<!-- Pramāṇa, a library of Indian primary sources · https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4 -->

[Pramāṇa](https://indike.org/pramana/) › [Indian literature](https://indike.org/pramana/in) › [Epic, Poetry, Drama & Narrative](https://indike.org/pramana/in.lit) › [The Mahābhārata and its versions](https://indike.org/pramana/in.lit.mahabharata) › [Mahābhāratas in Indian regional languages](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa) › [Andhra Mahabharatamu](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra) › 5.4

# Andhra Mahabharatamu 5.4: ఉద్యోగపర్వము — చతుర్థాశ్వాసము

Āndhra Mahābhāratamu 5.4

- **Language:** Telugu

### ఉద్యోగపర్వము — చతుర్థాశ్వాసము

### [5.4.1](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.1)

క. శ్రీ మత్తులసీ పల్లవ | దామచ్ఛవిలబ్ధ మరకత ప్రతిమత్వో  
ద్దామ ప్రభాస్థిమాలా | శ్యామాయిత విపులవక్ష హరిహరనాథా!

### [5.4.2](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.2)

వ. దేవా! వైశంపాయనుండు జనమేజయున కిట్లనియెఁ గృష్ణుం డత్తెఱంగున వెడలిన విస్మితయై గాంధారి యభ్యంతర మందిరంబున కరుగం గౌరవులెల్లను బంధుమిత్ర సహాయ సహితంబుగాఁ దనతోడన వెడల, మొగంబు గంటు వెట్టికొని కక్ష్యాంతరంబులు గడచినప్పుడు దారుకుండు తేరినొగలపై నుండి పొడసూపి కేలు మొగిడ్చి ఫాలభాగంబునం గదియించినం, దత్ప్రదేశంబున నిలిచి, వారలదెస మరలిచూచి ‘మీ రింక నిలువుం’ డని పలికిన నాంబికేయుండు పుండరీకాక్షుం జేరి నిజతనూజుల నుపలక్షించి.

### [5.4.3](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.3)

ఉ. ‘వీరును బాండుపుత్త్రులును వేరము దక్కి పొసంగి మన్కికై  
పోరితమాడి యే నటులు బుద్ధులు సెప్పిన భంగియుం, గులా  
చారము నిర్వహింపఁ బలుచందములం దగ దుఃఖపాటు నీ  
కౌరవజాతికిం దెలిసెఁ గాదె గదాధర! నీదు సన్నిధిన్‌.’

### [5.4.4](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.4)

వ. అని వెండియు.

### [5.4.5](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.5)

తే. ‘నీకు శుద్ధుండ నగుటయ నిఖిలబంధు | మిత్ర గురుజన కోటికి ధాత్రి కెల్ల  
నంబుజాక్ష! నిర్దోషుండ నగుట; గాన | నా తెఱంగు నీ వెఱుఁగుట నాకుఁ జాలు.

### [5.4.6](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.6)

వ. అనిన విని యచ్యుతుండు బాహ్లిక భీష్మ ద్రోణ కృప ప్రముఖ నిఖిల విశిష్టజనంబుల నాలోకించి.

### [5.4.7](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.7)

తే. ‘ఇప్పు డీ సభఁ బుట్టిన యింతవట్టు | మీకుఁ దెల్లంబు గాదె! యీ మేదినీ వి  
భుండు దా నేమిటికిని ముఖ్యుఁడఁ గాను | దప్పు దనదెస లేదని చెప్పి విడిచె.

### [5.4.8](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.8)

వ. కావున నాకు నియ్యెడం దడయం బనిలేదు; పోయివచ్చెద; ధర్మపుత్త్రునకు నింత వృత్తాంత బెఱింగింపవలయు’ నని పలికి వారల నామంత్రణంబు సేసినవాఁడై రథారోహణంబు సేసి ధృతరాష్ట్రుండును నచటి జనంబులును వెనుకం జనఁ జని కుంతీగృహద్వారంబున నరదంబు డిగ్గి.

### [5.4.9](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.9)

క. వారందఱుఁ దనతోడన | గారవమున నరుగుదేరఁగాఁ జొచ్చి మహో  
దారుఁడు కుంతీ చరణాం | భోరుహముల కెఱఁగి వినయభూషణుఁ డగుచున్‌.

### [5.4.10](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.10)

క. కౌరవసభఁ దా నాడిన | గౌరవవాక్యములుఁ గార్యఖడ్గక్రమ వా  
క్పూరములు సుయోధను దు | ష్ప్రారంభము నల్పవచన పద్ధతిఁ జెప్పెన్‌.

### [5.4.11](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.11)

వ. ఇట్లు ధృతరాష్ట్రు కొలువునం బుట్టిన విశేషంబుల పాండురాజమహిషి కెఱింగించి మాధవుండు మఱియును.

### [5.4.12](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.12)

తే. ‘కురుకుమారులు తమయంతఁ గుడిచి క్రొవ్వి | మీఁ దెఱుంగరు; మాకేమి? మేల కాక;  
నాలుకలు గ్రోయు నర్జునానలము దగిన | యెర గొనం గని సంతృప్తి యెసక మెసఁగు.

### [5.4.13](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.13)

వ. పాండుకుమారులపాలికిం బోయి వచ్చెద; వారికిం దగిన బుద్ధు లానతి’మ్మనిన నద్దేవి విక్రమోపజీవులయిన ముచుకుందుండును సృంజయుండును నను తొంటినరపతుల చరిత్రంబులు సెప్పి, ‘యుధిష్ఠిరుండు వీరిని వినండొ కాక’యని పలికి యెల్లవారును వినుచుండ వెండియు నిట్లనియె.

### [5.4.14](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.14)

ఉ. ‘రాజుల కెందు నారయఁ బరాక్రమజీవన వృత్తి దక్క నొం  
డోజ నిషిద్ధ మండ్రు మును; లుత్తమసత్త్వులు వంశధర్మముల్‌  
పూజిత భంగిఁ జేయుదురు; బుద్ధివిహీనులు వానిఁ దక్కి ని  
స్తేజపుఁ గూటి కియ్యకొని దీనతఁ బొందుదు రంబుజోదరా!

### [5.4.15](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.15)

క. నీ వియ్యంబులు సంధియ | కావింపంబడిరి; వీరిఁ గలయుట కష్టం;  
బా వెరవు దప్పుటయ మే | లై వచ్చెం బొమ్ము; విడువు మనుమానంబున్‌.

### [5.4.16](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.16)

మ. నిజవంశోచిత వీరవృత్తమున కున్మేషంబుగా నా కపి  
ధ్వజుఁ డుత్సాహము సేయకున్న నకటా! దైన్యంబు వాటిల్లదే?  
భుజదర్పోద్ధతుఁడైన భీమునకు నీ పొం దొప్పునే? నీవు స  
ర్వజగన్మాన్యుఁడ విందు రాఁదగునె? దైవం బిట్లు దప్పించునే!’

### [5.4.17](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.17)

వ. అని యంత నిలువక గొంతి యిట్లనియె:

### [5.4.18](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.18)

క. ‘మఱచిరె కొలువున ద్రౌపదిఁ | బఱచిన బన్నంబు? ధర్మపథము దొఱంగన్‌  
వెఱచుట కప్పటి కది దగుఁ; | జెఱచినచో వెదక వలదె చిరతర కీర్తిన్‌?’

### [5.4.19](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.19)

వ. అని పలికి పుండరీకాక్షుం గౌఁగిలించుకొని, యచ్యుతుండు మ్రొక్కిన దీవించి, ‘యేను సుఖంబున్న దాన’నని పాండవులకుం జెప్పుము; చేతుల లావునం గనిన జీవనంబున బ్రదుకుం డనుము; పోయిర’మ్మని వీడుకొల్పిన సింహగమనసుందరంబుగా వెడలి, తన తోడన కదలివచ్చిన ధృతరాష్ట్రాదుల నిలువంబనిచి, రథారోహణంబు సేసి గోవిందుండు కర్ణుదెసం గనుంగొని, ‘న న్ననిచి వత్తుగానిర’మ్మని కరంబు సాఁచి చెయివట్టి తన యరదం బెక్కించికొని, సాత్యకి వేసరి నెక్కి కెలనం జనుదేరం గదలిచని, యనుపవచ్చిన కృతవర్మ నుచిత ప్రకారంబున సస్నేహంబుగా నిలిపి యరుగు నవసరంబునఁ బౌరలోకంబు.

### [5.4.20](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.20)

ఉ. ‘అక్కట! వాసుదేవు పను పాదరణంబునఁ జేయరైరి; వీ  
రెక్కడి బుద్ధిమంతు? లని నిందును నందును లోకమెల్లఁ బే  
రుక్కున మ్రగ్గుటం దలఁప నొల్ల కపాయము సేసి రట్టె! యీ  
యుక్కివు లెందునుం గలరె? యొప్పరు వో ధృతరాష్ట్ర నందనుల్‌.’

### [5.4.21](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.21)

వ. అని మఱియు ననేకు లనేక ప్రకారంబులం బలుకుచు నిరుగెలంకులం జూచుచుండఁ బుండరీకాక్షుండు పురంబు నిర్గమించె; నట ధృతరాష్ట్రుండును మగిడి కొలువు కూటంబునకు వచ్చి యెప్పటివారలు పరివేష్టింప నుండి కృష్ణుని వలని మాటలాడుచున్న సమయంబున సుయోధనునితో భీష్మద్రోణు లిట్లనిరి.

### [5.4.22](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.22)

చ. ‘పలుకునె యిట్లు గొంతి? విని బమ్మెరపోయితి; మింత బెట్టిదం  
బు లగునె మాట? లయ్యమయుఁ బుణ్యుఁడుఁ గృష్ణుఁడు గార్యవాదముల్‌  
వలికెడు వార లిట్లు దెగఁబాఱిరి; ధర్మజవారిరాశికిం  
జెలియలికట్ట వాసె; మనచే నగు కర్జముచంద మెట్టిదో?’

### [5.4.23](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.23)

వ. అని పలికి వెండియు.

