<!-- Pramāṇa, a library of Indian primary sources · https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7 -->

[Pramāṇa](https://indike.org/pramana/) › [Indian literature](https://indike.org/pramana/in) › [Epic, Poetry, Drama & Narrative](https://indike.org/pramana/in.lit) › [The Mahābhārata and its versions](https://indike.org/pramana/in.lit.mahabharata) › [Mahābhāratas in Indian regional languages](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa) › [Andhra Mahabharatamu](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra) › 3.7

# Andhra Mahabharatamu 3.7: అరణ్యపర్వము — సప్తమాశ్వాసము

Āndhra Mahābhāratamu 3.7

- **Language:** Telugu

### అరణ్యపర్వము — సప్తమాశ్వాసము

### [3.7.1](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.1)

క. శ్రీకర సోమాన్వయ ర | త్నాకర హిమధామ! ధార్మికాంచిత వినయో  
త్సేక! భువనైకవీర మ | హాకావ్యరస ప్రయోజనారూఢమతీ!

### [3.7.48](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.48)

వ. అని పలికి దశరథాగ్రసూనుండు దానును దమ్ముండును నుపవసించి దర్భశయను లై జలధీంద్రు నుపాసించి యున్నంత సముద్రుండు సకలజలచరప్రకరపరివారుండై రాఘవునకుం బొడసూపి ‘యయ్యా! నీవలనఁ బ్రీతుండ నైతి; నీ కెయ్యది ప్రియంబు సేయుదుఁ? జెప్పు ‘మనిన నతండు’ నాకు లంకపై నరుగం దెరు విచ్చునది; యీనినాఁడు సూర్యనిభంబులైన మదీయదివ్యాస్త్రంబుల నిన్ను శోషింపం జేయుదు’ ననిన విని సరిత్పతి రఘుపతి కి ట్లనియె.

### [3.7.49](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.49)

సీ. ‘జననాథ! నీ కార్యమునకు నే విఘ్నంబు | గావింప నోడుదు నే విధమున;  
వినుము! నా వాక్యంబు; జను లెల్ల నెఱుఁగ నీ | కిత్తఱి నేఁ దెరు విత్తునేని  
నిల నెల్లవాఁడును విలసిత దివ్యాస్త్ర | బలమున సాధింపఁ దలఁచు నన్ను;  
మీయందుఁ గపివీరుఁ డాయతమతి విశ్వ | కర్మసూనుఁడు శిల్పికర్మవిదుఁడు  
ఆ. నలుఁడు నాఁగ నొకఁడు గలఁడు; వాఁ డొలసి నా | యందుఁ దరులు గిరులు నొంద వైవ  
నవి ధరింతు నేను; దివిరి నీ కది సేతు | వుగఁ గడంక నరిగి పగఱ గెలుము.’

### [3.7.50](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.50)

వ. అని యతని నొడంబఱిచి సముద్రుండు సనుటయు, నమ్మహీపతి నలు రావించి సేతుబంధనంబు సేయ నియోగించిన, ననేకవానరసహస్రంబులు నలుదిక్కులకుఁ బఱచి గిరిశిఖరంబులుఁ దరునికరంబులు విఱిచి తెచ్చియిచ్చుచుండ నన్నలుండు మున్నీటి యందు శతయోజనాయామంబును దశయోజనవిస్తారంబునుంగా నతిదృఢం బగు సేతుబంధనంబు నిర్మించె నయ్యవసరంబున.

### [3.7.51](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.51)

ఆ. అన్నతోడ నలిగి యాప్తులుఁ దాను వి | భీషణుండు వినయభూషణుండు  
నెమ్మి నరుగుదెంచి నృపశిరోమణి రాము | శరణుఁ జొచ్చె భక్తిభరితుఁ డగుచు.

### [3.7.52](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.52)

క. ఆ రాక్షసవృషభుని యా | కారము నింగితముఁ జూచి కాకుత్‌స్థకులో  
ద్ధారుఁ డతని నతిధార్మికుఁ | గా రూపించి ముద మొప్పఁ గైకొనియెఁ దగన్‌.

### [3.7.53](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.53)

ఉ. వానికి దానవేంద్రువిభవంబు సమస్తము నిచ్చువాఁడు గాఁ  
బూని ప్రతిజ్ఞ సేసి కృతపుణ్యుఁడు లక్ష్మణుతోడి చెల్మియున్‌  
వానికి నిచ్చెఁజెచ్చెర నవారితవానరసైన్యయుక్తుఁడై  
వానిఁ బురస్కరించుకొని వారిధి దాఁటె మహోగ్రలీలతోన్‌.

### [3.7.54](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.54)

వ. ఇట్లు సేతుమార్గంబున సాగరరోత్తరణం బాచరించి త్రికూటపర్వతం బెక్కిలంకానగరంబు చుట్టును శిబిరంబులు సంఘటింపం బంచిన.

### [3.7.55](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.55)

క. తాలైలాగరు సాల ర | సాల తమాలామ్ర నింబ జంబూ జంబీ  
రాలంకృత లంకావన | జాలంబుల విడిసె వృక్షచరసైన్యంబుల్‌.

### [3.7.56](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.56)

వ. తదనంతరంబ రావణచారులైన శుకసారణు లనువారలు వానరాకారంబులు దాల్చి శిబిరంబునఁగ్రుమ్మరుచున్న నెఱింగి, విభీషణుం డా రాక్షసులం బట్టించి రామునకు సమర్పించిన, నతండు వారికి నిజసైన్యం బంతయుం జూప నియోగించి విడిచి పుచ్చినఁ, జని యయ్యిరువురు నమరవైరిం గని కపిసైన్యంబు దుర్జయం బనియును, రామలక్ష్మణుల తేజోమూర్తివిశేషంబులును నెఱింగించిన, నతండు దాని సరకు సేయక సమరంబునకు మోహరించి.

### [3.7.57](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.57)

సీ. బద్ధశిలాయంత్రబహుళమై యుత్తాలి | తాట్టాలకాభీలమై యుదగ్ర  
కేతుపతాకాప్రకీర్ణమై తోమర | ముద్గరాలాతక ముసల శూల  
శర శతఘ్నీముఖ సాధనోపేతమై | యుగ్రవిగ్రహధీరయోధవీర  
సంకులంబై హయస్యందనవేదండ | చండమై సముదిత సప్తసాల  
ఆ. మై యలంఘ్యపరిఖమై తృణకాష్ఠజ | లాది వస్తుభరిత మైన లంక  
కధికరక్షఁ జేసి యప్రమాదంబున | నుండె రిపుజిగీష నుదితబలుఁడు.

### [3.7.58](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.58)

వ. ఇట రాఘవుండును సుగ్రీవసహితుండై యుండి యంగదుం జూచి ‘నీవు రావణుపాలికిం జని యతనికిం దగినతెఱంగున బుద్ధిగాఁ జెప్పి, జానకి విడుచుట మే లని చెప్పు’ మని పనిచినం బని పూని యవ్వీరుండు.

### [3.7.59](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.59)

శా. లంకాద్వారము దుర్నివార గమనోల్లాసంబునం జొచ్చి ని  
శ్శంకుండై సురశత్రుసైనికసహస్రంబుల్‌ దనుం జూచి యా  
శంకం బొందఁగ లీలమైఁ జని సుహృత్సంఘంబు గొల్వన్‌ నిరా  
తంకుండై కొలు వున్న దైత్యుఁ గని యుద్యన్మూర్తియై యిట్లనున్‌.

### [3.7.82](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.82)

మ. కృతహస్తుండు ప్రహస్తుఁ డాహవకళాకేళీవిదగ్ధుండు ద  
ర్పితుఁడై తాఁకె విభీషణుం గడఁకమైఁ బెంపారి వారిద్దఱున్‌  
శితశల్యోగ్రమయూరపత్త్రవిశిఖశ్రేణీశతచ్ఛన్నులై  
ధృతి నొప్పారిరి చిత్రవారిధరపంక్తిచ్ఛన్న శైలాకృతిన్‌.

### [3.7.83](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.83)

చ. కదిసి ప్రహస్తుఁ డార్చి పరిఘంబు రయంబున నెత్తి భీకరో  
న్మద కరిహస్త తాడనము మాడ్కి దలిర్పఁగ వ్రేసె నీసుమై  
నదయత రావణానుజుని నాతఁడు వ్రేటున కించుకంతయుం  
గదలక హేమకూటగిరికైవడి నిల్చి యుదీర్ణకోపుఁడై.

### [3.7.84](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.84)

మ. శతఘంటాపరిభూషితంబును జగత్సంహారఘోరానలో  
త్థిత కీలాసదృశంబునై మెఱయు శక్తిం బూన్చి మంత్రించి యు  
ద్ధతతేజుండు ప్రహస్తు వైచిన వెసం దత్క్రూరసంపాత పా  
టితవక్షుం డయి కూలె వాఁడు శతకోటిచ్ఛిన్నశైలాకృతిన్‌.

### [3.7.85](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.85)

వ. ఇట్లు ప్రహస్తుండు వడినం దత్సైన్యంబులు విముఖంబు లగుటయు, ధూమ్రాక్షుండు రోషతామ్రాక్షుం డగుచు నతినిబిడబలాహకానీకభీకరంబై కాఱుకొనుచున్న నిశాచరచక్రంబుతో నురలం బఱతెంచినం జలించి బలీముఖబలంబులు దుర్బలంబులై తొలంగినం జూచి యాంజనేయుం డజయ్యుండై నిల్చినం బెల్చన యెప్పటియట్ల యూధపతులుం గూడుకొని; రప్పుడు.

### [3.7.86](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.86)

సీ. అనిలతనూజ ధూమ్రాక్ష రక్షిత సైన్య | యుగ్మంబునకు నయ్యె నుగ్రసమర;  
మందు నిష్ఠురచరణాఘాతముల డొల్లు | నరదంబులును, శిలాహతులఁ దూలి  
యొఱలు నేనుంగులు, నుత్తాలతరుహతిఁ | ద్రెళ్లు ఘోటకములు, దీవ్రనఖర  
దంతక్షతంబుల దళితాంగులై నేలఁ | బడి తన్నికొను వీరభటులు నగుచు  
ఆ. నధిక శౌర్యసారులగు కపివీరుల | చేత నొచ్చి దైత్యసేన భీతిఁ  
బఱచెఁ గొంత, బెండువడి యుండెఁ గొంత, ధూ | మ్రాక్షువెనుక కొదిఁగె నంతఁ గొంత.

### [3.7.87](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.87)

మహాస్రగ్ధర. కని ధూమ్రాక్షుండు విశ్వ | గ్రసన రయలసత్కాల మేఘంబ పోలెన్‌  
ఘన గర్జాఘోష మొప్పం | గడఁగి శరశతాకల్పితాసారదుర్ద  
ర్శన వీరారంభుఁడైనన్‌ | సకల హరిచమూసంఘమున్‌ విహ్వలంబై  
చనెఁ దూలెం గూలె లావుం | జలమును జెదరన్‌ సంగడిన్‌ విచ్చె నొచ్చెన్‌.

### [3.7.88](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.88)

తే. అతనియుద్ధతి సైఁపక యనిలసూనుఁ | డనిలవేగుఁడై పఱతెంచి యార్చి తాఁకెఁ  
బ్రధన మయ్యిద్దఱకు నుగ్రభంగి నమర | పతికిఁ బ్రహ్లాదునకుఁ బోలెఁ బ్రకట మయ్యె.

