<!-- Pramāṇa, a library of Indian primary sources · https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5 -->

[Pramāṇa](https://indike.org/pramana/) › [Indian literature](https://indike.org/pramana/in) › [Epic, Poetry, Drama & Narrative](https://indike.org/pramana/in.lit) › [The Mahābhārata and its versions](https://indike.org/pramana/in.lit.mahabharata) › [Mahābhāratas in Indian regional languages](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa) › [Andhra Mahabharatamu](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra) › 5

# Andhra Mahabharatamu 5

Āndhra Mahābhāratamu 5

- **Language:** Telugu

## Contents

- [5.1 ఉద్యోగపర్వము — ప్రథమాశ్వాసము](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1) — 386 parts
- [5.2 ఉద్యోగపర్వము — ద్వితీయాశ్వాసము](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.2) — 335 parts
- [5.3 ఉద్యోగపర్వము — తృతీయాశ్వాసము](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.3) — 415 parts
- [5.4 ఉద్యోగపర్వము — చతుర్థాశ్వాసము](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.4) — 429 parts

### ఉద్యోగపర్వము — ప్రథమాశ్వాసము

### [5.1.1](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.1)

క. శ్రీగౌరీ పల్లవపుట | యోగాశ్రయ మంజరీ సముజ్జ్వల మూర్తీ !  
యోగీంద్ర సంతతాంత | ర్యాగ పరీపాకరూప! హరిహరనాథా !

### [5.1.2](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.2)

వ. దేవా! వైశంపాయనుండు జనమేజయున కిట్లనియె.

### [5.1.3](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.3)

తే. ఎలమి నభిమన్యు పెండిలి యివ్విధమునఁ | జేసి, యుల్లాసలక్ష్మిఁ గైసేసి మత్స్య  
మనుజపతి యన్వయంబు పావనము సేసి, | దినచతుష్టయానంతరమునఁ బ్రియమున.

### [5.1.4](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.4)

వ. ధర్మతనయుండు దమ్ములుం గొడుకులుం బరివేష్టించియుండ, విశాలరమణీయంబగు విరాటు కొలువు కూటంబున కరిగి యందు.

### [5.1.5](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.5)

క. విరటుఁడుఁ, బాంచాలుండును, | హరియును, రాముండు, వారి యనుజ తనూజుల్‌,  
పరిణయ సమాగతాఖిల | ధరణీశులు బలసియుండఁ, దద్దయు నెమ్మిన్‌.

### [5.1.6](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.6)

వ. ఉన్నసమయంబున సభాసదులైన మానవేంద్రులు నానావిధంబులఁ గృష్ణ యుధిష్ఠిరులతో సంభాషణంబులు సేయుచుండఁ, బాండవకార్యార్థియై కృష్ణుండు తదీయ వచనంబులు వారించి, వారలఁ గలయం గనుంగొని యిట్లనియె.

### [5.1.7](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.7)

మ. ‘కపటద్యూతమునందు సౌబలునిచేఁ గౌంతేయు లాత్మీయరా  
జ్య పదభ్రంశముఁ బొంది, సత్యనిరతిన్‌ శక్తాత్ములై యుండియుం  
గుపితస్వాంతులు గాక, తత్సమయ సంక్షోభంబు గాకుండఁగా,  
విపినావాసము, గూఢచర్యయును గావింపం దలం పొప్పదే?

### [5.1.8](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.8)

ఆ. తలఁచినట్ల వ్రతము సలిపి యమ్మాడ్కిఁ బం | డ్రెండు వత్సరములు పాండవేయు  
లకట! క్రూరసత్త్వ యాతుధానావలి | తోడఁ గాననమునఁ గూడి మనరె?

### [5.1.9](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.9)

క. పదపడి, దుస్తరమగు నీ | పదుమూఁడగునేఁడు గడవఁబడుట యరిది; త  
మ్మెదు రెఱుఁగమికై యాపద | లొదవిన సైరించి; రిట్టి యునికియుఁ గలదే?

### [5.1.10](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.10)

క. మీరలు ధర్మజు వర్తన | గౌరవ మెఱుఁగుదుర కాదె? కావున నా గాం  
ధారీ తనూభవులకును, | వీరలకును హితమగా వివేకప్రౌఢిన్‌.

### [5.1.11](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.11)

తే. ధర్మమార్గంబు దప్పక తలఁపుఁ డొక్క | తెఱఁగు; ధర్మువు దప్పి యుధిష్ఠిరుండు  
పడయ నొడఁబడఁ డయ్యింద్రపదవియైన; | నుచితగతి నెంత వడసిన నుల్లసిల్లు.

### [5.1.12](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.12)

వ. కావునఁ బాండవులకుఁ బితృధనంబగు రాజ్యంబుఁ గపటద్యూతంబున దుర్యోధనుఁ డపహరించుటయు, నది వీరలు దిగ్విజయంబుఁ జేసి యలవరించుకొన్న పదం బగుటయు; ధర్మసూను మహానుభావంబు విచారింపక ధార్తరాష్ట్రులు పరిభవించినం దెగి యితండు వారలకుం గీడు రోయమియు, నీరెండు దెఱంగుల వారికిం బంచి కుడువందగుటయుం దలపోసి, తగిన కార్యంబు సెప్పనర్హుల; రేనును నాకన్నంత సెప్పెద వినుండు.

### [5.1.13](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.13)

క. కుంతీతనయులు సమయము | శాంతతమై నడపి, తమ భుజాబలమును, దు  
ర్దాంతోద్యమ శౌర్యము నెఱిఁ | గింతు మనుచు నున్నవారు గిను కెదఁ గదురన్‌.

### [5.1.14](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.14)

క. వీరి తలం పెఱిఁగిన గాం | ధారీ తనయుఁడు సుహృద్వితానముఁ గూర్చుం,  
‘బోరఁ బరిమార్తుఁ గొంచెపు | వారై యున్నెడన’ యని యవశ్యముఁ గడఁకన్‌.

### [5.1.15](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.15)

క. అలఘు బల విక్రమోదా | త్తుల కైనను బలము లేక దోర్గర్వముమై  
గెలువఁగ వశమె, సహాయము | కలిమి ననంతంబు లగు పగఱసైన్యములన్‌?

### [5.1.16](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.16)

క. కావునఁ బాండవ పక్షము | భూవల్లభకోటి యిచటఁ బ్రోవగు; నిమ్మై  
నీ వీరులు, నా వీరులు | దేవాసురులట్ల యనికిఁ దెగుదురు గడిమిన్‌.

### [5.1.17](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.17)

వ. ఇది యిక్కడి తెఱంగునకుఁ దోఁచిన తలం; పక్కడివారి చిత్తవృత్తి యెట్టిదగుట యెఱుంగ; మెదిరిమతంబెఱుంగక యెట్టికార్యంబు నిశ్చయింప వెరవగునే? కావున ని య్యవసరంబునం దగిన మానిసి నందులకుం బుచ్చవలయు; దుర్యోధనుండు వీరికి రాజ్యంబు పా లిచ్చిన మేలగుఁగాక, తక్కిన నప్పటికిఁ బోలినపని సూచుకొంద’మని పలికిన విని బలదేవుం డియ్యకొని రాజలోకంబు నాలోకించి యిట్లనియె.

### [5.1.18](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.18)

క. ‘హరి వాక్యము వింటిరె? యిది | యిరు దెఱఁగుల జనములకును హితమును ధర్మో  
త్తరమును నైయున్నది యీ | వెరవున శక్యంబు మనకు వీరలఁ దీర్పన్‌.

### [5.1.19](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.19)

చ. తమ సగపాలు గోలుపడి దానిన యిప్పుడు గోరు వీరికిన్‌  
సముచితవృత్తి నిచ్చి తమ సామున సంతసమంది యున్కి యు  
క్తము ధృతరాష్ట్రసూనునకు; దాన నపాయము లేకయుండుఁ; గో  
పముడిగి వీరు సేయుదురు బాంధవ; మిజ్జగముం బ్రియంపడున్‌.

### [5.1.20](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.20)

వ. కావున నిక్కార్యం బెడసేయక యొక్కరుం బనుపవలయు; వాఁడునుం జని యభిమతంబు సాధించునప్పుడు.

### [5.1.21](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.21)

ఆ. మాట పొందెఱింగి, యోటమై నల్లన | చేరి, కౌరవేంద్రు చిత్తవృత్తి  
కనుగుణంబుగాఁగ నానతుం డగుచుఁ బ్రా | ర్థించి యడుగకున్నఁ దెఱఁగుపడదు.

### [5.1.22](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.22)

వ. అది యెట్లనిన, ధర్మనందనుం డతని యుద్ధతికిం బుయిలోడి, మెయివడిగల నడవడిం బ్రవర్తిల్లుచుండియు, జూదంబు వెంట మోసపోయి, తొడరి చిక్కునం బడియె; అదియును నతం డక్షవిద్యాపాటవంబు దనకు మిగుల లేమింజేసియు, బంధుజనంబులు దన్ను వారించుటయుఁ, దా నాడుట మాని గాంధారరాజును నియమించినం, దత్కళా కౌశలంబునం బరిణతుండు గావున నా శకుని యాడి, యుధిష్ఠిరుం డొడ్డిన యొడ్డిమియు గెలుచుచు వచ్చె నట్లగుట, నాతని యందును గొఱంత లే; దిత్తెఱంగున వార లధర్మపరులని నిందింపరాకునికి కారణంబుగా వీరలు వుచ్చినమానిసి వినయంబుతోన యిక్కార్యంబు దీర్చికొని రావలయు’ ననిన, సాత్యకి కోపించి యిట్లనియె.

