<!-- Pramāṇa, a library of Indian primary sources · https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6 -->

[Pramāṇa](https://indike.org/pramana/) › [Indian literature](https://indike.org/pramana/in) › [Epic, Poetry, Drama & Narrative](https://indike.org/pramana/in.lit) › [The Mahābhārata and its versions](https://indike.org/pramana/in.lit.mahabharata) › [Mahābhāratas in Indian regional languages](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa) › [Andhra Mahabharatamu](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra) › 3.6

# Andhra Mahabharatamu 3.6: అరణ్యపర్వము — షష్ఠాశ్వాసము

Āndhra Mahābhāratamu 3.6

- **Language:** Telugu

### అరణ్యపర్వము — షష్ఠాశ్వాసము

### [3.6.1](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.1)

క. శ్రీలలితమూర్తి! సుమహ! | చ్చాళుక్యవరేణ్య! పుణ్యచారిత్ర! విచి  
త్రాలంకారోజ్జ్వల కవి | తాలాపకలాప! సంతతానందమతీ!

### [3.6.2](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.2)

వ. అక్కథకుండు శౌనకాదిమహామునులకుం జెప్పె; నట్లతిమానుషంబైన యర్జునుపరాక్రమంబును, నత్యంతదైన్యాస్పదం బగు దుర్యోధనుపరాభవంబును, ధర్మజుదయయు నాకర్ణించి, విస్మయ జుగుప్సాకలితమానసుం డగుచు జనమేజయుండు వైశంపాయనున కి ట్లనియె.

### [3.6.3](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.3)

చ. ‘అనిశముఁ బాండుపుత్త్రులకు నప్రియకార్యము రోయునట్టి దు  
ర్జునుఁడు సుయోధనుం డటులు శత్రులచే నవమానితుండుఁ బే  
ర్చినకృప నొప్పుచున్న కురుసింహులచేత విమోక్షితుండు నై  
మనమున లజ్జ లేక మునిమండన! యెమ్మెయి నేఁగె వీటికిన్‌?

### [3.6.4](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.4)

మత్తకోకిల. మేనఁ బ్రాణముఁ దాల్చి భంగము మ్రింగి యెప్పటిచాడ్పునన్‌  
మానవేంద్రుఁడ నేను దద్దయు మానినన్‌ దలఁ పాత్మలోఁ  
బూను టాతని కెట్లు గల్గఁగఁ బోలు నారయ నద్భుతం  
బైన తచ్చరితంబు సెప్పుమ యంతయుం బరిపాటితోన్‌.’

### [3.6.5](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.5)

వ. అని యడిగిన నమ్మహాముని యిట్లను; నట్లు కౌంతేయులచేత బంధమోక్షితుం డై దుర్యోధనుండు లజ్జా కజ్జలితహృదయుం డగుచుఁ జెదరిన సేనలం గూర్చుకొని కొంత దవ్వరిగి యొక్కసమతలంబునం బటమందిరవిరచనంబు నిర్వర్తించి, యభ్యంతరమందిరమ్మున నొక్కరుండును దల్పంబుపయిం బడి చింతాపరవశత్వంబు నొంది, రాహుకబళనకలుషితుం డైన రోహిణీపతియునుంబోలె విషాదవివర్ణుం డయి యున్నయెడఁ గర్ణుండు వచ్చి, సముచితంబుగాఁ గని యన్నరేంద్రున కిట్లనియె.

### [3.6.6](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.6)

చ. ‘మనుజవరేణ్య! చూడ నతిమానుష మమ్మెయిఁ గయ్య మెందుఁ గ  
ల్గునె? పటువిక్రమాన్వితులఁ గ్రోధనిబద్ధులఁ గామరూపులం  
జెనయఁగ వచ్చునే ఖచరసింహుల నేరికి?; నట్టివారి నే  
పునఁ దునుమాడి గెల్చితి విభూతి యెలర్పఁగ నీవుఁ దమ్ములున్‌.

### [3.6.7](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.7)

ఉ. అప్పుడు నీవు సూడఁగ ననంతములై ఖచరేంద్రసైన్యముల్‌  
గప్పె ననేకసాయకనికాయములన్‌ వడి నన్ను; నేనునుం  
గుప్పలు గూల నేసి రిపుకోటి వధించితి; నంతలోన న  
న్నొప్పరికించె సైన్యతతి; యొక్కఁడ నై రణభూమి నొచ్చితిన్‌.

### [3.6.8](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.8)

వ. ఆలోనన విరథుండ నై వికర్ణురథం బెక్కిన నది సమర ప్రదేశంబునకుఁ దొలంగఁ బఱచె; దేవా! నీవు బలవిక్రమాతిశయంబులం బ్రతివీరుల నోర్చి యక్షతుండ వై యుండుటఁ గనుంగొని గృతార్థుండ నైతి; నిట్టి పరాక్రమంబు సేసిన వా రిజ్జగంబున నెవ్వరు గల? రిది యత్యద్భుతం’ బనినం గౌరవేశ్వరుం డాత్మగతంబున ‘నీతండు మత్ప్రకారం బెఱుంగక యిట్లు వలికెం గాకేమి?’ యని లజ్జితుం డగుచు రాధేయున కి ట్లనియె.

### [3.6.9](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.9)

సీ. ‘అనఘ! తమ్ములు నేను నంబరచరకోటిఁ | దలపడి పోరంగ బలయుగంబుఁ  
జచ్చియు నొచ్చియుఁ జలమునఁ బెనఁగె; నా | సమయమ్మునందు విక్రమ మెలర్ప  
గంధర్వపతితోడఁ గలిగెఁ గయ్యము నాకు; | నాతని శరములచేత నాజి  
నేను నొచ్చితి; వేయు నేల? భార్యానుజ | సుతమిత్త్రజనసమన్వితము గాఁగ  
తే. నన్నుఁ జెఱగొని గంధర్వనాయకుండు | నెగసె దివమున; కప్పుడు బెగడి చెదరి  
పఱచి మనవార లెల్లను బాండుసుతుల | శరణు సొచ్చిరి దైన్యసంభరితు లగుచు.

### [3.6.10](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.10)

ఉ. వారలయార్తిఁ జూచి జనవంద్యుఁడు ధర్మసుతుండు దమ్ములన్‌  
భూరిబలాఢ్యులం బరమపుణ్యుఁడు నన్‌ విడిపింపఁ బంచె; న  
వ్వీరులు నుక్కునం గవిసి వీఁకున ఖేచరకోటిఁ దొల్త నిం  
పారఁ బ్రియోక్తులం దెలఁచి; రంతటఁ దీరద కార్య మెమ్మెయిన్‌.

### [3.6.11](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.11)

ఆ. అంతఁ దెగువసేసి యంతకాకారు లై | భీమపార్థయములు భీమబలులు  
ఖచరతతులమీఁదఁ బ్రచురబాణౌఘముల్‌ | గురిసి రాహవమున ఘోరభంగి.

### [3.6.12](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.12)

వ. తదీయబాణపాతంబుల నొచ్చి గంధర్వులు మమ్ముం గొనుచు గగనంబునం బఱచిన, నర్జునుండు వారికిం బోవరాకుండ నతినిబిడబాణజాలంబుల నంబరమార్గంబు నిరోధించినం, జిత్రసేనుండు దనప్రియసఖుండైన శతమఖసుతుం జేరనరిగి కుశలం బడిగిన, నర్జునుండునుంబ్రీతుండైవాని ననునయించి, ‘యీ దుర్యోధనుండు మాతోడంబుట్టువు గావున నితని విడువవలయు’ ననిన నాగంధర్వనాయకుండు.

### [3.6.13](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.13)

క. మనదుర్మంత్రిత మంతయు | ఘనుఁ డప్పార్థునకుఁ జెప్పి ‘ఘనభుజ! యిది యిం  
ద్రుని పను పగుట నవశ్యం | బును నీతని విడువ’ ననియె భూరిబలుం డై.

### [3.6.14](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.14)

క. కడు లజ్జయు దైన్యంబును | నడరి ముసుఁగు వడఁగ నాకు నాత్మగతమునం  
బుడమి వివరంబు లేదే | యడఁగెద నన్నట్టి దయ్యె నప్పుడు కర్ణా!

### [3.6.15](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.15)

వ. అంతం గౌంతేయులు గంధర్వులం దోడ్కొని ధర్మరాజుపాలికిం జని, మనదుర్మంత్రంబుకతంబున బంధగోచరుండ నయిన నన్ను నయ్యజాతశత్రుముందట నివేదించిన, నతండు విడిచి పుత్తెంచె నిది మదీయ వృత్తాంతంబు.

### [3.6.16](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.16)

క. ఒవ్వనివారల యెదురన | యివ్విధమున భంగపడితి నే; నింక జనుల్‌  
నవ్వఁగ నేటి బ్రదుకుగా | నివ్వసుమతి యేలువాఁడ? నెట్లు చరింతున్‌?

### [3.6.17](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.17)

ఉ. అక్కట! యమ్మహారణమునందు వియచ్చరకోటితోడఁ బే  
రుక్కునఁ బోరి యేను మృతి నొందఁగ నేరన; యట్టు లైన నీ  
తక్కువపాటు లేక ప్రమదంబున దేవపదంబు నొందుదున్‌;  
మిక్కిలి యైన కీర్తియును మేదినియందు వెలుంగు నిత్యమై.

### [3.6.18](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.18)

వ. కావున నిట్టి దురవస్థపాలైతి; నేను ప్రాయోపవేశంబునఁ బ్రాణపరిత్యాగంబుఁ జేసెద; మీరందఱు దుశ్శాసనుం బురస్కరించుకొని పురంబున కరుగునది; మిత్రులకుఁబ్రమోదంబును శత్రులకు నిర్వేదనంబునుం జేయుచు మను నట్టియేను నేఁడు పోఁడిమిసెడి, పగతురచేత శిరస్తాడనంబు సేయంబడి సిగ్గువడక బంధు జనంబులలోని కేమని యరుగుదు? నాంబికేయుం గని యే మని పలుకుదుఁ? గురువృద్ధు లైన భీష్మబాహ్లికులయు నాచార్యులయిన కృప ద్రోణులయు సమ్ముఖంబున నెట్లు నిలుతుఁ? బరిజనులుం బౌరులుం బురోహితులు నన్నుం గనిన నేమని సంభాషింతు? నిది యాత్మదోషంబున నైన యపాయంబు, నా కవశ్యభోక్తవ్యంబు.

### [3.6.19](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.19)

క. విను దుర్వినయాత్మకుఁ డగు | జనుఁ డుజ్జ్వల మైన సిరియు సద్విద్యయుఁ గ  
ల్గిన నందు మెలఁగనేరక | చెనఁటి తెఱంగునకుఁ జొచ్చి చెడిపోవుఁ దుదిన్‌.

### [3.6.20](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.20)

క. అకటకట యిట్టికష్టము | నకు వచ్చితి నయ్య యేను; నన్నటె వైరి  
ప్రకరము లనిఁ బట్టినఁ గృప | నొకరుఁడు విడిపించె దైవ మోపదె యెట్లున్‌.

### [3.6.21](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.21)

క. మానము సెడియును నిమ్మై | మేనం బ్రాణంబు లెట్లు మేకొని తాల్తుం?  
గాన యిది నిశ్చయముగాఁ | బూనితి నాతెగువ మాన్పఁ బోల దొరులకున్‌.’

### [3.6.22](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.22)

వ. అని పలికి సమీపగతుం డయిన దుశ్శాసను నాలోకించి యమ్మహీపాలుం డి ట్లనియె.