### [3.7.89](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.89)

క. పరిఘంబులు గదలును బె | క్కరుదుగ రక్కసుఁడు వైచె నమ్మారుతిపై  
నురుగండశైలములు ఘన | తరువులు హరివరుఁడు గురిసె దానవుమీఁదన్‌.

### [3.7.90](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.90)

వ. ఇబ్భంగిం బెనంకువ సెల్లుచుండఁ గొండొక సేపునకు.

### [3.7.91](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.91)

స్రగ్ధర. లంకాలుంటాకుఁ డుద్య | ల్లఘుతరగమనోల్లాసియై డాసి వీఁకం  
బొంకం బేపారఁ జంచ | ద్భుజరచిత మహాభూరుహం బెత్తి వైచెం  
గింకన్‌ ధూమ్రాక్షు; వాఁడుం | గెడసెను వదనోద్గీర్ణకీలాలధారా  
పంకప్రాగ్భాగమగ్నా | పఘనవిఘటితప్రాణుఁడై యాహవోర్విన్‌.

### [3.7.92](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.92)

వ. ఇత్తెఱంగున ధూమ్రాక్షుండు తెగినఁ గపిసైనికు లార్చి హనుమంతుని ననేకభంగులం బ్రస్తుతించుచు రజనిచరులం గనుకనిం దోలినం దూలి యందఱుం బఱచి పురంబు సొచ్చిదనుజేంద్రునకుం బ్రహస్తధూమ్రాక్షుల మరణప్రకారంబు లెఱింగించినఁ, బ్రకటబాష్పనిశ్వాసవివర్ణవదనుం డగుచుఁ బంక్తివదనుండు.

### [3.7.93](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.93)

క. ‘కలవా రెల్లను మడిసిరి; | కలిగియు లేఁడయ్యెఁ గుంభకర్ణుఁడు; వీనిం  
దెలుపుదునొ? యేను గొడుకుం | జల మెడపక రిపులతోడ సరిఁ బెనఁగుదుమో?’

### [3.7.94](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.94)

వ. అని వితర్కించి యప్పటికిఁ గుంభకర్ణప్రబోధంబు గార్యంబుగా నిశ్చయించి, తదీయశయ్యాగృహంబునకుం జని వానిం దెలుపం బరిజనంబులం బనిచిన.

### [3.7.95](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.95)

సీ. భేరీమృదంగగంభీరనాదంబులుఁ | గాహళఘంటికాకలకలములు,  
దారుణసింహనాదంబులు నొనరింపఁ | గడుఁ బెద్దవడికి నంగము గదల్చి  
యొదిఁగిలి కను విచ్చి హూ యని బిట్టావు | లించి కొండొక దేఱి లేచి నీల్గి  
కలయఁ జూచుటయును గట్టెదురున యున్న | యన్న నవ్వుచుఁ దన యనుఁగుదమ్ముఁ  
ఆ. జూచి యనియె ‘నిట్టి చోద్యంపునిద్రలుఁ | గలవె? యేరికిని జగంబులోన?  
నెవ్వ రేమి యైరొ యెఱుఁగవు, ధన్యుఁడ; | వీవు మనకు నైన యెడరు వినవె?

### [3.7.96](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.96)

వ. దశరథ నందనుం డయిన రాముండు నాచేత నపహృతభార్యుండై కలుషించి యనేకవానరయూథంబులం గూర్చికొని వచ్చి వనధి బంధించి మనవీటిపై విడిసి, మమ్మెల్లను నేలకుం గోలకుం దెచ్చుచున్నవాఁడు; ప్రహస్తాది వీరులు వానిచేతం బెక్కండ్రు సిక్కిరి; నీవ కాక వాని జయింప నన్యుండు శక్తుండు గాఁడు; కావున లెమ్ము; గ్రక్కునం బగతుపై నడచి, పొడిచి, గెలువుము; దూషణానుజులు వజ్రవేగ ప్రమాథులు నీకుం దోడ్పడియెద’ రనిన ‘నట్ల కాక’ యని కుంభకర్ణుండు విహితపరికరబంధుండై సమరసన్నద్ధులయిన పరిజనంబుల తోడం గూడి వెల్వడి నడతెంచిన.

### [3.7.97](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.97)

లయగ్రాహి. దారుణదవానల శిఖారుణ శిరోరుహు, గ | భీరఘనకర్బురశరీరుఁ, బటురోష  
క్రూరనయనాంతగళితోరుతరవహ్నికణ | ఘోరముఖు, దంతవలయారభసదంశో  
ద్గారి రుధిరాధరు, నుదారభుజసారణ వి | దూరితదిగంతుఁ, బదభారవినమద్భూ  
భారుఁ, ద్రిజగద్విజయభూరిబలు, నద్దనుజ | వీరుఁ గని రచ్చెరువు గూరఁ గపివీరుల్‌.

### [3.7.98](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.98)

క. రక్కసుఁడును దనమదిలో | నక్కపివీరులను జీరికైనఁ గొనక పే  
రుక్కున రఘుకులవీరుల | దిక్కునకుం గవియుదెంచెఁ దీవ్రస్ఫురణన్‌.

### [3.7.99](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.99)

మ. వడి నడ్డం బరికట్టె నెట్టన హరివ్రాతంబు పెన్‌మ్రాఁకులం  
బిడుగుల్వోని మహోద్ధతాశ్మముల నాభీలంబుగా దైత్యు బి  
ట్టడువన్‌ వైవఁగఁజొచ్చెఁ గొందఱు బలంబారంగ వే డాసి దం  
దడి తత్కాయము సించి రుగ్రనఖదంతన్యాససంక్రీడలన్‌.

### [3.7.100](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.100)

ఉ. కన్నుల నిద్ర దేఱఁగ నకంపితుఁ డై యతఁ డెంత సేసినం  
దన్ను నెఱుంగ కొక్కమొగిఁ దత్కపిసైన్యచయంబుఁ బోర బే  
రన్నున మ్రింగఁ జొచ్చె విలయాగమసంభృతదర్పరోషవే  
గోన్నతలీలఁ గాలుఁడు జనోత్కరమున్‌ గ్రసియించుచాడ్పునన్‌.

### [3.7.101](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.101)

వ. ఇట్లు బల చండబల వజ్రబాహులు లోనుగాఁ బెక్కండ్ర యూథపతులను బహుసహస్రసంఖ్యల వానరయూథంబును మ్రింగియు గొదగొని వచ్చుచున్న యన్నిశాచరుని మార్కొన నోడి తారప్రముఖు లైన బలీముఖులు నలువంకలం జెదరి పఱచిన.

### [3.7.102](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.102)

మ. కని సుగ్రీవుఁడు బిట్టదల్చుచును వేగంబార దైత్యేంద్రు మా  
ర్కొని సాలంబున వాని యౌఁదలఁ గడున్‌ ఘోరంబుగాఁ బూన్చి వ్రే  
సిన నా వ్రేటున నిద్రదేఱి కడఁకం జేదోయి సారించి య  
మ్మనుజాశుండు గపీంద్రుఁ బట్టె రభసోన్మాదంబుమై నార్చుచున్‌.

### [3.7.103](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.103)

క. పట్టువడిన సుగ్రీవునిఁ | గట్టెదురం గాంచి యధికకలుషిత మతియై  
దట్టుఁడు లక్ష్మణుఁ డసురన్‌ | బిట్టేసెన్‌ బిడుగుఁ బోని పృథుబాణమునన్‌.

### [3.7.104](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.104)

సీ. ఉరమాడి యాశరం బుచ్చిపోవుటయును, | గడు నొచ్చి యా కుంభకర్ణుఁ డలిగి,  
వెస వాలితమ్ముని విడిచి తోరపుశిలఁ | గొనుచు నుక్కున రాముకూర్మితమ్ము  
దెసఁ బాఱుతెంచిన, ధీరుండు సౌమిత్రి | భల్లయుగ్మమునఁ దద్బాహు యుగము  
నఱక, మాయాబలోన్నతుఁడు దైత్యుఁడు చతు | ర్బాహుఁడై తోఁచిన, భానుకులుఁడు  
ఆ. చేతు లెల్లఁ దునిమె శితభల్లముల; వాఁడు | మఱియనేకహస్తమస్తకాంఘ్రి  
భాగుఁ డైనఁ గినిసి బ్రహ్మాస్త్ర మేసినఁ | గూలె నసుర కొండ గూలినట్లు.

### [3.7.105](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.105)

వ. ఇట్లు కుంభకర్ణుండు దెగటారినం జూచి దూషణానుజులు వజ్రవేగుండును, బ్రమాథియు రాఘవానుజుం దలపడి నిబిడబాణౌఘనిర్మగ్నుం జేయుటయు, నతండును వారి నతిబహుళశరజాలంబులం బొదివినఁ గయ్యం బొక్క ముహూర్తంబు చూపఱకు రోమహర్షణంబై చెల్లెఁ; దదనంతరంబ.

### [3.7.106](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.106)

చ. అనిలసుతుండు నీలుఁడు రయం బెసఁగం బఱతెంచి యమ్మహా  
దనుజులమీఁద నేపున నుదగ్రనగాగ్రయుగంబుఁ బూన్చి వై  
చినఁ గడు రూపఱం జదిసి చెప్పఁగఁ జూపఁగ లేక పోయి ర  
ద్దనుజులు వానరోత్కరముఁ దద్దయు నుబ్బున నార్చె నత్తరిన్‌.

### [3.7.107](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.107)

క. ఆకులపడి నలుదెసలం | గాకులక్రియఁ జెదరి కడు వెగడుపడి రక్షో  
నీకములు లంక యెనిమిది | వాకిళ్లను దూఱెఁ బౌరవర్గము దలఁకన్‌.

### [3.7.108](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.108)

క. అంతఁ దనకూర్మితమ్ముం | డంతకుఁ గూడుటయు, దూషణానుజమృతి వృ  
త్తాంతంబును విని యెంతయు | వంతఁ దలరి యఱచెఁ బంక్తివదనుఁ డవశుఁడై.

### [3.7.109](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.109)

వ. అయ్యవసరంబున నాముక్తకవచుండును, నాబద్ధతూణీరుండును, బ్రచండకోదండుండును, గృపాణబాణాసనాది వివిధ సాధనోపేత సన్నిహిత స్యందనుండును, బురందర హృదయ సాగర మందరుండును నైన మేఘనాదుండు తండ్రిం జేరం జనుదెంచి, వినయంబున నిట్లనియె.

### [3.7.110](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.110)

చ. ‘వగవఁగ నేల దైత్యకులవల్లభ! యేఁ గలుగంగ నెమ్మెయిన్‌  
జగముల నీదుశత్రులకు శౌర్యము సెల్లునె? వృత్రవైరిలో  
నగు సురకోటి యే పడఁచి యప్రతిమోన్నతి నున్న నీకుఁ గ్రోఁ  
తి గముల నోర్చు టెంతపని దేవ! ననున్‌ గృపఁ బంపు మాజికిన్‌.

