<!-- Pramāṇa, a library of Indian primary sources · https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3 -->

[Pramāṇa](https://indike.org/pramana/) › [Indian literature](https://indike.org/pramana/in) › [Epic, Poetry, Drama & Narrative](https://indike.org/pramana/in.lit) › [The Mahābhārata and its versions](https://indike.org/pramana/in.lit.mahabharata) › [Mahābhāratas in Indian regional languages](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa) › [Andhra Mahabharatamu](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra) › 3

# Andhra Mahabharatamu 3

Āndhra Mahābhāratamu 3

- **Language:** Telugu

## Contents

- [3.1 అరణ్యపర్వము — ప్రథమాశ్వాసము](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1) — 310 parts
- [3.2 అరణ్యపర్వము — ద్వితీయాశ్వాసము](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.2) — 234 parts
- [3.3 అరణ్యపర్వము — తృతీయాశ్వాసము](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.3) — 250 parts
- [3.4 అరణ్యపర్వము — చతుర్థాశ్వాసము](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.4) — 318 parts
- [3.5 అరణ్యపర్వము — పంచమాశ్వాసము](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.5) — 290 parts
- [3.6 అరణ్యపర్వము — షష్ఠాశ్వాసము](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.6) — 277 parts
- [3.7 అరణ్యపర్వము — సప్తమాశ్వాసము](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.7) — 237 parts

### అరణ్యపర్వము — ప్రథమాశ్వాసము

### [3.1.1](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.1)

క. శ్రీకీర్తిశ్రీవల్లభ! | లోకజనస్తుత్య! సర్వలోకాశ్రయ! ర  
త్నాకర పరివృత సకల ధ | రా కాంత! జితారి! రాజరాజ నరేంద్రా!

### [3.1.2](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.2)

వ. అక్కథకుండు శౌనకాది మహామునులకుం జెప్పె; నట్లు పాండవులు నిజాయుధంబులు ధరియించి కృష్ణాసహితులై యుత్తరము మించి యరిగిన నింద్రసేనాదులైన మూలభృత్యులు పదునాలుగువేల రథంబులతోడ సుభద్రాభిమన్యు ప్రతివింధ్యాదులం దోడ్కొని వారి పిఱుందన యరిగి; రంత నప్పాండవులం జూచి పౌరులెల్లఁ బరమ దుఃఖితులై.

### [3.1.3](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.3)

క. ‘చనునె యధర్మద్యూతం | బున నిట్టుల పాండురాజపుత్త్రులఁ బ్రభులన్‌  
వనగతులఁ జేయ దుర్యో | ధన ధృతరాష్ట్రులకు విగతదయహృదయులకున్‌.

### [3.1.4](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.4)

క. క్రూరతర ధార్తరాష్ట్రు ని | కారము వారింపరైరి గాంగేయుఁడు న  
బ్భారద్వాజుఁడుఁ గృపుఁడు ను | దారుఁడు విదురుండు నేమి దలఁచిరొ బుద్ధిన్‌.

### [3.1.5](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.5)

సీ. కర్ణ జయద్రథ గాంధారు లాప్తులై | యుండంగ లోభి దుర్యోధనుండు  
రాజుగా నీతని రాజ్యంబు నందెట్టు | లుండంగ నేర్తు? మీ యుర్వి నింక  
నేది ధర్మువు? ప్రజ నెవ్వరు గాతురు? | పరమధార్మికులైన పాండుసుతుల  
యరిగిన చోటికి యరుగుద’ మని వారి | పిఱుఁదన చని పాపభీతమతులు  
ఆ. ‘వీరులార! మమ్ము విడిచి మీ కరుగంగఁ | జనునె, మాకు నొండు శరణ మెద్ది?  
సాధులకు నసాధుసహవాసమునఁ బాప | సంప్రయోగ మగుట సందియంబె?

### [3.1.6](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.6)

క. తిలలును నీళ్ళును వస్త్రం | బులుఁ బుష్ప సుగంధ వాసమున సౌరభముం  
బొలు పెసఁగఁ దాల్చుఁ గావున | నలయక సత్సంగమమున నగు సద్గుణముల్‌.

### [3.1.7](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.7)

వ. సాధుసమ్మతంబులైన గుణంబుల నొప్పి, జన్మవిద్యా కర్మంబులం బ్రశస్తులరై, యార్యవృత్తులరైన మీ సహవాసంబున నుండి, ధర్మపరులమై కృతార్థుల మగుదుము; దుష్కృతంబులయం దనారంభులయ్యును జనులు దుర్జన దర్శన స్పర్శన సంభాషణ సహాసనంబులంజేసి ధర్మవిహీను లగుదురు; గావున నేము దుర్యోధను రాజ్యంబున నుండనోపము; మా యనుగమనంబున కొడంబడవలయు’ నని కృతాంజలులైన న ప్పౌరులం జూచి ధర్మతనయుం డిట్లనియె.

### [3.1.8](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.8)

క. ‘మాయందు లేని గుణములు | మీ యనురాగమునఁ జేసి మిగిలి వెలింగెన్‌;  
మీ యనుగతి మా కనభి | ప్రాయము; వనవాసదుఃఖభర మోపుదురే?

### [3.1.9](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.9)

తే. వలవ దుడుగుండు మీ’ రని వారినెల్లఁ | గరుణఁ బాండవజ్యేష్ఠుండు గ్రమ్మఱించెఁ;  
బౌరు లట్లు నివర్తింపఁబడి నిరంత | రార్తనాదులై యరిగిరి హస్తిపురికి.

### [3.1.10](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.10)

వ. ఇట్లు పాండవులు గృతప్రస్థానులై గంగాతీరంబునం బ్రమాణాఖ్యవటంబున విడిసి, గంగాస్నానంబు సేసి, నాఁటి పగలును రాత్రియు నంద యుండి; రంతఁ బ్రభాతసమయంబున.

### [3.1.11](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.11)

చ. పరువడి నగ్నిహోత్రములు బంధులు శిష్యులుఁ దోడ రా మహీ  
సురవరులెల్లఁ బాండునృపసూనులయొద్దకుఁ బ్రీతి నేఁగుదెం  
చిరి బహువేదఘోషములఁ జేసి నిరస్త సమస్త కిల్బిషో  
త్కరు లగుచున్న ధన్యులు జగత్పరిపూజ్యులు బ్రహ్మసమ్మితుల్‌.

### [3.1.12](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.12)

వ. ఇట్లు దమతోడన వనవాసంబు సేయ నిశ్చయించి వచ్చిన విప్రుల నతిప్రీతి గౌరవంబున నర్చించి తదా శీర్వాదంబుల నభినందితుండై ధర్మతనయుండు వారల కిట్లనియె.

### [3.1.13](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.13)

క. ‘అపహృత సర్వస్వులమై | సపత్నుల నికారమునఁ బ్రచండాటవిలో  
విపుల ఫల శాక మూలము | లుపయోగించుచును నిష్ఠ నుండెడు మాతోన్‌.

### [3.1.14](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.14)

క. రా నేల? వచ్చి నవయం | గా నేల? నివాసములకుఁ గ్రమ్మఱి చనుఁ; డు  
గ్రానేకప శార్దూల భ | యానక వనవాస మర్హ మగునే మీకున్‌!’

### [3.1.15](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.15)

వ. అనిన విని బ్రాహ్మణులు పరమ దుఃఖితులై ‘మీర కాని మాకు నొండు గతి లేదు; మమ్ము ననన్యశరణ్యుల విడుచుట ధర్మంబు గాదు.

### [3.1.16](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.16)

ఆ. ఆశ్రితులను భక్తులగువారి నెప్పుడు | నన్యులైన విడువ; రట్టి విప్ర  
వరుల భక్తిపరుల వసుధేశ! మీ యట్టి | ధార్మికులకు విడువఁదగునె చెపుమ.

### [3.1.17](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.17)

వ. అస్మ త్పోషణోపాయచింత సేయ వలదు; వన్యమూల ఫలంబుల నేమ తెచ్చికొని యుపయోగించుచు జపహోమాది పుణ్యక్రియల మీకుం బ్రియంబు సేయుచు నుండెద; మధర్మవర్తులయి మీ కపకారంబు సేసిన ధార్తరాష్ట్రుల రాష్ట్రంబున నుండ నోప’ మనిన వారల రాక కొడంబడి.

### [3.1.18](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.18)

తే. ఇష్టమృష్టాన్నములఁ దొల్లి యెల్ల ప్రొద్దుఁ | దృప్తులగుచున్న వసుమతీదేవవరులఁ  
గానలందు శాకాశనుల్‌ గాఁగ నెట్లు | సూడ నోపుదు నని ధర్మసూనుఁ డపుడు.

### [3.1.54](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.54)

వ. నీవు నా కొడుకుల యున్నతి కెన్నండును సహింపవు; నీ సహాయత్వంబే నొల్లఁ; బాండవులకడ కేనియు నొండు గడకేనియు నీకిష్టం బైన చోటికి నరుగు’ మనిన నా క్షణంబ విదురుండు మనోజవైకరథారూఢుండై పాండవుల కడకుం గామ్యకవనంబున కరిగె; నంత నతనిరాక దవ్వులం గని ధర్మరాజు భీమసేనుని కిట్లనియె.

### [3.1.55](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.55)

సీ. ‘గాండీవ మాదిగాఁ గల యాయుధావలు | లుక్కివంబున నప్పు డొడిచి కొనఁగ  
మఱచినవాఁడయ్యు మందాత్ముఁ డా ధార్త | రాష్ట్రుండు గాంధారరాజతనయు  
వచనముల్‌ విని యక్షవతి నెపంబున వానిఁ | గష్టుఁడై కొన సమకట్టి మనల  
మగుడింపఁగా దుష్టమతిఁజేసి విదురుఁ బు | త్తెంచెఁ; గాకున్న నేతేరఁ డితఁడు  
ఆ. నింక జూదమాడ నే నోప; నిది పని | గాఁగ వచ్చు నొక్కొ కడఁగి విదురుఁ;  
డేమి సేయు వార? మితని నియోగంబు | మనకుఁ జేయ కునికి మానుషంబె?’

### [3.1.56](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.56)

వ. అని తమలోఁ బలుకుచున్న సమయంబున విదురుం డేతెంచిన నతనికిఁ బ్రత్యుద్గతులై వినయప్రియ సత్కారంబుల సంతుష్టుం జేసి, తదాగమననిమిత్తం బడిగిన, వారికి విదురుం డిట్లనియె.

### [3.1.57](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.57)

క. ‘మతి వారికి మాకును గడు | హితుఁడవు; చెపుమయ్య; యింక నెయ్యది కార్య  
స్థితి?’ యని ధృతరాష్ట్రుం డే | కత మిష్టంబైన కార్యగతి నన్నడుగన్‌.

### [3.1.58](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.58)

వ. ఏ నుభయపక్షంబులవారికి జగంబునకు లగ్గుగ హితంబైన విధంబు సెప్పిన, నది సర్వజన రుచికరంబైన యాహారంబు రోగాతురునకు నరుచికరంబైన యట్ల యతనికి రుచియింపదయ్యె.

### [3.1.59](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.59)

ఆ. కార్యగతులతెఱఁగు కలరూపు సెప్పిన | నధికమతులు దాని నాదరింతు;  
రల్పకార్యబుద్ధు లగువారలకు నది | విరసకారణంబు విషమ పోలె.

### [3.1.60](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.60)

వ. దానన చేసి ధృతరాష్ట్రుండు నన్నొల్లక యెగ్గులు వలికి ‘నీవు విపరీతచేతస్కుండ; విందుండ వలవదు; పాండవుల పాలికిం బొ’ మ్మనిన వచ్చితి; రూపలావణ్యవతియై వృద్ధశ్రోత్రియునిచేతం బరిణీతయైన తరుణియుం బోలె రాజ్యలక్ష్మి యద్దురాత్మునందు విరక్తయగాని ప్రీతిఁ బుట్టదండ్రు.

