<!-- Pramāṇa, a library of Indian primary sources · https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3 -->

[Pramāṇa](https://indike.org/pramana/) › [Indian literature](https://indike.org/pramana/in) › [Epic, Poetry, Drama & Narrative](https://indike.org/pramana/in.lit) › [The Mahābhārata and its versions](https://indike.org/pramana/in.lit.mahabharata) › [Mahābhāratas in Indian regional languages](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa) › [Andhra Mahabharatamu](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra) › 3.3

# Andhra Mahabharatamu 3.3: అరణ్యపర్వము — తృతీయాశ్వాసము

Āndhra Mahābhāratamu 3.3

- **Language:** Telugu

### అరణ్యపర్వము — తృతీయాశ్వాసము

### [3.3.2](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.2)

వ. అక్కథకుండు శౌనకాది మహామునులకుం జెప్పె; నట్లు ధర్మతనయుం డగస్త్యు మాహాత్మ్యంబు విని వెండియుఁ దచ్చరిత్రంబు రోమశు నడిగిన, నమ్ముని యిట్లనియె.

### [3.3.3](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.3)

సీ. ‘కృతయుగంబునఁ గాలకేయగణంబుతో | వృత్రుఁ డన్నసుర గర్వించి యమర  
పతిఁ దొట్టి వేల్పుల బాధించుచున్నఁ ద | ద్భయమున నమరులు బ్రహ్మకడకుఁ  
జని ‘పోరిలో వృత్రుఁ జంప నుపాయ మె | య్యదియొ మా కానతి’ మ్మన నజుండు  
‘దివిరి సరస్వతీ తీరంబునందు ని | శ్చింతుఁడై తప మొప్పఁ జేయుచున్న  
ఆ. యా దధీచికడకు నరిగి వేఁడుండు, ని | జాస్థు లిచ్చు మీకు నమ్మహాత్ముఁ;  
డవి జయించు వజ్ర మాదిగా నిఖిలది | వ్యాయుధంబులై సురారివరుల.

### [3.3.4](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.4)

వ. అందు వజ్రంబున నింద్రుండు వృత్రు వధియించు’ ననిన నమరు లెల్లం గమలాసను శాసనంబున దధీచి పాలికిం జని కృతప్రణాము లై యిట్లనిరి.

### [3.3.5](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.5)

క. ‘భువనజనస్తుత! నిజగౌ | రవ మెసఁగఁగ నమరపతి పురస్కృతు లగు ని  
ద్దివిజుల కెల్ల హితంబుగ | భవదస్థిచయంబు లిమ్ము పరమమునీంద్రా!’

### [3.3.6](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.6)

వ. అనిన విని దధీచి సంతసిల్లి ‘కృతార్థుండ నైతి’ నని దేవహితార్థంబుగా నిజప్రాణంబుల విడిచె; నమరులెల్ల నమ్మహాముని యస్థు లాయుధంబులుగాఁ బరిగ్రహించి; రందు.

### [3.3.7](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.7)

ఆ. త్వష్ట యంత నూఱుధారల రమ్యమై | యనలకణ కరాళ మైన వజ్ర  
మొనరఁ జేసి ‘దీన నోర్వుము దైత్యుల’ | ననుచు నిచ్చె దాని నమరపతికి.

### [3.3.8](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.8)

వ. అవ్వజ్రంబున నింద్రుండు వృత్రు వధియించె నంత.

### [3.3.9](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.9)

చ. అనుపమదివ్యశస్త్రధరులైన యమర్త్యుల కాహవంబులో  
మొనయక కాలకేయులు సముద్రముఁ జొచ్చి దివంబు లెల్ల న  
వ్వనధి నడంగి యుండి బలవంతులు వెల్వడి రాత్రులెల్ల భూ  
జనులకు బాధసేయుచు భృశంబుగ నుండిరి క్రూరచిత్తులై.

### [3.3.10](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.10)

వ. మఱియు ‘విద్యాతపోయుక్తులై ధర్మచరితులైన వారి కారణంబున జగంబు లపాయంబు నొందక సుఖంబున్న యవి; గావున నట్టి వారిన రోసి వధియించి జగంబుల కపాయంబు సేయుద’ మని యసురులు వసిష్ఠాశ్రమంబున నూటతొంబదియేడ్వురను, జ్యవనాశ్రమంబున నూర్వురను, భరద్వాజాశ్రమంబున నిరువదుండ్రనుంగాఁ బలువురు బ్రాహ్మణుల బ్రహ్మమయుల వధియించి, భక్షించి, యిప్పాట ననవరతంబు నఖిల మునిగణాశ్రమంబుల కుపద్రవంబు సేయుచున్న.

### [3.3.48](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.48)

వ. తొల్లి యిక్ష్వాకు వంశంబున సగరుం డనురాజు హైహయుల నిర్జించి నిఖిల మహీరాజ్యంబు సేయుచు నపుత్త్రకుండై వైదర్భియు శైబ్యయు నను నిద్దఱు భార్యలతోడం గైలాసంబున కరిగి, యందు.

### [3.3.49](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.49)

క. దక్షమఖక్షయకరు నిట | లాక్షజహుత భక్ష్యభక్షితానంగు విరూ  
పాక్షు మహోక్షధ్వజుఁ బ్ర | త్యక్షము గావించె నుగ్రతపమున పేర్మిన్‌.

### [3.3.50](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.50)

తే. హరుఁడు వానికిఁ బ్రత్యక్షమయి వరంబు | వేఁడు మనవుడుఁ ‘ద్రైలోక్యవిభుఁడ! నాకు  
దయ యొనర్పుము సంతానదాన’ మనుచు | వేఁడెఁ బుత్త్రార్థియై కడువేడ్కతోడ.

### [3.3.51](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.51)

వ. ఈశ్వరుండు వానికి వైదర్భియం దఱువదివేవురు గొడుకులును, శైబ్యయం దొక్క కొడుకుంగా వరం బిచ్చి, యయ్యఱువదివేవురు నతిదర్పితులై యేకకాలంబునఁ గాలగోచరు లగుదు రనియు, నయ్యొక్క కొడుకు వంశకర్త యగుననియుం జెప్పి యదృశ్యుం డైన.

### [3.3.52](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.52)

క. కొడుకులఁ బలువురఁ బడసియుఁ | బడయనియట్టి దయి ధర్మపత్నులుఁ దానుం  
గడు సంతసపడ కరిగెను | దడయక సగరుండు మగుడి తన పురమునకున్‌.

### [3.3.53](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.53)

వ. అంతఁ గొంతకాలంబునకు నయ్యిద్దరు గర్భిణులైన నందు వైదర్భికి నొక్కి యలాబూ ఫలంబును, శైబ్యకు నసమంజసుండను కొడుకునుం బుట్టిన.

### [3.3.54](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.54)

ఆ. ‘వరదుఁడైన యీశువరమున నిది యొక్క | వదరు పుట్టె; నెట్టివరమొ!’ యనుచు  
దానిఁ బాఱవైవఁ దా రున్న నాకాశ | వాణి యిట్టు లనియె వసుమతీశ!

### [3.3.55](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.55)

తే. సాహసం బిట్టు సేయంగఁ జనునె? దీని | బీజములు ఘృతఘటములఁ బెట్టి రక్ష  
సేయు; మఱువదివేవు రూర్జితులు సుతు లు | మేశు వరమునఁ బుట్టుదు రిందు నీకు.’

### [3.3.56](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.56)

వ. అనినం దద్వచనానురూపంబు సేసి రక్షించుచున్న రెన్నెలలకు.

### [3.3.57](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.57)

క. సుతషష్టి సహస్రక ము | ద్గతమై వర్ధిల్లి గగనగతిఁ బఱచి శత  
క్రతులోకముఁ దొట్టి మదో | ద్ధతిఁ జేసె సమస్తలోకతతులకు బాధల్‌.

### [3.3.58](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.58)

క. సగరసుతు లట్లు జగముల | కొగి బాధలు సేయుచున్న నోడి మరుత్ప  
న్నగవరు లరిగిరి నాలుగు | మొగములు గల వేల్పుకడకు మునిసంఘముతోన్‌.

### [3.3.59](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.59)

ఆ. వారిజాసనుండు వారల వచ్చిన | విధ మెఱింగి ‘మీకు వెఱవ నేల?  
సగరసుతులు దగ్ధు లగుదురు; దర్పితు | లైనవారి పేర్మి యధ్రువంబు.’

### [3.3.60](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.60)

వ. అని కమలసంభవుం డానతిచ్చిన నరిగి యమరవరు లాదిగా నఖిలలోకనివాసు లెల్ల సగరుసుత పరిక్షయం బపేక్షించి యుండునంత.

### [3.3.61](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.61)

సీ. అశ్వమేధంబు సేయంగ దీక్షితుఁ డయ్యె | సగరుండు; వాని యశ్వంబు సగర  
తనయులచే రక్షితంబై వసుంధర | యెల్లఁ గ్రుమ్మరి తోయహీన మైన  
జలధిలోపల నదృశ్యం బైనఁ గానక | సగరున కెఱిఁగించి, సగరసుతులు  
జనకు శాసనమునఁ జని భూతలమునందుఁ | దడయక రోసి పాతాళతలము  
ఆ. నందు రోయఁ గడఁగి యఱువదివేవురు | నొక్క మొగిన గ్రొచ్చి రుదధిలోన  
జలధిపంకమగ్న సత్త్వముల్‌ నిశితకు | ద్దాలహతి విదారితములు గాఁగ.

### [3.3.62](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.62)

వ. ఇట్లు గ్రొచ్చి గ్రొచ్చి సగరసుతులు సముద్రపూర్వోత్తరదేశంబునం గపిలుం డను మహాముని యాశ్రమ సమీపంబునందుఁ దమగుఱ్ఱంబుఁ గని సంతోసిల్లి.

### [3.3.63](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.63)

ఆ. అశ్వమేధమునకు నర్చితంబైన యీ | యశ్వరాజు నిట్టు లపహరించి  
మ్రుచ్చు గొఱక యీ సముద్రదేశంబున | నోట మెడఁద లేక యున్నవాఁడు.

### [3.3.97](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.97)

మధ్యాక్కర. ‘ఎందుండి వచ్చితి ఋషికుమార! యే నెన్నఁడు నిట్టి  
సుందరాకారు మునిసుతు నేఁ దొల్లి చూచి యెఱుంగ  
నిందుండు మీ’ వని కృష్ణమృగచర్మకృతకుశాసనము  
నం దుండఁగాఁ బనిచె ఋషి యను బుద్ధి నత్తన్విఁ బ్రీతి.

### [3.3.98](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.98)

వ. మఱియు నర్ఘ్యపాద్యాదివిధులను వన్యస్వాదుఫలదానంబులం దాని కతిథిపూజ సేయ నున్న నది యమ్ముని వరున కిట్లనియె.

### [3.3.99](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.99)

క. ‘మా యాశ్రమ మిందులకున్‌ | న్యాయనిధీ! మూఁడుయోజనంబులు గల దేఁ  
బోయెద; నీవును విజయం | చేయుమ యందులకుఁ; జెలిమి సేయుము నాతోన్‌.

### [3.3.100](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.100)

వ. అట్లేని నీచేత సత్కారంబుఁగొందు’ ననిన ఋశ్యశృంగుం ‘డట్లు సేయుదు’ నని దాని నాతిథ్య విధానంబునం బూజించి తనకు దాని యిచ్చిన దివ్యగంధమాల్యంబులును సరసభక్ష ప్యానంబులును, విచిత్రవస్త్రంబులుం బరిగ్రహించిన నదియును.

