Andhra Mahabharatamu 1.4: ఆదిపర్వము — చతుర్థాశ్వాసము
Āndhra Mahābhāratamu 1.4
- Language
- Telugu
ఆదిపర్వము — చతుర్థాశ్వాసము
1.4.1
క. శ్రీలలనాస్తన ఘటిత వి | శాలోరస్థ్సల! వివేకచతురానన! వా
ణీ లీలాస్పద! విలస | చ్చాళుక్యాన్వయ పయోధి సంపూర్ణశశీ!
1.4.2
వ. అక్కథకుండు శౌనకాదిమహామునులకుం జెప్పె : నట్లు యయాతికిఁ బుత్త్రుం డయిన పూరుండు సకల మహీరాజ్యంబు సేయుచు వంశకర్త యయిన వానికిఁ గౌసల్య యనుదానికి జనమేజయుండు పుట్టి రాజై యశ్వమేధత్రయంబుఁజేసి ప్రఖ్యాతి నొందె; నాజనమేజయునకు ననంత యనుదానికిఁబ్రాచిన్వంతుఁడు పుట్టి పరాక్రమంబున నుదయాచల పర్యంతంబు ప్రాగ్దిగ్విజయంబు సేసి ప్రాచిన్వంతుఁడు నాఁ బరఁగె; నట్టి ప్రాచిన్వంతునకు నశ్మకి యనుదానికి సంయాతి పుట్టె; వానికి వరాంగియనుదానికి నహంయాతి పుట్టె; వానికిం గృతవీర్యపుత్త్రియైన భానుమతికి సార్వభౌముండు పుట్టె; వానికిఁ గేకయ రాజపుత్త్రి యైన సునందకు జయత్సేనుండు పుట్టె; వానికి వైదర్భి యైన సుశ్రవసకు నవాచీనుండు పుట్టె; నయ్యవాచీనునకు విదర్భరాజపుత్త్రి యైన మర్యాదకు నరిహుండు పుట్టె; వానికి నాంగి యనుదానికి మహాభౌముండు పుట్టె; నా మహాభౌమునకుం బ్రసేనజిత్పుత్త్రియైన సుపుష్టకు నయుతానీకుండు పుట్టె; వానికిం బృథుశ్రవసుని పుత్త్రి యైన కామకు నక్రోధనుండు పుట్టె; వానికిం గాళింగి యైన కరంభ యనుదానికి దేవాతిథి పుట్టె; వానికి వైదేహి యయిన మర్యాదకు ఋచీకుండు పుట్టె; వానికి నాంగియైన సుదేవ యనుదానికి ఋక్షుండు పుట్టె; ఋక్షునకుఁ దక్షకపుత్త్రి యయిన జ్వాలయనుదానికి మతినారుండు పుట్టి.
1.4.3
క. ఇమ్ముగ సరస్వతీ తీ | రమ్మునఁ బండ్రెండు వత్సరమ్ములు విధిమా
ర్గమ్మున సద్గుణసముదా | య మ్మెసగఁగఁ జేసి సత్త్రయాగము నిష్ఠన్.
1.4.4
క. అతనికి సరస్వతీనది | మతి ననురక్త యయి వాని మానుగఁ దనకుం
బతిఁ జేసికొనియె ధర్మ | స్థితి; నయ్యిరువురకుఁ ద్రసుఁడు ధీరుఁడు పుట్టెన్.
1.4.5
వ. ఆ త్రసునకుఁ గాళింది యనుదానికి నిలినుండు పుట్టె; వానికి రథంతరి యను దానికి దుష్యంతుండు పుట్టెఁ; బుట్టి యనన్యసాధారణశక్తియుక్తుం డై.
1.4.6
క. బాలహరిణములఁ బట్టెడు | లీలను విషమాటవీ చలిత కేసరి శా
ర్దూలేభ శరభములఁ దన | బాలత్వమునంద యెగిచి పట్టుచు మఱియున్.
1.4.7
క. ఉర్వీరుహ నివహముతోఁ | బర్వతములు వెఱికి యొండు పర్వతములపైఁ
బర్వఁగ వైచుచు యౌవన | గర్వంబున నొప్పె నుర్విఁ గడు నధికుం డై.
1.4.8
శా. ఆ దుష్యంతుఁ డనంతసత్త్వుఁడు సమస్తాశాంతమాతంగ మ
ర్యాదాలంకృత మైన భూవలయ మాత్మాయత్త మై యుండఁగా
నాదిత్యాంశు సమీర దుర్గమ మహోగ్రారణ్య దేశాళితో
నాదిక్షత్త్ర చరిత్ర నేలె నజితుండై బాహువీర్యంబునన్.
1.4.9
క. ఆతని రాజ్యంబున ను | ర్వీతలము ప్రజాసమృద్ధి వెలసి రుజాశో
కాతంక క్షయ శంకా | పేతం బై ధర్మచరితఁ బెరుఁగుచు నుండెన్.
1.4.10
వ. అమ్మహీపతి యొక్కనాఁడు మృగయావినోదార్థి యయి యాదిత్యహయంబులకంటె వడిగల హయంబులు పూనిన రథం బెక్కి యాజానేయతురంగారూఢు లైన యాశ్వికులు పరివేష్టించి రాఁగ ననంతకుంతశక్తిచాప కృపాణపాణు లయిన వీరభటసహస్రంబులతోఁ జని వనంబులోని మృగంబులం జుట్టుముట్టి.
1.4.11
క. కలయఁగ నార్పుల బొబ్బల | యులివున నవ్విపిన మను మహోదధిఁ బెలుచం
గలఁచెను దుష్యంత మహా | బల మందరనగము సత్త్వభయజననం బై.
1.4.12
క. సరభస పరిచరిత మహా | శరభ ద్విపరిపు వరాహ శార్దూల మద
ద్విరదాది ప్రకర భయం | కరవనమధ్యమున నృపతి గడుఁ గడిమిమెయిన్.
1.4.13
క. ఓసరిలి పఱచు మృగముల | నేసియు, డాసిన మృగముల నెగచి భుజాసిన్
వ్రేసియుఁ, జంపెను మృగయా | వ్యాసక్తి నపారఘోరవన్యమృగాళిన్.
1.4.14
వ. ఇట్లు పెక్కుమృగంబుల నెగిచి చంపుచు మఱియుఁ జంపెడువేడుక నతి దూరంబున కరిగిన, నాతని రథవేగంబు ననుగమింపనోపక యధిక క్షుత్పిపాసాపరవశు లయి పదాతు లయ్యయి ప్రదేశంబుల విశ్రమించి; రంత దుష్యంతుండు కతిపయామాత్య పురోహితసహితుం డై కొండొకనేల యరిగి, ముందట నొక్క పుణ్యనదీతీరంబున వివిధసురభి కుసుమఫల భారవినమ్ర తరులతాగుల్మ పరిశోభితం బయిన యొక్కవనంబు గని.
1.4.15
క. అమరపతి ఖాండవమునకు | రమణను వైశ్రవణు చైత్రరథమునకు సమా
నముగా దీనిని భూభా | గమునను రచియించె నొక్కొ కమలజుఁడు దయన్.
1.4.16
వ. అని దాని రమణీయభావంబుఁ బొగడుచుఁ జనుదెంచి యవ్వనంబు సొచ్చునప్పుడు
1.4.17
చ. అతిరుచిరాగతుం డయిన యాతనికిన్ హృదయప్రమోద మా
తతముగ నవ్వనంబున లతాలలనల్ మృదులానిలాపవ
ర్జిత కుసుమాక్షతావళులు సేసలు వెట్టినయట్టిరైరి సం
పత దళినీనినాదమృదుభాషల దీవన లొప్ప నిచ్చుచున్.
1.4.18
వ. మఱియును.
1.4.19
క. కాఱడవిఁ బఱచు మృగముల | నూఱడకం దిగిచి డస్సియున్నతని శ్రమం
బాఱఁగ నెడఁ బరితాపము | దీఱఁగఁ బైవీచె నన్నదీపవనంబుల్.
1.4.20
మానిని. ఏచి తనర్చి తలిర్చిన క్రోవుల నిమ్మగు ఠావుల, జొంపములం
బూచిన మంచియశోకములన్, సురపొన్నలఁ, బొన్నల, గేదఁగులం,
గాచి బెడంగుగఁ బండిన యాసహకారములం, గదళీతతులం
జూచుచు, వీనుల కింపెసఁగన్ వినుచున్ శుకకోకిల సుస్వరముల్.
1.4.21
చని చని ముందట నాజ్య హవిర్ధృత సౌరభ ధూమలతాతతులం
బెనఁగిన మ్రాఁకుల కొమ్మలమీఁద నపేతలతాంతము లైనను బా
యని మధుపప్రకరంబులఁ జూచి జనాధిపుఁ డంత నెఱింగెఁ దపో
వన మిది యల్లదె దివ్యమునీంద్రునివాసము దానగు నంచు నెదన్.
1.4.22
వ. ఇట్లు హృదయసుఖావహం బగుచున్న యవ్వనంబులో నరిగి యరిగి యనవరత మహాద్విజ పఠ్యమానవేదధ్వనులను, నవిచ్ఛిన్న హూయమానాగ్ని హోత్రస్వాహాశబ్దంబులను, ననేకమునిగణప్రణీత వచన విషయ విభాగ వినిర్ణయన్యాయనిపుణ విద్వత్సభాసంభాషణఘోషంబులను, బ్రతిపక్ష దుర్విభేద ప్రమాణ విచార్యమాణ వేదార్థ మీమాంసక గోష్ఠీవివాద నాదంబులనుంజేసి మ్రోయుచు, యజ్ఞప్రయోగప్రవీణు లయిన యాజ్ఞికులకును విహితానుష్ఠానాసక్తులయిన యనుష్ఠాతలకును నధికతపోనిరతు లయిన మహాతపోధనులకును నివాసం బయిన పుణ్యనదీతీరంబునఁ దద్దయు రమ్యం బయి గంగాతీరంబున నరనారాయణస్థానంబునుంబోలె జగత్పావనం బైన కణ్వమహాముని యాశ్రమంబు గని యందు.
1.4.23
సీ. శ్రవణసుఖంబుగా సామగానంబులు | చదివెడు శుకముల చదువు దగిలి
కదలక వినుచుండు కరులయుఁ గరికర | శీతలచ్ఛాయఁ దచ్ఛీకరాంబు
కణముల చల్లనిగా డ్పాసపడి దానిఁ | జెంది సుఖం బున్న సింహములయు,
భూసురప్రవరులు భూతబలుల్ తెచ్చి | పెట్టు నీవారాన్న పిండతతులు
తే. గడఁగి భక్షింప నొక్కటఁ గలిసియాడు | చున్న యెలుకలుఁ బిల్లుల యొండు సహజ
వైరివర్గంబులయు సహవాస మపుడు | సూచి మునిశక్తి కెంతయుఁ జోద్య మంది.