### [3.1.61](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.61)

ఆ. ధర్మరహితులైన ధార్తరాష్ట్రులకు భూ | రాజ్యలక్ష్మి సుస్థిరంబు గాదు;  
ధర్మతనయ! నిన్నుఁ దద్రాజ్యసంపదల్‌ | వలచి తమకుఁ దామ వచ్చి పొందు.

### [3.1.62](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.62)

వ. నా వచనంబున నెగడునది’ యనిన ధర్మరాజు ‘నట్ల చేయుదు’ నని యున్నంత; నిట ధృతరాష్ట్రుండు పాండవులయొద్ద విదురు నునికి యెఱింగి ధృతివిహీనుండై, తన హృదయంబును దృష్టియుం బోని విదురుం బాసి నిమిషం బేనియు నిర్వహింప నోపక సంజయున కిట్లనియె.

### [3.1.63](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.63)

క. ‘నెమ్మిగలవాని, నా చి | త్తమ్మెఱిఁగెడు వాని విదురు ధర్మప్రియు నా  
తమ్ము నిట వేగఁ దోడ్కొని | ర; మ్మరుగుము కామ్యకాఖ్య రమ్యాటవికిన్‌.

### [3.1.64](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.64)

వ. అని పంచిన నప్పుడ సంజయుం డతిత్వరితగతిం గామ్యకవనంబున కరిగి.

### [3.1.65](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.65)

మ. ధరణీదేవసహస్రసంఘములతో ధౌమ్యుండు ధర్మక్షమా  
భరణుల్‌ నల్వురు దమ్ములున్‌ విదురుఁడుం బాంచాలియుం బ్రీతి బం  
ధురులై కొల్వఁగ నొప్పుచున్న బుధబంధున్‌ ధర్మరాజుం బ్రభా  
స్వరతేజుం బ్రభుఁ గాంచి సంజయుఁడు సంజాతప్రమోదాత్ముఁడై.

### [3.1.66](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.66)

క. వనవాసము సేయుచుఁ ద్రిభు | వన రాజ్యము సేయునట్టి వడువున సంతో  
ష నిబద్ధ బుద్ధి యగు యమ | తనూజునకు భక్తి నెఱఁగి తా నిట్లనియెన్‌.

### [3.1.67](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.67)

వ. ‘మిమ్మును ధర్మార్థవిదుండైన విదురునిం గౌరవేంద్రుం డెప్పుడుం దలంచుచుండు; మీ యనుమతంబునఁ దన యనుజుం దోడ్కొని తేర నన్నుఁ బుత్తెంచె’ ననిన విని ధర్మరాజు విదురున కిట్లనియె.

### [3.1.68](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.68)

తే. ‘సర్వజనులును ధృతరాష్ట్రు శాసనంబు | సేయుచున్నచో మనకు విశేషభక్తిఁ  
జేయవలయుఁ; గావున నెడ సేయ కరుగు’ | మనిన విదురుండు గజపురి కరిగె నంత.

### [3.1.69](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.69)

వ. ధృతరాష్ట్రుండును దనకు వినయవినమితోత్తమాంగుఁ డైన విదురు నతిస్నేహంబునం గౌఁగిలించుకొని మూర్ధాఘ్రాణంబు సేసి ‘నీవు నిత్యక్షమానిరతుండవు నాబుద్ధిలేమికి క్షమియింపు’ మనిన విదురుం డిట్లనియె.

### [3.1.70](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.70)

ఆ. ‘నీవు నీ సుతుండు నెఱిఁ దప్పి పలికినఁ | బథ్యమయిన పలుక పలుకవలయు;  
వీరు లయిన పాండవేయులతో నిగ్ర | హంబు సేయు టిది నయంబు గాదు.’

### [3.1.71](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.71)

వ. అనుచు నెప్పటి యట్ల కార్యసహాయుండై విదురుండు ధృతరాష్ట్రునొద్ద నున్న, నయ్యిద్దఱ సంగమంబునకు శంకించి దుర్యోధనుండు కర్ణ శకుని దుశ్శాసనులతో నిట్లనియె.

### [3.1.72](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.72)

క. ‘పాండవహితుఁ డగు విదురుఁడు | వెండియుఁ జనుదెంచి కార్యవిధులందు సహా  
యుండయ్యె; నతనితోడ హి | తుండయి మంతనము సేయఁ దొడఁగెన్‌ విభుఁడున్‌.

### [3.1.73](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.73)

వ. వీరలింకఁబాండవుల నిందులకు రావించు వారలయిన నగ్ని విష జలంబులు ప్రయోగించి వారల కపాయంబు సేయుద’ మనిన విని శకుని దుర్యోధనుం జూచి ‘యిట్లేల బాలిశంబైన మతిఁ దలంచితివి? విదుర ధృతరాష్ట్రులు విపరీతమతులై రావించినను, నిత్యసత్యనిరతులైన యప్పాండవులు దమ సేసిన సమయంబు సలుపక యేల వచ్చువార గుదు?’ రనిన శకునిదుర్యోధనులకుఁ గర్ణుం డిట్లనియె.

### [3.1.74](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.74)

ఉ. ‘ఇత్తఱిఁ బన్నిపోయి పయినెత్తి రణం బొనరించి వారలన్‌  
మిత్తికి నంపి ధాత్రి నిరమిత్రముఁ జేయుద; మిట్టు లైనఁ ద  
ద్వృత్తులు నీక దక్కుఁ గురువీర; కడంగుము’ నావుడున్‌ మదో  
న్మత్తుఁడు గౌరవుం డతనిమాటకు సంతసమంది చెచ్చెరన్‌.

### [3.1.75](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.75)

వ. సమర సన్నద్ధుఁడై సమస్తబలంబును సమకట్టి వెలువడినం దన దివ్యదృష్టి నంతయు నెఱింగి కృష్ణద్వైపాయనుండు వచ్చి ‘యిది ధర్మువు గా దుడుగు’ మని దుర్యోధనుని వారించి ధృతరాష్ట్రున కిట్లనియె.

### [3.1.76](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.76)

క. ‘పుడమియు రాజ్యముఁ గోల్పడి | యడవుల నేకతమ యున్న యప్పాండవులం  
గడఁగి వధియింతు నని నీ | కొడు కరిగెడు; నిట్లు తలఁపఁ గూడునె బుద్ధిన్‌?

### [3.1.77](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.77)

క. ధృతియుతులై సత్యవ్రత | రతులై పదుమూఁడు వత్సరంబులు ధర్మ  
స్థితి సలిపి వార కడఁగెద | రతులపరాక్రములు మీఁద నాహవమునకున్‌.

### [3.1.78](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.78)

క. వనగతులని వారలపైఁ | జని భంగముఁ బొంది రాఁగ సమకట్టెడు నీ  
తనయుఁడు గావున నీ వా | తని వారింపు మది యనుచితం బని నెమ్మిన్‌.

### [3.1.79](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.79)

క. విను మేనును నీవును శాం | తనవుఁడు విదురుండు నుండి తగునె యధర్మం  
బు నుపేక్షింపఁగ? ననయం | బును బాండవవిగ్రహంబు పుట్టుట లగ్గే?’

### [3.1.80](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.80)

వ. అనిన విని ధృతరాష్ట్రుండు దుఃఖితుండై ‘నాకును గాంధారికిని భీష్మ విదుర కృప ద్రోణులకు ననిష్టంబైన దుష్ట ద్యూతంబు ప్రవర్తిల్లె; దుర్బుద్ధియైన దుర్యోధనుం బుత్త్రస్నేహంబున విడువనోప; నేమి సేయుదు?’ ననిన ధృతరాష్ట్రునకుఁ గృష్ణద్వైపాయనుం డిట్లనియె.

### [3.1.81](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.81)

ఆ. ‘ఎల్ల నెయ్యములకుఁ దల్లిదండ్రులయందు | సుతులవలని నెయ్య మతిశయంబు;  
ధనము లెంత గలిగినను సుతరహితుల | కెమ్మెయిని మనఃప్రియమ్ము లేదు.

### [3.1.82](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.82)

వ. తొల్లి సకలగోమాత యయిన సురభి సురరాజుకడకుం బోయి కరుణంబుగా నేడ్చిన దానింజూచి సురపతి విస్మితుండై’ యిట్లేల రోదనాకులితలోచనవయి యున్న దాన; వెల్ల వారికి లగ్గ కదా’ యనిన నింద్రునకు సురభి యిట్లనియె.

### [3.1.83](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.83)

క. ‘నీ వజ్రము రక్షింపఁగ | నా వారికిఁ దక్కఁ ద్రిభువనంబులఁ గల జీ  
వావలి కెల్లను గుశలమ | దేవేంద్ర! జగత్త్రయప్రదీప! మహాత్మా!

### [3.1.84](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.84)

వ. దీనిం జిత్తగింపుము; బలంబు గల బలీవర్దంబులతో బలహీనంబులయిన వానిం బూన్చిన నవి దుర్వహ భారవహన మహాలాంగలాకర్షణంబులయం దసమర్థంబు లైన నడిచియుం బొడిచియు ములుకోలలం గుట్టియు దుర్బలబలీవర్దంబుల జనులు బాధింపం జూచి యేను దానికి దుఃఖించెద’ ననిన సురభికి సురపతి యిట్లనియె.

### [3.1.85](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.85)

క. ‘నీకు నపత్యశతంబు ల | నేకంబులు గలవు వాని కేకాకృతి దుః  
ఖాకులత సంభవింపదు | శోకింపకు’ మనిన సురభి సురపతి కనియెన్‌.

### [3.1.86](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.86)

వ. ‘దేవా! దీనాననంబులయి దుర్బలంబు లయిన యపత్యంబుల దుఃఖం బే నెట్లు సూడనోపుదు?’ ననిన నగి యింద్రుండు దానికిం గరుణించి వర్షంబునఁ దృణవర్ధనంబు సేసి దుర్బల బలీవర్దంబులకు బలంబు గావించె నని యింద్ర సురభి సంవాదంబు వేదంబులయందు వినంబడుఁ గావున నీకుం బుత్త్రస్నేహంబు సామాన్యంబు గా; దైనను దీనులై వనంబున నవయుచున్న యప్పాండవులకు దయాళుండ వగుము.

### [3.1.87](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.87)

తే. నీవుఁ బాండుండు విదురుండు నెమ్మి నాకు | నొక్క రూపైన యట్లు నీ కుదితయశులు  
నీ సుతులు నూర్వురును బాండునృపతనూజు | లేవురును నొక్కరూప కా నెఱుఁగవలయు.

### [3.1.88](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.88)

క. సుజనుల సహవాసంబునఁ | గుజనులు సద్ధర్మమతు లగుట నిక్కము; ధ  
ర్మజునొద్ద నుండి నీ యా | త్మజుఁడు ప్రశాంతుండు ధర్మమార్గుండు నగున్‌.

### [3.1.89](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.89)

వ. రాజర్షి యైన ధర్మరాజుతోడి సహవాసంబు సర్వజనహితంబు గావున నాతని నుపాసించి దుర్యోధనుండు గొండొకకాలం బుండు నట్లుగాఁ బనుపు; మట్లయిన నుభయపక్షంబులకు లగ్గగు’ ననిన ధృతరాష్ట్రుండు గృతాంజలి యయి ‘మునీంద్రా! దుర్యోధనుండు నా పలుకులు వినండు; కురుకులంబు రక్షించు నట్టి బుద్ధి గలదేని వాని మీర శిక్షింపుం’ డని మ్రొక్కిన

### [3.1.90](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.90)

క. ‘అనఘుఁడు మైత్రేయుం డను | మునినాథుఁడు వచ్చి ధర్మమున నాతనిఁ దా  
ననుశాసించుఁ దిరంబుగ’ | నని చెప్పుచు నప్పరాశరాత్మజుఁ డరిగెన్‌.

