<!-- Pramāṇa, a library of Indian primary sources · https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2 -->

[Pramāṇa](https://indike.org/pramana/) › [Indian literature](https://indike.org/pramana/in) › [Epic, Poetry, Drama & Narrative](https://indike.org/pramana/in.lit) › [The Mahābhārata and its versions](https://indike.org/pramana/in.lit.mahabharata) › [Mahābhāratas in Indian regional languages](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa) › [Andhra Mahabharatamu](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra) › 4.2

# Andhra Mahabharatamu 4.2: విరాటపర్వము — ద్వితీయాశ్వాసము

Āndhra Mahābhāratamu 4.2

- **Language:** Telugu

### విరాటపర్వము — ద్వితీయాశ్వాసము

### [4.2.1](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.1)

క. శ్రీమదపాంగాలోకన | ధామసకృత్సంగ రూఢ తాదృశ విభవో  
ద్దామాశ్రితలోకా! లో | కామయ నిర్హరణ నిపుణ! హరిహరనాథా!’

### [4.2.2](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.2)

వ. దేవా! వైశంపాయనుండు జనమేజయున కి ట్లనియె; నట్టియెడ ధర్మసూనుండు సభాజనంబుల యుల్లంబులు రంజిల్ల రాజునకు వినోదంబులు వివిధోదాత్త ప్రకారంబులఁ జలుపుచు, నొక్కొక్కమాటు మధుర ప్రసంగంబుగా నాడిన నెత్తంబున గెలిచిన విత్తంబులు తమ్ముల కొసంగుచుండు; వాయునందనుండు వంటకు మిగిలిన మాంసంబు లమ్మునెపంబున నిచ్చలు సహోదరులకు నిచ్చుచుండు; వివ్వచ్చుండు సంగీత ప్రసంగంబున మెచ్చువడసిన కనకాంబరాదులు సోదరులకుం జేర్చుచుండు; నకులుండు దురంగంబుల గ్రాసంబులం గనిన ధనంబులు తోడంబుట్టువులకుఁ బెట్టుచుండు; సహదేవుండు గోవులం జూచి భూవల్లభుండు సంతసిల్లిన సమయంబున సముపార్జితంబు లగు పదార్థంబులన్నియు నన్నలవశంబు సేయుచు వారలకు గోరసంబులం దుష్టి సలుపుచుండు; ద్రౌపది త న్నరసికొని తిరుగుచున్న వీరలం గన్నులారం జూచుచు నుచితంపు నడవడి మెలంగుచుండు.

### [4.2.3](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.3)

తే. ఇట్లు దమతమ వర్తిల్లు నెడల సకల | జనములకు హృదయానురంజన మొనర్చి  
తాల్మి, పుయిలోట, యడఁకువ, తగవు మెలపు | నెఱితెఱంగు, వాటింపంగ నేర్పు గలిగి.

### [4.2.4](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.4)

క. ఉన్నతఱి వివిధదేశో | త్పన్నులు నద్భుతవిధాయి బలవిక్రమ సం  
పన్నులు నగుమల్లులు విభ | వోన్నతుఁడగు విరటుపాల నుద్భటవృత్తిన్‌

### [4.2.5](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.5)

క. తమలోన మాటలాడెడు | సమయంబున నొక్క రుఁడు విశాలోరస్కుం  
డమితబలుఁడు, పంచానన | సమమూర్తిస్ఫూర్తి యధిక సంరంభమునన్‌.

### [4.2.6](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.6)

వ. అన్నరపతి కట్టెదుర నిల్చి మ్రొక్కి భుజాస్ఫాలనంబు సేసి యిట్లనియె.

### [4.2.7](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.7)

తే. ‘నేల నాలుగు సెఱఁగుల నృపుల కొలువు | లందు నేను వర్తించితి నవనినాథ!  
యగ్గలించి, నా యెదుర బాహప్పళించి | కడఁగఁజాలెడు మల్లులఁ గాన నెందు.’

### [4.2.8](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.8)

చ. అనునెడ వాని యుగ్రసమదాకృతియుం, బటువాక్యవృత్తియుం,  
గని, విని, మల్లులెల్ల భయకంపితమూర్తులు దాల్చి మాఱువ  
ల్కను, గనువిచ్చి చూడను, మొగం బెగయింపను జాలకున్న న  
జ్జనపతి వేడ్క మ్రోడుపడు చందము గాంచి యుధిష్ఠిరుం డనున్‌.

### [4.2.9](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.9)

క. ‘వీనికి మార్కొనఁజాలెడు | దానికిఁ దగువాని ధర్మతనయుని పురిలో  
నానానియుద్ధలంపటు | నే నొక్కనిఁ గంటి నిపుణుఁ డిందుల కతఁడున్‌.

### [4.2.10](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.10)

క. మన బానసీఁడు వలలుం | డను శూద్రుఁడు నాకుఁ దెల్ల; మధిక బలుల నో  
ర్చినవాఁ డనేక మల్లుల | నిను మెచ్చింపంగఁ జాలు; నిజ మిది యధిపా!

### [4.2.11](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.11)

క. అనవుడు భూపతి పిలువం | బనిచె; నతని నతఁడు నపుడ భయభక్తులతోఁ  
జనుదెంచి, మల్లవర్గముఁ | గని మై వెఱుగంగ నిలిచెఁ గౌతూహలియై.

### [4.2.12](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.12)

వ. ఇట్లు నిలిచిన పవనతనయు నవలోకించి, యవనీవల్లభుం డమ్మల్లముఖ్యుం జూపి, ‘యితనితోడి యుద్ధంబునకు సన్నద్ధుండవు గ’ మ్మనిన నతండును ధర్మతనయు కనుసన్న గనుంగొని యమ్మత్స్యవిభునకు వినయంబుతో నిట్లనియె.

### [4.2.13](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.13)

తే. ‘అధిప! ధర్మజుపాల నున్నప్పు డతని | వేడుకకుఁ దగఁ బెనఁగుదు వింతలైన  
జెట్టిమల్లులతో, నిప్పు డట్టువోలె | నీదు వేడ్కకుఁ బెనఁగెద నేర్చినట్లు.’

### [4.2.14](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.14)

వ. అని మెత్తన యియ్యకొని, గర్జించి, గజాలస్యంబునం బ్రాంగణంబు సొచ్చి, భూపాలుని ముందట భుజాస్ఫాలనంబు సేసి, మ్రొక్కి మరలునెడ, నంతకుమున్న యమ్మల్లవరుండు నరపతి యనుమతి వడసి, కృతపరికర బంధుండై యరుగుదెంచి యచ్చట నునికింజేసి యతండును ననిలసుతుండునుం బరస్పర మూర్తుల నవలోకించి యుద్ధరంగంబు మన్ను ఫాలప్రదేశంబున ధరియించి శరీరంబులపైఁ జల్లుకొని రెండు సేతుల మునివ్రేళ్ళను గొండొక పుచ్చికొని యొండొరుల దెసకు వైచి, యున్నతంబులగు నపసవ్య కరంబుల నాకుంచిత సవ్య బాహు తలంబుల నప్పళించు చప్పుళ్ళు గలసి యొక్కరుండ మల్లసఱచిన చందంబున వీతేర వింతతానకంబుల నిలిచి కదిసిన యప్పుడు వృకోదరుండు.

### [4.2.15](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.15)

సీ. ఉపతాయిలోఁ దన కొదవిన తోరహ | త్తము సూపి వ్రేయక సమదవృత్తిఁ  
బాసి క్రమ్మఱఁ జేరు; బలువిడి వాఁడు పై | నదరిన జరగక యవనిఁ గ్రుంగి  
నిలుచు; నొత్తొరువున వలచినయప్పుడు | గొనిపోవు; నవలీలఁ గూలవైచు;  
జళికి పట్టిస మను సన్నపు విన్నాణ | ములు దొరకొన్నను ముట్టఁగొనఁడు;  
తే. కాలిదెసఁ జొరవచ్చుట గానిపించి | యుడుగు; సీసానఁ బట్టియు నుప్పళించుఁ;  
బోవనిచ్చు; మగుడ నేచి పోరఁజేరు | నెడల సరిసేయ నగు తడవీక హత్తు.

### [4.2.16](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.16)

వ. మఱియు ననేకగతుల యోజలు మెఱయుచుఁ గొండొకసేపు విరాటునకు వినోదంబు సలిపి.

### [4.2.17](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.17)

ఆ. కచ్చ యమరఁ బట్టి కాళ్ళును జేతులు | వ్రేల మత్తగజములీల మెఱయ  
ముష్టి బలువు నెఱయ ముక్కున వాతను | నెత్తురొలుక మల్లు నెత్తివైచె.

### [4.2.18](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.18)

వ. ఇవ్విధంబున విసరి నేలతో వ్రేసి వీఁపున మండివెట్టిన.

### [4.2.19](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.19)

క. పెలుకుఱి తాళం బీ మదిఁ | దలఁచి యనువుగాక ధరణితలము గరతలం  
బుల నప్పళించె వాఁ డ | క్కొలు వార్వఁగ విఱిచి మెఱసెఁ గుంతీసుతుఁడున్‌.

### [4.2.20](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.20)

వ. ఇవ్విధంబున మహాబలుపట్టి యాజెట్టి నెట్టన గెల్చిన మత్స్యపతి మెచ్చి తన కిచ్చిన ధనంబు లచ్చటి (యర్థి) జనంబుల కిచ్చి నిజ నివాసంబునకుం జనియె; మఱియు నిత్తెఱంగున నతనికి వేడ్కసలుపుచుండుఁ; జిక్కని మల్లులులేని తఱి నంతిపురంబు నింతులు సూడ నయ్యవనీ కాంతుండు పోరింప శార్దూల శుండాలాదులతోడ నీడంబోక పెనంగి భంగంబునకుం దెచ్చి మెచ్చించుచుండు.

### [4.2.21](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.21)

క. పెఱవారలు తమమెలఁగెడు | తెఱఁగులు దొరఁకొన్న వింత తెరువుల నేర్పుల్‌  
మెఱయుచుఁ బతిచిత్తము గొన | నొఱపు గలిగి మాన్యవృత్తి నుండుదురు దగన్‌.

### [4.2.22](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.22)

వ. ఇట్లు పాండవులు పాంచాలీ సహితంబుగా విరాటు నగరంబున వర్తించుచుఁ గతిపయదినంబులు గొఱంతగా నేఁడుకాలంబు గడపిన సమయంబున మత్స్యపతి మఱందియు, దండనాథుండును, గీచకాగ్రజుండును, రూపాభిమానియు, నానాభరణ ధరణశీలుండును. దుర్విదగ్ధుండును. బలగర్వితుండును నగు సింహబలుండు దనయప్ప సుదేష్ణకు మ్రొక్కంజనువాఁ డద్దేవి కనతిదూరంబున నున్న ద్రుపదరాజనందనం గనుంగొని.

