Andhra Mahabharatamu 1.3: ఆదిపర్వము — తృతీయాశ్వాసము
Āndhra Mahābhāratamu 1.3
- Language
- Telugu
ఆదిపర్వము — తృతీయాశ్వాసము
1.3.1
క. శ్రీమచ్చళుక్య వంశశి | ఖామణి! మనుమార్గ! రాజకంఠీరవ! ధై
ర్యామరధరణీధర! ధర | ణీమండన! ధర్మనిరత! నిత్యాభ్యుదయా!
1.3.2
వ. అక్కథకుండు శౌనకాదిమహామునులకుం జెప్పె: నట్లు జనమేజయుం డుపసంహృతసర్పసత్త్రుం డయి యథావిధి సంపూర్ణదక్షిణల ఋత్విజులను, సదస్యులనుం బూజించి, దీనానాథజనంబులకుఁ గోరినధనంబు లిచ్చి, యనేకపురాణపుణ్యకథాశ్రవణకుతూహలపరుం డగుచు విద్వజ్జనగోష్ఠి నుండి యొక్కనాఁడు.
1.3.3
మ. పరమబ్రహ్మనిధిం, బరాశరసుతున్, బ్రహ్మర్షిముఖ్యున్, దయా
పరుఁ, గౌరవ్యపితామహున్, జనహితప్రారంభుఁ, గృష్ణాజినాం
బరు, నీలాంబుదవర్ణదేహు, ననురూపప్రాంశు, నుద్యద్దివా
కర రుక్పింగజటాకలాపు, గతరాగద్వేషు, నిర్మత్సరున్.
1.3.4
వ. వైశంపాయన ప్రభృతి శిష్యవర్గంబులతో ననేకమునిగణపరివృతుం డయి, కనకమణిమయోచ్చాసనంబున నున్న వ్యాసభట్టారకు నతిభక్తి నర్ఘ్యపాద్యాదివిధులం బూజించి, వినయవినమితశిరస్కుం డై నమస్కరించి జనమేజయుం డి ట్లనియె.
1.3.5
సీ. ప్రీతితో మీరును భీష్మాదికురువృద్ధ | రాజులు నుండి భూరాజ్యవిభవ
మెల్ల విభాగించి యిచ్చినం, దమతమ | వృత్తుల నుండక, వీఁగి పాండు
ధృతరాష్ట్రనందనుల్ ధృతి చెడి, వా రేమి | కారణంబునఁ బ్రజాక్షయము గాఁగ
భారతయుద్ధ మపారపరాక్రముల్ | చేసిరి? మీపంపు సేయ రైరి?
ఆ. యెఱిఁగి యెఱిఁగి వారి నేల వారింపర; | యిట్టి గోత్రకలహ మేల పుట్టె?
దీని కలతెఱంగు దెలియంగ నానతి | యిండు నాకు సన్మునీంద్రవంద్య!
1.3.6
వ. అని యిట్లు పాండవధార్తరాష్ట్రవిభేదనకథాశ్రవణకుతూహలపరుం డయి యడిగిన జనమేజయునకుం గరుణించి, కృష్ణ్ణద్వైపాయనుండు వైశంపాయనమునింజూచి ‘శ్రీమహాభారతకథాఖ్యానంబాద్యంతంబితనికి సవిస్తరంబుగాఁ జెప్పు’ మని పంచిచనిన.
1.3.7
క. జనమేజయుండు విద్వ | జ్జనపరివృతుఁ డై సమస్తజనపాలసభా
జనయోగ్యుని వైశంపా | యనమునిఁ బూజించె వినతుఁ డై వినువేడ్కన్.
1.3.8
వ. ఆ వైశంపాయనుండును నఖిలభువనవంద్యుం డయిన కృష్ణద్వైపాయనమునీంద్రునకు నమస్కారంబు సేసి, విద్వజ్జనంబుల యనుగ్రహంబు వడసి.
1.3.9
సీ. కమనీయధర్మార్థకామమోక్షములకు | నత్యంతసాధనం బయినదాని,
వేడ్కతోఁ దవిలి తన్ వినుచున్నవారల | కభిమతశుభకరం బయినదాని,
రాజుల కఖిలభూరాజ్యాభివృద్ధిని | త్యాభ్యుదయప్రదం బయినదాని,
వాఙ్మనఃకాయప్రవర్తితానేకజ | న్మాఘనిబర్హణం బయినదాని,
ఆ. సత్యవాక్ప్రబంధశతసహస్రశ్లోక | సంఖ్య మయినదాని, సర్వలోక
పూజ్య మయినదాని, బుధనుతవ్యాసమ | హామునిప్రణీత మయినదాని.
1.3.10
చ. వినుతపరాక్రముల్, ధృతివివేకులు, సత్యసమన్వితుల్, యశో
ధనులు, కృతజ్ఞు, లుత్తములు, ధర్మపరుల్, శరణాగతానుకం
పను లనఁగాఁ బ్రసిద్ధు లగు భారతవీరుల సద్గుణానుకీ
ర్తనముల నొప్పుదాని, విదితం బగుదాని సభాంతరంబులన్.
1.3.11
శా. ఆయుష్యం, బితిహాసవస్తుసముదాయం, బైహికాముష్మిక
శ్రేయః ప్రాప్తినిమిత్త, ముత్తమసభాసేవ్యంబు, లోకాగమ
న్యాయైకాంతగృహంబునాఁ బరఁగి, నానావేదవేదాంతవి
ద్యాయుక్తం బగుదానిఁ జెప్పఁ దొడఁగెం దద్భారతాఖ్యానమున్.
1.3.12
సీ. పాండుకుమారులు పాండుభూపతిపరో | క్షంబున హస్తిపురంబునందు
ధృతరాష్ట్రునొద్దఁ దత్సుతులతో నొక్కటఁ | బెరుఁగుచు, భూసురవరులవలన
వేదంబులును ధనుర్వేదాదివిద్యలుఁ | గఱచుచుఁ గడలేనియెఱుకఁ దనరు
చున్నఁ, దద్విపుల గుణోన్నతి సైఁపక | దుర్యోధనుండు దుష్కార్య మెత్తి.
