<!-- Pramāṇa, a library of Indian primary sources · https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4 -->

[Pramāṇa](https://indike.org/pramana/) › [Indian literature](https://indike.org/pramana/in) › [Epic, Poetry, Drama & Narrative](https://indike.org/pramana/in.lit) › [The Mahābhārata and its versions](https://indike.org/pramana/in.lit.mahabharata) › [Mahābhāratas in Indian regional languages](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa) › [Andhra Mahabharatamu](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra) › 3.4

# Andhra Mahabharatamu 3.4: అరణ్యపర్వము — చతుర్థాశ్వాసము

Āndhra Mahābhāratamu 3.4

- **Language:** Telugu

### అరణ్యపర్వము — చతుర్థాశ్వాసము

### [3.4.1](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.1)

క. శ్రీ రాజరాజ! కులని | స్తార! సుధాహార హీర సన్నిభ కీర్తీ!  
శ్రీరమణ! ధనుర్విద్యా | పారగ! కోదండపార్థ! పార్థివ తిలకా!

### [3.4.2](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.2)

వ. అక్కథకుండు శౌనకాది మహామునులకుం జెప్పె; నట్లు పాండవులు నరనారాయణ స్థానంబునఁ గొన్ని దినంబు లుండి యొక్కనాఁడు ధర్మతనయుండు దమ్ముల కిట్లనియె.

### [3.4.3](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.3)

మధ్యాక్కర. ‘ఏనేఁడు లగుదెంచె నర్జునుఁ డేఁగి, యింత కేతెంచుఁ  
బూని దివ్యాస్త్రముల్‌ వడసి, యమ్మహాభుజు భూరిసత్త్వు  
నానతరిపువర్గుఁ జూడఁ గాంతు మిం’ దంచు బ్రాహ్మణుల  
తో నేఁగె నుత్తరమించి ధర్మనిత్యుఁడు ధర్మజుండు.

### [3.4.4](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.4)

వ. ఇట్లు గంధమాదన పుణ్యతీర్థావలోకనపరు లయి పాండవు లరిగి పదియేడగు దివసంబున వృషపర్వుండను రాజర్షియాశ్రమంబుఁ గని, యం దతిప్రీతి నాతనిచేతఁ బూజితు లయి యేడుదివసంబులు వసియించి బ్రాహ్మణుల నెల్ల నందు నిలువం బనిచి, వృషపర్వోపదిష్ట మార్గంబున ధౌమ్యరోమశప్రభృతి కతిపయ బ్రాహ్మణ వరులతోఁ జని యష్టమదివసంబున.

### [3.4.5](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.5)

క. విమల స్ఫాటిక హాటక | రమణీయ దరీ నిరంతర శ్వేతనగేం  
ద్రము మాల్యవంతమును ను | త్తమచరితులు సూచు చరిగి తద్విపినమునన్‌.

### [3.4.6](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.6)

క. చలదళి పుంస్కోకిల కుల | కల రవముఖరిత లతాంత కమ్ర ఫలాళీ  
లలిత మహీరుహ మాలా | మిళితోద్దేశముల విశ్రమించుచు లీలన్‌.

### [3.4.7](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.7)

వ. అందు విహరించుచున్న నొక్కనాఁడు శ్వేతకి యను పుణ్యనదివలన మారుతానీతంబు లై తమ ముందటం బడిన పంచవర్ణ సురభి కుసుమంబులం జూచి యందఱు విస్మయం బంది; రంత నేకతంబున నొక్క శశికాంత శిలాతలంబుపయి నున్న భీమసేనునకు ద్రుపదరాజపుత్త్రి యి ట్లనియె.

### [3.4.8](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.8)

క. ‘ప్రకటముగఁ దొంటి సౌగం | ధిక కనకాబ్జములకంటె దివ్యసుగంధా  
ధిక కుసుమము లివి దద్దయు | సుకుమారము; లిట్టివానిఁ జూచి యెఱుంగన్‌.

### [3.4.9](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.9)

వ. ఇప్పువ్వులు నాకుఁ దెచ్చి యిచ్చి మనఃప్రియంబు సేయు’ మనిన, భీముండు తత్‌క్షణంబ చని చక్రవాళ నగ సమున్నతం బయిన గిరిశృంగం బెక్కియందు వివిధరత్నరచిత రమ్య ప్రాకార పరివృతం బయిన వైశ్రవణు నివాసంబు గని శంఖధ్వానంబు సేసిన.

### [3.4.10](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.10)

క. దాని విని యక్షరాక్షస | సేనలు పఱతెంచి భీమసేను మహాసే  
నానీసన్నిభుఁ దాఁకిరి | నానాయుధధరులు దారుణధ్వను లెసఁగన్‌.

### [3.4.11](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.11)

క. వాయుసుత ప్రేరిత శిత | సాయకముఖ దళిత రాక్షస ప్రకర బృహ  
త్కాయాభ్ర గళిత శోణిత | తోయంబుల నవనిధరనదులు గడు నిండెన్‌.

### [3.4.12](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.12)

ఉ. ఉక్కఱి యిట్లు మధ్యముమహోగ్రశరంబుల కోర్వనోప కా  
రక్కసు లెల్ల నాహవపరాఙ్ముఖు లైనఁ గడంగి భీముఁ దా  
నెక్కటి దాఁకె దిక్కరి సహింపక సింహముఁ దాఁకు నట్టులం  
దక్కజుఁ డుద్యతాయతగదాయుధుఁడై మణిమంతుఁ డల్కతోన్‌.

### [3.4.13](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.13)

క. ఆ రాక్షసు నతివీరుఁ గు | బేరసఖుం బవనసుతుఁ డభేద్యుఁడు నిజదు  
ర్వారతరశాతసాయక | ధారావర్షమునఁ గప్పె దారుణభంగిన్‌.

### [3.4.14](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.14)

క. గద ద్రిప్పి భీముమీఁదను | వదలక మణిమంతుఁ డలిగి వైచిన నది వి  
ద్యుదుదితప్రభానిభం బై | పదిదిశలు వెలుంగ భీముపైఁ బఱతెంచెన్‌.

### [3.4.15](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.15)

క. దానిఁ దన నిశితబాణవి | తానంబున జర్జరీకృతముఁ జేసె మరు  
త్సూనుఁడు గుహ్యక రాక్షస | సేనల కెల్లను భయంబు సేయుచు నలుకన్‌.

### [3.4.16](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.16)

క. ఘనుఁ డమ్మణిమంతుఁడు కాం | చనదండోద్భాసి యైన శక్తి మరున్నం  
దనుమీఁద వైచె; నది యా | తని భుజపార్శ్వమ్ము దాఁకి ధారుణిఁ బడియెన్‌.

### [3.4.17](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.17)

చ. గదఁ గొని భీముఁ డంత లయకాలకృతాంతుఁడపోలె నేల గ్ర  
క్కదల నదల్చి నిల్చిన, నకంపితుఁడై మణిమంతుఁ డాజి దు  
ర్మదుఁడు త్రిశూల మెత్తికొని మధ్యముపై ననలస్ఫులింగముల్‌  
సెదరఁగ వైచె; దానిఁ జెఱిచెన్‌ ఘనుఁ డగ్గదచేత భీముఁడున్‌.

### [3.4.18](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.18)

వ. ఇట్లు తనశక్తిశూలంబు లశక్తి నిహతంబైనఁ బరిత్యక్త మదుండై మణిమంతుం డంతరిక్షంబున కెగసిన.

### [3.4.19](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.19)

క. ‘పోవకు పోవకు’ మనుచు మ | హావీరుఁడు గద యమర్చి యమ్మణిమంతున్‌  
లా వఱఁగ వైచె నగ్గద | తో వాఁడును బడియెఁ బ్రతిహతుం డై నేలన్‌.

### [3.4.20](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.20)

క. పోర మణిమంతుఁ డిట్లు స | మీరణసుతుచేతఁ బ్రాప్తమృతుఁ డై పడినన్‌  
వారక పఱచిరి భయమున | నా రాక్షసు లార్తనాదు లై తూర్పునకున్‌.

### [3.4.21](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.21)

వ. అట ధర్మరాజు, భీముండు పోయిన వలను ద్రౌపదిచే నెఱింగి యార్ష్టిషేణుం డను మునివరు నాశ్రమంబున ధౌమ్యద్రౌపదీప్రభృతులంబెట్టి, రోమశనకుల సహదేవయుతుండై తద్గిరిశృంగం బెక్కికుబేరసదన సమీపంబున నిజగదాఘాతపాతిత మణిమదాది రాక్షస దారుణ రణమధ్యంబున నున్న మధ్యమునొద్దకుం జనియె; నంత.

### [3.4.22](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.22)

క. హతశేషు లైన రాక్షసు | లతిరయమునఁ బాఱి చెప్పి రప్పుడ యలకా  
పతికి సవిస్తరముగ నిజ | మతిఁ బవనజువిక్రమంబు మణిమద్వధయున్‌.

### [3.4.23](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.23)

వ. దాని విని కుబేరుండు విస్మితుండై యాత్మగతంబున.

### [3.4.24](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.24)

క. ‘తలఁకక మును సౌగంధిక | ములు గొని, యిప్పుడును దర్పమున నిందుల పు  
వ్వులు గొని మణిమత్ప్రభృతులఁ | బలువుర వధియించె నెట్టి బలియుఁడొ!’ యనుచున్‌.

### [3.4.25](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.25)

వ. సురగరుడగంధర్వయక్షరాక్షససహితుం డయి యక్షప్రభుం డరుగుదెంచి పాండవులం గని, వారిలోన గదాకృపాణ బాణబాణాసనధరుం డయి రణకాంక్ష నున్న మహావీరు మారుతాత్మజుం జూచి పరమప్రీతచిత్తుం డయిన.

### [3.4.26](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.26)

ఆ. అక్కుబేరునకు మహామతుల్‌ పాండవుల్‌ | మ్రొక్కి; రంత ధర్మమూర్తి యైన  
ధర్మతనయుఁ జూచి తద్దయు దయతోడ | నిట్టు లనియెఁ గిన్నరేశ్వరుండు.

### [3.4.27](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.27)

వ. ‘అయ్యా! నీయనుజుండు మత్ప్రియసఖుండైన మణిమంతు వధియించి నా కపకారంబు సేసె నని లజ్జింపవలవ; దది యగస్త్యుశాపనిమిత్తంబున నయ్యె’ నని భీమసేను డాయంబిలిచి ‘నీ చేసినసాహసంబు నా కుపకారంబు గావున నిన్ను మెచ్చితి’ ననిన నక్కుబేరునకుం గృతాంజలి యయి ధర్మతనయుం డి ట్లనియె.