### [3.7.111](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.111)

ఉ. కూడిన కొండమ్రుచ్చులను గ్రోఁతుల నుగ్రత ముట్టి కిన్కఁ జెం  
డాడెద; నుజ్జ్వలోగ్రవివిధాంబకచుంబితదిఙ్ముఖుండ నై  
యాడెద వీరనృత్యము; రయంబునఁ బార్థివసూమ లిద్దఱం  
గ్రీడయపోలెఁ గిట్టి పెడకేలుగఁ గట్టెదఁ, బట్టి తెచ్చెదన్‌.’

### [3.7.112](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.112)

వ. అనినఁ దెలివొంది మందోదరీసుందరుండు ప్రియనందనున కి ట్లనియె.

### [3.7.113](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.113)

సీ. ‘నీ పరాక్రమలీల నిక్కమే నెఱుఁగనే | పుత్త్ర! నీ భుజబలస్ఫురణమునన  
కాదె నా కిట్టి విఖ్యాతియు సిరియును | గలిగె; గీర్వాణసంఘంబుతోడఁ  
గూడ నయ్యింద్రునిఁ గొనివచ్చి నా బంటుఁ | గా నొనరింపవే గర్వ మెసఁగ;  
మాయావిదుండవు మహితదివ్యాస్త్రవి | శారదుండవు నీవు; సంగరమునఁ  
ఆ. బగతు రెల్ల వెఱఁగుపడఁగ దృశ్యాదృశ్య | దుర్నిరూపభంగిఁ దొడరి చిక్కు  
వఱుచు నీ మహోగ్రబాణ పాతంబులు | దశరథాత్మజులకుఁ దరమె యోర్వ?

### [3.7.114](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.114)

ఆ. నిఖిలశత్రుచయము నిశ్శేషముగఁ జంపి | యనఘ! సమరనిహతు లైన యస్మ  
దీయ జనులఋణము దీర్పుము; మసలక | పోయి రమ్ము; పోరఁ బొడిచి గెలుము’.

### [3.7.115](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.115)

వ. అని కౌఁగిలించుకొని వీడుకొల్పిన నింద్రజిత్తు సత్వరుండై యరదం బెక్కి లంకాపురంబు వెలువడినం గని వనచరానీకంబు లార్చుచు నెదురు నడచుటయు, నతండు వారి నించుకయు సరకుగొనక కరతలం బెత్తి లక్ష్మణునిం బిలిచిన.

### [3.7.116](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.116)

క. విని యాతండును మౌర్వీ | నినదంబున గగనధారుణీమధ్యం బె  
ల్లను మ్రోయ మత్తగజముం | గనిన మృగేంద్రుండపోలెఁ గడఁగెం బెలుచన్‌.

### [3.7.117](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.117)

వ. అంత.

### [3.7.118](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.118)

ఉ. జైత్రులు గోత్రభూమిధరసారులు సాగరధీరు లుల్లస  
చ్చిత్ర ధనుఃకళావిదు లజేయులు భూరిజయార్థు లప్డు సౌ  
మిత్రియు మేఘనాదుఁడు నమిత్రవిభేదులు దాఁకి రార్చి లో  
కత్రయ భీకరప్రథనకౌతుక వేగిత చిత్తవృత్తులై.

### [3.7.119](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.119)

క. మచ్చరము మీఱ నొండొరుఁ | జిచ్చఱ పిడుగులను బోని శితవిశిఖములం  
జెచ్చెర నొంపఁగ విలు నే | ర్పచ్చటఁ దుల్యంబు లయ్యె నయ్యిరువురకున్‌.

### [3.7.120](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.120)

క. తనకంటె నపుడు రావణ | తనయుం డని మీఱఁ జూచుఁ, దా నాతనికం  
టెను మున్న రాఘవానుజుఁ | డనుపమశరలీల నతిశయంబుగ మెఱయున్‌.

### [3.7.121](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.121)

క. అంతఁ బటుతోమరంబుల | నెంతయు వెస నృపతనూజు నింద్రజి వైవన్‌  
సంతతశరముల నన్నిటి | నింతింతలు శకలములుగ నేసె నతండున్‌.

### [3.7.122](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.122)

వ. అట్టియెడ నంగదుండు గడంగి లక్ష్మణునకుం దలకడచి యమందవేగంబున మందోదరీనందనుం గదిసి ఘనమహీరుహంబునఁ దన్మస్తకంబు వ్రేసినఁ, జలింపక నిలింపవైరి నిశితప్రాసంబు వాసవపౌత్త్రుం జంప నెత్తుటయు, లక్ష్మణుండు దానిం దునియ నేసిన, నయ్యసురయు గదాదండంబుఁదీర్చి యంగదువక్షంబు వ్రేసినం, దొలంగక చెలంగి వాలిసూనుండు సాలవృక్షంబున నా రాక్షసురథంబు రథ్యసారథి సహితంబుగాఁ జదియనడిచె; నట్లు విరథుండయి యచ్చోటన యంతర్ధానంబు నొంది గగనగతుండయ్యెఁ; బదంపడి.

### [3.7.123](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.123)

క. ‘ఎవ్వలన నుఱుకునో యతఁ | డెవ్వరి నెటు సేయునొక్కొయిం’ దనుచుఁ గడున్‌  
నివ్వెఱపడి కపిసేనలు | గ్రొవ్వుసెడం బంక్తివదనుకొడు కుద్ధతుఁడై.

### [3.7.124](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.124)

చ. ఉఱుముచు నంత్యకాలచలితోగ్రబలాహకలీల దోఁపఁగాఁ  
దఱచగు ఘోరపుంబిడుగుతండము వోని శరప్రతాన ము  
క్కఱఁ దొరఁగించుచుం గపిబలావళిఁ ద్రుంచి కలంచె నేపునన్‌  
నెఱఁకులు నొంచి బాణమయనీరధి ముంచె రఘుప్రవీరులన్‌.

### [3.7.125](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.125)

క. మాయాధికు నంతర్హిత | కాయుఁ బురందరవిరోధిఁ గాకుత్‌స్థులు క్రో  
ధాయత్తు లగుచు నేసిరి | ధీయుక్తులు శబ్దభేదిదివ్యాస్త్రములన్‌.

### [3.7.126](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.126)

వ. వానికి నలిగి సుగ్రీవాది వానరులు వృక్షశిలాప్రకరంబులు గైకొని యాకసంబున కెగసిన నద్దానవుండు వారి నందఱ వెఱచఱవ నేయుటయుఁజేవ సెడి మగుడి పుడమి కెఱఁగిరి; వాఁడంత నిలువక వాఁడి తూపులు వఱపి రామలక్ష్మణులఁ గరంబు నొప్పించినం జెయ్వేది యయ్యన్నయుం దమ్ముండును గపిబలంబు లడల ధరణీతలంబునకు నొరగి విలయకాలపతితు లైన సూర్యేందుల చందంబున నున్నంగని సింహనాదంబుసేసి.

### [3.7.127](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.127)

మ. పరమోదాత్తులఁ బార్థివోత్తముల శుంభద్విక్రమారంభులన్‌  
సురసంకాశులఁ గోసలప్రభుల నస్తోకప్రభోద్దాములన్‌  
వరలాభోన్నతుఁ డన్నిశాచరుఁడు గర్వం బొప్ప దుర్వార ని  
ర్భర’ నాగాస్త్రములం దదాహవమహిన్‌ బంధించె నయ్యిద్దఱన్‌.

### [3.7.128](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.128)

వ. తదవసరంబున సుగ్రీవసుషేణ జాంబవత్ప్రముఖు లైన కపివీరులు రామలక్ష్మణు లున్నయెడకుం జనుదెంచి, యెయ్యదియునుం జేయునది నేరక దుఃఖితు లగుచుండ నవ్విభీషణుండు వారి నాశ్వాసించి, బ్రహ్మాస్త్ర ప్రయోగంబున నారాజకుమారులకు బంధమోక్షంబు గావించె; సుగ్రీవుండు విశల్యకరణి యను నౌషధంబున వారల విశల్యదేహులఁ జేసె; నిట్లు ప్రబుద్ధులై రాఘవులు గ్రమ్మఱఁ గయ్యంబునకుం గడంగి; రప్పుడు రావణానుజుండు రామునకుఁ గృతాంజలి యై యి ట్లనియె.

### [3.7.129](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.129)

సీ. ‘నరనాథ! కిన్నరనాథుని పనుపున | శ్వేతుండు నాఁగఁ బ్రసిద్ధుఁ డైన  
గుహ్యకుఁ డిదె మీకుఁ గొనివచ్చె దివ్యతో | యంబు; లీ జలముల నంబుజాక్ష!  
నయనపద్మక్షాళనము సేయుఁ; డిప్పు డ | దృశ్యభూతము లెల్లఁ దెల్లముగను  
గానఁగఁ బడు’ నన్నఁ గైకొని రాఘవుం | డనుజసహాయసమన్వితముగ  
ఆ. నట్ల చేసి, కనియె నంబరమధ్య సం | చారుఁ గృతవిపక్షసంప్రహారు  
నింద్రజాలశీలు నింద్రవిద్రావణు | రావణాగ్రతనయు రహితవినయు.

### [3.7.130](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.130)

వ. ఆ రక్కసుండునుందన చేసిన పౌరుషంబు ప్రతిహతంబగుటకు విస్మయం బంది, మగుడి హోమకార్యంబునకుం బోవం దొడంగిన నెఱింగి, విభీషణుండు లక్ష్మణుం జూచి’ యన్నీచునకు హోమసమాప్తి యయ్యె నేని నెవ్వరికిం గెలువ నశక్యంబు; వీని వెన్నడిం దగిలి తెగటార్పు’ మనిన నతండు.

### [3.7.131](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.131)

ఆ. ఆర్చి వెనుకఁ దగిలి యశనికల్పము లైన | శరము లేయుటయు, నిశాటవరుఁడు  
గినిసి వడి నెదిర్చి కీలించె లక్ష్మణు | నంగకముల నుజ్జ్వలాంబకములు.

### [3.7.132](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.132)

వ. ఇట్లు దలపడి యవ్వీరు లిరువురు నిశాచరవనచరబలంబులు రణం బుడిగి వెఱఁగుపడి తమపోరు సూచుచుండ నుద్దండవేదండ యుగళంబు పోలిక నాభీలశార్దూలద్వయంబు కరణి నసహ్యసింహ యమళంబు కైవడి నతిఘోరయుద్ధంబు సేయం దొడంగి; రంత.

### [3.7.133](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.133)

క. వడి నొక్కపెట్ట లక్ష్మణుఁ | డడరించె నిశాతశరము లా రక్కసుపైఁ  
గడఁగి యతఁడు నాతనిపై | నెడపక నాటించెఁ గలయ నెనిమిది యమ్ముల్‌.

### [3.7.134](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.134)

ఆ. వాఁడితూపు లొడల వడి నాటుటయు నొచ్చి | తోన కలుషరోషధూమకేతుఁ  
డతిశయిల్ల రాఘవానుజుం డురుచాప | శింజినీరవంబు సెలఁగఁ గవిసి.

### [3.7.151](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.151)

సీ. కమనీయకనకపుంఖప్రభాభాసియుఁ | దీక్ష మ్ణుఖంబును దివిజయక్ష  
మునిసిద్ధసాధ్యసమ్మోదావహంబు నై | విలసిల్లు బాణ మవ్వీరవరుఁడు  
గైకొని బ్రహ్మాస్త్రకలితమంత్రాభియు | క్తంబుగా నొనరించి కార్ముకమున  
సంధించి జగములు జయపెట్టఁ జెచ్చెరఁ | దివిచి యేయుటయును దీవ్రభంగిఁ  
ఆ. గడఁగి యాశరంబు గల్పాంతవహ్నియ | పోలెఁ బంక్తికంఠుఁ బొదివి నీఱు  
గా నొనర్చె సూతఘన రథరథ్య స | మన్వితముగ నొక్కమాత్రలోన.

