<!-- Pramāṇa, a library of Indian primary sources · https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4 -->

[Pramāṇa](https://indike.org/pramana/) › [Indian literature](https://indike.org/pramana/in) › [Epic, Poetry, Drama & Narrative](https://indike.org/pramana/in.lit) › [The Mahābhārata and its versions](https://indike.org/pramana/in.lit.mahabharata) › [Mahābhāratas in Indian regional languages](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa) › [Andhra Mahabharatamu](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra) › 4.4

# Andhra Mahabharatamu 4.4: విరాటపర్వము — చతుర్థాశ్వాసము

Āndhra Mahābhāratamu 4.4

- **Language:** Telugu

### విరాటపర్వము — చతుర్థాశ్వాసము

### [4.4.1](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.1)

క. శ్రీమద రేఖ విషాద వి | రామాహిత గాఢ శమధురా నిర్భర ని  
ష్ఠా మర్దిత వివిధ వికా | రామల చేతో నివాస! హరిహరనాథా!

### [4.4.2](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.2)

వ. దేవా! వైశంపాయనుండు జనమేజయున కిట్లనియె.

### [4.4.3](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.3)

క. సూర్యోదయావసరమున | దుర్యోధనుబలము ప్రబల దోర్బల లీలా  
ధుర్యగతి నడచె భీష్మా | చార్య రవి సుతాది యోధ సంఘోద్భటమై.

### [4.4.4](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.4)

వ. ఇట్లు నడచి మత్స్యనగరంబున కనతి దూరంబున విరాటు పశుగణంబులం బొదివె; నట్టియెడ మ్రుక్కడి మూఁకలు సని యెక్కడెక్కడ యని తలపడినం గృపాశ్వత్థామ శకుని దుశ్శాసన కర్ణ వికర్ణ దుర్ముఖ ప్రముఖ రథిక జనంబులు గోపాల వర్గంబు ననర్గళ ప్రసారంబగు శరాసారంబునం గప్పినం గని కౌరవబలం బగుట యెఱింగి, బెగ్గలించి గవాధ్యక్షుండు రథంబు దోలికొని యాక్రోశించుచుం బురంబున కరుగుదెంచి రాజ మందిర ద్వారంబుఁ జొచ్చి రథావతరణంబు సేసి యంతఃపురంబున నున్న భూమింజయుం గాంచి ససంభ్రమంబుగా నిట్లనియె.

### [4.4.5](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.5)

మ. ‘ధరణీచక్రము సంచలింపఁగ సముద్దాంతంబులై గ్రక్కునం  
గురుసైన్యంబులు వచ్చి ముట్టికొనియెన్‌ గోవర్గమున్‌; వేగమై  
మరలం దెచ్చుటకుం గడంగుము; రిపుక్ష్మాపాలలోకంబు నీ  
శరజాలంబులపాలు సేయుము భుజోత్సాహంబు శోభిల్లఁగన్‌.

### [4.4.6](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.6)

ఆ. తేరుఁ బూన్పఁ బంపు; తెప్పింపు దృఢ తను | త్రాణ, ముగ్రచాప బాణ పూర్ణ  
తూణ ఘనగదాసి తోమర చక్రాదు | లనువుగా నొనర్పు మతి రయమున.

### [4.4.7](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.7)

చ. విరటుఁడు నిన్ను నెప్డుఁ బదివేవురముందటఁ జెప్పుఁ బాహువి  
స్ఫురితుఁడు, శౌర్యశాలి, కులభూతి విశేష విధాయకుండు, భూ  
భరణ విశారదుండు, జనభవ్యతపఃఫలసంభవుండు, కా  
తర పరిరక్షకుం డనుచు; దానికి నీడుగఁ జేయు మిత్తఱిన్‌’.

### [4.4.8](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.8)

క. అని కాంతాజనములలోఁ | దను నగ్గించుటయుఁ బొంగి దర్పోద్ధతి ని  
ట్లను నుత్తరుండు దన మన | మున సంగర కౌతుకంబు ముడివడుచుండన్‌.

### [4.4.9](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.9)

ఉ. ‘ఎత్తునఁ గొందుఁ గౌరవుల నెల్లను మార్కొనిరేని; గోవులం  
దెత్తు ముహూర్త మాత్రమునఁ; దేరికి సారథి లేమిఁ జేసి నా  
చిత్తమునన్‌ విచారదశ చెందెడు; నెవ్వఁడు గల్గునొక్కొ నా  
కిత్తఱి ‘నేఁ గదా కడప నెంతయు నేర్తు రథం’ బనం బురిన్‌.

### [4.4.10](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.10)

క. తగు సారథి దొరకొనినం | బగతుర భంజించు టెంతపని? కదుపుల ద  
వ్వుగఁ గొని పోదురొకో! యి | ట్లగునె? కలండేని సూతు నరయుం డెందున్‌.

### [4.4.11](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.11)

చ. కురుపతి భీష్మ కర్ణ కృప కుంభజముఖ్యులు మత్సముద్యమ  
స్ఫురణము చూచి పార్థుఁడను బుద్ధిఁ గలంగఁగ బెట్టు గిట్టి సం  
గరమున నోర్చి యేఁ బసుల గ్రమ్మఱఁ దేరకయున్న నన్ను భూ  
వరుఁడు సుహృజ్జనంబుఁ బరివారముఁ జిత్తములందు మెత్తురే?’

### [4.4.12](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.12)

వ. అనునప్పుడు తత్ప్రదేశంబున నునికిం జేసి.

### [4.4.13](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.13)

క. విని, ద్రుపద ధరణిపతినం | దన సామర్షాపహాస తరళ హృదయ యై  
చని, తద్వృత్తాంతము మె | త్తని పలుకులఁ జెప్పె నింద్రతనయునితోడన్‌.

### [4.4.14](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.14)

వ. అతండు నజ్ఞాతవాస వత్సరం బతీతంబగుట నిరూపించి, పాంచాలి కిట్లనియె. ‘నీవు పోయి వారలతో నిట్లనుము ‘మన బృహన్నలకు సారథ్యంబుసేయు సామర్థ్యంబు గలదు; దొల్లి ఖాండవ దహనంబునం బాండవ మధ్యమునకు సారథియై యతని చిత్తంబు వడసె; మఱియుఁ బెక్కెడలం దదీయంబగు రథంబు గడపఁ దానయై యుండు; నేను నెఱుంగుదుం, దత్సాహాయ్యంబునం గురుసైన్యంబుల జయింప వచ్చుటకు సంశయంబు వల దనుము. వా రేమనిరేని మఱియుం దగనాడి నన్నుం బిలిపించునట్టి తెఱంగు గావింపు’ మన ‘నట్లచేయుదు’ నని సైరంధ్రి యుత్తరయున్న యెడకుం బోయి.

### [4.4.15](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.15)

చ. ‘జనపతినందనుండు తగు సారథి నారయుచున్నవాఁ డెఱిం  
గిన పని సెప్పఁగా వలయుఁ, గ్రీడి మనంబున మెచ్చునట్టి నే  
ర్పును భుజశక్తియుం గలిగి రూఢికి నెక్కిన సూతవృత్తి మై  
నని సడిసన్న యేడ్తెఱ బృహన్నలకుం గల దంబుజాననా!

### [4.4.16](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.16)

తే. అర్జునునకు ఖాండవ దహనాదులైన | విక్రమము లా బృహన్నల వెరవు లావు  
గాదె! జయ మొనరించె లోకంబు లెఱుఁగ | నువిద! దీని నెఱింగింత ముత్తరునకు’.

### [4.4.17](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.17)

క. అని యమ్ముదితయుఁ దానును | జని యతనికి నత్తెఱంగు సముచితముగఁ జె  
ప్పిన నక్కుమారవరుఁ డి | ట్లనియెం బాంచాలితోడ నల్లన నగుచున్‌.

### [4.4.18](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.18)

తే. ‘అకట సైరంధ్రి! నన్ను నిట్లాలి గొనఁగ | నేల? చక్కఁగఁ గనువిచ్చి యేను బేడిఁ  
జూడరోయుదు; రణమున సూతకృత్య | భరముఁ దాల్చుట కెమ్మెయిఁ బనుచువాఁడ?

### [4.4.19](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.19)

వ. అదియునుంగాక.

### [4.4.20](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.20)

చ. కురుబల మేఁగుదెంచెనట గోవుల బిట్టఱఁబట్ట; దానిపైఁ  
బరిగొని శౌర్యసంపదయు బాహుబలంబును జూపఁబూని యే  
నరిగెద నట్టె; తేరికి బృహన్నల సారథియైన దీని న  
వ్వరె? పురిలోన నింత కఱవా? రథచోదకు లింత యేటికిన్‌.’

### [4.4.21](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.21)

వ. అనిన విని సైరంధ్రి యతని కిట్లనియె.

### [4.4.22](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.22)

ఉ. ‘కౌరవసేన గాదు త్రిజగంబులు నొక్కట నెత్తి వచ్చినం  
దేరు బృహన్నలా వశగతిం జరియించిన గెల్వ వచ్చుఁ; ద  
ద్వీరగుణంబు సొంపు పృథివీవరనందన! ము న్నెఱుంగుదుం;  
గారణజన్మమై తను వికారము వచ్చినఁ బెంపు దప్పునే?’

### [4.4.23](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.23)

వ. అనవుడు.

### [4.4.24](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.24)

క. మన మురియాడుచు నుండఁగఁ | దన కొరు లప్పటికి లేమి ధరణీశ్వరనం  
దనుఁడు బృహన్నలఁ బిలువం | బనుచుట కొడఁబడిన పలుకు వలుకుటయుఁ దగన్‌.

### [4.4.25](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.25)

వ. సైరంధ్రి దెసఁ గనుంగొని ‘యేను బోయి తోడ్కొని వచ్చెద’ నని పూని.

### [4.4.26](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.26)

సీ. అడుగుల నునుఁగాంతి నయ్యెడఁ బద్మరా | గంబుల నెలకట్టు కరణినొప్పఁ,  
బాలిండ్లు దను వెడ వ్రాలింపఁ జెన్నొందు | నసదుఁ గౌఁదీఁగె యల్లాడుచుండఁ,  
దఱి వేచి వెనువెంటఁ దగులు కామాంధ కా | రములీలఁ గ్రొవ్వెద కొమరుమిగులఁ,  
గర్ణభూషణ మౌక్తిక ప్రభాడోలన | మీక్షణ దీప్తుల నినుమడింప’  
తే. నందియల మొరపంబున కరుగుదెంచి | ప్రోది రాయంచ రయమునఁ బోవు నవ్వి  
ధంబు దగ నభ్యసించు చందమునఁ దోన | చనఁగ నుత్తర నర్తనశాల కరిగె.

### [4.4.27](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.27)

ఆ. మెఱుఁగు మొగిలు సొచ్చు తెఱఁగున నాట్యమం | దిరము సొచ్చి తనదు గురువు కడకు  
నరిగి నెమ్మి నిట్టు లను నింతి ప్రార్థనా | వినయ సంభ్రమములు పెనఁగొనంగ.

### [4.4.28](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.28)

క. ‘ఇచ్చట నొకకయ్యంబునఁ | జచ్చె మదీయాగ్రజన్ముసారథి; తగువాఁ  
డెచ్చోట లేమి నాతం | డచ్చు పఱుపఁడయ్యె నీ క్రియకు నొండొకనిన్‌.

### [4.4.29](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.29)

వ. అది యట్లుండె; నేఁడు కౌరవులు పసులం బట్టిరని కూయి వచ్చిన, నన్న సన్నద్ధుఁడై వెనుకం దగుల సమకట్టి, సారథ్యంబు సేయువాఁడు లేమికి విషాదంబు నొందిన, నీ కందువ సైరంధ్రి సెప్పినం బ్రియంబంది నిన్నుఁ దోడ్తేర నన్నుఁ బనిచిన, నేనును నీ పాల నాకుఁ జనవు గలుగుటంజేసి,‘యెల్ల విధంబులం దెత్తు’ నని పూని వచ్చితి; నీవును నా పలుకులు కుఱుచసేయక, నీ పెంపునుం బ్రకటంబుగా నయ్యుత్తరకుమారునకు రథంబు గడప నియ్యకొని, యి య్యాపదఁ దలఁగ వలయు, నిట్లొడంబడక తక్కుట నా వలని వాత్సల్యంబు గొఱంతపఱుచుట’ యనిన నమ్ముద్దియ పలుకులు ముద్దు సేసి.

### [4.4.30](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.30)

క. నగుచు బృహన్నల యిట్లను | ‘జగతీశ్వర పుత్రి! నాకు సారథ్యము నే  
ర్పు గలదె? నీ మాటకు నే | మిగులంగా వెఱతుఁ; బొదము మీఁ దట్లుండెన్‌.

### [4.4.31](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.31)

క. భవదీయ ప్రార్థనచేఁ | దివిరి పరమ దుష్కరములు దీర్చియయిన ను  
త్సవ మొనరించెద సార | థ్య విధం బొకఁ డనఁగ నేల యంబుజవదనా!’

### [4.4.32](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.32)

వ. అనుచు సంగీతనిలయంబు వెలువడి సలీలంబుగా మెత్త మెత్తన నడతెంచు మత్తశుండాలంబునుం బోలె.

### [4.4.33](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.33)

తే. అరుగుదెంచు బృహన్నల నంత నంతఁ | గని నృపాలసుతుం డను గారవమునఁ  
‘గౌరవులతోడఁ గయ్యంబు గలిగె నాకుఁ | గడఁగి నేఁడు రథ మ్మీవు గడపవలయు.

### [4.4.34](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.34)

క. వే రమ్ము; మై మఱువుఁ దొడి | తే రెక్కుము; దప్పఁ గ్రుంకఁ దీఱదు నీకున్‌;  
సైరంధ్రి సెప్పె నీదగు | బీరమ్మును బెంపులావు వెరవును మాకున్‌.’

### [4.4.35](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.35)

చ. అనుటయు, ‘నాట పాట గల యప్పటికిన్‌ ననుఁ గోరి పిల్పఁబం  
చినఁ దగుఁగాక; సంగరము సేఁతకు సారథి గమ్ము, రమ్ము, నీ  
వను టుచితంబె? యెల్లెడల నారసి బాహుబలాఢ్యుఁడైన యొ  
క్కని రథ మేడ్తెఱం గడపఁగా నియమింపుము రాజనందనా!’

### [4.4.36](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.36)

వ. అనిన విని వైరాటి కిరీటి కిట్లనియె.

### [4.4.37](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.37)

ఉ. ‘ఖాండవ మేర్చునప్పుడు తగన్‌ రథచోదక వృత్తి సల్పి; యా  
ఖండలసూతికిన్‌ జయము గల్గ నొనర్చిన యట్టి బుద్ధియున్‌  
దండితనంబు నీ యెడన తక్కెనె? నా దెస మైత్రి పెన్పు; మిం  
కొండొక మాట దక్కుము, రణోత్సహనం బొనరింపు గ్రక్కునన్‌.’

### [4.4.38](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.38)

తే. అనిన, నాతని మాటకు నడ్డమాడ | వెఱచినట్టి తెఱంగు భావించి యల్ల  
నియ్యకొనుటయు; నమ్మనుజేంద్రసుతుఁడు | దృఢ తను త్రాణ మతనికిఁ దేరఁ బనిచె.

### [4.4.39](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.39)

క. తెప్పించి తొడుగు మీ వని | యొప్పించిన, నిట్టునట్టు నొఱవలుగా మైఁ  
గప్పికొని, యా బృహన్నల | యప్పుడు నగుపించె నచటి యబలాజనమున్‌.

### [4.4.40](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.40)

క. ఉత్తరుఁడు సత్వరంబుగఁ | దత్తనువున మఱువు దొడిగి తానును హృద్యో  
దాత్తంబగు కంకట మిడి | చిత్తము పసిఁ గ్రమ్మఱింపఁ జిడిముడిపడఁగన్‌.

### [4.4.41](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.41)

వ. బృహన్నల నవలోకించి.

### [4.4.42](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.42)

క. ‘హయములఁ బూన్పుము రథమున, | రయమున సిడమెత్తు; మిపుడ రావలయును గో  
చయము గొని, యస్మదీయ వి | జయ మభినందింపఁ బురముజను లెదురుకొనన్‌.’

### [4.4.43](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.43)

తే. అనిన ‘నీ వేమి పనిచిన నట్ల చేయ | వలయు; నీ వున్నయెడ నుండవలయు; నీవు  
సన్న దెసఁ జనవలయు; నా శక్తి యెఱిఁగి | పంచి పనిగొని కడిమిమైఁ బగఱ గెలుము.’

### [4.4.44](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.44)

వ. అని పలుకుచు మనంబున ముదం బొదవ నా ధనంజయుండు.

### [4.4.45](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.45)

క. కాంచనమాలాలంకృత | చంచత్తను లీల మెఱయ జవనాశ్వములం  
బూంచి రథంబున మణిమయ | పంచాననకేతు వెత్తె బంధుర భంగిన్‌.

### [4.4.46](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.46)

వ. ఇట్లు సన్నాహంబు మెఱసిన సారథిం జూచి యుత్తరయుం జెలులు నిట్లనిరి.

### [4.4.47](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.47)

క. ‘కురువీరుల గెలిచి తదం | బరములలోఁ జిత్రవర్ణ భాసురములుగాఁ  
దర మెఱిఁగి లోచనోత్సవ | కరములుగా బొమ్మపొత్తికలకుం దెండీ.’

### [4.4.48](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.48)

క. అనుడు బృహన్నల యిట్లను, | ‘జనపాలకనందనుండు జయలక్ష్మిం జే  
కొనునటె! చీరలు దెచ్చుట | పనియే! యటు సూడుఁ, డెల్ల భంగులఁ దెత్తున్‌.’

### [4.4.49](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.49)

వ. అనుచు ధనుస్తూణీర కృపాణ ముద్గరాది వివిధ సాధనంబులు రథంబుపైఁ బదిలంబుగా నిడి నొగలెక్కి పగ్గంబుల స్రుక్కుసక్కంజేయ, నుత్తరుండును బసులం బట్టిన దెస గోపాలకు నడిగిన, వాఁడు పితృవణంబువలనని చెప్పిన వినుచు, రథారోహణంబు సేసి, వెడలి, పౌరవృద్ధ పుణ్యాంగనా భూసుర సమూహంబులు బృహన్నలం జూచి ‘తొల్లి ఖాండవ దహనంబున నర్జునునకు నీ కతంబున నయిన మాంగల్యం బెట్టి దట్టిద భవత్సాహాయ్యంబున భూమింజయున కయ్యెడు’ మని దీవించి సేసలు సల్లం బురంబు నిర్గమించి, నిరర్గళపరాక్రముం డయిన యా ఫల్గును నైపుణంబున వల్గ దశ్వంబగు రథంబు రయంబునకు మెచ్చుచుం బరేతనిలయ ప్రాంత ప్రదేశంబు సేరం జని.

### [4.4.50](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.50)

సీ. అభినవ జలధర శ్యామంబు లగునెడ | లాకు జొంపంబుల ననుకరింప,  
సాంధ్యరాగోపమచ్ఛాయంబులగు పట్లు | కిసలయోత్కరములఁ గ్రేణి సేయ,  
రాజమరాళ గౌరములగు చోటులు | తఱచుఁ బూఁ బొదల చందంబు నొంద,  
హారిద్రరుచి సమానాకృతులగు ఠావు | లడరెడు పుప్పొడులట్లు మెఱయఁ,  
తే. గలయ నెగసి ధరాధూళి లలితవనము | దివికి నలిఁగాఁపు వోయెడు తెఱఁగు దాల్ప  
గోగణము ముంగలిగ నేల గోడివడఁగ | నడచు కౌరవరాజు సైన్యంబుఁ గనియె.