### [3.3.101](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.101)

క. మునిముందటఁ గందుకన | ర్తన మృదుగీతములయందుఁ దనకౌశల మె  
ల్లను జూపి విరచితాలిం | గనయై మునిపతికి ముదము గావించె మదిన్‌.

### [3.3.102](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.102)

వ. ఇట్లు ఋశ్యశృంగుం బ్రబోధించి వేశ్యాపుత్త్రి యరిగిన, దాని పోయినవలను సూచుచు ఋశ్యశృంగుఁ డగ్ని హోత్రంబు వేల్వమఱచి విపరీతబుద్ధియై యున్ననంత నడవినుండి వన్యఫలంబులు గొనివచ్చివిభాండకుండు గొడుకుం జూచి ‘యి ట్లేల చింతాపరుండవై యగ్నిహోత్రంబు వేల్వక కాలాతిక్రమంబు సేసి?’ తనినఁ దండ్రికి ఋశ్యశృంగుం డిట్లనియె.

### [3.3.103](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.103)

సీ. ‘కాంచనవర్ణుండు గడు రూపవంతుండు | గమ్మని జడలతో ఘనము లగుచు  
ననయంబు వట్రువలగు రెండు పిండంబు | లురమున విలసిల్లుచుండ, నఱుత  
వెలుఁగుచు జపమాల వ్రేలంగ, నన్నువ | నడుమును వడఁకంగ, నడచునపుడు  
కలహంసకూజితకలనాద మెసఁగ నా | పాలికి నేఁ డొక్క బ్రహ్మచారి  
ఆ. వచ్చిపోయె; వానివదనంబువలన వె | ల్వడు సుగంధిమధురభాషితంబు  
పొలుచు వినఁగ సమదపుంస్కోకిలాలాప | చారు వగుచు హృదయ సమ్మదముగ.

### [3.3.104](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.104)

క. ఆ ఋషికుమారు కట్టిన | చీరలు నతిమృదులములు విచిత్రములు; మనో  
హారము వాని బృహత్కటి | భారము; నం దొక్క కనకపట్టము వెలుఁగున్‌.

### [3.3.105](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.105)

క. పవనసమీరిత మధుసం | భవ వివిధప్రసవసౌరభముఁ బోలి ముని  
ప్రవరుని తనువునయం దు | ద్భవమై రమ్యమయి సౌరభము విలసిల్లున్‌.

### [3.3.106](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.106)

వ. మఱియు నక్కుమారుం డొక్క యెఱ్ఱనిఫలంబు దన దక్షిణపాణితలంబున నందంద చఱచుచు నది నేలంబడి యెగయం బోయిన వలనికి వ్రాలుచు వాతావధూతంబైన బాలవృక్షంబునుం బోలె నొప్పుచున్న నమ్మునిపుత్త్రు నందు నా హృదయంబు దద్దయుం దగిలినయది.

### [3.3.107](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.107)

ఉ. నన్నును గౌఁగిలించుకొని నా వదనంబునకున్‌ నిజాస్య మా  
సన్నముఁ జేసి యొక్క మృదుశబ్దము సేసె మనోహరంబుగా;  
నెన్నఁడు నట్టి శబ్దము మునీశ్వర! మున్‌ విని యే నెఱుంగ; న  
య్యన్నువ బ్రహ్మచారిముఖ మంబురుహంబు సమంబు సూడఁగన్‌.

### [3.3.108](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.108)

వ. నా యిచ్చిన వన్యస్వాదుఫలంబు లాదరించి యారగింప కమ్మునికుమారుం డమృతోపమానంబు లైన ఫలంబులు నతిమధురంబులైన పానీయంబులు నాకు నిచ్చిన నుపయోగించితి.

### [3.3.109](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.109)

క. తన చేతి పుష్పములఁ జ | ల్లిన నంతటఁ జెదరి యవి యళిప్రకరనిషే  
వన మొప్ప నున్నయవి; యి | వ్వనకుసుమము లట్లు గావు వరగంధంబుల్‌.

### [3.3.110](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.110)

వ. నాకు నమ్మునిపుత్త్రునాశ్రమంబునందు వానితో నొక్కటఁ దపంబు సేయుచుండు నిష్టం’ బనినఁ గొడుకు పలుకులు విని విభాండకుండు విస్మితుండై ‘తపస్వుల తపంబులకు విఘ్నంబులు సేయ ననేక రూపులయి రాక్షసులు వనంబునం గ్రుమ్మరుచుండుదురు; తజ్జనదత్తంబు లయిన పానీయంబు లపేయంబు; లతి సుగంధులయిన కుసుమంబులు మునులకు వర్జనీయంబు’ లని కొడుకుం బ్రబోధించి, యెప్పటియట్ల వన్యఫలంబులు దేర నరిగిన.

### [3.3.111](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.111)

క. చనుదెంచి తరుణి మునినం | దను చిత్తంబునకు వైకృతముఁ జేసె; విలా  
సినుల సహాలాప సహా | సన సహయానములు బంధసమములు గావే!

### [3.3.112](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.112)

వ. ఇట్లు ఋశ్యశృంగుండు విలాసినీమోహితుండయి, తండ్రి కెఱింగింపక సుచరిత్రంబయిన తన యాశ్రమంబు విడిచి, మనుష్యయోగంబునం దగిలి యక్కోమలి పిఱుందన చని, యంగదేశంబు సొచ్చి, యందు రోమపాదు నాదేశంబున రాజాశ్రయం బను వనంబున నుండునంత.

### [3.3.113](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.113)

మత్తకోకిల. అమ్మునీశునివాసశక్తిఁ దదంగదేశమునందు మే  
ఘమ్ము లెల్ల వలంకులం గడుఁ గ్రమ్మి సర్వజనప్రమో  
దమ్ముగాఁ బ్రభవద్బృహజ్జలధార లొప్పఁగ వృష్టిఁ జే  
సె మ్మహానదులున్‌ మహాసరసీవరంబులు నిండఁగన్‌.

### [3.3.114](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.114)

వ. ఇట్లు ఋశ్యశృంగు నాగతంబున నంగవిషయంబున నవగ్రహదోషంబు నిరస్తంబైన సంతసిల్లి రోమపాదుండు తన కూఁతు శాంత యనుదాని నత్యంతకాంతిమతి నమ్మునివరునకు వివాహంబు సేసి.

### [3.3.115](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.115)

క. అనుభోగయోగ్యములుగా | ధనరాసులు భూషణములు దాసీనివహం  
బును గాంచనమయ శయ్యా | సనములు ముని కిచ్చె హృదయసంతోషముగాన్‌.

### [3.3.174](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.174)

క. ‘ఇక్కొలని సమీపంబునఁ | బెక్కగు వేలేండ్లు తపము భృగుసుతుఁడు గరం  
బక్కజముగ నొనరించెను | వెక్కస నియమమున నిరతవీరాసనుఁడై.

### [3.3.175](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.175)

క. అమ్మునిదేహము వల్మీ | కమ్మునఁ గప్పంగఁబడి నికటవల్లీ గు  
ల్మమ్ములు పైఁ బ్రాఁకిన నన | యమ్మును నేర్పడక యుండె నవ్వనభూమిన్‌.

### [3.3.176](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.176)

వ. అంతం బెద్దకాలంబునకు శర్యాతి యనురాజు దన చతుస్సహస్ర దేవీనివహంబుతోడఁ దత్సరోవరంబున విహరింప నరిగిన నాతని కూఁతురు సుకన్య యనునది యిష్టసఖులతోఁ గ్రుమ్మరుచున్న నవ్వల్మీకంబునందు.

### [3.3.177](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.177)

క. విద్యుల్లతాంగి భార్గవు | నుద్యన్నయనములు మెఱచుచున్నను విలసత్‌  
ఖద్యోతద్యుతులొకొ యని | సద్యస్సంజాతబుద్ధి సంభ్రమ యగుచున్‌.

### [3.3.178](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.178)

వ. అప్పు డప్పుట్ట గ్రొప్పించిన నలిగి నిమీలితనయనుండై చ్యవనుండు శర్యాతిసైన్యంబుల కెల్ల మూత్రపురీష నిరోధంబుఁ జేసిన, నది దనసైన్యాపరాధంబున నయ్యెఁగా వగచి, వాఁ డెల్లవారి నడిగి తత్కారణం బెఱుంగ నేరక చింతాపరుండై యున్నఁ, దండ్రికడకు వచ్చి సుకన్య యిట్లనియె.

### [3.3.179](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.179)

తే. ‘మిన్న మిడుఁగుఱు లట్టులై మెఱసి రెండు | మెఱుఁగు లొక పుట్టలో నున్న నెఱుఁగ కేను  
బుట్ట గ్రొప్పించి యారెంటి పొడవుఁ గాన | కుడిగి వచ్చితి విస్మయపడి మనమున.

### [3.3.180](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.180)

వ. ఈ సైన్య నిరోధంబున కిది నిమిత్తంబగునో?’ యనిన, శర్యాతి యప్పు డా పుట్టయొద్దకు వచ్చి, యందుఁ దపః క్లేశంబునఁ గృశత్వగస్థీభూతశరీరు నతివృద్ధు భార్గవుం గని నమస్కరించి యిట్లనియె.

### [3.3.181](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.181)

క. ‘అమితంబగు మీ తపము మ | హిమ యెఱుఁగక యిట్లు చేసె నిది; దీని సహిం  
పుము; దయ మత్సైన్యనిరో | ధము వాపుమ; యెఱుక గలరె తరుణులు ధరణిన్‌.’

### [3.3.182](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.182)

వ. అనిన భార్గవుండు కరుణించి ‘యతిశయ రూపయౌవన గర్వితయైన యాకన్యకం బరిగ్రహించి కాని సహింప’ ననిన శర్యాతి తన కూఁతు నమ్మునివరున కిచ్చి నిజసైన్యనిరోధంబుఁ బాచిగొని చనిన.

### [3.3.183](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.183)

ఆ. పతికిఁ బరమభక్తిఁ బరిచర్య సేయుచు | నొనరఁగా సుకన్య యుండునంత  
నా లతాంగికడకు నాశ్విను లేతెంచి | త మ్మెఱుంగఁ జెప్పి దాని కనిరి.

### [3.3.184](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.184)

వ. ‘అవ్వా! నీ వెవ్వని కూఁతుర? వెవ్వని భార్య?’ వని యడిగిన ‘నేను శర్యాతికూఁతుర; భార్గవుం డయిన చ్యవనుని భార్య’నని చెప్పిన విని వారలు నగి ‘యక్కటా! యిట్టి రూపవిభవంబులు వడసి కామభోగబాహ్యుఁ డయిన వృద్ధు భార్గవుని వరియించి నీ జవ్వనం బెల్ల వృథచేసి; తింకనైనను నీవయోరూపంబులకుం దగిన వరు వరియింపు; మేము వానిఁ దెచ్చెద’ మనిన నప్పలుకులు సహింపక సుకన్య యాశ్వినుల కిట్లనియె.

### [3.3.185](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.185)

ఆ. ‘చ్యవనునందు నాకు సంతతప్రీతియై | యుండ నిట్లు పలుకు టుచిత మగునె?’  
యని నిజేశ్వరునకు నప్పుడ వారల | పలుకు లెఱుఁగఁ జెప్పెఁ బంకజాక్షి.

### [3.3.186](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.186)

వ. చ్యవనుండు దాని పతివ్రతాత్వంబునకు సంతోసిల్లి ‘వారల పలుకుల కొడంబడు’ మని పంచిన నది పతి చేత ననుజ్ఞాతయై చని’ నాకు నవయౌవనవరుం గావింపుం’ డనిన నాశ్విను లప్పుడక్కొలను సొచ్చిరి; భార్గవుండును వారితోడ సరఃప్రవేశంబు సేసె; నిట్లమ్మువ్వురు నవయౌవను లయి సుకన్యకడకు వచ్చి నిలిచి ‘మాయందు నీ వలచువానిని వరియింపు’ మనిన నది తనపతియైన భార్గవుని వరియించె; నంత నయ్యాశ్వినుల కతిప్రీతుండై చ్యవనుం డిట్లనియె.

