<!-- Pramāṇa, a library of Indian primary sources · https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2 -->

[Pramāṇa](https://indike.org/pramana/) › [Indian literature](https://indike.org/pramana/in) › [Epic, Poetry, Drama & Narrative](https://indike.org/pramana/in.lit) › [The Mahābhārata and its versions](https://indike.org/pramana/in.lit.mahabharata) › [Mahābhāratas in Indian regional languages](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa) › [Andhra Mahabharatamu](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra) › 2

# Andhra Mahabharatamu 2

Āndhra Mahābhāratamu 2

- **Language:** Telugu

## Contents

- [2.1 సభాపర్వము — ప్రథమాశ్వాసము](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.1) — 124 parts
- [2.2 సభాపర్వము — ద్వితీయాశ్వాసము](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2) — 253 parts

### సభాపర్వము — ప్రథమాశ్వాసము

### [2.1.1](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.1.1)

క. శ్రీదయితోరస్థ్సల! విమ | లాదిత్యాత్మజ! నిరంతరానందమతీ!  
కోదండపార్థ! నిఖిల ధ | రాదేవ స్తుత్య! రాజరాజ నరేంద్రా!

### [2.1.2](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.1.2)

వ. అక్కథకుండు శౌనకాది మహామునులకుం జెప్పె: నట్లు ధర్మతనయునొద్ద వాసుదేవ సహితుం డయి యున్న యర్జునున కతిప్రీతిం గృతాంజలి యయి మయుం డిట్లనియె.

### [2.1.3](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.1.3)

క. ఘనముగఁ బ్రాణము రక్షిం | చిన యుపకారికిఁ బ్రియంబు సేయుదు నన నే  
ర్తునె; యైనను నీకుఁ బ్రియం | బనఘా! చేయంగ నిష్టమైనది నాకున్‌.

### [2.1.4](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.1.4)

వ. ‘ఏను దానవ విశ్వకర్మ, ననేకవిధ శిల్ప కలా కుశలుండ; మీ కిష్టంబయిన దాని నిర్మించెదం బనుపుం’ డనిన నర్జునుం డచ్యుతుమొగంబు చూచి ‘యతని నెద్దియేనియు నొక్క యపూర్వం బయినదాని నిర్మింప నియోగింపు’ మనినఁ గృష్ణుండు పెద్దయుంబ్రొద్దు విచారించి మయున కిట్లనియె.

### [2.1.5](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.1.5)

చ. కురుపతికిన్‌ యుధిష్ఠిరునకున్‌ సకలక్షితిపాలసేవ్యసు  
స్థిర విభవాభిరామున కతిప్రమదంబుగ రత్నరాజిసుం  
దర మగు దాని నొక్క సభ ధాత్రి కపూర్వముగా నొనర్చి చె  
చ్చెరఁ గొనిరమ్ము నీదయిన శిల్పకలాకుశలత్వ మేర్పడన్‌.

### [2.1.6](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.1.6)

వ. అనిన వాసుదేవునకు మయుం డిట్లనియె.

### [2.1.7](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.1.7)

ఉ. ఇమ్మనుజేంద్రుఁ డింద్రదనుజేంద్రులకంటె మహావిలాస సౌ  
ఖ్యమ్ములఁ బెద్ద యిద్ధరణిఁ గావున, నీతని పేర్మికిం దగన్‌  
నెమ్మి నొనర్చెదన్‌ సభ మణిప్రభ నొప్పఁగ, దేవతావిమా  
నమ్ములు నిట్టివే యని జనమ్ములు దానిన మెచ్చి చూడఁగన్‌.

### [2.1.8](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.1.8)

వ. తొల్లి వృషపర్వుండను దానవేంద్రున కొక్కసభ నిర్మింప సమకట్టి వివిధ రత్నమయంబులయిన యుపకరణంబు లొడఁగూర్చి బిందుసరంబను కొలన సంగ్రహించినవాఁడ; నయ్యుపకరణంబుల దాని విచిత్రంబుగా రచియించి తెచ్చి ధర్మరాజున కిచ్చెద; మఱియును భౌమాదిత్యుండను రాజర్షిచేత నిహితంబయి సకలశత్రుఘాతినియైన దాని భీమసేనున కొక్కగదను. దారుణంబయిన దివ్యఘోషంబు గలుగు దేవదత్తంబను శంఖం బర్జునునకు నిచ్చెద’నని చెప్పి ధర్మరాజుచేత సత్కృతుండై మయుం డరిగె; నంత నిట నారాయణుండును బాండవుల వీడ్కొని పితృదర్శనలాలసుండై ద్వారవతీపురంబున కరిగె; నట మయుండును బూర్వోత్తరదిశాభిముఖుండై పోయి కైలాసంబునుత్తరంబున మైనాకశైలంబునందు హిరణ్యశృంగంబున.

### [2.1.9](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.1.9)

సీ. ఎందేని సర్వభూతేశుండు సృజియించె | సచరాచరములైన జగము లెల్ల,  
గంగఁ బ్రత్యక్షంబు గావింప నెందేనిఁ | గృతవాసుఁ డయ్యె భగీరథుండు.  
నలినసంభవ నరనారాయణస్థాణు | వాసవప్రభృతి గీర్వాణముఖ్యు  
లెందేనిఁ గ్రతువు లనేకయుగంబులఁ | జేసిరి, రత్నవిచిత్ర వితత  
ఆ. చైత్యములు మహా విశాల హిరణ్మయ | యూపతతులు నోలి నొప్పు చుండ,  
నట్టి బిందుసరమునందున్న వివిధర | త్నోపకరణచయము లొనరఁ గొనియె.

### [2.1.10](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.1.10)

క. దేవబ్రాహ్మణులకు నా | నావిధపూజనలఁ దర్పణము సేసి ధరి  
త్రీవనిత కపూర్వశ్రీఁ | గావింపఁ దొడంగె మయుఁడు గడు రమ్యముగన్‌.

### [2.1.11](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.1.11)

క. విమల మణిమయము లగు దూ | లములం గంబముల గోడలను వేదులఁ గు  
ట్టిమములఁ జుట్టిన ప్రాకా | రములను గర మొప్పుచుండ రచియించె సభన్‌.

### [2.1.12](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.1.12)

వ. మఱియును.

### [2.1.13](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.1.13)

సీ. సురుచిరహరినీలకిరణజలంబులఁ | బద్మరాగారుణపద్మములను  
రాజితరాజీవరాజహంసావళి | నిర్మలసౌవర్ణకూర్మములను  
గమనీయవైదూర్యకుముదంబులను వజ్ర | మీనమౌక్తికనవఫేనములను  
మరకతశైవలోత్కరముల విలసిల్లఁ | గొల నని సన్మణిస్థలము చూచి  
ఆ. పలుఁగురాలకుడ్యముల రుచుల్‌ గప్పిన | జలము లున్నయెడల వెలయఁ జూచి  
యననుపస్థలంబు లని జను లెఱుఁగక | యుండునట్లుగా మయుండు సేసె.

### [2.1.14](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.1.14)

వ. మఱియు సకలజన మనోహరంబు లైన నానావిధ యంత్రంబులును, ననవరత కుసుమఫలభరితంబు లైన తరువనంబులును, వికచ కమల కుముదాభిరామంబులైన జలాశయంబులును, వివిధ విచిత్ర పతాకావలంబిత తోరణ విటంక ప్రదేశంబులునుం గలిగి దశ కిష్కు సహస్ర ప్రమాణవృత్తాయతంబును. సహస్రకర ప్రభా ప్రసర విస్తార విభూతియును వివిధరత్న విభవాభిశోభితంబునుంగా నపూర్వ సభా భవనంబు నందుఁ బదునాలుగు నెలలు నిర్మించి, దాని నెనిమిది వేల రాక్షస కింకరుల మహాకాయుల మహాజవసత్త్వ సంపన్నుల నంతరిక్ష చరులం బనిచి మోపించికొని వచ్చిధర్మరాజున కిచ్చి, గదయును శంఖంబును భీమార్జునుల కిచ్చి, ధర్మరాజుచేత సత్కృతుండయి మయుం డరిగిన.

### [2.1.23](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.1.23)

ఉ. నీరజమిత్త్రుఁ డేల ధరణీగతుఁ డయ్యెడు నొక్కొ యంచు వి  
స్మేర మనస్కులై జనులు మెచ్చి నిజద్యుతి చూచుచుండఁగా  
నారదుఁ డేఁగుదెంచె గగనంబుననుండి సురేంద్రమందిర  
స్ఫారవిలాసహాసి యగు పార్థుగృహంబునకుం బ్రియంబునన్‌.

### [2.1.24](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.1.24)

క. తన పిఱుఁద ధర్మ సంబో | ధన వాంఛను వచ్చు దేవతా ఖచర మహా  
మునివరులఁ దపనమార్గం | బునఁ గ్రమ్మఱఁ బంచె బ్రహ్మపుత్త్రుఁడు నెమ్మిన్‌.

### [2.1.25](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.1.25)

వ. పర్వతపారిజాతరైవత సుముఖు లను మహామునులతో నిట్లు వచ్చిన నారదమహామునికిం బ్రత్యుద్గతుండయి ధర్మరాజు దమ్ములుం దానును నమస్కరించి తోడ్కొని తెచ్చి యున్నతాసనంబున నునిచి యడుగులు గడిగి, యర్ఘ్యపాద్యాదివిధులం బూజించిన, వారల కుశలం బడిగి నారదుఁడు రాజనీతి విషయంబుల నయ్యుధిష్ఠిరు ని ట్లని యడిగె.

### [2.1.62](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.1.62)

క. శతమఖుసభ శుభరత్నాం | చితకాంచనరచిత, మతివిచిత్రము, లోక  
త్రితయాఖిల లక్ష్మీ సం | శ్రిత; మలవియె దానిఁ బొగడ శేషున కయినన్‌.

### [2.1.63](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.1.63)

వ. అదియును నూఱుయోజనంబుల వెడల్పును, నూటయేఁబది యోజనంబుల నిడుపును, నేను యోజనంబుల తనర్పునుం గలిగి, వైహాయసంబయి, కామగమనంబయి, వ్యపేతశీతాతపంబయి, సకల కాల కుసుమ ఫలభరిత పాదపవన సంకీర్ణ సరోవర విరాజితంబయి, తపఃప్రభావంబున నమరేంద్రుచేత నిర్మితంబయి కరం బొప్పుచుండు; నట్టి సభయందు.

### [2.1.64](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.1.64)

చ. అతుల విభూతితో మణిమయాభరణద్యుతు లొప్పఁగా శత  
క్రతుఁడు శచీసమేతుఁడయి కాంచన చారు విమానమాలికా  
గత దివిజోత్తముల్‌ గొలువఁగాఁ గొలువుండు వరాప్సరోంగనా  
యత విలసత్కటాక్ష కుసుమార్చిత సుందర వక్త్ర చంద్రుఁడై.

### [2.1.65](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.1.65)

వ. మఱియును.

### [2.1.66](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.1.66)

సీ. వదలక యేలినవాని ప్రస్తవమునఁ | బోరిలో నీల్గిన వీరభటులుఁ,  
దమకుల ధర్మముల్‌ దప్పక సలిపిన | గృహమేధులును, జగన్మహితకీర్తిఁ  
బరఁగిన ధన్యులుఁ, బరహితవ్రతులైన | పురుషులు, రుగ్జరా మరణ శోక  
భయ బుభుక్షార్తి పిపాసా వ్యపేతులై | కొలుతురు సురరాజు నొలసి యర్థ  
ఆ. ధర్మకామములు సదక్షిణ క్రతువులు | శ్రీ విలాసములు విశేషయజ్ఞ  
వాహమంత్ర తతులు వచ్చి సేవింతురు | మూర్తిమంతు లగుచు ముదముతోడ.

