Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.4.210

Āndhra Mahābhāratamu 5.4.210

Language
Telugu

5.4.210

వ. అది యట్లుండె; నీవు వేగపోయి రేపకడయ మీ రాజుం గలనికి నడపింపు’మనియె; నప్పుడు ధర్మనందనుం డులూకునకుం దాంబూలాభరణంబు లిచ్చి వీడుకొలిపి, ధృష్టద్యుమ్ను నవలోకించి ‘యెల్లి కయ్యంబని మన సైన్యంబులకెఱింగించి సర్వసమరసన్నాహంబులు సమకట్టు’మని పనిచి కొలువు విరిసి చనియె; ధృష్టద్యుమ్నుండును ద్రోణులం దొడరం బడసితినని యుబ్బుచు వెడలి, భీష్ముం దలపడఁగంటి నని పొంగు శిఖండి తోడుగా రాజు శాసనంబు నిర్వర్తించె; నిట యులూకుండు వచ్చి దుర్యోధనుం బేరోలగంబునం గని యతనికిఁ గృష్ణార్జునుల పలుకు లున్న రూపు విన్నవించిన, నతండు కర్ణుదెసఁ గనుంగొని ‘సమస్త సేనలకు రేపు బవరం బని చెప్పి పుచ్చుము; సకల సాధనంబులు నాయితంబులు సేయు’ మని పనిచిన నతండు నట్లచేసె; నిట్లు భయకటకంబులు రణంబునకు నుత్సహించి విజృంభించి యుల్లసిల్లె’ ననిన ధృతరాష్ట్రుండు సంజయున కిట్లనియె: