<!-- Pramāṇa, a library of Indian primary sources · https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4 -->

[Pramāṇa](https://indike.org/pramana/) › [Indian literature](https://indike.org/pramana/in) › [Epic, Poetry, Drama & Narrative](https://indike.org/pramana/in.lit) › [The Mahābhārata and its versions](https://indike.org/pramana/in.lit.mahabharata) › [Mahābhāratas in Indian regional languages](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa) › [Andhra Mahabharatamu](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra) › 4

# Andhra Mahabharatamu 4

Āndhra Mahābhāratamu 4

- **Language:** Telugu

## Contents

- [4.1 విరాటపర్వము — ప్రథమాశ్వాసము](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1) — 336 parts
- [4.2 విరాటపర్వము — ద్వితీయాశ్వాసము](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.2) — 366 parts
- [4.3 విరాటపర్వము — తృతీయాశ్వాసము](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.3) — 241 parts
- [4.4 విరాటపర్వము — చతుర్థాశ్వాసము](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.4) — 278 parts
- [4.5 విరాటపర్వము — పంచమాశ్వాసము](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.5) — 408 parts

### విరాటపర్వము — ప్రథమాశ్వాసము

### [4.1.1](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.1)

ఉ. శ్రీయన గౌరినాఁ బరఁగు చెల్వకుఁ జిత్తము పల్లవింప భ  
ద్రాయితమూర్తి యై హరిహరంబగు రూపము దాల్చి “విష్ణు రూ  
పాయ నమశ్శివాయ” యని పల్కెడు భక్తజనంబు వైదిక  
ధ్యాయిత కిచ్చ మెచ్చు పరతత్త్వముఁ గొల్చెద నిష్టసిద్ధికిన్‌.

### [4.1.2](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.2)

వ. అని సకల బ్రహ్మ ప్రార్థనంబు సేసి, తత్ప్రసాదాసాదిత కవిత్వ తత్త్వ నిరతిశయాను భావానంద భరితాంతః కరణుండ నగుచుండి యొక్కనాఁ డిట్లని వితర్కించితి.

### [4.1.3](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.3)

శా. విద్వత్సంస్తవనీయ భవ్య కవితావేశుండు, విజ్ఞాన సం  
పద్విఖ్యాతుఁడు, సంయమి ప్రకర సంభావ్యానుభావుండు, గృ  
ష్ణద్వైపాయనుఁ డర్థి లోకహితనిష్ఠం బూని కావించె ధ  
ర్మాద్వైతస్థితి భారతాఖ్య మగు లేఖ్యంబైన యామ్నాయమున్‌.

### [4.1.4](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.4)

క. వేదములకు నఖిల స్మృతి | వాదములకు బహు పురాణ వర్గంబులకున్‌  
వా దైన చోటులను దా | మూదల ధర్మార్థ కామ మోక్ష స్థితికిన్‌.

### [4.1.5](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.5)

వ. అదియును.

### [4.1.6](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.6)

ఉ. ఆదరణీయ సార వివిధార్థ గతి స్ఫురణంబు గల్గి య  
ష్టాదశ పర్వ నిర్వహణ సంభృతమై పెనుపొందియుండ; నం  
దాదిఁ దొడంగి మూఁడుకృతు లాంధ్ర కవిత్వ విశారదుండు వి  
ద్యాదయితుం డొనర్చె మహితాత్ముఁడు నన్నయభట్టు దక్షతన్‌.

### [4.1.7](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.7)

మ. హృదయాహ్లాది, చతుర్థ, మూర్జిత కథోపేతంబు, నానా రసా  
భ్యుదయోల్లాసి విరాటపర్వ; మట యుద్యోగాదులుం గూడఁగాఁ  
బదియేనింటిఁ దెనుంగుబాస జనసంప్రార్థ్యంబులై పెంపునం  
దుదిముట్టన్‌ రచియించు టొప్పు బుధ సంతోషంబు నిండారఁగన్‌.

### [4.1.8](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.8)

క. అని రచనా కౌతుకమున | మన మలరఁగ ‘ నీ ప్రబంధ మండలి కధినా  
ధునిఁగా నే పురుషునిఁ బే | ర్కొనువాఁడనొ’ యను తలంపు గూరిన మదితోన్‌.

### [4.1.9](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.9)

వ. ఇంచుక నిద్రించు సమయంబున.

### [4.1.10](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.10)

సీ. మజ్జనకుండు, సమ్మాన్య గౌతమ గోత్ర | మహితుండు, భాస్కరమంత్రి తనయుఁ,  
డన్నమాంబాపతి, యనఘులు కేతన | మల్లన సిద్ధనామాత్యవరుల  
కూరిమి తమ్ముండు, గుంటూరి విభుఁడు కొ | మ్మన దండనాథుండు, మధుర కీర్తి  
విస్తర స్ఫారుఁ డాపస్తంబసూత్ర ప | విత్రశీలుఁడు సాంగవేదవేది  
తే. యర్థిఁ గల వచ్చి వాత్సల్య మతిశయిల్ల | నస్మదీయ ప్రణామంబు లాదరించి  
తుష్టి దీవించి, కరుణా ర్ధ్ర దృష్టిఁ జూచి | యెలమి ని ట్లని యానతి యిచ్చె నాకు.

### [4.1.11](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.11)

వ. “కి మస్థి మాలాం కిము కౌస్తుభం వా | పరిష్క్రియాయాం బహుమన్యసే త్వమ్‌ | కిం కాలకూటః కిము వా యశోదా | స్తన్యం తవ స్వాదు వద ప్రభో మే,” అని నీవు తొల్లి రచియించిన పద్యంబు గాఢాదరంబున నవధరించి, భక్తవత్సలుం డగు హరిహరనాథుండు నీదెస దయాళుండై యునికిం జేసి నిన్నుం గృతార్థునిఁ జేయం గార్యార్థి యయి నాకలోక నివాసి యయిన నాకుఁ దన దివ్య చిత్తంబునం గల యక్కారుణ్యంబు తెఱం గెఱుంగునట్టి శక్తిం బ్రసాదించి నన్ను నాకర్షించి కొలిపించికొని వీఁడె విజయం చేయుచున్నవాఁడనుచుం జూపుటయు సవిశేష సంభ్రమ సంభరిత హృదయుండ నయి యవ్వలనుఁ గలయం గనుంగొనునప్పుడు.

### [4.1.12](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.12)

సీ. కరుణారసము పొంగి తొరఁగెడు చాడ్పున | శశిరేఖ నమృతంబు జాలువాఱ  
హరినీలపాత్రిక సురభిచందన మున్న | గతి నాభి ధవళపంకజము మెఱయ  
గుఱియైన చెలువున నెఱసిన లోక ర | క్షణ మనంగ గళంబు చాయ దోఁపఁ  
బ్రథమాద్రిఁ దోఁతెంచు భానుబింబము నా ను | రమ్మునఁ గౌస్తుభరత్న మొప్ప  
తే. సురనదియును గాళిందియు బెరసినట్టి | కాంతిపూరంబు శోభిల్లు శాంతమూర్తి  
నా మనంబు నానంద మగ్నముగఁ జేయ | నెలమి సన్నిధి సేసె సర్వేశ్వరుండు.

### [4.1.13](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.13)

వ. ఏనును భక్తిమయం బగు సాష్టాంగదండప్రణామం బాచరించి, కొండొక దొలంగి వినయావనతుండనై, లలాటోపరిభాగంబున నంజలిపుటంబు ఘటించి, నయనంబులు నవయవంబులును బ్రమదబాష్ప సలిల విలులితంబులును, బులకపటల పరికలితంబులునుం గా నంతంత నిలిచిన నద్దేవుండు.

### [4.1.14](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.14)

క. అనుకంపాతిశయంబునఁ | దన దక్షిణనేత్రమును సుధారోచియ కా  
నను వింత లేక చూచి, వ | దనమున దరహాసరసము దళుకొత్తంగన్‌.

### [4.1.15](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.15)

ఉ. ‘వైదిక మార్గ నిష్ఠమగు వర్తనముం దగ నిర్వహించుచున్‌  
భేదము లేని భక్తి మతి నిర్మల వృత్తిఁగఁ జేయుచుండు మ  
త్పాద నిరంతర స్మరణ తత్పర భావము కల్మి, నాత్మ స  
మ్మోదముఁ బొందఁ గావ్య రసముం గొనియాడుచు నుండు దెప్పుడున్‌.

### [4.1.16](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.16)

వ. అందును.

### [4.1.17](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.17)

క. పారాశర్యుని కృతి యయి | భారత మను పేరఁ బరఁగు పంచమవేదం  
బారాధ్యము జనులకుఁ ద | ద్గౌరవ మూహించి నీ వఖండిత భక్తిన్‌.

### [4.1.18](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.18)

తే. తెనుఁగుబాస వినిర్మింపఁ దివురు టరయ | భవ్య పురుషార్థ తరుపక్వ ఫలము గాదె!  
దీని కెడ నియ్యకొని వేడ్క నూని కృతి | పతిత్వ మర్థించి వచ్చితిఁ దిక్కశర్మ!’

### [4.1.19](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.19)

వ. అనిన నద్దివ్యవచనామృతంబు నా యుల్లంబున వెల్లిగొనినఁ బునః పునః ప్రణామంబు లాచరించి, యప్రమేయ ప్రభావ భావనాతీతుండయ్యును నప్పరమేశ్వరుం డాశ్రితులకు నత్యంత సులభుండని బుధులవలన విని యునికిం జేసి ననుబోఁటి బాలస్వభావునకు నిట్టి మహనీయ మహిమ దొరఁకొనుటయుం గలుగున కాక యని తలంచుచు నవ్విభునకు విన్నపంబు సేయువాఁడనయి కొమ్మనామాత్యునాననం బాలోకించి తదనుమతి వడసి యిట్లంటి.

### [4.1.20](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.20)

క. భూరి భవత్కారుణ్య | క్షీరాంబుధిలోన నాదు చిత్తంబును వి  
స్తార మహితముగ నునిచితి | వారయ నచ్చెరువు గాదె యఖిలాండపతీ!