### [5.4.24](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.24)

శా. ‘మాకుం జూడఁగఁబోలు కార్య మిది: ధర్మప్రీతి నీ వేఁగి సు  
శ్లోకుండైన యుధిష్ఠిరుం గని జనస్తుత్యంబుగా శాంతిమై  
నీ కౌరవ్యులనెల్లఁ గాచికొనవే యే పొప్ప దెందుం; దుదిన్‌  
శోకం బొందక వేగమైఁ గదలి కృష్ణుంగూడఁబోవే నృపా!’

### [5.4.25](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.25)

వ. అనిన విని దుర్యోధనుండు మొగంబు రాఁజుచుండ నూరకుండె; గాంగేయుండును గురుండును దిగ్గనలేచి యతని నవలోకించి.

### [5.4.26](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.26)

క. ‘కురునృప! విను సంసారము | దరిద్రొక్కినవార; మింకఁ దలఁకెదమే? సం  
గరమునకు నేము నీకై | పొరలితి; మెట్లైన నగును బోయెద’ మనుచున్‌.

### [5.4.27](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.27)

క. అరిగిరి, రాజును నభ్యం | తరమునకుం జనియె, రాజతనయుండు బహిః  
పరివారముఁ బొమ్మని మిత | పరిజనుఁడై యేఁగె నాత్మభవనంబునకున్‌.

### [5.4.28](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.28)

తే. అంత నక్కడ నచ్యుతుఁ డరిగి యరిగి | యధిక సంప్రీతి దలకొన నర్కతనయు  
నాననంబు వీక్షించి యిట్లనియె నెమ్మి | నన్యు లెవ్వరు వినకుండ నతనితోడ.

### [5.4.29](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.29)

సీ. ‘నీవు వృద్ధజనోపసేవివి, ధర్మసం | వేదివి, తెలియంగ వినుము; సిద్ధ  
మంత్రబలంబున మార్తాండు వరమునఁ | గన్నియ తఱి గొంతి గన్నవాఁడ  
వగుటఁ బాండునృపాలు నగ్రసుతుండవు; | ధర్మమార్గం బిది; ధర్మతనయుఁ  
డాదిగాఁ గల తమ్ములందఱు నా చేత | నెఱిఁగి నీ యడుగుల కెఱఁగి సకల  
ఆ. పుత్త్ర మిత్త్ర బంధు భూరిసేనా సమ | న్వితముగాఁగఁ గొలిచి నిన్ను రాజ్య  
భారవహనమునకుఁ బట్టంబుగట్ట ను | జ్జ్వలుఁడ వగుదు; రమ్ము వారికడకు.

### [5.4.30](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.30)

వ. ఏను నిన్ను సామ్రాజ్యంబునకు నభిషిక్తుంజేయుదు; నీవు దొలుత వెడలునప్పటి మహోత్సవంబునకు యువరాజైయుధిష్ఠిరుండు నీ రథంబున నుండి నీకు ధవళచామరంబులు వైచు; వాయుపుత్త్రుండు సితచ్ఛత్రంబు వట్టు; సవ్యసాచి సారథ్యంబుచేయు; మఱియుఁ బాంచాల యాదవ పాండ్యమాత్స్యులు లోనుగాఁగల రాజలోకంబుతోడఁ గవలు నభిమన్యు ప్రభృతి కుమారులు బెరయ నే మెల్లం బలసి పరివేష్టించి వత్తు; మిట్టి మహేంద్ర విభవంబున మహనీయుండ వగుచు మహీచక్రం బేలు’ మని మఱియును.

### [5.4.31](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.31)

క. ‘పాంచాల రాజపుత్రియు | నంచితముగ నిన్నుఁ బొందు నాఱవ వరుసన్‌;  
సంచితపుణ్యుఁడ వీ వొక | యించుకయును వేఱుసేయ కేతె మ్మెలమిన్‌.

### [5.4.32](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.32)

వ. ఇట్లైనఁ గుంతికి సమస్త బంధుమిత్రులకుఁ బ్రియంబగు’ ననిన విని రహస్యంబుగా రాధేయుండు మాధవున కిట్లనియె:

### [5.4.33](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.33)

చ. ‘వెడవెడ యేనుఁ దొల్లి యిది వింటి’ ననుం గని కుంతి నిర్దయన్‌  
జెడ నదివైచిపోయెఁ; గృపఁజేకొని సూతుఁడు దెచ్చి తాను మున్‌  
కొడుకులఁ గానకున్కిఁ బ్రియకుం దగనిచ్చినఁ జేఁపెఁ జన్ను; ల  
ప్పడఁతియు నప్పుడాదిగ శుభస్థితిఁ బెంచెఁ బ్రయత్నశీలయై.

### [5.4.34](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.34)

క. మూత్ర పురీషాదులు దమ | గాత్రములం దింక వారు గారవ మెసఁగం  
బుత్త్రుండని సంవర్ధిత | గాత్రునిగాఁ జేసి రింతకాలముఁ గూర్మిన్‌.

### [5.4.35](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.35)

క. నేఁ డింక నెఱిఁగి యొరువుల | వాఁడఁ గదా యనుచు నేను వారిఁ దొఱఁగినం  
బోఁడిమి సెడదే? మదిఁ గడు | వాఁడి గలదె నాకు నకట వారిజనాభా!

### [5.4.36](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.36)

వ. వృద్ధోప సేవనంబును ధర్మ సంవేదనంబునుం గలవాఁడ వని నన్ను నీవ చెప్పితివి; రాధయు నధిరథుండును నాకు జాతకర్మాది సమస్త సంస్కారంబులు నిజకులోచితంబుగా నాచరించి; రట్టి తల్లిదండ్రులకుఁ బుత్త్రకృత్యంబులు నిర్వర్తింపక వారలంబాసి యేను వచ్చుట ధర్మంబగునే?’ యని పలికి వెండియు.

### [5.4.37](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.37)

క. ‘సోదరులుఁ బ్రియులు ననుజులు | నా దెసఁ బెక్కండ్రు; వారినందఱ విడువం  
గాదని యూహింపక దా | మోదర! నన్నిట్లు పిలుచు టుచితమె? చెపుమా!

### [5.4.38](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.38)

వ. అదియునుం గాక.

### [5.4.39](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.39)

ఉ. సూతసుతుండు వీఁ డనక సూనుల తమ్ములకంటె నాకు సం  
ప్రీతియొనర్చి తేజమును బెంపును నాఁటికినాఁటి కగ్గలం  
బై తనరార నన్నుఁ దనయంతటి మానిసిఁ జేసియుండ నే  
నేతగవూఁది యా కురుకులేశ్వరుఁ బాయుదు? ముట్టవచ్చినన్‌.

### [5.4.40](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.40)

క. నను నయ్యర్జునునకు నెదు | రని పెద్దయు నమ్మియుండు నక్కట! దుర్యో  
ధనుఁ; డా నమ్మిగ వమ్ముగఁ | జనునే పాండవులఁ గలయఁ జన నా కనఘా!

### [5.4.41](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.41)

ఆ. ఏను నర్జునుండు నెక్కటెక్కటి దల | పడకయున్న నగరె పుడమి జనము?  
లందు నాదు వచ్చు టతనికి నపకీర్తి | యనిన నాకు వేఱె యడుగనేల?

### [5.4.42](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.42)

క. హిత ముపదేశించితి నీ | వతి నిర్మలబుద్ధి వగుట; నైనను నిది నా  
మతి సొరదు; రహస్యము ర | క్షితముగఁ బాటింపుమయ్య! చిత్తములోనన్‌.

### [5.4.43](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.43)

వ. అది యేమిటి కంటేని.

### [5.4.44](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.44)

తే. ధర్మతనయుండు తాను నా తమ్ముఁ డగుట | యెఱిఁగెనేనియు సామ్రాజ్య మేల పూను?  
నట్టి ధార్మికుఁ డాధిపత్యంబుఁ జేయ | వలవదే శాశ్వతంబుగ వసుధకెల్ల?

### [5.4.45](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.45)

క. అనుజులు ఋత్విజులుగ, నీ | పని యిటు సేయుమను నీ వుపద్రష్టవుగా  
విను! కురుకుమార పశువిశ | సనమున రణయజ్ఞ మతఁడు సమ్మతిఁ జేయున్‌.

### [5.4.46](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.46)

వ. దానం బుణ్యభూమి యగు కురుక్షేత్రంబున మముబోం ట్లెల్లను సద్గతి వడయుదురు గాక!’ యనిన విని వసుదేవనందనుండు సూతనందనున కిట్లనియె.

### [5.4.47](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.47)

మ. ‘దయ నా యాడినమాటఁ గైకొనవు సంతాపంబుఁ దెచ్చుం జుమీ!  
స్మయ మెట్లుం దుది నీకు నర్జునునితో మాత్సర్యమైనం బరా  
జయ మొండెన్‌ మృతి యొండెఁ గాక గెలువన్‌ శక్యంబె? పెక్కండ్ర కిం  
తియ కాలం బగునట్టె నీ మనము శాంతింబొందఁగా నేర్చునే?

### [5.4.48](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.48)

క. గాండీవముఁ గవదొనలు న | ఖండిత దివ్యాస్త్రములు నొగలపై నేనుం  
జండ భుజబలమునై యు | ద్దండత నరుఁ డడర నెదురఁ దరమే నీకున్‌?

### [5.4.49](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.49)

వ. ఎల్లభంగులం బాండవుల గెల్తు; రది యట్లుండె; నీవు పొ; మ్మిప్పుడ పోయి సుయోధనునకును గురుభీష్ములకును మీకుం దోడువచ్చిన రాజుల కందఱకుం జెప్పు : మిమ్మాసంబు సౌమ్యంబై సమశీతోష్ణంబై పుష్పఫలోపేతంబును, సమగ్ర ధాన్యంబును, సులభయవ సేంధనంబును నగుచు నొప్పియున్నయది; యేడెనిమిది దివసంబులకు నమావాస్య వచ్చు; నది పుణ్యదినంబు; నాఁడు భండనంబు గావలయు’ ననినఁ గానీనుండు కమలనాభున కిట్లనియె.