### [4.2.23](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.23)

ఉ. అక్కజమైన చెల్వమున నాత్మకు వ్రేఁగయి పొల్చు పొల్తిపై  
నెక్కొను చూడ్కిఁ గ్రమ్మఱుప నేరక యూరక నిల్చెఁ గాముచేఁ  
జిక్కిన నెమ్మనంబుఁ గడుఁ జేడ్పడు మానముఁ జేష్టితంబులం  
దక్కిన యంగముం దలఁకు ధైర్యమునై యతఁ డప్పు డయ్యెడన్‌.

### [4.2.24](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.24)

తే. ద్రౌపదీ రూప మను నురిఁ దగిలి తనదు | హృదయ మను మృగ మత్తఱి నుదిలగొనుచుఁ  
గాముఁడను బల్లిదపు వేఁటకాని బారిఁ | బడుట కెంతయు నా సింహబలుఁడు తలరి.

### [4.2.25](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.25)

వ. నిజాంతర్గతంబున.

### [4.2.26](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.26)

ఉ. ‘ఎందును నిట్టిరూపు నరు లెవ్వరుఁ గాంచిరె? నాక కాదు సం  
క్రందనసూతికిం దగిలి కన్గొనఁ జాలదె! దీన నిందిరా  
నందను నాజ్ఞ యేచి భువనంబులఁ బ్రబ్బదె? యిత్తలోదరిం  
జెందఁగఁ గాన్పుగాదె ఫలసిద్ధి పురాతన పుణ్యవృద్ధికిన్‌!

### [4.2.27](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.27)

సీ. ఇయ్యింతి ప్రాపున నయ్యనంగుఁడు పార్వ | తీశునైనను దక్కనేలకున్నె!  
యిన్నాతి చెలువంబు గన్న శచీ ప్రియుం | డైనను గనుకలి నవియకున్నె!  
యిత్తన్వి కెనలేమి కెదిరి పన్నిదము భా | షావిభుతోనైనఁ జఱవరాదె!  
యిత్తలోదరి జీవితేశున కిందిరా | పతినైన మెచ్చక పలుకఁజనదె!.  
తే. కుసుమబాణుని బాణముల్‌ గూడ నైదు | కరఁగి నేరిమి వాటించి కరువు గట్టి  
పోసి చేసి చైతన్యసంపుటము దగ ఘ | టించెనో కాక యిట్టి చేడియలు గలరె!

### [4.2.28](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.28)

క. ఈ నెలఁతఁ గన్న మన్మథుఁ | డైనఁ జిగురు గొడుగుఁ పువ్వుటమ్ములపొదులున్‌  
లోనుగ సెజ్జలు సేయం | దా నియమింపండె? విరహతాపము పేర్మిన్‌.’

### [4.2.29](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.29)

వ. అని వెండియు.

### [4.2.30](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.30)

సీ. దీని జన్మంబునఁ దేజంబునొందిన | యింతియుఁ బతియును నెవ్వరొక్కొ!  
దీని నామాకృతిగా నోఁచి పడసిన | యింపగు వర్ణంబు లెవ్వియొక్కొ!  
దీని వల్లభుఁ డనఁగా నిల సొబగు సొం | పెసఁగ వర్తిల్లు వాఁ డెవ్వఁడొక్కొ!  
దీని వసించుటఁ దా నొప్పి పెంపున | నేపారు మందిరం బెద్దియొక్కొ!  
ఆ. దీనిఁ బొందఁగాంచు తెఱఁగు నా కెయ్యది | యొక్కొ! యిట్టిపనికి నూఱడిల్లి  
తోడుకొనఁగ నిచట నీడగు చుట్టంబుఁ | దడవి యెట్టులొక్కొ పడయువాఁడ!’

### [4.2.31](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.31)

చ. అని యని యుగ్గడించు, ధృతి యల్లల నాడినఁ దల్లడించుఁ బై  
కొను తలపోఁత నించు, మదిఁ గోర్కులు పేర్చిన నప్పళించు, నె  
ట్టన తెగ నగ్గలించు, నచటన్‌ జనులం బరికించు, బుద్ధి దూ  
లిన వెస నెంతయుం గళవళించు మనోజవికారమగ్నుఁడై.

### [4.2.32](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.32)

క. మాసిన చందముఁ దనుఁ గని | రోసిన డెందంబుఁ గల తరుణి నెఱుఁగఁడ బి  
ట్టేసిన మదనునిచే ధృతి | వాసిన బెగడొందు సింహబలుఁ డట్టియెడన్‌.

### [4.2.33](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.33)

సీ. వెఱవక ననుఁ జూచె వీఁడని యెదఁ గలు | షించిన నొండొండ చెమట వొడమ,  
ననుచితకృత్యంబు లాచరించు విధాతృ | బలిమికి నివ్వెఱపాటు దోఁప,  
నిచ్చట దిక్కులే రెవ్వరు నా కను | భయమున మేనఁ గంపంబు పుట్టఁ,  
జేయంగ నేమి యుపాయంబు లేమి నా | ననమున వెల్లఁదనంబు గదుర  
తే. నున్న పాంచాలిఁ గనుఁగొని యన్నరాధ | ముఁడు వివేక విహీనుఁడై ముదితుఁ డగుచు  
మదనవికృతియకాఁ దన మదిఁ దలంచి | రాగసాగరపూర నిర్మగ్నుఁ డయ్యె.

### [4.2.34](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.34)

వ. అయ్యవసరంబున.

### [4.2.35](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.35)

చ. పొలఁతుక కాంతి యింత పొలివోవఁగనీ కెసలారఁ దార ని  
శ్చలతఁ గడంగి క్రోలికొనఁజాలుటఁ గీచకముఖ్యు లోచనం  
బులు ‘నయనం ప్రధాన’ మను పూర్వవచస్‌స్థితి తప్పకుండఁగా  
నెలమి వహించెఁ దక్కుఁ గల యింద్రియ వర్గము ధిక్కరించుచున్‌.

### [4.2.36](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.36)

క. అప్పయుఁ బరిజనములుఁ దనుఁ | దప్పక కనుఁగొనుచునుండఁ దగవేది కరం  
బొప్పని తమకము చిత్తముఁ | గప్పికొనుట నుత్తలంబు గదురఁగ నచ్చోన్‌.

### [4.2.37](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.37)

సీ. తన్వంగి మవ్వంపుఁ దనులత నెసఁగెడు | నునుఁగాంతి వెల్లువ మునుఁగఁబాఱఁ,  
గిసలయహస్త కెంగేల నేపారు క్రొ | మ్మిం చను లేయెండ మిగులఁ బర్వఁ,  
గమలాస్య ముద్దు మొగంబు లేమెఱుఁగుల | మొత్తంబు పరి చుట్టు ముట్టికొనఁగ,  
ధవళాక్షి తొంగలి తఱచు ఱెప్పల చెన్ను | కప్పను చీఁకటి గవియుదేర,  
తే. బెగ్గలం బంత కంతకు నగ్గలింప | నొదవు చెమటతోఁ జిత్తంబు చెదరి యెందు  
మెలఁగఁ దలఁపేది యా సింహబలుఁ డనంగు | పట్టి యాడెడు జంత్రంబు పగిది నుండె.

### [4.2.38](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.38)

వ. ఇట్లు కందర్పదర్ప గోచరుండైన కీచకుండు నిజసహోదరివలన నక్కోమలి కలరూపు తెలియందలంచి దాని దెసం దగిలిన దృష్టి యెట్టకేలకుం దిగిచికొని చని యద్దేవికిం బ్రణమిల్లిన.

### [4.2.39](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.39)

క. కాంచన పీఠము వెట్టఁగఁ | బంచి ప్రియము చూడ్కి ముసుఁగువడఁ దను సంభా  
వించునెడ నాతఁ డప్పకుఁ | బాంచాలిం జూపి వేగపడి యిట్లనియెన్‌.

### [4.2.40](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.40)

ఉ. ‘ఇయ్యరవిందగంధి కుల మేమి? చరిత్రము చంద మెట్లు? పే  
రెయ్యది? నాథుఁ డెవ్వఁ? డిది యెచ్చట నెప్పుడు నుండు? నిపు దా  
నియ్యెడ కేఁగుదేవలయు టేపని సేయఁగఁ బూని? దీనిపై  
నెయ్యము కల్మి యేకొలఁది నీ మది? కింతయు నాకుఁ జెప్పుమా!’

### [4.2.41](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.41)

క. అనవుడు నయ్యంగన ‘యితఁ | డనంగశర దళిత హృదయుఁ డయ్యె నకట! యీ  
తని చిత్తవృత్తి మరలుప | ననురూపం బగు నుపాయ మది యెయ్యదియో?’

### [4.2.42](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.42)

వ. అని తలంచుచుఁ గీచకుని మాటలు గీటునంబుచ్చి యొండు పలుకులు జరిపిన, నతండును సత్త్వహీనుండు  
గావున సత్వరుండై క్రమ్మఱి, ద్రౌపది యున్న యెడకుం జని, యా సమీపంబున నఱ్ఱాడుచు నమ్మానవతితో నిట్లనియె.

### [4.2.43](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.43)

క. ‘ఇవ్వసుమతి నే పొలఁతుల | కివ్విధమునఁ జెలువు గలదె యెన్నండును? నీ  
వెవ్వరి తనయవు? నీ పతి | యెవ్వఁడు? పే రేమి? సెప్పు మిందునిభాస్యా!’

### [4.2.44](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.44)

వ. అనిన నప్పలుకులు వినియు వినమి భావించి యప్పాంచాలి నిర్వికారయై యూరకున్న నచ్చపలుండు వెండియు నిట్లనియె.

### [4.2.45](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.45)

సీ. ‘తెలి గన్నుఁగవ కాంతి పొలుపార నించుక | కను విచ్చి చూచినఁ గాదె యబల!  
చెలువంపు నెమ్మోము నెలమి సొం పినుమడి | గా నల్ల నవ్వినఁ గాదె యింతి!.  
దంతమౌక్తికరుచి దలకొన మఱుమాట | వలికినఁ గాదె యుత్పలదళాక్షి!  
యుల్లంబు సరసత దెల్లంబుగా లీలఁ | గైకొన్నఁగాదె పంకరుహవదన!’  
ఆ. యనుచుఁ జూచుఁ, జేరుఁ, నమ్ముగ్ధ పలుకులు | వినఁగఁ గోరుఁ, గేలు తనదు కేలఁ  
గీలుకొలుపఁ దలఁచుఁ గీచకాధముఁడు ని | జానురక్తిఁ దెలుప నప్పళించు.