### [3.1.91](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.91)

వ. అంత.

### [3.1.92](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.92)

ఉ. న్యాయవిదుండు గామ్యకవనంబున ధర్మజునొద్దనుండి మై  
త్రేయుఁడు ధీయుతుం డరుగుదెంచిన నప్పుడ యమ్మునీంద్రు నిం  
ద్రాయితుఁ డాంబికేయుఁ డుచితస్థితిఁ బూజితుఁజేసి నాత్మ ని  
శ్శ్రేయసలాలసుండయి విశేషసపర్యలఁ జేసె భక్తితోన్‌.

### [3.1.93](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.93)

వ. ఇట్లుదనచేతంబూజితుండై సుఖవిశ్రాంతుండైన మునివరునకు ధృతరాష్ట్రుండు ముకుళితహస్తుండై ‘భట్టారకా! యెందుండి వచ్చితి?’ రని యడిగిన మైత్రేయుం డిట్లనియె.

### [3.1.94](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.94)

చ. ‘అలఘుతపోభరంబున జటాజినముల్‌ ధరియించి రూక్ష వ  
ల్కలములు గట్టి కూరలును గాయలుఁ బండులు భోజనంబుగా  
నలయక కామ్యకం బను మహావిపినంబున నున్న పాండవే  
యులకడనుండి వచ్చితిఁ గురూత్తమ! నీసుతు నిన్నుఁ జూడఁగన్‌.

### [3.1.95](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.95)

వ. ఏ నఖిలతీర్థదర్శనార్థంబు పరిభ్రమించుచుఁ గురుజాంగలంబున కరిగి యందుఁ గురుకులోత్తము లైన పాండుపుత్త్రులం జూచితి.’

### [3.1.96](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.96)

ఆ. అనిన నవనతాస్యుఁ డయి ధృతరాష్ట్రుఁ డి | ట్లనియె ‘నెట్లు సెప్పుఁ డయ్య! యందుఁ  
బాండవులకు సత్యభాషణులకుఁ గుశ | లంబె? వార లిట దలంతు రొక్కొ!’

### [3.1.97](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.97)

క. ‘అమితభుజశక్తి నంతక | సము లప్పాండుసుతు లిందు సౌభ్రాత్ర స్నే  
హమునకు విచ్ఛేదముగా | సమయాతిక్రమము సేయ సమకట్టరుగా.’

### [3.1.98](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.98)

వ. అనిన మైత్రేయుం డిట్లనియె.

### [3.1.99](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.99)

క. ‘చనుదెంచి మహామునివరు | లనవరతము వారలకుఁ బ్రియం బొనరఁగ దీ  
వన లీగిఁ జేసి కుశలమ | మనుజేశ్వర! వారు ధర్మమతియుతు లగుటన్‌.

### [3.1.100](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.100)

క. వారలు సమయము దప్పిన | వారిజరిపుహితుల గతు లవశ్యముఁ దప్పున్‌;  
వారికి నకారణంబ ని | కారము నీ కొడుకు సేసెఁ గడు నహితుండై.’

### [3.1.101](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.101)

వ. అని దుర్యోధనుం జూచి ‘యయ్యా! నీవు బుద్ధిగలవేనిఁ బాండవులతో విరోధం బుడుగు; మట్లయిన నీకును వారికిం గురుకులంబునకు లగ్గగు; నా పలుకుఁ జేకొనుము.

### [3.1.102](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.102)

సీ. వజ్రసంహనను లవార్యపరాక్రముల్‌ | పాండుకుమారు లాఖండలాభు  
లందఱు నాగశతాయుతత్రాణు లు | గ్రాహవకాంక్షు లుత్సాహపరులు;  
వారలలో బలవంతుండు బక హిడిం | బాసురు లనువారి నాసురమునఁ  
జంపె, నాగాయుతసత్త్వు జరాసంధు | నెక్కటి యోర్చిన యక్కజుండు  
తే. ఘోరవనమున వీరుఁ గిమ్మీరుఁ డను సు | రారి నిశ్చల ఘన భీకరాంగుఁ బట్టి  
పోర వధియించినట్టి సమీరజునకు | భూరిభుజునకు మార్కొనువారుఁ గలరె?

### [3.1.103](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.103)

వ. వారికి వాసుదేవ ధృష్టద్యుమ్నులు సంబంధ సహాయులు; జరామరణవంతులైన మనుజులు వారింజెనకి యెట్లు జీవింతురు? నీవు వారితో నొడంబడియుండు; మిది కార్యం’ బనిన మైత్రేయుపలుకు లాదరింపక పాదాంగుష్ఠంబున నేల వ్రాయుచు బాహు వెత్తి తొడలు సఱచి నగుచున్న యా దుర్యోధనుం జూచి, మైత్రేయుం డలిగి ‘యీ యపరాధంబున నాహవంబగు నందు భీముగదాఘాతంబున నీ యూరుయుగళంబు భగ్నం బయ్యెడు’ మని శాపం బిచ్చిన వెఱచి ధృతరాష్ట్రుండు ‘మునీంద్రా! యట్లు గాకుండం బ్రసాదింపు’ మనిన నమ్మునివరుం డిట్లనియె.

### [3.1.104](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.104)

తే. ‘కడఁగి సమబుద్ధి వీనికిఁ గలిగె నేనిఁ | గాదు శాప ఫలం; బట్లు గాక బుద్ధి  
హీనుఁడై గర్వితుం డగు నేని శాప | హవ్యవాహఫలంబు వీఁ డనుభవించు.’

### [3.1.105](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.105)

వ. అని ప్రసన్నుండైన మైత్రేయునకు నాంబికేయుం డిట్లనియె.

### [3.1.106](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.106)

క. ‘కిమ్మీరుం డను రక్కసు | డ మ్మారుతతనయుచేత నత్యుగ్ర వనాం  
తమ్మున నిహతుండయిన వి | ధ మ్మెట్టులు సెప్పు మద్భుతం బిది’ యనినన్‌.

### [3.1.107](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.107)

వ. ‘నా పలుకులు నీకొడుకు వినండయ్యె; నే నేల చెప్పెద? దీనిం బాండవసహాయులైన విప్రులచేత విదురుం డిమ్ముగా నెఱిఁగినవాఁ; డతనివలన విను’ మని చెప్పి మైత్రేయుం డరిగినం, గిమ్మీరవధ కథాశ్రవణపరుండై తన్నడిగిన ధృతరాష్ట్రునకు విదురుం డిట్లనియె; నిందుండి చని పాండవులు మూఁడహోరాత్రంబులు నిరంతర ప్రయాణంబు సేసి, కామ్యకవనంబుఁ జొచ్చు వా రొక్కనాఁటి యర్ధరాత్రంబున రాక్షసప్రచారవేళయందుఁ బరిభ్రమించుచు రాక్షసమాయఁ గావించుచున్నవాని, నతినిశితదంష్ట్రాకరాళంబైన తన వదన గహ్వరంబుఁ దెఱచి గ్రుడ్లు మెఱవ(య) బభ్రుకేశంబులు దూల బాలార్క రశ్మియుతంబయిన బలాహకంబునుంబోలె సకల ప్రాణిభయజననంబుగా గర్జిల్లుచున్నవాని, నిజపాద ఘట్టిత మహీతల ప్రచలన వేగ వేల్లిత వల్లీ పల్లవ బాహు పరిరంభణసుఖంబుఁ బాదపంబుల కాపాదించుచున్నవాని నెదుర నొక్కరక్కసుం గని; రంత వాఁడును బ్రాహ్మణ సంఘంబు ముందటఁ గృష్ణాజినావృతులై వచ్చు పాండవుల దవ్వులం గని మార్గ నిరోధియై మహాపర్వతంబునుంబోలె నున్న, నదృష్ట పూర్వ ప్రమాణంబైన వాని దేహంబుఁజూచి నిమీలితనయన యయి దుశ్శాసన కరాకృష్ట వికీర్ణవేణీభరంబు వెనువెంట నొలయం బాంచాలి పంచపర్వతంబుల నడిమి నదియుంబోలెఁబతుల నడుమ భయవ్యాకుల చిత్తయైన నింద్రియంబులు విషయరతిం బరిగ్రహించు నట్టు లేవురు నక్కోమలిం బట్టుకొని భయపడకుండ నాశ్వాసించుచున్నంత.

### [3.1.108](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.108)

క. రక్షోఘ్నమంత్రముల నా | రాక్షస మాయాపరిస్ఫురణఁ జెఱిచెఁ గ్రియా  
దక్షుఁడు ధౌమ్యుఁడు పాండవు | లీక్షించుచు నుండఁగా నహీనప్రతిభన్‌.

### [3.1.109](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.109)

వ. అంత.

### [3.1.110](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.110)

క. ప్రతివిహితమాయు నత్యా | యతభుజయుతుఁ గోపఘూర్ణితారుణ విస్ఫా  
రితనేత్రు నసురఁ జూచి భ | రతకులవర్ధనుఁడు ధర్మరా జిట్లనియెన్‌.

### [3.1.111](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.111)

వ. ‘నీ వెవ్వరి వాఁడ? వెవ్వండ? వివ్వనంబున నేల యున్న వాఁడ? వనిన వాఁ డి ట్లనియె.

### [3.1.112](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.112)

క. ‘ఏను బకాసురు ననుజుఁడఁ, | గీనాశుఁడ మానవులకుఁ, గిమ్మీరుఁ డనం  
గా నెగడుదు నీ కామ్యక | కాననమున సర్వసత్త్వఖాదనబుద్ధిన్‌.

### [3.1.113](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.113)

క. పాయక యుండుదు, రాక్షస | మాయల సమరంబు సేసి మనుజుల విగతో  
పాయులఁ జంపుచు భక్షణ | సేయుదు, నమరాదులకు నజేయుఁడఁ బోరన్‌.

### [3.1.114](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.114)

వ. నాకు వెఱచి యెల్లవారును దూరంబున దీనిం బరిహరింతురు; మీ రెవ్వ? రిందుల కేల వచ్చితిరి? మిమ్ము వధియించి యిపుడు భక్షించెద’ ననిన వానికి యుధిష్ఠిరుం డిట్లనియె.

### [3.1.115](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.115)

ఆ. ‘ఏను ధర్మసుతుఁడ, నీతఁడు భీముండు, | వాఁడు విజయుఁ, డల్లవారు గవలు;  
పాండవులము సమయపడి వనవాసంబు | సేయ వచ్చితిమి విశేషయుక్తి.’

### [3.1.116](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.116)

సీ. అనవుడు రాక్షసుం డట్టహాసంబుతో | ‘నెట్టెట్టు! భీముండె యీతఁ? డేమి  
పుణ్యమో వీని నెప్పుడు సంపఁగాంతునో | యని యున్నచోఁ దాన యరుగు దెంచె;  
నధికు మా యన్న బకాసురు, నా యిష్ట | సఖు హిడింబాసురుఁ జంపి యున్న  
ఖలు మ్రింగి జీర్ణంబు గావింతు వాతాపిఁ | దడయక మ్రింగిన తపసి యట్ల’  
ఆ. యనిన రక్కసునకు నలిగిన యగ్రజు | నలుక యెఱిఁగి వీరుఁ డర్జునుండు  
మొనసి గాండివంబు మోపెట్టె; సునిశిత | ఖడ్గపాణులైరి కవలు నంత.

