<!-- Pramāṇa, a library of Indian primary sources · https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2 -->

[Pramāṇa](https://indike.org/pramana/) › [Indian literature](https://indike.org/pramana/in) › [Epic, Poetry, Drama & Narrative](https://indike.org/pramana/in.lit) › [The Mahābhārata and its versions](https://indike.org/pramana/in.lit.mahabharata) › [Mahābhāratas in Indian regional languages](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa) › [Andhra Mahabharatamu](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra) › 5.2

# Andhra Mahabharatamu 5.2: ఉద్యోగపర్వము — ద్వితీయాశ్వాసము

Āndhra Mahābhāratamu 5.2

- **Language:** Telugu

### ఉద్యోగపర్వము — ద్వితీయాశ్వాసము

### [5.2.1](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.1)

క. శ్రీ విస్తారకరణ కరు | ణావేశోదార ! శశ్వదమలాకారా!  
భావ వికార విదూర! శు | భావహ నామప్రకార! హరిహరనాథా!

### [5.2.2](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.2)

వ. దేవా! వైశంపాయనుండు జనమేజయున కిట్లనియె; ‘నివ్విధంబున వీడ్కొని సూతనందనుండు పవనజవంబు లగు నరదంబు తురంగంబులం దఱిమి ప్రొద్దుగ్రుంకునంతకుం గరిపురి సొచ్చి నగరి కరిగి యంతఃపురంబున నున్న ధృతరాష్ట్రునకుం దనరాక యెఱింగించి పుచ్చి యతనిం గాంచి యడుగుల కెఱఁగిన, నమ్మహీవరుండును నత్యాదరంబున నెత్తి సమీపంబున నునిచినం గొలిచియుండి చేతులు మోడ్చి యిట్లనియె;

### [5.2.3](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.3)

ఉ. ‘దేవర పంపఁగాఁ జని యుధిష్ఠిరునిం గని వచ్చినాఁడ; నా  
భూవిభుఁ డప్రమేయ గుణపూజ్యుఁడు మీకు నమస్కరించె; సం  
భావనసేసె నా; కిచటి బంధుల నెల్లఁ దలంచె; మీ సుఖ  
శ్రీ విభవంబులున్‌, సుతుల సేమము నన్నడిగెం బ్రసన్నుఁడై.’

### [5.2.4](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.4)

తే. అనుడు ధృతరాష్ట్రుఁ డిట్లను ‘నయ్యజాత | శత్రునకు సేమమే? యనుజన్ము లెల్ల  
సుఖులె? బంధులు, భృత్యులు, సఖులు, మంత్రి | వరులు సంప్రీతిమెయి నున్నవారె యచట?’

### [5.2.5](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.5)

వ. అనిన సంజయుం డిట్లనియె;

### [5.2.6](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.6)

క. ‘వారెల్లను భవదీయ | స్ఫారబలము గారణముగ సౌఖ్యంబున ను  
న్నారమని పలుకుదురు; నిజ | మారయఁగా నట్ల కాదె యది, జననాథా!

### [5.2.7](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.7)

క. ధర్మజునకు భోగంబులు | ధర్మువున ట్లింపు గావు; ధర్మంబులలో  
నిర్మల బుద్ధి నహింసకుఁ | గూర్మి గడుం గలఁ డతండు, కురువంశనిధీ!

### [5.2.8](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.8)

ఉ. మానుషశక్తి యొల్లఁడు; సమంచిత దైవమ యూఁదియుండు; నీ  
పైన యతండు పుణ్యమును బాపముఁ బెట్టినవాఁడు; నీవు నీ  
సూనువశంబ కాని యొకచొప్పుఁ దలంపవు; కర్ణ సౌబలా  
ధీనము కార్యనిశ్చయము; తెల్లము నీ మత మొప్ప దేమియున్‌.

### [5.2.9](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.9)

ఆ. ఆలు బిడ్డ లేని యట్టి త్రిమ్మరి యగు | కొయ్య గాక, కుదుటఁ గూడు వెట్టి  
కుడుచువార లిట్టి క్రొవ్విదంబులు సేయఁ | జొచ్చు టిచ్చగించి చూతురయ్య?

### [5.2.10](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.10)

చ. కొడుకులఁ గానరే నృపు లకుంఠితతేజుల నెందు? నిమ్మెయిం  
జెడు తెరు వైనచోఁ దగవు సెప్పక యొప్పరికించి చూతురే?  
పుడమి జనంబులెల్ల నినుఁ బ్రువ్వఁగఁ దిట్టఁగ వించు నున్కి నొ  
చ్చెడు మది యెప్పుడుం, జెవులు చీములు గట్టెడుఁ గౌరవేశ్వరా!

### [5.2.11](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.11)

చ. చలమున దుస్ససేనుఁడును సౌబలుఁడున్‌ మిముఁ బట్టి యార్ప బొ  
మ్మల క్రియ నాడుచుండుదురు మానక నీవు సుయోధనుండుఁ; దా  
రలసి యొకప్డు పాండుసుతు లాగ్రహవృత్తికిఁ జొచ్చిరేని నీ  
చలము బలంబునుం గులముఁ జక్కఁగఁ జేయరె యొక్క వ్రేల్మిడిన్‌?

### [5.2.12](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.12)

క. వినుము యుధిష్ఠిరు సైరణ | మనవారలు వెఱపుగా సమర్థింతురు; డీ  
కొనఁగం దగరే కొండం | గని యోటమి వెట్టినట్లు, కౌరవనాథా!

### [5.2.13](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.13)

క. అనుజులకు నడ్డపడి యే | మిని జేయఁగ నీమిఁ జూచి మెచ్చితిగా కీ  
వును; సాదు రేఁగె నేని | న్విను, తలపొలమునన కాని నిలువదు సుమ్మీ!

### [5.2.14](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.14)

చ. అనయము వుట్టె జూదమున యప్పుడ; యెంతయుఁ జిచ్చువెట్టి కా  
ల్చినయది నీ యుపేక్షయ; వశీకృతచిత్తుఁడు ధర్మసూతి మె  
త్తని పులి; యెల్లవారలు నధర్మము నీపయిఁ బెట్టునంతకు  
న్వినఁడును గానఁడుం, బిదప నీకును నాకు మరల్పవచ్చునే?

### [5.2.15](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.15)

చ. అనయము నొచ్చుచున్నయవి యంగము లెల్లను వేగ వచ్చుట;  
న్మనము వశంబు గాదు; జననాయక! ప్రొద్దును బోయె; నిప్పు డేఁ  
బనివిని రేపు పుత్త్రులును, బంధులు, నాప్తులు, నీవు నేర్పడన్‌  
విన మన కార్యమంతయు సవిస్తరతం దగ విన్నవించెదన్‌.’

### [5.2.16](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.16)

ఆ. అనిన, ‘నట్ల కాక’ యని సంజయుని వీడు | కొలిపి, కొంత ప్రొద్దు కురువిభుండు  
కార్యచింత మునిఁగి, కంచుకి నొక్కరుఁ | బిలిచి, వేగ విదురుఁ బిలువు మనియె.

### [5.2.17](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.17)

వ. వాఁడును సత్వరంబుగాఁ జని యతనిం దోడ్తెచ్చి కాన్పించిన, నమ్మహీవరుం డత్యాదరంబున విదురుం దనయొద్ద నునిచికొని యతని కి ట్లనియె:

### [5.2.18](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.18)

ఆ. ‘పాండురాజసుతుల పాలికిఁ చని యిప్డు | సంజయుండు వచ్చి, సమ్ముఖమున  
నన్నుఁ జాల దూఱి, నాకు రే పచ్చటి | పనులు సెప్పువాఁడ ననుచుఁ జనియె.

### [5.2.19](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.19)

క. అప్పటినుండియు నెవ్వగ | గప్పికొనినఁ జిత్తవృత్తి గలఁగెడు; మేనున్‌  
నిప్పులఁ బొరలినయ ట్లయి | చొప్పడ దించుకయు నిద్ర శుద్ధవిచారా!’

### [5.2.20](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.20)

వ. అనిన, విదురుం డిట్లనియె :

### [5.2.21](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.21)

క. ‘బలవంతుఁడు పై నెత్తిన | బలహీనుఁడు, ధనము గోలుపడిన యతఁడు, మ్రు  
చ్చిల వేచువాఁడుఁ, గామా | కుల చిత్తుఁడు నిద్రలేక కుందుదు రధిపా!

### [5.2.22](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.22)

క. ఇక్కొఱగాముల లోపల | నొక్కటి నీ చిత్తవృత్తి నొందెనొ? యొరు సొ  
మ్మెక్కటి గుడువఁ దలంచితొ? | నిక్కము గత మేమి సెపుమ నిద్ర సెడుటకున్‌?’

### [5.2.23](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.23)

తే. అనిన, ధృతరాష్ట్రుఁ డిట్లను నతనితోడ | ‘ధర్మసుతుమాటచొ ప్పెవ్విధంబొ యెఱుఁగ  
కునికిఁజేసి చింతిల్లితి; నోపు దీవు | దెలియఁ జెప్పి నా యలమట మలుగఁ జేయ.’

### [5.2.24](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.24)

చ. అనవుడు నిట్లనున్‌ విదురుఁ; ‘డక్కట! ధర్మసుతుండు బాంధవుం  
డును జెలికాఁడునుం దగు భటుండును బ్రెగ్గడయున్‌ గురుండుఁ గాఁ  
డె, నృపవరేణ్య! నీకుఁ? బ్రకటీకృత సత్త్వుఁడు శాంతమూర్తి స  
ద్వినయ వివేక శీలముల విశ్రుతుఁ; డాతఁడు గీడు వల్కునే?

### [5.2.25](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.25)

ఆ. నీవుఁ గొడుకు వారి నెఱి లేక పఱిచితి; | రదియ చాలు; నుచితమైన పాలు  
పంచి యిండు; పిల్లి వట్టిన యీరువు | సేసియున్న నేల చెల్ల నేర్చు?

### [5.2.26](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.26)

వ. మీరు శకుని కర్ణ దుశ్శాసనుల మీఁద రాజ్యభారంబు వెట్టికొనియుండుదు; రిది దుది ముట్టనేర దెట్లంటేని.

### [5.2.27](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.27)

క. తముఁ దా రెఱుఁగుట, వేగ ప | డమి, దాలిమి, విడుపు గలుగుటయు లేని ప్రభు  
త్వము గలదె? వారియం దీ | సుమానుషము లొకఁడుఁ బట్టి చూడం గలఁడే?

### [5.2.28](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.28)

వ. యుధిష్ఠిరుండు నీవు నిక్కమ తండ్రివని, తగవు నమ్మి, చాల సైరించియున్నవాఁ; డది నీవ యెఱుంగు’ దనిన విని ధృతరాష్ట్రుం డిట్లనియె :

### [5.2.29](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.29)

తే. ‘సంజయునిచేతఁ గార్యంబు చంద మెల్లి | యెఱిఁగి, మన కెద్ది సేయంగఁ దెఱఁగు, దానిఁ  
బనిచి చేయింపు; మిపుడు నా మనము దల్ల | డిలుట హితభాషణంబుల డిందుపఱుపు.