### [3.6.23](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.23)

సీ. ‘అన్న! దుశ్శాసన! నిన్ను రాజ్యమునకుఁ | బట్టంబు గట్టెదఁ బతివి గమ్ము;  
శకునికర్ణులు దీర్పఁ బ్రకటవసుంధరా | వలయమంతయు మహోజ్జ్వలత నేలు;  
భ్రాతృవర్గమునకుఁ బ్రీతి సేయుము; బంధుఁ | జనుల బోషింపుము; సద్ద్విజులకు  
నుత్తమంబుగఁ దగువృత్తులు సెల్లింపు; | గురుజనంబుల భక్తిఁ గొలువు మెపుడు;  
తే. నింద్రుఁ డమరగణంబుల నేలునట్లు | ధరణి పతుల నేలుము; బాహుదర్ప మొప్పఁ  
బగఱ నుక్కడఁగింపుము; పరమమిత్త్రు | లైన శూరులఁ గొనియాడు మర్హభంగి’.

### [3.6.24](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.24)

వ. అనిన నమ్మాట దనహృదయంబునకు నిశితశూలంబయిన, నతండు నిలువ నోపక యగ్రజు పాదంబులపయిం బడి, ‘దేవా! యిట్లానతీఁ దగదు; నాకుం బ్రసన్నుండ వగు’ మని నిజనేత్రజలంబులం దదీయ చరణయుగళం బభిషేకించుచు నిట్లనియె.

### [3.6.25](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.25)

చ. ‘అవని విదీర్ణ మైనను, హిమాద్రి చలించుట గల్గినన్‌, మహా  
ర్ణవ మది యింకినన్‌, దివసనాథుఁడుఁ జంద్రుఁడు దేజ మేదినం,  
గువలయనాథ! నీకు నొక కుత్సితభావముఁ గల్గ నేర్చునే!  
భవదుపయోగ్య మైన నృపభారము నాకు వహింప శక్యమే?

### [3.6.26](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.26)

క. హితు లైనవారిఁ బ్రోచుచు | సతతంబును రిపుల నెల్లఁ జమరుచు నిఖిల  
క్షితితలము నీవ యేలుము | శతసంవత్సరము లధిప! జయశీలుఁడవై.’

### [3.6.27](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.27)

వ. అనుచునయ్యువరాజు దుఃఖాతిభారవిహ్వలుండై యెలుంగెత్తి యేడ్చిన, నయ్యన్నయుంగన్నీరొలుక నూరకుండె; నప్పుడు కర్ణుండు వారలంజూచి’ యిట్లేల బాలిశులుంబోలెనేడ్చెదరు? ధైర్యంబులు ధరియించి శోకవ్యసనంబులు విడువుండు; శోకశీలురం జూచి పగతురు సంతసిల్లుదురు; శోకశీలురకుఁ బైపై శోకంబులు వొందు’ నని దుర్యోధనుం బేర్కొని యిట్లనియె.

### [3.6.28](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.28)

క. ‘ఒకయల్పమనుజు క్రియ సో | మకులోత్తమ! నీకు నిట్లు మహనీయసుఖ  
ప్రకృతి యగు నిజశరీరం | బకట! విడువఁ దలఁపనగునె? యవిహితబుద్ధిన్‌.

### [3.6.29](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.29)

తే. శోకమగ్నుండ వగు నిన్నుఁ జూచి బెగడి | యధిప! నీతమ్ములును నేను నధికదుఃఖ  
వహ్ని పాల్పడ మయ్య! మావలనఁ గరుణ | గలిగి తీర్పవె యిందఱఁ గౌరవేంద్ర!

### [3.6.30](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.30)

వ. పాండవులచేత విముక్తుండ నైతి నని వగచె; దంతియకాని నీకుం గార్యగతియందు వివేకంబు సాల; దది యెట్లనిన, నేరాజు రాజ్యంబున నిశ్చింతు లయిన జనులు తమతమ జీవనంబుల వర్తింతు రారాజునకు నట్టిజనులుబంట్లు; గావునఁదా రమ్మహీపతికిం దీఱమిగల్గిన చోట్ల నెల్లనుందమపౌరుషంబులు నెఱపవలయుఁ; గౌంతేయులు నీదేశంబున నుండి నీయాజ్ఞవలనం గృతారంభులై యున్న వా రగుటంజేసి వారు నీకింకరులు; నీకునైన యక్కఱ దీర్చుట వారి కర్హ కృత్యంబు; దీని కింత వనర నేల?; యదియునుంగాక పాండవులు జూదంబునాఁడ నీకు దాసు లైరి; తదీయంబు లైన మణికనకాదివస్తువులును భవదధీనంబులై యున్నయవి; వారు నిన్నుం గొలిచియుండుట లేకుండెనేనియు నింతటి కెలసంబు దీర్ప నేనియు వలదే; యిది యంతయు నూహించి వలవనివగలం బొగులక లెమ్ము! పురంబునకు నడువుము; నామాట వినక నిర్బంధపరుండ వైతేనియు ని న్నేమనవచ్చు; నిందఱము నీపోయిన గతిన పోవంగలవారము; నీవు లోకంబు చేత నగుఁబాటును బొందెద; వింతియ’ యని కర్ణుండు సెప్పిన విని దుర్యోధనుండు వెండియుం బ్రాయోపవేశంబునందు నిశ్చయంబు వదలకున్నం గనుంగొని శకుని యి ట్లనియె.

### [3.6.31](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.31)

క. ‘కర్ణుని యాడిన మాటలు | నిర్ణయమున కింత యొప్పునే! యిప్పలుకుల్‌  
కర్ణంబులఁ జొనుపుము; దుః | ఖార్ణవపారంబుఁ బొందు మవనీనాథా!

### [3.6.32](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.32)

తరలము. కడఁగి బుద్ధిబలంబునంద యకంటకంబుగఁ జేసి యేఁ  
బుడమిరాజ్యము సర్వముం దగఁ బుచ్చి యిచ్చిన నిమ్ములం  
గుడువ నేరక దీని నిచ్చటఁ గూలఁ దన్ని శరీరమున్‌  
విడుతుఁ గా కని నిశ్చయించెదు వెఱ్ఱి వైతె నరేశ్వరా!

### [3.6.33](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.33)

ఆ. నీకు వృద్ధసేవ లేకున్కి యిప్పుడు | నాకుఁ దెల్లమయ్యెఁ బ్రాకటముగఁ  
గోపమును మనోనుతాపంబుఁ బొందుచో | ధీరుఁ డపుడ యడఁప నేరవలదె.

### [3.6.34](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.34)

తే. పిఱికితనము నేమఱుటయు నొఱువతనము | మెత్తఁబాటును గార్యంబు నత్తెఱంగు  
నేరమియు విషయంబులఁ గూరుటయును | గలుగు పతికి నుండదు సిరి దొలఁగి పోవు.

### [3.6.35](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.35)

వ. కావునఁ గార్యజ్ఞుండ వగుము; కార్యజ్ఞానం బెట్టి దనిన.

### [3.6.36](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.36)

ఉ. కౌరవనాథ! నీకు నుపకారము సేసిరి పాండవేయు ల  
వ్వీరులయందు నెయ్యమును వేడ్కయు నొప్పఁగ నీ వభీష్టస  
త్కారముసేఁత యుక్తమగుఁ గాక ప్రియంపడ నర్హమైనచో  
దారుణశోకవహ్నిపరితాపముఁ బొందుట యిప్డు ధర్మువే?

### [3.6.37](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.37)

చ. కృతముఁ దలంచి చిత్తమునఁ గిల్బిషమంతయు నుజ్జగించి స  
న్మతులఁ బృథాతనూజుల నమానుషతేజులఁ బిల్వఁ బంచి, త  
త్పితృధన మైన రాజ్యము నభీష్టముగాఁ దగ నిమ్ము; నీకు నీ  
క్షితివలయంబునం బరమకీర్తియుఁ బుణ్యముఁ గల్గు భూవరా!

### [3.6.38](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.38)

క. వారలు నీతోఁబుట్టువు; | లీరాజ్యము మీరు వారు నేకం బై పెం  
పారఁగ నేలుఁడు; దీనం | గౌరవకులనాథ! సౌఖ్యగౌరవ మొందున్‌.’

### [3.6.39](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.39)

వ. అని శకుని చెప్పుచుండ నగ్గాంధారీనందనుండు నిజచరణసమీపంబునం బడి యున్న దుశ్శాసనుం గ్రుచ్చి యెత్తి మూర్ధాఘ్రాణంబు సేసి కర్ణసౌబలులం జూచి ‘మీ రేల నన్నుఁగారించెదరు? ధర్మైశ్వర్యధనభోగంబులందు నా కభిలాషంబు లేదు; ప్రాయోపవేశంబునందుఁ గృతనిశ్చయుండ నైతి; మీ రింక నొండు విఘ్నంబులు సేయక యూరక మీ వలయునెడకుం బొం’ డనిన వారలు ‘దేవా! నీవిధం బిట్టిద యయ్యె నేని మే మెందుఁ జేరెదము? నీతోడివారము కాక’ యని; రంతం గమలహితుండు పశ్చిమాచల సమీపగతుం డగుటయు నన్నరనాథుండు సురలోకగమనకుతూహలి యై శుచిస్నానంబు సేసి వల్కలంబులు ధరియించి, సంధ్యాసమయ సముచితంబులగు కరణీయంబులు నిర్వర్తించి, వివిక్తదేశంబునందు దర్భాస్తరణంబున నాసీనుండై వాఙ్నియతుండై.

### [3.6.40](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.40)

క. క్రమమున బాహ్యేంద్రియక | ర్మము లెల్లను వదల విడిచి మహిత సమాధి  
క్రమదశ నుండె నివాత | స్తిమితంబై వెలుఁగుచున్న దీపము పోలెన్‌.

### [3.6.41](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.41)

సీ. ఆ సమయమున ము న్నమరేంద్ర విజితు లై | యహిలోకమున నున్న యసురవరులు  
ధృతరాష్ట్రనందను తెగువ యెఱింగి యా | త్మీయపక్షక్షయస్థితికి వగచి  
యాతనిఁ బిలిపింప నప్పుడు శుక్రాదు | లైన భూసుర సమూహములచేత  
వేల్మి వెట్టించిన వేగంబ యొక కృత్య | వెలువడి భీషణవికృతమూర్తి  
ఆ. ‘యేమి పనులు గలిగె నెఱిఁగింపుఁ’ డనిన, వా | ‘రిచటి కిపుడు కౌరవేంద్రు ననఘు  
నుజ్జ్వలాంగు నా సుయోధనుఁ దెమ్ము, ప్రా | యోపవేశవృత్తి నున్నవాని.

### [3.6.42](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.42)

వ. అని పనిచినం గృత్యయు నాక్షణంబ చని ప్రాయోపవిష్టుండై యున్న దుర్యోధను గ్రుచ్చి యెత్తికొని రసాతలం బునకుం దెచ్చి, దైత్యులకు సమర్పించినం, బ్రీతులై వారు వానిం గౌఁగిలించుకొని కుశలం బడిగి, యిట్లనిరి: ‘అయ్యా! నీవు శూరుండవు. శూరజన రక్షితుండవు, భరతకులోద్వహుండ; విట్టి సాహసం బేల చేసితివి? మఱి యాత్మఘాతుకునకు లోకంబున నిందయు, హీనతయు, దుర్గతియుం బ్రాపించు; లోకవిరుద్ధంబు లై మూల ఘాతంబు లైన కార్యంబులయందు నీయట్టి బుద్ధిమంతులు ప్రవర్తిల్లుదురే? యట్లుగావున, నీ వఖిల ధర్మార్థయశోభోగనాశం బైన యీదుర్విచారంబు విడువుము; ధైర్యంబును బ్రతాపంబును బాటింపుము; శత్రుజనభంజనంబు సేయుము; నీవు మనుష్యమాత్రుండవు గావు; నీపూర్వజన్మప్రకారంబు సెప్పెద; మాకర్ణింపుము.

### [3.6.43](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.43)

ఉ. ఏము తపంబు సేసి పరమేశ్వరు నీశ్వరుఁ బార్వతీమనః  
కాముకుఁ గామవైరి నవికారుఁ బురాంతకుఁ బ్రీతుఁ జేసినం  
గామితదాయి యైన శితికంఠుఁడు నిన్ను సృజించి యిచ్చె ను  
ద్దామదయావిధేయుఁడు ముదంబున మాకు నధీశ్వరుండుగన్‌.