1.4.24
వ. ‘ఇక్కాశ్యపుం డైన కణ్వమహామునీంద్రునకు నమస్కరించి వచ్చెద; నా వచ్చునంతకు నందఱు నిచ్చోటన యండునది’ యని.
1.4.25
చ. వలయు నమాత్యులం దగినవారల నుండఁగఁ బంచి ధారుణీ
తలవిభుఁ డొక్కరుండ చని తన్విఁ బయోజదళాయతాక్షి సం
కుల మిళితాళినీల పరికుంచిత కోమలకుంతలన్ శకుం
తల యను కన్యకం గనియెఁ దన్మునివల్లభు మందిరంబునన్.
1.4.26
వ. అదియును ననంతవిలాసంబున జయంతుండ పోని దుష్యంతు నెఱింగి, యతిసంభ్రమంబున నాసనార్ఘ్య పాద్యాది విధులం బూజించి, కుశలం బడిగి యున్న, నక్కన్యకం జూచి దుష్యంతుం డి ట్లనియె.
1.4.27
ఉ. ‘క్రచ్చఱ వేఁట వచ్చి యిట కణ్వమహామునిఁ జూచి పోవఁగా
వచ్చితి; మెందుఁ బోయిరొకొ వా?’ రనినన్ విని యాలతాంగి ’ వా
రిచ్చటినుండి యీక్షణమ యేఁగిరి కానకుఁ బండ్లుదేర; మీ
వచ్చు టెఱింగిరేని జనవల్లభ! వారును వత్తు రింతకున్.
1.4.28
వ. ‘వారు వచ్చునంతకు నొక్కముహూర్తం బుండునది’ యనిన విని యక్కోమలి వినయంబునకు మృదుమధురవచనంబులకు సంతసిల్లి, దానిం గన్యకగా నెఱింగి మనోజరాజ్యలక్ష్మియుంబోని దాని సర్వలక్షణ లక్షితంబు లయిన సర్వావయవంబులుం జూచి సంచలితహృదయుం డై ‘నీ వెవ్వరి కూఁతుర? విట్టి రూపలావణ్యవిలాసవిభ్రమగుణసుందరి విందుల కేల వచ్చి’? తని యడిగిన నది యి ట్లనియె.
1.4.29
క. ‘జగతీవల్లభ! యే న | త్యగణిత ధర్మస్వరూపుఁ డని జనములు దన్
బొగడఁగ జగదారాధ్యుం | డగు కణ్వమహామునీంద్రునాత్మజ’ ననినన్.
1.4.30
చ. ‘ఇది మునికన్య యేని మఱి యేలొకొ యీలలితాంగియందు నా
హృదయము దద్దయుం దవిలె; నిప్పలు కింకను నమ్మనేర న
య్యెద; విజితేంద్రియుం డనఁగ నిమ్మునిఁ బాయక విందు’ నంచుఁ దా
నిది కలరూ పెఱుంగ నవనీపతి యుత్సుకుఁ డయ్యె నాత్మలోన్.
1.4.31
వ. ఇట్లు దుష్యంతుం డా శకుంతలజన్మం బెఱుంగ వేఁడి వెండియు దాని కి ట్లనియె.
1.4.32
తే. ఉత్తమాశ్రమనిష్ఠితుఁ డూర్ధ్వరేతుఁ | డైన కణ్వమహాముని యనఘచరితుఁ;
డట్టిముని కెట్లు గూఁతుర వైతి? దీని | నాకు నెఱుఁగంగఁ జెప్పుము నలిననేత్ర!
1.4.33
వ. అని యడిగిన నారాజునకు శకుంతల యి ట్లనియె.
1.4.34
క. ‘ఇక్కమలాక్షి శకుంతల | యెక్కడియది? దీని జన్మ మెవ్విధ?’ మని త
మ్మొక్క మునినాథుఁ డడిగిన | నిక్కాశ్యపు లర్థిఁ జెప్పి రేను వినంగన్.
1.4.35
వ. ‘నాజన్మప్రకారంబు మాయయ్య యమ్మునికిం జెప్పినవిధంబు చెప్పెదఁజిత్తగించివిను’మని యాదుష్యంతునకు శకుంతల యి ట్లనియె.
1.4.36
సీ. అనఘుఁడు రాజర్షియై తపశ్శక్తిమై | బ్రహ్మర్షిభావంబుఁ బడసియున్న
సన్మునీశ్వరుఁడు విశ్వామిత్రుఁ డతిఘోర | తపము సేయుచునున్నఁ దత్తపమున
కెంతయు వెఱచి దేవేశ్వరుఁ డప్సరో | గణములలో నగ్రగణ్య యైన
దాని మేనక యను ధవళాక్షిఁ బిలిచి ‘వి | శ్వామిత్రుపాలికిఁ జని తదీయ
ఆ. ఘోరతపము చెఱిచి కోమలి! నా దైన | దేవరాజ్యమహిమఁ దివిరి నీవు
గావు’ మనిన నదియుఁ గడు భయంపడి యమ | రేశ్వరునకు మ్రొక్కియిట్టు లనియె.
1.4.37
చ. వనజభవప్రభావుఁ డగువాని వసిష్ఠు నపత్యశోక మ
న్వననిధిలోన ముంచిన యవారితసత్త్వుఁడు నిన్నుఁ దొట్టి యీ
యనిమిషు లెల్లవానికి భయంపడుచుండుదు రట్టియుగ్రకో
పనుకడ కిప్పు డేఁగు మని పాడియె యిప్పని నన్నుఁ బంపఁగన్.
1.4.38
ఉ. అమ్ముని యల్గి చూచుడును నాక్షణమాత్రన గోత్రధారుణీ
ధ్రమ్ములు వ్రయ్యు, నయ్యిసుము దక్కఁగ నంబుధు లింకు, మూఁడులో
కమ్ములు దిర్దిరం దిరుగు, గాడ్పు చలింపఁగ నోడు, నుగ్రతం
బమ్మినయట్టి కోపపరుపాలికి భామలు వోవ నోడరే.
1.4.39
వ. ‘అయినను నానేర్చువిధంబున నమ్మునివరుచిత్తంబు మెత్తన చిత్తజాయత్తంబగునట్లుగాఁ జేసెద’ నని వాసవు వీడ్కొని మేనక తనకు మందమలయానిలంబు దోడుగాఁ జనుదెంచి, హిమవత్పర్వతప్రదేశంబునం దపంబుసేయుచున్న విశ్వామిత్రు తపోవనంబు సొత్తెంచిన.
1.4.40
క. చల్లని దక్షిణ మారుత | మల్లన వీతెంచెఁ దగిలి యా లలనా ధ
మ్మిల్ల కుసుమాంగరాగస | ముల్లసనసుగంధి యగుచు మునివరుమీఁదన్.
1.4.41
వ. అంత.
1.4.42
చ. అనిమిషకాంతయున్ నవలతాంత విభూషణ లీల నల్లన
ల్లన వనకేళి లాలస విలాసగతిం జనుదెంచి ముందటం
గనియె మహామునిప్రవరుఁ గౌశికుఁ గౌశిక చిత్తభీతి సం
జనన మహాతపశ్చరణ సంయతచిత్తు నిరస్తచిత్తజున్.
1.4.43
క. అంబుజలోచన గని విన | యంబున నమ్మునికి మ్రొక్కి యనురాగముతో
డం బుష్పాపచయ వ్యా | జంబున విహరించుచుండె సఖులుం దానున్.
1.4.44
చ. అలసత యొప్పఁగాఁ దరుణి యమ్మునివల్లభుమ్రోల నున్న స
మ్మిళిత సుగంధబంధురసమీరవశంబునఁ దూలి బాల పై
వలు వెడలన్ బయల్పడియె వల్దకుచంబులుఁ గక్షయుగ్మమున్
లలితకృశోదరంబుఁ దరళత్రివళీయుత రోమరాజియున్.
1.4.45
క. అందుఁ దనదృష్టి నాటుడుఁ | గందర్ప నిశాత సాయకంబులు పెలుచన్
డెందముఁ గాఁడిన ధృతి సెడి | కంది మునీంద్రుండు దానిఁ గవయం దివిరెన్.
1.4.46
వ. మేనకయు విశ్వామిత్రు నిష్టంబునకుం దగిన కామోపభోగంబులం బెద్దకాలంబు రమియించిన నయ్యిద్దఱకు నిక్కన్యక పుట్టిన, దీని మాలిని యను నొక్కయేటి పులినతలంబునం బెట్టి మేనక దేవలోకంబునకుం జనియె; విశ్వామిత్రుండును దపోవనంబునకుం జనియె; నంత నమ్ముని ప్రభావంబున.
1.4.47
ఆ. చెలఁగి లేవ నేడ్చు చిఱుతుకదానిఁ గ్ర | వ్యాదఘోరమృగము లశనబుద్ధిఁ
బట్టకుండఁ జెట్టుపలఁ గప్పి రక్షించు | కొని శకుంతతతులు గూడియుండె.
1.4.48
వ. అంత నేము శిష్యగణంబులతోడ సమిత్కుసుమ ఫలాహరణార్థం బక్కడకుం జని, యమ్మాలినీ పులినతలంబున శకుంతరక్షిత యై యున్న కూఁతు నత్యంతకాంతిమతి నవనీతలంబున కవతరించిన తరుణ శశిరేఖ యుంబోని దాని నెత్తుకొని వచ్చి, శకుంతరక్షిత యగుటఁ జేసి శకుంతల యను నామం బిడి కరంబు గారవంబునం బెనిచితిమి.
1.4.49
మధురాక్కర. తనర జనకుండు నన్నప్రదాతయును భయత్రాత
యును ననఁగ నింతులకు మువ్వు రొగిన గురువులు; వీర
లనఘ! యుపనేత మఱియు నిరంతరాధ్యాపకుండు
ననఁగఁ బురుషున కియ్యేవు రనయంబును గురువులు.
1.4.50
వ. ‘అనం బరఁగిన శాస్త్రార్థంబున నేము దీనికి భయత్రాతల మగుటంజేసి గురుల; మిదియును మాచే నభివర్ధిత యగుటం జేసి మాకు హృదయానందని యైన కూఁతు’ రని కణ్వమహామును లమ్మునికిం జెప్పిన విధం బంతయు సవిస్తరంబుగా శకుంతల చెప్పిన విని దుష్యంతుం డాత్మగతంబున.