### [3.1.117](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.117)

ఉ. ఘోరపరాక్రముల్‌ ప్రబలకోపపరుల్‌ పృథుసారభూరిభూ  
మీరుహపాణు లుద్ధతు లమిత్రవిఘాతులు వీరబృందబృం  
దారకు లార్చు చొండొరులఁ దాఁకిరి దారుణభంగిఁ బొంగి కి  
మ్మీర సమీరసూనులు సమీరవిధూతపయోధులట్ల యై.

### [3.1.118](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.118)

తరలము. పొరిని వారల చేతి యున్నతభూరుహాయుధముల్‌ పర  
స్పర కఠోరశిరస్థ్సలంబులపై వడిం బడి మత్తకుం  
జర శిరఃపతితంబులైన లసన్మృణాలములట్ల జ  
ర్జరిత మయ్యెఁ దదారవప్రతిశబ్ద మొప్ప నభంబునన్‌.

### [3.1.119](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.119)

వ. ఇ ట్లొక్క ముహూర్తంబు వృక్షయుద్ధంబు సేసి యాసన్నమహీరుహంబులు సమసిన నయ్యిద్దఱు శిలాయుద్ధంబునకుఁదొడంగి చేయునెడం బవనజనిక్షిప్త నిష్ఠుర శిలాహత హృదయుండై భానుంబట్టుకొను స్వర్భానుండునుం బోలెఁ గిమ్మీరుండు భీముం బట్టుకొనిన భీముండును వాని హీనబలుంగా నెఱింగి కృతాంతదండానుకారంబులైన తన బాహుదండంబుల నమ్మనుజకంటకు కటి కంఠ ప్రదేశంబులు పట్టుకొని నేలంబెట్టి దేహయష్టి విఱిచి బకుం జంపిన విధంబునఁ గిమ్మీరు విగతప్రాణుం జేసి.

### [3.1.120](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.120)

తే. ‘బక హిడింబులు హతులైనఁ బనవి పనవి | యఱచి శోకింపఁ గానక యమపురమున  
కరిగి తక్కట రాక్షస!’ యనుచుఁ దెరువు | వాయఁ బావని దత్కళేబరము వైచె.

### [3.1.121](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.121)

వ. ఇట్లు ధర్మరాజువచనంబునఁ గిమ్మీరు నశ్రమంబున వధియించి తద్వనవాసులకు రాక్షసభయం బుడిపిన మహావీరు నమ్మారుతాత్మజు ధర్మార్జుననకులసహదేవులును ధౌమ్యాది మహీసురవరులును బ్రశంసించి’ రని విదురుండు గిమ్మీరువధ సెప్పిన విని ధార్తరాష్ట్రులకు హృదయదలనం బయ్యె; నిట పాండవులు గామ్యక వనంబున నుండు నంత.

### [3.1.122](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.122)

సీ. వసుమతీరాజ్యంబువలన నిరస్తులై | మునివృత్తి నత్యుగ్రవనములోన  
నవయుచుఁ బాండుభూనాథనందను లున్న | వారని విని యతిక్రూరమతుల  
ధృతరాష్ట్రసుతుల నిందించుచుఁ బాంచాల | యాదవ వృష్ణి భోజాంధు లెల్ల  
నచ్యుత ప్రముఖులై యప్పాండవుల కడ | కేతెంచి శోకపరీతు లగుచు  
ఆ. నున్న నధికధర్మయుక్తుఁ డుపేంద్రుండు | నికృతిఁ జేసి పాపనియతబుద్ధిఁ  
బాండవులకు న ట్లపాయంబు సేసిన | ధార్తరాష్ట్రులకును దద్ద యలిగి.

### [3.1.123](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.123)

క. ‘అనిఁ గర్ణ శకుని దుర్యో | ధన దుశ్శాసన నవాస్రధారాపాతం  
బునఁ దృప్తివొందు వసుధాం | గన రాక్షస కాక గృధ్ర గణములతోడన్‌.

### [3.1.124](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.124)

క. అవినీతుల వధ్యులఁ గౌ | రవపాంసులఁ జంపి ధర్మరాజునకుఁ గురు  
ప్రవరున కొనరింతమ, యీ | యవనీరాజ్యాభిషేక మవిజితశక్తిన్‌.

### [3.1.125](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.125)

వ. అని యుగాంత్యకాల కుపిత కృతాంతాకృతి నున్న జగన్నాథు జనార్దనుం బ్రశాంతచిత్తుం జేసి యర్జునుం డతని నిట్లని కీర్తించె.

### [3.1.126](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.126)

ఆ. ‘పూజ్యుఁడవు పురాణపురుషుండ వీశుండ | వప్రమేయుఁడవు చరాచరంబు  
లయిన భూతరాసు లచ్యుత! నీయంద | పుట్టు, నిలుచు, లయముఁ బొందుచుండు.

### [3.1.127](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.127)

వ. నీవు దొల్లి గంధమాదనంబునం గందమూలఫలాశనుండవై పదివేలేండ్లు తపంబు సేసి, పుష్కరంబున నేకాదశసహస్ర వర్షంబులు జలంబు లాహారంబుగా నుండి, ప్రభాసంబను తీర్థంబున దివ్యసహస్ర వర్షంబు లేకపాదస్థితుండ వయి యుండి, బదరీవనంబునం బవనంబు భక్షించుచు నూర్ధ్వబాహుండ వయి యేకపాదంబున ననేకసహస్ర వర్షంబులు నిలిచి, సరస్వతీ సత్త్రంబున నవకృష్టోత్తరాసంగుండవై నియమకృశీకృత శరీరంబుతోఁ బండ్రెండు వర్షంబు లశేష వ్రతంబులు సలిపిన తపోనిధానంబవు. నిఖిలలోకజైత్రుండ వయి చైత్రరథంబున నుత్తమక్రతువు లనేకంబులు సేసి యొక్కొక్కక్రతువునకు నూఱేసి లక్షలు సువర్ణంబులు దక్షిణ లిచ్చిన యజ్ఞపురుషుండవు. తపోయజ్ఞంబులు రెంటను సమృద్ధతేజుండ వయి, దైత్యదానవేంద్రుల వధియించి, యింద్రున కింద్రత్వం బేకాధిష్ఠతంబు సేసిన లోకప్రభుండ, వదితికిం గశ్యపునకు నుదయించి, యింద్రానుజుండవై త్రివిక్రమంబునం ద్రిజగంబుల నభివ్యాపించిన విశ్వరూపధరుండవు.

### [3.1.128](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.128)

క. నరక శిశుపాలు రాదిగ | ధరణీకంటకుల నధికతరదర్పులఁ బ  
ల్వుర వధియింపఁగ మహి నవ | తరించిన మహాత్ముఁడవు నుతస్థిరశక్తిన్‌.

### [3.1.129](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.129)

క. అనృతము, మదమును, మత్సర | మును, గ్రోధము నను వికారములు వొరయునె ని?  
న్ననుపమ గుణముల నీ కొరు | లెన పోల్పఁగఁ గలరె సురమునీంద్రప్రణుతా!’

### [3.1.130](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.130)

వ. అని కృతాంజలి యయిన ధనంజయుం జూచి దనుజభంజనుం డిట్లనియె.

### [3.1.131](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.131)

తే. ‘నరుఁడు నారాయణుండు నాఁబరఁగు నాది | మునుల మిద్దఱ; మందు నీ వనఘ! నరుఁడ,  
వేను నారాయణుండ; ననూనశక్తి | యుతులమై మర్త్యయోనిఁ బుట్టితిమి పేర్మి?

### [3.1.132](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.132)

తరువోజ. నిరతంబుగా నేను నీవను భేద | నియమంబు లే, దైక్యనిష్ఠయ మనకు  
నిరువురకును, నీకు నిష్టుండ నాకు | నిష్టుండు, మఱి నీ కనిష్టుండ నాకుఁ  
గర మనిష్టుం, డట్లుగా నమ్ము’ మనుచు | ఘనభుజుల్‌ భువనోపకారైకమతులు  
హరియు నర్జునుఁడుఁ బ్రియంబుతోఁ దగిలి | యన్యోన్యహితభాషు లగుచుండు నంత.

### [3.1.133](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.133)

వ. అఖిల రాజలోక పరివృతుండయి యున్న నారాయణునొద్దకు వచ్చి ద్రుపదరాజపుత్త్రి ముకుళిత కరాంబుజ యయి యిట్లనియె; ‘దేవా! నిన్ను నాదిప్రజాసర్గంబునఁ బ్రజాపతివని యసితుం డయిన దేవలుండును, సత్యంబువలన యజ్ఞం బుద్ధరించుటంజేసి నిత్యసత్యమయుండవయిన యజ్ఞపురుషుండ వని కశ్యపుండును, శిరంబున దివంబును, బాదంబుల మేదినియును, లోచనంబుల సూర్యుండును, నవయవంబుల లోకంబులు నభివ్యాపించుటం జేసి సర్వమయుండ వని నారదుండును. నక్షయజ్ఞాననిధి వని సర్వమునిముఖ్యులును జెప్పిరి.

### [3.1.134](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.134)

మధ్యాక్కర. అని ననివృత్తులై పుణ్యచరితులై యాత్మప్రబోధ  
వినిహితచిత్తులై సర్వధర్మార్థవిదులయి తృప్తిఁ  
దనరెడు రాజర్షివరులకును యోగధరులకు సాధు  
జనులకు గతి నీవ నిత్యకారుణ్య! సర్వశరణ్య!

### [3.1.135](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.135)

వ. నీ యంతఃకరణ ప్రవృత్తి కగోచరం బెద్దియు లే; దయినను నా పడిన పరాభవం బెఱింగించెద.

### [3.1.136](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.136)

సీ. పార్థివప్రభుఁడైన పాండుమహీపతి | కోడల నయి, యుద్ధకుశలు లయిన  
పాండుతనూజుల భార్యనై, పూజ్యుఁడ | వైన నీ యనుజనై, యధికశక్తిఁ  
బరఁగు ధృష్టద్యుమ్ను భగినినై, ధృతరాష్ట్రు | పట్టిచే సభఁ దలపట్టి యీడ్వఁ  
బడి, పాపకర్ముచేఁ బరిధాన మొలువంగఁ | బడి, దారుణం బైన పరిభవంబు  
ఆ. పడితి; నట్టి నన్నుఁ బాండవుల్‌ సూచుచు | నుండి రొరులు వోలె నుక్కు దక్కి;  
యాపగాతనూజుఁ డాదిగాఁ గల వృద్ధ | బంధుజనులు సూచి పలుక రయిరి.

### [3.1.137](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.137)

క. శరణనినవారిఁ గరుణా | కరులయి రక్షించు పురుషకారాన్వితులే  
శరణని యఱచిన నాలిం | పర భీమార్జునుల బాహుబల మేమిటికిన్‌?

### [3.1.138](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.138)

వ. భ్రాతృ పుత్త్ర బంధుజనంబులు నాకుం గలిగియు లేని వారయి; రట్టియెడం గర్ణుండు నన్నుం జూచి నగియె.

### [3.1.139](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.139)

ఆ. కర్ణునగవు లోకగర్హితుండగు దుస్స | సేను చెయిదికంటె శిఖియ పోలె  
నడరి నా మనంబు నతిదారుణక్రియ | నేర్చుచున్నయది మహీధరుండ!