### [3.7.152](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.152)

వ. అప్పు డంబరంబున దివ్యతూర్యనాదంబులు సెలంగం గలంగి యసురు లెల్లఁ దొలంగిరి; గంధర్వగానంబులు నప్సరోనర్తనంబులుఁబ్రవర్తిల్లె; నింద్రాదిదేవోత్తము లన్నరదేవోత్తముం బ్రస్తుతించుచుం బ్రమోదంబు నొందిరి.

### [3.7.153](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.153)

క. ఏకోత్సవంబు లయ్యెఁ ద్రి | లోకంబులు నఖిలలోకలుంటాకుఁడు ఘో  
రాకారుఁడు దశవదనుఁడు | గాకుత్‌స్థనిశాతశరముఖంబునఁ బడినన్‌.

### [3.7.154](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.154)

ఉ. అంత ననంతకీర్తి శరణాగతరక్షణశాలి రాఘవుం  
డెంతయు వేడ్కతోడ నసురేంద్రుపదంబున నవ్విభీషణున్‌  
సంతతపుణ్యుఁ బుణ్యజనసంతతివర్ధనుఁ గట్టెఁ బట్ట మ  
త్యంతదయాంతరంగుఁడు గృతాహితభంగుఁడు దానుఁ దమ్ముఁడున్‌.

### [3.7.155](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.155)

వ. తదనంతరంబ యవింధ్యుండు విభీషణసహితుండై జానకి నుచితయానంబున నునిచికొని రామదేవు పాలికిం దెచ్చి ‘దేవా! దేవిం బరిగ్రహింపు’ మని విన్నవించిన నతండు.

### [3.7.156](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.156)

చ. అతిమలినాంగి జీర్ణమలినాంబరధారిణి సంతతాశ్రుపం  
కితవిలసత్కపోలఁ బరికీర్ణజటాయితకేశభార నా  
యతఘనదుఃఖదూషితఁ బ్రియాంగనఁ గన్గొని యప్రియాత్ముఁడై  
నుతచరితుండు దద్దయు మనోవ్యథ సేయుచు నింతి కిట్లనున్‌.

### [3.7.157](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.157)

సీ. ‘అధికదుష్టాచారుఁ డైన దశాననుఁ | డింతకాలము తనయింటఁ బెట్టి  
కొనియున్న నిన్నుఁ గైకొనిన నస్మచ్చరి | త్రమునకుఁ దొడరదే ధర్మహాని?  
పరిభవంబునకునై ప్రతికారముగ వైరిఁ | గూల్చితిఁ గాని నీకొఱకుఁ గాదు;  
మెలఁత! నీ చరితంబు మేలైనఁ గీడైనఁ | గానిమ్ము, నిన్ను నిక్కముగ నొల్లఁ;  
ఆ. బరఁగఁ గుక్కవాతఁ బడిన హవ్యముభంగి | యయ్యె నీ తెఱంగు నరయ నిపుడు;  
గాన యిచటఁ దడయఁ గాదు; చెచ్చెర నీకు | నిష్టమయిన యెడకు నేఁగు మతివ!’

### [3.7.158](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.158)

ఆ. అనినఁ జెవులఁ గొఱవి గొని చూఁడినట్లైనఁ | దాల్మి పెల్లగిల్లఁ దరళనయన  
మొదలు నఱక నొఱగు కదళిచందంబున | నెలఁత దల్లడమున నేల వ్రాలె.

### [3.7.159](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.159)

క. వెఱఁగుపడి హర్షరాగము | తఱిఁగిన వెలువెల్లనై వదనములు వ్రాలం  
దెఱఁగేది ఱిచ్చపడి ర | త్తఱిఁ దత్పరిజనము లెల్లఁ దద్దయు వంతన్‌.

### [3.7.160](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.160)

తే. పడఁతి యల్లన మఱికొంతవడికిఁ దెలిసి | యలసమూర్తియై దందడి నశ్రు లురులఁ  
గేలు ముకుళించి వసుమతీపాలుఁ జూచి | యెలుఁగు గుత్తుకఁ దగులంగ నిట్టు లనియె.

### [3.7.161](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.161)

క. ‘నినుఁ గీడు వొరయకుండఁగ, | జనులకు నా నిక్క మెక్క జననాయక! యే  
ననలంబుఁ జొచ్చి వెడలెదఁ; | గనుగొను; మిచ్చనవు నాకుఁ గరుణింపు దగన్‌.

### [3.7.162](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.162)

ఉ. నాదగుబుద్ధి నీదు చరణస్మరణంబ యొనర్చుఁ గాని యొం  
డేదియు నెన్నఁడుం దలఁప; దిట్టిద; యొండొకచందమైన ని  
మ్మేదినియుం గృశానుఁడు సమీరుఁడు శీతకరుండు నర్కుఁడుం  
గా దన కీక్షణంబ ననుఁ గాల్పరె; వేల్పులు చెట్ట సైతురే?’

### [3.7.163](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.163)

వ. అని పలుకుటయు నప్పుడు పృథివ్యాదిభూతంబు లెలుంగులు సెలంగ నెల్లవారును వినం దమదమ నామంబు లెఱింగించి యి ట్లనిరి.

### [3.7.164](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.164)

క. ‘విను ముత్తమురాలు సుమీ | జననాయక! జనకతనయ; సందేహపడం  
బనిలేదు మాకుఁ దెల్లము; | జనులకు మము మొఱఁగరాదు సకలక్రియలన్‌.

### [3.7.165](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.165)

వ. అనిన యనంతరంబ సకలసురముని గణసహితంబుగాఁ బితామహుండు సనుదెంచి రాఘవుచేత సత్కృతుం డై యిట్లనియె: ‘నయ్యా! నీవు సకలభూతదుస్సహుండైన రావణుం బరిమార్చి లోకహితంబు సేసితివి; వినుము! నలకూబరుశాపంబునంజేసి దశగ్రీవునకుఁ బరస్త్రీలయందు బలాత్కారంబు సెల్లదు; గావున నీధర్మపత్నియం దొక్క దురితంబును బొరయదు; నీవు నిర్విచారుండ వై యిప్పతివ్రతం బరిగ్రహించి నెమ్మదిఁ బురంబున కరుగు’ మని పలికి, యతనికిఁ బ్రియంబుగాఁ దత్సమరనిహతు లైన వానరులఁ బ్రాప్తజీవులం జేసి పరమేష్ఠి సనియెఁ; బురందరసారథియును దాశరథి వీడ్కొని హరిసహస్రయుక్తం బైన రథంబు గొని నాకలోకంబున కరిగె; నంత.

### [3.7.166](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.166)

మ. అవిరోధంబుగ జానకీసహితుఁడై యాబద్ధరత్నప్రభా  
నవపుష్పంబగు పుష్పకం బను విమానం బెక్కి యర్కాన్వయ  
ప్రవరుం డిమ్ముల నేఁగె సమ్మదభరప్రాగ్భాగవారాకర  
ప్లవమానుం డగుచుం బురంబునకుఁ బ్రాప్తశ్రీవిశేషోన్నతిన్‌.

### [3.7.167](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.167)

వ. ఇ ట్లరిగి భరతాదిబంధుజనంబులు నఖిలపరిజనంబులు నభినందింప వసిష్ఠవామదేవవిహితం బయిన యభిషేకశోభనంబు వహించి రాముండు సుగ్రీవవిభీషణాది సుహృజ్జనంబులం బ్రకటబహుమానవిశేషంబుల నాదరించి వీడ్కొలిపి, యభిమతభోగంబుల నిరంతరత్యాగంబులఁ బ్రభూతయాగంబులఁ బ్రసిద్ధుం డయి బహుసహస్రసంవత్సరంబులు వసుమతీరక్షణం బొనర్చె; నిది రాఘవుచరిత్రంబు.

### [3.7.168](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.168)

ఉ. వారక యిట్లు పూని వనవాసనిరంతర దుఃఖమున్‌ మహా  
వైరికృతాపకారదురవస్థయు నోర్చి శుభంబు నొందఁడే  
యారఘురాముఁ; డట్లు వసుధాధిప! నీవును దుఃఖ మింతయున్‌  
సైరణ నోర్చి పొందెదవు సర్వమహీవలయాధిరాజ్యమున్‌.

### [3.7.169](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.169)

వ. అని చెప్పిన విని యుధిష్ఠిరుండు రాముని పరాక్రమవిశేషంబు గొనియాడి, ‘జానకి పాతివ్రత్యమహిమ యింత యొప్పునే!’ యని పలికి, ‘మునీంద్రా!, పతిభక్తితాత్పర్యంబున నఖిలదుఃఖంబులు నోర్చి శుభంబు నొందిన పుణ్యసతిచరిత్రంబు వినవలతుం జెప్పవే!’ యనిన నతనికి మార్కండేయుండు ‘సావిత్రి యను రాజపుత్త్రిచరిత్రంబు విను; మది నీ ప్రశ్నంబునకు నుత్తరం బగు’ నని యిట్లనియె.

### [3.7.170](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.170)

సీ. కలఁడు మద్రేశుండు ఘనుఁ డశ్వపతి యను | ధరణీశుఁ; డతఁడు సంతానకాంక్ష  
నెంతయు ధృతిఁ బదునెనిమిది యేఁడులు | సావిత్రిఁ గొల్చె; నజ్జనవిభునకు  
నద్దేవి ప్రత్యక్షమై ‘వర మడుగుము’ | నావుడు నతఁడు వినమ్రుఁ డగుచు  
‘నాత్మజుఁ గోరెద’ ననవుడుఁ ‘గన్నియ | పుట్టు నీ’ కనియె నా భువనమాత;  
తే. యనుడు ‘దేవి! భవత్కృప నస్మదీయ | వాంఛితము సఫలంబు గా వలదె?’ యని నృ  
పోత్తముఁడు విన్నవించె; నయ్యోగమూర్తి | గాఢకారుణ్యవికచహృత్కమల యగుచు.

### [3.7.171](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.171)

వ. ‘ఏను నీమనోరథంబుతెఱంగు మున్న చతుర్ముఖున కెఱింగించిన నతండు గన్నియఁగా నిర్దేశించె; నద్దేవునియానతి యమోఘంబు; విను మక్కన్నియ కారణంబున నీకు నొక్కవిధంబునం బిదపఁబుత్త్రశతలాభంబు నగు; సంతసిల్లు’ మని యనుగ్రహించి యద్దేవి యంతర్ధానంబు నొందె; నశ్వపతియును సావిత్రీప్రసాదంబున నిజధర్మపత్ని యయిన మాళవియందు సావిత్రి యను కూఁతుం గని, యక్కన్నియ నతిగౌరవంబునం బెనిచె నంత.

### [3.7.172](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.172)

క. ఆ వనజాక్షి పరిస్ఫుట | యౌవనయై సిద్ధసాధ్యయక్షామరక  
న్యావలిఁ దన సౌందర్య | శ్రీవిలసనరేఖ నపహసించుచు నొప్పెన్‌.

