<!-- Pramāṇa, a library of Indian primary sources · https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.89 -->

[Pramāṇa](https://indike.org/pramana/) › [Indian literature](https://indike.org/pramana/in) › [Epic, Poetry, Drama & Narrative](https://indike.org/pramana/in.lit) › [The Mahābhārata and its versions](https://indike.org/pramana/in.lit.mahabharata) › [Mahābhāratas in Indian regional languages](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa) › [Andhra Mahabharatamu](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra) › 5.2.89

# Andhra Mahabharatamu 5.2.89

Āndhra Mahābhāratamu 5.2.89

- **Language:** Telugu

### [5.2.89](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.89)

వ. కావునఁ గౌరవులుం బాండవులు నొండొరులకుఁ బ్రాపై పొదలిన నెదిరికి నజయ్యు లగుదురు; పరుల యొత్తులేని రాజ్యంబు పూజ్యమహిమం బరఁగు. వనవాసంబునం గుందిన కౌంతేయులం దడయక తెచ్చి యుచితపదం బిచ్చి నిలుపుట నీ కొడుకులకు నిలుపు గావించుట యగు’నని చెప్పి మఱియు నిట్లనుఁ ‘బ్రియవాదు లెందును గల రప్రియం బగుంగాకేమియని పథ్యంబు(తథ్యంబు) వలుకువారు లేరు. జూదంబునప్పు డే నడ్డపడి, యప్రియం బగుటకు శంకింపక తథ్యంబు వలికితి; నది నీకు రుచియింపక, రోగికిఁ బథ్యాహారంబు దలకంటగించునట్లయ్యె; నైన నిప్పుడుం జెప్పెద వినుము: కాకంబులం గైకొని మయూరంబులం బరిహరించు విధంబున, మార్జాలంబులం బాటించి సింహంబులయెడ ననాదరంబు సేయు చందంబున సుయోధనాదులం బట్టి యుధిష్ఠిర ప్రముఖుల విడిచితి; నేఁడు కార్యంబు ముట్టవచ్చినం దోఁపక మిడుంగుఱు సోఁకినట్లు దల్లడించెదవు. కులంబునకై యొకనిఁ దొఱంగుటయ నీతి యని పెద్దలు సెప్పుదురు; దుర్ణయపరుండై సద్బుద్ధి సెప్ప వినం డేని, మనము దుర్యోధనుం దొఱంగిన నేమి యగు? నది యట్లుండె, సంపద సహాయంబు నపేక్షించియుండు; సహాయంబు సంపద నుద్దేశించి వర్తిల్లు; నిట్లవి యొకటొకటి పొందునంగాని సిద్ధింపవు కావున నీ సంపద పాండవులకును, వారి సహాయత్వంబు నీకునుం బ్రియం బొనరింప, నొండొరుల కలయుట మేలుగాక, మనలావువెలిసేయుట లెస్స యగునే? కురువంశనిస్తారకులగు భీష్మ యుధిష్ఠిరులును, నవక్ర విక్రములగు కర్ణార్జునులును, బ్రతాపధాములగు భీమ దుర్యోధనులును, శస్త్రాస్త్రపారగులగు నభిమన్యు లక్ష్మణ ప్రభృతి కుమారులును, శాపాను గ్రహసమర్థులగు ద్రోణ ద్రుపదాది పరమాప్తులును, వారి వారి బంధు మిత్రజనంబులును, నొక్క మొగంబై నీ పనుపు సేయుచు, నయ విక్రమంబు లప్రతిహతంబులై నడవం, బృథివి శాసింప భవదీయ విభవం బుజ్జ్వలంబై యొరులకెడలేక చెల్లుచున్న నెంత యొప్పగునో యటు విచారింపుము. పాండవులు ధీరమతులై వైర మెత్తక యూరక తొలంగియుండిరేనియుఁ, గతిపయ దినంబులలోఁ జీకాకుపడి చెడుంగాక, గాంధారీనందనుచేత వసుంధరా పరిపాలన భారంబు నిర్వహింపబడునే?’ యనిన విని ధృతరాష్ట్రుండు విదురున కి ట్లనియె:

- [Previous: 5.2.88](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.88)
- [Next: 5.2.90](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.90)
- [Up: 5.2](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2)

---
Source: [https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.89](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.89) · Pramāṇa
