<!-- Pramāṇa, a library of Indian primary sources · https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3 -->

[Pramāṇa](https://indike.org/pramana/) › [Indian literature](https://indike.org/pramana/in) › [Epic, Poetry, Drama & Narrative](https://indike.org/pramana/in.lit) › [The Mahābhārata and its versions](https://indike.org/pramana/in.lit.mahabharata) › [Mahābhāratas in Indian regional languages](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa) › [Andhra Mahabharatamu](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra) › 5.3

# Andhra Mahabharatamu 5.3: ఉద్యోగపర్వము — తృతీయాశ్వాసము

Āndhra Mahābhāratamu 5.3

- **Language:** Telugu

### ఉద్యోగపర్వము — తృతీయాశ్వాసము

### [5.3.1](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.1)

క. శ్రీవాగ్విభవారోగ్య | ప్రావీణ్యప్రాభవానుభావమహిత సౌ  
ఖ్యావహ పదస్మరణ! కరు | ణావాస కటాక్షకిరణ! హరిహరనాథా!

### [5.3.2](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.2)

వ. దేవా! వైశంపాయనుండు జనమేజయున కిట్లనియె:

### [5.3.3](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.3)

తే. సంజయుఁడు దన్ను వీడ్కొని చనిన ధర్మ | సుతుఁడు మఱునాఁడు దమ్ముల సుతుల నిష్ట  
భృత్యవరులఁ గొలువునకుఁ బిలువఁ బనిచి | యెల్లవారలు వినుచుండ నిట్టు లనియె.

### [5.3.4](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.4)

క. ‘మనము జనార్దను పాలికిఁ | జని కౌరవసభకు నతనిఁ జనుమని ప్రార్థిం  
చిన మేలు బంధు హిత గురు | జనములతో రణము గాక సంప్రీతి యగున్‌.’

### [5.3.5](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.5)

వ. అని పలికి వార లందఱు బలసి చనుదేర మాధవు మందిరంబున కరిగి యతని చేత సత్కృతుండయి సమస్త పరిజనంబులుం బరివేష్టింప నొక్క పార్శ్వంబునం బాంచాలియు సముచిత పరివార పరివృతయై యుండ నతండునుం దానును సుఖాసీనులై యుండి యతనితో నిట్లనియె:

### [5.3.6](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.6)

క. ‘ఆపదఁ గడవం బెట్టఁగ | నోపి శుభంబైనదాని నొడఁగూర్పను మా  
కీ పుట్టువునకుఁ బాండు | క్ష్మాపాలుఁడు నిన్నుఁ జూపి చనియె మహాత్మా!

### [5.3.7](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.7)

తే. సమయ మిది మిత్త్రకార్యంబు చక్కఁ జేయ | నీ కతంబున నే మవినీతుఁ డైన  
యా సుయోధను తోడి పోరాట దక్కి | యనుభవింతుము మా యంశమగు ధరిత్రి.

### [5.3.8](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.8)

వ. నీకు మేము ప్రద్యుమ్నాది కుమారుల తోడివారము, మమ్ము దురితంబులు వొరయకుండ నరసి రక్షింపు’ మనవుడు వాసుదేవుండు ‘నీ పంచిన యట్ల చేయంగలవాఁడ; నెయ్యది తలంపు? సెప్పు’ మనిన నజాతశత్రుండు ‘నీవు కరినగరంబున కరిగి కౌరవులతోడం దగిన మాటలాడి తెఱంగు సేయవలయు’ నని ప్రార్థించి, యతని నియ్యకొలిపి యిట్లనియె:

### [5.3.9](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.9)

సీ. ‘మా తండ్రి తలఁపును నాతని నందను | చందంబు నిన్న నా సంజయుండు  
పలికిన పలుకులఁ దెలిసెఁగదా నీకు; | వారి చిత్తము భంగి వాఁ డెఱుంగుఁ;  
బాలు పంపనియీక మేలిమాటలన మ | మ్మలుక దీర్చెదరు తా; రధిక దుష్క  
రంబైన యాసమయం బేము పదుమూఁడు | వత్సరంబులు సల్పి వచ్చియుండఁ  
ఆ. గులము పాడి నడపఁ దలఁపడ; పతి సెడఁ | దలఁచెనేనిఁ గొడుకు వలచినట్టి  
వాఁడు గాన యతని వక్రత మాన్పలేఁ; | డింతకంటెఁ గలదె యెడరు మాకు?

### [5.3.10](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.10)

క. జననియు సమస్త బాంధవ | జనములుఁ బ్రియమంద, వారి శాంతులఁగాఁ జే  
యను, నెమ్మిగ నొక్కటియై | మననుం దెఱఁగేది యునికి మా పౌరుషమే?

### [5.3.11](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.11)

క. ఇచ్చటి బంధులు నీవును | నచ్చెరువడి వినుచునుండ నయిదూళ్ళును మా  
కిచ్చినను జాలు నంటిని | బొచ్చెముగా దింతవట్టు పూర్ణము సుమ్మీ!

### [5.3.12](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.12)

శా. ఆ దుర్యోధనుఁ డంతమాత్రయును జేయంజాలఁడో కాని, పెం  
పేదం గ్రూరత కోర్వరాదు; సిరి నా కేలందునే, గ్రాసవా  
సోదైన్యంబులు వచ్చు నా యరయు నీ చుట్టాలకుం; గావునన్‌  
మోదంబందుట గల్గుఁ గౌరవులు నేముం బొంది శ్రీ నొందినన్‌.

### [5.3.13](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.13)

ఉ. అక్కట! లాఁతులైనఁ బగఱైనను జంపన కోర నేల? యొం  
డొక్క తెఱంగు లేదె? యది యొప్పదె? బంధు సుహృజ్జనంబు లా  
దిక్కున నున్నవారు; గణుతింపక సంపదకై వధించి దూ  
ఱెక్కుట దోషమందు టను నీ దురవస్థల కోర్వవచ్చునే?’

### [5.3.14](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.14)

వ. అని పలికి పాండవాగ్రజుండు వెండియు.

### [5.3.15](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.15)

ఆ. క్షత్త్రధర్మ మింత కష్టమగునె? పెఱ | ధర్మ మాచరింపఁ దగ దటండ్రు  
గాన శస్త్రజీవికయ తగియున్నది; | యైన వంశనాశ మనభిమతము.

### [5.3.16](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.16)

వ. అదియునుంగాక.

### [5.3.17](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.17)

ఆ. కలహ మగుట లక్ష్మిఁ గావించుఁ, బ్రాణహా | నియును జేయు; నింత నిక్కువంబు;  
పలువు రొకని కోడి పాఱుట, బల్లిదు | లనదచేతఁ జెడుటయును ఘటించు.

### [5.3.18](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.18)

క. జయమగు నోడుదు మను ని | శ్చయ మొక్కఁడు లేదు; వినుము! సమరమునఁ బరా  
జయము మరణంబు కంటె హృ | దయపుట భేదనము సేయుఁ దథ్యం బనఘా!

### [5.3.19](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.19)

క. కాన నవశ్యముఁ బెనఁకువ | గాని యుపాయమునఁ బగఱఁ గడతేర్చు ధృతిం  
బూని నడచు నెవ్వఁడు డెం | దానం జెయివెట్టికొని యతఁడు నిద్రించున్‌.

### [5.3.20](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.20)

ఆ. పగయ కలిగె నేనిఁ బామున్న యింటిలో | నున్న యట్లకాక యూఱడిల్లి  
యుండు నెట్లు చిత్త మొకమాటుఁ గావున | వలవ దధిక దీర్ఘ వైరవృత్తి.

### [5.3.21](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.21)

చ. పగ యడఁగించు టెంతయు శుభం; బది లెస్స; యడంగునే పగం  
బగ? వగ గొన్న మార్కొనక పల్కక యుండఁగ వచ్చునే? కడుం  
దెగ మొదలెత్తిపోవఁ బగ దీర్పఁగ వచ్చినఁ గ్రౌర్య మొందు; నే  
మిగతిఁ దలంచినం బగకు మేలిమి లేమి ధ్రువంబు గేశవా!

### [5.3.22](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.22)

ఉ. కావున శాంతిఁ బొందుటయ కర్జము; దా నది యట్టులుండె; శ్రీ  
గావలె నంచుఁ, బోరితము గామియుఁ గోరెద; మెల్లసొమ్ములుం  
బోవుటయుం గులక్షయము పుట్టుటయున్‌ వెలిగాఁగ నొండుమై  
నే విధినైనఁ జక్కఁబడు టెంతయు నొప్పుఁ జుమీ జనార్దనా!

### [5.3.23](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.23)

చ. మనమునఁ బక్షపాతగతి మాదెస మానుము ధర్మనీతి వ  
ర్తనముల రెండు దిక్కుల హితంబును బెంపును గల్గునట్టి చొ  
ప్పున విదురాది సజ్జనుల బుద్ధికి రా నుచితంబుతోడి మె  
ల్పునఁ బరుసందనంబునను భూపతులెల్ల నెఱుంగ నాడుమీ!

### [5.3.24](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.24)

చ. తగవునఁ బోక రాజు బెడిదంబులు వల్కినయేని సైఁచి యొ  
ప్పుగ నిలుమీ; గురుత్వముఁ బ్రభుత్వమునుం గల పెద్దవారి మా  
ట గొనమి యా సుయోధను కడన్‌ నిలువన్‌ మన మెల్ల గారవం  
బుగఁ గురువృద్ధు పల్కుఁ దలఁపుం జన నిచ్చిన మెచ్చరే జనుల్‌?

### [5.3.25](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.25)

మ. సుతువాఁడై వినయంబు సేకొనక యేచొప్పున్‌ దగం జెప్ప కా  
ధృతరాష్ట్రుం డవినీతిఁ జేసినను సంధింపంగ రాదంచు వే  
గ తెగంబాఱకు తెంపుసేయునెడ లోకంబెల్ల మెచ్చం బ్రకా  
శిత ధర్మస్థితి నొంది మా మనము నిశ్చింతంబుగాఁ జేయుమీ!

### [5.3.26](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.26)

ఆ. ఇన్ని సంకటముల నిబ్భంగి నెంతయు | నొగులు చిత్తవృత్తి నొవ్వు దీర్ప  
వెజ్జ వీవకావె! వేయేల? యేగతి | నడపఁ దలఁచి తదియ నాకుఁ బ్రియము.’

### [5.3.27](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.27)

వ. అని చెప్పి తలంచికొని వెండియు నిట్లనియె :

### [5.3.28](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.28)

క. ‘నీవు సుయోధను పాలికిఁ | బోవఁగ వలదనియు నొక్క బుద్ధి వొడమెడున్‌;  
గోవింద! యతఁడు మంత్రులుఁ | గావరమునఁ జక్క వినరు కార్యవచనముల్‌.