### [5.1.23](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.23)

ఆ. ‘ఇట్టు లాడఁదగునె? యిది నీక పోలు ని | న్నేమనంగ నేర్తు? నిత్తెఱంగు  
పాడి గాఁగఁ బూని పలుకంగఁ జెవి యొడ్డి | యాదరించువారి నందుఁగాక!

### [5.1.24](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.24)

క. వేడుక పుట్టిన జూదం | బాడెనె ధర్మజుఁడు? వార లందఱుఁ దమలోఁ  
గూడుకొని పిలిచి బలిమిన | యాడి కపట జయము గొనుట యది దగవగునే?

### [5.1.25](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.25)

క. ధర్మతనూభవు దెస దు | ష్కర్మము రూపించిన సభ నొకండును మైమైఁ  
బేర్మి సెడక పోనేర్చునె? | ధార్మికు లిం కెట్టివారు తథ్యం బరయన్‌?

### [5.1.26](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.26)

చ. పలికినచందముల్‌ నెఱపి పైతృకమై చను రాజ్యభాగ మి  
మ్ములఁ బడయం దలంచి బలముం జలమున్‌ నెఱపం గడంగు వీ  
రలు నొరు వేఁడఁబోదురె? యరాతులు సాధుల మెత్తురే? రణం  
బుల జయలక్ష్మిఁ జేకొనుటఁ బోలునె యొండొకరాజధర్మముల్‌?

### [5.1.27](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.27)

తే. సముచితములగు మాటలఁ జక్కఁబడక | తక్కెనే, నుక్కివుం డగు ధార్తరాష్ట్రుఁ  
గ్రూరశరముల నే నియ్యకొలుపువాఁడ | నవని కౌంతేయులకు నిచ్చునట్లుగాఁగ.

### [5.1.28](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.28)

క. భీమార్జునులకు రణమున | నే మగలును బ్రతియె? వీరు నేనును సైన్యో  
ద్దాములమై నడచిన, నే | భూమీశులు నెదిరి బ్రదికిపోవం గలరే?

### [5.1.29](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.29)

ఆ. కవలవారుఁ, గొడుకుగమియుఁ, బాంచాలవ | ర్గంబు, వృష్ణివరులుఁ గడఁగిరేని,  
నొక్క మాత్రలోన నువ్వెత్తుగొనరె? దు | ర్యోధనాది శతము నుద్దవిడిన.

### [5.1.30](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.30)

క. ఈ మత్స్యపతి సహాయము | గా మాకుం దీర్పరాని కార్యము గలదే?  
సామాద్యుపాయపరుఁ, డు | ద్దామ భుజాబలయుతుం డితఁడు కేవలుఁడే?

### [5.1.31](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.31)

క. నా మతమునఁ గార్యము సం | గ్రామము సేయుటయ; యిట్లుగా కీలోనన్‌  
సామవచనంబు లక్కురు | భూమీశ్వరుతోడ నాడఁ బుచ్చెదరేనిన్‌.

### [5.1.32](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.32)

ఉ. దైన్యము దక్కి దూత యుచితంబుగఁ బాండునృపాలుపాలు రా  
జన్యవరుండు ధర్మజుఁడు సమ్మతి వేఁడెడు నన్న, లోక సా  
మాన్య విధిం దగంగ గరిమంబున నిచ్చినఁ బుచ్చికొంద; మ  
న్యోన్య విరుద్ధభాషణము లాడినఁ, దత్ఫల మాతఁ డందెడున్‌.

### [5.1.33](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.33)

వ. అనిన ద్రుపదుం ‘డిది వోలు; బలదేవు మాట మాట గాదు. బలపరాక్రమవంతుండును, సహాయ సంపన్నుండును, దుష్టాత్ముండునునైన దుర్యోధనుండు ప్రియవచనంబుల రాజ్యంబు పాలిచ్చుట కియ్యకొనమి సిద్ధంబు; యుద్ధంబునంగాని చక్కంబడఁ’ డని పలికి మఱియు నిట్లనియె.

### [5.1.34](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.34)

క. ‘మృదుభాషణముల దుర్జన | హృదయములు ప్రసన్నతామహిమఁ బొందునె? యె  
ల్లిదముగఁ గొని, యంతంతకు | మద మెక్కుంగాక దురభిమానముపేర్మిన్‌.

### [5.1.35](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.35)

వ. అదియునుంగాక.

### [5.1.36](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.36)

తే. కూటికై ద్రోణభీష్ములు గుమతి యనక | యనుసరింతురు; ధృతరాష్ట్రుఁడును దనూజు  
తృష్ణ నూనినవాఁడు; రాధేయు బోఁటి | తులువ లెల్లను నతని సద్బుద్ధి యండ్రు.

### [5.1.37](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.37)

వ. కావున నతండు దుర్వినీతుండైయుండు; నెల్లభంగుల సంగరంబు గాఁగలయది; యీ సమయంబున బలంబులంగూర్చికొని పిలువందగు రాజులం బిలిచి పుచ్చవలయు; సుయోధనుండును దోడాసపడి పుచ్చు; నుచితపరులగు నరపతులు దొలుతఁ జెప్పినవారిక సహాయత్వంబుఁ జేయంజూతురు; మనము వెసగల కాలరుల వేగంబ పుచ్చి, శల్య కేకయ ధృష్టకేతు జరాసంధతనయ ప్రభృతు లయిన భూపతులకును, వారి వారి బంధు మిత్ర జనంబులకునునెఱింగించి పుచ్చుట కార్యం; బిది నాకుం బోలిన తెఱం’ గని పలికి తన కెలన సముచితాసనంబున నున్న విప్రవరుం జూపి.

### [5.1.38](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.38)

క. ఇతఁడు మదీయాగ్ర పురో | హితుఁ; డితనికి నెల్లపనులు నెఱిఁగించి తగన్‌  
ధృతరాష్ట్రు కడకుఁ బనుపుఁడు | చతుర వచన రచనఁ గఱపి సంప్రీతిమెయిన్‌.

### [5.1.39](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.39)

ఉ. ఆతని సమ్ముఖంబునఁ దదగ్రతనూజుకడన్‌ మరున్నదీ  
జాతుని సన్నిధిం గలశసంభవునొద్దఁ గ్రమోచితంబుగా  
నీతెఱఁ గిట్టులాడుమని యేర్పడ నంతయుఁ జెప్పిపుచ్చఁగా  
నీతిమెయిం దగం బలుక నెయ్యము లాభముఁ, బెంపుఁజొప్పడున్‌.

### [5.1.40](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.40)

వ. అనిన వాసుదేవుండు ‘పాంచాలపతి వచనంబు లుచితంబులయి యున్నయవి; యిబ్భంగిన చేయవలయు’ నని పలికి’ మఱియు నిట్లనియె.

### [5.1.41](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.41)

క. ‘కౌరవులకుఁ బాండవులకు | నారయ నే నొక్కరూప; యట్లగుటఁ దగన్‌  
వారును వీరును దమతమ | నేరిమిమెయి ధరణి యేలి నెగడఁగఁ జూతున్‌.

### [5.1.42](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.42)

తే. పెండ్లికని పిల్వఁ బంచినఁ బ్రియముతోడ | నేఁగుదెంచితి; మిన్నాళ్ళు నెల్ల యొప్పి  
దములఁ జూచితి; మియ్యెడఁ దడవుగాఁగ | నిలువఁ దీఱదు పోయిరావలయు మాకు.

### [5.1.43](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.43)

వ. అని పలికి ద్రుపదు నాలోకించి ‘మీరు మాకెల్లవారికి గురుస్థానంబు; మీ మాట యనిన ధృతరాష్ట్రుండు బహుమానంబు సేయు, మిమ్ము శాంతనవుండునుం గొనియాడు; మీయందు ద్రోణకృపాచార్యులు సఖ్యంబు వాటింతు; రట్లగుటం జేసి.

### [5.1.44](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.44)

తే. పాండవార్థమై యొక్కరుఁ బనుప మీక | భరము; మీ పలు కందఱపలుకు; మీరు  
తెఱఁగు పఱుపంగ మిగిలి యుద్రేకులైన | వార చెడువారు; విమలవిచారవిభవ!

### [5.1.45](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.45)

క. పొందైన లెస్స; విరసపుఁ | గ్రం దయ్యెడు చందమైన, రాజుల నెల్లన్‌  
ముందఱ రావించి క్రమం | బొందఁగ, మముఁ బిలువఁ బంపుఁ డొయ్యన పిదపన్‌.

### [5.1.46](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.46)

క. మీ పనుపున రాజ్యము పా | లీపాండు తనూభవులకు నీకున్న, భుజా  
టోపభయంకరుఁ డర్జును | కోపానల మడరి ముట్టికొనదే వారిన్‌?’

### [5.1.47](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.47)

చ. అని, గమనోన్ముఖుండయి మురాంతకుఁ డా ద్రుపదుండు ధర్మనం  
దనుఁడు వృకోదరాదులగు తమ్ములు మత్స్యమహీవిభుండుఁ ద  
న్ననుప, హలాయుధ ప్రభృతి యాదవలోకము తోడరా ముదం  
బున నిజపట్టణంబునకుఁ బోయె సముజ్జ్వల వైభవంబునన్‌.

### [5.1.48](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.48)

వ. వివాహ మహోత్సవంబునకు వచ్చిన తక్కటి రాజులును సంగ్రామ సన్నాహంబునకై తమ తమ పురంబులకుం జనిరి; తదనంతరంబ.

### [5.1.49](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.49)

క. సమరమునకుఁ దగు నుద్యో | గమునఁ బ్రవర్తిల్లి రెలమిఁ గౌంతేయులు; మ  
త్స్య మహీనాథుఁడు సన్నా | హము సేసెన్‌; ద్రుపదవిభుఁడు నాయిత మయ్యెన్‌.