### [2.1.67](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.1.67)

వ. మఱియు శుక్రబృహస్పతులు నగ్నీషోములు నాశ్వినులు విశ్వదేవతలును ధాతయు విధాతయు హరిశ్చంద్రుం డను రాజర్షియు సురేంద్రసభ నుండుదురు.

### [2.1.74](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.1.74)

క. ధనదుసభ యింద్రసభతో | నెనయగుచు మహావిభూతి నెంతయు నొప్పుం  
దన దివ్యశక్తి నాతం | డొనరఁగ నిర్మించె దాని నుత్తమమణులన్‌.

### [2.1.75](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.1.75)

వ. అదియును నూఱుయోజనంబుల నిడుపును డెబ్బదియోజనంబుల వెడల్పునుం గలిగి సితప్రభంబయి గగనచరంబయి కనకమయతరులతాలంకృతం బయి తటిల్లతావిచిత్రశరదంబుదంబు ననుకరించు చుండు.

### [2.1.76](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.1.76)

క. అందుఁ గుబేరుఁడు పరమా | నందంబున నుండు ధర్మనందన! విలస  
న్మందార పారిజాతక | నందన మందానిలాభినందితుఁ డగుచున్‌.

### [2.1.77](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.1.77)

వ. అతని ననవరతంబును నరకిన్నర నాములైన గంధర్వులును, వరాహకర్ణ గజకర్ణ మాణిభద్ర హేమనేత్ర విభీషణ పింగళక ప్రవాళకాదులయిన యక్షులును, నలకూబరుండును, నూర్వశీతిలోత్తమా ఘృతాచీ మేనకా విభావరీ రంభా ప్రభృతులయిన యప్సరసలును సేవింతు; రే నెప్పుడు ననేక దేవర్షి గణంబులతో నరిగి చూచుచుండుదు.

### [2.1.78](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.1.78)

ఉ. వానికి నెయ్యుఁడై యమరవంద్యపదాంబుజుఁ డంబికా బృహ  
త్పీనపయోధరాగ్ర పరిపీడితవక్షుఁడు భూషణీకృతా  
హీనుఁ డశేషలోకగురుఁ డీశ్వరుఁ డెప్పుడు నంద యుండు నా  
నా నిశితాయుధాయుతసనాథమహాద్భుతభూతకోటితోన్‌.

### [2.1.94](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.1.94)

క. పితృసంకల్పము సేయఁగ | సుతుల కవశ్యమును వలయు; సుతజన్మఫలం  
బతిముదమునఁ బితృవరులకు | హిత మొనరించుటయ కాదె యెంతయు భక్తిన్‌.

### [2.1.95](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.1.95)

క. ‘పరలోకనిలయు లగు మీ | గురులకు దీనన హితం బగున్‌ లోకభయం  
కరసంగరమును గాలాం | తరమున నగు’ నని విరించితనయుఁడు సెప్పెన్‌.

### [2.1.96](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.1.96)

క. పితృగణహితార్థముగ స | త్క్రతు వొనరింపంగ బుద్ధిగలదు, ప్రజా సం  
హృతి తత్క్రతువున నగు నని | మతి నాశంకయును గలదు మానుగ నాకున్‌.

### [2.1.97](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.1.97)

వ. ఏమి సేయుదు నని డోలాయమాన మానసుం డయి యున్న ధర్మరాజునకు ధౌమ్యప్రభృతు లి ట్లనిరి.

### [2.1.98](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.1.98)

ఉ. చేయుము రాజసూయ మెడసేయక; దానన చేసి దోషముల్‌  
వాయు నిలేశ! భూప్రజకుఁ; బార్థివులెల్ల భవత్ప్రతాపని  
ర్జేయులు; సర్వసంపదలు చేకొనఁగాఁ దఱియయ్యెఁ గౌరవా  
మ్నాయలలామ! నీ కెనయె మానవనాథులు మానుషంబునన్‌.

### [2.1.99](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.1.99)

వ. అనిన వారల వచనంబుల కనుగుణంబుగా ననుజానుమతుండయి ధర్మరాజు రాజసూయంబు సేయ సమకట్టి, ‘దీని నిర్విఘ్నంబున నిర్వహించుట కనాదినిధనుం డాదిపురుషుండు పురుషోత్తముండు పుండరీకాక్షుం డజుం డయ్యును జగద్ధితార్థంబుగా మర్త్యంబున జనియించిన యమ్మహాత్ముండు వాసుదేవుండ యోపుంగాని యన్యుల కశక్యం’ బని యప్పుడ యాప్తచరులం బిలువంబనిచి.

### [2.1.100](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.1.100)

క. అనిలజవాశ్వంబులఁ బూ | నిన యరదం బెక్కి ధారుణీధరు మధుసూ  
దను దోడ్తెం డని ముదమునఁ | బనిచి తదాగమనకాంక్షఁ బార్థివుఁ డుండెన్‌.

### [2.1.109](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.1.109)

క. కురువృషభ! సర్వగుణముల | సురుచిర తేజమున రాజసూయాఖ్య మహా  
ధ్వరమునకు నీవ యర్హుఁడ | వరిసూదనశౌర్యు లయిన యనుజులబలిమిన్‌.

### [2.1.110](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.1.110)

వ. తొల్లి జమదగ్నిసుతుం డయిన రామునిచేత ధాత్రి యపగతక్షత్త్రం బయిన నంతనుండి యైలవంశంబును నిక్ష్వాకువంశంబును దక్కఁ దక్కిన క్షత్త్రియవంశంబు లెల్లం గృత్రిమంబులు గాని విమల మకుటార్హంబులుగా; వీ రెండు వంశంబులవలన నేకోత్తరశతవంశంబు లయ్యె; మఱి యయాతి భోజ వంశంబులవలనం జతుర్దశ వంశంబు లయ్యె; నిట్టి సకలక్షత్త్రంబునెల్ల జయించి జరాసంధుం డున్నవాఁడు; వాని సామర్థ్యంబు చెప్ప నశక్యంబు.

### [2.1.111](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.1.111)

క. అతిదర్పోద్ధతుఁడు మహా | ద్భుతభూరిబలుండు చేదిభూపతి సేనా  
పతి యయి శిశుపాలుఁడు సం | తతమును నాతనిన కొలుచుఁ దద్దయు భక్తిన్‌.

### [2.1.112](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.1.112)

క. ఆయతభుజవీర్యులు మా | యాయోధులు హంసడిభకు లనువార లని  
ర్జేయులు పరస్పర స్నే | హాయత్త సుచిత్తు లతని యాప్తు లధీశా!

### [2.1.113](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.1.113)

వ. అయ్యిద్దఱును గౌశిక చిత్రసేను లను నామంబులతో మహాసేనాన్వితులై వానికి వామదక్షిణ భుజంబులుంబోలె సర్వసాధనసమర్థు లయి వర్తిల్లుదురు; మఱియు వరుణు నంతియ బలవంతుండు పశ్చిమ దిఙ్మహీపతి భగదత్తుం డనువాఁడు పాండురాజుసఖుం డగుటంజేసి నీకు మనంబున భక్తుం డయ్యును భయంబున జరాసంధునకు వాక్కర్మంబులం బనిసేయుచుండుఁ; జేదిపతులలోనఁ బురుషోత్తముండును నంగ వంగ పుండ్ర కిరాతపతులలోనఁ బౌండ్రకవాసుదేవుండు మదీయ నామంబులు దాల్చి జరాసంధుం గొలుతురు; ప్రాగ్దక్షిణ దిగ్భూముల రాజులు పురుజితుండును గరూశ కలభ నకుల సంకర్షణ సూపహిత మనోదత్త చక్ర సాల్వేయ యవనులును వానిన సేవింతు; రుదీచ్యులయిన యష్టాదశక్షత్త్రకులంబుల వారును నుత్తరపాంచాల శూరసేన పుష్కర పుళింద కళింగ కుంతి మత్స్యదేశంబుల రాజు ల్లెలను దద్భయంబునఁ దమ తమ దేశంబుల విడిచి యున్నవారలు మఱియును.

### [2.1.114](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.1.114)

ఉ. ఘోరరణంబులోన నధికుం గృతబంధు జనాపకారు నే  
దారుణ లీలఁ గంసు నతిదర్పితుఁ జంపుటఁ జేసి, యమ్మహా  
క్రూరుఁడు కంసుభార్య దన కూఁతురు గావున, దానిసంతత  
ప్రేరణ నా కుపద్రవముఁ బెక్కు విధంబులఁ జేసె నీసునన్‌.

### [2.1.115](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.1.115)

క. భూమీశ! హంసడిభకులు | నా మగధాధీశ్వరుండు నమ్మువ్వురు ను  
ద్దామ భుజవీర్య సంపద | తో మూఁడుజగములు నోపుదురు సాధింపన్‌.

### [2.1.116](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.1.116)

వ. ఆ జరాసంధుండును నాయుధనిహతులు గాని హంసడిభకులతో వచ్చి మధురపై విడిసిన నతి వీరులయిన యదు వృష్ణిభో జాంధక వరు లష్టాదశ సహస్ర రథవ్రాతంబులతో నేమును సమకట్టి మహాయుద్ధంబు సేయుచు వాని నెట్లును జయింపరాకున్న నుపాయంబున హంసుండు సమరనిహతుం డయ్యె నని డిభకునకుం జెప్పంబంచిన నప్పలుకులు నిక్కువంబ కా వగచి.

### [2.1.117](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.1.117)

చ. ‘అనవరతంబు నిష్టుఁడగు హంసుఁడు లేని జగంబులోని జీ  
వన మది యేల నా’ కనుచు వారినిమగ్న శరీరుఁ డై క్షణం  
బున డిభకుండు మృత్యుగతిఁ బొందె; ఘనంబుగ; దాని నక్కడన్‌  
విని మృతుఁడయ్యె హంసుఁ డతివీరుఁడు తద్గత సౌహృదంబునన్‌.

### [2.1.118](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.1.118)

వ. అట్లు కౌశిక చిత్రసేనులు పరలోకగతులైన నసహాయుండై జరాసంధుండు మగిడి మగధపురంబునకుం జనియె; నేమును వానితోడి వైరంబు బలవంతంబైన, నమ్మధుర నుండ నొల్లక కుశస్థలంబునకు వచ్చి రైవతక పర్వతంబున ఘనంబుగా దుర్గంబు నిర్మించికొని భవదాశ్రయంబున సుఖంబున్నవారము.

### [2.1.119](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.1.119)

చ. ఖలుఁడు బృహద్రథాత్మజుఁడు గర్వితుఁడై మహిలోని రాజులం  
బెలుకుఱఁ బట్టి తెచ్చి చెఱఁబెట్టి గిరివ్రజమ న్పురంబులోఁ  
జొలయక నిత్య మొక్కొకని సూనరివోలె వధించి నేమమున్‌  
బలిమియు నేర్పడం గడఁగి భైరవపూజ యొనర్చు నుగ్రుఁడై.

### [2.1.120](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.1.120)

క. ధరణీశ! వానిఁ జంపుడు | నురుతర సామ్రాజ్య విభవ మున్నతితో సు  
స్థిరమగు నీకును; మఱి భా | సురముగ సమకూరు రాజసూయము సేయన్‌.