1.4.51
చ. ఇది మునినాథ కన్య యని యెంతయు నిఃస్పృహవృత్తి నున్ననా
హృదయము రాజపుత్త్రి నని యిక్కమలాక్షి నిజాభిజాత్య సం
పద నెఱిఁగించినన్ మదనబాణపరంపర కిప్పు డుండ నా
స్పద మయి సంచలించె నళిపాత వికంపిత పంకజాకృతిన్.
1.4.52
వ. అనుచు మదనాతురుం డయి దుష్యంతుండు దనయం దక్కోమలియనురాగం బుపలక్షించి యి ట్లనియె.
1.4.53
క. ఈ వల్కలాజినములకు | నీ వన్యఫలాశనముల కీ విటపకుటీ
రావాసములకు నుచితమె | నీ విలసిత రూపకాంతి నిర్మలగుణముల్.
1.4.54
ఉ. ఈ మునిపల్లె నుండు టిది యేల కరం బనురాగ మొప్పఁగా
భామిని! నాకు భార్య వయి భాసురలీల నశేషరాజ్య ల
క్ష్మీ మహనీయ సౌఖ్యముల మేలుగ నందు మనిందితేందుపా
దామలతుంగహర్మ్యముల హారిహిరణ్మయ కుట్టిమంబులన్.
1.4.55
సీ. ‘బ్రాహ్మంబు దైవంబుఁ బరఁగ నార్షంబుఁ బ్రా | జాపత్యమును రాక్షసంబు నాసు
రంబు గాంధర్వంబు రమణఁ బైశాచంబు | నను నెనిమిది వివాహములయందుఁ
గడుఁ బ్రశస్తములు సత్క్షత్త్ర వంశ్యులకు గాం | ధర్వ రాక్షసములు ధర్మయుక్తి;
నీకును నాకును నెమ్మిఁ బరస్పర | ప్రేమంబు గాముండు పెంపఁదొడఁగెఁ
ఆ. గాన యెడయుఁ జేయఁగా నేల? గాంధర్వ | విధి వివాహ మగుట వినవె యుక్త’
మనిన లజ్జఁ జేసి యవనత వదన యై | యాలతాంగి యిట్టు లనియెఁ బతికి.
1.4.56
క. కరుణానిరతులు ధర్మ | స్వరూపు లింతకు మదీయజనకులు సనుదెం
తురు; వారు వచ్చి నీ కి | చ్చిరేని పాణిగ్రహణము సేయుము నన్నున్.
1.4.57
వ. అనిన దానికి దుష్యంతుం డి ట్లనియె.
1.4.58
తే. తనకు మఱి తాన చుట్టంబు, తాన తనకు | గతియుఁ, ద న్నిచ్చుచోఁ దాన కర్త యనఁగ
వనజనేత్ర! గాంధర్వవివాహ మతి ర | హస్యమును నమంత్రకమును నగుచు నొప్పు.
1.4.59
వ. అని దుష్యంతుండు గాంధర్వవివాహస్వరూపంబు చెప్పి శకుంతల నొడంబఱిచిన నది యి ట్లనియె.
1.4.60
చ. నరనుత! నీ ప్రసాదమున నా కుదయించిన నందనున్ మహీ
గురుతర యౌవరాజ్యమునకున్ దయతో నభిషిక్తుఁ జేయఁగా
వరము ప్రసన్నబుద్ధి ననవద్యముగా దయసేయు నెమ్మితో;
నిరుపమకీర్తి! యట్లయిన నీకును నాకును సంగమం బగున్.
1.4.61
వ. అనిన విని శకుంతల కెంతయు సంతోషంబుగా దాని కోరిన వరంబిచ్చి, గాంధర్వవివాహంబున నభిమతసుఖంబు లనుభవించి, యక్కోమలి వీడ్కొని ‘నిన్నుఁ దోడ్కొనిరా నస్మత్ప్రధానవర్గంబుఁ గణ్వమహాముని పాలికిం బుత్తెంచెద’ నని యూఱడ నొడివి దుష్యంతుండు నిజపురంబునకుం జనియె; నిట శకుంతలయుఁ దనచేసినదాని మునివరుం డెఱింగి యలిగెడునో యని వెఱచుచుండె; నంత నమ్మహాముని వనంబుననుండి కందమూలఫలంబులు గొని చనుదెంచి, లలితశృంగారభావంబున లజ్ఞావనతవదనయు నతిభీతచిత్తయు నైయున్న కూఁతుంజూచి, తన దివ్యజ్ఞానంబున నంతవృత్తాంతంబు నెఱింగి, క్షత్త్రియులకు గాంధర్వవివాహంబు విధిచోదితంబ యని సంతసిల్లి శకుంతల కి ట్లనియె.
1.4.62
తే. తల్లి! నీకులగోత్ర సౌందర్యములకుఁ | దగిన పతిఁ గంటి; దానికిఁ దగఁగ గర్భ
మయ్యె; నీదు గర్భమున వాఁ డఖిలభువన | వహన మహనీయుఁ డగు చక్రవర్తి సుమ్ము.
1.4.63
వ. ‘నీధర్మచరితంబునకు మెచ్చితి, నీ కోరిన వరం బిచ్చెద వేఁడు’ మనిన శకుంతలయు ‘నాచిత్తం బెప్పుడు ధర్మువునంద తగిలియుండను, నాకుద్భవించెడు పుత్త్రుండు దీర్ఘాయురారోగ్యైశ్వర్య బలసమన్వితుండును వంశకర్తయుఁగాను వలయు’ ననిన నమ్మహాముని కరుణించి దాని కోరిన వరం బిచ్చి, యథాకాలవిధుల గర్భసంస్కార రక్షణంబులు సేయించి యున్నంత, వర్షత్రయంబు సంపూర్ణం బైన, శకుంతలకు భరతుం డుదయించి కణ్వనిర్వర్తిత జాతకర్మాది క్రియాకలాపుం డయి పెరుఁగుచుఁ గరతలాలంకృతచక్రుండును, చక్రవర్తిలక్షణలక్షితుండును, సింహసంహననుండును, దీర్ఘబాహుండును, ననంతజవసత్త్వ సంపన్నుండును నై పరఁగుచు.
1.4.64
మ. అమితోగ్రాటవిలోనఁ గ్రుమ్మరు వరాహవ్యాళశార్దూల ఖ
డ్గమదేభాదులఁ బట్టి తెచ్చి ఘనుఁడై కణ్వాశ్రమోపాంత భూ
జములం దోలిన కట్టుచుం బలిమిమై శాకుంతలుం డొప్పె వ
న్యమదేభంబుల నెక్కుచుం దగిలి నానాశైశవక్రీడలన్.
1.4.65
వ. ఇట్లు వనంబులోని సర్వసత్త్వంబులను దనమహాసత్త్వంబునం జేసి దమియించుచున్న యాతనిం జూచి యాశ్చర్యం బంది యందులమునులెల్ల నాతనికి సర్వదమనుం డను నామంబుఁ జేసిరి; కణ్వమహామునియు నక్కుమారు నుదార తేజోరూప విక్రమ గుణంబులకు సంతసిల్లి ‘వీఁ డఖిల భువన యౌవరాజ్యంబునకు సమర్థుం డగు సమయం బరుగుదెంచె’ నని విచారించి యొక్కనాఁడు కూఁతున కి ట్లనియె.
1.4.66
ఆ. ఎట్టిసాధ్వులకును బుట్టిన యిండ్లను | బెద్దకాల మునికి తద్ద తగదు;
పతులకడన యునికి సతులకు ధర్మువు; | సతుల కేడుగడయుఁ బతుల చూవె.
1.4.67
వ. ‘కావున నీ విక్కుమారునిం దోడ్కొని నీపతిపాలికి నరుగు’ మని మహాతపోధను లైన తన శిష్యులం గొందఱఁ దోడువంచిన, శకుంతలయు దౌష్యంతిం దోడ్కొని దుష్యంతుపాలికి వచ్చి సకలసామంతమంత్రిపురోహిత ప్రధానపౌరజనపరివృతుండై యున్న యారాజుం గనుంగొని.
1.4.68
క. గురునాశ్రమంబునను ము | న్నరుదుగఁ బతివలనఁ గనిన యనురాగము నా
దరణము ననుగ్రహంబును | గరుణయు సంభ్రమము నపుడు గానక యెడలోన్.
1.4.69
క. ఎఱుఁగ డొకొ నన్ను; నెఱిఁగియు | నెఱుఁగని యట్లుండునొక్కొ; యెడ దవ్వగుడున్
మఱచెనొకొ! ముగ్ధు లధిపులు | మఱవరె బహుకార్యభారమగ్నులు కారే.
1.4.70
చ. తలఁపఁగ నాఁడు పల్కినవిధం బెడఁ దప్పఁగ వీడె నొక్కొ చూ
డ్కులు విరసంబులై కరము క్రూరము లైన నిమిత్త మేమియో?
కలయఁగఁ బల్కరించి రుపకారులు నై రని నమ్మియుండఁగా
వలవదు బుద్ధిమంతులు నవప్రియు లైన ధరాధినాథులన్.
1.4.71
వ. అని తలంచి చింతాక్రాంత యై శకుంతల వెండియు నాత్మగతంబున.
1.4.72
క. మఱచినఁ దలఁపింపఁగ నగు; | నెఱుఁగని నాఁ డెల్లపాట నెఱిఁగింప నగున్;
మఱి యెఱిఁగి యెఱుఁగ నొల్లని | కఱటిం దెలుపంగఁ గమలగర్భుని వశమే.
1.4.73
వ. అయినను వచ్చి మిన్నక పోవంగాదు కావున నాపూర్వవృత్తాంతంబెల్ల నెఱింగించి యే నిక్కుమారుం జూపుదు’ నని మనంబున నిశ్చయించి శకుంతల యా రాజున కి ట్లనియె.
1.4.74
క. జననాథ! వేఁట నెపమున | గొనకొని కణ్వాశ్రమమునకున్ వచ్చి ముదం
బున నందు నాకు నీయి | చ్చిన వరము దలంపవలయుఁ జిత్తములోనన్.
1.4.75
క. బాలార్కతేజుఁ డగు నీ | బాలుఁడు నీకొడుకు వీనిఁ బౌరవకుల ర
త్నాలంకారు నుదార గు | ణాలయు యువరాజుఁ జేయు మభిషేకముతోన్.
1.4.76
వ. అనిన విని దుష్యంతుండు దానినంతయు నెఱింగియు నెఱుంగనివాఁడ పోలె ని ట్లనియె.
1.4.77
క. ఏ నెఱుఁగ నిన్ను; నెక్కడి | దానవు? మిన్నకయ యనుచితంబులు పలుకం
గా నేల? యరుగు మంబురు | హానన! యెందుండి వచ్చి తందులకు వడిన్.