### [3.4.28](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.28)

ఆ. ‘ఇట్టి శాప మమ్మునీంద్రుండు దా నేల | యిచ్చె? దాని నాకు నెఱుఁగఁ జెప్పు’  
మనిన విస్తరించి యమరాజసుతునకు | నక్కుబేరుఁ డిట్టు లనుచుఁ జెప్పె.

### [3.4.29](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.29)

వ. ‘తొల్లికుశావతి యను పుణ్యనదీతీరంబున నమరులెల్ల సత్త్రయాగంబు సేయుచుండి నన్ను రావించిన నేనును బుష్పకవిమానారూఢుండ నై త్రిశతమహాపద్మసంఖ్యల యక్షరాక్షసబలంబుతో గగనగతి నందులకుఁ బోవునెడ నూర్ధ్వబాహుండై యమునా తీరంబున నుగ్రతపంబు సేయుచున్న యగస్త్యమహామునిమీఁద నా ప్రియసఖుం డైన మణిమంతుం డెఱుంగక నిష్ఠీవనంబు సేసిన నలిగి యమ్మునివరుండు నా కిట్లనియె.

### [3.4.30](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.30)

ఆ. ‘నీవు సూచుచుండ నీ యిష్టుఁ డిమ్మణి | మంతుఁ డిపుడు దనదు మదముపేర్మి  
నన్ను నరయ కుమిసె నామీఁద కష్టదు | ర్మదుఁడు పొలియు నొక్క మనుజుచేత.

### [3.4.31](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.31)

వ. మఱియు నీ యక్ష రాక్షస బలంబులు వానిచేత నిహతు లగుదు; రిద్దురితంబు దద్దర్శనంబునం బాయు ననియెం గావున నిట్టి శాపఫలంబునకు నీ యనుజుండు నిమిత్తం బయ్యె’ నని చెప్పి, వెండియు ని ట్లనియె ‘ధృతియును దాక్ష్యంబును దేశకాలంబులును బరాక్రమంబును మంత్రవిధానంబు నను పంచవిధాంగంబు నెఱింగిన క్షత్రియుండు ధర్మవిదుండై ధరణీచక్రంబు నిర్వక్రమంబుగా రక్షించి పుణ్యలోకంబు పడయుఁ; గర్మవిశేషంబు లెఱుంగక వృథారంభుం డై సాహసంబున వర్తిల్లువానికిం బాతకం బగుట నిశ్చయంబు.

### [3.4.32](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.32)

క. కావున నిరతమ్ము మరు | ద్దేవాత్మజు సాహసైకధృతి గాకుండన్‌  
భూవల్లభ! శిక్షింపుము | నీ విమలజ్ఞానధర్మనిష్ఠితబుద్ధిన్‌.

### [3.4.33](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.33)

వ. నిన్నును నీ తమ్ములను ధర్మానిల శక్రాశ్వినులు రక్షించునట్ల యే నెప్పుడు రక్షింతు; నా నియోగంబున మత్పరిచారకులు మీకు నిత్యంబును నన్న పానాదులు దెచ్చియిచ్చుచుండ నార్ష్టిషేణాశ్రమంబున నొక్కపక్షంబు వసియించునది.

### [3.4.34](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.34)

సీ. ‘మానితయశుఁడు భీమానుజుం డర్జునుం | డమరులచేత దివ్యాస్త్రతతులు  
వడసి దేవేశ్వరుకడ నున్నవాఁ; డతం | డుపకారి యయ్యె దేవోత్తమునకు;  
సప్తమేధాధ్వరప్రాప్తపుణ్యుఁడు ధర్మ | మతి భవత్పితృపితామహుఁడు ఘనుఁడు  
శంతనుఁ డతనిచే సంతర్పితుం డయ్యె; | గుఱుకొని మీదైన కుశల మడిగె;  
ఆ. నరుగుదెంచు నింత కయ్యర్జునుండు మీ | కభిమతార్థసిద్ధి యగును సిద్ధ’  
మని యెఱుంగఁ జెప్పి యలకాధినాథుండు | యక్షగణముతోడ నరిగె నంత.

### [3.4.35](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.35)

వ. ఇట్లు ధర్మరాజు కుబేరునాదేశంబున నార్‌ష్టిషేణాశ్రమంబున నున్న నాతనికి నొక్కనాఁడు ధౌమ్యుండు నిజాంగుళి నుత్తరదిగ్భాగంబు సూపుచు ని ట్లనియె.

### [3.4.36](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.36)

క. ‘అది మందరనగ మక్కడ | నది మేరుగిరీంద్ర మమ్మహాశైలము నె  
న్మిదిదిక్కుల వసియింతురు | త్రిదశేశ్వరు దొట్టి యష్టదిక్పాలవరుల్‌.

### [3.4.37](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.37)

చ. కనకగిరిం బ్రదక్షిణముగా శశిభాస్కరతారకాగణం  
బనవరతంబుఁ ద్రిమ్మరు మహామునిసప్తకమండలంబుతో  
ననఘ! తదీయతుంగశిఖరాగ్రమునందుఁ బయోరుహాసన  
త్రినయన విష్ణు లుండుదురు దేవగణంబులు గొల్చుచుండఁగన్‌.’

### [3.4.38](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.38)

వ. అని చెప్పుచుండఁ బాండవు లం దొక్కమాసంబు నివాసంబు సేసి; రంత.

### [3.4.39](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.39)

ఉ. అంబర మాత్మదీప్తినివహంబున నొప్పఁగ మాతలిప్రయు  
క్తం బగు దివ్యకాంచనరథంబు లసచ్చపలాంశుపుంజ ర  
మ్యం బగు దాని నెక్కి ధృతిమందరుఁ డింద్రసుతుండు నాకలో  
కంబుననుండి వచ్చెఁ బ్రవికాశితతేజుఁ డినప్రకాశుఁ డై.

### [3.4.40](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.40)

వ. ఇట్లు చనుదెంచి ధనంజయుండు రోమశధౌమ్యధర్మజభీమసేనులపాదంబులకుం బరమభక్తి మ్రొక్కి వినయావనతులయిన కవల నెత్తి కౌఁగిలించుకొని, ద్రౌపదీహృదయనయనాంబుజంబుల కానందంబు సేయుచున్నంత, నందఱు సంతసిల్లి మాతలి నతిప్రీతిఁ బూజించిన, నతండును దివ్యరథంబు గొని దివంబున కరిగె; నట్టి యవసరంబున.

### [3.4.41](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.41)

క. దిననాథుఁ డస్తగిరిఁ బొం | దినఁ జీఁకటిఁ బాచి యాత్మతేజమున దిగం  
గనల విభూషించుచు రజ | నినాథకలహంస గగననిమ్నగ నొప్పెన్‌.

### [3.4.42](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.42)

వ. ఆరాత్రి యర్జునుం డనుజులనందఱ నొద్దఁబెట్టుకొని యిష్టపూర్వకథలు సెప్పుచు శయనించె; నంతఁబ్రభాతం బగుడు సిద్ధమునిగణంబులయు రోమశధౌమ్యులయుఁ దమ్ములయుఁదోడ ధర్మతనయుండు సుఖోపవిష్టుం డై యున్నంత.

### [3.4.58](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.58)

క. ఫేనవదూర్మిచయంబుల | నానావిధ మీన కూర్మ నక్రంబుల శై  
లానుకృతి నొప్పుచున్న మ | హానీరధిఁ గంటి నేను నమ్మాతలియున్‌.

### [3.4.59](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.59)

వ. ఆ సముద్రోదరంబున విశాలాట్టాలక ప్రతోళికాలంకృతం బైన పురంబుఁ గని తద్ద్వారంబున శంఖధ్వానంబు సేసిన, నది సకలదిఙ్మహీధరగుహాకుహరంబులయందుఁ బ్రతిశబ్దజనకం బైన, దాని విని యలిగి దానవులు నానావిధాయుధసన్నద్ధు లయి నిజకాయకాళిమతమోభూతభువను లగుచు వచ్చి నారథంబుఁ బరివేష్టించి.

### [3.4.60](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.60)

క. ఉరుశస్త్రవృష్టి నాపైఁ | గురిసినఁ దత్‌క్షణమె యొక్కొకొనిపయి నేనున్‌  
వరుసం బదేసిబాణము | లరుదుగ నేసితి మహాభయంకరభంగిన్‌.

### [3.4.61](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.61)

క. దనుజులు మదీయరథమా | ర్గనిరోధముగాఁ బ్రచండకాండప్రకరం  
బునఁ గప్పిరి రోదోంతర | మనిమిషులును ఋషులుఁ జూచి యద్భుతమందన్‌.

### [3.4.62](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.62)

క. కడుభయమున మాతలి చే | డ్పడి రథచోదనమునం దపాటవుఁ డైనన్‌  
వడి నేన రథము గడుపుచుఁ | దడయక యేసితిఁ గడంగి దానవులపయిన్‌.

### [3.4.63](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.63)

వ. మాతలి నన్నుం జూచి సంతసిల్లె నంత.

### [3.4.64](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.64)

చ. అతుల రణాంతరంబున నిరంతర మ త్పటు బాణ దారితో  
చ్ఛ్రిత దనుజాంగ నిర్గళ దసృగ్జల ధారలు సూడ నొప్పె నా  
తత గిరి శృంగ సంగ దళిత ప్రచల జ్జల వాహ జాల సం  
తత గళ దంబుధారల విధంబున నంబర మెల్లఁ గప్పుచున్‌.

### [3.4.65](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.65)

వ. అంత నయ్యసురులు మాయాయుద్ధంబు సేయ సమకట్టి నామీఁద వర్షాస్త్రంబు లేసిన.

### [3.4.66](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.66)

క. బలరిపుఁడు నాకు నిచ్చిన | యలఘునిశాతముఖశోషణాస్త్రంబున ని  
ర్గళదవిరళజలధారా | వలి నెల్లను దత్‌క్షణంబు వట్టఁగఁ జేసెన్‌.

### [3.4.67](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.67)

సీ. అద్దానవులు దారుణాశ్మవర్షంబులుఁ | గురిసిన నవి నన్నుఁ దెరలఁ గప్పె;  
నేనును గులిశాస్త్ర మేసి పాషాణముల్‌ | నుఱుము గావించితి; నుఱక వెండి  
యసురులు నామీఁద ననలాస్త్రజాలంబు | లేసిన గాడ్పుతో మ్రోసి యగ్ని  
కణములు నాపయిం గవిసిన నేనును | సలిలాస్త్రముల వాని బల మడంచి  
ఆ. యున్నఁ, దిమిరబాణ ముగ్రంబుగా వార | లేసి; రంత దిక్కు లెల్లఁ గప్పె;  
నంధకారమగ్నుఁ డై చలియించి మా | తలి ప్రతోద మెడలి ధరణిఁ బడియె.

