఁ డగు వసుదేవు చేయు  
ఆ. నశ్వమేధమునకు నభ్యర్చితం బైన | హయము నపహరించి యజ్ఞమునకు  
విఘ్న మాచరించె; వీఁ డతిపాపుఁ డై | బభ్రుభార్యఁ దనకు భార్యఁ జేసె.

### [2.2.66](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.66)

వ. ‘మఱియు వాగ్విషయంబు లయిన యపకారంబు లనేకంబులు సేసె; మా యత్త సాత్వతి నన్నుం బ్రార్థించుటంజేసి యిద్దురాత్ముండు సేసిన యపరాధశతంబు సహించితి; నిప్పుడు మీ రిందఱు నెఱుంగ నాయం దకారణ వ్యతిక్రమం బుపక్రమించి యత్యంతశత్రుం డయ్యె’ ననిన విని శిశుపాలుం డతిపరుష వచనుం డగుచుఁ బురుషోత్తమున కి ట్లనియె.

### [2.2.67](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.67)

క. నీ కూర్మియు నీ యలుకయు | నా కవి యేమిటికి దుర్గుణప్రియ! మొదలన్‌  
నా కిచ్చిన యక్కన్యకఁ | జేకొని నీ కిట్లు పలుక సిగ్గును లేదే!

### [2.2.86](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.86)

వ. అట దుర్యోధనుండు శకునియుం దానును సభావిభవంబుఁ జూచు వేడుక నందుఁ గొన్ని దినంబు లుండి, యొక్కనాఁడు దాని యపూర్వరమణీయతకు విస్మితుం డగుచు నయ్యయి ప్రదేశంబులం గ్రుమ్మరువాఁడు వివృతంబైన ద్వారదేశంబు సంవృతంబుగా వగచి చొరనొల్లక, సంవృతంబైనదాని వివృతంబుగా వగచి చొరంబోయిలలాట ఘట్టితగృహద్వారుండయి, సమప్రదేశం బున్నతంబుగా వగచి యెక్కసమకట్టి, నీలాశ్మరశ్మి స్థగితంబైన విమలమణిస్థలంబు జలాశయంబుగా వగచి పరిధానం బెగఁద్రోచికొని, స్ఫటికదీప్తిజాల పరివృతంబైన జలాశయంబు స్థలంబుగా వగచి కట్టిన పుట్టంబు దడియంజొచ్చి, క్రమ్మఱిన వానిం జూచి పాంచాలియుఁ బాండుకుమారులును నగి రంత.

### [2.2.87](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.87)

ఆ. దాని నెఱిఁగి ధర్మతనయుండు ధృతరాష్ట్రు | తనయునకు సమీరతనయుచేత  
దివ్యవస్త్రములును దివ్యభూషణములు | నిచ్చి పుచ్చెఁ బ్రీతి యేర్పడంగ.

### [2.2.88](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.88)

వ. దుర్యోధనుం డట్లు సభాప్రలంభంబునకు లజ్జితుండయి పాండవుల వీడ్కొని గజపురంబున కరిగి ధర్మరాజు రాజసూయంబు దన కసూయాజననం బగుటయు సకలజనమనో నయనోత్సవంబయిన తత్సభాలక్ష్మి దన మనోనయనంబుల కగ్నిజ్వాలయై మహాదాహంబు సేయుటయు సంతప్తుండై నిదాఘదాహంబున నింకి తఱుఁగు నల్పజలాశయంబునుం బోలెఁ దద్దయుం దఱిఁగి.

### [2.2.89](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.89)

క. కందు గల పసిఁడి గాఁచినఁ | గంది వివర్ణమయినట్లు కౌరవుకాయం  
బొందఁగ వివర్ణమయి కడు | వందె మనస్తాపహవ్యవహదాహమునన్‌.

### [2.2.90](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.90)

క. అవనీ రాజ్యవ్యాపా | రవిహీనుం డయి సుహృద్విరంజనుఁ డై కౌ  
రవపాంసనుండు పాప | వ్యవసాయమునందు బుద్ధి వదలక నిలిపెన్‌.

### [2.2.91](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.91)

వ. ఇట్లు సకల సుఖోపభోగ విముఖుండయి యెవ్వరితోడం బలుక కున్న దుర్యోధనుం జూచి శకుని యి ట్లనియె.

### [2.2.92](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.92)

ఆ. ఇన్ని దినములయ్యె నేటికి నాతోడ | నిభపురేశ! పలుక విట్టు లేల?  
నీ ముఖంబు దీర్ఘ నిశ్వాస ధూమ సం | హతులఁ జేసి కలుషమయిన యదియు.

### [2.2.93](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.93)

క. నా కెఱిఁగింపుము దీని, న | నేకాగ్రతఁ బొందనేల యే నుండఁగ? న  
వ్యాకులభవత్ప్రతాప ని | రాకృతులు ధరిత్రిలోని రాజులు నీకున్‌.

### [2.2.94](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.94)

వ. ‘ఇంత సంతాపింప నేల?’ యనిన నాశకునికి దుర్యోధనుం డిట్లనియె.

### [2.2.130](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.130)

ఆ. ఇట్టి కార్యమునకు నే నవశ్యంబును | నొడఁబడంగ నోప నుక్కివమున  
సుతులతోడ నేల సుతులకు భేదంబు | సేయఁ గడఁగి తిదియుఁ జెట్ట యనక.

### [2.2.131](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.131)

తే. ఒలసి నీ పుత్త్రులెల్ల నొండొరులతోడ | నె ట్లొడంబడి యుండుదు రట్ల చేయ  
వలయుఁ; దమలోన జూదంబు వాదు నగుటఁ | గలహ మూలంబ యెట్టి శాంతులకు నైన.

### [2.2.132](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.132)

వ. ‘నీ నేర్చు విధంబున శకుని దుర్యోధనుల దుర్వ్యవసాయం బుడిగించి యిక్కురువంశంబు రక్షింపు’ మనిన విదురునకు ధృతరాష్ట్రుం డి ట్లనియె.

### [2.2.133](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.133)

ఉ. పుత్త్రుల కేల భేదమగు భూనుత! యేనును నీవు జాహ్నవీ  
పుత్త్రుఁడు నుండఁగా నహితమున్‌ భయమున్‌ దొరకొన్నె? నాకు నా  
పుత్త్రులకుం బ్రసాదకృత బుద్ధులు వేల్పులు గాన దీనికిన్‌  
మిత్రనిధీ! యొడంబడుము మిన్నక సంశయ మంద నేటికిన్‌?

### [2.2.134](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.134)

వ. ‘వడిగల తురంగంబులం బూనిన రథం బెక్కి యింద్రప్రస్థపురంబునకుం జని యిందులకు ధర్మనందనుం దోడ్కొని ర’ మ్మని విదురుం బంచిన, నాతండును నాపగేయున కంతయు నెఱింగించి ‘యిది యపకర్మం’ బనుచుండె; నిట ధృతరాష్ట్రుండు దన నిర్మింపంబంచిన సభ దుర్యోధనునకుం జూపి యాతని కేకాంతంబున నిట్లనియె.

### [2.2.135](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.135)

క. జూద మిది యేల? దీనను | భేదము మీలోనఁ బుట్టుఁ బెలుచన; యుష్మ  
ద్భేదమునఁజేసి యె గ్గు | త్పాదిల్లు ధరిత్రిఁ బ్రజకు భయజననంబై.

### [2.2.136](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.136)

ఉ. ఇమ్మహి నీవుఁ బాండవులు నెప్పటియట్ల పరస్పరానురా  
గమ్మున నేలుచున్కి యిది కార్యము; పాండవలక్ష్మి నీ కస  
హ్య మ్మన నేల? వంచనఁ బరార్థ పరిగ్రహబుద్ధిఁ జేసి పా  
పమ్మగుఁ; బాపకారులకుఁ బాయు నవశ్యము నర్థధర్మముల్‌.

### [2.2.137](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.137)

వ. ‘ధర్మాధర్మవిదుండైన విదురున కిది సమ్మతంబు గాదు; ధర్మజు ధనసంపదకంటె నేనుమడుంగులు నీకు ధన సంపద గలదు; వాని చేసిన యజ్ఞంబుకంటె విశేషంబుగా దక్షిణ లిచ్చి నీ కిష్టంబయిన యజ్ఞంబు సేయుము; నీకును భూలోకంబునంగల రాజులెల్లం దమసర్వస్వమ్ములుఁ దెచ్చియిత్తు’ రనిన విని దుర్యోధనుండు దండ్రి కి ట్లనియె.

### [2.2.138](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.138)

క. ఇమ్ముల ధర్మజుతో జూ | దమ్మాడఁగఁ గాన్ప నాకు ధరణీశ్వర! య  
జ్ఞ; మ్మదియ సమస్తైశ్వ | ర్యమ్ములు వడయఁగ నుపాయ మభిమతబుద్ధిన్‌.