### [3.7.173](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.173)

తే. ‘కోరి జనపతి దనకూర్మికూఁతుఁ జూచి | గుణవయోరూపముల ననుకూలుఁ డైన  
భర్త నెమ్మెయి దీనికిఁ బడయువాఁడ | నొక్కొ!’ యని యెందుఁ దడవుచునుండె నెలమి.

### [3.7.174](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.174)

వ. అదియును సాళ్వపతి యైన ద్యుమత్సేనుకొడుకు సత్యవంతుండు రూపవంతుం డనియును గుణవంతుం డనియును విని వానియందుఁ జిత్తంబు దగిలి యున్నను సిగ్గుపెంపున నెవ్వరికి నెఱింగింపకుండె; నంత నొక్కనాఁడు మద్రపతికడకు నారదుం డరుగుదెంచిన నతం డమ్మహాముని నుచితసపర్యాపరితోషితుం జేసి సద్గోష్ఠీవిశేషంబులు సలుపుచున్నయెడ.

### [3.7.175](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.175)

క. నెచ్చెలులు దన్నుఁ గొలువఁగఁ | బచ్చవిలుతుకలిమి యెల్లఁ బద్మానన యై  
యచ్చుపడినట్లు మెఱయుచు | నచ్చటి కేతెంచె భూవరాత్మజ నెమ్మిన్‌.

### [3.7.176](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.176)

వ. ఇట్లు వచ్చి సఖీజనంబు నంతంత నిలిపి మెలపుతోడి పొలుపున నమ్ముగ్ధ లీలామధురం బగుచుండఁ దండ్రికి మ్రొక్కిన, నతండు గాఢస్నేహదోహళం బగు చిత్తంబుతో నత్తన్వి గ్రుచ్చియెత్తి నిజాంకతలంబున నునిచికొని సముచితోపలాలనకేళీపరవశుం డయ్యె; నప్పుడు నారదుం డమ్ముద్దియం జూచి యశ్వపతితోడ ‘నిక్కన్నియం దగినవరున కొసంగక యి ట్లేల యునిచినవాఁడ?’ వనిన నతండు గూఁతున కి ట్లనియె.

### [3.7.177](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.177)

తే. ‘తల్లి! నీగుణరూపవృత్తముల కెందుఁ | దగినవరు నీవ యిమ్ముగఁ దడవి నెమ్మి  
నీదు మనసున కెక్కిన నృపకుమారుఁ | గోరి వరియింపు; మిదియ నాకును బ్రియంబు’.

### [3.7.178](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.178)

వ. అనిన నదియుఁ గొండొక లజ్జించి కోర్కిపెంపున సిగ్గు దొలంగం ద్రోచి ప్రకటకౌతూహల తరళితాంతరంగ యగుచుఁ దండ్రి కిట్లనియె.

### [3.7.179](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.179)

క. ‘చిరకీర్తి సాళ్వభూవరు | వరతనయుం డయిన సత్యవంతుఁడు నాకున్‌  
వరుఁడుగఁ గోరుదు మదిలో | నరవర! యాతనికి నిమ్ము ననుఁ బ్రీతిమెయిన్‌.

### [3.7.180](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.180)

వ. సాళ్వపతియును నిపుడు దైవయోగంబునం జేసి విగతచక్షుం డయి తనరాజ్యంబు వైరులచేతం గోల్పడి పుత్త్రదారసహితంబుగా వనంబున నున్నవాఁ; డట్లయినను సత్యవంతున వరియింతు’ ననిన మద్రేశ్వరుండు నారదుంజూచి ‘మునీంద్రా! మీ యెఱుంగని వారు లేరు; సావిత్రిచేత వరియింపంబడిన కుమారుం డెట్టివాఁడు? వానిగుణరూపశీలంబు లెఱింగింపుఁ’ డనిన నారదుం డిట్లనియె.

### [3.7.181](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.181)

సీ. ‘సత్యంబు వలుకుట సత్యవంతుం డన | వతఁ డొప్పు; మఱియుఁ జిత్రాశ్వుఁ డనఁగ  
నామాంతరంబు నన్నరనాథసుతునకుఁ | గలదు; తేజంబునఁ గమలమిత్త్రు  
బుద్ధి నింద్రాచార్యుఁ బురుడించు; శూరత | వాసవుఁ, దాలిమి వసుధఁ బోలుఁ;  
గాంతిఁ జంద్రున కెనగాఁ దగు; రూపున | నాశ్వినేయుల సరియనఁ దలిర్చుఁ;  
ఆ. దపము శమము దమము దానంబు బ్రాహ్మణ | భక్తియును మహానుభావతయును  
నతనియంద కాని యన్యులయందు లే; | దింత నిక్కువము మహీతలేశ!

### [3.7.182](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.182)

వ. వానియందుఁ గీ డొక్కటి గలదు; పరిణయంబు మొదలుగా నొక్కసంవత్సరంబునకు మృతింబొందు; నిది నీకుఁజెప్పవలయుటంజేసి చెప్పితి’ ననిన నతండు గూఁతుమొగంబు సూచి ‘తల్లీ! యిమ్మహాత్ముండు దేవరహస్యం బెఱుంగు; నీతనివచనం బమోఘంబు; నీకు నట్టివరుం డేటికి? నొండొక్కవరుని వెదకి కొ’ మ్మనిన నక్కన్యక యి ట్లనియె.

### [3.7.183](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.183)

క. ‘వినుము మనోవాక్కాయము | లను మూఁడుతెఱంగులందు నంతఃకరణం  
బనఘ! ప్రధానము గావున | మనమునఁ గైకొన్న భర్త మానుటఁ దగునే?

### [3.7.184](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.184)

వ. సత్యవంతుం డెట్టివా డైననుం గాని; మ్మే నింక నొరుల వరియింప నొల్ల’ ననిన నశ్వపతి నారదుదెసఁ జూచుటయు, నతం డి ట్లనియె.

### [3.7.185](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.185)

చ. ‘గొనములప్రోక నీ యనుఁగుఁ గూఁతురు; దీని తలంపు మాన్పఁగా  
మనకు నశక్య; మింక ననుమానము లేల? నరేంద్ర! కూఁతుఁ జ  
య్యన నృపసూతి కిమ్ము; కమలానన చేసిన పుణ్యగౌరవం  
బున నయినం బ్రియుండు పరిపూర్ణచిరాయురుపేతుఁ డయ్యెడున్‌.’

### [3.7.186](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.186)

వ. అనిన నమ్మహీపతి మునిపతికి మ్రొక్కి ‘నీవు మాకుం బరమగురుండవు; నీ యానతిచ్చినట్ల చేసెద’ ననియె; నారదుండును దాని దీవించి, దివంబునకుం జనియె; నంత.

### [3.7.187](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.187)

సీ. అమరఁ బుణ్యదినంబునందు బాంధవమంత్రి | వృద్ధపురోహితవితతితోడ  
సావిత్రిఁ దోడ్కొని జననాయకుండు వై | వాహికమహనీయవస్తుకోటి  
గొనుచుఁ బుణ్యారణ్యగోచరుండై తప | స్థ్సితుఁడైన యా ద్యుమత్సేనుకడకుఁ  
జనిన నారాజును సంభ్రమంబున నశ్వ | పతికి నర్ఘ్యాదిసంభావనంబు  
ఆ. లాచరించి సముచితాభిమతాలాప | పూర్వకముగ సుజనపూజ్యుఁ డతని  
యాగమననిమిత్త మడిగిన, మద్రేశుఁ | డెలమి సాళ్వపతికి నిట్టు లనియె.

### [3.7.188](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.188)

క. ‘ఈ కన్నియ నాకూఁతురు | మాకులమున కెల్లఁ దెప్ప మనుజోత్తమ! నీ  
వీకన్నియఁ గోడలుగాఁ | గైకొనుము మదీయవచనగౌరవబుద్ధిన్‌.’

### [3.7.189](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.189)

వ. అని పలికి సావిత్రి నతనికి నభివందనంబు సేయించి మఱియు నతండు.

### [3.7.190](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.190)

క. ‘నీకొడుకు సత్యవంతున | కీ కన్నియ దగు నరేంద్ర! యీ కన్నియకున్‌  
నీ కొడుకు దగు; ననన్యగు | ణాకరు లియ్యిరువురును సమంచితమూర్తుల్‌.’

### [3.7.191](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.191)

వ. అనిన నతనికి ద్యుమత్సేనుం డిట్లనియె.

### [3.7.192](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.192)

తే. ‘విగతరాజ్యులమై ఘోరవిపినములకు | వచ్చి యిమ్మెయిఁ దప మున్నవార మేము;  
బాల సుకుమారి యిది జనపాల! యడవి | నుండి మాతోడియిడుమకు నోర్చునయ్య?’

### [3.7.193](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.193)

వ. అనిన నశ్వపతి యతని కి ట్లనియె.

### [3.7.194](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.194)

చ. ‘కలిమియు లేమియున్‌ సతముగా; వవి సెందినచోఁ జెలంగుచున్‌  
గలఁగుచు నున్కి ధీరులప్రకారమె? లెస్సగ నింతవట్టు నేఁ  
దెలియుదుఁ జెప్పెదన్‌ వసుమతీవర! పిన్న యనంగ నేల? నే  
కొలఁదియుఁ గాదు; ధీరమతి గూఁతురు; పేర్కొనఁ జాలు పెంపునన్‌.

### [3.7.195](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.195)

క. నీతోడ వియ్యమందగఁ | జేతోగతి నాసఁ జేసి చెచ్చెర ని ట్లే  
నేతెంచితి మత్ప్రార్థన | బ్రాఁతిగఁ జేకొనక యునికి పాడియె నీకున్‌?’

### [3.7.196](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.196)

వ. అనుటయు నయ్యంధనృపతి తత్సంబంధంబునకు సంతసిల్లి నిజాశ్రమవాసు లైన మునులం గూర్చుకొని శుభలగ్నంబున సత్యవంతునకు సావిత్రిం బరిణయంబు సేసె; నయ్యశ్వపతియునుం గూఁతునకు నల్లునకు వివిధాంబరాభరణాది వస్తువిశేషంబు లొసంగి నిజపురంబున కరిగెఁ; బదంపడి.

### [3.7.197](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.197)

తే. పడఁతి రమణీయభూషణాంబరవిలాస | ముజ్జగించి వనాంతరయోగ్యలీల  
వల్కలాజినవసనయై వదల కధిక | భక్తి భర్తృ శుశ్రూషణపరత నుండె.

### [3.7.198](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.198)

క. ఆ మెలఁత సేయు సవినయ | సామకథల మృదుగభీరసంభావనలన్‌  
మామయు నత్తయు సంతో | షామృతమునఁ దేలి రంతరంగములఁ దగన్‌.

### [3.7.199](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.199)

వ. సావిత్రియుఁ దనమగని యాయుఃప్రమాణంబు నారదముని చెప్పిన దినంబు మొదలుగా ననుదినంబును లెక్కయిడికొనుచుండె; నిట్లు వర్తిల్లుచుండ నాలుగుదివసంబులు గొఱంతగా నొక్కసంవత్సరంబు గడచిన.

### [3.7.200](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.200)

క. నాలవుదినంబు పతిమృతి | కాలం బని మది నెఱింగి కడునిష్ఠమెయిం  
జాల భరంబుగఁ బూనెను | బాల త్రిరాత్రోపవాసపరమవ్రతమున్‌.