### [5.4.50](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.50)

క. ‘కలవు నిమిత్త స్వప్నం | బులు కౌరవ పాండవులకుఁ బోటగు; దానన్‌  
గెలు పయ్యుధిష్ఠిరునకును | గల; దెఱుఁగుదు నీవు సెప్పఁగా నేమిటికిన్‌?

### [5.4.51](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.51)

వ. అట్లుగాన కదా యే నందు రా’ నని పలికి మఱియును.

### [5.4.52](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.52)

క. ‘దీనికి మూలము శకునియు | నేనును, దుశ్శాసనుండు, నింతియ; కుంతీ  
సూనుల వారలు గలసిన | రానేరఁగ వచ్చు నాకు రాజీవాక్షా!

### [5.4.53](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.53)

వ. ఈ సమర సముద్రంబు గడవ నీఁది నిన్నుం గనియెదఁ; గాదేని నూర్ధ్వలోకంబునం గాంచెద; నీ వింక నేమియుం బలుకకుము; పని వినియెద’నని కౌఁగిలించుకొనిన ‘నట్ల కాక పొ’మ్మని విష్ణుండు వీడుకొలువ రాధేయుండు రథావతరణంబు సేసి, కనక రత్నమయంబగు తన యరదం బెక్కి కరిపురంబున కరిగె; నచ్యుతుండును సాత్యకిం దన రథం బెక్కించుకొని దారుకుం జూచి ‘పద పద పోనిమ్ము పోని’మ్మని పలికి లలితాటోపకలితుండగుచుఁ జనియె; నట్టియెడ విదురుండు విషాదంబుతోఁ బాండురాజమహిషి పాలికిం జని యిట్లనియె.

### [5.4.54](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.54)

ఉ. ‘అక్కట! కౌరవాన్వయ మహార్ణవ మింకెడునట్లు వుట్టె; నిం  
దొక్కరుఁడైనఁ గేశవు హితోక్తికి మేకొనఁ డయ్యె; నర్జునుం  
డెక్కటి దాన చాలుఁ దము నిందఱఁ దీవ్రశరాగ్నిఁ గాల్పఁ; బెం  
పెక్కిన పాండునందనుల యేడ్తెఱఁ దొల్లియుఁ దా రెఱుంగరే?

### [5.4.55](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.55)

తే. అన్ని వడియును బంధుక్షయంబు సేయ | నొల్ల కెల్ల విధంబుల నుపశమంబ  
కోరి రప్పాండవేయులు; వారి కిట్టి | దొసఁగు వచ్చునె తులువల తోడఁబుట్టి.’

### [5.4.56](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.56)

వ. అని వెండియు నివ్విధంబు మాటలఁ బాండవులకుఁ గయ్యంపు టలజడియైన వగపు దోఁప నాడుచుం గొండొక ప్రొద్దు నిలిచి నిజనివాసంబునకుం బోయిన యనంతరంబ కుంతి యిట్లని వితర్కించె.

### [5.4.57](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.57)

మ. ‘తమ వారిన్‌ సిరికై వధించు టిది సద్ధర్మంబె? యక్లేశ కృ  
త్యమె తాఁ గయ్యము? ద్రోణ భీష్మ కృప కర్ణాటోపముల్‌ మాన్చు ట  
ల్పములం దీఱునె? యందు నర్కజుని యుల్లం బెప్పుడుం గ్రోధ దీ  
ప్తము భీమాదుల మీఁదఁ; దక్కొరుల కుత్సాహంబు లే దాజికిన్‌.’

### [5.4.58](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.58)

వ. అని యిత్తెఱంగునఁ బెక్కులు చింతించి తలంచుకొని ‘కర్ణునకుం బుట్టువు తెలిపి సహోదర స్నేహం బావహించెద; నట్లయిన నాహవంబువలని కడంక యుడుగకుండునె?’ యని విచారించి యతని పాలికిం బోన నిశ్చయించి, యుచిత ప్రకారంబున వెడలి యతం డనుష్ఠానార్థంబు భాగీరథికిం జనుట విని తత్ప్రదేశంబున కరిగి యతనికి జపకాలంబయి యునికిం జూచి వెనుక వలనఁ గూర్చుండఁ, గొండొక సేపునకు జపంబుదీఱి కలయం గనుంగొని యమ్మహాదేవింగాంచి కానీనుండు సంభ్రమ వినయంబులతోడం జేరి సూత గోత్రంబును రాధేయనామంబునుం జెప్పి యభివాదనంబు చేసి ‘నీవు విజయంచేసిన కార్యం బేమి? నాకుం జేయంగల పని యెయ్యది? యానతి’మ్మనినఁ గుంతి యేకాంతంబుగా నిట్లనియె.

### [5.4.59](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.59)

సీ. ‘వినుము! సూతాన్వయంబున నీవు పుట్టుట | బొం; కేను మా కుంతిభోజునింటఁ  
గన్నియనాఁడు భాస్కరుని రావించితి | వరమంత్రబలమున; వచ్చి యతఁడు  
సంప్రీతి నొసఁగంగ జన్మించినాఁడవు | నాకుఁ; గావునఁ బాండునందనుండ  
వగుదు ధర్మస్థితి; నట్టి నీ వితరులఁ | గొలువ నేటికిఁ గురుకులవరేణ్య?  
తే. ధర్మతనయాదులైన నీ తమ్ములకును | ధార్తరాష్ట్రులకును నీవ తగు విభుండ;  
వేలు మీ లోకమెల్ల; నీ కేల రాధ | కొడు కితం డను తక్కువ? కొడుకుఁగుఱ్ఱ!’

### [5.4.60](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.60)

క. అని పలికిన యవసరమున | నినబింబములోన నుండి ‘యిది నిజ మిబ్భం  
గిన నెగడవన్న మేలగు’ | నను వాక్యము వెడలెఁ గర్ణుఁ డాకర్ణింపన్‌.

### [5.4.61](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.61)

తే. దాని వినియును నపుడు రాధాసుతుండు | దిరుగఁబడని మనంబుతో ధీరవృత్తిఁ  
దల్లి కిట్లను ‘నీమాట తథ్యమగున | యైన నొక్కటి సెప్పెద నవధరింపు.

### [5.4.62](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.62)

క. క్షత్రియ సంస్కారమునకుఁ | బాత్రముగా నీవు నన్నుఁ బాటింప విహా  
ముత్రఫలములకు నీ కేఁ | బుత్రుఁడ నని వచ్చుటింకఁ బోలునె చెపుమా?

### [5.4.63](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.63)

వ. సూర్యానుగ్రహంబునఁ జేసి నింద్యంబుగాక తక్కెనేనియు నా జన్మంబు పరమ రహస్యంబునై యున్నయది; దీనిఁ బ్రకాశంబు చేయుట మనకెంత మే? లట్లుంగాక.

### [5.4.64](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.64)

ఆ. విజయు విక్రమంబు విఖ్యాతమై యుండ | ‘నేను గుంతికొడుక భానుజుండ’  
ననుచు నతనిఁ గూడ నరిగిన నతనికి | వెఱచి పోయె ననరె? వేయు నేల?

### [5.4.65](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.65)

క. కడిఁది పగఱ నేఁ దెప్పగఁ | గడవంగా నీఁదఁదలఁచు కౌరవనాథుం  
జెడుఁ గాక యంచు నిత్తఱి | విడువఁదగునె? యతని వలన వెలసిన వాఁడన్‌.

### [5.4.66](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.66)

క. కౌరవులచేతఁ గుడిచిన | వారికి నిది సమయ; మెట్టివారును సంగ్రా  
మారంభంబునఁ బాయుదు | రే? రాజులు మనలఁ దిట్టరే యట్లయినన్‌.

### [5.4.67](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.67)

వ. ఏ నవశ్యంబును దుర్యోధనునకై నీకొడుకులతోడం బెనంగుదు.

### [5.4.68](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.68)

ఉ. నీ పలు కెంత వోలినను నిర్ణయ మిట్టిద కాని యొండు లే;  
దీపని మీఁది భారమున నీ విట వచ్చితిగాన పాండవుల్‌  
సేపడిరేనిఁ జంప; నఱసేయక చెప్పెద సవ్యసాచిపైఁ  
గోపము పెద్ద; వాఁడు సమకూరిన బిట్టఱఁ జంపుదుం జుమీ!

### [5.4.69](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.69)

ఆ. సవ్యసాచిచేతఁ జచ్చుటయును గీర్తి | కరమ యతఁడు లోనుగాఁగ నేవు  
రేను లోనుగాఁగ నేవురుగాని నీ | కొడుకు లార్వురనుట విడువు’మింక.

### [5.4.70](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.70)

చ. అనుటయు నప్డు గొంతి హృదయంబున శోకము నివ్వటిల్ల ని  
ట్లను ‘నిది దైవసంఘటన మక్కట! యెట్లును దప్ప నేర్చునే?  
యనుపమ సత్యవిస్ఫురణ నాడినమాట మఱాకుమన్న! నీ  
యనుజుల నల్వురం గడపు; మర్జునుఁ జేఁతకు సమ్మతించితిన్‌.

### [5.4.71](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.71)

ఆ. అనుచుఁ గౌఁగిలింప నర్కజుం ‘డట్ల కా’ | కని ప్రియంబు మెఱయ వినతుఁ డైన  
నరిగె సదనమునకు నద్దేవి; యతఁడును | జనియె నిజనివాసమునకుఁ బ్రీతి.

### [5.4.72](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.72)

వ. అక్కడ వాసుదేవుం డుచిత ప్రయాణంబుల నుపప్లావ్యంబునకుం జని ధర్మతనయుచేతం బూజితుండయి, భీమసేనాదులు విరాట ద్రుపదముఖ్యులగు తగువారలుఁ దన్నుం గాంచిన వారినెల్ల నభినందించి, కొలువున నుండి యుధిష్ఠిరుతో నిట్లనియె.

### [5.4.73](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.73)

తే. ‘ధార్తరాష్ట్రు లున్మత్తులు; తగిన పలుకు | లేల విని సంధి సేయుట కిచ్చగింతు?  
రెదిరిఁ దమ్మును నెఱిఁగిర యేని వార | లంత లంతలు చేయుదు రయ్య నాఁడు?’

