<!-- Pramāṇa, a library of Indian primary sources · https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5 -->

[Pramāṇa](https://indike.org/pramana/) › [Indian literature](https://indike.org/pramana/in) › [Epic, Poetry, Drama & Narrative](https://indike.org/pramana/in.lit) › [The Mahābhārata and its versions](https://indike.org/pramana/in.lit.mahabharata) › [Mahābhāratas in Indian regional languages](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa) › [Andhra Mahabharatamu](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra) › 3.5

# Andhra Mahabharatamu 3.5: అరణ్యపర్వము — పంచమాశ్వాసము

Āndhra Mahābhāratamu 3.5

- **Language:** Telugu

### అరణ్యపర్వము — పంచమాశ్వాసము

### [3.5.27](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.27)

వ. అని యా క్షణంబ యమ్మహాద్విజుండు ధర్మవ్యాధ దర్శనలాలసుండై కదలి పతివ్రతయెఱుకకు విస్మయం బందుచు దన్నుం గృతాపరాధునింగాఁ దలంచుచు ననేకనగర గ్రామంబు లతిక్రమించి చని, యనుపమానశోభాసనాథం బయిన మిథిలానగరంబు సొచ్చి, రాజమార్గంబు దఱిసి, యచ్చటి జనంబుల ధర్మవ్యాధుం డున్నయెడ నడిగి, వా రెఱింగింప నట యేఁగి ముందట నల్పమృగమాంసఖండంబు లంగడిం బచరించి యమ్ముచున్నవాని, ననవరత విక్రయాగత జనసమావృతు నక్కిరాతుం గని, యతిజుగుప్సితం బయిన సూనాపణంబు సేర నొల్లక తొలంగి యొక్కయెడ నుండె; నంత.

### [3.5.28](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.28)

ఆ. వాఁడు నతనిరాక పోఁడిగ నిజబుద్ధి | నెఱిఁగి యతనియున్నయెడకు వచ్చి  
పరమభక్తిమ్రొక్కి ధరణీసురేశ్వరుఁ | గుశల మడిగి ప్రియము గొనలు నిగుడ.

### [3.5.29](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.29)

చ. ‘అనఘ! నితంబినీతిలక మైన పతివ్రత నా తెఱంగు సె  
ప్పినఁ జనుదెంచి తీవు ననుఁ బ్రీతిఁ గనుంగొన; నీమనోరథం  
బును మదిలో నెఱుంగుదుఁ; బ్రమోదముఁ బొందితి; రమ్మ మద్గృహం  
బున’ కని పల్కి తోడుకొనిపోయె నతండు మహీసురోత్తమున్‌.

### [3.5.30](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.30)

వ. కౌశికుండును ధర్మవ్యాధునెఱుక కచ్చెరు వంది పతివ్రతయెఱుకయుం దలంచి ‘యిది రెండవు నాశ్చర్యంబు గంటి పొ’ మ్మని తలంచుచుఁదదీయభవనంబున కరిగి వానిచేతంబూజితుం డయి యిష్టకథాప్రసంగంబున నుండి యతని కి ట్లనియె.

### [3.5.31](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.31)

తే. ‘నీవు గడు ధర్మవిదుఁడవు జీవహింస | జీవనంబుగ నడచుట శిష్టపథమె?  
యకట! యీ ఘోరకర్మంబునకు మదీయ | బుద్ధి దద్దయు దుఃఖంబు వొందె నిపుడు.

### [3.5.32](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.32)

వ. అనుటయు లుబ్ధకుం డి ట్లనియె; ‘బ్రాహ్మణులకుఁ దపస్స్వాధ్యాయ సత్యశౌచబ్రహ్మచర్యంబులును, రాజులకు దండనీతియు, వైశ్యులకుఁ గృషిపశుపాలనవాణిజ్యంబులును, శూద్రులకు శుశ్రూషయు నెట్లు పరమధర్మం బయి చెల్లు; నట్ల మాకును మృగమాంసోపజీవనంబు పరమధర్మంబు; విశేషించి యిది వంశక్రమాగతం బయిన యాచారంబు; విను; మదియునుం గాక యీ దేశంబునకు రాజైన జనకుండు రాజధర్మతత్పరుండయి సకలవర్ణధర్మరక్షణంబు వదలకుండు; నట్లుగాన యాత్మకర్మంబులు విడుచువానిం దనపుత్త్రునైనను దండితుం జేయుఁ గావున నేనును నిజకర్మపరిత్యాగంబు సేయ నోడుదు; నీదృశప్రవర్తనుండ నయ్యును.

### [3.5.33](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.33)

తే. జీవహింస యెన్నండును జేయ ననఘ! | యొరులు సంపి తెచ్చిన మాంస మొనర విలిచి  
తగిన వెల కమ్మి బ్రదుకుదుఁ; దద్ధనమున | నమలమానసశాంతి నా యర్థ మెందు.

### [3.5.34](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.34)

చ. వినయము విస్తరిల్ల గురువృద్ధజనాతిథి విప్ర దేవతా  
ర్చన లొనరింతు, సత్యమును శౌచము నేమఱ, నీగి మన్ననం  
దనుపుదు భృత్యబంధుతతిఁ, దాల్మి వహింతు, నసూయఁ జేయ, నెం  
దును మదిఁ దృష్ణ సొన్పఁ, బరదోషకథావిముఖుండ నెప్పుడున్‌.

### [3.5.35](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.35)

క. సతతోపవాసనియమ | వ్రతములఁ జరియింతు నేకవనితాప్రియుఁడన్‌  
ఋతుకాలరతుఁడ నిందా | స్తుతులందు మనంబు నాకుఁ దుల్యత నుండున్‌.

### [3.5.36](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.36)

వ. అట్లగుటం జేసి హీనయోనిజుండ నయ్యును నిర్మలుండ నైతిం; బ్రసంగవశంబున నింత సెప్పవలసె; నీవు ధర్మబోధార్థంబు నాయున్నయెడకుం జనుదెంచితి గావున నీకు ధర్మవిశేషంబు లెఱింగించెద; నవధానతత్పరుండ వయి యాకర్ణింపుము.

### [3.5.37](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.37)

క. తనకులధర్మము విడువక | మనుట పరమధర్మ మండ్రు మాన్యులు; చిత్తం  
బునఁ గృప గలుగుట ముఖ్యపుఁ | బని; సైరణ వలయు నఖిలభావములందున్‌.

### [3.5.38](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.38)

ఆ. విడువవలయు విషయవిషమవాంఛల నెద | విడుపుఁబోలు గుణము వెదకి యెందుఁ  
గానరైరి బుధులు గలదె పరిత్యాగ | శీలునకు నసాధ్యసిద్ధి యెందు.

### [3.5.39](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.39)

సీ. సత్యహితాలాప చతురత యర్హంబు, | సంతత సుజన పూజనము వలయు,  
విను కామసంరంభవిద్వేషములఁ జేసి | మతి గలంగినను ధర్మంబు దప్పఁ  
ద్రొక్కక నడచు టత్యుత్తమసరణి; య | ప్రియములయందును బ్రియములందు  
దైన్యహర్షంబులఁ దగులక యున్నట్టి | కల్యాణవర్తనకాంక్ష లెస్స;  
తే. యెగ్గు సేసినవారికి హితము సేఁత | యార్యజనములు గీర్తింతు; రన్యదోష  
కారి దనపాపమునఁ దాన కాలిపోవు; | వేఱ వానికిఁ గీడు గావింప నేల?

### [3.5.40](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.40)

క. ధార్మికులు సలుపు నుత్తమ | కర్మముఁ జెడనాడు నాస్తికజనము; విను! మా  
దుర్మతుల తెఱఁగు గైకొని | ధర్మమునెడఁ బ్రీతి వదలఁ దగదు బుధునకున్‌.

### [3.5.41](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.41)

క. మది మఱపునఁ బాపము దన | కొదవుటయును బిదప వగచి యొక సగమును నే  
నిది సేయ నింక ననియెడు | మదిఁ బెఱసగమును నరుండు మలుఁగు నఘంబున్‌.

### [3.5.42](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.42)

తే. పాపముల కెల్ల నెక్కుడు పాతకములు | సువ్వె క్రోధలోభంబులు సువ్రతాత్మ!  
వాని రెంటి జయించినవాఁడు గాని | యెందుఁ బరమధార్మికుఁ డని యెన్నఁబడఁడు.

### [3.5.43](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.43)

వ. శిష్టచరితంబులుగాని మార్గంబులుగొన్ని తృణసంవృతంబులైన కూపంబులుం బోలెఁగపట ధర్మ సంవృతంబులై యుండు; వాని దవ్వులన పరిత్యజించి శిష్టాచారంబుల నడపుట ధర్మలక్షణం’ బనినం గౌశికుండు ‘శిష్టాచారంబు లెయ్యవి? యెఱింగింపు’ మనుటయు ధర్మవ్యాధుం డి ట్లనియె.

### [3.5.44](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.44)

సీ. ‘దానంబు, సత్యంబుఁ, దపము, యజ్ఞము, నార్జ | వముఁ, గామలోభాది వర్జనంబు  
గురుజన శుశ్రూష, క్రోధ రాహిత్యంబు | దమము, సంతోష, మధ్యయన నిరతి,  
దాంభికత్వము లేమి, దైన్యంబు వొరయమి | యనసూయ, యనహంక్రియాభియుక్తి,  
దలఁపంగ నాద్యమై తనరు ధర్మమ యెప్డుఁ | గొనియాట, నాస్తికగోష్ఠిఁ జనమి,  
తే. శీలసంరక్ష, తీర్థసంసేవ, శౌచ, | మఖిలభూతంబులందు దయార్ద్రుఁ డగుట,  
మితహితోక్తులు, సంశ్రితమిత్త్రగుప్తి | యిన్నియును శిష్టచరితంబు లిద్ధచరిత!

### [3.5.45](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.45)

క. విను శిష్టచరిత గైకొని | యనసూయత నడవ నడవ నంతఃకరణం  
బునఁ బొదలు నట్టి సమ్మద | మనఘా! దుర్లభము సూవె యన్యపథములన్‌.

### [3.5.46](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.46)

వ. కావున శిష్టాచారనియతిం జేసి గురుశుశ్రూష సలిపి కృతాధ్యయనుండ వై పరమజ్ఞానపరిపక్వం బైన చిత్తంబుతోడం గామక్రోధ మహామకరసంకీర్ణయు విషయజలపరిపూర్ణయు నైన మోహజలధి నస్ఖలితధైర్యం బను తెప్పం జేసి యశ్రమంబున నిస్తరించి కృతార్థుండ వగు’ మని మఱియు నిట్లనియె.

### [3.5.47](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.47)

క. ‘క్రమమున శిష్టాచార | క్రమ మెఱుఁగఁగ ధర్మమునకుఁ గడు వాటం బై  
విమలం బగుఁ జిత్తము స | త్యమును నహింసయును దనకుఁ దావలములుగన్‌.

### [3.5.48](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.48)

ఆ. విను మహింస ధర్మవితతి కెల్లను మేటి; | యదియు సత్యయుక్త మైన వెలయు  
ననఘ! శిష్టచరితలందు సత్యమ కడు | నధిక మనిరి శ్రుతుల నరసి బుధులు.

### [3.5.49](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.49)

తే. వేద విహితంబులును శాస్త్రవిహితములును | శిష్టచరితంబులును ననఁ జెప్ప నొప్పి  
ధర్మములు మూఁడువిధములఁ దనరుచుండుఁ | గడఁగి యిన్నియు సద్గతికారణములు.