### [4.4.51](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.51)

క. కని యుత్తరుండు గరుపా | ఱిన మేనును, దలఁకు మనము, ఱిచ్చవడిన చూ  
పును నై, తొట్రుపడుచు, ని | ట్లనియె, దిగులు సొచ్చి యా బృహన్నలతోడన్‌.

### [4.4.52](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.52)

శా. ‘భీష్మద్రోణ కృపాది ధన్వినికరాభీలంబు, దుర్యోధన  
గ్రీష్మాదిత్య పటుప్రతాప విసరాకీర్ణంబు, శస్త్రాస్త్ర జా  
లోష్మస్ఫార చతుర్విధోజ్జ్వల బలాత్యుగ్రం బుదగ్రధ్వజా  
ర్చిష్మత్త్వాకలితంబు సైన్య మిది యేఁ జేరంగ శక్తుండనే?

### [4.4.53](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.53)

క. అకృతాస్త్రుఁడ, బాలుఁడఁ గా | ర్ముక విద్యా ప్రౌఢిమై నిరూఢులయిన యీ  
శకుని జయద్రథ దుర్ముఖ | వికర్ణ కర్ణాది యోధ వీరుల కెదురే!

### [4.4.54](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.54)

క. ఇట్టగు టెఱుఁగక వచ్చితి | మెట్టొకొ! మనభంగి; వీర లిందఱును గడున్‌  
బెట్టిదులు; మనకు మార్కొను | నట్టి కొలఁది గాదు; భీతి యడరెడుఁ దోడ్తోన్‌.

### [4.4.55](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.55)

ఉ. కౌరవసేనఁ జూచి వడఁకం దొడఁగెన్‌ మదితోన మేను; నీ  
వూరక పోవుచున్కి యిది యొప్పునె? యిప్పటి భంగిఁ జూచిన  
న్వీరల నేను మార్కొనమి నిశ్చయ, మట్లగుటన్‌ రయంబునన్‌  
దేరు మరల్పు, ప్రాణములు దీపన మున్‌ వినవే బృహన్నలా!’.

### [4.4.56](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.56)

వ. అనిన దరహసిత వదనుం డగుచు శతమఖతనయుం డతని కిట్లనియె.

### [4.4.57](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.57)

చ. ‘అసదృశలీలఁ బొల్చు రథికావలి మీఁదఁ జనంగ వెఱ్ఱినే  
మసలక యామిషంబు గొని మార్గము వట్టిన తుచ్ఛసైన్యమున్‌  
వెసఁ జని ముట్టి గోధనము వేగ మరల్తము గాక; యిమ్మెయిం  
బసు లటు వోవఁగా మరలఁ బాడియె నీకు నరేంద్రనందనా!

### [4.4.58](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.58)

ఉ. అంతిపురంబులోనఁ గల యంగన లెల్లను నెమ్మనంబులన్‌  
సంతసమందఁగాఁ బసులఁ జయ్యనఁ దెచ్చెద నంచుఁ బూని, నీ  
వెంతయు మేటివై, యరదమెక్కి రయంబున వచ్చి, యిచ్చటన్‌  
దంతితురంగ సద్భటకదంబముఁ జూచి కలంగు టొప్పునే!’

### [4.4.59](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.59)

ఆ. అనిన పలుకులకు బృహన్నలఁ గనుఁగొని | యెలుఁగు వడఁక నాతఁ డిట్టు లనియెఁ  
‘బసుల దయ్య మెఱుఁగుఁ బడఁతుల సంతోష | మేల నాకు? ననికిఁ జాల నేను.’

### [4.4.60](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.60)

వ. అనవుడు.

### [4.4.61](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.61)

చ. ‘తన భుజశక్తియున్‌ రిపుల దర్పము నేర్పడఁ జూచి చూచి యె  
ట్లును దెగకున్నఁబోక యిది లోకము చక్కటి; శూరులైన దీ  
నిని మది మెచ్చ; రీ బలము నీదెస దేఱియుఁ జూడ; దింతకున్‌  
మును భయహేతువైన విధముం దగఁ జెప్పుము నాకు నిత్తఱిన్‌.

### [4.4.62](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.62)

సీ. దెసలు బీఁటలు వాఱఁ దివురు చిందంబుల | కోలాహలఁములకుఁ గుదియఁ బడక,  
యురవడి సేనలు దెరలఁ బైఁ దోఁతెంచు | ధూళి పెల్లడరినఁ దూల పోక,  
చతురంగబల మతిసాంద్రతఁ గవిసిన | యగ్గలికమునకు బెగ్గడిలక,  
శస్త్రాస్త్రములు రథ్య సారథి వర్మాంగ | తతి నాటు తఱచునఁ దల్లడిలక,  
తే. బహువిధంబులఁ బగతుర బరవసమున | నిత్తెఱంగునఁ గలుగు క్రందెల్ల నోర్చి  
నిల్చి గెల్చిన సత్కీర్తి నెగడుఁ గాక | దవ్వు దవ్వుల నిట్లైన నవ్వరెట్లు?’

### [4.4.63](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.63)

చ. అను దివిజేంద్ర నందనున కమ్మనుజేంద్ర తనూజుఁ డిట్లనున్‌  
‘వినుము! త్రిగర్తవాహినులు విక్రమసంపద సొంపు మీఱ, గో  
ధనములఁ బట్టినం, బతి యుదగ్రత సైన్యము లెన్ని యన్నియుం  
గొని యటు వోయెఁ, గాన మనకుం బురి బాసట లేర యెవ్వరున్‌.

### [4.4.64](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.64)

తే. ఒంటిఁ దలపడి కురుసేన నోర్చువాఁడ | నే? యిదేటికి వెడమాట లిట్టు లాడ?  
వారు గానక ముందఱఁ దేరు దోలు | కొని రయంబునఁ బురి కరుగుటయ నీతి.’

### [4.4.65](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.65)

వ. అనినం బార్థుండు పార్థివనందనున కిట్లనియె.

### [4.4.66](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.66)

క. ‘వెగడొంది యిట్లు వలుకఁగ | నగునే? పగతురు ప్రమోద మందఁగఁ బసులన్‌  
దిగవిడిచి, పురజనంబులు | తెగడంగా మగిడిపోక దీనత గాదే!

### [4.4.67](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.67)

వ. అట్లుంగాక.

### [4.4.68](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.68)

మ. నను సైరంధ్రి గడంగి పేర్కొనియె, దానం బెంపుమైఁ బిల్చి, తో  
డని తోడ్తెచ్చితి వీవు, బంటుతన మ ట్లగ్గించి పౌరాలి దీ  
వన లిచ్చెం, దుదిఁ బోయి కౌరవులు గోవర్గంబు గొంపోవఁగాఁ  
గని యేఁ గ్రమ్మఱి రిత్తవోదునె? భయోత్కంపంబు నీ కేటికిన్‌?

### [4.4.69](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.69)

తే. చిత్తవృత్తి యొక్కించుక చిక్కఁ బట్టు, | మిపుడ కౌరవ సైనికు లెల్లఁ జూచి  
వెఱఁగు పడ వేగమును లావు వెరవు మెఱయఁ | గదుపుఁ బెట్టించి పోదము క్రమ్మఱంగ.’

### [4.4.70](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.70)

వ. అనుచు వివ్వచ్చుండు గడంగి తేరు వోవనిచ్చుటయు, నాననంబు పల్లటిల్ల, మానసంబు దల్లడిల్ల నా భూవల్లభు కుమారుండు.

### [4.4.71](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.71)

క. ‘దవ్వుల విఱిగినఁ బౌరులు | నవ్వుదురటె! మేలు మేలు! నను నాఁగకు, నీ  
క్రొవ్వఱుగదేనిఁ దలపడు | మెవ్విధిఁ జనితేని’ యనుచు నెత్తిన భీతిన్‌.

### [4.4.72](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.72)

క. శరములు శరాసనము న | య్యరదముపై డిగ్గవిడిచి యతి రభసమునన్‌  
ధరణికి లంఘించి వెసం | బురిదెసకును లజ్జ వీటిఁ బోవం బాఱెన్‌.

### [4.4.73](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.73)

వ. ఇట్లు వాఱినం దనమనంబునం గుత్సించుచు బీభత్సుండు యుగ్యంబుల పగ్గంబుల నొగల ముడిచి రథంబు డిగ్గనుఱికి లంబకేశభారుండును, నాందోళిత రక్తాంబర యుగళాంచలుండును నగుచు వెనుకంబఱచు సమయంబున, నిలిచి కనుంగొను కౌరవబలంబునందు.

### [4.4.74](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.74)

ఉ. అజ్ఞులు కొంద ఱప్పుడపహాసము సేయుచు గూఢరూప రే  
ఖాజ్ఞత లేమిఁ దద్వికృత కాయము మీఁదను దృష్‌ట్లు నిల్పఁగాఁ;  
బ్రాజ్ఞులు మూర్తి సౌమ్యతయు, బాహుల దీర్ఘతయున్‌, భటత్వ త  
త్త్వజ్ఞతయున్‌, గతిస్ఫురదుదాత్తతయుం గని సంశయంబుతోన్‌.

### [4.4.75](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.75)

తే. ‘ఆఁడు చందంబుఁ బురుష సమాకృతియును | గలిగియున్నవి’ యొప్పు నూష్మలత సొంపు  
వికృత వేషావృతంబులై వెలయ కితఁడు | నివుఱు గవిసిన మెఱయని నిప్పువోలె.

### [4.4.76](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.76)

ఉ. బాహుల చాయయున్‌, గమన భంగియు, నర్జునునట్ల; దీన సం  
దేహము లే దితండు తన తేజము డాఁపఁగ మత్స్యభూమి భృ  
ద్గేహమునందుఁ బేడి యనఁ గీడ్పడి యుండెనొ? కాక యీ కురు  
వ్యూహముతోడి కయ్యమున కొండొకరుం డిటు లొంటి వచ్చునే?