### [2.1.121](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.1.121)

సీ. రక్షణంబున భగీరథుఁడు, జయంబున | నయ్యౌవనాశ్వుండు, నత్యుదగ్ర  
బాహుబలంబున భరతుండు, తపమునఁ | గార్తవీర్యుండును, గరముబుద్ధి  
నమ్మరుత్తుండును, నఖిల సామ్రాజ్యంబుఁ | బడసిరి తొల్లి భూపాల! యిప్పు  
డిన్ని గుణంబులు నెన్నంగఁ గలవు నీ; | కిది యేమి దుర్లభ, మిద్దురాత్ముఁ  
ఆ. డెంత బలియుఁడయ్యు, నెంత గర్వితుఁడయ్యుఁ | దన కఠోర దుష్ప్రతాపమునను  
విగతవిభవుఁ డగు; వివేకవిహీనుల | కైన లక్ష్మి సుచిర మగునె యెందు?

### [2.1.122](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.1.122)

వ. అనిన విని భీమసేనుండు ధర్మరాజున కిట్లనియె.

### [2.1.123](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.1.123)

క. ఆరంభరహితుఁ బొందునె | యారయ సంపదలు? హీనుఁ డయ్యును బురుషుం  
డారంభశీలుఁ డయి యకృ | తారంభుల నోర్చు నెంత యధికుల నయినన్‌.

### [2.1.124](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.1.124)

క. కడు నధికుతోడఁ దొడరినఁ | బొడిచిన నొడిచినను బురుషు పురుషగుణం బే  
ర్పడుఁగాక, హీను నొడుచుట | కడిఁదియె? పౌరుషము దానఁ గలుగునె చెపుమా!

### [2.1.125](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.1.125)

క. ఈహరి కరుణయు నర్జును | సాహాయ్యముఁ గలుగ నీ ప్రసాదమున జగ  
ద్ద్రోహు జరాసంధు మహా | సాహసు వధియింతు నుగ్ర సంగ్రామమునన్‌.

### [2.1.126](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.1.126)

తే. అనఘ! యేము మువ్వురము మూఁడగ్నులట్లు | నీ మహాయజ్ఞ కార్యంబు నిర్వహింతు  
మా జరాసంధ పశువున నఖిల శాత్ర | వాహుతులఁ జేసి తృప్తుల మగుచు బలిమి.

### [2.1.127](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.1.127)

వ. అనిన భీమసేను విక్రమవచనంబుల కనుగుణంబుగా నర్జునుం డిట్లనియె.

### [2.1.128](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.1.128)

ఉ. భూభుజులన్‌ జయింపుము, విభూతి నొనర్పుము రాజసూయమున్‌,  
నాభుజ వీర్య విక్రమ గుణంబులకుం దగుచున్న యీ ధను  
ర్లాభము, దివ్య బాణరథలాభము, శోభితమైన యీ సభా  
లాభము నొండుపాట సఫలత్వముఁ బొందునె కౌరవేశ్వరా!

### [2.1.129](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.1.129)

క. కలరూప గుణ ద్రవ్యం | బులు విక్రమవంతునందు భూవిదితములై  
నిలుచు నవిక్రమునకు నవి | గలిగియు లేని క్రియ నప్రకాశంబు లగున్‌.

### [2.1.130](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.1.130)

వ. ‘మఱియు రాజసూయ మహాధ్వరంబు కారణంబుగాఁ బరాక్రమంబున జరాసంధు వధియించి నిఖిల క్షత్త్రియ నిగ్రహ మోక్షణంబు సేయునంతకంటె మిక్కిలి యశోధర్మంబు లొండెవ్వి?’ యనిన భీమార్జునుల పలుకులకు సంతసిల్లి నారాయణుం డి ట్లనియె.

### [2.1.131](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.1.131)

క. వెలయ విధిదృష్ట నయమున | వలయుఁ బరాక్రమము సేయ వసుధేశ్వర య  
గ్గల మగు బుద్ధియుఁ గడఁకయుఁ | గల పురుషుల కిదియె చూవె కర్తవ్య మిలన్‌.

### [2.1.132](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.1.132)

వ. ‘కావున మేము మువ్వురముఁ గ్రమంబునం బరాక్రమించి జరాసంధుడాసి నదీప్రవాహంబులు వృక్షోన్మూలనంబు సేయునట్లు క్రమంబున వాని నిర్మూలితుం జేసెద; మద్దురాత్ముండు భూతంబులయం దంతరాత్మయుం బోలెఁ దన యంతరం బెఱుంగక యేకాంతశీలుఁడై సుఖం బనుభవించుటం జేసి వాని యంతికంబున కరుగుట యశ్రమం’ బనిన నారాయణునకు ధర్మరా జిట్లనియె.

### [2.1.133](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.1.133)

క. దనుజాహిత! నీ కాహవ | మున నెదిరి మహోగ్ర దహనమునఁ బడియును గా  
లని మిడుత వోలె నతికో | పనుఁడు జరాసంధుఁ డెట్లు బ్రదుకఁగ నేర్చున్‌?

### [2.1.134](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.1.134)

క. అట్టి యతి దారుణత్వము | నట్టి యజేయ భుజ విక్రమాధిక్యము వాఁ  
డెట్టి క్రియఁ బడసె; నాతని | పుట్టిన విధ మెట్లు చెప్పు పొలుపుగ నాకున్‌.

### [2.1.135](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.1.135)

వ. అని యడిగిన ధర్మరాజునకుఁ గృష్ణుం డిట్లనియె.

### [2.1.136](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.1.136)

సీ. అతిసమర్థుండు బృహద్రథుం డనువాఁడు | మగధాధినాథుఁ డున్మార్గదూరుఁ,  
డక్షౌహిణీ త్రితయంబు బలంబునఁ | బరుల నోడించిన బలిమికాఁడు,  
కాశిరా జనువానిగాదిలికూఁతులఁ | గవల వారల నతికాంతిమతుల  
నమరంగఁ బెండ్లి యై యనుపమప్రీతి న | య్యిరువురయందు భోగేచ్ఛ సలిపి  
తే. యం దపత్యంబు వడయుదు నని తలంచి | విప్ర ముని దేవ పూజల వివిధవిధులఁ  
బుత్త్రకామేష్టులను నొండు పుణ్యకర్మ | యుక్తులను జేసి పడయంగ నోప కలసి.

### [2.1.137](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.1.137)

వ. ‘పుత్త్రుండు లేని విభవంబు లన్నియు నేల?’యని నిర్వేదించి పత్నీద్వయ సమేతుండయి వనంబున కరిగి.

### [2.1.138](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.1.138)

ఉ. ఆ విపినాంతరంబున నిరంతర నిష్ఠ ననంత మోక్షకాం  
క్షావిధి నొక్క బాల సహకార మహీజము క్రింద నుజ్జ్వల  
త్పావకతేజుఁడై తపము పాయక చేయుచు నున్న ధన్యుఁ గా  
క్షీవతుఁ గాంచె గౌతము నకిల్బిషమానసుఁ జండకౌశికున్‌.

### [2.1.139](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.1.139)

క. ధరణీశ్వరుఁ డమ్మునివరుఁ | బురాతనమునిన్‌ నిరాశుఁ బుణ్యాత్ము నిరం  
తర కృత నియమ సపర్యా | వరివస్యుం డగుచు భక్తి వదలక కొలిచెన్‌.

### [2.1.140](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.1.140)

వ. ఇ ట్లుపాస్యమానుం డయి చండకౌశికుండు బృహద్రథునకు మెచ్చి ‘నీ కిష్టంబు చెప్పు మిచ్చెద’ ననిన వినయ వినమితోత్తమాంగుం డయి వాఁ డి ట్లనియె.

### [2.1.141](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.1.141)

ఉ. సంతతమైన సర్వ సుఖ సంపద గల్గియు దానికిం దగన్‌  
సంతతి లేమిఁ జేసి యది సర్వము హేయమ కాఁ దలంచి ని  
శ్చింతుఁడనై ధృతిం దపము సేయఁగవచ్చితిఁ బుత్త్రజన్మమై  
నంతన యేను మీ దయఁ గృతార్థతఁ బొందుదు సన్మునీశ్వరా!

### [2.1.142](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.1.142)

వ. అనినం గరుణించి మునివరుండు పరమధ్యానముకుళిత నయనుండై యున్నంత.

### [2.1.143](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.1.143)

క. పవనవిధూతము శుకచం | చు విలూనముఁ గాక యొక్క చూతఫలం బ  
య్యవనిజమువలన నమ్ముని | ప్రవరుపృథూత్సంగతలముపై వడిఁ బడియెన్‌.

### [2.1.144](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.1.144)

వ. దానిం బుచ్చికొని యభిమంత్రించి చండకౌశికుండు బృహద్రథున కిచ్చి ‘యీ ఫలంబువలన నీకొక్క పుత్త్రుం డుద్భవిల్లు’ నని చెప్పిన నాతండును గృతార్థుండై క్రమ్మఱి నిజపురంబునకు వచ్చి, తన యిద్దఱు భార్యలకు నప్పండు సమంబుగా విభాగించి పెట్టినం దత్ఫలోపభోగంబున నయ్యిద్దఱు గర్భిణులయినఁ బదియగు మాసంబున నొక్కనాఁటి రాత్రియందు వారలకు.

### [2.1.145](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.1.145)

క. ఒక్కొక కన్నును జెవియును | జెక్కును జను బొడ్డు మూఁపుఁ జెలువగు చేయున్‌  
బ్రక్కయుఁ గుఱువును గాలును | నక్కజముగ మనుజ శకలమై యుదయించెన్‌.

### [2.1.146](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.1.146)

క. అమ్మానిసి వ్రయ్యలు గని | యమ్ముదితలు వెఱచి ‘వీని నాత్మజుఁ డని నె  
య్యమ్మున నెట్టులు చూపుదు | మిమ్మనుజేశ్వరున?’ కనుచు నెంతయు లజ్జన్‌.

### [2.1.147](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.1.147)

వ. ‘వీని నెవ్వరును నెఱుంగకుండ వెలుపల వైచిరం’ డని తమదాదులం బంచిన, వార లా రెండు వ్రయ్యలుం గొనిపోయి రాజగృహ ద్వారతోరణ సమీపంబునఁ జదుకంబునొద్ద నొక్కచోట వైచిన, నచ్చదుకంబున నుండెడు రాక్షసి జర యనునది దాని బలియకా వగచి పఱతెంచి.

### [2.1.148](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.1.148)

ఆ. ఎత్తికొని చనంగ నిమ్మగు నట్లుగా | మెదలుచున్న వ్రయ్య లదిమి రెంటిఁ  
గూడఁబట్టె; నవియుఁగూడి యొండొంటితోఁ | జక్క నంటి రెండు నొక్కఁడయ్యె.

### [2.1.149](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.1.149)

క. ఆ రాక్షసి కెత్తికొనన్‌ | భారముగా వజ్రకఠిన బంధురతనుఁ డై  
ధీరుఁడు బాలకుఁ డేడ్చె మ | హారవమున దాని చేతు లాడకయుండన్‌.

### [2.1.150](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.1.150)

వ. అబ్బాలకు రోదన ధ్వని విని యంతిపురంబున నున్న ముదుసలి యవ్వలెల్లం బఱతెంచి మహాహర్షంబుతో వాని నెత్తికొని; రట్టి సంభ్రమం బెఱింగి బృహద్రథుండు వచ్చి తేజోధికుండయి తామ్రతలముష్టిం దనముఖపద్మంబునం బెట్టికొని దిక్కులు సెలంగ నేడ్చుచున్న కొడుకుం జూచి కృతార్థీకృత లోచనుం డయ్యె; నట్టి యవసరంబున నా రాక్షసి కామరూపిణి గావున మనుష్య స్త్రీరూపధారిణి యయి యమ్మగధరాజున కి ట్లనియె.