### [3.5.50](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.50)

మ. అనయంబున్‌ శ్రుతవంతుఁడై వినుతశిష్టాచారమార్గంబులం  
జను పుణ్యాత్ముఁడు దుర్గముల్‌ గడచి ప్రజ్ఞాహర్మ్యసంరూఢుఁడై  
కనుచుండుం బటు మోహపంకజలమగ్నం బైన లోకంబు వీఁ  
క నధోభాగమునందు డింది కడుదుఃఖం బొందఁగా నవ్వుచున్‌.’

### [3.5.51](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.51)

వ. అని పలికి ధర్మవ్యాధుండు మఱియు నిట్లనియె; ‘నయ్యా! నీవు దొలుత నావర్తనంబు గనుంగొని యిది హింసా బహుళంబు గాదె? యని పలికితివి; దాని కేను దగు తెఱంగు సెప్పితి; నది య ట్లుండె; హింస యిట్టిది యహింస యిట్టి దని విభాగింప నెవ్వరికి నేర నగు?

### [3.5.52](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.52)

క. మును తన చేసిన కర్మం | బునఁ జూవె నశించు భూతములు సంపెడు వాఁ  
డు నిమిత్తమాత్ర మింతయె | యని చెప్పఁగ వినమె యంచితాచారులచేన్‌.

### [3.5.53](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.53)

వ. అదియునుం గాక.

### [3.5.54](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.54)

క. ఫలమూలౌషధిశాకం | బులుఁ బశుమృగతతులు భక్ష్యములుగా భూతం  
బుల కజుఁడు సేసె నని య | స్ఖలితంబుగ మ్రోయు శ్రుతులఁ గాదన వశమే!

### [3.5.55](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.55)

సీ. అనఘ! యౌశీనరుం డగు శిబి నిజగాత్ర | హింస నింద్రాగ్నుల కిడఁడె మాంస;  
మతనికి లేదయ్యె నయ్య యుత్తమ గతి? | రంతిదేవుం డనురాజు తొల్లి  
యనుదినంబును గోసహస్రద్వయంబుఁ దా | వధియింపఁడే వేయి వత్సరములు;  
దురిత మమ్మహితాత్ముఁ దొడరెనే? వేదార్థ | నిరతులై యత్యంత నియతు లైన  
తే. ధారుణీసురముఖ్యు లధ్వరములందుఁ | బశువరింపరే పశువులఁ; బరమపుణ్య  
గతులు గలుగవె వారికిఁ? గడఁగి యగ్ను | లధికమాంసార్థు లని శ్రుతులందు వినమె!

### [3.5.56](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.56)

క. పితృదైవత కార్యములం | దతిభక్తిని మాంస మిడుట యర్హమనియుఁ ద  
త్పితృదైవశేషములు స | మ్మతి భోజ్యము లనియు మునులమతములు గావే.

### [3.5.57](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.57)

మ. హలికుం డెంతయు నోజతో దునఁగ సీరాగ్రంబునం జోఁకి ప్రా  
ణు లనేకంబులు సచ్చు, హింస యది యౌనో కాదొ! వేయేల? మ  
ర్త్యులు నేలం జరియించుచోఁ బదములం ద్రొక్కంబడుం బెక్కు జం  
తులు హింసావిధి గాదనంగ వశమే దోషజ్ఞ! యూహింపుమా!

### [3.5.58](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.58)

చ. సలిలము లుర్వి యాకసము సర్వము జంతుమయంబు గావునం  
గలుగు నవశ్యమున్‌ సకలకర్మములందును హింస, హింసకుం  
దొలఁగిన దేహయాత్రయును దుర్ఘట మైనటు లుండు; నింతయుం  
దలఁపరు హింస సేయ మని తారు తలంతురు గొంద ఱిమ్మహిన్‌.

### [3.5.59](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.59)

క. పనివడి యహింస వ్రతముగఁ | గొని వనమున నున్న మునులకుం దొడరదె హిం  
సనము తరుమూల ఫలశా | కనిపీడన మదియు హింస గాదొకొ తలఁపన్‌.

### [3.5.60](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.60)

తే. హింస సేయనివాఁడు లేఁ డిజ్జగమున | నొక్కఁడైనను, దమతమ, యోపినట్లు  
హింసతెరువున కెడఁగల్గి యేఁగవలయు | నదియ చూవె యహింసనా నతిశయిల్లు.

### [3.5.61](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.61)

వ. ధర్మంబు బహుప్రకారం బై యుండుఁ; దదీయసూక్ష్మగతి దురవబోధంబు; గావున శ్రుతిప్రమాణంబువలనను వృద్ధాచారనిదర్శనంబులను నెఱింగికొనునది.

### [3.5.62](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.62)

ఉ. భూతహితంబుగాఁ బలుకు బొంకును సత్యఫలంబు నిచ్చుఁ; ద  
ద్భూతభయాస్పదం బగు ప్రభూతపుసత్యము బొంకు నట్ల; ప్రా  
ణాతురుఁ డైనచోఁ, బరిణయంబునయందును బల్కు బొంకు స  
త్యాతిశయంబ యండ్రు; మహితాత్మక! యిట్టివి ధర్మసూక్ష్మముల్‌.’

### [3.5.63](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.63)

వ. అని తెలిపి మఱియు నతండు.

### [3.5.64](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.64)

క. ‘ఒప్పెడునది యైనను గడు | నొప్పనియది యైన నిజకులోచితపథముం  
దప్పఁ దగదండ్రు ధార్మికు | లప్పని నిజభాగ్యవిహిత మని యుండఁదగున్‌.

### [3.5.65](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.65)

క. విను, పూర్వకర్మఫలములు | దనకు వశము గాక పొందుఁ దఱితో వానిం;  
గనుఁగొననేరక మూఢుఁడు | దన కాపద యైనచోట దైవము దూఱున్‌.

### [3.5.66](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.66)

తే. కార్యఫలములయెడఁ దాన కర్త ననుట | కడు నెఱుంగమిఁ జువ్వె! తాఁ గర్తయేని  
తగిలి తనదైన కార్యజాతంబు నెల్లఁ | జెడక ఫలియించునట్లుగాఁ జేయరాదె!

### [3.5.67](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.67)

వ. అది యెట్లంటేని.

### [3.5.68](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.68)

సీ. నీతిమంతులు ధర్మనిరతులు దక్షులు | నగువారు సేయు కార్యములు గొన్ని  
సిద్ధిఁ బొందవు, దుష్టచిత్తులు క్రూరు లై | చేయఁ గొన్ని విశేషసిద్ధిఁ బొందు;  
నూరక యుండంగ నొందుఁ గొందఱ విపు | లార్థముల్‌; గొంద ఱాయాస పడియు  
నిష్ఫలారంభు లై నిలుతురు; గొందఱు | పేదవారికిఁ బ్రజ పెల్లు వొడము  
తే. నర్థవంతులు గొందఱ కర్థి నధిక | దానములు ధర్మములు సువ్రతములుఁ జేయఁ  
బ్రజలు వుట్టరు; విను మిట్టిభంగి సుమ్ము | కర్మఫల మాత్మతంత్రంబు గాక యుండు.

### [3.5.69](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.69)

క. పురుషుఁడు కర్మాధీనత | నరుగక తనవశమ యనిన నాపదలు రుజల్‌  
మరణంబును నివి యేమియుఁ | బొరయక యుండంగ బ్రదుకఁబోలదె చెపుమా!

### [3.5.70](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.70)

ఆ. కర్మవశతఁ జూవె కలుగు దేహము; దేహ | వర్తనంబు కర్మవశతఁ బుట్టు;  
దేహపాత మైన దేహస్థుఁ డగు జీవుఁ | డరుగుఁ గర్మవిహిత మైన యెడకు’.

### [3.5.71](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.71)

వ. అనినం గౌశికుండు ‘జీవుం డెట్టివాఁ?’ డని యడిగిన లుబ్ధకుం డి ట్లనియె.

### [3.5.72](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.72)

క. ‘విను జీవుండు సనాతనుఁ | డనఘుఁడు నిజకర్మవశత నధ్రువదేహం  
బునఁ బొందు దేహపాతం | బున నెప్పుడుఁ జెడఁ డతండు భూసురవర్యా!

### [3.5.73](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.73)

క. ఈ యొడలు విడిచి వేఱొక | కాయముఁ గైకొని శరీరి కర్మవశగతిం  
బోయి సుఖదుఃఖములు గనుఁ; | బాయక వెండియును దేహబంధముఁ బొందున్‌.’

### [3.5.74](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.74)

వ. అనిన విని బ్రాహ్మణుండు లుబ్ధకునితోడం ‘బుణ్యపాపానురూపంబు లయిన దేహబంధంబు లెట్టి?’ వనిన వాఁ డి ట్లనియె.

### [3.5.75](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.75)

చ. ‘స్థిరమగు పుణ్యకర్మమున దేవభవం బగుఁ, బుణ్యపాప సం  
కరమున మానుషత్వ మగుఁ, గల్మషముల్‌ పశుకీట భావముం  
బొరయఁగఁ జేయు; నిప్పగిదిఁ బుట్టుచుఁ జచ్చుచు మోహవార్ధిలోఁ  
దిరుగుచునుండుఁ గాని యొకతీరము సేరఁడు జీవుఁ డెన్నఁడున్‌.

### [3.5.76](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.76)

చ. ఇది సకలంబుఁ గాంచి బుధుఁ డెన్నఁడుఁ బాపము పొంతఁ బోక ని  
ర్మదనిరహంక్రియాత్ముఁడును మత్సరదూరుఁడు నై చరించుఁ బెం  
పొదవఁగ ధర్మమార్గమున నొయ్యన ధర్మము తీ పెఱింగి తా  
వదలఁడు సత్క్రియావిధము వారక యెక్కు డొనర్చు ధర్మముల్‌.

### [3.5.77](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.77)

చ. చిరముగ ధర్మముల్‌ నడపఁ జిత్తము దేఱుఁ బ్రసన్నచిత్తుఁ డై  
పరువడి నింద్రియార్థముల భంగులు రిత్తలుగా నెఱింగి చె  
చ్చెర నవి యంతవట్టు నిరసించి తపో దమ సత్యశీలతం  
బరిణతి నొందుఁ బొందుఁ బిదపం బరమార్థపదప్రభావమున్‌.’

### [3.5.78](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.78)

వ. అనిన నమ్మహాద్విజుండు ధర్మవ్యాధున కి ట్లనియె.

### [3.5.79](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.79)

ఆ. ‘ఇంద్రియంబు లనఁగ నెయ్యవి? యవి నిగ్ర | హింపకున్నఁ బాప మేమి దొడరు?  
వాని నిగ్రహించువానికి నగు ఫలం | బెట్టి?’ దనిన నాతఁ డిట్టు లనియె.

### [3.5.80](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.80)

క. ‘విను విషయజ్ఞానమునకు | ననయంబును మనసు మూల; మది కామక్రో  
ధనిరూఢ మగుచుఁ బురుషుని | ననిశము నెలయించు నింద్రియార్థక్రియలన్‌.