ఆ. దుర్ణయమున శకునికర్ణదుశ్శాసనుల్ | గఱపఁ బాండవులకు నఱయ చేయఁ
గడఁగెఁ; బాండవులును గడుధార్మికులు గానఁ | బొరయ రైరి వారిదురితవిధుల.
1.3.13
వ. అది యెట్లనిన: నొక్కనాఁడు జలక్రీడాపరిశ్రమవిచేష్టితుం డయి ప్రమాణకోటిస్థలంబున నిద్రితుం డైన భీమసేను నతిఘనలతాపాశబద్ధుం జేసి గంగమడువునం ద్రోచిన, నాతం డనంతసత్త్వుండు గావునఁ దద్బంధంబు లెల్లఁ దెగ నీల్గి మీఁదికి నెగసె; మఱియొక్కనాఁ డతివ్యాయామఖేదంబున సుప్తుం డైన వానిసర్వాంగంబుల యందుఁ గృష్ణసర్పంబులం బట్టి కఱపించిన, నాతండు వజ్రమయదేహుండు గావునఁ దద్విషదంష్ట్రలు నాఁటవయ్యె; మఱియు నొక్కనాఁడు భోజన సమయంబున వానికి విషంబు వెట్టిన, నతండు దివ్యపురుషుండు గావునఁ దద్విషం బన్నంబుతోడన జీర్ణం బయ్యె; మఱియు వారల కెల్ల నపాయంబు సేయసమకట్టి.
1.3.14
సీ. వదలక కురుపతి వారణావతమున | లక్కయిల్ గావించి, యక్కజముగ
నందఱఁ జొన్పి, యం దనలంబు దరికొల్పఁ | బనిచినఁ, బాండునందను లెఱింగి
విదురోపదిష్టభూవివరంబునం దప | క్రాంతు లై బ్రదికి నిశ్చింతు లయిరి;
ధర్మువు నుచితంబుఁ దప్పనివారల, | సదమలాచారుల నుదిత సత్య
ఆ. రతుల నఖిలలోకహితమహారంభుల, | భూరిగుణుల, నిర్జితారివర్గు
లై వెలుంగువారి దైవంబ రక్షించు | దురితవిధుల నెపుడుఁ బొరయకుండ.
1.3.15
వ. ఇట్లు దుర్యోధనుచేయు నపాయంబులవలనం బాయుచుఁబాండవులు లాక్షాగృహదాహంబువలన నక్షయు లై జననీసహితంబుగా వనంబులకుం జనిన, నందు భీమసేనుండు హిడింబాసురుం జంపి, వాని చెలియలి హిడింబను వివాహం బై, యేకచక్రపురంబున కేఁగి, యందు బకాసురుం జంపి విప్రులం గాచె; మఱి. యందఱు విప్రవేషంబున ద్రుపదుపురంబునకుం జని, యందు ద్రౌపదీస్వయంవరంబున మత్స్యయంత్రం బర్జునుం డశ్రమంబున నురుల నేసి, సకలరాజలోకంబు నొడిచి, ద్రోవదింజేకొనిన, దాని నేవురు గురువచనంబున వివాహం బై ద్రుపదుపురంబున నొక్కసంవత్సరం బున్న నెఱింగి ధృతరాష్ట్రుండు వారి రావించి, వారల కర్ధరాజ్యంబిచ్చి, యింద్రప్రస్థపురంబున నుండం బనిచిన, నందుఁ బాండవులు రాజ్యంబు సేయుచున్నంత.
1.3.16
క. ద్వారవతి కేఁగి, యర్జునుఁ | డారంగ సుభద్రఁ బెండ్లి యై వచ్చి, మహా
వీరు నభిమన్యుఁ గులవి | స్తారకు సత్పుత్త్రు నతిముదంబునఁ బడసెన్.
1.3.17
వ. మఱియు నగ్నిదేవుచేత దివ్యరథంబును దివ్యాశ్వంబులును గాండీవదేవదత్తంబులును నక్షయబాణ తూణీరంబులుం బడసి, సురగణంబులతో సురపతి నోర్చి, ఖాండవదహనంబున నగ్నిదేవునిం దనిపె; మఱి మయువలన సభాప్రాప్తుం డై, భీమునిచేత జరాసంధుం జంపించి, దిగ్విజయంబు సేసి సార్వభౌముం డై ధర్మరాజు రాజసూయమహాయజ్ఞంబుఁ గావించె; నివి మొదలుగాఁ గల పాండవులగుణసంపదలు చూచి సహింప నోపక దుర్యోధనుండు శకునికైతవంబున మాయాద్యూతంబున ధర్మరాజుం బరాజితుం జేసి, పండ్రెండేఁడులు వనవాసంబును, నొక్కయేఁడు జనపదంబున నజ్ఞాతవాసంబునుగా సమయంబు సేసి భూమి వెలువరించినం, జని పాండవులు వనవాసంబున నున్నంత.
1.3.18
చ. పరమగురూపదేశమునఁ బార్థుఁడు పార్థివవంశశేఖరుం
డరిది తపంబునన్, భుజబలాతిశయంబున నీశుఁ బన్నగా
భరణుఁ బ్రసన్నుఁ జేసి, దయఁ బాశుపతాదిక దివ్యబాణముల్
హరసురరాజదేవనివహంబులచేఁ బడసెం బ్రియంబునన్.
1.3.19
అక్కర. వనమునఁ బదియు రెండేఁడు లజ్ఞాతవాస మొక్కేఁడు
జనపదంబున నుండి, తపన నయ్యేండ్లు సలిపి, సద్వృత్తు
లనఘులు మును వేఁడి, కొనక మఱి భారతాజి సేయంగ
మొనసిరి, పాండవ కౌరవుల భేదమూల మిట్టిదియ.
1.3.20
వ. ఇట్టి భరతకులముఖ్యులవంశచరితానుకీర్తనంబునం జేసి యిక్కథ శ్రీమహాభారతంబునాఁ బరఁగె.