### [2.1.151](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.1.151)

తే. ఏను జరయను రాక్షసి, నిప్పురంబు | చదుకమునఁ బాయకుండుదు, సంతతంబు  
నీకు నిష్టంబు సేయంగ నెమ్మితోడఁ | గోరుచుండుదు, నది సమకూరె నేఁడు.

### [2.1.152](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.1.152)

వ. ‘నీ యిద్దఱు దేవులకు నుద్భవిల్లిన యిమ్మనుష్య శకలంబులు రెండును నీదాదులు దెచ్చి యిచ్చదుకంబు నొద్ద నొక్కచో వైచి పోయిన నేను వానిం గూడఁబట్టుడు నప్పుడు వజ్రఘన ఘటిత కఠిన శరీరుండై యిక్కుమారుండు మేరుగిరి శృంగంబునుంబోలె నా కెత్తికొన నశక్యుం డయ్యె; వీని నొప్పుగొను’ మనిన విని బృహద్రథుండు ముదితహృదయుం డయి దాని కి ట్లనియె.

### [2.1.153](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.1.153)

ఉ. ఇచ్చకు వచ్చు పూజనల నెంతయు సంతసమంది తొల్లి నా  
కిచ్చె మునీశ్వరుండు దయ నిత్తనయున్‌; మఱి యిప్డు నెమ్మితో  
నిచ్చితి వీవు రాక్షసివె! యిక్కులమెల్లను నుద్ధరింపఁగా  
వచ్చిన పుణ్యదేవతవు వారిరుహాయతచారులోచనా!

### [2.1.154](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.1.154)

వ. అని దాని నతిప్రీతిం బూజించి కొడుకు నెత్తికొని దేవీద్వయంబునకు నిచ్చి, జర యను రాక్షసిచేత సంధింపఁబడినవాఁడు గావున జరాసంధుం డను పేరిడి. పురం బష్టశోభనంబు సేయించి, యా రాక్షసి కేఁటేఁట మహోత్సవంబు సేయించుచుం గొడుకు నతి గౌరవంబునం బెంచిన.

### [2.1.155](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.1.155)

క. ఈహిత విధానముల లో | కాహిత దుస్సహనతేజుఁ డయి వాఁడు మహో  
త్సాహముతో వర్ధిల్లె ఘృ | తాహుతులఁ బ్రవృద్ధి నొందు నగ్నియపోలెన్‌.

### [2.1.172](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.1.172)

వ. కృష్ణభీమపార్థులు కృతకస్నాతకులయి చని, యేక పర్వత ప్రభవంబులైన కాల కూట శోణ గండకీ సదానీరలను నేఱుల లంఘించి, సరయూనదియునుం బూర్వకోసల మిథిలా దేశంబులును గంగయుం గడచి, పూర్వాభిముఖులయి నిత్య ప్రయాణంబుల నమ్మగధదేశంబు సొచ్చి గోరథం బనుపర్వతం బెక్కి.

### [2.1.173](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.1.173)

చ. ఉరుతర హర్మ్యమాలికల నొప్పు గిరివ్రజ మన్పురంబుఁ గాం  
చిరి నవసౌరభప్రసవచిత్రవనావళి గల్గుదాని నె  
వ్వరికి దురాసదంబు లగు వజ్రమయోన్నతవప్రచారు గో  
పురముల దాని నయ్యలకఁ బోలెడు దాని మహార్థసంపదన్‌.

### [2.1.174](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.1.174)

వ. కని దాని యపూర్వ రామణీయక సమృద్ధి కచ్చెరువడి యచ్యుతుండు భీమార్జునుల కిట్లనియె.

### [2.1.175](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.1.175)

క. గోరథమును ఋషభము వై | హారము ఋషిగిరియుఁ జైత్యకాద్రియు ననఁగా  
భూరిగిరు లేను దీనికి | శూరభటులువోలెఁ గాచి చుట్టును నుండున్‌.

### [2.1.176](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.1.176)

వ. ‘దానన చేసి యిప్పురంబు గిరివ్రజంబు నాఁబరఁగె; నిందుఁ దొల్లి గౌతముం డౌశీనరి యను శూద్రయందుఁ గాక్షీవాదుల సృజియించె; నట్టి గౌతమానుగ్రహంబునను నీ దుర్గ బలంబుననుం జేసి యిమ్మాగధుల నెవ్వరును జయింప నోప’ రనుచుఁ దద్ద్వారంబునం బురంబు సొరనొల్లక చైత్యకగిరి శృంగంబున కరిగి యందున్న మూఁడు భేరులం జూపి, ‘తొల్లింటి మాగధులు మానుషాదంబను ఋషభంబు వధియించి దాని చర్మంబున వీని నిర్మించి; రివి యిప్పురంబు వింతవారు చొచ్చునప్పు డమ్మునిశక్తిం జేసి మ్రోయు’ ననిన.

### [2.1.177](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.1.177)

ఉ. దారుణ వజ్రచారు భుజదండములన్‌ బలవద్విచార గం  
భీరులు ధీరు లాక్షణమ భేరులు మూఁటిని వ్రచ్చి చైత్యక  
స్ఫార నితంబదేశమును భగ్నము సేసి గిరివ్రజంబు న  
ద్వారమునందుఁ జొచ్చి రతిదర్పితు లా యదుకౌరవోత్తముల్‌.

### [2.1.178](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.1.178)

క. ఘోరాకారులు మాలా | కార గృహంబులకు గంధిక గృహంబునకున్‌  
దా రరిగి మువ్వురు బలా | త్కారంబునఁ గొనిరి పుష్పగంధము లొప్పన్‌.

### [2.1.179](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.1.179)

వ. అందు మాల్యాలంకృతమౌళులుఁ జందనాగరు రూషితహస్తులు విస్మయమాన మాగధ నిరీక్ష్యమాణులు నయి రాజమార్గంబు గదియం జని, యనవరతంబును బ్రాహ్మణులకు సుప్రవేశంబగుచున్న జరాసంధు మందిరంబు గోవాసంబు హిమవత్సింహంబులు సొచ్చునట్లు యాదవ పాండవ సింహంబులు సొచ్చిన.

### [2.1.208](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.1.208)

చ. విరహితసత్త్వుఁ డయ్యెఁ బ్రతివీరుఁడు; వీని నశేష ధారుణీ  
శ్వరనికరాపరాధు నతిసాహసికున్‌ వధియించి, నీ భుజ  
స్థిరత యెలర్ప నయ్యనిలదేవుబలంబును నీ బలంబు భా  
సురముగ మాకుఁ జూపుము విశుద్ధయశోనిధి! మారుతాత్మజా!

### [2.1.209](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.1.209)

వ. అని ప్రబోధించిన ననిలతనయుం డనిలదేవుం దలంచి తత్ప్రసాదంబున నధికసత్త్వసమేతుండై.

### [2.1.210](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.1.210)

ఉ. ఆతనిఁ బట్టి యెత్తి నిహతాహితవీరుఁడు వానిముక్కునన్‌  
వాతను గర్ణరంధ్రముల వారక శోణితధార లొల్కఁగా  
వాతసుతుండు వీచె శతవారము లుద్ధత చండ వాత సం  
ఘాత వివర్తమాన తృణఖండసముం డగుచుండ మాగధున్‌.

### [2.1.211](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.1.211)

వ. మఱియును.

### [2.1.212](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.1.212)

క. వెఱచఱవఁ బట్టికొని వడిఁ | జఱచి జరాసంధుసంధిసంధుల యెమ్ముల్‌  
విఱిచి వధియించి యార్చెను | వఱలఁగ భీముండు భువనవలయం బద్రువన్‌.

### [2.1.213](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.1.213)

చ. అవనితలంబు వ్రస్సెనొ, హిమాచలశృంగము వ్రయ్యలయ్యెనో,  
శ్రవణ విదారణం బయిన శబ్దము దా నిది యేమి యొక్కొ భై  
రవమయి విన్చె నంచును బురంబునవారు భయంబు వొంది; రం  
దువిదలగర్భముల్‌ గలఁగె; నుక్కడఁగెన్‌ మగధేశు సైన్యముల్‌.

### [2.1.214](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.1.214)

వ. ఇట్లు భీమసేనుండు జరాసంధుఁ జంపి వాని వధియించుట జగద్విదితంబుగాఁ దదీయ గృహద్వార తోరణ సమీపంబునం దత్కళేబరంబు వైచిన నది సర్వజన భయంకరంబయి యుండె; నంత నాదిత్యోదయంబున.

### [2.1.229](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.1.229)

సీ. అగ్నిదత్తంబైన యద్దివ్యరథ మెక్కి | గాండీవధరుఁ డతిఘర్మసమయ  
ఘర్మాంశుఁడును బోలెఁ గౌబేర దిగ్విజ | యార్థ ముగ్ర ప్రతాపాగ్ని వెలుఁగఁ  
జని పుళిందావనీశ్వరు నోర్చి, ప్రతివింధ్యుఁ | డనువాని నోడించి, యశ్రమమున  
మఱి యఖిల ద్వీప మండలేశుల నెల్ల | వశవిధేయులఁ జేసి, వారు దన్ను  
ఆ. భక్తిఁ గొలిచి రాఁగఁ బ్రాగ్జ్యోతిషంబుపై | విడిసెఁ; దత్పురమున విభుఁ డనంత  
బలముతోడఁ బన్ని భగదత్తుఁ డేతెంచి | విజయుఁ దాఁకె సమరవిజయకాంక్ష.

### [2.1.230](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.1.230)

వ. ఇట్లు శబర సాగరానూపవాసులైన యోధవీరులతోఁ బన్ని భగదత్తుండు పార్థుతో నెనిమిది దివసంబులు మహాయుద్ధంబు సేసి తదీయ బాణభగ్న బలుండై పార్థున కి ట్లనియె.

### [2.1.231](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.1.231)

క. ఏ నింద్ర సఖుఁడ; నీవును | భూనాథ! సురాధినాథ పుత్త్రుండవు; నీ  
తో నని సేయుట యుచితమె? | యే నోడితిఁ జెప్పు మెద్ది యిష్టము నీకున్‌.

### [2.1.232](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.1.232)

వ. ‘దానిన చేయుదు’ ననిన విని భగదత్తునకుఁ బార్థుం డి ట్లనియె.

### [2.1.233](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.1.233)

క. కురువిభుఁడు రాజసూయా | ధ్వర మొనరింపం గడంగె; ధర్మజుఁడు నిరం  
తరధర్మశీలుఁ; డాతని | కరి వెట్టుము; రమ్ము ప్రీతి నమ్మఖమునకున్‌.

### [2.1.234](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.1.234)

వ. అని యా భగదత్తుచేత నపరిమిత ధనరాసులు గొని ధనదదిశాభిముఖుండయి ధనంజయుం డరిగి.

### [2.1.235](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.1.235)

క. అతుల చతురంగ సేనా | యుతుఁ డంతర్గిరి బహిర్గి రోపగిరుల భూ  
పతుల నని నోర్చి శౌర్యో | న్నతిఁ గొనియెను వారిచేత నానాధనముల్‌.