### [2.2.139](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.139)

క. మీ రిందుల కందఱుఁ జను | దేరఁగ నే నంద యుండితిని సభ చూడన్‌;  
ధారుణి నట్టి యపూర్వ స | భారచనలు వినఁగఁ జూడఁబడ వెవ్వరిచేన్‌.

### [2.2.140](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.140)

వ. నిర్మల స్ఫటిక శిలానిర్మితం బై శశిప్రకాశంబై వివిధరత్న ప్రభా భాసురంబైన యా సభావిభవంబు చూచువేడుక నందుఁ గ్రుమ్మరు వాఁడ హరినీల బద్ధస్నిగ్ధ మణిస్థలంబునందు జలబుద్ధింజేసి పరిధానోత్కర్షణంబుసేసి, విమల శిలాతలబుద్ధి నుదకపరిపూర్ణం బయిన వాపి సొచ్చి, కట్టిన పుట్టంబు దడియం ద్రెళ్ళిన నన్నుం జూచి వృకోదరుండు నగియె; దాని నంతయు నెఱింగి ధర్మరాజ చోదితులయిన కింకరులు నాకుం బరిధానంబులు దెచ్చి యిచ్చిరి; మఱియు వివృతద్వారంబుఁ గవాట ఘటితం బని చొరనొల్లక, కవాటఘటితంబు వివృతంబుగా వగచి, చొరంబోయి తత్కవాట స్ఫటిక శిలా ఘట్టిత లలాటుండ నైన నన్నుం జూచి యనేక సహస్ర విలాసినీ పరివృతయయియున్న ద్రౌపది నగియె; నంత నకుల సహదేవులు పఱతెంచి ‘యిదె వాకిలి యిట వచ్చునది’ యని నన్నుం దోడ్కొని పోయి; రట్టి సభాప్రలంభంబు నాకు హృదయశల్యం బయి యున్నది.

### [2.2.141](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.141)

క. పెద్దలు హీనతఁ బొందిరి | తద్దయు హీనులు సమృద్ధిఁ దనరిరి నియమం  
బెద్ది విధియోగమున కసు | హృద్దర్పోన్నతులు సూచి యెట్లు సహింతున్‌.

### [2.2.142](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.142)

క. పరమసుఖోపాయంబునఁ | బరసంపద చేకొనంగఁ బడునేని నరే  
శ్వర! యంతకంటె మిక్కిలి | పురుషార్థం బెద్ది యొండు భూనాథులకున్‌.

### [2.2.143](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.143)

క. నముచి యను దనుజుఁ డుగ్రత | పము సేయుచు నున్నవాని బలమథనుఁ డధ  
ర్మమున వధియించె; రిపుప | క్షము నెమ్మెయి నైనఁ జెఱుపఁగా వలయు నిలన్‌.

### [2.2.144](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.144)

ఆ. అల్పుఁడయ్యు మనుజుఁ డతి పరాక్రమమునఁ | బేర్మిఁ దరతరంబ పెరుగుచున్న  
వాఁడు మ్రాని మొదలి వల్మీక మా మ్రానిఁ | జెఱుచు నట్లు గడఁగి చెఱుచుఁ బగఱ.

### [2.2.145](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.145)

తే. అహితవృద్ధి యుపేక్షితం బగుడు నల్ప | మగు మహావ్యాధియును బోలె నది యసాధ్య  
మయి యుపేక్షకు నిర్మూలితాత్ముఁ జేయుఁ | గాన పాండవశ్రీ యుపేక్ష్యంబు గాదు.

### [2.2.146](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.146)

వ. ‘దాని నెవ్విధంబున నయిన నపహరింపవలయు; నట్లుగాని నాఁడు నా హృదయ తాపంబున కుపశమనంబుగా; దనిన దుర్యోధనునకు శకుని యి ట్లనియె.

### [2.2.147](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.147)

సీ. నాగరథాశ్వసన్నాహ మొనర్పక, | యొడ్డనంబులు దీర్ప, కుభయ సైన్య  
వీరుల కరముల వివిధాయుధంబుల | నన్యోన్యసంఘట్టనారవంబు  
లెసఁగంగ సంగ్రామ మేర్పడఁ జేయక, | యక్షముల్‌ దొలిచి యే నశ్రమమునఁ  
బ్రతిపక్షతతుల సంపదలు జయించి నీ | కిచ్చెద; వగవంగ నేల? ధర్మ  
ఆ. రాజుఁ బ్రీతితోడ రావించి యతనితోఁ | గడఁగు జూద మాడఁ గౌరవేంద్ర!  
యొండు పాటఁ బాండవోన్నతి వేల్పుల | కయిన నపహరింప నలవి గాదు.

### [2.2.148](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.148)

వ. అనిన ధృతరాష్ట్రుండు దాని కొడంబడనొల్లక ‘యేను విదురు శాసనంబున వర్తిల్లుచున్నవాఁడ; నాతం డర్థానర్థ విదుండు, సకలకార్యసమర్థుండు; జూదంబున విగ్రహం బగు ననియె; బలవంతులతోడి విగ్రహంబు పరిహరించుట లగ్గు; నా వచనంబు ధర్మోపేతంబు; దీని నతిక్రమించి యనుతాపంబు సేయక యిప్పుడు జూదం బుడిగి యెప్పటియట్ల యుండుట కార్యం’ బనిన విని దుర్యోధనుం డతని కి ట్లనియె.

### [2.2.149](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.149)

క. తనకార్య మొరుమతంబున | నొనరింపఁగ నేర నగునె యొరునిమతంబుం  
దనమతము నొకఁడు గా నో | పునె? చెచ్చెర నిశ్చయింపఁబోలునె దానిన్‌?

### [2.2.150](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.150)

ఆ. విదురుమతము పాండవేయహితార్థంబు; | వానిబుద్ధి నెగడవలవ; దన్య  
పక్షపాతబుద్ధిఁ బరఁగుచు నుండెడు | నట్టి వాని నాప్తుఁ డనఁగ నగునె?

### [2.2.151](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.151)

వ. ‘జూదం బన్నది పురాణంబులయందును వినంబడు; దీన దోషంబు లేదు; సుహృద్ద్యూతంబున దేవతలు దేవసాయుజ్యంబు వడయుదురు; గాన, దీనిం బ్రవర్తింప శకుని కానతిచ్చి యిందులకు ధర్మనందను రావింప వలయు’ ననిన ధృతరాష్ట్రుండు పెద్దయుం బ్రొద్దు చింతించి, యెట్టకేనియు దాని కొడంబడి, విదురుం బిలిపించి వాని కి ట్లనియె.

### [2.2.152](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.152)

చ. అనుపమరత్నకాంచనచయాంచిత మీ సభ దీని ధర్మనం  
దనుఁ డనఘుండు దానుఁ దన తమ్ములు నిందుల కేఁగుదెంచి చూ  
చినఁ గడు సంతసం బగు విశిష్టజనస్తుత! నీవు వానిఁ దో  
డ్కొని చనుదెమ్ము భూసురసఖున్‌ బుధబంధుజనానురంజనున్‌.

### [2.2.153](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.153)

వ. ‘ఇట్టి విచిత్ర రత్న సభావేదికాతలంబున నతండును దుర్యోధనుతోడం బ్రొద్దువోక సుహృద్ద్యూతంబుఁ బ్రవర్తించు’ ననిన విని విదురుండు విషణ్ణహృదయుండయి ‘మాయా దురోదరంబు దురర్థంబుగాఁ జింతించి దీని నుడిగిన నుభయపక్షంబులకు ల గ్గగు’ నని పెక్కుమాఱులు వారించి.

### [2.2.154](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.154)

క. అవిలంఘనీయ మీదు | ర్వ్యవసాయం బనుచు సత్యవచనుఁడు ధర్మా  
ర్థవిదుం డప్పుడు ధృతరా | ష్ట్రవిధాతృనియోగమున కొడంబడి యంతన్‌.

### [2.2.155](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.155)

క. ఇంద్రప్రస్థపురంబున | కింద్రగురుప్రతిభుఁ డరిగి యింద్రసమానుం  
జంద్రయశు ననుజసహితు నృ | పేంద్రుని ధర్మసుతుఁ గాంచె నెంతయుఁ బ్రీతిన్‌.

### [2.2.156](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.156)

వ. అతనిచేత నభ్యర్చితుం డయి కుశలం బడిగి నిజాగమనప్రయోజనం బెఱింగించిన విని, విదురునకు ధర్మతనయుం డి ట్లనియె.

### [2.2.157](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.157)

సీ. ‘పుత్త్రవత్సలుఁడు విచిత్రవీర్యాత్మజుఁ | డార్యుండు ధృతరాష్ట్రుఁ డాదరించి  
నిన్ను నియోగించె నన్నుఁ దోడ్కొని తేర; | నీవును వచ్చితి నెమ్మితోడ;  
లాలితాపూర్వసభాలోకనంబున | యందు జూదంబు కార్యంబె? చెపుమ;  
జూదంబు కతమున భేదంబు గాకుండ | నేరదు మాలోన; నీనియోగ  
ఆ. మనఘ! మా కలంఘ్య మయినట్లు ధృతరాష్ట్రు | పనుపుసేయ నీకుఁ బాడి యదియ’  
యనుచు విధినియుక్తుఁ డయి యప్డు విదురుతో | నేఁగ నిశ్చయించె నిందుకులుఁడు.