### [5.4.74](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.74)

వ. అని యెల్లవారును వినఁ దనపోయివచ్చిన కార్యంబు తెఱంగెఱింగించి, పథిశ్రమంబు పుచ్చువాఁడయి పుండరీకాక్షుండు నిజమందిరంబున కరిగె; నాఁటి రాత్రి ధర్మనందనుం డనుజ సహితంబుగా నుచిత ప్రదేశంబున నుండి గోవిందుని రావించి ‘నీవు సుయోధనునితోఁ బలికిన చందం బెయ్యది? యతండేమి విధంబున నుత్తరంబిచ్చె?’ నని యడిగిన నచ్యుతుఁ డిట్లనియె.

### [5.4.75](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.75)

క. ‘కయ్యము గాని తెఱంగున | నెయ్యంబగు నట్లుగాఁగ నెఱిఁ బలికితి నే  
నెయ్యది సుఖంబు పథ్యం | బెయ్యది యరయంగఁ దథ్య మెయ్యది దానిన్‌.

### [5.4.76](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.76)

తే. బహు విధంబులఁ బలుకు నా పలుకు లెల్లఁ | జీఁదక న్నిడి తన పెడచెవులఁ బెట్టి  
యీఱతాఱలు మఱుమాట లిచ్చి యపహ | సించె; దుర్యోధనుఁడు వేయుఁ జెప్పనేల?’

### [5.4.77](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.77)

క. అనిన విని ధర్మజుం డి | ట్లను ‘నప్పుడు తండ్రి యుచిత మాడఁడె? భీష్ముం  
డును గురుఁడు విదురుఁడుం ద | క్కిన పెద్దలుఁ బలుకరే తగిన చందమునన్‌?

### [5.4.78](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.78)

క. నావుడు హరి యిట్లను ‘స | ద్భావమున విచిత్రవీర్యతనయుఁడుఁ దగ నా  
నా విధములఁ జెప్పిన సం | భావన వినఁ డతఁడు, పలుకుఁ బ్రతికూలంబుల్‌.

### [5.4.79](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.79)

సీ. శంతను పుణ్యవంశం బంకురించిన | చందంబు, నంబికానందనుండు  
జాత్యంధుఁడై యుండ సామ్రాజ్యమంతయుఁ | బాలించి పాండునృపాలుఁ డతనిఁ  
గొలిచి యుండుటయును, గురుకులంబున కెల్ల | దేజంబుగా మీరు దిగ్విజయము  
సేసి కావించిన సిరి వారు వంచనఁ | గొనుటయు, సత్య మకుంఠితముగ  
తే. నీవు సమయంబు నడపిన నెఱియుఁ దండ్రి | పాలు మీకు నీఁదగుటయుఁ, బాడిలేమి  
నరయఁ జెడుదురు కౌరవు లనియుఁ, బెద్ద | లెల్లఁ జెప్పిరి మొగమోట యింతలేక.

### [5.4.80](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.80)

క. అలయక యందఱుఁ జెప్పం | గల యంతయుఁ జెప్పి; రతఁడు కటకటఁబడి య  
క్కొలువు వెడలి పోయెం ద | మ్ములుఁ గర్ణుఁడు రాజలోకముం దో నరుగన్‌.

### [5.4.81](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.81)

వ. ఇట్లు కొడుకు ముష్కరుండై యరిగిన ధృతరాష్ట్రుండు గాంధారి రావించి.

### [5.4.82](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.82)

క. తగ విదురుఁ బంచి యాతని | మగుడఁగఁ బిలిపించె; నా యమయుఁ దనయునకున్‌  
వగయును గూర్మియు వెరవును | మిగిలిన వచనముల సంధి మెయికొనఁ జెప్పెన్‌.

### [5.4.83](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.83)

వ. ఎవ్వ రెంత సెప్పినను గైకొనక కడంగి దుర్యోధనుండు దనకుం గలవారల నెల్లను గురుక్షేత్రంబునకు నడవుండని చెప్పంబనిచె; భీష్ముని సేనా ముఖంబు సేసికొని యెత్తి విడియం గలవాఁ; డిది ధార్తరాష్ట్రుల నిశ్చయం; బేనును నా యోపినంత సామవాదంబు లాడితి; నారదాది మహామునులను సుయోధనునకు బుద్ధులు సెప్పునట్లు సేసితి; నేమి చెప్పినను నెంతటం బోకున్నం గినుక దెచ్చికొని జంకించియు భంగించియు ధిక్కరించియుఁ దృణీకరించియుం జూచితిఁ గార్యంబు భగ్నంబగుట కొల్లక వెండియు శాంత వచనంబులు వలికితి; నతం డశక్త దుర్జనత సేయం జూచిన నమానుషంబు లగువానిం గొన్ని వెడమాయలం బన్ని పెక్కుపోకలం బోయితి నెన్ని భంగుల సంధియ కావలయునని పారలంగలయంతయుంబొరలితి; నప్పాపాత్ముం డెట్లునుం జక్కంబడక తన చలంబుతోన పొట్టుపొరలయ్యుఁ గయ్యంబు వొడుచుంగాని, యవశ్యంబును రాజ్యంబు పాలిచ్చు వాఁడు గాఁడు; కౌరవుల యెడ దండంబు దక్క నొం డుపాయంబు లేదు; మీకుం బోలిన తెఱంగు సేయుం’ డనిన ధర్మతనయుండు తమ్ములం గనుంగొని యిట్లనియె:

### [5.4.84](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.84)

క. ‘కురుసభఁ బుట్టిన చందము | హరి యంతయుఁ జెప్పె; నింక ననుమానము లే;  
దరి మర్దనమున కయ్యెడు | వెరవుం జేవయును మెఱయ వెడలుఁడు గడఁకన్‌.’

### [5.4.85](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.85)

వ. అని పలికి, యజాతశత్రుండు కరుణాయత్తచిత్తుండై యచ్యుతు నాలోకించి.

### [5.4.86](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.86)

క. ‘కురువంశముఁ ద్రుంచుటకుం | జొరఁజాలక నా మనంబు సుడివడియెడు; నే  
వెరవును దొరకొనదు గదే | సరసీరుహనాభ! పొందు సంపాదింపన్‌.

### [5.4.87](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.87)

వ. నా మనంబును దమ్ములతలంపును నీ వెఱుంగుదు; ధార్తరాష్ట్రుల చందంబును భీష్మ ద్రోణ విదురాదుల చిత్తంబులును నెఱింగి వచ్చితి; మాకు ధర్మచ్యుతి లేకుండునట్టి కార్యంబు నిశ్చయింపు’ మనిన నారాయణుం డిట్లనియె.

### [5.4.88](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.88)

ఉ. ‘యుద్ధమ కాక కార్యమును నొండొకఁ డెద్దియుఁ గల్గనేర్చునే?  
బుద్ధులు చెప్పు వాక్యములఁ బోల వినం డననేల? యట్టిచో  
బద్ధునిఁ జేయఁజూచె ననుఁబట్టి సుయోధనుఁ, డింక నయ్యసం  
బద్ధునితోడి సంధికి నుపాయము నా మతిఁ దోఁప దెమ్మెయిన్‌.’

### [5.4.89](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.89)

వ. అని చెప్పి విదురుం డేకాంతంబున నాడినమాటలును, భీష్మద్రోణ బాహ్లికాదులగు పెద్దలకు ధార్తరాష్ట్రుల దెసం బుట్టిన మనఃక్షోభంబును, గుంతి కౌరవులు వినం బలికిన పలుకులుం బ్రకటించి ధర్మపుత్త్రుపైఁ బాపంబు లేకునికిఁ దెలిపి సమరం బవశ్య కర్తవ్యంబుగా నిశ్చయించె; నట్టియెడఁ దమ్ము లన్న మొగంబునం జూడ్కి నిలిపి యూరకుండి; రతండు వారలం గలయం గనుంగొని యిట్లనియె:

### [5.4.90](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.90)

ఉ. ‘కౌరవకోటిచేత మన కష్టపుఁబాటు తలంపు వచ్చినం  
గ్రూరవిచేష్టితంబునకు గొంతి యొడంబడె; బంధువర్గమున్‌  
ఘోరముగా వధించుటకుఁ గోల్కొన కున్నది బుద్ధి; మీరు ని  
ర్ధారణ చేయుఁడా హితము ధర్మము నయ్యెడు వృత్తమెట్టిదో.’

### [5.4.91](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.91)

వ. అనిన విని అర్జునుం డతని కిట్లనియె :

### [5.4.92](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.92)

చ. ‘హితమును ధర్మముం దగవు నిట్టిది నా మన మేమి నేర్తు? మ  
చ్యుతుఁడు సమస్త ధర్మ పరిశోధకుఁ; డా విదురుండుఁ; బాండు భూ  
పతి సతియుం దగం బలుకు పల్కుల సందియమెల్లఁ బాసె; ని  
ట్లితఁడు రణంబు చేయుఁ డన నింక విచారము లెల్ల నేటికిన్‌?’

### [5.4.93](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.93)

ఆ. అనిన ‘నట్లకాక యఖిల ధర్మజ్ఞాన | ఘనుఁడు మనకు నేడుగడయుఁ దాన  
శౌరి నిశ్చయింప సంశయం బేటికి? | సంఘటింపుఁ డుగ్ర సమర విధము.’

### [5.4.94](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.94)

వ. అని యుధిష్ఠిరుండు తమ్ములతో నెట్టకేలకుం దెగువ సెప్పి.

### [5.4.95](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.95)

క. ‘బాహాగర్వము వివిధ | వ్యూహ విధిజ్ఞతయుఁ గలిగి యొకరుం డే డ  
క్షోహిణులు నడపి భీష్మో | త్సాహంబున కోర్చు చాపధరుఁ డెవ్వఁ డొకో!

### [5.4.96](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.96)

వ. అట్టివానికి వాహినీ నాయకత్వం బిచ్చి యభిషేకంబు సేయవలయు.’

### [5.4.97](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.97)

తే. అనిన సహదేవుఁ డిట్లను ‘నధిప! పుత్త్ర | పౌత్ర సోదరవంతుండు బాహువీర్య  
ఘనుఁడు మన కాశ్రయంబయి మనిచె మత్స్య | దేశపతి గాఁడె సేనాపతిత్వమునకు?’