### [4.4.77](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.77)

చ. విరటుఁడు దక్షిణంబునకు వీరుల సారథులన్‌ నిజాజికై  
పురిఁ గల వారినెల్లఁ గొనిపోయిన, నొండులు లేమిఁ జేసి యు  
త్తరుఁడిట వచ్చుచుండి, యరదంబు దగం గడపంగ నెవ్వరుం  
దొరకొనకున్నఁ దా నితనిఁ దోడ్కొని వచ్చినవాఁడు సూడఁగన్‌.

### [4.4.78](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.78)

చ. పరి సనుదెంచి గోగణముఁ బట్టె ననన్‌ విని, పిన్నగాన మీఁ  
దరయక రాజనందనుఁ డహంకృతిమైఁ బఱతెంచి, సైన్య వి  
స్ఫురణముఁ జూచి, భీతిఁ దనబుద్ధి గలంగినఁ బాఱఁ జొచ్చె; ని  
ప్పురుషుని శౌర్యసంపదయు భూరిబలంబు నెఱుంగఁ డేమియున్‌.’

### [4.4.79](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.79)

వ. అనుచు నిశ్చయరహిత హృదయులగుచుండ శుండాలరయ లీలాసమరేఖంబగు గమనంబునం బురుహూత పుత్త్రుండు పదశత మాత్ర ప్రదేశ పలాయితుండైన భూమింజయు నెయిది పట్టికొనిన నతండు.

### [4.4.80](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.80)

సీ. వెల వెలఁ బాఱుచు వెగడొందుఁ, బెదవుల | తడియాఱ నెంతయుఁ దల్లడిల్లుఁ,  
జల్లన నంగంబు లెల్ల నిండఁ జెమర్చుఁ, | బదములుఁ గరములుఁ గుదియ వడఁకు,  
హృదయంబు తటతట నదరంగఁ బెలుకుఱు, | దీన దృష్టుల మోముఁ దేఱి చూచు,  
నెలుఁగు గద్గదికఁ దొట్రిల నేడ్చు, విడుమని | ప్రార్థించు మాటఁ గీడ్పాటు దోఁప,  
తే. ‘నిష్కశతశుద్ధ హేమంబు నిర్మలోజ్జ్వ | లాష్ట వైడూర్యములుఁ దురగాఢ్య రథముఁ  
గరటి దశకంబు నొకయూరుఁ బురము సొచ్చి | నపుడ యిచ్చెద నీ’ కను నార్తుఁ డగుచు.

### [4.4.81](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.81)

క. ‘నాతోడి ప్రేముడిం గడు | నాతురయై యెదురుచూచు నంబకుఁ జేతః  
ప్రీతిగఁ జని యాయమఁ బొడ | సూతుం బోనీఁ గదే విశుద్ధచరిత్రా!’

### [4.4.82](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.82)

వ. అని మఱియు నానావిధ దీనాలాపంబులం బ్రార్థించుచుండం బార్థుండు నగుచు నతనిం దేరు సేరం దెచ్చి.

### [4.4.83](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.83)

చ. ‘వెఱవకు మన్న! పోటు కురువీరులతోడ నశక్యమేని, న  
త్తెఱఁగది యేల నీ? కుడుగు; తేరికి సారథి గమ్ము నాకుఁ జి  
చ్చుఱ పిడుగెట్టులట్టడరి శూరుల మొత్తము నుగ్గు సేసెదం;  
బఱపెద సేన, రాజు ధృతిఁ బాపెద, గోవులఁ గ్రమ్మఱించెదన్‌.’

### [4.4.84](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.84)

క. అనుచు నొడఁబాటు లేకు | న్నను, నయ్యుత్తరుని నొగల నడుకొన నిడి, తా  
నును రథ మెక్కి రథికుఁ డయి | చనియె నరుఁడు జమ్మి సేర సమ్మదలీలన్‌.

### [4.4.85](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.85)

వ. ఇట్లు సవ్యసాచి నిక్షిప్తాయుధంబయిన శమీవృక్ష సమీపంబున కరుగు నవసరంబునం గ్లీబరూపచ్ఛన్నుండయ్యును బ్రస్ఫురణ విశేష భీషణుం డగు నతనిం గనుంగొని కౌరవసైనికులు గలంగిన మనంబులతోడ నివ్వెఱపడి యుండ, వారలం గనుంగొని, తోఁచు నుత్పాతంబుల నాలోకించి, గురుం డిట్లనియె.

### [4.4.86](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.86)

క. ‘మాసె నభోమణి; నక్కలు | కూసెం; గలయంగ దెసలకుం బలుచాయల్‌  
సేసెం బఱమొయిళు లడరి; | మ్రోసెం దమయంతఁ దూర్యము లపధ్వనులై.

### [4.4.87](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.87)

క. ఇగ్గజములు మిన్నకయును | మ్రొగ్గెడు; నుత్తమ తురంగములు బాష్పజలం  
బగ్గలము విడుచుచున్నవి; | తగ్గెడుఁ గారణము లేక తడఁబడి పడగల్‌.

### [4.4.88](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.88)

క. దగ్ధము లైనట్టులు స | మ్యగ్‌ధైర్యము లెడలె; మండె నాయుధ చయముల్‌;  
దిగ్ధూమం బెసఁగె; నసం | దిగ్ధము మనకాజి యగుట; దీనికిఁ దగఁగన్‌.

### [4.4.89](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.89)

క. మొన లొఱపుగఁ దీర్చికొనుఁడు; | దనతన వాహనము లాయుధము లెల్ల జనం  
బును ననువు సేసికొనుఁ; డో | పిన యంతయుఁ గాచికొనుఁడు బెదరక పసులన్‌.’

### [4.4.90](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.90)

వ. అని చెప్పి తానప్పు డర్జును నెఱింగినవాఁడు గావున నతనికి నజ్ఞాతవాస సమయభంగం బగునో యను భయంబున సురనదీసూను వదనంబు వీక్షించి సన్నవాఱ నిట్లనియె.

### [4.4.91](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.91)

చ. ‘వెరవరి గాక వీఁడు కురువీరులకుం బొడ సూపువాఁడె? య  
చ్చెరు, వొక మ్రానిపేర నిట సేరఁగ వచ్చుచునున్నవాఁ; డహం  
కరణమ కాని యొండొకటి గానఁడు; మూర్తివిశేష మారయన్‌  
సురపతి యట్ల; వీని మదిచొప్పది యెట్లొ యెఱుంగ నయ్యెడున్‌.’

### [4.4.92](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.92)

క. అనిన విని యెఱిఁగికొని యా | తని మది సందియము మాన్పఁదలఁచి నరేంద్రుం  
గనుఁగొనుచు నతనితోఁ జె | ప్పిన భంగి నిగూఢ వృత్తి భీష్ముఁడు వలికెన్‌.

### [4.4.93](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.93)

క. ‘తలఁపఁగ రిపులకు నిమ్మగు | కొలఁది గడచి వచ్చితిమి; యకుంఠిత బాహా  
బలము నెఱపఁ దఱియయ్యెను | జలింపవల దింక మనకు శత్రులవలనన్‌.’

### [4.4.94](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.94)

వ. అనవుడు నాచార్యుం డయ్యర్థంబు గనికొని పార్థునకు సమయ భంగంబు వలని సంకటంబు లేకునికి మనంబునం బ్రియంబంది మొగంబునం దోఁపనీక పుయిలోట దక్కి యిట్లనియె.

### [4.4.95](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.95)

శా. ‘సింగం బాఁకటితో గుహాంతరమునం జేడ్పాటుమై నుండి మా  
తంగ స్ఫూర్జిత యూథ దర్శన సముద్యత్క్రోధమై వచ్చు నో  
జం గాంతార నివాసఖిన్నమతి నస్మత్సేనపై వీఁడె వ  
చ్చెం గుంతీసుత మధ్యముండు సమరస్థేమాభిరామాకృతిన్‌.

### [4.4.96](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.96)

ఉ. ఈతనితోడి కయ్యమున కియ్యకొనందగు వార లస్మదీ  
యాతత సేనలోఁ గలుగు టారయ సంశయ; మెల్లభంగి గో  
వ్రాతనివర్తనంబు సుకరంబ కిరీటి; కితండు రుద్రునిం  
బ్రీతునిఁ జేసె నా వినమె! పెంపెసలారెడు బాహుసంపదన్‌.’

### [4.4.97](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.97)

వ. అను పలుకు లాకర్ణించి కర్ణుండు కటకటంబడి కుంభసంభవున కిట్లనియె.

### [4.4.98](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.98)

ఉ. ‘పాండవ పక్షపాతమునఁ బల్కుదు నోరికి వచ్చినట్లు, ని  
న్నొండన రామిఁ జేసి; యిది యొప్పునె? కౌరవసేన కెల్ల నొ  
క్కండవ మేటి; వీ బలము గర్వముఁ గుందఁగ నిట్లు శత్రుదో  
శ్చండిమ కోహటించితి; నిజంబునకున్‌ నరుఁ డింత యెక్కుడే?

### [4.4.99](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.99)

ఆ. అతఁడు వచ్చెనేని, నస్మచ్ఛిలీముఖ | పాతచలిత హృదయపద్ముఁ జేసి,  
వెగడు పఱిచి, యోధవీరుల కెల్ల ను | త్సవ మొనర్తు బాహుదర్ప మొప్ప.’

### [4.4.100](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.100)

వ. అనిన విని సుయోధనుండు రాధేయున కిట్లనియె.

### [4.4.101](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.101)

ఆ. ‘తప్పఁ బలికి తీవు; చెప్పెద విను; మితఁ | డర్జునుండ యేని నడవి కేఁగి  
భ్రాతృయుతము గాఁగఁ బండ్రెండు వత్సర | ములును నంద నిలువ వలయు మగుడ.

### [4.4.102](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.102)

క. ఒరుఁడయ్యెనేని మామక | శరాసన క్షిప్త దీప్తసాయక పంక్తిం  
బరిమార్చెద వ్రేల్మిడి న | చ్చెరువుఁ బ్రమోదంబు నొంది సేనలు వొగడన్‌.’

### [4.4.103](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.103)

క. అనుపలుకులకును భీష్ముం | డును ద్రోణుఁడు ద్రోణసూనుఁడును గృపుఁడును మే  
లని యియ్యకొనిరి హృదయా | ననురూపములైన తెలివు లాస్యముఁ బొందన్‌.