### [3.6.44](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.44)

ఉ. నీదగు పూర్వదేహము వినిర్మలవజ్రశిలావిశేష సం  
పాదిత మస్త్రశస్త్రపరిపాటనభేద్యము గాదు, నిత్యనిః  
ఖేదము పుష్పకోమలము ఖేచర భూచరకామినీమనో  
హ్లాదన; మిట్లుగా నభవుఁ డర్థి నొనర్చె నుమాసమేతుఁడై.

### [3.6.45](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.45)

ఉ. నీవు ధరిత్రిఁ బుట్టుటయు నీకు సహాయము చేయఁ గోరి నా  
నావిధ దైత్యదానవగణంబులు రాజకులంబులందు స  
ద్భావన నుద్భవించెఁ బటుబాహులు దివ్యమహాస్త్రకోవిదుల్‌  
ద్రావితవైరు లుర్వి భగదత్తపురస్సరు లైన వీరులై.

### [3.6.46](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.46)

వ. భీష్మద్రోణకృపాదులు గొందఱు దేవాంశసంభవులైనను దదీయభావంబులు రాక్షసావేశంబు నొందెడు; దానంజేసి వారు నిర్దయులై విమూఢులుంబోలె నన్యోన్య పరుషంబులు వలుకుచు నలుక మిగులం బుత్త్ర పౌత్త్రమిత్త్రభ్రాతృ శిష్యగురుబాలవృద్ధజనభేదంబులు విచారింపక సమరంబు సేసి దివ్యంబులు మానుషంబులు నైన వివిధాస్త్ర శస్త్రంబులఁ బాండవపక్షక్షయంబు గావింపం గలవారు; పాండవులు బంధుస్నేహంబు విడిచి తెగువకుం జొచ్చి నీచేత నిహతు లగుదురు; నీమనంబున బీభత్సువలని భయంబు గొంత గలదు; దాని నెఱింగి యేమునుం దగు నుపాయంబు దలంచితి; మది యెట్లనినఁ గృష్ణుచేతం జచ్చిన నరకాసురునంశంబు గర్ణు నావేశింపం గల యది; తత్కారణంబునం గృష్ణార్జునులతోడ బద్ధవైరుండై యవ్వీరుండు నిజదివ్యాస్త్రంబులం గృష్ణుల నిద్దఱ నిర్దహించు; నివ్విధం బెఱింగి యింద్రుండు పాండవ రక్షణార్థంబు వచ్చి కర్ణుకవచకుండలంబులు గపట రూపంబున నపహరింపం గలవాఁడు; మఱియును.

### [3.6.47](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.47)

క. క్షితి సంశప్తకు లనఁగా | శతలక్షసహస్రసంఖ్య జనియించిరి ద  
ర్పితులై దనుజులు దద్బల | తతిచే సమరమున నింద్రతనయుఁడు సిక్కున్‌.

### [3.6.48](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.48)

తరలము నిహతకంటక మైన యిద్ధరణీతలం బఖిలంబు నీ  
మహితశాసనగోచరం బగు మానవేంద్ర! ప్రసన్నతా  
మహిమ నొందుము, నీవ తేపవు మాకు నందఱకుం; గురూ  
ద్వహ! విషాదము వొందఁ బాడియె దైత్యపక్షభయంబుగన్‌?

### [3.6.49](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.49)

మ. చను; మిం కొండు దలంపు మాను’ మని యాశ్వాసించి వానిం బునః  
పునరాలింగన మాచరించి యెలమిం బూజించి, దైత్యోత్తముల్‌  
జననాథోత్తము వీడు కొల్పిరి; తదాజ్ఞం జేసి యాకృత్యయున్‌  
మును దాఁ దెచ్చిన చోటఁ బెట్టె నధిపున్‌ మోదంబు సంధిల్లఁగన్‌.

### [3.6.50](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.50)

ఉ. అంత సుయోధనుండు హృదయంబున విస్మయ మంది యంత వృ  
త్తాంతము స్వప్నవృత్తము క్రియం దలపోసి నిజంబ కాఁగ న  
త్యంతము నిశ్చయించుచుఁ బృథాసుతులన్‌ సమరంబులోన ని  
ర్జింతున కాక యంచు వికసిల్లె దురాశయ భగ్నబుద్ధియై.

### [3.6.51](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.51)

క. విను, జనమేజయ! పౌరవ | జనవిభుఁ డబ్భంగి రాత్రిచరితం బగు న  
ద్దనుజ సమాభాషణ మె | వ్వనికిని నెఱిఁగింపకుండువాఁ డయ్యె మదిన్‌.

### [3.6.52](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.52)

వ. అంతఁబ్రభాతం బగుటయు రాధేయుండు సుయోధనుపాలికిం జని హేతుమద్వాక్యంబుల నతని కి ట్లనియె.

### [3.6.53](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.53)

ఉ. ‘చచ్చిన పిమ్మటం గడిఁదిశత్రుల నోర్వఁగవచ్చునే? శుభం  
బిచ్చునె చావు లెందును నరేశ్వర! యాఱడి చత్తు నంట దా  
మెచ్చగునయ్య యేరికిని? మేనికి జీవము గల్గుచోన పెం  
పచ్చుగ సిద్ధిఁ బొందు విజయార్థసుఖంబులు మర్త్యకోటికిన్‌.

### [3.6.54](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.54)

ఉ. కావున శోకదైన్యముల కాలము గా దిది; లెమ్ము విక్రమ  
శ్రీవిలసిల్లు’ మంచుఁ గురుసింహుని సింహసమానుఁ జారుశ  
య్యావివశాంగు నంగపతి యాదటఁ దా నిరుగేల గ్రుచ్చి సం  
భావన నెత్తుచుం బ్రణయభాషల వెండియు వాని కి ట్లనున్‌.

### [3.6.55](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.55)

క. ‘మది నర్జునుఁ జూచి భయం | బొదవినయది నీకు; వాని నుగ్రరణమునం  
బదునాలవయేఁడు జయిం | చెద; నాయుధ మంటి ప్రతిన సేసితి నధిపా!’

### [3.6.56](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.56)

చ. అనవుడుఁ దత్ప్రతిజ్ఞయు సురారులవాక్యములుం దలంచి య  
జ్జనపతి గాఢనిశ్చయవశంవదుఁ డై శయనంబు డిగ్గి చ  
య్యనఁ ‘బయనంబు సేయుఁ’ డని యప్పు డమాత్యులఁ బంచి యిమ్ములన్‌  
దినముఖకృత్యముల్‌ సలిపి దీపితుఁడై వెడలెం బ్రియంబుతోన్‌.

### [3.6.57](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.57)

వ. అయ్యవసరంబున.

### [3.6.58](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.58)

చ. రయవిచలత్తురంగమ తరంగములన్‌ మదనాగనక్రసం  
చయములఁ జంచలచ్చటుల సైనికమత్స్యములన్‌ మహోన్నతం  
బయి కురురాజచంద్రు నుదయంబునఁ దద్దయుఁ బొంగెఁ బ్రస్ఫుర  
ద్భయదమనోహరప్రకటభంగులఁ దద్భటవార్ధి యుద్ధతిన్‌.

### [3.6.59](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.59)

ఉ. చామరపుండరీకవిలసత్సితచారుపతాకలం గురు  
గ్రామణియాత్ర నెంతయును గాంతి వహించె నభంబు శారదో  
ద్దామమరాళమండలసితస్ఫుటపద్మవనీపరిస్ఫుర  
త్తామరసాకరంబున విధంబున భూచరనేత్రపర్వమై.

### [3.6.60](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.60)

వ. ఇట్లు దుర్యోధనుండు గర్ణసౌబలసమేతుండై దుశ్శాసనాద్యనుజ గణంబునుం దక్కిన యమాత్యులుం గొలువఁ జెలువు మిగులం జని కరిపురంబు ప్రవేశించి సముచిత వ్యాపారంబుల నుండునంత, నొక్కనాఁడు మంత్రి జన పరివేష్టితుండై యున్న రాజునకు భీష్ముం డిట్లనియె.

### [3.6.61](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.61)

మ. ‘హితులై పెద్దలు బుద్ధిసెప్పఁగఁ గ్రియాహీనుండవై త్రోచి పో  
యితి దుష్టాత్ములఁ గూడి; దానికి ఫలం బెట్లయ్యెనో చూచితే!  
గతవిద్వేషుఁడు ధర్మనందనుఁడు గల్గంబట్టి యప్పాట దు  
ర్గతికిం దప్పితిగాక చిక్కితిగదా గంధర్వుచే నాజిలోన్‌.

### [3.6.62](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.62)

ఉ. నీవును దమ్ములున్‌ సతులు నెయ్యురు వైరులచే గృహీతులై  
పోవఁగఁ బాఱిపోయెఁ గడుఁ బొల్లఁదనంబున సూతపుత్త్రుఁ డీ  
కావరుఁ గష్టచిత్తు నధికంబుగ నమ్ముదు నీవు వీని బా  
హావిభవంబు గయ్యమున నక్కడఁ జూచితె కన్నులారఁగన్‌.

### [3.6.63](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.63)

ఉ. ఆయతబాహు లుగ్రబలు లార్యులు పార్థులు వారిభూరిశౌ  
ర్యాయుధ నైపుణక్రియలయందుఁ బదాఱవపాలుఁ బోలఁ డీ  
వాయపురజ్జులాఁ డధిప! వారలచందము వీని చందమున్‌  
నీయెడ నిక్కమై తెలిసెనే ఖచరేంద్రుల పారిలోపలన్‌.

### [3.6.64](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.64)

క. కులమును సిరియును జెఱుపక | యలఘుస్థితి నింకనైన నప్పాండవులం  
గలసి మనవయ్య! నాదగు | పలుకు వినఁగదయ్య! హితము పథ్యము సుమ్మీ!’

### [3.6.65](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.65)

వ. అనిన భీష్మువచనంబుల దెస ననాదరంబు సేసి, దుర్యోధనుండు గర్ణసౌబలులం జూచి నవ్వుచు, వారలుం దమ్ములుం దోడన చన నక్కడ వాసి చనియె; భీష్ముండును లజ్జితుం డై నిజగృహంబున కరిగె; నంతఁ గౌరవేశ్వరుండు గ్రమ్మఱి యెప్పటిచోటికిం జనుదెంచి మంత్రులతోడ మంతనం బుండి ‘మన కెయ్యది కర్తవ్యం? బెయ్యది సేసినఁ దేజోలాభంబు లగు?’ నని యడిగినఁ గర్ణుండు ‘దేవా! నీ కింక నే విచారమ్ములు నేల? నిష్కంటకంబైన యీ పృథివి సకలంబునుం బాలించుచు మహేంద్రమహిమతోడ నఖిలసుఖంబులు ననుభవింతుగా’ కనినం బ్రీతుండై యతండు వాని కి ట్లనియె.

### [3.6.66](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.66)

క. ‘నీయట్టివీరవరుఁడు స | హాయుం డటె, పడయరాని యదియుం గలదే?  
ధీయుత! నా కెయ్యదియును | బాయక విను మింక నొక్క పని దెల్లముగన్‌.

### [3.6.67](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.67)

తే. ధర్మజుఁడు రాజసూయంబుఁ బేర్మిఁ జేసి | నంతనుండియు నమ్మహితాధ్వరమున  
యం దభిప్రాయమై యుండు; నొంద నాకు | నమ్మఖంబు సేయింపవే యనఘ! నన్ను.’

### [3.6.68](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.68)

వ. అనినం గర్ణుండు గౌరవపతి కి ట్లనియె.

### [3.6.69](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.69)

క. ‘అగుఁగాక యేమి యిప్పుడు | జగతిం గల నృపతు లెల్ల జనవర! నీ కి  
మ్ముగ వశవర్తుల కావునఁ | దగ నుద్యోగింపు మిపుడు తత్క్రతు విధికిన్‌.