### [5.4.98](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.98)

వ. అనవుడు నకులుండు.

### [5.4.99](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.99)

చ. ‘బలఁగముఁ బెంపుఁ, దేజమును, బాహుబలంబును, నగ్గలంబు పె  
క్కు లెఱుఁగుఁ గార్య ఖడ్గములకుం దగు త్రోవలు; ద్రోణులందు భీ  
ష్ములదెసఁ గోపముం గలఁ, డమోఘ పరాక్రమశాలి, నీ బలం  
బుల కధినాథుఁగా ద్రుపదభూపతిఁ బట్టముఁ గట్టు టెట్లొకో!’

### [5.4.100](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.100)

వ. అనుటయుం దదనంతరంబ ధనంజయుఁడు.

### [5.4.101](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.101)

సీ. ‘అగ్నికుండమున ద్రోణాచార్యునకు నాశ | మొనరించుదానికై యుద్భవించె;  
రథరథ్యములు ధనుర్బాణంబులును దను | త్రాణఖడ్గములు నుద్దామ లీలఁ  
దనతోన జన్మించె; దహన శిఖామూర్తి | భుజవీర్య విక్రమ స్ఫూర్తిశాలి  
సైన్యనాథుండు ధృష్టద్యుమ్నుఁ డగునని | తలఁచెద; నాతఁడు దక్క నొరులు  
తే. భీష్ము తాఁ కోర్వ; రుగ్రంపు బిరుదు ధైర్య | ధన ఘనుండు శిఖండి భీష్మునకు మృత్యు  
వై జనించినవాఁడు మహాబలుండు | దండనాయకుఁ జేయ నతండు దగును.’

### [5.4.102](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.102)

వ. అనవుడు ధర్మనందనుండు గోవిందుం జూపి ‘యితండు సకల చరాచర తారతమ్య సంవేది; విశేషించి మనకు నితని మాటలు విజయ మూలంబు; గావున నిమ్మహాత్ముండు నిరూపించినవాడు వరూధినీ ముఖ్యుండు.’

### [5.4.103](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.103)

క. అనుటయు దామోదరుఁ డి | ట్లను ‘ధృష్టద్యుమ్నుఁ డర్హుఁ డగు నభిషేకం  
బొనరింపుము పేరోలగ | మున నక్షోహిణుల కెల్ల ముఖ్యుఁడు గాఁగన్‌.

### [5.4.104](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.104)

క. సురగంధర్వ ఖచర కిం | పురుషాది సమస్త దివ్యభూతంబుల బం  
ధుర భూరి వ్యూహంబుల | విరచనముల నెఱుఁగు నతఁడు వీరోత్తముఁడున్‌.

### [5.4.105](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.105)

క. నీ యొద్దిరాజు లందఱు | ధీయుక్తులు విక్రమ ప్రదీప్తుల యైనన్‌  
వేయేటికి ధృష్టద్యు | మ్నా యత్తము చేయు సైన్యమంతయు నధిపా!’

### [5.4.106](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.106)

వ. అనిన విని యుధిష్ఠిరుం ‘డక్షోహిణులకుం బ్రత్యేక నాయకులను నీవ నిర్దేశింపు’ మనుటయు నతండు.

### [5.4.107](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.107)

తే. ‘సేన దమకును గలవారు లేనివారు | ననక తగువారిఁ జెప్పెద నఖిల సమర  
పండితుల నేరి, వారి నీ బలము లేడు | నడపఁ జాలించి యభిషేచనం బొనర్పు.’

### [5.4.108](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.108)

వ. అనిన ‘నట్ల చేయుదు; వారెవ్వ రెవ్వరు? నిరూపింపు’మని యడిగినఁ గుంతీనందనునకు దేవకీనందనుం డిట్లనియె.

### [5.4.109](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.109)

సీ. ‘పటుపరాక్రమనిధి పాంచాలపతియు, న | మానుష తేజుండు మత్స్యవిభుఁడు,  
శత్రుభీకరమూర్తి సాత్యకియును, జరా | సంధాగ్ర తనయుండు శౌర్యఘనుఁడు  
సహదేవుఁడును, ధైర్యశాలి యాదవశిరో | మణి చేకితానుండు, మహితవిభవ  
ఖని యగు శిశుపాల తనయుండు దోర్దర్ప | ధుర్యుండు ధృష్టకేతుండు, సమర  
తే. లంపటుండు శిఖండియు లావు వెరవు | గలరు, నీయెడ ననురక్తిఁగలరు, సాలఁ  
బెంపుగల, రుక్కు ముట్టిన తెంపుగలరు | కోరి పతులుగఁ జేయు మక్షోహిణులకు.

### [5.4.110](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.110)

వ. అని దండనాథుల నిశ్చయించి వెండియు.

### [5.4.111](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.111)

క. ‘కురుసైన్యము నిస్సారం | బరయఁగ మన బలము లెల్ల నతిదృఢములు; నీ  
వరవాయి గొనక నడపుము | ధరణీశ్వర! సేన మొగము దైవమ నీకున్‌.

### [5.4.112](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.112)

క. నీ యనుజులు దివిజులకు న | జేయులు ధృతరాష్ట్రసుతులఁ జెఱుచుట వ్రేఁగే?  
తోయజనాశము గజలీ | లాయత్తము గాదె! యెత్తు మాహవమునకున్‌.’

### [5.4.113](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.113)

వ. అని నిర్ణయించి నారాయణుఁడు నిజనివాసంబునకుం జనియె; ధర్మతనయుండు దమ్ములుం దానును బ్రియంబంది యారాత్రి సుఖనిద్ర సేసిరి; రేపకడయ పాండవాగ్రజుం డనుజతనుజ దనుజాంతక సామంత మంత్రి పురోహిత సహితంబుగాఁ బేరోలగంబున నుండి సమస్త పరివారంబును వినఁ గార్యంబు నిశ్చయంబుఁ దెలియంబలికి, తగువారలతో సముచిత సంభాషణంబులు సేసి, మహనీయ మహిమ వెలయం బుండరీకాక్షుండు పనిచినట్ల పాంచాలనాథ ప్రముఖుల నక్షౌహిణులకు నధిపతులుగా వేఱువేఱ యభిషేకించి, శ్వేతవంశజాతుం డగుటంజేసి శ్వేతుండనం బ్రఖ్యాతుం డగు ధృష్టద్యుమ్నునకు నుత్కృష్ట ప్రకారంబున నభిషేకం బొనర్చి సర్వసేనాధిపత్యంబునకుం బట్టంబుగట్టి, యయ్యెనమండ్రను దక్కటి దొరలను గనుంగొని మధురవాక్యంబుల నగ్గించి కౌరవులతోడి కయ్యంబునకుం గురుక్షేత్రంబునకు విడియం బోద’మని చెప్పి వారినెల్ల ధనంజయునకుం జూపి.

### [5.4.114](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.114)

ఉ. ‘ఎప్పుడు నెయ్యెడం బొదివి యిందఱకుం దగ నీవు కంటికిన్‌  
ఱెప్పయుఁ బోలె మాటయి నెఱిం బను లారసి యొజ్జచాడ్పునం  
జెప్పుచు వీరిబుద్ధిఁగొని చేయుము కార్యము; నీకు రక్షగా  
నిప్పరమేశ్వరుండు గలఁ; డిచ్చు శుభం’ బని చూపెఁ గృష్ణునిన్‌.

### [5.4.115](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.115)

వ. ఇట్లు గాంభీర్య మాధుర్య ధుర్యుండైన యుధిష్ఠిరుండు వరిష్ఠ ప్రభువుల చిత్తంబు లారాధించి సర్వజన సమ్మతంబుగా సమరోత్సాహంబు చేసి మహోల్లాసంబునం బ్రస్థాన భేరి సఱవంబంచిన.

### [5.4.116](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.116)

సీ. బీఱెండ తాఁకున బీఁటలు వాఱిన | పచ్చిగోడల మాడ్కిఁ బగిలె దిశలు,  
కాఁగిన యెసరుల కరణిఁ బొరిం బొరి | శరనిధు లుప్పొంగి పొరలఁబడియెఁ,  
గలముపైఁ గీలించి గాలి కెత్తిన చాఁప | వోలె మిన్నంతయు బూరటిల్లెఁ,  
గులపర్వతావళి కులిశభయంబున | బెదరి వాపోవున ట్లెదురుసెలఁగె,  
తే. ధాత్రి కుమ్మరి సారె విధమునఁ దిరిగెఁ | జిత్రరూపులభంగి నిశ్చేష్టితంబు  
లయ్యె సర్వభూతములుఁ బ్రయాణభేరి | భూరి నిష్ఠుర ఘోరభాంకార మడర.

### [5.4.117](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.117)

వ. ఇట్లు ప్రస్థాన భేరి చెలంగిన సకల సైన్యంబులు దండనాథ సహితంబుగా సన్నద్ధంబులయ్యె; మఱునాఁడు.

### [5.4.118](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.118)

ఉ. భూరి విభూతిఁ బెండ్లికిని బోవు తెఱంగునఁ బాండునందనుల్‌  
దారును బుత్త్రులున్‌ హరియుఁ దమ్ముఁడు నుజ్జ్వల చారులీల శృం  
గారము చేసి, సమ్మద వికాస మెలర్పఁగ వీర సంభ్రమో  
దార సముద్ధతిం జనిరి ద్రౌపది యున్నెడ కందఱుం దగన్‌.

### [5.4.119](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.119)

వ. ఇట్లుచని యమ్మహాదేవి నామంత్రణంబు సేసి తత్ప్రభృతి పుణ్యస్త్రీ కరకలితలలితాక్షతంబులు గైకొని, విప్రాశీర్వాదంబులాదరించుచు, భద్రపాఠక శ్లోకంబు లాకర్ణించుచు, శోభన పదార్థంబులు గనుంగొనుచు, నాంగిక మాంగల్య సూచకంబులు సేకొనుచు వెడలునప్పుడు.