### [5.3.29](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.29)

తే. కుటిలమతు లవినీతులు క్రూరకర్ము; | లట్టి నీచుల కడకు ని న్ననుపఁజాల;  
నీవు సంకటపడియెడు దేవపదవి | యైన నే నొల్ల; నొంటి యం దరుగు టుడుగు.’

### [5.3.30](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.30)

చ. అనవుడుఁ గృష్ణుఁ డిట్లనియె ‘నా ధృతరాష్ట్రుఁడు నట్టివాఁడ త  
త్తనయుఁడ యేల; నీ పలుకు తథ్యము; నీ తలఁ పే నెఱింగితి;  
న్మనమున శంక దక్కుము; వినన్‌ వలతే విను; మేను నిక్క మ  
ల్గిన నచటం గలండె రణకేళికి మార్కొన నొక్కఁడేనియున్‌?

### [5.3.31](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.31)

క. పనుపుము కౌరవసభ; కేఁ | జను టెట్లును మేల; యర్థ సంసిద్ధియగున్‌;  
మన కొకటం బాపము రా | కునికికిఁ గతమైన పలుకు లొండెను గలుగున్‌.’

### [5.3.32](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.32)

వ. అని పలికిన యుధిష్ఠిరుం డిట్లనియె:

### [5.3.33](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.33)

ఆ. ‘మేలుగాక నీకుఁ బోలినట్లయిన నం | దరిగి యేము వారు నర్థిఁ బొంది  
యుండునట్లుగాఁగ నొడఁబాటు గావింపు | మెల్లభంగి మనకు నిదియ లెస్స.

### [5.3.34](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.34)

క. మ మ్మెఱుఁగు, దెదిరి నెఱుఁగుదు | నెమ్మి యెఱుఁగు దర్థసిద్ధి నెఱి యెఱుఁగుదు వా  
క్యమ్ముల పద్ధతి నెఱుఁగుదు | పొ మ్మెవ్వఁడ నేను నీకు బుద్ధులు సెప్పన్‌.

### [5.3.35](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.35)

సీ. అనిన ముకుందుఁ డిట్లనియె; ‘సంజయుని మా | టలును నీవన్న పల్కులును వింటి;  
నీమది ధర్మైకనిష్ఠమై నున్నది; | వైరంబు విడువరు వారు; ద్రోణ  
భీష్ములు గలరని బిరుదులై యున్న వా; | రగునె రాజన్యుల కడఁగి కుడువ?  
నక్లేశవృత్తి రాజ్యము చవి గొన్న వా | రేల యిత్తురు నీకుఁ బాలు సెపుమ!  
తే. ధార్తరాష్ట్రులు సడికి నధర్మమునకు | నలుక రెన్నఁడు; విడువు దైన్యంబు; పొడువు  
కయ్య మరివర్గ జయమునఁ గలుగు నిహ ప | రములుఁ జిరకీర్తియును బాండురాజతనయ!

### [5.3.36](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.36)

మ. గురుభీష్మాదులు సూచుచుండ సభ మీకుం గీడు నాఁ డట్లు ము  
ష్కరులై చేసిరి; యంతసేసియును బశ్చాత్తాపముం బొంద నో  
పర వా రెన్నఁడు; నట్టిచోటఁ గృపయున్‌ బంధుత్వముం దక్కు; మె  
వ్వరుఁ గోపింపరె యా దురాత్మకుల గర్వక్రౌర్యముల్‌ సూచినన్‌.

### [5.3.37](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.37)

వ. కపటపు నెత్తంబు నెపంబుగా మిమ్ము వెడలనడుచునప్పుడు దుర్యోధన దుశ్శాసన శకుని సూతనందనులు పుయిలోట దక్కి కలకల నవ్వుచుం బలికిన పలుకు లుగ్గడింపవచ్చునే? వాని విని సమస్త జనంబులు ధృతరాష్ట్రు నిందించుచు మీరు బలవంతులరయి యుండియు సత్యంబు వాటించి యూరకపోక సూచి యచ్చెరు వాటుతో నుమ్మలించుచుండిరి; తిట్టువాట్లం బోయెడువారు దైవోపహతులై మున్న చెడియుండుదురు గావున వారలం జంపనుం జెఱుపనుం జులుకన క్రూరాత్ములగు కౌరవులెల్లవారికి వధ్యులుగాఁ దగుదురు; నీకేల యవధ్యులైరి? పాపాత్మకులగు హింసకులం బాముల నెట్లట్ల నిర్విచారంబుగా వధియించుట కర్తవ్యంబు.

### [5.3.38](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.38)

క. మీ తండ్రికి భీష్మునకుం | జేతోముద మొదవ భక్తి సేయన తగు నీ;  
కా తలకు నేనుఁ జని వి | ఖ్యాతంబుగ నీదు వినయ మభివర్ణింతున్‌.

### [5.3.39](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.39)

క. చెలులుం జుట్టలు దేశం | బులరాజులు వినఁగ నీదు పుణ్యచరిత్రం  
బులు నీవు ధర్మమార్గము | దలఁచుటయుం దెలియఁబలికెదం గురుసభలోన్‌.

### [5.3.40](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.40)

వ. దానికి దుర్యోధనుం డియ్యకొనక తెఱంగుమాలిన మాట లాడుటయుఁ దండ్రి యతని వారింప నేరమికిఁదో డుపేక్షకుం డగుటయుఁ జూచి, మీ తొల్లింటిపాట్లునుం దలంచి యెల్లవారును వారిన గర్హింతు; రింతియ కాక మనకు నొండేమి వలయు? నా యోపినంతయుఁ బెక్కు భంగుల సంధియ కావింపఁజూచెద; నవ్విధంబు సిద్ధించిన మేలుగాదె! యట్లుగాకతక్కిన నచ్చోటి యుత్సాహంబు చందంబును, నందుఁ జేయంగలవారి వర్తనంబులుఁ గొలందులు నెఱింగి నీకు విజయంబగు విధంబునం జనుదెంచెద.

### [5.3.41](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.41)

తే. ఆ సుయోధను ముక్కున నావి గలుగఁ | బుడమి నీ కీఁడు గావునఁ బోర కలుగు,  
నేను గయ్యపు శకునంబు లెన్నియేనిఁ | గంటి; నీ వనుత్సాహివి గాఁగ వలదు.

### [5.3.42](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.42)

వ. చతురంగ బలంబుల నాయితంబు గావించుచు దొరలం బురికొల్పికొనుచు నాలస్యంబులేక సమరంబునకు సన్నాహంబు సేయుచుండవలయునని పలికిన విని వృకోదరుండు దామోదరున కిట్లనియె:

### [5.3.43](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.43)

క. ‘సమరంబు గలుగు ననుచును | మము వెఱపింపంగ వలదు మాధవ! నీ వా  
కుమతి యగు ధార్తరాష్ట్రుఁడు | శమించు కార్యంబు నడపు సౌజన్యమునన్‌.’

### [5.3.44](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.44)

వ. అని వెండియు.

### [5.3.45](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.45)

శా. ‘పాపాత్ముండు మదాంధుఁ డా తులువ నీపంపెట్లునుం జేయఁగా  
నోపం; డడ్డము సెప్ప రెవ్వరును; మానోద్రేకమున్‌ గర్వముం  
గోపంబుం దనుఁ ద్రిప్ప నాప్తజనులం గుందించుటం బోయిన  
ట్లే పోనిత్తురు; గాన ని న్నతఁడు జాలింబెట్టెడుం జూడుమీ!

### [5.3.46](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.46)

ఉ. చొచ్చిన చోన చొచ్చి తెగఁ జూచెద నంచుఁ గడంగుచుండు; న  
న్మెచ్చఁడు బాహుగర్వమున; నీచు సుయోధనుఁ; డట్టివానితోఁ  
బొచ్చెములేక కూడి మనఁ బోవక పోవఁగరాదు నాకు వి  
వ్వచ్చుఁడు రాచవారుఁ గురువంశము చేటున కోపకుండుటన్‌.

### [5.3.47](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.47)

ఉ. పాండవ కౌరవుల్‌ గలసి పాలును నీరును బోలె నెమ్మిమై  
నుండఁగ దుష్టచేష్టల సుయోధనుఁ డింతలు సేసె; నాతఁ డొ  
క్కండ కులక్షయంబునకుఁ గారణమం; డ్రది దప్ప; దైన నీ  
వొం డన నేల యా బిరుదు నోపిన యంతయుఁ దీర్పు నేర్పునన్‌.

### [5.3.48](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.48)

చ. తన పొరిపోవునంతకు నుదగ్రతయుం గపటంబు మాన నే  
ర్చునె ధృతరాష్ట్ర సూనుఁడు? యశోభరితంబగు భారతాన్వయం  
బున కొక నిందవచ్చు ననుబుద్ధి దురాత్మున కేలకల్గు? నా  
యనమెయిఁబోయి హీనగతినైన ఘటించిన నెంత యొప్పునో!

### [5.3.49](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.49)

వ. అని పలికి, మాకును వారికిఁ బితామహుండగు భీష్ముండు వినుచుండ సుయోధనుతోడం గురుకులేశ్వరు నాస్థానంబున నా వచనంబులుగా నిట్లనుము.

### [5.3.50](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.50)

తే. అన్నదమ్ములమై యుండి యకట! మనల | నొరులు దలయెత్తి చూడ నొండొరులతోడఁ  
బెనఁగ నేటికి? నీ నేల పెద్దవారి | బుద్ధి విని పంచి కుడుచుట పోల దొక్కొ?

### [5.3.51](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.51)

క. అని యెవ్విధమున నైనను | వనజోదర! సంధి సేయవలయుం దగ నే  
మును వారును గలయుట భూ | జనులకునెల్లను హితంబు సౌఖ్యకరంబున్‌.’

### [5.3.52](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.52)

చ. అనుటయుఁ బిన్ననవ్వు నగి యంబుజనాభుఁడు వల్కు ‘నెన్నఁడున్‌  
విననివి భీముపాలఁ గడు వింతలు వింటిమి మాట; లగ్గి చ  
ల్లనగుట భూరిభూధరము లాఘవ మొందుటఁ గాదె యివ్విధం  
బున నితఁ డిప్డు మార్దవముఁ బొందుట; యింకిటఁ జెప్ప నేటికిన్‌?