### [5.1.50](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.50)

వ. ఇట్లు సన్నద్ధులై వెలివీడు విడిసి తమకు ననురక్తులైన రాజుల పాలికిం దగుదూతలం బుచ్చి; రట దుర్యోధనుండు వీరల చందంబు విని, తానును దన బంధుమిత్రగణంబైన రాజలోకంబు నెల్ల రావించిన.

### [5.1.51](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.51)

క. ఇభ తురగ స్యందన గతి | రభసంబునఁ బృథివి యద్రువ రాఁ దొడఁగిరి భూ  
విభులు నలుదిక్కులను లో | క భయంకరలీల నుభయకటకంబులకున్‌.

### [5.1.52](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.52)

వ. అట్టి సమయంబున నజాతశత్రు ననుమతి వడసి పాంచాలపతి వయోజ్ఞానవృద్ధుండైన తన పురోహితుం గురుపతిపాలికిఁ బుచ్చువాఁడై యతని రావించి.

### [5.1.53](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.53)

క. ‘హితుఁడవు, మతిమంతుండవు, | చతుర వచన కోవిదుఁడవు, సమయజ్ఞుఁడ, వు  
న్నత వంశవర్ధనుఁడ, విం | గిత వేదివి, నెచ్చెలివి, సుకృతి వ ట్లగుటన్‌.

### [5.1.54](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.54)

తే. నాకుఁ గర్తవ్య మగుపని నీకుఁ జేయఁ | దగవుగావున నెల్లవిధములఁ బూని  
పాండవార్థంబు ధృతరాష్ట్రుపాలి కరిగి | నేర్పువాటించి కార్యంబు దీర్పవలయు.’

### [5.1.55](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.55)

వ. అని చెప్పి యొడంబఱిచి యతనితో మఱియు నిట్లనియె.

### [5.1.56](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.56)

క. ‘విను కొడుకు గొన్న వేఁదుఱ | కొని కొట్టిన తిండికాఁడు కుటిలుం డతఁ; డా  
జనపతి చందము, ధర్మజు | ననుపమ శీలంబు నెఱుఁగు; దది యట్లుండెన్‌.

### [5.1.57](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.57)

తే. పుడమి పాలు పాండవులకు నడుగఁబోయి, | నీవు ధృతరాష్ట్రుతో ధర్మ నిష్ఠమైన  
యుచిత మాడిన, నందుఁ బోటొడ్డియున్న | దొరల భృత్యుల మనములు దిరుగఁబడవె?

### [5.1.58](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.58)

క. గురుభీష్మాదుల మనములు | దురమునకుం జొరకయుండ దుర్యోధనుఁ డా  
తురుఁడై యొడఁబఱుపఁగ ని | ప్పరుసున నెరవైన ఱిచ్చవడు బల మెల్లన్‌.

### [5.1.59](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.59)

ఉ. పాండుతనూభవుల్‌ వడిన పాటులు బంధులకెల్లఁ దెల్పుచున్‌,  
బండిత వృద్ధ సజ్జనుల పాలికిఁబోయి కులోచితంబు గా  
కుండుట సూపి చెప్పుచుఁ, బ్రియోక్తులఁ దక్కటివారి ‘నిట్లు మే  
లొండొకచంద మొప్ప’ దని యుల్లములం దలపోయఁ జేయుచున్‌.

### [5.1.60](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.60)

వ. మఱియు సమస్తజనంబుల మనంబుల నిక్కడ వ్రాలునట్టి యుపాయంబు లెన్నిగల వన్నియు నయ్యై తగవులమై నాచరించుచుఁజరియించునది; యిచ్చట విరాటు కొలువు కూటంబునం బుట్టిన కృష్ణాదుల సంవాదంబు తెఱంగును మన యెఱింగినయదియె; తదనురూపంబుగాఁ బలికి పాండవులకుఁ దేజోలాభంబు గావించుట కర్తవ్యంబు; నీవు కరినగరంబున వసియించి ధృతరాష్ట్ర ధార్తరాష్ట్ర గాంగేయ విదుర గురుకృపాదుల కడ కరిగి నానాఁటికి వారి వారి చిత్తంబుల తెఱంగెఱింగి ప్రవర్తింపుము; దైవగతింజేసి నీయొడ్డిన సూత్రంబునకు సుయోధనుం డొడంబడియెనేనియు నదియ సకల జనసమ్మతంబయినవిధంబగు; దాన నజాతశత్రుండును బ్రీతుండగుఁ బోయి ర’మ్మని నిశ్చయంబు సేసిన, నమ్మహీసురవరుండు.

### [5.1.61](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.61)

క. మును పాంచాలవిభుని వీ | డ్కొని ధర్మజు భీము నరు నకులు సహదేవుం  
గని యనుమతుఁడై యందఱు | ననుపఁగ మన్ననలు వడసి యరిగెం బ్రీతిన్‌.

### [5.1.62](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.62)

వ. అంత నక్కడ దుర్యోధనుండు, సకల రాజన్య సామాన్యంబుగా గోపాలదేవు పాలికి దూతం బుచ్చుట దగ వగునే?యని విచారించి.

### [5.1.63](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.63)

క. వెరవుమెయిఁ దాన కతిపయ | పరిజన సహితముగ నరిగెఁ బటు తురగ గతి  
స్ఫురణానుమోదలీలా | భరితుఁ డగుచు వేగిరంపుఁ బయనములఁ దగన్‌.

### [5.1.64](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.64)

వ. చని తదీయ పురప్రవేశంబు సేసె; నా దివసంబున ధనంజయుండును గోవిందుం గానవచ్చె నట్టియెడ.

### [5.1.65](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.65)

తే. అతఁడు పవడింప మును కౌరవాధినాథుఁ | డరిగి తలయంపి దెస నున్నతాసనమున  
నుండెఁ, బదపడి కాల్కడ యొద్ద కల్లఁ | జని వినమ్రుఁడై నిలుచుండె సవ్యసాచి.

### [5.1.66](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.66)

వ. అంత.

### [5.1.67](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.67)

క. మేలుకని కృష్ణుఁ డర్జును | నాలోకించి మఱి కౌరవాధిపుఁ గని త  
త్కాలోచిత బహుమతిమైఁ | జాలఁ బ్రియం బిరువురకుఁ బ్రసన్నతఁ జేసెన్‌.

### [5.1.68](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.68)

వ. తదనంతరంబ.

### [5.1.69](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.69)

ఉ. వారలఁ జూచి కేశవుఁడు ‘వచ్చిన కార్యము సెప్పుఁ’డన్న న  
క్కౌరవనాథుఁ డిట్లనియెఁ; ‘గయ్యము సేయువగన్‌ సహాయముం  
గోరి భవత్సకాశమునకుం జనుదెంచితి; మేము వీరు నీ  
కారయ నొక్కరూప హృదయంబునఁ బేర్చిన బాంధవంబునన్‌.

### [5.1.70](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.70)

క. ము న్నేను గానవచ్చితి | నిన్ను; సుజనులైనవారు నెమ్మిని మునుమున్‌  
గన్నం దగఁ గైకొండ్రు; స | మున్నత సౌజన్య సారయుతుఁడవు నీవున్‌.

### [5.1.71](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.71)

వ. కావున లోకంబుపాడి విచారించి నాకుం దోడు గావలయు’ ననిన వాసుదేవుం డిట్లనియె.

### [5.1.72](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.72)

ఉ. ‘నీ విట మున్న వచ్చి;తిది నిక్కము; పార్థునిఁ దొల్తఁ గాంచితిం;  
గావున మీకు నిద్దఱకు గౌరవ మొప్పఁగఁదోడుపాటు స  
ద్భావము; దీనికిం దెఱఁగు దప్పకయుండఁగ నేర్పరించెదన్‌;  
మీ వల పెట్టు లట్ల తగ నీవును నీతఁడు గోరికొం డొగిన్‌.

### [5.1.73](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.73)

క. నా పాటియ పదివేవురు | గోపాలురు గలరు సమరకోవిద బాహా  
టోపాభిరామమూర్తులు, | చాపాద్యాయుధ కళా విశారదచిత్తుల్‌.

### [5.1.74](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.74)

క. నారాయణాభిధానులు | వారలు గయ్యంబు సేయువా; రొక్కెడ నే  
నూరక నిరాయుధ వ్యా | పారతమై నుండువాఁడఁ బరమాప్తుఁడనై.

### [5.1.75](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.75)

క. వా రొకతల, యే నొక తల; | యీ రెండు దెఱంగులందు నెయ్యది ప్రియ మె  
వ్వారికిఁ జెప్పుఁడు; దొలితొలి | గోరికొనన్‌ బాలునికిఁ దగుం బాడిమెయిన్‌.’

### [5.1.76](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.76)

క. అని పలికి హరి కిరీటిం | గనుఁగొని ‘కొండుకవు నీవు గావున, నీకున్‌  
మును గోరఁ బాడి’ యనవుడు | విని కృష్ణునిఁ గోరికొనియె విజయుం డెలమిన్‌.

### [5.1.77](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.77)

ఆ. దాని కాత్మఁ బొంగి ధార్తరాష్ట్రుఁడు వారి | నపహరించికొనినయట్ల కాఁగఁ  
దలఁచి, చెన్నుమీఱి, బలములఁ గైకొని | చనియెఁ బ్రీతి రాము సదనమునకు.

### [5.1.78](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.78)

వ. చని యతనిం గని సమ్మానంబు వడసి తనవచ్చిన కార్యం బెఱింగించిన దుర్యోధనునకు బలదేవుం డిట్లనియె.

### [5.1.79](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.79)

క. ‘అభిమన్యు వివాహమునకుఁ | బ్రభువర్గం బెల్లఁ గూడఁబడియుండఁగ, నా  
సభ నీకై యేఁ బలికితి; | నిభపురమున మాట వుట్ట దె ట్లీవు వినన్‌?