1.4.78
వ. అనిన విని, వెల్లనై, వెచ్చనూర్చి, నిశ్చేష్టిత యై, కెందమ్మిరేకులవలనం దొరంగు జలకణంబులపోలెఁ గోపారుణిత నయనంబుల బాష్పకణంబులు దొరంగం దలవాంచి, యారాజుం గటాక్షించుచు, హృదయసంతాపంబు దనకుం దాన యుపశమించుకొని, పెద్దయుం బ్రొద్దు చింతించి శకుంతల యా రాజున కి ట్లనియె.
1.4.79
ఆ. ఏల యెఱుక లేని యితరుల యట్ల నీ | వెఱుఁగ ననుచుఁ బలికె దెఱిఁగి యెఱిఁగి;
యేన కాని దీని నెఱుఁగ రిం దొరు లని | తప్పఁబలుక నగునె ధార్మికులకు!
1.4.80
చ. విమలయశోనిధీ! పురుషవృత్త మెఱుంగుచునుండుఁ జూవె వే
దములును బంచభూతములు ధర్మువు సంధ్యలు నంతరాత్మయున్
యముఁడును జంద్రసూర్యులు నహంబును రాత్రియు న న్మహాపదా
ర్థము లివి యుండఁగా నరుఁడు దక్కొననేర్చునె తన్ను మ్రుచ్చిలన్.
1.4.81
క. నా యెఱిఁగినట్ల యిన్నియు | నీ యిచ్చిన వరము ధారుణీవర! యెఱుఁగున్
నాయందుఁ దొంటియట్టుల | చేయు మనుగ్రహ; మవజ్ఞ సేయం దగునే!
1.4.82
క. సతియును గుణవతియుఁ బ్రజా | వతియు ననువ్రతయు నైన వనిత నవజ్ఞా
న్వితదృష్టిఁ జూచు నతి దు | ర్మతి కిహముం బరముఁ గలదె మతిఁ బరికింపన్.
1.4.83
క. సంతతగృహమేధి ఫలం | బంతయుఁ బడయంగ నోపు ననుగుణభార్యా
వంతుం డగువాఁడు క్రియా | వంతుఁడు దాంతుండుఁ బుత్త్రవంతుండు నగున్.
1.4.84
వ. మఱియును.
1.4.85
సీ. ధర్మార్థకామసాధన కుపకరణంబు | గృహనీతివిద్యకు గృహము, విమల
చారిత్రశిక్ష కాచార్యకం, బన్వయ | స్థితికి మూలంబు, సద్గతికి నూఁత,
గౌరవంబున కేకకారణం, బున్నత | స్థిరగుణమణుల కాకరము, హృదయ
సంతోషమునకు సంజనకంబు భార్యయ | చూవె భర్తకు, నొండ్లు గావు ప్రియము,
ఆ. లెట్టి ఘట్టములను నెట్టి యాపదలను | నెట్టితీఱములను ముట్టఁబడిన
వంతలెల్లఁ బాయు నింతులఁ బ్రజలను | నొనరఁ జూడఁగనిన జనుల కెందు.
1.4.86
వ. మఱియు భార్య పురుషునం దర్ధం బగుటంజేసి పురుషునకు మున్న పరేత యైన పతివ్రత పరలోకంబునం దనపురుషుం గూడఁ దదాగమనంబు ప్రతీక్షించుచుండుం; బురుషుండు మున్న పరేతుం డైనఁ బదంపడి తానును బరేత యై తనపురుషుం గూడ నరుగునట్టి భార్య నవమానించుట ధర్మవిరోధంబు; మఱియునుం బురుషుండు భార్యయందుఁ బ్రవేశించి గర్భంబునఁ బుత్త్రుండై తాన యుద్భవిల్లు గావున ‘నఙ్గా దఙ్గా త్సమ్భవసి’ యనునది యాదిగాఁగల వేదవచనంబులయందును జనకుండునుఁ బుత్త్రుండును ననుభేదంబు లేదు.
1.4.87
క. విను గార్హపత్య మను న | య్యనలము విహరింపఁబడి తదాహవనీయం
బున వెలుఁగునట్ల వెలుఁగును | జనకుఁడు దాఁ బుత్త్రుఁడై నిజద్యుతితోడన్.
1.4.88
క. తాన తననీడ నీళ్ళు ల | లో నేర్పడఁ జూచునట్లు లోకస్తుత! త
త్సూను జనకుండు సూచి మ | హానందముఁ బొందు నతిశయప్రీతిమెయిన్.
1.4.89
వ. ‘పున్నామ్నో నరకాత్త్రాయత ఇతి పుత్త్ర’ యను వేదవచనంబు గలదు గావునఁ బుణ్యాచారుం డయిన పుత్త్రుం డుభయపక్షంబులవారి నుద్ధరించుఁ; గావున.
1.4.90
క. నీ పుణ్యతనువు వలనన | యీపుత్త్రకుఁ డుద్భవిల్లి యెంతయు నొప్పున్
దీపంబువలన నొండొక | దీపము ప్రభవించినట్లు తేజం బెసఁగన్.
1.4.91
మ. విపరీతప్రతిభాష లేమిటికి నుర్వీనాథ! యీ పుత్త్రగా
త్రపరిష్వంగసుఖంబు సేకొనుము ముక్తాహార కర్పూర సాం
ద్రపరాగ ప్రసరంబుఁ జందనముఁ జంద్రజ్యోత్స్నయుం బుత్త్రగా
త్రపరిష్వంగమునట్లు జీవులకు హృద్యంబే కడున్ శీతమే.
1.4.92
క. అనఘుఁడు వంశకరుండై | పెనుపున నీసుతుఁడు వాజపేయంబులు నూ
ఱొనరించు నని సరస్వతి | వినిచె మునులు వినఁగ నాకు వినువీథిదెసన్.
1.4.93
క. భూరిగుణు నిట్టి కులవి | స్తారకు దారకు నుదారధర్మప్రియ! ని
ష్కారణమ తప్పఁజూడఁగ | సారమతీ! చనునె నాఁటి సత్యము గలుగన్.
1.4.94
చ. నుతజలపూరితంబు లగు నూతులు నూఱిటికంటె సూనృత
వ్రత! యొక బావి మేలు; మఱి బావులు నూఱిటికంటె నొక్కస
త్క్రతువది మేలు; తత్క్రతుశతంబునకంటె సుతుండు మేలు; త
త్సుత శతకంబుకంటె నొక సూనృతవాక్యము మేలు సూడఁగన్.
1.4.95
క. వెలయంగ నశ్వమేధం | బులు వేయును నొక్కసత్యమును నిరుగడలం
దుల నిడి తూఁపఁగ సత్యము | వలనన ములుసూపు గౌరవంబున పేర్మిన్.
1.4.96
తే. సర్వతీర్థాభిగమనంబు సర్వవేద | సమధిగమము సత్యంబుతో సరియుఁ గావు
ఎఱుఁగు మెల్ల ధర్మంబుల కెందుఁ బెద్ద | యండ్రు సత్యంబు ధర్మజ్ఞు లైన మునులు.
1.4.97
క. కావున సత్యము మిక్కిలి | గా విమలప్రతిభఁ దలఁచి కణ్వాశ్రమ సం
భావిత సమయస్థితి దయఁ | గావింపుము; గొడుకుఁ జూడు కరుణాదృష్టిన్.
1.4.98
క. క్షత్త్రవరుఁ డైన విశ్వా | మిత్త్రునకుఁ బవిత్ర యైన మేనకకున్ స
త్పుత్త్రి నయి బొంకు వలుకఁగ | ధాత్రీతలనాథ! యంత ధర్మేతరనే?
1.4.99
వ. అనిన శకుంతల పలుకులు సేకొన నొల్లక దుష్యంతుం డి ట్లనియె.
1.4.100
క. ఏ నెట? నీ వెట? సుతుఁ డెట? | యే నెన్నఁడు తొల్లి చూచి యెఱుఁగను నిన్నున్;
మానిను లసత్యవచనలు | నా నిట్టు లసత్యభాషణం బుచితంబే?
1.4.101
క. పొడవునఁ బ్రాయంబునఁ గడుఁ | గడిఁది బలంబునను జూడఁగా నసదృశు నీ
కొడు కని యీతని నెంతయు | నెడమడుగుగఁ జూపఁ దెత్తె యిందఱు నగఁగన్.
1.4.102
వ. ‘ఇట్టి లోకవిరుద్ధంబుల కే మోడుదు; మయుక్తంబు లయిన పలుకులు పలుకక నీయాశ్రమంబునకుం బొ’ మ్మనిన శకుంతల యత్యంతసంతాపితాంతఃకరణ యై.
1.4.103
మధ్యాక్కర. ‘తడయక పుట్టిననాఁడ తల్లిచేఁ దండ్రిచే విడువఁ
బడితి; నిప్పుడు పతిచేతను విడువఁబడియెదనొక్కొ!
నుడువులు వేయు నిం కేల? యిప్పాటినోములు తొల్లి
కడఁగి నోఁచితిని గా కేమి’ యనుచును గందె డెందమున.
1.4.104
వ. ఇట్లు దద్దయు దుఃఖించి విగతాశయై బోరనఁదొరఁగు బాష్పజలంబు లందంద యొత్తికొనుచు ‘నింక దైవంబ కాని యొండు శరణంబు లేదని యప్పరమ పతివ్రత తనయుందోడ్కొనిక్రమ్మఱిపోవ నున్న యవసరంబున.
1.4.105
చ. ‘గొనకొని వీఁడు నీకును శకుంతలకుం బ్రియనందనుండు; సే
కొని భరియింపు మీతని; శకుంతల సత్యము వల్కె,సాధ్వి, స
ద్వినుత, మహాపతివ్రత వివేకముతో’ నని దివ్యవాణి దా
వినిచె ధరాధినాథునకు విస్మయ మందఁగఁ దత్సభాసదుల్.
1.4.106
వ. ఇ ట్లెల్లవారలకు నతిహర్షంబుగా శకుంతల పతివ్రతాత్వంబును సత్యంబును భరతోత్పత్తియుఁ బ్రశంసించు వేలుపుల పలుకు లతివ్యక్తంబు లయి యాకాశంబువలన వీతెంచిన విని దుష్యంతుండు సభాసదులు విన ని ట్లనియె.
1.4.107
తే. ఏను నీ యింతియును గాని యెఱుఁగ రన్యు | లర్థిఁ గణ్వమహాముని యాశ్రమంబు
నందు గాంధర్వవిధి వివాహమునఁ గరము | నెమ్మిఁ జేసిన దీని పాణిగ్రహణము.
1.4.108
తే. అన్యు లెఱుఁగమిఁ జేసి లోకాపవాద | భీతి నెఱిఁగియు నిత్తన్విఁ బ్రీతి దప్పి
యెఱుఁగ నంటిని నిందఱ కిప్పు డెఱుఁగఁ | జెప్పె నాకాశవాణి యచ్చెరువు గాఁగ.