### [5.4.120](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.120)

క. తగ శంఖ కాహళాదిక | మగు మంగళ తూర్యసంచయము గంభీరం  
బుగ మ్రోసె జయముఁ దెలుపుచు | జగతీశ్వరు మ్రోల నాకసము దీటుకొనన్‌.

### [5.4.121](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.121)

క. మనుమని జయప్రయాణం | బనుమోదింపంగ నా సుధాంశుఁడు సనుదెం  
చినకరణి గొడుగు కుంతీ | తనయాగ్రజుమ్రోల నతిసితప్రభ నొప్పెన్‌.

### [5.4.122](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.122)

వ. అట్టి యెడ నమ్మహీవల్లభుండు.

### [5.4.123](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.123)

క. ఉచితగతిఁ జేరి వంది | ప్రచయముఁ గీర్తింప నెక్కె రథమం దొనరన్‌  
ఖచియించిన వజ్రంబుల | రుచులను బొలుపారు సీవిరులు బెరయంగన్‌.

### [5.4.124](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.124)

వ. తదనంతరంబ.

### [5.4.125](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.125)

సీ. వక్ష స్థ్సలంబున వనమాల క్రాలంగ | వెలిమావు గెడల వాగెలు ధరించి  
నొగలపై హరియొప్ప నగచరకేతువు | మెఱయంగ నరదంబు మెఱుఁగు లడర  
దివ్యకిరీటంబు దీప్తులు భూనభోం | తరమెల్లఁ గలయంగఁ బరఁగుచుండ  
గాండీవతూణ యుగ్మములు పూర్వాపర | భాగంబులకు నవాభరణములుగఁ  
తే. దెలి మొగంబుతో నల్ల నేతెంచి యొక్క | పార్శ్వమునఁ బొడసూపి భూపతికి మ్రొక్కి  
దేవదత్తంబు పూరించె దేవదేవు | పాంచజన్యంబునకు మున్న ఫల్గునుండు.

### [5.4.126](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.126)

శా. భీముండుం గవలుం గుమారులును సంప్రీతిన్‌ గదాద్యాయుధో  
ద్దామ స్ఫీత రుచుల్‌ వెలుంగ, రథ సంతానంబు రమ్యోజ్జ్వల  
శ్రీ మీఱన్‌ దగ వచ్చి శంఖములు గర్జిల్లంగఁ బూరించుచున్‌  
భూమీశుం గని యగ్రభాగమున కొప్పుం బెంపునుం జేయుచున్‌.

### [5.4.127](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.127)

క. నిలిచిరి, తక్కటి దొరలును | బలుమానుసులును మహోగ్రభంగి సవరణల్‌  
సెలువొంద నధిపు చుట్టుల | నలంకరించిరి విభూషణాంశుచ్ఛటలన్‌.

### [5.4.128](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.128)

వ. అప్పుడు పాండవాగ్రజున కభిముఖంగాఁ జనుదెంచి.

### [5.4.129](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.129)

క. సాష్టాంగ మెఱఁగి సమరా | వష్టంభం బొప్ప దివ్యవాహన లీలో  
త్కృష్టగతిన్‌ ముంగలియై | ధృష్టద్యుమ్నుండు వొలిచెఁ దేజో మహిమన్‌.

### [5.4.130](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.130)

వ. ఇవ్విధంబునం జారుభీషణంబుగా సన్నద్ధుండై యుధిష్ఠిరుండు గదలి శుభసూచకంబులు గైకొనుచు నడచె; నట్టిసమయంబున నెల్లవారి పరిచారకులును శకటాది సకల సాధనంబులును బటగృహంబులును మొదలుగా వలయు సమస్త వస్తువు లొడఁగూర్చి వెడలిన దండు పఱపై సముద్రంబు గాఁపువోవు చందంబయ్యె; నిట్లరిగి ధర్మపుత్త్రుండు కురుక్షేత్రంబు దఱియంజొచ్చి ఋష్యాశ్రమంబులకు దేవతాయతనంబులకు నలజడి గాకుండం బరిహారంబు సేయుచుం జని తృణకాష్ఠ జలసమృద్ధంబై తగియెడు సమస్థలంబున హిరణ్వతి యను పుణ్యనది పొంత విడిదలగా నిరూపించి యచ్చో నిలిచెఁ; దదనంతరంబ.

### [5.4.131](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.131)

తే. విడియుటకు సూచకంబుగ విష్ణుఁ డొత్తెఁ | బాంచజన్యంబు; ధర్మజపార్థులాది  
గాఁగఁ దమతమ వీరశంఖంబు లెల్ల | దొరలు నొత్తిరి దివి మ్రోఁతఁ దూఁటుగట్ట.

### [5.4.132](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.132)

వ. తదనంతరంబ యొక్క రమ్యప్రదేశంబున రాజమందిరంబును నుచిత స్థానంబుల సమస్తజన నివాసంబులునై రమణీయబంధురంబును సింధురాశ్వశాలా మాలికా మనోహరంబునుంగా వీడెల్ల విడిసె; వీటి చుట్టునుం దిరిగి ధృష్టద్యుమ్నుండు సురక్షితంబు చేసివచ్చె; రాజును దొరలును దమ్ములును సకల పరివారంబును దగిన తెఱంగున నుండిరి. నానావస్తు బహుళ సంభారంబుల మహోదారం బగుచుఁ బాండవ స్కంధావారంబు మహనీయాకారంబున నొప్పె; నంత నక్కడ.

### [5.4.133](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.133)

క. చారులచే నంతయు విని | కౌరవపతి విననియట్ల కర్ణాదులతోఁ  
బేరోలగమున విగత వి | కారుండై యిట్టు లనియె గర్వ మెలర్పన్‌.

### [5.4.134](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.134)

క. ‘తన వచ్చిన కార్యము మన | మనుకూలతఁ జేయకున్న హరి యలుకమెయిన్‌  
జని యప్పాండు తనూజులు | మనములఁ గిను కూనునట్టి మాటలు సెప్పున్‌.

### [5.4.135](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.135)

చ. మును మనచేత భంగపడి ముచ్చిరి యుండుటఁ జేసి పాండునం  
దనులును నెత్తివత్తు రుచితంబుగ; సంగర మెట్లుఁ గల్గుఁ; బే  
ర్చిన బహుసైన్యముల్‌ బయలఁ జేరఁ దగన్‌ విడియింత; మెల్లి దం  
డని పురిఁ జాటఁ బంచి దొరలందఱకున్‌ బడిసేయుఁ డేడ్తెఱన్‌.

### [5.4.136](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.136)

వ. మనకు విడిదల కురుక్షేత్రం’బని పలికి దుశ్శాసనుం జూచి, నీవును గర్ణుండును గాంధారపతియును సమస్తంబును సమకట్టుం’ డనుటయు వారలు ప్రియంబునం బనిపూని వెడలి దండు సాటించి, తగు వారలకెల్ల నెఱింగించి పుచ్చిన, సకల పరివారంబును బ్రమోదంబు నొందె; భూవల్లభుండును గొలిచియున్నవారలం బోవంబంచి, వలయు నెడకుం జని తగిన వర్తనంబున నుండె; నట్టి సమయంబునఁ బ్రయాణోచితంబులగు బహుప్రకార వ్యాపారంబులయందుఁ దత్పరులయిన దొరల నానాచేష్టితంబులను, గరితురగ రథంబులకు సవరణలు సమకూర్చు చతుర పరిచారకుల సంభ్రమంబునను, వివిధాయుధంబులు రవణంబులుగా నాయితంబులు సేయఁ బ్రవర్తించు పదాతి వర్గంబుల సంరంభంబునను నయ్యైసరకులు పయనంబున కనువు సేయ బలుమానుసుల తిరుగుడు వడుటనుం బురంబు సమరోత్సాహ చంద్రోదయంబునకు మహార్ణవంబై ఘూర్ణిల్లుచుండె; నపరదిన ముఖంబున.

### [5.4.137](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.137)

క. త్వరితగతి సమయ సముచిత | కరణీయము లాచరించి కమనీయాలం  
కరణోజ్జ్వలుఁడై యెలమిం | గురురా జేతెంచెఁ గొలువు కూటంబునకున్‌.

### [5.4.138](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.138)

వ. వచ్చి దుశ్శాసన ప్రముఖ నిఖిలసహోదర పరివృతుండై యుండి.

### [5.4.139](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.139)

సీ. అరిభయంకరుఁడు ద్రోణాచార్యుఁడును, రణో | త్సాహ లంపటుఁడు రాధాసుతుండు,  
శరతత్త్వవేది యశ్వత్థామయును, భూరి | బాహా విలాసుండు బాహ్లికుండు,  
శౌర్య వైభవశాలి శల్యుండు, ధైర్యసం | పన్నిధి కృపుఁడును, బ్రకటశక్తి  
సార దుర్జయమూర్తి భూరిశ్రవుండును, | దర్పోజ్జ్వలుండు గాంధారపతియు,  
తే. నుగ్రతేజుండు గృతవర్మయును, బ్రతాప | ఘనుఁడు కాంభోజుఁడును, బరాక్రమధనుండు  
సింధురాజును బతులుగాఁ జేయఁగోరి | కొనఁగఁ దగువార లగుదు రక్షోహిణులకు.’

### [5.4.140](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.140)

చ. అని మది నిశ్చయించి తగ నందఱఁ బిల్వఁగఁ బంచి వారితో  
నని పని మాటలాడి వినయంబునఁ బ్రార్థన చేసి ‘మీర లీ  
యొనరిన సైన్యముల్‌ పదునొకొంటికిఁ బ్రాభవ మాచరింపఁ జొ  
చ్చిన సకలంబు నొప్పు నభిషేకముఁ గైకొనుఁ డుత్సవంబునన్‌.

### [5.4.141](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.141)

క. అనవుడు నందఱు నౌఁగా | కని సంతసమంద నధిపుఁ డభిషేకించెన్‌  
జనులెల్ల సంప్రమోదం | బునఁ బొందఁగ నప్పు డతివిభూతి దలిర్పన్‌.