### [5.1.80](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.80)

వ. దానికిఁ గొంద ఱసహ్యపడి పాండవ పక్షపాతంబునం బ్రతికూలవచనంబులు వలికిన, నవి కృష్ణునకుఁ బ్రియంబులై యుండె నట్లగుటం జేసి.

### [5.1.81](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.81)

తే. అతనిఁ బాసి యొక్కింత ప్రొద్దైన నిలువఁ | జాలమియు మూలముగ, విరసంపు మాట  
లాడ నొల్లమి, నేమియు ననక యంత | నుండి యొక నిశ్చయమ్ముమై నున్నవాఁడ.’

### [5.1.82](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.82)

వ. అది యెయ్యది యంటేని.

### [5.1.83](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.83)

క. మీరును వారును జలమునఁ | బోరెడునెడ, నెద్ది యెట్లు వోయిన నెఱి నే  
నూరకయుండుదుఁ; దో డె | వ్వారికిఁ బో; నింత నిక్కువం బెబ్భంగిన్‌.’

### [5.1.84](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.84)

వ. అనిన విని, దుర్యోధనుండు దాని కియ్యకొని, సవినయంబుగా బలదేవుని వీడ్కొని, వాసుదేవు నామంత్రణంబుసేసి, కృతవర్మ పాలికిం జని, యాతం డొక్క యక్షౌహిణితోడఁ దన్నుంగలయవచ్చువాఁడయి యూఱడం బలికినఁ బ్రియంబంది, నిజపురంబున కరిగెఁ; దదనంతరంబ కృష్ణుం డర్జునున కిట్లనియె.

### [5.1.85](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.85)

క. ‘నారాయణ గోపాలుర | భూరిపరాక్రములఁ గురువిభుఁడు గొన, సంగ్రా  
మారంభరహితు నన్నుం | గోరికొనుట నీకు మేలగునె తలపోయన్‌?’

### [5.1.86](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.86)

క. అనుటయు, నాతఁడు హరి కి | ట్లను: ‘నేను రణంబునకు సహాయం బొల్లన్‌;  
విను, సుప్రసిద్ధుఁడవు నీ | వని సేసినఁ, బేరు నీక యగు నెప్పాటన్‌.

### [5.1.87](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.87)

వ. నీ కెదురై జయంబు గొనరా; దట్లగుటం జేసి, విజయమూలం బగు నీతోడును వలయు; నీవు సమరంబు సేయకునికియుం బ్రియంబు కావున నిన్నుం గోరికొంటి’ నని చెప్పి మఱియు నిట్లనియె.

### [5.1.88](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.88)

క. ‘సారథ్యం బొనరింపు మ | పారకృపాలీల నెల్లభంగుల నా; కీ  
గౌరవమును జిరకాలము | గోరినయది; దీని నిమ్ము గుణరత్ననిధీ!’

### [5.1.89](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.89)

క. అనినఁ గిరీటికి హరి యి | ట్లను ‘నీదగు కోర్కి దీర్చు టది నాకు వ్రతం  
బనఘా! తగ సారథ్యం | బొనరించెద నీకు నసమయుద్ధక్రీడన్‌’.

### [5.1.90](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.90)

క. అని యూఱడించి, నరుఁ దో | డ్కొని, ధర్మతనూజునొద్దకుం బ్రియ మెసఁగం  
జనుదెంచెం గార్యాలో | చనమును దగఁజేయు బుద్ధి శౌరి గడంకన్‌.

### [5.1.91](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.91)

వ. అంత నట శల్యుపాలికిం బోయినదూత లతనిం గని సముచితాలాపంబుల సమరసహాయత్వంబునకుఁ గోరి పిలిచినం బ్రీతుండై యతండును బుత్త్రమిత్త్రసమేతంబుగా నానాసేనాతిసంకులంబుగాఁ గదలి పాండవు లున్నయెడకు నిత్యప్రయాణంబుల నడచు సమయంబున.

### [5.1.92](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.92)

తే. ఇంతయును విని కౌరవాధీశ్వరుండు | దక్షులగు నాప్తజనములఁ దత్‌క్షణంబ  
మద్రనాథుని చనియెడు మార్గమునకుఁ | బుచ్చి యెడనెడ నతుల విభూతి మెఱయ.

### [5.1.93](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.93)

సీ. అరుదారు మేలుక ట్లాయితం బై చూడ | నొప్పారి తను పగు చప్పరములుఁ,  
బరపైన చెలువంబు గరగరికయుఁ దియ్య | తెలి నీరుఁ గలిగిన దీర్ఘికలును;  
బొడవైన మువ్వంచఁ బొలుచునట్లుగ నేనుఁ | గులకు గుఱ్ఱములకుఁ గొట్టములును,  
ముందర బయలైన చందంబుఁ జతురాభి | మతమైన యాస్థానమండపములు  
ఆ. బియ్యములును, నేయుఁ, బెరుఁగును, గూరఁగా | యలును, వంటకట్టియలును, గడ్డి,  
కవణములును బెల్లుగా నొడఁగూర్చి ని | గూఢవృత్తిఁ దానుఁ గూడ నడచె.

### [5.1.94](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.94)

వ. ఇవ్విధంబున విడిదల పయనంపు సంపదలు వొంపిరివోవం దనకు సమకట్టిన సమస్త వస్తువుల యవైకల్యంబునకు శల్యుండు సంతుష్టాంతరంగుండై నిజపరిజనంబులం జూచి ‘యిట్లు చతురంబుగా మనకు వలయువాని సంపాదించుటకుఁ బ్రవర్తకులైన యుధిష్ఠిరామాత్యు లెవ్వారు? వారలం దోడ్కొని రండు; వారలు ప్రసాదదానంబున కర్హు’లని పలుకు నవసరంబున, నటమున్న పలుదెఱంగులఁ బనులు సేయుచున్న తన పల్లాయనంబువారిలోఁ గలసి మఱువడియున్న కౌరవేశ్వరుం డమ్మాటలు విని, యతనికిం బొడసూప నిదియ సమయంబని సముచిత ప్రకారంబునఁ దన్నెఱింగించికొని వినయంబునఁ గనిన, నతండును సంభ్రమంబున గాఢాలింగనంబు సేసి కనకాసనంబున నునిచి, ‘యింతయు నిమ్మహాత్ము నుద్యోగంబున నయ్యెం గావలయు’ నని తలంచి విస్మయంబంది ‘నీ కెయ్యది యిష్టంబు గోరు మిచ్చెద’ ననిన, గాంధారీ నందనుండు పరమానందంబునం బొంది యిట్లనియె.

### [5.1.95](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.95)

క. ‘సత్యసరస్వతి వగు; మౌ | చిత్య విశారదము నీదు చిత్తము; నియమౌ  
దాత్త్యంబు మెఱయ నాకు న | మాత్యుఁడవై పూని నడపు మత్సైన్యంబున్‌.

### [5.1.96](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.96)

ఆ. తలఁపఁ బాండవులును ధార్తరాష్ట్రులు నీకు | నొక్క రూప; భక్తియుక్తిఁ జాల  
నీవు నన్ను మాననీయుండు గాఁగ న | నుగ్రహించి తగఁ బరిగ్రహింపు.’

### [5.1.97](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.97)

చ. అనవుడు శల్యుఁ డియ్యకొని, ‘యట్టిద కాదె, విభేదవృత్తి నా  
మనమున లేదు; పాండవసమాజము మీరును నొక్కరూప కా  
వున నిది లెస్సమాట దగవుం దలపోయఁగ; మున్ను ప్రీతిఁ గాం  
చిన నిను నెమ్మిఁ గూడుటయ చేయుదు నిట్టుల యెల్లభంగులన్‌.

### [5.1.98](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.98)

ఉ. దానఁ గొఱంత లే; దభిమతం బిది గాకయుఁ గల్గెనేనియుం  
బూని యొనర్తు’ నన్నఁ, గురుపుంగవుఁ డెంతయుఁ బొంగి ‘నీవు స  
మ్మానము సేసి నా కిటు లమాత్యుఁడవైన పదంబుకంటె మే  
లై నుతికెక్కు కోర్కి యెటు లారసి చూచిన నొండు గల్గునే?’

### [5.1.99](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.99)

వ. అనిన విని, వికచవదనుం డగుచు మద్రేశ్వరుండు.

### [5.1.100](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.100)

క. ‘చను నీవు హస్తి నగరం | బున; కేనును బాండుభూపపుత్త్రులఁ బ్రీతిం  
గని యట వత్తు; నవశ్యం | బును వారలఁ జూడవలయుఁ, బోయెద’ ననినన్‌.

### [5.1.101](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.101)

ఆ. ‘అట్లకాక; వేగ మట వోయి మరలుండు; | వరము మఱవకుండవలయు ! మిమ్ముఁ  
జేరి నెగడువాఁడఁ; గారుణ్యమున నిట | యరసి యుండుఁ’డనియెఁ గురువిభుండు.

### [5.1.102](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.102)

వ. అనవుడు.

### [5.1.103](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.103)

క. దరహాసముతో మద్రే | శ్వరుఁ డాలింగనము సేసి, ‘సందియపడ కీ  
వరుగు’ మని యనుప, నాతఁడు | కరిపురికిం జనియె మది వికాసముఁ బొందన్‌.

### [5.1.104](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.104)

వ. అంత శల్యుండు నుపప్లావ్యంబునకుం జని, స్కంధావారంబు దఱియం జొచ్చి, ధర్మనందనుని నివాసంబున కరిగిన, నతండు దమ్ములుం, దానును, ద్రౌపదీ సుభద్రలు, నభిమన్యు ప్రభృతి పుత్త్ర వర్గంబును నెదురువచ్చి, కృతప్రణాముండై, తోడ్కొనిపోయి, కాంచనాసనంబున నునిచి, యర్ఘ్యపాద్యంబు లిచ్చి, కుశలం బడిగిన, ‘సర్వంబును గుశల సంపన్నంబ’ యని వారల నందఱ నభినందించి, యుధిష్ఠిరుం బునరాలింగనంబు సేసి యిట్లనియె.