### [5.3.53](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.53)

తే. అని సహోదరు లాజి నాయాసపడుట | కోర్వమియుఁ గౌరవులఁ జంప నొల్లమియును,  
గలుగు నెయ్యంబు పెంపునఁ గరుణ నార్ద్రుఁ | డైన పవనజుఁ బురికొల్ప నాత్మఁ దలఁచి.

### [5.3.54](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.54)

వ. మురమర్దనుం డతనితో నిట్లనియె :

### [5.3.55](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.55)

ఉ. ‘యుద్ధము మీఁది వేడ్కయు మహోగ్ర విరోధుల నల్కఁజేయు ద  
ర్పోద్ధతియున్‌ సుయోధనుని యున్నతి సైఁపని యేపు రాజ్యసం  
సిద్ధి నిజాగ్రజన్మునకుఁ జేయు తలంపును గల్గు నీ వసం  
బద్ధములైన వాక్యములు వల్కుట యొప్పునె కీచకాంతకా!’

### [5.3.56](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.56)

వ. అని యంత నిలువక.

### [5.3.57](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.57)

క. ‘వెఱ పెట్టిదియో యెన్నఁడు | నెఱుఁగని నీ యట్టివాని కెవ్వరొకో యీ  
పిఱికితన మింత యలవడ | గఱపినవా’ రనుచు శౌరి గలకల నవ్వెన్‌.

### [5.3.58](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.58)

వ. దానికి దరహసితవదనుం డగుచు భీమసేనుండు వసుదేవసూనున కిట్లనియె:

### [5.3.59](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.59)

ఉ. ‘బంటుతనంబు మాటలకుఁ బాఱకు; పాండునృపాలుపాలు గై  
కొంటయ చాలునన్న నృపకుంజరు పల్కుల కడ్డమాడ రా  
కుంట యెఱుంగవే; మును సుయోధను చందముఁ జూపి యప్పు డే  
మంటి యుపేంద్ర! న న్నని రణాగ్రమునన్‌ నిను మూదలించెదన్‌.

### [5.3.60](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.60)

క. నా కొలఁది విచారింపక | నీ కిట్లనఁ దగునె? మిన్ను నేలయు నిమ్మైఁ  
గాక తిరుగంగఁ బడినం | బో కే ముంజేతు లొడ్డి పోవఁగఁ ద్రోతున్‌.

### [5.3.61](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.61)

ఉ. నావుడు ‘నవ్వుటాల కనినం బవనాత్మజ! యింత యేటికిం?  
గేవల యోధవే? పరుల కిల్బిషముల్‌ దలపోయ కిమ్మెయిన్‌  
జావడమైనఁ జూచి యిది చందము గాదని యంటిఁగాక, నీ  
చేవయు లావు నీవు మును చేసిన భంగులు నే నెఱుంగనే?

### [5.3.62](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.62)

వ. అని చెప్పి మాధవుండు మఱియును.

### [5.3.63](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.63)

ఉ. ‘పార్థుఁడు పోరఁ దేరు గడపం దనకున్‌ ననుఁ గోరి యెంతయుం  
బ్రార్థన సేసె; దాని కనురాగము నొందితి నేను గాన యు  
ద్ధార్థులమైన మాకు నిను నాసపడం దగదే? యశంబు నా  
నార్థములున్‌ విరోధి విజయంబునఁ దక్కఁగ నొంటఁ గల్గునే?’

### [5.3.64](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.64)

వ. అనవుడు.

### [5.3.65](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.65)

శా. ‘ఏమీ! పార్థుఁడు నీవు దండిమగలై యీవచ్చు కౌరవ్య సం  
గ్రామక్షోభము బాహుదర్పమునఁ దీర్పం బెద్ద మిఱ్ఱెక్కి మి  
మ్మే మెల్లన్‌ వెఱఁగంది చూచెదముగా; కీసారెకుం బోయి రా  
భీముం డిత్తఱి రిత్తమాటలకుఁ గోపింపండుసూ పెంపఱన్‌.’

### [5.3.66](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.66)

వ. అని పలికి యివ్విధంబున గోపాలదేవు మేలంపు మెయివడి కార్యవచనంబులకుం దగం దానును దోడ్తో సరసం బాడుటయకా మఱుమాటలాడి యంతటఁ దనివోవక బకమర్దనుం డతనితో నిట్లనియె:

### [5.3.67](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.67)

ఉ. ‘కయ్యము గల్గినట్లయిన గంధ గజ ప్రకరంబు కుంభముల్‌  
వ్రయ్యఁ దురంగ పంక్తులు ధరం బడఁ దేరిగముల్‌ బడల్పడన్‌  
డయ్యమి కీవు వెక్కసపడన్‌ గదపండువు సేయఁగోరు నా  
దయ్యము నెత్తికోలు దుది దాఁకుటగాదె భుజంగభంజనా!

### [5.3.68](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.68)

చ. అన విని దేవకీతనయుఁ డాతని కిట్లనుఁ ‘జెప్పినంత కం  
టెను మిగులంగఁ జేయుదు గడింది మగండవు నిన్నుఁ దెప్పగాఁ  
గొని పలుమాఱు నాపదలకున్‌ భయమొందక దుఃఖవార్థు లీఁ  
దిన మము నెల్ల నిక్కొఱఁత దీర్చి సుఖాత్ములఁ జేయు పావనీ!

### [5.3.69](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.69)

క. ఇదె పోయెదఁ గౌరవ్యులఁ | బదనికి రాఁ బలికి సంధి వాటించెద; నా  
కది యొప్పదె! కాని తుదిం | గుదురింతకు నీవ కావె గుణరత్ననిధీ!’

### [5.3.70](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.70)

వ. అనిన వాసుదేవున కర్జునుం డిట్లనియె :

### [5.3.71](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.71)

తే. ‘చెప్పఁ గల యంతవట్టును జెప్పె నీ క | జాత శత్రుండు; వింటి వీ వా తెఱంగు;  
మాకు నెల్లను బలుకంగ మాట లొండు | గలవె? యైనను జెప్పెదఁ గన్నయంత.

### [5.3.72](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.72)

మ. ధృతరాష్ట్రుం డతిలోభదూషితుఁడు ధాత్రీభాగ మీ నేర్చునే  
సుతుఁడుం గష్టుఁడు సంధి యేల యగునంచున్‌ మున్న కైపెక్కిన  
ట్టితలం పచ్యుత! నీకుఁ గల్గినది; గాండీవంబు దివ్యాస్త్ర సం  
తతియుం బెట్టినయట్లయుండ మముఁ జింతం బాపరాదో కదే!

### [5.3.73](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.73)

ఉ. నీ వొనరింపఁ బూనిన పనిం గమలోదర! కీడు వుట్టునే?  
కా వనినట్ల యుండి యవుఁ గార్యము; లట్లగుటం బ్రయత్న సం  
భావనసేఁత పౌరుషము పద్ధతి తత్ఫలసిద్ధి వొందుచో  
దైవము దోడ్పడన్‌ వలయుఁ; దథ్యము రెండును నీ వినోదముల్‌.

### [5.3.74](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.74)

ఉ. వేరిమి ధర్మజుం బరిభవించిన ద్రోహులు వధ్యులన్న నె  
వ్వారికిఁ బోలదే సుజనవత్సల! నీ విటులంట వారు మ  
మ్మీరసమెత్తి కీడ్పఱిచి యింతలుసేసినదాన నీ మదిం  
గూరిన నొవ్వుసొంపునను గోపము పెంపునఁ గాదె యారయన్‌.

### [5.3.75](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.75)

ఉ. ఐనను జిత్తగింపు; ద్రుపదాత్మజ నాసభ నట్లు సేసినన్‌  
దానికి సైఁప లెస్సయని దైన్యముఁ బొందుట కోర్చి యమ్మెయిం  
గాననభూమికిం జనుట కారుణికోత్తమ! నీ వెఱుంగవే?  
కాన సహించి పాండవులఁ గౌరవులం దగఁ గూర్పు నేర్పునన్‌.

### [5.3.76](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.76)

తే. అలవి యెఱుఁగక ధార్తరాష్ట్రులు గడంగి | మమ్ముఁ బఱచిన పాటులు మానసమునఁ  
జవుటఁబెట్టిన విత్తుల చందమొంది | యంకురింపక చెడిపోయె నంబుజాక్ష!

### [5.3.77](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.77)

వ. అమ్మొఱకుల నెమ్మెయి నయినను.

### [5.3.78](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.78)

క. ఒడఁబఱిచి మాకు వారికిఁ | బుడమి సగము గాఁగఁ జేసి పొంది పొసఁగియుం  
డెడు నట్టి తెఱఁగు సేయుట | కడు మే; లది గౌరవము సుఖంబును జేయున్‌.

### [5.3.79](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.79)

క. నీ కిట్టిది చిత్తమునకు | రాకున్నది యేని వలదు రం డిమ్మెయి మీ  
రీకార్యము సేయుం డని | మా కానతి యిమ్ము కంసమర్దన! తెలియన్‌.

### [5.3.80](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.80)

మ. హిత మిబ్భంగిది మాకు ధర్మము తెఱం గిట్లుండునం చేను నీ  
మతి బోధింప వలంతినే? హితము ధర్మంబున్‌ విచారించి చూ  
చి తగున్‌బొమ్మని యేది పంచి తది నిశ్చింతంబునంజేసి యు  
న్నతిఁ బొందంగలవారమై యునికి కృష్ణా! నేఁడుగా వచ్చెనే!

### [5.3.81](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.81)

వ. అనిన విని కృష్ణుండు విజయున కిట్లనియె :

### [5.3.82](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.82)

చ. వెరవున లావునం గృషికి వేయు విధంబుల మేలొనర్చినం  
దొరకొనునే ఫలంబు? తఱితోఁ దగు వర్షము లేకయున్న; నె  
ప్పరుసున లెస్స సేసినను బౌరుషముల్‌ ఫలియించు టెల్ల నా  
దరణమునం బ్రసన్నమగు దైవముచేఁతన చూవె ఫల్గునా!

### [5.3.83](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.83)

ఉ. కావున సంధికిం బురుషకార మొనర్చెద నోపినంతయున్‌  
దైవముచేఁత యెట్లగునొ దాని నెఱుంగ సుయోధనుండు సం  
భావనసేసి పా లొసఁగు పాడియ కల్గిన బాల్యమాదిగా  
నేవిధి నైననుం జెఱుప నింతలు పాపము లాచరించునే?

### [5.3.84](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.84)

వ. అది యెల్ల నట్లుండె; నిచ్చట విరాటు పసులన్‌ బెట్టింప నీవు వోయిన యప్పుడు భీష్ముండు దుర్యోధనుతోఁ జెప్పిన తెఱంగు.