### [4.2.46](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.46)

వ. ఇట్లు దాన తమకంబున వడిగొనుచు, నప్పు డయ్యంగన యింగితం బూహింప వెరవుమాలి మఱియును.

### [4.2.47](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.47)

సీ. ‘సుదతి! నీమై చక్కఁ జూచుట కోడెదఁ | గనుఁ బాటు వొరయునో యని తలంచి;  
మదిఁ బొనర్చిన మాట మగువ! నీ పెంపునఁ | గుదిసి నా నాలుక తుదికి రాదు ;  
పడఁతి! నీ కరములు పట్టంగఁ దివిరి శం | కించి వడంకెడుఁ గేలు సూడు;  
నెఱి నిట్టి దని యింతి! నీ నెమ్మనం బెన్ని | భంగుల నరసినఁ బట్టు వడదు ;  
తే. చెలువ! యింక నొక్కించుక సేపు నీ వ | నాదరంబున నెప్పటియట్ల యున్న  
మన్మథుఁడు సమయించిన మగుడ నన్నుఁ | బడయవచ్చునె యెన్ని యుపాయములను?’

### [4.2.48](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.48)

వ. అని తన యభిలాషంబు తేటపడం బలికిన నబ్బోటి కలుషించియు, దుర్వారం బైన పరిభవ వికారంబు దోఁపకుండ తన్నుందాన యుపశమించుకొని ‘వీడు దురభిమానియై యున్నవాఁడు, వేగిరపడుట వెరవుగాదు. వెరవు తోడన తప్పించుకొనవలయు’ నని తలంచి యతని కిట్లనియె.

### [4.2.49](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.49)

క. ‘నాయున్నబాముఁ దలఁపవ; | యీ యొడ లీ చీర యిట్టి యేవపుఁజందం  
బో యన్న! మదన వికృతిం | జేయు ననుట యెంతయును నిషిద్ధము గాదే!

### [4.2.50](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.50)

తే. చనునె యిమ్మాటలాడ సజ్జనుల కాఁడుఁ | బుట్టువులతోడ నీవును బుట్టినాఁడ;  
వట్లుగాకయు హీనవంశాభిజాత | నై పతివ్రతనగు నన్ను నడుగఁ దగునె?’

### [4.2.51](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.51)

క. అని వీడఁగఁ బల్కిన న | మ్మనుజాధముఁ డంతఁ బోక మదనోన్మాదం  
బునఁ దన్ను నెదిరి నెఱుఁగక | వనితకు నిట్లనియె గారవంపుఁ బలుకులన్‌.

### [4.2.52](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.52)

సీ. ‘నెత్తమ్మిరేకుల మెత్తఁదనము దెచ్చి | యచ్చునఁ బెట్టిన ట్లంద మొంది,  
చక్రవాకంబుల చందంబు గొనివచ్చి | కుప్పలు సేసిన ట్లొప్పు మెఱసి,  
చందురు నునుఁగాంతి కం దేర్చి కూర్చి బా | గునకుఁ దెచ్చిన యట్లు కొమరు మిగిలి,  
యళికులంబుల కప్పు గలయంతయును దెచ్చి | నారు వోసిన భంగి నవక మెక్కి,  
తే. యంఘ్రితలములుఁ, గుచములు, నాననంబుఁ, | గచభరంబును నిట్లున్న రుచిరమూర్తి  
యనుపమాన భోగములకు నాస్పదంబు | కాదె? యీ త్రిప్పు లేటికిఁ గమలవదన?’

### [4.2.53](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.53)

తే. నీవు దుర్జాతిగామికి నీవ సాక్షి; | పరసతీ సంగమున వచ్చు పాపమునకు  
నోరుతును గాని, సైరింప నోపఁ బచ్చ | విలుతు తూపుల తాఁకున కలరుఁ బోఁడి!’

### [4.2.54](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.54)

క. అను నప్పలుకుల కయ్యం | గన కోపము గదిరి ‘నీచు గావున జంకిం  
చినఁ గాని మెత్తఁబడి పోఁ’ | డని మనమునఁ దలఁచి యిట్టు లనియెం బెలుచన్‌.

### [4.2.55](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.55)

శా. ‘దుర్వారోద్యమ బాహు విక్రమ రసాస్తోక ప్రతాపస్ఫుర  
ద్గర్వాంధ ప్రతివీర నిర్మథన విద్యాపారగుల్‌ మత్పతుల్‌  
గీర్వాణాకృతు లేవు రిప్డు నిను దోర్లీలన్‌ వెసం గిట్టి గం  
ధర్వుల్‌ మానముఁ బ్రాణముం గొనుట తథ్యం బెమ్మెయిం గీచకా!’

### [4.2.56](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.56)

తే. అనుడు నతఁ డిట్టు లనియె ‘నా యతుల బాహు | బలముఁ జెనయంగ భవదీయ పతుల కారు  
మూఁడులోకంబులందు నెవ్వాఁడు లేమి | నిక్కువం బింత నమ్ముము నీరజాక్షి!’

### [4.2.57](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.57)

వ. అనిన విని సైరంధ్రి సైరణ దక్కి ధిక్కరించి యిట్లనియె.

### [4.2.58](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.58)

క. ‘చనుఁ జనదని చూడక యం | దని మ్రాఁకులపండ్లు గోయఁ దలఁచుట హితమే?  
మును చెడిన రావణాదుల | విని యెఱుఁగవె యెన్నఁడును వివేకవిహీనా!’

### [4.2.59](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.59)

తే. ఇవ్విధంబునఁ బలికిన యింతి పలుకు | గాన నేరక తమ యప్పకడకు మగుడ  
నరిగి నెవ్వగ మనమునఁ బిరిగొనంగఁ | జిన్నఁబోయిన మొగముతో సింహబలుఁడు.

### [4.2.60](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.60)

క. చని మదనాగ్ని జ్వాలలు | దనుకఁగ నిట్టూర్పు గాడ్పు దందడి నిగుడం  
దను నూరార్పఁగ సఖి దొర | కొనమికి వెనుఁబడుచుఁ కీచకుం డా సతితోన్‌.

### [4.2.61](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.61)

వ. ‘ఏ నప్పుడు నీకుం జూపి యన్వయ నామధేయంబు లడిగిన యప్పొలఁతి వలనం జిక్కి చిత్తం బుత్తల పడుచున్నయది; యిటమీఁద నీవ యెఱుంగు; దయ్యింతి యింతసేపు నీ చేరువనుండి యిప్పుడెట మెలఁగె?’ నని యడిగిన విని, యతని వేగిరపాటు చూచి శిరఃకంపంబు సేయుచు సుదేష్ణ నిజాంతర్గతంబున.

### [4.2.62](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.62)

తే. ‘రాగరసమగ్నుఁడయ్యె సైరంధ్రిఁ జూచి | యకట! దీన నింకేమి యపాయమగునొ?  
వలదు తగదన్న నుడిగెడు వాఁడె వీఁడు? | మాయదైవమ! యే నేమి సేయుదాన?

### [4.2.63](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.63)

వ. అయిన నా నేర్చుకొలందిఁ దగిన తెఱంగున వారించి చూచెదంగాక!’ యని యూహించి యిట్లనియె.

### [4.2.64](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.64)

సీ. ‘లలితంబు లగు మట్టియల చప్పు డింపార | నంచకైవడి నడ నల్ల వచ్చి,  
యెడ మేని నెత్తావి సుడియంగఁ బయ్యెద | సగము దూలించి పై మగుడఁ దిగిచి,  
సోలెడు నెలదీఁగె లీలఁ గ్రాలుచు వింత | చెలువంబు దలకొనఁ జేరి నిలిచి  
తెలిగన్నుఁగవకు నెచ్చెలియైన లేఁతన | వ్వొలయంగ సరసంపుఁ బలుకు పలికి,  
తే. మెఱయు చెయ్వుల రాగంబు మెయికొనంగ | నెడఁద సొగయించు మాటల నెలమి మిగుల  
నిన్ను ననురక్తిఁ గొలుచు నన్నెలఁత లుండ | నీరసాకార సైరంధ్రిఁ గోరఁ దగునె?’

### [4.2.65](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.65)

వ. అనిన నప్పలుకులదెస ననాదరంబు సేయుచు నచ్చేడియం జూచి కీచకుం డిట్లనియె.

### [4.2.66](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.66)

క. ‘నా కొలువు వార కా; ర | న్నాకేశుం గొలుచు నంగనలలోనైనన్‌  
లేకునికి నాకుఁ దెల్లం | బా కొమ్మకు నీడు పోల్పనయ్యెడు సుదతుల్‌.

### [4.2.67](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.67)

సీ. గండుమీలకుఁ బుట్టి కాము బాణములతోఁ | గలసి యాడెడు నట్టి కన్నుఁ గవయు,  
బిస కాండముల శిక్షఁ బెరిఁగి లేఁ దీఁగల | మెచ్చక యున్నట్టి మృదు కరములుఁ,  
జిగురులతో సంధి సేసి యంబుజముల | పై నెత్తి చను నట్టి పదతలములుఁ,  
గలకంఠములచేతఁ గఱచిన విద్య వీ | ణల కిచ్చునట్టి తిన్నని యెలుంగు,  
తే. నత్తెఱంగున రేఖయు, నవ్విధంబు | గరువ చందంబు, నమ్మెయి కలికితనము,  
నట్టి చెన్నును సైరంధ్రియంద కాక | కలవె యొరులకు? నెఱుఁగక పలికి తబల!

### [4.2.68](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.68)

వ. కావున నా యెలనాఁగ నేమి యుపాయంబుననైన నన్నుం జేర్పవైతేని కందర్పదర్పంబున నలందురి వందుదు’ ననిన నవ్వెలంది వెండియు నిట్లనియె.

### [4.2.69](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.69)

తే. ‘ఆయురైశ్వర్య కీర్తుల నపహరించుఁ | బరసతీ సంగమము; ధర్మపథమునందుఁ  
బరఁగువారలు పరిహరింపంగఁ గనియు | వినియుఁ దెలియవె యిది దుర్వివేక మగుట.

### [4.2.70](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.70)

సీ. పతి యెఱింగినఁ దన ప్రాణంబుపై వచ్చు | నను భయంబున నుల్లమదరు చుండ,  
జనులు గాంచిన మానుషము దూలుఁ దన కను | పుయిలోటమున మోము పుల్లగిలఁగ,  
బోటికిఁ దోఁచినఁ బొలియుఁ దేఁకువ యను | వెగడునఁ జెయ్వులు వీడుపడఁగ,  
బంధుల కగపడ్డఁ బాయు నన్వయ మను | కలఁక మైఁ జెమటలు క్రమ్ము దేరఁ,  
తే. గ్రీడ దెసఁ గౌతుకం బురియాడ రతుల | చవులు గొనియాడ నేరని జార పొందు  
హృదయమున కింపు చేయమి నెఱుక గలుగు | వారు దీని సుఖంబుగాఁ గోర రెందు.