### [3.3.208](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.208)

క. ‘సోమకుఁడను రాజర్షి మ | హా మఖ మొనరించి జంతుఁ డను నొక్క సుతున్‌  
భూమీశ! పడసె; నాతని | భామలు నూర్వురును గొడుకుఁ బరమప్రీతిన్‌.

### [3.3.209](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.209)

క. తమ తమ పుత్త్రుఁడ కాఁ జి | త్తములం జేకొని దయం బృథగ్భావము లే  
క ముదంబునఁ బెంచిరి లో | కమున జనుల్‌ చోద్యమందఁగాఁ గడువేడ్కన్‌.

### [3.3.210](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.210)

వ. ఒక్కనాఁ డబ్బాలకు కుఱువు చీమ గుట్టినఁ దద్వేదన సహింప నోపక యేడ్చుచున్నవాని కడకుఁ దల్లులందఱుఁ బఱతెంచి యేడ్చిన నయ్యాక్రందన ధ్వని విని సంభ్రమించి సోమకుం డంతఃపురంబునకుం జని కొడుకు నూరార్చి సభాస్థితుండై మంత్రులకు ఋత్విజులకు నిట్లనియె.

### [3.3.211](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.211)

ఆ. ‘కోరి యొక్క కొడుకుఁ గొడుకుగా నే నెట్లు | నమ్మియుండనేర్తు? నాకు సతులు  
శతము గలిగియుండ సంతాన మల్పమై | యునికి మీకుఁ జూడ నుచిత మగునె?’

### [3.3.212](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.212)

వ. అనిన వానికి ఋత్విజు లిట్లనిరి.

### [3.3.213](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.213)

తే. ‘ధరణినాథ! నీ భార్యాశతంబునందుఁ | బరఁగ నూర్వురుపుత్త్రులఁ బడయ నీకు  
నభిమతం బేనిఁ దగుఁ దగదనక నీవు | కడఁగి మా చేయఁబంచిన క్రతువు సేయు.

### [3.3.214](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.214)

వ. ఈ జంతుం బశువుగా వధించి తద్వపాహవ్యంబుల హవ్యవహుం దనిపిన, దాన నీ నూర్వురు భార్యలకు నూర్వురు కొడుకులు పుట్టుదు; రందగ్రజుండైన జంతుండు సౌవర్ణ లక్షణ లక్షిత సవ్యపార్శ్వుండై యుదయించు’ నని చెప్పి ఋత్విజులచేత సోమకుండు ననుజ్ఞాతుండై.

### [3.3.215](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.215)

క. తనయుఁ బశువఱిచి తద్వపఁ | గొని వేల్చినఁ జూచి యార్తకురరీనాదం  
బున నేడ్చిరి కడు నడలుగఁ | దనుమధ్యలు నూర్వురును సుతస్నేహమునన్‌.

### [3.3.216](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.216)

క. ఇమ్ముగఁ దద్ధూమాఘ్రా | ణమ్మున గర్భములు దాల్చి నాతులు నవమా  
సమ్ములు నిండుడుఁ గనిరి ము | దమ్మున జంతుప్రముఖసుతప్రకరమ్మున్‌.

### [3.3.217](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.217)

వ. అందు జంతునకు నందఱు నెప్పటియట్ల తల్లులు సమస్నేహలై యుండం బుత్త్రులు నూర్వురుం బెరిఁగి సమర్థులైయున్నఁ బెద్ద కాలంబునకు ఋత్విజుండు పరలోకగతుండై ఘోరనరకానలంబున నెరియుచు నుండె; నంత సోమకుండును దేహత్యాగంబు సేసి, యమరలోకంబున కరుగువాఁడు ముందట నరకానల పచ్యమానుండయ్యెడు ఋత్విజుం జూచి’ యి ట్లేల త్రీవ దుఃఖోపహతుండవైతి?’ వని యడిగిన వాఁ డిట్లనియె.

### [3.3.218](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.218)

ఆ. ‘అవనినాథ! నీకు నార్త్విజ్య మొనరించి | చూవె యిట్టి నరకపావకమునఁ  
బడినవాఁడ; నీకు బహుపుణ్య లోకముల్‌ | గలవు; నన్నుఁ గావవలయుఁ గరుణ.’

### [3.3.219](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.219)

వ. అనిన సోమకుండు ధర్మరాజు పాలికిం జని తచ్ఛాసనంబునం బుణ్యలోకంబులకుం బోవుచుండి యిట్లనియె.

### [3.3.220](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.220)

క. ‘నా కారణమున ఋత్విజుఁ | డేకాంతమ నరకగతికి నేఁగెను వానిం  
దోకొని పోయెద’ నని శుభ | లోకంబున కరిగెఁ ద్రిదశలోకస్తుతుఁడై.

### [3.3.221](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.221)

వ. ఇట్లు యజ్ఞపుత్త్రుం డైన సోమకుండు తన తపోయజ్ఞఫలంబున ఋత్విజు నరకవిముక్తుంజేసి పుణ్యలోక గతుండయ్యె ; నిందుఁ దొల్లి ప్రజాపతి సహస్ర వార్షికంబైన యిష్టాకృతంబను సత్త్రయాగంబుఁ జేసె; నాభాగుండైన యంబరీషుం డిందు యజ్ఞంబులం జేసి పరమసిద్ధికిం జనియె; నిది నహుషు యజ్ఞదేశం; బిందు దశపద్మ సంఖ్య ధనంబుల నాతండు సదస్యులం బూజించె; నిది సార్వభౌమ యజ్ఞస్థానం; బిది యయాతి యజ్ఞాయతనంబు; వాని సవనంబున కింద్రుండు వచ్చె; నిది రామహ్రదం, బిది నరనారాయణాశ్రమం, బిది ప్లక్షావతరణంబను యమునాతీర్థం; బిందు దేవతలును ఋషులును సారస్వత యాగంబుఁ జేసి; రిది దేవర్షియైన సంవర్తుచేత రక్షితం; బిందు భరతుం డనేక యాగంబులు సేసి సర్వలోకంబులుం జూచె; నీవు నిందుఁ గృతస్నానుండవై సర్వలోకంబులుం జూడు’ మనిన ననుజసహితుండై ధర్మతనయుం డత్తీర్థంబున స్నానంబుఁ జేసి రోమశున కిట్లనియె.

### [3.3.222](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.222)

శా. ‘దేవర్షిద్యుచరాహిలోకములు నాదిత్యాశ్వినీలోకముల్‌  
దేవాధీశ్వరుఁ జూచితిన్‌; మఱియు నద్దేవేంద్రునొద్దన్‌ సగాం  
డీవోద్దామమహాభుజార్గళుఁ గిరీటిన్‌ సవ్యసాచిన్‌ జయ  
శ్రీవిభ్రాజితుఁ బార్థుఁ జూచితి జగత్సేవ్యా! మునీంద్రోత్తమా!’

### [3.3.223](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.223)

వ. అనిన రోమశుండు వెండియు ధర్మరాజున కిట్లనియె.

### [3.3.224](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.224)

క. ‘ఇది దక్షుమఖస్థానం; | బిదియు సరస్వతి యనంగ నిలఁ బరఁగు మహా  
నది; యిందుఁ ద్రిదశతతితోఁ | ద్రిదశజ్యేష్ఠుండు సేసెఁ దివిరి మఖంబుల్‌.

### [3.3.225](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.225)

వ. ఇది పంచయోజన ప్రమాణంబైన ప్రజాపతియజ్ఞవేది; ఇందు దేహత్యాగంబు సేసి మర్త్యు లమర్త్యత్వంబుం బొందుదురు; తొల్లి సరస్వతి నిషధదేశంబున భూమి సొచ్చి యిచ్చమసోద్భేదంబునందుఁ గానంబడియె; నిది సింధుతీర్థం; బిందు లోపాముద్ర నగస్త్యుండు ప్రతిగ్రహించె.

### [3.3.226](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.226)

తే. ఇదియు విష్ణుపదంబు; దా నిది విపాశ; | యిదియుఁ గాశ్మీరమండలం; బిది వితస్త;  
మిదియు మానసద్వార; మిం దిందువంశ! | పరశురాముండు మును హంసపథముఁ జేసె.

### [3.3.227](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.227)

వ. ఇక్కొలనం జైత్రమాసంబునందు మహామునులచేతం బూజితుండై యుమాసహితుం డీశ్వరుండు వారికిం బ్రత్యక్షంబగుటయు నరుంధతీ సహితుండై వసిష్ఠుం డిందుల వసియించె; నిది భృగుతుంగం బను పర్వతం; బిందు నుశీనరపతి శిబియను వాఁడు దొల్లి యజ్ఞంబు సేయుచున్న నింద్రాగ్నులు వాని మహాగుణంబు లెఱుంగవేఁడి యింద్రుండు శ్యేనం బైన, నగ్ని కపోతంబై శ్యేనభయంబునఁ బఱతెంచి శిబిమఱువు సొచ్చిన దాని నెగిచికొని వచ్చి శ్యేనంబు శిబి కిట్లనియె.

### [3.3.228](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.228)

ఆ. ‘నిన్ను సత్యధర్మనిర్మలుఁగా విందు; | నట్టి నీకుఁ బాడియయ్య యిప్పు  
డతిబుభుక్షితుండనై యున్న నాకు నా | హారవిఘ్న మిట్టు లాచరింప?

### [3.3.229](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.229)

వ. సర్వభూతంబులు నాహారంబున జీవించి వర్ధిల్లు; నిది నాకు భక్ష్యంబు గానినాఁడు బుభుక్షావేదనం జేసి ప్రాణ వియోగం బగు; నట్లయిన నా పుత్త్రులు భార్యయు జీవింపనేర; రొక్కకపోతంబు రక్షించి పెక్కు జీవులకు హింస సేయుట ధర్మవిరోధంబు.

### [3.3.230](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.230)

క. ధర్మజ్ఞు లైన పురుషులు | ధర్మువునకు బాధ సేయు ధర్మువునైనన్‌  
ధర్మముగా మదిఁ దలఁపరు; | ధర్మువు సర్వంబునకు హితంబుగ వలయున్‌.

### [3.3.231](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.231)

వ. ఇక్కపోతంబు నాకు వేదవిహితంబైన యాహారంబు; ‘శ్యేనాః కపోతాన్‌ ఖాదయన్తి’ యను వేదవచనంబు గలదు గావున దీని నాకు నాహారంబుగా ని’ మ్మనిన దానికి శిబి యిట్లనియె.

### [3.3.232](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.232)

తే. ‘ప్రాణభయమున వచ్చి యిప్పక్షి నన్ను | నాశ్రయించె; నాశ్రితు నెట్టి యధముఁ డయిన  
విడువఁ డనినను నే నెట్లు విడుతు దీని? | నాశ్రితత్యాగ మిది ధర్ము వగునె? చెపుమ.

### [3.3.233](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.233)

వ. నీవు పక్షివయ్యును ధర్మ మెఱింగినట్లు పలికితి; శరణాగత పరిత్యాగంబుకంటె మిక్కిలి యధర్మం బొం డెద్ది? నీయాఁకలి దీననకాని యొంట నుపశమింపదే? నీయత్నం బాహారార్థంబేని యిప్పు డివ్వనంబున మృగ మహిషవరాహఖగ మాంసంబులు దీనికంటె మిక్కిలిగాఁ బెట్టెద; నిక్కపోతంబువలని యాగ్రహం బుడుగుము; దీని నే నెట్లును విడువ’ ననిన శ్యేనం బిట్లనియె.