### [3.1.140](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.140)

వ. తొల్లివేదాధ్యయనంబుసేయుచు బాలకేళీవినోదంబున నున్న కాలంబునఁబ్రమాణకోటియందు సుప్తుండయిన భీమసేను నంటఁగట్టి గంగమడువునం ద్రోపించియు, విషంబుఁబెట్టియు, విషసర్పంబులంబట్టి గఱపించియు, జననీసహితులైన యేవురను వారణావతంబున లక్కయిల్లు సొనిపి యందు దహనంబుఁ బ్రయోగింపం బంచియు ననేకంబులైన యపకారంబులు సేసి, యిప్పుడు దుర్యోధనుం డధర్మద్యూతంబున రాజ్యంబు నపహరించి, రాజలోక సమక్షంబునం దమ్ము నిరాకృతులం జేసినను బరాక్రమపరాఙ్ముఖులైన పాండవులు నా పడిన పరిభవంబు నెట్లు దలఁగెద?’ రని బాష్పధారా స్నపితపయోధర యయి పాణిపల్లవంబున నయన సమ్మార్జనంబు సేయుచున్న పాంచాలిం జూచి వాసుదేవుం డిట్లనియె.

### [3.1.141](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.141)

చ. ‘తనుకుచు నున్న నీ హృదయతాప నిమిత్తమునన్‌ సురేంద్రనం  
దను పటుబాణపాతహతిఁ దద్ధృతరాష్ట్రబలంబు మృత్యుసా  
దనమున కేఁగుఁ జు; మ్మిదియ తథ్యము; నా వచనంబు దప్ప ది  
వ్వననిధు లేడు నింకిన, దివంబును రాత్రియు సంచలించినన్‌.

### [3.1.142](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.142)

వ. అనిన నర్జునుండు ద్రౌపదిం జూచి యిట్లనియె.

### [3.1.143](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.143)

వ. ‘ఈ పురుషోత్తముండు మన కిందఱకుం గుశలంబు సేయుచుం  
బాపకలంకపంకములఁ బాయఁగఁ జేయుటఁ జేసి దుర్మదో  
ద్దీపితశత్రుసంహతి హతిం బరమార్థమ పొందు; నేల సం  
తాపము నీకుఁ జేయఁగఁ ద్రిధామజయోన్నతి గల్గియుండఁగన్‌.’

### [3.1.144](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.144)

వ. అనిన సక్రోధుం డయి ధృష్టద్యుమ్నుం డిట్లనియె.

### [3.1.145](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.145)

క. ‘వినయవిహీనుల దుర్యో | ధన దుశ్శాసనులఁ బవనతనయుఁడు, రాధా  
తనయుని నరుఁ, డేఁ గుంభజు | ననిఁ జంపుదు; మేల వగవ నంబుజనేత్రా!’

### [3.1.146](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.146)

వ. అని యందఱు ద్రుపదరాజపుత్త్రి నాశ్వాసించి; రంత నచ్యుతుండు ధర్మరాజున కిట్లనియె.

### [3.1.147](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.147)

తే. ‘ద్వారవతినుండి యే యుయుధానువలన | ధారుణీశ! యింతయు విని తత్‌క్షణంబ  
యరుగుదెంచి యాపన్నుఁడ వైన నిన్నుఁ | జూచి దుఃఖోపహతమనస్కుండ నైతి.

### [3.1.148](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.148)

వ. అయ్యవసరంబున నేను మీయొద్ద నుండమిం జేసి యిట్టి దుర్వ్యసనంబు సంభవిల్లెం; గామజంబులైన స్త్రీ ద్యూత మృగయా పానంబు లను నాలుగు దుర్వ్యసనంబులం బ్రవర్తిల్లకుండఁ బ్రతిషేధింపవలయు; నందును విశేషంబుగా ననర్థమూలంబయిన పాపద్యూతంబుఁబరిహరింపనినాఁడు పాపం బగు నని హేతుదృష్టాంతంబులు సూపి, కృప ద్రోణ విదుర గాంగేయులం దోడుసేసికొని యాంబికేయు నొడంబఱిచి దుష్టద్యూతంబు సర్వ ప్రకారంబుల వారింతు.

### [3.1.149](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.149)

క. వలచి హితంబునఁ బథ్యముఁ | బలికినఁ జేకొనని ధర్మబాహ్యుల నవివే  
కుల నిగ్రహింతు; మీ కె | గ్గులు మత్సాన్నిధ్యమున నగునె యెయ్యెడలన్‌?

### [3.1.179](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.179)

వ. అంత సాల్వుండును నివృత్తుండయి ద్వారకాపురి యవరోధం బుడిగి తన సౌంభక బెక్కి క్రమ్మఱి చనియె; నంత నీ యజ్ఞంబు నిర్వృత్తం బయిన నేనరిగి బల భగ్నీకృత పాదపవనంబుల దాని, ననభిజ్ఞాత ద్వారదేశంబుల దాని, నస్వాధ్యాయ స్వాహాకార మహీసురాగారం బయిన దాని, నపేత భూషణ యోషిజ్జనంబుల దాని ద్వారవతిం జూచి, యాహుకాత్మజువలన నంత వృత్తాంతంబును నెఱింగి, సాల్వుం జంపి కాని యిప్పురంబు సొర నొల్ల నని నిశ్చయించి, దీని నప్రమాదులరై రక్షించుకొని యుండుండని బలదేవాదులం బంచి, యప్పుడ ప్రయాణభేరి సఱవం బంచి, కృత స్వస్తి వచన పురోహిత ప్రముఖ బ్రాహ్మణ వరులకు నమస్కరించి శైబ్యసుగ్రీవంబులను వాహనంబులం బూనిన దివ్యరథం బెక్కి.

### [3.1.180](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.180)

ఆ. పాంచజన్యరవముఁ బంచమహాశబ్ద | రవముఁ జెలఁగె దిశలు సెవుడు వడఁగ  
నొలసి జనుల దీవనలు మించె రమ్యమై | గరుడకేతనంబు గ్రాలెఁ జదల.

### [3.1.181](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.181)

వ. అ ట్లసంఖ్యాత చతురంగ సైన్యంబులతో నరిగి గిరి వన సరోవర సరిద్దేశంబులు గడచి మార్తికావత దేశంబున కరుగునంతకు ముందర సాల్వుండు సౌంభకారూఢుండయి సముద్రకుక్షిదేశంబునకుం బోయిన.

### [3.1.182](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.182)

క. ఏనును వాని పిఱుందన | మానక చని తచ్చమూసమాజముతోడన్‌  
భూనాథ! రణము సేసితి | నానానిశితాస్త్రవర్షణవ్యాప్తముగన్‌.

### [3.1.183](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.183)

క. వీరు లగు సాల్వయోధుల | నారాచావళులు గప్పె నా రథముపయిన్‌  
సారథిఁ దురంగముల పయిఁ | జారుధ్వజయష్టిపయి నసంఖ్యాతముగన్‌.

### [3.1.184](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.184)

వ. వాని నెల్ల నస్మదీయ గోచరంబులు గాకుండ ననేకాయుతశరంబు లేసి సాల్వుసైన్యంబుతో మహాయుద్ధంబు సేసిన.

### [3.1.185](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.185)

మ. అవనీనాథ! తదాహవాంతరమునం దస్మత్కరాకృష్ట శా  
ర్ఙ్గ వినిర్ముక్త నిశాతసాయకశతాగ్రచ్ఛిన్నమై దైత్య దా  
నవదేహప్రకరంబు వాతవిధుతార్ణఃపూర్ణ సంఘూర్ణితా  
ర్ణవకుక్షిం బడియెం గపిప్రవరసైన్యక్షిప్త శైలాకృతిన్‌.

### [3.1.186](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.186)

చ. ఘనతర దైత్య దానవ నికాయ కళేబర పాత ఘట్టనం  
దనరి యుగాంత్యకాలచలితంబునుబోలెఁ బయోధి మ్రోసె న  
వ్వనధి రవంబుకంటె ననివారితమై చెలఁగెన్‌ మదీయ వా  
హిని భట సింహనాదహయహేషిత సింధురబృంహితధ్వనుల్‌.

### [3.1.187](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.187)

వ. అట్టి మదీయ సేనోత్సాహంబును నిజసేనాక్షీణతయుం జూచి సహింపక సాల్వుండు వెండియు సౌంభకారూఢుం డయి నాతో మాయాయుద్ధంబు సేయ సమకట్టి.

### [3.1.188](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.188)

సీ. పరశు పాశాంకుశ కరవాల శూల ము | ద్గరములు నా మీఁదఁ దెరలఁ గురిసె;  
నేనును గడఁగి యద్దానవు శస్త్రముల్‌ | వాయంగఁ జేసితి; మాయఁ జేసి  
వెఱవక సాల్వుండు వెండియు నామీఁదఁ | బరుషశిలావృష్టిఁ గురిసె; వరుస  
నమరఁ దమః ప్రకాశములతో దుర్దిన | సుదిన శీతోష్ణముల్‌ గదియఁ జేసి  
ఆ. దితిసుతాధముండు శతసూర్య శతచంద్ర | శతసహస్ర వహ్నితతులు వెలుఁగ  
గగనతలము సేసెఁ బగలిది రేయిది | యని యెఱుంగ నయితి మనములోన.

### [3.1.189](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.189)

క. మనుజేంద్ర! సర్వ మాయా | పనోదనం బయిన యగ్నిబాణంబున న  
ద్దనుజ వినిర్మిత మాయా | వినివర్తనఁ జేసితిని సవిస్మయమతినై.

### [3.1.190](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.190)

వ. అట్టి యవసరంబున ద్వారవతినుండి యాహుక్రప్రేషితుండయి యొక్కరుం డతిత్వరితగతిం బఱతెంచి ‘సాల్వుచేత నక్కడ వసుదేవుండు పట్టువడియె నీ వెవ్వనితోడం గయ్యంబు సేసెదు? క్రమ్మఱి చని పురంబు రక్షించుకొను’ మనిన విని యదరిపడి ‘మహాబలపరాక్రములైన బలదేవాదులు రక్షించుకొని యుండ వసుదేవుఁ డేల పట్టువడు? నిది పోల’ దని సంశయించుచు విమనస్కుండ నయి యుండునంత.

### [3.1.191](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.191)

సీ. పుణ్యకర్మంబులు వొలిసిన నుర్వికిఁ | బ్రీతి నేతెంచు యయాతి వోలె  
భూషణదీప్తులు వొలియంగ వివృత కే | శాంబరుం డయి సౌంభకంబువలనఁ  
బఱతెంచు వసుదేవుఁ బాప నిశాచర | బల పీడ్యమాను దవ్వులను కాంచి  
యత్యంత మోహశోకాంధుండ నయిన నా | హస్తంబు వలన విస్రస్త మయ్యె  
ఆ. శార్ఙ్గ మప్రియావసన్నదేహుండనై | యుడిగి రథముమీఁదఁ బడితి నేను;  
దానిఁ జూచి భయము దగిలి మత్సైన్యంబు | దల్లడిల్లి యులిసెఁ బెల్లు రేఁగి.

### [3.1.192](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.192)

వ. అంత నెంతయుం బ్రొద్దునకుఁ దెలిసి సాల్వు సౌంభకంబున వసుదేవుం గానక దాని మాయగా నెఱింగి, పదంపడి మాయావి యయిన సాల్వుం జూచి వానిపయి నలిగి యే నేసిన నయ్యసురయు సౌంభకంబు నదృశ్యం బగుటయు.

### [3.1.193](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.193)

క. అసురుల యాక్రోశధ్వను | లెసఁగెం బదిదిశల నంత నేనును దద్రా  
క్షసుల గతాసులఁ జేసితిఁ | బ్రసభంబున శబ్దభేది బాణప్రతతిన్‌.

### [3.1.194](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.194)

వ. అంత సాల్వుండును దన సౌంభకంబుఁ బ్రాగ్జ్యోతిషంబుఁ జేసి తానును దానవుండయి పర్వతవర్షంబు నా పయిం గురిసిన.