### [3.4.68](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.68)

క. తురగములు పఱవ నేరక | వరరథవహనంబునందు వంధ్యము లయ్యెన్‌;  
సురసారథి ననుఁ గానక | ‘హరినందన! యెందుఁ బోయి’ తనెఁ గడు భీతిన్‌.

### [3.4.69](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.69)

క. ‘అమృతనిమిత్తంబున ము | న్నమరాసురయుద్ధ మయ్యె; నది యింతభయ  
భ్రమజనకము గా; దిది యు | గ్రము దనుజు లవార్యవీర్యగర్వితు లగుటన్‌.

### [3.4.70](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.70)

తే. బ్రహ్మచేత నిర్మింపఁగఁబడిన భువన | సంప్లవం బిది’ నావుడు ‘సంగరమున  
సంచలింపక నాభుజశక్తిఁ జూచు | చుండు’ మనవుడు మాతలి చోద్య మందె.

### [3.4.71](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.71)

ఉ. వాసరనాయకుం దలఁచి వజ్రివరంబున సూర్యబాణ మే  
నేసితి నింద్రుఁ దొట్టి సుర లెంతయు సంతస మందఁగా జగ  
త్త్రాసి తమిస్రరాశి నిహతంబుగ దిక్కులు ద్రెళ్ళఁగా మహో  
గ్రాసురు లాహవంబున భయంపడ మాతలి మెచ్చి యార్వఁగన్‌.

### [3.4.72](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.72)

క. గాండీవముక్తదారుణ | కాండవిఖండీకృతాపఘను లై దనుజుల్‌  
భండనముఖమునఁ జేడ్వడి | గొండలు వడినట్టు వడిరి కుతలం బద్రువన్‌.

### [3.4.73](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.73)

వ. ఇట్లు నివాతకవచులు మదీయదివ్యాస్త్రనిహతులై మహీతలంబునం బడిన; నట యసురకాంతలయాక్రందన ధ్వను లాకసం బద్రువ నొక్కటఁ బురంబున నెగసె; నంత నద్దానవపురంబుఁ బురందరుపురంబుకంటె నతిసుందరం బైన దానిం జూచి మాతలి కి ట్లంటి.

### [3.4.74](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.74)

క. ‘నిరుపమరత్ననిరంతర | వరగృహముల నొప్పి సుఖనివాసం బగు ని  
ప్పురి నుండ నొల్ల కొండొక | పురి నుండఁగ నేల వలసెఁ బురుహూతునకున్‌.’

### [3.4.75](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.75)

వ. అనిన మాతలి యి ట్లనియె.

### [3.4.76](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.76)

సీ. ‘అసురులవలన భయం బైన యపుడు వే | ల్పులకు సేమంబుగా బలవిరోధి  
యీప్రోలు జలధిలో నిమ్ముగ నిర్మించె; | దనుజులు పదపడి వనజగర్భు  
వలనఁ దపోవీర్యవంతు లై యిందుండ | నమరులచేతఁ గయ్యమున నజితు  
లై యుండఁ బడసిన, నమరేంద్రుఁ డెఱిఁగి త | ద్విజయార్థముగఁ బంచె విజయ! నిన్ను;  
ఆ. నమరులకు నసాధ్యు లైనట్టి వీరల | నీవ యోర్చి’ తనుచు నెమ్మితోడ  
నన్ను సంస్తుతించి నరనాథ! మాతలి | గడఁగి యపుడు రథముఁ గ్రమ్మఱించె.

### [3.4.77](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.77)

వ. ఇట్లు నివాతకవచులం జంపి క్రమ్మఱి వచ్చునెడ నాముందట నొక్క తపోవనంబును నతివిచిత్రం బైన పురంబునుం గని ‘యిది యెవ్వరిపురం?’ బని యడిగిన నాకు మాతలి యి ట్లనియె.

### [3.4.78](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.78)

క. ‘వినవె పులోమయుఁ గాలక | యును ననఁగా నిరువు రసురయువతులు గమలా  
సను నారాధించిరి తప | మున దివ్యసహస్రవర్షములు గడునిష్ఠన్‌.

### [3.4.79](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.79)

క. కనకమయ మైన యీప్రో | లునఁ దమసుతు లాహవంబులో నమరులచే  
తను వధ్యులు గాకుండను | వనజజుచేఁ బడసి రసురవనితలు వరముల్‌.

### [3.4.80](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.80)

వ. ఇది హిరణ్యపురం; బిందుఁ బౌలోమకాలకేయు లను నసురు లరువది వేలుండుదురు వా రమరులచేత నవధ్యు’ లనిన ‘నట్లేని దానిపయిం బోదము; రథంబు వఱపు’ మని యేను మాతలిం బంచిన.

### [3.4.81](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.81)

చ. అతఁడును సప్తమారుతరయంబున దివ్యరథంబుఁ దత్సురా  
హితపురి భూరి వప్రముపయిం బఱపెన్‌ సురవైరు లంత ను  
ద్ధతు లయి ప్రోలు వెల్వడి రథంబులు షష్టిసహస్రకంబుతో  
శతమఖబుద్ధిఁ జేసి కడు సైఁపక తాఁకిరి నన్ను నల్కతోన్‌.

### [3.4.82](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.82)

వ. ఏనును వారల యఱువదివేలరథంబులకు గతినిరోధంబుగా వితతవృక్షవికటశిలాప్రభవంబు లయిన దివ్యబాణంబు లేసిన, నసురులు మాయాయుద్ధనిబద్ధబుద్ధులై తమపురంబుతోడన దివంబున కెగసి మదీయమార్గణార్గళనిరుద్ధమార్గు లై నేలంబడిన, వీరల నొండువిధంబున నోర్వరా దని తలంచి.

### [3.4.83](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.83)

చ. ఉరగఫణాగ్రరత్నకిరణోల్లసదుగ్రభుజున్‌ వృషాంకు శం  
కరు శశిఖండమండితశిఖండు శివున్‌ హృదయాంబుజంబునం  
దిరముగ నిల్పి పాశుపతదివ్యశరం బరివోసి యేసితిన్‌  
సురరిపుకోటిమీఁద సురసూతుఁడు మాతలి చూచి మెచ్చఁగన్‌.

### [3.4.84](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.84)

వ. ఆ దివ్యాస్త్రప్రభావంబున సింహశరభశార్దూలశుండాలమహిషమహోక్షయక్షరాక్షసపిశాచపన్నగ గంధర్వరూపంబు లుద్భవిల్లి యసురుల నెల్ల విగతాసులం జేసిన.

### [3.4.85](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.85)

క. వంచనయును మాయయు మా | యించి పరాక్రాంతి నయ్యుమేశాస్త్రమునం  
గ్రంచఱ నంతకపురి కేఁ | గించితిఁ బౌలోమకాలకేయాసురులన్‌.

### [3.4.86](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.86)

వ. ఇట్లు హిరణ్యపురనివాసులం గృతాంతపురనివాసులం జేసి వచ్చి వాసవునకు మ్రొక్కిన, వాసవుండును నివాతకవచపౌలోమకాలకేయుల వధప్రకారం బంతయు మాతలివలన విని సంతసిల్లి నా కి ట్లనియె.

### [3.4.87](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.87)

చ. ‘సురలకుఁ బ్రీతి సేసితి; వసుంధర కేఁగుము; నిన్ను నీ సహో  
దరులు నిరంతరంబును ముదంబునఁ జూడఁగఁ గోరుచున్నవా;  
రరిమదభేది! నీకు విషమాజిముఖంబుల మార్కొనంగ నో  
పరు నరు లెవ్వరున్‌; హరి కిభంబులు మార్కొనునయ్య యెయ్యెడన్‌?

### [3.4.88](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.88)

క. ద్రోణద్రోణజ కృపగీ | ర్వాణనదీజాంగపతు లవశ్యమును భవ  
ద్బాణహతిఁ జేసి సమర | క్షోణిఁ బరిక్షీణబలు లగుదు రవజితులై.’

### [3.4.89](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.89)

క. అనిన నమరేంద్రు వీడ్కొని | చనుదెంచితి’ నని కిరీటి శతమఖలోకం  
బునఁ దన చేసినవిధ మ | త్యనఘుం డేర్పడఁగఁ జెప్పె నందఱు వినఁగన్‌.

### [3.4.90](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.90)

వ. ధర్మరాజును దమ్ముఁడు సేసిన మహాపరాక్రమంబునకుఁ జతురంభోధిపర్యంతమహీరాజ్యం బప్పుడు తనకు సంప్రాప్తం బైనంతియ సంతసిల్లి.

### [3.4.91](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.91)

ఆ. ‘దివ్యబాణములు తదీయప్రయోగముల్‌ | మాకుఁ జూపు’ మనిన మఘవసుతుఁడు  
వేఱువేఱ చూపె వేలుపు లిచ్చిన | యస్త్రశస్త్రములు నిజాగ్రజునకు.

### [3.4.92](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.92)

వ. మఱియును.

### [3.4.93](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.93)

చ. సురవిశిఖ ప్రయోగములు సూపఁ దొడంగిన నేల దిర్దిరం  
దిరిగెఁ, బయోనిధుల్‌ గలఁగె, దిగ్గజముల్‌ మదమేది కుందె, భా  
స్కరరుచి మాసెఁ, బావకశిఖాతతి తోన యడంగె గాడ్పు, లం  
బరమున నిల్చి రీశ్వరుఁడు బ్రహ్మయు నాదిగ వేల్పులందఱున్‌.

### [3.4.94](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.94)

వ. అంత సురగణచోదితుం డైన నారదుం డర్జునుపాలికి వచ్చి యి ట్లనియె.

### [3.4.95](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.95)

తే. ‘ఎదురు లేక దివ్యాస్త్రంబు లిట్లు నీకుఁ | బాడియే ప్రయోగింపంగఁ బాండుపుత్త్ర!  
సిద్ధ మివి యధిష్ఠానవర్జితము లయ్యె | నేని మూఁడులోకములు దహించు నొగిని.’

### [3.4.96](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.96)

వ. అని యర్జును వారించి నారదుం డరిగిన, నమరులు నిజస్థానంబుల కరిగి; రిట్లు పాండవు లందుఁ బదిమాసంబు లుండునంత; నొక్కనాఁ డమరకన్యకలు వచ్చి యర్జునున కి ట్లనిరి.

### [3.4.97](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.97)

తే. ‘వనమునందును బండ్రెండువత్సరములు | నలయ కజ్ఞాతవాస మేకాబ్దకంబు  
పూని నిర్విఘ్నవృత్తిఁ జల్పుదురు మీరు | పగఱ నిర్జింతు రాహవాభ్యంతరమున.