### [5.2.30](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.30)

వ. నీవు ధర్మాధర్మ విదుండవు; నయానయజ్ఞుండవు. నాకుం బ్రజాగరం బొనర్చుచున్న సంతాపం బుపశమిం చునట్లుగా భవద్వచనామృతంబు నా యుల్లంబున వెల్లిగొల్పు’ మనిన విదురుం డిట్లనియె.

### [5.2.31](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.31)

క. ‘జనులకు నొడఁ బా టగువిధ | మున నడచుచు, లోకనింద్యముల నుడుగుచు, మీఁ  
దని యొకని కలిమి కులుకక | మనుజులతోఁ బొంది పొసఁగి మను టొప్పు నృపా!

### [5.2.32](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.32)

క. కోపము, నుబ్బును, గర్వము | నాపోవక యునికియును, దురభిమానము, ని  
ర్వ్యాపారత్వము నను నివి | కాపురుషగుణంబు లండ్రు కౌరవనాథా!

### [5.2.33](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.33)

క. ఏలిన వానిని, దైవము, | నాలిని, బంధులను సముచితారాధన సం  
శీలతఁ బ్రీతులఁ జేయని | పాలసుఁడా ఫలము లాసపడు, మనుజేంద్రా!

### [5.2.34](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.34)

క. నెమ్మి గలవారి నొల్లరు | త మ్మొల్లనివారి వెనుకఁ దగులుదు; రధిక  
త్వ మ్మెఱిఁగి యెఱిఁగి తొడరుదు | రి మ్మెఱుఁగని యట్టివార లిభపురనాథా!

### [5.2.35](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.35)

క. ధనమును, విద్యయు, వంశం | బును దుర్మతులకు మదంబుఁ బొనరించును; స  
జ్ఞను లైనవారి కడఁకువ | యును, వినయము నివియతెచ్చు నుర్వీనాథా!

### [5.2.36](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.36)

క. అరిది విలుకాని యుజ్జ్వల | శర మొక్కని నొంచుఁ; దప్పి చనినం జను; నే  
ర్పరి యైనవాని నీతి | స్ఫురణము పగరాజు, నతని భూమిం జెఱుచున్‌.

### [5.2.37](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.37)

తే. ఒకటిఁ గొని, రెంటి నిశ్చలయుక్తిఁ జేర్చి, | మూఁటి నాల్గింటఁ గడు వశ్యములుగఁ జేసి,  
యేనిటిని గెల్చి, యాఱింటి నెఱిఁగి, యేడు | విడిచి వర్తించువాఁడు వివేకధనుఁడు.

### [5.2.38](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.38)

క. విను, మధురాహారంబులు | గొనుటయుఁ, బెక్కండ్రు నిద్ర గూరినయెడ మే  
ల్కని యునికియుఁ, గార్యాలో | చనముఁ, దెరువు నడచుటయును జన దొక్కనికిన్‌.

### [5.2.39](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.39)

క. నడవడి యను మున్నీటిం | గడవం బెట్టంగ నోడకరణిం దగి తా  
నొడఁగూడు ననిన, సత్యము | గడచినగుణ మింక నొండు గలదే యరయన్‌?

### [5.2.40](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.40)

క. క్షమియించు వారిఁ గని చా | లమి వెట్టుదు; రైననుం దలంప, ననూన  
క్షమయ కడు మెఱయు తొడ; వు | త్తమ రూపము గోరువారు దాల్తురు దానిన్‌.

### [5.2.41](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.41)

క. పురుషుండు రెండు దెఱఁగుల | ధర నుత్తముఁ డనఁగఁ బరఁగుఁ; దా నెయ్యెడలం  
బరుసములు వలుక కునికిన్‌; | దురితంబులు వొరయు పనులు దొఱఁగుట కతనన్‌.

### [5.2.42](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.42)

తే. చెల్లియుండియు సైరణ సేయువతఁడుఁ, | బేదవడియును నర్థికిఁ బ్రియముతోడఁ  
దనకుఁ గల భంగి నిచ్చు నతండుఁ, బుణ్య | పురుషు లని చెప్పి రార్యులు కురువరేణ్య!

### [5.2.43](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.43)

ఆ. పాడి దప్పకుండఁ బడయు సొమ్ములకు న | పాత్రములకు నీగి, పాత్రములకుఁ  
బెట్ట కునికి యనఁగ నెట్టన రెండు వి | ధములఁ గీడు దొడరు ధరణినాథ!

### [5.2.44](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.44)

తే. వెలఁది, జూదంబు, పానంబు, వేఁట, పలుకు | ప్రల్లదంబును, దండంబుఁ బరుసఁదనము  
సొమ్ము నిష్ప్రయోజనముగ వమ్ము సేఁత | యనెడు సప్తవ్యసనములఁ జనదు తగుల.

### [5.2.45](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.45)

తే. తగిన వేషంబు, దనుఁ దాన పొగడుకొనమి | నొచ్చియును గీడు వలుకమి, యిచ్చి వగవ  
కునికి, దన కెంత నడవకయున్నఁ బథము | దప్పకుండుట నడవడి కొప్పు సేయు.

### [5.2.46](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.46)

క. చెలిమియు, సంభాషణమును | బలిమి, వివాదంబుఁ, ద్రోపుఁ బాడియుఁ దమయం  
తలవారితోన తగు; నథి | కుల, హీనుల తోడనైనఁ గొఱ గా దధిపా!

### [5.2.47](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.47)

తే. కొంచె మైనను దగఁ బంచి కుడువ మేలు; | పనులయెడ దుఃఖ మోర్చి యల్పంబు సుఖము  
ననుభవించుట హితము; శత్రునకు నైన | నిచ్చుటయ లెస్స యడిగినయెడ నృపాల!

### [5.2.48](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.48)

క. తను లోకము గొనియాడఁగ | విని యుబ్బఁడు సజ్జనుండు; వెండియుఁ గడు మే  
లొనరించుఁ; గీ డొకించుక | యును దసదెసఁ దోఁపనీక యుడుపుచు వచ్చున్‌.

### [5.2.49](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.49)

వ. ఇట్టి చందంబులు ధర్మనందనునకుం గల’ వని పలికి, విదురుం డది ప్రసంగంబుగాఁ బాండవులఁ బ్రశంసించి, ‘నీవు వారలం బెనిచి మానుసులం జేసి రక్షించి, యిప్పు డుపేక్షించి, వారలు వెలినుండ నూరకుండం దగునే? తగుపాలిచ్చి, వారి రావించి, నీ కొడుకుల తోడివారింగా నడపుట యుచితంబు, మీరును వారును నొక్కటియై యున్న మీదిక్కు దేవతలకుం దేఱి చూడరా’ దనిన, నమ్మాటలు వెడవెడ యూఁకొని ధృతరాష్ట్రుండు విదురున కిట్లనియె.

### [5.2.50](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.50)

తే. ‘హితముఁ గర్తవ్యమును నాకు నెఱుఁగు దీవ; | ధర్మసుతు చందమును విదితంబు నీకు;  
నట్లు గావున నెఱిఁగింపు మఖిలకార్య | జాతమును జిత్తతాపోపశమము గాఁగ.’

### [5.2.51](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.51)

క. అనుడు విదురుఁ డాతని కి | ట్లను; ‘నిమ్మెయి నన్ను నొత్తి యడిగినఁ జెప్పం  
జను నున్న రూపు; సెప్పెద | విను మవధానంబు తోడ విమలవిచారా!

### [5.2.52](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.52)

ఉ. డక్కెను రాజ్యమంచు నకటా! యిటు దమ్ముని భాగ మీక నీ  
వెక్కటి మ్రింగఁ జూచె; దది యె ట్లఱుగున్‌? విను, మీను లోలతన్‌  
గ్రక్కున నామిషంబు చవి గాలము మ్రింగిన చాడ్పు సూవె యి;  
ట్లుక్కివుఁడైన నీ కొడుకు నుల్లము నున్నటు లాడఁగూడునే?’

### [5.2.53](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.53)

క. అన విని నిరుత్తరుం డయి | మనుజేంద్రుఁడు గొంతసేపు మ్రాన్పడి తలఁపుల్‌  
పెనఁగొన, నిద్రాహానిం | దను వలయఁగ విదురుతోడఁ దా నిట్లనియెన్‌:

### [5.2.54](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.54)

క. ‘ఇందాఁక నీదు పలుకుల | డెందము తాపంబు గొంత డిందుపడియె; నా  
కుం దగ నయానయంబుల | చందంబులు సెప్పుచుండు సౌజన్యనిధీ!’

### [5.2.55](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.55)

వ. అనిన విని విదురుం డిట్లనియె:

### [5.2.56](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.56)

ఆ. ‘తనియఁ బండకుండ మును గోసికొనఁ జవి | చేటె కాదు; విత్తు చేటుఁ గలుగుఁ;  
బక్వమైనఁ గొనిన ఫల మించుఁ, జెడదు బీ | జంబుఁ; గార్యసిద్ధిచంద మిట్లు.

### [5.2.57](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.57)

తే. మాలకరి పుష్పములు గోయుమాడ్కిఁ, దేఁటి | పువ్వుఁ దేనియ గొనియెడు పోల్కి నెదురు  
గందకుండఁగఁ గొనునది కార్యఫలము; | బొగ్గులకుఁ బోలె మొదలంటఁ బొడువఁ జనదు.

### [5.2.58](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.58)

క. పరుల ధనమునకు, విద్యా | పరిణతికిం, దేజమునకు, బలమునకు మనం  
బెరియఁగ నసహ్యపడు న | న్నరుఁడు దెవులు లేని వేదనం బడు నధిపా!

### [5.2.59](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.59)

క. ఎదిరికి హితమును, బ్రియమును, | మది కింపును గాఁగఁ బలుకు మాటలు పెక్కై  
యొదవినను లెస్స; యటు గా | కిది యది యన కూరకునికి యెంతయు నొప్పున్‌.

### [5.2.60](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.60)

క. చెలిమియుఁ బగయును, దెలివియుఁ, | గలఁకయు, ధర్మంబుఁ, బాపగతియును, బెంపుం,  
దులువతనంబును వచ్చును | బలుకుబడిన; కానఁ బొసఁగఁ బలుకఁగ వలయున్‌.

### [5.2.61](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.61)

క. బెడిదముగఁ గత్తి గొడ్డటఁ | బొడువఁ దెగినమ్రానఁ జిగురు వొడముఁ; బలుకులం  
జెడఁ దునిసిన కార్యంబు ని | గుడనేరదు పిదపనెట్టుఁ గురువంశనిధీ!

### [5.2.62](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.62)

క. తనువున విఱిగిన యలుఁగుల | ననువునఁ బుచ్చంగవచ్చు; నతి నిష్ఠురతన్‌  
మనమున నాటిన మాటలు | విను మెన్ని యుపాయములను వెడలునె యధిపా!