### [3.1.195](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.195)

ఆ. పరుష విషమ భూరి పాషాణ భీషణ | గిరులు వచ్చి నన్నుఁ దెరలఁ గప్ప  
వజ్రబాణ మేసి వాని నన్నింటిని | బాచియున్న నన్నుఁ జూచి యపుడు.

### [3.1.196](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.196)

క. దారుకుఁ డిట్లనియె ‘మహా | వీరు నుపేక్షింపఁదగునె? వీనిని మాయా  
ప్రారంభు నుపేక్షింప ర | పార పరాక్రములు పోరఁ బ్రాకృతు నైనన్‌’.

### [3.1.197](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.197)

వ. అనిన వాని పలుకులు విని యలిగి యనలజ్వాలాకరాళంబయి ప్రతికూల రాక్షస యక్షగంధర్వ దైత్యదానవ భస్మసాత్కరణదారుణం బయిన చక్రంబు నభిమంత్రించి సౌంభకంబు పయి వైచిన నది యుగాంతకాల పరివేషభీషణంబయిన రవిమండలంబునుంబోలె గగనంబునం బఱచి సౌంభకమధ్యంబునం బడిన.

### [3.1.198](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.198)

చ. తడయక ఘోరదర్శన సుదర్శన పావకుచే దహింపఁగాఁ  
బడి పరమేశ్వరోగ్రశరపావకదగ్ధ పురత్రయాభమై  
యెడరి ధరిత్రి మీఁదఁ బడియెం జెడి సౌంభక; మంత సాల్వుఁడుం  
బడియె మదీయచక్రపటుపాతరయంబున రెండువ్రయ్యలై.’

### [3.1.199](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.199)

వ. అని యిట్లు సాల్వుం దన చంపిన విధంబు సెప్పి, చక్రధరుండు పాండవుల వీడ్కొని, సుభద్రాభిమన్యులం గాంచనరథం బెక్కించుకొని తోడ్కొని ద్వారవతి కరిగె; ధృష్టద్యుమ్నుండును బ్రతివింధ్యాదులైన ద్రౌపదేయులం దోడ్కొని ద్రుపదుపురంబునకుం జనియె; నిట పాండవులును రథంబు లెక్కి యాయుధంబులు ధరియించి యింద్రసేనాది మూలభృత్యు లిరువదుండ్రు ముందట రా ననేక సహస్ర బ్రాహ్మణ వరులతో ద్వైతవనంబున కరిగి; రంత ధర్మరాజు తమ్ముల కిట్లనియె.

### [3.1.200](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.200)

మధ్యాక్కర. ‘ఇది మహోగ్రాటవి, సింహశరభోరగేంద్ర శార్దూల  
మద గజాకీర్ణంబు, దీనిలోన నేమఱకుండ వలయు,  
నదియునుంగాక పరప్రయోగమాయలు గల, వెఱిఁగి  
మది నుండునది’ యన్న నన్న కిట్లను మఘవనందనుఁడు.

### [3.1.201](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.201)

వ. ‘బ్రహ్మవిదులును దపోవృద్ధులైన బ్రాహ్మణులును నఖిలలోకద్వారంబులనపత్రిహతులైన నారదద్వైపాయనాది మునివరులును నీచేత నుపాసితులయి నీ కుశలంబ కోరుచుండుదురు; భవత్ప్రతాపం బెల్లవారిని రక్షించు నివ్వనంబు సకలకాలకుసుమ ఫలభరిత వనస్పతిశాఖాశిఖారూఢమయూరకీరకోకిలాలాప మధురంబును, బక బలాక కోక కారండవ సారస రమ్యమధుకర సౌమ్య సరోవర సంకులంబును, విమలశీతల జల ప్రవాహ నదీశోభితంబును, మహర్షి గణ సేవితంబునునై యొప్పుచున్నయది; యిందుండుదమని లలితలతావితానాది రమణీయంబులయిన వృక్షమూలంబుల నేవురు వేఱువేఱ నివాసంబులు సేసి నియతాత్ములయి యిష్టంబున దేవ పితృ కార్యంబులు సేయుచుందమ్ముఁజూడవచ్చిన మహామునులకు, బ్రాహ్మణులకు మనఃప్రియంబులయిన యాహారంబులు వెట్టుచు ద్వైతవనంబున నుండునంత.

### [3.1.202](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.202)

క. పాండవులకడకు ధర్మ వి | దుండు తపోదహనదగ్ధదురితౌఘుఁడు మా  
ర్కండేయుం డను మునినా | థుం డంతేవాసిగణముతోఁ జనుదెంచెన్‌.

### [3.1.203](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.203)

వ. ఇట్లు వచ్చి వారలచేత నర్చితుండయి వనవాస క్లేశదుఃఖితులైన పాండవులను ద్రౌపదిం జూచి యమ్మార్కండేయుం డిట్లనియె.

### [3.1.204](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.204)

సీ. ‘పితృనిదేశమ్మునఁ బృథివీశ్వరత్వంబు | విడిచి సానుజుఁడై పవిత్రచరిత  
జానకిఁ దోడ్కొని చని వనంబున నున్న | రఘుకులనందను రాముఁ దొల్లి  
చూచితి; నిపుడు భూసురవంశపోషకు | సాధుజనస్తుత్యు సత్యధర్మ  
నిత్యు ధర్మజు రమణీయకీర్తిప్రియు | శమవంతుఁ జూచితి; సగర భరత  
ఆ. నల యయాతి వైన్య నాభాగులాదిగా | నాదిరాజులెల్ల నధిక ధర్మ  
సత్యయుక్తిఁ జేసి సకలలోకంబులు | వడసి భాగధేయభాగు లయిరి.

### [3.1.205](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.205)

వ. పాపసౌబలప్రయుక్తుం డయిన ధార్తరాష్ట్రునట్లు ధర్మువు దప్పినవా రెవ్వరును లేరు; మీరు ధర్మనిత్యులగు సత్యవ్రతులరు గావున మీ కిష్టసిద్ధి యగు’ నని మార్కండేయుం డరిగిన, నపరసంధ్యోపాసనాసీనుం డయిన ధర్మరాజును సాయంహోమార్థప్రజ్వలిత జ్వలనంబు లయిన యనేక సహస్ర బ్రాహ్మణాగ్ని హోత్రంబులం జూచి బకదాల్భ్యుండను మహాముని యిట్లనియె.

### [3.1.206](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.206)

ఉ. ‘భూమిసురోత్తముల్‌ ప్రకృతిపుణ్యవిధాయులు వీరు ఋగ్యజు  
స్సామపరాయణుల్‌ పరమసాధుచరిత్రులు మీకు సంతత  
ప్రేమమునన్‌ శుభోన్నతులు వెంచుచు నుండుటఁ జేసి సద్గుణో  
ద్దామ! యరణ్యవాస మిది దద్దయు నొప్పెడు మాకుఁ జూడఁగన్‌.

### [3.1.207](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.207)

వ. బ్రాహ్మణానుగ్రహంబునం జేసి తొల్లివైరోచనాదు లనేకకాలంబు లక్షయలక్ష్మీవిభవులయి సముద్రనేమి భూచక్రంబు రక్షించిరి; యనిలసహాయుం డయిన యగ్నిదేవుం డరణ్యంబులు దహించునట్లు బ్రాహ్మణ సహాయుం డయిన మహీశుండు శత్రువర్గంబు నిశ్శేషంబు సేయు; వినీతుం డయి విప్రులచేత ననుశాసితుం డయిన రాజునకు నలబ్ధలాభాది త్రితయంబు సంపన్నంబగు; బ్రాహ్మణరహితుం డయి ధర్మహీనుం డయిన రాజును బ్రజ వలవదు; ప్రజానురాగంబు లేనివానికి రాజ్యంబు సుస్థిరంబు గానేరదు; మీరు బ్రాహ్మణప్రియులరు ధర్మనిత్యుల; రెప్పుడును మీ కభ్యుదయం బగు’ నని బకదాల్భ్యుం డరిగినఁ, బాండవులుం దమ యిష్టంబున నుండి దుఃఖోపశమనంబు లయిన కథలు సెప్పుకొనుచున్న యవసరంబున ద్రౌపది ధర్మరాజున కిట్లనియె.

### [3.1.208](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.208)

ఆ. ‘వృద్ధు గొడుకుపలుకు విని క్రూరుఁడై పాప | బుద్ధిఁజేసి మిమ్ము భూతలంబు  
వెలువరించి రాజ్యవిభవంబు గొని యిప్పు | డలుక సెడి సుచిత్తుఁ డయ్యె నొక్కొ!

### [3.1.209](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.209)

ఆ. అద్దురాత్ముహృదయ మది యయఃపాషాణ | నిష్ఠురంబు; ధర్మనిధుల మిమ్ము  
నట్లు గొడుకు లెగ్గు లాడంగఁ బోయిన | వలదనండ కలహవాంఛఁ జేసి.

### [3.1.210](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.210)

సీ. విమలహర్మ్యంబుల విహరించువారలఁ | బ్రియమహార్హాసన శయనరతులఁ  
జందనాగురులిప్త చారుసర్వాంగుల | నతనరనాథసేవితుల మిమ్ము  
వనమునఁ గ్రుమ్మరువారిఁగాఁ గుశబ్రుసీ | శయనాభిరతులఁగా నియతరూక్ష  
భూరేణుధూసరీభూతవిగ్రహులఁగా | ద్రుతవన్యమృగ నిషేవితులఁ గాఁగ  
ఆ. నిట్లు సూచి చూచి యే నెట్లు చిత్తోప | శాంతి సేయుదాన? సకల భోగ  
విషయవిరతిఁజేసి విధియును ధృతరాష్ట్రు | నట్లు మీకు నహితుఁడయ్యె నొక్కొ!

### [3.1.211](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.211)

క. భవదాజ్ఞానిగళంబునఁ | దవిలి పరాక్రమము విడిచి ధరణీశ్వర! నీ  
యవరజు లిడుమలఁ బడి కడుఁ | జివికిరి చెఱఁబడిన సింహశిశువుల భంగిన్‌.

### [3.1.212](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.212)

ఆ. పరనరేంద్రమకుటపద్మరాగద్యుతి | నరుణ మగు భవత్పదాబ్జయుగము  
పరుషధాతుశిలలపై నిప్పు డరుగుట | నరుణ మయ్యెఁ బర్వతాంతరముల.

### [3.1.213](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.213)

క. అనవరత సౌఖ్యసంపదఁ | బెనుపొందుచు నుండు మీకు భీకర కాంతా  
ర నివాసాయాసంబుల | ననఘా! యిబ్భంగి నవయ నలమట వొడమెన్‌.

### [3.1.214](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.214)

వ. నిత్యంబునుం బదివేవురు బ్రాహ్మణులు బ్రహ్మవిదులు పసిండితళిగల నిష్టాన్నంబులు గుడిచి తృప్తులయినం దద్భుక్తశేషం బుపయోగించుచుండు నీకు వన్యమూలఫలాశనంబు లుపయోగించుచు నన్యులయందుఁ గ్రోధంబు విడిచి యునికి యుచితంబు గాదు.

### [3.1.215](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.215)

సీ. పదివేల గజముల బలమున విలసిల్లు | ననిలసుతుండు కాఱడవిలోనఁ  
గ్రుమ్మరి కాయలుఁ గూరలు దిని పేద | వడినఁ జూచియు, దీర్ఘబాహుయుగళుఁ  
డయ్యును బాహుసహస్రంబు కలిగిన | యర్జునుకంటె బలాఢ్యుఁ డగుచు  
నేకవేగంబున నేనమ్ము లొక్క య | మ్మేసిన విధమున నేయ నేర్చు  
ఆ. నర్జునుండు వనమృగావలిఁ గలిసి యి | ట్లున్నఁ జూచియును సుఖోచితాత్ము  
లైన కవలు దీనులై యున్నఁ జూచియు | నుపశమంబుఁ దాల్చి యుండఁ దగునె?