### [3.5.81](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.81)

సీ. ఇంద్రియార్థంబుల కెలసిన పురుషుండు | గాఢరాగంబునఁ గరఁగుచుండు;  
రాగంబువలనఁ దిరంబగు లోభంబు | లోభియై కరుణకు లోనుగాఁడు;  
మఱి సముద్ధతవృత్తి మరగుఁ బాపక్రియఁ | దగువారు సెప్పెడి తగవు వినఁడు;  
కుజనుల దెసఁ బ్రీతి గొఱలుఁ; దుల్యంబులు | గాకుండు వాఙ్మనఃకర్మభంగు;  
ఆ. లిహమునందుఁ బుణ్యహీనుఁడై చెడిపోవుఁ | బరమునందు దుఃఖభరము నొందుఁ;  
గాన యింద్రియార్థగతిఁ బోక సాధుసం | సర్గఁ జేసి సుగతిఁ జనుట యొప్పు.

### [3.5.82](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.82)

వ. ఇంద్రియంబు లన నెయ్యవి యనియు, నింద్రియ జయసిద్ధియు నీవు నన్నడిగితివి; తత్ప్రకారంబు బ్రహ్మవిద్యావిషయంబు మాబోఁటివారికి నవాచ్యం బై యుండు; నైనను నీవు బ్రాహ్మణప్రవరుండవు గావున సద్‌బ్రాహ్మణ ప్రియం బవశ్యకర్తవ్యంబు; పరమబ్రహ్మవిదు లైన బ్రాహ్మణవరులకు నమస్కరించి, బ్రహ్మవిద్యాప్రపంచం బెఱింగించెద; నవధాన పరుండ వై యాకర్ణింపుము.

### [3.5.83](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.83)

తే. అంబరము వాయు వగ్ని దోయమ్ము ధరణి | భూతపంచక మిది; క్రమంబున మహాత్మ!  
శబ్ద సంస్పర్శ రూప రసములు గంధ | సంయుతంబుగ భూతపంచక గుణములు.

### [3.5.84](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.84)

క. ఒనరఁగ నాకస మాదిగ | ననులోమముతోడ నిమ్మహాభూతము లే  
నును బుట్టు నొకటి కొక్కటి | యనయముఁ బ్రతిలోమగతి లయంబునఁ బొందున్‌.

### [3.5.85](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.85)

వ. శ్రోత్రంబును ద్వక్కును జక్షువును జిహ్వయు ఘ్రాణంబును నను నియ్యేనగు నింద్రియంబులు శబ్ద స్పర్శ రూపరసగంధంబు లింద్రియ విషయంబు లై యుండు; నింద్రియపంచకంబునకు షష్ఠం బై మనస్సుప్రకాశిల్లు; సప్తమాష్టమంబు లై బుద్ధియు నహంకారంబును వర్తిల్లు; సత్త్వంబును రజస్సును దమస్సును గుణంబు లై యుండు; నీ చెప్పంబడిన మహాభూతప్రముఖ ప్రపంచంబంతయు నవ్యక్తం బను తత్త్వంబునం దావిర్భావతిరోభావంబులం బొందుచుండు.

### [3.5.86](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.86)

క. అవ్యక్త తత్త్వ మరయఁగ | నవ్యక్తం బయ్యు నిట్టి దై లక్ష్య మగున్‌  
సువ్యక్తేంద్రియ భూతా | ది వ్యవహారార్థ లింగదృష్టాకృతి యై.

### [3.5.87](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.87)

వ. అని చెప్పి మఱియు ని ట్లనియె.

### [3.5.88](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.88)

తే. అనఘ! శబ్దాది విషయంబులందుఁ దగిలి | యిచ్చఁ జరియించు నెప్పుడు నింద్రియములు;  
బుధుఁడు దత్స్వభావముఁ దనబుద్ధి నెఱిఁగి | యేమఱక వానిఁ దగఁ గుదియింప వలయు.

### [3.5.89](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.89)

ఉ. ధీరుఁడు నిర్జితేంద్రియుఁడు దెల్లముగాఁ దనుఁ గాంచు భూత వి  
స్తారనిగూఢ మైన పరతత్త్వముగాఁ, దనయందు భూత వి  
స్తారము నెల్లఁ గాంచు సతతస్ఫుటదర్శనుఁ డై సమగ్ర వి  
స్ఫారతఁ బొంది నిర్మలతపంబులయందుఁ జలింప కెన్నఁడున్‌.

### [3.5.90](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.90)

క. తప మనఁగ సకల విషయ | వ్యపేత మగు నట్టి బుద్ధివైభవము సుమీ!  
తపమున సుస్థిరుఁ డగు యో | గపరునకుం గలవె యొండు కర్తవ్యంబుల్‌.

### [3.5.91](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.91)

క. స్వర్గనరకంబు లింద్రియ | వర్గ సమాచరణమునన వచ్చును వినవే!  
స్వర్గ మగుఁ దన్నివారణ | దుర్గతి యగుఁ దన్నిరోధ దుర్బలతమెయిన్‌.

### [3.5.92](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.92)

చ. అరదము దేహ, మింద్రియము లశ్వము, లాత్ముఁడు సూతుఁ డమ్మహా  
తురగచయంబు ధైర్య మను తోరపుఁ బగ్గములన్‌ దృఢంబుగా  
నురవడిఁ బోక యుండ వెర వొప్పఁగఁ బట్టినవాఁడు సేమపుం  
దెరువున నేఁగు నప్పరమధీరుఁడు సువ్వె యుదారుఁ డెయ్యెడన్‌.

### [3.5.93](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.93)

తే. ఇంద్రియంబులు దివిచిన యెడక పాఱు | చుండు మన సెప్డుఁ; దద్వేగ ముడుపకున్న  
నెడలి చెడిపోవు బుద్ధి యుదీర్ణపవన | హతిఁ బయోనిధిలోఁ గల మవియు నట్లు.

### [3.5.94](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.94)

క. ఏనింద్రియములు మనసును | బూని తనవశంబ యైన బురుషుండు గదా  
ధ్యానసమాధిసమగ్రుఁడు | వానిం గీర్తింతు రమరవరులున్‌ మునులున్‌.’

### [3.5.95](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.95)

వ. అనిన నవ్విప్రుండు సత్త్వరజస్తమోగుణంబులతెఱం గెఱింగింపు మనిన నెఱు కి ట్లనియె.

### [3.5.96](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.96)

క. అతినిందితము తమోగుణ | మతిబోధమయంబు సత్త్వ మనయంబుఁ బ్రకా  
శత నొప్పు; నుభయగుణమి | శ్రతఁ బరఁగు రజోగుణంబు సన్నుతచరితా!

### [3.5.97](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.97)

మ. అసుఖాకారత నిద్ర దైన్యము విమోహం బక్షమత్వంబుఁ దా  
మసభావంబులు; రాగలోభజడతామానంబు లూహింప రా  
జసవృత్తంబులు; ధైర్యశాంతికరుణాసంతోషవిద్యాదు లిం  
పెసఁగన్‌ సాత్త్విక చేష్టితంబులు; నిజం బి ట్లాత్మఁ గ న్మిన్నియున్‌.

### [3.5.98](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.98)

చ. అనఘుఁడు సాత్త్వికుం డగు మహాత్ముఁడు బోధనిరూఢి సర్వముం  
గనికొని లోకవృత్తములు గావని రోసి సమస్తసంగభం  
గనిరతుఁ డై తొరంగు మమకారవికార మహంక్రియాచ్యుతిం  
బనుపడి సంయమప్రకట భావన నుత్తమశాంతిఁగైకొనున్‌.

### [3.5.99](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.99)

వ. సత్త్వగుణనిబద్ధుం డగునేని శూద్రుం డైనను జన్మాంతరంబున వైశ్యత్వంబు నొంది క్రమంబున రాజభూసురభావంబులు భజించి భవవిముక్తుం డగు’ నని చెప్పిన నమ్మహీదేవుం డమ్మహానుభావు నభినందించి.

### [3.5.100](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.100)

తే. ‘దేహమున ధాతు సంశ్రయదీప్తుఁ డగుచు | వహ్ని యెట్లుండు? శారీరవాయువులకు  
నెలవు లెయ్యవి? యవి నాకు నిశ్చయముగఁ | జెప్పు’ మనుటయు నిట్లని చెప్పె నతఁడు.

### [3.5.101](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.101)

సీ. మూర్ధదేశమునకు వర్ధితం బై పర్వు | నాత్మాగ్ని; నాభి దదాశ్రయంబు;  
శిరమునఁ బావకాంతరమునఁ జరియించుఁ | బ్రాణుండు భూతాత్మభావుఁ డతఁడు;  
వరుసఁ బ్రాణాపాను లిరువురు నయ్యగ్ని | వెలిగింతు రనపేతవృత్తు లగుచు;  
గుదవస్తితలము లాస్పదములుగా వహ్ని | పరిగతుం డగుచు నపానుఁ డుండు;  
తే. గడఁగి విణ్మూత్రనిర్గమకారి యతఁడు; | కర్మబలయత్నకారి యై కంఠతలము  
నం దుదానుండు వర్తించు; నఖిలదేహ | సంధులందును వ్యానుండు సంచరించు.

### [3.5.102](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.102)

క. విను, ప్రాణాపానులు న | య్యనలుఁడుఁ బ్రాపుగ సమానుఁ డన్నరసవిపా  
చనుఁ డగుచు నాభిదేశం | బున నుండును సకలధాతుపోషకవృత్తిన్‌.

### [3.5.103](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.103)

క. ఇది పరమయోగదర్శన | విదితం; బిప్పాటఁ బవనవిదు లైన మునుల్‌  
వదలక యభ్యాసవిధిన్‌ | ముదమున ధరియింతు రాత్మమూర్ధతలమునన్‌.

### [3.5.104](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.104)

వ. ప్రాణాపానసమాహితుండై సకలదేహంబులందును జరియించుచున్న పావకుండు జీవాత్ముండుగా నెఱుంగు; మతండు జలంబుల నున్న కమలపత్త్రంబునుంబోలె దేహంబునం దుండియు నిర్లేపస్వరూప దీపితుం డయి వెలుంగుచుండు; నిట్టి జీవాత్ముండ కదా పరమాత్ముండు.

### [3.5.105](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.105)

క. చేతన రహితక్షేత్రముఁ | జేతనముం బొరయఁ జేయు జీవాత్మ దశో  
పేతుఁడు పరమాత్ముఁడు వి | ఖ్యాతుఁడు త్రైలోక్యసంప్రకల్పనుఁ డనఘా!

### [3.5.106](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.106)

క. భూతములయందు వెలిఁగెడు | భూతాత్ముని నెఱుఁగుదురు ప్రబుద్ధులు నిత్య  
జ్యోతిర్మయు నవ్యయు న | ద్వైతం బగు బుద్ధి సూక్ష్మధర్మమువలనన్‌.

### [3.5.107](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.107)

వ. అని మఱియుఁ గౌశికునకు ధర్మవ్యాధుండు బ్రహ్మవిద్యా ప్రభావంబు తెఱంగు సంప్రయోగరహస్యంబు తెలియ ని ట్లనియె.

### [3.5.108](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.108)

సీ. ‘తెలివి నొందిన బుద్ధిగల మహాత్ముండు శు | భాశుభ కర్మములందుఁ జొరఁడు;  
క్రమమున సౌఖ్యదుఃఖము లాదిగా నశే | షద్వంద్వములయందు సమత నుండు;  
విను, మట్టిపుణ్యున కొనరింపవలయు కా | ర్యం బెఱింగించెద ననుదినంబు  
నియతాశియును జితేంద్రియుఁడు నై పూర్వరా | త్రమ్మున నపరరాత్రమ్మునందు  
తే. యోగధారణనిరతుఁడై యుండవలయు; | నపుడు బోధదీపంబున నాత్ము నాత్మ  
యందుఁ గనుచు నివాతదీపానుకారి | యై వెలుంగుచు నమృతమయత్వ మొందు.