### [5.2.63](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.63)

ఉ. అక్కట! ధర్మనందనుని యాస్యమునం దొకనాఁడుఁ గీడుప  
ల్కొక్కఁడు లేదు; నీ కొడుకు లొండొరు మీఱి నికృష్టవాక్యముల్‌  
పెక్కులు పెక్కుభంగులను బ్రేలుచు నుండఁగ నీవు దానికిన్‌  
స్రుక్కక వించు నుండె; దనురూపమె నీ కిది కౌరవేశ్వరా?

### [5.2.64](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.64)

ఆ. చేటుకాలమైనఁ జెట్టమాటలు నెఱి | గాని తెరువు వట్టు కర్జములును  
దగవు లట్లు తోఁచుఁ; దగియెడునవి యవి | నీతు లని మనంబు నిశ్చయించు.

### [5.2.65](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.65)

వ. నీ బుద్ధి పాండవులతోడి విరోధంబునెడ మరలంబడమి పాపం బింతియకాక యేమి సేయుదము? మన కులంబునం దేజో ధైర్య ధార్మికత్వాది గుణంబుల గరిష్ఠుండయిన యుధిష్ఠిరుండు నీ సిరికి వెలియై యట్లుండుట దగ వగునే? నీ పెద్దతనంబు సూచి సైరణ వాటించి యున్నవాఁ’డనిన, విదురు దిక్కు మొగంబై ధృతరాష్ట్రుండు ‘నీ చెప్పిన నీతివాక్యంబుల నా మనంబు దనివోవ దింకను జెప్పు’ మనవుడు నతండు వెండియు నిట్లనియె.

### [5.2.66](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.66)

ఆ. ‘సకల పుణ్యకర్మ చయమును నొకదెస, | వినుము పాడి దప్పకునికి యొక్క  
దిక్కు; దీని శ్రుతులు తెలిపెడునెడఁ, బాడి | కలిమి యెందుఁ బెద్దగా నుతించె.

### [5.2.67](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.67)

తే. పాడి గలిగిన నిహలోకఫలములెల్లఁ | జేరుటయ కాదు, కీర్తియుఁ జెందుఁ బురుషు;  
ధరణిఁ బొగడిత యెందాఁకఁ బరఁగు, నంత | కాలమును బుణ్యలోకంబు గల్గు నండ్రు.

### [5.2.68](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.68)

వ. తొల్లి ప్రహ్లాదుండు దైత్యజాతి సంభవుం డయ్యును, దనకొడుకు విరోచనుండును, నంగిరసుండను విప్రు కొడుకు సుధన్వుండును దమతమ ప్రాణంబు లొడ్డుగా నొడ్డి యొక్క ధర్మ సందేహంబునకుఁ బన్నిదంబు సఱచి వచ్చి త న్నడిగిన, నితండు గొడు, కితండు లాఁతి యని తలంపక మధ్యస్థుండై సుధన్వు గెలిపించి, యతని చేత నిజతనయుని జీవితంబు దానంబుగాఁ గొని వాని బ్రదికించెం గావున, నీవును ధర్మంబు విడువక, యధర్మోపేతులైన నీకొడుకులవలని పక్షపాతంబు విడిచి తెఱంగు సేయుము; వారును వీరును నాపదలేక బ్రదుకుదురు; నీవును శోకంబులేక తక్కుదు’వని చెప్పి మఱియును-

### [5.2.69](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.69)

క. ‘పాపంబులు గర్జము లని | యేపునఁ జేయంగ నవియు నింపగు; ధర్మ  
వ్యాపారంబు లకార్యము | లై పరిణతిఁ బొందెనేని నట్టుల చెల్లున్‌.

### [5.2.70](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.70)

చ. అది సభయే ప్రియం బెసఁగ నార్యులు నిల్వరయేని? నార్యులే  
మదిఁ దలఁపంగ వారలు సమంచిత ధర్మము వల్కరేని? న  
ట్టిదియును ధర్మువే తగ ఘటించిన నిక్కము లేద యేనిఁ? దాఁ  
బదిలపునిక్కమే యొక నెపంబిడు చొప్పగునేని భూవరా!

### [5.2.71](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.71)

ఉ. నీతి పథంబునన్‌ బ్రదుక నేర్చుట యుత్తమ భంగి; శౌర్య సం  
జాతములై కరం బలరు సంపద లొందుట మధ్యవృత్తి; య  
స్ఫీతములైన భారవహజీవనముల్‌ దలఁపం గనిష్ఠముల్‌;  
నీతికి బాహ్యులైన, ధరణీవర! మెత్తురె వారి నుత్తముల్‌?

### [5.2.72](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.72)

ఆ. కయ్యమునక యెపుడుఁ గాలు ద్రవ్వుదురు నీ | పుత్త్రు లెల్ల; సూతపుత్త్రుఁ డాది  
యగు తదీయ మంత్రు లంతకు ముందర | బిరుదు; లీవు నీతి తెరువు సొరవు.

### [5.2.73](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.73)

క. పాండవులు శౌర్య మొల్ల; ర | ఖండిత నీతి ప్రకార కార్యము మెచ్చై  
యుండుదు; రెదు రేచినఁ దుది | మండుదు; రార్పంగ రాదు మఱి యెవ్వరికిన్‌.

### [5.2.74](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.74)

క. తమ తండ్రి భంగి నీకును | సముచిత మగు భక్తి సేసి సజ్జననుత మా  
ర్గమున నడచువారల నీ | వమలమతిం గన్నకొడుకు ల ట్లరయఁదగున్‌.’

### [5.2.75](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.75)

వ. అని పలికి మఱియు నిట్లనియె:

### [5.2.76](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.76)

క. ‘కారణము లేకయును నుప | కార పరత్వమున నొరుల కార్యంబులకున్‌  
వారని యలజడిఁ బడియెడు | వారల చూ యేడుగడయు వారికి నధిపా!

### [5.2.77](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.77)

చ. ఒకరుని చేతిప్రోపును దదున్నతి ప్రాపును గాంచి, యెల్లవెం  
టకును గొఱంతలేక పొగడందగు సంపద నొంది, యట్టి దా  
తకుఁ దుదిఁ గీడు సేసిన కృతఘ్నుని పీనుఁగునైన రోఁత వు  
ట్టక కబళింపఁ గుక్కలు నొడంబడునే కురువంశవర్ధనా!

### [5.2.78](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.78)

వ. కావునఁ గృతము దలంపమి గీడు; పాండురాజు నీకుం బరమ భక్తుండు; పాండవులునుం దేజో లాభంబులు గావించినవారలు; వారల నాదరింపు’ మని చెప్పి వెండియు నిట్లనియె:

### [5.2.79](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.79)

ఆ. ‘బ్రదుకు, చేటు, పొగడువడుట, దూ ఱొందుట, | యీఁగి, వేఁడుకొనుట, యిట్లు మఱియుఁ  
గలుగు సౌఖ్య దుఃఖములు వచ్చు నడవడి; | వాని కింత యేల వగవ నధిప!

### [5.2.80](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.80)

క. వగ బలము దఱుఁగు, రూపఱు; | వగచిన మతి దప్పుఁ, దెవులు వచ్చును; దూరన్‌  
వగచి నలంగినఁ బ్రియ మగుఁ | బగతురకును; వగచు టుడుగు; పార్థివముఖ్యా!’

### [5.2.81](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.81)

వ. అనిన విని ధృతరాష్ట్రుండిట్లనియె :

### [5.2.82](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.82)

క. ‘రిత్త యుపచారముల నే | నుత్తముఁ డగు ధర్మతనయు నుడికించితి; దు  
ర్వృత్తులగు మత్సుతులకును | మిత్తి యగుం బోర; వగలు మిగులక యున్నే?

### [5.2.83](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.83)

వ. నెవ్వగలు నివ్వటిల్లనీక నిలుపునట్టిది యెయ్యది? దాని నెఱింగింపు’ మనిన విదురుం డిట్లనియె.

### [5.2.84](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.84)

తే. ‘నియత తపమును, నింద్రియ నిగ్రహంబు, | భూరి విద్యయు శాంతికిఁ గారణములు;  
వాని యన్నిటికంటె మేలైన శాంతి | కారణము లోభ ముడుగుట కౌరవేంద్ర!’

### [5.2.85](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.85)

వ. అని వెండియు.

### [5.2.86](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.86)

క. ‘జ్ఞాతుల పోరితమును; గో | వ్రాతము నాక్రమము, విప్ర వర్గము చనవున్‌,  
నాతులఁ గారించుటయును | బ్రీతిం జన నిచ్చునతని పెం పొప్పు నృపా!

### [5.2.87](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.87)

క. అలమికొని యొండొరుల ప్రో | పులఁ బ్రాపుల నెలమికలిమిఁ బొంది బహు జ్ఞా  
తులు నెమ్మిఁ గూడి తామర | కొలని క్రియన్‌ సిరికిఁ బట్టగుదు రుజ్జ్వలులై.

### [5.2.88](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.88)

చ. కరి తురగాది ఘట్టనయు గాలియు నొంపదె యొంటి నున్న య  
త్తరువు? ననేక భూరుహవితానము గుంపయిపేర్చి బాధలం  
బొరయునె? యన్నదమ్ములును బొందిన నేరి కసాధ్యు; లట్లు గా  
కెరవయి నిల్చినం గెలని కెల్లిదమై పఱివోదు రెంతయున్‌.