### [2.1.236](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.1.236)

వ. మఱియు నులూక దేశాధిపతియగు బృహంతునిఁ బరాజితుం జేసి, యుత్తరోలూక వామదేవ మోదాపుర సుదామ సుసంకులంబు లను దేశంబుల రాజుల జయించి, దేవప్రస్థంబున సేనాబిందు నోడించి, విష్వగశ్వుండనురాజువిక్రమం బడంచి, పార్వతేయుల గర్వం బుడిపి, బర్బర శబర తురుష్కపతుల వశగతులంజేసి, మాళవ పౌండ్ర కాశ్మీర త్రిగర్త లోహిత సుధన్వగాంధార కాంభోజ కోసల పతులచేత విచిత్ర రత్న కాంచన వస్తు వాహన నివహంబులు గొని, చిత్రాయుధ రక్షితంబైన సింహపురంబు మథించి, సింహాసనాసీనులయిన వనచర దస్యుల వశ్యులంజేసి, శ్వేతపర్వతం బతిక్రమించి యట చని కాంభోజ కటకుండను రాజుచేతం బూజితుండై, హాటకదేశంబున మానసం బనుకొలను ఋషికుల్యంబును జూచి, యందుల రాజులచేత నపరిమిత పదార్థంబులం దిత్తిరి కల్మాష మండూకాఖ్య మయూరహంస శుక సవర్ణంబులైన హయంబులం బర్వత నిభంబులైన యిభంబులం గొని, (హేమకూట నిషధాచలంబులు గడచి గంధర్వనగరంబులు గెలిచి, శత సహస్ర యోజనాయతం బయి శుద్ధ సువర్ణమయం బయి తేజోరాశి యయిన మేరు మహీధరంబు నాలోకించి, జంబూ మహావృక్షంబును జంబూ మహానదియునుం జూచి, తత్తీరంబున మేరువునకుం బ్రదక్షిణంబుగాఁజని, గంధమాదన పర్వతం బతిక్రమించి, తద్దిశాధిపతులైన సిద్ధ విద్యాధర చారణ గంధర్వులచేత నానా విచిత్రవస్తు వాహనంబులు గొని మాల్యవన్నీల పర్వతంబులు గడచి) యుత్తర కురుదేశములకుం జని హరివాసం బను పురంబుపై విడిసిన.

### [2.1.237](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.1.237)

సీ. తద్ద్వారపాలకుల్‌ దారుణాకారు ల | పార బలాఢ్యులు పార్థుకడకుఁ  
జనుదెంచి సురరాజసన్నిభు నాతనిఁ | జూచి యచ్చెరు వడి ‘శూరు లెందు  
నీయట్టిరే కురునృపవీర! పర్యాప్త | మయ్యె నీ విజయ వీర్యాతిశయము;  
వసుమతీనాథు లెవ్వరు నిట్లు బలిమిమై | నిట వచ్చిరే తొల్లి యే యుగముల?  
ఆ. నున్నతప్రతాప! యుత్తర కురు భూము | లండ్రు జనులు వీని; నవనిచరుల  
కివి యగోచరంబు; లిందు సాధించి యె | ద్దియును గొనఁగలేదు తివిరి నీకు.

### [2.1.238](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.1.238)

వ. అయినను నీవచనంబు సేయంగలవారము మమ్ముఁ బనుపు మనిన వారికి నర్జునుం డి ట్లనియె.

### [2.1.239](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.1.239)

తే. రాజసూయాధ్వరము ధర్మరాజు సేయ | నుత్సహించినవాఁడు తదుత్సవమున  
కిండు మీయందుఁ గల వస్తు వెద్దియైన; | నమ్మహీనాథు సామ్రాజ్య మతిశయిల్లు.

### [2.1.240](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.1.240)

వ. అనిన నయ్యుత్తర కురు భూముల రాజు లెల్ల నర్జునున కతిప్రీత చిత్తులయి యమూల్యంబులైన యపరిమిత దివ్యరత్నాభరణంబులు దెచ్చియిచ్చిన.

### [2.1.241](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.1.241)

తరలము. తరణిసన్నిభు ధర్మపుత్త్రు నుదారతేజము పర్వ భా  
స్వర సుసంపదఁ బాకశాసని శాసనంబున నిట్టు లు  
త్తర కురూత్తముఁ దొట్టి యుత్తర ధారుణీశులు వశ్యు లై  
కర ధనంబులు దెచ్చియిచ్చిరి గౌరవంబున ధన్యు లై.

### [2.1.274](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.1.274)

క. ద్వారవతినుండి జగదా | ధారుఁడు గృష్ణుండు వచ్చి ధర్మజు ధర్మ  
ప్రారంభనిత్యు నుత్తము | భూరిధనంబులను రత్నములఁ బూజించెన్‌.

### [2.1.275](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.1.275)

వ. ధర్మరాజును జగదర్చితుం డయిన యచ్యుతు నర్ఘ్యాదివిధులం బూజించి తమ్ములయు ధౌమ్య ద్వైపాయనాదులయు ఋత్విజులయు నాప్తమంత్రులయు సమక్షంబున నధోక్షజున కి ట్లనియె.

### [2.1.276](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.1.276)

మత్తకోకిల. ధారుణీధర! ధర్మతత్త్వనిధాన! దానవదర్ప సం  
హార! వారిజనాభ! బంధుజనానురంజనకారి! నీ  
కారణంబునఁ జేసి మాకు జగంబునం గల భూపతుల్‌  
భూరివిక్రమవశ్యు లైరి విభుత్వ మేర్పడుచుండఁగన్‌.

### [2.1.277](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.1.277)

క. క్షితిపతులవలన సముపా | ర్జితమైన ధనంబు కొలఁదిఁ జెప్పఁగ వాచ  
స్పతికి నశక్యము; దీనిం | బ్రతిపాదింపంగవలయుఁ బాత్రవశమునన్‌.

### [2.1.278](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.1.278)

వ. ‘దేవముఖం బైన యగ్నిదేవుముఖంబున విధ్యుక్తంబుగా వేల్చి, దేవతర్పణంబును, యథోచితదక్షిణల నభీష్టదానంబుల మహీదేవ తర్పణంబునుం జేయవలయుం గావున నీ కిష్టంబయిన యజ్ఞంబు చేయించి, నాకును, లోకంబులకుం బ్రియంబు సేయు; మొండె నన్ను రాజసూయాధ్వర విధానంబునందు నియోగించి యనుగ్రహింపు’ మనిన యుధిష్ఠిరునకు నారాయణుం డి ట్లనియె.

### [2.1.279](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.1.279)

ఉ. పూజ్యుఁడ వెల్ల వంశముల భూపతులందును, ధర్మ నిర్మల  
ప్రాజ్యవిభూతి నద్దివిజపాలకు నట్టిఁడ నీక యొప్పె సా  
మ్రాజ్యము దైవసంపదయు మానుషసంపదపేర్మి కావునన్‌  
యాజ్యుఁడ విప్డు నీవ భరతాన్వయభూషణ! ధర్మనందనా!

### [2.1.280](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.1.280)

క. పంపం దగుఁ దగ దని శం | కింపక నీ కిష్టమయిన కృత్యముల నియో  
గింపుము నన్ను భవద్గుణ | సంపత్ప్రవణుల సమస్తజనుల జనేశా!

### [2.1.281](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.1.281)

చ. అనిన నుపేంద్రువాక్య మను నయ్యమృతంబునఁజేసి ధర్మనం  
దనుఁడు ముదంబు నొంది ‘విదితంబుగ నాకు మనోరథంబు లె  
ల్లను సమకూరె నిప్డు, సఫలత్వము నొందె ధనాగమంబు’ లం  
చును నెడ నిశ్చయించె మధుసూదనదేవు ననుగ్రహంబునన్‌.

### [2.1.282](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.1.282)

వ. ఇట్లు నారాయణదేవుచేత ననుజ్ఞాతుండయి తమ్ములయు ధౌమ్య ద్వైపాయనాదులయు ననుమతంబున ధర్మరాజురాజసూయంబు సేయ నుపక్రమించి, సహదేవుంజూచి ‘నీవు ధౌమ్యోపదిష్టంబులయిన యజ్ఞోపకరణ ద్రవ్యంబులు దేర నింద్రసేన ప్రముఖులను నర్జును సారథియయిన రుక్మను సమర్పించి, యజ్ఞాయతనంబున నానాదేశాగతులైన రాజులకు సన్నివేశంబులు సేయించి, నిఖిల మహీతలంబునం బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రుల నెల్ల రాఁబనుపు’ మని పంచిన నతండును దద్వాక్యానంతరంబున నింద్రసేనాదుల ననేక శిల్పివరుల నియోగించి.

### [2.1.283](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.1.283)

సీ. శాస్త్రోపదిష్ట ప్రశస్త ప్రమాణల | క్షణముల యజ్ఞోపకరణ తతుల  
యజ్ఞాయతనమున నతిరమణీయంబు | లయి యుండ నొనరించి, యందు సర్వ  
సంభారములు నించి, సకలదిక్కుల హరి | ప్రస్థంబుచుట్టు నపార భూరి  
బహువిధాగారముల్‌ ప్రమదవనంబుల | వాపుల దీర్ఘికావలుల వెలసి  
ఆ. యాజ్య తైల తండులాది నానా వస్తు | పూరితంబులయి విభూతిఁ దనర  
జననుతుండు సేసె సహదేవుఁ డపర భూ | తలముఁ బోలి యొప్పెఁ దత్పురంబు.

### [2.1.284](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.1.284)

వ. మఱియు సహదేవానుశాసనంబునఁ బుత్త్ర మిత్త్ర భ్రాతృసమేతులై విరాట ద్రుపద శిశుపాల గాంధార రాజులును బ్రాగ్జ్యోతిషంబున భగదత్తుండును, శక సాల్వ బృహద్బల చంద్రసేన సముద్రసేన కుంతిభోజ పౌండ్రకవాసుదేవులును, వసుదేవ బలదేవ ప్రద్యుమ్న శూరసేనాది యదు వృష్ణి భోజాంధకవరులును, నంగ వంగ కళింగ కాశ్మీర కాంభోజ గౌడాంధ్ర సింహళ కేరళ కుంతల ద్రవిడ మరు యవనపతులును, బార్వతేయులును సాగరానూపవాసులును నాదిగాఁ జతుస్సముద్ర ముద్రిత వసుంధరా చక్రంబునం గల రాజచక్రంబును, సమగ్ర వేద వేదాంగవిదు లైన యగ్రజన్ములును, స్వకర్మ నిరతులైన వైశ్యశూద్రులును వచ్చి యథాపరికల్పిత సన్నివేశంబుల నుండి; రంత ధర్మపుత్త్రుండు భీష్మాదులం దోడ్కొని తేర గజపురంబునకు నకులుం బంచిన.

### [2.1.295](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.1.295)

క. భూరి గుణ రత్న భూషణ! | నారాయణమూర్తి! రాజనారాయణ! కం  
ఠీరవ విక్రమ! శారద | నీరద నీహార హీర నిభశుభకీర్తీ!

### [2.1.296](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.1.296)

రాజకులోత్తమ! రాజమనోహర! రాజసూరి సభాంతర  
భ్రాజిత సద్గుణ పార్థివశేఖర! పార్థ సన్నిభ! బాంధవాం  
భోజవనద్యుమణీ! మణికాంచన పుంజ భూషిత! భూమరు  
ద్రాజసమాజ! పరాక్రమరాఘవ! రాజరాజనరేశ్వరా!