### [3.4.98](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.98)

తే. నీ పరాక్రమబలమున నిఖిలధరణి | రాజ్యభారంబు నీ ధర్మరాజు పూను;  
రఘుకులాధీశ్వరుం డైన రాముకీర్తి | యట్ల నీ కీర్త్తి త్రిజగంబులందుఁ బరఁగు.’

### [3.4.99](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.99)

వ. అని యాదేశించి దేవకన్యకలు వోయిన, నిట దేవర్షి యైన రోమశుండు ధర్మరాజునకు ధర్మానుశాసనంబు సేసి దివంబున కరిగె; నంతఁ బాండవు లెప్పటియట్ల ఘటోత్కచసేనానీతు లై క్రమ్మఱి వృషపర్వునివాసంబు సూచుచు బదరీవనంబున నొక్కరాత్రి వసియించి, సుబాహుపురంబునకు వచ్చి యందుఁ దమ పరిచారకు లైన యింద్రసేనాదులం గూడి నిజరథారూఢు లై ఘటోత్కచుం బోవం బనిచి హిమవత్పర్వతంబునందు దేవర్షి బ్రహ్మర్షులయజ్ఞప్రదేశంబుల ననేకవిధయూపంబులు సూచుచు నొక్కవర్షం బుండి; రంత నొక్కనాఁడు.

### [3.4.100](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.100)

క. మృగయార్థ మరిగి హిమవ | న్నగ భూములయందుఁ బవననందనుఁ డొక ప  
న్నగుచేతఁ బట్టువడి యి | మ్ముగ ధర్మతనూజుచేత మోక్షితుఁ డయ్యెన్‌.

### [3.4.101](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.101)

వ. అనిన విని జనమేజయుండు వైశంపాయనున కి ట్లనియె.

### [3.4.102](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.102)

మధ్యాక్కర. ‘పదివేల గజముల బలము గలవాఁడు పౌలస్త్యుతోడఁ  
గదనంబు సేసి యనేక యక్షరాక్షసుల నిర్జించి  
యుదితశౌర్యోన్నతుం డైనవాఁడు వృకోదరుఁ డేల  
పదపడి నిగృహీతుఁ డయ్యెఁ దా నొక్కపన్నగుచేత?’

### [3.4.103](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.103)

వ. అనిన విని వైశంపాయనుం డి ట్లనియె; భీముం డొక్కండ హిమవదుత్తుంగశృంగోపాంతకాంతారంబుల మృగయాభ్రాంతిఁ బరిభ్రమించుచుండి యతిశ్రాంతుం డయి తత్‌ప్రదేశంబున.

### [3.4.104](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.104)

మ. అశనాశావివృతాస్యగహ్వరుఁ, గృతాంతాకారు, నిశ్వాస ధూ  
మశిఖాధూసరితోగ్రదుర్గతరుగుల్మవ్రాతు, హారిద్ర వ  
ర్ణశరీరున్‌, భృశరూక్షదర్శను, మహానాగప్రభుం గాంచె న  
ర్ధశశాంకద్యుతి హారిదారుణ చతుర్దంష్ట్రున్‌ జగత్త్రాసకున్‌.

### [3.4.105](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.105)

వ. అమ్మహాజగరం బామిషార్థి యై భీముం బట్టికొని వాని భుజయుగంబుఁ దనముఖంబున నంగంబు నిజాంగంబునఁ జిక్కం బంధించిన నాగాయుతబలుం డయ్యును తదంగసంగంబున దుర్బలుండై మెలంగనేరక భీముం డప్పాము బలవీర్యంబులకు విస్మితుం డయి ‘యిది ప్రకృతిసర్పంబుగా; దెయ్యదియేనియు నొక్కయద్భుతరూపం’ బని విచారించుచు దాని కిట్లనియె.

### [3.4.106](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.106)

మత్తకోకిల. ‘ఏను భీముఁడఁ బాండవేయుఁడ నిద్ధతేజుఁడ ధర్మరా  
జానుజుండఁ బిశాచపన్నగయక్షరాక్షసవీరులం  
బూని పోరుల నోర్వనోపెడు భూరివీరుఁడ నాగపం  
చాననాదులఁ బట్టి వ్రచ్చు ననంతబాహుబలాఢ్యుఁడన్‌.

### [3.4.107](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.107)

ఆ. ఇట్టి నన్నుఁ బట్టి యిప్పాట బంధించు | నట్టి శక్తి యెట్టు లయ్యె నీకు?  
నిది నిసర్గశక్తియే? వరదానసం | సిద్ధి యైన యదియె? చెప్పు’ మనిన.

### [3.4.108](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.108)

వ. అదియును దిర్యగ్జాతి యయ్యును దనపూర్వస్మృతి సెడకుండ వరంబుఁ గాంచుటంజేసి వాని కి ట్లనియె.

### [3.4.109](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.109)

క. ‘ఇది నా వరలాభంబున | నుదయించినశక్తి; యెట్టియున్నతబలసం  
పదు లైన జీవులును నా | కెదిరిచి బలహీను లగుదు రివ్విపినమునన్‌.

### [3.4.110](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.110)

ఆ. ఎదురఁ బడినవాని వదలక శార్దూల | శరభసామజాదిసత్త్వతతులఁ  
బట్టి తినుచు నున్న యట్టి నా కిప్పుడు | భక్ష్య మైతి వీవు పాండుపుత్త్ర!

### [3.4.111](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.111)

ఆ. శక్రపదవిఁ బొంది సద్బ్రాహ్మణుల కవ | మాన మేనుఁ జేసి మదము పేర్మి  
ననఘ! యిట్టు లైతి నం దొక్క మునివరు | శాపశక్తిఁ దొంటిశక్తి దఱిఁగి.’

### [3.4.112](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.112)

వ. అని దుఃఖించిన యజగరంబునకు భీముం డి ట్లనియె.

### [3.4.113](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.113)

క. ‘కడుకొని కడుదుఃఖములై | నెడ నుచితమె? యాత్మనింద యెయ్యెడల మనం  
బెడలక యేకాకృతి నె | ప్పుడు నుండుట సూవె పురుషు పురుషార్థ మిలన్‌.

### [3.4.125](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.125)

వ. అయినను నా నేర్చు విధంబునం జెప్పెద నడుగు’ మనిన నజగరం బి ట్లనియె.

### [3.4.126](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.126)

ఆ. ‘ఘనుఁడ! యే గుణములు గలవాఁడు బ్రాహ్మణుం? | డతని కెఱుఁగఁదగినయట్టి వస్తు  
వెద్ది? దీని నాకు నెఱిఁగింపు’ మనిన ని | ట్లనుచుఁ జెప్పెఁ బాండవాగ్రజుండు.

### [3.4.127](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.127)

సీ. ‘సత్య క్షమా దమ శౌచ దయా తపో | దాన శీలంబు లెందేనిఁ గాన  
నగు నట్టి వాఁడు బ్రాహ్మణుఁడు; సుఖంబు దుః | ఖంబు నై నెడ విమోహంబు నొంద  
కునికియ వానికి నుత్తమం బగు విద్య’ | యనిన ‘నీ చెప్పిన గుణము లివియు  
క్రియ శూద్రునందుఁ గల్గిన నతం డుత్తమ | ద్విజుఁడు గానేర్చునే? నిజము విడిచి  
ఆ. నట్టు లయిన బ్రాహ్మణాదివర్ణవిభాగ | మెట్లు గలుగునయ్య? హీను లధికు  
లను వివేక మది యపార్థకం బగుఁగాదె!’ | యనిన ననియె నంతకాత్మజుండు.

### [3.4.128](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.128)

వ. ‘ప్రమాదంబున వర్ణసంకరం బయినప్పుడు వర్ణ పరీక్షార్థంబుగా బ్రాహ్మణాదులకు వృత్తంబు వేఱువేఱ స్వాయం భువుం డైన మనువు సెప్పె; సత్యాదిగుణంబులు శూద్రునందుఁగలిగెనేని వాఁడు సచ్ఛూద్రుండుఁగాక బ్రాహ్మణుండు గానేర్చునే? యవి బ్రాహ్మణునందు లేనినాఁడు శూద్రుం డనంబడుఁ గావున వృత్తంబ యుత్తమంబు.

### [3.4.129](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.129)

తే. వృత్తవంతుండు వెండియు వివిధగతుల | వృత్తవంతుండు గా నేర్చు; వృత్తహీనుఁ  
డైనవాఁడు విహీనుండ యండ్రు గాన | విత్తరక్షకుఁ గడు మేలు వృత్తరక్ష.

### [3.4.130](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.130)

వ. అనిన నజగరం బి ట్లనియె.

### [3.4.131](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.131)

తే. ‘అప్రియంబుఁ జేసియు మఱి యనృతవాది | యయ్యు హింస గావింపని యమ్మహాత్ముఁ  
డేఁగు సుగతికి నం; డ్రది యె ట్లహింస | యనఘ! యింత విశేష మెట్లయ్యె చెపుమ!’

### [3.4.132](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.132)

వ. అనిన ధర్మతనయుం డి ట్లనియె; ‘దానంబును బ్రియంబుచేఁతయును సత్యంబును నహింసయు ననునవి నాలుగును సమంబుల యయినను నహింస విశేషం; బెట్లనిన దేవమనుష్యతిర్యగ్యోను లను మూఁడు గతులయందును మనుష్యుండు దానాదిగుణంబులు గలిగి యహింసాపరుం డయిన దేవగతి వడయు; విపరీతవర్తనుండు తిర్యగ్యోనులం బొందు’ నని యిట్లు తన చేసినప్రశ్నంబులకు నుత్తరంబులు చెప్పిన ధర్మరాజున కతిప్రీతుం డై భీమసేనుని విడిచి శాపవిముక్తుండై దివ్యరూపంబు సేకొనియున్న నహుషువలన నధ్యాత్మవిద్యారహస్యంబు లిమ్ముగా నెఱింగి యుధిష్ఠిరుండు వృకోదరుం దోడ్కొని నిజాశ్రమంబునకు వచ్చియున్నంత.

### [3.4.133](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.133)

క. ఖరకిరణతాపమున నురు | తరదవదాహమున శోషితము లైన వనాం  
తరతరుతతి కాప్యాయన | కర మై వర్షాగమంబు కడు బెడఁగయ్యెన్‌.

### [3.4.134](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.134)

క. నాలుగుకెలఁకుల నవఘన | జాలంబులు వ్రేలి కురిసె ఝంఝానిలవే  
గాలోలము లై బహుల | స్థూలపయోధార లోలిఁ దుములంబులుగాన్‌.