### [2.2.158](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.158)

క. అనుజులు ద్రుపదాత్మజయును | ననుచరముఖ్యులును ధౌమ్యుఁ డాదిగ విద్వ  
జ్జనులును దోఁ జనుదేరఁగ | నినసన్నిభతేజుఁ డరిగె నిభపురమునకున్‌.

### [2.2.159](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.159)

వ. అందు దుర్యోధన దుశ్శాసనాది పుత్త్రశతంబుతో భీష్మశల్య శకుని సైంధవ కర్ణ గౌతమ ద్రోణాశ్వత్థామ సోమదత్త సమేతుండయి యున్న ధృతరాష్ట్రునకు భానుమతీ ప్రభృతిస్నుషా పరివృతయయి తారకాపరివృత యయి యున్న రోహిణియుంబోలె నున్న గాంధారీదేవికిఁ గురువృద్ధజనులకు నతివినయంబున ననుజ సహితుండయి ధర్మతనయుండు మ్రొక్కె; నంత ద్రుపదరాజనందనయు గాంధారికి మ్రొక్కిన, నక్కోమలిం జూచి గాంధారికోడం డ్రెల్లను విస్మితలయి.

### [2.2.160](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.160)

తే. ‘అఖిలలావణ్యపుంజంబు నబ్జభవుఁడు | మెలఁతగా దీనియందు నిర్మించె నొక్కొ!  
కానినాఁ డిట్టి కాంతి యే కాంతలందు | నేల లే?’దని సామర్షహృదయ లయిరి.

### [2.2.161](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.161)

వ. ఇట్లు పాండవ కౌరవు లతిప్రణయగౌరవంబున నద్దివసంబు సలిపి రంతఁ బ్రభాతంబ.

### [2.2.162](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.162)

ఉ. ఆ ధృతరాష్ట్రుచేసిన యనర్ఘమణిప్రకరానుబద్ధ శో  
భాధృతి నొప్పుచున్న సభ పార్థివముఖ్యుఁడు ధర్మజుండు దు  
ర్యోధనుఁ డర్థిఁ జూపఁగ సహోదరవీరులుఁ దానుఁ జూచి ల  
క్ష్మీధరమూర్తి యెంతయును మెచ్చె మనంబునఁ దద్విభూతికిన్‌.

### [2.2.163](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.163)

వ. అయ్యపూర్వసభామణి కుట్టిమంబున నందఱు సుఖాసీనులయి యిష్టసంభాషణాది క్రీడావసరంబున నున్నంత దుర్యోధనుండు యుధిష్ఠిరున కి ట్లనియె.

### [2.2.164](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.164)

క. అనఘ! సుహృద్ద్యూతం బిం | దొనరింతము ప్రొద్దువోకయును నగు, జూదం  
బునకుం బ్రియుఁడవు దక్షుఁడ | వన విందుము నిన్నుఁ బ్రీతి నక్షజ్ఞులచేన్‌.

### [2.2.165](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.165)

వ. అనిన వానికి ధర్మతనయుం డి ట్లనియె.

### [2.2.166](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.166)

తే. క్షత్త్రనీతిక్రమంబులు గావు సూవె | నికృతియును జూదమును; ధర్మనిత్యులైన  
వారి కీ రెండు వర్జింపవలయు నెందుఁ; | బాపవృత్తంబు జూదంబు పార్థివులకు.

### [2.2.167](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.167)

ఆ. కుటిలమార్గు లయిన కుత్సితకితవుల | తోడఁ గడఁగి జూదమాడఁ జనదు;  
దానఁజేసి యర్థధర్మవివర్జితు | లగుదు రెట్టివారు జగములోన.

### [2.2.168](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.168)

వ. ‘మఱియు మాయాద్యూతంబున జయించుట మహాపాతకం బనియును, ధర్మద్యూతంబున జయించుట ధర్మయుద్ధంబున జయించు నంతియ పుణ్యం బనియును నసితుండయిన దేవలుండు చెప్పె’ ననిన నయ్యుధిష్ఠిరునకు శకుని యి ట్లనియె.

### [2.2.169](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.169)

క. ద్యూతకళాకుశలుండగు | నాతఁడు లోకజ్ఞుఁడును మహామతియును వి  
ఖ్యాతుఁడు నగు సత్‌క్షత్త్రియ | నీతి విదుఁడు దగునె దాని నిందింపంగన్‌.

### [2.2.170](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.170)

క. బలహీను లయిన వారలు | బలవంతుల నొడుచునపుడు బహుమాయల న  
చ్చలమునఁ జేయుట యెందును | గలయదియ; జయంబ కాదె కర్తవ్య మిలన్‌.

### [2.2.171](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.171)

వ. ‘జూదంబున కీ వోడుదేని యుడుగు’ మనిన నాతనికి ధర్మరా జి ట్లనియె.

### [2.2.172](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.172)

క. ‘బలవద్ద్యూతార్థముగాఁ | బిలువంబడి మగుడ నగునె? పెక్కులు పలుకుల్‌  
పలుకంగ నేల?’ యని య | త్యలఘుఁడు ధర్మజుఁడు జూద మాడఁ గడంగెన్‌.

### [2.2.173](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.173)

వ. ఇట్లు జూదంబున నయ్యెడు దోసం బెఱింగియు దైవానుశాసనంబున ధర్మజుండు దాని కభిముఖుండయి చందన కర్పూర కస్తూరీ పరిషిక్తంబయిన ద్యూతరంగంబునందు ముందఱ గంధపుష్పార్చితంబు లయిన యభిమతాక్షంబు లమర్చికొనియున్న సౌబల వివింశతి చిత్రసేన వికర్ణులం జూచి ‘వీరిలో నెవ్వఁడు నాతో జూదం బాడెడు వాఁ?’డనిన నాతనికి దుర్యోధనుం డి ట్లనియె.

### [2.2.174](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.174)

తే. అనఘ! మా మామ శకుని నాకై కడంగి | జూదమాడెడి నీతోడఁ; గాదు నాక  
యీతఁ డొడ్డిన ధనరాసు లెవ్వియైనఁ | బోఁడిగా నీకు నీఁగలవాఁడ నేను.

### [2.2.175](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.175)

వ. అని తనచేతి యనర్ఘ రత్న కటకంబు లొడ్డిన, ‘నన్యులకయి యన్యులు జూదం బాడుట యెంతయు విషమం’ బనుచు ధర్మతనయుండు సాగరావర్త సంభవంబులయిన పరార్థ్యమణిహారంబు లొడ్డె; నిట్లు సుహృద్ద్యూతంబు ప్రవర్తిల్లు నదియైన నచ్చోటికి వచ్చి భీష్మ ధృతరాష్ట్ర విదురకృపద్రోణాశ్వత్థామలు విచిత్రోచ్చాసనస్థు లయి దానిం జూచుచు నప్రహృష్టహృదయు లయి యుండి రంత.

### [2.2.176](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.176)

తే. అభిమతాక్షముల్‌ దొల్చి మాయావిదుండు | సుబలరాజాత్మజుఁడు ధర్మసుతు జయించె;  
నొడుతు నే నింక నని వెండియును గడంగె | శకునితో జూదమాడ నా శశికులుండు.

### [2.2.177](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.177)

వ. ఇట్లు యుధిష్ఠిరుండు బద్ధమత్సరుండయి పెఱిఁగి యొండొండ యొడ్డుచు నిష్కసహస్రభరితానేకాయుత కుండమండితంబు లయిన సువర్ణభాండాగారంబులును, వజ్రవైదూర్యమరకతమౌక్తికనీలప్రవాళ పద్మరాగాది వివిధ శుద్ధ విపుల రత్న పరిపూర్ణంబు లైన రత్నభాండాగారంబులుం, బ్రత్యేకంబ పంచద్రోణ కాంచన సంచితంబు లయిన చతుశ్శతనిధులును, మణికింకిణీ జాలాలంకృతంబు లయిన యసంఖ్యాత హయ యూధంబులును, జాతరూప వరూధంబులుం గనక కక్ష్యాకుథ సనాథంబు లయిన మదాంధ గంధ సింధుర సందోహంబులుం, బరార్థ్య రత్న భూషణ భూషితంబు లయిన యోషిత్సహస్రంబులును, ననుదినాతిథి జన భోజనపాత్రహస్తులయిన శతసహస్రపరిచారకులును, నర్జునునకుఁ జిత్రరథుం డిచ్చిన గంధర్వ హయంబులం దొట్టి దుగ్ధపానశాలి తండుల ఖాదనంబులం బెరుఁగుచున్న జాత్యశ్వానేకాయుతంబులు, నజావి గో మహిష ఖర రాసభ నివహంబులు నొక్కొక్క యొడ్డునన యొడ్డి యోటుపడినం జూచి విదురుండు ధృతరాష్ట్రునకు రహస్యంబున ని ట్లనియె.