### [4.4.104](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.104)

వ. అట్టియెడ శమీవృక్ష సమీపంబున నరదంబు నిలుపంబంచి పార్థుం డుత్తరున కిట్లనియె.

### [4.4.105](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.105)

క. ‘ఇన్నగమునందు గాండివ | మున్నది; యదిగాని మద్భుజోద్రేక విలా  
సోన్నతి కోర్వవు పెద్దయు | నన్నువ లీవిండ్లు కుఱుచ లలఁతి బలంబుల్‌.

### [4.4.106](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.106)

క. ఇవి నీ తెగకొలఁదివి; వీ | రవినోదము నప్పు డధిక రభసము లగు మ  
ద్వివిధాటోపములకుఁ జా | లవు; విల్లది నూఱువేల లావరయంగన్‌.

### [4.4.107](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.107)

క. వీనిఁ గొని గట్టి మైమఱు | వేనుంగును మఱియు నెట్టి వేనియుఁ దునియం  
గా నేయ నగునె? కైదువు | లేని యలవు కలిమి పోర లెస్సై యున్నే?

### [4.4.108](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.108)

వ. కావున నిమ్మహీరుహం బెక్కి యమ్మహనీయ చాపంబు దెచ్చి యిమ్ము; ధర్మజ భీమార్జున నకుల సహదేవులు దమ దమ సమస్తాయుధంబులుఁ గూడంగట్టి యిందుఁ బెట్టిన వా; రాకట్ట విడిచి యందు గాండీవంబు వుచ్చికొని తక్కటియవి యెప్పటియట్ల బంధింపు, ‘మని చెప్పి శవాకారంబున నున్న శస్త్రాస్త్ర సంచయంబు సూపిన భూమింజయుం డతని కిట్లనియె.

### [4.4.109](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.109)

క. ‘పీనుఁగు నంటఁగఁ దగునే | భూనాథ తనూజుఁ డనక, పుయిలోడక, న  
న్నీ నీచపుఁ బనిఁ బనుపం | గా నీకుం దగునె? పాపకర్మము గాదే!’

### [4.4.110](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.110)

వ. అనిన విని ధర్మనందనానుజుం డత్యాదరంబున.

### [4.4.111](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.111)

ఆ. ‘మనుజు లంటకుండ మఱువడఁ జేసిన | యస్త్ర శస్త్ర సంచయంబు గాని,  
శవము గాదు, మత్స్య జనపాలతనయ! యే | నట్టి దైనఁ బనుతునయ్య నిన్ను?

### [4.4.112](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.112)

క. నమ్ముము కైదువు మోపగు, | జమ్మి వెసం బ్రాఁకి విడిచి చాపము నాకం  
ది’ మ్మనుఁడుఁ జేయునది లే | కమ్ముగ్ధుం డమ్మహీజ మలసత నెక్కెన్‌.

### [4.4.113](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.113)

వ. ఇ ట్లుత్తరుండు సమారూఢ శమీవృక్షుం డగుటయు, నరదంబు పయి నిలుచుండి పాండవమధ్యముండు ‘వేవేగ విడువు’ మనవుడు నతండు నాయుధ సంచయ బంధం బెడలించిన.

### [4.4.114](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.114)

క. మెఱసి యుదయించు గ్రహముల | తఱచు ప్రభలఁ గ్రేణిసేసి దశదిశలం గ్రి  
క్కిఱిసి వెడలె నా, విండ్లన్‌ | మెఱుఁగులు, నృపతనయు దృష్‌ట్లు మిఱుమిట్లు గొనన్‌.

### [4.4.115](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.115)

వ. అట్టియెడ నయ్యాయుధంబులు.

### [4.4.116](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.116)

క. పెనుబాముల చందంబున | నునికికి భయమంది వడఁకు నుర్వీశసుతుం  
గని తగుమాటలఁ గుంతీ | తనయుఁడు వెఱ వాపుటయు, నతం డచలితుఁడై.

### [4.4.117](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.117)

వ. పొదుపు విరియందట్టి కనుంగొని నిరూపించి, ‘సారథీ!’ యని సవ్యసాచిం బిలిచి యిట్లనియె.

### [4.4.118](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.118)

క. ‘ఇది యొక చాపము విస్మయ | మొదవించుచుఁ గొండచిలువయొకొ నాఁ దగి యు  
న్నది, ఖచిత కనక కమల స | ముదయద్యుతి సముపగూహనోజ్జ్వల మగుచున్‌.

### [4.4.119](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.119)

వ. దీనిం బాండవులయం దెవ్వరు ధరియింతు?’ రని మఱియు బహు విధంబులగు నాయుధంబు లుపలక్షించి వేఱు వేఱ వాని చందంబు లుపన్యసించి, ‘యివి యెవ్వ రెవ్వరి’ వని యడిగిన నర్జునుం డిట్లనియె.

### [4.4.120](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.120)

తే. ‘తొలుత నీవు న న్నడిగిన దొడ్డ విల్లు | గాండివము, ఫల్గునున కేడుగడయు నదియ;  
సమరమున దేవదానవ సమితినైన | గెలుచు నశ్రమమున దానివలన నతఁడు.

### [4.4.121](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.121)

క. ఆద్యపురుషోపలాలిత | ముద్ద్యోతిత రోచిరుద్గమోగ్రం బరి ని  
ర్భేద్యము దివ్యజనన మన | వద్యం బిది కార్ముకైక వరము గుమారా!

### [4.4.122](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.122)

వ. ఇమ్మహనీయ చాపంబు బ్రహ్మ శతసహస్ర వర్షంబులు, ప్రజాపతి చతుష్షష్టి సహస్ర వర్షంబులు, నింద్రుండు పంచాశీతి హాయనంబులు, సోముండు పంచశతాబ్దంబులు, వరుణుండు శతశరత్సమితియుఁ గ్రమంబున ధరియించిరి; వరుణుచేత నగ్నిదేవుండు వేడుకపడి పుచ్చుకొని పదంపడి ఖాండవ దహనంబున నద్భుత కర్మంబునకు మెచ్చి వివ్వచ్చున కిచ్చె; నతండును నఱువదేనేండ్లు ధరియింపంగలవా; డిట్లిది త్రిలోక పూజ్యమహిమ నొప్పుచుండు.

### [4.4.123](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.123)

సీ. నీలోత్పలచ్ఛాయ నెరసి సౌవర్ణ వృ | షావళి నొప్పు బాణాసనంబుఁ,  
దాళప్రమాణ సుందరమునై భర్మశా | ఖామృగాంచితమగు కార్ముకంబుఁ,  
దీవ్రకృశాను సందీప్తాకృతియుఁ గన | త్కనక మత్స్యంబులుఁ గలుగు ధనువుఁ,  
మెఱుఁగారు సారంబు మెఱయు కాంచనమయూ | రముల శోభిల్లు చాపమును వరుసఁ  
ఆ. బాండవాగ్రజుండుఁ, బవనపుత్రుఁడు, నకు | లుండుఁ దదనుసంభవుండుఁ బట్టు  
నవి కుమార! య గ్గవాజిన కోశమ | హాశరంబు పార్థునదియ చూవె!

### [4.4.124](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.124)

క. ఎద్దెసలం దనరుచులు స | ముద్దీప్తము లగుచునుండ, నుజ్జ్వల మగు న  
య్యుద్దండ గదాదండము | పెద్దయు నెడ మెచ్చి పట్టు భీముఁడు పోరన్‌.’

### [4.4.125](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.125)

వ. అనిచెప్పి మఱియు బాణ కృపాణ తనుత్రాణాదు లగు వివిధ సాధనంబులు వేఱువేఱ నిరూపించి గ్రక్కున నెఱింగించె; నప్పుడు మూఢాత్ముండగు నయ్యుత్తరుండు పాండవోత్తము నెఱుంగమి నిట్లనియె.

### [4.4.126](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.126)

క. ‘ఈ యెడ ని ట్లిమ్మహనీ | యాయుధములు పెట్టి యెచటి కరిగిరి మన కౌం  
తేయులు బృహన్నలా! తగ | నీ యెఱిఁగిన యంతవట్టు నిక్కము సెపుమా!’

### [4.4.127](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.127)

వ. అని సస్నేహంబును, సగౌరవంబును, సవిషాదంబునుంగా మఱియును.

### [4.4.128](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.128)

క. ‘ఏ నమ్మహానుభావుల | మేనల్లుఁడ; వార లార్యమిత్రులు, శత్రు  
క్ష్మా నాయక గర్వ తమో | భానులు, బంధుహిత కార్య పరతంత్రాత్ముల్‌.

### [4.4.129](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.129)

తే. అయ్యుధిష్ఠిరుఁ డెచ్చట నడఁగి యున్న | వాఁడొ? భీముని పార్థుని వర్తనంబు  
లెయ్యెడల నేమి చందంబులయ్యె? నక్క | టా విధాతృండ! కవ లెందు దాఁగి రొక్కొ?

### [4.4.130](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.130)

క. భూపాల వల్లభాజన | దీపిక యనఁ జాలు ద్రౌపదికి నెయ్యెడలం  
దేపాటులు వాటిల్లెనొ? | కాపురుషులవలన నిట్టి కాఱియ పుట్టెన్‌.

### [4.4.131](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.131)

క. కపట ద్యూత మొనర్చిన | నృపతియు దుర్యోధనాది నీచుల వలఁ బా  
ఱి పడియెఁ గడుఁ బెక్కిడుమల | రిపుమర్దన వీర్యభుజ గరిష్ఠుం డయ్యున్‌.

### [4.4.132](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.132)

క. వినఁబడ రెచ్చోటను దమ | వినుత మహీరాజ్య మహిమ విడిచి చనుట, నే  
మని వినియెదనో నీచే?’ | ననుడు నతం డిట్టులనియె నాతని తోడన్‌.