### [4.1.21](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.21)

ఉ. ఇంతకు నేర్చు నీకు, నొక యింతటిలోన, మదీయవాణి న  
త్యంత విభూతిఁ బెంపెసఁగు నట్టి నినుం గొనియాడఁ జేఁత దా  
నెంతటి పెద్ద? నీ కరుణ నిట్లు పదస్థుఁడ నైతి నింక జ  
న్మాంతర దుఃఖముల్‌ దొలఁగు నట్లుగఁ జేసి సుఖాత్ముఁ జేయవే.

### [4.1.22](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.22)

వ. అని యుపలాలితుం డగు డింభకుండు దన కొలంది యెఱుంగక మహాపదార్థంబు వేఁడు విధంబున బ్రహ్మానంద స్థితిం గోరి సర్వాంగాలింగిత మహీతలం బగు నమస్కారంబు సేసిన నజ్జగన్నాథుండు.

### [4.1.23](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.23)

తే. జనన మరణాదులైన సంసార దురిత | ములకు నగపడకుండంగఁ దొలఁగు తెరువు  
గనువెలుంగు నీ కిచ్చితి ననిన లేచి | నిలిచి సంతోష మెద నిండ నెలవుకొనఁగ.

### [4.1.24](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.24)

వ. ఇట్లు మేలుకాంచి.

### [4.1.25](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.25)

క. ఎలమియు నచ్చెరువును సరి | నెలసి పొదలు మానసమున నెంతయుఁబ్రొద్దేఁ  
గలలోనఁ గన్న చందము | దలఁచుచు నుండితిని భక్తి తాత్పర్యమునన్‌.

### [4.1.26](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.26)

వ. తదనంతరంబ.

### [4.1.27](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.27)

ఉ. ఇట్టి పదంబు గాంచి పరమేశ్వరునిం గృతినాథుఁ జేసి యే  
పట్టునఁ బూజ్యమూర్తి యగు భారత సంహితఁ జెప్పఁగంటి; నా  
పుట్టుఁ గృతార్థతం బొరసెఁ, బుణ్యచరిత్రుఁడ నైతి; నవ్విభుం  
గట్టెదఁ బట్ట మప్రతిమ కావ్య కవిత్వ మహావిభూతికిన్‌.

### [4.1.28](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.28)

ఉ. కూర్చుట నూత్నరత్నమునకుం గనకంబునకుం దగున్‌; జనా  
భ్యర్చిత మైన భారత మపార కృపాపరతంత్రవృత్తిమైఁ  
బేర్చిన దేవదేవునకుఁ బ్రీతిగ నిచ్చుట సర్వసిద్ధి; నా  
నేర్చిన భంగిఁ జెప్పి వరణీయుఁడ నయ్యెద భక్తకోటికిన్‌.

### [4.1.29](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.29)

వ. ఇది యనన్య సామాన్య కరణం బగు పరమధర్మ ప్రకారంబు.

### [4.1.30](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.30)

ఉ. కావున భారతామృతముఁ గర్ణపుటంబుల నారఁగ్రోలి యాం  
ధ్రావళి మోదముం బొరయునట్లుగ సాత్యవతేయ సంస్మృతి  
శ్రీ విభవాస్పదం బయిన చిత్తముతోడ మహాకవిత్వ దీ  
క్షావిధి నొంది పద్యముల గద్యములన్‌ రచియించెదన్‌ గృతుల్‌.

### [4.1.31](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.31)

వ. అని పూని యీదృశంబు లగు పుణ్యప్రబంధంబులు దేవసన్నిధిం బ్రశంసించుటయు నొక్క యారాధన విశేషం బగుటం జేసి.

### [4.1.32](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.32)

క. ఓంకార వాచ్యునకు, నన | హంకార నిరూఢ భావనారాధ్యునకున్‌,  
హ్రీంకారమయ మనోజ్ఞా | లంకారోల్లాస నిత్యలాలిత్యునకున్‌.

### [4.1.33](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.33)

క. త్రిభువన శుక దృఢపంజర | విభవ మహితునకు, సమస్త విష్టప నిర్మో  
క భుజంగపతి, కఖిల జగ | ద భిన్న రూపునకు, భావనాతీతునకున్‌.

### [4.1.34](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.34)

క. శ్రుతి సీమంత మణికి, నా | శ్రిత వాంఛాపూర్తి కరణ చింతామణి, కా  
నత దురిత తమో ద్యుమణికిఁ | గ్రతుభూషణమణికి, లోకరక్షా మణికిన్‌.

### [4.1.35](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.35)

క. పరమశమ నిరత సంయమి | వరమానస కుముదహాస వర్ధన చంచ  
చ్చరణ నఖ చంద్రికా వి | స్ఫురణా చిత్రప్రకార శోభాఢ్యునకున్‌.

### [4.1.36](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.36)

క. హరిహరనాథునకు, మరు | త్సరిదాకల్పిత మనోజ్ఞ చరణ శిరస్సుం  
దరమూర్తికి, భావనత | త్పర చేతో యుక్త భక్తపరతంత్రునకున్‌.

### [4.1.37](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.37)

వ. ఏను విన్నపంబు సేయు తెఱంగుగా నంతస్సన్నిధిం గలిగించుకొని యమ్మహాకావ్యంబు నర్థంబు సంగతంబు చేసెద.

### [4.1.38](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.38)

క. శరణాగత సంశ్రిత భయ | హరణా! సురనికర శేఖరానర్ఘమణి  
స్ఫురణా పరిచయ రంజిత | చరణా! వనమాలికా భుజంగాభరణా!

### [4.1.39](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.39)

క. అజగవ శార్ఙ్గాలంకృత! | భుజగర్వ నిరస్తదైత్య! భూమస్తుత్యా!  
త్రిజగద్ధారణ నిత్యా! | భుజగ సమాచరిత శయన భూషణ కృత్యా!

### [4.1.40](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.40)

క. జలనిధి హిమవద్భూధర | కలిత జనన కేళికౌతుక వ్యక్తా వ్య  
క్త లలిత సౌందర్య స్ఫుర | దలఘుతను స్త్రీ సనాథ! హరిహరనాథా!

### [4.1.41](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.41)

వ. దేవా, దివ్య చిత్తంబున నవధరింపుము.

### [4.1.42](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.42)

ఆ. కథ జగత్ప్రసిద్ధి గావునఁ బూర్వ ప | ర్వార్థ యుక్తి చేయునట్టి యెడల  
యత్న మించుకంత యయినను వలవదు | వలసినట్లు చెప్పవచ్చి యుండు.

### [4.1.43](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.43)

వ. మహాభారతంబు సమస్త దురితాపహంబును, నభిమత శుభావహంబును, నశుభ హరణంబునుం గావున నొక్క మహాఫలంబు గోరి జనమేజయుండు కృష్ణద్వైపాయన మహాముని కారుణ్యంబు వడసి, తదీయ ప్రియశిష్యుం డైన వైశంపాయను వలన వినిన కథ యగుటం జేసి తత్ప్రకారంబు నడపెద; నది యె ట్లనినం బరమ పవిత్రు లగు పాండుపుత్త్రుల చరిత్రం బుపాఖ్యాన సహితంబుగా వ్యాఖ్యానంబు సేయుచుండ వారల వనవాస సమ్యగనుష్ఠానంబు సవిస్తరంబుగా విని జనమేజయుండు వైశంపాయనున కి ట్లనియె.

### [4.1.44](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.44)

చ. “మహిత సముజ్జ్వలాకృతులు, మానధనుల్‌, జనమాన్యు లంగనా  
సహితము గాఁగ నేమిగతి సమ్యగుపాయ నిగూఢ వృత్తిమై  
నహితుల కప్రభేద్యముగ నా పదుమూఁడగు నేఁడు మత్పితా  
మహులు చరించి? రంతయుఁ గ్రమంబున నా కెఱుఁగంగఁ జెప్పుమా.”

### [4.1.45](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.45)

క. అని యడిగిన వైశంపా | యనుఁ డమ్మనుజేంద్రచంద్రు నధి కౌత్సుక్యం  
బున కలిమికిఁ దన హృదయం | బున గాఢాదరము భరితముగ ని ట్లనియెన్‌.

### [4.1.46](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.46)

వ. పాండవులు వనవాసంబు సముచితంబుగా సలిపి, పండ్రెండగు నేఁటి కడపటఁ దమకు ధర్మదేవతా సమాగమం బయినం, దత్ప్రసాదంబున నజ్ఞాతవాస సమయంబునకు భంగంబు గాకుండ వరంబు వడసి, యంతకుమున్ను తమ వెనుక నడవులం దిరుగుచు నగ్ని హోత్రంబులఁ దోడన కొని వర్తిల్లు భూసురోత్తములు దమ్ముం బరివేష్టించి యుండఁ దారనుష్ఠింపం బూనిన పని వారల కెఱింగింపం దలంచి కర (కమల)ంబులు మొగిచి సవినయంబుగా ని ట్లనిరి.

### [4.1.47](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.47)

సీ. ‘తెల్లంబు గాదె మీ కెల్ల సుయోధను | చేసిన కుటిల విచేష్టితంబు  
లకట! మాతో మీరు నడవుల నిడుమలఁ | బొందితి; రొకభంగిఁ బోయెఁ గాల;  
మిది పదుమూఁ డగు నేఁడు మా కజ్ఞాత | వాసంబు సలుపంగ వలయు; నిందు  
ధార్తరా ష్ట్రులు సూతతనయ సౌబలులును | జెఱుపన వేతురు; చిన్నసన్న  
ఆ. యెఱిఁగి రేనిఁ జాలనెగ్గు వాటిల్లు, న | ట్లగుట మమ్ము నింక నతి రహస్య  
వృత్తిమై నిరస్తవిఘ్నుల రై చరి | యింపుఁ డని యనుగ్రహింపవలయు.’

### [4.1.48](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.48)

వ. అని చెప్పి; రట్టి సమయంబున ధర్మనందనుండు విషణ్ణహృదయుండై.

### [4.1.49](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.49)

క. ‘ఒకనాఁ డేమును నాపద | లకు విడుమరఁ గాంచి విప్రులం జుట్టలఁ బె  
ట్టుకొని సుఖముండఁ బడయుదు | మొకొ! యిప్పా టెందుఁ గలదె యొరు లెవ్వరికిన్‌?’