### [3.4.135](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.135)

క. ఘనతరధర్మతమం బొకొ | యనఁగ ఘనాఘనతమిస్ర మవిరళ మై క  
ప్పిన జనులకు వస్తువిభా | వన మొక్కొకమాటు గలిగె వైద్యుతరుచులన్‌.

### [3.4.136](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.136)

చ. అరుదుగఁ దత్పయోదసమయంబున నొక్కట విస్తరిల్లె నం  
బరమున నంబుదధ్వనియుఁ బల్వలభూముల భూరిదర్దురో  
త్కరరవముల్‌ మహీరుహ శిఖండములందు శిఖండి తాండవాం  
తరమదమంజులస్వన ముదారతరం బగుచున్‌ వనంబునన్‌.

### [3.4.137](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.137)

చ. దళిత నవీన కందళ కదంబ కదంబక కేతకీ రజో  
మిళితసుగంధబంధుర సమీరణ మన్‌ సఖి యూచుచుండఁగా  
నులియుచు పువ్వుగుత్తులను నుయ్యెల లొప్పఁగ నెక్కి యూఁగె ను  
ల్లలదళినీకులంబు మృదులధ్వనిగీతము విస్తరించుచున్‌.

### [3.4.138](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.138)

క. సురచాపచిత్రగగన | స్ఫురణం బురణించునట్లు భూవనిత నిరం  
తరచిత్రిత యై యొప్పెను | సురుచిరనవతృణశిలీంధ్రసురగోపములన్‌.

### [3.4.139](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.139)

వ. తత్సమయానంతరంబున.

### [3.4.140](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.140)

ఉ. భూసతికిం దివంబునకుఁ బొ ల్పెసఁగంగ శరత్సమాగమం  
బాసకల ప్రమోదకర మై విలసిల్లె మహర్షిమండలో  
పాసిత రాజహంస గతి భాతి ప్రసన్న సరస్వతీక మ  
బ్జాసనశోభితం బగుచు నబ్జజుయానముతో సమానమై.

### [3.4.141](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.141)

ఉ. శారదరాత్రు లుజ్జ్వలలసత్తరతారకహారపంక్తులం  
జారుతరంబు లయ్యె వికసన్నవకైరవగంధబంధురో  
దారసమీరసౌరభము తాల్చి సుధాంశువికీర్యమాణ క  
ర్పూరపరాగపాండురుచిపూరము లంబరపూరితంబు లై.

### [3.4.151](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.151)

సీ. శైబ్యసుగ్రీవాదిజవనాశ్వయుక్త మై | యాబద్ధనూత్నరత్నాంశుపటల  
భాసితం బై చారుపతగ పతాకా వి | భూషితగగన మై పొలుపు మిగులు  
దివ్యరథంబున దేవకీసుతుఁడు ప్రి | యంబున సత్యభామాన్వితముగఁ  
దరళసౌదామినీదామసముజ్జ్వల | ధారాధరోత్సంగతలమునందు  
ఆ. శచియుఁ దాను వెలుఁగు శతమఖుండును బోలె | నరుగుదెంచె ఘనరథాంగనేమి  
విపులఘోష తాండవిత బర్హిశబ్ద శ | బ్దాయమాన వనవిభాగుఁ డగుచు.

### [3.4.152](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.152)

వ. ఇట్లు వచ్చి వాసుదేవుండు రథావతరణంబు సేసి, ధర్మనందనున కభివందనం బొనరించి, భీమార్జున నకుల సహదేవులం గౌఁగిలించుకొని, ద్రౌపదిం గారవించి, ధౌమ్యాది మహీసురులచేత నభినందితుం డయ్యె; నంతఁ గౌంతేయాగ్రజుండు గదాధరునకు నర్ఘ్యాదిసత్కారంబులు నిర్వర్తించి, తమ్ములుం దానును విప్రజనంబులు నతనిం బరివేష్టించి యుండి; రప్పుడు కృష్ణుండు ధనంజయుం దన చేరువ నునిచికొని చిరకాల దర్శనోల్లసితంబు లైన యాలోకనంబుల నతని యాకారం బత్యాదరంబున నభినందించి ధర్మరాజున కి ట్లనియె.

### [3.4.153](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.153)

సీ. ‘భాగ్యంబు గాదె యీ పార్థుండు హరుఁ డాది | యైన నిర్జరసమూహంబువలన  
నెలమిఁ గృతాస్త్రుఁడై యేతెంచు; టరయంగ | ధన్యుండ వైతివి ధర్మతనయ!  
నీ ధర్మనిష్ఠయు నీ తపంబును జూవె | యింతకుఁ గారణం బిద్ధచరిత!  
రాజ్యంబుకంటెను రాజేంద్ర! ధర్మంబె | యిష్టమై యుండు నీ కెల్లనాఁడు ;  
తే. వేదవేదాంగ విదుఁడవు, వివిధయజ్ఞ | కర్త వైతి, ధనుర్వేదకర్మఠుఁడవు,  
ధరణి యెల్ల నేలెడి రాజధర్మ మమర | సులభ మయ్యె నీ కిహపరశోభనంబు.

### [3.4.154](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.154)

చ. దమమును సత్యయుక్తియును ధైర్యనిరూఢియు నిత్యతృప్తియున్‌  
శమమును నీకు నైజములు; సన్మతి నర్థవశంబుఁ గామలో  
భములును బొంద; వట్లగుటఁ బార్థివకుంజర! ధర్మరాజనా  
మమునఁ ద్రిలోకపూజ్యమహిమం బొగడొందెద వివ్విధంబునన్‌.’

### [3.4.155](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.155)

వ. అని వెండియు.

### [3.4.156](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.156)

శా. ‘ద్యూతవ్యాజమునన్‌ సభాంగణమునన్‌ దుర్యోధనుం డట్లు దు  
ర్నీతిం గూరి యొనర్చినట్టి యఘముల్‌ నిష్కంపధైర్యోన్నమ  
చ్చేతస్సారుఁడ వైన నీ కొకనికిం జెల్లెన్‌ సహింపంగ; వి  
ఖ్యాతక్షాంతులు లేరె ధార్మికులు? నిక్కం, బిట్టిరే యెవ్వరున్‌?

### [3.4.157](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.157)

ఉ. ఉల్లము సత్యసంయమము నూనినవాఁడవు నీవు విక్రమం  
బొల్లమిఁ గౌరవాధములయుద్ధతి యమ్మెయిఁ జెల్లెఁగాక; యొం  
డెల్లను నేల? నీదుమది నించుక కిన్క జనించినన్‌ మహీ  
వల్లభ! యప్డ రూపఱదె వారక వైరికులంబు సర్వమున్‌.

### [3.4.158](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.158)

చ. వినుత భవన్నియోగ మను వేల యలంఘ్యము గాన యిమ్మెయిన్‌  
ఘనభుజవీచివిభ్రమవికాసముఁ జూపక నిల్చెఁ గాక స  
జ్జననుత! చూడ నీ యనుజసాగరముల్‌ దఱితోడ విద్విష  
జ్జనలయకాలులై కడఁగు సర్వజగంబుల నాక్రమింపఁగన్‌.

### [3.4.159](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.159)

ఉ. అంధక వృష్ణి భోజ కుకురాన్వయభూపతు లెల్ల నీదెసన్‌  
బాంధవ సౌహృద ప్రణయ భక్తివిశేషము లొప్ప నీ మనో  
గ్రంథి యడంగఁజేయ నెసకంబునఁ బూనినవారు లోభ మో  
హాంధులు ధార్తరాష్ట్రులు జనాధిప! మార్కొనువారె వారలన్‌?

### [3.4.160](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.160)

క. చతురంభోధిపరీత | క్షితితల సామ్రాజ్యలక్షి క్మిం బతివి జగ  
న్నుత! నీవ; నీవు దలఁచిన | నతిదుష్కర మెందు లే దనర్గళమహిమన్‌.’

### [3.4.161](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.161)

వ. అనిన సంతసిల్లి కుంతీనందనుండు దేవకీనందనుతోడ ‘దేవా! యెవ్విధంబున నైన నల్పావశిష్టంబైన వనవాసకాలంబును నజ్ఞాతవర్తనంబును దీర్చి, లోకనింద్యంబు గాని విక్రమంబునం బగఱ జయింపఁగోరెదము; దీని నంతయు నిర్వహించు భారంబు నీయదియ; నిన్ను శరణంబు సొచ్చిన మాకుం బరమశోభనంబులును సులభంబు లగుట నిశ్చయంబుగాదె!’ యనియె; నప్పుడు కృష్ణుండు నిజసమీపంబున నున్న పాంచాలిం జూచి యిట్లనియె.

### [3.4.162](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.162)

సీ. ‘నీ పుత్త్రులేవురు నీరజలోచన! | యదుకుమారులుఁ దారు ముదముతోడ  
ననుపమ స్నేహసమాహితహృదయు లై | కరిహయారోహణపరతఁ దగిలి  
యాడుచు, వివిధశస్త్రాస్త్ర ప్రయోగముల్‌ | గఱచుచు నొండెల్ల మఱచి యున్న  
వారు; ప్రద్యుమ్నుండు వారికి దివ్యాస్త్ర | జాతంబు లెల్లను బ్రీతి నొసఁగెఁ;  
ఆ. దన్వి యా సుభద్ర తన పుత్త్రుకంటె నీ | తనయులందుఁ గూర్మిఁ దనరఁ జేయు;  
నూఱడిల్లు మింక; నుజ్జ్వలోన్నతులఁ బెం | పారఁ గాల మనతిదూర మయ్యె’.

### [3.4.163](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.163)

వ. అని యాశ్వాసించు సమయంబునం బరమతపోవృద్ధుం డయిన మార్కండేయుండు సనుదెంచినం గృష్ణుండును బాండవులును నతని నెదుర్కొని యథోచితవిధులం బూజించిరి; మునీంద్రుండును బ్రత్యేకంబ వారి కుశలంబు లడిగెఁ; దదనంతరంబ యందఱు నాసీనులై యున్నయెడఁ బాండవహితార్థియై వనజోదరుం డమ్మునివరున కి ట్లనియె.

### [3.4.164](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.164)

ఉ. ‘ఏనును బాండునందనులు నిమ్మునిముఖ్యులు నిప్డు లోకస  
మ్మానితవాక్య! నీదయిన మంజులవాగమృతప్రవాహమున్‌  
వీనులదోయి నించుచును వేడుకఁ గ్రోలికొనంగ నాత్మలం  
బూనెద; మస్మదీప్సితము పూర్ణము సేయఁగ నర్హ మెమ్మెయిన్‌.

### [3.4.165](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.165)

వ. కావున.

### [3.4.166](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.166)

క. దేవ నరదేవ ధరణీ | దేవ చరిత్రములు భర్తృదేవత లనఁగా  
భూవినుత లయిన సతుల ప్ర | భావము లెఱిఁగింపు మోలిఁ బ్రస్ఫుటములుగన్‌.’