### [3.5.109](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.109)

క. కామంబును గ్రోధంబును | నేమఱక జయింపవలయు నెల్ల విధములన్‌  
ధీమహిత! యిదియ సతత | క్షేమంకర మైన పథము గృతబుద్ధులకున్‌.

### [3.5.110](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.110)

క. నిత్యముఁ గర్మియుఁ గర్మఫ | లత్యాగియు నగుట లెస్స లౌల్యవియోగం  
బత్యుత్తమ యోగము ద | త్ప్రత్యయలక్ష్యుండు సూవె బ్రాహ్మణుఁడు మహిన్‌.

### [3.5.111](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.111)

చ. అరయఁగ జీవితంబు గడునస్థిర; మింత యెఱింగి యాత్మ నె  
వ్వరిదెసఁ గీడురోయక ధ్రువం బగు మైత్రి భజించి సత్కృపా  
నిరతుఁడు నిష్పరిగ్రహుఁడు నిత్యతపస్వియు నిత్యతృప్తుఁడుం  
బరమశమాన్వితుండు నగు బ్రాహ్మణుఁ డొందు సనాతన స్థితిన్‌.

### [3.5.112](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.112)

వ. నీవడిగిన యఖిలధర్మంబులు సంక్షేపరూపంబున నెఱింగించితి; నింక నెయ్యది వినవల’ తనినం గౌశికుండు‘ ‘మహాత్మా! వినవలయునవి యెల్లను విశదంబుగా వింటిం; బ్రబుద్ధుండ నైతి; నీవు సర్వజ్ఞుండ వగుట దెల్లం బయ్యె’ ననిన ధర్మవ్యాధుం డతని కి ట్లనియె.

### [3.5.113](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.113)

క. ‘ఏ నిమ్మెయి నుత్తమ వి | జ్ఞానోన్నతి వడయుటకు నిజం బగు మూలం  
బైనది గల దొక ధర్మము | భూనుత! యది నీకు దృష్టముగ నెఱిఁగింతున్‌.

### [3.5.114](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.114)

వ. అభ్యంతరగృహంబునకుర’ మ్మని యతనిం దోడ్కొని చని మనోహరంబై చతుశ్శాలంబై వివిధసౌరభసంవాసితం బైన హర్మ్యంబునందు మహితాసనాసీను లైన వారిం దన జననీ జనకుల నభిమతాహారపరితోషితులఁ బరమాంబరాభరణ గంధమాల్యాలంకృతమూర్తుల నతనికిం జూపి, తానును దత్పాదప్రణామంబు సేసి, వారలఁ గుశలం బడిగిన, నయ్యిరువురుం బుత్త్రున కి ట్లనిరి.

### [3.5.115](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.115)

సీ. ‘అన్న! కుమార! నీయట్టి సత్పుత్త్రుండు | గలుగ మా కేమిటఁ గడమ సెపుమ!  
నీ చేయు ధర్మంబ నీకుఁ దోడయ్యెడుఁ | బరమాయు రర్ధసంపదలుఁ గనుము;  
నీ చరిత్రంబున నిఖిలవంశముఁ బవి | త్రిత మయ్యె మానుషదేహ మేల  
ధరియించితో కాని తత్త్వమారయఁ బర | దేవత వీవు; సందియము వలదు;  
తే. వాఙ్మనఃకర్మములఁ బితృవత్సలత్వ | మొక్కరూపుగఁ జలుపుచు నున్నయట్టి  
సద్గుణాకరు నిన్నెన్ని జామదగ్న్యు | నొకని నెన్నంగఁ దగుఁ గాక యొరులు గలరె!’

### [3.5.116](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.116)

వ. అని పలికి; రప్పుడు ధర్మవ్యాధుండు వారికిం గౌశికుం జూపి, ‘యిమ్మహాత్ముండు మనలఁ జూచువేడ్కనిటవచ్చె’ నని చెప్పిన నావృద్ధు లతనికి నర్హసత్కారంబులు గావించినం, గైకొని, యతండు వారలఁగుశలం బడిగె; నంత నవ్విప్రునకు లుబ్ధకుం డి ట్లనియె.

### [3.5.117](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.117)

సీ. ‘జననుత! వీరు నా జననియు జనకుండుఁ | జూవె! వీరలకు శుశ్రూష సేసి,  
యిట్టి పరిజ్ఞాన మేనుఁ బ్రాపించితి | నమరులఁ బూజింతు రర్థి నెల్ల  
వారును; నొండు దైవంబుల నెఱుఁగ; నీ | వృద్ధుల నాపాలి వేల్పు లనఘ!  
కమనీయ ఫలపుష్పగంధభూషణవస్త్ర | ములు మనోహరభక్ష్యభోజ్యములును  
తే. వీరి కెపుడు నివేదింతు, వేడ్కఁ బుత్త్ర | దారసహితుండ నై నియతముగ సేవ  
యాచరింతును; వేదముల్‌ యజ్ఞములు వ్ర | తంబులును వీర నా కను తలఁపు దృఢము.

### [3.5.118](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.118)

తే. జనని జనకుఁడు సద్గురుఁ డనలుఁ డాత్ముఁ | డనఁగ నియ్యేవురును నే గృహస్థుచేత  
సుగతివాంఛఁ బ్రసాదితు లగుదు రట్టి | వాఁడ సూవె ధర్మాత్ముండు వసుధమీఁద’.

### [3.5.119](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.119)

వ. అని చెప్పి యిట్లనియెఁ; ‘బతివ్రత పనుపునం జేసి నీవు ధర్మజ్ఞానార్థంబు నాయున్నయెడకుం జనుదెంచిన నప్పతివ్రతవలని యనుగ్రహంబున నీకు నెల్లవియు నెఱింగించితిఁ గాని, నీదెస నాదు చిత్తంబు ప్రియంపడియుండదు; నీచేసిన యకార్యం బొక్కటి గల దది యెయ్యది యనిన;

### [3.5.120](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.120)

ఉ. ఎంతయు వృద్ధు లై తమకు నీ వొకరుండవ తెప్ప గాఁగ న  
త్యంతముదంబునన్‌ బ్రదుకు తల్లిని దండ్రిని నుజ్జగించి ని  
శ్చింతుఁడ వై సదాధ్యయనశీలత వారియనుజ్ఞ లేక యే  
కాంతమ యెమ్మెయిన్‌ వెడలి తక్కట! నీవు గరంబు క్రూరతన్‌.

### [3.5.121](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.121)

ఆ. నీక వగచి వగచి నిర్భిన్నహృదయు లై | విగతచక్షు లైరి వినవె? వార;  
లరిగి యింక నైన నమ్ముదుసళ్ల యు | దగ్రశోకవహ్ని నార్పవయ్య!

### [3.5.122](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.122)

క. నీయధ్యయనమ్మును సుకృ | తాయాసము నిష్ఫలంబు లై చను గురుసే  
వాయుక్తి లేక తక్కినఁ | జేయుము నాపలుకు; మేలు సేకుఱు నీకున్‌.’

### [3.5.123](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.123)

వ. అనినఁ గౌశికుం డతని కిట్లనియె.

### [3.5.124](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.124)

క. ‘ఇది యట్టిద నీ చెప్పిన | సదమలహితవాక్యభంగి సకలము వింటిన్‌;  
వదలక యిమ్మెయిన చరిం | చెద గురుజనములకుఁ బ్రీతిఁ జేసెద ననఘా!

### [3.5.125](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.125)

క. నాదైన భాగ్యవశమునఁ |గాదే నీతోడి చెలిమి గలిగెం, బరమా  
హ్లాదమనస్కుఁడ నైతి, శు | భోదయముల కెల్ల నింక యుక్తుఁడ నైతిన్‌.

### [3.5.126](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.126)

క. పాపకృతం బగు దుర్గతి | మోపుఁ గనకయుండ ననుఁ బ్రబోధాత్మక లీ  
లాపరిణతుఁ గావించితి; | నాపాలిటి వేల్ప వీవ నరనుతచరితా!

### [3.5.127](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.127)

చ. అనుపమ మెట్టివారలకు నందదు ధర్మపథంబు ధాత్రిలో;  
విను, పదివేవురం దొకఁడు విశ్రుతధర్మపరాయణుండు గ  
ల్గునొ కలుగండొ సందియము; గోరి సనాతనధర్మ మూఁది యె  
వ్వనికిని నీకుఁ బోలె బుధవత్సల! యిట్లు చరింపవచ్చునే.

### [3.5.128](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.128)

చ. నిను నొక శూద్రుఁగాఁ దలఁపనేర గుణాకర; నీ చరిత్రముం  
గన మది నద్భుతం బొలసెఁ; గావున నెయ్యది కారణంబుగా  
నొనరఁగ నిట్టి జన్మమును నొందితి చెప్పుము; భూత భావివ  
ర్తనములయందు నీకు విదితంబులు గానివి గల్గ వెమ్మెయిన్‌’.

### [3.5.129](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.129)

వ. అనిన నతనికి ధర్మవ్యాధుం డిట్లనియె.

### [3.5.130](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.130)

క. ‘జననుత! నీ వెయ్యది యడి | గినఁ దెలుపుట నా కవశ్యకృత్యము గాదే!  
విను చెప్పెదఁ; బూర్వభవం | బున నే నొక బ్రాహ్మణుండఁ బుణ్యచరితుఁడన్‌.

### [3.5.131](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.131)

వ. వేదవేదాంగపారంగతుండ నై యుండుదు; నాకుం బ్రియసఖుం డైన యొక్క రాజపుత్త్రుతోడి సంగతిం జేసి ధనుర్వేదంబును నభ్యసించితి; నొక్కనాఁ డమ్మహీపతి వేఁట వోయిన నేనును నతనితోడన చని వనంబునం బెక్కు మృగంబుల నేయుచుండ నం దొక్కబాణంబు దృణలతాంతరితదేహుండైన మునివరు నొక్కరుం దాఁకిన నతఁడు హా! యనుచుం బడియె; నంత నేనును.

### [3.5.132](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.132)

ఆ. డాయఁబోయి తీవ్రసాయకవిద్ధుఁ డై | పొరలుచున్న విప్రవరునిఁ జూచి  
తలఁకి యనునయంపుఁ బలుకులు పలికినఁ, | గినిసి యిట్టు లనియె మునివరుండు.

### [3.5.133](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.133)

ఆ. ‘బ్రాహ్మణుండవయ్యుఁ బాపప్రవృత్తివై | శూద్రకర్మమునకుఁ జొచ్చి తీవు  
గాన నిక్కువము మృగవ్యాధజన్ముండ | వగుము మీఁద’ ననియె; ననిన నేను.

### [3.5.134](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.134)

చ. ‘ఎఱుఁగక తప్పు సేసితి సహింపఁగదే! కడుదుర్భవంబునం  
బఱుపకుమయ్య!’ నావుడుఁ గృపన్‌ మునినాథుఁడు ‘దప్ప దివ్విధం;  
బెఱుకుకులంబునందు జనియించియు ధర్మువు లెల్ల నిమ్ముగా  
నెఱిఁగెదు, తల్లిదండ్రులకు నెంతయుఁ బ్రీతి యొనర్తు భక్తితోన్‌.

### [3.5.135](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.135)

వ. గురుశుశ్రూషం జేసి నీకుఁ బరమశోభనం బగు; జాతిస్మరత్వంబునుం గలుగు; నపరజన్మంబునఁ బరమబ్రాహ్మణుండ వయ్యెద’ వని యనుగ్రహించిన, నవ్విప్రుని దేహంబునందు నాటిన బాణంబు మెత్తన పెఱికి, యతనిం దదీయాశ్రమంబునకుం జేర్చితి; నా చేసినపుణ్యంబున నమ్మహాత్ముండు నపాయంబు వొందం డయ్యె; నాకు నిట్టిజన్మంబు నొంద వలసె’ నని చెప్పినం గౌశికుం డిట్లనియె.

### [3.5.136](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.136)

తే. ‘జన్మ మిట్టిది, చరితంబు చంద మిట్టి | దెన్నఁడును నిట్టిచోద్య మే నెందుఁ జూడ;  
నింక జన్మాంతరముదాఁక నేల? యిపుడ | పుణ్యచరిత మై నీవు విప్రుఁడవ కావె!

### [3.5.137](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.137)

ఆ. పాపవర్తనుండు బ్రాహ్మణుం డయ్యును | నిజము శూద్రుకంటె నీచతముఁడు;  
సత్యశౌచధర్మశాలి శూద్రుం డయ్యు, | నతఁడు సద్ద్విజుండ యనిరి మునులు.

### [3.5.138](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.138)

క. అనయంబు నాత్మకర్మం | బున నతినీచ మగు భవముఁ బొందవలసెనే  
యని నీవు నిరంతరమును | మనమున దుఃఖింపవలదు మహితచరిత్రా!

### [3.5.139](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.139)

చ. నిజగుణదోషకర్మముల నెట్టన మేలును గీడు వచ్చుఁ; ద  
త్ప్రజనితసౌఖ్యదుఃఖములఁ బ్రాజ్ఞులు దుల్యమనస్కులై మనో  
రుజలును దేహజంబు లగు రోగములున్‌ హితధర్మకర్మభే  
షజములఁ జేసి పొపుదురు సర్వము సాత్త్వికదృష్టిఁ జూచుచున్‌.

### [3.5.140](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.140)

క. ప్రియములు వాయుటయును న | ప్రియములు వెసఁ బొందుటయును బెల్లుగ నగుఁ ద  
త్క్రియలందు మూఢమతికి హృ | దయతాపము పాయ దెపుడు దరికొనుచుండున్‌.

### [3.5.141](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.141)

తే. వగతుమన్న నెవ్వారికి వగవఁ జనదు | చిత్తమున నేమిటికి సంతసింపరాదు  
కాన గతమునందును ననాగతమునందు | వగవ రార్యులు సంతోషవంతు లగుచు.

### [3.5.142](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.142)

క. వగపునఁ దేజోహీనుం | డగు నాత్మహితక్రియలకు నక్షముఁ డగు న  
వ్వగపు దొఱఁగి యుద్యోగము | దగఁ జేయఁగఁ గలుగు నంచితము లగు శుభముల్‌.

### [3.5.143](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.143)

వ. కావున భూతంబుల సదసత్ప్రకారంబులు గనికొని ధీరుండ వై యుండు’ మనిన ధర్మవ్యాధుండు ‘మహాత్మా! నీ చెప్పినయంతవట్టు నిదర్శనంబులుగాఁగొని యేను నిఃఖేదుండ నై యున్నవాఁడ; భవిష్యత్కాలసద్భావంబునందు సమాహితుండ నై యుండువాఁడ’ ననియె; నంత నా భూదేవుండు.

### [3.5.144](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.144)

చ. ‘అతులిత పుణ్యమూర్తివి, కృతాత్ముఁడ వెందును నీవు ధర్మ మూ  
ర్జితముగ నెప్పు డేమఱక చేయుచు నుండుము, నిత్యశోభన  
స్థితి వెలుగొందు; మేను భవదీయసమాగతిఁ జేసి ధర్మ సు  
స్థితమతి నైతి న న్ననుమతింపు గుణాకర! పోయి వచ్చెదన్‌.’

### [3.5.145](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.145)

వ. అని వానికిం బ్రదక్షిణంబు సేసి వీడ్కొని చని కౌశికుండు నిజజననీజనకుల కతిభక్తి శుశ్రూష చేసి కృతార్థుం డయ్యెం; బాండవోత్తమా! నీయడిగిన తెఱంగునం బతివ్రతామాహాత్మ్యంబును బితృశుశ్రూషావిశేషంబును హీనవర్ణుం డైనవాఁడు ధర్మంబు సలుపు నుపాయంబును జెప్పితి’ ననిన విని ధర్మతనయుండు సంతసిలి మఱియు మార్కండేయు నిట్లని యడిగె.

### [3.5.146](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.146)

తే. ‘అగ్నిదేవుండు తొల్లి మహాతపంబు | సేసె నని విందు; నది యేల చేసె ననఘ!  
యంగిరసుఁ డేమి కతమున నగ్ని యయ్యె? | నగ్ను లెన్ని విధంబుల నతిశయిల్లు?

### [3.5.147](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.147)

వ. ఇంతయు వినవలతు’ ననిన, నమ్మహాముని యిట్లని చెప్పె; ‘నగ్నిదేవుండు దేవతలతోడి యలుకం జేసి హవ్యంబులు వహింప నొల్లక వనంబునకుం జని బహుకాలంబు ఘోరతపంబు సేయుచు నత్యంతకృశుం డై యాత్మ గతంబున.

### [3.5.148](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.148)

చ. ‘అలుకమెయిం దొలంగి విపినాంతరభూమికి వచ్చి యిట్లు నే  
వెలుఁగక యున్నచో భువనవృత్తము సర్వము నిల్చు, నిల్చినన్‌  
జలరుహసూతి వేఱొకనిఁ జయ్యన నగ్ని పదంబునందుఁ దా  
నిలుపక యున్నె? నే నిచట నిల్చుట పోలదు పోయెదన్‌ వెసన్‌’.

### [3.5.149](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.149)

వ. అని తలంచి తపంబు సాలించి నిజపదంబున కున్ముఖుండై చని చని, యంతకు మున్న బ్రహ్మనియోగంబునం ద్రిలోకంబులకు నగ్నియై వెలుంగుచున్నవాని నధికతపో విజృంభితు నంగిరసుం గని, భయంపడి, యెప్పటి యట్ల మగిడిపోవు నెడ నంగిరసుం డతనిపాలికిం జనుదెంచి, యిట్లనియె.

### [3.5.150](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.150)

చ. ‘అనఘ! జగత్త్రయార్చితుఁడవై తిమిరాపహరుండవై తగన్‌  
వనరుహగర్భుచేఁ బ్రథమవహ్నిపదంబునఁ గల్పితుండ వై  
తనరుదు; రమ్ము! నీ దగు పదంబున నే నిటులుండ నోడుదున్‌;  
ఘనముగ నీవు నీ పదము గైకొనవే! యవికల్పభావనన్‌’.

### [3.5.151](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.151)

వ. అనిన నగ్నిదేవుం డిట్లనియె.

### [3.5.152](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.152)

క. ‘విను నా కీర్తి జగంబులఁ | బొనుఁగు పడియె; నీవు భువనపూజితవృత్తిం  
బనుపడితి గానఁ దగు నీ | యనలపదము నీక; నాకు నలవడ దింకన్‌.

### [3.5.153](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.153)

వ. ‘నీవు ప్రథమాగ్నివైయుండు; మేను ద్వితీయంబగు ప్రాజాపత్యవహ్నినైవర్తించెద’ ననిన నంగిరసుండు ‘దేవా! యి ట్లానతీ వలదు; ప్రథమాగ్నిత్వంబు నీవ కైకొని, నన్ను నీకుం బ్రథమపుత్త్రుంగా నాదరింపు’ మనినం. బావకుండు దాని కొడంబడియె; నివ్విధంబున నంగిరసుం డగ్నికి నగ్రతనయుం డై యగ్నిసారూప్యంబునం దేజరిల్లె; నయ్యంగిరసునకు శివ యను దానికి బృహత్కీర్తియు, బృహజ్జ్యోతియు, బృహద్బ్రహ్మయు, బృహన్మనసుండును, బృహన్మంత్రుండును, బృహద్భానుండును, బృహస్పతియు నన నేడ్వురు గొడుకులు, మఱియు భానుమతియును, రాగయు, సినీవాలియుఁ, గుహువు, నర్చిష్మతియు, మహిష్మతియు, మహామతియు నన నేడ్వురు గూఁతులుం బుట్టిరి.

### [3.5.154](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.154)

క. తనయుఁడు బృహస్పతికి న | త్యనఘుఁడు శంయుండు వుట్టి యాగంబులలో  
మునుమును హవిషాజ్యము దాఁ | గొనియెడు వాఁ డయ్యె నధికగుణయుక్తి మెయిన్‌.

### [3.5.155](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.155)

వ. ఆ శంయునకు ధర్మపత్ని యైన సత్యకు భరద్వాజుండును భరతుండును నా నిరువురు కొడుకులు పుట్టి; రందు భరతునకు భారతుం డను కొడుకును, భారతి యను కూఁతురుం బుట్టిరి; భరద్వాజునకు వీర యను దానికి వీరుండు పుట్టె.

### [3.5.156](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.156)

క. వానికి సరయువునకుఁ బటు | భానుం డై పుట్టె సుతుఁడు భానుఁ డనఁగ; నా  
భానునకు నిశ్చ్యవనుఁ డనఁ | గా నాత్మజుఁ డుద్భవించెఁ గడు నుజ్జ్వలుఁ డై.

### [3.5.157](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.157)

చ. అతనికిఁ బుట్టెఁ బుత్త్రుఁడు నిరంతరతేజుఁ డుదారకీర్తి ని  
ష్కృతి యను పేరివాఁడు విను కిల్బిషభాజను లైన మానవుల్‌  
సతతము నా కృశాను నతిసక్తమనస్‌స్థితిఁ గొల్చి దోష ని  
ష్కృతిఁ దగఁ గాంతు; రట్లగుట గీర్తిత మయ్యెఁ దదాఖ్య వానికిన్‌.

### [3.5.158](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.158)

క. ఘనుఁడు రుజస్కరుఁ డనఁగా | జనియించెను నాతనికి; రుజస్కరునకు న  
త్యనుపమకాంతిపరుం డై | జనియించెం గ్రోధుఁ డనఁగ జనవరతిలకా!

### [3.5.159](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.159)

వ. ఆ క్రోధునకు రసుండు వుట్టె; రసునకు స్వాహా యను కన్యకయుం గాముం డను కొడుకునుం బుట్టిరి; కామునకు నమోఘుండు పుట్టె; నమోఘునకు నుక్థుండు పుట్టె; మఱియుం గాశ్యపుండును వాసిష్ఠుండును బ్రాణుండును నాంగిరసుండును జ్యవనుండును నను వా రేవురు తేజస్వి యైన కొడుకుం బడయుదు మని యనేక వర్షంబులు ఘోర తపంబు సేసి మహావ్యాహృతిస్మరణంబు సేయుచున్నంత.

### [3.5.160](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.160)

చ. అనలము చాయ మస్తకము, నర్కనిభం బగు బాహుయుగ్మముం,  
గనకసముజ్జ్వలంబు లగు కన్నులుఁ, జర్మము కృష్ణవర్ణతం  
దనరిన జంఘలుం గల యుదాత్తపు దేహము దేజరిల్లఁగాఁ  
దనయుఁడు పుట్టె వారలకుఁ దద్దయు నద్భుత మంద లోకముల్‌.