1.3.21
శా. ఆ నారాయణపాండవేయగుణమాహాత్మ్యామలజ్యోత్స్నఁ జి
త్తానందం బొనరించుచున్, జనుల కర్థాంశుప్రకాశంబుతో
మానై, సాత్యవతేయధీవనధి జన్మ శ్రీమహాభారతా
ఖ్యానాఖ్యామృతసూతి యొప్పు నిఖిలాఘధ్వాంతవిధ్వంసి యై.
1.3.22
వ. ఇట్టి శ్రీమహాభారతంబునకుం గర్త యయిన శ్రీవేదవ్యాసునిజన్మంబు సవిస్తరంబుగాఁ జెప్పెద వినుము.
1.3.23
సీ. వాసవప్రతిముండు వసు వను నాతండు | చేదిభూనాథుండు శిష్టలోక
నుతకీర్తి మృగయావినోదార్థ మడవికిఁ | జని, యొక్కమునిజనాశ్రమమునందు
నిర్వేదమున మహానిష్ఠతో సన్న్యస్త | శస్త్రుఁ డై తప మొప్పఁ జలుపుచున్న
నాతనిపాలికి నమరగణంబుతో | నింద్రుండు వచ్చి తా నిట్టు లనియె:
ఆ. ‘ధరణిఁ బ్రజఁ గరంబు దయతోడ వర్ణధ | ర్మాభిరక్షఁ జేసి యమలచరిత
నేలి, రాజ్యవిభవ మది యేల యని తప | శ్చరణ నునికి నీక చనియె ననఘ!’
1.3.24
వ. ‘నీవర్ణధర్మప్రతిపాలనంబునకుఁ దపంబునకు మెచ్చితి; నీవు నాతోడం జెలిమిసేసి నాయొద్దకువచ్చుచుంబోవుచు మహీరాజ్యంబు సేయుచు నుండు’ మని వానికి దేవత్వంబును గనకరత్నమయం బైన దివ్యవిమానంబును నెద్దాని నేని తాల్చిన నాయుధంబులు దాఁక నోడు నట్టి వాడని వనజంబులు గలిగిన యింద్రమాల యను కమలమాలికయును, దుష్టనిగ్రహశిష్టపరిపాలనక్షమం బైన యొక్కవేణుయష్టియు నిచ్చిన, నవ్వసువును దద్విమానారూఢుం డై యుపరిలోకంబునం జరించుటంజేసి యుపరిచరుండు నాఁ బరఁగి, యక్కమల మాలికయుఁ దనకుం జిహ్నంబుగా నవ్వేణుయష్టికి మహావిభవంబు సేయుచు, మెఱసి యేఁటేఁట నింద్రోత్సవం బను నుత్సవంబు సేయుచు నీశ్వరునకు నింద్రాదిదేవతలకు నతిప్రీతి సేసె; నది మొదలుగా రాజులెల్లం బ్రతిసంవత్సరంబు నింద్రోత్సవంబు సేయుచుండుదురు.
1.3.25
క. ఘనముగ నయ్యింద్రోత్సవ | మొనరించు మహీపతులకు నొగి నాయుర్వ
ర్ధనము నగుఁ, బెరుఁగు సంతతి, | యనవరతము ధరణిఁ బ్రజకు నభివృద్ధి యగున్.
1.3.26
వ. అట్టియింద్రోత్సవంబున నతిప్రీతుండయిన యింద్రువరంబున నుపరిచరుండు బృహద్రథ మణివాహన సౌబల యదురాజన్యు లనియెడి కొడుకుల నేవురం బడసి, వారలం బెక్కుదేశంబుల కభిషిక్తులం జేసిన, నయ్యేవురువాసవులు వేఱువేఱ వంశకరు లయి పరఁగి; ర ట్లుపరిచరుండు లబ్ధసంతానుం డయి రాజర్షి యయి రాజ్యంబు సేయుచు, నిజపురసమీపంబునం బాఱిన శుక్తిమతి యను మహానదిం గోలాహలం బనుపర్వతంబు గామించి యడ్డంబు వడిన, దానిం దనపాదంబునం జేసి తలఁగంద్రోచిన, నన్నదికిఁ బర్వతసమాగమంబున వసుపదుం డను కొడుకును గిరిక యను కూఁతురుం బుట్టిన, నయ్యిరువురను శుక్తిమతి దద్దయు భక్తిమతి యై గిరినిరోధంబు బాచి యుపకారంబు సేసిన యుపరిచరునకు మెచ్చి కానిక యిచ్చిన, నాతండు వసుపదుం దనకు సేనాపతిం జేసికొని, గిరికం దనక ధర్మపత్నిగాఁ జేసికొని యున్నంత, నగ్గిరిక ఋతుమతి యయిన, దీనికి మృగమాంసంబు దెచ్చి పెట్టు మని తనపితృదేవతలు పంచిన, నప్పు డయ్యుపరిచరుండు మృగవధార్థంబు వనంబున కరిగి.
1.3.27
సీ. పలుకులముద్ద్దును, గలికిక్రాల్గన్నుల | తెలివును, వలుఁదచన్నులబెడంగు,
నలఘుకాంచీపదస్థలములయొప్పును | లలితాననేందుమండలము రుచియు,
నళినీలకుటిలకుంతలములకాంతియు, | నెలజవ్వనంబున విలసనమును,
నలసభావంబునఁ బొలుపును, మెలుపును | గలుగు నగ్గిరికను దలఁచి తలఁచి,
ఆ. ముదితయందుఁ దనదు హృదయంబు నిలుపుటఁ | జేసి రాగ మడర భాసురముగ
రమణతో వనాంతరమున రేతస్స్కంద | మయ్యె నవనిపతికి నెయ్య మొనర.
1.3.28
వ. అయ్యమోఘవీర్యం బొక్కయజీర్ణపర్ణపుటంబున నిమ్ముగా సంగ్రహించి యొక్కడేగయఱుతంగట్టి దీనిం గొనిపోయి గిరికకిమ్మని యుపరిచరుండు పనిచిన, నదియు నతిత్వరితగతి నాకానం గడచి యాకాశంబునం బఱచునప్పుడు.