### [3.4.167](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.167)

వ. అని యడుగుచున్నయెడ నారదుం డేఁగుదెంచిన, నందఱు ప్రత్యుద్గతు లయి ప్రణమిల్లి యాతని నుచితసత్కారంబులం బ్రీతునింజేసిన, నమ్మహాముని మార్కండేయునింజూచి ‘కృష్ణపాండవప్రియార్థంబుగాఁ బరమపుణ్య కథాకథనం బొనరింతువుగాక!’ యని పలికి వారల నామంత్రణంబు సేసి నిజేచ్ఛం జనియెఁ; దదనంతరంబ ధర్మతనయుండు మార్కండేయున కి ట్లనియె.

### [3.4.168](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.168)

సీ. ‘కడఁగి ధర్మముతోడ నడచుచు నే మిట్లు | దందడి దుఃఖంబుఁ బొందుటయును  
నేపున నెప్పుడు పాపంబు సేయుచు | ధృతరాష్ట్రజులు సుఖోన్నతు లగుటయుఁ,  
గని యివ్విపర్యయమునకు నే నూహింతుఁ | బాయక నరుఁ డిప్డు సేయు కర్మ  
మున ఫల మిందుఁ బొందునొ? పరలోకంబు | నందుఁ బొందునొ? యిందు నందుఁ గనునొ?  
ఆ. విశ్వకర్తయైన యీశ్వరుఁ గానని | పురుషుఁ గర్మఫలము పొరయకున్నె ?  
యొడలితోనఁ గృతము వెడలిపోవునొ? యిది | దెలియవలయు నాకు నలఘుపుణ్య!

### [3.4.169](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.169)

వ. ఇంతయు నెఱింగింప నీవ యర్హుండ’ వనినఁ బరమజ్ఞాననిధి యైన యత్తపోనిధి యతని కి ట్లనియెఁ ‘దొల్లి విధాత ప్రథమకల్పంబున నత్యంతనిర్మలంబులును ధర్మతంత్రంబులును నైన శరీరంబులు సృజియించె; నట్లు పుట్టింపఁబడిన యా మనుష్యులు మహాసత్త్వసంపన్నులు, సత్యవాదులు, సత్యసంకల్పులు, బ్రహ్మభూతాత్ములు, స్వచ్ఛందజీవులు నై దేవయానంబుల విహరించుచు ననాయాసంబున నధికఫలసిద్ధింబొందుచు, సర్వ ధర్మజ్ఞులై విగతమత్సరులై బహుసహస్రసంతానులై బహుసహస్ర సంవత్సరాయుష్యులై వర్తిల్లుచుండి; రంతఁ గాలాంతరంబునం గామక్రోధాది గుణంబులు దమ్ముం బొందుటయు మాయా ప్రవర్తనులై దేవతలచేత విడువంబడి యల్పాయువులు, నల్పబలశరీరసత్త్వులును, దరిద్రులును, నిష్ఫలారంభులును, బహురోగ పీడితులును, నాస్తికులును నై యొండొరుల మెచ్చక దురితంబులు సేయుచుఁదిర్యగ్యోనులం బుట్టుచు, నరకాగ్నులం గ్రాఁగుచు, గతాగతభ్రమణంబుల నలయం దొడంగి; రిట్లు దిరుగుచున్న సంసార చక్రంబునందు.

### [3.4.170](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.170)

చ. మనుజులు పుణ్యపాపములు మానక యి ట్లొనరించుచుం దుదిం  
దనువు దొఱంగి పోవునెడఁ దప్పదు నీడయవోలెఁ గర్మమున్‌  
వెనుకన యేఁగి భూరిసుఖవిస్మృతియుం బటుదుఃఖదైన్యమున్‌  
దనుకఁగఁ జేయుఁ; గ్రమ్మఱఁగఁ దాన యొనర్చు భవంబు దేహికిన్‌.

### [3.4.171](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.171)

క. విను మనుజున కెవ్విధమునఁ | దన చేసిన సుకృత దుష్కృతంబులు నెఱయం  
దన కనుభవింపఁ బా లివి; | తనువు సెడుం గాని కర్మతతి సెడ దనఘా!

### [3.4.172](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.172)

వ. మఱియు నొక్క నిదర్శనంబు సెప్పెద.

### [3.4.173](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.173)

క. ఈ లోకమ యగుఁ గొందఱ; | కా లోకమ కొందఱకు; నిహంబును బరమున్‌  
మే లగుఁ గొందఱ కధిపా! | యే లోకము లేదు వినవె యిలఁ గొందఱకున్‌.

### [3.4.174](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.174)

వ. అది యెట్లంటేని.

### [3.4.175](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.175)

చ. ధనములు సాలఁ గల్గి సతతంబును నింద్రియవాంఛ సల్పుచున్‌  
మనమున నెన్నఁడున్‌ సుకృతమార్గము పొంతకుఁ బోక లోభమో  
హనిహతబుద్ధు లై తిరుగునట్టి జనుల్‌ పరలోకసౌఖ్యముల్‌  
గనుటకు నేర; రిప్పటి సుఖంబులు మేలయి తోఁచు వారికిన్‌.

### [3.4.176](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.176)

మ. ఉపవాసవ్రత సంతతాధ్యయన తీర్థోపాసనాది క్రియై  
క పరత్వంబునఁ జేసి యైహికము దుఃఖప్రాయమై పోవఁగా  
విపులానందముఁ బొందఁ గల్గుఁ దుది నావిర్భూతభోగైకలో  
లుపబుద్ధిం జిరపుణ్యశీలురకు నా లోకంబునన్‌ భూవరా!

### [3.4.177](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.177)

ఉ. ధర్మమ సల్పుచుం దగిలి ధర్మపథంబునఁ జేసి యర్థముం  
బేర్మియుఁ గాంచి ధర్మవిధిఁ; బెండిలి యై ప్రజలన్‌ సృజించి స  
త్కర్మములం బ్రశస్తములుగాఁ గ్రతువుల్‌ వొనరించు సజ్జనుల్‌  
ధర్మజ! యిందు నందును ముదంబునఁ గాంతు రభీష్టసౌఖ్యముల్‌.

### [3.4.178](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.178)

ఆ. సత్యమును శమంబు శౌచంబు లేక, నా | స్తిక్యమును నిషిద్ధసేవనంబు  
గలిగి తిరుగు దుష్టకష్టజనశ్రేణి | పొలియు నుభయలోకములకుఁ గాక.

### [3.4.179](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.179)

వ. ఇది మనుష్యుల కర్మగతిప్రకారంబు.

### [3.4.180](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.180)

చ. జనవర! మీరు దివ్యులరు; సమ్మతి దేవహితార్థ మి మ్మహిన్‌  
జననము నొందినారరు; ప్రశస్తపరాక్రమలీలఁ బేర్చి యిం  
క నఖిలశత్రునిర్మథనకర్మ మొనర్చి మహీభరంబు దీ  
ర్చి నియతిఁ బెక్కు జన్నములు సేసి భజింతురు దేవభావమున్‌.’

### [3.4.181](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.181)

వ. అనిన విని ధర్మనందనుండు ‘బ్రాహ్మణప్రభావంబు వినవలతుం జెప్పవే’ యనిన మార్కండేయుం డిట్లని చెప్పెఁ; దొల్లి హైహయవంశోద్భవుండైన ధుంధుమారుండను కుమారుండు మృగయాసక్తుండై వనంబునఁ గ్రుమ్మరువాఁ డొక్కయెడం దృణలతాగుల్మమధ్యంబునం గృష్ణాజినోత్తరీయుం డై యున్నవాని నొకవిప్రు దవ్వులం గని మృగం బను బుద్ధిం జేసి యేసి, డాయంజని, నిశ్చేతనుండైన యతనిం జూచి యత్యంతదుఃఖితుండయి పురంబునకుం బోయి నిజవంశవృద్ధులైన హైహయుల కంత వృత్తాంతంబునుం జెప్పి, వారిం దోడ్కొని వచ్చి యవ్విప్రకళేబరంబు సూపిన.

### [3.4.182](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.182)

తే. వార లందఱు వందురి వగచి యచటి | కతిసమీపంబునను దార్‌క్ష్యుఁడను మునీంద్రు  
నాశ్రమం బున్న నయ్యెడ కరిగి కనిరి | దేవమునిసిద్ధలోకప్రతీక్ష్యుఁ దార్‌క్ష్యు.

### [3.4.183](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.183)

క. కని భక్తి మ్రొక్కుటయు, న | య్యనఘుఁడు దీవించి వారి కర్హమ్మగు పూ  
జనము లొనరింపఁ బంచెం | దన శిష్యులఁ బరమసంశితవ్రతుఁడు దయన్‌.

### [3.4.184](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.184)

వ. హైహయులు నమ్మునీంద్రునకు సాష్టాంగదండప్రణామంబుసేసి ‘మహాత్మా! యిక్కుమారుండు మృగయాసక్తుం డై వచ్చి యింతకుమున్న యివ్వనంబున నొక్కబ్రాహ్మణుం గృష్ణాజినసంవృతు నతిశాంతుం బాపంబునం జేసి మృగం బను బుద్ధి నేసిన నతండు మృతుం డయ్యె; నేము మహాపాతకదూషితుల మైతిమి గావున మీ చేయు సత్కారంబుల కర్హులము గా; మిప్పాపంబున కెయ్యది నిష్కృతి?’ యనిన నవ్వుచుఁ దార్‌క్ష్యుం డి ట్లనియె.

### [3.4.185](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.185)

క. ‘వినుఁ డెన్నఁడు మా యాశ్రమ | మున నెవ్వారలకు లేవు భూరిభయవ్యా  
ధినిరోధమృత్యుదోషా | ద్యనేకదుఃఖములు త్రిజగదాశ్చర్యముగన్‌.

### [3.4.186](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.186)

వ. అని పలికి తనపుత్త్రు నధికతపోబలసమన్వితుం జూపి.

### [3.4.187](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.187)

క. ‘ఈతఁ డగునె మీ బాలకు | చేత నిహతుఁ డైనఁవాడు సెప్పుఁ’ డనుడు వా  
రాతఁడ తమ మును చూచిన | యాతం డగుటకు మహాద్భుతాత్మకు లగుచున్‌.

### [3.4.188](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.188)

క. ‘మృతుఁ డయి క్రమ్మఱ సం | జీవితుఁ డయ్యె నితండు; కరము విస్మయ మిది భూ  
నుత! యిట్టి మహిమ కలిమికిఁ | గత మెయ్యది? యానతిమ్ము కారుణ్యమునన్‌.