### [4.2.71](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.71)

వ. అదియునుంగాక.

### [4.2.72](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.72)

క. బలవిక్రమ సంపన్నులు | గల రేవురు దానిపతులు గంధర్వులు; వా  
రలఁ దలఁచిన నా చిత్తము | దలఁకెడు; నది యేల నీకుఁ దమ్ముఁడ! చెపుమా!

### [4.2.73](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.73)

తే. కాని తెరువునఁ బోయినఁ గలుగునయ్య! | బ్రదుకు? చవి యెంతయైన నపథ్యములకు  
వేడ్క సేయుదురయ్య వివేకు? లెవ్వి | ధమున నా బుద్ధి వినవయ్య తమక ముడిగి.’

### [4.2.74](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.74)

క. అనవుడు నమ్మాటలు దన | మనమునకు సహింపరామి మల్లడిగొనుచున్‌  
మనసిజ పరతంత్రత ని | ట్లని పల్కె సుదేష్ణతోడ నతఁ దుద్ధతుఁడై.

### [4.2.75](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.75)

మ. ‘వనితా! యే నొక పల్కు పల్కెదఁ జతుర్వారాశి మధ్యంబునన్‌  
ఘనబాహాబల మొప్ప నన్ను నెదురంగా నొక్కఁడున్‌ లేమి యె  
వ్వనికిం దెల్లము గాదె! దాని మగలన్‌ వజ్రాహతిం గూలు శై  
ల నికాయం బన మద్భుజాసమదలీలన్‌ గీ టడంగించెదన్‌.

### [4.2.76](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.76)

ఉ. బుద్ధులు సెప్పు టెల్ల నటు వో విడు; మెమ్మెయి నైన సౌఖ్యసం  
సిద్ధి యొనర్పు నాకు; నెడ సేసినఁ దాపము రూపుమాపు; నా  
వృద్ధియ కోరుదేని ‘నవివేకివి నీ’ వని నన్ను ని ట్లసం  
బద్ధములైన వాక్యములు పల్కక వే పిలిపింపు కోమలిన్‌.’

### [4.2.77](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.77)

తే. అనుచు దైన్యంబు నొందెడు నాననంబు | తోడ దిగ్గన లేచి యత్తోయజాక్షి  
చరణ పీఠంబుకడఁ జక్కఁజాఁగి మ్రొక్కి | యున్న నద్దేవి కనుఁగొని చిన్నఁబోయి.

### [4.2.78](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.78)

ఉ. ‘ఆవల వచ్చు నాపదల కన్నిటి కోర్చి లతాంగిఁ గూర్చి కా  
కీ వెడ మాటలన్‌ మరలఁ; డెన్ని విధంబులఁ జూపి చెప్పినం  
గావల మైన వీఁడు తగు కార్యము వట్టునె? వీని కెమ్మెయిం  
జావు నిజంబు మన్మథునిశాత శరంబులనైన నక్కటా!’

### [4.2.79](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.79)

క. అని మనమునఁ దలపోయుచుఁ | దన తమ్ముని నల్లనెత్తి దందడి దొరఁగం  
జనుదెంచు నశ్రుపూరము | కనుఁగవలో మ్రింగికొనుచుఁ గామిని పలికెన్‌.

### [4.2.80](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.80)

ఆ. ‘ఇంత దలరనేల? యెమ్మెయినైనను | కొమ్మ నలవరించి కూర్చు టరుదె?  
యుమ్మలంబు దక్కి యూఱటతోడ నీ | వేఁగు; మసలవలవ దింక నిచట.

### [4.2.81](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.81)

క. ఆసవమున కని నీదు ని | వాసమునకు దివములో నవశ్యంబును నే  
నా సుదతిం బుత్తెంతు ని | జాసక్తి ఫలింపఁ గొఱలు మభిమత కేళిన్‌.’

### [4.2.82](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.82)

వ. అనిన విని కీచకుండు ముదిత హృదయుండయి నిజసదనంబునకుం జని వివిధ మధురసంబు లొనరించి, సముచిత ఖాద్యంబులు సమకట్టి, తత్ప్రదేశంబు విజనంబు గావించి, యొక్క రమ్యస్థలంబుననుండి పాంచాలివలని తగులు చిత్తంబు నుత్తలపఱుపం దలరి నెవ్వగల కగపడి తలపోఁతలకుం జొచ్చి దుర్విదగ్ధుండు గావున నమ్ముగ్ధకుం దన సన్నిధిఁ గామ వికారంబు వుట్టుట గలుగ భావించుచు.

### [4.2.83](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.83)

సీ. ‘కేలిమై నొక్కట లీలఁ గ్రేళ్ళుఱికెడు | వాలుగు సోగల నేలుదెంచి,  
కరువలి సుడియమిఁ గందక చెన్నొందు | నెఱవిరితమ్ముల నుఱక తెగడి,  
బెడఁగొందఁ దుడిచి మైఁ దొడసిన వలరాజు | వాలిక తూపులఁ దూలఁ దోలి,  
పొలపంబు మెఱసి దిక్కులఁ గాంతి పూరించు | క్రొక్కారు మెఱుఁగుల నుక్కడంచి,  
తే. తన విలోచనములు నాదు మనము నాఁచి | కొనఁగ నయ్యింతి ననుఁ గనుఁగొనియె, నాత్మఁ  
గై కొనియె, రాగ రసమునఁ గడలుకొనియె | మదన వికృతి బయల్పడ నుదిలకొనియె.

### [4.2.84](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.84)

ఉ. చిత్తము మెచ్చి నావలనఁ జిక్కఁగ వెండియు నా లతాంగి య  
చ్చొత్తిన యట్లు నాకుఁ దన యుల్లము దెల్లము సేయకున్కిఁ దా  
నత్తఱిఁ గ్రొత్తకాన్పగుట నడ్డము సొచ్చిన సిగ్గుపెంపు త  
న్ను త్తలమందఁ జేయుటకునో తలపోసి యెఱుంగ నయ్యెదన్‌.’

### [4.2.85](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.85)

తే. అనుచుఁ గొందలపడు కోర్కె లగ్గలించి | చిఱ్ఱుముఱ్ఱాడుచుండ నచ్చెలువ చెలువు  
తగిలి తన యిచ్చఁబాఱు చిత్తంబు పజ్జ | నరిగి యిట్లను నక్కీచకాధముండు.

### [4.2.86](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.86)

సీ. ‘లీల నాముందట నా లేమ పొలసినఁ | జూడ్కికిఁ జుబ్బనచూఱగాదె!  
కనువిచ్చి నన్ను నా తనుమధ్య సూచినఁ | దనువున కమృతసేచనము గాదె!  
చిఱునవ్వు బెరయ నచ్చెలువ నా తోడఁ బ | ల్కినఁ జెవులకు రసాయనము గాదె!  
యెలమి నమ్మెలఁత నన్నెలయింపఁ దివిరిన | నెడఁద కానందంబు నిక్క గాదె!  
తే. యా నితంబిని మక్కువ ననఁగి పెనఁగి | యింపు పొంపిరివోవ న న్నేలికొనఁగఁ  
దలఁచి పొందిన నది జన్మఫలము గాదె!’ | యనుచు వలరాజు బారికి నగ్గమయ్యె.

### [4.2.87](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.87)

వ. మఱియు ననేకభంగుల ననంగ విభ్రమంబుల కనురూపంబులైన బహువిధ ప్రలాపంబులం బ్రొద్దుగడుపుచు నమ్మదిరాక్షిరాక కెదురు చూచుచుండె; నక్కడ పాంచాలి రావించి సుదేష్ణ తృష్ణ భావించుచు నిట్లనియె.

### [4.2.88](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.88)

క. ‘ఒదవెడు తృష పెల్లిదమున | వదనము వఱువట్లు వట్టె వాసిత రాజ  
న్మదిరారస మానఁగ నా | హృదయంబున వేడ్క యెసకమెసఁగెడుఁ దరుణీ!

### [4.2.89](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.89)

క. కీచకుని యింట నెప్పుడు | వాచవి యగు బహువిధముల వారుణి గలుగున్‌  
వే చని యచటికిఁ గొని ర | మ్మా చూతముగాని నీ గమన వేగంబున్‌.

### [4.2.90](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.90)

వ. అనవుడు.

### [4.2.91](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.91)

ఉ. ఉల్లము దల్లడిల్లఁ దను వుద్గత ఘర్మజలంబు దాల్చుచున్‌  
డిల్లపడంగ ‘నా కిది కడింది విచారము పుట్టె; నందుఁ బో  
నొల్ల ననంగ రా, దచటి కూరక పోవను రాదు, నేర్పు సం  
ధిల్లఁగ దీనిఁ బాపికొను దీమస మెట్టిది యొక్కొ దైవమా!’

### [4.2.92](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.92)

వ. అని తలంచుచు డోలాందోళితమానస యగుచు నమ్మానిని సుదేష్ణ కిట్లనియె.

### [4.2.93](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.93)

ఉ. ‘ఉత్పలగంధి! నన్నుడుగు, మొడ్లను బంపుము కల్లుదేర; నే  
సత్పథవృత్తి నీ కడన సంతతమున్‌ బహుమానపాత్రనై  
తత్పరతం జరించి యుచితంపుఁ బనుల్‌ దగఁ జేయఁ గాక దు  
ష్యత్పరివారయోగ్య పరిచారముమైఁ జను నట్టి దాననే?

### [4.2.94](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.94)

క. అతివ! తగునమ్మ నీ గృహ | మతి నిర్మల చరితభరితమని యీ యెడ మ  
త్పతుల యసన్నిధి నైనను | మతి నూఱడి యున్నచోట మన్నన దప్పన్‌.

### [4.2.95](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.95)

ఉ. సాధులు సేరి నెమ్మిగ నిజస్థిర వృత్తము దుష్టకోటిచే  
బాధలఁ బొందకుండఁ దమపాల వసించినఁ బెద్దవారు ది  
క్కై ధరియించి వారికొక యాపద వుట్టకయుండఁ గాచు టొ  
ప్పై ధరఁ కీర్తి కెక్కదె? యపాయము సేసిన నింద వుట్టదే?

### [4.2.96](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.96)

ఆ. ఎవ్వరేని యింటి కెద్దియే నొకటికి | నన్నుఁ బంపఁదగునె? నిన్ను నాఁడ  
కొలుచునెడ ననుజ్ఞగొననె? నీచములగు | పనుల కేను జాలకునికి సెప్పి.’