### [3.7.201](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.201)

వ. దానికి విస్మయంబంది ద్యుమత్సేనుండు గోడలిం బిలిచి, ‘తల్లీ! యి ట్లేల దుస్తరం బగు వ్రతంబు దొడంగి?’ తనిన నమ్మద్రరాజతనయ వినయంబుతో ని ట్లనియె.

### [3.7.202](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.202)

క. ‘మీరు మదీయం బగు వ్రత | భారమునకు వగవవలదు; పరమశుభంబుల్‌  
గోరి యొనరింపఁ బూనితిఁ; | గారణమును మీకు నెఱుఁగఁగా నగుఁ బిదపన్‌.’

### [3.7.203](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.203)

వ. అనిన నతం ‘డట్లైన మేలు గాక’ యనియె; నంతఁ జతుర్థదివసంబున.

### [3.7.204](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.204)

సీ. కడురేపకడయ మేల్కని యింతి నిజభర్తృ | మరణదినం బని మానసమునఁ  
దద్దయు శోకసంతాపంబు గదురంగ | దినముఖోచితవిధుల్‌ దీర్చి భక్తిఁ  
బతికి సమంచితపావనపరిచర్య | యప్పుడు కడువేడ్క నాచరించి  
యత్తకు మామకు నచటివృద్ధులకును | వేర్వేఱ ప్రణమిల్లి వేడ్క వారు  
తే. తనకు సౌభాగ్యభాగ్య వర్ధనము గాఁగ | నిచ్చు దీవన మదిలో గ్రహించి యున్నఁ,  
బ్రొద్దు జా మెక్కుటయుఁ బూవుఁబోఁడిఁ బిలిచి | మామ యిట్లని పలికె సన్మాన మెసఁగ.

### [3.7.205](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.205)

క. ‘కడునుగ్రం బగు వ్రత మిది | దొడఁగితి; దివసత్రయంబుతో నది సెల్లెం;  
బడఁతిరొ! యెంతయు డస్సితి: | దడయక పారణ యొనర్పఁదగదే యింకన్‌’.

### [3.7.206](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.206)

వ. అనిన సావిత్రి యతని కి ట్లనియె.

### [3.7.207](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.207)

ఆ. ‘అధిప! ప్రొద్దుగ్రుంకునంతకు నేఁడును | గుడువఁదగదు నాకుఁ; గోరి యిట్ల్లు  
గాఁగ వ్రతముఁ బూనుకాలంబునన యేను | నిశ్చయించుకొనిన నియమ మిదియ.’

### [3.7.208](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.208)

వ. అనియె; నప్పుడు సత్యవంతుండు సమిత్కుశఫలాహరణార్థంబు వనంబునకుం గదలినం జూచి సావిత్రి యతనిఁ జేరంజని ‘వనంబున కేనును నీతోడఁ జనుదెంతుఁ; దోడ్కొనిపోవలయు’ ననిన నతండు ‘నీవు త్రిరాత్రోపవాసంబునంజేసి యెంతయు డస్సినదానవు; రానోప’ వనిన నత్తన్వి వాని కి ట్లనియె.

### [3.7.209](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.209)

మ. ‘ఉపవాసశ్రమ మించుకేనియును నాయుల్లంబునం దోఁప దీ  
విపినంబుజ్జ్వలపుష్పపల్లవఫలావిర్భూత నానాలతా  
గపరీతం బన విందుఁ; జూడఁగ మదిం గౌతూహలంబయ్యె; న  
న్నుపరోధింపకు మింతవట్టు చన వీ యుక్తుండ వెబ్భంగులన్‌.

### [3.7.210](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.210)

వ. అనిన నతం ‘డట్లకాక చనుదె’ మ్మనుటయు సావిత్రి చయ్యనంజని భార్యాసహితుం డయి యున్న తనమామకుం బ్రణమిల్లి ‘మీకొడుకు వనంబునకు నగ్నిహోత్రార్థంబు సమిధలు దేర నరిగెడు; నాకును నతనితోడన చని వనంబు సూడ వేడుక యయ్యెడు; మీరు నా కివ్వరంబు గృప సేయవలయు’ ననిన వారును ‘నిమ్మగువ యెన్నండును నెయ్యదియును నడుగ; దిత్తెఱంగు దీనికిం బ్రియంబై యున్నది; మాకు నివారింప నేల?’ యని తలంచి యనుమతించుటయు, నయ్యిరువురయడుగులం బడి వీడ్కొని.

### [3.7.305](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.305)

తే. ‘ఎల్లభంగుల నిశ్చయం బిదియ యేని | వత్స! విను మింక నొక్కటి; వాసవునకుఁ  
గలదు దారుణంబును నమోఘంబు నైన | శక్తి; యది నీకు నడుగుము సవినయముగ.

### [3.7.306](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.306)

క. తొలి తొలి బలసూదనుచేఁ | జెలువుగ నాదివ్యశక్తి చేకుఱఁ గొని కుం  
డలములుఁ గవచంబును మఱి | యలఘుమతీ! యిమ్ము భద్ర మగు నిట్లయినన్‌.

### [3.7.307](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.307)

ఉ. వైరులఁ జంపి చంపి వెస వచ్చుఁ గరంబున కాజిలోన న  
ద్దారుణశక్తి వాసవుఁడు దానన తొల్లి సహస్రసంఖ్యలం  
గ్రూరసురారిసంఘములఁ గూల్చె; మహాభుజ! నీకు నెమ్మి నా  
ఘోరపు సాధనంబు దొరకొన్న నవశ్యము గెల్తు వైరులన్‌.’

### [3.7.308](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.308)

వ. అని చెప్పి కమలహితుం డంతర్హితుం డయ్యె; కర్ణుండును వాసవురాక కెదురుసూచుచుండె; ననిన విని జనమేజయుండు వైశంపాయనున కి ట్లనియె.

### [3.7.309](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.309)

మధురాక్కర. ‘కలదు దేవగుహ్యం బని కమలబాంధవుఁడు గర్ణుఁ  
బలికె నని చెప్పి; తది యెద్ది? బలియుఁ డా సూతజుండు  
లలితకవచంబు మణికుండలములు నెమ్మెయిఁ బడసె?  
వెలయ నివ్విధమంతయు వివరింపవలయు నాకు.’

### [3.7.310](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.310)

వ. అనిన వైశంపాయనుం ‘డదియంతయుం జెప్పెద విను’ మని యిట్లనియెఁ; దొల్లి కుంతిభోజు నింటికి దుర్వాసుం డతిథియై వచ్చి వానిచేత సత్కృతుండై ‘నాకు నీయింటఁ గొంతకాలంబు వసియింప నిష్టం బైనది; నాయున్నంత కాలంబును నీవును నీయనుచరులును నిర్వ్యాజం బగు భక్తి సేయవలయు; ని ట్లోపుదే?’ యనుటయు నొడంబడి యతండు దన కూఁతుం బృథ యను కన్యం బిలిచి యమ్మహామునిం జూపి.

### [3.7.311](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.311)

ఉ. ‘దేవసమానుఁ డీ ధరణిదేవుఁడు; వేడుక మద్గృహంబునం  
దా వసియింపఁ గోరుటయు, దానికి నేనును నియ్యకొంటి, నిం  
దీవరనేత్ర! నీవుఁ గడుధీరవు, సద్వినయోపచారసం  
భావితవృత్త; వట్లగుట భక్తి భజింపుము బ్రాహ్మణోత్తమున్‌.

### [3.7.312](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.312)

క. ఇతఁ డెత్తఱి నెయ్యది స | మ్మతిఁ గోరిన నది ఘటించి మచ్చిక నిడి తో  
షితుఁ జేయు మిమ్మహాత్ముని | మతి యలుగక యుండవలయు మానిని! యెపుడున్‌.

### [3.7.313](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.313)

ఆ. వినుము విప్రవరులు వెడవెడఁ గినిసిరే | నియును ధరణి యెల్ల నీఱు సేయఁ  
జాలుదురు తపఃప్రశస్తులు దుర్వార | తేజు లెందు నధికధీరమతులు.

### [3.7.314](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.314)

క. భూదేవపరాభవమునఁ | గాదే వాతాపిదండక ప్రభృతులు పెం  
పేది చెడిరి; భూదేవస | మాదరమునఁ గాదె బ్రదికినవి యిజ్జగముల్‌.

### [3.7.315](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.315)

సీ. పసిబిడ్డ వయ్యును బడఁతి! నీ వెంతయు | గుణవంతురాలవు గురులయందుఁ  
బెద్దలయందును బృథివీసురులయందుఁ | గడుభక్తి సేయుదు కమలనయన!  
బంధులుఁ జెలులు సంబంధిజనంబులుఁ | బురమువారలు నంతిపురమువారుఁ  
బూఁబోఁడి! నిను నెమ్మిఁ బొగడనివారు లే; | రేమని వర్ణింతు నేను నిన్ను?  
తే. యదుకులంబునఁ బుట్టి యత్యంతసౌఖ్య | మమరఁ బెరిఁగితి నాపుత్త్రి వై, త్రిలోక  
సుందరము రూపు, ప్రాయంబు సొంపు, నిట్టి | దిచ్చరిత్రంబు సతులకు నెందుఁ గలదు?

### [3.7.316](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.316)

వ. నీగౌరవం బంతయు నెఱింగి కాదె వహ్నిసమానుండైన యీ మహాముని నారాధించుటకు నీయందు భారం బెక్కించెద; నీవును దర్పంబును నహంకారంబును దూరంబున నిడి యిప్పుణ్యపురుషుం బరితుష్టుం జేసి కృతార్థతం బొందు’ మనిన నక్కన్య యి ట్లనియె.

### [3.7.317](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.317)

ఉ. ‘కోరుదు నేను విప్రతతిఁ గొల్వఁగ నెప్పుడు నాత్మలోన; నా  
కోరినకోర్కి నేఁడు దలకూడె; నరేశ్వర! యట్లుఁ గాక నీ  
కోరినయట్టి యవ్విధము గోరి యొనర్చుట నాదుభాగ్యసం  
భారము గాదె! యూఱడుము భారము నాపయిఁ బెట్టి నెమ్మదిన్‌.’

### [3.7.318](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.318)

వ. అనిన సంతసిల్లి కుంతిభోజుండు దుర్వాసున కక్కన్నియం జూపి యి ట్లనియె.

### [3.7.319](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.319)

క. ‘ఈ పిన్నది నాకూఁతురు | తాపసజనముఖ్య! మిమ్ముఁ దాఁ గొలువంగా  
నోపుదు నని పూనెం బసి | పాపసుఁడీ! కినుక లేక పని గొనవలయున్‌.

### [3.7.378](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.378)

క. ‘తరుశాఖఁ దగిల్చిన నా | యరణి యొకమృగంబు వచ్చి యతిరయమున న  
త్తరువును నొరసి కొనంగా | ధరణీశ్వర! తగిలెఁ జువ్వె తచ్ఛృంగమునన్‌.

### [3.7.379](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.379)

క. దానిఁ గొని పఱచె నమ్మృగ | మానతరిపులోక! నాకు నయ్యరణిఁ దగం  
గా నిపుడు దేరఁ బనుపవె | భూనుత! నిత్యవిధిలోపమునఁ జనకుండన్‌.’