1.4.109
వ. అని మహానురాగంబునం గొడుకు నెత్తికొని హర్షపులక లెసఁగ నాలింగనంబు సేసి, శకుంతలా మహాదేవి నతిప్రణయగౌరవంబునసంభావించి, యౌవరాజ్యంబునకు భరతు నభిషిక్తుంజేసి. పెద్దకాలంబు రాజ్యసుఖంబు లనుభవించి, తన రాజ్యభారం బంతయు భరతుం బూన్చి, దుష్యంతుండు తపోవనంబున కరిగిన.
1.4.110
చ. భరతుఁ డశేష భూభువనభార ధురంధరుఁ డై వసుంధరం
బరఁగి, యనేక యాగములఁ బాయక భాస్కర జహ్నుకన్యకా
సురుచిర తీరదేశముల సువ్రతుఁడై యొనరించి, భూరిభూ
సురులకు నిచ్చె దక్షిణలు శుద్ధసువర్ణ గవాశ్వహస్తులన్.
1.4.111
వ. మఱియు నతీతానాగతు లైన నిజవంశంబున రాజులకెల్ల వంశకర్త యయ్యె; నట్టి భరతునకుఁ గైకేయి యైన సునందకు భుమన్యుండు పుట్టె; వానికి దాశార్హపుత్త్రి యైన విజయకు సుహోత్రుండు పుట్టె; వానికి నిక్ష్వాకు కన్యయైన సువర్ణకు హస్తి పుట్టె; నతనిపేరం గౌరవ్య రాజధాని యైన నగరంబు హస్తిపురంబునాఁ బరఁగె; నట్టి హస్తికిం ద్రిగర్తరాజపుత్త్రి యైన యశోధరకు వికుంఠనుండు పుట్టె; వానికి దాశార్హపుత్త్రి యైన వసుదేవకు నజమీఢుండు పుట్టె; నయ్యజమీఢునకుఁ గైకేయియు గాంధారియు ఋక్షయు నను మువ్వురు స్త్రీలకు.
1.4.112
క. బలయుతులు నూటయిరువది | నలువురు సుతు లుద్భవిల్లి నానాదేశం
బులకుఁ బతు లైరి; మఱి వా | రలలో సంవరణుఁ డఖిలరాజ్యోన్నతుఁ డై.
1.4.113
క. అనఘుఁడు పౌరవకుల వ | ర్ధనుఁ డద్దిననాథ తనయఁ దపతి వివాహం
బొనరఁగ నయ్యె; నిరువుర | కును వంశకరుండు పుట్టెఁ గురుఁ డున్నతుఁడై.
1.4.114
వ. వానిపేరం గురుక్షేత్రంబునాఁ బరఁగె; నట్టి కురునకు దాశార్హియైన శుభాంగికిని విధూరథుండు పుట్టె; వానికి మాగధి యయిన సంప్రియకు ననశ్వుండు పుట్టె; నయ్యనశ్వునకు మాగధి యైన యమృతకుం బరీక్షితుండు పుట్టె; వానికి బహుదానసుత యైన సుయశకు భీమసేనుండు పుట్టె; వానికిం గైకేయి యైన కుమారికిఁ బ్రదీపుఁడు (బర్యశ్రవసుండు) పుట్టె; వానికిఁబ్రతీపుండు పుట్టెఁ; బ్రతీపునకు శిబిపుత్త్రియయిన సునందకు దేవాపి శంతనుబాహ్లికు లనఁగా మువ్వురు పుట్టి; రందు దేవాపి బాల్యంబునంద తపోవనంబున కరిగిన శంతనుండు రాజయ్యె; వానికి గంగాదేవికి దేవవ్రతుం డైన భీష్ముండు పుట్టె; మఱియు శంతనునకు యోజనగంధి యయిన సత్యవతికిం జిత్రాంగద విచిత్రవీర్యు లనంగా నిద్దఱుగొడుకులు పుట్టి; రందుఁ జిత్రాంగదుండు బాల్యంబున గంధర్వనిహతుండయిన, వానికింగొండుకవానివిచిత్రవీర్యురాజ్యాభిషిక్తుంజేసి భీష్ముండు కాశీరాజదుహితల నంబికాంబాలిక లనువారి నిద్దఱ విచిత్రవీర్యునకు వివాహంబు సేసిన.
1.4.115
చ. అతిశయరూపయౌవన గుణాధిక సుందర మైన యాసతీ
ద్వితయమునందు సంతతరతిన్ వివశుం డయి రాజకృత్యముల్
మతి నొకనాఁడుఁ జేయ కహిమద్యుతితేజుఁడు రాజయక్ష్మబా
ధితుఁడయి దేవలోకసుదతీప్రియుఁ డయ్యె విచిత్రవీర్యుఁడున్.
1.4.116
వ. అంత దౌష్యంతి సంతానవిచ్ఛేదంబు గావచ్చిన సత్యవతీనియుక్తుండై సకలధర్మమూర్తి కృష్ణద్వైపాయనుండు దేవరన్యాయంబున నంబికయందు ధృతరాష్ట్రుని, నంబాలికయందుఁ బాండురాజును నంబికాపరిచారిక యందు విదురునిం బుట్టించిన; నందు ధృతరాష్ట్రునకు గాంధారికి వ్యాసవరప్రసాదంబున దుర్యోధనుండాదిగా నూర్వురు గొడుకులు పుట్టిరి. పాండురాజు నియోగంబునఁ గుంతీమాద్రులకు ధర్మానిలశక్రాశ్వినుల ప్రసాదంబున ధర్మజభీమార్జున నకులసహదేవు లనంగా నేవురుకొడుకులు పుట్టి; రయ్యేవురకుం బాంచాలి ధర్మపత్నియయ్యె;దానియందు ధర్మరాజునకుఁబ్రతివింధ్యుండును, భీమసేనునకు శుత్రసోముండును, నర్జునునకు శ్రుతకీర్తియు, నకులునకు శతానీకుండును, సహదేవునకు శ్రుతసేనుండును ననఁ బంచోపపాండవులు పుట్టిరి; మఱి ధర్మరాజునకు స్వయంవర లబ్ధ యైన దేవికయనుదానికి యౌధేయుండు పుట్టె; భీమసేనునకు జరంధరకు సర్వగుండు పుట్టె; నర్జునునకు సుభద్రకు నభిమన్యుండు పుట్టె; నకులునకుఁ జైద్యయయిన కరేణుమతికి నిరమిత్రుండు పుట్టె; సహదేవునకు స్వయంవరలబ్ధయైన విజయకు సుహోత్రుండు పుట్టె; మఱియుభీమసేనునకు హిడింబకుఘటోత్కచుండు పుట్టె; నిప్పాటంబాండవ పుత్త్రులైన పదునొక్కండ్రయందును వంశకరుం డైన యభిమన్యునకు విరాటపుత్త్రి యయిన యుత్తరకుం బరీక్షితుండు పుట్టె.
1.4.117
క. అతనికి ననంత పుణ్యా | న్విత యనఁదగు మాద్రవతికి నీ వఖిలజగ
న్నుత! జనమేజయ! పుట్టితి | ధృతిఁ బాండవవంశమునకుఁ దేజం బెసఁగన్.
1.4.118
వ. మఱియు నీకును వపుష్టమకును శతానీక శంకుకర్ణులుపుట్టి; రందు శతానీకునకువైదేహికి నశ్వమేధదత్తుండు పుట్టె.
1.4.119
క. వీ రైలులుఁ బౌరవులును | భారతులును గౌరవులును బాండవులు ననన్
వీరు లయి పరఁగి; రిది నయ | పారగ! భవదీయవంశ పరిపాటి మహిన్.
1.4.120
వ. అనిన విని జనమేజయుండు వైశంపాయనున కి ట్లనియె.
1.4.121
క. నరవరుఁ డగు శంతనున క | మరనదికిని నెట్లు సంగమం బయ్యె మహా
పురుషుండు భీష్ముఁ డె ట్ల | య్యిరువురకును బుట్టె? దీని నెఱిఁగింపు మొగిన్.
1.4.122
వ. ‘మఱి పాండవ ధార్తరాష్ట్ర సంభవంబును సవిస్తరంబుగా వినవలతుం జెప్పు’ మనిన వానికి వైశంపాయనుం డి ట్లని చెప్పెఁ; దొల్లి యిక్ష్వాకువంశంబున మహాభిషుం డనువాఁడు పుట్టి మహాధర్మశీలుండై యశ్వమేధసహస్రంబును రాజసూయశతంబునుం జేసి యింద్రాదిదేవతలం దనిపి, దేవలోకంబునకుం జని యందు దేవర్షిగణంబులతోఁ బితామహుంగొల్చుచున్న యవసరంబున గంగానది దివ్యస్త్రీరూపధారిణి యయి బ్రహ్మసభకు వచ్చిన.
1.4.123
తే. ఊరుమూల మేర్పడఁగ నయ్యువిద వలువు | దొలఁగె ననిలంబుచేత విధూత మగుచు;
నమరు లెల్లఁ జరాఙ్ముఖు లైరి; దాని | సాభిలాషుఁ డై చూచె మహాభిషుండు.
1.4.124
ఆ. దాని నెఱిఁగి కమలయోని వానికిఁ గర | మల్గి మర్త్యయోనియందుఁ బుట్టు
మనుచు శాపమిచ్చె; నొనరంగ వాఁడును | గరము భీతిఁ గరయుగంబు మొగిచి.
1.4.125
వ. ‘మర్త్యలోకంబున రాజర్షివరులలోనఁ బుణ్యచరిత్రుండు ప్రతీపుండ కావున వానికిఁ బుత్త్రుండ నై జన్మించెద; నొరులయందు జనింపనోప’ నని కమలభవుననుమతంబు వడసె, గంగయు నమ్మహాభిషుని మహానుభావంబును రూపసౌందర్యంబులును దనయందుల యభిలాషయు నెఱింగి తానును మనోజబాణబాధిత యయి వానిన తలంచుచు మర్త్యలోకంబునకు వచ్చునది యెదుర.
1.4.126
క. అనిమిషలోక వియోగం | బున దుఃఖితు లయి వసిష్ఠమునివరు శాపం
బున వచ్చువారి వసువుల | నెనమండ్రం గాంచి గంగ యెంతయుఁ బ్రీతిన్.
1.4.127
క. ‘ద్యుతి దఱిగి నిజనియోగ | చ్యుతిఁ బొందను మీకు నొండుచోటికి నరుగం
గత మేమి’? యనిన విని య | య్యతివకు సురనదికి నిట్టు లని రవ్వసువుల్.