### [4.2.97](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.97)

క. అనిన విని యనుచితంబున | కనయము శంకించియును లతాంగి మదిన్‌ త  
మ్ముని వలవంత దలఁచి యి | ట్లనియెం బాంచాలితోడ సాదర వృత్తిన్‌.

### [4.2.98](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.98)

ఉ. ‘అక్కట! యేను వేడ్కపడి యానెడు నాసవ మర్థిఁ దేర నొం  
డొక్క నికృష్టఁ బంచుటకు నోపక చెప్పిన దీని నీవు గో  
సెక్కఁగఁజేసి నిన్ను నతిహీన విధాన నియుక్తఁ జేఁతగా  
నిక్కమ యుమ్మలించి; తిది నెయ్యము తియ్యము కల్మియే? సఖీ!

### [4.2.99](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.99)

క. అది లాఁతియిల్లె? నినుఁ దమ | హృదయంబుల నెవ్వరేని నెఱుఁగరె? యేఁ జె  
ప్పుదు నీదు పెంపు నినుఁగ | న్నది మొదలుగ నెల్లవారి కయ్యై భంగిన్‌.

### [4.2.100](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.100)

క. అని మఱియుఁ బెక్కుభంగులఁ | దనుఁ బ్రార్థింపంగ ద్రుపదతనయకుఁ జిత్తం  
బున‘నింకఁ బెద్ద పెనఁగం | జన దీయమతోడ’ నను విచారము పుట్టెన్‌.

### [4.2.101](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.101)

వ. ఇట్లు దోఁచిన తలంపునం జేసి.

### [4.2.102](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.102)

చ. మన మురియాడుచుండ ననుమానముతోన సుదేష్ణఁ జూచి ‘నీ  
వనయముఁ గోరినట్టి పని యర్థిమెయిం జని చేయుదానఁ గా’  
కను తన మాట కప్పొలఁతి హర్షముఁ బొందుచు నందియిచ్చు కాం  
చన చషకంబు పుచ్చికొని చారువిలోచన యార్తమూర్తియై.

### [4.2.103](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.103)

వ. చనుచుండి, నీచహృదయుండగు కీచకుండు తనయెదుర నప్పుడాడిన కర్ణశూలంబులగు మాటల మీఁదం బిడుగుపడినవానిఁ గొఱవింజూఁడిన తెఱంగున సుదేష్ణ ద న్ననుచిత వ్యాపారంబునకు నియోగించుటకు నిర్వేదనంబునం బొంది.

### [4.2.104](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.104)

చ. అలమటఁ బొంది మాయ విధియా! యని దైవము దూఱు, నిత్తఱిం  
గలరొకొ నాకు దిక్కను, మొగంబున నశ్రులు వెల్లిగొల్పుఁ, దొ  
ట్రిలఁబడు, జల్లనం జెదరు డెందముఁ గూడఁగఁ దెచ్చి నన్నుఁ గే  
వలమున ముట్ట నెవ్వరికి వచ్చుననుం, గలఁగున్‌, వెనుంబడున్‌.

### [4.2.105](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.105)

వ. అట్టియెడ.

### [4.2.106](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.106)

సీ. దైన్యంబు తలపోఁత తలకొన్నఁ జెలువ కా | ననమున వెల్లఁదనంబు గదిరె;  
భయరసవేగంబు పైకొని ముట్టినఁ | గాంతకుఁ దనులతఁ గంప మడరె;  
బెగ డంతకంతకు మిగిలిన నింతికిఁ | బదముల నటఁ దొట్రుపాటు బెరసెఁ;  
దల్లడం బొందినఁ దన్వికి నవయవం | బుల నెల్ల ఘర్మాంబు కళిక లెసఁగెఁ;  
ఆ. దలఁకు పుట్టెఁ, గొంకు కొలఁదికి మీఱె, వె | న్బాటు దోఁచె, ముట్టుపాటు దొడరె  
వెఱఁగుపాటు దనికె, నెఱ నాడె నొవ్వు నె | వ్వగలు వగల నీనె, దిగులు వొదివె.

### [4.2.107](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.107)

వ. ఇవ్విధంబున ద్రుపదపుత్రి దురవస్థం బొందుచు ‘మహాపదలకుం బరిహరణంబు హరి (చరణ) స్మరణంబ’ యని తన హృదయపుండరీకంబునం బుండరీకాక్షు నిక్షేపించుకొని, సుదేష్ణ మందిరంబు వెలువడి దినకరుం గనుంగొని వినయవినమితోత్తమాంగయై నిజాంతర్గతంబున.

### [4.2.108](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.108)

తే. ‘పాండుపుత్రులకేను తప్పని మనంబు | గలుగుదాననయేని నో కమలమిత్ర!  
కీచకుని దెస న న్నొక కీడు తెరువు | వొరయకుండఁగ రక్షింపు కరుణతోడ.’

### [4.2.109](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.109)

వ. అనుచుం గేలు మొగిచిన.

### [4.2.110](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.110)

క. తరణియు దుఃఖితయగు న | త్తరుణిం గాచుటకు నత్యుదగ్రభుజావి  
స్ఫురణాఢ్యు నొక్క రక్కసుఁ | గరుణా ర్ద్రమనస్కుఁ డగుచు గ్రక్కునఁ బనిచెన్‌.

### [4.2.111](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.111)

వ. వాఁడునుం బనిపూని యంబరతలంబున నదృశ్యాకారుండై వచ్చి నిలిచె.

### [4.2.112](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.112)

తే. ఇట్లు ప్రార్థించి పాంచాలి యెట్టకేని | సింహబలు మందిరం బల్లఁ జేర నరిగి  
యొల్లఁబోవుచు బెబ్బులి యున్న పొదరు | సొచ్చు లేడి చందంబునఁ జొచ్చుటయును.

### [4.2.113](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.113)

ఉ. అంబురుహాక్షి వచ్చు తెరు వారయఁ గీచకముఖ్యుఁ డపు తె  
ల్లంబుగఁ జూచి యుల్లము కలంకయు వారక మేన వెమ్ముతా  
పంబును డిగ్గఁ ద్రావి, గరుపాఱుచు నుత్కట సంభ్రమంబు హ  
ర్షంబుఁ బెనంగొనంగ నతిచంచలభావ పరీతమూర్తియై.

### [4.2.114](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.114)

క. చిడిముడి పడుచు నెదురు చనఁ | గడఁగుచు హారములు సక్కఁగాఁ ద్రోచుచు మ  
ల్లడి గొనుచు దుర్విలాసం | బొడలికి నొడఁ గూర్చుచుండ నుగ్మలి యంతన్‌.

### [4.2.115](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.115)

వ. తత్ప్రదేశంబునకుం జని.

### [4.2.116](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.116)

తే. ‘దేవి తృష పుట్టి వారుణిదేరఁ బనుప | నరుగుదెంచితిఁ బోయింపుఁ’ డనిన నింతి  
నెమ్మొగంబున దృష్టులు నిలిపి, తమక | మడర నిట్లను నా కీచకాధముండు.

### [4.2.117](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.117)

క. ‘దేవి తృష దీర్పఁ బూనితి; | వా వెలఁది సహోదరుండ నగు నా తృష లీ  
లావతి! నీదు సరస సం | భావనమెయిఁ దీర్పకునికి పాడియె చెపుమా!

### [4.2.118](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.118)

సీ. కాంతి దళ్కొత్తు నీ కడగంటి చూడ్కితోఁ | బొందఁగానని మేను పొగులుటయును,  
దీపారు నీ పల్కుఁ దెల్లంబుగా వినఁ | గానని వీనులు గందుటయును,  
నింపగు నీ చెయ్వు లెలమిమైఁ గొనియాడఁ | గానని కోర్కులు గలఁగుటయును,  
సొగయించు నీ కేళిఁ దగిలి యానందంబుఁ | బొందఁగానని మది గుందుటయును  
తే. బాయ, నాదగు జన్మంబు ఫలము నొంద | భావజన్ముని పూనిక పార మెయ్ద  
నన్ను బంటుగా నేలుము నలినవదన! | యింక నీ సిగ్గుదెర యోల మేల నీకు?’

### [4.2.119](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.119)

వ. అనవుడు.

### [4.2.120](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.120)

తే. చెలువ యప్పలుకులు పెడ చెవులఁ బెట్టి | ధీర గావున విగతవికార యగుచు  
‘మదిర వోయింపుఁ డద్దేవి యెదురుచూచు | నలుగుఁ దడవైన మగుడఁ బోవలయు’ననిన.

### [4.2.121](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.121)

చ. ‘మదిర సుదేష్ణపాలి కొకమాత్రన పుచ్చెద నొడ్ల చేత; నిం  
పొదవెడు నట్టి దీని చవి యుల్లము సొక్కఁగ నాను మీవు; నీ  
వదన సరోజ సౌరభమవారణ నన్నును గ్రోల నిమ్ము; బె  
ట్టిదుఁ డగు కాము తూపులఁ దొడింబడకుండఁగఁ గావు మిత్తఱిన్‌.

### [4.2.122](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.122)

క. కరితురగ రథసమితిఁ బొం | పిరివోయెడు నాదు లక్ష్మి పెంపున కెల్లన్‌  
సరసిరుహవదన! నీవ కు | దురుగా నొనరించెదం గుతూహల మెసఁగన్‌.

### [4.2.123](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.123)

క. రుచిర మణి భూషణంబులు | నుచిత విహారప్రకార యోగ్యాగార  
ప్రచయము సుందరగణికా | నిచయము నొప్పించువాఁడ నీకుం దరుణీ!

### [4.2.124](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.124)

క. నా కులకాంతల నెల్లను | నీకుం బనిసేయఁ బనిచి నెయ్యంబున నే  
నీ కనుసన్నన మెలఁగెద | నే కార్యంబైన నడుపు మీవ తగంగన్‌.’

### [4.2.125](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.125)

వ. అనుచు సింహబలుండు తన యంతరంగంబున నంతకంత కగ్గలించు తమకంబునఁ దన్నుఁదా నెఱుంగక పయింబడి పట్టుకొనిన.

### [4.2.126](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.126)

క. తనుఁ గాచి వెనుక వచ్చిన | దనుజు మహాబలము తనదు తనువొందిన, నా  
తని చే విదిల్చి రభసం | బునఁ దన్మందిరము ద్రుపదపుత్రిక వెడలెన్‌.