### [3.7.380](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.380)

చ. అనవుడు నా క్షణంబ మనుజాధిపుఁ డుద్ధతచాపహస్తుఁడై  
యనుజులుఁ దాను నెంతయు రయంబున నాహరిణేంద్రుపజ్జఁ గై  
కొని చని కూడముట్టి మెఱుఁగుల్‌ నిగుడం బటుసాయకంబు లే  
సిన నొకయమ్ము నమ్మృగము సెందద చేరద యద్భుతంబుగన్‌.

### [3.7.381](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.381)

వ. అదియును వారి నతిదూరంబుగా నెలయించికొని చని యొక్కఘోరవిపినంబున నదృశ్యంబైనఁ, బ్రయత్నంబు విఫలం బగుటకు విషాదంబు నందుచు నయ్యేవురు నతిశ్రాంతులై శీతలచ్ఛాయం బగు నొక్కవటమహీరుహంబు క్రింద విశ్రమించి; రప్పుడు నకులుండు ధర్మనందనున కి ట్లనియె.

### [3.7.382](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.382)

క. ‘కులశీలోన్నతియు విని | శ్చలకరుణారతియు ధర్మసంగ్రహమతియుం  
గల మనకు నివ్విధంబున | నలజడి వచ్చుటకు మూల మది యెయ్యదియో!’

### [3.7.383](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.383)

వ. అనిన నమ్మహాప్రాజ్ఞుండతని కిట్లనియె.

### [3.7.384](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.384)

క. ‘వినుము సుఖమునకు దుఃఖం | బునకుం గారణము దనదుపూర్వకృతం బై  
చను కర్మమ; కారణ మిది | యని యన్యము గలుగనేర దం దొక్కటియున్‌.

### [3.7.385](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.385)

వ. అనుటయు భీమసేనుండు నకులున కి ట్లనియె.

### [3.7.386](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.386)

ఆ. ‘ప్రాతికామి వోయి పాంచాలిఁ గొలువులో | పలికిఁ దెచ్చి నపుడ యలుక యెసఁగ  
నాంబికేయసుతుల నందఱఁ దునుమక | యునికి నిట్టియెడరు మనకుఁ బుట్టె’.

### [3.7.387](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.387)

చ. అనవుడు నర్జునుం డనియె ‘నాసభ సూతసుతుండు పేర్చి ప  
ల్కిన పటువాక్యముల్‌ వినియుఁ గిన్కకుఁ బూనక యేఁ దొలంగి కా  
ననమున కిట్లు కాతరజనంబులచాడ్పున నేఁగుదెంచుటన్‌  
మనకు దురంతదుఃఖములు మానక పైకొని వచ్చెఁ దమ్ముఁడా!’

### [3.7.388](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.388)

వ. అనిన యనంతరంబ సహదేవుం డిట్లనియె.

### [3.7.389](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.389)

ఆ. ‘దుష్టశీలుఁ డైన దుర్ద్యూతపరుని గాం | ధారుఁ బట్టి యేను దడయ కపుడ  
తునుమకునికి నిట్టి దుర్దశ పాలైతి | మనఘ! మనము కాననాంతరమున.

### [3.7.390](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.390)

వ. అని యి ట్లందఱు నన్ని తెఱంగులఁ బలుకుచుండ నజాతశత్రుండు నకులుం జూచి ‘భవదీయసోదరు లత్యంత పిపాసితు లైన వారు; నీ విమ్మహీరుహం బెక్కిజలంబు లున్నయెడ యరయు’ మనిన నతండును నవ్వనస్పతి సమారోహణంబు సేసి దెసలు కలయం బరికించి ‘దూరంబున సలిలంబు లున్న’ వని యన్న కెఱింగించిన, నతం ‘డట్లేని నీవు పోయి జలపానంబు సేసి మాకును జలంబులు గొనిర’మ్మని పనుచుటయు, మాద్రేయుండు వృక్షావతీర్ణుం డయి రయంబునం జని ముందట నతిమనోహరం బగు తటాకంబుఁ గని జలంబులు ద్రావంబోయిన నొక్కయశరీరభూతం బిట్లనియె.

### [3.7.391](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.391)

క. ‘ఓ యన్న! యీ తటాకము | నాయది; నీ వీ జలము గొనఁగ వలతేనిన్‌  
నా యడిగిన ప్రశ్నములకు | ధీయుత! యుత్తరము లిమ్ము తేటపడంగన్‌.’

### [3.7.392](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.392)

క. అనుటయు నవ్వాక్యముదెస | ననాదరము చేసి నకులుఁ డక్కొలనం ది  
య్యని నీరు ద్రావి నిశ్చే | తనుఁడై యాక్షణమ పడియెఁ దత్తీరమునన్‌.

### [3.7.393](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.393)

వ. అట ధర్మపుత్త్రుండు సహదేవుం గనుంగొని ‘నకులుండు జలంబులకుం జని తడసె; నీ వరిగి యతనిం దోడ్కొని జలంబులు గొనుచు ర’మ్మనిన నక్కుమారుం డతి శీఘ్రగమనంబునంబోయి యాపద్మాకరతీరంబునం బడియున్న యన్నతెఱంగుఁ జూచి విస్మయశోకవ్యాకులహృదయుం డగుచు, ‘నిది యేమి నిమిత్తంబున నయ్యెనో!’ యని యూహించుచుఁబెల్లడరు తృష్ణాభరంబు సహింప నోపక జలంబులదెస నాసఁ జేసి కొలనికి డిగ్గిన నెప్పటిభూతం బి ట్లనియె.

### [3.7.394](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.394)

ఆ. ‘అనఘ! యీజలాశయము నాయధీనంబు; | సాహసంబుఁజేసి చనదు చొరఁగ;  
నాదు ప్రశ్నములకు నలి నుత్తరము లిచ్చి | వారిఁ గొనుము నీకు వలసినట్లు’.

### [3.7.395](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.395)

క. అనిన నది యాదరింపక | ఘనుఁ డాసలిలములు ద్రావి గ్రక్కున విష మె  
క్కినవిధమునఁ బరవశుఁడై | ఘనసాలమహీరుహంబు కైవడిఁ బడియెన్‌.

### [3.7.396](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.396)

సీ. అంత నంతకసూనుఁ డంతరంగంబున | సంతాప మెసఁగ వాసవతనూజుఁ  
గనుఁగొని ‘యన్న! నీ యనుగుఁదమ్ములు వోయి | కడుఁ దడవయ్యె; నిక్కాననమున  
నెయ్యది వుట్టెనో? చయ్యన నీ వేఁగి | వారిని దోడ్కొని వారిఁ గొనుచుఁ  
జనుదెమ్ము’ నావుడు ఘనభుజుం డధికర | యంబున నరిగి జలాశయంబు  
ఆ. తీరభూమిఁ బడిన వారి నవారిత | మహితశౌర్యధనుల మాద్రిసుతులఁ  
జూచి, విస్మయైకగోచరుఁడై సవ్య | సాచి యుల్లమున విషాద మడర.

### [3.7.397](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.397)

క. నాలుఁగుదిక్కులు గనుఁగొని | యాలో నెవ్వరిని గాన కత్యంతపిపా  
సాలసుఁడై సలిలంబులు | గ్రోలఁగ సమకట్టి యొయ్యఁ గొలనికి డాసెన్‌.

### [3.7.398](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.398)

వ. డాయుటయు నయ్యశరీరభూతం బి ట్లనియె.

### [3.7.399](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.399)

మ. ‘బలిమిం జొచ్చిన నెట్టివారికయినం బ్రాణంబుపై వచ్చు; నీ  
సలిలావాసము మత్పరిగ్రహము; తృష్ణాఖేదమారం జలం  
బులు ద్రావన్‌ వలతేనిఁ బ్రశ్నములకుం బొం దొందఁగా నుత్తరం  
బులు నా కి’ మ్మనుడున్‌ మనంబునఁ బృథాపుత్త్రుండు సక్రోధుఁడై.

### [3.7.400](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.400)

ఉ. ‘మ్రుచ్చిలి నిల్చి దుర్వచనముల్‌ పచరించినఁ జెల్లనిత్తునే?  
చెచ్చెర నీయెలుం గడఁగఁ జేసెద నిప్పుడు సూడు’ మంచు వి  
వ్వచ్చుఁడు శబ్దభేదిశరవర్గముఁ దద్వచనంబుచక్కటిం  
గ్రచ్చఱ నించె మౌర్విరవకంపితసర్వదిగంతరాళుఁడై.

### [3.7.401](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.401)

ఆ. ఇట్టు లేయుటయును నెప్పటివాక్యంబు | మఱియు వినఁగఁబడిన మఘవసూనుఁ  
డలసి కొలనుఁ జొచ్చి యంబుపానము చేసి | యిలకు నొఱగె వివశహృదయుఁ డగుచు.

### [3.7.402](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.402)

వ. తదనంతరంబ యుధిష్ఠిరుండు భీమసేను నాలోకించి ‘కవలును గవ్వడియును నింతదడయుటకు నిమిత్తం బెయ్యదియో నీ వరుగు’ మనినం గిమ్మీరవైరి మారుతజవంబున నమ్మువ్వురుఁ జనిన చొప్పునం జని పద్మాకరకూలంబున నిద్రాపరవశులుం బోలెఁ బడియున్న తమ్ములం గని దుఃఖితుండై.

### [3.7.403](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.403)

తరలము ‘ఇది మనుష్యకృతంబు గాదు సురేంద్ర కిన్నర పన్నగ  
త్రిదశనిర్మిత మైన కర్మము; దీని నింతయు నేర్పడం  
బిదపఁ జూచెదఁగాక’ యంచును భీతిదూరుఁడు నీరువ  
ట్టొదవఁ దత్సలిలాశయంబు సముత్సుకుం డయి చొచ్చినన్‌.

### [3.7.404](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.404)

వ. అంతరిక్షగోచరం బైన వచనం బిట్లని వినంబడియె: ‘నయ్యా! నీ వి ట్లేల సాహసంబు సేసెద; విక్కొలను మత్పూర్వపరిగ్రహంబు; నీ వోపుదేని నా యడిగిన యర్థంబులకు నుత్తరంబు లిచ్చి జలంబులు ద్రావు’ మనిన నప్పలుకులు గైకొనక వృకోదరుండు నిపీతసలిలుండై యచ్చోటన మూర్ఛితుండై పడియె; నిట బాండవాగ్రజుండు.

### [3.7.405](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.405)

క. తమ్ములు నలువురు నొక్కట | నమ్మెయి మసలుటకు నాత్మ నత్యంతవిషా  
ద మ్మొలయ సముత్థితుఁ డై | క్రమ్మఱ నమ్మార్గ మపుడు గైకొని నడచెన్‌.

### [3.7.406](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.406)

సీ. అపగత జనశబ్దమై, యనభివ్యక్త | మార్గమై, యవిరళదుర్గశైల  
తరుగుల్మవల్లీవితానమై, గజసింహ | శరభ శార్దూల సూకర లులాయ  
బహుళమై, బహువిధపక్షికోలాహల | భయదమై, కడుఁ బరపైన యడవి  
ననుజుల వెదకుచు ననఘుండు సని కాంచెఁ | గమలాకరంబుతీరమునఁ బడిన  
ఆ. వారిఁ బూరువంశవరుల భీమార్జున | యముల నమితబలుల విమలమతులఁ  
బ్రళయపతితలోకపాలసంకాశుల | భూరిపుణ్యధనుల వీరవరుల.

