Andhra Mahabharatamu 5.4.360
Āndhra Mahābhāratamu 5.4.360
- Language
- Telugu
5.4.360
వ. అని చెప్పి యతని కడకుం దారును నారదమునీశ్వరుండును జమదగ్ని ప్రముఖులును భాగీరథియును జని ‘నీ శిష్యుండు దేవవ్రతుండు; వాని యెడ నలుగం దగునె? వాఁడు తగవు మాలిన పనిఁ జేయంజాలక పెనంగె; నింతియకాని విరోధి గాఁడు; వానిం గరుణింపు’ మని తెలిపి, నన్నుం బిలిచినం బోయి యే నమ్మహాత్మునకు సాష్టాంగదండ ప్రణామంబు సేసిన నతండు దీవనతో గ్రుచ్చి యెత్తి కౌఁగిలించికొని ‘గాంగేయా! నీశక్తికి భక్తికిం బ్రీతుండనైతి’ నని సస్నేహంబుగా సంభావించి, యంబ నవలోకించి; నన్ను భీష్ముండు గెలిచె ‘నా వలన నయ్యెడుపని యింతియ; నీవింక నీకుం జూడం బోలిన గతిం బొమ్మ’నిన నమ్మానిని’ ‘దేవా యిది యిట్టిద; నీ యోపినంతయుం జేసితి; నీ చేతం బోకున్న నేమి సేయుదు? నేను దపంబు పెంపున భీష్ముని వధించెద జన్మాంతరంబున నైననుం జలంబు సాధ్యంబు చేయుదు; నటు సూడు’ మని పలికిపోయెఁ; దదనంతరంబ యమ్మునిజన పితృదేవతా సమూహంబును భృగు నందను నన్ను నామంత్రణంబు చేసి యంతర్ధానంబు సేసె; భార్గవుండును నన్నువీడ్కొలిపి మున్ను దనతో వచ్చిన తపోధనవర్గముం దానును మహేంద్ర శైలంబునకుం జనియె; నేను మగిడి యెడనెడ నుర్వీసురుల యాశీర్వాదంబులు సంభావన వచనంబులుఁ బ్రస్తుతి వాక్యంబులుఁ గర్ణంబుల కింపుసేయ నిటవచ్చి సత్యవతికి నమస్కారపూర్వకంబుగా నంతయు నెఱింగించిన నద్దేవి యభినందించె.