### [3.3.234](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.234)

ఆ. ‘నాకు విహితభక్షణం బిది; యిప్పక్షిఁ | బూని కావ నీకు బుద్ధియేని  
యవనినాథ! దీనియంత నీ మాంసంబు | దూఁచి నాకుఁ బెట్టు తొలఁగ కిపుడ.’

### [3.3.235](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.235)

చ. అనిన ‘ననుగ్రహించితి మహావిహగోత్తమ!’ యంచు సంతసం  
బున శిబి తత్‌క్షణంబ యసిపుత్త్రిక నాత్మశరీరకర్తనం  
బనఘుఁడు సేసిచేసి తన యంగమునం గల మాంసమెల్లఁ బె  
ట్టినను గపోతభాగమ కడిందిగ డిందుచు నుండె నత్తులన్‌.

### [3.3.236](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.236)

క. దానికి నచ్చెరువడి ధర | ణీనాథుఁడు తనువునందు నెత్తురు దొరుఁగం  
దాన తుల యెక్కె; నంతన్‌ | వాని గుణోన్నతికి మెచ్చి వాసవదహనుల్‌.

### [3.3.237](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.237)

వ. శ్యేనకపోత రూపంబులు విడిచి నిజరూపంబులఁ జూపి ‘నీ ధైర్య శౌర్యాది గుణంబు లనన్యసాధారణంబులు గావున నీకీర్తి నిత్యంబై శబ్ద బ్రహ్మంబు గలయంత కాలంబును వర్తిల్లుచు నుండెడు’ మని శిబికి వరం బిచ్చి యింద్రాగ్నులు చని; రిది యమ్మహాపురుషు పుణ్యస్థానంబు; మఱియు ననవరత ఫలవృక్షంబులు గల యిది యౌద్దాలకియైన శ్వేతకేతు తపోవనం; బిందు సరస్వతి మనుష్య స్త్రీరూపధారిణియై శ్వేతకేతుని సేవించె; మాతుల భాగినేయులైన యష్టావక్రశ్వేతకేతు లిందు యుగ్రతపంబుఁజేసి’ రనిన ‘నం దష్టావక్రు మాహాత్మ్యంబు విన వలతు’ నని యడిగిన, యుధిష్ఠిరునకు రోమశుం డిట్లనియెఁ; ‘దొల్లి యేకపాదుం డనుమునివరుండు తనవిద్యావిభవంబున సుజాత యను దాని వివాహంబై వనంబున ఘోరతపంబు చేయుచు ననవరతంబును శిష్యుల వేదంబులు చదివించుచున్నఁ బెద్దకాలంబునకు సుజాత గర్భిణియైనఁ దద్గర్భంబున నున్న యర్భకుం డొక్కనాఁడు తండ్రి కిట్లనియె.

### [3.3.238](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.238)

క. ‘ఎడఁబడక యహోరాత్రులు | వడిఁగొని చదివింప నిట్లు వలయునె శిష్యుల్‌  
గడు నిద్రలేమి నెంతయు | జడమతులై చదువు దప్పఁ జదువుచు నుండన్‌.’

### [3.3.239](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.239)

వ. అని యుపాలంభించి పలికిన నలిగి యేకపాదుండు ‘నీ వధ్యయనంబునకు వక్రంబుగాఁ బలికితివి గావున నెనిమిదివంకలు గల శరీరంబుతో జన్మింపు’ మని కొడుకునకు శాపం బిచ్చిన.

### [3.3.240](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.240)

ఆ. అగ్నికల్పుఁడై మహాత్ముఁడు కడుపునఁ | బెరుఁగుచుండె; నంత సరసిజాక్షి  
ప్రసవకాల మైనఁ బతి కొక్కనాఁ డిట్టు | లనియెఁ బ్రసవభారమునకు వెఱచి.

### [3.3.241](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.241)

క. ‘ధరణిఁ గడుఁ బేదవారును | బురిటికి ఘృత తైల ధాన్యములఁ జెచ్చెర ముం  
దర సంగ్రహింతు; రవి మన | కరయఁగ నతిదుర్లభంబు లర్థము లేమిన్‌.

### [3.3.242](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.242)

వ. ఏమి ‘సేయుదు? నెవ్విధంబున నీప్రసవక్లేశంబువలనఁ బాయుదు?’ ననిన నేకపాదుండు ధనార్థియయి జనకరాజుపాలికిం జని వాని యజ్ఞంబునందు వరుణపుత్త్రుండైన వందితో వివాదంబు సేసి యోటువడి జలమగ్నుండై యున్న, నిట సుజాత ప్రసూతియై యష్టావక్రుం గనియెఁ; దత్కాలంబున నుద్దాలకుభార్య శ్వేతకేతుం గనియె; నిట్లు మాతులభాగినేయు లిద్దఱు సవయస్కులై పెరిఁగి పండ్రెండేండ్లొక్కట నుద్దాలకుతోఁ జదివి యధ్యయనశూరులై రందు.

### [3.3.243](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.243)

తే. తండ్రి యనుచు నుద్దాలకుఁ దనకుఁ, గరము | ప్రీతితో శ్వేతకేతుని భ్రాత యనుచు  
ననఘచరితుఁ డష్టావక్రుఁ డనుదినంబు | నొం డెఱుంగక సుఖలీల నుండు నంత.

### [3.3.244](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.244)

వ. ఒక్కనాఁ డుద్దాలకు కుఱు వెక్కియున్న యష్టావక్రుం జూచి శ్వేతకేతుండు సహింపక ‘నీ వేల మాయయ్య కుఱువెక్కి యుండె? దీవు వోయి మీయయ్య కుఱు వెక్కు’ మని చేయిపట్టి యీడ్చిన, నేడ్చుచుం దల్లికడకుం జని యష్టావక్రుం డిట్లనియె.

### [3.3.245](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.245)

క. ‘మా యయ్య యెవ్వ? రెక్కడఁ | బోయిరి? సెప్పు’ మని తెల్లముగ నడిగి తప  
శ్శ్రీయుతుఁడు తండ్రికడకుం | బోయెం దన మామ నెయ్యమునఁ దోడ్కొనుచున్‌.

### [3.3.246](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.246)

వ. ఇ ట్లష్టావక్రుండు దానును శ్వేతకేతుండును జనకరాజు యజ్ఞంబునకుం జని యందు దౌవారిక నివారితులై ‘మూకాంధ బధిర పంగు స్త్రీ బ్రాహ్మణ సుప్రవేశం బగుచున్న యీ రాజద్వారంబున మమ్ము విద్వాంసుల బ్రాహ్మణుల నేల వారించెద?’ రనిన దౌవారికుం డిట్లనియె.

### [3.3.247](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.247)

క. ‘అలఘులగు వృద్ధవిద్వాం | సులకు మహాయాజ్ఞికులకుఁ జొర నర్హంబై  
విలసిల్లు యజ్ఞసభ సొర | వలవదు చనుఁ; డీరు చిఱుతవారల’ రనినన్‌.

### [3.3.248](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.248)

క. ‘అలయక యేండ్లు గడుం బె | క్కులు జీవించుట నర గలుగుటయుం దగు వృ  
ద్ధుల లక్షణమే? జ్ఞానము | గలఁ డేనిన్‌ బాలుఁ డయినఁ గడు వృద్ధు మహిన్‌.

### [3.3.249](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.249)

వ. కృతాధ్యయనశీలుండై యాచారపరుండైన వాఁడు బాలుండయ్యును సర్వజన సంభావనీయుండగు; బాలురని మమ్ము నవమానింప వలవ; దేము జనకరాజ సదనంబున దర్పితులైన వేదవాదులతో వాదంబు సేయ సమకట్టి వచ్చినవార’ మనిన దౌవారికుండు వారి నప్పుడు రాజానుమతుండై లబ్ధప్రవేశులం జేసె; నంత.

### [3.3.250](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.250)

సీ. జనకభూపాలుని సంప్రశ్నముల కెల్ల | నేర్పడ నుత్తరం బిచ్చి వాని  
సభయందు భూసురసంఘమధ్యంబున | వరుణపుత్త్రుం డైన వందితోడ  
వాదంబు చేసి, గర్వంబున నాతని | నొడిచి, తద్విజితులై యొదిఁగియున్న  
ధరణీసురులఁ దన తండ్రితో నిగ్రహ | ముక్తులఁ జేసి సన్మునికుమారుఁ  
తే. డధికతేజుఁ డష్టావక్రుఁ డఖిలలోక | పూజితుం డైన జనకుచేఁ బూజ లంది  
యేకపాదుఁ దోడ్కొని పేర్మి నేఁగుదెంచె | బుధనుతుండు నిజాశ్రమంబునకు నొప్ప.’

### [3.3.251](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.251)

వ. అని చెప్పుచు నరిగి, ‘యిది సమంగ యను పుణ్యనది; యిందు భరతుండు రాజ్యాభిషిక్తుఁడయ్యెఁ; దొల్లి యింద్రుండు లక్ష్మీప్రాప్తుండై దీని జలోపస్పర్శనంబునఁ బాపవిముక్తుండయ్యె; నిది మైనాకకుక్షి; యిం దదితి పుత్త్రార్థినియై తపంబు సేసె; నిది ఋషిదైవతంబైన కనఖల నగం; బిది గంగానది; యిందు సనత్కుమారుండు సిద్ధింబొందె; నిది యుష్ణగంగ; యిందుఁ గృతస్నానులైనం గృతార్థు లగుదు; రిది రైభ్యాశ్రమం; బిది భరద్వాజాశ్రమం; బిందు భరద్వాజసుతుండు యవక్రీతుండు తపోవిద్యాగర్వంబున నపగతజీవుం డయ్యె; ననిన ‘నది యె?’ ట్లని ధర్మతనయుం డడిగిన రోమశుం డిట్లనియె.

### [3.3.252](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.252)

క. ‘అలఘులు రైభ్య భరద్వా | జులు తమలో సుహృదులై విశుద్ధ తపోని  
శ్చలితమతు లివ్వనంబున | నొలసి తపం బొప్పఁ జేయుచుండిరి నెమ్మిన్‌.

### [3.3.253](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.253)

వ. అందు రైభ్యుండు కృతాధ్యయన శూరులైన యర్థావసు పరావసులను తన యిద్దఱు పుత్త్రులతో విద్వత్పూజితుండై యున్నవానిం జూచి సహింపనోపక భరద్వాజసుతుఁడు యవక్రీతుండు తపోబలంబున నఖిల వేదశాస్త్రాగమంబులు పడయుదు నని సమిద్ధంబైన యగ్నియందు సంధార్యంబు సంధించుచు నుగ్రతపంబు సేయుచున్న, దాని సహింపనోపక యింద్రుండు వానియొద్దకు వచ్చి ‘నీ వేమి యుద్దేశించి యుగ్రతపంబు చేసెద?’ వనిన శక్రునకు యవక్రీతుం డిట్లనియె.

### [3.3.254](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.254)

ఆ. ‘చదువకయును నాకు సర్వవేదంబులు | సర్వశాస్త్రములును సంభవిల్ల  
వలయు నని తలంచి వదలక నిష్ఠతో | నుగ్రతపముఁ జేయుచున్నవాఁడ.’

### [3.3.255](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.255)

వ. అనిన వాని కింద్రుం డిట్లనియె.