### [4.1.50](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.50)

వ. అని డగ్గుత్తిక వెట్టి దుఃఖ పరవశుం డగుటయు, నమ్మహీసురవరులుం దమ్ములు నతని నాశ్వాసించుచుండఁ దత్పార్శ్వంబున నున్న ధౌమ్యుండు తదీయ విషాదాపనోదంబు సేయం దలంచి యి ట్లనియె.

### [4.1.51](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.51)

ఉ. ‘ధర్మనిరూపకత్వమున ధైర్యమునన్‌, మహనీయవృత్తి, స  
త్కర్మ విధిజ్ఞతం జతురతా మహిమన్‌, దృఢబుద్ధి నెవ్వరున్‌  
ధర్మజుపాటిగా రనఁగ ధాత్రిఁ బ్రసిద్ధుఁడ వైన యిట్టి నీ  
పేర్మికి నీడె? దుర్దశల పెల్లునకున్‌ దురపిల్లు టారయన్‌.

### [4.1.52](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.52)

వ. అట్లుంగాక

### [4.1.53](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.53)

క. దేవతల కైన నొక్కొక | చో వలయున కాదె శత్రుసూదనవిధి కా  
లావాప్తికి మును దమ స | ద్భావంబు లడంచి యుడుగఁబడి యుండంగన్‌.

### [4.1.54](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.54)

సీ. నిషధాద్రియం దనిమిషపతి ప్రచ్ఛన్న | సంచరణమున వర్తించుటయును  
నదితి గర్భంబున నవతార మై వామ | నాకారమున హరి యడఁగుటయును  
జనని యూరు ప్రదేశంబున నతి నిగూ | ఢంబుగా నౌర్వుండు డాఁగుటయును  
ధేను శరీర విలీనుఁడై యజ్ఞాత | చర్య మార్తాండుండు సలుపుటయును  
ఆ. వినమె! యిట్లు వడిన వీరలు పదపడి | తమకు నగ్గమైన తఱి జయింప  
రెట్లు ప్రబల రిపుల; నీవును నాపద | కోర్చి భంగపాటు దీర్చికొనుము.’

### [4.1.55](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.55)

క. అనవుడు నప్పలుకులు విని | తన చిత్తము కలఁక దేఱి ధర్మతనూజుం  
డనుజన్ముల దెసఁ జూచిన | ననిలసుతుం డిట్టు లనియె నాతనితోడన్‌.

### [4.1.56](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.56)

మ. ‘భవదాజ్ఞా దృఢబంధ సంయమిత శుంభ ద్వేగ మై కాక నాఁ  
డవలీలన్‌ మన యర్జున ద్విపము గ్రోధావేశదుర్దాంత ద  
ర్ప విలాసోద్భట భంగి నేపడరి కౌరవ్యాంబుజ శ్రేణిఁ జి  
క్కువడం జేయదె యొక్క వ్రేల్మిడిన నీకున్‌ వేడ్క సంధిల్లఁగన్‌.’

### [4.1.57](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.57)

వ. అనిన విని ధర్మనందనుండు తెలివొందిన మొగంబు తోడ శిరఃకంపంబుసేసె; నట్టి సమయంబున నవ్విప్రులందఱు నొక్క మొగిన ‘మీ తలంపునకు దైవం బనుకూలంబు గావుత’ మని పాండుపుత్త్రుల దీవించి పునర్దర్శనం బయ్యెడు మనుచు వీడ్కొని నిజస్థానంబులకుం జనిరి; తదనంతరంబ బాహ్యపరివారం బెల్లను సముచిత ప్రకారంబున వీడుకొలు వడసి తమ తమ పొందుపట్లకుం బోయిన.

### [4.1.58](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.58)

ఉ. తమ్ములు ధౌమ్యుఁడున్‌ సతియుఁ దా నరదంబులతోడఁ గ్రోశమా  
త్ర మ్మొక చోటి కల్లఁ జని, ధర్మతనూభవుఁ డందు నాఁటిరే  
యిమ్ముల సల్పి వేగుటయు నీప్సితకార్యము సేయఁగా విచా  
రమ్మున నున్నచో నమరరాజతనూభవుఁ జూచి యిట్లనున్‌.

### [4.1.59](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.59)

క. ‘మన మొక యేవుర మీయం | గనయుం దో నరుగుదేరఁగా నెయ్యెడఁ బో  
యిన నెఱుఁగ కుండుదురె? యి | ద్దినములు గడపంగ నెద్ది తెఱఁ గయ్యెడినో!’

### [4.1.60](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.60)

వ. అనిన నతం డి ట్లనియె.

### [4.1.61](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.61)

తే. ‘ధర్మదేవత నీదు సత్కర్మమునకు | మెచ్చి యెంతయుఁ బ్రీతిమై నిచ్చినట్టి  
వరము గలుగంగ మన మేమి వర్తనమున | నెచట నున్నను నొరులకు నెఱుఁగ నగునె?

### [4.1.62](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.62)

వ. కురు జనపదంబు చుట్లం బాంచాల చేది మత్స్య సాళ్వ విదేహ బాహ్లిక దశార్ణ శూరసేన కళింగ మగధ దేశంబులు సుభిక్షంబులు, జనాకీర్ణంబులు, నతిస్థిరంబులు నై నివాసయోగ్యత కలిగి యున్నయవి యని విందుము. వానియందు మీకుఁ జూడం బోలిన యెడఁ దగిన చందంబున నిలుచువారము గాక’ యనినం బ్రియంబంది ధర్మనందనుం డి ట్లనియె.

### [4.1.63](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.63)

క. ‘అగు నది యట్టిద; దైవము | దగ నిచ్చిన యవ్వరంబు దప్పునె? మనకున్‌  
విగత భయ వాస యోగ్యం | బుగ నొక్కెడ సెప్పు మిపుడ పోవఁగవలయున్‌.

### [4.1.64](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.64)

ఆ. నాకుఁ జూడ మత్స్య నరపతి సద్ధర్మ | వర్తి, సుజనహితుఁ, డవార్య బాహు  
బలుఁడు గాన యతని పాల నందఱుఁ దగ | వైన పనుల నిలుచు టభిమతంబు.

### [4.1.65](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.65)

క. మనలోన నెవ్వఁ డెమ్మెయి | పని వెంటను విరటు మనము వడయుద? మదియె  
ల్లను నేర్పరించి యందఱుఁ | దన తనమది నున్న తెఱఁగు తథ్యమ చెపుఁడా!

### [4.1.66](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.66)

వ. అనిన విని సవ్యసాచి సవితర్కంబును సవిషాదంబును సగౌరవంబునుంగా నతని నుపలక్షించుచు నిట్ల నియె.

### [4.1.67](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.67)

సీ. ‘మహనీయమూర్తియు, మానవైభవమును, | సౌకుమార్యంబును, సరసతయును,  
మార్దవంబుఁ, బ్రభుత్వ మహిమయు, నపగత | కల్మషత్వంబును, గౌరవంబు  
శాంతియు, దాంతియుఁ, జాగంబు, భోగంబుఁ, | గారుణ్యమును, సత్యసారతయును,  
ధర్మమయ క్రియా తత్పరత్వంబును | గీర్తి, ధనార్జన క్రీడనంబుఁ  
ఆ. గలిగి జనుల నేలఁ గాని, యెన్నందును | నొరులఁ గొల్చి తిరుగ వెరవు లేని  
యట్టి నీవు విరటు నెట్టి చందంబున | ననుచరించు వాఁడ వధిప! చెపుమ.’

### [4.1.68](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.68)

క. అనినం దమ్ముని నెమ్మన | మునఁ బుట్టిన వగపు భావమున నెఱిఁగియు గీ  
టునఁ బుచ్చుచుఁ బ్రస్తుత కా | ర్య నిరూపణ దశయ మెఱయ నతఁ డి ట్లనియెన్‌.

### [4.1.69](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.69)

క. ‘సన్న్యాసి వేషమున రా | జన్యునిఁ గని యెపుడుఁ గొలిచి సభ్యత్వమునన్‌  
మాన్యుఁడనై పుణ్యకథా | విన్యాస మొనర్తు నతని వేడుకకుఁ దగన్‌.

### [4.1.70](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.70)

క. శ్రౌత స్మార్త నిమిత్త | జ్యోతిర్విద్యలు వహించి యోగ్య సమయసం  
జాత ప్రాగల్భ్యుఁడ నై | చాతుర్యము మెఱసి మానసం బలరింతున్‌.

### [4.1.71](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.71)

క. ఆతనితో నొక్కొక మరి | కౌతూహలవృత్తికిం దగం దొడఁగి మృదు  
ద్యూతంబునఁ గ్రీడింతుం | జేతోముద మొదవ నక్షశిక్షాప్రౌఢిన్‌.

### [4.1.72](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.72)

తే. మణిమయమ్ములుఁ గలధౌతమయములును సు | వర్ణ మయములు నాదిగా వలయునట్టి  
యడ్డసాళులు గలవు నా కభిమతముగ | వానిఁ గొనిపోయి చూపుదు వరుసతోడ.

### [4.1.73](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.73)

వ. మఱియు నవసరోచితంబు లగు వినోదంబులం బ్రమోదంబు పుట్టించుచుఁ బ్రసాదంబునకుం బాత్రుండ నై కంకుండను నామధేయంబు ధరియించి చరియింతు; నయ్యుర్వీశ్వరుండు మ త్పూర్వవర్తనం బడిగె నేనియు ధర్మపుత్త్రుతోడి మైత్రిం దగిలి యతనిపాల వసియింతు ననంగలవాఁడ’ నని చెప్పి, యనిలతనయు నిరీక్షించి తత్కాలజనితం బయిన ఖేదంబునం దొరఁగ సమకట్టు బాష్పజలంబులు మగుడ నింకించుచు నిట్టూర్పు లడంచి ధైర్యం బవలంబించి యి ట్లనియె.