### [2.1.297](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.1.297)

గద్య. ఇది సకలసుకవిజనవినుతనన్నయభట్ట ప్రణీతంబయిన శ్రీ మహాభారతంబునందు సభాపర్వంబున ధర్మరాజునకు సభాప్రాప్తియుఁ, గింకరదర్శనంబును, నారదువలన లోకపాలుర సభాశ్రవణంబును, రాజసూయ మహాధ్వరారంభంబును, జరాసంధవధయు, గిరివ్రజ నిరుద్ధులయిన రాజులం గృష్ణుండు విడిపించుటయు, దిగ్విజయంబును, రాజసూయంబు నన్నది ప్రథమాశ్వాసము.

### సభాపర్వము — ద్వితీయాశ్వాసము

### [2.2.1](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.1)

క. శ్రీరమణీప్రియ! ధర్మవి | శారద! వీరావతార! సౌజన్యగుణా  
ధార! భువనైక సుందర! | వీరశ్రీరమ్య! బుధ వివేక నిధానా!

### [2.2.2](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.2)

వ. అ క్కథకుండు శౌనకాది మహామునులకుం జెప్పె; నట్లు రాజసూయ మహోత్సవంబు నొప్పును ధర్మరాజు ధర్మనిత్యతయును స్తుతియించి నారదుం డా సదంబున సకలరాజసమూహంబును రాజలోకంబులో మనుష్యసామాన్యుండయి యున్న జగన్మాన్యు జనార్దనుం జూచి తొల్లి బ్రహ్మాదిసురగణప్రార్థితుండయి యఖిల మహీభారావతరణార్థంబు నారాయణుండు యదువంశంబున నుదయించుటయు, నయ్యయి క్షత్త్రియ కులంబుల సురదైత్య దానవ యక్ష రాక్షస గంధర్వాదుల యంశావతారంబులుం దలంచి భవిష్యద్భారత రణంబునకు సంహృష్ట హృదయుండయి యుండు నంత.

### [2.2.3](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.3)

క. శాంతనవుఁడు భీష్ముండు ప్ర | శాంతుఁడు దత్క్రతువు సూచి సంతుష్టుండై  
యంతక తనూజునకు ధృతి | మంతున కత్యంత ధర్మమతి కి ట్లనియెన్‌.

### [2.2.4](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.4)

మత్తకోకిల స్నాతకుండును ఋత్విజుండును సద్గురుండును నిష్టుఁడున్‌  
భూతలేశుఁడు సంయుజుండును బూజనీయులు; వీరిలోఁ  
బ్రీతి నెవ్వఁడు సద్గుణంబులఁ బెద్ద యట్టి మహాత్ము వి  
ఖ్యాతుఁ బూజితుఁ జేయు మొక్కనిఁ గౌరవాన్వయవర్ధనా!

### [2.2.5](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.5)

వ. అనిన ‘నట్టివాఁ డెవ్వండు నా కెఱిఁగింపు’ మనిన ధర్మరాజునకు భీష్ముం డి ట్లనియె.

### [2.2.6](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.6)

సీ. రోదసీకుహరంబు రుచిరాంశుతతిఁ జేసి | యర్కుండు వెలిఁగించు నట్టు; లమృత  
సందోహ నిష్యంద చంద్రికఁ జేసి శీ | తాంశుఁ డానందించు నట్టు; సకల  
జనులకుఁ దనదైన సదమలద్యుతిఁ జేసి | తనరంగఁ దేజంబుఁ దనుపుఁ దాన  
చేయుచునున్న సత్సేవ్యుండు పుండరీ | కాక్షుండు గృష్ణుఁ డనాదినిధనుఁ  
ఆ. డబ్జనాభుఁ డుండ; నర్ఘ్యంబునకు నిందు | నర్హు లొరులు గలరె? యజ్ఞపురుషు  
నఖిలలోకపూజ్యు నచ్యుతుఁ బూజింపు | మధిప! యదియ చూవె యజ్ఞఫలము.

### [2.2.7](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.7)

వ. అనిన భీష్మువచనంబున నప్పుడు సహదేవోపనీతంబయిన యర్ఘ్యం బర్ఘణీయుండయిన వాసుదేవునకు శాస్త్రదృష్ట విధానంబున ధర్మతనయుం డిచ్చిన, దానింజూచి సహింపక శిశుపాలుం డుపాలంభనపరుం డయి యధోక్షజు నాక్షేపించుచు ధర్మరాజున కిట్లనియె.

### [2.2.8](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.8)

మ. అవనీనాథు లనేకు లుండఁగ విశిష్టారాధ్యు లార్యుల్‌ మహీ  
దివిజుల్‌ పూజ్యులు పల్వు రుండఁగ ధరిత్రీనాథ! గాంగేయు దు  
ర్వ్యవసాయంబునఁ గృష్ణుఁ గష్టచరితున్‌ వార్‌ష్ణేయుఁ బూజించి నీ  
యవివేకం బెఱిఁగించి తిందఱకు; దాశార్హుండు పూజార్హుఁడే?

### [2.2.9](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.9)

చ. కడుకొని ధర్మతత్త్వ మెఱుఁగంగ నశక్యము; ధర్మబాహ్యు ని  
న్నొడఁబడ నిష్టుఁడై కఱపి యుత్తము లుండఁగ వాసుదేవుఁ డ  
న్జడునకుఁ బూజ యిమ్మని విచారవిదూరుఁడు భీష్ముఁ డెంతయున్‌  
వెడఁగుఁదనంబునం బనిచె; వృద్ధులబుద్ధులు సంచలింపవే.

### [2.2.10](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.10)

చ. ఇతనికిఁ గూర్తురేని ధనమిత్తు రభీష్టములైన కార్యముల్‌  
మతి నొనరింతు రిష్టుఁడని మంతురుగాక, మహాత్ములైన భూ  
పతులయు విప్రముఖ్యులసభన్‌ విధిదృష్ట విశిష్ట పూజనా  
యతికి ననర్హు నర్హుఁ డని యచ్యుతు నర్చితుఁ జేయఁ బాడియే?

### [2.2.11](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.11)

సీ. ఈతని వృద్ధని యెఱిఁగి పూజించితే | వసుదేవుఁ డుండంగ వసుమతీశ!  
ఋత్విజుం డని విచారించి పూజించితే | ద్వైపాయనుం డుండ ధర్మయుక్తి;  
యాచార్యుఁ డని వినయమునఁ బూజించితే | కృతమతుల్‌ ద్రోణుండుఁ గృపుఁడు నుండ;  
భూనాథుఁ డనియెడు బుద్ధిఁ బూజించితే | యాదవుల్‌ రాజులే యవనిమీఁదఁ;  
ఆ. బూజనీయులైన పురుషులలోపల | నెవ్వఁడయ్యెఁ గృష్ణుఁ? డిట్టు లేల  
పూజ్యులయినవారిఁ బూజింపనొల్లక | భీష్ము పనుపుఁ జేసి బేల వయితి.

### [2.2.12](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.12)

చ. పురుష విశేష విత్తముఁడు పూజ్యుఁడు రాజులలోన నీయుధి  
ష్ఠిరుఁ డని నీ గుణాళి ప్రకటించి మనంబులలోన ధారుణీ  
శ్వరులు భవన్మఖంబునకు వచ్చిన నిందఱ కివ్విధంబునం  
బరఁగ నవజ్ఞ సేయు టిది పాడియె ధర్మువె ధర్మనందనా!

### [2.2.13](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.13)

క. నీ వెఱుఁగక యిచ్చిన నిది | నా విషయమె యని మనంబునం దలఁపక ల  
జ్జా విరహితుఁ డయి యర్ఘ్యము | గోవిందుఁడు గొనియెఁ; దనకుఁ గొను టుచితంబే?

### [2.2.14](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.14)

క. చనఁ బేడికి దారక్రియ | యును, జెవిటికి మధురగీతియును, జీకునక  
త్యనుపమ సురూపదర్శన | మును జేయుటఁ బోలుఁ గృష్ణుఁ బూజించు టిలన్‌.

### [2.2.15](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.15)

ఉ. ‘ఈ యవనీశ్వర ప్రవరు లిందఱు నిన్ను నగంగ నిట్లుగాఁ  
జేయుదె ధర్మరా జను విశేషసమాఖ్య నిరర్థకంబుగా  
ధీయుత!’ యంచు ధర్మజ నదీసుత కృష్ణుల నెగ్గులాడుచుం  
బోయె సదంబు వెల్వడి సపుత్త్రబలుండయి చైద్యుఁ డల్కతోన్‌.

### [2.2.16](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.16)

వ. ఆ శిశుపాలు పిఱుందన చని ధర్మనందనుండు వానిం బ్రియవచనంబుల ననునయించుచు ని ట్లనియె.

### [2.2.17](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.17)

క. భూరిగుణోన్నతు లనఁదగు | వారికి ధీరులకు ధరణివల్లభులకు వా  
క్పారుష్యము చన్నె? మహా | దారుణ మది విషముకంటె దహనముకంటెన్‌.

### [2.2.18](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.18)

ఉ. ఆదిజుఁడైన బ్రహ్మయుదయంబున కాస్పదమైనవాఁడు, వే  
దాది సమస్త వాఙ్మయములందుఁ బ్రశంసితుఁడైన వాఁడు,లో  
కాది, త్రిలోకపూజ్యుఁ డని యాత్మ నెఱింగి పితామహుండు దా  
మోదరుఁ జెప్పెఁ బూజ్యుఁ డని; యుక్తమ కా కిది యేమి దోసమే?

### [2.2.19](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.19)

క. పరమార్థ ప్రతిభఁ దమో | హరు నచ్యుతు భీష్ముఁ డెఱిఁగిన ట్లెఱుఁగఁగ నీ  
కరిది శిశుపాల! పెద్దల | చరితం బల్పులకు నెఱుఁగ శక్యమె యెందున్‌?

### [2.2.20](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.20)

క. గురుఁ డని సమస్తలోకో | త్తరుఁ డని నీకంటె వృద్ధతములైన నరే  
శ్వరు లచ్యుతు నర్చన నెడఁ | గర మభినందింప నీకుఁ గాదనఁ దగునే.

### [2.2.21](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.21)

వ. అని యా శిశుపాలుం బట్టువఱుచుచున్నంత ధర్మరాజునకు భీష్ముం డి ట్లనియె.

### [2.2.39](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.39)

ఉ. ‘ఇమ్ముదివెఱ్ఱి వీనిఁ బరమేశ్వరుఁగాఁ గొనియాడె; ధర్మత  
త్త్వమ్ములు పాండవేయులును దానునుగాని యెఱుంగరట్టె; సా  
మమ్మున నెల్లవారి నవమాన్యులఁ జేసె నమాన్యుఁడంచు రూ  
క్షమ్మున భీష్ముఁ జూచి బలగర్వితుఁ డి ట్లని పల్కె నల్కతోన్‌.

### [2.2.40](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.40)

ఉ. నెట్టన ధర్మనందనుఁడు ని న్నవలంబము సేసి యోడతోఁ  
గట్టినయోడవోలె గతగౌరవుఁడై కడుఁదూలెఁ గృష్ణుఁ జే  
పట్టి బిభీషికల్‌ ధరణిపాలుర కిప్పుడు సూపి; తెందు నీ  
యట్టి దురాత్ములుం గలరె; యంత యధీరులె ధారుణీపతుల్‌?

