<!-- Pramāṇa, a library of Indian primary sources · https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.2.276 -->

[Pramāṇa](https://indike.org/pramana/) › [Indian literature](https://indike.org/pramana/in) › [Epic, Poetry, Drama & Narrative](https://indike.org/pramana/in.lit) › [The Mahābhārata and its versions](https://indike.org/pramana/in.lit.mahabharata) › [Mahābhāratas in Indian regional languages](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa) › [Andhra Mahabharatamu](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra) › 3.2.276

# Andhra Mahabharatamu 3.2.276

Āndhra Mahābhāratamu 3.2.276

- **Language:** Telugu

### [3.2.276](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.2.276)

వ. మఱి యక్షిణీతీర్థంబునందు జలపానంబు సేసి బ్రహ్మహత్యాది దోష విముక్తు లగుదురు; మణినాగం బను తీర్థం బాడినవారికి నాశీవిషవిషంబు లొందవు; గౌతమవనంబునం దహల్యాహ్రదం బాడి యుదపానం బను తీర్థం బాడియు నశ్వమేధ ఫలంబుఁ బడయుదురు; రాజర్షి జనక కూపం బాడి విష్ణులోకప్రాప్తు లగుదురు; కంపనయు మహానదియు నను తీర్థంబుల నాడినవారు పౌండరీక ఫలంబు నొందుదురు; దేవపుష్కరిణిని మహేశ్వరధారను మహేశ్వరపదంబున నాడిన నశ్వమేధఫలంబు వడయుదురు; తొల్లి కూర్మరూపుం డయిన యసురచేతం గోటితీర్థంబు లపహృతంబు లయిన వానిఁ దెచ్చి, విష్ణుఁ డెందేని నిలిపె నట్టి మహేశ్వరపథం బను తీర్థంబాడియు, విష్ణుస్థానం బయిన సాలగ్రామం బను తీర్థంబాడి విష్ణు నర్చించియు, నందు సన్నిహిత చతుస్సముద్రం బయిన కూపంబు నాడియు విష్ణులోకగతు లగుదురు; భరతాశ్రమంబునఁ, జంపకారణ్యంబున దేవీసహితు నీశ్వరుం బూజించి మిత్రావరుణలోకంబు వడయుదురు; కన్యాసంవేద్యం బను తీర్థంబునఁ గన్యాదానంబు చేసి యక్షయఫలప్రాప్తు లగుదురు; దేవకూటం బను తీర్థంబాడి బ్రహ్మలోకం బుఁబడయుదు; రెందేని విశ్వామిత్రుండు సిద్ధింబొందె నట్టి కౌశికహ్రదం బాడియుఁ, గుమారవీరాశ్రమంబున నొక్కమాసంబు వసించియు నశ్వమేధ ఫలంబు వడయుదు; రగ్నిధారయుఁ బితామహ సరంబునం బుట్టిన కుమార ధారయు నాడి, త్రిరాత్రోపవాసంబు సేసినవారు బ్రహ్మహత్యాది దోషవిముక్తు లగుదురు; గౌరీశిఖరకుండం బాడిన నందినీకూపం బాడిన నశ్వమేధఫలం బగుఁ; గాళికా కౌశికా సంగమంబునందుఁ ద్రిరాత్రోపవాసంబు సేసినవారు సర్వపాప విముక్తులగుదు; రూర్వశీతీర్థం బాడిన సర్వపూజార్హు లగుదురు; గోకర్ణంబను తీర్థంబాడి జాతిస్మరణంబు వడయుదురు; సరస్వతీ తీర్థస్నాతులయి వృషభ ద్వీపంబునం గుమారుఁ బూజించి దేవవిమానగతు లగుదురు; నందయు, నౌలకమును, గరతోయంబును, గంగాసాగరసంగమంబు నను తీర్థంబు లాడి శతాశ్వమేధ ఫలంబు వడయుదురు; శోణా నర్మదాప్రభవంబును, బదరీతీర్థంబును నాడి యాయుష్మంతు లగుదురు; మహేంద్రంబును రామతీర్థంబును, మతంగ కేదారమ్మును, వంశగుల్మంబు నను తీర్థంబుల నాడి యశ్వమేధఫలంబు వడయుదురు.

- [Previous: 3.2.275](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.2.275)
- [Next: 3.2.277](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.2.277)
- [Up: 3.2](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.2)

---
Source: [https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.2.276](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.2.276) · Pramāṇa