### [4.1.74](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.74)

సీ. ‘కడిమిమై సౌగంధికమున యక్షుల మద | మడఁచి కృష్ణకుఁ బువ్వు లట్లు దెచ్చెఁ;  
గిమ్మీరదానవు నమ్మెయి నిర్జించి | విగతకంటకముఁ గావించె వనము;  
బకదైత్యుఁ దొడరి యాభంగి రూపఱఁ జేసి | రక్షించె నేకచక్రాపురంబు;  
నప్పాటఁ బ్రబలు జటాసురు నడరి దం | డితుఁ జేసి మనలఁ బెట్టించుకొనియె;  
తే. నితఁడు పుట్టినకోలెను నెసఁకమెసఁగ | దర్పమునన వర్తిల్లు నుదగ్రమూర్తి  
యకట! యొరు చిత్తమున కెక్కునట్లు గాఁగ | మెలఁగి యేమి విధంబునఁ గొలుచువాఁడు.’

### [4.1.75](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.75)

వ. అనిన విని భీమసేనుం డి ట్లనియె.

### [4.1.76](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.76)

తే. ‘ఏను వంటలవాఁడ నై యా నరేంద్రుఁ | గొలిచి గరగరగాఁ గూడు గూర చిత్త  
మునకు వచ్చిన చందంబునన యొనర్చి | నేర్చి మెలఁగుదుఁ గరము వినీతి మెఱసి.

### [4.1.77](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.77)

ఉ. ఆఱురసంబులం జవులయందలి క్రొత్తలు వుట్ట నిచ్చలున్‌  
వేఱొకభంగిఁ బాకములు విన్ననువొప్పఁగఁ జేసి చేసి న  
న్మీఱఁగ బానసీని నొకనిం బురిఁ గానని యట్లుగాఁగ మేన్‌  
గాఱియవెట్టియైన నొడికంబుగ వండుదుఁ గూడుగూరలన్‌.

### [4.1.78](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.78)

తే. పఱియ వాపంగఁ దునియఁగా విఱువవలయు | నెడలఁ గాళులఁ జేతులఁ దొడలఁ బట్టి  
కడఁగి యనువుగఁ జేసి ప్రొయ్యిడుదుఁ గాని | కత్తి గొడ్డలి యడుగ నేఁ గట్టియలకు.

### [4.1.79](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.79)

క. సూపాధ్యక్షుఁడు గలిగిన | నాపురుషునితోడ సఖ్య మగునట్లుగ నే  
నే పాట నైన నడవఁగ | నోపుదుఁ దత్తద్విధ ప్రయోగముల మెయిన్‌.

### [4.1.80](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.80)

వ. అట్లుంగాక.

### [4.1.81](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.81)

తే. జెట్టితండంబుతోడఁ జేపట్టి హొంత | కారి విఱిచినయట్టు లగ్గలిక విఱుతు  
లాఁగు వేగంబు మెఱసి బలంబు నెఱపి | మల్లుతనమున మెప్పింతు మనుజవిభుని.

### [4.1.82](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.82)

క. పెక్కండ్ర నొక్క పోరను | నుక్కఱ భంజించి చంపు టుడుగుదు; రాజుం  
దక్కటి చూపఱు లెంతయు | వెక్కసపడఁ జిత్రగతుల విహరింతుఁ దగన్‌.

### [4.1.83](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.83)

చ. అదియునుఁ గాక కోలుపులి నైనను, గా రెనుపోతు నైన, ను  
న్మదకరినైన, నుగ్రమృగనాథుని నైనను గిట్టి ముట్టి బె  
ట్టిదముగఁ గాలఁ గేలను గడింది మగంటిమి యుల్లసిల్లఁ బ  
ట్టుదు నడఁగంగ మాత్స్యుఁడు గడున్‌ వెఱఁగందుచుఁ బిచ్చలింపఁగన్‌.

### [4.1.84](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.84)

వ. ఇట్లు నానాప్రకారంబుల నతని మనంబు వడయుచు వలలుండను సమాఖ్య వహింతు; నమ్మహీపతి ‘నీ వెవ్వరి వాఁడ?’ వని యడిగె నేని ‘పాండవాగ్రజునకు బానసంబు సేయుదు ననం గలవాఁడ’ ననిన విని ధర్మజుం డమ్మెయికి సమ్మతించి బీభత్సు వీక్షించి ఘూర్ణమాన మానసుం డగుచు నిట్లనియె.

### [4.1.85](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.85)

ఉ. ‘ఖాండవ మేర్చె; దేవతలుఁ గానని యీశ్వరుఁ గాంచె; దోర్బలో  
ద్దండ మహాసుర ప్రతతి దర్ప మడంచి ప్రియం బొనర్చి యా  
ఖండలుఁ డున్న గద్దియసగంబున నుండె; మహానుభావుఁ డీ  
తం డొక మర్త్యుఁ జేరి యనుదాత్తత నెమ్మెయిఁ గొల్చువాఁ డొకో!’

### [4.1.86](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.86)

క. అను మాటలు విని సంక్రం | దన నందనుఁ డిట్టు లనియె ‘దైవంబుకతం  
బున నాకు నొక్క చందం | బనువై యున్న యది; దీని నౌఁగా దనుఁడా!

### [4.1.87](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.87)

వ. అమరనగరంబున కరిగినయెడ నూర్వశి నన్ను నపుంసకుంగా శపియించిన, నాకు నాకేశుండు గరుణించి, ‘ఈ శాప ఫలంబు భవదజ్ఞాతవాస వత్సరంబున ననుభవించి, తదనంతరంబ శాప మోక్షంబ వడయు’ మని దీవించెం గావునఁ బేడితనంబు దాల్చి బాహులదీర్ఘత్వంబునకు, గుణకిణంబులకు, గంచుకంబును, శంఖ వలయంబులును మాటు సేసికొని విరాటు కడకుం జని.

### [4.1.88](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.88)

క. ఉత్తమ కన్యాజనులకు | నృత్తము గఱపంగ నాకు నేర్పు గలదు; త  
ద్వృత్తమునకు న న్నేలుము; | చిత్తమునకు నెక్కఁ బనులు చేసెద నందున్‌.

### [4.1.89](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.89)

క. అని కొలిచి యే బృహన్నల | యను నామముతోడఁ గన్యకాంతఃపుర వ  
ర్తన మొనరించుచు లాసిక | తనమున నిపుణుండనై యతని మెచ్చింతున్‌ .

### [4.1.90](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.90)

క. మానవపతి న ‘న్నెక్కడి | దానవు నీ’ వనియెనేని ‘ద్రౌపదికడ స  
మ్మానంబు వడసి మెలఁగుదు; | నా నగళుల నృత్యగురువ ననఁగల వాఁడన్‌’.

### [4.1.91](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.91)

తే. అనిన ‘నిది వోలు’ నని యియ్యకొని యజాత | వైరి యల్లన నకులుని వలను సూచి  
నెమ్మనంబున నుమ్మలికమ్ము గదుర | నెలుఁగు చందంబు వేఱుగా నిట్టు లనియె.

### [4.1.92](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.92)

ఉ. ‘ఒప్పెడు మేనుఁ బెంపు గల యుల్లము, నాగరికంపుఁ జందముం  
జెప్పక చూప కీతని విశేషముఁ దెల్పెడుఁ గొల్చుటెంతయున్‌  
డెప్పర; మేమి సేయుదుఁ గడింది విచారము పుట్టె; నె ట్లితం  
డప్పురి సంచరించునొకొ! యన్యు లెఱుంగక యుండునట్లుగన్‌.’

### [4.1.93](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.93)

వ. అనిన నప్పలుకులకు నకులుం డిట్లనియె.

### [4.1.94](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.94)

ఆ. ‘అశ్వశిక్షకుండనై మత్స్యభూవిభుఁ | గొలుచువాఁడ; గుఱ్ఱములకు వలయు  
తెఱఁగు లెల్లఁ జాల నెఱుఁగుదు; రూపుగా | నరయ నేర్తు వాని ననుదినంబు.

### [4.1.95](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.95)

సీ. గోడిగ జాతిలోఁ గొదమ పెంటుల నేర్చి | మావుల హత్తించు మార్దవంబుఁ,  
ద్రాళ్ళఁ బట్టింపంగఁ దఱి యైన కొదమల | సంచంబు లెఱిఁగి శిక్షించు నేర్పుఁ,  
గళ్యాలఁ బదిలంబు గాని గుఱ్ఱంబులఁ | గ్రొత్త ముట్టున కియ్య కొలుపు వెరవుఁ,  
బెనఁగు శూకలముల బిరుసుతనంబులఁ | జలము డింపక తీర్పఁ జాలుటయును.  
తే. నలవరించిన వాఁడ; లాయమున నున్న | యపుడు దొసఁగించుకయు లేనియట్లు గాఁగ  
మాటి మాటికిఁ బరికించి మందడీల | కెల్ల నూఱట యగుచు వర్తిల్ల నేర్తు.

### [4.1.96](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.96)

క. దామగ్రంథి యనఁగ నొక | నామము వెట్టుకొనువాఁడ, నా తొంటి విధం  
బా మనుజేశ్వరుఁ డడిగిన | నే మీకడవాఁడ నందు; నిది దెఱఁ గధిపా!’

### [4.1.97](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.97)

క. అనినఁ ‘గడు లెస్స’ యని నె | మ్మనమున నూఱడి, విభుం డమానుష తేజో  
ధనుఁ డగు సహదేవుఁ గనుం | గొని యిట్లను వగలు మిగిలి కొందలపఱుపన్‌.

### [4.1.98](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.98)

చ. ‘అకుటిలుఁ; డార్యసమ్మతుఁ, డహంకృతి దూరుఁడు, నీతి నిర్మలా  
త్మకుఁ డనవద్య శీలుఁడు, సధర్ముఁడు, దాంతుఁడు, గొంతిముద్దుసే  
యు కొడుకు, మేను లేఁత, దన యుల్లము మెత్తన, యిట్టి యీతఁ డె  
ట్లొకొ యొరు నాశ్రయించు? విధి యోపదె యెవ్వరి నెట్లు సేయఁగన్‌!’

### [4.1.99](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.99)

క. అనుడు నతఁడు దన చిత్తం | బునఁ దోఁచిన విధము ధర్మపుత్రునితో ని  
ట్లని చెప్పె నాతనికిఁ బు | ట్టిన యుత్తలపాటు గొంత డిందుపడంగన్‌.