### [5.2.89](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.89)

వ. కావునఁ గౌరవులుం బాండవులు నొండొరులకుఁ బ్రాపై పొదలిన నెదిరికి నజయ్యు లగుదురు; పరుల యొత్తులేని రాజ్యంబు పూజ్యమహిమం బరఁగు. వనవాసంబునం గుందిన కౌంతేయులం దడయక తెచ్చి యుచితపదం బిచ్చి నిలుపుట నీ కొడుకులకు నిలుపు గావించుట యగు’నని చెప్పి మఱియు నిట్లనుఁ ‘బ్రియవాదు లెందును గల రప్రియం బగుంగాకేమియని పథ్యంబు(తథ్యంబు) వలుకువారు లేరు. జూదంబునప్పు డే నడ్డపడి, యప్రియం బగుటకు శంకింపక తథ్యంబు వలికితి; నది నీకు రుచియింపక, రోగికిఁ బథ్యాహారంబు దలకంటగించునట్లయ్యె; నైన నిప్పుడుం జెప్పెద వినుము: కాకంబులం గైకొని మయూరంబులం బరిహరించు విధంబున, మార్జాలంబులం బాటించి సింహంబులయెడ ననాదరంబు సేయు చందంబున సుయోధనాదులం బట్టి యుధిష్ఠిర ప్రముఖుల విడిచితి; నేఁడు కార్యంబు ముట్టవచ్చినం దోఁపక మిడుంగుఱు సోఁకినట్లు దల్లడించెదవు. కులంబునకై యొకనిఁ దొఱంగుటయ నీతి యని పెద్దలు సెప్పుదురు; దుర్ణయపరుండై సద్బుద్ధి సెప్ప వినం డేని, మనము దుర్యోధనుం దొఱంగిన నేమి యగు? నది యట్లుండె, సంపద సహాయంబు నపేక్షించియుండు; సహాయంబు సంపద నుద్దేశించి వర్తిల్లు; నిట్లవి యొకటొకటి పొందునంగాని సిద్ధింపవు కావున నీ సంపద పాండవులకును, వారి సహాయత్వంబు నీకునుం బ్రియం బొనరింప, నొండొరుల కలయుట మేలుగాక, మనలావువెలిసేయుట లెస్స యగునే? కురువంశనిస్తారకులగు భీష్మ యుధిష్ఠిరులును, నవక్ర విక్రములగు కర్ణార్జునులును, బ్రతాపధాములగు భీమ దుర్యోధనులును, శస్త్రాస్త్రపారగులగు నభిమన్యు లక్ష్మణ ప్రభృతి కుమారులును, శాపాను గ్రహసమర్థులగు ద్రోణ ద్రుపదాది పరమాప్తులును, వారి వారి బంధు మిత్రజనంబులును, నొక్క మొగంబై నీ పనుపు సేయుచు, నయ విక్రమంబు లప్రతిహతంబులై నడవం, బృథివి శాసింప భవదీయ విభవం బుజ్జ్వలంబై యొరులకెడలేక చెల్లుచున్న నెంత యొప్పగునో యటు విచారింపుము. పాండవులు ధీరమతులై వైర మెత్తక యూరక తొలంగియుండిరేనియుఁ, గతిపయ దినంబులలోఁ జీకాకుపడి చెడుంగాక, గాంధారీనందనుచేత వసుంధరా పరిపాలన భారంబు నిర్వహింపబడునే?’ యనిన విని ధృతరాష్ట్రుండు విదురున కి ట్లనియె:

### [5.2.90](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.90)

తే. ‘నీవు సెప్పిన మాటలు నిర్మలములు, | నిపుణ సమ్మతములు, రాజనీతి మార్గ  
బోధకంబులు; నైనను బుత్త్రువిడువ | నోప, ‘ధర్మో జయతి’యని యుండువాఁడ.’

### [5.2.91](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.91)

వ. అనిన విని విదురుం డతని కిట్లనియె: ‘దేవా! జ్ఞాతులు గుణహీనులైనను విడువందగ దనిన, సకల గుణసంపన్నులై భవత్ప్రసాదంబు గోరుచున్న కౌంతేయులన్‌ దిగవిడువం దగునే? యేను నీకు హితంబు గోరెడువాఁడనని నిశ్చయించి నా బుద్ధి వినుము; వారల జీవనంబునకుఁ గొన్ని యలంతిపల్లియలైనను దుర్యోధను నొడంబఱచి యేర్పఱచి, తెఱంగు పఱచిన లెస్స యని చూచెద; నతని విడువ వలయునని చెప్పితినేనిఁ బెనఁకువం బశ్చాత్తాపంబువుట్టు; దాని కప్పుడు ప్రతీకారంబు లేదు. కావున నెల్లభంగుల నియ్యకొని పాండవులతోడ సంధి సేయవలయు; నట్లుం గాక.

### [5.2.92](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.92)

క. తమలోని పాళ్ళకుం గా | సమరము సేసినను గాని చాఁ జనదె? శరీ  
రము లాధివ్యాధి జరా | సమన్వితము లగుటఁ జేటు సహజం బరయన్‌.

### [5.2.93](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.93)

చ. గజ తురగాది సంపదలుఁ, గాంతలతోడి విహారలీలలుం,  
బ్రజ కనురాగ మొందఁ బరిపాలన సేయుక్రమంబుఁ, బోరులన్‌  
విజయము లొంది పేర్చుటయు, విస్ఫురితాభరణానులేపవ  
స్త్ర జనిత వైభవంబుఁ గల రాజులుఁ బోయిర కాక నిల్చిరే?

### [5.2.94](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.94)

క. కావునఁ జెవికిం జేఁ దగు | నీ వాక్యము వినఁగఁ జాలితేని, నిహపర  
శ్రీ విభవములకుఁ గీర్తికిఁ | దావలమై వెలయు టింత తథ్యము సుమ్మీ!

### [5.2.95](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.95)

క. తగ నీలో నూహింపుము; | దిగ విడువకు ధర్మతనయు; దృఢమతివై పొం  
దగు చందము గొడుకులకుం | బ్రెగడలకుం జెప్పి తీర్పు పెం పేర్పడఁగన్‌.

### [5.2.96](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.96)

ఆ. అనిన నాంబికేయుఁ డను: ‘నీదు పలుకులఁ | గలఁక దేఱి బుద్ధి దెలివి నొందె;  
నిట్ల చేయువాఁడ; నిదియ కర్జము, ధర్మ | మును, యశంబు, లాభమును దలంప.’

### [5.2.97](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.97)

చ. అనుడు ముదంబు నమ్మమియు నాత్మఁ బెనంగొన నన్నతోడ ని  
ట్లను విదురుండు: ‘పెద్దవడి కక్కట! నీ మది కార్యవృత్తి నూ  
ల్కొనియె; సుయోధనుం గని యకుంఠిత నిశ్చయమై యతండు వ్రా  
లినదెస వ్రాలకుండిన బలే, మముబోఁటులకుం బ్రియం బగున్‌.

### [5.2.98](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.98)

వ. అని పలికి నిట్టూర్పు నిగిడించి.

### [5.2.99](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.99)

క. ‘దైవంబు నేర్చుఁగా; కిటు | వోవఁగ నే నేర్తు, నేరఁ బొమ్మని పలుకం  
గా వశమె నరున? కెక్కుడు | దైవము పౌరుషముకంటె ధరణీనాథా!’

### [5.2.100](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.100)

వ. అనిన, విదురునకు వైచిత్రవీర్యుం డిట్లనియె:

### [5.2.101](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.101)

తే. ‘ధర్మ పథమును, నీతి తత్త్వంబు తెరువు | నిర్మలము లగు పలుకుల నీవు నాకుఁ  
దెలియఁ జెప్పితి; పరమార్థ దృష్టి యెట్టి | వాక్యములఁ గల్గుఁ? జెప్పుము వాని ననఘ!

### [5.2.102](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.102)

వ. అని యడిగిన, విదురుం డతని కిట్లనియె; ‘నాకుఁ దోఁచిన యన్నియు నా నేర్చినట్లు నీ కెఱింగించితి; నత్యంత గుహ్యంబులగు నర్థంబులు పురాణుం డయ్యునుం గుమారుం డగు సనత్సుజాతుండు దెలుపనోపుంగాని యిట మీఁద నాకుం దెలియ’ దనిన ధృతరాష్ట్రుం ‘డమ్మునీంద్రుండు నా కెంతదవ్వు! నీవ యవియునుం జెప్పు’ మనిన, ‘నేను శూద్రయోని జాతుండ, వేదాంత వేద్యంబు లగు నర్థంబులు నా కగోచరంబు; లమ్మహాత్ము బుద్ధి నే నెఱుంగుదు. దేవతలకుం దెలియనట్టివి యాతనికిం దెలియు; నతండు దెలుపంజాలు’ ననిన, ధృతరాష్ట్రుం డతి కుతూహలుండై.

### [5.2.103](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.103)

ఆ. ‘మనకు నిప్పు డతనిఁ గను తెఱంగెయ్యది | యగుటయును నెఱుంగ’ ననిన, విదురుఁ  
డధిక భక్తిఁ దలఁచె నాత్మలో నాశ్రిత | వత్సలత్వ నిధి సనత్సుజాతు.

### [5.2.104](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.104)

వ. ఇట్లు దలంచుటయును, దివ్యజ్ఞాన మాననీయుండగు నమ్మునివరేణ్యుం డాక్షణంబ పొడసూపిన, విదురుం డతని వచ్చుట యుగ్గడించుచు, వినయంబున నతని నెదుర్కొని, దండ నమస్కారంబు లాచరించి, యున్నతాసనంబిడి, యర్ఘ్యపాద్యంబు లిచ్చి, ససంభ్రమంబుగాఁ బ్రత్యుత్థానంబును బ్రణామంబునుం జేసియున్న ధృతరాష్ట్రు నతనికిం జూపి విదురుం డి ట్లనియె:

### [5.2.105](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.105)

క. ‘దేవా! దేవర కృప నీ | భూవల్లభుఁ డమల తత్త్వ బోధకమై సౌ  
ఖ్యావహ మగు వాక్య చయముఁ | దా వినఁ గోరుటయు, మిమ్ముఁ దలఁచితి భక్తిన్‌.

### [5.2.106](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.106)

వ. మీరును గారుణ్యాతిశయంబున విజయం చేసితిరి. గురు సమాశ్రితులగు వార లెద్దాని వలన సుఖదుఃఖంబులు, లాభాలాభంబులుఁ, బ్రియద్వేషంబులు నాదిగాఁ గల ద్వంద్వంబులం బడక బ్రదుకుదు? రట్టి పరమార్థోపదేశంబున నితనిం గృతార్థునిం గావించి రక్షింపవలయు’నని ప్రార్థించినం, బార్థివుండునుం దదనురూపంబు లగు నాలాపంబుల నారాధించినం బ్రసన్నుండై, సనత్సుజాతుం డధ్యాత్మ విషయంబులగు వివిధ వాక్యంబుల సోపాన ప్రకారంబున నంతకంతకు సూక్ష్మంబులగు నర్థంబులు సమర్థించుచు, నందుఁ బ్రజ్ఞాచక్షుండెయ్యది యేర్పడ నడిగె నది యెల్ల వివరించుచు, హృదయ పుష్కర కలితంబగు పరతత్త్వంబు ప్రసాదించునట్టి గూఢోక్తు లనుగ్రహించుచుండ, నెట్టకేలకుఁ బ్రభాతం బగుటయు, ధృతరాష్ట్ర విదురుల నామంత్రణంబు సేసి యద్దేవముని యంతర్ధానంబు నొందె; నట్టి సమయంబున.

### [5.2.107](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.107)

తే. తన కులంబునఁ బుట్టిన ధార్తరాష్ట్రు | లన్నదమ్ములతో విగ్రహంబు గొనుట  
కుమ్మలించి వివర్ణత నొందినట్లు | గంది, యెంతయుఁ జెలు వేదెఁ జందురుండు.

### [5.2.108](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.108)

క. కుముదములుఁ దారు నొక్కటఁ | బ్రమదంబున నుండి, వాని పదవి దొలఁగినం  
దమకున్‌ నిలువఁగఁ దగదను | క్రమమునఁ జనునట్లు తారకంబులు విరిసెన్‌.

### [5.2.109](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.109)

ఉ. ఎత్తిన వేడ్కఁ గంధరము లెత్తి, మొగంబులు సాఁచి, చూడ్కులం  
జిత్తములన్‌ నిగిడ్చి, తమ చెందెడు నిక్కలు రోసి, యింపు ద  
ళ్కొత్తఁగ నొక్కచో నొకటి నొక్కటి గాంచి, యెలర్చు కాయ్వులం  
జిత్తజుకేళిఁ దేలె విలసిల్లుచు జక్కవదోయి వేకువన్‌.