### [4.4.133](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.133)

వ. ‘వారలకు వగవ వలవదు; విధివశంబున వచ్చిన యాపదకు నోర్చి బాసతప్పక తారును బాంచాలియు నొక్కటఁ బండ్రెండేండ్లు వనంబున వసియించి పదుమూఁడగునేఁ డజ్ఞాతవాసంబు సలుప వలయుట నిట వచ్చి మనవీట నవ్యాపన్నులై యున్నవారు. వినుము వారి నెఱింగించెద.

### [4.4.134](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.134)

క. కంకుఁడు ధర్మసుతుఁడు; వల | లాంకుఁడు భీముండు; కవలు హయశిక్షక గో  
కింకరులు; సెప్పఁ దొడఁగితి | నింకఁ గొఱఁత వెట్ట నేల? యే నర్జునుఁడన్‌.

### [4.4.135](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.135)

తే. అధిపనందన! మాలిని యనఁగఁ బరఁగు | కాంత ద్రౌపది; దానికై కాదె సింహ  
బలునిఁ దమ్ముల గంధర్వపతులు సంపి | రనఁగఁ జంపె మహోగ్రత ననిలసుతుఁడు.’

### [4.4.136](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.136)

వ. అనిన విని భూమింజయుండు సంభ్రమాశ్చర్య సంశయంబులు మనంబున ముప్పిరి గొనం దప్పక చూచి, సవ్యసాచికి వెండియు నిట్లనియె.

### [4.4.137](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.137)

క. ‘చిరకీర్తి ప్రియుఁడగు న | న్నరునకుఁ బది గలవు భవ్యనామములు మనో  
హరముగ నవి సెపుమా యొం | డరయక యే నమ్మెదను బృహన్నల! నిన్నున్‌.’

### [4.4.138](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.138)

వ. అనుటయు నతండు సస్మితాననుం డగుచు, ‘నర్జునుండు, ఫల్గునుండు, పార్థుండు, కిరీటి, శ్వేతవాహనుండు, బీభత్సుండు, విజయుండు, జిష్ణుండు, సవ్యసాచి, ధనంజయుండు నను నివి పదియును నా పేళ్ళనవుడు, నుత్తరుండు పాండవమధ్యమున కిట్లనియె.

### [4.4.139](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.139)

క. ‘ఏమి కతంబున నిట్లీ | నామంబులు సంభవిల్లె నరునకు? నవి చే  
తో మోదంబుగఁ జెప్పుము | నీమది తత్తద్విధంబు నిశ్చితమేనిన్‌.’

### [4.4.140](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.140)

వ. అనుటయు ‘నట్ల చేయుదు’ నని యతం డిట్లనియె.

### [4.4.141](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.141)

ఆ. ‘ధరణి యెల్ల గెలిచి తగ ధనంబులు గొని | యునికి నే ధనంజయుండ నైతి;  
నెట్టివారినైన నెదిరినఁ బోర జ | యంబు గొనుట విజయుఁ డండ్రు నన్ను.

### [4.4.142](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.142)

తే. తెలుపులగు వాహనములు నాతేర సమర | భూములం దెప్డు నియతిమైఁ బూన్కిఁ జేసి  
శ్వేతవాహన నామవిఖ్యాతి నాకు | సకలజన సమ్మతంబుగ సంభవించె.

### [4.4.143](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.143)

చ. రవి యుదయించు నట్లు సమరంబున నా తలమీఁదఁ గాంతి మూ  
ర్తి వెలుఁగు నింద్రుఁ డిచ్చిన కిరీట మభేద్యమహోగ్ర సుస్థిర  
త్వ విభవ రూఢిమై; జనులు దానన నన్నుఁ గిరీటి నామ సం  
స్తవన విశేష పాత్రముగ సమ్మతిఁ జేసిరి మాత్స్యనందనా!

### [4.4.144](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.144)

తే. వీరులకుఁ జూడ బీభత్స విధము గలుగు | నట్టి కార్యంబు సేఁతకు నెట్టి సమర  
భంగులను దడఁబడక బీభత్స సేయ; | దాన బీభత్సుఁ డను నభిధాన మయ్యె.

### [4.4.145](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.145)

క. భండనమున నిరుగేలను | గాండీవముఁ దివియ నేర్పు గలిగిన నందు  
ద్దండ మగు సవ్యకరము ప్ర | చండతఁ బరఁగుదును సవ్యసాచి యనంగన్‌.

### [4.4.146](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.146)

తే. ధరణి దుర్లభమగు నవదాతవర్ణ | మారఁ గలుగుట నర్జునుఁ డండ్రు నన్ను;  
ఫల్గునాహ్వయ ముత్తర ఫల్గునీ వి | శిష్టకాల సంజననతఁ జేసి గలిగె.

### [4.4.147](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.147)

క. అని మొన మార్కొని వ్రణ మేఁ | గనుఁగొన ధర్మజుని మేనఁ గావింపఁగ న  
య్యనిమిషులుఁ జాల రెవ్వరుఁ | జెనకినఁ బరిమార్తుఁ గాన జిష్ణుఁడ నైతిన్‌.

### [4.4.148](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.148)

క. పృథ యను పేరు మదంబకుఁ | బ్రథితంబై యునికిఁ జేసి పార్థుఁడ నైతిన్‌;  
వృథయుఁగఁ బలుకుదునే? యవి | తథవచనుండైన ధర్మతనయు ననుజుఁడన్‌.

### [4.4.149](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.149)

వ. ఈ పది పేళ్ళును నివి కారణంబులుగాఁ బ్రకాశంబులయ్యె; సకలసుర నికరంబు లడ్డపడినం బుండరీకాక్ష సహాయుండనై ఖాండవం బేర్చి నప్పుడు మెచ్చి భద్రమూర్తులైన రుద్ర విరించులు సన్నిధి సేసినం బెన్నిధిఁ గన్న పేద చందంబున సంభ్రమించు నాకుం గరుణించి కృష్ణుండను నేకాదశ నామంబును, నప్రతిహత బాణంబులు నొసంగిరి. వారల యనుమతి నింద్రాదులయిన విబుధులును వివిధంబులగు దివ్యాస్త్రంబు లిచ్చిరి; పదంపడి గీర్వాణులకు నోర్వరాని యట్టివారి, వరదాన గర్వితుల నివాతకవచు లనియెడు దైతేయుల మాతలి సారథికంబగు నైంద్రస్యందనం బెక్కి యొక్కండన మూఁడు కోట్ల నిర్జించితి. దుర్జయులగు హిరణ్యపుర నివాసుల నఱువది వేవుర దేవారాతుల వారాశి తీరంబునం బరిమార్చితి; నప్పుడు ప్రీతుండై గిరిభేది కిరీటం బొసంగె; దేవసంఘంబు శంఖంబిచ్చె; నది కతంబుగా నచ్చిందంబు దేవదత్తం బనంబరఁగె. మఱియు నెయ్యెడల నెవ్వరు దొడరినం బొలివోని బలిమి కలిమి వెలుంగుదు. గాంధారీ నందనుండు గంధర్వరాజు చేతం బట్టువడిన యప్పుడు పదునాలుగువేల గంధర్వుల జయించి యతని విడిపించితి, నీ వోడకు; మీ కూడిన కురుబలంబుల గెలిచి, కర్ణ, గాంగేయ, కృప, ద్రోణ, ద్రౌణి, దుర్యోధనులు కనుంగొనుచుండఁ గదుపులం గ్రమ్మఱించెద’ నని సత్వరంబుగాఁ జెప్పిన, విని యుత్తరుండు చిత్తంబున నద్భుత హర్షంబులు వొదువ మ్రాను డిగ్గనుఱికి, సర్వాంగ సంగతోర్వీ తలంబగు దండప్రణామం బాచరించి, చేతులు మొగిచి నిలిచి యిట్లనియె.

### [4.4.150](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.150)

ఉ. ‘బాహు సమగ్ర శత్రు మదభంజన శౌర్య! సమస్తలోక చే  
తోహర మూర్తి! నీ విటులు దోఁచుట నాకుఁ బ్రసన్న విస్ఫుర  
ద్దేహముతోడ భాగ్యమయ దేవత సన్నిధిసేఁత గాదె; స  
మ్మోహము పాసెఁ; జిత్తము ప్రమోద రసత్వముఁ బొంది పొంగెడున్‌.

### [4.4.151](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.151)

క. ని న్నెఱుఁగక యే నే మే | నన్న పలుకులెల్ల మఱచి యాశ్రిత రక్షా  
సన్నద్ధ భావ మేర్పడ | నన్నుం గృపఁ జూడవే సనాథుఁడ నగుదున్‌.’

### [4.4.152](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.152)

క. అన వినుచుఁ దేరు డిగి గ్ర | క్కునఁ గౌఁగిటఁ జేర్చె విరటుకొడుకును గుంతీ  
తనయుఁడు సమ్మదమునఁ దన | కనుఁగవఁ గడు నశ్రువారి కడలుకొనంగన్‌.

### [4.4.153](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.153)

వ. ఇట్లు సమాలింగితుండై.

### [4.4.154](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.154)

చ. ‘మనము కలంకదేఱె రిపుమర్దన విక్రమ! యెక్కు తేరు; నీ  
ఘనభుజశక్తి ప్రాపున నఖండిత శౌర్య మహోన్నతుండనై  
యనిమొన సారథిత్వము మహత్త్వము వైరులు మెచ్చఁ జూపెదన్‌  
ననుఁ బనిగొమ్ము, లెమ్ము, కురునాథు నదల్పు, మరల్పు గోవులన్‌.

### [4.4.155](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.155)

క. మనమునఁ గోరుదు నే న | ర్జునునకు సమరమున రథ్యచోదక భావం  
బునఁ బని సేయవలయు నని | యనిశము; విధికరుణ నాకు నది సిద్ధించెన్‌.’

### [4.4.156](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.156)

వ. అని పలుకు నుత్తరు నత్యాదరంబునం జూచి సవ్యసాచి యతని కిట్లనియె.

