Andhra Mahabharatamu 5.1.225
Āndhra Mahābhāratamu 5.1.225
- Language
- Telugu
5.1.225
వ. ఇవ్విధంబునం గూడి పెరిఁగి యుధిష్ఠిరు సైన్యంబు గయ్యంబునకుం గాలు ద్రవ్వుచునుండె; నంత నక్కడం గిరాతకాంచన సైన్యనిచయంబులం గూర్చికొని, సమరంబునకు నమరి యొక్క యక్షౌహిణి గల భగదత్తుండు సుయోధనుం గలిసె; భూరిపరాక్రముండయిన భూరిశ్రవుండును, మహాబలుండయిన శల్యుండును నేకాక్షౌహిణీ సమేతంబుగా నేతెంచిరి; వారలయట్ల సన్నద్ధుఁడై కాంభోజనాథుండైన సుదక్షిణుండును యవనేశ్వరుండును వచ్చె; నత్తెఱంగున సమకట్టి జయద్రథ ప్రముఖులైన సింధు సౌవీర నరపతు లరుగుదెంచిరి; మాహిష్మతీ పతి యగు నీలుండు, యాదవవీరుం డగు కృతవర్మయు, నవంతీశ్వరులు సోదరులు నగు విందానువిందు లిరువురునుంగా నిన్నలువురు నొక్కొక్క యక్షౌహిణితోడఁ జనుదెంచిరి; మఱియునుం బలుదెసల నుండి వచ్చి కూడిన వాహినులు మూఁ డక్షౌహిణులకుం గలిగె; ధార్తరాష్ట్రులకుఁ దోడు పడం బూనినయవి పదునొకం డక్షౌహిణు లయ్యె; నట్టియెడ.