### [5.2.110](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.110)

మ. మును సౌరభ్యము నివ్వటిల్లఁగ, మనోమోదంబునం దేఁటు ల  
ల్లన యోలిన్‌ వెడలంగ, రేకులు సముల్లాసంబునన్‌ బింక మె  
క్క నయంబెక్కుచు, గద్దె పొం దెడలి వీఁకం గేసరంబుల్‌ గడ  
ల్కొనఁ, దోడ్తో మధు వుచ్చి, పేరెలమిఁ బొల్పుం జెందె నంభోజముల్‌.

### [5.2.111](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.111)

చ. వెడవెడ నిద్రవొంది కనువిచ్చిన పాంథులమీఁద దాడి వోఁ,  
దడఁబడ నొండొరుం బిలుచు దర్పకు పంపు బలంబులోని య  
ల్కుడు కరణిం జెలంగె శుక కోకిల భృంగతతుల్‌ వనంబులం  
దెడనెడఁ బల్కఁ, గూయ, సొగియింపఁగ మ్రోయఁగఁ దద్విరావముల్‌.

### [5.2.112](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.112)

సీ. పద్మపరాగంబుఁ బరఁగించు నరుణోద | యంబు కాంతికిఁ జెలువంబు మిగులఁ,  
బరువంబు దప్పిన విరుల రాలుచుఁ దరు | చయము చుక్కలు లేని చదలఁ జెనయ,  
నరవిరి నెత్తాని నడరించు నున్నిద్ర | విట వీటి సౌరభవితతి వొదల,  
నెలఁత చీరిన యెఱకల నెఱిఁ దీర్చు జ | క్క వలు చందోయి కేఁకట యొనర్ప.  
ఆ. వెలరువాఱు దీవియల నల్లనల్లార్చు | సోర్ణగండ్లయందుఁ జొచ్చి సుడిసి,  
తిరిగి వేగుఁబోక తెమ్మెర లెలదీఁగ | కొనల వంక లొత్తు, ననలఁ బ్రోచు.

### [5.2.113](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.113)

ఆ. అంత నుదయశైల మను నశోకద్రుమ | సమితియందుఁ గాంతి చారుభంగి  
నెఱయ విరిసి తొలుత నెగసిన యుజ్జ్వల | స్తబక మనఁగఁ బద్మసఖుఁడు వొడిచె.

### [5.2.114](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.114)

సీ. ఉర్వీధరంబుల నొప్పెడు జేవుఱుఁ | జఱుల కాంతికి నును మెఱుఁగు వెట్టి,  
ధరణీజ గుల్మ లతా వితానము పల్ల | వములకుఁ గట్టెఱ్ఱ వన్నె యొసఁగి,  
యరుణాంబుజంబుల యంతర్దళంబుల | తళతళలకు జిగి దళము కొల్పి,  
చక్రవాకద్వయ సంతతి యెఱకల | కొమరారు కెంజాయఁ గ్రొత్తసేసి,  
ఆ. తనదు బాలబింబ మనుపమేయప్రభా | పటల జటిల గగనభాగ మగుచు  
నుల్లసిల్లి, జగము లెల్లను విలసిల్లఁ | బూర్వశిఖరిమీఁదఁ బొడిచె నినుఁడు.

### [5.2.115](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.115)

వ. ఇట్లు సూర్యోదయం బగుటయు, ధృతరాష్ట్రుండు తత్కాలోచితాచారంబులు నిర్వర్తించి, తగు తెఱంగున నలంకృతుం డయి, యాస్థానమండపంబున కరిగి పేరోలగం బిచ్చినఁ, గుంభ సంభవ కృప కృతవర్మాశ్వత్థామ కర్ణాదు లగు దొరలును, భీష్మ విదుర బాహ్లిక సోమదత్త భూరిశ్రవః ప్రభృతులగు బంధుజనులును, దుర్యోధన దుశ్శాసన ప్రముఖులగు కుమారులును లోనుగాఁ గల సమస్త పరిజనంబులును వచ్చి బలసియుండి; రయ్యవసరంబున సంజయుండు వచ్చి వాకిట నిలిచి పణిహారుల వలనఁ దన్నెఱింగించి పుచ్చి చొచ్చి, సముచిత ప్రదేశంబునం గూర్చుండి, తన మాటలు వినుటకుఁ జిడిముడిపడుచున్న కొలువుఁ గలయం గనుంగొని యిట్లనియె.

### [5.2.116](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.116)

తే. ‘పాండురాజ తనూజులపాలి కర్థి | నిమ్మహారాజు పనుపంగ నేఁగి ధర్మ  
పుత్త్రుఁ గాంచితి; నాతండు మైత్రి మెఱయఁ | గౌరవుల సేమ మెల్లఁ బేర్వేర నడిగె.

### [5.2.117](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.117)

వ. మఱియుఁ దగువారల నెల్ల నయ్యై యుచితవిధిం బ్రణామంబున, వినయంబున, బాంధవంబున, మిత్రభావంబున, వాత్సల్యంబునఁ, బ్రసాదంబున నాదరించె; నేనును భూనాథుండు గఱపిన తెఱంగునఁ గొఱంత లేకుండ బంధుత్వంబునకు వలయు మాటలాడితిఁ; బదంపడి కార్యంబు ప్రసంగించి నా యాడిన మాటలకు నయ్యుధిష్ఠిరుండు పలికిన వచనంబు లింత యొప్పునే?’ యని యగ్గించిన, ధృతరాష్ట్రుం డవహి తుండై యడుగఁ, దా నయ్యుధిష్ఠిరునకుం జెప్పిన భంగులు, నతండు వానికి నెల్ల నుత్తరం బిచ్చిన తెఱంగును నెఱింగించి, ధృతరాష్ట్రునకుం, బితామహునకు, దుర్యోధనునకుం గ్రమంబున వారివారితో నాడుమని నియమించిన చందంబులు ధర్మనందను పలుకుల పరిపాటిం దేటపడం జెప్పి సూతసూనుండు వెండియు నిట్లనియె.

### [5.2.118](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.118)

తే. ‘ఏ నుపప్లావ్య పురమున కేఁగి తొలుత | వాసుదేవార్జునులఁ గంటి; వారు నీతి  
పథము దప్పని మాటలు బలిమిఁ దోఁచు | నట్లుగా నాడి; రవి వినుం డాదరించి.’

### [5.2.119](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.119)

వ. అనిన విని ధృతరాష్ట్రుం ‘డవ్వాసుదేవు చిత్తం బె? ట్లతం డేమనియె?’ నని యడిగిన, నతనికి సంజయుం డిట్లనియె:

### [5.2.120](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.120)

ఉ. ‘తానును సత్యభామయును ద్రౌపదియున్‌ నరుఁడున్‌ రహస్యగో  
ష్ఠీ నిరతాత్ముఁడై సుతులుఁ జేరని చెందని యట్టిచోటఁ గాం  
తానివహంబు గొల్వఁ బ్రమదస్థితి నుండియుఁ, బిల్వఁబంచె న  
న్నా నలినోదరుండు; హృదయంబున నీ దెస కూర్మియెట్టిదో?

### [5.2.121](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.121)

వ. ఏనును దత్ప్రకారంబు పణిహారుల వలన మున్న యెఱింగిన వాఁడ నగుటం జేసి కంచుకంబును, శిరోవేష్టనంబును ధరియించి వినీత వేషుండనై పోవునప్పుడు కృష్ణార్జును లనేక మణిమయ భూషణ ప్రభా భాసితులై యొక్కసెజ్జన యున్నవారు; కృష్ణుండు పవ్వళించి యుండి, చాఁచిన చరణంబులు దొడలపై నిడికొని యర్జునుండు గూర్చున్నవాఁడు; సత్యభామయుం బాంచాలియుం గద్దియలపై నున్నవారు; సవినయంబుగా నేనును దండప్రణామంబు సేసిన నన్నాదరించి, కృష్ణుని చేసన్న నర్జును పనుపునం గనక రత్నమయంబగు నతని పాదపీఠం బతండు వ్రేల్చిన కాళ్ళు దిగిచికొన; నిద్దఱు ముద్దియ లెత్తి తెచ్చి నాకుం బెట్టిన, నేనును దానిం గరతలంబున నంటుచు ధరణీతలంబునఁ గూర్చుండి, కేలు మొగిడ్చి ఫాలతలంబునం గదియించి, నీలవర్ణులు బాహుబల మద భరితులును నయి యేనుఁగు దోయియుంబోలె నున్న యమ్మాధవధనంజయులఁ జూచునప్పుడు నాకు హర్షాశ్రు పులకలును, దదనంతరంబ భయంబునుం బుట్టె; నట్టియెడ.

### [5.2.122](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.122)

క. ‘ఈ యిరువురుఁ బంచిన పని | సేయుదురటె! ధర్మజునకుఁ జేకుఱని తలం  
పేయది? యతనిం దొడరుట | వేయేటికి జముని శిరము వ్రేయుట గాదే?’

### [5.2.123](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.123)

వ. అని తలంచుచుండ, నమ్మహానుభావులు నన్ను సంభావించి, తా రుపయోగించునట్టి యన్నపానంబులను, దమకుఁగట్టఁదగినట్టి వస్త్రంబులను, దాము దొడుగునట్టి భూషణంబులను నాకుఁ బ్రియంబొనర్చి గారవించిరి, నేనును నా పోయిన కార్యంబు విన్నవించిన; విజయుండు బలుమొగంబుతో దానికి నుత్తరంబు వలుకం దొడంగిన వారించి వారిజోదరుం డిట్లనియె:

### [5.2.124](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.124)

తే. ‘వినుము సంజయ! ధృతరాష్ట్ర విభుని పెద్ద | కొలువునందుఁ దత్పుత్త్రులు, గురుఁడుఁ, గృపుఁడు,  
నాపగానందనుఁడు మొదలైన సకల | జనులు వినుచుండఁగా నిట్టు లనుము నీవు.

### [5.2.125](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.125)

ఆ. అయ్యజాతశత్రుఁ డలుగుట నీళ్ళుల | నగ్ని పుట్టినట్టి దయ్యె; మీకు  
నార్ప వెరవు లేదు; నేర్పుమై నింకఁ గా | వింపవలయు పనులు వినుఁడు మీరు.

### [5.2.126](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.126)

వ. అవి యెవ్వి యంటేని.

### [5.2.127](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.127)

సీ. కలయట్టి వివిధార్థములు నశేషంబుగఁ | దగ నొసంగుండు సత్పాత్రములకుఁ,  
జెలులఁ జుట్టముల నాశ్రితులను రావించి | సత్కరింపుఁడు సంతసం బెలర్ప,  
నిచ్ఛానుగుణముల నింద్రియసుఖముల | ననుభవింపుఁడు హృదయంబు లలర,  
నాండ్రను బిడ్డల నయ్యై విధంబుల | గారవింపుఁడు ప్రియపూరితముగ  
తే. మఱియు నెవ్వరి చిత్త మెత్తెఱఁగునందు | వాటమైయుండు నది యెల్ల వలయునట్లు  
సేసి విహరింపుఁ; డిం కెడ సేయ కనికి | నడవుఁ డఱచేతఁ బ్రాణంబు లిడి కడంగి.