### [3.5.161](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.161)

వ. ఇట్లు పుట్టిన యప్పావకుండు పంచజనకప్రభవుండు గావునం బాంచజన్యుం డను పేరం బ్రసిద్ధుం డై దశ సహస్రవర్షంబులు దపంబు సేసి నిజమస్తకంబున బృహద్రథంతరులనువారలను, వదనంబున హరిని, నాభియందు శివుని, బలంబున నింద్రునిం, బ్రాణముల వాయ్వగ్నులను, బాహుయుగదంతపుటంబుల విశ్వభూతంబుల సృజియించె మఱియును.

### [3.5.162](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.162)

క. తపుఁ డను వహ్ని నిరంతర | తపోనిరూఢుఁ డయి పంచదశపుత్త్రుల న  
త్యపరిమిత ఘోర తేజో | విపులాత్ములఁ గనియెఁ గపటవృత్తినిపుణులన్‌.

### [3.5.163](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.163)

వ. ఆ పదియేవురు సుభీముండు, నతిభీముండును భీముండును భీమబలుండును నతిబలుండు నను వా రొక్క మొగియును, సుమిత్త్రుండును మిత్త్రవంతుఁడును మిత్త్రజ్ఞుండును మిత్త్ర వర్ధనుండును మిత్త్రధర్ముండును నను వా రొక్క మొగియును, సురప్రవీరుండును వీరుండును సువేషుండును సువర్చసుండును సురహంతయు నను వారొక్క మొగియునుగానిట్లు మూఁడుమొత్తంబు లై యజమానుల యజ్ఞఫలంబు లపహరించు చుండుదురు; తత్ప్రశాంత్యర్థంబై యాగంబులందు నగ్నిచయనంబు సేయునది.

### [3.5.164](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.164)

తే. అధిప! విహగాకృతుల నొప్పు నగ్ని చయన | ముల యుదగ్రపక్షాఘాతములను విప్ర  
వరుల మంత్రఘోషములను వారు నిహతు | లై భయంపడి చేరరు యజ్ఞభూమి.

### [3.5.165](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.165)

వ. తపుండు మఱియు సకలయజ్ఞభాగభుజు లైన పుత్త్రుల నేవురం గనియె; నం దగ్రజుండు.

### [3.5.166](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.166)

సీ. వైశ్వానరుం డను వహ్ని చాతుర్మాస్య | విధులందు భూసురవితతిచేతఁ  
బర్జన్యసహితుఁ డై పరమార్చనముఁ గాంచు | నధిప!; రెండగు నాతఁ డఖిలమునకుఁ  
బ్రభుఁడు దానై విశ్వపతి యన విలసిల్లు; | వినుము! మూఁడగు వాఁడు విశ్వమునకు  
నాత్ముఁడై విశ్వకుం డన నొప్పు; నాలవు | నతఁడు భూతముల యాహార వితతి  
తే. వెలయఁ బక్వము సేయుట విశ్వభుక్కు | నాఁగఁ బెంపొందు; గోపతి నామధేయుఁ  
డై సమస్తధర్మక్రియలందు హేతు | వై ప్రశస్తి వహించు నేనగు నతండు.

### [3.5.167](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.167)

వ. మఱియు భానుం డను వహ్నికి సోమపుత్త్రియైన బృహద్భాసయందు బలదుండును మన్యుమంతుండును ధృతిమంతుండును నాగ్రయణుండును నగ్నియు సోముండును నన నార్వురు గొడుకులు నిశ యను కూఁతురుం బుట్టిరి; సకలతపఃఫలంబులు నిర్వహించుట కయి పురందరుండు మను నామ ధేయుం డైన కొడుకుం బడసె; నమ్మనువు భానుపుత్త్రియైన నిశాకన్యం బెండ్లియై, ప్రాజాపత్యుం డను పేరఁ బరఁగి పరమబ్రాహ్మణులచేత నర్చితుం డయ్యె; నివ్విధంబున ననేక వహ్నులు సకలధర్మ క్రియాసాధకు లై వెలింగిరి; దక్షిణాగ్ని ప్రముఖంబు లైన వహ్నులు వాయుహతిం జేసి యన్యోన్య సంస్పృష్టంబు లయ్యె నేనియు, రజస్వలాది సంకరంబులం బొరసె నేనియు, మృతక జాతకాది సంస్పర్శనంబునం బొందెనేనియుఁ, దత్ప్రాయశ్చిత్తార్థం బై యష్టాకపాలేష్టి సేయ వలయు’ నని చెప్పి మఱియు మార్కండేయుం డిట్లనియె.

### [3.5.168](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.168)

క. ‘ఆపుఁ డను వహ్ని యతులిత | రూప యయిన ముదిత యను తరుణియందు జగ  
ద్దీపకు నపారతేజు మ | హాపూజ్యుం గనియె నగ్ని నద్భుతనామున్‌.

### [3.5.169](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.169)

చ. అతఁడు త్రిలోకతంత్రము నిరంతర మై చన నిర్వహించుచున్‌  
శతమఖుఁ డాది యైన సురసంతతికిం బ్రియ మొప్ప హవ్యముల్‌  
సతతము మోచి యిచ్చుచు భృశం బగు తద్భర మోర్వలేక సు  
వ్రత నిరతుం డధర్వుఁ డనువానికి నిట్లను నాదరంబుతోన్‌.

### [3.5.170](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.170)

వ. ‘ఏను దుర్బలుండ నైతి; నీవు దేవతలకు హవ్యంబులు మోచి యి’ మ్మని వానిం బంచి, తాను సముద్రంబు సొచ్చి యందు దాఁగుటయు, దేవత లద్దేవముఖుం డున్న యెడ రోయం దొడంగిన నబ్ధిచరంబు లైన మత్స్యంబులు సురలకు నగ్నిదేవుండు జలధి నుండుట సెప్పుటయుం గనలి యనలుండు మీలం జూచి’ జనంబులు మిమ్ము నిర్దయు లై వధియింతురు గావుత’ మని శాపం బిచ్చె; నప్పుడు.

### [3.5.171](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.171)

ఆ. హవ్య వహనమునకు నమరోత్తములు దన్ను | వేయువిధుల నొలసి వేఁడుకొనిన  
నెట్లు నియ్యకొనక యెంతయు విసిగి స | మీరసఖుఁడు దనదుమేను విడిచె.

### [3.5.172](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.172)

వ. ఇట్లు సంత్యక్తశరీరుం డై ధరాతలంబు ప్రవేశించుటయు, నతనిచేత విడువంబడిన దేహంబువలనం బూయంబున గంధకంబు, నస్థుల దేవదారువును, శ్లేష్మంబున స్ఫటికంబును, బిత్తంబున మరకతంబును, వాతంబునఁగృష్ణశిలయు, నఖంబుల నభ్రకంబును, స్నాయుసంచయంబునం బ్రవాళంబునుం బుట్టె; నతండు భూగర్భస్థితుండై ఘోరతపంబుసేయుచున్నంత భృగ్వంగిరఃప్రముఖులైన మహామునులు నిజతపోబలంబున నతనికి నాప్యాయనంబు సేయుటయుఁ దేజస్వి యై ధరణి వెలువడి వచ్చి యమ్మహాత్ముం డమ్మహామునులం జూచి తదీయతేజంబు దనకు దుస్సహం బగుటయు భయంపడి క్రమ్మఱ నంబుధి సొచ్చి యడంగిన.

### [3.5.173](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.173)

క. విను జననాయక! సంయమి | జనములు వహ్నిపని యంతఁ జాలించి ప్రియం  
బున నంచితవిధి సంగ్రహ | మునకై పూజించి రధికపుణ్యు నధర్వున్‌.

### [3.5.174](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.174)

వ. అయ్యధర్వాగ్ని తేజంబును నమ్మును లతనికిం జేయు బహుమానంబునుం దన్ముఖంబున నమరులు దృప్తు లగుచునికియుం జూచి సహింపక పావకుండు సకలభూతంబులుఁ జూచుచుండ నంబుధి వెలువడి వచ్చి నిఖిలలోకహితార్థంబుగా నెప్పటియట్ల హవ్యవహత్వంబు నంగీకరించె; ని ట్లనేకశాఖం బయిన యగ్ని వంశంబు ప్రశంసాభాజనం బయ్యె; నగ్ను లెంద ఱైనను దదాత్మ యైన తేజం బొక్కటి’ యని చెప్పిన విని సంతసిల్లి యమ్మహామునికి ధర్మతనయుం డి ట్లనియె.

### [3.5.175](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.175)

క. ‘మునినాథ! మహాసేనుం | డనలునకుం గృత్తికలకు హరునకు సుతుఁడై  
న నిమిత్త మేమి తెఱఁ గే | వినవలతుం జెప్పవే! సవిస్తరఫణితిన్‌’.

### [3.5.176](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.176)

వ. అనిన మార్కండేయుం డతని కిట్లని చెప్పెఁ; దొల్లి దైత్యులతోడ రణంబు సేసి యోటువడి దేవగణసహితుం డై దేవేంద్రుండు దొలంగిపోయి దానవుల నోర్వనోపునట్టి మహాసత్త్వుం డగు సేనాపతి నెందుఁ బడయుదు నొకో! యని యొక్కనాఁడు మానసం బను శైలంబునకుం జని యం దొక్కయెడ నొక్కరుండ కార్యచింతాపరుం డై యున్న యెడ.

### [3.5.177](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.177)

తే. ‘ఒక్క దనుజాధముండు మొఱ్ఱో యనంగ | నన్నుఁ జెఱగొని పోయెడు నన్నలార!  
యెవ్వ రిట విడిపింపరే యింత వట్టు | పుణ్యమునఁ బోవరయ్య! కారుణ్యబుద్ధి’.

### [3.5.178](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.178)

వ. అని యిట్లు సువ్యక్తం బైన వనితావిలాపంబు వీతెంచినం బురందరుండు నిజాంతరంగంబు గరుణాతరంగితం బగుటయు ‘నోడ కోడకు మిదె యేను వచ్చితి’ ననుచు నద్దిక్కునకు నడచి ముందట నతిభయంకరాకారుం బటుగదాహస్తు నప్రచలితవిద్యుల్లతారుచిరమూర్తి యైనదాని నొక్క కన్నియం గొని గగనతలంబునం బఱచువానిం బ్రబలవలాహకవినీలదేహుఁ గేశి యను దానవుం గని సరభసుం డై.

### [3.5.179](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.179)

ఉ. ‘ఓరి దురాత్మ! యీ యబల నోడక యేటికిఁ బట్టినాడ వం  
భోరుహనేత్ర విడ్వు; మెట వోయినఁ బ్రాణము గొందు నింకఁ బ్ర  
స్ఫారమహీధరప్రకరభంగవిహారధురీణ ముగ్ర దై  
త్యారుణరంజితోగ్ర కులిశాస్త్రము సు మ్మిదె’ యంచు డాసినన్‌.

### [3.5.180](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.180)

మత్తకోకిల. ఘోరవిక్రముఁడైన కేశియుఁ గ్రోధఘూర్ణితచిత్తుఁ డై  
ధీరుఁ డుక్కున నిల్చి యగ్గదఁ ద్రిప్పి వాసవు వైచె; న  
వ్వీరుఁడున్‌ గద చూర్ణితంబుగ వ్రేసె నాసుర భంగిఁ బొం  
గారి దారుణవజ్రపాతరయంబునం బటుహస్తుఁడై.