### [2.2.178](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.178)

క. ఖలుఁ డీ దుర్యోధనుఁ డె | గ్గులతోడన యుద్భవిల్లె; గోమాయురుతం  
బులు వించె, దుర్నిమిత్తం | బులు పెక్కులు వుట్టె వీని పుట్టిన వేళన్‌.

### [2.2.179](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.179)

వ. తొల్లి యెన్నండును బాపంబుం బొరయని మహాభిష భీమసేన ప్రతీప శంతనుల కులంబు దుర్యోధనుకారణంబునం బాపభూయిష్ఠంబు గానున్నయది; యొక్కని కారణంబునఁ గులంబున కెగ్గగు నేని వాని దూషించి కులంబు రక్షించుట ధర్మం బని శుక్రుండు చెప్పెఁ; గులరక్షణార్థం బంధక యాదవ వృష్ణి వీరులు కృష్ణు నియోగించి కులదూషకుండైన కంసుని వధియించిరి గావున.

### [2.2.180](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.180)

మత్తకోకిల. వాసవాత్మజుఁ బంపు మిప్పుడ వాఁడు ధర్మవిదుండు నీ  
శాసనంబున నిగ్రహించు విచారదూరు సుయోధనున్‌;  
భూసతీశ్వర! దీన నీకులమున్‌ మహీప్రజయున్‌ గత  
త్రాసవృత్తిసుఖంబు వొందుఁ; బ్రధానవిగ్రహ మేటికిన్‌?

### [2.2.181](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.181)

ఉ. ఇమ్మనుజాధమున్‌ గుణవిహీను బహిష్కృతుఁ జేసి ధర్మమా  
ర్గమ్మునఁ గౌరవాన్వయముఁ గావుము; పాండుతనూజులం బ్రతా  
ప మ్మెసఁగంగ నేలు; మిది పథ్యము సు; మ్మొక నక్క నిచ్చి సిం  
హమ్ముల విల్చికో లుఱదె? యన్యులె వారలు కౌరవేశ్వరా!

### [2.2.182](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.182)

మధ్యాక్కర. అంగారములు గొనువేడ్కఁ బుష్పఫలావళీ లలిత  
తుంగద్రుమప్రకరంబుఁ గరుణావిదూరుఁడై కాల్చు  
నంగారకారుఁ బోలంగ సమకట్టె నర్థలోభంబు  
నం గురుకులహానికరుఁడు ధారుణీనాథ! నీ సుతుఁడు.

### [2.2.183](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.183)

ఆ. అధికదర్పయుక్తమై బలీవర్దంబు | నగముదరి విదారణంబు సేయఁ  
గాలుద్రవ్వునట్లు గడు బలాఢ్యులతోడ | నేచి వీఁడు విగ్రహింపఁ దొడఁగె.

### [2.2.184](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.184)

వ. ‘ఇంక నయిన నుపేక్షింపక యీ దుష్టద్యూతంబు వారింపు ‘మనినఁ బుత్త్రస్నేహంబున నెద్దియుం జేయునది నేరక ధృతరాష్ట్రుండు మిన్నకుండె; నంత విదురుండు దుర్యోధనున కభిముఖుండై యి ట్లనియె.

### [2.2.185](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.185)

క. న్యాయంబు విడిచి సౌబలు | మాయా ద్యూతమునఁ బాపమతివై భరతా  
మ్నాయు లగు పాండవేయుల | శ్రీ యిమ్మెయిఁ గొనిన నిన్నుఁ జీ యనరె యొరుల్‌.

### [2.2.186](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.186)

క. ధృతిమంతుల భుజవిక్రమ | జితశత్రులఁ బాండవేయసింహులను మదో  
ద్ధతిమైఁ బరాజితులఁ జే | సితి; వారల కిట్లు నికృతి సేయుట లగ్గే?

### [2.2.187](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.187)

వ. అనిన విని విదురున కలిగి దుర్యోధనుం డి ట్లనియె.

### [2.2.188](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.188)

సీ. పరుల గుణంబులు పలుమాఱుఁ గీర్తింతు; | పక్షంబ పలుకుదు పాండవులకు;  
ధార్తరాష్ట్రుల సంతతంబు నిందింతువు; | కుడిచిన చోటికిఁ గూర్ప వెపుడు;  
నుత్సంగతలమున నుగ్రవిషోరగం | బున్నట్లు నీవు మా యొద్ద నునికి;  
పరులసంపద సుఖోపాయబలంబునఁ | గొనుట భూపతులకు గుణము కాదె?  
ఆ. యడుగకయును గర్జ మది యిష్టుఁడై చెప్పు | నతని కాడఁ దగిన యదియ; నన్ను  
నిట్టు నట్టు ననఁగ నేల? నీ యిమ్ముల | నుండు; బుద్ధి సెప్పకుండు మాకు.

### [2.2.189](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.189)

వ. అనిన విదురుం డి ట్లనియె.

### [2.2.190](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.190)

క. చెడఁ గఱపువార చెలులుం | గడుకొని నీయట్టివారి కర్జంబులు చె  
ప్పెడు వారుఁగాక, నీకున్‌ | మడవక మా యట్టివారి మాటలు గొఱయే?

### [2.2.191](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.191)

తే. ప్రియము పలికెడువారిన పెద్ద మెత్తు, | రప్రియంబును బథ్యంబునైన పలుకు  
వినఁగ నొల్లరు, గావున వేడ్కదానిఁ | బలుక రెవ్వరు నుత్తమప్రతిభు లయ్యు.

### [2.2.192](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.192)

తే. మొదల నప్రియ మయ్యును దుదిఁ గరంబు | పథ్య మగు పల్కు ప్రియులందు బలిమి నైనఁ  
బలుక వలయు మోమోడక యొలసి యట్టి | వాఁడు దగు సహాయుండు భూవల్లభునకు.

### [2.2.193](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.193)

వ. ‘ఏను సపుత్త్రకుండైన వైచిత్రవీర్యు కార్యంబునకు హితుండనై నెగడుదు; నట్టి న న్నన్యథాబుద్ధి నొల్లక పలికితి; పాండవులతోడి విగ్రహంబు లగ్గుగా’దని చెప్పి విదురుండు విగతవచనుండై యుండె; నంత శకుని ధర్మనందనున కి ట్లనియె.

### [2.2.194](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.194)

ఉ. ‘ఎల్లధనంబు నోటువడి తిందుకులేశ్వర! యింక నొడ్డఁగా  
మొల్లము నాకుఁ జూపు’మని ముందట సారెలు ద్రోచి యాడఁగా  
నొల్లకయున్న సౌబలున కున్నతచిత్తుఁడు ధారుణీతలం  
బెల్లను నొడ్డి యోటువడియెన్‌ బలవద్వ్యసనాభిభూతుఁడై.

### [2.2.195](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.195)

వ. ఇట్లు దేవభోగ బ్రాహ్మణ వృత్తులు దక్కఁ దక్కిన మహీతలంబును, బ్రాహ్మణులు దక్క సర్వప్రకృతిజనులను, రాజ పుత్త్రుల నొక్కొక్క యొడ్డున నొడ్డి యోటువడి వెండియు.

### [2.2.196](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.196)

సీ. తమ్ముల నత్యంత ధర్మసమేతుల | నాయతబాహుల నాజిజయుల  
నాదిత్యతేజుల నాదిభూపాలక | చరితుల నభిమానసత్యరతుల  
సహదేవనకులవాసవసుతభీములఁ | గ్రమమున నలువురఁ గౌరవేంద్రుఁ  
డొక్కొక్క యొడ్డున నొడ్డి తన్నును నొడ్డి | యుక్కివంబున నప్పు డోటు వడిన  
ఆ. నతనిఁ జూచి శకుని యనియె ‘నిట్లేల ని | న్నొడ్డి తధిప! నీకు నొండుధనము  
గలదు; మఱచి తెట్లు? కమలాక్షి పాంచాల | కన్య నీకు ధనము గాదె?’ యనిన.

### [2.2.197](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.197)

చ. అలయక వెండియుం గడఁగి యక్షరతుండయి ద్రౌపదిన్‌ మహో  
త్పలదళచారునేత్రఁ గులభామఁ బణంబుగఁ జేసి యొడ్డి సౌ  
బలఖలుచేత నోటువడి పాండుసుతుం డుడిగెన్‌ ధనంబు ల  
గ్గలముగ నొడ్డలేమి గతగర్వమునం గడు దీనవక్త్రుఁడై.