### [3.3.256](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.256)

క. ‘గురుముఖమునఁ బడయక దు | ష్కరతపమునఁ జేసి పడయఁగాఁబడు విద్యల్‌  
పరమార్థము మదమును మ | త్సరమును గావించు నెట్టిసాధుల కైనన్‌.

### [3.3.257](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.257)

వ. ‘ఇది విద్యోపార్జనంబున కుపాయంబు గా’ దని వారించి వాసవుఁ డరిగిన, నుడుగక యవక్రీతుం డెప్పటియట్ల తపంబుఁ జేయుచున్నఁ దదీయ తపస్తప్తమానసుండై వృద్ధశ్రవుండు వృద్ధవిప్రరూపంబు ధరించి యశక్తుండై శోషించిన శరీరంబుతోడ సికతాముష్టి పరంపర నపారగంభీరగంగాప్రవాహంబునందు సేతుబంధంబు చేయుచున్న నవ్విప్రుం జూచి యవక్రీతుండు నగుచు నిట్లనియె.

### [3.3.258](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.258)

క. ‘శతవర్షవృద్ధుఁడవు నీ | వతికృశుఁడ వశక్యమైన యర్థమునం దా  
స్థత యేల సేసి కడు దు | ర్మతి వై? తిం కెన్నఁ డిది సమాప్తిం బొందున్‌?’

### [3.3.259](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.259)

వ. అనిన నింద్రుండు వానిం జూచి ‘యేను నీయట్ల యఘటమానంబైన యర్థంబునందు యత్నంబుఁ జేసెద’ నని నిజరూపంబుఁ జూపి ‘యిట్లు నిరర్థకప్రయాసం బేల చేసె? దుడుగు ‘మనిన ‘నే నెట్లు నుడుగ; నాయభిమతంబు సఫలంబు సేయవలయు’ నన యవక్రీతుండు శక్రువలనం దనయభిమతంబు వడసి, తత్ప్రకారంబుఁ దండ్రికిం జెప్పిన విని భరద్వాజుఁడు కొడుకుగర్వంబు సహింపక దేవగీతలైన గాథల యర్థంబు వానికి నిట్లని చెప్పె.

### [3.3.260](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.260)

సీ. ‘బాలధి యను మునిప్రవరుండు పుత్త్రశో | కాపన్నుఁడై ఘోరమగు తపంబుఁ  
జేసి వేల్పులదయఁ జిరజీవిగాఁ బుత్త్రుఁ | బడసె మేధావి నాఁ బరఁగువాని  
వాఁడు నాయుష్యగర్వమున మునీంద్రుల | నెవ్వరి మెచ్చక యేఁగి యొక్క  
ధనుషాక్షుఁ డను తపోధనునొద్ద గర్వించి | పలికిన నలిగి తపస్వి వాని  
ఆ. నంత కాంతికమున కరుగంగఁ జేసె; గ | ర్వంబు చెట్ట; యెట్టివారి నైనఁ  
గ్రాఁచుఁ దత్‌క్షణంబు గర్వంబు; గర్వంబు | నొడిచియున్నవాఁడ యుత్తముండు.

### [3.3.261](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.261)

వ. కావున నీవు గర్వంబు విడిచి యకోపనుండవై పరమశాంతు లైన రైభ్యుకొడుకులతోడ నిర్మత్సరుండవయి యుండు’ మనిన ‘నట్లసేయుదు; నాకు రైభ్యుండు భవత్సమానుండ’ యని యవక్రీతుండు తన విద్యావిభవంబు మునిసభల విస్తరించుచు నొక్కనాఁడు రైభ్యాశ్రమంబునకుం జని, యందు.

### [3.3.262](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.262)

ఉ. కోమల కీర షట్చరణ కోకిలనాద మనోహరంబు ను  
ద్దామ వసంత పుష్ప భరిత క్షితిజ ప్రకరంబు నైన యా  
రామమునందుఁ జూచె మునిరాజకుమారుఁడు రైభ్యుకోడలిం  
దామరసాక్షిఁ గృష్ణ యనుదానిఁ బరావసుభార్యఁ బ్రీతితోన్‌.

### [3.3.263](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.263)

ఆ. దానిఁ జూచి మదనతప్తుఁడై తన యభి | ప్రాయ మెఱుఁగఁ జెప్పెఁ బంకజాక్షి;  
కదియు శాపభీతి నప్పటి కొడఁబడి | నట్లు పలికి పెలుచ నరుగుదెంచి.

### [3.3.264](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.264)

క. తమ మామకుఁ దద్వృత్తాం | తము నంతను దెలియఁ జెప్పి తరుణి విలోలా  
క్షములందు బాష్పసలిలో | ద్గమముగఁ దల వాంచి యుండెఁ గడుఁగోపమునన్‌.

### [3.3.265](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.265)

వ. రైభ్యుండు నయ్యవక్రీతున కలిగి నిజకోపానల శిఖాయమానైక జటావలంబనకరుండై హుతాశనునందు వేల్చి, యయ్యగ్నికుండంబునందు.

### [3.3.266](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.266)

క. లలితాంగిఁ బడసెఁ దనకో | డలిరూపముకంటెఁ గడు బెడంగగు రూపో  
జ్జ్వలకాంతి గలుగుదానిం | బొలఁతుక నొక్కర్తు నతితపోవీర్యమునన్‌.

### [3.3.267](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.267)

వ. మఱియు నొక్కజట యవలంబించి వేల్చిన నందు వికృత దంష్ట్రాకరాళంబైన ముఖంబుతో శూలహస్తుండైన యొక్కరాక్షసుండు పుట్టె; నయ్యిద్దఱు ముకుళితహస్తులై ‘మాకుం బని యేమి?’ యని యడిగిన ‘నవినీతుండైన యవక్రీతు వధియింపుం’ డని పంచిన.

### [3.3.268](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.268)

క. ఆ తరుణి మున్న చని మద | నాతురుఁడై వికృతచిత్తుఁడై యున్న యవ  
క్రీతు కరకమండలువుం | బ్రీతిఁ బ్రబోధించి కొనియె బెడఁగుగ నంతన్‌.

### [3.3.269](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.269)

క. అపహృత కమండలుండై | యపవిత్రుం డగుటఁ జేసి యధికతపోవీ  
ర్య పరిక్షయ మగుడును నా | తపస్విసుతు రాక్షసుండు దడయక తాఁకెన్‌.

### [3.3.270](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.270)

వ. వానికి వెఱచి పఱచి యవక్రీతుండు మహానదులు గొలంకులు సొచ్చిన నవి శుష్కంబులైనఁ దన జనకు నగ్నిహోత్రంబుఁ జొచ్చునంత.

### [3.3.271](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.271)

ఆ. మునికుమారు నెగిచికొని వచ్చి నిశితశూ | లాయుధమునఁ బొడిచి యాసురమున  
రక్కసుండు చంపి, యక్కాంతయును దాను | నరిగె రైభ్యుకడకు నాక్షణంబ.

### [3.3.272](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.272)

వ. రైభ్యుండును వానికి భార్యగాఁ గృత్తి నిచ్చె; నంత నిట భరద్వాజుండు వనంబుననుండి వచ్చి తన కెప్పుడుం బ్రత్యుత్థానంబు జేయునగ్ను లప్పు డడంగియున్న నచ్చెరువడి గృహపాలకుండైన శూద్రువలన నంత వృత్తాంతం బెఱింగి, నిహతుం డైన పుత్త్రుం జూచి దుఃఖితుండై.

### [3.3.273](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.273)

ఆ. ‘రైభ్యుఁ డధికకోపరతుఁ డంటి, నమ్ముని | యాశ్రమంబుదెసకు నరుగ వలవ  
దంటి; వినఁగ నొల్లవైతి నా పలుకులు; | గర్వితునకు బుద్ధి గాన నగునె?’

### [3.3.274](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.274)

వ. అని ప్రలాపించుచు భరద్వాజుండు వాని దహించి, పుత్త్రశోక దహనంబు సహింపనోపక తద్దహనంబున దేహ త్యాగంబుఁ జేసె; నంత బృహద్ద్యుమ్నుండను రాజు సత్త్రయాగంబు చేయుచుండి, రైభ్యు పుత్త్రుల నర్థావసుపరావసులం దనకు ఋత్విజులంగా వరియించిన నయ్యిరువురుఁదండ్రిచే ననుజ్ఞాతులై వానియజ్ఞంబు నడుపుచుండి, యొక్కనాఁడు పరావసుండు నిజాశ్రమంబునకు వచ్చువాఁడు వేగుఁబోక చీఁకటి నడవిలో నేకతంబ తనకు నెదురుగా వచ్చు రైభ్యు నెఱుంగక మృగంబకా వగచి నిజప్రాణ భయంబున వధియించి పదంపడి యెఱింగి పరమదుఃఖితుండై ప్రేతకార్యంబులు దీర్చి, బృహద్ద్యుమ్ను సత్త్రంబునకు వచ్చి తన చేసిన పితృఘాతం బగ్రజునకుం జెప్పి యిట్లనియె.

### [3.3.275](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.275)

తే. ‘నీవు దీని నొక్కరుఁడవు నిర్వహింప | నోప; వే నొక్కరుండ నయ్యును గడంగి  
నడప నోపుదుఁ గావున నాతదర్థ | మాచరింపుము బ్రహ్మహత్యావ్రతంబు.’

### [3.3.276](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.276)

వ. అనిన నర్థావసుం‘డట్లు సేయుదు’ నని బ్రహ్మహత్యావ్రతంబులు సలుపుచుండెఁ; బరావసుండును నొక్కరుండ సత్త్రయాగంబు జరుపుచుండె; నంత నర్థావసుండు బ్రహ్మహత్యాప్రాయశ్చిత్తంబులఁ జేసి యా సత్త్రయాగంబునకు వచ్చిన, వానిం జూచి పరావసుండు బృహద్యుమ్నున కిట్లనియె.

### [3.3.277](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.277)

క. ‘ఇమ్ముని నీ యజ్ఞాయత | నమ్ముఁ బ్రవేశింపఁదగఁడు నరనాయక! యు  
గ్రమ్ముగ సలిపెడు శుభకా | ర్యమ్ములకుం బాసి బ్రహ్మహత్యావ్రతముల్‌.’

### [3.3.278](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.278)

వ. అనవుడు, బృహద్ద్యుమ్న ప్రేరితులైన జనులచేత నుత్సార్యమాణుం డయి యర్థావసుం డనియెఁ ‘బరావసుండు గాని యేను బ్రహ్మఘాతకుండఁ గాను; వానికై వ్రతంబు సలిపి తత్పాతకవిముక్తుఁ జేసితి’ నని చెప్పిన యర్థావసు యథార్థకథనంబునకు మెచ్చి యగ్నిపురోగములైన దేవతలు వాని కిట్లనిరి.

### [3.3.279](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.279)

తే. ‘తమ్ముచేసిన దురితముల్‌ తలఁగఁ బూని | ధర్మబుద్ధివై వ్రతములు పేర్మిఁ జలిపి  
తనఘ! నీకు నభీష్టంబు లైన వరము | లడుగు మిచ్చెద; మీ మెచ్చు గడవ నగునె!’

### [3.3.280](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.280)

వ. అనినఁ దన తండ్రియు భరద్వాజుండును యవక్రీతుండు నెప్పటియట్ల జీవించియుండను, నిజజనకుండు పరావసుచేత నిహతుం డగుట నిస్తరింపను వలయు నని ప్రార్థించి, దేవతల వరంబున నర్థావసుండు రైభ్య భరద్వాజ యవక్రీతుల సంజీవితులం జేసిన నద్దేవతలకు యవక్రీతుం డిట్లనియె.