### [3.5.181](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.181)

ఆ. అసుర వీఁక నొక మహాచలశృంగంబు | విఱిచి వైచె నమరవిభునిమీఁద  
గోత్రవైరి ఘోరకులిశాభిహతి వ్రయ్య | నడిచె దానిఁ జదల నదరు లెగయ.

### [3.5.182](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.182)

వ. ఇట్లు దన సాధనంబులు విఫలంబు లైనం దలంకి దానవుం డక్కన్నియ దిగవిడిచి పఱచిన, నింద్రుండు దానిం జేరంజని ‘నీ వెవ్వరిదాన? వీ రక్కసుచేత నెట్లు పట్టువడి?’ తనిన నది యతని కిట్లనియె ‘నయ్యా! యే నరిష్టనేమి యను ప్రజాపతి కూఁతుర, దేవసేనయనుదాన, ధైత్యసేన చెలియల; నేనును మాయప్పయుం గేళికౌతుకంబునఁ దండ్రియనుమతంబు వడసి సఖీజన సహితంబుగా వెడలి యిమ్మానసనగంబు సాను దేశంబులం గ్రుమ్మరుచుండం గేశి నామధేయుం డైన యీ యసురాధముండు.

### [3.5.183](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.183)

క. పలుమాఱు వచ్చి తన దు | ర్విలసితములు మాకుఁ జూపు వేడుక దోఁపన్‌  
బలుకును మేలమునఁ జెనకఁ | దలఁచుఁ గదియు మదనకదనదళితహృదయుఁ డై.

### [3.5.184](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.184)

తే. వాని చేష్టలన్నియు దైత్యసేన కభిమ | తంబు లై యుండు; నాకు నెంతయును దుస్స  
హముల; వినవె! యిమ్మెయిన యక్కమలనయనఁ | గోరి దానవుఁ డెలయించి కొంచుఁ జనియె.

### [3.5.185](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.185)

తే. అంతఁ బోక వెండియు వచ్చి యింత సేసె | నద్దురాత్ముఁడు నన్ను; మీ దైన కరుణఁ  
దొడరి దుఃఖసాగరమునఁ బడుట దప్పె’ | ననిన నయ్యింద్రుఁ డనియె నయ్యతివఁ జూచి.

### [3.5.186](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.186)

క. ‘విను, దక్షతనూజలు మా | జననియు మీ తల్లియును; నిజంబుగ మా కీ  
వనుజ వయితి; వనజానన! | యొనరంగా వేఁడు నీకు నొక వర మిత్తున్‌’.

### [3.5.187](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.187)

వ. అనిన దేవసేన దేవేంద్రున కి ట్లనియె.

### [3.5.188](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.188)

తే. ‘అనఘ! మాతండ్రి యొక్కనాఁ డతిముదమున | నన్ను నుపలాలనము సేసి ‘నాతి! నీవు  
ప్రథిత పౌరుషుఁ డగు భర్తఁ బడయు’ దనియె; | నట్టి వానిని నీవు నా కరయవలయు.

### [3.5.189](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.189)

చ. అనిమిష దానవేంద్రులకు నైన నజయ్యుఁడు, నుగ్రవైరిభం  
జనుఁడు, త్రిలోకరక్షణవశంవదుఁడున్‌, భవదిష్టమిత్రుఁడున్‌  
ఘనగుణకీర్తనుండు నగు కాంతునిఁ గోరెద; నా మనోరథం  
బు నెరయ సంఘటించి సురపుంగవ! నన్నుఁ గృతార్థఁ జేయవే!’

### [3.5.190](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.190)

వ. అనిన నింద్రుండు దీనికిం బతి యెవ్వం డగు నొకో! యని కొండొక విచారించు నెడ, నమ్ముహూర్తంబు రౌద్ర నామకంబయి సోమ సూర్యసంగమ కారణం బయిన యమావాస్యాముఖం బై యుండం, బూర్వసంధ్యారాగ రక్తాంబుద ప్రతిబింబ పటల పాటలితోదకం బయిన జలనిధి సమీపంబున నమరాసుర సమర సంకులంబుగా నరుణకిరణుం డుదయించుచుండఁ దత్కాలంబున భృగ్వంగిరఃప్రముఖు లైన మునులు వేల్చు హవ్యంబులు మోచికొని హవ్యవహనుండు సూర్యమండలంబు ప్రవేశించుచుండం గనుంగొని, యిది సూర్యసోమాగ్ని సమాగమం బయిన రౌద్ర నామక ముహూర్తంబు గావున సూర్యసోమాగ్ని తేజంబున జనియించిన వాఁడు దీనికిఁ బ్రియుండు గావలయు నని మనంబున నిశ్చయించి, యతం డా క్షణంబ.

### [3.5.191](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.191)

క. బాలం దోడ్కొని యబ్జజు | పాలికిఁజని మ్రొక్కి త్రిదశపాలుఁడు ‘దేవా!  
యీ లలనకుఁ దగు వరునిఁ గృ | పాలుఁడవై యొసఁగు’ మనినఁ బద్మజుఁ డనియెన్‌.

### [3.5.192](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.192)

ఉ. ‘దీపితవిక్రమాస్పదుఁడు దీనికి వల్లభుఁ డయ్యెడుం ద్రిలో  
కీపరిరక్షణక్షముఁడు గీర్తితమూర్తి యొకండు; వాఁడ మీ  
యాపదలెల్లఁ బాపుటకునై ధృతిఁ బూను నశేష దేవసే  
నాపతి భావమున్‌ విబుధనాయక! శీఘ్రమ భావ్య మింతయున్‌.’

### [3.5.193](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.193)

వ. అనినం బ్రీతుం డై పితామహు వీడ్కొని యింద్రుండు సనియెఁ; దదనంతరంబ వసిష్ఠ ప్రముఖులైన సప్త మహామును లమావాస్యాహోమంబు సేయ సమకట్టిన, నమరు లందఱు నందుల హవిర్భాగంబులు గొనుటకు నాసన్ను లగుటయు.

### [3.5.194](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.194)

క. ఆహవనీయ ముఖంబున | నాహూతుం డై హుతాశుఁ డమ్మును లిడఁగా  
నాహుతులు గొని దివిజ సం | దోహమునకు వరుస నొసఁగఁ దొడఁగెం బ్రీతిన్‌.

### [3.5.195](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.195)

సీ. ఆ సమయంబున నమ్మునీంద్రుల భార్య | లందఱు సుస్నాన మొందఁ జేసి  
రమణీయ మాల్యాంబర విభూషణాద్యలం | కారంబు లొనరించి గారవమునఁ  
జనుదెంచి పతులకు సన్మతిం బరిచర్య | సేయుచు మెలఁగంగ వాయుసఖుఁడు  
మెలఁతల వాలిక మెఱుఁగుఁ గన్నుల యొప్పుఁ | దెలినవ్వుమొగముల విలసనములు  
తే. నడబెడంగులు నన్నువనడుములందు | వెలయు వళులభావంబులు వలుఁదచన్నుఁ  
గవల నిక్కును నేర్పడఁ గని, కరంగి | మదనమార్గణ విదళిత హృదయుఁడయ్యె.

### [3.5.196](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.196)

వ. ఇట్లు వికలేంద్రియుండై వైశ్వానరుం డమ్మునిపత్నులయందుఁ దగిలిన డెందంబు మగిడింప నేరక వారలం గదియ నప్పళించి గార్హపత్యకుండంబునం దావేశించి.

### [3.5.197](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.197)

చ. అతివలు దన్నుఁ జేరుటకు నాసపడుం, బొరిఁ జేరుచోట నా  
యత విలసచ్ఛిఖాగ్రముల నల్లన వారల నంటుఁ, గౌతుకం  
బతిశయమై తదంగలత లాదటఁ గౌఁగిటఁ జేర్పఁ గోరుఁ, గం  
పిత ధృతి యై కలంగుఁ, గడుఁబెల్లగు రాగరసంబు ముంపఁగన్‌.

### [3.5.198](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.198)

వ. అంత నమ్మునీంద్రుల హోమవిధి సమాప్తం బగుటయు, జాతవేదుండు మదనవేదనాభరంబు సహింప నోపక నిర్జనం బయిన వనంబునకుం జని మునిపత్నీసమాగమంబు దుర్లభంబుగా వగచి వెగడంది శరీరంబు దిగ విడువ సమకట్టు నెడ, తదీయవల్లభ యైన స్వాహాదేవి తత్ప్రకారం బంతయు నెఱింగి, యతనికిం బ్రియంబు సేయునది యై సప్తమునులలో నంగిరసుభార్య శివ యను దాని రూపంబు గైకొని చని, యేకతంబ యున్న హుతాశనుం గనుంగొని యిట్లనియె.

### [3.5.199](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.199)

తే. ‘అంగిరసుభార్య నేను శివాభిధాన; | ననఘ! నాకును నాతోడి యంగనలకు  
ననుదినంబును నతిమనోహర విలాస | మైన నీమూర్తిపైఁ గోర్కి యడరియుండు.

### [3.5.200](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.200)

ఉ. నీ మదిచంద మిట్టి దని నిక్క మెఱుంగక మే మజస్రముం  
గామశరాహతిం గలఁగి కాఱియ వొందుదు మాత్మలందు; నీ  
కామము మాదెసం గలిమి కౌతుకచేష్టలయం దెఱింగి యు  
ద్దామ మనోరథప్రచలితస్థితి నందఱముం గ్రమంబునన్‌.

### [3.5.201](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.201)

చ. నినుఁ గవయందలంచి యిట నెమ్మిమెయిం జనుదెంచినార మిం  
పునఁ జెలు లెల్లఁ; దొల్త ననుఁ బొమ్మని పంచిన వచ్చితిన్‌; మనం  
బనవరతానురాగమున నంగజకేళి భజింపు మింక నొం  
డని యెడ సేసితేనిఁ గుసుమాస్త్రుఁడు సైఁపఁడు నన్నుఁ బావకా!’

### [3.5.202](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.202)

వ. అనిన సంతసిల్లి యగ్నిదేవుండు దానిం గైకొనియె; నదియును నతని నభిమత భోగంబులం బ్రీతునిం జేసి, తదీయ తేజోధాతువు ధరియించి యచ్చోటు వాసి యాక్షణంబ గరుడి యై గగనంబునకు నెగసి యతిత్వరిత గమనంబున శ్వేతపర్వతంబునకుం జని యందొక్కయెడ శరవణస్తంబ సంవృతం బైన కాంచనకుండంబు నందు నిజభర్తశుక్లంబు సంగ్రహించి, మఱియును.

### [3.5.203](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.203)

క. మునిపత్నులరూపులు గై | కొని యిట్టుల వరుసఁ బుష్పకోమలి ప్రియుఁ బ్రీ  
తునిఁ జేయుచు రేతస్కం | దన మొనరించుచును వచ్చెఁ దత్కలశమునన్‌.

### [3.5.204](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.204)

తే. విను, పతివ్రతాతిలక మై వెలయునట్టి | యయ్యరుంధతి రూపంబు నలవరింప  
నెట్లు నేరద కాని యయ్యింతి యున్న | యువిద లార్వుర రూపులు నొనరఁ దాల్చె.

### [3.5.205](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.205)

వ. ఇవ్విధంబున నాఱుమాఱులు ప్రస్కందితం బైన యగ్నితేజంబున.