1.4.128
వ. ‘ఏము వసిష్ఠమునివరు శాపంబునం జేసి మర్త్యలోకంబునం దెయ్యేనియు నొక్కపుణ్యవతి యైన స్త్రీయందు జన్మింపంబోయెద’ మని దుఃఖించి, తమ శాపప్రకారంబు గంగాదేవికి నెఱింగించి, ‘యే మొండుచోట జన్మింపనోపము; నీయంద పుట్టెదము; మఱి మహాభిషుండు ప్రతీపునకు శంతనుం డై పుట్టెడుఁగావున వానికి నీకును సమాగమం బగు; మాజన్మంబునకు నిమిత్తం బాతండ యగు’ ననిన విని గంగ సంతసిల్లి యి ట్లనియె.
1.4.129
క. ‘నా కభిమతంబు నిట్టిద; | మీకును నుపకార మగు; సమీహిత బుద్ధిం
జేకొని చేసెద మీర ల | శోకస్థితి నుండుఁ’ డనుచు సురనది కరుణన్.
1.4.130
వ. వసువులకు మనఃప్రియంబుగాఁబలికిన విని, వారును గంగ యనుగ్రహంబు వడసి ‘నీవు మాకు నుపకారంబు సేయనోపుదేని నేము నీకుం గ్రమక్రమంబునం బుట్టునప్పుడ మమ్ము నీళ్ళ వైచుచు మర్త్యలోకంబున నుండకుండునట్లుగాఁ జేయునది; మాకు వసిష్ఠ మహాముని యనుజ్ఞయు నిట్టిద’ యనిన గంగయు ‘నట్ల చేయుదు; మఱి మీరెల్ల స్వర్గతులైన నా కొక్కకొడుకు దీర్ఘాయుష్మంతుండై యుండెడు విధం బె‘ట్లనిన దానికి వసువు లి ట్లనిరి.
1.4.131
క. మాయం దొక్కొక్కళ్ళతు | రీయాంశముఁ దాల్చి శుభచరిత్రుం డై దీ
ర్ఘాయుష్యుం డష్టమ వసు | వాయతభుజుఁ డుండు నీకు నాత్మోద్భవుఁ డై.
1.4.132
వ. అని యిట్లు గంగా వసువు లొండొరులు సమయంబు సేసికొని చని; రంత నిక్కడ.
1.4.133
క. వీరుఁడు ప్రతీపుఁ డఖిల | క్ష్మారాజ్య, సుఖములఁ దనిసి మానుగ గంగా
తీరమునఁ దపము సేయుచు | భారతకులుఁ డుండె ధర్మపరుఁడై నిష్ఠన్.
1.4.134
వ. ఇట్లు యమ నియమవ్రత పరాయణుండై యున్నవానికిం బ్రత్యక్షం బై యొక్కనాఁడు.
1.4.135
ఉ. గంగ నిజాంగదీప్తు లెసఁగం జనుదెంచి లతాంగి సంగతో
త్తుంగ పయోధర ద్వితయ తోయరుహానన చారునేత్ర ది
వ్యాంగన యై ప్రతీపవసుధాధిపు శాలవిశాల దక్షిణో
త్సంగమునందు మన్మథవశంబున నుండెఁ గరంబు లీలతోన్.
1.4.136
వ. ప్రతీపుండును దానింజూచి యచ్చెరువంది ‘నీవెందులదాన? విట్లేలనాకుఱువెక్కి?’ తనిన నది యి ట్లనియె.
1.4.137
ఆ. ఏను జహ్నుకన్య నింద్రసమాన! నీ | సద్గుణావళులకు సంతసిల్లి
భానుతేజ! నీకు భార్యగా వచ్చితి | నిష్టమునఁ బరిగ్రహింపు నన్ను.
1.4.138
చ. అనినఁ బ్రతీపుఁ డిట్లనియె; ‘నంబురుహానన యగ్నిసాక్షికం
బునఁ బరిణీత యైన సతిఁ బొల్పుగ నొక్కతఁగాని యన్యలన్
మనముననేనియుం దలఁప; మానిని! యిట్టి జితాత్ము నన్ను ని
ట్లని పలుకంగ నీ కగునె? యన్యులఁ బల్కినయట్ల బేల వై.
1.4.139
వ. ‘మఱి యదియునుంగాక స్త్రీభాగం బయిన డాపలికుఱువెక్కక పురుషభాగంబై పుత్త్రారోహణ యోగ్యం బైన నావలపలికుఱు వెక్కితిగావున నాపుత్త్రునకు భార్య వగు’ మనిన నదియునట్ల చేయుదునని యదృశ్యయయ్యె; నంతం బ్రతీపుఁడును బుత్త్రార్థియై సకలతీర్థంబులయందు సునందాదేవియుం దాను వేదవిహితవ్రతంబులు సలుపుచుఁ బెద్దకాలంబు దపంబు సేసిన.
1.4.140
ఆ. అధికపుణ్యమూర్తు లైన యయ్యిరువుర | కమరనిభుఁడు కౌరవాన్వయంబు
వెలుఁగుచుండఁ బుట్టె వీరాగ్రగణ్యుండు | సంతతార్థదాయి శంతనుండు.
1.4.141
వ. ఇ ట్లుదయించి పెరిఁగి సంప్రాప్త యౌవనుం డైన కొడుకుం జూచి ప్రతీపుండు తనకు నక్షయపుణ్యలోకంబులు గలిగె నని సంతసించి, సకలరాజ్యభారధౌరేయుఁగా నభిషిక్తుం జేసి కొడుకున కి ట్లనియె.
1.4.142
మధ్యాక్కర. తనుమధ్య దా నొక్కకన్య సురనదీతటమున నన్నుఁ
గనిన నక్కన్యకఁ జూచి ‘నీ విట్టి కమనీయ రూప,
వొనర నా సుతునకు భార్య వగు మన్న నొడఁబడి యియ్య
కొనియెఁ; గావున దానిఁ దగ వివాహ మగుము నెయ్యమునను.’
1.4.143
వ. మఱి యక్కోమలి కులగోత్రనామంబు లడుగక దానియిష్టంబు సలుపు మని కొడుకుం బంచి ప్రతీపుఁడు తపోవనంబునకుం జనియె; నిట శంతనుండు రాజ్యంబు సేయుచు నొక్కనాఁడు మహాధనుర్ధరుండై మృగయావినోదంబులఁ దగిలి యొక్కరుండును వనమ్ములోఁ గ్రుమ్మరువాఁ డనిలాలోలకల్లోలమాలాస్ఫాలన సముచ్చల జ్జలకణాసార శిశిరశిశిరం బగుచున్న గంగాపులినతలంబున.
1.4.144
క. తరళాయతలోచన న | త్యురుకుచఁ దేజోభిరామ నుత్తమదివ్యాం
బర మాల్య మణిమయాలం | కరణోజ్జ్వలవేష నొక్కకన్యకఁ గనియెన్.
1.4.145
చ. కని ‘వనకన్యయో దనుజకన్యకయో భుజగేంద్రకన్యయో
యనిమిషకన్యయో యిది వియచ్చరకన్యకయో యపూర్వ మీ
వనమున కిట్టు లేకతమ వచ్చునె మానవకన్య’ యంచు న
య్యనఘుఁడు దానిఁ జిత్తమున నాదట వోవక చూచెఁబ్రీతితోన్.
1.4.146
వ. అదియు నమ్మహీపతి రూపయౌవనసౌందర్యవిలాసంబుల కోటువడి మహానురాగంబున వానిన చూచుచున్నంత.
1.4.147
క. ఇరువురు నొండొరువులఁ గడు | సురుచిరముగఁ జూచు వాఁడిచూడ్కులు దనకున్
శరములుగాఁ గొని యేసెను | మరుఁ డయ్యిరువుర మనోభిమానచ్యుతిగన్.
1.4.148
వ. శంతనుండు దానిం జూచి ‘నీవెందులదాన‘ విట్లేల యేకతంబ యున్నదాన’ వని యడుగ నోడి మిన్నకయున్న నాతండు తనయందు దృఢానురాగుం డగుట యెఱింగి యది యి ట్లనియె.
1.4.149
క. భూనాథ! నీకు భార్యం | గా నన్నుఁ బరిగ్రహింపఁ గడుకొని యిష్టం
బేని సమయంబు సేయుము | మానుగ నా కిష్టమయినమార్గముఁ బ్రీతిన్.
1.4.150
వ. అది యెట్లంటేని -‘యే నెద్ది సేసినను దానికి నొడంబడి వారింపకుండను, నన్ను నప్రియంబులు పలుకక యుండను వలయు; నట్లైన నీకు భార్య నై యభిమతసుఖంబు లొనరింతు; నటుగాక నీ వెప్పుడేని నన్ను నప్రియంబులు వలుకు దప్పుడ నిన్నుఁ బాసిపోదు’ ననిన శంతనుండు నొడంబడి దానిం బరిగ్రహించె; గంగయు మనుష్యస్త్రీరూపధారిణియై వాని కిష్టోపభోగంబులు సలుపుచుండె; నంత.
1.4.151
సీ. వరుణుఁ డాదిగఁగల వసువులు దోడ్తోడఁ | బుట్టుచు నున్న నప్పొలఁతి వారి
నల్లన పుట్టిన యప్పుడ కొనిపోయి | నిర్దయ యై గంగనీరిలోన
వైచిన, నెఱిఁగి య వ్వసుమతీనాథుండు | ‘తనయుల ని ట్లేల దయయు లేక
గంగలో వైచెదు’? కడు నధర్మం బేల | చేసెదు’ నా నోడుఁ; జెలువ దన్నుఁ
ఆ. బాసిపోవు ననియుఁ బలుకక యెప్పటి | యట్ల నెమ్మి నుండు; నంతఁ బుట్టెఁ
దనయుఁ డష్టముండు దల్లిదండ్రుల కతి | ప్రీతియును ముదంబుఁ బెరుఁగుచుండ.
1.4.152
వ. అక్కొడుకుం జూచి పుత్త్రమోహంబునఁ జంపనీనోపక శంతనుండు గంగ కి ట్లనియె.
1.4.153
క. పడయంగ రాని కొడుకులఁ | గడుఁ బలువురఁ బడసి పుత్త్రఘాతినివై; తీ
కొడుకు నుదయార్కతేజుని | విడువఁగ నే నోప ననుచు వేడుకతోడన్.