### [3.3.281](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.281)

తే. ‘ఏను బహువేదశాస్త్రమ్ము లెఱిఁగి, వ్రతము | లెల్లఁ జేయుచు రైభ్యుచే నిట్లు హతుఁడ  
నైతి; నాకంటె రైభ్యున కధికశక్తి | యైన తెఱఁ గెట్టు?’ లనిన నిట్లనిరి సురలు.

### [3.3.282](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.282)

క. ‘గురుశుశ్రూష యొనర్చుచుఁ | బరమక్లేశమునఁ జేసి పడసిన విద్యల్‌  
స్ఫురియించుఁగాక; గురుముఖ | విరహితముగఁ బడసినవియు వెలయునె యెందున్‌?

### [3.3.283](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.283)

వ. నీవు గురుముఖంబునం బడయక యొండు విధంబునం బడయుటం జేసి నీయధ్యయనశ్రుతంబులు నిర్వీర్యంబు లయ్యె; గురుసంతోషకరుండై రైభ్యుండు బ్రహ్మజ్ఞానం బుపార్జించెం గావున నాతం డిట్టి శక్తివడసె నని దేవతలు దివంబున కరిగి; రిది యవక్రీతు నివాసం; బిందు వసియించినవారు దురిత విముక్తులగుదు; రిది కాలశైలం; బిది సప్తవిధం బైన గంగ; యిది మనుష్యుల కగోచరం; బింద యుండి సమాధి శౌచపరులై చూడుం; డిది మందరనగం; బిందు నానాప్రహరణపాణులై యష్టాశీతిసహస్రగంధర్వులు కిన్నరకింపురుష సుపర్వులు సురేంద్రుం గొలిచి పోయెద; రిందుల కాఱునూఱుయోజనంబులు గలదు కైలాసపర్వతం; బందు గుబేరుం డుండు’ నని రోమశుండు సెప్పినం బాండవులు కృతసమాధిశీలురై వాని నెల్లం జూచి; రంత నంతక సుతుండు భీమున కిట్లనియె.

### [3.3.284](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.284)

సీ. ‘దుర్గమం బైన యీ దుర్గమార్గంబున | నడవంగ నేర; మున్నతరథముల  
నింద్రసేనాదుల నీ ధౌమ్యవిప్రుల | ద్రుపదతనూజను దోడికొనుచు  
సహదేవుఁడును నీవు చట్టనఁ గ్రమ్మఱుఁ; | డేనును నకులుండు నేఁగి రోమ  
శాదేశమునఁ జేసి యఖిలతీర్థంబులు | నాడి వచ్చెదము; మా యరుగుదెంచు  
ఆ. నంత కెంతయును బ్రయత్నంబుతోఁ గృష్ణఁ | గాచి యుండుఁ’ డనిన ఘనుఁడు భీముఁ  
డనియె ‘నిట్టి రాక్షసాకీర్ణవనములో | నిన్నుఁ బాయనగునె నిమిషమేని.

### [3.3.285](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.285)

చ. అనఘచరిత్రు నర్జును మహాభుజు నొక్కనిఁ బాసి వంతఁ బొం  
దిన యెడ నిట్టిచోట సహదేవుఁడు నేనును గృష్ణయున్‌ జగ  
జ్జననుత! నిన్నుఁ బాసిన నసహ్యతరం బగు తీవ్రతాపవే  
దన యగు; నీకు మాకు నుచితంబె పరస్పరభేద మెన్నఁడున్‌.

### [3.3.286](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.286)

క. కడు డస్సి నడవనోపని | యెడ నీ కమలాయతాక్షి నీ కవలను నేఁ  
దడయక నఱకట నిడికొని | కడఁకం గొనివత్తు విషమగహనాంతములన్‌.

### [3.3.287](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.287)

వ. ఈ రథంబులతోఁ బోవ నిమ్ము గాదేని వీని నింద్రసేనాదుల నెందేనిం బెట్టి పోద’ మనిన రోమశుం డిట్లనియె.

### [3.3.288](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.288)

క. ‘అతులతపోవీర్యబలో | న్నతిఁ బోదము గంధమాదనంబునకు; సమా  
గతు నందుఁ గాంతు మర్జును | నతివీరు నుదారు సురగణార్చితుఁ బార్థున్‌.’

### [3.3.289](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.289)

వ. అనిన నందఱు సంతసిల్లి యరుగువారు ముందర ననేకప హయరథసనాథంబై యపారకిరాతబల సంకులంబైన దానిఁ బుళిందాధిపతి యైన సుబాహుపురంబుఁ గని, యందు వానిచేతం బూజితులై తమ రథసూతహయనివహంబుల నింద్రసేనాదిభృత్యులను సుబాహునొద్దం బెట్టి, పాదచారులై పాంచాలిని బ్రాహ్మణులను రక్షించికొని గంధమాదనంబున కభిముఖులై యరిగి; రంత ధర్మతనయుండు భీమున కిట్లనియె.

### [3.3.290](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.290)

సీ. ‘అలిగి వజ్రాయుధునైనను బోరిలో | నోర్వంగ నోపు నత్యుగ్రవీరు.  
జవమునఁ బవనుఁ దేజంబున నాదిత్యుఁ | బోలినవాని, నంభోజనేత్రు,  
నాయతబాహుఁ, గృతా స్త్రు, సింహస్కంధు | సర్వధనుర్ధరాచార్యు, విజయు,  
నిత్యక్షమాన్వితు, నీ తమ్ము నర్జును | శుభగుణసుందరుఁ జూచునంత  
ఆ. కధికతాపతప్త మైనది నా చిత్త; | మొనర నతనితోడ నొక్కటునికి  
యెన్నఁ డొక్కొ మనకు! నిందఱ కగునాతఁ | డేల మసలెనొక్కొ యిన్ని యేండ్లు!’

### [3.3.291](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.291)

మ. అనుచుం బార్థవిలోకనంబు మదిలో నర్థింపఁగా ధర్మజుం  
డనవద్యుల్‌ గడువేడ్కతో నరిగి తా రప్పాండవుల్‌ గంధమా  
దనశైలేంద్రముఁ గాంచి రున్నతబృహద్ధాతుస్థలీసంహతిన్‌  
ఘనసంధ్యాగమశంక సన్మునులకుం గావించు దానిన్‌ మహిన్‌.

### [3.3.292](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.292)

క. నానావర్ణ శిలావిహ | గానేక మృగాభిరామమై భూనారీ  
నానాభరణవిభూషిత | పీనోన్నతకుచముఁ బోలె వెలిఁగెడు దానిన్‌.

### [3.3.293](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.293)

క. లలితాచ్ఛ స్ఫటిక శిలా | తలములపైఁ బాఱు విమలతర నిర్ఝరిణీ  
జలపూరములను తారో | ల్లల దురుహారాలి నుజ్జ్వలం బగు దానిన్‌.

### [3.3.294](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.294)

ఉ. వారలు గంధమాదన మవార్యబలాఢ్యులు సొచ్చుచో మహా  
మారుత మప్డు వీచె నహిమద్యుతిమార్గము దిఙ్ముఖంబులన్‌  
భూరుహపత్రమిశ్ర మయి భూరిపరాగము గప్పఁగా ధరి  
త్రీరుహశాఖలున్‌ విఱిగి త్రెళ్ళఁగ గుల్మలతాలి సాల్పడన్‌.

### [3.3.295](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.295)

చ. కడువడిగాడ్పుచే విఱుగఁగాఁ బడి త్రెళ్ళు మహీరుహాళి చ  
ప్పుడు విని యందఱుం జెదరి భూమిపయిన్‌ గగనం బుదగ్రతం  
బడియెనొ శైలశృంగములు భగ్నము లయ్యెనొ యంచు ధూళి నె  
క్కడఁ జననేర కొండొరులఁ గానక యుండిరి సంచలాత్ములై.

### [3.3.296](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.296)

వ. ఇట్లు మహారేణుపటలం బంధకారంబునుంబోలె నీరంధ్రంబై కప్పినఁ బతిత తరు విటప లతా గుల్మంబులు కరతలంబులం బాయం ద్రోచుచు విశాలదృఢతరుమూలంబు లాశ్రయించి యగ్నిహోత్రంబులతో ధౌమ్య ధర్మజ సహదేవు లొక్కచోట, నుద్యద్గదా కార్ముకుండైన భీమసేనుండును ద్రౌపదియు నొక్కచోట, రోమశుండును నకులుండును బ్రాహ్మణులు నొక్కచోటనుగా నందఱు వేఱు వేఱ యుండి రంత.

### [3.3.297](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.297)

చ. కురిసెఁ బ్రచండవృష్టి ఘనఘోషము లెల్ల కెలంకులన్‌ భయం  
కరములుగాఁ గరాళకరకాతతు లొప్పఁ దటిల్లతాళి వి  
స్ఫురితముగాఁ బ్రపూర్ణ జలపూరముల న్గిరికుంజభూరిని  
ర్ఝరతటినీతటీనికట సాలచయంబు విమూలితంబుగన్‌.

### [3.3.298](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.298)

వ. అట్లు గాడ్పుతోడి వాన పెద్దయుంబ్రొద్దు కురిసి యుడిగిన నందఱు నొక్కచోటికి వచ్చి యెప్పటియట్ల యరుగు నెడ, నతివిషమ శిలాసంకటపథంబున నడవనేరక ద్రౌపది తొడరిపడి మూర్ఛిత యైనం బవనతనయుం డక్కోమలి నెత్తికొని యజనాస్తరణంబుపయిం బెట్టి కదళీదళంబుల వీచుచున్నం గవలు దాని పల్లవతామ్ర పాదతలంబు లాయుధాభ్యాసవశంబునం గిణీభూతంబులయిన తమ కరతలంబులంజేసి మెత్తన యొత్తుచుండి; రట్టి యవసరంబున ద్రౌపదిం జూచి దుఃఖితుం డయి ధర్మతయుం డిట్లనియె.

### [3.3.299](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.299)

అక్కర. ‘అరుణ సరోరుహ రమ్య మృదులంబులైన యీ తన్వి  
చరణతలంబులు గొడిగరాలపైఁ జనుచున్కిఁ జేసి  
పరుసంబులై కడు నెఱ్ఱనైనవి పద్మాయతాక్షి  
పరఁగ నా కారణంబునను నీ దుఃఖభారంబు దాల్చె.

### [3.3.300](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.300)

సీ. సముచితంబగు మృదుశయన తలంబున | శయనించు నిత్తన్వి సదమలాంగి  
పరుసంపు ఱాలపైఁ బడి తీవ్రవేదనఁ | బొందినయది; మహాపురుషు లైన  
పాండవులకుఁ బ్రియభార్యయై నాపుత్త్రి | సుఖ ముండు నని మది సోమకుండు  
పాయక సంతోషపడి యుండుఁ గాకున్నె’ | యని విలాపించు నయ్యమతనూజు  
ఆ. నుచితవచనరచన నూరార్చి రప్పుడు | ధౌమ్యుఁదొట్టి సకలధరణిసురులు;  
మూర్ఛ దేఱె నంత ముదిత ద్రౌపది శీత | మందపవనసేవ్యమాన యగుచు.

### [3.3.301](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.301)

వ. దాని నాశ్వాసించి ధర్మరాజు భీమున కిట్లనియె.

### [3.3.302](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.302)

క. ‘ఈ రాజపుత్త్రిఁ దోడ్కొని | దారుణ పాషాణ దుష్పథంబులఁ జనఁగా  
నేర; మిది నడువ నోపదు | భూరిభుజా!’ యనిన ననిలపుత్త్రుం డంతన్‌.