### [3.1.216](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.216)

వ. క్షమయును దేజంబును నయ్యయికాలంబులఁ బ్రయోగింపనేరని రాజునకుం బ్రజానురాగ ప్రతాపంబులు లేవను నీ యర్థం బితిహాసంబున వినంబడు; క్షమా తేజంబులలోన నెయ్యది విశేషంబు దానిన నిర్ణయించి చెప్పు మని బలీంద్రుండు దొల్లి తన పితామహుం డయిన ప్రహ్లాదు నడిగిన నాతండు బలీంద్రున కిట్లనియె.

### [3.1.217](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.217)

ఆ. ‘క్షమయ తాల్చియుండఁ జన దెల్ల ప్రొద్దుఁ దే | జంబ తాల్చియుండఁ జనదు పతికి;  
సంతతక్షముండు సంతతతేజుండు | నగుట దోష మందు రనఘమతులు.

### [3.1.218](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.218)

వ. అది యెట్లనిన నిత్యక్షమాన్వితుండయిన వానికి భృత్యులు వెఱవక యవమానంబు సేయుదు; రర్థంబుల యం దధికృతులైన వారలు ధనంబు లపహరించి దర్పంబు సూపుదురు; మఱి నిత్యతేజో -ధికుండైన వాఁ డతిక్రూరదండంబున సర్వజనసంతాపంబు సేయుచు గృహగతంబైన సర్పంబునుం బోలె నెప్పుడు నుద్వేగ కరుం డగుం; గావునఁ గాలోచితంబులుగా క్షమాతేజంబులు గల్పించునది. యథాకాల కల్పిత క్షమా తేజుండైన వానికి నుభయలోకసిద్ధి యగు’ నని బలీంద్ర ప్రహ్లాద సంవాదంబు సెప్పి వెండియు ద్రౌపది యిట్లనియె.

### [3.1.219](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.219)

తే. ‘ఆది నపరాధ మొక్కటి యైన నదియు | నల్పమైనను క్షమియించు నదియుఁ గాక  
చెనసి యపరాధములు పెక్కు సేయుచున్న | పాపకౌరవ్యులకు సహింపంగ నేల?

### [3.1.220](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.220)

క. ఇది తేజంబున కవసర; | ముదితక్రోధుండ వగుమ యొక్కించుక; దు  
ర్మదు లగు సుయోధనాదుల | నదయుల వధియింతు రుగ్రులై నీ తమ్ముల్‌.’

### [3.1.221](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.221)

వ. అనిన ధర్మరా జిట్లనియె.

### [3.1.222](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.222)

సీ. ‘క్రోధంబు పాపంబు, గ్రోధంబునన చేసి | యగుఁ జువ్వె ధర్మకామార్థ హాని.  
గడుఁగ్రోధి గర్జంబు గానండు, క్రుద్ధుండు | గురునైన నిందించుఁ, గ్రుద్ధుఁడైన  
వాఁ డవధ్యులనైన వధియించు, మఱి యాత్మ | ఘాతంబు సేయంగఁ గడఁగుఁ గ్రుద్ధుఁ,  
డస్మాదృశులకు ధర్మానుబంధుల కిట్టి | క్రోధంబు దాల్చుట గుణమె చెపుమ?  
ఆ. యెఱుక గల మహాత్ముఁ డెఱుకయ న్జలముల | నార్చుఁ గ్రోధ మను మహానలంబుఁ,  
గ్రోధవర్జితుండు గుఱుకొని తేజంబు | దాల్చు దేశకాలతత్త్వ మెఱిఁగి.

### [3.1.223](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.223)

క. క్షమ గల వానికిఁ బృథ్వీ | సమునకు నిత్యంబు విజయసంసిద్ధి యగున్‌;  
క్షమి యైనవాని భుజవి | క్రమము గడున్‌ వెలయు సర్వకార్యక్షమమై.

### [3.1.224](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.224)

వ. తేజఃప్రభవంబులైన యమర్ష దాక్షిణ్య శౌర్య శీఘ్రత్వంబు లను నాలుగు గుణంబులు క్షమావంతునంద వీర్యవంతంబులగుఁ; దొల్లి కశ్యపగీతలైనగాథలయందీ యర్థంబు వినంబడు, వినుము; వేదంబులు యజ్ఞంబులు శౌచంబును సత్యంబును విద్యయు ధర్మువు సచరాచరం బయిన జగమంతయు క్షమయంద నిలిచినవి; తపస్స్వాధ్యాయ యజ్ఞకర్తలయు బ్రహ్మవిదులయుం బడయు పుణ్యగతులు క్షమావంతులు వడయుదు; రదియునుంగాక, కృష్ణ ద్వైపాయన భీష్మ విదుర కృపద్రోణ సంజయ ప్రభృతులు నా యుపశమంబ కీర్తింతు; రుపశమ హీనుండయిన దుర్యోధను కారణంబున ధార్తరాష్ట్రుల కెల్లం బ్రళయం బగు’ ననిన ద్రౌపది వెండియు నిట్లనియె.

### [3.1.225](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.225)

మధ్యాక్కర. ‘క్షమయంద చిత్తంబు నిల్పి నిర్గతకల్మషబుద్ధిఁ  
గ్రమమున ధర్మువునంద వర్తిల్లు కరుణాత్ము నిన్ను  
నమర ధర్మంబు రక్షించుఁ బ్రీతితో నని శత్రులందు  
సమబుద్ధి సేయంగఁ జనునె నీకు నజాతశత్రుండ!

### [3.1.226](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.226)

ఆ. ధర్మదూరులైన ధార్తరాష్ట్రులయంద | ధర్ము వేమి సేయు ధరణినాథ!  
నికృతిపరులయందు నికృతి సేయనివారు | వారి నికృతిఁజేసి వధ్యు లండ్రు.

### [3.1.227](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.227)

క. ఆర్యులకు విహీనతయు న | నార్యుల కున్నతియుఁ జేసి యవినీతుఁడ వై  
కార్యము దప్పితి; నీకు న | నార్యులు చుట్టములె, యార్యు లరులె విధాతా!’

### [3.1.228](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.228)

వ. అని, విధాతృని ధర్మువు నాక్షేపించు ద్రౌపదిం జూచి ధర్మ రాజిట్లనియె; ‘నాస్తికులయట్లు ధర్మాభిశంకినివై దైవ దూషణంబు సేసెదు; శిష్టచరితంబైన ధర్మంబు నధిక్షేపించుచున్న దుర్మతికిం బ్రాయశ్చిత్తంబు లేదు; ధర్మువు దప్పక నిత్యులై జీవించుచున్న మైత్రేయ మార్కండేయ వ్యాస వసిష్ఠ నారద ప్రభృతులం బరమయోగధరులం బ్రత్యక్షంబ చూచెదము; వీరెల్ల నన్ను ధర్మపరుండని మన్నింతు; రన్యు లన్యాయంబు సేసి రేనియు నే నేల ధర్మువు దప్పుదు?

### [3.1.229](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.229)

క. ధీరమతియుక్తిఁ జేసి వి | చారింపఁగ నిక్కువంబు సర్వజన స్వ  
ర్గారోహణసోపానం | బారఁగ ధర్మంబ సూవె యతిరమ్యంబై.

### [3.1.230](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.230)

వ. తపస్స్వాధ్యాయ బ్రహ్మచర్యదాన ధర్మ యజ్ఞంబులను పుణ్యకర్మంబు లఫలంబు లగునేని వీనినేల ఋషిగణంబులు సేవింతురు; నీ జన్మంబును ధృష్టద్యుమ్ను జన్మంబును బుణ్య కర్మ ఫల సద్భావంబునకు నిదర్శనంబులు గావె? మఱి పుణ్యకర్మఫలంబులు గల యట్ల పాపఫలంబులును గలవు; తొల్లి బ్రహ్మ పుత్త్రులకుం గర్మఫల సద్భావంబుసెప్పె; నందుఁగశ్యపుండు ధర్మప్రబోధనంబునం జేసి పుణ్యఫల ప్రాప్తుండయ్యె; విధాతృ నియోగంబునం బుణ్యపాప ఫలంబు సంప్రాప్తం బగు; విధాతృ ననుగ్రహంబునన కాదె పుణ్యకర్మంబులు ప్రవర్తించి మర్త్యు లమర్త్యత్వంబును బొందుదు’ రనిన విని ద్రౌపది యిట్లనియె.

### [3.1.231](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.231)

ఆ. ‘కర్మఫలము లేదు, కర్మ ఫలాప్తికిఁ | గారణంబు విధియుఁ గా దనంగ  
నంత యెఱుకలేనె యార్తనై విధి చెయ్ది | కలసి పలికితిం బ్రియంబు దప్పి,

### [3.1.232](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.232)

ఆ. వేదశాస్త్రములును విధివిధానములును | నప్రమాణ మను దురాత్మకులకుఁ  
బుణ్యగతులు లేమి భూనాథ! యెఱుఁగని | దానఁగాను ధర్మతత్త్వయుక్తి.

### [3.1.233](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.233)

వ. తొల్లి నీతిమంతులైన బ్రాహ్మణులు మదీయ జనకునకుం జెప్పంగ వింటి; నెఱుక గలవారికిం గర్మంబు గర్తవ్యంబు; గర్మరహితులయి స్థావరంబులయట్లు జనులు జీవింపనేర; రల్పఫలంబునైనను గర్మంబుఁ బ్రవర్తించుచున్నవారిం జూచెదము; దైవమానుషంబులు గర్మఫలప్రాప్తికి నిమిత్తంబులు; పురుషుండు మనంబున నర్థసిద్ధి నిశ్చయించి కర్మంబునందుఁ గృతోత్సాహుండు గావలయు; నట్టివానికి దైవంబు సహాయం బయి కర్మసిద్ధి గావించు.

### [3.1.234](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.234)

మధ్యాక్కర. తిలలందుఁ దైలంబు గాష్ఠములయందుఁ దిరముగా నగ్ని  
గలుగు టెఱింగి యుపాయపూర్వము గడఁగి తత్సిద్ధి  
యలయక యుత్సాహవంతుఁడు వడయున ట్లనుత్సాహ  
మొలసి దైవపరుఁ డిది వడయంగను నోపునె యెందు.

### [3.1.235](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.235)

మధ్యాక్కర. కడు నిమ్ముగా దున్ని బీజములు సల్లి కర్షకుం డున్నఁ  
దడయక వర్షంబు గురిసి కావించుఁ దత్ఫలసిద్ధి  
నడుమఁ బర్జన్యుఁ డనుగ్రహింపనినాఁ డేమి సేయుఁ  
గడఁగి చేయంగలవానిఁ జేయును గాక కర్షకుఁడు.

### [3.1.236](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.236)

వ. కర్మఫలంబులు దైవమానుషసిద్ధం బులయిననుం బురుషోత్సాహ సముపార్జితంబులయిన నవి సుస్థిరంబు లయి సురక్షితంబులయి వర్తిల్లు; ననీహమానుండయి దైవపరుండయిన వాఁడు నీరిలోని యాన పాత్రంబునుంబోలె నవసన్నుండగుం గావునఁ గర్మఫలసిద్ధి నిశ్చయించి యుత్సాహవంతుండవయి నీ యనుజుల పరాక్రమంబునం బరుల జయించి మనయందలి యర్థకృశత్వం బపనయింపు ‘మనిన, యాజ్ఞసేని వచనంబుల కనుగుణంబుగా భీమసేనుండు ధర్మరాజున కిట్లనియె.