### [5.3.85](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.85)

ఉ. వచ్చినవాఁడు ఫల్గునుఁ డవశ్యము గెల్తు మనంగరాదు రా  
లచ్చికినై పెనంగిన బలంబులు రెండును గెల్వనేర్చునే?  
హెచ్చగుఁ గుందగుం దొడరు టెల్ల విధంబుల కోర్చు టట్లుగా  
కిచ్చఁ దలంచి యొక్క మెయి నిత్తఱిఁ బొందగుచేఁతయుం దగున్‌.

### [5.3.86](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.86)

వ. అనియె దానికతం డుత్తరం బిచ్చిన తెఱంగు.

### [5.3.87](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.87)

ఆ. మనకుఁ బాండురాజతనయవర్గమునకు | నెట్లు వొందు గలుగు? నేను రాజ్య  
భాగ మీను; సమరభంగిక విక్రమ | నిరతిఁ బూను టిదియ నిశ్చయంబు.

### [5.3.88](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.88)

వ. అని పలికె; నది యంతయుఁ బదంపడి మనమెల్ల వింటిమ కాదె! యా మాటల ఫలం బప్పుడ కనియు నా కష్టాత్ముండు వెండియుఁ దెలియండు.

### [5.3.89](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.89)

తే. అతని గుణదోషముల చంద మట్లయుండె; | నాకు ధర్మజు బుద్ధిన నడపవలయు  
నిత్తెఱం గాచరింపంగ నేఁగి యచట | నెల్ల తెఱఁగును నేర్పడ నెఱిఁగివత్తు.’

### [5.3.90](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.90)

చ. అనిన ముకుందుతో నకులుఁ డల్లన యిట్లను ‘నీకు ధర్మజుం  
డును బవనాత్మజుండు నరుఁడుం దగఁ జెప్పుట రిత్తగాదు; మా  
మనము లరణ్యవాసమున మత్స్యమహీపతిపాల నున్నయ  
ద్దినముల భంగి గావు; కృపఁ దీవ్రతఁ గుందిన చంద మయ్యెడున్‌.

### [5.3.91](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.91)

క. కడవఁగ నొకళ్ళు పసరము | నడిచిన నొక్కళులుఁ బెయ్య నడువ వలయునే?  
చెడుతెరు వా కౌరవ్యుల | కడ నిలుచుంగాక మనకుఁ గ్రౌర్యం బేలా?

### [5.3.92](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.92)

సీ. గోగ్రహణంబునఁ గోలె నెంతయు మెత్తఁ | బడకుండుదురె వారు పద్మనాభ!  
నీ యనుగ్రహమున నెమ్మిమైఁ గూడిన | బలము లేడక్షౌహిణులును, దొరలుఁ,  
బాంచాల యాదవ పాండ్య కేకయ మాత్స్యు | లొకతెంపు నెఱుఁగకయున్నవారె  
భీమార్జునుల లావు పెంపును నీ సహా | యంబును గలుగుట కలుక రెట్లు?  
ఆ. గురుఁడుఁ గృపుఁడు బాహ్లికుఁడు భీష్ముఁడును బుద్ధి | సెప్పి వారిఁ జక్కఁ జేయరెట్లు?  
కార్య మీవు చెప్పఁగా విదురుండు వి | నంగ నెట్లు గాదనంగ వచ్చు?

### [5.3.93](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.93)

వ. అట్లుంగాక నీవు దమపాలికిం బోవుట ధార్తరాష్ట్రు లాదరింపకుండ వెఱవరే? నీ పోయినప్పుడ యీ కార్యంబు చక్కనగు’ ననిన విని సహదేవుండు వాసుదేవున కిట్లనియె:

### [5.3.94](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.94)

ఉ. ‘రక్కెస మాట లాడెదరు రాజును దమ్ములు; వానిలోన నీ  
వొక్కటియైనఁ గాదనక యూఁ కొనుచుండుట యంతకంటె మే;  
లక్కట! యిట్లు వేఁడికొననైనను బోయెదువో; సుయోధనుం  
డెక్కడ? భూమిలోన సగమిచ్చుట యెక్కడ? దానవాంతకా!

### [5.3.95](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.95)

మ. తలఁపం గూడునె యింత లేసి దొర లీ దైన్యంబు? చుట్టంబులుం  
జెలులుం దిట్టరె? లాఁతిరాజులకు మెచ్చే యి వ్విధం’ బిట్టిదిం  
గలదే? వేఁడఁగ ధర్మజుం డడుగఁ బోఁగాఁ గృష్ణుఁ డా ధార్తరా  
ష్ట్రులు పాలీక చలంబునం బెనఁగ నిట్లుం గూడు దీపయ్యెనే?

### [5.3.96](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.96)

ఉ. వీరలు ధర్మమార్గము సవిస్తరతం దగనాడి రేనియు  
న్వారలు దాని కియ్యకొనినన్‌ విను మచ్యుత! యట్టిసంధి పెం  
పారఁగ నేర్చునే? యుచితమైనది కయ్యమ; వంకమాట లే  
నేరఁ గురుప్రవీరుసభ నిశ్చయ మిట్టిద కాఁగఁ జెప్పుమీ!

### [5.3.97](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.97)

మ. తుది రాజ్యమ్ము సగమ్ము గొ; మ్మడవియందుం, బేరు వంచించియుం,  
బదుమూఁడేఁడులు నీవునుం దిరిగిరాఁ బాలీకపోవచ్చునే?  
యది గాదేఁ దెగి బంటవై యఱుము మాయల్‌వన్ను నేర్పింకఁ జె  
ల్లదుసూ నీ కని యా సుయోధనుని యుల్లం బుచ్చిపోనాడుమీ!’

### [5.3.98](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.98)

మ. అనినన్‌ సాత్యకి ప్రీతుఁడై ‘యితఁడు లెస్సై యుండఁబల్కెం; బ్రయో  
జనముం గల్గదు గౌరవంబుఁ జెడు దుశ్చారిత్రకుం డా సుయో  
ధను బోధింపఁగఁ బోయినన్‌; సరభసోత్సాహంబుమై నున్న వీ  
రనికాయంబున కెల్లనుం బ్రియము సంగ్రామంబు మే లెమ్మెయిన్‌.’

### [5.3.99](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.99)

వ. అనిన విని రథికవరు లందఱు ‘సహదేవుం డింత యొప్పనాడునే? సాత్యకి పలుకు లిట్లుండునే? తక్కటివి యెక్కడి మాటలు? పగవారి నడిగికొనంబోవుట యుచితంబఁట! కయ్యంబు కర్జంబుగాదఁట! భంగంబు నీఁగికొనం దగదఁట! యనునిది మొదలుగా ననేకు లనేక ప్రకారంబుల వీరాలాపంబులం గొలువెల్ల నొక్క మ్రోఁతగాఁ జెలంగిన యెలుంగులు నింగి ముట్టెఁ దదనంతరంబ.

### [5.3.100](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.100)

తే. ధర్మనందను పలుకులు దనకు హృదయ | తాప మొనరింప మోమున దైన్య మొంద  
నున్న పాంచాలి యిట్లని యొయ్యఁ బలికెఁ | గనలి శౌరితో గద్గదకంఠి యగుచు.

### [5.3.101](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.101)

ఉ. అంతలు సేసి పోనడిచి యక్కట సంజయుచేతఁ జెప్పి పు  
త్తెంతురె? యిట్టి యూఱట మదిం బ్రియమందె యుధిష్ఠిరుండు దా  
నంతన యూళు లేవురకు నైదు సుయోధనుఁ డిచ్చు నొక్కొ? యీ  
కంత కృపావిహీనమతి నాతఁడు నొంచునె యన్నదమ్ములన్‌?

### [5.3.102](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.102)

చ. తన మును బడ్డ బన్నములుఁ దమ్ములపైఁ గల కూర్మి పేర్మి నీ  
జనపతి సైఁపకున్నె? యది సక్కన; రాజ్యము పాలులేక తీ  
ఱున కొడఁబాటు గల్గిన నెఱుంగమి వెట్టరె? ‘చాలరైరి వీ’  
రన రొకొ? నానలేమి యని యాడరె లోకమువారు కేశవా?

### [5.3.103](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.103)

శా. పెంపేదన్‌ దమకిట్టి తక్కువలు రూపింపంగ నేలా? విచా  
రింపన్‌ వారిక మేలు సంధి; దము వారిం జూచినం దారు సా  
ధింపం జాలరొ? కాక పోరఁ దగ మర్దింపం దలంపేని శం  
కింపం బట్టొకొ? వారు బ్రాహ్మణులె యే కీడైన సైరింపఁగన్‌?

### [5.3.104](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.104)

ఉ. ఓట యొకింత యేనియు సుయోధను చిత్తమునందు లేదు; నీ  
మాటలఁ బోవునే దురభిమానమ యెక్కుడు పూనుఁగాక; య  
చ్చోటన సంగరంబు లగు చొప్పులు వుట్టిననైనఁ బాండవుల్‌  
పోటున కిచ్చగింతురొకొ! పోదురొ కానల నుండ నచ్యుతా!

### [5.3.105](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.105)

ఉ. ఏ నిటులంటి నా వలవ; దింకను నీవును రాజుఁ దమ్ములుం  
గా నుచితంబు చూచి మన కార్యము మీసుజనత్వముం జెడం  
గా నొకభంగి సేయక తగం గురువర్గము తోడి సంధి మీ  
కైన తెఱంగునన్‌ వలచినట్టుల చేయుఁడు నేర్పు లేర్పడన్‌.

### [5.3.106](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.106)

వ. అని మఱియు నిట్లనియె.

### [5.3.107](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.107)

ఉ. ఆఱడిఁ బోకయున్‌ ఫలము నందుటయుం గని పల్కనేరమిన్‌  
మాఱట నోరి దాననయి మాటలు చిత్తమునందు నిల్ప కేఁ  
గాఱులు ప్రేలెదన్‌; వినుఁడు; కర్జము నెగ్గును గాన నల్కమై,  
వీఱిఁడి యైన మానిసికి వెండి వివేకము గల్గనేర్చునే?

### [5.3.108](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.108)

చ. వరమునఁ బుట్టితిన్‌, భరత వంశముఁ జొచ్చితి, నందుఁ బాండుభూ  
వరునకుఁ గోడలైతి, జనవంద్యులఁ బొందితి, నీతి విక్రమ  
స్థిరులగు పుత్త్రులం బడసితిన్‌, సహజన్ముల ప్రాపు గాంచితిన్‌  
సరసిజనాభ! యిన్నిటఁ బ్రశస్తికి నెక్కినదాన నెంతయున్‌.

### [5.3.109](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.109)

వ. అట్లుంగాక.