### [3.3.303](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.303)

క. అగ్రజుననుమతమున న | త్యుగ్రనిశాచరసమేతు నుడుమార్గగు వీ  
రాగ్రణి ఘటోత్కచుం దన | యగ్రసుతుం దలఁచె ధీరు హైడింబు వెసన్‌.

### [3.3.304](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.304)

క. అతఁడును రాక్షససైన్యా | న్వితుఁడై తత్‌క్షణమ వచ్చి నిర్జరవరస  
మ్మితులకుఁ బ్రణమిల్లెం దన | పితృవరులకు బ్రాహ్మణులకుఁ బెద్దయు భక్తిన్‌.

### [3.3.305](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.305)

వ. ఇట్లు మ్రొక్కి పని యే మని ముకుళితహస్తుం డయి తన ముందర నున్న కొడుకుం గౌఁగిలించుకొని భీముండు వాని కిట్లనియె.

### [3.3.306](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.306)

తే. ‘అబల యిది, భవన్మాత, నిత్యాధ్వగమన | ఖిన్న యైనది గజరాజఖేలగమన;  
దీని నీ వెత్తికొని చనుదెమ్ము మాస | మీపమున’ నని సుతు నియమించె నపుడు.

### [3.3.307](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.307)

వ. వాఁడును బితృవచన చోదితుండై ‘యిమ్మార్గం బతిపరుష శిలావిషమంబు; పాదచారుల కగమ్యంబు గావున మిమ్మందఱ నెత్తికొని యశ్రమంబున నరిగెద’ నని ధౌమ్య పాండవ ద్రౌపదులం దా నెత్తుకొని, బ్రాహ్మణుల నెత్తికొనం దన రాక్షసబలంబులం బంచె; రోమశుండు సిద్ధగతి నరిగె; నిట్లందఱు గగనమార్గంబునం జని గంగాతీరంబున నరనారాయణాశ్రమంబైన బదరీవనంబుఁ గని, రాక్షసస్కంధావతీర్ణులై యందు.

### [3.3.308](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.308)

క. లలితమధుస్రవఫలములు | విలసిత మృదుపత్రతతులు వృత్తస్కంధం  
బులు నవిచలితచ్ఛాయలు | గల బదరీతరులఁ జూచి కడు విస్మితులై.

### [3.3.309](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.309)

వ. సురసిద్ధముని సేవితంబైన భాగీరథిం జూచి, యందుఁ గృతస్నాను లయి నియమవ్రతంబులు సలుపుచు సమాధియోగంబున మైనాకశైలంబును హిరణ్యశృంగంబును బిందుసరంబునుం జూచి, బదరీవనంబునం దాఱుదివసంబులు నివాసంబు సేసి యుండునంత; నొక్కనాఁడు.

### [3.3.310](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.310)

చ. అలఘులు గంధమాదన మహాధరణీధరసానురత్నవే  
దులఁ బవమాననందనుఁడు ద్రోవదియున్‌ విహరించుచున్నచో  
లలితసహస్రపత్రకమలంబు సమీరవిధూతమై మహీ  
తలముపయిన్‌ వడిం బడియెఁ దద్దయుఁ బొల్పుగ వారిముందటన్‌.

### [3.3.311](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.311)

వ. ఆ సౌగంధిక కమలంబుఁ జూచి దాని యపూర్వరమణీయత్వంబునకు ననన్యకుసుమసాధారణంబయిన సౌరభ్యంబునకు నోటువడి ద్రుపదరాజపుత్త్రి ముదితచిత్తయై ‘యక్కటా! యిది యొక్క పువ్వ యయ్యు నపూర్వంబై మనోనయనానందకరం బైనది; యిట్టి కుసుమంబులు కడుం బెక్కులు గావలవదె!’ యని ‘కురంగటం గలవేని తెచ్చి యిచ్చి నాకు మనఃప్రియంబుఁ జేయు’ మని యప్పుడ యప్పువ్వు ధర్మరాజుకడకుం గొనిపోయె; నిట భీముండు దాని యభిమతంబుఁజేయం గడంగి, రుక్మపృష్ఠంబైన ధనుశ్శ్రేష్ఠంబును నాశీవిషోపమానంబులైన బాణంబులు ధరియించి, యక్కమలంబు దెచ్చిన గాడ్పున కభిముఖుండై గంధమాదనంబున వివిధరత్న బంధుర కందర కదళీ షండ దర్శనంబులను, మందార మందిర సుగంధ గంధవహస్పర్శనంబులను, నలికుల కోకిలాలాప శ్రవణంబులను, సర్వర్తు కుసుమ సురుచిర గంధాఘ్రాణంబులను, నతిమధుర ఫలాస్వాదనంబులను, బద్ధప్రమోదహృదయుం డగుచుఁ దన కెదిరి వచ్చు మృగంబులం దాఁకి గజంబు నెత్తి గజంబుపై వైచుచు సింహంబు నెత్తి సింహంబుపై వైచుచు నల్పమృగంబులం గరతలప్రహారంబులం బ్రహరించుచు.

### [3.3.312](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.312)

సీ. గమనవేగంబున ద్రుమలతాజాల సం | చాలన సేయుచు శైలగుహల  
నడఁగి యదృశ్యలై కడువేడ్కతోఁ దన్నుఁ | జూచు ఖేచర సిద్ధ సుర భుజంగ  
గరుడ గంధర్వ కిన్నర కామినులచేత | మానుగా నభివీక్ష్యమాణుఁ డగుచు  
మ్రాఁకులు విఱుచుచు వీఁకతోఁ దీఁగలు | పెఱుకుచుఁ బదహతిఁ బృథునగేంద్ర  
ఆ. మద్రువ నున్నతంబు లయి నెడ లెక్కుచు | మదగజంబువోలె మధ్యముండు  
పవన వైనతేయ పటుజవయుక్తుఁడై | యరిగె గంధమాదనాంతరమున.

### [3.3.313](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.313)

వ. ఇట్లరుగువాఁడు నిజసింహనాదశ్రవణపరిత్రస్తంబులై యెగసి పఱచు పక్షుల యార్ధ్రపక్షంబులు చూచి ముందట నాసన్నంబునం గొలను కలుగవలయు నని యుపలక్షించి యతిత్వరితగతిం జని, పవనవశ సంచలిత తట మహావన తమాలతాల హింతాల విశాల కదళీదళ వీజ్యమానశీతలజలపరిపూర్ణంబైన యొక్కసరోవరంబుఁ గని, యందుఁ గృతావగాహుండై నవనళినదళమృణాలవలయాలంకృతుండగుచు దాని వెలువడి యనేకయోజనవిస్తారాయామ రమణీయంబైన కదళీషండంబుఁ జొచ్చి, యందు శంఖధ్వానంబుఁ జేసిన.

### [3.3.314](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.314)

క. ఆ శంఖరవంబు మహేం | ద్రాశనినిర్ఘోషభీమమై దిక్కులు నా  
కాశంబు నిండె; నంత గు | హాశయుఁడై యున్న హనుమ యను కపి పెలుచన్‌.

### [3.3.315](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.315)

క. దాని విని బెదరి లేన్‌చి ‘మ | హానాదం బిది మనఃప్రియం బయ్యె; మదీ  
యానుజు శంఖధ్వానము | దా నగు’ నని యెఱిఁగి హృష్టతనురుహుఁ డగుచున్‌.

### [3.3.316](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.316)

వ. భీమునకు మార్గనిరోధంబుగా మహావృక్షంబు లురలం ద్రోచి యేకాయనపథంబున కడ్డంబుగా శయనించి లాంగూలలీలాచాలనంబుఁ జేసిన.

### [3.3.317](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.317)

క. గోలాంగూలోత్తము లాం | గూల స్ఫోటనరవంబు ఘోరంబై వా  
చాలతఁ జేసి నశేషమృ | గాలి భయం బంద గిరిగుహాంతర మురలన్‌.

### [3.3.318](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.318)

వ. అయ్యపూర్వధ్వని విని భీముండు విస్మితుండై చని కదళీషండమధ్యంబున నొక్క విశాలశిలాతలంబుపయి శయనించినవాని.

### [3.3.319](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.319)

సీ. హ్రస్వపీనగ్రీవు, నచలితాయతహను, | నతిచపలస్వభావాభిరాముఁ,  
దనుమధ్య కటిచక్రు, దహనకణాకార | తామ్రోష్ఠు, నతికృశదశనకరజుఁ,  
బృథులవిద్యుత్పుంజపింగాక్షు, నుత్తుంగ | దృఢవక్షు, నాజానుదీర్ఘబాహు,  
నూర్ధ్వలాంగూల మత్యున్నతధ్వజలీలఁ | గ్రాలుచు నుండ నేకాంతయోగ  
ఆ. నిద్ర నున్న ధర్మనిర్మలు హనుమంతుఁ | జూచి పాండురాజసుతుఁడు వాని  
నిద్రఁ జెఱుపఁ గడఁగి నిజసత్త్వ మేర్పడ | సింహనాద మొప్పఁ జేసె డాసి.

### [3.3.320](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.320)

వ. హనుమంతుఁడును మెల్లమెల్లన మేల్కని జృంభ సంభృత జలార్ధ్రసంచల విలోచనుం డగుచు ననాదరంబున నాతనిం జూచి యిట్లనియె.

### [3.3.321](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.321)

తే. ‘అతిజరారోగభరమున నలసి యొలసి | యొదిఁగి సుఖనిద్రమై నిట్టులున్న వానిఁ  
గడుమదంబున నేమియుఁ గరుణ లేక | యేల బోధించి తయ్య! నీ వెఱిఁగి యెఱిఁగి.

### [3.3.322](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.322)

వ. తిర్యగ్జాతులు ధర్ము వెఱుంగవు గాక; సర్వభూతదయాస్వరూపంబైన ధర్ము వెఱింగెడువారు మనుష్యుల కారె! యిట్టి మనుష్యజన్మంబు వడసి వృద్ధోపసేవ సేయవు గాకేమి ధర్ము వెఱుంగక నిర్దయుండవై మాబోఁటి పేద మృగంబులకు భయంబుగ గర్జిలితి; వీ వెవ్వండవు? మనుష్య గోచరంబు గాని యివ్వనంబున కేల వచ్చితి? సిద్ధగతి లేనివారి కిట వోవ నశక్యం; బమృతకల్పంబులైన యీ ఫలమూలంబు లుపయోగించి క్రమ్మఱుము; నీయందు బద్ధస్నేహుండఁ గాన బుద్ధి సెప్పితి; నా పలుకులు చేకొను’ మనిన భీముం డిట్లనియె.

### [3.3.323](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.323)

తే. ‘క్షత్త్రియప్రవరుండ విఖ్యాతబలుఁడఁ | బాండుతనయుండ గొంతిగర్భంబునందు  
వాయువరమునఁ బుట్టినవాఁడ; నన్ను | భీముఁ డండ్రు భూజనులు కపిప్రభుండ!

### [3.3.324](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.324)

వ. ఏ నిక్కడఁ గార్యార్థినై పోయెద; నాకుఁ దెరు వి; మ్మీనినాఁడు దొల్లి శతయోజన విస్తారంబయిన సముద్రంబు లంఘించి లంకకుం బోయిన హనుమంతు నట్ల నిన్ను నీ పర్వతంబు లంఘించి పోదు’ ననిన హనుమంతుం ‘డతం డేమి కారణంబున సముద్రలంఘనంబుఁ జేసె? నెఱుంగు దేనిం జెప్పు’ మనిన వానికి భీముం డిట్లనియె.

### [3.3.325](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.325)

క. ‘అలఘుం డిక్ష్వాకుమహా | కుల వీరుఁడు రాఘవుండు గురువచనంబున్‌  
సలుప వనవాసియై తన | లలనం గోల్పడియె నట్టె లంకేశ్వరుచేన్‌.