### [3.6.70](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.70)

ఉ. రాజులఁ బిల్వఁ బంపుము, ధరాసురసంఘము నామతింపు, పే  
రోజ నుదాత్తయజ్ఞగృహయూపతతుల్‌ సమకట్టఁ బంపు, వి  
భ్రాజితభక్ష్యభోజ్యవిధి భవ్యపదార్థము లానయింపు, మ  
వ్యాజ విభూతిమై నమరవల్లభుచాడ్పునఁ జేయు జన్నమున్‌.

### [3.6.71](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.71)

వ. అనిన సంతోసిల్లి కురుపతి యప్పుడు పురోహితునిం బిలిపించి, ‘రాజసూయ యజ్ఞంబు సంపూర్ణ దక్షిణంబుగాఁ జేయవలయుఁ; దత్ప్రయోగ విశేషంబులకు మీరు సాలియుండునది’ యనినం బురోహితుండు దగిన విద్వజ్జనంబులతోడ విచారించి దుర్యోధనున కి ట్లనియె.

### [3.6.72](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.72)

చ. ‘జనవర! నీకుఁ బాండవులు శత్రులు గావున వారి నాజి నో  
ర్చిన మఱి కాక మున్న యిటు సేయఁగ శక్యమె రాజసూయమున్‌?  
వినుము దగంగ నిప్పటికి వేఱొక యజ్ఞము సేయు మిమ్ములం;  
బనుపుము తత్క్రియావివిధభంగులకుం దగువారి వేగమై.

### [3.6.73](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.73)

తే. రాజసూయంబు నట్టిద రాజవర్య! | వైష్ణవం బను యాగంబు; వాసుదేవుఁ  
డిమ్మఖము సేసెఁ దొల్లి; యభీష్ట మిదియ; | చేయు నిర్విఘ్నముగ నిది సెల్లు నీకు’.

### [3.6.74](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.74)

క. అనిన నిది వోలు నని య | జ్జననాథుఁడు సూతతనయసౌబలులు ప్రియం  
బున ననుమతింప నభిమత | వినుతాధ్వరసంప్రయోగవిహితోద్యముఁ డై.

### [3.6.75](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.75)

క. తనయుద్యోగము జననీ | జనకులకును ద్రోణవిదురశాంతనవ కృపా  
ది నిఖిలమాన్యజనమ్ముల | కును దగ నెఱిఁగించి భరతకుంజరుఁ డెలమిన్‌.

### [3.6.76](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.76)

వ. వారిచేత ననుజ్ఞాతుం డయి నగరసమీపంబున నొక్క పుణ్యస్థలంబునం దఖిలయజ్ఞగృహంబులు నతిరమణీయంబులుగాఁజేయించి యజ్ఞోపకరణంబులును సమస్తవస్తువిశేషంబులును సమకట్ట నియోగించి శుభదినంబునం బరమబ్రాహ్మణసహాయుం డై నియతదీక్షాశోభనంబు వహించె నంత.

### [3.6.77](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.77)

ఆ. అఖిలదేశవాసు లైన రాజులను బ | విత్రచరితు లైన విప్రవరుల  
నర్థిఁ బిలువ దూత లరిగిరి కౌరవే | శ్వరుని యాజ్ఞఁజేసి సమ్మదమున.

### [3.6.78](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.78)

వ. అందొక్క దూతం బిలిచి దుశ్శాసనుండు ‘నీవు ద్వైతవనంబునకుం జని పాండవులను దదాశ్రమవాసు లైన భూసురులను గౌరవేశ్వరు నధ్వరంబునకుఁబిలువు’ మని పనిచిన, వాఁడునుంజని ధర్మరాజుం గని యిట్లనియె.

### [3.6.79](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.79)

ఉ. ‘వీరుఁడు గౌరవుండు నిజవిక్రమలబ్ధ సమున్నతార్థ సం  
భారములన్‌ మహాధ్వర మపారబలుం డొనరించుచుండి పెం  
పారఁగ నిన్నుఁ దమ్ముల మహాద్విజులం బిలువంగఁ బంచె ధా  
త్రీరమణేశ! నెమ్మిఁ జనుదెమ్ము తదధ్వరముం గనుంగొనన్‌.’

### [3.6.80](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.80)

వ. అనిన ధర్మజుండు వాని కిట్లనియె.

### [3.6.81](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.81)

చ. ‘అనఘుఁడు ధార్తరాష్ట్రుఁడు మహాధ్వరకర్మధురీణుఁ డయ్యె నా  
విని ప్రియమందెఁ జిత్తము; పవిత్రిత మయ్యెఁ గులంబు; వింటె! యై  
నను దగ మేము పూనిన ఘనంబగు పూనికి దీర్ప కెవ్విధం  
బున నట రా నొడంబడము? భూవరుతో నిది సెప్పు మేర్పడన్‌.’

### [3.6.82](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.82)

వ. అనియె; నప్పుడు భీమసేనుం డాదూతం జూచి, ‘యోరి! వినుము! పదుమూఁడగునేఁటి కడపటఁ బాండవాగ్రజుండు దీప్తం బగుశస్త్రాస్త్రదహనంబునందు ధార్తరాష్ట్రసుతశతకంబును బశువరించివేల్చి రణసత్త్రంబు సేయుటకునై వచ్చుం గాని యందాఁకం జనుదెంచుట గలుగ దని యాదుర్యోధను నెదురన వాయోడక చెప్పు’ మనిన, వాఁడును మగిడి చని ధర్మనందను ప్రియవచనంబులను వృకోదరు నిష్ఠురోక్తులను ధార్తరాష్ట్రుల కెఱింగించెఁ; దదనంతరంబ.

### [3.6.83](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.83)

క. చనుదెంచిరి కౌరవశా | సనమున ధరణిఁ గల నిఖిల జనపతులును స  
న్మునులును సమస్తజనులును | ఘనభుజుజన్నంబుఁ జూడఁ గరిపురమునకున్‌.

### [3.6.84](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.84)

వ. వారి కెల్లను దగిన సత్కారంబులు సేయను బాత్రదానంబులు గావింపను ధృతరాష్ట్రుండు విదురుం బనిచె; నివ్విధంబునఁ బ్రసిద్ధ దక్షిణాన్వితంబై ప్రభూతాన్నపానసంతర్పిత సకలజనంబై యభిమతాంబరాభరణ పరిపూజిత భూసురప్రకరంబై యథాకాలవిహితకర్మకలాపంబై యథాశాస్త్రీయంబై వైష్ణవయాగంబు నిర్విఘ్నంబుగఁ బరిసమాప్తం బగుటయు.

### [3.6.85](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.85)

క. అవభృథశోభితుఁడై కౌ | రవముఖ్యుఁడు భూరికనకరత్నతతుల భూ  
దివిజులఁ బూజించి నృపుల | వివిధ విధుల సత్కరించి వీడ్కొలిపెఁ దగన్‌.

### [3.6.86](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.86)

వ. అట్టియెడ నధ్వరోత్సవాగతు లైన జను లనేకులు ధృతరాష్ట్రనందను సమ్ముఖంబున ని ట్లనిరి.

### [3.6.87](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.87)

క. ‘జనపతు లెవ్వరు నివ్విధ | మున నిర్విఘ్నముగ నఖిలభూజనసమ్మో  
దనముగఁ జేసిరె సత్క్రతు | వనఘ! భవత్పుణ్యమహిమ లాశ్చర్య మిలన్‌.

### [3.6.88](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.88)

శా. సారోదారవిభూతిమై మును హరిశ్చంద్రుం డొనర్చెం గ్రియా  
పారీణుండయి రాజసూయ; మది సెప్పన్‌ వింటి; మయ్యజ్ఞముం  
గౌరవ్యోత్తముఁ డైన ధర్మసుతుఁడుం గావింపగాఁ గంటి; మే  
మా రెండున్‌ సరిగావు నీమఖముతో నత్యున్నతిన్‌ భూవరా!

### [3.6.89](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.89)

క. ఈ జన్న మొనర్చియకా | దే జగదావర్తకీర్తి దీపితులై య  
వ్యాజసురలోకసుఖముల | భ్రాజిల్లిరి రఘు యయాతి భరతాది నృపుల్‌’.

### [3.6.90](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.90)

తే. అని నుతింపంగ మఱియును నంద కొంద | ఱయ్యుధిష్ఠిరు రాజసూయంబు చిదుర  
పాలుఁ బోల దీమఖము వైభవసమృద్ధి | నని తలంచిరి నిజహృదయంబులందు.

### [3.6.91](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.91)

వ. అనంతరంబ నిరంతరానందమందమందాయమానమానసుం డగుచు మానవేశ్వరుండు దమ్ములు దొరలు బంధుజనంబులుం బరివేష్టింపఁ బౌరజనదత్తాశీర్వాద జయజయశబ్ద శబ్దాయమాన దిగ్విభాగుం డగుచుఁ బుణ్యాంగనా కరకలిత లలితాక్షతవిక్షేపంబులును, బటువందిమాగధ సంకీర్తనంబులును గైకొనుచుఁ బురప్రవేశంబు సేసి, రాజమందిరగతుండై ధృతరాష్ట్రునకు గాంధారికిఁ గృపద్రోణభీష్ములకుం బ్రణమిల్లి యుల్లంబు వికసిల్లఁ గనకాసనాసీనుండయ్యె; నప్పుడు కర్ణుం డతని కి ట్లనియె.

### [3.6.92](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.92)

ఉ. ‘భాగ్యము గాదె కౌరవనృపాల! భవన్మఖ మిష్టసత్క్రియా  
యోగ్యత నిర్వికల్పముగ నొందె సమాప్తి; నశేషధాత్రియున్‌  
భోగ్యమ నీకు; నింక రణభూమిఁ బృథాసుతులన్‌ జయించి స  
మ్యగ్యమశాలివై భువనమాన్య! యొనర్పుము రాజసూయమున్‌.

### [3.6.93](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.93)

క. అది యెమ్మెయి నగునో యని | మదిలో వగవంగవలదు; మఘవతనూజుం  
గదనంబునఁ జంపక యే | పదనఖధావన మొనర్పఁ బార్థివముఖ్యా!’

### [3.6.94](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.94)

తే. అనినఁ గర్ణుఁ గౌఁగిటఁ జేర్చి యన్నరేంద్ర | నందనుఁడు ‘నీ సహాయత నాకుఁ గలుగఁ  
బాండవుల నోర్చు టెంతటి పని మహాత్మ!’ | యని సహోదరసహితుఁడై హర్ష మొందె.

### [3.6.95](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.95)

వ. అట ధర్మతనయుండు సూతతనయు ప్రతిజ్ఞ విని వాని బలశౌర్యవిభవంబును నభేద్యకవచ ప్రభావంబును దలంచి విషణ్ణహృదయుం డై రేయెల్లను గన్ను మూయుట లేక వగచుచుండె; నిట దుర్యోధనుండునుం గర్ణసౌబలప్రవర్తిత కార్యఖడ్గుం డై భీష్మద్రోణకృపాదులకును మహనీయు లైన మహీసురులకు ననుదినంబును బ్రియ సత్కారంబులు సలుపుచు ధనంబు దత్తభుక్తఫలంబుగా వగచి, నిరంతర త్యాగ భోగంబుల ననురాగంబు నొందుచుండె ననిన’ వైశంపాయనునకు జనమేజయుం డిట్లనియె.

### [3.6.96](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.96)

క. ‘దుర్యోధను చెఱఁ దలిఁగి య | వార్యపరాక్రములు పాండవప్రభులు మహా  
శ్చర్యచరితు లవ్వనమున | నార్యులు మఱి యెట్టివార లైరి మునీంద్రా!’

### [3.6.97](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.97)

వ. అని యడిగిన నమ్మహాముని యమ్మహీపతి కి ట్లనియె.