1.4.154
వ. దాని నప్రియంబులు వలికి వారించిన, నదియుం దొల్లి చేసిన సమయంబు దలంచిఁ ‘నీతోడిసంగతి నాకు నింతియ; యేను బుణ్యజలప్రవాహపవిత్రఁ ద్రిభువనపావని యనంబరఁగిన గంగఁజుమ్మీ! వసువులు వసిష్ఠుశాపంబున వసుమతిం బుట్టుచుండి యే మొండుచోట జన్మింపనోపము; నీయంద పుట్టెదము; మర్త్యంబునం బెద్దకాలం బుండకుండ మమ్ము ముక్తులం జేయు మని నన్నుం బ్రార్థించిన దేవహితార్థంబు మనుష్యస్త్రీరూపంబు దాల్చి నీవలన వసువులం బుట్టించితి; దీన నీకుం బుణ్యలోకంబు లక్షయంబు లగు; మఱియు నియ్యష్టమపుత్త్రుండు వసువులం దొక్కొక్కళ్ళ చతుర్థాంశంబులు దాల్చి సకలధర్మమూర్తి యయి పుట్టినవాఁడు; లోకహితార్థంబుగా మర్త్యంబునం బెద్దకాలం బుండు ‘ననిన గంగకు శంతనుండి ట్లనియె.
1.4.155
క. వసువు లనువా రపేత | వ్యసనులు, దేవతలు, లోకవంద్యులు; వారిన్
వసుమతిఁ బుట్టఁగ శాపము | వసిష్ఠముని యేల యిచ్చె వారిజనేత్రా!
1.4.156
వ. ‘మఱి వసువులు పుట్టుచు స్వర్గంబునకుం జనుటయు, నీయష్టమవసువు మర్త్యంబునం బెద్దకాలం బునికియు నేమి కారణం?’ బని యడిగిన వానికి గంగ యి ట్లనియె.
1.4.157
చ. అతులతపంబునన్ వరుణుఁ డన్మునిచే బహుపుణ్యకర్మసు
స్థితిఁ బ్రభవింపగాఁ బడిన దివ్యమునీంద్రుఁ డశేషలోక పూ
జితుఁడు వసిష్ఠుఁ డాశ్రమముఁ జేసి తపం బొనరించె బ్రహ్మస
మ్మితుఁ డురురత్నరాజిత సుమేరు మహీధర కందరంబునన్.
1.4.158
వ. మఱియు దక్షప్రజాపతి పుత్త్రియయిన సురభికిం గశ్యపునకుం బుట్టిన నందిని దనకు హోమధేను వయి కోరిన వస్తువులు గురియుచుండఁదపంబు సేయుచున్న వసిష్ఠునాశ్రమంబునకు వసువు లెనమండ్రును భార్యాసహితు లై క్రీడార్థంబు వచ్చి, వసిష్ఠుహోమధేనువుం జూచి, దాని శీలంబునకు విస్మయం బందుచున్నచో నం దష్టమవసుభార్య పతి కి ట్లనియె.
1.4.159
ఆ. దీనిపాలు ద్రావి మానవుల్ పదియువే | లేండ్లు జరయు రుజయు నెఱుఁగ కమర
భావమున సుఖంబు జీవింతు రటె!; దీని | నేలఁగనిన వాఁడ యెందుఁ బెద్ద.
1.4.160
వ. ‘మర్త్యలోకంబున నుశీనరపతికూఁతురు జితవతి యను కోమలి నా ప్రియసఖి; యే నెప్పుడు దానికిఁ బ్రియంబు గోరుచుండుదు; నిమ్మొదవు నమ్ముదితకిచ్చిపుత్త’ మనినఁబ్రణయిని వచనంబుల కనుగుణంబుగాఁ బ్రభాసుండు నిజభ్రాతృచోదితుం డయి వసిష్ఠుహోమధేనువుం బట్టికొనిపోయిన, నమ్మునియు దనహోమధేనువుం గానక వనంబెల్లఁ గలయరోసి, తన యోగదృష్టిం జూచి వసువులు గొనిపోక యెఱింగి.
1.4.161
ఆ. ‘మనుజయోనిఁ బుట్టుఁ’ డని వారి కప్పుడు | కోప మడర మునియు శాప మిచ్చె;
భయము వొంది వివశు లయి వచ్చి వారును | వినయ మొనర నిట్టు లనిరి మునికి.
1.4.162
వ. ‘నీవు ధర్మమూర్తివి; మాచేసిన యజ్ఞానంబు సహించి మర్త్యంబునం బెద్దకాలం బుండకుండ మా కనుగ్రహింపవలయు’ నని ప్రార్థించిన నమ్ముని ప్రసన్నుం డయి ‘మీకోరినయట్ల యగు; నష్టముం డయిన యీప్రభాసుండుపెద్దయునపరాధంబుఁజేసెఁగావున వీఁడు మర్త్యలోకంబునం బెద్దకాలంబుండు; ననపత్యుండు నగు’ ననియె నని గంగాదేవి తనస్వరూపంబుఁ జూపి, వసూత్పత్తియు స్వర్గగమన నిమిత్తంబును గాంగేయ జన్మస్థితియునుం జెప్పి, ‘దేవవ్రతుం డయిన యిక్కుమారుండు పెరుఁగునంతకు నాయొద్దన యుండు’నని శంతను నొడంబఱిచి కొడుకుం దోడ్కొని యరిగిన; విస్మయం బంది శంతనుండు దానితోడి యిష్టోపభోగంబులం బెద్దకాలంబు సనిన నల్పకాలంబుకా వగచుచు హస్తిపురంబునకు వచ్చి.
1.4.163
మ. తన కాజ్ఞావశవర్తు లై మహిసమస్తక్షత్త్రవంశేశు లె
ల్లను భక్తిం బనిసేయుచుండఁగ విశాలం బైన సత్కీర్తి ది
గ్వనితా మౌక్తిక దామలీల వెలుఁగన్ వారాశిపర్యంత భూ
జనరక్షాపరుఁ డయ్యె శంతనుఁడు రాజద్రాజధర్మస్థితిన్.
1.4.164
వ. ఇట్లు లోకంబెల్లఁ దనధర్మమార్గంబ పొగడుచుండ సుఖంబుండి యాతం డొక్కనాఁడు మృగయావ్యాజంబున గంగాసమీపంబునం జనువాఁడు దన్నుంబాసి తనుత్వంబుఁ దాల్చినట్లు గడునల్పప్రవాహం బైయున్నదానిం గంగానదిం జూచి యిది యేమినిమిత్తంబో యనుచుం గొండొకనేల యరిగి.
1.4.165
తరలము. కనియె ముందట నమ్మహీపతి గాంగసైకత భూములం
బనుగొనన్ ధను వభ్యసించుచు బానసంహతి సేతుగా
ఘనముగా నమరాపగౌఘముఁ గట్టియున్న కుమారు న
త్యనఘు నాత్మసమాను నాత్మజు నాపగేయు మహాయశున్.
1.4.166
వ. కని పుట్టిననాఁడ చూచినవాఁడు గావున నప్పు డెఱుంగనేరక విస్మయాకులిత చిత్తుం డయి యుండెఁ; గుమారుండు నాతనిం జూచి తండ్రిగా నెఱుంగనేరకయు నిసర్గస్నేహమోహితుం డై యుండె; నంత,
1.4.167
తే. దివ్యభూషణాలంకృతదేహుఁ డైన | కొడుకు వలపలిచేయూఁది కోమలాంగి
దివ్యనది ప్రీతితోఁ జనుదెంచి పతికిఁ | జూపి ‘భూనాథ! వీఁడు నీ సూనుఁ’ డనియె.
1.4.168
వ. మఱియును.
1.4.169
సీ. సాంగంబు లగుచుండ సకలవేదంబులు | సదివె వసిష్ఠుతో; సకలధర్మ
శాస్త్రాది బహువిధశాస్త్రముల్ శుక్రబృ | హస్పతుల్ నేర్చినయట్ల నేర్చెఁ
బరమాస్త్రవిద్య నప్పరశురాముం డెంత | దక్షుఁ డంతియ కడుదక్షుఁ డయ్యె;
నాత్మవిజ్ఞానంబునందు సనత్కుమా | రాదుల యట్టిఁడ యనఘమూర్తి
ఆ. నొప్పుగొనుము వీని; నుర్వీశ!’ యని సుతు | నిచ్చి గంగ సనిన, నెఱిఁగి తనయు
నెమ్మిఁ దోడుకొనుచు నిధి గన్నపేదయ | పోలె సంతసిల్లి భూవిభుండు.
1.4.170
వ. తన పురంబునకు వచ్చి సకలరాజన్య ప్రధాన సమక్షంబున గాంగేయునకు యౌవరాజ్యాభిషేకంబు సేసి, కొడుకుతోడి వినోదంబులం దగిలి నాలుగువత్సరంబు లనన్యవ్యాపారుండై యుండి, యొక్కనాఁడు యమునాతీరంబున వేఁటలాడుచుఁ గ్రుమ్మరువాఁ డపూర్వసురభిగంధం బాఘ్రాణించి దానివచ్చిన వల నారయుచు నరిగి యమునాతీరంబున.
1.4.171
క. కనకావదాతకోమల | తనులతఁ దనుమధ్యఁ గమలదళనేత్రను యో
జనగంధి నవనినాథుఁడు | గనియెను సురకన్యవోని కన్నియ నంతన్.
1.4.172
ఉ. దాని శరీరసౌరభము, దాని విలోల విలోకనంబులున్,
దాని మనోహరాకృతియు, దాని శుచిస్మిత వక్త్రకాంతియున్,
దాని విలాసముం గడుముదంబునఁ జూచి మనోజబాణసం
తానహతాత్ముఁ డై నృపతి దానికి ని ట్లనియెం బ్రియంబునన్.
1.4.173
ఉ. ‘ఎందులదాన? వేకతమ యియ్యమునానది నోడ నడ్పుచున్
సుందరి! నీకు నున్కి యిది చూడఁగఁ దా నుచితంబె?’ నావుడున్
మందమనోజ్ఞహాసముఖమండల మెత్తి మృగాక్షి చూచి సం
క్రందనసన్నిభున్ నృపతిఁ గన్యక యి ట్లని పల్కెఁ బ్రీతితోన్.
1.4.174
వ. ‘ఏను దాశరాజుకూఁతురఁ; దండ్రి నియోగంబున నిక్కార్యంబు ధర్మార్థంబు సేయుచుందు’ ననిన దాని యభినవ రూపసౌందర్యంబులు దొల్లియు విని యెఱింగినవాఁ డై యక్కోమలిం గామించి దాశరాజుకడకుం జని తనయభిప్రాయం బెఱింగించిన, నతండును సంతసిల్లి శంతను నత్యంతభక్తిం బూజించి యి ట్లనియె.
1.4.175
తే. పుట్టినప్పుడ కన్యకఁ బోలునట్టి | వరుస కిచ్చుట యిది లోకవర్తనంబు;
వసుమతీనాథ! నీయట్టి వరున కిచ్చి | ధన్యులము గామె యిక్కన్యఁ దద్ద పేర్మి.