### [5.2.128](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.128)

వ. అని చెప్పు; మింత యేమిటి కంటేని.

### [5.2.129](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.129)

ఉ. ఎందును నెవ్వరుం బడని యెంతయుఁ గష్టముపాటు వచ్చినం  
గొందల మంది పాండువిభుకోడలు దవ్వుల నున్న నన్ను ‘గో  
విందుఁడ ! కావు’ మంచుఁ బలవించుట యీఁగఁగరాని యప్పుఁ బో  
లెం దలపోయ వ్రేఁగయి చలింపకయున్నది యెప్పుడున్‌ మదిన్‌.

### [5.2.130](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.130)

తే. ఇట్టి యేఁ దేరు గడపంగ, నెందు నుతికి | నెక్కు గాండీవ మేడ్తెఱ నెక్కు వెట్టి  
రెండు దొనలను బూని కిరీటి యనికి | వచ్చు నేఁ డెల్లి; యెందుఁ బోవచ్చు మీకు?’

### [5.2.131](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.131)

వ. అని పలుకునప్పటి వారి యెత్తికోలును, నీ కొడుకు నిలుపోపమియునుం దలంచి భయం బందితి; నితండు వారల నెఱుంగండు; భీష్మద్రోణుల ప్రాపును, గర్ణు గర్వంబును దన్ను గెలిపించునని నచ్చి తొడరెడు’ ననిన విని ధృతరాష్ట్రుం ‘డర్జునుం డేమనియె?’ నని యడిగిన నతనికి సంజయుం డిట్లనియె:

### [5.2.132](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.132)

క. ‘నరుఁ డలుక వొడమియును సు | స్థిరుఁడై, తన యెఱ్ఱ సెరల చెలువునఁ గెందా  
మరలం దెగడెడు కన్నుల | నరుణచ్ఛవి నెఱయ నిట్టు లనియె నరేంద్రా!

### [5.2.133](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.133)

ఆ. ‘ఆ సుయోధనుండు, నతనికిఁ దోడ్పడ | నరుగుదెంచినట్టి ధరణినాథ  
చయము వినుచునుండ సంజయ ! నా వచ | నములు గాఁగ ని ట్లనంగవలయు.

### [5.2.134](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.134)

ఉ. పాండుని యగ్రనందనుఁడు పా లడుగం దగ నీఁడయేని, మా  
కొం డన నేల? మే లది; సుయోధనుఁ డింతకుమున్ను పెక్కు లు  
ద్దండతఁ దాను జేసిన విధంబుల కెల్ల మెఱుంగు వెట్టిన  
ట్లుండెడుఁ గాక, యేనును వృకోదరుఁడుం బ్రియమందునట్లుగన్‌.

### [5.2.135](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.135)

క. మా యిరువురతోఁ గయ్యము | సేయ నతం డియ్యకొనిన, సిద్ధించెన కా  
దే యుచితచరితుఁ డగు కౌం | తేయాగ్రజు కార్య; మట్టి తెఱఁగొప్పుఁ గదా!

### [5.2.136](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.136)

క. వనవాసంబున భూశ | య్యను ధర్మజుఁ డున్నయట్టి యాయాసము వో  
వునె, యంపశయ్య దుర్యో | ధనుఁడు రణక్షోణిఁ బడక తక్కిన యేనిన్‌?

### [5.2.137](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.137)

ఉ. సూనృత మూఁది బన్నములు సూడక లోన నడంచినట్టి కో  
పానల మెండియున్న నిబిడాటవిపైఁ బచరించు తీవ్ర దా  
వానలుఁ బోలి శాత్రవచయంబుపయిం గవియించి నిల్చినం  
గాని యుధిష్ఠిరున్‌ సరకుగాఁ గొన రా ధృతరాష్ట్రనందనుల్‌.

### [5.2.138](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.138)

మ. గద సారించుచు నంత్యకాల విచలత్కాలాకృతిన్‌ భీముఁ డు  
న్మద మాతంగచయంబు నుగ్గుగ, లసన్నానా రథవ్రాతముల్‌  
చదియన్‌, భూరి హయవ్రజంబు పొడిగా సంరంభతుంగాంగుఁడై  
కదియం జూచి బలే! సుయోధనుఁడు భాగం బిచ్చు రాజ్యంబునన్‌.

### [5.2.139](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.139)

సీ. కోల్పులి వీఁకమై గొదగొని లేళ్లకు | నుఱుకు తెఱంగునఁ దఱియఁ జొచ్చి,  
పెనుగాలి జీమూత బృందంబుపైఁ బెట్టి | దంబుగ వీఁచుచందమున నడరి,  
కసి మసంగిన మారి గడఁగి జీవులమీఁద | నుగ్రతఁ గవియున ట్లురవడించి,  
యాఁకొన్న లయరుద్రుఁ డాగ్రహంబున జగ | త్ప్రచయంబు ముట్టెడు భంగిఁ బొదివి.  
తే. నకులుఁడును, దదనుజుఁడు, సాత్యకియు, నా సు | భద్ర కొడుకును నెదిరిన బలము నెల్ల  
బెదరఁ, జెదర, బడల్పడఁ, బెల్లు సావఁ | జేయఁగని కౌరవులు సంధి సేయువారు.

### [5.2.140](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.140)

ఉ. చిత్తము లుల్లసిల్ల, నల సింహకిశోరము లొక్కమై మదో  
న్మత్త గజావళిం బొదువుమాడ్కి నరాతి బలంబు ముట్టి, యు  
ద్వృత్తిఁ గడంగి యప్రతిమవీరులు ద్రౌపదిపుత్త్రులేవురున్‌  
నెత్తురు నీరఁ దేల్చిన ననిం గని మీ నృపుఁ డల్క దీఱెడిన్‌.

### [5.2.141](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.141)

మ. చెలులుం జుట్టలు నిష్టభృత్యులు మహాజిం బ్రాణముల్‌ డాఁప కు  
జ్జ్వలులై తో నడవన్‌, విరాటుఁడును బాంచాలుండు నేపారి సే  
నల యుద్రేకము రౌద్రముం బెనుప, నానా హేతి ఘోరంబుగాఁ  
దలపడ్డం గని గాక; స్రుక్కుదురె గాంధారీసుతుల్‌ మాటలన్‌?

### [5.2.142](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.142)

చ. తఱిమి శిఖండి తన్నొరులు దాఁకఁగ నెవ్వరి దిక్కుఁజూడ కే  
డ్తెఱఁ దనపూన్కిపై మనము ధీరత నిల్పి, రథంబు బల్విడిం  
బఱపి, కురుక్షితీశుఁడను బ్రహ్మకు వేయును నిండ భీష్ముపై  
కుఱికినఁ గాక, మాకు సగ మూరక యిత్తురె మీరు మేదినిన్‌?

### [5.2.143](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.143)

శా. విద్యుద్దండము నిల్చిపొల్చినగతిన్‌ విల్లందమైయుండ న  
స్మ ద్యోధావలి మానసంబున రణోత్సాహంబు రెట్టింప ధృ  
ష్టద్యుమ్నుండు గడంగి ద్రోణుఁ గడిమిన్‌ డాయంగ, వీక్షించి కా  
కుద్యోగించుట కేల తక్కుదురు మీ రుగ్రాహవక్రీడకున్‌?

### [5.2.144](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.144)

సీ. గాండీవ గుణ రవం బొండొండ చెలఁగంగ, | శరపరంపర లాకసంబు గప్పఁ,  
బ్రతి విశిఖములు ఖండితములై రాలంగ, | నెదిరి సైన్యంబుల మదగజాది  
చతురంగములును జర్జరితంబులై యవ | యవ భేద మెఱుఁగని యట్లు గాఁగఁ  
దునిసిన, నెత్తురు నెనడును నెమ్ములు | నెఱచియుఁ గండలు నెనసి సమర  
తే. తలము ఘోరంబుగాఁ, గపిధ్వజము, ధవళ | హరులు శోభిల్ల, నొగలపై హరి యెలర్ప,  
దేవదత్తంబు మ్రోయఁ దోఁతెంచునట్టి | రథముఁ గని కాని కానఁడు రాజరాజు.

### [5.2.145](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.145)

శా. బాలక్రీడ మహాసురప్రకరమున్‌ భంజింపఁడే? యెప్పుడుం  
ద్రైలోక్యంబును భక్తియుక్తిఁ దగ నారాధింపదే? యట్టి శౌ  
ర్యాలంకారు మహాత్ముఁ దా సరకుసేయం డచ్యుతున్‌! మ మ్మతం  
డేలా కైకొను? నా సుయోధనునియం దెగ్గేది యూహింపఁగన్‌?

### [5.2.146](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.146)

వ. ఏము పితామహ గురు కృపాచార్యులకు నమస్కరించి, యస్మదీయ రాజ్యభాగంబునకై తొడరి కయ్యంబు సేయువారము; కౌరవులకుంబూని యెవ్వరేమాతోఁబెనంగినను వారి శస్త్రాస్త్రంబులు ధర్మప్రతిహతంబులగునని తలంచెదము; పండ్రెండు వత్సరంబులు వనంబున నమ్మెయి నిడుమలం బడి, జనపదంబునం బదుమూఁడగునేఁ డజ్ఞాతవాసాయాసం బట్లనుభవించి వచ్చి, మా తండ్రి పాలికినై పెనం గు మమ్ము నింద్రాది సుర సహాయులయ్యును ధార్తరాష్ట్రులు గెల్చువారైరేని ధర్మంబుకంటె నధర్మము బలవంతం బైనయదియగు; నింతియకాని మా చేయునట్టిది గీ డైనదిగా; దేము వాసుదేవుని మున్నిడుకొని నడతుము గావున, నీ యుద్ధంబునం జయంబు మాకు సిద్ధంబ; యెల్ల భంగులం గర్ణ సహితంబుగా గాంధారీనందనులం దునిమి యేము భూమి గొనుట దప్పదు; ‘గాండీవంబు దివియకయును గుడుసువడియెడు; బాణంబులు దమయంతన తూణీరంబుల వెడలెడుఁ; దోలూడ్చు మహానాగంబునుంబోలెఁ గరవాలంబు దాన యొఱవెలికి నిగుడుచున్నయది గావున, మా కవశ్యంబును సంగరంబు సంభవించుఁ; బాశుపతాది దివ్యశరంబులం గురుపక్ష ప్రజాక్షయంబు సేసి శాంతిం బొందెదము; సూతనందనా! నీవు సుస్థిరుండవై యింతయుం దెలియం బలుకవలయు; నిమ్మాటలు విని కురువృద్ధుండగు బాహ్లికుండును, బితామహుండగు భీష్ముండును, గురుం డగు కుంభసంభవుండును, శిక్షకుండగు కృపాచార్యుండును, గురుపుత్రుండగు నశ్వత్థామయు, సద్బుద్ధి యగు విదురుండును, ధర్మాచరణకల్యుండగు శల్యుండును నెయ్యది నిశ్చయించి పలికి రది యయ్యెడు; సుయోధనాదు లాయుష్మంతు లగువారకాక! యని పలికె.’ నని చెప్పిన విని మందాకినీనందనుం డందఱు విన దుర్యోధనున కి ట్లనియె:

### [5.2.147](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.147)

సీ. నలినగర్భుఁడు పెద్ద కొలువున నున్నెడ | సురపతి ప్రముఖుల చూడ్కులెల్ల  
మెఱయు తేజంబున మిఱుమిట్లు గొన నిద్ద | ఱచ్చట నొరసికొంచరుగఁ జూచి,  
‘వీ రెవ్వ, రిమ్మెయి మీ రుండ సరుకుసే | యని యట్లు వోయెడు నట్టివార?’  
లని బృహస్పతి బ్రహ్మ నడిగిన నతని కి | ట్లనియె నా చతురాస్యుఁ డాదరమునఁ  
తే. దపము పెంపును బలశౌర్యదర్పములును | గలిగి లోకహితార్థంబుగాఁ జరింతు  
రే యుగంబున నరుఁడు నారాయణుండు | ననఁ బ్రసిద్ధికి నెక్కిన మునులు సుమ్ము!’