### [3.6.98](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.98)

సీ. ‘ద్వైతవనంబున ధర్మజుం డొకనాఁడు | నిద్రింపఁగాఁ దద్వనేచరంబు  
లగునట్టి మృగజాతు లన్నియుఁ గలలోన | వచ్చి కన్నుల నశ్రువారి దొరుఁగఁ  
ద మ్మెఱింగించి యాతనితోడ నిట్లను | ‘ధర్మాత్మ! మీరు నిత్యంబుఁ గడఁగి  
చంపంగఁ జంపంగ సమసి యల్పావశి | ష్టము లయ్యె నిప్పు డస్మత్కులంబు  
తే. లేము బీజమాత్రమ దక్కి యిట్లు వనరు | చున్నవారము; మీ రింక నొండు గడకు  
నరిగి, మముఁ గావరే కరుణార్ధ్రబుద్ధి’ | ననిన నట్లకా కని వాని కభయ మిచ్చి.

### [3.6.99](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.99)

క. జనపతి మేల్కొని యంతయు | ననుజుల కెఱిఁగించి యిట్టు లను ‘నబ్దముపై  
నెనిమిది నెల లుండితి మి | వ్వనమునఁ; దగు నింక నొండువలనికిఁ బోవన్‌.

### [3.6.100](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.100)

వ. ఇప్పుడు కామ్యక వనంబు బహుమృగాకీర్ణంబై సరసఫలభరిత భూరుహప్రకరంబై విమలకమలా కరాభిరామంబై యున్న యది యని వింటిమి గ్రమ్మఱ గావునం నందులకుం జని తృణబిందునాశ్రమంబున వసియించుటలెస్స’ యనినం దమ్ములు ‘దేవా! నీ వెట్లు నిశ్చయించితి మాకు నదియ యిష్టం’ బని వలికిరి; తదనంతరంబ.

### [3.6.101](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.101)

క. అనుజన్ములుఁ బాంచాలియు | నను చరవర్గంబు బ్రాహ్మణావలియును దోఁ  
జనుదేరఁగ సమ్మదమున | ఘనతేజుఁడు సనియెఁ గామ్యకవనంబునకున్‌.

### [3.6.102](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.102)

వ. ఇట్లరిగి యందుఁగృతనివాసులై యవ్వీరులు శాఖఫలమూలంబులంజేసి దేహయాత్రలు నడపుచు నొండొరుల యలజడి సూచి యత్యంతదుఃఖపరవశు లగుచు, జూదంబునాఁడు దమపడినపాట్లు దలంచి కలంగుచుఁ గ్రోధశోకంబులు దమలోన నుపశమించుకొనుచు వర్తిల్లం, బదునొక్కండగు నేఁడు సనిన నందఱుం గాలంబు గడగాంచినవారలై వెడవెడ వికసిల్లిన చిత్తంబులతో నుచితవృత్తంబుల నుండునంత.

### [3.6.103](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.103)

శా. ప్రీతుండై చనుదెంచె నాశ్రితజనాభీష్టక్రియాశీలుఁ డు  
ద్గీతామ్నాయుఁడు నిర్విధూతదురితక్లేశుండు యోగామృత  
స్ఫీతస్వాంతుఁ డనంతసంతతసమావిర్భూతకారుణ్యధా  
రాతోయస్నపనైకశీలుఁ డగు పారాశర్యుఁ డచ్చోటికిన్‌.

### [3.6.104](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.104)

క. మునిపతి దోదవ్వులఁ గని | జనపతి దమ్ములును దాను సంప్రీతి నెదు  
ర్కొని యర్ఘ్యాది విశేషా | ర్చనలం బరితుష్టుఁ జేసె సంభృతభక్తిన్‌.

### [3.6.105](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.105)

వ. కృష్ణద్వైపాయనుండును ననవరతవనవాసాయాస కృశదేహుల నధికదుఃఖాయమాన హృదయులం దన మనుమలం జూచి వగచి, ధర్మపుత్త్రున కి ట్లనియె.

### [3.6.106](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.106)

ఉ. ‘కాలవిపర్యయంబున సుఖంబును దుఃఖము వచ్చుచుండు; నె  
క్కాలము నేరికిన్‌ ధ్రువము గాదు సుఖంబును దుఃఖమున్‌ మహీ  
పాల! బుధుండు దద్వివిధభంగు లెఱింగి ప్రమోద ఖేదసం  
శీలుఁడు గాఁడు రెంటను బ్రసిద్ధపథంబున నప్రమత్తుఁడై.

### [3.6.107](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.107)

క. విను నీవును నాపదలకు | మనమున నొక్కింత యోర్చి మహనీయముగా  
నొనరింపుము తపము; దపం | బునన కదా సకలసౌఖ్యములు సిద్ధించున్‌.

### [3.6.108](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.108)

క. క్షమయు నహింసయు సత్యము | సమతయు నింద్రియజయంబు శమముఁ బరిత్యా  
గమును దపోలక్షణములు | గ్రమమున నిన్నియును నూర్ధ్వగతికారణముల్‌.

### [3.6.109](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.109)

తే. ఇందుఁ జేసిన పుణ్యంబ యందుఁ గుడుచు | మీఁది జన్మంబునకు నది మేలుఁ జేయుఁ  
గాన తనశక్తితోఁ గూడ దానధర్మ | చిరపరోపకారంబులు సేయవలయు’.

### [3.6.110](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.110)

వ. అనినం బాండవాగ్రజుండు ‘దానతపంబులలో దుష్కరం బెయ్యది? యెద్దాన నధికఫలం బగు?’ నని యడిగిన వేదవ్యాసుం డి ట్లనియె.

### [3.6.111](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.111)

సీ. ‘దాన మూర్జితఫలదం బర్థసాధ్య మై | పరఁగుటఁ గరము దుష్కరము నదియ;  
నరులకు నధిప! ప్రాణంబులకంటెను | రూపింప నర్థంబు తీపు వినవె  
యుగ్రంబు లైన యాయుధముల మొనలపై | నుఱుకుట యంభోధి దఱిసి చనుట  
కృషి పాశుపాల్యసంక్లేశంబు నొందుట | యడవులఁ గొండల నిడుమ వడుట  
ఆ. నవసి పొవసి యనుదినముఁ బరప్రేష్యులై | యునికిఁ దలఁప నర్థమునకు చూవె!  
యట్టి దుఃఖలబ్ధ మైన యయ్యర్థంబు | విడుచు టెవ్విధమునఁ గడిఁది గాదె?

### [3.6.112](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.112)

శా. అన్యాయార్జిత మైన విత్తమునఁ జేయం బూను దానంబు మూ  
ర్ఖన్యాయం బది; దానఁజేసి ఫలపాకం బేమియున్‌ లేదు; యు  
క్తన్యాయార్జిత మించుకంత యయినం గాలంబు దేశంబు స  
మ్మాన్యంబై తగఁ బాత్రయోగమున సౌమ్యంబై ఫలించుం దుదిన్‌.

### [3.6.113](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.113)

వ. తొల్లి ముద్గలుం డను మహాద్విజుండు సన్మార్గోపార్జితం బైన వ్రీహిద్రోణంబు సత్పాత్రంబున వినియోగించి కాదె పరమసిద్ధిం బొందె’ ననిన విని ధర్మనందనుండు ‘మునీంద్రా! ముద్గలుండు వ్రీహిద్రోణం బెబ్భంగి నుపార్జించె? నెట్టి పాత్రంబునఁ బ్రతిపాదించె?; వినవలతుం జెప్పవే!’ యనిన నతం డిట్లనియె.

### [3.6.232](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.232)

వ. అంత నంగారకుండును, గుంజరుండును, సృంజయుండును, సుప్తకుండును, శత్రుంజయుండును, సుప్రబుద్ధుండును, శుభంకరుండును, భ్రమంకరుండును, శూరుండును, రథియును, గుహకుండును, బలాఢ్యుండును నను సౌవీరకుమారులు పన్నిరువురు నిక్ష్వాకు శిబి సైంధవ త్రిగర్త సైన్యంబులం గూడి క్రీడి మార్కొని పటుబాణజాలంబులం గప్పిన.

### [3.6.233](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.233)

మ. అతులక్రోధ విఘూర్ణమానహృదయుండై చండ గాండీవ ని  
ర్గత భల్లౌఘములం దదస్త్రవితతుల్‌ ఖండించి సౌవీరసం  
తతిఁ బన్నిద్దఱవిండ్లులం దునిమి దోర్దర్పంబు మీఱంగ స  
స్మితుఁడై యాతఁడు దచ్ఛిరఃప్రకర విచ్ఛేదంబు సేసెన్‌ వెసన్‌.

### [3.6.234](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.234)

క. ఆకులముగ శైబ్యుల ని | క్ష్వాకుల, సైంధవులనుం ద్రిగర్తులనుం బో  
నీక పొదివి రయమున న | స్తోకపరాక్రముఁడు దునిమి తూఁటాడె వడిన్‌.

### [3.6.235](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.235)

వ. అప్పుడు రణభూమి యంతయు శవమయం బయ్యె, నంబరం బంతయుం గబంధమయం బయ్యెఁ; జారు కేయూర వీరాంకవిభూషితంబులైన బహుచరణచ్ఛేదంబులును, గార్ముకతూణీరకాండఖండంబులు, నక్షకూబర రథాంగకేతనత్రివేణుకశకలంబులును, బుండరీకవ్యజనచామర భంగంబులుం, గరవాలపరిఘ శక్తిగదా ముసలపట్టిసప్రాస లేశంబులు, నెక్కడఁ జూచిన రాసులై యుండెఁ; గీలాల పూరంబును మాంసపంకంబును గేశ శైవాలంబును నైన యపూర్వనదీప్రవాహంబునందు బహువిధక్రవ్యాదగణంబు లవగాహంబు సేయుచుఁ బ్రకటకోలాహలవ్యాకులం బగుచుండె; నివ్విధంబున.

### [3.6.236](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.236)

క. గాండివపవనప్రేరిత | చండాంబకఘోరశిఖల శతమఖతనయో  
ద్దండదహనుఁ డొకమాత్ర న | ఖండితసౌవీరసైన్యకానన మేర్చెన్‌.

### [3.6.237](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.237)

వ. అట్టి క్రందున జయద్రథుండు ద్రౌపదిని దిగ విడిచి రథంబు దోలుకొని పఱచె; నంత ధర్మజుండు ధౌమ్య సమన్విత యై యున్న పాంచాలిం గని నిజరథంబుపై నిడికొనియె; సైంధవు పలాయనం బెఱింగి యర్జునుండు శత్రుసేనాహననసంరంభంబున నున్న భీమసేనున కిట్లనియె.

### [3.6.238](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.238)

తే. ‘వీతలజ్జుఁడై పఱచె సౌవీరవిభుఁడు | పొనుఁగుప్రజ నేల యాఱడిఁ దునిమి వైవ  
నద్దురాత్ముని వెనుకొని యసువు లిపుడు | గొనఁగవలయు, లే లెమ్ము సద్వినుతశౌర్య!

### [3.6.239](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.239)

వ. అనిన నతండు గయ్యంబు సాలించి ధర్మతనయుం జూచి.

### [3.6.240](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.240)

క. ‘జననాథ! ద్రుపదసుతఁ దో | డ్కొని ధౌమ్యుఁడు నీవుఁ గవలు గుఱుకొని మగుడం  
జనుఁ డాశ్రమంబునకు నే | మును సైంధవువెనుకఁ గూడ ముట్టెదము వెసన్‌.

### [3.6.241](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.241)

క. అతలంబునఁ గ్రుంగిన న | ద్భుతముగ దివమునకు నెగసి పోయినఁ బగతున్‌  
హతుఁ జేయక మగుడము; విని | హతుఁడుగఁ జేయుదుము దివిజు లడ్డం బైనన్‌’.