### [4.2.127](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.127)

వ. ఇట్లు ద్రోచిపోయినం గీచకుండు వెనువెంటం దగిలిన నమ్మగువయు మరలి చూచి భయభ్రాంతయై ‘యెవ్వలనికిం బోదునో’ యని తలంచి, దైవయోగంబున విరాటుం డప్పుడు గొలువునికింజేసి తత్సభా భాగంబు దెసకు వెసం బాఱినం, గామాయత్తచిత్తుండును, గర్వోన్మత్తుండును గావున జనసమూహంబు సరకుసేయక రహస్యప్రకాశవిభేదవిచారంబు దక్కి.

### [4.2.128](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.128)

సీ. సమదవారణము జంగమలత వెనుకొని | సరభసంబునఁ బట్టఁ జనువిధమునఁ  
గ్రూరదానవుఁడు భూచారి నిర్జరకాంతఁ | బొదువ రయమ్మునఁ బోవుభంగి  
ఘోర గృధ్రము సుకుమార నాగాంగనఁ | బటుగతి నొడియంగఁ బాఱు కరణిఁ  
బ్రబల బిడాలంబు బాలశారిక మీఁద | నడరి సత్వరముగ నరుగుమాడ్కి  
తే. సింహబలుఁ డత్యుదగ్రతఁ జిగురుబోఁడి | పజ్జఁ గడువడిఁ దగిలి కోపంబు గదుర  
నొడిచి తలపట్టి తిగిచి మహోగ్రవృత్తి | గొంకు కొసరించుకయు లేక కూలఁదాఁచె.

### [4.2.129](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.129)

వ. అట్టియెడఁ బాంచాలీ రక్షకుండైన రాక్షసుం డతని డొల్లవ్రేసిన.

### [4.2.130](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.130)

క. కీచకుఁడు వ్రేటుపడి తన | నీచపుదశ యొరు లెఱుంగ నేరకయుండన్‌  
లేచి వెనుకఁ జని విస్మయ | గోచరుఁడై యసురకతనఁ గుంఠితుఁడగుచున్‌.

### [4.2.131](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.131)

వ. ఒడుపు దప్పిన మహానాగంబునుం బోలె నిట్టూర్పు నిగుడ నిట్టలంబగు కోపంబు పెల్లున మల్లడిగొనుచుండె; నయ్యవసరంబున.

### [4.2.132](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.132)

క. తానును నన్నయు నయ్యా | స్థానమ్మున నుండి పవనతనయుఁ డసహ్యం  
బైన మనోవల్లభ యవ | మానము, నా సింహబలుని మదజృంభణమున్‌.

### [4.2.133](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.133)

చ. కనుఁగొని కోప వేగమునఁ గన్నుల నిప్పులు రాల, నంగము  
ల్గనలఁగ, సాంద్ర ఘర్మ సలిలంబులు గ్రమ్మ, నితాంతదంతపీ  
డనరట దాస్యరంగ వికట భ్రుకుటీ చటుల ప్రవృత్త న  
ర్తన ఘటనా ప్రకార భయదస్ఫురణా పరిణద్ధ మూర్తియై.

### [4.2.134](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.134)

సీ. నేలయు నింగియుఁ దాళముల్‌గాఁ జేసి | యేపున రేఁగి వాయించి యాడఁ,  
గులపర్వతంబులు గూల్చి యొండొంటితోఁ | దాఁకంగ వీఁకమైఁ దన్ని యాడ,  
నేడు సాగరములు నిక్కడక్కడఁ బెట్టి | పలుచని రొంపి మై నలఁదికొనఁగ,  
దిక్కులు నాలుగు నొక్క చోటికిఁ దెచ్చి | పిసికి పిండలి సేసి పిడుచగొనఁగ,  
తే. మిగిలి బ్రహ్మాండభాండంబు పగుల వ్రేయ | నప్పళించుచుఁ బ్రళయకాలానలమున  
గండరించిన రూపంబు కరణి భీముఁ | డతి భయంకరాకారత నతిశయిల్లె.

### [4.2.135](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.135)

వ. ఇట్లు పేర్చిన కోపాటోపంబున నవిచారిత సమయవర్తనుండయి వృకోదరుండు కీచకుని గీటడంగింపంజూచి తత్సంబంధబద్ధుండును నాజ్ఞాపరిపాలకుండును గావున మత్స్యపతిఁ దన యలుకలోని వానిన కాఁదలంచుచు నచ్చేరువ నున్న యున్నతవృక్షంబు నిరీక్షించి, యాననంబు పల్లటిల్ల ధర్మతనయుం గనుంగొనిన నతండు తన నయనాకారంబున వారించి యిట్లనియె.

### [4.2.136](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.136)

మ. ‘వలలుం డెక్కడఁ జూచె నొండెడ నసేవ్యక్ష్మాజముల్‌ పుట్టవే?  
ఫలితంబై వరశాఖ లొప్పఁగ ననల్పప్రీతి సంధించుచున్‌  
విలసచ్ఛాయ నుపాశ్రిత ప్రతతికిన్‌ విశ్రాంతి గావింపఁగాఁ  
గల యీ భూజము వంటకట్టియలకై ఖండింపఁగా నేటికిన్‌?’

### [4.2.137](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.137)

తే. అని నిగూఢభాషణముల నయ్యజాత | శత్రుఁ డనిలజు కోపరసంబు పేర్మి  
చెఱిచె, నయ్యన్నదమ్ముల చేష్టితములు | దెల్లముగ నప్డు సూచుచు నల్లలేచి.

### [4.2.138](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.138)

సీ. ఎలదీఁగఁ గప్పిన లలితపరాగంబు | క్రియ మేన మేదినీ రేణువొప్పఁ,  
జంపకంబున నవసౌరభం బెసఁగెడు | కరణి నాసిక వేఁడి గాడ్పు నిగుడఁ,  
దోయజ దళములతుది మంచు దొరఁగెడు | గతిఁ గన్నుఁగవ నశ్రుకణము లురుల,  
నిందుబింబము మీఁది కందు చందంబునఁ | గురులు నెమ్మొగమున నెరసియుండ,  
తే. సర్వజన వంద్య యైన పాంచాలి సింహ | బలునిచే నివ్విధంబున భంగపాటు  
దనకు వచ్చిన నెంతయు దైన్యమొంది | యవ్విరాటుని సభఁ జేర నరిగి నిలిచి.

### [4.2.139](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.139)

ఉ. పంబిన కోపమున్‌ సమయభంగ భయంబును నగ్గలించి యు  
ల్లంబు పెనంగొనంగఁ బతులం దగ సభ్యులఁ జూచుమాడ్కి రూ  
క్షంబగు చూడ్కి నా ద్రుపదుకన్నియ సూచి సభాజనప్రతా  
నంబును మత్స్యనాథుఁడు వినంగ నెలుంగు చలింప నిట్లనున్‌.

### [4.2.140](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.140)

సీ. ‘నిఖిల ధర్మాధర్మ నిపుణంబు లైన శు | ద్ధాంతరంగంబుల నతిశయిల్లి,  
శిష్ట సంరక్షణ దుష్ట నిగ్రహముల | నీతి వాటింపంగ నేర్పు గల్గి,  
సకల శస్త్రాస్త్ర సంచయములఁ బరమాద్భు | తంబు సేయు పరిశ్రమంబు దాల్చి,  
దుర్దమ ప్రతిభట మర్దన క్రీడమైఁ | జతురులు నా నెందు నుతికి నెక్కి ,  
తే. యున్న గంధర్వు లేవురు నన్ను నిట్టు | లొకఁడు వఱుపంగ నూరక యునికి సూడ  
నచ్చెరువు గాదె! యెవ్వరి యాండ్రు రింకఁ | బరిభవంబునఁ బొందకఁ బ్రదుకువారు?

### [4.2.141](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.141)

క. ఈ నరపతి యాస్థానము | లో నొక్కరుఁడైన ధర్మలోప భయమునన్‌  
బూని తగవైన వెడ పలు | కైనను బలుకంగఁ జాలఁ డయ్యెను నకటా!

### [4.2.142](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.142)

ఉ. ఇందఱుఁ జూడఁగా నిచట నిమ్మెయి నన్నుఁ బతివ్రతా గుణా  
స్పందిత వర్తనం బరమ సాధ్వి ననిందితశీలఁ గీచకుం  
డెందును నెట్టి యంగనల నెవ్వరుఁజేయనియట్లు సేయఁగాఁ  
గొందఱకైన నిప్డు కృపకుం దఱిగాదటె? యేమి సెప్పుదున్‌?

### [4.2.143](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.143)

ఉ. ఐనను మత్స్యదేశమున యాజ్ఞ కితం డొడయుండు గాన నా  
కీ నరనాథు దూఱఁదగు; నెయ్యది యేని నధర్మ మెవ్వ రెం  
దైన నొనర్చినం బ్రభువు లారసి దండన మాచరింతు; రి  
చ్చో ననుఁ దన్ను కీచకునిఁ జూచియు నూరక యున్కి పాడియే?’

### [4.2.144](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.144)

చ. అనుడు విరాటుఁ డుల్లమున నక్కటికం బొలయంగ నంగనం  
గనుఁగొని, కీచకుం గినియఁగాఁ దగు సత్త్వము లేమిఁ జేసి సాం  
త్వనములు పల్కి రోషభరితస్థితిఁ గంపితమూర్తి యైన యా  
తని మది కుందు వాపిన నతండును బోయె నివాసభూమికిన్‌.

### [4.2.145](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.145)

వ. అట్టి యవసరంబున.

### [4.2.146](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.146)

సీ. ‘శుభలక్షణాంగి యీ సుందరి సైరంధ్రి | యగు టెట్లొకో!’ యని వగచువారు,  
‘నిమ్మేని కక్కట యిట్టిది సేసెనే ! | మాయ దైవం’ బని మఱుఁగువారు,  
‘నింత కీ డొనరించెనే! రాజు సూడ నీ | దుష్టాత్మకుం’ డని దూఱువారు,  
‘దేవి యుపేక్షయ చూవె! యీయమకు ని | ప్పాటు వచ్చుట’ యని ప్రందువారు  
తే. నగుచు సభవార లందఱు నంత నంత | నల్ల నల్లన గుజగుజ లాడుచుండి;  
రుల్లమున నిండి ఖేదంబు వెల్లివిరిసె | నాఁగ మోముల విన్నఁదనంబు గదుర.

### [4.2.147](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.147)

ఉ. అప్పుడు ధర్మసూతి హృదయంబు గలంగ, లలాట భాగముం  
గప్పఁగ ఘర్మవారి, యధికంబగు రోషము నొందియుండియుం  
దప్పఁగఁ ద్రోచికొంచుఁ దనధైర్యము పెంపున నిర్వికారుఁడై  
యెప్పుడుఁ దాను పల్కు నెలుఁ గేర్పడ ద్రౌపదితోడ నిట్లనున్‌.