### [3.3.326](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.326)

క. సీతాన్వేషణపరులై | నీతిఁ గపిప్రవరు లరిగి నిరతంబుగ సం  
పాతి యను పక్షిచేత మ | హీతనయ సువార్త లెల్ల నెఱిఁగి కడంకన్‌.

### [3.3.327](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.327)

క. వారలు వారిధి గడవఁగ | నేరక తా రున్న యెడ ననిలసత్త్వమునన్‌  
వారిధి లంఘించె మహా | వీరుఁడు హనుమంతుఁ డనఁగ విందుఁ గపీంద్రా!

### [3.3.328](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.328)

వ. ఏను హనుమంతునంతియ బలపరాక్రమంబులు గలవాఁడ; నా పౌరుషంబుఁ జూపుదునే?’ యనిన నవ్యక్త హాసముఖుం డగుచు ‘నన్నా! యేను ముదిసినవాఁడ లేవ నోపం; బోయెదవేని నాతోకం బాయంద్రోచి పొ’ మ్మనిన మెచ్చక తన వామకరంబున నెత్తం బోయి వశంబుగాక.

### [3.3.329](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.329)

ఉ. ఏపున రెండుచేతులను నిమ్ముగఁ బట్టి యమర్చి యెత్తఁగా  
నోపక మొగ్గతిల్లఁబడి యుద్గతఘర్మజలార్ద్రదేహుఁ డై  
కాపురుషుండుఁ బోలె నిజగర్వము దక్కి యడంగి యుండెఁ జిం  
తాపరుఁడై వృకోదరుఁడు దద్దయు లజ్జ నధోముఖంబుతోన్‌.

### [3.3.330](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.330)

వ. ఇట్ల క్కపివరు లాంగూలంబుఁ గదల్ప నోపక భీముండు కృతప్రణాముం డయి ‘ని న్నెఱుంగక నా పలికిన దురుక్తంబులు సహింపవలయు; నీవు కపిరూప ధరుండవైన సిద్ధుండవో, గంధర్వుండవో; దేవవరుండవో నా కెఱింగింపు’ మనిన హనుమంతుండు భీముం జూచి నగుచు ‘నేను గేసరిక్షేత్రంబున వాయుభట్టారకునకుం బుట్టిన వాఁడ; నీ చెప్పిన హనుమంతుండ; నీవు నా యనుజుండవు; దొల్లి రఘుకులేశ్వరుం డయిన రామ దేవుండు రావణుం డను రాక్షసుచేత నపహృతభార్యుండై సుగ్రీవాది వానరుల నసంఖ్యాతసంఖ్యలవారిం దనకు సహాయులం జేసికొని సేతుబంధనంబున సముద్రంబు లంఘించి సమరంబున రావణు వధియించి యందు నా కెలసంబునకు మెచ్చి.

### [3.3.331](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.331)

మధ్యాక్కర. ‘నరసురస్తుత్యమై యెంతకాలంబు నా కీర్తి నిలుచు  
నిరతంబుగా నంత కాలమున్‌ నీవు నిత్యుండ వగుచుఁ  
బరఁగు’ మని వరముఁ దగ దయంజేసి ప్రభుఁ డుర్వి యెల్ల  
సరిఁ బదునొక్కండు వేలయేం డ్లేలి చనియెఁ దా దివికి.’

### [3.3.332](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.332)

వ. అనిన విని భీముండు వాని నప్పుడు హనుమంతుం గానెఱింగి సంతసిల్లి వెండియు నమస్కరించి ‘భవద్దర్శనంబునం గృతార్థుండ నయితి’ నని యిట్లనియె.

### [3.3.333](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.333)

ఆ. ‘బలిముఖుండ! దయయుఁ గలవేని దొల్లి య | ర్ణవము గడచి చనిననాఁటి నీదు  
రూపుఁ జూడ వలతుఁ, జూపు నా’ కనవుడు | వాని కిట్టు లనియె వానరుండు.

### [3.3.334](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.334)

క. ‘అక్కాలంబున రూపం | బిక్కాలమునందుఁ జూప నెట్లగుఁ? గాలం  
బొక్క విధంబున నుండక | పెక్కు ప్రకారముల నుండు భిన్నావస్థన్‌.

### [3.3.335](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.335)

వ. దానం జేసి కృత త్రేతా ద్వాపర కలియుగంబుల సంఖ్యలు వేఱు వేఱయై, యందుల చరాచర భూతంబులు భిన్నప్రకారంబులై వర్తిల్లు’ ననిన ‘నయ్యై యుగంబుల యాచార ప్రవర్తనంబులు నా కేర్పడం జెప్పు’ మనిన భీమునకు హనుమంతుం డిట్లనియె.

### [3.3.336](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.336)

తే. ‘కృతమ కాని కర్తవ్యంబు గృతయుగంబు | నందు లేదు; చతుష్పాద మగుచు ధర్మ  
మనఘ! వర్తిల్లు; నచ్యుతుం డయ్యుగమున | శుక్లవర్ణుఁడై ప్రజలఁ గాచుచు వెలుంగు.

### [3.3.337](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.337)

వ. అది సనాతనధర్మసనాథం; బందుల బ్రహ్మ క్షత్రియ వైశ్య శూద్రు లేకవేదక్రియాయోగ్యులై యకామ ఫలసంయోగంబునఁ బుణ్యలోకంబులు వడయుదు; రందు నసూయాభిచార దర్పపైశున విగ్రహ క్రోధమదమత్సర భయ సంతాప వ్యాధి ప్రజాక్షయేంద్రియక్షయంబులు లేవు; మఱియుఁ ద్రేతాయుగంబునందుఁద్రిపాదంబై ధర్మువు వర్తిల్లు; నందు జనులు నిత్యసత్యవ్రతశీలురై యజ్ఞతపో దానాది క్రియల వర్తింతు; రందు రక్తవర్ణుండయి విష్ణుభట్టారకుండు ప్రజారక్షణంబుఁ జేయు.

### [3.3.338](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.338)

తే. ద్వాపరంబున రెండుపాదములఁ జేసి | నడుచు ధర్మువు వేదముల్‌ నాల్గుదెఱఁగు  
లై ప్రవర్తిల్లు వేదశాస్త్రార్థ చోది | తంబులై ధర్మకామముల్‌ ధరణిఁ బరఁగు.

### [3.3.339](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.339)

తే. సత్యశమహీను లగుదురు జనులు గామ | కాములై చేయుదురు బహుక్రతువు లోలి;  
నందుఁ ద్రైలోక్యవందితుం డచ్యుతుండు | కృష్ణవర్ణుఁడై జగము రక్షించు మఱియు.

### [3.3.340](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.340)

క. కలియుగమునందు ధర్మము | బలమఱి వర్తిల్లు నేకపాదంబున; నం  
దలఘుఁడు కృష్ణుఁడు జగతీ | వలయము రక్షించుఁ బీతవర్ణుం డగుచున్‌.

### [3.3.341](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.341)

వ. అందుల జనులు తమోగుణ యుక్తులై కామక్రోధాది దోషవశంబునం దమ్మెఱుంగక యధర్మవర్తు లగుదు; రందుఁ జేసిన తపోదానాది కర్మంబులు స్వల్పంబులయ్యును బహుఫలంబు లగు’ నని యుగవర్తన ప్రకారంబులఁ జెప్పి, ‘నీ కిష్టావాప్తి యయ్యెడు, నరుగు’ మనిన భీముం డిట్లనియె.

### [3.3.342](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.342)

క. ‘నీ నాఁటి తనువుఁ జూచియ | కాని యవశ్యంబు పోవఁ; గావునఁ గపినా  
థా! నాకుఁ జూపు’ మనవుడు | వానికిఁ దనరూపుఁ జూపె వానరుఁ డంతన్‌.

### [3.3.343](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.343)

చ. అతులితమై ద్వితీయ కనకాద్రి యొకో యిది నా నిజాంగ మూ  
ర్జితముగఁ బెంచి పుచ్ఛమునఁ జేసి దిగంతము లందుచున్న యు  
న్నతుఁ గపినాథుఁ జూచి కురునందనుఁ డప్డు నిమీలితాక్షుఁ డై  
మతి నతివిస్మితుం డగుచు మారుతి కిట్లనియెన్‌ భయంబునన్‌.

### [3.3.344](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.344)

క. ‘అతిభీషణ మిది యత్య | ద్భుత మోహో! చాలు; భూనభోమధ్యవ్యా  
పిత మయ్యె భవద్దేహా | యతత్వ ముపసంహరింపు’ మనవుడుఁ గపియున్‌.

### [3.3.345](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.345)

క. తన యెప్పటి రూపముఁ జే | కొని ‘దీనికి నినుమడుం గగుం బ్రతిబలముం  
గనినప్పుడు నా రూపం | బనుపమముగ’ ననిన హనుమ కనిలజుఁ డనియెన్‌.

### [3.3.346](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.346)

ఉ. ‘ఉన్నతిఁ బూని నీవు బలియుం డగు రావణు నశ్రమంబునం  
బన్నుగఁ జంపనోపు పటుబాహుబలాఢ్యుఁడ విట్టియున్నతున్‌  
నిన్ను సహాయుఁగా బడసి నిర్మలనీతిపరుండు రాఘవుం  
డన్నరభోజనాన్వయుల నాజి వధించుట యేమి చోద్యమే?’

### [3.3.347](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.347)

వ. అనిన వాని కతిప్రీతిమంతుండై హనుమంతు డిట్లనియె ‘నయ్యా! నీవు సౌగంధిక సరోవరంబునకుం బోయెద వే నందు సాహసంబు సేయవలవ; దది యక్షరాక్షసరక్షితంబై దేవతోపభోగయోగ్యంబై యుండు; దేవతలు బలిహోమ నమస్కారంబులఁజేసి భక్తిసాధ్యులు గాని సాహసక్రియాసాధ్యులు గారు; నీవు నిజధర్మ నిష్ఠితుండవై పరమధర్మంబు లెఱుంగునది; యెందేని హీనబుద్ధులు విమోహింతు రట్టి ధర్మాధర్మవిభాగంబు లెఱుంగు విద్వాంసుల నుపాసించి శుభాచారుండవు గావలయు; నాచారంబున ధర్మంబు వుట్టు; ధర్మంబువలన వేద ప్రతిష్ఠ యగు; వేదంబులం జేసి యజ్ఞంబులు ప్రవర్తిల్లు; నట్టి యజ్ఞంబువలన దేవతలు తృప్తు లగుదురు.

### [3.3.348](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.348)

ఆ. కార్యసిద్ధిపొంటెఁ గాలంబు దేశంబు | నెఱిఁగి బుద్ధిమంతు లెల్లప్రొద్దు  
సాహసంబు విడిచి సామాద్యుపాయప్ర | యుక్తి చేయుదురు యథోచితముగ.

### [3.3.349](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.349)

వ. మఱియు సర్వకార్యంబులు మంత్రమూలంబులు గావున విద్వాంసులై ప్రబుద్ధులైనవారలతో మంత్రంబుఁ జేయునది; బాలకులయు నధికశ్రీదర్పితులయు లుబ్ధులయు లఘుజనంబులయుఁ దోడ మంత్రంబు సేయవలదు.

### [3.3.350](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3.350)

తే. జనులు నిగ్రహానుగ్రహశక్తుఁ డైన | రాజు శాసనమునఁ జేసి రమణతోడ  
నోలిఁ దమ తమ మర్యాద లొక్కనాఁడుఁ | దప్ప నోడుదు రిమ్మహీతలమునందు.

_First 200 of 251 passages. [Read on](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3)_

---
Source: [https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3) · Pramāṇa