### [3.6.242](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.242)

తే. అనిన ధర్మజుఁ డిట్లను నద్దురాత్ముఁ | బొలియఁ జేయుట దగదు దుస్సలఁ దలంచి;  
వాని నొకతప్పునకు సైఁప వలదె? యాంబి | కేయమహిషికి ఖేదంబు సేయఁ దగునె?’

### [3.6.243](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.243)

వ. అనినం బాంచాలి భీమార్జునులతోడ ‘నప్పాపాత్ముని దెసం గృప సేయ వలవ; దవశ్యంబును వాని వధియించి, నాకుం బ్రియంబు గావించునది; యట్టి ద్రోహి యెల్ల భంగుల వధ్యుం’ డనియెఁ; దదనంతరంబ ధర్మనందనుండు ధౌమ్య ద్రౌపదీ నకుల సహదేవ సహితుండై, మగిడి నిజాశ్రమంబునకుం జనియె; నిట భీమ విజయులు రథంబులు రయంబునం దోలుకొని చని, క్రోశమాత్రాంతరంబున సైంధవుం గని; రప్పుడు కిరీటి దూరాపాత విశిఖంబుల జయద్రథురథ్యంబులం బడనేసిన.

### [3.6.244](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.244)

క. తల్లడ పడి యరదము డిగి | విల్లును నమ్ములును విడిచి వెల్ల నగుచు మే  
నెల్లఁ జెమర్పఁగ నూర్పులు | పెల్లుగ నమ్మనుజపశువు పెలుచం బఱచెన్‌.

### [3.6.245](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.245)

ఆ. వానిఁ జూచి నగుచు వార ‘లోరోరి! యిం | కెందుఁ బోవ వచ్చుఁ బంద! నిలువు;  
మిట్టికడిమి నమ్మియే ప్రల్లదంబులు | సేయఁ దొడఁగి’ తనుచు డాయుటయును.

### [3.6.246](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.246)

వ. మరలి చూచి వాఁ డొక్క గుల్మమధ్యంబుఁ దూఱుటయుఁ గని భీమసేనుండు రోషసందష్టాధరుం డగుచు రథంబు డిగ్గ నుఱికి.

### [3.6.247](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.247)

క. ఒడిసి తలవట్టి నేలం | బడఁ దిగిచిన, వాఁడు పెనఁగఁ బడుటయుఁ జిక్కన్‌  
మెడఁ ద్రొక్కి గాఢముష్టిం | బొడిచె మొగం బవియ రక్తపూరము దొరుఁగన్‌.

### [3.6.248](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.248)

క. ఒడలెల్లఁ బిండికూడుగఁ | బొడిచి యెగయ నెత్తి త్రిప్పి భూస్థలి మీఁదన్‌  
బడవైచి యురము మొగమును | నడిచెను వడముడి తలప్రహారకుశలుఁడై.

### [3.6.249](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.249)

వ. ఇట్లు బెట్టుగా నడఁచినఁ బగతుండు వివశుం డగుటయుం జూచి యర్జునుం ‘డోహో! యింత సాలు; నింక నొచ్చినం బ్రాణ విముక్తుం డగుం గావున నజాత శత్రువచనంబులు దలంచి, వీనిఁ గరుణింపు’ మనిన నతండు గవ్వడి దెసఁ గనుంగొని, ‘ధర్మనందనుం డెప్పుడుఁ గరుణయకాని కార్యంబు చేటుపాటు విచారింపఁజొరండు; నీవును నతనిభంగిన బేలవై; తిద్దురాత్ము నెట్లు సైఁప వచ్చు?’ నని పలికె; ననంతరంబ.

### [3.6.250](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.250)

ఆ. వాఁడియైన కత్తి వాతి యమ్మునఁ గొని | పగతుశిరము చెక్క లెగయ గొఱిగి  
నరుల కెల్లఁ జూడ నవ్వగునట్లుగాఁ | గలయ నైదు గూఁకటుల నొనర్చె.

### [3.6.251](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.251)

వ. ఇట్లు రాజవేషంబు వికల్పితంబు సేసి యమ్మహాభుజుండు వాని కిట్లను ‘నోరీ! బ్రదుకవలతేని నేఁడు మొదలుగా నెల్ల సభలయందును ‘బాండవదాసుండ’ నని పలుకునది’ యనిన వాఁడును దండాఘాతభయంబున ‘నట్లచేయుదు’ ననియె; నంత నయ్యిరువురు నతనిం బెడకేలు గట్టి రథంబుపై నిడికొని నిజాశ్రమంబునకుం జని ధర్మపుత్త్రునకు నివేదించి, ‘వీఁడె పాండవ దాసుం’ డనిన, నతం ‘డట్లేని వీని విడువుం’ డనియెఁ; బాంచాలియు జయద్రథుం జూచి నవ్వుచు ‘నిప్పాపాత్ముండు భవదీయ దాసుం డయ్యెం గావున వీనిం బో విడువుం’ డని విడిపించె; నా సైంధవుండును ధర్మజునకుఁ దత్సభా గతులైన మునులకు మ్రొక్కిన, నజాత శత్రుం డి ట్లనియె.

### [3.6.252](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.252)

ఆ. ‘ఎట్టి కష్టుఁ డైన నిట్టిపాపము సేయ | నెత్తికొనునె! ధరణి నీవు దక్క.  
నరుగు మింక; నేమి యందుము నిన్ను నిం | ద్రియవిలోలు నల్పు ధృతివిహీను.

### [3.6.253](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.253)

వ. ఇంక నెవ్వారికి నిట్టి కొఱగాములు సేయక బుద్ధిమంతుఁడవై యుండు’ మనిన నతండు లజ్జావనత వదనుం డగుచు నచ్చోటు వాసి, గంగాద్వారంబున కరిగి యందు.

### [3.6.254](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.254)

శా. ఆదిత్యార్చితపాదపద్ము జగదేకాధీశు నీశుం ద్రిలో  
కాదిం గామవిభేదిఁ బర్వతసుతాహ్లాదైకసంపాది నిః  
ఖేదుం డై శివు నాత్మలో నిలిపి యక్షీణవ్రతారూఢతం  
బాదాంగుష్ఠము నేల మోపి తప మొప్పం జేసె సద్భక్తిమైన్‌.

### [3.6.255](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.255)

ఉ. వానికి నమ్మహేశ్వరుఁడు వత్సలుఁ డై పొడసూపి, ‘యీప్సితం  
బైనది వేఁడు’ మన్న, నతఁ డానతుఁడై ‘పరమేశ! విక్రమా  
హీనులఁ బాండునందనుల నేవుర సైన్యయుతంబుగా ననిం  
బూని జయించు నట్టి వరముం గృపసేయుము నాకు’ నావుడున్‌.

### [3.6.256](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.256)

క. ‘ఇది వొసఁగదు పాండవులం | గదనమున జయింప నలవిగా దింద్రాది  
త్రిదశులకు; వినవె! యైనను | వదలక నీకోర్కి దీర్పవలయున యెట్లున్‌.

### [3.6.257](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.257)

చ. విజయుఁ డొకండు తక్క నతివీరులఁ బార్థుల నున్న నల్వురన్‌  
నిజ మొకనాఁటి కయ్యమున నీవు జయింపుము; ఫల్గునుండు స  
ర్వజగదజయ్య విక్రముఁడు; వాని నెదుర్కొని నాకు నైనఁ బో  
ర జితునిఁ జేయు టెంతయు భరం బగు; నిక్కము వల్కితిం జుమీ!

### [3.6.258](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.258)

వ. అస్మ త్ప్రసాదవిశేషంబునం జేసి వాని కిట్టి ప్రభావంబు గలిగె; నదియునుం గాక.

### [3.6.259](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.259)

క. నిఖిలాస్త్రశస్త్రవిద్యా | సఖుఁ డపరాజితయశోవిశాలుఁడు విష్ణుం  
డఖిలేశ్వరుఁ డతనికిఁ బ్రియ | సఖుఁ డటె! యవ్వీరు గెల్వ శక్యమె నీకున్‌?’

### [3.6.260](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.260)

వ. అని పలికి యీశ్వరుం డంతర్హితుం డయ్యె; సింధుపతియు నిజదేశంబునకుం జనియె’ ననిన విని జనమేజయుండు వైశంపాయనున కిట్లనియె.

### [3.6.261](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.261)

తే. ‘ధర్మపత్నీసమేతులై తద్వనంబు | నం దపారదుఃఖాతురు లగుచు నున్న  
రాజముఖ్యులు సత్యైకరతులు పాండు | సుతులు మఱి యేమి సేసిరి సూరిముఖ్య!’

### [3.6.262](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.262)

వ. అనిన నతం డిట్లనియె; నట్లు ద్రౌపదీమోక్షణం బొనరించిన పిదపం గామ్యకవననివాసుండై భూసుర నివహంబుతో నున్న ధర్మజుపాలికి మార్కండేయుం డరుగు దెంచిన, ననుజసహితంబుగాఁ బ్రత్యుద్గతుండై యమ్మునివరుం బ్రభూతసపర్యల సంతుష్టహృదయుం గావించి, యవ్విభుండు పాంచాలియెడ జయద్రథు చేసిన దుర్వ్యవసాయంబు వానిం బరిభవించుటకునై తమ పడిన యాయాసంబును నమ్మహాత్మున కెఱింగించి ‘మహనీయ శౌర్యధైర్య ధర్మారంభ సమగ్రుల మైన మా కివ్విధంబున నఖిలసామ్రాజ్యభోగ వియోగంబై దుస్తరం బగు వనవాసంబు సంప్రాప్తం బయ్యెం గావున విధికృతం బెవ్వనికి నెబ్భంగుల నలంఘ్యం బని తలంచెద’ నని పలికి మఱియు ని ట్లనియె.

### [3.6.263](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.263)

తే. ‘ద్రుపదనందనక్రియఁ గడుదుఃఖపడిన | నృపవధూటియు నాయట్ల నియతశోక  
వనధి నిర్మగ్నుఁ డైన భూవరసుతుండుఁ | గలఁడె వినఁ జూడ ననఘ! యెక్కాలమునను?’

### [3.6.264](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.264)

వ. అనిన నతనికి నత్తపోనిధి యి ట్లనియె.

### [3.6.265](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.265)

క. ‘కడు దుఃఖము నొందితి నని | యుడుగక యిటు వగచె దేల యుర్వీశ్వర! నీ  
పడు టేటిది? రఘురాముఁడు | గడఁగి యిడుమ వడఁడె! తొల్లి కాఱడవులలోన్‌.

### [3.6.266](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.266)

ఉ. ఆ విభుకాంత గాదె జనకాత్మజ రావణుచే గృహీత యై  
పోవదె; వానరప్రకరముల్‌ వెసఁ దోడుగ నేఁగి యా ధరి  
త్రీవిభుఁ డబ్ధిఁ గట్టఁడె, వధింపఁడె దివ్యశరంబులన్‌ దశ  
గ్రీవునిఁ; గ్రమ్మఱం జని యకిల్బిషరాజ్యవిభూతి నొందఁడే?

### [3.6.281](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.281)

వ. ‘మనుష్యజాతి యొక్కండుదక్క నీ చెప్పిన యందఱవలనను నీకు మరణభయంబు లే’ దని పలికి, పరమేష్ఠి గుంభకర్ణుం జూచి ‘వరం బడుగు’ మనిన వాఁడు దైవోపహతుండై తనకు నాత్యంతికం బయిన నిద్ర యడిగిన నట్ల యగు నని, విభీషణున కభిముఖుం డగుటయు నతండు కృతాంజలియై జలజాసనుఁ బ్రస్తుతించి.

### [3.6.282](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.282)

క. ‘పరమాపద యైనపుడును | దురితంబులు నా మనంబు దొడరమియును భా  
సుర మగు బ్రహ్మాస్త్రమ్మును| గరుణింపవె’ యనిన నిచ్చి కమలజుఁ డనియెన్‌.