### [2.2.41](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.41)

సీ. పూతనాఘాతంబుఁ, జేతనేతరమైన | శకటంబు త్రోపును జరణనిహతి,  
వీఁకతోఁ గడుఁబూచుమ్రాకుల విఱుపును, | వల్మీకమాత్రపర్వతము నెత్తి  
కొని, లావుగలఁడు వీఁ డన నేఁడు దివసంబు | లునికియు, వృషవధయును ననంగఁ  
బమ్మిన కృష్ణుబీరమ్ములు వొగడుచు | నున్న నీ నాలుక యొక్కఁడయ్యు  
ఆ. వ్రయ్యవలయు నూఱు వ్రయ్యలుగాఁగ; న | ట్లయినఁ గాని చాల వతనిఁ బొగడ;  
నెల్లదాని నేన యెఱుఁగుదు; నెందు వాఁ | డర్ఘ్యదానయోగ్యుఁ డయ్యెఁ జెపుమ.

### [2.2.42](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.42)

వ. స్త్రీలను గోబ్రాహ్మణులం గూడువెట్టువారిని విశ్వసించినవారిని వధియించుట మహాపాతకం బని పెద్దలు సెప్పుదు; రట్టివానియందు గోవిందుఁడు స్త్రీవధయును గోవధయునుం జేసె; నీవునుం గడు ధర్మువెఱింగినవాఁడ వయి వీని కర్ఘ్యం బిప్పించి; తదియునుంగాక యన్యకామ యయిన యంబ యను కన్యక నపహరించి నీవు దెచ్చిన నెఱింగి నీ తమ్ముండు విచిత్రవీర్యుండు ధర్ము వెఱిఁగినవాఁడై దాని విడిచి పుచ్చె.

### [2.2.43](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.43)

క. జననిందిత మయి నీయం | దనపత్యత యను నధర్మ మది యుండఁగ ధ  
ర్మనివృత్తచరిత్రక! నీ | యనుశాసన మెట్లు నమ్మ నగు జనములకున్‌?

### [2.2.44](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.44)

వ. తొల్లి సముద్రతీరంబున నుండి యొక్క వృద్ధహంస ధర్మాధర్మంబులు సెప్పుచు ధర్మమార్గంబున వర్తిల్లుచుండుఁ డని పక్షుల నెల్ల శిక్షించుచుఁ బ్రాణిహింస సేయక తపోవృత్తి నున్న దానికి సముద్రజలచరంబు లయిన పక్షులు రుచ్యంబు లగు భక్ష్యంబులు దెచ్చి పెట్టుచుం దత్సమీపంబునం దమ తమ యండంబుల నెల్ల నిక్షేపించి భక్షణార్థం బొక్కనాఁ డతిదూరం బరిగిన, నిట యాహంసయు నయ్యండంబుల భక్షించిన దాని నొక్క పక్షి గని యా పక్షులకెల్లం జెప్పిన, నవి దద్దయు దుఃఖించి యా యంచను వధియించెం గావున నట్ల నీవు నధర్మప్రవృత్తుండవై ధర్మశిక్ష సేయుచుఁ గౌరవుల కాపద యాపాదించుచున్నవాఁడవు.

### [2.2.45](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.45)

క. విదితముగ నధికబలసం | పద నోర్చె నుపేంద్రుఁ డవనిపాలుర నంచున్‌  
మదిఁ బొగడితి; నా యెఱుఁగని | యదియె జనార్దనుబలంబు నత్యున్నతియున్‌?

### [2.2.46](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.46)

క. సకలక్షత్త్రభయంకరు | నకు బార్హద్రథికి ననిమొనన్‌ మార్కొన నో  
పక వలియం బాఱఁడె యీ | ముకుందుఁడు భయాతిరేకమునఁ బదిమాఱుల్‌.

### [2.2.47](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.47)

వ. అమ్మహాసత్త్వు జరాసంధుం బరమబ్రహ్మణ్యు బ్రాహ్మణవేషంబున భీమార్జునులం దోడుసేసికొని వధియించె; నవి యెల్లం ద్రివిక్రము పరాక్రమంబులుగా నశ్రాంతవచనుండ వయి.

### [2.2.48](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.48)

ఆ. బూతు వొగడినట్లు వొగడెదు; పొగడంగ | వలయునేని సుగుణవంతు లయిన  
కర్ణ శల్యు లాదిగాఁ గల వీరులఁ | బొగడుచుండరాదె ప్రొద్దువోక.

### [2.2.49](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.49)

ఆ. అన్యకీర్తనంబు నన్యనిందయుఁ దన్నుఁ | బరఁగఁ బొగడికోలుఁ బ్రబ్బికోలు  
నాపగాతనూజ! యార్యవృత్తములు గా | వనిరి వీని నాద్యులయిన మునులు.

### [2.2.50](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.50)

వ. అని రూక్షాక్షరవచనంబుల నాక్షేపించుచున్న శిశుపాలుం జూచి సహింపనోపక భీమసేనుం డతిరౌద్రాకారంబున నలిగిన.

### [2.2.51](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.51)

చ. ప్రకటితకోపవేగమునఁ బద్మదళాయతనేత్రముల్‌ భయా  
నకతర లీలఁ దాల్చె నరుణద్యుతి నుద్యతమై త్రిశాఖ మై  
భ్రుకుటి లలాటదేశమునఁ బొల్చెఁ ద్రికూటతటిత్రిమార్గగా  
నుకృతిఁ బ్రభంజనప్రియతనూజున కంతకమూర్తి కచ్చటన్‌.

### [2.2.52](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.52)

వ. ఇట్లు నిఖిల క్షత్త్రియత్రాసజననంబుగా నలిగి దంతసందష్ట దారుణ ముఖుండై శిశుపాల నిర్మూలనాభీల సంరంభంబున నున్న భీమసేను వారించి భీష్ముం డిట్లని చెప్పె ; ‘నిద్దురాత్ముండు తొల్లి చేదివంశంబున దమఘోషుం డనువానికి సాత్వతికిం జతుర్భుజ లలాట నేత్రంబులతో నుదయించి. రాసభరవంబున నేడ్చుచున్నం జూచి తల్లిదండ్రులు భయవిస్మయాధీనమనస్కులయి యున్న వారికి నొక్క యశరీరభూతం బిట్లనియె.’

### [2.2.53](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.53)

ఆ. వీని నొరులు చంపఁగా నోప రెవ్వరు; | నెవ్వరేని వీని నెత్తికొనుడు  
మిగిలియున్న బాహుయుగళంబుఁ గన్నును | నడఁగు వీని కతఁడ యంతకుండు.

### [2.2.54](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.54)

వ. అనిన నయ్యశరీరివచనంబులు విని వార లాశ్చర్యమానసులయి, యా కుమారుం జూడవచ్చిన వారికెల్ల నెత్తికొన నిచ్చుచున్నంత.

### [2.2.55](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.55)

చ. అతివికృతస్వరూపధరుఁ డైన కుమారకుఁ బ్రీతితోడ సా  
త్వతిఁ దమ మేనయత్తను ముదంబునఁ జూడఁగఁగోరి యద్భుత  
ప్రతిభులు రామకేశవులు పన్నుగ నేఁగిరి చేదిధారుణీ  
పతిపురి కొక్కనాఁ డఖిల బాంధవ మంత్రిసుహృత్సమేతులై.

### [2.2.56](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.56)

వ. ఇట్లు వచ్చిన రామకేశవులం బ్రియసత్కారంబులఁ బూజించి సాత్వతియు నబ్బాలు బలదేవుచేతికి నెత్తికొననిచ్చి తదనంతరంబ నారాయణుచేతికి నిచ్చిన.

### [2.2.57](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.57)

క. అక్కొడుకు నబ్జనాభుం | డక్కజముగ నెత్తికొనుడు నందఱుఁ జూడన్‌  
గ్రక్కున నొక్కట నడఁగెను | మిక్కిలి చేతులును వానిమిక్కిలి కన్నున్‌.

### [2.2.58](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.58)

వ. దానిం జూచి సాత్వతి యద్భుతచిత్తయై యశరీరిపలుకు లప్పుడు దలంచి తన పుత్త్రునకు మురవైరివలన మరణం బగుట యెఱింగి యతని కి ట్లనియె.

### [2.2.59](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.59)

క. కుపథప్రవృత్తుఁ డయి వీఁ | డపనయమున నీ కనిష్టుఁ డయినను గరుణా  
నిపుణుఁడవై నీ మఱఁదికి | నపరాధశతంబు సైఁపుమయ్య యుపేంద్రా!

### [2.2.60](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.60)

వ. అని వీనితల్లి తొల్లి జగద్వల్లభుండైన జనార్దనుం బ్రార్థించి తత్ప్రసాదంబున వరంబు వడయుటం జేసి శతాపరాధంబులు నిండునంతకు వీఁ డన్యులచేత నప్రతిహతుండు; కృష్ణునిచేత నిహతుండగు; నది కారణంబుగా.

### [2.2.61](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.61)

చ. ఇతనికి నిట్లు న న్నుఱక యెగ్గులు వల్కఁగఁ బోలెఁగాక, యు  
ద్ధతమతి నన్యు లీతని విధంబునఁ బల్కి మదీయచాప ని  
ర్గత చటులోగ్రమార్గణ నికాయ పయోధి మునుంగ కిట్లు ద  
ర్పితులయి పోవనేర్తురె గభీరపరాక్రమ! మారుతాత్మజా!

### [2.2.62](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.62)

వ. అని పలుకుచున్న భీష్మభీముల నతిక్రమించి శిశుపాలుండు జనార్దనున కభిముఖుండయి యి ట్లనియె.

### [2.2.63](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.63)

మ. అవమాన్యున్‌ సభలోన మాన్యుఁ డని సౌహార్దంబునం గౌరవ  
స్థవిర ప్రేరణ నిన్నుఁ బాండుతనయుల్‌ తప్పంగఁ బూజించి ర  
య్యవివేకాస్పదు లైన పాండవులు మోహాంధుండు భీష్ముండుఁ గే  
శవ! నీవుం గడఁగుండు నాకు నెదురై సంగ్రామరంగంబునన్‌.

### [2.2.64](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.64)

వ. అని శిశుపాలుండు గర్వించి పలికిన విని చక్రధరుం డఖిల రాజచక్రంబు విన నిట్లనియె.

### [2.2.65](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.65)

సీ. ప్రాగ్జ్యోతిషంబున భగదత్తుపయి నేము | వోయిన నీతఁ డన్యాయవృత్తి  
నిట బాలవృద్ధుల కెల్ల భయంబుగా | ద్వారకాపురిఁ గాల్చె, వీరులైన  
భోజరాజన్యులు పొలఁతులతోడ రై | వతకాద్రిఁ గ్రీడాభిరతిఁ బ్రమత్తు  
లయియున్న వారల నదయుఁడై వధియించె; | దేవాభుఁ డగు వసుదేవు చేయు  
ఆ. నశ్వమేధమునకు నభ్యర్చితం బైన | హయము నపహరించి యజ్ఞమునకు  
విఘ్న మాచరించె; వీఁ డతిపాపుఁ డై | బభ్రుభార్యఁ దనకు భార్యఁ జేసె.

### [2.2.66](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.66)

వ. ‘మఱియు వాగ్విషయంబు లయిన యపకారంబు లనేకంబులు సేసె; మా యత్త సాత్వతి నన్నుం బ్రార్థించుటంజేసి యిద్దురాత్ముండు సేసిన యపరాధశతంబు సహించితి; నిప్పుడు మీ రిందఱు నెఱుంగ నాయం దకారణ వ్యతిక్రమం బుపక్రమించి యత్యంతశత్రుం డయ్యె’ ననిన విని శిశుపాలుం డతిపరుష వచనుం డగుచుఁ బురుషోత్తమున కి ట్లనియె.

### [2.2.67](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.67)

క. నీ కూర్మియు నీ యలుకయు | నా కవి యేమిటికి దుర్గుణప్రియ! మొదలన్‌  
నా కిచ్చిన యక్కన్యకఁ | జేకొని నీ కిట్లు పలుక సిగ్గును లేదే!