### [5.2.148](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.148)

వ. అని పలికి వెండియు

### [5.2.149](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.149)

క. ‘అనిమిషహితము దనుజ నా | శనమును జేయుదు; రధర్మ సంగ్రామము గ  
ల్గిన చోట ధర్మపరు లగు | జనముల గెలిపింతు రధిక సంరంభమునన్‌.

### [5.2.150](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.150)

వ. దేవాసుర యుద్ధంబు నప్పు డింద్రుండు వోయి వీరి నారాధించి తో డడిగినం, జనుదెంచి పౌలోమ కాలకేయాదులగు ననేక దైత్య దానవులం జంపి యింద్రునకు విజయంబు గావించి; రది మొదలుగా వీరల నె‌ల్లవారలు నెఱింగియుండుదు; రిది యొక్క తేజంబ రెండు దెఱంగులై వెలుంగుచుండు’ నని చెప్పి, వినోదార్థంబు జన్మాంతరంబు నొందిన యమ్మహాత్ములు గదా యీ యర్జునుండును వాసుదేవుండును! నర్జునుండు సముద్రతీరంబున హిరణ్యపురంబు వొడిచి నివాతకవచుల నఱువది వేవుర నిర్జించి పర్జన్యునకుఁ బ్రియంబుసేసె; వాసుదేవు పరాక్రమంబు గంస నరకాసుర ప్రముఖ నిఖిల దుష్ట నిగ్రహంబునం బ్రసిద్ధంబు గాదె? తెలియ విను మున్నరూపు సెప్పెద.

### [5.2.151](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.151)

క. ఆ యిరువురు నొకతలయై | యాయోధనమునకు నడచునట్టిద యేనిన్‌  
వే యేల మనక కా దెదు | రై యేడ్తెఱఁ దాఁక హరునకైనను వశమే?

### [5.2.152](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.152)

క. సారథియు రథియు నై యొక | తేరం గృష్ణు లతిఘోరతేజస్సార  
స్ఫారతఁ దోఁచిన నైనను | ధీరత వాటించి చూచి తెలిసెదవు బలే!’

### [5.2.153](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.153)

వ. అనుచు నా సుయోధను నుపలక్షించి శాంతనవుండు మఱియు నిట్లనియె:

### [5.2.154](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.154)

క. ‘మది నా మాట కొకింతయు | బెదర వకార్యంబునందుఁ బ్రియము గలిగి యుం  
డుదు; కౌరవులకుఁ గాలము | తుదియో కా కిట్టి గర్వితుని నే మందున్‌?

### [5.2.155](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.155)

తే. హితములగు నాదు వచనంబు లిపుడు వినని | వాఁడవైతేని నప్పుడు ‘వారు వడిరి,  
వీరు వడి’ రను పలుకులు విందుగాక | శకుని కర్ణ దుశ్శాసనుల్‌ సమ్మతింప.

### [5.2.156](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.156)

వ. దుష్ట కష్ట నికృష్టాత్ము లగు నిమ్మువ్వురుఁ జెప్పెడు బుద్ధులుగాని యొండు విననొల్ల; వేమి సేయవచ్చు?’ నని పలికినం గానీనుండు గనలి గాంగేయున కిట్లనియె;

### [5.2.157](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.157)

ఆ. ‘ఇట్టు లాడఁ దగునె? యే నేమి సేసెతిఁ? | గొలిచి కుడుచు పాడి నలవుఁ జలముఁ  
బలుకు టెందు నెగ్గె? పతికిఁ బుత్త్రులకును | మనుమలకు హితంబ యొనర నడతు.

### [5.2.158](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.158)

క. కాని తెఱఁగైన నింతటి | మానిసిఁ గా నేల చేయు మనుజేంద్రుఁడు న  
న్నీ నెఱి దప్పిన మాటలు | నీ నోరన్‌ వెడలఁ దగునె నిండిన సభలోన్‌?’

### [5.2.159](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.159)

వ. అనిన విని భీష్ముఁడు ధృతరాష్ట్రున కిట్లనియె:

### [5.2.160](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.160)

తే. ‘ఒకట నైనను వారియం దొకరిలోని | చిదుర పాలును బోలండు; సిగ్గులేక  
‘పాండవుల గెల్తు నే’ నని పలుకుచుండు; | వీని రజ్జులు దులువలు విండ్రు తగిలి!

### [5.2.161](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.161)

క. మగఁటిమి వారికి వీఁ డెదు | రుగ నమ్మి, సుయోధనుఁడు విరోధము గొని, స  
ర్వ గుణాఢ్యులు బలవంతులు | నగు పాండునృపాలసుతుల నవమానించెన్‌.

### [5.2.162](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.162)

ఉ. ఒక్కఁ డొకం డనేక విధ యుద్ధ జయంబులు గొన్నవారు వా;  
రెక్కడ నేమి సేసె నితఁ? డీతని తమ్మునిఁ గూలనేసి యు  
క్కెక్కిన పార్థుపైఁ గవిసెనే? పసు లాతఁడు గ్రమ్మఱింపఁగా  
నక్కడ లేఁడె వీఁడు? భవదాత్మజుఁ గోల్పడె ఘోషయాత్రలోన్‌.

### [5.2.163](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.163)

వ. ఈ దురాత్ముండు కర్జం బెఱుంగక నీతిబాహ్యుండై వలసినట్లు ప్రేలరిమాట లాడుచుండు; నీవునుం గైకొని వినుచుండుదువు; మేల కాక!’ యనిన భీష్ము పలుకులు విని ద్రోణుం డమ్మహారాజుతో నిట్లనియె;

### [5.2.164](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.164)

ఉ. ‘శాంతనవుండు సర్వకురుసంతతికిం గలవాఁడు గాఁడె? య  
త్యంత హితంబు లీ పలుకు; లాహవ మొప్పదు; ధర్మసూతితోఁ  
బొంతము మేలు; దేవపతిపుత్త్రుఁడు సంజయుతోడ నాడిన  
ట్లంతకు నోపు; మీకుఁ దెలియం దగు ఖాండవదాహ మాదిగాన్‌.

### [5.2.165](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.165)

ఆ. శర శరాసనములు ధరియింప రెట్టు లె | వ్వరును? మగతనంబు వలనుఁ గలిగి  
కయ్యమున జయంబు గైకొనరే యొరు? | లర్జునుండ విజయుఁ డనఁగ నెగడె!

### [5.2.166](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.166)

క. మన వీటనకా, దయ్య | ర్జునునకు సరివింటివానిఁ జూడఁగ లోకం  
బున నెందు లేమి దెల్లం | బనుమానములేదు; తొడరనగునే వానిన్‌?’

### [5.2.167](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.167)

వ. అని చెప్పి, యప్పాటం బరమహితోపదేశంబు సేసిన భీష్మ ద్రోణుల పలుకు లాదరింపక, వారికి సదుత్తరంబు లీక, వారలతోడం దదనురూపంబుగా సంభాషింపక, ధృతరాష్ట్రుండు వెండియుఁ బాండవులవలని వార్త లడుగుటకు సంజయుదిక్కు మొగంబైనం జూచి, కురుపక్షవీరు లందఱుఁ బ్రాణంబుల దెస నిరాశులై యుండి; రమ్మహీపతి సంజయునితో నిట్లనియె;

### [5.2.168](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.168)

తే. ‘ధర్మ పుత్త్రున కిక్కడి తలఁపు భంగి | యెట్టు లుండు? నీ సైన్యంబులెల్లఁ గూడి  
యునికి వినియెనే? యెవ్వరిఁ గొని యతండు | కౌరవులమీఁది కెత్తి రాఁగలుగువాఁడు?’

### [5.2.169](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.169)

వ. అనిన విని సంజయుండు వెచ్చనూర్చి, ఱిచ్చవడి, మూర్ఛవోయిన చందంబున డెందంబు మొగుడం జేష్టలు దక్కియుండి, కొండొక సేపునకుఁ జిత్తం బొక్కింత సేసికొని, ‘యక్కటా! యీ భూపాలుం డింత బేల యగునే? యుధిష్ఠిరుం డెవ్వరిఁ గొని యెత్తి వచ్చు వాఁడని యడుగుచున్నవాఁ! డింత యెఱుంగని వాఁ డెంతసెప్పినను తెలియనేర్చునే? యితని భంగి యిట్టిదనినఁ, గొడుకుల తెఱంగు వేఱ యెన్న నేల? యే నింక నేమనువాఁడ? నైనను నన్నడిగిన మాటకుం దగిన మాఱుమాట పలుకవలయునకాదె’ యని తలంచి ధృతరాష్ట్రున కిట్లనియె;’

### [5.2.170](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.170)

చ. ‘వినుము నరేంద్ర! పాండుపృథివీవతి యగ్రసుతుండు సంధిసే  
యన మదిఁ గోరు; మీరు దమ యయ్యసగంబును భూమియీక త  
క్కిన మఱికాని ముంద రొకకీడుఁ దలంపఁడు; మీ బలంబు నె  
ల్లను మదిఁ జీరికిం గొనఁడు లావున నేలఁ గొనం దలంచినన్‌.’

### [5.2.171](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.171)

వ. అతం డెవ్వరిం గొని యెత్తివచ్చువాఁ డని యడిగితివి; నీ యెఱుంగని వార లం దెవ్వరు గల? రవధరింపుము.

### [5.2.172](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.172)

మ. బకవిధ్వంసి జటాసురాంతకు హిడింబప్రాణపారీణుఁ గీ  
చక నిర్మూలన కేళి లోలు సమరోత్సాహైక శీల ప్రవ  
ర్తకు నాగాయుత సామ్యకీర్తిత బలోదగ్రుం బ్రతివ్యూహ దా  
హకు భీముం గొని వచ్చు ధర్మజుఁడు బాహాటోపముం జూపఁగన్‌.