### [3.6.283](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.283)

క. ‘నిరతము రాక్షసభవమును | బొరసియు నీ విట్లు ధర్మబుద్ధి వగుట య  
చ్చెరు విది గావున నీకును | దిరముగ నమరత్వ మిచ్చితిం గృప వత్సా!

### [3.6.284](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.284)

వ. అని పలికి పితామహుం డంతర్హితుం డయ్యెఁ; దదనంతరంబ.

### [3.6.285](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.285)

మ. వరగర్వోన్నతుఁ డై దశాననుఁడు దుర్వారోద్ధతిన్‌ దాడిమై  
నరిగెం గిన్నరనాథుపై; నతఁడు కార్యం బాత్మ నూహించి సం  
గరసన్నద్ధుఁడు గాక కింపురుష యక్షశ్రేణితోఁ గూడఁ దా  
నరిగెన్‌ లంకఁ బరిత్యజించి రభసోద్యత్పుష్పకారూఢుఁడై.

### [3.6.286](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.286)

వ. ఇ ట్లతండు గంధమాదనంబునకుం జనునెడ వెన్నడిం దగిలి దానవుండు వాని మానంబుతోన విమానంబు నపహరించినం గనలి యక్షేశ్వరుండు ‘గురుండ నగు నన్ను నవమానించితివి గావున నివ్విమానంబు నీ పగతు పా లయ్యెడు’ మని శపించె నంత.

### [3.6.287](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.287)

క. రాక్షసలక్ష్మీమహిమకు | రక్షకుఁడుగఁ బంక్తిముఖుని రాక్షసమాయా  
దక్షు నభిషిక్తుఁ జేసిరి | రాక్షసబేతాళవరులు రాగం బెసఁగన్‌.

### [3.6.288](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.288)

వ. వాఁడును బలదర్పమోహితుండై కడంగి యింద్రాదిదేవతల నొడిచి తత్పదంబు లాక్రమించి, యీసు మిగిలి జగద్రావణంబు సేయుటం జేసి, రావణుం డను పేరం బ్రఖ్యాతి వహించి సకలభూత భయంకరుం డయ్యె; నట్టియెడ దేవర్షులును, రాజర్షులునుం గూడి చని తత్ప్రకారం బగ్నిదేవునకుం జెప్పిన, నతండు వారిం దోడ్కొని వారిజాసనుపాలికిం జని యి ట్లనియె.

### [3.6.289](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.289)

ఉ. ‘భూరిభుజుండు విశ్రవసుపుత్త్రుఁడు పంక్తిముఖుండు దర్పదు  
ర్వారుఁడు రాక్షసేంద్రుఁడు భవద్వరశక్తి నవధ్యుఁ డై మహా  
ఘోరముగాఁ ద్రిలోకములకుం గడుఁ బీడ యొనర్పఁ జొచ్చె వృ  
త్రారి పురోగమత్రిదశు లందఱుఁ గింకరు లైరి వానికిన్‌.

### [3.6.290](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.290)

ఉ. దానవుచేతఁ గష్టపడి దైన్యము నొందుట కోర్వలేక నీ  
దైన పదాంబుజంబు లభయం బని చేరితి; మింక మమ్ము నె  
ట్లైనఁ గృపార్ద్రమానసుఁడ వై తగఁ జేకొనవయ్య! మాకు ది  
క్కైనను గాకయున్నఁ గమలాసన! నీవ కదయ్య యెయ్యెడన్‌.’

### [3.6.291](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.291)

వ. అనినంబరమేష్ఠివారల కిట్లను; నిక్కార్యంబునకు నేను మున్న తగిన యుపాయంబు నిశ్చయించి నారాయణుం బ్రార్థించితి; నద్దేవుండు మనుష్యభావంబున నవతరించి, యా రాక్షసు వధియించువాఁ డయ్యె; నింద్రాది సురులునుం దమ తమ యంశంబులంజేసి ఋక్షవానరజాతులయందు జనియింపఁగలవారు; మీకు భయంబు వలవ’ దని యగ్నిప్రముఖు లైన యమ్మహామునుల సమ్ముఖంబున దుందుభి యను గంధర్వ కామినిం బిలిచి ‘నీవు కుబ్జరూపంబున మంథర యను పేర భూలోకంబున నుద్భవించి నీ నేర్చు విధంబున దేవకార్యంబులు నిర్వహింపు’ మని పనిచి వారి వీడ్కొలిపెఁ; బదంపడి దివిజుల యంశావతారంబులం. జేసి.

### [3.6.292](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.292)

మ. గురుశైలోన్నతగాత్రు లుద్ధత భుజో గ్రుల్‌ వజ్రపాషాణ క  
ర్కరు లర్కప్రతిమానతేజులు, గుణాకల్పుల్‌, మహాకల్పభీ  
కరకాలాంతకకల్పు లాజినిపుణుల్‌ గర్వోన్నతుల్‌ ఋక్షవా  
నర వీరుల్‌ జనియించి రెల్లయెడలన్‌ నాగాయుతప్రాణులై.

### [3.6.293](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.293)

క. అన విని యుధిష్ఠిరుం డ | మ్మునివరుతో ‘ననఘ! ధర్మమూర్తిని నా రా  
ముని నేల యరణ్యంబున | కనిచెను దశరథుఁడు సెపుమ యక్కథ నెల్లన్‌’.

### [3.6.294](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.294)

వ. అని యడుగుటయు మార్కండేయుం డిట్లనియె: ‘దశరథుండు నిజ సుకృత పాకంబునం జేసి రామ ప్రముఖులయిన కొడుకుల నలువురం గని, త్రైలోక్యరాజ్యంబు సంప్రాప్తం బయినయట్లు సంతసిల్లె; నక్కుమారులు క్రమంబున నుపనీతులు నఖిలవేదవేదాంగవినీతులు, యథాక్రమ పరిణీతులు నై విలసిల్లి రంత.

### [3.6.295](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.295)

సీ. అభినవపద్మదళాక్షు నక్షీణవి | స్తృతవక్షు నాజానుదీర్ఘబాహు  
మధురస్మితానను మదగజగమను నా | రూఢయౌవను నభిరూపతేజు  
శ్రీరమణీయుఁ బ్రసిద్ధయశోరమ్యు | నిఖిలవిద్యాగమనిపుణచిత్తు,  
నింద్రసమాను జితేంద్రియు ధర్మజ్ఞుఁ | బౌరబాంధవజనప్రార్థనీయు  
ఆ. దుష్టనిగ్రహైకధుర్యు విశిష్టసం | రక్షణాభిలోలు రామభద్రుఁ  
గులపవిత్రుఁ బెద్దకొడుకుఁ గనుంగొని | రాజవరుఁడు గరము రాగ మెసఁగ.

### [3.6.296](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.296)

వ. యౌవరాజ్యపదంబునకు నతని నభిషేకం బాచరింపం గోరి యాప్తమంత్రిజనసమ్మతంబునఁ బురోహిత నిరూపితం బైన శుభదినంబున నక్కార్యంబునకు సమకట్టునెడ భరతు దాది మంథర యనునది యమంద గతిం గైకేయిపాలికిం జని యిట్లనియె.

### [3.6.297](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.297)

ఉ. ‘అక్కట నీదెసం బతికి నాఱడి కూరిమి యయ్యె; మాయపుం  
జొక్కులు నీవు నిక్కముగఁ జూచి మనంబున మోసపోయి; తా  
టక్కరి కోసలాత్మజయెడం బ్రియుఁడై యదె తత్తనూజు నిం  
పెక్కఁగ యౌవరాజ్యమున నిప్పుడ పట్టము గట్టఁ బూనెడున్‌.

### [3.6.298](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.298)

ఆ. పుడమిఱేని మదికి నెడ యైతి నీ వింక; | నేమి సెప్పఁగలను వామనయన!  
కడఁగి నిన్నుఁ గొడుకుఁ బెడవడ వైచి యా | సవతికొడుక యేలు నవని యింక’.

### [3.6.299](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.299)

క. అనిన నుదరిపడి కేకయ | తనూజ గడుసంభ్రమమునఁ దత్‌క్షణమ నరేం  
ద్రునిపాలికిఁ జని యేకత | మున నిట్లనుఁ బ్రణయపూర్వముగ నాతనితోన్‌.

### [3.6.300](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.300)

క. ‘ధరణీశ! తొల్లి నాకుం | గరుణించిన వర మొకండు గల; దది మదిలోఁ  
బరికించి యిప్పు డొసఁగుము; | చిరముగ సత్యవ్రతంబు సెల్లింపు తగన్‌.’

### [3.6.301](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.301)

వ. అనిన నతం డయ్యతివం గనుంగొని ‘యవధ్యుల వధియించుటయును, వధ్యులం గాచుటయును, బ్రాహ్మణ ధనంబులు దక్క నన్యులధనం బపహరించుటయును, నభీష్టధనంబు నిచ్చుటయును మొదలుగా నతి దుష్కరంబులైన వాని నైనను భవత్ప్రియార్థము సేసెద; నెయ్యది సెప్పు’ మనిన ప్రీత యై భరతమాత యి ట్లనియె.

### [3.6.302](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.302)

తే. ‘యౌవరాజ్యపదంబునయందు భరతు | నధిప! యభిషేక మొనరింపు; మడవిలోన  
నొలసి పదునాల్గువర్షంబు లుండ నాన | తిమ్ము రాముని; నురువర మ్మిదియ నాకు’.

### [3.6.303](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.303)

క. అనవుడు వీనులు గొఱవిం | గొని చూఁడిన యట్టు లైనఁ గువలయపతి పె  
ల్చన పిడు గడఁ చిన క్రియఁ జే | తనరహితుం డగుచు ధరణితలమునఁ బడియెన్‌.

### [3.6.304](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.304)

వ. అంతయు నెఱింగి రాఘవుండు నిజజనకుండు సత్యప్రతిజ్ఞుండు గావుత మని యాక్షణంబ సీతాసమేతుండయి వనంబునకు వెడలె; నతని పిఱుందన లక్ష్మణుండునుం జనియెఁ; దదనంతరంబ.

### [3.6.305](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.305)

క. రాముఁడు సనుట విని మహో | ద్దామం బగు శోకవహ్ని దరికొనఁగను హా  
రామ! గుణధామ! యని యని | భూమీశ్వరుఁ డసువియోగముం బ్రాపించెన్‌.

### [3.6.306](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.306)

వ. ఇట్లు దశరథుండు సురలోకగతుం డగుటయుఁ, గైకేయి దనకొడుకు రావించి ‘భూవల్లభుండు దేవభావంబు నొందె, రాముండును వనంబున కరిగె, నింక నర్హుండవు నీవ కావున నఖిలమహీరాజ్య రక్షణంబు సేయు’ మనిన నక్కుమారుండు క్రోధశోకదందహ్యమానమానసుం డగుచుఁ దల్లి కి ట్లనియె.

### [3.6.307](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.307)

సీ. ‘దురితంబు లెన్నండుఁ బొరయక వెలుఁగొందు | కమలాప్తకులమునఁ గసటు గలిపి,  
పరమధర్మాత్మకుఁ బురుహూతసన్నిభుఁ | బతి మ్రింగికొని, కృపఁ బాఱవైచి  
యాయతబాహుఁ దేజోయుక్తు మాయన్నఁ | బటుధైర్యు నడవులపాలు వఱిచి,  
జీవితహంత్రివై త్రోవంగరాని దు | ష్కీర్తి నా యౌదలఁ గీలుకొల్పి,  
ఆ. శ్రీకి నెడలి సకలలోకంబుచేతను | దిట్టు గుడిచి కోర్కి దీర్చుకొంటి  
పాపజాతురాల! యీ పాతకం బేమి | సేయ? దింక నేమి సేయువాఁడ?’

### [3.6.308](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.308)

వ. అని దుఃఖించి, భరతుండు దండ్రికి నుచితక్రియలు నిర్వర్తించి, యనంతరంబ సమస్త మంత్రి సామంత భూసుర పౌర జానపద సహితుండై కదలి, మువ్వురు దల్లులను వసిష్ఠ వామదేవులనుం బురస్కరించుకొని తానును శత్రుఘ్నుండును రామానునయార్థంబు చిత్రకూటశైలంబున కరిగి యందు.