### [5.1.105](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.105)

క. ‘జనరహితంబగు వనమున | ననుజన్ములు, ద్రుపదభూవరాత్మజయును, నీ  
వును నింతకాల మలయక | యునికి కడున్‌ దుష్కరము, మహోదాత్తమతీ!

### [5.1.106](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.106)

ఆ. దానికంటె నరిది దలపోయ నజ్ఞాత | వాస ముజ్జ్వలాంగభాసమాను  
లైన, మీకు; మీ దయాసూనృతాదుల | పెంపు మిమ్ముఁ గడవఁ బెట్టకున్నె?

### [5.1.107](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.107)

క. ఇమ్మహి యెల్లను నీ మది | యుమ్మలికకుఁ జాల నొచ్చె, నుర్వీవర! నీ  
విమ్మెయి నిప్పు డఖిల దురి | తమ్ములుఁ గడచుటకు సమ్మదమ్మునఁ బొదలెన్‌.’

### [5.1.108](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.108)

వ. అని యుచితసంభాషణంబులు సేసి, దుర్యోధనుండు తన్నుం గాంచిన విధంబును, నతండు ప్రార్థించిన తెఱంగును, దానికిఁ దా నియ్యకొనుటయుం జెప్పిన, ధర్మనందనుం డతని కిట్లనియె.

### [5.1.109](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.109)

తే. ‘మేలు సేసితి; రొక్కరి మెచ్చి వారి | కోర్కి దీర్చుట పెద్దల గుణమ కాదె?  
యది మదీయ చిత్తమునకు హర్షకరమ; | తివిరి యొక్కటి వేఁడెద నవధరింపు.

### [5.1.110](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.110)

వ. పార్థునకుఁ గృష్ణుండు సారథ్యంబు సేయువాఁడై యున్నవాఁడు; కర్ణుండు పార్థుతో నెప్పుడు మచ్చరించుచునుండు; వీరిరువురకు సంగ్రామం బైనయప్పుడు కృష్ణునకుఁ బ్రతిసారథ్యం బొనరింప మీరకాని యక్కడం దక్కొరుండు లేఁడు; గావున, నవశ్యంబును మీకుం గర్ణసారథ్యంబు గర్తవ్యంబు గాఁగలయది; సమర సమయంబున నిరాకరించి పలికి కర్ణు చిత్తంబునకుం గలంకవుట్టించి పార్థు రక్షింపవలయు; నకృత్యంబని యనుమానింపక మత్ప్రార్థనంబున నెల్లభంగుల నివ్విధం బనుష్ఠించువా’రని యభ్యర్థించిన, సమ్మతించి శల్యుం డిట్లనియె.

### [5.1.111](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.111)

క. ‘అగు నిది వోలును; నాకుం | దగ వట్టిద; ‘కర్ణునకు రథంబు గడప నీ  
వగు’ దని కోరిన కౌరవ | జగతీశ్వరు ప్రార్థనంబు సలుపఁగవలయున్‌.

### [5.1.112](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.112)

క. కర్ణుని సారథినైనను | నిర్ణయమున కేను బార్థునిం గాచెద; నా  
దుర్ణయవిచారు నెమ్మెయిఁ | గర్ణకఠోరంబు లాడి కలఁతుం బోరన్‌.

### [5.1.113](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.113)

తే. దర్పమును దేజమును మాయఁ దలరఁ బలికి | చిక్కువఱిచిన, నేయంగఁ జేతులాడ  
కునికి, రాధాతనూజు నర్జునుఁడు తీవ్ర | బహుళ బాణపరంపర పాలుపఱుచు.

### [5.1.114](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.114)

చ. ఇది యొకఁ డేల? నీవు మది నెయ్యదిగోరినఁ జేయువాఁ డ; నాఁ  
డదయత సూతసూతి సభ నాడినమాటకుఁ జాల నొచ్చి మా  
హృదయము లెల్ల నీవలన నెంతయుఁ బక్షముసేయు; నక్కటా!  
యదియునుగాక మీ పడిన యాపద లెవ్వరి నొవ్వఁజేయవే?

### [5.1.115](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.115)

ఆ. ఇట్లు వడితి ననుచు నెద నీవు వగవకు; | గారవమున నీ మనోరథమ్ము  
ఫలము నొందు నెల్లభంగుల; దేవత | లయినఁ బడుదు రొక్క యవసరమున.

### [5.1.116](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.116)

క. వాసవుఁడు దొల్లి నిజకాం | తా సహితము గాఁగ నధికదైన్యము నొందెన్‌;  
మీ సంపద పెద్దయె? విధి | సేసిన గతిఁ బడకయుండ శివునకు వశమే?’

### [5.1.117](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.117)

వ. అనిన విని ధర్మనందనుం ‘డింద్రుండు శచీసమేతంబుగా నట్టి దురవస్థ యేమికారణంబున నెత్తెఱంగున ననుభవించె?’నని యడిగిన, మద్రపతి ‘దొల్లింటి యితిహాసంబు సెప్పెద విను’మని యిట్లనియె; ‘దేవతలయందు మాన్యుండై త్వష్ట యనుపేరం బరఁగువాఁడు వాసవునకుఁ గీడు దలంచి మూఁడుదలలవాని నొక్కని సృజియించి, విశ్వరూప నామధేయుం జేసిన, నతం డింద్రపదవిం గోరి ఘోరతపంబు సేయుచున్న, దానికి భయంబంది నిలింపపతి యప్సరః స్త్రీలఁ ‘దత్తపోభంగంబు సేయుం’ డని నియమించి పంచిన.

### [5.1.118](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.118)

క. వారి విలాసంబులను, వి | హారముల, విలోకనముల, నాలాపములన్‌  
మారవికారం బాతనిఁ | జేరద; యన్నాకపతియు సి గ్గెదఁ గదురన్‌.

### [5.1.119](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.119)

తే. తలరి యమ్మునిఁ దెగఁజూచి ధర్మరహితుఁ | డగుట, యెవ్వరు నెఱుఁగనియట్లు గాఁగ  
నేఁడు గాలంబు గడపిన, నెఱిఁగి భూత | గణము లాక్రోశ మొనరింపఁగా నతండు.

### [5.1.120](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.120)

వ. తన దుష్కర్మంబు ప్రకటంబగుటకు రోసి, యొక్కవిషమవ్రతం బాచరించి, సముద్ర తరు ధరణీ స్త్రీజనంబులయందు బ్రహ్మహత్య విభాగించి పెట్టి, నిజకల్మషంబుఁ బాపికొని, మునిగణ సేవితుండయి సముల్లాసంబునం బొంది యునికికిఁ ద్వష్ట కోపించి.

### [5.1.121](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.121)

తే. ‘అనపరాధుఁ, దపోనిధి, నధికశాంతి | యుక్తుఁ జంపిన పాపాత్ము నుఱక పట్టి  
మ్రింగఁ జాలెడు వాని, నుత్తుంగదేహు | నేను సృజియింతుఁ జూడుఁడీ యీ క్షణంబ.’

### [5.1.122](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.122)

చ. అనుచుఁ గడంగి నిష్ఠమెయి నగ్నిముఖం బొనరించి, వేలిమిం  
దనయు సృజించి, లోకవిదితంబుగ వృత్ర సమాఖ్య యిచ్చి ‘మ  
ద్వినుత తపోబలంబునఁ బ్రదీపిత తేజుఁడవై జయింపు నీ’  
వని నియమించి పంచె నమరాధిపుతో సమరంబు సేయఁగన్‌.

### [5.1.123](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.123)

చ. పనిచిన నాతఁడుం జనియె బాహుబలంబున నేచి; వాసవుం  
డని కెదురేఁగుదెంచె; నిటు లద్భుతసంగరమైనచోట న  
య్యనిమిషనాథుఁ బట్టుకొని యంగద వృత్రుఁడు మ్రింగె, దేవత  
ల్మనమున బెగ్గలింపఁగఁ జలంబు బలంబును జూపి యుగ్రుఁడై.

### [5.1.124](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.124)

వ. ఇట్లు మ్రింగినం ద్రిదశగణంబులు దత్‌క్షణంబ యాదైత్యునకు నావులించునట్టి యాలస్యం బావహించిన.

### [5.1.125](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.125)

తే. అసురనాథుండు నలసత యడర నీల్గి | యావులించిన, నత్తఱి నమరవిభుఁడు  
దన శరీరంబు సంకుచితంబు సేసి, | కడుజవంబునఁ గుప్పించి వెడల నుఱికె.

### [5.1.126](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.126)

క. వెలలి బలరిపుఁడు చలమునఁ | గలహమునకుం జొచ్చె; వృత్రు ఘనబాహుబలం  
బలవికి మీఱెను దండ్రి వి | మల తపమునఁ జేసి సురల మనములు దలఁకన్‌.

### [5.1.127](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.127)

వ. ఇట్లధికబలుండైన వృత్రు నాటోపంబు సహింపంజాలక సురపతి దెరలి మరలి పఱచి మందరగిరి శిఖరంబున కరిగినం, గనుకనిం జని యనిమిషు లతనిం గూడుకొని, వృత్రవధోపాయంబు విచారించునెడ, నవ్వాసవుండును దన మనంబున నిశ్చయించి.