1.4.176
వ. ‘అయినను నా డెందంబునం గలదానిం జెప్పెద; నిక్కన్యక నీకు ధర్మపత్నిగాఁ జేయునట్టి యిష్టంబు గలదేని నావేఁడిన దాని ని’మ్మనిన శంతనుండు ‘దాని నీనగునేని యిచ్చెదఁ; గానినాఁడీనేర; నది యేమి సెప్పు’ మనిన దాశరా జి ట్లనియె.
1.4.177
మధ్యాక్కర. ‘భూపాల! నీకు నిక్కోమలివలనఁ బుట్టిన సుతుఁడు
నీ పరోక్షంబున రాజు గావలె; నెమ్మి ని ట్లీఁగ
నోపుదే?’ యనిన శంతనుఁడు గాంగేయు యువరాజుఁ దలఁచి
‘యీపల్కు దక్కఁగ నొండు వేఁడుమ యిచ్చెద’ ననిన.
1.4.178
వ. ‘నా కొండెద్దియు నిష్టంబు లే’ దనిన విని, యద్దాశరాజుచేతం బ్రతిహత మనోరథుం డయి, క్రమ్మఱి నిజపురంబునకు వచ్చి, శంతనుండు చింతాక్రాంతుం డయి సత్యవతిన తలంచుచు, నివృత్తకార్యాంతరుం డయియున్న; నొక్కనాఁడు గాంగేయుండు తండ్రిపాలికి వచ్చి యి ట్లనియె.
1.4.179
చ. భవదభిరక్షితక్షితికి బాధ యొనర్పఁగ నోపునట్టి శా
త్రవనివహంబు లేదు; వసుధాప్రజకెల్ల ననంతసంతతో
త్సవముల; రాజులెల్ల ననిశంబు విధేయుల నీకు; నిట్లు మా
నవవృషభేంద్ర! యేలొకొ మనఃపరితాపముఁ బొందియుండఁగన్.
1.4.180
వ. అనిన విని పెద్దయుంబ్రొద్దు చింతించి శంతనుండు గొడుకున కి ట్లనియె.
1.4.181
క. వినవయ్య! యేకపుత్త్రుఁడు | ననపత్యుఁడు నొక్కరూప యని ధర్మువులన్
విని, నీకుఁ దోడు పుత్త్రుల | ననఘా! పడయంగ నిష్టమయినది నాకున్.
1.4.182
క. జనవినుత! యగ్నిహోత్రం | బును సంతానమును వేదములు నెడతెగఁగాఁ
జన దుత్తమవంశజులకు | ననిరి మహాధర్మనిపుణు లైన మునీంద్రుల్.
1.4.183
క. నీవస్త్ర శస్త్ర విద్యా | కోవిదుఁడవు; రణములందుఁ గ్రూరుఁడ; వరివి
ద్రావణ సాహసికుండవు | గావున నీయునికి నమ్మఁగా నేర నెదన్.
1.4.184
వ. ‘బహుపుత్త్రార్థంబు యత్నంబు సేయవలయు; వివాహం బయ్యెద’ ననిన విని గాంగేయుండు వృద్ధామాత్యపురోహితసుహృజ్జనంబులతోవిచారించి, యోజనగంధి రాజు చిత్తంబునం గలుగుట యెఱింగి, యనేక రాజన్యసమన్వితుం డయి దాశరాజుకడకుం జని’ మారాజునకు సత్యవతిని దేవింగా నిచ్చునది’ యని యడిగిన; నాతండును దేవవ్రతుం బూజించి, ‘నీవు ధర్మశీలుండ, వర్థానర్థవిదుండవు, సకలకార్య సమర్థుండవు. గుర్వర్థంబు కన్యార్థివై వచ్చితివి కావునం గృతార్థుండ నైతి; నెవ్వనియేని వీర్యంబున నిక్కన్య యుద్భవిల్లె నట్టి యుపరిచరుం డను రాజర్షి ‘యీ సత్యవతి నొరుల కీవలవదు; శంతనునక యిచ్చునది’ యనుటంజేసి తొల్లి యసితుం డయిన దేవలుండు కన్యార్థి యయి వచ్చి ప్రత్యాఖ్యాతుం డయ్యె; నిట్టి సంబంధ మెవ్వరికిఁ బడయనగు?’
1.4.185
క. విను మైనను సాపత్న్యం | బను దోషము కలదు దీన; నదియును నీచే
తన సంపాద్యము; నీ వలి | గిన నడ్డమె పురహరాజకేశవు లయినన్.
1.4.186
వ. ‘ఆ దోషం బెట్లు పరిహృతంబగు నట్లుగా నీచిత్తంబునం దలంచి వివాహంబు సేయు’ మనిన గాంగేయుం డి ట్లనియె.
1.4.187
చ. వినుఁడు ప్రసిద్ధులైన పృథివీపతు లిందఱు నే గురుప్రయో
జనమునఁ జేసితిన్ సమయసంస్థితి; యీలలితాంగి కుద్భవిం
చిన తనయుండ రాజ్యమును జేయఁగ నర్హుఁడు; వాఁడ మాకు నె
ల్లను బతి; వాఁడ కౌరవకులస్థితికారుఁ డుదారసంపదన్.
1.4.188
వ. అని సభాసదులకెల్ల రోమహర్షణంబుగా సత్యవ్రతుండయిన దేవవ్రతుండు పలికిన వెండియు దాశరా జిట్లనియె.
1.4.189
క. ‘నీ వఖిల ధర్మవిదుఁడవు | గావున నీ కిట్ల చేయఁగా దొరకొనియెన్;
భావిభవత్సుతు లిట్టిరె? | నీవిహితస్థితియు సలుపనేర్తురె?’ యనినన్.
1.4.190
క. ధృతిఁ బూని బ్రహ్మచర్య | వ్రత మున్నతిఁ దాల్చితిని ధ్రువంబుగ; ననప
త్యత యైనను లోకము లా | యతిఁ బెక్కులు గలవు నాకు ననుభావ్యము లై.
1.4.191
వ. అని యిట్లు సత్యవతిని దనతండ్రికి వివాహంబు సేయుపొంటె నిజరాజ్యపరిత్యాగంబును బ్రహ్మచర్య వ్రత పరిగ్రహణంబును జేసిన దేవవ్రతు సత్యవ్రతంబునకు గురుకార్యధురంధరత్వంబునకు మెచ్చి దేవర్షి గణంబులు నాతనిపయిం బుష్పవృష్టిఁ గురిసి భీష్ముం డని పొగడిరి. దాశరాజును గరంబు సంతసిల్లి శంతనునకు సత్యవతి నిచ్చె నంత.
1.4.192
మ. ఇనతేజుం డతిభక్తిఁ గాంచనరథం బెక్కించి యక్కన్యఁ దో
డ్కొని తెచ్చెం దనతల్లి సత్యవతినిన్ క్షోణీజనుల్ దన్ను బో
రనఁ గీర్తింపఁగ శంతనుం డతిమనోరాగంబునం బొంద శాం
తనవుం డాతతకీర్తి హస్తిపురికిం దత్కౌతుకారంభుఁ డై.
1.4.193
వ. శంతనుండును బరమానురాగంబున సత్యవతిని వివాహంబై, యతిమానుషం బయిన యాభీష్ము సత్యవ్రతంబునకు సంతసిల్లి, యాతనికి స్వచ్ఛందమరణంబుగా వరం బిచ్చి, సత్యవతియందుఁ జిత్రాంగద విచిత్రవీర్యులన నిద్దరు కొడుకులం బడసి, వారలు సంప్రాప్తయౌవనులు గాకుండఁ బరలోకగతుం డైనఁ, దండ్రికి భీష్ముండు పరలోకక్రియలు నిర్వర్తించి, చిత్రాంగదు రాజ్యాభిషిక్తుం జేసిన; నాతండును నతివ్యాలోలుండై గర్వంబున నెవ్వరి నుఱక సురదనుజ మనుజ గంధర్వాదుల నాక్షేపించుచున్న వాని కలిగి చిత్రాంగదుం డను గంధర్వపతి యుద్ధార్థియయి వచ్చినం గురుక్షేత్రంబునందు.
1.4.194
క. నరగంధర్వాధిపు ల | య్యిరువురు చిత్రాంగదులు సహింపక యని నొం
డొరుఁ దాఁకి వీఁకఁ బొడిచిరి | హిరణ్వతీ తీరమున నహీనబలాఢ్యుల్.
1.4.195
క. వదలక మాయాయుద్ధా | తిదక్షుఁ డయి వంచనోన్నతిన్ గంధర్వుం
డుదితరవితేజుఁ జిత్రాం | గదుఁ జంపె విచిత్ర పత్త్రకార్ముకహస్తున్.
1.4.196
వ. ఇట్లు చిత్రాంగదుండు గంధర్వనిహతుం డయినఁ, దత్పరోక్షంబున భీష్ముండు విచిత్రవీర్యుం గౌరవరాజ్యంబున కభిషిక్తుం జేసిన.
1.4.197
క. వసునిభుఁడు పైతృకం బగు | వసుధా రాజ్యంబు భీష్మువచనమున గత
వ్యసనుఁడయి తాల్చెఁ దేజం | బెసగంగ విచిత్రవీర్యుఁ డిద్ధయశుం డై.
1.4.198
వ. అట్టి విచిత్రవీర్యు నారూఢయౌవనుం జూచి భీష్ముండు వివాహయత్నపరుం డయి తన చారులవలనం గాశీరాజు కూఁతుల స్వయంవరోత్సవంబు విని ధనుర్ధరుం డయి రథం బెక్కి యొక్కరుండును వారణాసీపురంబునకుం జని యందు స్వయంవరంబునకు మూఁగిన రాజలోకం బెల్ల వెఱచి వెఱుఁగుపడి చూచుచుండ నక్కన్యకలఁ దనరథం బెక్కించికొని యెల్లవారలు విన ని ట్లనియె.
1.4.199
క. నాయనుజునకు వివాహము | సేయఁగఁ గన్యాత్రయంబుఁ జేకొని బలిమిం
బోయెద నడ్డం బగు వా | రాయతభుజశక్తి నడ్డమగుఁ డాజిమొనన్.
1.4.200
వ. ‘బ్రాహ్మంబు మొదలుగాఁగల యెనిమిది వివాహములయందు క్షత్త్రియులకుఁ గాంధర్వ రాక్షసంబు లుత్తమంబులు; స్వయంవరంబున జయించి వివాహం బగుట యంతకంటె నత్యుత్తమంబు గావున నిమ్మూఁగినరాజలోకంబు నెల్ల నోడించి యిక్కన్యలం డోడ్కొని నాచనుట యిది ధర్మంబ’ యని కాశీరాజునకుం జెప్పి వీడ్కొని భీష్ముండు వచ్చునప్పుడు.
First 200 of 277 passages. Read on