1.3.29
క. ఆమిష మని దానిం గొనఁ | గా మది సమకట్టి, యొక్కఖగ మాఖగమున్
వ్యోమమునఁ దాఁక, దివిసం | గ్రామం బారెంటి కయ్యెఁ గడురభసమునన్.
1.3.30
క. సునిశితతుండహతిని వ్ర | స్సినపర్ణపుటంబు వాసి చెదరుచు నృపనం
దనువీర్యము యమునానది | వనమధ్యమునందు వాయువశమునఁ బడియెన్.
1.3.31
వ. తొల్లి బ్రహ్మశాపనిమిత్తంబున నద్రిక యను నప్సరస యమునయందు మీ నయి క్రుమ్మరుచున్నయది యవ్వసువీర్యబిందుద్వయంబు త్రావి గర్భంబు దాల్చిన దశమమాసంబునందు.
1.3.32
తే. తెరలవల వైచి జాలరుల్ దిగిచి, దాని | యుదరదళనంబు సేసి, యం దొక్కకొడుకు
నొక్కకూఁతును గని, వారి నొనరఁ దెచ్చి | దాశరాజున కిచ్చిరి తత్క్షణంబ.
1.3.33
వ. అయ్యద్రికయు మానుషప్రసవం బొనరించినం దనకు శాపమోక్షణం బగు నని బ్రహ్మవచనంబు గలుగుటంజేసి మీనయోని విడిచి, దివ్యవనిత యయి దేవలోకంబునకుం జనియె; మఱియును మత్స్యోదరంబునఁ బుట్టిన యక్కొడుకు మత్స్యరాజునాఁ బరఁగి, ధర్మపరుం డయి మత్స్యదేశంబున కధిపతి యయ్యె; నక్కూఁతును దాశరాజు దనకూఁతుంగాఁ జేకొని పెంచినం బెరుఁగుచు.
1.3.34
క. అంబుజముఖి యక్కన్య ప్రి | యం బొనరఁగ మత్స్యగంది యనఁగా ధర్మా
ర్థంబుగఁ దనతండ్రి నియో | గంబున నయ్యమున నోడఁ గడపుచు నుండెన్.
1.3.35
వ. అంత.
1.3.36
చ. గతమదమత్సరుండు, త్రిజగద్వినుతుండు, వసిష్ఠపౌత్త్రుఁ డు
న్నతమతి, శక్తిపుత్త్రుఁ, డఘనాశనఘోరతపోధనుండు, సు
వ్రతుఁ డయి తీర్థయాత్ర చనువాఁడు, పరాశరుఁ డన్మునీంద్రుఁ డ
య్యతివఁ దలోదరిం గనియె నయ్యమునానది యోడరేవునన్.
1.3.37
వ. ఇ ట్లేకతంబ యేకవస్త్ర యై యోడ నెక్కవచ్చువారి నిరీక్షించుచున్న సత్యవతిం జూచి యా మునివరుండు దానియందు మదనపరవశుం డై దానిజన్మంబు దన దివ్యజ్ఞానంబున నెఱింగి, యయ్యోడ యెక్కి దానితో నొక్కటఁ జని చని.
1.3.38
సీ. చపలాక్షిచూపులచాడ్పున కెడ మెచ్చుఁ, | జిక్కనిచనుఁగవఁ జీఱఁ గోరు,
నన్నువకౌఁదీగ యందంబు మది నిల్పు, | జఘనచక్రంబుపైఁ జలుపు దృష్టి,
యభిలాష మేర్పడు నట్లుండఁగాఁ బల్కు, | వేడ్కతో మఱుమాట వినఁగఁ దివురు,
నతిఘనలజ్జావనత యగు నక్కన్య | పైఁ బడి లజ్జయుఁ బాపఁ గడఁగు
ఆ. నెంతశాంతు లయ్యు, నెంత జితేంద్రియు | లయ్యు, గడువివిక్త మయినచోట
సతులగోష్ఠిఁ జిత్తచలన మొందుదు; రెందుఁ | గాముశక్తి నోర్వఁగలరె జనులు.
1.3.39
వ. ఇట్లు విగతలజ్జాపరవశుం డయి మునివరుండు దనయభిప్రాయం బక్కన్యక కెఱింగించిన, నదియును దీని కొడంబడనినాఁడు నా కలిగి యిమ్ముని శాపం బిచ్చునో యని వెఱచి యి ట్లనియె.
1.3.40
తరలము. తనువు మీన్పొలవల్చు జాలరిదాన, నట్లును గాక యే
ననఘ! కన్యకఁ, గన్యకావ్రత మంతరించిన నెట్లు మ
జ్జనకునింటికిఁ బోవ నేర్తుఁ? బ్రసాదబుద్ధి యొనర్పు స
న్మునిగణోత్తమ! నాకు దోషవిముక్తి యె ట్లగు నట్లుగాన్.
1.3.41
వ. అనిన నమ్మునివరుండు గరంబు సంతోషించి ‘నాకు నిష్టంబు సేసినదాన నీకన్యాత్వంబు దూషితంబు గా, దోడకు’ మని దానికి వరం బిచ్చి, నీవు వసు వనురాజర్షివీర్యంబునం బుట్టినదానవు గాని సూతకులప్రసూతవు కా వని చెప్పి, దానిశరీరసౌగంధ్యంబు యోజనంబునం గోలె జనులకు నేర్పడునట్లుగాఁ బ్రసాదించిన, నది గంధవతి యనియు, యోజనగంధి యనియుఁబరఁగి, తత్ప్రసాదంబున ననేక దివ్యాంబరాభరణభూషితయు నయి యమునానదీద్వీపంబున నోడ చేర్చి.
1.3.42
తే. ‘ఎల్లవారును జూడంగ నిట్టిబయల | నెట్లు సంగమ మగు’ నని యింతి యన్న
నమ్మునీంద్రుండు గావించె నప్పు డఖిల | దృష్టిపథరోధినీహారతిమిర మంత.