### [5.2.173](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.173)

వ. మఱియును.

### [5.2.174](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.174)

మ. అట మిన్నందిన యట్టివాని పొడ వెం తన్నట్లు ఫాలాక్షు నె  
క్కటి కయ్యంబునఁ గన్న ఫల్గును భుజాగర్వంబు లెక్కించు; టం  
తటి వానింగొని ధర్మసూతి సమరోత్సాహంబుమై నెత్తి వ  
చ్చుటకుం గొంకునె? వీఁపు సక్కనయి నిల్చుంగాక మీ సైన్యముల్‌.

### [5.2.175](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.175)

తే. నకులు సహదేవుఁ గొని ధర్మనందనుండు | మొనసి కౌరవ బలముల ముట్టికొనఁగఁ  
దలఁచి తఱి వేచి వచ్చుట ధరణినాథ! | సింగములఁ బట్టి వేఁటాడు భంగి గాదె?

### [5.2.176](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.176)

తే. ద్రౌపదేయులు, నా సుభద్రా సుతుండు | నుక్కు తునియలు గారె? మి మ్మక్కుమార  
వరులఁగొని యోర్చువాఁడయి వచ్చు ధర్మ | పుత్త్రుఁ; డిది నీకుఁ జూడంగఁ బోల దెట్లు?’

### [5.2.177](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.177)

వ. అని చెప్పి వెండియు నిట్లనియె :

### [5.2.178](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.178)

క. ‘వృష్ణి కుమారోత్తముఁ డా | కృష్ణుని తమ్ముండు సాత్యకియు, దవదహనా  
త్యుష్ణ ప్రతాపదీప్తులు | కృష్ణా సోదరులుఁ దలఁపఁ గేవలులె నృపా!

### [5.2.179](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.179)

సీ. శౌర్యోజ్జ్వలుండు పాంచాల భూనాథుండు, | మహితవిక్రముఁ డగు మత్స్యవిభుఁడు  
నధిక ధైర్యాన్వితు లతని తమ్ము, లుదగ్ర | తేజస్కులైన తదీయసుతులు,  
నన్నదమ్ములు ప్రతాపోన్నతు లేవురు | కేకయపతులు, నక్షీణ బాహు  
శక్తియుక్తులు జరాసంధ సూనుఁడు సహ | దేవుండు, నా జయత్సేన విభుఁడు  
తే. వినుము శిశుపాల తనయులు వీరధనులు | ధృష్టకేతుండు వృషభుండుఁ, దీవ్రరణ వి  
నోది యదుభర్త చేకితానుండు, దర్ప | ఘనుఁడు శైబ్య నృపాలుండుఁ గలరుగాదె!

### [5.2.180](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.180)

క. వీరెల్లఁ బాండురాజ కు | మారుల పాటునకుఁ గుందు మనములతోడన్‌  
వారి పగ దీర్పఁ గడఁగెడు | వారల కా, కందు లాఁతివారుం గలరే?

### [5.2.181](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.181)

వ. భీమసేనసూనుండు ఘటోత్కచుండు తండ్రికంటెను లావును బీరంబునుం గలవాఁడు, మాయాబలంబున మనబలంబు నెల్లం గలంచు; మఱియును దూర్పున నుత్తరంబునం గలుగు నరనాయకులు నానా సేనా సమన్వితులయి వచ్చి చిచ్చయిననుం బిడికిలింత మనుచున్నవా; రదియునుంగాక.

### [5.2.182](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.182)

క. సకల భువనములు నఱ చే | తికిఁ దేరంజాలు నట్టి ధీమంతుఁడు దే  
వకి కొడుకు గలఁడు ధర్మజు | నికి; నాతం డెత్తి రాక నిలుచునె యధిపా?’

### [5.2.183](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.183)

వ. అని చెప్పిన సూతపుత్త్రునకు నంబికాపుత్త్రుం డిట్లనియె:

### [5.2.184](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.184)

క. ‘వారి దెస నీదు సెప్పిన | యా రథికులు ప్రబలు లగుదు రందఱు; నైనన్‌  
వా రెల్లను నొకతల, య | మ్మారుతి యొకతల బలప్రమాణము సూడన్‌.

### [5.2.185](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.185)

ఉ. భీముఁ దలంచినన్‌ మనము భీతిఁ గలంగుచునుండు నాకు, రే  
లేమియు నిద్ర రా; దతని నేడ్తెఱ మార్కొనఁ జాలునట్టి వాఁ  
డీ మొన లేఁ; డతం డలుక నెత్తిన యా గద కాలదండ; ము  
ద్దామ విలాసుఁడై కురు కదంబములో విహరింపకుండునే?

### [5.2.186](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.186)

తే. చిఱుతనాఁడును వాఁడు నాశిక్షఁ బోఁడు; | వీరు చివ్వకుఁ జొత్తురు వైర మెత్తి;  
వానిచేఁ బీడ వడియును మాన; రిదియ | కాదె యీ భేదమున కెల్లఁ గారణంబు.

### [5.2.187](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.187)

క. సమరమున దైత్య దానవ | సమితియు నాతని నెదుర్పఁ జాలదు; భుజయు  
ద్ధమున జరాసంధుని నొక | నిమిషంబునఁ జంపె; నొరులు నిలుతురె యెదురన్‌?

### [5.2.188](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.188)

మ. బొమ లల్కన్‌ ముడివడ్డ, రౌద్రరస ముప్పొంగం, దనర్పన్‌ భుజా  
గ్రము, ‘లిందెవ్వఁడు నాకు మా’ ఱనుచు శౌర్యస్ఫూర్తి శోభిల్ల దు  
ర్దమ లీలం గదియంగ, భీముఁ గని ధైర్యం బేది కౌరవ్యసై  
న్యము లంతంతఁ గలంగఁ బాఱినటులై నా మోమునన్‌ వ్రేలెడిన్‌.

### [5.2.189](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.189)

క. కరవాలము గద మొదలగు | పరికర మేమియును లేక బాహుబలమునం  
గరి గతి నడరినను వృకో | దరునకు నొకఁ డెదుర నిలిచి తలపడువాఁడే?

### [5.2.190](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.190)

తే. ప్రళయకాల సముద్రము భంగిఁ బొంగి | కడు భయంకరుఁడగు భీముఁ గడవ నీఁద  
వశమె నా పుత్త్రులకు? విధివశము వొంది | యెదిరిఁ దమ్మును నెఱుఁగరు మదము కతన.

### [5.2.191](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.191)

క. చిచ్చునకుఁ దోడు కరువలి | వచ్చు గతిన్‌ భీము దుర్నివార విహారం  
బచ్చు పడఁగఁ బ్రాపై వి | వ్వచ్చుఁడు వెస వచ్చు గాండివంబును దానున్‌.

### [5.2.192](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.192)

వ. సంజయా! వినుము; నీ కున్న రూపు సెప్పెద.

### [5.2.193](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.193)

క. ఆ యర్జును మగఁటిమి కెన | యే యుగములఁ జూడ వినఁగ నెందును గలదే?  
నీ యెదుర నాడి నంతయుఁ | జేయుట కతఁ డోపు; రిత్త సెప్పెడువాఁడే?

### [5.2.194](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.194)

ఉ. ఎక్కటి గాండివంబు నుతికెక్కి వెలుంగుట! మీఁదఁ గేశవుం  
డక్కజమైన తేజ! మది యాసపడండు, దనంత నర్జునుం  
డొక్కఁడ వైరిసేనలకు నొట్టిన మంట! ప్రతాపమూర్తు లి  
ట్లొక్కెడఁ గూడె, నిన్నిటి మహోగ్రపు వేఁడిమి కోర్వవచ్చునే?

### [5.2.195](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.195)

క. దివిజ దనుజ సహితము లగు | భువనము లన్నిట మహేంద్ర పుత్త్రుఁడు విజయో  
త్సవ లీలఁ గ్రీడ సల్పుం; | దవులం బడఁడెందు నత్యుదగ్ర బలమునన్‌.’

### [5.2.196](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.196)

వ. అని పలికి వెండియు.

### [5.2.197](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.197)

క. ‘కురుసేనఁ గదా! గెలుచుట | కరము భరం బర్జునునకు! గాండీవమునం  
బెరిఁగిన యమ్ముల మంటల | దరికొని తెగఁ గాల్చునట్టిద యగుం జుమ్మీ!

### [5.2.198](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.198)

వ. భీమార్జునుల కొలందులు భీష్మద్రోణు లెఱుంగునంతకంటె నెవ్వ రెఱుంగుదు? రెఱింగియు మానుషంబు వాటించి సేన మొగంబున నిలుతురు; కీర్తి వట్టి ప్రాణంబులు విడుతు; రంతియకాని చేయునది లే; దదియునుం గాక పౌత్రులగుటయు శిష్యు లగుటయు, గాంగేయునకు గురునకు సామాన్యం బగుటం జేసి, రెండు దెఱంగుల వారికి వీ రొక్కరూప; మన కడనున్న తప్పునకు మనముందట నిలువవలయునను నింత మాత్రకుంగా వీరల కింత వలసె; నేను దైవాధీనత కతంబున బిడ్డల నొత్తి చెప్పను, నియమింపనుం జాల; మొదల విదురుం డేమని చాటి చెప్పి నదియంతయుం బాటిలె; జూదంబు నాఁటనుండియుఁ గురుజాతికిం జేటు మూఁడుట దోఁచుచుండు; మంద బుద్ధియు, లోభోపహతుండును నయి దురభిలాషంబున దుర్యోధనుఁ డింతసేసెఁ; గాలపర్యాయంబునఁ గౌరవులకుఁ గడవరాని యవస్థ వచ్చె; సంజయా! నే నేమి సేయుదు? నెందుఁ జొత్తు? నెద్ది దెరు? వెవ్వరు శరణంబు? వా రిరువురుఁ గల యంతటన పోయెనే? విను’ మని మఱియు నిట్లనియె:’

### [5.2.199](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.199)

చ. ‘అనుజులు నట్టి వార; ద్రుపదాది సుహృజ్జను లెల్ల నంతకం  
టెను బలవంతు; లాహవ పటిష్ఠుఁడు రాజు యుధిష్ఠిరుండు; స  
ద్వినయ వివేక శీలముల విశ్రుతుఁ డాతఁడు బంధు భృత్యులం  
దనకు వశంబు సేసికొనుదానికి నేర్చుఁ బ్రభుత్వ సంపదన్‌.

### [5.2.200](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2.200)

ఆ. సత్య శౌచ ధర్మశాలి దయాపరుం | డట్టి ధర్మపుత్త్రు నాక్రమింప  
మనము దలఁచు టెల్ల మంటలో మిడుత లు | దగ్రవృత్తి నుఱుకఁ దలఁచునట్ల.

_First 200 of 336 passages. [Read on](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2)_

---
Source: [https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2) · Pramāṇa