### [3.1.237](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.237)

మ. ‘పితృపైతామహమైన రాజ్య మరినిర్భేద్యంబు, గాండీవిచే  
నతిగుప్తంబు, బలారికైనను నహార్యం బిట్టి దానిన్‌ సుదు  
ర్మతి నన్యార్థము సేసి నీకుఁ జనునే మర్త్యేశ! యుగ్రాటవిన్‌  
వ్రతముల్‌ సల్పుచు ధర్మలేశచరణవ్యాసక్తి నిట్లుండఁగన్‌.

### [3.1.238](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.238)

క. ఆమిషము సింహములచే | గోమాయువు గొన్నయట్లు కువలయరాజ్య  
శ్రీ మనచేఁ గొని కౌరవుఁ | డేమని తలఁచునొకొ బుద్ధి నిష్టులుఁ దానున్‌.

### [3.1.239](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.239)

క. దుర్మతులను దుర్జనులను | ధర్మస్థితి నోర్వఁదగునె ధరణీశ్వర! దు  
ష్కర్ములగు ధార్తరాష్ట్రుల | పేర్మి యడంగింపఁ గడఁగు పృథుభుజశక్తిన్‌.

### [3.1.240](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.240)

వ. ధర్మకామప్రభవంబయి సర్వార్థసాధనంబయిన యర్థంబు విడిచి మిత్త్రుల కప్రియంబు నమిత్త్రులకు హర్షం బునుంగా మునివృత్తిం జేకొని ధర్మువు ధర్మువనుచు ధర్మువునందు చిత్తంబు నిలిపి దుర్బలునట్లు నిర్వేదింపఁ దగునె?

### [3.1.241](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.241)

ఆ. బాహుబలము మెఱసి పరుల సంపదలు సే | కొనఁగ లావులేని కుత్సితుండు  
నియతదుఃఖవృత్తి నిర్వేద పరుఁడగుఁ | గాక, నీకుఁ దగునె కౌరవేంద్ర!

### [3.1.242](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.242)

చ. నరనుత! నీ యనుజ్ఞఁగొని నాఁడ విరోధుల నెల్లఁ బోరిలో  
సరభసవృత్తి నుక్కడఁగఁ జంపితిమేని మహోగ్రకాననాం  
తరముల నుండకుండ నతిదారుణదుర్మృగ సంగమంబునం  
బొరయక యుండఁగా మనకుఁ బోలు నమందమనఃప్రియంబుగన్‌.

### [3.1.243](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.243)

క. సమయాతిక్రమభీతిని | క్షమాయుతులమైన మనలఁ గౌరవులు పరా  
క్రమహీనులుగాఁ దలఁతురు | సమరోత్సాహంబు విడిచి జడమతి నున్నన్‌.

### [3.1.244](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.244)

తే. తగిలి నిత్యంబు నేకాంతధర్మనిరతుఁ | డగుట యుక్తమె పురుషున? కట్టి వాని  
వెలయ నర్థకామంబులు విడుచుఁ బ్రాణ | విగతు సుఖదుఃఖములు రెండు విడుచునట్లు.

### [3.1.245](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.245)

సీ. ధర్మ కామంబులు దఱుగంగ నర్థార్థి | యగువాఁడు పతితుఁ డౌ; నర్థసేవ  
నర్థార్థముగఁ జేయు నతఁ డుగ్రవనములో | గోరక్ష సేయు నక్కుమతిఁబోలు;  
నర్థ ధర్మములకు హానిగాఁ గామార్థి | యగు నాతఁ డల్పజలాశయమున  
జలచరం బెట్టు లజ్జలములతోఁ జెడు | నట్లు కామంబుతో హానిఁ బొందు;  
ఆ. నర్థ ధర్మములు మహాబ్ధి మేఘము లట్టు | లుభయమును బరస్పరోదయమ్ము;  
లిట్లుగాఁ ద్రివర్గ మెఱిఁగి సామ్యమున సే | వించువాఁడు సర్వవిత్తముండు.

### [3.1.246](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.246)

వ. భవదాచరితంబయిన యీ ధర్మం బర్థకామంబులక కాదు, నీకును నీ బాంధవులకును బాధాకరంబు; దాన యజ్ఞసత్పూజలు గావింప నర్థహీనున కశక్యంబు; జగంబులు ధర్మమయంబులు; ధర్మువునకు మిక్కిలి యొండెద్దియు లే; దయినను నర్థార్థంబు గాని ధర్మువు క్షత్త్రియుల కయుక్తంబు.

### [3.1.247](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.247)

ఉ. శత్త్రుల నాజి నోర్చుటయు, సర్వభయంబులఁ బొందకుండఁగా  
ధాత్త్రిఁ బరిగ్రహించి యుచితస్థితిఁ గాచుటయుం, బ్రియంబుతోఁ  
బాత్త్రుల కర్థ మీగియును, బ్రాహ్మణపూజయుఁ జువ్వె! యుత్తమ  
క్షత్త్రియధర్మముల్‌ సుగతికారణముల్‌ విపులార్థమూలముల్‌.

### [3.1.248](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.248)

వ. కేవల ధర్మాచరణంబు శత్రుజయంబునకు సాధనంబు గాదు; నికృతిపరులయందు నికృతియు వలయుఁ; బూర్వభ్రాతలైన యసురుల నమరులు నికృతినగాదె నిర్జించిరి; కావున నీవు సమయధర్మరక్షణవ్రతం బుడిగి శత్రువుల జయింప నుద్యోగింపుము.

### [3.1.249](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.249)

క. జయశీలివైన నీకుం | బ్రియ మొనరింపంగ నున్న పృథుయశులు ముదా  
శ్రయు లగుదురు సృంజయకే | కయ యదు పాంచాలు రాదిగాఁగల సుహృదుల్‌.

### [3.1.250](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.250)

తే. మిత్త్రసంపన్నుఁ డైన నమిత్త్రు మిత్త్ర | బలముతోడ భేదించి దోర్బలముఁ జలముఁ  
గలిగి దేశబలంబును గాలబలముఁ | గలుగువాని కసాధ్యంబు గలదె యెందు?

### [3.1.251](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.251)

తే. బలము గలవానిఁ బలువురు బలవిహీను | లొక్కటై కూడి నిర్జింతు రుత్సహించి  
మధువుఁ గొన నుత్సహించిన మనుజుఁబట్టి | కుట్టి నిర్జించు మధుకరకులమునట్లు.

### [3.1.252](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.252)

వ. శ్వదృతియందలి దుగ్ధంబునుం బోలె దుర్యోధను రాజ్యంబు దూష్యంబగుటఁ బౌర జానపద బ్రాహ్మణ వరులు నీ కనురక్తులయి భవద్రాజ్యంబ వలచి యుండుదురు; దీని నేల యెడ సేసెదు? సర్వాయుధ సనాథంబయిన రథం బెక్కి గజపురంబున కభిముఖుండవై విజయప్రయాణంబు సేయుము.

### [3.1.253](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.253)

మ. ప్రణుతక్షాత్త్రగుణంబు విక్రమము దర్పం బేర్పడన్‌ విక్రమ  
క్షణదానం బొనరింపు మీ క్షణమ; విఖ్యాతంబుగా సంగరాం  
గణమధ్యంబునఁ జేయు మర్జునబృహద్గాండీవ నిర్ముక్త మా  
ర్గణ ధారావళి ధార్తరాష్ట్ర కదళీకాంతార విచ్ఛేదమున్‌.

### [3.1.254](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.254)

క. బహు వాహ సుభట హస్తిక | సహితులు బలవంతులని విచారింపకు నీ  
యహితులు మద్బాహుగదా | నిహతికి మార్కొనఁగఁ బోర నిలువం గలరే?

### [3.1.255](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.255)

క. అరివరుల నోర్చి సాగర | పరివృత భూచక్రమెల్లఁ బాలింపు; ప్రజా  
పరిపాలనంబు కంటెను | ధరణీశ! విశేష మొండు ధర్మువు గలదే?

### [3.1.256](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.256)

వ. రాజ్యపదస్థుండైన క్షత్త్రియుండు భూరిదక్షిణంబులైన యజ్ఞంబుల దేవబ్రాహ్మణులం దృప్తులం జేసి బ్రాహ్మణులకు నగ్రహారంబులు గోసహస్రంబులు నిచ్చి దురితంబులవలనం బాసి తమోవిముక్తుండైన చంద్రుండునుం బోలె వెలుంగు’ ననిన భీమసేనునకు ధర్మరా జిట్లనియె.

### [3.1.257](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.257)

ఉ. ‘నీ వచనంబు ధర్మ్యము, వినీతము, నీతియుతంబు, నిష్ట సి  
ద్ధ్యావహ, మత్యుదార మిదియైనను నిప్డు దలంపఁగా విచా  
రావసరాప్తికిన్‌ విషయమైనది; కార్య ఫలంబు లెల్ల స  
ద్భావమునన్‌ విచారసులభంబుల యండ్రు విచారపారగుల్‌.

### [3.1.258](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.258)

క. వనమునఁ బండ్రెండేండ్లును | జనపదమున నెఱుఁగకుండ సరి నొక వర్షం  
బును జలుపఁ బూని సత్యము | దనరఁగఁ జేసితిఁ బ్రతిజ్ఞ దగ వృద్ధసభన్‌.

### [3.1.259](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.259)

చ. అలఘుగుణంబులం దధికుఁడైన మహాత్ముఁడు రాగకోపమా  
యలఁ బడి, యక్షమావివశుఁ డై, యచిరాంశులతావిలాసచం  
చలమగు లక్ష్మి కాసపడి, సత్యము ధర్మువుఁ దప్పి సత్సభా  
వలిఁ దగువారియొద్దఁ దగువాఁడయి సద్విధి నుండ నేర్చునే?

### [3.1.260](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.260)

వ. ఏ నెట్లును సత్యసమయం బతిక్రమింప నోప; శుభోదయకాలంబుఁ బ్రతీక్షించి యుండుము; రాజ్యంబులుఁ బుత్త్రులును ధనంబును యశంబును సత్యంబునకు సమంబులు గా’ వనిన భీమసేనుం డిట్లనియె.

### [3.1.261](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.261)

ఆ. ‘అంతకుండు జనుల కాసన్నుఁడై యుండ | నిమిషమాత్రమేని నిశ్చయింపఁ  
దగని జీవనంబు దద్ద సుస్థిరముగాఁ | జేసి కార్య మెడయుఁ జేయఁదగునె?

### [3.1.262](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.262)

వ. శరీరికి మరణంబు నియతంబు; మరణంబునకు ముందర వైరంబు దీర్పనివాని జన్మంబు నిరర్థకంబు; సకల రాజ సమక్షంబునం బరులచేత నట్లు మన పడిన పరిభవంబునకుం బ్రతీకారంబు సేయునంతకు రేయునుం బగలును నా హృదయంబు దపించుచుండు; నాకంటె నర్జున నకుల సహదేవులుం గుంతీదేవియు నంతస్తాపంబున నెంతయు సంతప్తు లగుచున్నవారు.

### [3.1.263](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.263)

క. వీరల దుఃఖము దీర్పక | క్రూరనికారులగు రిపులకును ముదముగ ను  
గ్రారణ్యములో ధర్మువుఁ | గారుణ్యముఁ దాల్చి యునికి కార్యమె నీకున్‌?

### [3.1.264](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3.1.264)

వ. ఇది బ్రాహ్మణ ధర్మంబుగాని క్షత్త్రియ ధర్మంబు గాదు; మనుప్రణీతంబులైన రాజధర్మంబులు నీ యెఱుంగనియవి లేవు; శత్రుసంహారంబు సేయని నాఁ డత్యంతహాని యగు; నట్లుంగాక.

_First 200 of 1,924 passages. [Read on](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3)_

---
Source: [https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.3) · Pramāṇa