1.3.43
క. పరమేష్ఠికల్పుఁ డగు న | ప్పరాశరుసమాగమమునఁ బరమగుణైకా
భరణకు ననవద్యమనో | హరమూర్తికి సత్యవతికి నమ్మునిశక్తిన్.
1.3.44
క. సద్యోగర్భంబున నహి | మద్యుతితేజుండు వేదమయుఁ డఖిలమునీం
ద్రాద్యుఁడు వేదవ్యాసుం | డుద్యద్జ్ఞానంబుతోడ నుదితుం డయ్యెన్.
1.3.45
క. ఆ యమునాద్వీపమున న | మేయుఁడు కృష్ణుఁడయి లీలమెయిఁ గృష్ణద్వై
పాయనుఁ డనఁ బరఁగి వచ | శ్రీయ్శుతుఁడు తపంబువలనఁ జిత్తము నిలిపెన్.
1.3.46
వ. పరాశరుండు సత్యవతి గోరిన వరంబు లిచ్చి నిజేచ్ఛ నరిగె; నంతఁ గృష్ణద్వైపాయనుండును గృష్ణాజిన పరిధాన కపిలజటామండల దండకమండలు మండితుం డై తల్లిముందట నిలిచి కరకమలంబులు మొగిచి మ్రొక్కి ‘మీకుం బనిగలయప్పుడ నన్నుం దలంచునది; యాక్షణంబ వత్తు’ నని సకలలోకపావనుం డఖిలలోక హితార్థంబుగాఁ దపోవనంబునకుం జని, యందు మహాఘోరతపంబు సేయుచు.
1.3.47
ఉ. సంచిత పుణ్యుఁ డంబురుహసంభవునంశము దాల్చి పుట్టి లో
కాంచితుఁ డైనవాఁడు నిఖిలాగమపుంజము నేర్పడన్ విభా
గించి జగంబులందు వెలిఁగించి సమస్తజగద్ధితంబుగాఁ
బంచమవేద మై పరఁగు భారతసంహితఁ జేసె నున్నతిన్.
1.3.48
వ. ‘మఱియు దేవదైత్య దానవ ముని యక్ష పక్షిగంధర్వాదుల యంశావతారంబులు దాల్చి భీష్మాది మహావీరులు భారత యుద్ధంబు సేయ ననేకులు పుట్టిరి. వారల కొలంది యెఱింగి చెప్ప ననేకకాలం బనేకసహస్ర ముఖంబులవారి కైన నలవిగా’ దనిన విని జనమేజయుండు వైశంపాయనున కి ట్లనియె.
1.3.49
క. ‘అమరాసుర ముఖ్యుల యం | శములను మహిఁ బుట్టి ‘సకలజనపాలక సం
ఘములకు భారతరణరం | గమునను లయ మొంద నేమి కారణ?’ మనినన్.
1.3.50
వ. జనమేజయునకు వైశంపాయనుం డి ట్లనియె.
1.3.51
సీ. పరశురాముండు భీకర నిజకోపాగ్ని | నుగ్రుఁ డై యిరువదియొక్కమాఱు
ధాత్రీతలం బపక్షత్త్రంబు సేసినఁ, | దత్క్షత్త్రసతులు సంతానకాంక్ష
వెలయంగ ఋతుకాలముల మహావిప్రుల | దయఁ జేసి ధర్మువు దప్పకుండఁ
బడసిరి పలువురఁ గొడుకులఁ గూఁతుల, | నిప్పాటఁ దత్క్షత్త్ర మెసఁగి యుర్విఁ
ఆ. బర్వి రాజధర్మపద్ధతి ననఘమై, | జారచోర దుష్టజనుల బాధఁ
బొరయకుండ నిఖిల భూప్రజాపాలనఁ | జేయుచుండె శిష్టసేవ్య మగుచు.
1.3.52
వ. ఇట్లు బ్రాహ్మణ వీర్య ప్రభవు లయిన క్షత్త్రియులు ధర్మమార్గంబునం బ్రజాభిరక్షణంబు సేయుటంజేసి వర్ణాశ్రమ ధర్మస్థితులు దప్పక ప్రవర్తిల్లుటయు, బ్రహ్మక్షత్త్రంబుల కాయుర్వర్ధనంబును, ననవరతయాగతర్పిత పర్జన్య ప్రసాదంబునం గోరినయప్పుడు వానలు గురియుచు సకల సస్యసమృద్ధియుఁ, బ్రజావృద్ధియు నైన భూదేవి ప్రజాభారపీడిత యై సురాసుర మునిగణ పరివృతు లై యున్న హరి హర హిరణ్యగర్భుల కడకుం జని యి ట్లనియె.
1.3.53
క. ‘భూరి ప్రజా నిరంతర | భారము దాల్చు టిది కరము భారము; దయతో
మీరీభారమునకుఁ బ్రతి | కారము గావించి నన్నుఁ గావుం’ డనినన్.
1.3.54
క. వనజాసను ననుమతమున | వనరుహనాభుండు వాసవప్రముఖసుప
ర్వనికాయాంశంబులతోఁ | దనరఁగఁ బుట్టించె నుర్విఁ దనయంశమ్మున్.
1.3.55
క. దితిసుత దానవ యక్ష | ప్రతతుల యంశములఁ బుట్టి ప్రజలకు విహితా
హితు లగుచుండి రనేకులు | జితకాశులు ధరణిపతులు శిశుపాలాదుల్.
1.3.56
చ. అతులబలాఢ్యు లైన యమరాంశ సముద్భవు లెల్లఁ బాండుభూ
పతిసుతపక్ష మై, సురవిపక్ష గణాంశజు లెల్ల దుర్మదో
ద్ధత కురురాజ పక్షమయి, ధారుణిభారము వాయ ఘోరభా
రతరణభూమి నీల్గిరి పరస్పరయుద్ధము సేసి వీరు లై.