### [5.4.142](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.142)

వ. ఇట్లు మహామహిమ వెలయ నక్షోహిణీ నాయకుల సమకట్టి రారాజు పితామహుపాలికి వారిం దోడ్కొని చని సవినయంబుగా నతనికిఁ బ్రణామంబుసేసి, వారలం జూపి ‘వీరల మన యక్షోహిణులు పదునొకొంటికిం బతులఁ గావించితి; నిన్నిసైన్యంబులు నొక్కలావున వర్తించు చందంబు సూచికొనవలయు’ నని చెప్పుచుఁ జేతులు మొగిచి యిట్లనియె.

### [5.4.143](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.143)

చ. ‘నెఱిఁబడి యాజి నీ మొనలు నేరవు కూడి తగం జరింప నిం  
దఱ మన సొక్కఁడై చనక తప్పుఁగదా బహుదేశవాసు లం  
దఱొకటి సేయుచో వెరవు దప్పక చెల్లుట యెట్లు గల్గు? ని  
త్తెఱఁగొక చాలు వాని బలుతీర్పునఁ గాక పొసంగ నేర్చునే?

### [5.4.144](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.144)

ఆ. అమరసేనలును దమంతన వర్తింప | నేర కునికి నా కుమారు మొగము  
గానొనర్ప వలసెఁగాదె! సమస్తసే | నలను నీవ యరసి నడపవలయు.

### [5.4.145](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.145)

క. తారలకుం జంద్రునిగతిఁ | గౌరవులకు మేటి వీవ; కావున నీవీ  
భారంబు పూని మముఁ గడ | చేరుపఁదగు నెమ్మెయిం బ్రసిద్ధచరిత్రా!

### [5.4.146](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.146)

తే. సర్వసేనాధిపత్యంబు నిర్వహింప | నీవు దక్క నిం దొక్కరు నీవ యరసి  
చెప్పుమా కలఁడేని; రక్షింపు మమ్ముఁ, | బూని పట్టంబుఁ దాల్పుము, పొడిచి గెలుము.’

### [5.4.147](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.147)

వ. అనిన విని గాంగేయుండు గాంధారేయున కిట్లనియె :

### [5.4.148](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.148)

ఆ. ‘మీరుఁ బాండుసుతులు నారయ నా కొక్క | రూప; కార్య మున్నరూపు వలుక  
వలయుఁ; గయ్యమైన వత్తు మీలోన నా | యునికి చందమునకు నుచిత మిదియ.

### [5.4.149](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.149)

క. సేనాధిపత్యమును దగఁ | బూనెద; నను మార్కొనంగఁ బురుషుల నుర్విం  
గానఁ; గిరీటికి నొక్కని | కే నోర్వ; నతండు శరము లెక్కు డెఱుంగున్‌.

### [5.4.150](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.150)

క. పెఱవారినెల్లఁ దరమిడి | నఱకుదుఁ; బాండుక్షితీశ నందనులను రూ  
పఱసేయం జేయాడదు; | తఱుమరు నామీఁద నత్యుదగ్రత వారున్‌.

### [5.4.151](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.151)

వ. అప్పటికిఁ దగిన భంగి యయ్యెడు; నది యట్లుండె’ నని పలికి మఱియు నిట్లనియె.

### [5.4.152](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.152)

ఆ. ‘మున్ను కర్ణునొండె నన్నొండెఁ గయ్యంబు | చేయఁ బనుపు; మిట్లు సేయువాఁడ  
వైనఁ గాని సకల సేనాధిపత్యంబుఁ | బూన నేరఁ జుమ్ము భూపవర్య!’

### [5.4.153](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.153)

వ. అనినం గర్ణుండు కౌరవపతితో నిట్లనియె :

### [5.4.154](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.154)

క. ‘ఇప్పుడు క్రొత్తగ దీనిం | జెప్పంగా నేల? మున్న చెప్పితిఁగాదే!  
యెప్పుడు భీష్ముండు వడు నే | నప్పు డనికి వచ్చువాఁడ నని సభలోనన్‌.’

### [5.4.155](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.155)

ఆ. అనిన ‘నట్ల కాక’ యని సర్వసేనాధి | పత్యభార పట్టబంధమునకు  
నియ్యకొనియె భీష్ముఁ; డయ్యగ్గలికఁ గొని | యాడె విభుఁడు ప్రముదితాత్ముఁ డగుచు.

### [5.4.156](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.156)

క. ‘భేరీ మృదంగ శంఖ మ | హారవములు సెలఁగఁ జేయుఁ’డని పనిచి, మహో  
దార పతాకా ద్యుత్సవ | గౌరవములు నడపె నెల్లకడలం బురిలోన్‌.

### [5.4.157](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.157)

వ. అట్లు పట్టణాలంకారంబు సంఘటించి, రత్నకాంచన కలధౌతమయంబులగు కలశంబులఁ దీర్థజలంబులు దెప్పించి, మణిప్రకరంబునఁ గుసుమ నికరంబున మంగళ తరు త్వక్పల్లవ ప్రచయంబున మహౌషధి నిచయంబున విహిత మంత్రంబుల నుచిత తంత్రంబుల ఋత్విక్పురోహిత సహితుండై త త్సంస్కార ప్రకారం బాచరించి.

### [5.4.158](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.158)

క. గురుఁడును గృపుఁడును లోనగు | గురు లనుమోదింప, బాహ్లికుండు మొదలుగాఁ  
గురుజాతి యెలర్పఁగ న | న్నరపతి భీష్మాభిషేచనం బొనరించెన్‌.

### [5.4.159](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.159)

తే. ఇవ్విధంబున నభిషేక మెలమిఁ జేసి | పరమభక్తి నక్షోహిణీపతులఁ జూపి  
‘వీరికిని సైన్యములకును మీర యొడయ’ | లనుచుఁ బట్టంబుఁ గట్టె శంతనుతనూజు.

### [5.4.160](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.160)

క. అత్తఱిఁ బాషాణంబులు | నెత్తురు నెమ్ములను గురిసె, నిష్ఠుర నినదా  
యత్తమయి నభము పిడుగుల | మొత్తంబులు వడియె నగరమున నెల్లెడలన్‌.

### [5.4.161](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.161)

క. దానికి జను లుత్సాహ వి | హీనతఁ బొందంగఁ, గౌరవేంద్రుఁడు నానా  
దానాదు లయిన శాంతి వి | ధానము లొనరించి యానతత్పరమతియై.

### [5.4.162](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.162)

క. తల్లియుఁ దండ్రియు వెఱఁగునఁ | బుల్లవడన్‌ వారికడకుఁ బోయి తడయఁగా  
నొల్లక పయనపు వీడ్కో | లెల్లను దనయిచ్చ నడపి యేడ్తెఱ వెడలెన్‌.

### [5.4.163](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.163)

తే. వెడలి తమ్ములుఁ దగువారు వివిధభృత్య | గణముఁ దానును నేల గ్రక్కదలఁ గదలి  
రాజరాజు గాంగేయుఁ బురస్కరించి | కొని సముద్ధతి నడచె దిక్కులు వడంక.

### [5.4.164](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.164)

వ. నడచి కురుక్షేత్రంబు దఱియం జొచ్చి యం దొక్క రమణీయ ప్రదేశంబు విడిదలగా నిరూపించి నిలిచి, భానుసూనుండునుం దానును మెలంగి యెల్లవారిని విడియించి, నడుమ నిజనివాసంబు గావించినఁ, గౌరవేశ్వరు స్కంధావారంబు వారణపురంబున నెవ్వ రెయ్యెడ వసియింతు రాచందంబున నందంబై యొప్పె; నిట్లు రెండు వీళ్ళును సన్నద్ధంబులైన సమయంబున.

### [5.4.165](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.165)

ఉ. సంధికి నేఁగి కార్యము పొసంగక కృష్ణుఁడు రాకయున్‌, సుహృ  
ద్బాంధవ సంఘయుక్తముగఁ బాండవ కౌరవ వీరు లష్ట ది  
క్సింధుర కంధరంబు లడఁగించు బలంబుల పెల్లుతోడ గ  
ర్వాంధత నాజికెత్తుటయు నా బలభద్రుఁ డెఱింగి యార్తుఁడై.

### [5.4.166](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.166)

వ. కతిపయ పరివారంబు పరివేష్టింప రయంబునం జనుదెంచి సముచిత ప్రకారంబున ధర్మనందనుం బేరోలగంబునం గని సంభ్రమాలింగనాసనార్ఘ్య పాద్యంబుల నతనిచేత సంభావితుండయి, దామోదర భీమార్జున నకుల సహదేవుల యభివాదనంబు లాదరించి, పాంచాల విరాట ప్రముఖులగు తగువారల వినయంబుల నభినందించి, యా దొరలతోఁ దత్కాలయోగ్య మితసంభాషణంబులు సేసి, యనంతరంబ వారల కిట్లనియె:

### [5.4.167](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.167)

క. ‘కౌరవ పాండవు లెంతయుఁ | గ్రూరత వాటించి బంధుకోటికి నిఖిలో  
ర్వీ రమణులకుం జేటుగఁ | బోరికిఁ దెగి; రిట్టి ఘోరపుంబని యగునే?

### [5.4.168](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.168)

తే. ఇట్టిదానికి నోర్వక యెన్నఁడేనిఁ | గృష్ణుతోడ నేఁ జెప్పితిఁ, గినిసి యిరు దె  
ఱంగువారికిఁ దగఁ జెప్పి సంగతంబు | సేయు మని యెంత సెప్పినఁ జేయఁడయ్యె.

### [5.4.169](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.169)

క. పలుకుల పొం దెఱుఁగని వా | రలఁ బూజావాక్యములఁ దిరంబై తనకుం  
దెలుపం దగదే? యే మని | యలుకమెయిన్‌ సంధి సెఱిచి హరి యేతెంచెన్‌?

### [5.4.170](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.170)

తే. వీరు వారును సంబంధ విషయబంధు | లగుట సరిగాదె హరికిఁ; దా నర్జునునకుఁ  
బక్షపాతంబు చేయుటఁ బాండవులను | బెట్టుచోటులు గానక పట్టి క్రాలు.