### [2.2.198](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.198)

సీ. ఆతనిఁ జూచి ద్రోణాచార్య కృప భీష్ము | లవిరళ స్వేదాంగు లగుచు వృద్ధ  
జనులును దారు నిశ్శబ్ద నిరంతర | ముఖులైరి; విదురుండు మొగము వాయ  
నిడి తలవాంచి త న్నెఱుఁగక దుఃఖితుం | డై యుండెఁ; దక్కిన యా సదస్యు  
లందఱుఁ బ్రబలబాష్పాంబుధారాకులి | తాక్షులై; రత్యుచ్చమై పయోధి  
ఆ. పటురవాభమై సభాక్షోభ మయ్యె; దు | శ్శాసనుండుఁ గర్ణసైంధవులును  
నధికహర్షవికసితాస్యంబు లొప్ప నొం | డొరులఁ జూచి నగుచు నుండి రపుడు.

### [2.2.199](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.199)

వ. ధృతరాష్ట్రుండును ‘నిది యేమి సభాక్షోభం? బెవ్వ రెవ్వ రే వస్తువు లొడ్డి?’ రని విదురు నడుగుచుండె; నట్టి యవసరంబున దుర్యోధనుండు పాండవులం దనకు దాసులంగా నొడిచినవాఁడై పెఱిఁగి.

### [2.2.200](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.200)

క. వరవుళ్ళఁ గలసి తనయిలు | పరువడిఁ దుడువంగఁ గృష్ణఁ బనుచువగన్‌ భా  
సుర రాజ్యదర్ప మొప్ప వి | దురుఁ జెచ్చెరఁ బంచె దానిఁ దోడ్కొని తేరన్‌.

### [2.2.201](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.201)

క. దాని సహింపక విదురుం | డా నరపతి కిట్టు లనియె ‘నజ్ఞానులు నీ  
తో నెన లే రొరు; లిట్లు మ | హానిష్ఠురవృత్తిఁ బనుప నగునే నన్నున్‌?’

### [2.2.202](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.202)

క. మదమలినమనస్కుఁ డరుం | తుదుఁడు నృశంసుఁ డనఁ బరఁగు దుర్జనునకు సం  
పద లెడలయ్యును నాతని | మొదలిటి సంపదలతో సమూలంబు చెడున్‌.

### [2.2.203](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.203)

క. అవనీతలసామ్రాజ్యో | త్సవమునకును యోగ్యమైనసతి ద్రౌపది పాం  
డవధర్మపత్ని నీ కం | తవమానము సేయ నేమి యనపాశ్రయయే.

### [2.2.204](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.204)

తే. ఏల యాశీవిషంబుల నెఱిఁగి యెఱిఁగి | మూర్ఖవై యలిగించెదు? మొనసి యొరుల  
ధనము నికృతిమై గొను టిది ధర్మువగునె? | శకునిమతమునఁ బాపంబుఁ జనునె చేయ?

### [2.2.205](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.205)

వ. జూదంబున నెగ్గు పుట్టు; దీన నయ్యెడు ఫలంబు వేణుఫలంబునుంబోలె సహమూలవినాశంబునకు నిమిత్తం బగు’ననిన దుర్యోధనుండు విదురుం దూలనొదరి, ప్రాతికామి యనువానిం బిలిచి’ యీ విదురుం డెప్పుడు నరిష్టంబ కాని పలుకండు; పాండవులకు వెఱచు; నీవు వోయి ద్రౌపదిం దోడ్కొని ర’మ్మని పంచిన.

### [2.2.206](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.206)

ఆ. అవనినాథుచేత నాజ్ఞాపితుం డయి | సూతనందనుండు ప్రాతికామి  
పాండవాగ్రమహిషిపాలికిఁ జని భక్తి | వినతుఁ డగుచు నిట్టు లనియె సతికి.

### [2.2.207](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.207)

తరువోజ. ‘ధనసంపదలు నిజధరణిరాజ్యంబుఁ దనయులం దమ్ములఁ దన్నును నిన్నుఁ  
దనరఁ జూదంబాడి ధార్తరాష్ట్రులకు ధర్మతనూజుండు దా నోటువడియె;  
వనజాక్షి! కౌరవవరుపని నిన్ను వడిఁ దోడుకొని పోవ వచ్చితి నిపుడ;  
చనుదెమ్ము కౌరవేశ్వరుకడ’ కనిన జలజాయతాక్షి పాంచాలి యి ట్లనియె.

### [2.2.208](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.208)

ఆ. ‘ఏయుగంబునందు నెట్టి దుష్కితవుండు | భార్య నొడ్డి యోటువడినభర్త  
గలఁడె? యిది వినంగఁ గడు నపూర్వం బయ్యె; | నిట్లు సేయునొక్కొ యిందుకులుఁడు?

### [2.2.209](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.209)

తే. మున్ను ద న్నోటువడి మఱి నన్ను నోటు | వడియెనో, నన్ను ము న్నోటువడి విభుండు  
గ్రన్నఁ ద న్నోటువడియెనో యన్న! నాకు | నెఱుఁగఁ జెప్పుము దీని నీ వెఱుఁగుదేని.’

### [2.2.210](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.210)

వ. ‘ఎఱుంగవేని యక్కితవు నడిగి వచ్చి మఱి నన్నుం దోడ్కొని పోవనగునేని తోడ్కొని పొ’మ్మనినం బ్రాతికామి క్రమ్మఱి వచ్చి పాంచాలిపలుకులు ధర్మరాజునకుం జెప్పిన, దురోదర పరాజయ దుఃఖిత చేతస్కుం డగుటం జేసి యతఁడు వానికి నదత్తప్రతివచనుం డైనఁ, బ్రాతికామికి దుర్యోధనుం డి ట్లనియె.

### [2.2.211](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.211)

క. ‘సందిగ్ధ మయిన యర్థము | నిందఱ సన్నిధిన యడిగి; తింద ఱెఱుంగన్‌  
సుందరిఁ బాంచాలేంద్ర సు | తం దోడ్కొని రమ్ము, పొమ్ము! తడయక’ యనినన్‌.

### [2.2.212](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.212)

వ. వాఁడును ద్రౌపది పాలికింబోయి ‘దేవీ! నీ యడిగిన యర్థంబ నిర్ణయించువా రయి సభ్యులు నిన్ను రాఁబంచిరి; ర’మ్మనిన దుర్యోధను దుశ్చేష్టితంబునకు ధర్మరాజుసమ్మతంబునకు వెఱచి, యక్కోమలి ప్రాతికామిపిఱుంద నేకవస్త్రయు నధోనీవియు నవిరళగళితనయనోదకబిందుసందోహపరిపీడ్యమానపీనస్తన పరిధానాంతరయు నగుచు సభకుం జనుదెంచి కురువృద్ధుసమీపంబున నున్నంత; ద్రౌపదిం జూడ నోపక లజ్జితులయి దుఃఖాయమాన మానసులయి తలలు వాంచియున్న పాండవుల వైలక్ష్యం బుపలక్షించి సంతసిల్లి దుర్యోధనుండు దుశ్శాసనుం బిల్చి ‘ప్రాతికామి వృకోదరునకు వెఱచు; నీవు వోయి ద్రౌపదిం దోడ్కొని ర’మ్మని పంచిన.

### [2.2.213](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.213)

ఆ. నిర్దయాత్ముఁ బాపనిరతు దుశ్శాసనుఁ | బనుచు టెఱిఁగి కృష్ణ పంకజాక్షి  
గడుభయంబు నొంది గాంధారియొద్దకు | నరిగెఁ గడు నడంగి యతిరయమున.

### [2.2.214](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.214)

చ. తడయక కౌరవానుజుఁడు దాని పిఱుందన పాఱి ‘యింక నె  
క్కడ కరుగంగఁబోలుఁ? జులుకం జను దెమ్మిట; సౌబలుండు ని  
న్నొడిచె దురోదరంబునఁ; గురూత్తము నర్థమ వైతి; నిన్నునుం  
బుడమిని దమ్ముఁ గోల్పడిరి పొల్తి! భవత్పతులైన పాండవుల్‌.’

### [2.2.215](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.215)

వ. అనుచు డాయ వచ్చిన నక్కోమలి ‘రజస్వల నన్ను ముట్టకు; మేకవస్త్ర నయి యున్నదాన; గురుబంధు జనాధిష్ఠి తంబైన సభకు నెట్లు రా నేర్తు?’ ననిన ‘నీ వేకవస్త్ర వైతేమి విగతవస్త్ర వైతేమి? ని న్నెట్లుం దోడ్కొని పోదు’నని బలాత్కారంబున.

### [2.2.216](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.216)

ఉ. ఆ వనజాననం గురుకులాపశదుండు గడంగి రాజసూ  
యావభృథంబునందు వసుధామరమంత్రపవిత్రవారిధా  
రావళిఁ జేసి పావనము లైన శిరోజములం దెమల్చి పా  
పావహుఁ డీడ్చి తెచ్చె సభ కందఱు సంభ్రమమంది చూడఁగన్‌.