1.3.57
వ. అనిన విని జనమేజయుండు వైశంపాయనున కి ట్లనియె.
1.3.58
క. ఆదిత్య దైత్య దానవు | లాదిగఁ గల భూతరాశి దగు సంభవమున్
మేదినిఁ దదంశముల మ | ర్త్యోదయములు నాకుఁ జెప్పు మొగి నేర్పడఁగన్.
1.3.59
వ. అనిన విని జనమేజయునకు వైశంపాయనుం డి ట్లని చెప్పెఁ; దొల్లి సకలజగదుత్పత్తినిమిత్తభూతుం డైన బ్రహ్మకు మానసపుత్త్రు లైన మరీచియు, నంగిరసుండును, నత్రియుఁ, బులస్త్యుండును, బులహుండును, గ్రతువును ననునార్వురు పుట్టి; రందు మరీచికిఁ గశ్యపప్రజాపతి పుట్టెఁ; గశ్యపువలనఁ జరాచర భూతరాశి యెల్ల నుద్భవిల్లె; నె ట్లనిన- బ్రహ్మదక్షిణాంగుష్ఠంబున దక్షుండును, వామాంగుష్ఠంబున ధరణి యను స్త్రీయునుం బుట్టిన యయ్యిరువురకును.
1.3.60
క. సుతు లనఘులు వేవురు దమ | యుతు లై యుదయించి, సాంఖ్యయోగాభ్యాసో
న్నతిఁ జేసి ముక్తు లై, భూ | రితేజు లందఱును నూర్ధ్వరేతసు లైనన్.
1.3.61
వ. పదంపడి యేఁబండ్రుకూఁతులుం బుట్టిన, వారల నెల్ల దక్షుం డపుత్త్రకుండు గావునఁ బుత్త్రీకరణంబు సేసి, యందుఁ గీర్తి లక్ష్మీ ధృతి మేధా పుష్టి శ్రద్ధా క్రియా బుద్ధి లజ్జా మతు లను వనితలఁ బదుండ్రను ధర్ముం డను మనువున కిచ్చె; నశ్విన్యాదు లైన యిరువదేడ్వు రను జంద్రున కిచ్చె; నదితి దితి దను కాలా నాయు స్సింహికా ముని కపిలా వినతా క్రోధా ప్రాధా క్రూరా కద్రువ లను పదుమువ్వురను గశ్యపున కిచ్చె; నం దదితి యనుదానికి ధాతృ మిత్రార్యమ శక్ర వరుణాంశు భగ వివస్వ త్పూష సవితృ త్వష్టృ విష్ణు లనంగా ద్వాదశాదిత్యులు పుట్టిరి; మఱియును.
1.3.62
క. దితి యనుదానికి నప్రతి | హతబలుఁడు హిరణ్యకశిపుఁ డనఁ బుట్టె సుతుం;
డతనికి నేవురు పుట్టిరి | ప్రతాపగుణయుతులు సుతులు ప్రహ్లాదాదుల్.
1.3.63
వ. ఆ ప్రహ్లాదసంహ్లాదానుహ్లాద శిబిబాష్కళులయందుఁ బ్రహ్లాదునకు విరోచన కుంభనికుంభు లనంగా మువ్వురు పుట్టి; రందు విరోచనునకు బలి పుట్టె; బలికి బాణాసురుండు పుట్టె; దను వనుదానికి విప్రచిత్తి శంబర నముచిపులోమాసి లోమకేశి దుర్జయాదు లయిన దానవులు నలువండ్రు పుట్టిరి; వారల పుత్త్రపౌత్త్రవర్గం బసంఖ్యాతం బై ప్రవర్తిల్లెఁ; గాల యనుదానికి వినాశనక్రోధాదు లెనమండ్రు పుట్టిరి.
1.3.64
ఆ. అజితశక్తియుతులనాయువ యనుదాని | కజరు లధిక వీరు లతుల భూరి
భుజులు శక్రరిపులు పుట్టిరి నలువురు | విక్షర బలవీర వృత్రు లనఁగ.
1.3.65
వ. మఱియు సింహిక యనుదానికి రాహువు పుట్టె; ముని యనుదానికి భీమసేనోగ్రసేనాదు లయిన గంధర్వులు పదార్వురు పుట్టిరి; కపిల యను దానికి నమృతంబును గోగణంబులును బ్రాహ్మణులును ఘృతాచీ మేనకాదు లయిన యప్సరసలును బుట్టిరి; వినత యను దానికి ననూరుండును గరుడుండును బుట్టి; రం దనూరునకు శ్యేని యనుదానికి సంపాతి జటాయువులు పుట్టిరి; క్రోధ యను దానికిఁగ్రోధవశగణంబు పుట్టెఁ; బ్రాధ యను దానికి సిద్ధాదులు పుట్టిరి; క్రూర యనుదానికి సుచంద్ర చంద్ర హంత్రాదులు పుట్టిరి; కద్రువ యను దానికి శేష వాసుకి పురోగమానేక భుజంగముఖ్యులు పుట్టిరి.
1.3.66
సీ. మఱి యంగిరసుఁ డను మానసపుత్త్రున | కయ్యుతథ్యుండు బృహస్పతియును
సంవర్తుఁడును గుణాశ్రయ యోగసిద్ధి య | న్కూఁతురుఁబుట్టి; రక్కొడుకులందు
విభుఁడు బృహస్పతి వేల్పుల కాచార్యుఁ | డై లోకపూజితుఁ డై వెలింగె;
మానుగా నత్రి య న్మానసపుత్త్రున | కుద్భవించిరి ధర్మయుతచరిత్రు
ఆ. లఖిలవేదవేదు లాద్యు లనేకులు | దీప్తరవిసహస్రతేజు లనఘు
లధికతరతపోమహత్త్వసంభృతవిశ్వ | భరులు సత్యపరులు పరమమునులు.