### [4.1.100](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.100)

క. ‘కీలారితనమునకు నేఁ | జాలుదు నని కొలిచి మత్స్యజనపాలుకడన్‌  
మేలగు నడవడిఁ దంత్రీ | పాలుం డను పేరుతోడఁ బరఁగుదు నధిపా!

### [4.1.101](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.101)

సీ. వంజల నైనను వల నేర్పడఁగ నొక | భంగిఁ జేఁపఁగ జేసి పాలు గొనఁగ.  
బడుగుల నైనను బాటించి పరికించి | గోమున మైఁ గండ క్రొవ్వుదేఱఁ,  
దెవులు గొంటులనైనఁ దీర్చి సంకటమున | కోపి ముందటియట్ల రూపు సేయ,  
నఱ్ఱల నైనను నలువైన వెరవున | ముట్టె యంటఁగఁ బట్టి కట్టి విడువఁ.  
ఆ. బిదుకఁ గదుపు సేర్పఁ బెదరు వాపఁగ నీరు | మేపు గలుగు నెడకు మెలఁగ, వెలువ  
మెకము నరయ, మ్రుచ్చు మెలఁగిన వెలిగొట్ట | నేర్తుఁ; బసికిఁ జాలఁ గూర్తు నేను.

### [4.1.102](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.102)

వ. నన్ను విరాటుండు ‘మున్ను నీ వెందుండు’ దని నిరూపించెనేని’ “యుధిష్ఠిరుగోష్ఠంబుల కధిష్ఠాతనై యుండుదు ననియెద’ నని పలికినఁ గౌంతేయాగ్రజుం” డిది యుక్తం బగు’ నని యనుమతి సేసి, పాంచాలి నాలోకించి, ఖిన్నాంతఃకరణుం డగుచు ని ట్లనియె.

### [4.1.103](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.103)

చ. ‘ఇది కడు ముద్దరాలు, పను లేమియుఁ జేయఁగ నేర, దెంతయున్‌  
మృదు, వొక కీడుపాటునకు మేకొనఁజాల, దుదాత్తచిత్త, యొం  
టి దిరుగు దాని కోర్వ, దొకటిం దను దా సవరించుచొ ప్పెఱుం  
గదు, తగ నొడ్లనుం గొలువఁగా వెర వెమ్మెయిఁ గల్గు నక్కటా!’

### [4.1.104](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.104)

క. అనిన నతని చిత్తంబున | వెనుఁబాటంతయును బాయు వెరవు కలిమి యె  
ల్లను దెలియునట్లుగా ని | ట్లనియెం బాంచాలి యుచితమగు చందమునన్‌.

### [4.1.105](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.105)

క. ‘సైరంధ్రీ వేషంబునఁ | జేరుదు నంతఃపురంబు చెంతకు; నన్నా  
భూరమణుదేవి యెంతయు | గారవమునఁ బిలువనంపఁగా వినయమునన్‌.

### [4.1.106](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.106)

క. కని కొలువు సేసికొని మా | లిని నాఁజని ‘సాధ్వి యిది ; మలీమసవృత్తం  
బున పొంతఁ బోవ దెన్నఁడు’ | నను వ్రేఁకఁదనంబు దోఁచునట్లు చరింతున్‌.

### [4.1.107](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.107)

సీ. కలపంబు లభినవగంధంబులుగఁ గూర్చి | తనువున నలఁదుదుఁ దనుపుగాఁగ  
మృగమదపంకంబు మృదువుగా సారించి | తిలకంబు వెట్టుదుఁ జెలువు మిగులఁ;  
బువ్వులు బహు విధంబులఁ గట్టి ముడి కొక్క | భంగిగా నెత్తులు వట్టి యిత్తు;  
హారముల్‌ మెఱయ నొయ్యారంబుగాఁ గ్రుచ్చి | యందంబు వింతగా నలవరింతు;  
ఆ. వివిధ శిల్పములఁ బ్రవీణ నై మఱియును | వలయు పనుల వెంట మెలఁగ నేర్తు;  
మత్స్యరాజమహిషి మనమున మక్కువ | నెలకొనంగ నిట్లు గొలువ నేర్తు.

### [4.1.108](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.108)

క. ‘మును నీ వెచ్చో నిలు? తే | పని మెయి వర్తిల్లు?’ దనినఁ బాంచాలికి నే  
ననుచారిణినై తగఁ బం | చిన గరువపుఁ బనులు నేర్చి చేయుదు నందున్‌.’

### [4.1.109](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.109)

వ. అనవుడు ధర్మనందనుండు ద్రుపదనందన కి ట్లనియె.

### [4.1.110](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.110)

క. ‘మన వంశంబును, వృత్తం | బును, బెంపును గావఁ జాలు పుణ్యసతివి; దు  
ర్జను లగు తులువల తలఁపులు | గనుఁగొని యేమఱక మెలఁగఁగా వలయుఁ జుమీ!’

### [4.1.111](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.111)

వ. ’అనిన విని యాజ్ఞసేని యనాదర మందస్మిత సుందర వదనారవింద యయి యతని కిట్లనియె.

### [4.1.112](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.112)

క. ‘ఆరయ నెందును గౌరవ | భారం బెడలంగనీక పాతివ్రత్యా  
చారము మై వర్తింతురు | సైరంధ్రీ జాతివారు సౌజన్యమునన్‌.

### [4.1.113](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.113)

క. కావున నుచితము లగు నా | కా వెంటం గొలిచి తిరుగునప్పుడు, మితభా  
షా విరచనమును, వ్రతసం | భా వనమును గౌరవంబుఁ బాపభయంబున్‌.’

### [4.1.114](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.114)

క. అని చెప్పిన విని ‘యగుఁ బొ’ | మ్మని కైకొని ధర్మతనయుఁ ‘డందఱమును ని  
ట్లనపాయత వర్తిల్లుద’ | మని తమ్ములతోడ నిశ్చయంబుగఁ బలికెన్‌.

### [4.1.115](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.115)

వ. ఇవ్విధంబునఁ గార్యంబు నిర్ణయించి, ‘మన యగ్నిహోత్రంబుల నెల్ల ధౌమ్యులు రక్షించువారు; వంటలవారును మహానసాధ్యక్షులును బాంచాలీపరిచారికలును ద్రుపదపురంబున నిలుచువారు; రథంబులుగొని యింద్రసేనాదులైన సారథులు ద్వారకానగరంబున కరుగువారు; వీ రెల్లను దమ్మెవ్వరైనను మన వార్త లడిగిరేని ‘ద్వైతవనంబున మమ్ము విడిచి పోయి రట యెఱుంగ’ మనంగల వా’ రని చెప్పి యిత్తెఱంగున నభ్యంతర పరివారంబు నెల్ల నియోగించి వీడుకొలిపె; నయ్యవసరంబున ధౌమ్యుండు పాండుకుమారుల కి ట్లనియె.

### [4.1.116](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.116)

క. ‘ఎఱిఁగెడు వారికి నైనను | గఱపక తక్క రుచిత ప్రకారము శుభముం  
గొఱలు హితు; లట్లగుట నం | దఱకును జెప్పంగ వలయుఁ దగియెడు బుద్ధుల్‌.

### [4.1.117](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.117)

వ. అదియునుం గాక.

### [4.1.118](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.118)

తే. కౌరవాన్వయజాతులై గారవమునఁ | బెరిఁగినట్టి మీ రొండొక నరునిఁ గొలిచి  
మసలి వర్తిల్లి మానావమానములకు | నోర్చి, యడఁకువతోడన యునికి యరిది.

### [4.1.119](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.119)

క. వాలి వివిధాస్త్ర విద్యా | జ్వాలల వెలుఁగొందు పాండవజ్వలనం బా  
భీలత మండం దొడరినఁ | గాల విరోధంబు మఱచి కార్యముఁ దప్పున్‌.

### [4.1.120](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.120)

వ. కావున మీకు నప్రమాదార్థంబుగా నా నేర్చిన విధంబున నుపదేశం బవశ్యకర్తవ్యంబు; రాజులం గొలిచి యెమ్మెయి నయినను బ్రదుకు జనంబులు గీడునుం బొరయకుండునట్టి సాధారణ నీతి సంక్షేప రూపంబున నెఱింగించెద సావధానులరయి వినుండు.

### [4.1.121](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.121)

క. తగఁ జొచ్చి తనకు నర్హం | బగు నెడఁ గూర్చుండి రూప మవికృతవేషం  
బుగ సమయ మెఱిఁగి కొలిచిన | జగతీవల్లభున కతఁడు సమ్మాన్యుఁ డగున్‌.

### [4.1.122](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.122)

క. ‘నరనాథుఁ గొలిచి యలవడఁ | దిరిగితి నా కేమి’ యనుచుఁ దేఁకువ లేమిన్‌  
మరియాద దప్ప మెలఁగినఁ | బురుషార్థంబునకు హాని పుట్టకయున్నే?

### [4.1.123](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.123)

ఉ. రాజగృహంబుకంటె నభిరామముగా నిలు గట్టఁ గూడ, దే  
యోజ నృపాలుఁ డాకృతికి నొప్పగు వేషము లాచరించు, నే  
యోజ విహారముల్‌ సలుప నుల్లమునం గడువేడ్క సేయు, నే  
యోజ విదగ్ధుఁడై పలుకు; నొడ్డులకుం దగ దట్లు సేయఁగన్‌.

### [4.1.124](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.124)

క. పుత్రులు పౌత్రులు భ్రాతలు | మిత్రు లనరు రాజు లాజ్ఞ మిగిలిన చోటన్‌  
శత్రుల కాఁ దమయలుకకుఁ | బాత్రము సేయుదురు నిజశుభస్థితి పొంటెన్‌.

### [4.1.125](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.125)

క. చనువాని చేయుకార్యం | బున కడ్డము సొచ్చి నేరుపున మెలఁగుచుఁ దా  
నును బయిఁ బూసికొనుటఁ దన | మును మెలఁగిన మెలఁకువకును ముప్పగుఁ బిదపన్‌.