### [2.2.217](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.217)

వ. ఇట్లు వాతావధూతంబైన పతాకయుంబోలె దుశ్శాసనాకృష్టయై ద్రౌపది వికీర్ణకేశయు వివర్ణవదనయునై కర్ణ దుర్యోధన శకుని సైంధవాది దుష్ట భూయిష్ఠంబైన సభకు వచ్చి కోపలజ్జాపరవశ యయి.

### [2.2.218](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.218)

చ. అనుపమ దైవయోగహతుఁ డయ్యు నవశ్యము ధర్మసంపదం  
దనరున కాక ధర్మజుఁడు ధన్యుఁడు ధర్మపథంబు తప్పఁద్రొ  
క్కునె కురువృద్ధులార! భృశకోపనుఁ డీతఁడు నన్ను నేల దు  
ర్జనుఁ డిట యీడ్చి తెచ్చె నవిచారపరుం డయి దుర్మదంబునన్‌.

### [2.2.219](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.219)

చ. ‘ఇది యుచితంబు గా దనక యిక్కురుముఖ్యులు సూచుచుండ దు  
ర్మదుఁ డయి వీఁడు నన్ను నవమానితఁ జేసెడి; సర్వధర్మ సం  
విదు లన నున్న యీ భరతవీరులవంశము నేఁ డధర్మ సం  
పద నతినింద్య మయ్యె’ నని భామిని గృష్ణుఁ దలంచె భీతయై.

### [2.2.220](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.220)

వ. ఇట్లు జగత్త్రయ విజయ భుజవీర్య సనాథులైన నాథులు గలిగియు ననాథయుంబోలెఁ బాంచాలరాజపుత్త్రి భయార్తయై యార్తజన శరణ్యుండైన జగన్నాథు జనార్దనుం దలంచుచుఁగపట ద్యూతమధుమదోన్మత్తుండయిన ధర్మపుత్త్రు నిమిత్తంబున నుద్గతంబయిన పాండవపరాజయ దహనంబుఁ దన రూక్ష కటాక్ష వీక్షణ వచనంబులఁ బ్రవర్తించుచున్నదానిఁ జూచి దుఃఖితుండై భీమసేనుండు ధర్మరాజున కి ట్లనియె.

### [2.2.221](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.221)

క. ధన కనక రత్న వరవా | హన ధరణీ రాజ్యములును నాయుధములు మ  
మ్మును నోటువడుట యుచితమ | యినసన్నిభ! వీని కెల్ల నీశుఁడ వగుటన్‌.

### [2.2.222](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.222)

క. ద్రుపదతనూజం బణముగఁ | గపటద్యూతమునఁ జేయఁగాఁ దగునె జనా  
ధిప! యిది దుష్టద్యూతము | నెపమునఁ బరిభూత యయ్యె నిష్కరుణులచేన్‌.

### [2.2.223](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.223)

వ. ‘శకునికైతవం బెఱింగియుం బాపద్యూతంబునఁ బ్రవర్తించి యధర్మ ప్రవృత్తుండ వయితి కావున భవద్బాహు దాహంబు సేయవలయు’ నని కోపించి పలికినం బవనతనయునకు నర్జునుం డి ట్లనియె.

### [2.2.224](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.224)

సీ. ధర్మతనూజుండు ధర్మువు దప్పిన | ధరణీతలం బెల్లఁ దల్లడిల్లుఁ;  
దగిలి సుహృద్ద్యూత ధర్మయుద్ధములకుఁ | బరులచేఁ బిలువంగఁబడి విభుండు  
గడగక విముఖుండు గాఁ జన దని శుభ | క్షాత్త్రధర్మంబు లోకంబునందు  
నిలిపెఁ దా; నిది పతినేరమియే? దైవ | వైపరీత్యం బైన వనరఁ దగునె?  
ఆ. గురుల ధర్మపరులఁ గోపించి ధీరు ల | తిక్రమింతురే? తదీయనిత్య  
ధర్మగౌరవం బధార్మికు లగుచున్న | పరులచేతఁ జెఱుపఁబడియె నిట్లు.

### [2.2.225](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.225)

వ. అనుచు దుఃఖితులగు చున్న పాండవులను దుశ్శాసనాపకృష్టయై సభాంతరంబున నున్న ద్రౌపదిం జూచి వికర్ణుం డన్యాయశ్రవణవికర్ణులై మిన్నకున్న సభ్యుల కి ట్లనియె.

### [2.2.226](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.226)

క. సమచిత్తవృత్తు లగు బు | ద్ధిమంతులకు నిపుడు ద్రౌపదీప్రశ్న విచా  
రము సేయ వలయు; నవిచా | రమునఁ బ్రవర్తిల్లు టది నరకహేతు వగున్‌.

### [2.2.227](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.227)

వ. ‘ఇక్కురువృద్ధు లైన భీష్మ ధృతరాష్ట్ర విదురాదులును నాచార్యులయిన ద్రోణకృపాదులుం బలుకరైరి; యున్న సభాసదులెల్లం గామక్రోధాదులు దక్కి విచారించి చెప్పుం’డనిన నెవ్వరుం బలుకకున్న ‘నే నిందు ధర్మ నిర్ణయంబు సేసెద; నెల్లవారును వినుండు; జూదంబును వేఁటయుఁ బానంబును బహుభక్షణాసక్తియు నను నాలుగు దుర్వ్యసనంబులం దగిలిన పురుషుండు ధర్మువుం దప్పివర్తిల్లు; నట్టి వాని కృత్యంబులు సేకొనం దగవు; కిత వాహూతుండై వ్యసనవర్తి యయి పరాజితుం డయిన పాండవాగ్రజుండు పాండవుల కందఱకు సాధారణ ధనంబయిన పాంచాలిఁ బణంబుఁ జేసెం గావున ద్రౌపది యధర్మవిజిత; యక్కోమలి నేకవస్త్ర నిట దోడ్కొని తెచ్చుట యన్యాయం’ బనిన వికర్ణుపలుకుల కొడంబడక కర్ణుండు వాని కి ట్లనియె.

### [2.2.228](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.228)

ఆ. ‘ఎల్లవారు నెఱుఁగ నొల్లని ధర్మువు | బేల! నీకుఁ జెప్ప నేల వలసెఁ?  
జిఱుతవాని కింత తఱుసంటి పలుకులు | సన్నె వృద్ధజనము లున్నచోట?

### [2.2.229](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.229)

వ. నీవు ద్రౌపది నధర్మవిజిత యని పలికితి; సభాసదులెల్ల నెఱుంగ ధర్మజుండు దన సర్వస్వమ్ము నొడ్డి యోటువడి నప్పు డిది వానికి వెలిగాదు గావున ధర్మవిజితయ; యిట్లు గానినాఁడు పాండవు లిందఱును దీని విజితఁగా నేల యొడంబడుదురు? మఱి యేకవస్త్రయై యున్న దీని సభకుం దోడ్కొని వచ్చుట ధర్మువు గాదంటి; భార్యకు దైవవిహితుం డయిన భర్త యొక్కరుండ; యిది యనేకభర్తృక గావున బంధకి యనంబడు; నిట్టిదాని విగతవస్త్రం జేసి తెచ్చినను ధర్మవిరోధంబు లే’ దని కర్ణుండు వికర్ణువచనంబులకుం బ్రత్యాఖ్యానంబు సేసిన విని, దుర్యోధనుండు దుశ్శాసనుం బిలిచి ‘యిప్పాండవులయు ద్రౌపదియు వస్త్రంబు లపహరింపు’ మని పంచిన దాని నెఱింగి.

### [2.2.230](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.230)

క. కితవవ్యవసాయపరా | జితు లగుటం జేసి బలిమి చెడి పాండుసుతుల్‌  
ధృతిఁ దమ పయిపుట్టము లా | యతకీర్తులు మున్నపెట్టి యా సభ నున్నన్‌.

### [2.2.231](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.231)

సీ. ఇది సేయఁ గా దని మది విచారింపక | సద్గర్హితుండు దుశ్శాసనుండు  
నెట్టన ద్రౌపది గట్టిన పుట్టంబు | సభలోన విడ్చె నాశంక లేక  
యుడుగక యొలువంగఁ బడియు ము న్నపనీత | మైన తద్వస్త్రంబు నట్టి వలువ  
లలితాంగిజఘనమండలమునఁ బాయక | యొప్పుచు నున్న నయ్యువిదఁ జూచి  
ఆ. సభ్యులెల్ల నుదితసమ్మదు లయిరి దు | శ్శాసనుండు వస్త్రచయము పర్వ  
తోపమాన మయిన నొలువంగ నోపక | యుడిగె లజ్జఁ బొంది యుక్కు దక్కి.

### [2.2.232](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.232)

వ. ఇట్లు భీమసేనుండు ద్రుపదరాజనందనకు దుశ్శాసనుండు సేసిన యవమానంబు సూచి కోపరక్తాంత నయనుం డగుచు నంతకాకారంబున దంతసందష్టదారుణముఖుండయి యెల్లవారును విన ని ట్లనియె.