### [5.4.171](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.171)

ఉ. కావున వీరికిన్‌ జయము గల్గుట నిశ్చయ; మెల్ల భంగులం  
జావు నిజంబు వారికి; నసంశయమై యిటులుండ దీని నె  
ట్లే వినఁ జూడ నేర్తుఁ? దగ నింత ప్రవీణుల నేన చేసితిం  
జూవె! సుయోధనుం బవనసూనుని నొండొరుఁ జంపఁ జూతునే?

### [5.4.172](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.172)

క. హరి యెఱుఁగని చక్కటియుం | బురుషార్థము నా కెఱుంగఁ బోలునె? యీ ని  
ష్ఠురత వినఁ జూడఁ జాలక | సరస్వతీ తీర్థమునకుఁ జనియెడు బుద్ధిన్‌.

### [5.4.173](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.173)

వ. మీకుం జెప్పిపో వచ్చితిఁ; బోయి వచ్చెద’ నని పలికి బలదేవుండు వాసుదేవ ధర్మపుత్త్రు లొడంబడి యనుపఁ దీర్థయాత్ర వోయెఁ; దదనంతరంబ.

### [5.4.174](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.174)

సీ. కృష్ణుని దేవి రుక్మిణి సోదరుఁడు రుక్మి | యను రాజు బలవిక్రమాన్వితుండు  
శార్ఙ్గగాండీవ విజయములు నాఁగల | దివ్య చాపములఁ దృతీయమైన  
చాపంబు గలవాఁడు సైన్య సమేతుఁడై | చనుదెంచి ధర్మజుఁ గని తదీయ  
సత్కారములు గాంచి సముచితాసనమున | నుండి యక్కొలువున నున్న వీరు  
ఆ. లెల్ల వినఁ గిరీటి కిట్లను ‘సమరంబు | సేయ వెఱచితేనిఁ జెప్పు; నాకు  
నెదురు లేరు జగతి నెవ్వరు; నీకుఁ దో | డ్పడి జయింతు నెట్టి పగఱనైన.’

### [5.4.175](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.175)

వ. అని తన్ను నాక్రమించి తన తోఁబుట్టువు రుక్మిణిం గొనివచ్చిన యా కృష్ణు సన్నిధిని సిగ్గులేక యాడిన మాటలు విని, చిఱునవ్వు నవ్వుచుం గవ్వడి యతని యాననం బాలోకించి.

### [5.4.176](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.176)

తే. ‘చెనసి గంధర్వసేన నిర్జించునపుడు | మత్స్యనాథు గోవర్గంబు మరలఁ దెచ్చు  
నెడను దప్పె; నీకందువ యెఱుఁగనైతి | నింక నౌఁగాని తోడుగ మ్మెచటి కైన.’

### [5.4.177](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.177)

వ. అని యతని యుత్తరమునకుఁ దగిన యట్ల పలికి, మఱియును.

### [5.4.178](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.178)

క. ‘ము న్నే నసహాయుఁడనై | చన్న గతిం జనఁగ నైన చందం బయ్యెన్‌;  
వెన్నుఁడు తోడుగలఁడు; వెఱ | పెన్నండును వలవ దింక నేమిటికైనన్‌.

### [5.4.179](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.179)

చ. వెఱచితి రాఁగదే యనిన వెండికదా పగఁదీర్తు వీవు; నా  
వెఱపెటులున్న నీ రథిక వీరులు వాపెద; రొల్ల నిన్ను; నీ  
యుఱుకడ కేఁగి తోడుపడు మొడ్లకు నెవ్వరికేని’ నన్న నే  
డ్తెఱ నతఁ డేఁగి కౌరవపతిం గని యట్టుల బెట్టుపల్కినన్‌.

### [5.4.180](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.180)

క. ఆతఁడివి యేటిమాటలు | నీ తోడగు టొల్లఁ బొ’మ్మనిన రుక్మి వృథా  
యాతాయాస విషణ్ణుం | డై తన పురమునకు మగుడ నరిగెం బెలుచన్‌.

### [5.4.181](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.181)

తే. ఇట్లు బలదేవ రుక్ముల కిద్దఱకును | గయ్యమునకు సన్నాహంబు గలుగదయ్యెఁ  
గాని తక్కులోకమ్మునఁ గలుగు నృపతి | కోటి యిరువాఁగు నందును గూడె ననికి.

### [5.4.182](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.182)

వ. అట్టియెడ నిశాసమయంబున ధృతరాష్ట్రుండు సంజయు రావించి యిట్లనియె.

### [5.4.183](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.183)

క. ‘బవరము గీడని యెఱుఁగుదు | నవినీతుండైన కొడుకు నదలిచి యుడుపం  
దివిరియు నోరాడమి దై | వ వశం; బప్పనికి మనకు వగ పింకేలా?

### [5.4.184](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.184)

క. ఎయ్యది గానున్నది యది | యయ్యెడుఁ; జేయునది గలదె? యవనీశులకుం  
గయ్యానఁ జచ్చుటయు మే; | లయ్యొప్పుట లెస్సగాక! యది యట్లుండెన్‌.

### [5.4.185](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.185)

వ. రెండు వీళ్ళును గురుక్షేత్రంబున విడిసిన పిదపం బుట్టిన విశేషంబులు గలవేని నెఱింగింపుము.’

### [5.4.186](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.186)

తే. అనిన సంజయుఁ డిట్లను ‘నకట! కొడుకు | మీఁదఁ దప్పు పెట్టెదవు నీ మీఁది కొఱఁత  
నీకుఁ గానంగ వచ్చునె? నీ వెఱుంగ | కుండఁ బఱచెనె యాతండు పాండుసుతుల?

### [5.4.187](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.187)

వ. ఆ పని గడవంబడియె; వార్తలు వినియెదవేని వినుము; దుర్యోధనుండు దుశ్శాసన శకుని కర్ణులతో విచారించి యులూకుం బిలిపించి నీవు వోయి పాండవులంగని వాసుదేవు సన్నిధిని బాంచాల విరాట ప్రముఖులు వినఁ బలుకు’మని పరుసని మాటలు గఱపి పుచ్చిన నతండును.

### [5.4.188](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.188)

క. చని కొలువున ధర్మసుతుం | గని ‘దుర్యోధనుఁడు చెప్పఁగా నను నియమిం  
చిన మాటలు గొన్ని గలవు | విను మలుగక’ యనిన నతఁడు విని యిట్లనియెన్‌.

### [5.4.189](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.189)

ఆ. ‘నీకు వెఱవనేల? నిన్ను నా బుద్ధిమం | తుండు చెప్పు మనిన తులువమాట  
లెన్ని గలవు వాని నన్నింటి ననుమాన | మింత లేక యాడు మెల్ల వినఁగ.

### [5.4.190](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.190)

వ. అనిన నులూకుం డిట్లనియె :

### [5.4.191](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.191)

సీ. ‘కయ్యంబునకుఁ బెద్ద కాలమేనియుఁ బూఁచి | పట్టి వచ్చితి కడు బరవసమున;  
సంజయుతో మీరు శంకలే కాడిన | యెక్కుడు మాటలు పెక్కు గలవు;  
భూమి భాగము గోలుపోయిన యలుకకు | ద్రౌపదిఁ బఱచిన దైన్యమునకుఁ  
దగ మంచిబంటవై తఱి యిది బాహుబ | లాస్త్ర విద్యలు చూపనని తలంచి  
ఆ. నిలువ వలయు నీకుఁగలవారి నెల్లను | గూర్చి మోహరించికొని కడంగి  
నడవు సమరమునకు; వెడజంకఁబోదింకఁ | దప్పఁ గ్రుంకలేదు తఱికిఁ జొరుము.

### [5.4.192](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.192)

క. ఆతతబలుఁ డగు భీష్ముని చేతి | బలువు ద్రోణు నంపసెల లవియుటయుం  
జూతు రటురండు కృష్ణుని | చేతన సకలంబుఁ జక్కఁ జేసికొనుండీ!

### [5.4.193](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.193)

క. వారిద్దఱ వాలమ్ముల | బారింబడి యర్జునునకు బ్రదుక వశమె? మీ  
వారెల్ల నెఱుంగరె య | వ్వీరుల దివ్యాస్త్రశస్త్ర విభవ సమృద్ధుల్‌?’

### [5.4.194](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.194)

వ. అని భీమసేనుం జూచి.

### [5.4.195](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.195)

క. ‘ఈ వాయుపుత్త్రుఁ డాజిం | ద్రావుదు నే దుస్ససేను రక్తం బనియెం;  
ద్రావఁగ శక్యం బేనిం | ద్రావు మనన్‌ రాదె? యింకఁ దడ వేమిటికిన్‌?

### [5.4.196](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.196)

క. విను నూతి కప్ప విధమున | నిను నీవ యెఱుంగు; దెఱుఁగ నేరవు గర్వం  
బున నావలి కొలఁది రణం | బున నొకమరి పెట్టువడక పోనేర్చెదవే?’

### [5.4.197](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.197)

వ. అని పలికి సవ్యసాచిం జూచి.

### [5.4.198](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.198)

తే. ‘వినుము గాండీవ మనునొక విల్లు తాటి | పొడవు గలిమియుఁ, గృష్ణుండు పూని తోడు  
గూడుకొని వచ్చుటయు నెఱుంగుదుము; వీని | కెల్ల శంకించి భూమి పా లీము గాని.

### [5.4.199](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.199)

క. పవనజు గదయును నీ గాం | డివమును నెట వోయె నంగడికిఁ బాంచాలిం  
దివిచికొని వచ్చునెడఁ బరి | భవ మెఱుఁగవె బీర మేల పలుకుదు తోడ్తోన్‌?

### [5.4.200](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4.200)

చ. వలలుఁ డనన్‌ విరాటుకడ వంటలవాఁడయి భీముఁడున్‌, బృహ  
న్నల యన నాఁడు పేడివయి నాన యొకింతయు లేక నీవు న  
గ్గలమగు దైన్యమొంది కడుఁ గాఱియ వొందితి రుర్వియేలునా  
సలఁబడి; సవ్యసాచి! యిది శౌర్యమొ? బాహుబలంబొ? చెప్పుమా!

_First 200 of 430 passages. [Read on](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4)_

---
Source: [https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4) · Pramāṇa