1.3.67
వ. మఱియుఁ బులస్త్యుం డను మానసపుత్త్రునకు ననేకరాక్షసులు పుట్టిరి; పులహుం డను మానసపుత్త్రునకుఁ గిన్నర కింపురుషాదులు పుట్టిరి; క్రతు వను మానసపుత్త్రునకు సత్యవ్రత పరాయణు లైన పతంగ సహచరులు పుట్టిరి; పైతామహుం డైన దేవుం డను మునికిఁ బ్రజాపతి పుట్టె; వానికి ధూమ్రా బ్రహ్మవిద్యా మనస్వినీ రతాశ్వసాశాండిలీ ప్రభాత లనంగా నేడ్వురు భార్య లై; రందు ధూమ్రకు ధరుండును, బ్రహ్మవిద్యకు ధ్రువుండును, మనస్వినికి సోముండును, రతకు నహుండును, శ్వసకు ననిలుండును, శాండిలికి నగ్నియుఁ, బ్రభాతకుఁ బ్రత్యూష ప్రభాసు లనంగా నెనమండ్రు వసువులును బుట్టి; రందు ధరుం డను వసువునకు ద్రవిణుండును. హుతవావ్యవహుండునుం బుట్టిరి; ధ్రువుండను వసువునకుఁ గాలుండు పుట్టె; సోముం డను వసువునకు మనోహర యనుదానికి వర్చసుండును శిబిరుండును బ్రాణుండును రమణుండును బృథ యను కూఁతురునుం బుట్టిరి; పృథకుఁ బదుండ్రు గంధర్వసుతులు పుట్టిరి; యహుం డను వసువునకు జ్యోతి పుట్టె; ననిలుండను వసువునకు శివ యను దానికి మనోజవుండును నవిజ్ఞాతగతియునుం బుట్టిరి. అగ్ని యను వసువునకుఁ గుమారుండు పుట్టెఁ; బ్రత్యూషుం డను వసువునకు ఋషియైన దేవలుండు పుట్టెఁ; బ్రభాసుం డను వసువునకు బృహస్పతి చెలియ లైన యోగసిద్ధికి విశ్వకర్మ పుట్టె.
1.3.68
క. ఆ విశ్వకర్మ నిర్మిత | దేవవిమానుండు, నిఖిల దివ్యాభరణ
శ్రీవిరచన పరితోషిత | దేవుఁడు, శిల్పప్రజాపతియు నై నెగడెన్.
1.3.69
వ. మఱియు స్థాణునకు మానసపుత్త్రు లైన మృగవ్యాధ శర్వ నిరృత్యజైక పాదహిర్బుధ్న్యపినాకి దహనేశ్వరకపాలి స్థాణు భవు లనంగా నేకాదశరుద్రులు పుట్టిరి; మఱి బ్రహ్మ దక్షిణస్తనంబున ధర్ముం డను మనువు పుట్టె; వానికి శమకామహర్షు లనంగా మువ్వురు పుట్టిరి; యామువ్వురకుఁ గ్రమంబునఁ బ్రాప్తి రతి నంద లనంగా మువ్వురు భార్యలైరి; సవితృనకు బడబారూపధారిణి యైన త్వాష్ట్రికి నాశ్వినులు పుట్టిరి; బ్రహ్మహృదయంబున భృగుండు పుట్టె; వానికిఁగవి పుట్టె; వానికి శుక్రుండు పుట్టి యసురుల కాచార్యుం డయ్యె; వానికిఁ జండామర్కత్వష్ట్యధరాత్త్రు లనంగా నలువురు గొడుకులు పుట్టిరి; వా రసురులకు యాజ్ఞికు లైరి మఱియును.
1.3.70
సీ. విగతాఘుఁ డైన యాభృగునకుఁ బుత్త్రుఁడై | చ్యవనుండు పుట్టె; భార్గవవరుండు
జనవంద్యుఁ డతనికి మనుకన్యకకుఁ బుట్టె | నూరుల నౌర్వుండు భూరికీర్తి;
యతనికి నూర్వురు సుతులు ఋచీకాదు | లుదయించి రఖిల భూవిదిత తేజు;
లందు ఋచీకున కొందంగ జమదగ్ని | యనుముని పుట్టె; నాతనికిఁ బుట్టి
ఆ. రలఘుమతులు సుతులు నలువురు; వారిలోఁ | బరశురాముఁ డాదిపురుషమూర్తి
దండితాహితుండు గొండుక యయ్యును | దద్ద గుణములందుఁ బెద్ద యయ్యె.
1.3.71
వ. మఱియు బ్రహ్మకు ధాతయు విధాతయు ననంగా నిద్దఱు మనుసహాయులై పుట్టిరి; వారితోడను లక్ష్మి పుట్టె; లక్ష్మికి మానసపుత్త్రు లనేకులు పుట్టిరి; వరుణునకు జ్యేష్ఠకు బలుండును సుర యను కూఁతురునుం బుట్టిరి; సురయం దధర్ముండు పుట్టె; నా యధర్మునకు నిరృతికి భయ మహాభయ మృత్యువు లనఁగా మువ్వురు పుట్టిరి; మఱియుఁ దామ్రకుఁ గాకియు శ్యేనియు భాసియు ధృతరాష్ట్రియు శుకియు నన నేవురుకన్యలు పుట్టిరి; యందుఁ గాకి యనుదానికి నులూకంబులు పుట్టె; శ్వేని యను దానికి శ్యేనంబులు పుట్టె; భాసి యనుదానికి భాసగృధ్రాదులు పుట్టె; ధృతరాష్ట్రి యను దానికి హంస చక్ర వాకంబులు పుట్టె; శుకియను దానికి శుకంబులు పుట్టె; మఱియుం గ్రోధునకు మృగియు మృగమందయు హరియు భద్రమనసయు మాతంగియు శార్దూలియు శ్వేతయు సురభియు సురసయు ననఁ దొమ్మండ్రు పుట్టి; రందు మృగి యనుదానికి మృగంబులు పుట్టె; మృగమంద యనుదానికి ఋక్ష చమర సృమరాదులు పుట్టె; హరి యనుదానికి వానరగణంబులు పుట్టె భద్రమనస యనుదానికి నైరావణంబు పుట్టె; నైరావణంబునకు దేవనాగంబులు పుట్టె; మాతంగి యనుదానికి గజంబులు పుట్టె; శార్దూలి యనుదానికి సింహవ్యాఘ్రంబులు పుట్టె; శ్వేత యనుదానికి దిగ్గజంబులు పుట్టె; సురభి యనుదానికి రోహిణియు గంధర్వియు ననలయు ననం బుట్టి; రందు రోహిణికిఁ బశుగణంబులు పుట్టె; గంధర్వి యనుదానికి హయంబులు పుట్టె; ననలకు గిరి వృక్షలతా గుల్మంబులు పుట్టె; సురసకు సర్పంబులు పుట్టె; నిది సకలభూత సంభవప్రకారంబు.