### [2.2.233](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.233)

మ. కురువృద్ధుల్‌ గురువృద్ధబాంధవు లనేకుల్‌ సూచుచుండన్‌ మదో  
ద్ధురుఁడై ద్రౌపది నిట్లు సేసిన ఖలున్‌ దుశ్శాసనున్‌ లోకభీ  
కరలీలన్‌ వధియించి తద్విపులవక్షశ్శైలరక్తౌఘ ని  
ర్ఝర ముర్వీపతి సూచుచుండ నని నాస్వాదింతు నుగ్రాకృతిన్‌.

### [2.2.234](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.234)

వ. ‘ఇట్లు సేయనైతినేని పితృపితామహుల గతికిం దప్పినవాఁడ నగుదు’ ననిన నతని యతిమానుషంబయిన మహావ్యవసాయంబున కద్భుతం బంది దిక్కులు చూడక ధిక్ఛబ్దముఖరిత ముఖు లగుచు సభాజనులు తమలో సపుత్త్రకుండయిన ధృతరాష్ట్రు నిందించుచు ‘ద్రుపదరాజపుత్త్రి వాక్యంబులు విచారింపక వృద్ధరాజు లుపేక్షించి’ రనుచుండి; రంత నుద్యతబాహుం డయి విదురుం డెల్లవారిని వారించి యి ట్లనియె.

### [2.2.235](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.235)

క. సుమతులు పాంచాలీ ప్ర | శ్నము నర్థము నేర్పడన్‌ విచారింపుఁడు పా  
పము వొందు ధర్మసందే | హము దీర్పనినాఁడు సభ్యులగు సజ్జనులన్‌.

### [2.2.236](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.236)

మత్తకోకిల. ఈ వికర్ణుఁడు బాలుఁ డయ్యును నేర్పరించి యథావిధిన్‌  
దేవమంత్రియపోలె ధర్మువుఁ దెల్పె; నీతనిబుద్ధి మీ  
రేవగింపక చేకొనుం డిది; యెల్లయందును ధర్మ స  
ద్భావ మొక్కని కేర్పరింపఁగ బ్రహ్మకైనను బోలునే?

### [2.2.237](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.237)

ఆ. సభకు వచ్చి ధర్మసందేహ మడిగిన | నెఱిఁగి చెప్పకుండిరేని సభ్యు  
లనృతదోషఫలమునం దర్ధ మొందుదు | రనిరి ధర్మవేదులైన మునులు.

### [2.2.238](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.238)

ఆ. ధర్ము వెఱిఁగి దానిఁ దా నొండుగా లాభ | లోభ పక్షపాతలోలబుద్ధి  
సభల నెవ్వఁడేని సభ్యుఁడై పలుకు వాఁ | డనృతదోషఫలము ననుభవించు.

### [2.2.239](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.239)

వ. ఈయర్థం బితిహాసంబులయందు వినంబడుఁ; దొల్లి ప్రహ్లాదునికొడుకు విరోచనుండును నంగిరసుండను విప్రునికొడుకు సుధన్వుండును నొక్క కన్యా ప్రతిగ్రహ నిమిత్తంబున నెల్లసుగుణంబుల ‘నేన పెద్ద, నేన పెద్ద’ నని తమలో నిద్దఱును ప్రాణంబు లొడ్డుగా నొడ్డి వివాదంబు సేసి ప్రహ్లాదు పాలికిం జని; రందు సుధన్వుండు ప్రహ్లాదున కి ట్లనియె.

### [2.2.240](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.240)

తే. నీవు ధర్మవిదుండవు మా వివాద | మెఱిఁగి తీర్పు గుణశ్రేష్ఠుఁ డితఁడొ నేనొ  
చెప్పు; మన్యథాబుద్ధివై చెప్పితేని | మఘవు కులిశంబు వ్రచ్చు నీ మస్తకంబు.

### [2.2.241](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.241)

వ. అనినం బ్రహ్లాదుండు భయంపడి కశ్యపుకడకుం జని విరోచన సుధన్వులు తన్ను వివాదనిర్ణయం బడిగిన విధంబును జెప్పిన విని వానికిం గశ్యపుం డి ట్లనియె.

### [2.2.242](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.242)

తే. సాక్షియును ధర్మదర్శియు సాక్షిధర్మ | విధులు దప్పంగఁ జెప్పిన నధమవృత్తి  
వరుణపాశసహస్రంబు వానిఁ గట్టి | పాయు నేఁటేఁట నొక్కొకఁ డాయతముగ.

### [2.2.243](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.243)

వ. ‘ధర్మం బధర్మవిద్ధంబయి సభకు వచ్చిన దానిం దీర్పనిసభ్యు లధర్మవిద్ధు లగుదురు; మఱి సభ్యులు కామక్రోధంబులు విడిచి యధర్మంబు నాపనినాఁ డయ్యధర్మంబునం దొక్కపాదంబు సభ్యుల, నొక్కపాదంబు భూపతిఁ, దక్కినయది గర్తనుం బొందు; సమంజసులైన సభ్యులచేత విధ్యుక్తం బయ్యెనేని నధర్మంబు కర్తనుం బొందుఁ; గావున ధర్మంబు దప్పక చెప్పవలయు’ననినం బ్రహ్లాదుండు ధర్మమతియై విచారించి తనకొడుకుకంటె గుణశ్రేష్ఠుఁడుగా సుధన్వుం జెప్పినఁ, ‘బుత్త్రస్నేహంబు విడిచి ధర్మువు దప్పక చెప్పి’ తని ప్రహ్లాదుం బ్రశంసించి సుధన్వుం డరిగెఁ; గావున ‘మీరును ద్రౌపదీ ప్రశ్నంబునందు ధర్మబుద్ధిసేయుం’ డని విదురుండు పలికిన, దుర్యోధను భయంబున సభ్యు లెవ్వరుం బలుకరయిరి; ద్రౌపదియు నట్లు సకలక్షత్త్రియసమక్షంబున దుశ్శాసనుచేతం బరిభవింపంబడి దుఃఖిత యయి.

### [2.2.244](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.244)

సీ. ‘అవ్విధంబున నొప్పి యా స్వయంవరము నాఁ | డఖిల భూపతులచే నట్లు సూడఁ  
బడి, పాండవుల ధర్మపత్నినై, గోవిందు | చెలియలినై, వీనిచేత నిట్లు  
పరిభూత నగుచు సభామధ్యమున మహీ | పతులచేఁ జూడంగఁ బడితి; నింత  
వడుదునె? యిపుడు నా పలుకుల కెవ్వరుఁ | బ్రతివచనం బేల పలుక రైరి?  
ఆ. ధన్యులార! యే నదాసినే? దాసినే? | యెఱుఁగఁ జెప్పి పనుపుఁ’ డెల్ల దాని  
ననుచు వనరుచున్న నాపగాసుతుఁడు శాం | తనవుఁ డిట్టు లనియె దానిఁ జూచి.

### [2.2.245](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.245)

వ. ‘అవ్వా! నీ ప్రశ్నంబునకు నుత్తరం బయ్యుధిష్ఠిరుఁడు సెప్పవలయుఁ; గానినాఁడు ధర్మసూక్ష్మత యెవ్వరికి నెఱుంగ గహనంబు; దీని ఫలంబు వేగంబ యిక్కురుకులపాంసను లనుభవింతు’ రని పలుకుచున్న యవసరంబున నక్కోమలిం జూచి నగుచు.

### [2.2.246](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.246)

తే. ‘తరుణి! యేవురకంటె నొక్కరుఁడ భర్త | యగుట లగ్గు; జూదంబున నాలి నోటు  
వడని వానిఁగాఁ దగు భర్తఁ బడయు మింక’ | ననుచు రాధేయుఁ డుల్లసమాడె నంత.

### [2.2.247](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.247)

ఉ. అమ్ముదితన్‌ విభీతహరిణాక్షిఁ గలాపవిభాసికేశభా  
రమ్మున నొప్పు దానిఁ దన రమ్యపృథూరుతలంబు నెక్కఁగా  
రమ్మని సన్న సేసె ధృతరాష్ట్రసుతాగ్రజుఁ డప్డు; దాని దూ  
రమ్మునఁ జూచి కౌరవకురంగమృగేంద్రుఁడు భీముఁ డల్కతోన్‌.

### [2.2.248](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.248)

క. లయసమయదండధర ని | ర్దయుఁడై ధరణీశు లెల్లఁ దనపలుకులు వి  
స్మయసంభ్రమభయసంభృతు | లయి వినుచుండంగ నిట్టు లనియెన్‌ సభలోన్‌.