### [5.1.128](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.128)

క. ‘హరిఁ గాంచి యతని చెప్పిన | పరమోపాయంబు సేసి బ్రతుకుద’ మనినన్‌.  
సుర లదియ కర్జమని య | మ్మురమర్దను కడకుఁ జనిరి మునులుం దారున్‌.

### [5.1.129](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.129)

వ. ఇట్లు దివిజానీకంబును పాకశాసనుం బురస్కరించుకొని

### [5.1.130](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.130)

మ. చని యా దైత్యుతెఱంగు సెప్పి, ‘యతులోత్సాహంబుమై నెప్పుడున్‌  
దనుజవ్రాతము త్రు ళ్ళడంచి, దివిజేంద్రశ్రీవిలాసంబు పెం  
పునఁ బొందించుట నీకు నైజము గదా, భూతేశ! ఘోరారిమ  
ర్దన సంక్రీడ యొనర్పు లోకముల కత్యంతప్రమోదంబుగాన్‌.’

### [5.1.131](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.131)

క. అనిన విని, ‘యొకటి సెప్పెద | వినుఁ డాతనితోడ సమరవిభునకుఁ దగఁ బొం  
దొనరింపుఁ; డొక్క సమయం | బున నడఁకువఁ గులిశధారఁ బొందెద నేనున్‌.

### [5.1.132](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.132)

వ. మదీయ తేజో విశేషంబున నప్పురుహూతున కుత్సాహంబు సంభవింపంగలయది. అప్పు డనాయాసంబునఁ బగతు వధియింప నగు’నని గదాధరుం డూఱడిలం బలికిన, బలసూదన ప్రముఖ నిఖిల సురలోకంబును సంతసిల్లి మగిడి వచ్చి వృత్రుకడకు మునిజనంబులం బుచ్చిన, వారునుం జని యతని కిట్లనిరి.

### [5.1.133](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.133)

క. ‘భుజ బల దుర్జయుఁ డింద్రుం; | డజయ్యుఁడవు నీవు; నీకు నతనికి మీలో  
విజయము దక్కదు; మీరే | చి జగంబులు నొవ్వ రణము సేయఁగనేలా?

### [5.1.134](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.134)

క. మైత్రీ సౌఖ్యముఁబోలునె | శాత్రవ మెమ్మెయిఁ దలంప? శక్రశ్రీకిం  
బాత్రమవై యింపుగఁ ద | న్మిత్రుఁడవగు; మిదియ మేలు మీ యిద్దఱకున్‌.’

### [5.1.135](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.135)

వ. అనవుడు వృత్రాసురుండు ‘తేజంబువాసికి నాసపడియెడు మా యిరువురకు సఖ్యంబు సమకూర నేర్చునే?’ యనుటయు నమ్మునులు’ సత్పురుష సాంగత్యంబు సంభవించినఁ జేయమి నీతి గాదు. మహేంద్రుండు సకల లోక సమ్మత సద్భావుండుగావున నతనితోడి చుట్టఱికంబు మే’లనిన నొడంబడి యతండు వారల కిట్లనియె.

### [5.1.136](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.136)

క. ‘ఏ నొక్క తెఱఁగు సెప్పెద; | దానిం గాదనక చేసి తగ మీరలు సం  
ధానము దృఢముగఁ జేయుం | డా నాకేశునకు నాకు నధికప్రీతిన్‌.’

### [5.1.137](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.137)

వ. ‘అది యెయ్యది?’ యనిన ‘ఆర్ద్రం బగుదానను, శుష్కంబైన సాధనంబునను, దారువునం, బాషాణంబున, శస్త్రాస్త్రంబులం, దివంబున, రాత్రి యందును నేను వధ్యుండఁ గాకుండవలయు’ ననిన, వారును దానికి నొడంబడి, యవ్వరంబు లొసంగి వృత్రవజ్రధరులకు మిత్రభావం బొనరించి, మగుడం జని, యత్తెఱంగు వాసవున కెఱింగించి నిజనివాసంబుల కరిగిరి, సురనాథుండు సుఖంబుండి, పెద్దకాలంబునకుం దన మనంబునఁ బాయని వైరంబు సైరింపంజాలక, దామోదరుని పూనికయు, మునిజనంబు సేసిన సంధి విధంబును నిరూపించి, రిపుం బరిభవింప రంధ్రాన్వేషణంబు సేయుచుండి యొక్కనాఁడు.

### [5.1.138](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.138)

చ. జలనిధి తీరభూమిఁ దన శత్రుఁ గనుంగొని, ‘వీని నిప్డు దో  
ర్బల మెసఁగంగ నాదు భిదురంబునఁ ద్రుంచెద; రాత్రిగాదు, తాఁ  
దలఁప దివంబుగా; దిది యుదగ్రపరాక్రమ యోగ్య సంధ్య; నా  
యలవుఁ జలంబుఁ జూప నెపమై తగు సాధన మెద్ది గల్గునో?’

### [5.1.139](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.139)

క. అని తలఁచుచు నచ్చట నొక | వననిధి ఫేనంబుఁ జూచి వాసవుఁ ‘డార్ద్రం  
బును శుష్కంబును గాదిది’ | యనుచుం గులిశమునఁ గూర్చి యధికరయమునన్‌.

### [5.1.140](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.140)

తే. దాన వృత్రుని వ్రేయ నత్తఱి మురారి | యందుఁ దగ సంక్రమించి, యయ్యసురఁ జంపె;  
జిష్ణుఁ డతిభక్తి విష్ణుఁ బూజించె నాత్మ | నఖిలలోకంబులకు మోద మావహిల్లె.

### [5.1.141](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.141)

వ. ఇవ్విధంబునం బగతుం బరిమార్చి పేర్చి యింద్రుండు నిజపురంబునకుం జనియె; మఱియును భూతసంఘం ‘బిట్లు బ్రహ్మహత్య సేయందగునే?’ యని యతని నిందించినం బ్రభుత్వ సంపద సెడుటయు.

### [5.1.142](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.142)

ఆ. నీచదశకు వచ్చి నిషధాచలంబున | కరిగి, సురవరేణ్యుఁ డడఁగియుండె;  
నమరు లెల్లఁ గలఁగి, యన్యోన్యపీడన | భయముఁ బొంది కూడఁబాఱి, తమకు.

### [5.1.143](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.143)

క. కావలియై సురరాజ్య | శ్రీ వాలింపంగఁదగు విశేషంబున సం  
భావితుఁడు నహుషుఁ డని చని, | యా విభుఁ గని తారు మునులు నతనికి నెమ్మిన్‌.

### [5.1.144](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.144)

వ. పాకశాసను తెఱం గెఱింగింది.

### [5.1.145](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.145)

క. ‘ర మ్మింద్రపదవి సేకొని | మ మ్మెల్లను నరయు’ మనిన, మానవపతి, ‘నా  
కమ్మహిమకుఁ దగు మాహా | త్మ్యమ్ము గలదె? నన్ను నేల యలఁచెద?’ రనినన్‌.

### [5.1.146](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.146)

వ. అంత నిలువక యత్యంత ప్రార్థనంబు సేసి.

### [5.1.147](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.147)

క. యమ వరుణాది త్రిదశులు | దమ దమ శక్తి ప్రభావ దర్పంబులు భూ  
రమణునకుఁ బంచి యిచ్చిరి | ప్రమోద మెసఁగంగ మునిసభామధ్యమునన్‌.

### [5.1.148](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.148)

వ. ఇవ్విధంబున నిచ్చి, యధికబలసమన్వితుం గావించి తోడ్కొనిపోయి, పూజ్యంబగు దివిజరాజ్యంబున కభిషిక్తుం జేసిన, నతండును బరమ ధర్మపరుండై, కిన్నర కింపురుష గరుడ గంధర్వ సిద్ధ విద్యాధరాది సమస్త దేవయోనులవలనను దేజోభాగంబులు పుచ్చికొని మహానుభావుండై, దివ్యముని సేవ్యంబైన యద్దేవేంద్ర పదంబు సేకొని తుంబురు నారదాది వినోద పాత్రంబులును, రంభాద్యప్సరోగణంబులుం గొలువ నభిమతభోగంబు లనుభవించుచు, మదంబు మిగిలి మన్మథాధీనుండై వర్తిల్లుసమయంబున నొక్కనాఁడు.

### [5.1.149](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.149)

తే. మహిత లావణ్యమున నసమాన యనఁగఁ | జనిన పౌలోమి యా నహుషునకు నయన  
మార్గగోచర యగుటయు, మదన బాణ | భిన్న హృదయుఁడై, ధృతిఁబాయఁబెట్టి యతఁడు.

### [5.1.150](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.150)

క. ‘సురలోక రాజ్య పదవిన్‌ | గరిమంబున నున్న నన్నుఁ గవయం బరమా  
దరలీలఁ జతురయగు నీ | సరసిజముఖి రామి యేమి చందమొ తలఁపన్‌?’

### [5.1.151](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.151)

క. అని యప్పొలఁతిం బిలిపిం | చిన, నదియును భయము నొంది, శీఘ్రమ దేవే  
జ్యుని సదనమునకు శరణం | బనుచుం జనుటయును వాసవాచార్యుండున్‌.

### [5.1.152](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.152)

వ. పరమాదరంబున నద్దేవిని గారవించి ‘నిన్ను నహుషు దుర్వినయంబుఁ బొరయకుండ నరయువాఁడ; నాఖండలుండు నా యత్నంబున నవశ్యంబును దడయక వచ్చు’ నని యూఱడించిన.

### [5.1.153](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.153)

క. అది యెల్ల నెఱిఁగి కోపం | బొదవఁగ నహుషుండు ‘గురున కుచితమె యే న  
మ్ముదితం బిలిపింపఁగఁ దన | సదనంబున నునుచు’ టనియె సంక్షుభితుండై.

