Andhra Mahabharatamu 2.1.236
Āndhra Mahābhāratamu 2.1.236
- Language
- Telugu
2.1.236
వ. మఱియు నులూక దేశాధిపతియగు బృహంతునిఁ బరాజితుం జేసి, యుత్తరోలూక వామదేవ మోదాపుర సుదామ సుసంకులంబు లను దేశంబుల రాజుల జయించి, దేవప్రస్థంబున సేనాబిందు నోడించి, విష్వగశ్వుండనురాజువిక్రమం బడంచి, పార్వతేయుల గర్వం బుడిపి, బర్బర శబర తురుష్కపతుల వశగతులంజేసి, మాళవ పౌండ్ర కాశ్మీర త్రిగర్త లోహిత సుధన్వగాంధార కాంభోజ కోసల పతులచేత విచిత్ర రత్న కాంచన వస్తు వాహన నివహంబులు గొని, చిత్రాయుధ రక్షితంబైన సింహపురంబు మథించి, సింహాసనాసీనులయిన వనచర దస్యుల వశ్యులంజేసి, శ్వేతపర్వతం బతిక్రమించి యట చని కాంభోజ కటకుండను రాజుచేతం బూజితుండై, హాటకదేశంబున మానసం బనుకొలను ఋషికుల్యంబును జూచి, యందుల రాజులచేత నపరిమిత పదార్థంబులం దిత్తిరి కల్మాష మండూకాఖ్య మయూరహంస శుక సవర్ణంబులైన హయంబులం బర్వత నిభంబులైన యిభంబులం గొని, (హేమకూట నిషధాచలంబులు గడచి గంధర్వనగరంబులు గెలిచి, శత సహస్ర యోజనాయతం బయి శుద్ధ సువర్ణమయం బయి తేజోరాశి యయిన మేరు మహీధరంబు నాలోకించి, జంబూ మహావృక్షంబును జంబూ మహానదియునుం జూచి, తత్తీరంబున మేరువునకుం బ్రదక్షిణంబుగాఁజని, గంధమాదన పర్వతం బతిక్రమించి, తద్దిశాధిపతులైన సిద్ధ విద్యాధర చారణ గంధర్వులచేత నానా విచిత్రవస్తు వాహనంబులు గొని మాల్యవన్నీల పర్వతంబులు గడచి) యుత్తర కురుదేశములకుం జని హరివాసం బను పురంబుపై విడిసిన.