### [4.1.126](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.126)

ఆ. రాజునొద్దఁ బలువురకు సంకటంబు గాఁ | దిరుగు పనుల నెంత తేజ మయిన  
వాని బుద్ధి గలుగు వా రొల్ల; రవి మీఁదఁ | జేటు తెచ్చు టెట్లు సిద్ధ మగుట.

### [4.1.127](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.127)

క. ఊరక యుండక, పలువుర | తో రవ మెసఁగంగఁ బలుకఁ దొడరకయు, మదిం  
జేరువ గల నాగరికులుఁ | దారుఁ గలసి పలుక వలయు ధరణీశుకడన్‌.

### [4.1.128](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.128)

క. వేఱొక తెఱఁగున నొరులకు | మాఱాడక యునికి లెస్స మనుజేంద్రుకడం;  
దీఱమి గల చోటులఁ దా | మీఱి కడఁగి వచ్చి పంపు మెయికొన వలయున్‌.

### [4.1.129](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.129)

చ. ధరణిపు చక్కఁ గట్టెదురు దక్కి పిఱుందును గాని యట్లుగా  
నిరుగెలనం దగం గొలిచి యే మనునో, యెటు సూచునొక్కొ! యె  
వ్వరి దెస నెప్పు డే తలఁపు వచ్చునొ యీతని కంచుఁ జూడ్కి సు  
స్థిరముగఁ దన్ముఖంబునన చేర్చుచు నుండుట నీతి కొల్వునన్‌.

### [4.1.130](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.130)

క. నగళులలోపలి మాటలు | దగునే వెలి నుగ్గడింపఁ దన? కేర్పడ నొం  
డుగడం బుట్టినఁ బతి విన | నగుపని చెప్పెడిది గాక యాతనితోడన్‌.

### [4.1.131](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.131)

క. అంతిపురము చుట్టఱికం | బెంతయుఁ గీ, డంతకంటె నెగ్గు తదీయో  
పాంత చర కుబ్జ వామన | కాంతాదులతోడి పొందుకలిమి భటునకున్‌.

### [4.1.132](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.132)

ఆ. ఉత్తమాసనములు, నుత్కృష్ట వాహనం | బులును గరుణఁ దమకు భూమిపాలుఁ  
డీక తార యెక్కు టెంతటి మన్నన | గలుగువారికైనఁ గార్య మగునె?

### [4.1.133](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.133)

క. మన్నన కుబ్బక, యవమతి | దన్నొందిన స్రుక్కఁబడక, ధరణీశుకడన్‌  
మున్నున్న యట్ల మెలఁగిన | యన్నరునకు శుభము లొదవు నాపద లడఁగున్‌.

### [4.1.134](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.134)

క. జనపతి యెవ్వరి నైనను | మనుపఁ జెఱుపఁ బూనియునికి మది దెలియ నెఱిం  
గిన యేనిఁ దాను వెలిపు | చ్చునె మునుము న్నెట్టి పాలసుండును దానిన్‌?

### [4.1.135](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.135)

ఉ. ఎండకు వాన కోర్చి, తనయిల్లు ప్రవాసపుఁ జోటు నాక, యా  
కొండు, నలంగుదున్‌, నిదురకుం దఱి దప్పెడు, డప్పి పుట్టె, నొ  
క్కండన యెట్లొకో యనక కార్యము ముట్టినచోట నేలినా  
తం డొక చాయ చూపినను దత్పరతం బని సేయు టొప్పగున్‌.

### [4.1.136](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.136)

క. తా నెంత యాప్తుఁ డైన మ | హీనాయకుసొమ్ము పామునెమ్ములుగా లో  
నూనిన భయమునఁ బొరయక | మానినఁగా కేల కలుగు మానము బ్రదుకున్‌?

### [4.1.137](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.137)

ఆ. ఆవులింత, తుమ్ము, హాసంబు, నిష్ఠీవ | నంబు గుప్త వర్తనములు గాఁగఁ  
జలుప వలయు నృపతి కొలువున్న యెడల, బా | హిరము లైనఁ గెలని కెగ్గు లగుట.

### [4.1.138](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.138)

క. వైరుల దూతలు, నెరవగు | వారు, నిరాకృతులుఁ బాపవంతులుఁ దమకుం  
జేరువఁగా వర్తించుట | నేరమి; తుదిఁ బోయి చేటు నిందయు వచ్చున్‌.

### [4.1.139](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.139)

ఆ. వసుమతీశు పాల వసియించు నేనుంగు | తోడ నైన, దోమతోడ నైన  
వైర మగు తెఱంగు వలవదు; తా నెంత | పూజ్యుఁ డైన జనుల పొందు లెస్స.

### [4.1.140](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.140)

క. కలిమికి భోగముల కదా | ఫల మని తను మెఱసి బయలుపడఁ బెల్లుగ వి  
చ్చలవిడి భోగింపక వే | డ్కలు సలుపఁగ వలయు భటుఁ దడంకువతోడన్‌.’

### [4.1.141](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.141)

వ. అని యిట్లు పురోహితుండు సేవాధర్మంబు లెఱింగించిన ధర్మజ భీమార్జున నకుల సహదేవులు ప్రసన్న చిత్తులై యిట్లనిరి.

### [4.1.142](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.142)

క. ‘తల్లియుఁ దండ్రియు దైవము | నెల్ల సుహృజ్జనము మీర; యిట్లు గొలిచి వ  
ర్తిల్లెడు తెఱంగు లెంతయుఁ | దెల్లము సేసితిరి; బ్రతికితిమి మీ కరుణన్‌.’

### [4.1.143](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.143)

ఆ. అనిన ధౌమ్యుఁ డిట్టు లనియె; ‘నీ వత్సర | మొకఁడు నెట్టు లయిన నుడిగి మడిఁగి  
సంకటముల కోర్చి చరియించి యాపద | నిస్తరించి పిదప నెగడవలయు’.

### [4.1.144](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.144)

క. అనవుడు, ‘నట్టుల చేసెద’ | మని వారలు భక్తియుక్తి నతనికి నభివం  
దన మొనరించినఁ దగు దీ | వన లిచ్చె నతండు గాఢవాత్సల్యమునన్‌.

### [4.1.145](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.145)

క. భూదేవోత్తము నాశీ | ర్వాదంబులఁ బ్రీతిఁ బొంది వారలు ప్రస్థా  
నాదరపరు లగుటయు స | మ్మోదావహ పుణ్యకర్మముల కుద్యతుఁడై.

### [4.1.146](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.146)

ఆ. అతఁడు నియతితోడ నగ్ని సముజ్జ్వలం | బుగ నొనర్చి కామ్యపూజ దీర్చి  
యాన సమయ మంగళార్థంబు లగు మంత్ర | సంచయములు దగ జపించుచుండె.

### [4.1.147](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.147)

వ. తదనంతరంబ, హుతవహునకుం బురోహితునకుం బ్రదక్షిణంబు సేసి, యమ్మహీసురవరేణ్యు నను మతి వడసి, పాండవులు పాంచాలిం బురస్కరించుకొని, యాతండును దోడన యరుగుదేరం గదలి, శుభ నిమిత్తంబులు గైకొనుచుం జని, దశార్ణ దేశంబున కుత్తరంబునఁ బాంచాల జనపద యామ్యదిగ్భాగంబున సాళ్వ శూరసేన విషయంబులలోనం గాళిందీ దక్షిణతీరం బొరసికొని, పశ్చిమాభిముఖ ప్రయాణంబుల నెడనెడ వన్యాహారంబుల శరీర యాత్రలు నడపుచు, నానా మృగ వివిధ విహారంబులను, మనోహర కుసుమ కదంబ గంధ మకరంద బిందు సందోహ సుందర తరుచ్ఛాయా సేవనంబులను, గమల పరాగ పరంపరా ధూ సరిత భాసుర జలాశయ సమవగాహనంబులను, సరిత్సంగమ స్నానాద్యనుష్ఠానంబులను, బహుప్రకార పాదప గుల్మలతావ లోకనంబులను, బక్షికుల ప్రకరానేకభంగి విరుతాకర్ణనంబులను వినోదించుచుఁ, గానన మార్గంబుల నరిగి, మత్స్యమండలంబు గడి సేరి ధౌమ్యుని వీడుకొనిరి; అవ్విప్రవరుండును నొక్క పుణ్యాశ్రమంబున వసియించె; వారు మఱియు నూళ్ళు సొరక యడవి తెరువుల నడచి విరాటు నగరంబున కనతిదూరం బగు కాంతారంబునం దఱిమి పోవు సమయంబునఁ బథిశ్రమంబు నూని యాజ్ఞసేని యిట్లనియె.

### [4.1.148](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.148)

ఉ. ‘డప్పి జనించె, వ్రేళుల పుటంబులు పొక్కఁ దొడంగె, గోళ్ళలోఁ  
జిప్పిలఁ జొచ్చె నెత్తురులు, చిత్తము నాకుఁ గడు న్వశంబుగా  
దప్పుర మిచ్చ టచ్చటను నాసల వచ్చితి, నెంత ద వ్వొకో!  
యిప్పటి భంగి నొక్కడుగు నేఁగెడు దానికి నోర్వ నెమ్మెయిన్‌’.

### [4.1.149](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.149)

వ. అనవుడు.

### [4.1.150](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.150)

క. తన మదిఁ గరుణయు ఖేదం | బును బిరిగొనుచుండ ధర్మపుత్రుఁడు నకులుం  
గనుఁగొని ద్రుపదనృపతి నం | దన దెస యాతనికిఁ జూపి తగ నిట్లనియెన్‌.

### [4.1.151](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.151)

ఆ. ‘అకట! మనము వచ్చినది గడుదవ్వు, నేఁ | డప్పురంబు సొత్త మని తలంచి  
తఱిమి నడచితిమి లతాతన్వి యిది; వడ | గొనియె; మోచి తెమ్ము కొంత దవ్వు’

### [4.1.152](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.152)

క. అనిన విని పూని గ్రక్కున | జనుదేరమి, నతఁడు డస్సెఁ జాలం డని నె  
మ్మనమున నెఱింగి యాతని | యనుజన్మునిఁ బనిచె; నతఁడు నలసుం డయినన్‌.