### [3.4.189](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.189)

వ. అని యడిగినఁ దార్‌క్ష్యుం డిట్లనియె.

### [3.4.190](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.190)

శా. ఆలస్యం బొక యింత లేదు, శుచి యాహారంబు, నిత్యక్రియా  
జాలం బేమఱ, మర్చనీయు లతిథుల్‌, సత్యంబ పల్కంబడున్‌,  
మేలై శాంతియు బ్రహ్మచర్యమును నెమ్మిం దాల్తు; మట్లౌట నె  
క్కాలంబుం బటురోగమృత్యుభయశంకం బొంద మే మెన్నఁడున్‌.

### [3.4.191](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.191)

వ. ఇది యస్మదీయ ప్రభావంబు; మీకుఁ బాతకభయంబువలవ; దరుగుం’ డనినం దార్‌క్ష్యు వీడ్కొని హైహయులు నిజనివాసంబులకుం జనిరి; భరతవంశోత్తమ! యిట్టిది బ్రాహ్మణప్రభావం’ బని మఱియు మార్కండేయుండు ‘బ్రహ్మక్షత్త్రస్వరూపనిదర్శనం బయిన యొక్కయితిహాసంబు సెప్పెద విను’ మని ధర్మరాజున కిట్లనియె.

### [3.4.192](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.192)

చ. వినుతచరిత్రుఁ డత్రి యను విప్రవరుండు తపం బొనర్పఁ గా  
ననమున కేఁగుచుండి తన నాతిఁ గనుంగొని యిట్లనుం ‘దపం  
బున కిదె యేను బూని వనభూమికిఁ బోవుచు నున్నవాఁడ, నో  
వనరుహనేత్ర! నీవు నట వచ్చెదొ పుత్త్రులయొద్ద నుండెదో.’

### [3.4.193](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.193)

చ. అనుటయు భార్య యిట్లనియె ‘నక్కట! పుత్త్రులకుం గుటుంబభా  
ర నియమవృత్తు లెల్లను దిరంబుగఁ జేయక యాశ్రమాంతరం  
బునకు మహాత్మ! నీకు నిటు వోవుట ధర్మువు గాదు; వైన్యభూ  
జనపతి యిచ్చు నర్థులకుఁ జాలఁగ; నర్థము వేఁడు మవ్విభున్‌.’

### [3.4.194](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.194)

వ. అనినం గొండొక విచారించి భార్యపలుకులు ధర్మయుక్తంబు లగుటకు సంతసిల్లి, యమ్మహాద్విజుం డప్పుడు చని యశ్వమేధాధ్వరదీక్షితుండయి, విప్రులకు నపారధనంబు లిచ్చుచున్న వైన్యుం గని యాశీర్వాద పురస్సరంబుగా ని ట్లనియె.

### [3.4.195](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.195)

ఉ. ‘నీవ విధాత, వింద్రుఁడవు నీవ, సమస్తజనేశ్వరుండవున్‌  
నీవ, యశేషధర్మములు నీవ యెఱుంగుదు, నిన్నుఁ బోలఁగా  
నీ వసుధాతలంబున మహీశ్వరు లెవ్వరు లేరు, సన్మునీం  
ద్రావలి యెప్డు నిన్నుఁ గొనియాడుఁ బరిస్ఫుటవాక్యభంగులన్‌.’

### [3.4.196](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.196)

చ. అని పలుకంగ గౌతమమహాముని యచ్చట నుండి యంతయున్‌  
విని, కలుషించి, ‘యేల యిటు వీఁకున నో రఱుగంగఁ బ్రేలె; దీ  
జనపతియే విధాతయును శక్రుఁడు నీశుఁడు నర్థకాంక్షి వై  
మనమున శంక లేక యొక మానవు నింత నుతింప నేటికిన్‌?’

### [3.4.197](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.197)

వ. అనుటయు నత్రి యి ట్లనియె.

### [3.4.198](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.198)

ఉ. ‘ఊరక మీఱ నాడెదవు; యుక్త మయుక్తము నాత్మఁ జూడఁగా  
నేరవు; సర్వలోకములు నిర్మలనీతిపరాక్రమంబు లొ  
ప్పారఁగ నేలి ధర్మముల కన్నిటికిం గుదురై వెలుంగు ధా  
త్రీరమణుండు మేటిగ నుతింపఁగ వోలదె నాకు నిమ్మెయిన్‌?’

### [3.4.199](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.199)

వ. అని త న్నాక్షేపించిన గౌతముండు.

### [3.4.200](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.200)

ఆ. ‘కలయ నరలు వచ్చి తల తెల్ల నైనంతఁ | జేసి నీకు నెట్లుఁ జేరు నెఱుక?  
జ్ఞానవృద్ధుఁడైన వాని మాటలు గదా | సభలఁ జెల్లు నార్యజనుల కెక్కి.’

### [3.4.201](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.201)

వ. అని తొడంగి యయ్యిరువురు మహానాదంబుగా వివాదంబు సేయుచుండఁగాశ్యపనామధేయుం డైన ముని సభాసదులైన మునులం జూచి వీరలవాదు మనచేతఁ జక్కంబడదు; సకలధర్మజ్ఞుం డయిన సనత్కుమారు నడుగుద’ మనిన నా సదస్యులందఱు సనత్కుమారుపాలికిం జని యత్రిగౌతములవివాదంబు తెఱం గెఱింగించిన, నతండు వారల కి ట్లనియె.

### [3.4.202](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.202)

ఉ. ‘అత్రి నిజంబ పల్కెఁ; దగ నాతని వాక్యము ధర్మయుక్త; మీ  
ధాత్రి సమస్తమున్‌ బృహదుదగ్రభుజాగ్రమునందుఁ దాల్చు సత్‌  
క్షత్రియుఁ డెల్లవారలను గావను బ్రోవఁ బ్రభుండు; గావునన్‌  
శత్రునిషూదనుం డతఁడు శక్రుఁడు నీశ్వరుఁడున్‌ విధాతయున్‌.

### [3.4.203](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.203)

క. జనులకు నెల్లను బూజ్యుఁడు | జనపాలుం; డతని మహితశాసనమున స  
జ్జనులును మునులును సద్విధిఁ | జనువారలు గాక; కడవఁ జన దెవ్వరికిన్‌.

### [3.4.204](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.204)

వ. క్షత్త్రియప్రభావం బే మనవచ్చు! విరాట్టు, సమ్రాట్టు, విధిజితుండు, సత్యమన్యుండు, యథాజీవుండు, ధర్ముండు నను భవ్యనామంబుల నిగమంబులు పార్థివుం గొనియాడుఁ; దొల్లి యధర్మంబునకు వెఱచి బ్రాహ్మణులు నిజతేజోబలంబులు క్షత్త్రియులందు నిక్షేపించిరి; నాఁటంగోలె బ్రాహ్మ్యంబువలన క్షత్త్రంబు ప్రవర్తిల్లుచుండు; బ్రహ్మక్షత్త్రంబులు పరస్పరసంశ్రయంబులు; వెలిగా వర్తింప నేరవు; క్షత్త్రియుండు బ్రాహ్మణ సంసేవనంబునం దేజోనిరూఢుం డయి యాదిత్యుండు చీఁకటి నడంచునట్లు దురితంబుల నడంచు; నట్లగుటంజేసి క్షత్త్రియుండు సర్వాధికుం డగుట నిశ్చయం’ బనిన, నమ్మునులందఱుఁ జని వైన్యునకుఁ దత్ప్రకారం బంతయు నెఱింగించిన నా భూవరుం డత్రిం జూచి.

### [3.4.205](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.205)

క. ‘నను నెల్లజనులకంటెను | ఘనుఁ డని కొనియాడి తీవు కడు నిజముగఁ గా  
వున నిదె ప్రీతుఁడ నైతిన్‌ | గొను మిచ్చెద నీకు నేను గోటిధనంబుల్‌.’

### [3.4.206](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.206)

క. అని యిష్టధనము లిచ్చినఁ | గొని వచ్చి మునీశ్వరుండు గొడుకులకుఁ బ్రియం  
బునఁ బంచి యిచ్చి యిమ్ములఁ | జనియె వనంబునకు ధర్మసంహితబుద్ధిన్‌.

### [3.4.207](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.207)

వ. అని చెప్పి మార్కండేయుండు పాండవేయునితో నిట్లను; సరస్వతీగీత యను నితిహాసంబు సెప్పెద; నందు విశిష్టధర్మంబు లెఱుఁగ నగుఁ; దొల్లి తార్‌క్ష్యుండను మునివరుండు భారతి నారాధించిన నద్దేవి ప్రత్యక్షం బగుటయు ని ట్లని యడిగె.

### [3.4.208](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.208)

క. ‘పురుషున కెయ్యది ధర్మువు? | పురుషుం డెద్దానఁ బరమపుణ్యాత్మకుఁ డై  
చిరపుణ్యగతులు వడయును? | దిరముగ నిది యానతిమ్ము దేవీ! నాకున్‌.’

### [3.4.209](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.209)

వ. అనిన వానికి నప్పరమేశ్వరి యి ట్లనియె.

### [3.4.210](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.210)

మ. ‘ధృతి వేదంబులు నాలుగుం జదివి భూదేవుండు నానాధ్వర  
వ్రతుఁ డై యుండెడునట్టిపుణ్యుఁ డమరావాసంబునం దుండు ను  
న్నతవృత్తస్తనభారమంథర మరున్నారీపరీరంభ సం  
భృత రోమాంచ సమంచితాంగుఁ డగుచుం బెక్కేండ్లు సంప్రీతితోన్‌.

### [3.4.211](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.211)

సీ. మేలగు క్రేపుతోఁ బాలు సాలఁగ గల్గి | లాలితం బగు తొలిచూలు మొదవుఁ  
బాత్రభూతుం డైన శ్రోత్రియునకు నిచ్చు | సదమలచరితుఁ డమ్మొదవు మేన  
నెన్నిరోమము లుండు నన్ని వేలేఁడులు | సురలోకసౌఖ్యవిస్ఫురణ నొందు;  
భారంబునకుఁ జాలి భూరిసత్త్వాఢ్య మై | బిరుదైన యెద్దు భూసురున కిచ్చి  
ఆ. నరుఁడు ధేనుదశక మిరవొంద నిచ్చిన | ఫలము వడయు; మఱియు వలువ లొసఁగి  
చంద్రలోకమునకు సంప్రీతుఁడై చనుఁ; | గనక మిచ్చి నాకమునకు నరుగు.

### [3.4.212](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.212)

క. కృతమతి యై యేడేఁడులు | హుతవహు ఘృతమునను బ్రీతి నొందించిన సు  
వ్రతుఁ డీరేడుతరంబుల | పితరులఁ గొని దివికి నేఁగుఁ బెంపెసలారన్‌.