### [2.2.86](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.86)

వ. అట దుర్యోధనుండు శకునియుం దానును సభావిభవంబుఁ జూచు వేడుక నందుఁ గొన్ని దినంబు లుండి, యొక్కనాఁడు దాని యపూర్వరమణీయతకు విస్మితుం డగుచు నయ్యయి ప్రదేశంబులం గ్రుమ్మరువాఁడు వివృతంబైన ద్వారదేశంబు సంవృతంబుగా వగచి చొరనొల్లక, సంవృతంబైనదాని వివృతంబుగా వగచి చొరంబోయిలలాట ఘట్టితగృహద్వారుండయి, సమప్రదేశం బున్నతంబుగా వగచి యెక్కసమకట్టి, నీలాశ్మరశ్మి స్థగితంబైన విమలమణిస్థలంబు జలాశయంబుగా వగచి పరిధానం బెగఁద్రోచికొని, స్ఫటికదీప్తిజాల పరివృతంబైన జలాశయంబు స్థలంబుగా వగచి కట్టిన పుట్టంబు దడియంజొచ్చి, క్రమ్మఱిన వానిం జూచి పాంచాలియుఁ బాండుకుమారులును నగి రంత.

### [2.2.87](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.87)

ఆ. దాని నెఱిఁగి ధర్మతనయుండు ధృతరాష్ట్రు | తనయునకు సమీరతనయుచేత  
దివ్యవస్త్రములును దివ్యభూషణములు | నిచ్చి పుచ్చెఁ బ్రీతి యేర్పడంగ.

### [2.2.88](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.88)

వ. దుర్యోధనుం డట్లు సభాప్రలంభంబునకు లజ్జితుండయి పాండవుల వీడ్కొని గజపురంబున కరిగి ధర్మరాజు రాజసూయంబు దన కసూయాజననం బగుటయు సకలజనమనో నయనోత్సవంబయిన తత్సభాలక్ష్మి దన మనోనయనంబుల కగ్నిజ్వాలయై మహాదాహంబు సేయుటయు సంతప్తుండై నిదాఘదాహంబున నింకి తఱుఁగు నల్పజలాశయంబునుం బోలెఁ దద్దయుం దఱిఁగి.

### [2.2.89](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.89)

క. కందు గల పసిఁడి గాఁచినఁ | గంది వివర్ణమయినట్లు కౌరవుకాయం  
బొందఁగ వివర్ణమయి కడు | వందె మనస్తాపహవ్యవహదాహమునన్‌.

### [2.2.90](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.90)

క. అవనీ రాజ్యవ్యాపా | రవిహీనుం డయి సుహృద్విరంజనుఁ డై కౌ  
రవపాంసనుండు పాప | వ్యవసాయమునందు బుద్ధి వదలక నిలిపెన్‌.

### [2.2.91](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.91)

వ. ఇట్లు సకల సుఖోపభోగ విముఖుండయి యెవ్వరితోడం బలుక కున్న దుర్యోధనుం జూచి శకుని యి ట్లనియె.

### [2.2.92](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.92)

ఆ. ఇన్ని దినములయ్యె నేటికి నాతోడ | నిభపురేశ! పలుక విట్టు లేల?  
నీ ముఖంబు దీర్ఘ నిశ్వాస ధూమ సం | హతులఁ జేసి కలుషమయిన యదియు.

### [2.2.93](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.93)

క. నా కెఱిఁగింపుము దీని, న | నేకాగ్రతఁ బొందనేల యే నుండఁగ? న  
వ్యాకులభవత్ప్రతాప ని | రాకృతులు ధరిత్రిలోని రాజులు నీకున్‌.

### [2.2.94](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.94)

వ. ‘ఇంత సంతాపింప నేల?’ యనిన నాశకునికి దుర్యోధనుం డిట్లనియె.

### [2.2.130](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.130)

ఆ. ఇట్టి కార్యమునకు నే నవశ్యంబును | నొడఁబడంగ నోప నుక్కివమున  
సుతులతోడ నేల సుతులకు భేదంబు | సేయఁ గడఁగి తిదియుఁ జెట్ట యనక.

### [2.2.131](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.131)

తే. ఒలసి నీ పుత్త్రులెల్ల నొండొరులతోడ | నె ట్లొడంబడి యుండుదు రట్ల చేయ  
వలయుఁ; దమలోన జూదంబు వాదు నగుటఁ | గలహ మూలంబ యెట్టి శాంతులకు నైన.

### [2.2.132](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.132)

వ. ‘నీ నేర్చు విధంబున శకుని దుర్యోధనుల దుర్వ్యవసాయం బుడిగించి యిక్కురువంశంబు రక్షింపు’ మనిన విదురునకు ధృతరాష్ట్రుం డి ట్లనియె.

### [2.2.133](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.133)

ఉ. పుత్త్రుల కేల భేదమగు భూనుత! యేనును నీవు జాహ్నవీ  
పుత్త్రుఁడు నుండఁగా నహితమున్‌ భయమున్‌ దొరకొన్నె? నాకు నా  
పుత్త్రులకుం బ్రసాదకృత బుద్ధులు వేల్పులు గాన దీనికిన్‌  
మిత్రనిధీ! యొడంబడుము మిన్నక సంశయ మంద నేటికిన్‌?

### [2.2.134](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.134)

వ. ‘వడిగల తురంగంబులం బూనిన రథం బెక్కి యింద్రప్రస్థపురంబునకుం జని యిందులకు ధర్మనందనుం దోడ్కొని ర’ మ్మని విదురుం బంచిన, నాతండును నాపగేయున కంతయు నెఱింగించి ‘యిది యపకర్మం’ బనుచుండె; నిట ధృతరాష్ట్రుండు దన నిర్మింపంబంచిన సభ దుర్యోధనునకుం జూపి యాతని కేకాంతంబున నిట్లనియె.

### [2.2.135](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.135)

క. జూద మిది యేల? దీనను | భేదము మీలోనఁ బుట్టుఁ బెలుచన; యుష్మ  
ద్భేదమునఁజేసి యె గ్గు | త్పాదిల్లు ధరిత్రిఁ బ్రజకు భయజననంబై.

### [2.2.136](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.136)

ఉ. ఇమ్మహి నీవుఁ బాండవులు నెప్పటియట్ల పరస్పరానురా  
గమ్మున నేలుచున్కి యిది కార్యము; పాండవలక్ష్మి నీ కస  
హ్య మ్మన నేల? వంచనఁ బరార్థ పరిగ్రహబుద్ధిఁ జేసి పా  
పమ్మగుఁ; బాపకారులకుఁ బాయు నవశ్యము నర్థధర్మముల్‌.

### [2.2.137](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.137)

వ. ‘ధర్మాధర్మవిదుండైన విదురున కిది సమ్మతంబు గాదు; ధర్మజు ధనసంపదకంటె నేనుమడుంగులు నీకు ధన సంపద గలదు; వాని చేసిన యజ్ఞంబుకంటె విశేషంబుగా దక్షిణ లిచ్చి నీ కిష్టంబయిన యజ్ఞంబు సేయుము; నీకును భూలోకంబునంగల రాజులెల్లం దమసర్వస్వమ్ములుఁ దెచ్చియిత్తు’ రనిన విని దుర్యోధనుండు దండ్రి కి ట్లనియె.

### [2.2.138](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.138)

క. ఇమ్ముల ధర్మజుతో జూ | దమ్మాడఁగఁ గాన్ప నాకు ధరణీశ్వర! య  
జ్ఞ; మ్మదియ సమస్తైశ్వ | ర్యమ్ములు వడయఁగ నుపాయ మభిమతబుద్ధిన్‌.

### [2.2.139](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.139)

క. మీ రిందుల కందఱుఁ జను | దేరఁగ నే నంద యుండితిని సభ చూడన్‌;  
ధారుణి నట్టి యపూర్వ స | భారచనలు వినఁగఁ జూడఁబడ వెవ్వరిచేన్‌.

### [2.2.140](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.140)

వ. నిర్మల స్ఫటిక శిలానిర్మితం బై శశిప్రకాశంబై వివిధరత్న ప్రభా భాసురంబైన యా సభావిభవంబు చూచువేడుక నందుఁ గ్రుమ్మరు వాఁడ హరినీల బద్ధస్నిగ్ధ మణిస్థలంబునందు జలబుద్ధింజేసి పరిధానోత్కర్షణంబుసేసి, విమల శిలాతలబుద్ధి నుదకపరిపూర్ణం బయిన వాపి సొచ్చి, కట్టిన పుట్టంబు దడియం ద్రెళ్ళిన నన్నుం జూచి వృకోదరుండు నగియె; దాని నంతయు నెఱింగి ధర్మరాజ చోదితులయిన కింకరులు నాకుం బరిధానంబులు దెచ్చి యిచ్చిరి; మఱియు వివృతద్వారంబుఁ గవాట ఘటితం బని చొరనొల్లక, కవాటఘటితంబు వివృతంబుగా వగచి, చొరంబోయి తత్కవాట స్ఫటిక శిలా ఘట్టిత లలాటుండ నైన నన్నుం జూచి యనేక సహస్ర విలాసినీ పరివృతయయియున్న ద్రౌపది నగియె; నంత నకుల సహదేవులు పఱతెంచి ‘యిదె వాకిలి యిట వచ్చునది’ యని నన్నుం దోడ్కొని పోయి; రట్టి సభాప్రలంభంబు నాకు హృదయశల్యం బయి యున్నది.

### [2.2.141](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.141)

క. పెద్దలు హీనతఁ బొందిరి | తద్దయు హీనులు సమృద్ధిఁ దనరిరి నియమం  
బెద్ది విధియోగమున కసు | హృద్దర్పోన్నతులు సూచి యెట్లు సహింతున్‌.

### [2.2.142](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.142)

క. పరమసుఖోపాయంబునఁ | బరసంపద చేకొనంగఁ బడునేని నరే  
శ్వర! యంతకంటె మిక్కిలి | పురుషార్థం బెద్ది యొండు భూనాథులకున్‌.

### [2.2.143](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.143)

క. నముచి యను దనుజుఁ డుగ్రత | పము సేయుచు నున్నవాని బలమథనుఁ డధ  
ర్మమున వధియించె; రిపుప | క్షము నెమ్మెయి నైనఁ జెఱుపఁగా వలయు నిలన్‌.

### [2.2.144](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.144)

ఆ. అల్పుఁడయ్యు మనుజుఁ డతి పరాక్రమమునఁ | బేర్మిఁ దరతరంబ పెరుగుచున్న  
వాఁడు మ్రాని మొదలి వల్మీక మా మ్రానిఁ | జెఱుచు నట్లు గడఁగి చెఱుచుఁ బగఱ.

### [2.2.145](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.145)

తే. అహితవృద్ధి యుపేక్షితం బగుడు నల్ప | మగు మహావ్యాధియును బోలె నది యసాధ్య  
మయి యుపేక్షకు నిర్మూలితాత్ముఁ జేయుఁ | గాన పాండవశ్రీ యుపేక్ష్యంబు గాదు.

### [2.2.146](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2.2.146)

వ. ‘దాని నెవ్విధంబున నయిన నపహరింపవలయు; నట్లుగాని నాఁడు నా హృదయ తాపంబున కుపశమనంబుగా; దనిన దుర్యోధనునకు శకుని యి ట్లనియె.

_First 200 of 380 passages. [Read on](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2)_

---
Source: [https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.2) · Pramāṇa