### [5.1.154](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.154)

చ. అనుడు మునీంద్రులున్‌ సురలు ‘నక్కట నీ మహనీయ గౌరవం  
బునకుఁ బరాంగనం గవయుబుద్ధి జనించుట యీడుగాదు’ నా  
విని, ‘మును పూని యిమ్మెయి వివేకము గౌతముభార్యఁ బాకశా  
సనుఁ డెడఁ గోరుచోఁ గఱపఁ జాలర మీ రది యెట్లు సెప్పుఁడా!’

### [5.1.155](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.155)

వ. అనుచు నతండు కోపించిన, భయంబుఁగొని వార లా పౌలోమి నతని పాలికిం దోడ్కొని వచ్చువారై పూని బృహస్పతికడకుం జని యద్దేవి వినుచుండ నిట్లనిరి.

### [5.1.156](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.156)

క. ‘నహుషుఁడు మహేంద్ర పదవీ | సహితుఁడు; శచికిన్‌ వరింపఁ జను నాతని; లో  
కహితంబు గాఁగఁ బుచ్చుము | మహాత్మ! తచ్చిత్తమున యమర్షం బడఁగన్‌.’

### [5.1.157](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.157)

క. అనవుడు శోకం బడరఁగ | ననిమిషగురుఁ జూచి యిట్టులను శచి ‘యటుపు  
చ్చిన దూఱు రాదె? నను శుచి | యని మీ కొనియాడు టెల్ల ననృతము గాదే?’.

### [5.1.158](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.158)

వ. అనిన విని దరహసితవదనుం డగుచుఁ బురుహూత పురోహితుండు.

### [5.1.159](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.159)

క. ‘నహుషుండు పనుచువాఁ డటె! | విహితానుష్ఠానపరులు వీ రటె! తా లో  
కహితం బటె! యిది మనకున్‌ | మహనీయమ కాక యెట్లు మానఁగవచ్చున్‌?’

### [5.1.160](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.160)

వ. అని యుల్లసం బాడి యనిమిషులను ఋషులను జూచి యిట్లనియె.

### [5.1.161](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.161)

తే. ‘శరణు సొచ్చిన రక్షింపఁ జాలియుండి | కడపి పుచ్చిన నూర్ధ్వలోకములు దప్పుఁ,  
బుణ్యకర్మంబు లఫలతఁ బొందు ననఁడె | కమలగర్భుండు దొల్లి జగద్ధితముగ?’

### [5.1.162](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.162)

వ. అని యనురూపాలాపంబుల నిషేధింప, వార ‘లట్లేనిఁ గర్తవ్యం బెయ్యది యూహింపు’ మనిన, ‘నద్దేవి నహుషుకడకుం జని సముచితంబుగాఁ దదీయ సాంగత్యంబున కెడవలికికొని వచ్చునది; యటమీఁద మన మందఱముం బురందరున కభ్యుదయం బగుతెఱంగాచరించువార’ మనుటయు, వాచస్పతి వచనంబులకు సంతసించి సుర సంయమి సంఘంబు లరిగిన యనంతరంబ.

### [5.1.163](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.163)

క. పౌలోమియు నా నహుషుని | పాలికిఁ జనుటయు, నతండు భావజ వికృతి  
వ్యాలోల మానసుం డయి | లీలా సంభావనా లలిత ముఖుఁ డయ్యెన్‌.

### [5.1.164](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.164)

వ. అట్టియెడ.

### [5.1.165](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.165)

ఉ. అల్లన యింతి యిట్లనియె ‘నారసి వాసవు కల్మిలేమియుం  
దెల్లముగా నెఱింగికొని తేఁకువలే కిట వచ్చు టొప్పు; నా  
యుల్లము శంకితం బగుచు నుండఁగ వేగిరపాటు మేలె? నీ  
వెల్ల నెఱుంగు; దిప్పు డెడ యిచ్చుట యుక్తము నాకుఁ జూడఁగన్‌.

### [5.1.166](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.166)

వ. అని యొడంబఱిచి కొండొకకాలం బెడ వలికికొని యింద్రాణియు మగుడం జనుదెంచె; నమరగణంబును మునిజన సహితంబుగ విష్ణుదేవు పాలికి రహస్యవృత్తిం బోయి, జిష్ణుని దురితంబు వాపుటఁ గోరిన, శౌరి కరుణాయత్తచిత్తుండై.

### [5.1.167](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.167)

క. ‘హయమేధంబున నాకుం | బ్రియ మొనరింపంగ వృత్రభేదికిఁ బుణ్యో  
దయ మగు’ నావుడు వారలు | రయమునఁ జని రందఱుం బురందరు కడకున్‌.

### [5.1.168](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.168)

క. చని యతని నశ్వమేధం | బునఁ గల్మషరహితుఁ జేయఁ బురుహూతుండుం  
దన పురికి నరిగి నహుషుం | గని తత్తేజోవిశేషకంపితుఁ డయ్యెన్‌.

### [5.1.169](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.169)

వ. ఇట్లు వృత్రారి తన బ్రహ్మహత్య వాయుటయేకాని నహుషునంత బలంబు లేమింజేసి భయా కులితచిత్తుండై.

### [5.1.170](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.170)

క. ఎందేనిఁ జనియె నాతని | సుందరియును నెమ్మనమున శోకోద్రేకం  
బొంది ‘పురందరుఁ డరిగిన | కందువ యే నిప్పు డెట్లు గాంతునొ?’ యనుచున్‌.

### [5.1.171](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.171)

వ. నిశాసమయంబున నుపశ్రుతి నారాధించినఁ దదీయాధి దేవత ‘నీ సత్యంబువలన నీ మగనిం గను’దని చెప్పి, యనంతరంబ సాకారయై పొడసూపినఁ బౌలోమి ‘నీవెవ్వ?’రవని యడిగిన, నదియును ‘భవత్పాతివ్రత్య సత్య శౌచంబులకుఁ బ్రియంబంది వచ్చితి; నుపశ్రుతి’ నని చెప్పి, ‘నీకుం బాకశాసనుం జూపెదర’మ్మని తోడ్కొని హిమవంతంబు నుత్తరంబున మంజుమంతంబను మహాశైలంబున కరిగి, దానియందు శతయోజన విస్తీర్ణంబైన యొక్క సరోవరంబు సొచ్చి, యచ్చట నుల్లసిల్లు పంచవర్ణ కమనీయంబులగు కమలంబులలో నొక్క నాళంబు భేదించి, ముందటఁ బ్రవేశించె; నింద్రాణియుం దోడన చని తదీయ తంతుమధ్యంబున సూక్ష్మరూపంబున నున్న సురపతిం గన్నంత, నయ్యుపశ్రుతి యదృశ్యం బగుటయు.

### [5.1.172](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.172)

క. పతిసన్నిధి వడసి మహా | ద్భుత మందెడు శచి తదీయ పూర్వ సుకర్మ  
స్తుతి సేయుచు నిలిచిన, నతఁ | డతివం గని సంభృతాదరాత్ముం డగుచున్‌.

### [5.1.173](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.173)

ఉ. ‘ఇచ్చట నేను నిల్చు టిది యెట్టు లెఱింగితి? నన్నుఁ గాన నీ  
వచ్చిన కార్య మేమి? యనవద్యగుణోత్తర ! చెప్పు’ నావుడుం  
బొచ్చెము లేక యా నహుషు పోయిన పోకలు, వానికిం దగం  
జెచ్చెరఁ గాలయాపనము సేసిన భంగియుఁ జెప్పె దేవియున్‌.

### [5.1.174](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.174)

వ. చెప్పి, యుపశ్రుతి తెఱంగును నతని కెఱింగించి ‘దేవా! నీ విత్తఱింబ్రకాశుండవై, భవత్ప్రతాపంబున నహుషునకుఁ బరాభవం బొనరించి నన్ను రక్షింపక తక్కిన, నుక్కివుండగు నతని పాప నిశ్చయంబున నాపద వచ్చు’ ననిన విని వల్లభకు దివిజవల్లభుం డిట్లనియె.

### [5.1.175](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.175)

క. ‘ఆ నహుషు బాహుగర్వ మ | నూనంబై యున్నయది సముజ్జ్వల ముని స  
మ్మాన ప్రవృద్ధ మగుటను; | దానం గాలంబు వేచెదను జయమునకున్‌.

### [5.1.176](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.176)

చ. తఱి యగు నంతకున్‌ రిపునుదగ్రత సైఁచుట నీతి; నీవు నా  
కఱపిన యట్ల చేయుము; తగం జని యాతనిఁ గాంచి ‘నన్ను నె  
త్తెఱఁగుననైనఁ బొందఁగ మదిం దలపోఁతయ కల్గెనేనిఁ గ్ర  
చ్చఱ ‘మునివర్గ వాహనుఁడవై చనుదె’ మ్మను; మంతఁ దీఱెడున్‌.

### [5.1.177](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.177)

ఆ. అనిన ‘నట్ల కాక’ యని పతి వీడ్కొని, | యింతి నహుషుపాలి కేఁగుదెంచె;  
నతఁడు దమక మడర నద్దేవిఁ బెద్దయు | నాదరించి యిష్ట మడుగుటయును.

### [5.1.178](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.178)

వ. ఇంద్రాణియు నిట్లనియె: ‘మన నిరూపించిన సమయంబునకుఁ గొండొక తడవు గలదు. కాలం బగుటయు నిన్ను వరియించెద; నీవు మహాముని వాహనుండవు గావలయు. అది నాకుఁ బ్రియంబు; నీకు ననన్య సామాన్యం బైన యానంబు తేజోవిశేషకరం బగు’ ననిన, నప్పలుకులకు నహుషుండు ప్రహర్షచిత్తుండై.