### [4.2.148](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.148)

సీ. ‘జననాయకుండు నీ సభవారు నీదగు | తెఱఁగెల్ల నెఱిఁగిరి తెఱవ! యింక  
మానక యీ పలుమాట లాడఁగ నేల? | చనుము నీవు సుదేష్ణ సదనమునకు;  
నీ పరాభవమునఁ గోపింప నేరరే | గంధర్వులకుఁ దఱిగాదుగాక;  
సమయ మెయ్యది యేనిఁ దమకును నీకుఁ గ | ల్గిన యట్టులైనను గినియ రిచట  
తే. గాన నాథుల దూఱంగఁ గాదు వినుము | సతికిఁ; దానెంత వడియును సభలలోనఁ  
దడవుగా నిల్చి యిట్టు లుదగ్రవృత్తి | శంక సెడి ధిక్కరింపంగఁ జనునె చెపుమ!’

### [4.2.149](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.149)

వ. అనియిట్లు సెప్పిన ధర్మ తనయుని పలుకులు విని వెండియు సైరంధ్రి యచ్చోటు గదలక నిలిచి యెద్దియేనియుం బలుకం దలంచినం జూచి యతండు మఱియు నిట్లనియె.

### [4.2.150](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.150)

క. ‘పలుపోకలఁ బోవుచు వి | చ్చలవిడి నాట్యంబు సలువు చాడ్పున నిచటన్‌  
గులసతుల గఱువ చందము | దొలఁగఁగ నిట్లునికి దగునె తోయజవదనా!’

### [4.2.151](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.151)

వ. అనిన విని పాంచాలి సాభిప్రాయంబుగా నతని కిట్లనియె.

### [4.2.152](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.152)

ఆ. ‘నాదు వల్లభుండు నటుఁ; డింత నిక్కంబు; | పెద్దవారి యట్ల పిన్నవారు  
గానఁ బతుల విధమకాకయే శైలూషిఁ | గా ననంగరాదు కంకభట్ట!

### [4.2.153](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.153)

వ. అట్లగుటంజేసి నాకు నాట్యంబును పరిచితంబ; మత్పతి శైలూషుండ కాఁడు, కితవుండునుం గావున జూదరి యాలికి గఱువచందం బెక్కడిది?’ యనుచు నచ్చోటు వాసి తన చిత్తంబున.

### [4.2.154](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.154)

ఉ. ‘న న్నిటు లాదురాత్ము సదనంబునకుం జనుమన్నజంత కీ  
బన్నములన్నియుం దెలిపి ప్ర య్యిడనే’ యని పోయె నార్తయై  
కన్నుల బాష్పపూరములు గ్రమ్మఁగ మోమున దైన్యమొందఁగా  
నన్నలినాక్షి తొట్రిలుచు నంగము దూల సుదేష్ణపాలికిన్‌.

### [4.2.155](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.155)

తే. చనిన, నయ్యెలనాఁగయు సంభ్రమంబుఁ | దెచ్చికొని తానెఱుంగని తెఱఁగు దాల్చి  
శాఠ్యమున నుమ్మలించి పాంచాలితోడ | నెలుఁగువేఱొక భంగిగా నిట్టులనియె.

### [4.2.156](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.156)

సీ. ‘ధరణీ పరాగంబు వొరసి ధూసరితమై | చేడియ! నీ మేను చెన్నుదఱిఁగెఁ;  
జిత్తంబు తలపోఁతచే వాడు పొదవిన | చెలువ నీ నెమ్మోము చిన్నఁబోయెఁ;  
బ్రస్వేదమునఁ దోఁగి ఫాలంబుతో నంటి | యుగ్మలి! నీ కురు లొప్పు కుందెఁ;  
గన్నీరు వఱ్ఱొడ్డి కాంతి యెంతయుఁగొన్న | వెలఁది! నీ కనుఁగవ విన్ననయ్యె;  
ఆ. నేది కారణమున నెవ్వ రెచ్చోట నీ | కేమి కీ డొనర్చి రెట్టిపాటి  
సాహసికులొ వారిఁ జంపుదు నొంపుదు | భంగపఱుతు నిడుమపఱుతుఁ జెఱుతు.

### [4.2.157](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.157)

వ. ఇత్తెఱంగు నాకుం జెప్పు ’మనిన ’నీ వెఱింగియు నెఱుంగమి భావించిన, నింక నే మని పలుకంగలదాన? నైనను విను’ మని సైరంధ్రి యిట్లనియె.

### [4.2.158](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.158)

మ. ‘ నను నీ వప్పుడు సూతమందిరమున న్మద్యంబుఁ దెమ్మన్నఁ బో  
యిన నాతం డవినీతి సేసినను జేయీ కేను మత్స్యావనీ  
శుని యాస్థానము దిక్కు వే చనిన నచ్చోఁ దీవ్రకోపంబున  
న్వెనుకం గూడఁగ ముట్టి పట్టికొని తన్నెం బల్కు లింకేటికిన్‌?’

### [4.2.159](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.159)

వ. అని యేర్పడం బలికిన.

### [4.2.160](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.160)

ఉ. ‘ఖేదము దక్కు మీ క్షణమ కీచకు దండితుఁ జేసి నీకు నా  
హ్లాద మొనర్తు నే’నని నయంబునఁ గేకయరాజపుత్రి య  
త్యాదరవృత్తితో ననునయం బొనరించిన నయ్యసత్య సం  
వాదిని పూన్కి పాండుసుతవల్లభ యాలము సేసి యిట్లనున్‌.

### [4.2.161](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.161)

క. ‘నీ వింత యలుగ నేటికి? | నా వంతయుఁ బౌరజన మనఃఖేదము నొ  
క్కావంత ద్రిక్కకుండఁ గ | లావంతులు మత్పతులు గలరు పగఁ దీర్పన్‌’.

### [4.2.162](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.162)

క. అనిన సుదేష్ణయుఁ దత్పరి | జనములు వెఱఁబొంది యెన్ని సాంత్వనములు సె  
ప్పినఁ దేఱద, మజ్జ్జన భో | జనములకుం జొరద ద్రుపదసంభవ యెట్లున్‌.

### [4.2.163](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.163)

వ. అట్టియెడ సుదేష్ణసేయునది లేక నివ్వెఱఁగంది యుండెఁ; దక్కటి యంగనలును గీచకుని నీచత్వంబు దలంచి వాని చేటున కొడంబడిరి; పరిభవానల సంతప్తయైనపాంచాలి నిజశయనస్థానంబునకుం జని తల్పంబుపై మేను వైచి, యపాంగంబులం దొరంగు కన్నీరు చెవుల కొలంకులు నిండ నెవ్వగలు నివ్వటిలం దలపోయుచుండి.

### [4.2.164](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.164)

క. ‘ప్రబలుం డారయ నా సిం | హబలుం; డాతని జయింప ననిలతనయు బా  
హుబలంబ కూడఁ దగు; దై | వబలం బును నాతనికి నవశ్యముఁ గల్గున్‌.’

### [4.2.165](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.165)

వ. ఇట్లూహించి రాత్రిసమయం బగుటయు, సమస్త జనంబులుఁ గ్రమంబున నిద్రింపం దొడంగినం దానును శయ్యాతలంబు విడిచి, మేని ధూళి గడిగి, ధౌత పరిధాన పరీతయై మహానస గృహంబున సుప్తుండైన వృకోదరు కడకుం జని.

### [4.2.166](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.166)

ఉ. ‘నన్నుఁ బరాభవించి సదనంబునకుం జని కీచకుండు ము  
న్నున్న తెఱంగు దప్పక సుఖోచిత శయ్యను నిద్ర సేయ నీ  
కన్ను మొగుడ్చు నూఱటకుఁ గారణ మెయ్యది? భీమసేన! మీ  
యన్న పరాక్రమంబు వలదన్న నొకో దయమాలి తక్కటా!’

### [4.2.167](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.167)

వ. అనుచు మంద మంద సంభాషణంబుల సంబోధించు పాంచాలిపాణిస్పర్శంబున మేలుకని ‘యిది యెవ్వ’ రనవుడు? నే’ నను నమ్మానిని యెలుంగెఱింగి భీమసేనుండు ‘యాజ్ఞసేని కీచకు దురాచరణంబు నాకుఁ బ్రకటించి వాని నిర్జింప నియోగించునదియై యరుగుదెంచెంగావలయు; నత్తెఱం గిత్తెఱవ దాన చెప్పవిందు’ నని తలంచి.

### [4.2.168](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.168)

తే. ‘ఇంత ప్రొద్దేల యిచ్చోటి కేఁగుదేరఁ | గారణం బేమి? యెవ్వరుఁ గానకుండు  
నట్లుగాఁ జనుదెంచితె యంబుజాక్షి !’ | యనిన నయ్యింతి యిట్లను నతనితోడ.

### [4.2.169](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.169)

చ. ‘ఎఱిఁగి యెఱింగి నన్నడుగ నేమిటి? కప్పు డెఱింగి యింతకు  
న్మఱచుట గల్గెనే, నది వినం బనిలే; దటుగాక యున్న రూ  
పెఱిఁగియు నేన చెప్ప విన నిష్టము గల్గుట చాల లెస్స; య  
త్తెఱఁ గెఱిఁగించెదన్‌ వినుము తెల్లముగా మొదలింటినుండియున్‌.

### [4.2.170](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.170)

చ. అధిపు మఱంది సింహబలుఁ డప్పకు మ్రొక్కఁగ వచ్చి నన్ను న  
త్యధికమనోజ రాగ మతియై కనుఁగొంచుఁ గడంగి యెన్నియేన్‌  
విధములఁ బల్కి నాకుఁ దన విన్నను వెల్లను జూపి చెప్పి మా  
నధన విహీనతం జెనకినం గడునేవము పుట్టి యయ్యెడన్‌.

### [4.2.171](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.171)

క. విడియం బలుకఁగ వెండియు | నుడుగక కీచకుఁడు మన్మథోన్మాదము ద  
న్నడరిన న న్నడుగుటకుం | దొడరినఁ గోపించి వానితో నిట్లంటిన్‌.

### [4.2.172](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.172)

శా. దుర్వారోద్యమ బాహు విక్రమరసాస్తోక ప్రతాపస్ఫుర  
ద్గర్వాంధ ప్రతివీర నిర్మథన విద్యాపారగుల్‌ మత్పతు  
ల్గీర్వాణాకృతు లేవు రిపు నిను దోర్లీలన్‌ వెసన్‌ గిట్టి గం  
ధర్వుల్‌ మానముఁ బ్రాణముం గొనుట తథ్యం బెమ్మెయిం గీచకా!