### [4.1.153](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.153)

వ. సవ్యసాచిం జూచి.

### [4.1.154](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.154)

ఉ. ‘ఇమ్మదిరాక్షి డస్సె, మన కీనడుమన్‌ విడియంగ నొండుచో  
టిమ్మును గాదు; నిక్కమున కేమును డస్సితి; మట్లు గాన నీ  
వెమ్మెయినైన దీని భరియించి పురంబు సమీప భూమికిం  
దె’ మ్మని చెప్ప నాతఁడును దెచ్చెఁ బ్రియంబునఁ బుష్పకోమలిన్‌.

### [4.1.155](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.155)

క. మోచికొని వాసవాత్మజుఁ | డా చెలువం దేర నిట్టు లరిగి పురము దృ  
గ్గోచర మగుటయుఁ దమ్ములఁ | జూచుచు వారలకు ధర్మసుతుఁ డిట్లనియెన్‌.

### [4.1.156](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.156)

క. ‘చక్కని చిక్కని మేనులు | నిక్కోదండములు నైన నెఱుఁగరె? మన మీ  
చక్కటి నిలుతమె? శస్త్రము | లొక్కెడ దాఁచుటకు, వేషయోజనములకున్‌.’

### [4.1.157](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.157)

వ. అనిన నిది కార్యంబని మధ్యమపాండవుం డా సుమధ్య నొక్క శీతల సికతాతలంబున డించె; దక్కినవారలు నట్ల చేయుద మని నిలిచి; రట్టియెడలఁ బాండవాగ్రజుండు గాండీవి చేతి వి ల్లుపలక్షించి యతని కిట్లనియె.

### [4.1.158](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.158)

క. ‘మన శస్త్రాస్త్రంబులు ద | క్కినయవి యొకభంగి; వీటికిని గాండివముం  
గొనిపోయితిమేని సుయో | ధనునకు నగపాటు నిశ్చితం బూహింపన్‌.’

### [4.1.159](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.159)

వ. అనవుడు.

### [4.1.160](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.160)

చ. ‘ఇది పెనుఁబాము చందమున నెంతయు భీషణమై జనంబులన్‌  
బెదరఁగఁ జేయు; నట్లగుటఁ బెట్టి చనన్‌ వలయుం; దలంచి నా  
హృదయము దీనిఁ బాయుటకు నియ్యకొనం జొర; దెట్లు చెప్పినం  
దుది నొకచోట వైచుటయ తోఁచిన కార్యము నయ్యెడుం గటా!’

### [4.1.161](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.161)

వ. అని వితర్కించుచుం గిరీటి యురియాడు చిత్తంబు నుత్తలం బుడిపికొని నిశ్చయించి, యాయుధంబులు నిక్షేపించుటయ కర్జంబుగాఁ బలికి యోగ్యస్థల నిరూపణంబునకు నలుదిక్కులుం బరికించి ప్రేతభూమి పరిసరారణ్యంబునందు.

### [4.1.162](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.162)

సీ. నెగసిన కొనలేచి నింగినంతంతకు | నవులఁ ద్రోచుచుఁ దనరారు దానిఁ,  
జాఁగిన శాఖ లాశాచక్రమున కొలం | దులు బారవెట్టంగఁ బొలుచు దానిఁ,  
గవట లొండొంటితోఁ; గదియుచు నెడములు | మ్రింగి ప్రబ్బఁగ సొంపు మిగులు దాని,  
లోని జొంపము పవలును బెను జీఁకటి | నొదవించి పొదలంగ నొప్పుదానిఁ  
తే. గనియెఁ బవమాన వివిధ వర్తన కళాను | వర్తి; గాకఘూకారవస్ఫూర్తి జాత  
భీతి పరిసరవర్తి నాభీల భుజగ | చండమూర్తి, శమీతరు చక్రవర్తి.

### [4.1.163](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.163)

వ. కని యమ్మహీరుహంబు ధర్మనందనునకుం జూపి యిట్లనియె.

### [4.1.164](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.164)

శా. ‘పక్షివ్యాకులముం, బరేత నిలయోపాంతోత్థమున్‌, డాకినీ  
రక్షోభూత పిశాచ గోచరము దుర్గంధంబునై చూడఁ జి  
త్తక్షోభం బొనరించు; నట్లగుటఁ జెంతం జేరరా దీ శమీ  
వృక్షం బెవ్వరి; కిందుఁ బెట్టుదమె పృథ్వీనాథ! శస్త్రాస్త్రముల్‌?

### [4.1.165](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.165)

క. పెనుఁ బొడువుఁ బఱపు జొంప | మ్మును గలయది; దీన నెల్ల పురుషులకుఁ బ్రయో  
జన మొకఁడు లేదు, చేరం | జనఁ, జూడఁగ, నరయ, నెక్క సమకట్టంగన్‌.

### [4.1.166](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.166)

ఉ. కావున దీనియం దిడుట కార్యము కైదువులెల్లఁ; గేశచ  
ర్మావృత సంచయంబుగ శవాకృతిగా నొనరించి కట్టినం  
బోవరు దీని ది క్కొరులు భూవర! నెమ్మది నూఱడిల్లు; మె  
చ్చో వసియించినం బిదపఁ జొప్పడుఁ గ్రమ్మఱ వచ్చి కైకొనన్‌.’

### [4.1.167](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.167)

వ. అని చెప్పిన నందఱు నత్తెఱంగున కియ్యకొనుటయు, నతండు గాండీవంబు నవలోకించి.

### [4.1.168](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.168)

చ. ‘అనిమిష దాన వాంబరచరాదిక జాతుల నెల్లఁ బోర నీ  
ధనువునఁ గాదె గెల్తు! సముదగ్ర విరోధి భయావహంబు; దీ  
నిని నొక మ్రానఁ గట్టి చను నిశ్చయ మొందఁగఁ జేసె దైవ; మే  
మనఁ గల? దట్ల కాక’ యని యాత్మ నలందురి మందచేష్టుఁడై.

### [4.1.169](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.169)

వ. ఎక్కు డించినఁ బాండవాగ్రజుండు.

### [4.1.170](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.170)

క. దనుజకుల త్రాసకరం | బును రిపుభంజనము రత్నభూషిత రూపం  
బును గురుదేశాహ్లాదన | మును నగు నిజకార్ముకంబు మో పెడలించెన్‌.

### [4.1.171](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.171)

వ. తదనంతరంబ భీమ నకుల సహదేవులదెసఁ గనుంగొని.

### [4.1.172](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.172)

సీ. ‘సైంధవ యక్ష పాంచాల త్రిగర్తుల | దీనన యోర్చితి మానధనుఁడ!  
సౌరాష్ట్రనాథాది శత్రులు దీనిచేఁ | గాదె మర్దితు లైరి ఘనభుజుండ!  
కాళింగ పాండ్య మాగధుల నిర్జించుచో | నిదియ కైదువు నీకు విదితయశుఁడ!’  
యని క్రమంబున వారలందఱ విండులు | పెంపెసలార వేర్వేఱ పొగడి  
ఆ. గొనయములు వదల్ప ననుమతి సేయుడు | వారు నట్ల చేసి తేరఁ, జాప  
ములును దొనలు వర్మములు నసి ముద్గ రా | ద్యాయుధములుఁ గూడ నతఁడు గట్టె.

### [4.1.173](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.173)

వ. ఇట్లు పూర్వోక్త ప్రకారంబునం బొదివి, మహోరగంబులం బెట్టియలం బెట్టి కట్టు చందంబున బంధించి, వానిం గొనుచు, నయ్యజాతశత్రుండు ధర్మదేవతా దత్తవరుం డగుటంజేసి నిశ్శంకం బైన యంతఃకరణంబుతోడ శమీవృక్ష సమారోహణం బాచరించి.

### [4.1.174](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.174)

తే. బ్రహ్మ విష్ణు మహేశ దిక్పాల చంద్ర | సూర్య వనదేవతా పితృస్తుతు లొనర్చి  
దివియు భువియును జూచి ప్రార్థించి, యొక్క | విపులశాఖ నాయుధములు వ్రేలఁగట్టె.

### [4.1.175](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.175)

వ. ఇట్లు కట్టి తదీయాధిదైవతంబుల నుద్దేశించి నమస్కరించి.

### [4.1.176](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.176)

క. ‘నరునకు నాకుం దక్కఁగ | నొరులకు మీరూపు సూపకున్నది; విషవి  
స్ఫురిత భుజగభంగి భయం | కర మూర్తులు దాల్చి యుండఁగా వలయుఁ జుఁడీ.

### [4.1.177](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.177)

ఉ. భీముఁడు ధార్తరాష్ట్రకుల భీషణరోషుఁడు; చిత్త మెప్పు డె  
ట్లై మదమెత్తునో; యతని యాగ్రహవృత్తికి లోనుగాక మీ  
రే మెయి నైన వంచన వహించి తొలంగుట మత్సమీహితం;  
బేమఱకుండఁగా వలయు నివ్విషమాబ్దములోన నాతనిన్‌.

### [4.1.178](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.178)

వ. అని వేఁడికొని వృక్షంబు డిగ్గి దానికిం బ్రదక్షిణంబు వచ్చి ప్రణమిల్లి భీమసేనుదెస మరలి చూచి సాంత్వన వచన సమేతంబుగా నతనిం గౌఁగిటంజేర్చి యనునయించి తమ చేసిన విధంబు తత్ప్రదేశవర్తు లయిన గోపాలాది క్షుద్రజనంబులకు మఱుఁగు వెట్టం దలంచి వారల కభిముఖులై పాండునందను లందఱు నిట్లనిరి.

### [4.1.179](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.179)

చ. ‘ఇది శతవృద్ధు మాజనని; యిప్పుడు మృత్యువుఁ బొందె; నట్లు సే  
యుదుము; కులప్రయుక్త మగుచున్న సనాతన ధర్మ మిత్తెఱం  
గ; దహన కర్మ మొల్ల; మది గానిదిగా మును నిశ్చయించి మా  
మొదలిటివా రొనర్చు విధముం గొనియాడితి మేము నియ్యెడన్‌.