### [3.7.407](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.407)

మ. కని డెందంబునఁ దల్లడం బడర దీర్ఘశ్వాస వైవర్ణ్యముల్‌  
దనుకం దాల్మి చలింప విస్మయపరీతస్వాంతుఁడై శోకబా  
ష్పనిరుద్ధాకులలోచనుం డగుచు మూర్ఛల్‌ పైకొనం గొంతసే  
పు నరేంద్రోత్తముఁ డుండెఁ జిత్రమున రూపుంబోలెఁ దా నచ్చటన్‌.

### [3.7.408](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.408)

వ. పదంపడి డెందంబున ధృతి పొందుపఱుచుకొని యతం డన్నలువుర నుపలక్షించి నలుదెసలుం బరికించి యాత్మగతంబున.

### [3.7.409](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.409)

తే. ‘ఒరులు వచ్చిన చొప్పు లే; దరిగినట్టి | చొప్పు లేదు; పెనంగిన చొప్పు లేదు;  
ఘనభుజుల యంగకంబులు గనుఁగొనంగ | నక్షతము; లేల యొక్కొ యి ట్లయిరి వీరు?

### [3.7.410](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.410)

ఉ. క్రూరుఁడు ధార్తరాష్ట్రుఁ డతికుత్సితుఁ; డెంతయుఁ బాపబుద్ధి గాం  
ధారుఁడు పెక్కుమాయలకుఁ దావల; మక్కట! యద్దురాత్మకుల్‌  
వారక యెద్దియేని యొకవంచనమై యిటు సేసిరొక్కొ! యె  
వ్వారలు నాత్మ నమ్ముదురె వక్రవిచారులఁ బాపకర్ములన్‌.

### [3.7.411](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.411)

క. వదనంబుల తెలివియుఁ గర | పదరుచియుం జెడదు; వీరు వడుటకుఁ గత మీ  
యుదకము విషదుష్ట మనియు | మదిఁ దలఁపం బోల; దేమి మాయయొ యెఱుఁగన్‌.

### [3.7.412](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.412)

చ. పుడమియు సర్వసంపదలుఁ బొల్పఱ వైరుల పాలుసేసి యీ  
యడవికి వచ్చి భీకరమృగావలిపొందున నున్న వీరి వె  
న్నడికొని యిట్లు సేసెనె యనాథులఁబోలె విధాతృఁ; డింక నె  
క్కడఁ జనువాఁడ? నేది గడగాఁ దరియింతు దురంతదుఃఖమున్‌?

### [3.7.413](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.413)

సీ. పుత్త్రులు దుఃఖార్తిఁ బొగులుట కనిశంబుఁ | బొక్కచునున్న యప్పుణ్యచరిత  
మాతల్లి పాండునిమహిషి నా కెదురుగా | వచ్చి కౌఁగిటఁజేర్చి ‘వత్స! నాఁడు  
నీతమ్ముఁగుఱ్ఱలు నీవును నడవుల | కరిగితి, రిప్పు డయ్యనుజు లెందుఁ  
జనిరి? నీ వొకడవ చనుదెంచి; తిది యేమి?’ | యనిన నాయమతోడ నప్పు డేమి  
ఆ. యనఁగ నేర్చువాఁడ? నాచార్యవిదుర శాం | తనవకృపులు నను ముదంబుతోడఁ  
గుశల మడిగి రేనిఁ గుశల మే మనువాఁడ? | నెందుఁ దలఁగరాని యెడరు దగిలె.’

### [3.7.414](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.414)

వ. అని పెక్కుతెఱంగుల వగచి యా ధర్మజుండు దప్పి కోర్వక నీళ్ళు ద్రావుటకై సరోవరంబులోనికి డిగ్గుటయు నెప్పటియట్ల యశరీరభూతం బిట్లనియె.

### [3.7.415](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.415)

మ. ‘విను మే నొక్క బకంబ; నిక్కొలను పృథ్వీనాథ! నాసొమ్ము; నీ  
యనుజుల్‌ మద్వచనంబుఁ గైకొనక తోయాస్వాదులై యివ్విధం  
బునఁ బ్రాణచ్యుతిఁ బొంది; రీవును గడున్‌ మోహంబునన్‌ సాహసం  
బునకుం జొచ్చిన నట్ల యయ్యెడు సుమీ! మున్ముట్ట వారించితిన్‌.

### [3.7.416](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.416)

క. ఏ నడిగిన యర్థములకు | భూనుత! యుత్తరము లిచ్చి పొలుపొందఁ బయః  
పానంబు సేయు’ మనవుడు | నా నిర్మలచరితుఁ డంబరాభిముఖుండై.

### [3.7.417](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.417)

వ. ‘అయ్యా! నీవు బకరూపధరుండ వైన రుద్రుండవో, పావకుండవో, పవనుండవో! యట్లు గానినాఁడు కులపర్వతప్రతిము లయిన నాతమ్ములం బడఁద్రోచునట్టిబలంబు పులుఁగుల కెందునుం గలుగదు. దేవాసురగంధర్వయక్షాదులకు దుర్జయులైన యవ్వీరుల నిట్లు సేసి నీవు గాని వాఁడవ పోలెం దొలంగియున్నవాఁడవు; నాకు నద్భుతభయకౌతుకంబు లొక్కటం బొడమెడు; నీ వెవ్వండవు? నీతలంపెయ్యది? చెప్పి నాహృదయవేదన నపనయింపవే’ యనిన నదృశ్యభూతంబు.

### [3.7.418](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.418)

ఆ. ‘కౌరవేంద్ర! బకమఁ గాను నే; విను మొక్క | యక్షవరుఁడ; నిచట నస్మదీయ  
నికృతిఁ జేసి పడిరి నీతమ్ము లందఱు’ | ననుచు నాక్షణంబ యతని యెదుర.

### [3.7.419](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.419)

మ. నిలిచెం దాళసముచ్ఛ్రితాంగుఁడు మహానిర్ఘోషసంతర్జితా  
ఖిలభూతప్రకరుండు దీర్ఘవిపులగ్రీవుండు దంష్ట్రాసము  
జ్జ్వలవక్త్రుండు విరూపలోచనుఁడు తీవ్రస్ఫారతేజోఘనుం  
డలఘుం డా సరసీతటాంతమున నయ్యక్షుండు ఘోరాకృతిన్‌.

### [3.7.420](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.420)

వ. ఇట్లు నిలిచి కౌంతేయాగ్రజున కి ట్లనియె.

### [3.7.421](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.421)

క. ‘నాయనుమతి లేకుండఁగ | నీయుదకము ద్రావిరేని యెవ్వా రైనన్‌  
ధీయుత! చత్తురు; నీ వటు | సేయవు సమ్యగ్విచారశీలుఁడ వగుటన్‌.

### [3.7.422](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.422)

వ. కావున మదీయంబులగుప్రశ్నంబుల కుత్తరంబుసెప్పు మనిన నతండు ‘మహాత్మా! నీ చిత్తంబునకు వచ్చునట్లుగాఁ జెప్పనాబోఁటివానికి శక్యం బగునే? యైనను నా నేర్చువిధంబునఁజెప్పెద నడుగు’ మనిన నయ్యక్షుం డి ట్లనియె.

### [3.7.423](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.423)

క. ‘దినకరు నెయ్యది నడపును? | దినకరు నెవ్వారు గొలిచి తిరుగుదు? రద్దే  
వుని యస్తమించు టేమిట? | ననఘ! తదాధారభూత మది యెద్దియొకో’?

### [3.7.424](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.424)

తే. అనిన ధర్మజుఁ డిట్లను; ‘నబ్జహితుని | నడపు బ్రహ్మంబు; సురకోటి నడచు కొలిచి;  
ధర్మువున నస్తమితుఁ డగుఁ దపనుఁ; డమ్మ | హాత్మునకు సత్య మాధార మండ్రు బుధులు.’

### [3.7.425](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.425)

వ. అనిన విని యక్షుం డి ట్లనియె.

### [3.7.426](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.426)

క. ‘ఏమిట శ్రోత్రియుఁ డనఁ జను? | నేమిటఁ గడుమహిమ వడయు నిమ్ముగఁ బురుషుం?  
డేమిట సహాయయుతుఁ డగు? | నేమిట నగు బుద్ధిమంతుఁ? డేర్పడఁ జెపుమా!’

### [3.7.427](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.427)

వ. అనిన నతం డి ట్లనియె.

### [3.7.428](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.428)

క. ‘శ్రుతమువలన శ్రోత్రియుఁ డగు; | నతులతపోయుక్తిఁ గడుమహత్త్వము వడయున్‌;  
ధృతిచే సహాయయుతుఁ డగు; | నతిశయముగ బుద్ధిమంతుఁ డగు బుధసేవన్‌.’

### [3.7.429](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.429)

వ. అని చెప్పిన నప్పార్థివోత్తమునకు నప్పురుషుండు వెండియు ని ట్లనియె.

### [3.7.430](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.430)

తే. ‘ఏమి కతమున భూదేవుఁ డెసఁగు దేవ | భావమున? నాతనికి సాధుభావ మెవ్వి  
ధమున నగు? నసాధుత్వ మెద్దానఁ జెందు? | మానుషుం డగు నాతఁ డేదానఁ? జెపుమ.’

### [3.7.431](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.431)

చ. అనవుడు ధర్మజుం డనియె ‘నధ్యయనంబున దేవభావముం  
గను నవనీసుపర్వుఁ; డధికవ్రతశీలత సాధుభావ మా  
తనికి; విశిష్టవృత్తి దిగఁద్రావి యసాధు వనంగ నుండు; శౌ  
చనియతి లేక మృత్యుభయసంగతి నాతఁడు మానుషుం డగున్‌.’

### [3.7.432](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.432)

క. నావుడు నతఁ డాతనితో | ‘జీవన్మృతుఁ డెట్టివాఁడు? సెప్పు’ మనుటయున్‌  
‘దేవాతిథిపితృభృత్యజ | నావళులకు నిడక కుడుచునతఁ’ డని చెప్పెన్‌.

### [3.7.433](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.433)

చ. విని మగుడంగ వాఁడు పృథివీపతిఁజూచి ‘ధరిత్రికంటె వ్రేఁ  
గనఁ జనుదాని, నాకసముకంటెఁ గడుం బొడవైనదాని, గా  
డ్పునకును నెక్కుడై జవము పొంపిరివోయెడు దానిఁ, బూరికం  
టెను దఱచైన దానిని, ఘటింపఁగఁ జెప్పుము నాకు’ నావుడున్‌.

### [3.7.434](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.434)

వ. అమ్మనుజోత్తముం డయ్యక్షోత్తమున కి ట్లనియె.

### [3.7.435](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.435)

ఆ. ‘తల్లి వ్రేఁగు సువ్వె ధరణికంటెను; నాక | సంబుకంటెఁ బొడవు జనకుఁ డరయ;  
గాడ్పుకంటె మనసు కడుశీఘ్రగతి; తృణో | త్కరముకంటెఁ జింత గరము తఱచు’.

### [3.7.436](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7.436)

వ. అనిన నంబరచరుండు మఱియు నిట్లనియె.

_First 200 of 238 passages. [Read on](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7)_

---
Source: [https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7) · Pramāṇa