### [2.2.249](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.249)

ఉ. ధారుణి రాజ్య సంపద మదంబునఁ గోమలిఁ గృష్ణఁ జూచి రం  
భోరు నిజోరుదేశమున నుండఁగఁ బిల్చిన యిద్దురాత్ము దు  
ర్వార మదీయ బాహుపరివర్తిత చండ గదాభిఘాత భ  
గ్నోరుతరోరుఁ జేయుదు సుయోధను నుగ్రరణాంతరంబునన్‌.

### [2.2.250](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.250)

వ. అని సర్వజన భయానక క్రోధావేశ వివశుండయి యాయుధంబు లున్న వలనికి దృష్టులు సలుపుచు నగ్రజు మొగంబు సూచుచున్న భీమసేను నతిరౌద్రాకారంబు సూచి భీష్మ విదుర ద్రోణాదు‘లిది కోపంబున కవసరంబు గా’దని యాతనిం బ్రశాంతచిత్తుం జేసి రంత.

### [2.2.251](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.251)

క. ధృతరాష్ట్రు నగ్నిహోత్రా | యతనంబున నఱచె వఱళు, లగ్నులు శాంత  
ద్యుతులయ్యెఁ, గౌరవ స్త్రీ | తతిహృదయము లధికశోకతప్తము లయ్యెన్‌.

### [2.2.252](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.252)

క. క్రూరాత్మకులై దుష్పద | వీ రతులగు ధార్తరాష్ట్రవీరుల శయ్యా  
గారముల నెగసె నెంతయు | ఘోరంబుగఁ గాక ఘూక ఘూత్కారంబుల్‌.

### [2.2.253](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.253)

క. అట్టి మహోత్పాతంబులు | పుట్టినఁ గృప విదుర కలశభూ శాంతనవుల్‌  
‘నెట్టన ధృతరాష్ట్రజులకుఁ | బుట్టె నరిష్ట’ మని రిష్టమునఁ దమలోనన్‌.

### [2.2.254](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.254)

వ. అంత నంతయు నెఱింగి గాంధారి విదురుం దోడ్కొని ధృతరాష్ట్రు కడకుంబోయి పాండవపరాజయంబును ద్రౌపదిపరిభవంబును దుర్నిమిత్తోత్పత్తియుం జెప్పిన విని, ధృతరాష్ట్రుండు దుర్యోధనుం బిలిచి యి ట్లనియె.

### [2.2.255](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.255)

చ. పరమపతివ్రతన్‌ సభఁ దపస్వినిఁ బాండవధర్మపత్ని ధ  
ర్మరత నయోనిజం బ్రకృతిమానవభామినిఁగాఁ దలంచి దె  
ప్పరములు వల్కఁగాఁ దగునె? బాల్యము నాదిగ దుష్టభావనం  
బెరిఁగితి నీ నిమిత్తమునఁ బెద్దయు దుఃఖితు లైరి పాండవుల్‌.

### [2.2.256](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.256)

వ. ‘వారలవలన నీ దురాగ్రహం బుడుగు’మని కొడుకును భంగించి సకలబాంధవహితంబు సేయందలంచి ద్రౌపదిని రావించి శాంతవచనంబుల నిట్లనియె.

### [2.2.257](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.257)

క. సుందరి! నా కోడండ్రుర | యం దభ్యర్హితవు నీవ; యతిముదమున నీ  
కుం దగఁ బ్రియంబు సేసెద | నిందుముఖీ! వేఁడు మెద్ది యిష్టము నీకున్‌.

### [2.2.258](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.258)

వ. అనినం బాంచాలి యి ట్లనియె.

### [2.2.259](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.259)

ఆ. కరుణతోడ నాకు వరము ప్రసాదింప | బుద్ధియేని లోకపూజితుండు  
మనునిభుండు ధర్మతనయుండు దాస్యంబు | వలనఁ బాయవలయు వసుమతీశ!

### [2.2.260](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.260)

వ. ‘అ ట్లయినం గురుకుమారులు గురువృద్ధజనలాలితుండై పెరిఁగిన ప్రతివింధ్యు దాసపుత్త్రుం డనకుండుదు; రిదియ నా యిష్టం’ బనిన ‘నిచ్చితి; నింక రెండవవరంబు వేఁడు’ మనిన ద్రౌపది యి ట్లనియె.

### [2.2.261](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.261)

క. నెమ్మిని ధర్మజు నలువురు | దమ్ములుఁ దమ యాయుధములఁ దమవర్మవరూ  
థమ్ములయుఁ దోడ సకల హి | తమ్ముగఁ బాయంగవలయు దాస్యము వలనన్‌.

### [2.2.262](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.262)

వ. అనిన ధృతరాష్ట్రుండు ‘నీకోరిన వరం బిచ్చితి; నింక మూఁడవవరంబు వేఁడు’ మనిన ద్రౌపది యి ట్లనియె.

### [2.2.263](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.263)

ఆ. ‘వైశ్యసతికి నొక్క వరము, సత్‌క్షత్త్రియ | సతికి రెండు, శూద్రసతికి మూఁడు,  
విప్రసతికి నూఱు వేఁడఁజ న్వరములు | గాన యింక వేఁడఁగాదు నాకు.’

### [2.2.264](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.264)

వ. అనిన ధృతరాష్ట్రుండు కోడలి గుణంబులకు ధర్మం బెఱుంగుటకు సంతసిల్లి, యనుజ సహితుం డయిన యుధిష్ఠిరు రావించి ‘నీవు సర్వసంపదలు స్వరాజ్యంబు నొప్పుగొని యెప్పటియట్ల యింద్రప్రస్థపురంబున కరిగి సుఖం బుండుము; నీకు లగ్గయ్యెడు’ మని వెండియు.

### [2.2.265](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.265)

తే. నీవు నిత్యంబు వృద్ధోపసేవఁ జేసి | యెఱుఁగు దెల్ల ధర్మంబులు; నెఱుక లేక  
కడఁగి నీ కెగ్గు సేసె నా కొడుకు; దీని | మఱచునది; నీకు నే నొండ్లు గఱపనేల?

### [2.2.266](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.266)

క. మనమున వేరమిఁ దలఁపమి | యును, సక్షమచిత్తుఁ డగుటయును, గుణములు కై  
కొని దోషమ్ములు విడుచుట | యును నుత్తముఁ డయిన పురుషు నుత్తమగుణముల్‌.

### [2.2.267](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.267)

వ. ఏను బుద్ధిలేక జూదం బుపేక్షించితి; నల్పబుద్ధిసత్త్వుండయిన వృద్ధు నన్నును, మీతల్లి యయిన గాంధారినిం దలంచి, దుర్యోధనాదులు సేసిన దుర్నయంబులు సేకొన కుండునది; సర్వశాస్త్రవిదుం డయిన విదురుండు మంత్రిగా సర్వధర్మవిదుండవైన నీవు రక్షకుండవుగా నిక్కురుకులంబునకు లగ్గగు’నని ధర్మరాజుఁ బాండురాజు రాజ్యంబునందు సమర్పించిన.

### [2.2.268](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.268)

తరలము. తరుణి ద్రౌపది యిట్లు పాండవధార్తరాష్ట్రులదైన భీ  
కర పరస్పర కోపవేగము గ్రన్నఁ బాచి విపత్తి సా  
గర నిమగ్నుల నుద్ధరించెఁ బ్రకాశకీర్తుల ధీరులం  
బురుషసింహములన్‌ నిజేశులఁ బూని తద్దయుఁ బ్రీతితోన్‌.

### [2.2.269](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.269)

సీ. దాని నంతయు భీమసేనుండు విని ‘రాజ్య | సంప్రాప్తి పాండవసత్తములకు  
సతికారణంబున ధృతమయ్యె నను నింత | కంటెను గష్టంబు గలదె యొండు;  
పేర్మి నపత్యంబుఁ గర్మంబు విద్యయు | నను నివి తేజంబు లట్టె తగిన  
పురుషున కెందును; నిరతంబు మిక్కిలి | తేజంబు కర్మంబు; దీని విడిచి  
ఆ. యలుక గాఁడె పురుషుఁ’ డని కోపఘూర్ణిత | రక్తనేత్రుఁడై ‘పరాక్రమమున  
శత్రువరుల నుగ్రసంగరంబునఁ జంపి | కుతలరాజ్యమెల్లఁ గొందు’ ననుచు.

### [2.2.270](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.270)

వ. మృగమధ్యంబున నున్న సింహంబునుంబోలె ననుజమధ్యంబున నున్న యాతనిం గరంబున వారించి, ధర్మరాజు ధృతరాష్ట్రు శాసనంబునం దమ్ములుం దానును ద్రౌపదీ సహితంబుగాఁ గాంచనరథారూఢుఁ డై యింద్రప్రస్థపురంబున కరిగిన; నిట దుశ్శాసనుచేత నంత వృత్తాంతంబును విని దుర్యోధనుండు కర్ణశకుని సైంధవులతో విచారించి ధృతరాష్ట్రుపాలికిం జని యి ట్లనియె.

_First 200 of 254 passages. [Read on](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2)_

---
Source: [https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2) · Pramāṇa