### [5.1.179](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.179)

ఆ. ‘ఏను దక్క నొరుల కెవ్వరికైన న | వ్వాహనంబు నెక్క వశమె? నీకు  
సమ్మతంబు గాఁగ సప్తర్షిగణము నా | యందలంబు మోవ నరుగుదెంతు.’

### [5.1.180](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.180)

క. అని వనితఁ బంచి, యప్పుడ | మునులం బిలిపించి; మౌర్ఖ్యమునఁ దనకున్‌ వా  
హనముగఁ జేసి, యొకింతయు | ననుమానము లేక తిరిగె నతఁ డెల్లెడలన్‌.

### [5.1.181](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.181)

క. చని పౌలోమియు సురగురుఁ | గని ‘నహుషుడు వేచియున్నకాలం బెడ లే;  
దనిమిషనాథున కిత్తఱి | ననుగ్రహము సేయవలయు నవహితబుద్ధిన్‌.

### [5.1.182](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.182)

వ. శరణాగతనైన నన్ను రక్షింపు, మనిన నతం డిట్లనియె.

### [5.1.183](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.183)

క. ‘ఆ నహుషువలన నాపద | రా నీ; నాతనికి నాతురత గావింపం  
బూని యొనర్చెద వేలిమి | దానను మునివాహనత గతస్థైర్యుఁ డగున్‌.

### [5.1.184](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.184)

క. వెరవున నీ పతి యునికియు | నరసెద’నని యూరడించి, యప్పుడ వైశ్వా  
నరు నర్చితుఁ జేసి, పురం | దరు తెఱఁగుం జెప్పి యతనిఁ దడవం బనిచెన్‌.

### [5.1.185](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.185)

వ. పనిచిన వహ్నియు వనితా రూపంబునం జని మనోగతి యగుటంజేసి సర్వదిశలును, భూమ్యంతరిక్షంబులును, గిరివిపినంబులును గొండొక సేపునకుం గలయం జూచి, సంక్రందను నెందునుం గానక మగిడి వచ్చి, వాచస్పతికి నత్తెఱం గెఱింగించి, ‘నాకు జలంబులు ప్రవేశింపరామి నంద పరికింపనేరనైతి; నప్పుల వలన నగ్నియు, బ్రాహ్మణుల వలన క్షత్రియ జాతియు, నశ్మంబుల వలన లోహంబును నుద్భవించె; వాని వాఁడిమి యెల్లయెడలనుంజెల్లుఁ; దమ తమ జన్మస్థానంబులయం దడంగుం, గావున నీళ్లు నాకు సంక్షయంబు సేయుట సుప్రసిద్ధం’ బనిన విని యనిమిష గురుండు హవ్యవాహను నత్యంత గౌరవంబునం గనుంగొని.

### [5.1.186](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.186)

మ. ‘సకల స్థావర జంగమంబులు భవత్సాన్నిధ్యమాత్రంబునన్‌  
వికసిల్లుం; గ్రతు వైభవంబులుఁ, జతుర్వేదంబులున్‌ నీవ; పా  
వక! నీయంద జలంబులుం గలిగె; విశ్వవ్యాప్తిమై నున్ననీ  
కొకచో టెట్టు లగమ్య మయ్యె? నిను నీ వూహింపు పెంపారఁగన్‌.

### [5.1.187](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.187)

ఉ. ఏనును బ్రహ్మమంత్రముల నెంతయు నీ కభివృద్ధిఁ జేసెదం  
గాన విశంకతన్‌ సలిలగామివి గ’ మ్మనినం, గృశానుఁడుం  
బూనిక నేఁగి వారినిధి భూరి నదీ సరసీ తటాక సం  
తానము రోయుచుం జని శతక్రతుఁ డున్న సరోవరంబునన్‌.

### [5.1.188](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.188)

ఉ. అంబురుహంబులం గలయ నారసి చొచ్చి, యొకండు నాళసూ  
త్రంబున నున్న యింద్రుఁ గని, రాగమునన్‌ గురునొద్ద కగ్ని శీ  
ఘ్రంబున నేఁగుదెంచి, తన కన్నతెఱంగెఱిఁగింప, నాతఁ డు  
ల్లంబున నుల్లసిల్లి, సురలన్‌ మునులం దగఁగూడి గ్రక్కునన్‌.

### [5.1.189](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.189)

మ. దివిజాధీశ్వరుపాలికిం జని, కృతార్థీభూతచేతస్కుఁడై,  
వివిధ స్తోత్ర పరంపరా చతుర వాగ్విన్యాసతం బ్రీతుఁ జే  
సి, ‘వరిష్ఠంబగు నీదు కృత్యము ననుష్ఠింపంగ నీ వుత్సహిం  
పవు; నీ కేమి కొఱంత? వృత్రవధ యే పాపంబు రూపింపుమా?’

### [5.1.190](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.190)

క. శరనిధి ఫేనంబున నా | హరి వొంది జగద్విరోధి యగు వృత్రునిఁ దాఁ  
బరిమార్ప, నీకు విజయము | దొరకొనియెం గాక, దీన దోసము గలదే?’

### [5.1.191](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.191)

వ. అని సముచితంబుగా సంబోధించిన గురుని సంభాషితంబుల నిర్దోషితుండయి నిజరూపంబు వహించి, సకల సుమనోమునిసహితంబుగా నతని సంభావించి, జంభారి ‘కర్తవ్యం బెయ్యది?’ యని యడిగిన, నాచార్యుం ‘డితం డెఱింగినను విస్పష్టంబుగా నహుషు వృత్తాంతంబంతయు వివరించెదం గాక’ యని తలంచి యిట్లనియె.

### [5.1.192](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.192)

క. ‘నాఁ డట్లు నీవు నీ దగు | పోఁడిమి సెడి యడఁగుటయును, భువనంబుల కె  
వ్వాఁడును రక్షకుఁ డయ్యెడు | వాఁడిమగఁడు లేమిఁ ద్రిదశవర్గము మునులున్‌.

### [5.1.193](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.193)

ఉ. ఒండొరుచేతఁ బీడవడ నోపక రక్షకుఁ డైనవాని నా  
ఖండలతుల్యు నేమిగతిఁ గాంతుమొకో?’ యనుచున్న చోట, ‘ను  
ద్దండబలైక రక్ష్యము శతక్రతు రాజ్యము, దాని నేల న  
న్యుండు సమర్థుఁడే?’ యనుచు నొల్లరు దివ్యులలోన నెవ్వరున్‌.

### [5.1.194](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.194)

వ. అట్టి సమయంబున మునిజనసహితంబుగ ననిమిషులు నహుషు కడకుం జని మనంబుల మనుజుం డను ననుమానంబు దక్కి యతని నింద్రపదవిఁ బరిపాలించుటకుం బ్రార్థించిన, నతండును దాను హీనబలుండననిశంకించినం, దమ తమ తేజంబుల యంశంబు లతని కొసంగి శక్తిమంతుం గావించి యభిషిక్తుం జేసిన.

### [5.1.195](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.195)

క. మహనీయ భవ త్పదవీ | మహితుండై నహుషుఁ డేచి, మదమున ధర్మ  
స్పృహ దక్కి, తన్ను నిప్పుడు | వహియింపఁగ సన్మునీంద్రవర్గముఁ బనిచెన్‌.

### [5.1.196](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.196)

ఆ. ఇదియకాదు; మఱియు నెన్నియు దుర్విన | యములు గలవు; వాని కలసి నిన్ను  
వెదక వచ్చితిమి; వివేకహీనుండగు | నతనిఁ జెఱుప నిప్పు డవసరంబు.

### [5.1.197](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.197)

వ. అది యెట్లంటేని వినుము. నాఁడు హరి పంపునం జేసిన యశ్వమేధంబున నీ వపగతకల్మషుండ వైనను, నహుషునకుఁ దేజోహాని లేమిం జేసి యతని నాక్రమింపరాదయ్యె; నిప్పుడు మహామునుల నధఃకరించి యతండు నిస్తేజుండై యున్నవాఁడు. కావున నీ చేతం జెడు, నట్లగుటయుం దురగమేధ ఫలపరిపాకంబ; యింక నుత్సాహంబు సేయు’మనుచున్న సమయంబున యమ వరుణ కుబేరులు సోమసహితంబుగా నరుగుదెంచి పురందరుం గాంచిన, నతండు ప్రియంబంది, యప్పటి కార్యంబు తెఱంగు వారల కెఱింగించి, తగిన సంభాషణంబుల వారలఁ బ్రీతచేతస్కులం జేసి, దృష్టి విషయ దుస్సహుండైన నహుషు గెలుచు నుపాయంబు విచారించు నవసరంబున.

### [5.1.198](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.198)

క. ‘కష్టుం డగు నా నహుషుఁడు | నష్టాత్మకుఁ డయ్యె; దివిజనాయక! నీ యు  
త్కృష్ట చరితమున సురలకుఁ | దుష్టిగ నిజరాజ్య సంగతుఁడ వగు’ మనుచున్‌.

### [5.1.199](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.199)

క. మునివరుఁ డైన యగస్త్యుఁడు | ననుదెంచిన, శతమఖుండు సమ్మతి నుచితా  
సన మిడి, యర్ఘ్యముఁ బాద్యము | నొనరిచి, యిట్లనియె సవినయోక్తి నతనితోన్‌.

### [5.1.200](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5.1.200)

ఆ. ‘అధిక విభవ మెసఁగ నసమాన శక్తి స | నాథుఁ డగుచునున్న నహుషుఁ డిప్పు  
డేమికతన భాగ్యహీనుఁడై యుజ్జ్వల | శ్రీ దొఱంగె మునివరేణ్య! చెపుమ.’

_First 200 of 1,570 passages. [Read on](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5)_

---
Source: [https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5](https://indike.org/pramana/in.lit.mahabharata.bhasa.andhra.5) · Pramāṇa