### [3.5.233](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.233)

శా. నానాసిద్ధగణంబు గొల్వఁ బరమానందంబునం జంద్ర రే  
ఖా నవ్యాంచితమౌళి భూరిభుజగాకల్పోజ్జ్వలాకారుఁ డీ  
శానుం డానతశంకరుండు గిరిజాసంయుక్తుఁడై వచ్చెఁ ద  
త్సేనానిం బ్రియాసూను షణ్ముఖుని వీక్షింపం గడుం బ్రేమతోన్‌.

### [3.5.234](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.234)

వ. ఇట్లు వచ్చి మహాదేవుండు మహాసేనుం గౌఁగిలించుకొని యతనికి విశ్వకర్మ నిర్మితంబును హేమమయంబును నయిన పుష్పమాలిక యొసంగె’ నని చెప్పిన విని ధర్మజుండు ‘కుమారుఁడు రుద్రాంశజుఁ డని చెప్పుదు; రదియె?’ ట్లనిన మార్కండేయుండు పాండవేయున కిట్లనియె; ‘వినుము; రుద్రుండు మున్ను వీర్యంబు వహ్నియందు సంగ్రహించినఁ దత్తేజోవిశేషంబునం జేసి పావకుండు గుమారు నుత్పాదించె; నదియునుం గాక, యగ్ని రుద్రుం డని వేదవిదు లైన విప్రులవలన వినంబడు; నట్లగుటం గుమారుండు వహ్నిసంభవుండును, రుద్రసూనుండును నని చెప్పంబడియె; నగ్నిభామిని గృత్తికాఖ్యలైన మునిపత్ను లార్వుర రూపంబులు గైకొని, ప్రియ సమాగమంబు సలిపి శ్వేతశైలంబున రేతస్‌స్కందంబు సేయుటం బ్రభవించినవాఁడు గావునఁ గార్తికేయ స్కంద నామంబులం బరఁగె’ నని చెప్పి యిట్లనియె.

### [3.5.235](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.235)

తే. అప్పు డింద్రుండు మున్ను దా నబ్జభవు ని | యోగమున సురక్షితముగ నునిచినట్టి  
దేవసేనకుఁ గన్యకాతిలకమునకుఁ | జెలువముగ నలంకారంబు సేయఁ బనిచి.

### [3.5.236](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.236)

వ. సముచిత ప్రకారంబున నచ్చటికిఁ దెప్పించి కుమారుం జూచి ‘యిక్కన్నియ భవదర్థం బై పరమేష్ఠిచేత సృజియింపంబడియెం గావున నివ్వరవర్ణినిం బరిగ్రహింపు’ మనిన న ప్పార్వతీనందనుండు మందస్మిత సుందర వదనారవిందుం డయి యమ్ముహూర్తంబునందు.

### [3.5.237](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.237)

ఉ. మానిత విక్రమోజ్జ్వలుఁడు మంగళతూర్యనినాద మొప్పఁ దే  
జోనిధి వహ్నిసాక్షిగ విశుద్ధవిధిజ్ఞుఁడు దేవమంత్రి మం  
త్రానుగమం బొనర్పఁగఁ బ్రియం బెసలార వరించెఁ జారుప  
ద్మానన దేవసేనఁ గరియానఁ గరగ్రహణ ప్రయుక్తితోన్‌.

### [3.5.238](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.238)

ఆ. గుహుఁడు దేవసేనఁ గోరి పెండిలి యైన | యాదినంబు షష్ఠి యగుటఁ జేసి  
యర్చనీయ మయ్యె నాదివసంబు లో | కముల నెల్ల వెలసె గారవమున.

### [3.5.239](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.239)

క. ఏ దినమునందు షణ్ముఖు | శ్రీదేవి వరించెఁ గమలచిహ్నితకర యై  
యా దివసము పంచమి లో | కాదరణీయంబు లక్ష్మి కాస్పద మయ్యెన్‌.

### [3.5.240](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.240)

వ. ఇట్లు విహితమంగళాచారుం డయిన కుమారు పాలికిం జనుదెంచి నిజభర్తలచేతం బరిత్యక్తలైన ముని భార్యలార్వురు నధికదైన్యవివర్ణవదన లై యిట్లనిరి.

### [3.5.241](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.241)

చ. ‘కనుకనిఁ గూడి దుర్జనులు గానక చూడక యేము హవ్యవా  
హనునకు నిన్నుఁ గంటి మని యాడిన నిందకు నోడి మమ్ముఁ జ  
య్యనఁ బతు లుజ్జగించిరి ప్రియంబున నింకిట నీవు మాకు నం  
దనుఁడవు మమ్ముఁ బ్రోవ విహితంబు గుమారక! నీ కవశ్యమున్‌.

### [3.5.242](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.242)

తే. పుణ్యలోకంబులకుఁ బాసి పొక్కుచున్న | మమ్ముఁ జేకొని కరుణాసమగ్రబుద్ధిఁ  
బుణ్యగతియందు నిల్పుము పుత్త్రభావ | దృష్టి వెలయ మా యలమట దీర్పవయ్య!

### [3.5.243](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.243)

క. అనినఁ గుమారుఁడు వినయం | బున నిట్లను నేను మీకుఁ బుత్త్రుఁడ; మీరల్‌  
ననుఁ గన్న తల్లులరు వినుఁ; | డనుమానం బేల మీ ప్రియం బొనరింతున్‌.

### [3.5.244](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.244)

సీ. అనుచుఁ జేరువ నున్న యనిమిషపతిఁ జూచి | ‘వీరికిఁ దగుపదం బారయంగ  
వలయు’ నావుడు బలవైరి యిట్లనుఁ ‘జంద్ర | సతులైన యా దక్షసుతలలోన  
రోహిణి పొరువున రుచి నొప్పు నభిజిత్తు | నా నొక్కచుక్క దాఁ బూని యిప్పు  
డందఱకంటె నత్యంతవల్లభ నేన | యగుదుఁ జంద్రున కని వగచి యర్థిఁ  
ఆ. దపము సేయ నరిగెఁ; దత్పదం బది రిత్త | యున్న యదియు; వీరి నునుపు మచట’  
ననిన వారిఁ బ్రీతి నతఁడు వీడ్కొలిపినఁ | గడఁగి వారు సనిరి గగనమునకు.

### [3.5.245](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.245)

వ. నాఁటంగోలెఁ గృత్తిక లార్వురు నగ్ని దైవత్యం బనంబరఁగు నక్షత్రం బై దివంబున వెలింగిరి; తదనంతరంబ స్వాహాదేవి యేతెంచి కుమారుం గని ‘నీవు మత్పుత్త్రుండవు నిత్యంబును నీపాల వసియింపవలతు’ ననినం బ్రీతుండై యాతం ‘డట్ల కాక నీవు మత్సమీపంబున నుండి యేనును నీ కోడలుం గొనియాడం బ్రియంబున నుండు’ మనియె, నప్పుడు కుమారమాతృకలు హవిషయుఁ గాళియుఁ గౌశికయు నుద్ధతయు శారికయు నార్యయు వైధాత్రియు ననువార లేడ్వురుం గుమారుముందట నిలిచి యిట్లనిరి.

### [3.5.246](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.246)

ఉ. ‘మమ్ము జగత్త్రయంబునకు మాతలఁగా నొనరింపు మిప్డు; ము  
న్నిమ్ముల నొప్పు మాతృకల కెక్కుడు గావుత మేము; సర్వలో  
కమ్ములఁ దొంటి మాతృకలఁ గైకొనకుండుటయుం బ్రియంబుతో  
మ మ్మనిశంబుఁ గొల్చుటయు మాకు వరంబుగ నిమ్ము షణ్ముఖా!’

### [3.5.263](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.263)

మ. తనయుం గౌఁగిటఁ జేర్చుచున్‌ వరుస మూర్ధఘ్రాణముం జేయుచున్‌  
జనితానంద మనస్కుఁడై గిరిసుతాసంయుక్తుఁ డీశానుఁ డ  
య్యనఘుం దోడ్కొని బద్ధకేసరి సహస్రస్యందనారూఢుఁ డై  
చనియెన్‌ భద్రవటస్థలంబునకు నైశ్వర్యం బవార్యంబుగన్‌.

### [3.5.264](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.264)

వ. అమ్మహాదేవు ముందట ననేక యక్షగణ పరివృతుండును బుష్పకాధిరూఢుండును కుబేరుండును, వెనుక దెస నమరగణ సమన్వితుండును నైరావతారోహణోల్లాసియునై వాసవుండును, దక్షిణపక్షంబునం బ్రబల రక్షోయక్ష రక్షితుండై యమోఘ నామ ధేయుండైన యక్షోత్తముండును, గృతపరికరులైన వసు రుద్రాదిత్యులును, దాపలి పక్షంబున నతిభయంకర వ్యాధి మృత్యు పరివేష్టితుండై పితృపతియును, వివిధయాదోనివహ సనాథుం డయిన వరుణుండును నడచిరి; మఱియు మూర్తిమంతంబు లై శూల పట్టిస గదా ముసలాదికంబులైన యద్దేవు నాయుధంబులుఁగమండలు ప్రముఖోపకరణంబులుం జనియె; నయ్యాదిదేవునకు నా సన్నుండయి చంద్రుండును ధవళాతపత్రంబు ధరియించె; ననిలాగ్నులు చామరహస్తులై కొల్చిరి; విద్యయు, సావిత్రియు, గాంధారియుఁ గేశినియు నను దేవాంగనలు దాక్షాయణిం గొల్చి చనిరి; త్రిలోచనసఖుం డైన పింగళుం డను యక్షుండు వృషభకేతనంబు దాల్చె; నివ్విధంబున నభిరామ విభవోదారుండై కుమార గురుండు భద్రవటంబు సేర నరిగి, యచ్చటఁ గుమారుం జూచి యిట్లనియె.

### [3.5.265](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.265)

తే. ‘సప్తమం బైన మారుత స్కంధమునకుఁ | బతివి గమ్ము కుమార! దేవతల కెపుడుఁ  
గార్య మొదవినఁ జేకొని కడఁకఁ దీర్పు; | మనిశమును మత్పదధ్యానఘనుఁడ వగుము.

### [3.5.266](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.266)

క. చనుము శుభంబుల నొందుము | తనూజ!’ యని కౌఁగిలించి తద్దయుఁ బ్రేమం  
బున నతని వీడుకొలుపఁగ | ననఘ! మహోత్పాతములు రయంబునఁ బొడమెన్‌.

### [3.5.267](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.267)

ఆ. దెసలు మండె, ధరణి దిర్దిరఁ దిరిగె, న | భ్రంబు మ్రోసె, వడఁకెఁ బర్వతములు,  
జగము ఘోరతిమిర సంవృతమయ్యె, ని | ర్జరులమనము లెల్ల సంభ్రమించె.

### [3.5.268](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.268)

వ. తదనంతరంబు

### [3.5.269](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5.269)

మ. ఘనశస్త్రాస్త్ర మహోజ్జ్వలంబు చతురంగ వ్యాప్త భూమండలం  
బు నితాంతోద్ధత ఘోరఘోష బధిరీభూతాఖిలాశాముఖం  
బనిరోధోద్గత వేగ ముగ్ర దనుజేంద్రానీక మేతెంచె నీ  
సున నీశానముఖామరప్రతతిపై శుంభద్భుజారంభమై.

_First 200 of 291 passages. [Read on](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5)_

---
Source: [https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5) · Pramāṇa