### [5.3.110](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.110)

ఉ. నీవు సుభద్రకంటెఁ గడు నెయ్యము గారవముం దలిర్ప సం  
భావన సేయు; దిట్టి ననుఁ బంకజనాభ! యొకండు రాజసూ  
యావభృథంబు నందు శుచియై పెనుపొందిన వేణి వట్టి యీ  
యేవురుఁ జూడఁగా సభకు నీడ్చెఁ; గులాంగన ని ట్లొనర్తురే?

### [5.3.111](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.111)

ఉ. ఆ సభ కేకవస్త్ర యగు నట్టి ననుం గొనివచ్చి నొంచు దు  
శ్శాసనుఁ జూచుచుం బతు లసంభ్రములై తగుచేష్ట లేక నా  
యాసలు మాని చిత్రముల యాకృతి నున్న యెడన్‌ ముకుంద! వి  
శ్వాసముతోడ నిన్‌ గొలువ వచ్చె మనం; బదియుం దలంపవే.

### [5.3.112](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.112)

చ. అరయమిఁ జేసి కోడ లన కప్పుడు దాసిగఁ జేసె; నమ్మహా  
పురుషుని పాలికిం బతులు వోవఁగ వీరలతోన యేను జె  
చ్చెరఁ జని కోటరంబు దగఁ జేయుదునో? యటుఁగాక పాడిమై  
వరవుడ మోపి చేయుదునొ వారికి మాధవ! నిశ్చయింపుమా!’

### [5.3.113](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.113)

వ. అని యట్లుగ్గడించి.

### [5.3.114](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.114)

ఉ. ద్రోవది బంధురం బయిన క్రొమ్ముడి గ్రమ్మన విడ్చి, వెండ్రుకల్‌  
దా వలచేతఁ బూని, యసితచ్ఛవిఁ బొల్చు మహాభుజంగమో  
నా విలసిల్లి వ్రేలఁగ, మనంబునఁ బొంగు విషాద రోషముల్‌  
గావఁగ లేక బాష్పములు గ్రమ్మఁగ దిగ్గన లేచి యార్తయై.

### [5.3.115](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.115)

వ. గోవిందు ముందటంబెట్టి యిట్లనియె :

### [5.3.116](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.116)

క. ‘ఇవి దుస్ససేను వ్రేళ్ళం | దవిలి సగము ద్రెవ్విపోయి దక్కినయవి; కౌ  
రవుల కడఁ దీఱుమాటల | యవసరమునఁ దలఁపవలయు నచ్యుత! వీనిన్‌.

### [5.3.117](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.117)

సీ. ఈ వెండ్రుకలు వట్టి యీడ్చిన యాచేయి | దొలుతగాఁ బోరిలో దుస్ససేను  
తను వింత లింతలు దునియలై చెదరి రూ | పఱియున్నఁ గని యుడుకాఱుఁగాక!  
యలుపాలఁ బొనుపడునట్టి చిచ్చే యిది; | పెనుగద వట్టిన భీమసేను  
బాహుబలంబును బాటించి గాండీవ | మను నొక విల్లెప్పుడును వహించు  
ఆ. కఱ్ఱి విక్రమంబు గాల్పనే? యిట్లు బ | న్నములు వడిన ధర్మనందనుండు  
నేను రాజరాజు పీనుంగుఁ గన్నారఁ | గానఁ బడయమైతిమేనిఁ గృష్ణ!

### [5.3.118](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.118)

ఉ. నెట్టన యిట్టియల్క మది నిల్పితి రక్కెస తాల్మిఁ జిచ్చొడిం  
గట్టిన యట్లు పెద్దయును గాలము దీనికి నాఱు టెన్నఁడుం  
బుట్టదు దుష్టనిగ్రహము పూని జగంబులు గాచునట్టి తోఁ  
బుట్టువు తీవ్ర తేజమునఁ బొల్చిన భర్తలు గల్గ నచ్యుతా!’

### [5.3.119](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.119)

వ. అనుచు నెలుంగు రాలుపడ నేడ్చిన యాజ్ఞసేనిం గృపాయత్తచిత్తుండయి నారాయణుం డూరార్చి కూర్చుండ నియమించి కన్నీరు దుడువను బెన్నెఱివేణి ముడువనుం దగువారి నియోగించి య మ్మానినితో నిట్లనియె:

### [5.3.120](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.120)

ఉ. ‘మ్రుచ్చిర నేల యేఁ గలుగ? ముద్దియ! నాకు వృకోదరుండు వి  
వ్వచ్చుఁడుఁ దోడుగాఁగ జనవంద్యుఁడు ధర్మసుతుండు పంప నీ  
మెచ్చుగ శత్రు సంక్షయము మేకొని చేసెదఁగాక! వేఱొకం  
డచ్చుపడంగ నేర్చునె? దురాత్ములు కౌరవు లుర్వి యిత్తురే?

### [5.3.121](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.121)

క. లలనా! యుడుగుము నీ యే | డ్పుల కొలఁదియె కురునృపాల పుత్త్ర కళత్రం  
బుల యేడ్పు; లింక వానిం | గలకల నవ్వుచు వినంగఁ గాలం బయ్యెన్‌.

### [5.3.122](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.122)

క. యమ మహిష ఘంటికా నా | దము వినఁ గౌతూహలంబు దళుకొత్తెడు చి  
త్తములు గల కౌరవుల కి | ష్టము లగునే సంధికార్య శాంతవచనముల్‌?

### [5.3.123](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.123)

క. మొదల విధినియతియును న | ట్టిద యందురు పెద్ద; లది ఘటింపకపో దే  
మదిఁ జూచి చెప్పినను ద | ప్పదు మేరువు దిరిగెనేనిఁ బాంచాలసుతా!

### [5.3.124](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.124)

తే. పూని పలికెద వినుము రిపు క్షయంబుఁ | జేసి యుజ్జ్వల పుణ్యలక్ష్మీ సమేతు  
లైన పాండు కుమారుల యధిక విభవ | మీవు సూచెదు; తడవులే; దిది నిజంబు!

### [5.3.125](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.125)

క. అని యూఱడిలఁగఁ బలికిన | విని యంకిలి దేఱు చిత్తవృత్తిగలుగు నం  
గన యే డ్పుడిగెం; దగ ఫ | ల్గునుఁ డిట్లని పలికె నపుడు గోవిందునితోన్‌.

### [5.3.126](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.126)

తే. ‘పాండవులు ధార్తరాష్ట్రులుఁ బుండరీక | నేత్ర ! చుట్టరికంబున నీకు నొక్క  
రూప; కావునఁ గోరి యేరూపునందు | నుభయపక్షంబులకుఁ జేయు ముచితహితము.

### [5.3.127](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.127)

క. ధర్మార్థ సంగతంబుగ | ధర్మతనయు చెప్పినట్ల తగఁ బల్కఁగ నా  
దుర్మతులు కౌరవులు స | త్కర్మమునకుఁ జొరకయున్న దైవమ యెఱుఁగున్‌.

### [5.3.128](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.128)

క. అన విని ‘కౌరవులకు మీ | కును హితముఁ బ్రియంబుఁ జేయఁ గోరియ కుంతీ  
తనయాగ్రజుపని ధృతరా | ష్ట్రుని కడకుం బోయెదను గడుం బ్రీతిమెయిన్‌.

### [5.3.129](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.129)

క. అని పలికిన హరి ధర్మ వ | చనముల తెఱఁగున కజాతశత్రుఁడు చిత్తం  
బునఁ బొంగి ‘యట్ల చేయుము | మన నిశ్చయ మిదియ దీని మఱవకు మనఘా!’

### [5.3.130](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.130)

వ. అని కార్యంబు నిశ్చయించి దినశుద్ధి నిరూపించి నారాయణుం జూచి ‘నీ నక్షత్రంబు రోహిణిగదా యెల్లి రేవతి నీకుఁ జంద్ర తారాబలంబులు గలవు; గమనంబునకు రేపకడయ మేలు; పయనం బగుట లెస్స’యని చెప్పిన నప్పలుకుల కతండు సగౌరవంబుగా నియ్యకొనినం బాండవాగ్రజుండు కొలువుం గలయం గనుంగొని యెల్లవారును విన నది యట్లకాక యని పలికి తదనంతరంబ తానునుం దమ్ములుఁ బాంచాలియుఁ బరివారంబును నుచిత ప్రకారంబున నిజనివాసంబులకుం జనిరి; మఱునాఁ డరుణోదయంబునఁ గృష్ణుండు గాలోచిత కృత్యంబులు నిర్వర్తించి సూర్యోపాస్తి సేసి యగ్ని సమారాధనం బాచరించి ధరణిసురులం బ్రణామపూర్వకంబుగాఁ బ్రయాణ దాన ప్రముఖ పూజావిశేషంబులం బ్రీతులం గావించి వారల యిచ్చు నాశీర్వాదంబులును సమంత్రాక్షత దూర్వాంకురాదులునుం గైకొని యుచిత ప్రదేశంబున నుండి సాత్యకి రావించి.

### [5.3.131](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.131)

క. ‘మన ప్రజలోఁ గరిపురికిం | జనుదేరఁగ వలయువారి సవరణతో రం  
డని యేర్పడ నియమింపు ప | యనమై యేతెమ్ము నీవు’ నని తగ మఱియున్‌.

### [5.3.132](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.132)

వ. ‘దుర్యోధనుండు దుష్టాత్మకుం; డతని మన్నించు మానుసులునుం గుటిలబుద్ధులు గావునఁ జక్రగదా ద్యాయుధంబులు రథంబునం బెట్టింపవలయు’ నని చెప్పి పనిచి సమయజ్ఞతం బొడసూపి నిలుచున్న దారుకుం జూచి తేరు పూన్ప నియోగించిన, నతండును మణిగణ ప్రభాపటల జటిలంబగు నరదంబు వన్ని శైబ్య సుగ్రీవ మేఘపుష్ప వలాహకంబు లనంబరఁగు తురంగంబులం బూన్చి గరుడధ్వజం బెత్తి తెచ్చినం దానునుం బయనంపుఁ జందంబునఁ గట్టాయితంబై జనంబుల చూడ్కులకుం బండు వగుచుఁ బుండరీకాక్షుండు మంగళ తూర్యంబులు సెలంగఁ జామరంబు లుల్లసిల్ల రథం బెక్కిన యవసరంబున యాదవ పరివారంబుతో నరుగుదెంచిన సాత్యకిం దన రథం బెక్కించుకొని యాంగికంబులైన శుభ సూచకంబులు గైకొనుచుఁ బూర్ణ కలశ వృషభాది భద్రపదార్థంబుల నవలోకించుచుఁ బుణ్యాంగనలు సేసలొలుకఁ జిత్తంబు ప్రసన్నతం బొంద వెడలునప్పుడు.