### [4.4.157](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.157)

మ. ‘ప్రియ మక్షీణము నాకు నీ దెస; మదిన్‌ భీతిప్రదోద్వేగ సం  
శయముల్‌ సేరఁగ నీను నీకు; ఘనరక్షా కల్పనా బుద్ధి ని  
శ్చయ సంపాదిని నాదు దృష్టి; నిను నశ్వవ్రాతముం జోఁక గా  
లియు రానీను; దృణీకరింపు రిపుదోర్లీలాసముల్లాసమున్‌.’

### [4.4.158](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.158)

వ. అనిన విని భూమింజయుండు సవినయంబుగా నిట్లనియె.

### [4.4.159](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.159)

క. ‘నిను నర్జునుండని యెఱిం | గిన యంతన పాసె నెల్ల కిల్బిషములు; నీ  
తను వేల షండభావం | బునఁ బొందెనొ యెఱుఁగవలయుఁ బుంస్త్వాభరణా!

### [4.4.160](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.160)

చ. అనవుడు నాతఁ డిట్లను, ‘మదగ్రజుపంపున బ్రహ్మచర్య వ  
ర్తనకయి పూర్వశాపవిహితంబగు రూపముఁ దాల్చి యేకహా  
యన పరిపాలనీయ మగునట్టి వ్రతంబు సమాప్తిఁ బొందఁ జ  
ల్పిన జతనంబు లోకులకుఁ బేడితనంబయి తోఁచె నిమ్మెయిన్‌.

### [4.4.161](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.161)

వ. అదియును నిటమీఁద లే’దనినఁ బ్రమోదమాన మానసుండయి, మత్స్యపతిసూనుండు పాండుసూనున కిట్లనియె.

### [4.4.162](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.162)

ఆ. ‘ఇట్లు తెలియఁ జెప్పుటెల్ల నాదెస దయ | పెంపుతోడి కూర్మి పేర్మిఁ గాదె!  
యింక సురలకైన శంకింతునే? భవ | ద్బాహువప్రగుప్తి బలుపు గలుగ.

### [4.4.163](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.163)

వ. నాకుం బని యెయ్యది పనుపు ‘మనిన నతండును’ గాండీవంబును, గాంచన పుంఖంబులగు బాణంబులు గల తూణీర యుగళంబును, మదీయ తను త్రాణ కృపాణంబులును బుచ్చికొని తక్కిన వాని నెప్పటి భంగిన కట్టి పెట్టి ర’ మ్మని నియోగించిన, నాతండు నట్ల చేయుటయు, నమ్మహాత్ముండు నియాతాత్ముండయి యధి దేవతలకుం బ్రాణమిల్లి, భక్తితోడ దివ్యకోదండాదులగు సాధనంబులు గైకొని, సవిశేషస్ఫూర్తి యగు మూర్తి నత్యంత దర్శనీయత్వంబు నొంది.

### [4.4.164](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.164)

క. బలరిపుఁ డిచ్చిన కుండల | ములు నుష్ణీషంబుఁ జిత్తమున భక్తి మెయిం  
దలఁప నవి వచ్చె; వెండ్రుక | లలవడగాఁ బాచి ముడిచె నమర దృఢముగన్‌.

### [4.4.165](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.165)

క. తలచుట్టు చుట్టెఁ; గుండల | ములు వెట్టెను; ద్రిండు గాఢముగఁ గట్టెఁ; గరం  
బుల వలయంబులు గనుఁగొని | యెల నవ్వొలయంగ నెక్కె నేడ్తెఱ రథమున్‌.

### [4.4.166](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.166)

వ. అట్టి యెడ వరదాన మహానుభావంబునం జేసి.

### [4.4.167](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.167)

క. పెట్టక కట్టక మౌళిం | బుట్టిన క్రియ దీధితులు నభోభాగంబున్‌  
ముట్టి వెలుంగఁగ నింద్రుని | పట్టి కిరీటంబు పొలిచెఁ బ్రస్ఫురితంబై.

### [4.4.168](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.168)

వ. ఇవ్విధంబున సన్నద్ధుండై యతిరథశ్రేష్ఠుండు రథం బెక్కి యం దాయుధంబులు పదిలంబుగా నిడి, తనుత్రాణ తలత్రాణంబులు తాల్చి, కవదొనలం బూని, గాండీవంబుఁ బుచ్చికొని యెక్కువెట్టి, ముష్టి నలవరించి గుణధ్వని సేసిన.

### [4.4.169](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.169)

తే. పక్షి మృగజాతు లెల్లను బ్రమసి యిట్టు | నట్టుఁ గలగొనఁ జెదరె; వృక్షాళి యదరెఁ;  
గురుబలంబును బెదరె; నంబరము దిశలు | బూరటిల్లంగఁ దొడఁగెఁ దదారవమున.

### [4.4.170](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.170)

వ. తదనంతరంబ యగ్నిదేవుం దలంచిన, నతండును దన వరంబున మున్న కలిగి విశ్వకర్మ నిర్మితంబును, మాయామయంబును, వానరాకారంబును నగు మహోగ్ర కేతనంబును, తదాశ్రితంబులైన వికృతాభీల నానావిధ భూతంబులఁ బుత్తెంచిన, నుదాత్త చిత్తుండయి యుత్తరు సింహపతాక శమీవృక్షంబునం బెట్టించి, నిజ ధ్వజంబు రథంబునం గట్టించి, దివ్యంబు గావున దేవదత్తంబు చిత్తజ్ఞత్వంబున సన్నిధి సేసిన సవినయంబుగాఁ గైకొనియె; నక్కుమారుండును నాయితంబై నొగలెక్కి పగ్గంబు లమర్చికొని యగ్గలిక తోడం దురంగంబుల యంగంబులు తొడయుచు వాని జవసత్త్వంబులు వేఱు వేఱ వర్ణించిన.

### [4.4.171](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.171)

చ. ‘తడవగుదెంచె; జమ్మికిఁ బ్రదక్షిణవృత్తిగఁ దేరు వోవని;  
మ్మెడ గలుగంగఁ బోయెఁ బసు; లిప్పుడ కూడుద’ మన్న నాతఁడున్‌  
నడపఁ దొడంగుడున్‌ మనమునన్‌ రణకౌతుక ముల్లసిల్లఁగాఁ  
బిడుగుల పిండు బిట్టులియు పెల్లునఁ బార్థుఁడు శంఖ మొత్తినన్‌.

### [4.4.172](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.172)

మ. కలఁగెం దోయధి సప్తకంబు; గిరివర్గం బెల్ల నూటాడె, సం  
చలతం బొందె వసుంధరావలయ; మాశాచక్ర మల్లాడెఁ; గొం  
దల మందెం ద్రిదశేంద్రు పట్టణము; పాతాళంబు ఘూర్ణిల్లె; నా  
కులమయ్యెన్‌ గ్రహతారకాకులము; సంక్షోభించె నవ్వేధయున్‌.

### [4.4.173](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.173)

తే. అపుడు నిశ్చేష్టితంబులై హయము లవనిఁ | జాఁపకట్టుగఁ బడియె; మత్స్యక్షితీశ  
నందనుండును నొగలపై మ్రందినట్లు | మ్రొగ్గతిలఁ జాఁగి బలితంపు మూర్ఛఁ బొందె.

### [4.4.174](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.174)

చ. కనుఁగొని ఫల్గునుండు తురగంబుల వాగెలు వట్టి యెత్తి, త  
త్తనువులు నూల్కొనన్‌ నివిరి, తత్పరతం దగ మత్స్యభూమిభృ  
త్తనయుని నూఁదిపట్టి, వికృతంబగు రూపము చక్కఁజేసి, నె  
మ్మన మొకభంగిఁ దేర్చి, గరిమంబుగఁ గౌఁగిటఁ జేర్చి, యిట్లనున్‌.

### [4.4.175](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.175)

తే. ‘శంఖ భేరీ రవంబులు, సామజముల | బృంహితంబులు వింతలే పృథుల సైన్య  
పరిచయోదాత్తులగు నరపాల సుతుల? | కెలమిఁ బొందుము దీనికి నింత యేల?’

### [4.4.176](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.176)

చ. అనవుడు మత్స్యరాజసుతుఁ డాతని కిట్లనుఁ ‘దొల్లి శంఖ ని  
స్వనములు విందు, భేరుల రవంబులు విందుఁ, గరీంద్ర బృంహిత  
ధ్వనులును విందు, నద్భుత విధంబుగ ని ట్లవి యెల్లఁ జిత్తమో  
హన మొనరింపఁ జాలునె! మహానినదం బిది యోర్వవచ్చునే?

### [4.4.177](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.177)

చ. చెవు లవిసెన్‌, దిశల్‌ దిరిగెఁ, జిత్తము నీరయిపోయె నాకు నీ  
రవమున; నిమ్మహోగ్ర కపిరాజు పతాకయుఁ జూడ్కిఁ జీఁకటుల్‌  
గవియఁగఁ గ్రాలెడున్‌, భవదఖండిత తేజము పర్వి యాత్మకున్‌  
వివశతఁ జేయుచున్నయది, విహ్వల భావము మాననేర్చునే?’

### [4.4.178](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.178)

క. అన విని తగు మాటల నా | తని కొందలపాటు పాండుతనయుండు క్రమం  
బున డిందుపఱిచి యరదము | సనఁగా నెఱిఁగించి పట్టె శంఖము మఱియున్‌.

### [4.4.179](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.179)

వ. ఇత్తెఱంగున నయ్యుత్తర కుమారు ధీరుంగావించుకొని పాండవవీరుండు రథనేమి నిస్వన జ్యానాద మేదురం బగు శంఖారవంబు సెలంగ నడచు సమయంబున నాచార్యుండు దుర్యోధనున కిట్లనియె.

