Andhra Mahabharatamu 5.1.201
Āndhra Mahābhāratamu 5.1.201
- Language
- Telugu
5.1.201
వ. అనిన విని యమ్మునీంద్రుం డిట్లనియె; ‘నన్నహుషుని మోచి వేసరుచున్న మును లతనికడ గోష్ఠీ వినోదంబుల నుండి ‘బ్రాహ్మణంబు లయిన మంత్రంబులు గోసంప్రోక్షణంబునందుఁ జెప్పంబడియుండు; నవి నీకుఁ బ్రమాణ భూతంబు లగునే?’ యని యడిగినం, బాపనిశ్చయుండై యతం’ డమ్మంత్రంబులు ప్రమాణంబులు గా’వనిన నే నమ్మాట నిషేధించి, ‘పూర్వాచార్యులచేత నభినందితంబులగు మంత్రంబులు నిందించుట యజ్ఞానం’బని వివాదంబు సేసితి; నతండు కోపించి మదీయ మస్తకంబు దన్నె; నతనిం గనుంగొని, పుణ్యహీనుండును, దేజోహాని దీనుండును నగుట యుపలక్షించి, ‘నీవు పూజనీయులయిన మహామునుల నిన్ను వహింపం బనిచితి; వారలు గొనియాడు మంత్రంబులు గర్హించి; తదియునుంగాక నన్ను నవమానించితి; గావున నింద్రపద భ్రష్టుండవై బహుసంవత్సరంబులు భూలోకంబున నురగరూపంబున నుండు’ మని శాపం బిచ్చి, పదంపడి యనుగ్రహించి, ‘భవదీయవంశజాతుండయి యజాతశత్రుం డను పెంపుగలిగి యుధిష్ఠిరనామధేయుండైన యొక్క సత్పురుషుని సందర్శనంబున దురితంబులఁ బాసి పుణ్యలోకంబు వడయువాఁడ’ వనినఁ, దత్క్షణంబ.