Andhra Mahabharatamu 1.3.24
Āndhra Mahābhāratamu 1.3.24
- Language
- Telugu
1.3.24
వ. ‘నీవర్ణధర్మప్రతిపాలనంబునకుఁ దపంబునకు మెచ్చితి; నీవు నాతోడం జెలిమిసేసి నాయొద్దకువచ్చుచుంబోవుచు మహీరాజ్యంబు సేయుచు నుండు’ మని వానికి దేవత్వంబును గనకరత్నమయం బైన దివ్యవిమానంబును నెద్దాని నేని తాల్చిన నాయుధంబులు దాఁక నోడు నట్టి వాడని వనజంబులు గలిగిన యింద్రమాల యను కమలమాలికయును, దుష్టనిగ్రహశిష్టపరిపాలనక్షమం బైన యొక్కవేణుయష్టియు నిచ్చిన, నవ్వసువును దద్విమానారూఢుం డై యుపరిలోకంబునం జరించుటంజేసి యుపరిచరుండు నాఁ బరఁగి, యక్కమల మాలికయుఁ దనకుం జిహ్నంబుగా నవ్వేణుయష్టికి మహావిభవంబు సేయుచు, మెఱసి యేఁటేఁట నింద్రోత్సవం బను నుత్సవంబు సేయుచు నీశ్వరునకు నింద్రాదిదేవతలకు నతిప్రీతి సేసె; నది మొదలుగా రాజులెల్లం బ్రతిసంవత్సరంబు నింద్రోత్సవంబు సేయుచుండుదురు.