### [5.3.133](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.133)

సీ. పాండవ యాదవ పాంచాల కేకయ | పాండ్య మాత్స్యాదులు భద్రదంతి  
హయరథంబులతోడ నతికుతూహలమున | వచ్చినఁ గనుఁగొని వారినెల్ల  
సంభావనంబుల సంభాషణంబుల | నాదరించుచుఁ దగ నల్ల నల్ల  
విభవంబు మెఱయంగ విడిదల పఱపెల్లఁ | గడచిన యత్తఱిఁ గరము శుభము  
ఆ. లైన శకునములకు నందఱుఁ బ్రియమంద | నరుగుచున్నయట్టి యవసరమున  
రథము రథముఁ గదియ రా నిచ్చి ధర్మనం | దనుఁడు నెమ్మి నిట్టు లనియె హరికి.

### [5.3.134](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.134)

ఉ. ‘వచ్చె జనార్దనుం డనిన వార్తకుఁ బ్రాణము మేనికంతకున్‌  
వచ్చిన సేదఁ దేఱుఁ గురువంశ పవిత్రచరిత్ర గొంతి నీ  
వచ్చటి కేఁగి పాండవుల యందఱ మాఱనిచెప్పి మ్రొక్కుచున్‌  
గ్రుచ్చియ కౌఁగిలించుకొని కుందిన చిత్తము నొప్పి దీర్పుమీ!

### [5.3.135](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.135)

చ. అడవికి నేఁగునాఁడు మము నంపఁగ నెంతయు దవ్వు వచ్చిన  
ప్పుడు దనమోము దైన్యమునఁ బొందెడు నశ్రులుఁ జూచి చూచి య  
ట్లొడఁబడి డించిపోవలసె నుమ్మలికమ్మున గొంతి యింతకుం  
బడుగయి పాలలోఁ బడిన బల్లి విధంబున నుండకుండునే?

### [5.3.136](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.136)

క. లక్కయిలు కాలినది మొద | లక్కట! మా తల్లి మాకునై నెవ్వగతోఁ  
బెక్కిడుమలఁ బడుచున్నది | దిక్కెవ్వరు లేనియట్లు దీనత్వమునన్‌.

### [5.3.137](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.137)

క. ఏ ననుట గాఁగ దుఃఖము | లైనవి దెగు సమయ మయ్యె నని చెప్పుము; మీ  
మేనత్త నూఱడింపుము; | దా నెప్పుడు నీవు గలవు తన కనుచుండున్‌.’

### [5.3.138](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.138)

వ. అని చెప్పి వెండియు.

### [5.3.139](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.139)

ఆ. ‘గురుఁడు బాహ్లికాది కురువృద్ధులును సుహృ | ద్బాంధవులు నశేష ధరణిపతులుఁ  
బ్రీతిఁ బొంద నెవ్వరికి నేది దగుఁ బ్రణా | మాది విధుల నడపు నాదుపలుకు.

### [5.3.140](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.140)

క. పరమ ప్రియమున నాకై | పరిరంభణ సేసి గాఢ బాంధవ సాంద్రా  
దరమున సంభాషింపు వి | దురుతో; మధ్యస్థుఁడగు హితుం డతఁ డనఘా!’

### [5.3.141](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.141)

వ. అనియెఁ దదనంతరంబ యర్జునుండు.

### [5.3.142](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.142)

చ. ‘జనులు వినంగ రాజ్యమున సాము గొనంగలవారమన్న యీ  
జనపతి కార్యనిశ్చయము సమ్మతి గైకొని చేసినన్‌ సుయో  
ధనుఁడును దమ్ములున్‌ సఖులు దానికి నేమును నియ్యకొందు మొం  
డనిన సపుత్త్రమిత్త్రముగ నద్దెస నందఱ గ్రొచ్చి పాఁతుదున్‌.’

### [5.3.143](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.143)

మ. అనినన్‌ మెచ్చి వృకోదరుం డితఁడు కార్యం బింత దెల్లంబుగాఁ  
బొనరం బల్కునె?’ యంచుఁ బేరెలుఁగు సొంపుం బొంద వక్త్రంబు పొ  
ల్పున దర్పం బొలయంగ నంగములునుం బొంగార నుద్‌బృంహిత  
ధ్వనియై పొల్చు మహోగ్ర సింధురము చందం బొంది యొప్పెం గడున్‌.

### [5.3.144](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.144)

క. నకుల సహదేవులును దా | నికి సంతసమంది ‘యిట్లు నెయ్యము కయ్యం  
బొక తెఱఁగు సేసికొని తడ | యక ర మ్మని పలికి రప్పు డచ్యుతుతోడన్‌.

### [5.3.145](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.145)

వ. ఇవ్విధంబునం బాండునందను లందఱును గోవిందునకు వలయు మాటలు సెప్పి ‘యతనిఁ గౌఁగిలించికొని యథోచిత ప్రకారంబుల వీడుకొని వలగొని మగిడిరి; తక్కినవారలు నర్హంబులగు తెఱంగుల నామంత్రితులై మరలిరి; మాధవుండును బ్రయాణ సర్వ సంభార నిర్వాహకులం గలయం గనుంగొని తగిన సల్లాపంబులు సేసి, కరినగరంబు పెం దెరువుఁ గైకొని దారుకుని చతురత్వంబునఁ దురంగంబుల పటుత్వంబున నత్యంత సమీచీనంబైన యానంబున మనం బలరం జనిచని, యొక్కయెడ నారద జమదగ్ని కణ్వాదులగు మహామునులం గొందఱం గని రథంబు డిగ్గి నమస్కరించి సభక్తి తాత్పర్యంబునఁ గుశలం బడిగి, మీ రిక్కడకు, విజయంచేయుటకుఁ గతం బేమి? సేయంగల పని యెయ్యది? నా కానతిం’ డనిన నారాయణునకు నారదుం డిట్లనియె.

### [5.3.146](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.146)

సీ. ‘అనఘ! పుణ్యాత్ముఁడ వగు నిన్నుఁ గనుఁగొనఁ, | గౌరవసభ నీవు గారవమునఁ  
బలికెడి పలుకుల భంగు లాకర్ణింప, | విదుర భీష్మాదులు విను తెఱంగు  
నుత్తరం బిచ్చు కార్యోక్తులు నెఱుఁగంగ | వేడుక వచ్చిరి వీరలెల్ల’  
నని చెప్ప విని ‘లెస్స, యట్ల చేయుదురుగా’ | కని హరి వల్కిన నమ్మునీంద్రు  
తే. లతని దీవించి ‘నీవు పొ; మ్మచటి కేము | నరుగుదెంచెద’మని ప్రీతి ననుప నరిగి  
యొక్క పుణ్యాశ్రమంబున యొద్ది యేట | విడిసి దివస ప్రవర్తన విధులు నడిపి.

### [5.3.147](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.147)

వ. కమలనాభుండు గదలిపోయి సూర్యాస్తమయ సమయంబునఁ గుశస్థలంబు సేరం జనునప్పు డందలి విప్రు లెదురు వచ్చి కాంచి నిజనివాసంబులకుం బిలిచినం బ్రసన్నవదనుండగుచు సమ్మర్దంబు వలవదని పలికి విశాల రమణీయంబైన బహిరంగణంబునం బటకుటీర ప్రకరం బెత్తించి విడిసి, తగువారును దానును వారల గృహంబుల కరిగి యభ్యాగత పూజలు గైకొని వారిని సంభావించి విడిదలకుం జని సమయ సముచిత వృత్తిం బ్రవర్తిల్లుచుండె; నంత నక్కడ;

### [5.3.148](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.148)

తే. వార్త విని యాక్షణమ కౌరవక్షితీశ్వ | రుండు గాంగేయ గురు విదురులను బుత్త్రు  
సంజయునిఁ గర్ణు సైంధవు శకునిఁ బిలువఁ | బనిచి తా నిట్టు లనియె నందనునితోడ.

### [5.3.149](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.149)

వ. ‘కృష్ణుఁడు పాండవ కార్యార్థంబుగా మనయొద్దకు వచ్చుచున్నవాఁడు; నేఁడు కుశస్థలంబున విడిసె రేపిందులకు వచ్చునని వింటి; మిట్టి యాశ్చర్యంబునుం గలదే! సర్వలోకాభిగమ్యుండగు నమ్మహానుభావునకు మన మభిగమ్యుల మైతిమి; మన కింతకంటెను బెంపెయ్యది? యతం డెవ్వరివలన సంతుష్టుండయ్యె వారికి శుభంబును, నెవ్వరిదెస ననాదరంబు సేసె వారికి నశుభంబు నగుటదప్ప; దతనికి వలయు పూజ లాచరించుటకు సంవిధానంబు సేయుము; గృహాలంకరణాది మంగళప్రకారంబు లనుష్ఠింప నియమింపు; మతని చిత్తంబునకు నీ విభవంబును దనమీఁది ప్రియంబునుం దోఁచునట్టి తెఱంగున సమస్తంబును సమకట్టుము.

### [5.3.150](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.150)

క. అనిన ధృతరాష్ట్రు పలుకులు | గొనియాడిరి సంతసిల్లి గురుఁడును భీష్ముం  
డును నౌఁగాకని దుర్యో | ధనుడుం బరిచారక ప్రతతిఁ బిలిపించెన్‌.

### [5.3.151](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.151)

వ. ఇట్లుచిత పరివారంబు రావించి యతండు.

### [5.3.152](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.152)

క. ‘అలుకుఁడు మృగమదమున, మ్రు | గ్గులు వెట్టుఁడు గప్పురమునఁ, గుంకుమమున గో  
డలు పూయుఁడు’ మణిదామక | ములు గట్టుఁడు పెద్ద కూటమున సొంపారన్‌.

### [5.3.153](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.153)

వ. మఱియు నగరెల్లను శోభిల్ల నలంకారంబు సేయుండు.

### [5.3.154](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.154)

క. పెనుపుం జతురత మెఱయఁగ | మన యింటను దుస్ససేను మందిరమున శో  
భనశిల్పము లొనరింపుఁడు | చనుఁడు వృకస్థలమునందుఁ జప్పరము లిడన్‌.

### [5.3.155](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.155)

వ. అది విడి పట్టు గాఁదగియెడు ప’ ట్టని పలికి ‘వాసుదేవుండు రేపకడయ వచ్చునంతకుమున్న యింతయుం గావింపవలయు’ నని పనిచి పురంబున నుత్సవంబు సాటుండని నియోగించి వివిధ గంధ మహిత మాల్యంబులు సంపాదింపను మణిభూషణ చిత్రాంబరంబులు సమకట్టను సరసాన్నస్వాదు పాన ద్రవ్యంబు లొడఁగూర్పను నేర్పరులగు తద్‌జ్ఞుల నియమించె; నట్టి యెడ నాంబికేయుండు విదురున కిట్లనియె:

### [5.3.156](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.156)

క. ‘వివిధ మణిమయ రథంబులు | జవనాశ్వంబులును భద్రసామజములు ర  
త్న విభూషణములు దాసీ | నివహంబులుఁ జాలఁ గృష్ణునికి నే నిత్తున్‌.

### [5.3.157](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.157)

క. మన యింట సుయోధను గృహ | మున దుశ్శాసను నికేతమున నెయ్యది యా  
తని చూడ్కి కించు నదియె | ల్లను గౌరవమొప్ప నీవలయు మన మనఘా!’

### [5.3.158](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.158)

చ. అన విని యాతఁ డిట్లనియె ‘నంబుజనాభునిఁ బ్రీతుఁ జేయు కం  
టెను హితమైన కృత్య మొకటిం గలదే? యది మేలు; పాండునం  
దనులకు నైదయూళ్ళు లుచితస్థితి నిచ్చుట కోపమన్న యు  
న్కిన యిటు లోపు కల్మి ధరణీవర! యేమిట వచ్చెఁ జెప్పుమా!

### [5.3.159](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.159)

ఉ. నీ తలఁ పేను గంటి నొకనేర్పున శౌరికి లంచమిచ్చి సం  
ప్రీతునిఁ జేసి, కార్యగతి భేదము సేయఁగఁ జూచె; దింత బే  
లైతిగదే! సుమేరు సదృశార్థముఁ జూచియుఁ బార్థుఁ బాయునే?  
యాతఁడు? క్రీడి భక్తియును నచ్యుతు పెంపును నీ వెఱుంగవే?

### [5.3.160](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.160)

తే. అర్జునుఁడు ప్రాణతుల్యుండు హరికి నట్లు | గాన జలపూర్ణ మంగళ కలశమునకుఁ  
బాద్యమునకును గుశలసంప్రశ్నమునకు | మిగుల నొండు జనార్దను మెచ్చుగాదు.

### [5.3.161](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.161)

క. మన కడకు నేమి కార్యం | బునకై యాతండు వచ్చెఁ బూనికిమెయి నా  
పని వంచింపక చేయుట | విను మతనికిఁ బ్రియము; తక్కువేయును నేలా?’

### [5.3.162](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.162)

వ. అనిన విని దుర్యోధనుండు దండ్రి కిట్లనియె:

### [5.3.163](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.163)

క. ‘అది విదురు చెప్పినట్టిద | తుదిఁ గృష్ణుఁడు పాండుసుతులతో వేఱగునే?  
పదనెఱుఁగ కీఁగియిచ్చిన | బెదరి రనరె యొచ్చెమైనఁ బిమ్మట నగరే!

### [5.3.164](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.164)

ఆ. అతఁడు పూజనీయుఁ డగు; నే నెఱుంగుదు; | నైన ధనము లీఁగి యనదతనము  
వచ్చుఁ; బెచ్చు పెరిఁగి వైరులు గర్వింతు; | రేల పగ యడంగు నిట్టులైన?’

### [5.3.165](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.165)

క. అనవుడు భీష్ముఁడు ధృతరా | ష్ట్రున కిట్లను ‘నీవునుం గొడుకు నేమే ని  
చ్చిన నొకటి యీగి లేకు | న్నను వేఱొక్కటి దలంచునా కేశవుఁడున్‌.

### [5.3.166](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.166)

క. విను, మతఁడు సేయఁబూనిన | పని దప్పింపంగరాదు పాండవులం దే  
ర్పను గృష్ణుఁడు వెరవుగఁ జొ | చ్చిన మే లాపురుషు పనుపు సేయుము పుత్త్రా!

### [5.3.167](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.167)

క. నారాయణుండు ధర్మా | ర్థారూఢము గాఁగఁ బలుకు నది నీవును నీ  
వారును గైకొని యెంతయు | గారవమునఁ జేయ నెల్ల కార్యంబు నగున్‌.’

### [5.3.168](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.168)

క. అనుటయు సుయోధనుఁడు భీ | ష్మున కిట్లనుఁ ‘బాండురాజు సుతులకు నిమ్మే  
దిని హరి సగపా లీఁ దగు | ననుఁ బో, యే నీను, గాని యది యట్లుండెన్‌.

### [5.3.169](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.169)

వ. వేఱొక కార్యంబు సేయం దలంచితి; నది వినుము! పాండవులకు నేడుగడయు జనార్దనుం; డతనింబట్టి బంధించిన ఱెక్కలు విఱిగిన పులుఁగులుం బోలె వారు నాకు విధేయు లగుదురు; పాంచాల యాదవాదులైన తదీయ బంధు మిత్రులు నా వశంబున వర్తిల్లుదురు; సమస్త దేశంబులు నేన యేలుదు; దీనికిం దగిన యుపాయ సహాయంబు లనువు సేసెద; నీవింక నేమి సెప్పెదవు చెప్పుమనిన విని యతిఘోరంబగు నవ్విచారంబునకు నమాత్యసహితంబుగా సంతప్తచిత్తుండై వైచిత్రవీర్యుండు కొడుకున కిట్లనియె:

### [5.3.170](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.170)

క. ‘ఓహో! యిట్లనుట జగ | ద్ద్రోహం; బిమ్మాట మఱవు; దూతత్వంబున్‌  
మాహాత్మ్యంబును ధర్మో | త్సాహంబును విను మబాధ్యతకుఁ గారణముల్‌.

### [5.3.171](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.171)

క. ఈ కారణములు గలవను | నా కొలఁదియె వాసుదేవుఁ? డదిగాకయుఁ గీ  
డే కురువంశమున కతని | రాక? యతం డేమి సేసెరా పాపాత్మా!’

### [5.3.172](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.172)

వ. అని యదల్చె నప్పుడు గాంగేయుం డాంబికేయున కిట్లను ‘నీ కొడుకు ప్రాణగొడ్డంబైన కార్యంబు సేయందలంచె దామోదరు నిట్లు సేయం జూచెనేనిం దానును దనవారును వినాశంబుఁ బొందుదు; రింతియ; యిది సేసిరి సేయరైరి యమ్మహాత్మునెడ నీయపరాధంబు విచారించిన దుష్టాత్ములు నష్టాత్ముల కాక, యని పలికి యేనిట్టిదాని వినంజాల’ ననుచు మొగంబు గంటువెట్టుకొని దిగ్గన లేచిపోయె, ధృతరాష్ట్రుండును దుర్యోధనునితో ‘నిటువంటి కొఱగాములు మనంబునం దలంచినప్పుడు సేయంగలవాఁడవు గావున దీనం జేటువచ్చు నుడుగుమయ్య’ యనిచెప్పి యతనిం దక్కినవారినిం బోవంబనిచి తగిన వర్తనంబున నుండె; మఱునాఁడు.

### [5.3.173](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.173)

సీ. కాలోచితములగు కరణీయములు దీర్చి | కమలనాభుఁడు రేపకడయ కదలి  
తనుఁ గుశస్థలవాసు లనుప రా నందఱ | నాదరంబున నిల్పి యరుగునపుడు  
గజ్జంబులును బండ్లు గంధమాల్యంబులు | ధృతరాష్ట్ర సుతుఁడు పుత్తేరఁ బ్రీతి  
నెడ నెడఁ గొనివచ్చి యిచ్చిన వాని నె | ల్లను వేడ్క ననుభవించిన విధంబు  
తే. సలిపి, యనుభవ మొల్లక చనఁగ, నెదుర | బాహ్లిక ద్రోణ భీష్మాది బంధుమిత్త్ర  
గణము సర్వభూపాల లోకంబుఁ గురుకు | మార వర్గంబుఁ బుత్తెంచె మనుజవిభుఁడు.

### [5.3.174](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.174)

వ. ఇట్లు దుర్యోధనుం డొక్కరుండు దక్కనెల్లవారిం దూర్యాది శోభన పదార్థంబులు సమకట్టి ధృతరాష్ట్రుండు వనుప నెదుర్కొనిన వాసుదేవుండు వారల నందఱ నయ్యైతెఱంగుల సంభావించి, కృతవర్మ దమవాఁడు గావున నతనికి సవిశేష స్నేహంబు సేసి, యతండు సేరువరా సమస్త జనంబులుం బరివేష్టింపం జని తన రాకకు నలంకృతంబును బ్రమోద చాపల సుభగ జనంబును నైన పురంబు సొచ్చి, రాజమార్గంబున నరుగు నవసరంబున మౌక్తిక మిళితంబులు బహుగంధ లుళితంబులు నగు నక్షత ప్రకరంబులును బుష్ప నికరంబులునుం జల్లుచు సంతసిల్లుచు మ్రొక్కుచుఁ జొక్కుచు నిరుగెలంకుల రమ్యహర్మ్యంబులపై నిలిచి పొలిచి కనుంగొను నంగనాజనంబులు తమలోన.

### [5.3.175](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.175)

సీ. ‘ప్రాణంబుతోఁ గూడ రక్కసి చన్నుల | పాలు ద్రావిన ప్రౌఢబాలుఁ డితఁడె!  
వ్రేల్మిడిఁ జాణూరు విఱిచి లోకముల మె | చ్చించిన యా జగజెట్టి యితఁడె!  
దుర్వృత్తుఁడగు కంసుఁ దునిమి యాతని తండ్రిఁ | బట్టంబు గట్టిన ప్రభు వితండె!  
సత్యభామకుఁ బారిజాతంబుపైఁ గల | కోర్కిఁ దీర్చిన రసికుం డితండె!  
తే. వెన్నలును గోపికాచిత్త వృత్తములును | నరసి మ్రుచ్చిల నేర్చిన హరి యితండె!  
శ్రుతిశిరోభాగములఁ దన సుభగచరణ | సరిసిజామోదమును గూర్చు చతురుఁ డితఁడె!

### [5.3.176](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.176)

వ. అనుచు నతి కుతూహలంబున నవలోకింప నాబాలవృద్ధంబగు పౌరలోకం బాలోకన కౌతుకంబునఁ దన రథంబు గదిసిన సందడి జడియు వేత్రహస్తుల వారించుచు నారాయణుండు సమ్మర్ద మందగమనంబునం జని మణితోరణ సుందరం బగు రాజమందిర ద్వారంబు ప్రవేశించి కక్ష్యాంతరంబులు గడచి యేనుంగు మొగసాలఁ జొచ్చి యరదంబు డిగ్గి యల్లన నడచునప్పు డంతకు మున్నయరిగి భీష్మద్రోణ ప్రముఖులగు తగు వారలు ధృతరాష్ట్రునిం బొదువ నతండుఁ బ్రత్యుత్థానంబు సేసి విదుర సంజయ సహితంబుగా నెదుర్కొనం జేరి.