### [4.2.173](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.173)

వ. అనిన విని వాఁడు గొన్ని ప్రల్లదంబులు పలికిన నేనునుం దత్కాలోచిత వచనంబులం ద్రోచిపుచ్చినం బోయెఁ; బదంపడి పాపాత్మయైన సుదేష్ణ తనకు మదిరారసంబు దేరం గీచక నివాసంబునకు నన్నుం బనిచినం బోవుట కొడంబడక, యెన్ని సెప్పిన నన్నింటికి నన్ని సెప్పి నిర్బంధించినం బెద్ద పెనంగ నొల్లక నా మనంబున నన్నెవ్వరికి నేమి సేయవచ్చు నని మీలావు నచ్చి సూతునింటికి సురకుం బోయిన.

### [4.2.174](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.174)

క. కొన్ని వెడమాట లాడుచు | నన్ను నతఁడు చెట్టవట్టినం ద్రోచి వెసం  
జన్న వెనుకొనుటయును మీ | యున్నెడ కే నపుడు సంభ్రమోపేతగతిన్‌.

### [4.2.175](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.175)

తే. పాఱుతెంచిన నక్కులపాంసనుండు | గోప మడరంగ వెనుకన కూడముట్టె;  
నట యెఱుంగుదు వీవు; మీ యన్న పెద్ద | తనముఁ జూచితి; వేమందు ననిలతనయ!

### [4.2.176](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.176)

ఉ. మీ సుభటత్వమున్‌ బలము మిన్నకపోవఁగ దుస్ససేనుఁ డ  
ట్లా సభలోన నన్‌ బఱిచె; నంతియకాక జయద్రథుండు సం  
త్రాసభరంబు లే కనుచితం బొనరించినఁ జెల్లిపోయె; నేఁ  
డీ సభికుల్‌ గనుంగొనఁగ నిట్లయితిన్‌; వగ నాకు వింతయే!

### [4.2.177](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.177)

ఆ. అకట! యాఁడుకూయు నాలకూయును లాఁతి | వారికైన నరయవలయు ననిన  
నన్నుఁ గీచకుండు దన్నంగ నెట్టులు | సూడ నేర్చె ధర్మసూనుఁ డపుడు.’

### [4.2.178](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.178)

వ. అనిన విని యతం డిట్లనియె.

### [4.2.179](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.179)

ఉ. ‘కీచకుఁడట్లు మీఁదు పరికింపక నిన్నుఁ బరాభవింపఁగాఁ  
జూచి మహోగ్రకోప వివశుండగు నన్నును జూచి ధైర్య హే  
మాచలుఁడైన ధర్మసుతుఁ డమ్మెయి వారణ సేయకున్న నే  
నీచత వాని మత్స్యవిభునిం బరివారము నుగ్గు సేసినన్‌.

### [4.2.180](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.180)

వ. ఆ సంరంభంబున సమయభంగంబుగా జనంబులు మనల నెఱింగిరయేని.

### [4.2.181](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.181)

క. ముందటి భంగిన కానల | యందుఁ జరింపంగ వలదె? యది నీవును నే  
నుం దెచ్చిన యాపదగా | నిందింపరె యెల్లవారు నీరజనయనా!

### [4.2.182](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.182)

వ. కావున సత్యవ్రత నిష్ఠుండగు యుధిష్ఠిరుండు పొగడ్తకుం దగువాఁడుగాని దూఱువడ నర్హుండుగాఁ’ డని వెండియు నిట్లనియె.

### [4.2.183](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.183)

క. ‘పరిభవకరుఁడగు కీచకుఁ | బరిమార్చుట యిపుడు గడవఁబడియెనె? యిమ్మై  
దురపిల్ల నేల? వ్రేల్మిడిఁ | బొరిగొని నీ మనము కలఁక పుత్తు లతాంగీ!

### [4.2.184](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.184)

వ. మనల నెవ్వరు నెఱుఁగకుండునట్టి తెఱంగు తలపోయవలయుఁగాక, పగతుని భంజించుట యెంతపని?’ యనిన విని యా మానిని యిట్లనియె.

### [4.2.185](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.185)

క. ‘గొంతికి నంత వెఱవ, మీ | కంత వెఱవ, దైవమునకు నంత వెఱవ, న  
త్యంత కలుషాత్మ విరటుని | కాంతకు నే వెఱతుఁ బనులు గావించునెడన్‌.

### [4.2.186](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.186)

చ. కినుకకుఁ జాల కెంతయును గీడ్పడి నా పడుపాటులెల్ల వ  
మ్మునఁ గలయంగ నిట్టు లొక మూర్ఖునిచేఁ దుదిఁబోయి కోలుపో  
యెనె యభిమానమ న్వగపు నేడ్తెఱ డెందము కొందలంబుఁ బొం  
దిన ధృతి మాలి యేఁ బలికితిం దగవెల్ల నెఱింగియుండియున్‌.

### [4.2.187](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.187)

వ. ఇట్టిద కాని సమస్త జనస్తవనీయుండగు పాండవాగ్రజు నిక్కంబ నిందించినదానం గా ’నని పలికి మఱియును.

### [4.2.188](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.188)

క. ‘ధర్మతనూభవు సంతత | ధర్మనిరతి మనము బ్రదుకఁ దలఁచుట యరుదే?  
నిర్మలుఁ డగు నాతని స | త్కర్మంబునఁ గాదె బ్రదుకు ధాత్రికి నెల్లన్‌.

### [4.2.189](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.189)

సీ. చనునె వేఱొకని కజాతశత్రుండను | పేర దిగ్విజయంబు పెంపు దాల్ప?  
రాజసూయ మహాధ్వరముఁ గోరి చేయంగఁ | దీరునే పెఱధరిత్రీపతులకు?  
ధర్మైకనిరతుఁ డాతం డొక్కరుఁడ చూవె | యనఁ జన నొరులకు నలవి యగునె?  
నిత్యవ్రతంబుగా సత్యంబు పాటింప | వచ్చునె యొరుల కెవ్వరికి నైన?  
తే. నయ్యుధిష్ఠిరు గాంభీర్య మతనిధైర్య | మరయ నొండెడఁ గలుగునె? యతఁడు కీర్తి  
ధరుఁడు కరుణోత్తరుఁడు మహీసుర సమృద్ధి | కరుఁడు నిజవంశకరుఁ డుపకారపరుఁడు.

### [4.2.190](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.190)

క. కలిమికి నొప్పగు నీఁగియు, | బలిమికిఁ దొడవైన యట్టి బలఁగమునై లో  
కులచిత్తములకు వ్రేఁగగు | కొలఁది మన న్గొంతి పెద్దకొడుకున కమరున్‌.

### [4.2.191](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.191)

సీ. ఎవ్వని వాకిట నిభమదపంకంబు | రాజభూషణ రజోరాజి నడఁగు;  
నెవ్వని చారిత్ర మెల్ల లోకములకు | నొజ్జయై వినయంబు నొఱపుఁ గఱపు;  
నెవ్వని కడకంట నివ్వటిల్లెడు చూడ్కి | మానిత సంపద లీనుచుండు;  
నెవ్వని గుణలత లేడు వారాసుల | కడపటి కొండపైఁ గలయఁబ్రాఁకు;  
తే. నతఁడు భూరిప్రతాప మహాప్రదీప | దూర విఘటిత గర్వాంధకారవైరి  
వీర కోటీరమణి ఘృణివేష్టితాంఘ్రి | తలుఁడు కేవల మర్త్యుఁడె ధర్మసుతుఁడు!

### [4.2.192](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.192)

ఉ. అట్టి మహాత్ముఁ డొక్కనికి నాశ్రితుఁడై వెడకూడుఁ జీరయుం  
బెట్టఁగ నిల్చి వాని మది ప్రీతికి నీడగువృత్తిఁ బేరునుం  
బుట్టును మాలి యిప్పు డిటు బ్రుంగుడుపాటునఁ బొందఁ జూచి నా  
కెట్టు మనంబు వట్టు? ధృతి యెమ్మెయిఁ దూలక నిల్చుఁ? జెప్పుమా!

### [4.2.193](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.193)

ఉ. నీ వలమూపులావు మును నేల వహించిన నాగకూర్మ గో  
త్రావనిభృద్ధిశాకరుల కారయ నూఱటపట్టు గాదె? సం  
భావన భూజనంబులకుఁ బండువు గాదె? మహోగ్ర కోప రే  
ఖావిభవంబు వైరులకుఁ గాలము చేరువ గాదె పావనీ!

### [4.2.194](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.194)

తే. బక హిడింబ కిమ్మీరుల బాహుబలము | నా జరాసంధు నుగ్రదర్పాతిశయము  
లోకభీకరములు విజయాకరములు | నైన నీ కరములకు లోనయ్యెఁ గాదె !

### [4.2.195](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.195)

ఆ. అట్టి నీవు వంటకట్టియలకు లావు | సూపుచుండ నెపుడుఁ జూచి చూచి  
వగతు; నదియుఁగాక తగవేది యమ్మత్స్య | మేదినీశ్వరుఁడు వినోదములకు

### [4.2.196](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.196)

మ. మహిష వ్యాఘ్ర గజాది సత్త్వచయమున్‌, మల్లవ్రజంబుం గృపా  
రహితుండై యెదు రొడ్డుచున్‌ వరుసఁ బోరంజూచు నిన్నెప్పుడున్‌;  
మహనీయంబగు నీ శరీరము జగన్మాన్యంబు; నీచక్రియా  
విహితం బైన కుజీవనంబు విధి గావించెం గటా దీనికిన్‌’.

### [4.2.197](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.197)

వ. అని మఱియు నిట్లనియె ‘వివేకహీనుండగు విరాటుండు నిన్నుంబోరించునప్పుడు నిజాంతఃపురకాంతలకు వినోదంబు సేయ వారల రావించిన నేనును సుదేష్ణతో నరుగుదెంచి చూచుచుండుదు; నయ్యవసరంబున.

### [4.2.198](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.198)

క. భరమున నీ పోరెడు నెడఁ | బరమ విషాదంబు, నీవు బలిమి మెఱసి యు  
ద్ధురవృత్తి జయము గొనినం | బరితోషముఁ బొందు నన్ను భావించి మదిన్‌.

### [4.2.199](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.199)

వ. ఊహించి సుదేష్ణయుఁ దత్పరిజనంబులుం దమలోన.

### [4.2.200](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2.200)

క. ‘వలలుని దెస మాలినిచూ | డ్కుల తెఱఁ గెడపొందుఁ దెలిపెడుం గంటిరె! వీ  
రలు వచ్చిన సమయంబును | దలఁపఁగ నొక్కటియ యివ్విధం బెట్లొక్కో!

_First 200 of 367 passages. [Read on](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2)_

---
Source: [https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2) · Pramāṇa