### [3.6.309](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.309)

మ. కనియెం గోమలనీలమేఘసుభగాకారున్‌, జటావల్కలా  
జినధారున్‌, సితభూతిభూషితుని, రాజీవాక్షుఁ, గల్యాణ కీ  
ర్తనుఁ, గాకుత్‌స్థకులప్రదీపకుని, సీతాలక్ష్మణోపేతు, స  
న్మునిలోకార్చితు, సత్కృపాభరణు, రామున్‌, రాజచూడామణిన్‌.

### [3.6.310](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.310)

వ. కని యంతంత నాక్రందన పరుం డగుచుం జని తదీయచరణంబులపయిం బడి పితృమరణప్రకారం బంతయు నెఱింగించి, ‘దేవా! సకలసామ్రాజ్యధురీణుండ వై మమ్మందఱ ననుశాసింపవే!’ యని యర్హజన సహితంబుగా నతనిం బ్రార్థించిన.

### [3.6.311](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.311)

క. గురువాక్యరక్షణైకా | దరచిత్తుం డైన యయ్యుదాత్తచరితుఁ డె  
ప్పరుసున నొడఁబడఁ డయ్యెను | సరసమహీరాజ్యసమనుశాసనమునకున్‌.

### [3.6.312](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.312)

వ. భరతుండును రాముచేతఁ బ్రత్యాఖ్యాతుండై తదీయపాదుకంబులు గొని చని, వాని నర్చించుచు నంది గ్రామంబునందు వసియించి రాజ్యానుసంధానంబు సేయుచుండె; నిట రాఘవుం డయోధ్యాపుర సమీపం బగుటం జేసి క్రమ్మఱ భరతాగమనంబు శంకించి, చిత్రకూటంబు వాసి శరభంగుపాలికిం జని, యతని చేత సత్కృతుండై దండకారణ్యంబు సొచ్చి, యందు గోదావరీతీరంబున ననుజవధూసహితంబుగాఁగృత నివాసుండై యున్నంత; దశగ్రీవుచెలియలు శూర్పణఖ సనుదెంచి, వారికి నపకారంబు సేయ మొనసినం గినిసి, యా రాజపుత్త్రులు దత్కర్ణనాసికావైకృతం బొనరించినం బదంపడి.

### [3.6.313](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.313)

ఉ. శూర్పణఖానిమిత్తమున శూరు లనేకులు రక్కసుల్‌ మహో  
త్సర్పితరోషులై బహుళ సైన్యయుతంబుగ నెత్తి వచ్చుడున్‌  
దర్పితవైరిభంజనుఁ డుదారుఁడు రాఘవుఁ డస్త్రవిద్య నే  
ర్పేర్పడఁ గేలిఁ బోలె సమయించె రణాంగణభూమి నందఱన్‌.

### [3.6.314](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.314)

వ. ఇట్లు ఖరదూషణాదులం గొట్టి పదునాలుగువేలరాక్షసులం జంపి దండకారణ్యంబు విగతకంటకంబు గావించె; నంత శూర్పణఖయు రయంబున రావణుపాలికిం జని తచ్చరణంబులపయిం బడి యేడ్చినం, జెలియలి కైన వైకృతం బేర్పడం జూచి యన్నిశాచరనాథుం డి ట్లనియె.

### [3.6.315](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.315)

సీ. ‘ఎఱిఁగి యెఱింగి నేఁ డెవ్వాఁడు నిశిత వి | స్ఫారశూలాగ్రంబుపయికి నుఱికెఁ?  
దలయంపియం దగ్గి దరికొల్పి యెవ్వండు | నేఁడు నెమ్మది శయనింపఁ జూచె?  
నుగ్రవిషానలం బుమియుచున్న యహీంద్రుఁ | గడఁగి నేఁ డెవ్వండు గాలఁ దన్నె?  
హుంకారఘోరమై యుదరు బెబ్బులి మీస | లుఱక యెవ్వాఁడు నేఁ డూఁచికొనియె?  
ఆ. నిన్ను నెవ్వఁ డకట! నేఁ డిట్లు గడు భంగ | పఱిచెఁ జెపుమ నాకుఁ బద్మనయన!  
యాయువును సిరియును నవశంబు లయ్యె నేఁ | డెవ్వనికొ తలంప నిజ్జగమున.’

### [3.6.316](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.316)

క. అని పలుకునప్పు డాతని | ఘనతరముఖనేత్రనాసికాకర్ణములం  
దనవరతరోషపావక | జనితశిఖావితతు లక్కజంబుగ వెడలెన్‌.

### [3.6.317](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.317)

వ. శూర్పణఖయు నతనికి రాఘవు లున్న తెఱంగును, నిజపరిభవంబు దత్కృతం బగుటయు, ఖరదూషణాది రాక్షసవధయునుం జెప్పిన విని, ధనదానుజుం డాక్షణంబ పురసంరక్షణంబునం దాప్తజనంబుల నియోగించి, సన్నద్ధుండై యొక్కరుండ వెలువడి త్రికూటకాలపర్వతంబులు గడచి సముద్రతీరంబునఁ బరమేశ్వరనివాసం బైన గోకర్ణస్థానంబునకుం జని, యచ్చటం దొల్లి రామువలనం బ్రాప్తపరాభవుండై ప్రవ్రజనంబు నొంది తపంబు సేయుచున్నవానిం దనపూర్వామాత్యు మారీచుం గనిన, నతండును బ్రియసంభ్రమంబులతోడ నతనిం బూజించి కుశలం బడిగి, ‘భవదాగమన నిమిత్తం బేమి?’ యని యడిగిన నసురేశ్వరుం డి ట్లనియె.

### [3.6.318](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.318)

ఉత్సాహము. ‘వినవె రాముఁ డనఁగ నొకఁడు విపులదర్పహృదయుఁ డై  
మన ఖరుండు లోనుగా సమగ్రశౌర్యు లైన య  
ద్దనుజవరులఁ దునిమి, యిపుడు దండకస్థలంబునం  
దొనర నిర్భయత్వ మొప్ప నున్నవాఁడు మేటి యై.

### [3.6.319](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.319)

ఆ. వానిఁ బరిభవింపవలయు నప్పనికి సా | హాయ్యకం బొనర్పు మనఘ! నాకు’  
ననిన నధికభయసమావిష్టహృదయుఁడై | యమరవైరి కిట్టు లనియె నతఁడు.

### [3.6.320](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.320)

చ. ‘ఎఱుఁగవు గాక రాఘవు నుదీర్ణభుజాబలరూఢి నాజిలో  
నుఱక తదీయబాణరయ మోర్వ వశంబె పినాకికైన? ను  
క్కఱ మఱి నీకు నిత్తెఱఁగు గాదన కే ఖలుఁ డొక్కొ బుద్ధిగాఁ  
గఱపినవాఁడు సేటునకుఁ గాలము సేరెనొ గాక యిమ్మెయిన్‌.

### [3.6.321](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.321)

ఆ. రాముతోడఁ దొల్లి రణమునఁ గడు భంగ | మొంది కాదె దైన్యయుక్తి నిట్లు  
దపసి నైతి; నేఁడు తగ దమ్మహాత్ముని | యందు వైరబుద్ధి యధిప! నీకు.’

### [3.6.322](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.322)

వ. అనినం గలుషించి లంకేశ్వరుండు వానిం జూచి ‘నా పనుపు సేయ వైతివేని నిన్నిప్పుడ కృతాంతగోచరుం జేయుదు’ ననిన, వాఁడును దనమనంబున ‘వీనిచేతం జచ్చుటకంటెను రాఘవకృతం బైన మరణంబు మే’ లని తలపోసి, ‘మహాత్మా! నీకు హితంబుఁగోరి చెప్పితి; నిది యిష్టంబు గాదేని భవదీయశాసనంబు గైకొని చేసెదం; బనుపు’ మనినఁ బౌలస్త్యుం డిట్లను; ‘నీవు రత్నమయతనూరుహం బగు కనకమృగంబ వై చని, జానకిం బ్రలోభింపవలయు; సీతాచోదితుండై రాముండు నిన్నుం బట్ట సమకట్టి నీ చేత నతిదూరంబు గొనిపోవంబడు; నప్పు డేను దద్భామిని నపహరించెదఁ; బ్రియావిరహదుర్మనస్కుండై యతండు చెడిపోవు’ ననిన ‘నట్ల కాక’ యని మారీచుండు.

### [3.6.323](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.323)

క. కనకమృగరూపమునఁ జని | యినవంశ్యుఁడు సతియు నున్నయెడ మెలఁగుటయుం  
గని జానకి కౌతూహల | మునఁ బ్రియుఁ బ్రార్థించె హరిణపుంగవుఁ బట్టన్‌.

### [3.6.324](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.324)

ఆ. ధరణిసుతయు విధియుఁ దన్నుఁ బ్రేరేపంగ | వివశబుద్ధి యగుచు నవనివిభుఁడు  
మృగముఁ బట్టఁ దివిరె మృగనేత్రఁ గావ స | ద్వినుతబలు సుమిత్రతనయు నునిచి.

### [3.6.325](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.325)

క. అసదృశకార్ముకధరుఁడై | మసలక యామృగము వెనుక మర్దితరిపుఁ డే  
పెసఁగంగ నరుగఁ దొడఁగెను | వెస రుద్రుఁడు యజ్ఞమృగము వెనుకొనుమాడ్కిన్‌.

### [3.6.326](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.326)

వ. అట్టి యవసరంబున.

### [3.6.327](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.327)

మ. పఱచున్‌ దవ్వుగఁ, జేయలంతి నిలుచుం, బట్టీక యాసాసలం  
బిఱువోవుం, బొదలందు డిందుఁ, బొడమున్‌, బిట్టుల్కి వే దాఁటుఁ, గ్ర  
మ్మఱి చూచుం, జెవి దార్చి నిల్చు, మలయున్‌, మట్టాడు, గోరాడు, నే  
మఱినట్లుండుఁ దృణంబు మేయు నెలయున్‌ మాయామృగం బిమ్ములన్‌.

### [3.6.328](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.328)

వ. ఇ ట్లతిదూరంబుగా నెలయించి యలయించిన నది రాక్షసమాయగా నూహించి రాఘవుం డమోఘబాణంబు దొడిగి తడయక యమ్మృగంబు నేసిన.

### [3.6.329](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.329)

క. వాలమ్ము దాఁకి యొఱలుచు | నాలోనన రాము నెలుఁగునట్టి యెలుఁగు గా  
‘హా! లక్ష్మణ! సీతా!’ యని | కూలి కపటమృగము తన్నికొనుచుం జచ్చెన్‌.

### [3.6.330](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.330)

తరువోజ. ఆ యెలుఁ గేర్పడ నవనీతనూజ | యాలించి తల్లడం బడరు చిత్తమున  
‘నోయన్న! లక్ష్మణ! యొలసి మీయన్న | యుగ్రరాక్షసబాధ నొందంగఁ బోలు;  
నాయతభుజ! వింటె యమ్మహాభాగుఁ | డత్యంతదుఃఖార్తుఁ డై నిన్నుఁ జీరె;  
బోయి వే కావు విస్ఫురితపుణ్యైక | భూషణోదార! యప్పురుషరత్నంబు’.

### [3.6.331](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.331)

వ. అనిన నతం డా మానిని కి ట్లనియె.

### [3.6.332](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6.332)

ఆ. ‘అబల! వెఱవకుండు; మఖిలలోకములను | రాఘవేశ్వరునకు రణములోన  
నెదురఁ గలఁడె శూరుఁ డెవ్వాఁడు? నతనికి | నెట్టియెడల దురిత మేల పొందు?

_First 200 of 278 passages. [Read on](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6)_

---
Source: [https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6) · Pramāṇa