### [4.1.180](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.180)

వ. అని యిట్లు పలుమఱుం దెలియఁబలికి శస్త్రాస్త్రంబుల నిక్షేపణంబు నిగూఢం బగుటకు నూఱడిల్లి; యచ్చేరువం జచ్చిన పసరంబు వడియున్నం జూచి, సహదేవుం బనిచి, ధర్మ తనయుండు దాని చర్మం బొలిపించి, శీతాతప వర్ష పరిహారంబుగా నాయుధంబులం బొదివించి, మఱియును దత్సమీపంబున నొక్క శుష్కశవంబు నవలోకించి ‘యిది యుంఛవృత్తి యైన మానవు కళేబరంబు గావలయు’ ననుచు నదియునుం గైదువుల కట్టపయిం బెట్టి కట్టించె; నివ్విధంబున నత్యంతగుప్తి యాచరించి, ‘దీని దుర్గంధంబున వనచారు లెవ్వరుం జేర రని నవ్వుచు వార లచ్చోటు వాసి విరాట పురాభిముఖులై చనుచుండి, యజ్ఞాతవాస కాలంబునం దమ రహస్యపు వ్యవహారంబునకు ననువుగా నేవుర పేళ్ళును గ్రమంబున జయుండును, జయంతుండును, విజయుండును, జయత్సేనుండును, జయద్బలుండునని సంకేతించుకొని, యాజ్ఞసేనీ పురస్సరంబుగాఁ బుణ్యనదీ తీర్థావతరణంబు సేసి, తదీయస్నానంబునం బథిశ్రమం బపనయించి, దేవపితృతర్పణ మంగళ జపహోమ ధ్యానాద్యనుష్ఠానంబు లొనర్చిరి; తదనంతరంబ యక్కౌంతేయాగ్రజుండు ప్రాఙ్ముఖుం డయి నిర్మలచిత్తంబున ధర్మదేవతం దలంచి యిట్లనియె.

### [4.1.181](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.181)

ఆ. ‘తండ్రి! నీవు నాకు దయతోడ నిచ్చిన | వరము చిత్తగించి, వలయు తెఱఁగు  
సమయ సముచితముగ సమకట్టు మయ్య! యీ | రాకుమారు లవిధిఁ బోక యుండ.’

### [4.1.182](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.182)

వ. అనుచు ననుజుల దెసకు దూర వగచి డగ్గుత్తిక వెట్టి మఱియును.

### [4.1.183](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.183)

ఉ. అంబరవర్తి వైనఁ గని యక్షునిచే నగపడ్డ వీరి ప్రా  
ణంబులు మున్ను నిన్నడిగి, నల్వురకున్‌ నయవిక్రమ ప్రభా  
వంబులు వేఁడికొన్న నతివత్సలభావము; బొంది యాదరా  
ర్ద్రంబగు చూడ్కితోఁ బ్రియహిత స్థిరభాషల నూఱడింపవే.

### [4.1.184](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.184)

వ. అని తారు మున్ను భూసురవరు నరణి దేర నరిగిన నాఁడు సరోవరతీరంబునం దనకు ధర్ముండు సేసిన మన్నన దోఁప నతనికి విన్నవించినవాఁడై కరకమలంబులు మొగిచి, ఫాలభాగంబునం గదియించి, సంప్రార్థనంబుగా వినయ వినమిత మస్తకుం డగుటయుఁ, దదనుగ్రహంబునఁ బాండవాగ్రజుండున్న యునికిన సన్న్యాసి రూపం బలవడి ధాతుపట దండకమండలు కలిత మూర్తి యయ్యె; నయ్యవసరంబున వారందఱు మహాద్భుతం బంద వారివారికి నయ్యైవేషంబుల కనుగుణంబులగు నంబరాభరణ మాల్యాద్యుపకరణంబులు సన్నిహితంబు లయినం జూచి సంతసిల్లి, యెల్లవారిం గలయం గనుఁగొని, క్రమంబున నొంటిమైఁ జనుదెండని నియోగించి, యతండు నానావిధంబులగు నక్షంబులముడి కక్షంబున నిడికొని, చని, దైవయోగంబున విరాటుండు వెడలివచ్చి బయలికొలు విచ్చుటంజేసి తదాస్థానంబు చేరంబోవునప్పుడు.

### [4.1.185](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.185)

ఉ. దవ్వులఁ జూచి మత్స్యవసుధావతి ‘యీ చనుదెంచుచున్నవాఁ  
డెవ్వఁడొ? నాదు చూడ్కులకు నెంతయు వ్రేఁగయి తోఁచె నె ట్లితం  
డివ్విధిఁ బొందెనో? జగము లెల్లను నేలఁగఁ జాలు తేజ మా  
మువ్వుర తోడి జోడి యగు మూర్తి; యతీంద్రుని యొప్పుగంటిరే?

### [4.1.186](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.186)

సీ. కరచరణాద్యంగకంబు లేలొకొ రత్న | భూషణ ప్రకరంబు పొందు దొఱఁగె?;  
నుభయ పార్శ్వంబుల నిభఘట లేలొకో | చనుదేవు సమదాళి సమితి మొరయఁ?;  
బాయు తొలంగు మంచాయత వేత్ర హ | స్తుల మొత్త మేలొకో తోడ రాదు?;  
ధవళాతపత్రముల్‌ దఱచుగా నేలొకో | పట్టరు మౌక్తిక ప్రభలు వెలుఁగ?;  
తే. నితఁడు రాజగు; రాజను నింత మాత్ర | గాదు; మూర్ధాభిషిక్త వర్గంబుఁ దనదు  
చరణయుగ్మంబు గొలిపింపఁ జాలు సార్వ | భౌమ పదవికిఁ దగియెడు భంగివాఁడు.

### [4.1.187](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.187)

క. మన కడకు నేమిటికి వ | చ్చెనొకో; యే నిమ్మహాత్ము చెప్పిన పనులె  
ల్లను జేయువాఁడఁ గోరిన | కనకాంబరమణులు తలఁపు గడవఁగ నిత్తున్‌.

### [4.1.188](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.188)

ఆ. మత్స్యవిషయ రాజ్యమహిమకు యుక్తుండు | గాఁ దలంచెనేని గారవమున  
నట్లచేసి, భక్తి ననుచరింతు నమాత్య | సుత సుహృద్భటార్య యుతము గాఁగ’.

### [4.1.189](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.189)

వ. అని సమస్తజనంబులుఁ దదభిముఖులయి భక్తియుక్తింబ్రత్యుత్థానంబు సేయం దానును గద్దియ డిగ్గి యెదురు సని నమస్కరించి, యతని యాశీర్వాదంబులు గైకొని, సగౌరవంబుగాఁ దోడ్కొని చనుదెంచి సమంచిత సమున్నతాసనంబున నునిచి వినయావనతుం డయి.

### [4.1.190](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.190)

ఉ. ‘ఎయ్యది జన్మభూమి? కుల మెయ్యది? యెయ్యది యున్నచోటు? పే  
రెయ్యది? మీర లిందులకు నిప్పుడు వచ్చిన దానికిం గతం  
బెయ్యది? నాకు నింతయును నేర్పడఁగా నెఱిఁగింపుఁ డున్న రూ  
పయ్యది’ నావుడున్‌ నరవరాగ్రణి క య్యతిముఖ్యుఁ డిట్లనున్‌.

### [4.1.191](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.191)

ఆ. ‘ఉన్న రూప పలుకు నన్నరు లెక్కడఁ | గలరు? తోఁచినట్లు పలుకు వలుక  
నైన చంద మయ్యె; నంతియ కా, కంత | పట్టి చూడఁగలరె యెట్టివారు?’

### [4.1.192](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.192)

వ. అని మందహాసంబు సేయుచు మఱియును.

### [4.1.193](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.193)

క. నానావిధ భూతమయము | మే; నతిచంచలము మనము; మెయికొని నిక్కం  
బే నరునకుఁ జెల్లింపం | గానగు? సత్యంబు నడపుక్రమ మట్లుండెన్‌’.

### [4.1.194](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.194)

వ. అనుచు మత్స్యమహీవల్లభు నవలోకించి.

### [4.1.195](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.195)

క. ‘ద్విజుఁడఁ, గురు విషయ జాతుఁడ | సుజనప్రియుఁ డైన ధర్మసుతు సఖుఁడఁ బరి  
వ్రజనాశ్రమ కలితుండ, మ | నుజవల్లభ యోగ్య బహు వినోదకరుండన్‌.

### [4.1.196](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.196)

క. ద్యూతక్రీడకుఁ గొండొక | నేతుం; గపటమున నొవ్వని జనంబులు నా  
చేతి ధనమెల్లఁ గొని పరి | భూతి యొనర్చిన, విరక్తి పుట్టి వెడలితిన్‌.

### [4.1.197](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.197)

చ. నృపనయవిద్యకుం దగిన నే ర్పలవడ్డది గొంత కొంత; ధ  
ర్మపరుల సంగతిం దగిలి మచ్చిక నుండుదు; బేరు కంకుఁ; డే  
వపుఁ గొలు వైన నాకు నిలువన్‌ మది గొల్పదు; కాన నిన్ను భూ  
మిపతులలోన సాధుజనమిత్రుఁడు నా విని కొల్వ వచ్చితిన్‌.

### [4.1.198](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.198)

తే. వత్సరంబునఁ గడచను వ్రతము నాకు | దాని నీపాలఁ జల్పి యుత్సాహవృత్తి  
మెఱయ, నీకుఁ గృతజ్ఞత నెఱపి, తొల్లి | యెగ్గు సేసిన వారి జయింపఁ బోదు’.

### [4.1.199](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.199)

వ. అనిన విని సంప్రీత చేతస్కుండై విరాటుం డతని కిట్లనియె.

### [4.1.200](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4.1.200)

తే. ‘అట్ల చేయుఁడు రుచిరోన్నతాసనములు | వాహనములు భోజనములు వస్త్రములును  
వలయు భోగంబులును నెల్లవర్తనములు | నాకు నెట్లట్ల మీకును నడపువాఁడ.

_First 200 of 1,635 passages. [Read on](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4)_

---
Source: [https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.4) · Pramāṇa