### [5.3.177](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.177)

ఆ. అతనిఁ గౌఁగిలించి యచ్చటఁ గల విదు | రాది శిష్టజనుల నాదరార్ద్ర  
బంధు దృష్టిఁ జూచి పరిరంభ సంభావ | నము లొనర్చి శౌరి ప్రమద మెసఁగ.

### [5.3.178](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.178)

వ. వార లందఱకును సాత్యకిని దగిన సమాచారంబులు నడపం బనిచె; నటమున్న ధృతరాష్ట్రు పనుపునం దెచ్చి పెట్టిన నచ్చోటన యున్న యున్నత కనకాసనంబున నతం డునుప నాసీనుం డయ్యె; నవ్వాసుదేవునకు విహితానుష్ఠాన పరాయణు లగు నగరి పురోహితులు రాజానుమతంబున నర్ఘ్యపాద్య మధుపర్కాద్యుపచారంబు లాచరించి యతని తమ్ముని నర్హపీఠంబున నునిచి యర్చించిరి; నరనాథుండును దొరలును నిజోచితాసనంబుల నుండిరి; కొలువెల్లను సూర్యోదయ సమయంబునఁ గమలాకరంబు విధంబున వికసించి యుండె నయ్యవసరంబునఁ గృష్ణుండు ధర్మనందను వచనంబులుగా నాంబికేయునకుం దగువారలకుం బ్రణామ పరిరంభణ ప్రముఖ సముచిత సంభావనంబులు వలికి సంభాషణంబులకుం జొచ్చి.

### [5.3.179](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.179)

క. రాజునకుఁ దియ్య మెసఁగెడు | పూజా వచనముల నెయ్యపుంబలుకులఁబే  
రోజ మెయి బంధుమిత్ర స | మాజములకు మేలములఁ గుమారులకుఁ దగన్‌.

### [5.3.180](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.180)

వ. ఇంపు వుట్టించుచుఁ గొండొకసేపు నిలిచి పుండరీకాక్షుండు విదురు సదనంబునకుం జనియెద మఱియుఁ బోవలయు నెడలకుం బోయి వచ్చెద’ నని పలికి యాంబికేయుననుమతి వడసి యరుగ, విదురుండు ససంభ్ర మంబునం గడచిచని మంగళోపచార సహితంబుగా నెదుర్కొని భయ భక్తి వినయ స్నేహానందంబులఁ గందళితుం డగుచు గోవిందునకు దేవోపచారంబుల ననేక ప్రకారంబుల నర్చన లిచ్చి, కౌంతేయుల కుశలం బడిగిన నతనికి వారలవృత్తాంతంబు సమస్తంబును సవిస్తరంబుగాఁ జెప్పిన యనంతరంబ.

### [5.3.181](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.181)

క. ముదమునఁ గృష్ణుఁడు కుంతీ | సదనమునకుఁ జనియె; నపుడు సమ్మదమున న  
వ్విదురుం ‘డోగిర మొనరిం | చెద’ నని తన్నడుగ ‘నట్ల చేయుం’ డనుచున్‌.

### [5.3.182](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.182)

వ. చని కాంచిన నద్దేవియు నతని తోడు నీడయుంబోని తన కొడుకులం దలంచి యడలు వుట్టిన నమ్మాధవు మెడ వట్టికొని యెలుంగెత్తి యేడ్చిన, నతండు సంబోధించి యూరార్ప నెట్టకేలకు నుడిగి యాతనికి నాసన విన్యాసనాద్యుపచారంబులు చేయించి తత్సమీపంబున నుచిత పీఠంబునం గూర్చుండి గద్గద కంఠంబుతో నిట్లనియె.

### [5.3.183](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.183)

సీ. ‘నీ శిక్షఁ బెరుఁగుట నీతిమంతులుఁ బుణ్య | పరులు శూరులు గదా పాండుసుతులు  
సుఖవృత్తిఁ బెక్కండ్రు సూరెలఁ గొలువ నుం | డెడువార లిడుమలఁ బడుచు నిర్జ  
నంబైన కానలోనన యెట్లు నిలిచిరి? | ననుఁ బెట్టి నాయెదఁ గొనుచుఁ జనిరి  
యేను వడ్డింపంగ నింపారఁ గుడిచి మె | త్తని సెజ్జ నిద్రించి వినుతభద్ర  
తే. గాన కరి బృంహితముల మేల్కాంచునట్టి | వారు కందమూలంబు లాహారములుగఁ  
బొదలఁ బుట్టలఁబడి యుండి పులుఁగు మెకము | లఱవ మేల్కనుచుండిరే యక్కటకట!

### [5.3.184](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.184)

ఆ. తండ్రిలేని ప్రజలు తల్లిని బాసి పె | ద్దయునుగాల మివ్విధమునఁ బడిరి  
భంగపాటు దుఃఖపాటును సంకట | పాటు గలిగె విరటు పాలఁ బిదప.’

### [5.3.185](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.185)

వ. అని వెండియు.

### [5.3.186](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.186)

ఉ. ‘దానదయాపరుం డయిన ధర్మతనూభవు సేమ మెట్లు? పం  
చాననవిక్రముం డగు బకారికి భద్రమె? యస్త్ర శస్త్ర వి  
ద్యానిపుణుండు క్రీడి సుఖియా? వినయాభరణుల్‌ గవల్‌ సమా  
ధాన సమేతులే? యకట! ద్రౌపది సాధ్వి; సుఖంబె దానికిన్‌?

### [5.3.187](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.187)

చ. కొడుకుల కంటె నయ్యనుఁగుఁ గోడలి కెక్కుడు గూర్తుఁ గోడలుం  
గొడుకులు సేయు భక్తి కట కోటి మడుంగులు భక్తి నాకు నె  
ప్పుడుఁ దగఁ జేయుచుండు నది పుణ్యచరిత్ర కులాగ్రగణ్య క్రొ  
త్తడి సకలంబుఁ జూడ సభ దైన్యముఁ బొందుట సూచి పొక్కితిన్‌.

### [5.3.188](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.188)

తే. నాఁడు ద్రౌపది వడిన బన్నములు సూడ | నోర్చినప్పుడ యెంతకు నోర్వఁ జెపుమ  
యంత గడచిన దుఃఖంబు లనుభవింపఁ | గలవె లోకంబువారికిఁ గమలనాభ!

### [5.3.189](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.189)

వ. అట్టి యెడ.

### [5.3.190](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.190)

క. విదురుం డొక్కఁడు దక్కఁగ | సదస్యు లెవ్వరును ధర్మసంక్షయ మిది కూ  
డదు నార; యతని శీలమ | కుదు రీ లోకమున కింతకుం దలఁపంగన్‌.”

### [5.3.191](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.191)

వ. అని యివ్విధంబునఁ గృష్ణుతోడఁ దన యుమ్మలికంబు లన్నియుఁ ద్రవ్వికొని శోకంబు వెల్లిగొనఁ గొండొక దిగం బాఱెడు చిత్తంబుతో మఱియు నిట్లనియె;

### [5.3.192](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.192)

క. ‘ఇది యెల్లను నొకతల; యీ | పదు మూఁ డేఁడులును నాకు బావకొడుకుచే  
నదయమగు కూడుగుడుచుట | యది యొక తలయయ్యె; నేమి యనఁగల దనఘా!

### [5.3.193](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.193)

క. తన్నుఁ దన తమ్ములను నా | కన్న కొడుకు లట్ల తలఁతుఁ గాని విభేదం  
బెన్నఁడు నా మది లేమికి | వెన్నుఁడ దైవంబు సాక్షి వినుము పలికెదన్‌.

### [5.3.194](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.194)

క. ఇది నిక్కం బగునేనియుఁ | దుది నీవుం బాండవులను దురితరహితులై  
ముదమందఁ జూడఁగనియెద; | నది దీనికి మందు సువ్వె యంబుజనాభా!

### [5.3.195](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.195)

సీ. బావ యొప్పం డనుపలుకుల నేమగు? | నాతని కొడుకుఁ గీడాడనేల?  
కురువృద్ధుఁడగు బాహ్లికుని దూఱ నేటికి? | భీష్మునిపైఁబ్రయి వెట్టనగునె?  
యిట్టి క్రూరుల యింటి కిచ్చిన మనవారి | నందుఁగా కట్లు దాననుటమేలె?  
యర్జును పుట్టిన యప్పుడు ‘వీఁడు లో | కము లెల్ల గెల్చు పొగడ్త మొగులు  
తే. ముట్టు నట్టిద యగు, రణమున జయించు | గౌరవుల; సోదరులుఁ, దాను భూరి రాజ్య  
గౌరవముఁ బొందు’ నని యశరీరవాణి | వలికె; నది తిట్టువడుఁగాక వలయునేని.

### [5.3.196](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.196)

వ. ధర్మంబు గలుగునే నది నిక్కంబయ్యెడు; దాని కెల్లను నిర్వాహకుండవు నీవు గలవు గాదె! నీ మన్నించు నెచ్చెలులకుం జెప్పెడు మాటలు గలవు విను; మయ్యుధిష్ఠిరునితో నిట్లనుము;

### [5.3.197](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.197)

క. వేఁడికొని కృపణులై కను | పోఁడిమి యది యేల రాజపుత్రులు దమ మై  
వాఁడిమి దప్పిన నిప్పులు | వేఁడిమి సెడినట్లు జనులు విని యులుకుదురే?

### [5.3.198](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.198)

వ. భీమార్జునుల కిట్లని చెప్పుము:

### [5.3.199](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.199)

ఆ. కొడుకుఁ గాంచు రాచకూఁతు రెద్దానికి? | నట్టిపనికి నుచితమైన సమయ  
మొదవెఁ; దడయుటింక నొప్పదు; జనములు | నట్లుగాని పురుషు లనరు మిమ్ము.

### [5.3.200](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3.200)

క. భుజ బలమున జీవించుట | నిజధర్మము మెత్తఁబడుట నింద్యము; మాద్రీ  
ప్రజలకుఁ జెప్పుము ద్రుపదా | త్మజఁ గార్యం బడుగుమనుము తగనందఱతోన్‌.

_First 200 of 416 passages. [Read on](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3)_

---
Source: [https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3) · Pramāṇa