### [4.4.180](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.180)

సీ. ‘శ్రవణ పుటంబులు వ్రయ్యంగఁ దాఁకి సం | క్షోభంబు గావించె గుణము మ్రోఁత;  
బ్రహ్మాండ భాండంబు పగిలించి భూత ని | శ్చైతన్య మొనరించె శంఖ రవము;  
గగనభాగం బెల్లఁ గప్పి క్రాలుచు బెగ | డడరించె నుగ్రంపుఁ బడగపఱపు;  
మిఱుమిట్లు గొని చూడ్కి పఱివోవ వెలిఁగి ప | రి భ్రాంతి సేసెఁ గిరీట కాంతి;  
తే. తెల్ల మిది గాండివంబును దేవదత్త | మును గపిధ్వజమును వాసవుని వరమునఁ  
గన్న మకుటంబు నగు; వేఱ కొన్ని యైన | నుజ్జ్వలాద్భుత భంగులై యున్నె యిట్లు!

### [4.4.181](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.181)

ఉ. అచ్చెరువైన విక్రమము నగ్గలికన్‌ సమరంబు గోరి యీ  
వచ్చుచునున్నవాఁడు బలవద్రిపుభీషణబాహుఁ డైన వి  
వ్వచ్చుఁడ; యింక మిన్నక వివాదము సేసినఁ బోవ; దియ్యెడం  
బొచ్చెము లేని బల్మగలఁ బోరి కమర్పుము దర్పమేర్పడన్‌.’

### [4.4.182](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.182)

వ. అని కృపాశ్వత్థామాది యోధముఖ్యుల నవలోకించి.

### [4.4.183](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.183)

క. ‘మనమొనల దుర్నిమిత్తము | లనేకములు పుట్టఁ దొడఁగె; నట్లగుట జయం  
బనుమానం; బొక కార్యము | వినుఁడా! మీకెల్లఁ జూడ వెరవగు నేనిన్‌.

### [4.4.184](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.184)

ఉ. ముందర రాజుఁ బుచ్చి, బలముల్‌ గలయంబడి గోవ్రజంబులన్‌  
దందడి పెట్టకుండఁ బిఱుఁదన్‌ నడిపింపఁగఁ బంచి, గట్టిమై  
నందఱు నింతకున్‌ వెనుకయై మొనలేర్చి చనంగ, నెప్డు సం  
క్రందనసూతి డగ్గఱియెఁ, గయ్యము సేయుట కప్పు డిమ్మగున్‌.’

### [4.4.185](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.185)

వ. అనిన విని సుయోధనుండు భీష్మ కృప కర్ణ వికర్ణుల దెసం గనుంగొని ‘మున్నునుం జెప్పితిన కాదె! జూదంబునం బరాజయం బొంది, పాండునందనులు పండ్రెండు వత్సరంబులు వనంబున వసియింపను, బదుమూఁడగు నేఁడు జనపదంబున మన మెఱుంగకుండఁ జరియింపనుం బూని కాదె భూమి వెలువడిరి; యా పదుమూఁడవ యేఁటి కొఱంత గలుగం బార్థుండు దన్నెఱింగించి కొనియె నేని నెప్పటియట్ల వనవాసంబునకుం జనవలయు; నిది మనము మోహంబునం గానమి నొండె; వారు లోభంబున వచ్చుట నొండె నగుం గావున నెక్కువ దక్కువలు నిరూపించి భీష్ములు దీని నిశ్చయింప నర్హులు; రిత్త యుత్తరుండ కాక గాండీవియు నగుట మన కార్యంబు సఫలంబు; సుశర్మ నక్కడ గోవులం బట్టం బనిచి యిక్కడ మనమును బట్టుట మత్స్యనగరంబునం గౌంతేయులున్నవారని శంకించి వారలు కూయి వచ్చినం గనుటకుం గాదె? యిట్లు నిశ్చయించి చేసిన పనికి నిపుడు విచారం బేల?’ యని పలికి వెండియు నిట్లనియె.

### [4.4.186](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.186)

ఉ. ‘అర్జునుఁడైన నేమి? సురలైనను నేమగు? విద్విషచ్ఛిదో  
పార్జితమైన గోగణముఁ బట్టితి; మెవ్వరు వచ్చిరేని వి  
స్ఫూర్జిత బాహుసంపదలు సూపుద మొండొరు మీఱి నిర్మలా  
త్యూర్జిత కీర్తికారణ రణోద్ధతి; వెల్వెలఁ బాఱ నేటికిన్‌?

### [4.4.187](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.187)

చ. మనసుల నూలుకొల్పి, యనుమానము లెల్లను బాచి, యేచి వా  
హనములు నాయుధంబులును నాయిత మయ్యెడు భంగిఁ జేయుచున్‌  
మొనలకు హెచ్చుగా మనము మున్ను గడంగినఁ గాక శత్రులం  
గనుఁగొని యిట్టు లొండొరు మొగంబులు సూచుచునున్నఁ బోవునే?

### [4.4.188](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.188)

ఆ. హరుల హేషితములు ననుకూల వాయు సం | చారములును మనకు జయము కలిమిఁ  
దెలుపుచున్నయవి; యుధిష్ఠిరానుజుఁ డొక్కఁ | డీ బలంబు గెలువ నెట్లు నేర్చు?

### [4.4.189](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.189)

క. ఎవ్వరు వినినను దీనికి | నవ్వుదురని యెఱుఁగఁ డకట! నా యెదురెదురన్‌  
వివ్వచ్చుఁ జూపి సేనలు | క్రొవ్వఱఁ బలుపలుకులిట్లు ద్రోణుఁడు పలికెన్‌.

### [4.4.190](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.190)

తే. రోష మొండెను రాజ్యాభిలాష మొండెఁ | గాక యీతని రాకకుఁ గారణంబు  
పెఱ యెఱుంగమ; యెదిరిని బెద్దఁ జేసి | పూని వంది విధంబునఁ బొగడ నేల?

### [4.4.191](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.191)

వ. ఆచార్యులైన వారలు కార్యంబు దవ్వులం గనియెడు వారు గాన కయ్యంబు తెఱంగు వారల నడుగ వలవదు; బుద్ధిమంతు లిండ్లకడనుండి భోజనావసరంబుల, నాయుధ శ్రమ సమయంబుల, నీతిశాస్త్ర గోష్ఠీకాలంబుల నుచితాలాపంబులు పలుకుదురు గాని పోట్లాడెడువారు గారు; వారిం గలనం గలసి నిలువనీక పిఱిందిదెస నిలిపిన మనకు వారు విజయంబు గోరుచుండుదు; రది లెస్స’ యనిన విని యశ్వత్థామ యతని కిట్లనియె.

### [4.4.192](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.192)

ఉ. ‘కావలివారిఁ దోలి, యెసకంబున గోవులఁ బట్టికొంటి నం  
చీ వెడమాట లేల ధరణీశ్వర! యింతకుమున్న వీటికిం  
బోవవు, శత్రునే పుడిపి పోయెడు వాఁడవు గావు నీవు; సై  
న్యావలి యైనఁ జేడ్పడక యాతల కెయ్దుట లేదు నేనియున్‌.

### [4.4.193](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.193)

క. సమరమున గెల్చి, యొరు రా | జ్యము గొనియును సుజనుఁ డిట్టు లాడఁడు; సిరి జూ  
దమునఁ గొని రజ్జు లేటికి? | సమయం బరుదెంచెఁ దొంటిచందము గలదే!

### [4.4.194](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.194)

ఉ. పాండవవీరులం గలన బాహుబలంబున నోర్చియే సము  
ద్దండత నీవు దొల్లి ద్రుపదక్షితిపాత్మజఁ గొల్వులోనికిం  
దెండని పుచ్చి? తద్దెసకుఁ దెచ్చుట సౌబలు నీతిఁ గాదె? యా  
తండ మరల్చుఁ గాక సముదగ్రత వచ్చు విరోధి నిప్పుడున్‌.

### [4.4.195](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.195)

వ. అబ్భంగి నవమానింపం బడినవాఁడు గావున ధార్తరాష్ట్రకుల ధూమకేతు వగు కపికేతనుండు దోఁచె; నీకు దుర్మదంబున ద్రోణాచార్యుల నధిక్షేపింపవచ్చు నంతియకాక దేవదానవుల కయినను దుర్జయుండగు నర్జునునకుం దలసూప వచ్చునే! నయ విక్రమంబుల నతిలోకుండగు నతని నెవ్వరికేనియుం బొగడవలయు ననినం బుత్రనిర్విశేషుండగు నిజ ప్రియ శిష్యుని నగ్గించుట గురునకుం గొఱంతయె? యింక సిగ్గుమాలి రణంబు సేసెనేనియు ద్రోణుండు సేయుంగాని యే నిట్టి దాని కోర్వ; నదియునుం గాక.

### [4.4.196](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.196)

క. ప్రళయాంతకుండు బడబా | నలమును మృత్యువును నెదిరినం గొఱఁతవడన్‌  
నిలిపినను నిలుపు; మార్కొని | చెలఁగిన నరుశరము లనవశేషము సేయున్‌.

### [4.4.197](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.197)

ఆ. కుటిలబుద్ధు లిచటఁ గొనవు; నెట్టన ఘన | దోర్బలంబు మెఱసి తొడర వలయు;  
నతఁడు గాండివమున నడ్డసాళులు వైవఁ; | డురుల నంపవాన గురియుఁ గాని.

### [4.4.198](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.198)

క. విను మట్టులు గాకున్నం | దన గోవుల వెనుక మత్స్యధరణీశుఁడు వ  
చ్చిన మార్కొందుము; నరుఁ డే | పున ముట్టిన నతని పొంతఁ బోదుమె? యధిపా!’

### [4.4.199](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.199)

వ. అనిన విని, రాధేయుండు సక్రోధుండై యోధవీర లోకంబు నాలోకించి.

### [4.4.200](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4.200)

చ. ‘వడిగొని గోగణంబుఁ బొదువం బఱతెంచితి రెల్లవారు ము  
న్నొడఁబడి పాండునందనుల యున్నెడ యిమ్మెయిగాన వేఁడి; యి  
ప్పుడు నరుఁ గాంచి మీ రతని పోటు నుతించుచు భీతి నిట్లు వా  
విడిచి యనేక భంగిఁ బృథివీపతి వీఱిఁడిఁ జేయు టొప్పునే?

_First 200 of 279 passages. [Read on](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4)_

---
Source: [https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4) · Pramāṇa