### [3.4.213](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.213)

క. సతతంబును శుచియై దే | వతలఁ బ్రదీప్తాగ్నియందు వదలక సంత  
ర్పితులుఁగఁ జేసి పడయు నం | చితముగ గోలోకవాస చిరసౌఖ్యంబుల్‌.

### [3.4.214](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.214)

వ. అగ్నిహోత్రం బస్మదాత్మకం బని యెఱుంగుము; సకలయజ్ఞంబులందుఁ గల్గింపఁ బడు విశిష్టద్రవ్యంబు లన్నియు మదీయంబు; లేను మహనీయం బైన యగ్నిహోత్రముఖంబునం బ్రభవింతు; నాత్మజ్ఞు లగు మహాత్ములకు నఖిలసంశయచ్ఛేదంబు సేయుదు; ననవరత స్వాధ్యాయ దానవ్రత పరాయణులైన తపోధను లెందేని వీతశోకులై వసియింతు; రట్టిది మామకంబైన పరమపదంబు; వినుము! ప్రచుర మధుక్షీరతోయంబులును శర్కరాసైకతంబులును మాంసాపూపప్రకరతీరంబులును బాయసకర్దమంబులు నైన యేఱు లనేకంబు లుత్పాదించి యింద్రాగ్ని ప్రముఖు లైన దివిజులకుఁ దృప్తి సేసి యజనశీలురు మత్పదంబుం బ్రాపింతు’ రని చెప్పినఁ దార్‌క్ష్యుండు కృతాంజలియై.

### [3.4.215](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.215)

ఉ. అంబ! నవాంబుజోజ్జ్వలకరాంబుజ | శారదచంద్రచంద్రికా  
డంబరచారుమూర్తి! ప్రకట స్ఫుట భూషణ రత్న రోచిరా  
చుంబితదిగ్విభాగ! శ్రుతిసూక్తవివిక్తనిజప్రభావ! భా  
వాంబరవీథివిశ్రుతవిహారి! ననుం గృపఁ జూడు భారతీ!

### [3.4.216](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.216)

వ. అని వినుతించి కృతార్థుం డయ్యె’ ననిన విని మృకండుపుత్త్రునకుఁ బాండుపుత్త్రుం డి ట్లనియె ‘మునీంద్రా! వైవస్వతమను వెత్తెఱంగునం బ్రభావసంపన్నుం డయ్యెఁ జెప్పవే’ యనిన మార్కండేయుం డి ట్లనియె.

### [3.4.217](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.217)

క. ‘విను చాక్షుషమన్వంతర | మున వైవస్వతుఁడు పరమపుణ్యుండు దపం  
బొనరించె నిరాహారత | ననుపమధైర్యుండు దశసహస్రాబ్దంబుల్‌.

### [3.4.218](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.218)

ఆ. అనఘుఁ డూర్థ్వబాహుఁ డై యేకపాదంబు | నందు నిలిచి బదరికాశ్రమమునఁ  
జలిపె మఱియుఁ బెక్కుసంవత్సరంబులు | తపము సకలజనులుఁ దను నుతింప.

### [3.4.240](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.240)

సీ. ‘శాశ్వతు నఖిలభూతేశ్వరు నవ్యయు | నాదిదేవుని జగదాదిజన్ము  
నాదిమధ్యాంతవిచ్ఛేదవిదూరు నా | శ్చర్యకారణకర్మధుర్యు నజరు  
నీ కిష్టసఖుఁడును నీకుఁ బ్రెగ్గడయు నై | వెలుఁగొందుచున్న యీ యలఘుపుణ్యు  
లాలితదీర్ఘవిశాలసితేక్షణుఁ | గనకవర్ణాంబరు వనజనాభు  
ఆ. నింద్రనీలవర్ణు నింద్రాదిసురగణ | వినుతుఁ గృష్ణుఁ గరము వినయ మొప్పఁ  
దలఁచి, యతని యాజ్ఞఁ దలకొని యెఱిఁగింతు | వినుము వరుసతోడ మనుజనాథ!

### [3.4.241](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.241)

వ. కృత త్రేతా ద్వాపర కలినామంబు లయిన యుగంబులు నాలుగును బండ్రెండువేల దివ్యవర్షంబులం బర్యవసితంబులగునియ్యుగంబులు నాలుగు నొక్కమహాయుగం బనం బరఁగు; మహాయుగసహస్రపర్యంతం బైనకాలంబు బ్రహ్మకు దివసంబ నాఁబరఁగుఁ; దద్దివసావసానంబునందు శతవార్షికంబైన యనావృష్టిదోషంబు ప్రవర్తిల్లు నప్పుడు.

### [3.4.242](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.242)

ఆ. సప్తహయుఁడు మూర్తిసప్తకంబు ధరించి | కరము వేఁడి మిగులు కరము లొప్ప  
నదనదీజలములు నుదధిజలంబులుఁ | బీల్చి జగము లెల్లఁ బ్రేల్చుఁ గడఁగి.

### [3.4.243](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.243)

చ. దినకరతిగ్మతేజము ప్రదీప్తహుతాశనుఁ డై యుగాంతసం  
జనిత మహాసమీరణవశంబునఁ బేర్చి నగవ్రజంబుతో  
మనుజులతోడ నిర్జరసమాజముతోడ భుజంగపంక్తితో  
దనుజులతో జగత్త్రయముఁ దత్‌క్షణమాత్ర నొనర్చు నీఱుగన్‌.

### [3.4.244](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.244)

వ. తదనంతరంబ.

### [3.4.245](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.245)

మ. సితపీతారుణనీలపింగరుచులై స్నిగ్ధంబులై యుద్యతా  
యతవిద్యుల్లలితంబు లై ఘనగిరీంద్రాకారఘోరంబు లై  
తతనిర్ఘాతనిపాతభీమభిదురధ్వానంబు లై సంతతో  
ద్ధుతసంవర్తవలాహకంబులు వెసం దోఁతెంచు దిగ్భిత్తులన్‌.

### [3.4.246](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.246)

ఉ. పెల్లునఁ గూలు తజ్జలము పెక్కువ నొక్కట నమ్మహానలం  
బెల్లను నాఱిపోవుఁ బృథివీశ్వర! యేఱులు నబ్ధులున్‌ వెసం  
దొల్లిటి యట్ల నిండుఁ; బటుతోయదసంఘము లంతఁ బోక గ  
ర్జిల్లుచు వెండియుం గురియుఁ జిత్రముగాఁగ ననేకకాలముల్‌.

### [3.4.247](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.247)

శా. ధారాపాతనితాంతవేగమున నిద్ధాత్రీతలం బాహతం  
బై రూపేది మునుంగుఁ దోయములలో నత్యంతగంభీరవాః  
పూరం బంతయు ముంచి మించుటయు దిగ్భూమీనభోభాగముల్‌  
వే రూపింపఁగ రాకయుండఁ దమముల్‌ వేష్టించుఁ ద్రైలోక్యమున్‌.

### [3.4.248](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.248)

తే. అంతఁ బరమేష్ఠిచోదిత మైన యొక్క | మారుతము నలి రేఁగి దుర్వారభంగి  
విలయకాలవిశృంఖలవిపులవారి | ధరచయంబుల నెల్లను విరియ నడఁచు.

### [3.4.249](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.249)

క. ఆ మారుతంబు గ్రోలి పి | తామహుఁ డెంతయును ఘోరతర మగు సలిల  
స్తోమంబునందు నడుమం | దామరపై నిదురవోవుఁ దద్దయు నెమ్మిన్‌.

### [3.4.250](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.250)

వ. ఇట్టి కల్పాంతంబు లనేకంబులు సనియె; నింకఁ గానున్నవి యనేకంబులు; విను; మతీతకల్పాంత సమయంబున నేను బ్రబలాంధకారంబున నేదెసయుం గానక యొక్కండన యత్యంతభయాతురుండ నగుచుం బెద్దకాలంబు పరిభ్రమించుచుండ నొక్కతఱి నయ్యుదకమధ్యంబున నత్యున్నతం బయిన వటభూరుహంబు గానంబడియె; మఱియుఁ దదీయ పర్ణపర్యంకంబునందు.

### [3.4.251](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.251)

క. కమనీయజలదవర్ణుని, | హిమకరబింబాస్యు, నుద్యదినతేజుఁ బ్రమో  
దమునఁ బవళించువానిం | గుమారు నొక్కరునిఁ గుసుమకోమలుఁ గంటిన్‌.

### [3.4.252](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.252)

వ. కని, విస్మితుండనై యాత్మగతంబున.

### [3.4.253](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.253)

క. లోకంబులు దెగటారఁగ | నేకార్ణవమైన యిచట నిబ్బాలుఁ డొకం  
డేకతమున నిద్రించుచు | నేకతమున నున్నవాఁడొ? యెవ్వాఁ డగునో!

### [3.4.254](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.254)

తే. అని తలంచుచు నల్లన యక్కు మారుఁ | జేరఁబోయిన నాతండు సితసరోజ  
రేఖ దలకొనఁగా నలరించెఁ గన్ను | లవధరించెను నను లోచనాంచలముల.

### [3.4.255](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.255)

వ. తదనంతరంబ గంభీరమధురస్వరంబున ని ట్లనియె, ‘నయ్యా! నిన్ను నతిశ్రాంతుంగా నెఱింగితిఁ; గొండొకసేపు విశ్రమింప వలతేని నవకాశం బిచ్చెద; నాశరీరంబు ప్రవేశించి సుఖంబున శయనింపు’ మని తనవదనంబు వివృతంబుగాఁ జేసిన, నేనును బలాత్కార క్షిప్తుండునుం బోలెఁ బరవశుండ నై తన్మార్గంబున నతని యుదరంబుఁ బ్రవేశించి, యందు.

### [3.4.256](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4.256)

సీ. గంగాదినదులతోఁ గనకశైలాదిభూ | ధరములతో సముద్రములతోడ  
వివిధపట్టణనవద్వీపవర్షములతో | బహుకర్మరతు లైన ప్రజలతోడఁ  
బక్షిమృగవ్యాళపశుసంఘములతోడఁ | దద్దయు నొప్పారు ధాత్రిఁ గంటి;  
సూర్యేందుతారకాజ్యోతిరుజ్జ్వల మైన | గగనంబుఁ బవనమార్గములుఁ గంటి;  
తే. శక్రయమవరుణాది నిర్జరసమేత | మైన నాకంబు గంటి; మహాహియక్ష  
రాక్షసాసురవిద్యాధర ప్రముఖులఁ | గంటి; వేయేల సకలలోకములుఁ గంటి.

_First 200 of 319 passages. [Read on](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4)_

---
Source: [https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4) · Pramāṇa