1.3.72
చ. దివిజ మునీంద్ర దానవదితి ప్రభవాదిసమస్తభూతసం
భవముఁ గృతావధాను లయి భక్తిమెయిన్ వినుచున్న పుణ్యమా
నవులకు నిక్కువం బగు మనఃప్రియ నిత్యసుఖంబులుం జిరా
యువు బహుపుత్త్రలాభవిభవోన్నతియున్ దురితప్రశాంతియున్.
1.3.73
వ. మఱియు మర్త్యలోకంబునందు దేవదైత్యదానవుల యంశావతారంబుల వివరించెద వినుము.
1.3.74
క. యాదవవంశంబున జగ | దాదిజుఁ డగు విష్ణుదేవునంశంబున ను
త్పాదిల్లెఁ గృష్ణుఁ డపగత | ఖేదుఁడు వసుదేవ దేవకీదేవులకున్.
1.3.75
క. శ్రీ వెలుఁగ రోహిణికి వసు | దేవున కుదయించె విష్ణుదేవాంశమునన్
భూవంద్యుఁ డనంతుఁడు బల | దేవుండు ప్రలంబ ముఖ్యదితిజాంతకుఁ డై.
1.3.76
వ. మఱియు లక్ష్మి యంశంబున రుక్మిణి యుదయించె; సనత్కుమారు నంశంబునఁ బ్రద్యుమ్నుండు పుట్టె; నప్సరసల యంశంబులఁ గృష్ణునిషోడశసహస్రాంతఃపురవనితలు పుట్టి; రయ్యయి వేల్పుల యంశంబుల యదువృష్ణి భోజాంధక వంశంబుల వీరు లనేకులు పుట్టిరి; మఱియు.
1.3.77
క. ముదమునఁ బ్రభాసుఁ డను నెని | మిది యగు వసునంశమునను మేదిని భీష్ముం
డుదయించె సర్వవిద్యా | విదుఁ డపజిత పరశురామ వీర్యుఁడు బలిమిన్.
1.3.78
క. అనఘుఁడు సురగురునంశం | బునను భరద్వాజుకలశమునఁ బుట్టె శరా
సనవిద్యాచార్యుఁడు భూ | వినుతుఁడు ద్రోణుండు నిఖిలవేదవిదుం డై.
1.3.79
క. అలఘుఁడు కామక్రోధా | దుల యేకత్వమునఁ బుట్టె ద్రోణునకు మహా
బలుఁ డశ్వత్థామ రిపు | ప్రళయాంతకుఁ డస్త్రశస్త్రపరిణతుఁ డగుచున్.
1.3.80
వ. మఱియు నేకాదశరుద్రుల యంశంబునఁగృపుఁడు పుట్టె; సూర్యునంశంబునఁగర్ణుండు పుట్టె; ద్వాపరాంశంబున శకుని పుట్టె; నరిష్టాపుత్త్రుం డయిన హంసుం డను గంధర్వ విభుండు ధృతరాష్ట్రుం డయి పుట్టె; మతి యనువేల్పుగాంధారి యై పుట్టె; మఱియు నయ్యిద్దఱకుం గలియంశంబున దుర్యోధనుండు పుట్టెఁ; బౌలస్త్య భ్రాతృవర్గంబు దుశ్శాసనాది దుర్యోధనానుజ శతం బై పుట్టె; హిరణ్యకశిపుండు శిశుపాలుండై పుట్టె; సంహ్లాదుండు శల్యుం డై పుట్టె; ననుహ్లాదుండు ధృష్ణకేతుం డై పుట్టె; శిబి యనువాఁడు ద్రుమసేనుం డై పుట్టె; బాష్కళుండు భగదత్తుఁ డై పుట్టె; విప్రచిత్తి యను దానవుండు జరాసంధుం డై పుట్టె; నయశ్శిరుండును నశ్వశీర్షుండును నయశ్శంకుండును గగనమూర్ధుండును వేగవంతుండును ననువా రేవురు దానవులు గేకయరాజు లయి పుట్టిరి; కేతుమంతుండమితౌజుం డై పుట్టె; స్వర్భానుం డుగ్రసేనుండై పుట్టె; జంభుండు విశోకుండై పుట్టె; నశ్వపతి కృతవర్మ యై పుట్టె; వృషపర్వుండు దీర్ఘప్రజ్ఞుం డై పుట్టె; నజరుండు మల్లుం డై పుట్టె; నశ్వగ్రీవుండు రోచమానుం డై పుట్టె; సూక్ష్ముండు బృహద్రథుం డై పుట్టెఁ; దుహుం డనువాఁడు సేనాబిందుం డై పుట్టె; నేకచక్రుండు ప్రతివింధ్యుం డై పుట్టె; విరూపాక్షుండు చిత్రవర్మ యై పుట్టె; హరుండును నహరుఁడును సుబాహు బాహ్లికు లై పుట్టిరి; చంద్రవక్త్రుండు ముంజకేశుం డై పుట్టె; నికుంభుండు దేవాపి యై పుట్టె; శరభుండు సోమదత్తుం డై పుట్టెఁ; జంద్రుండు చంద్రవర్మ యై పుట్టె; నర్కుండు ఋషికుం డై పుట్టె; మయూరుండు విశ్వుం డై పుట్టె; సుపర్ణుండు క్రోధకీర్తి యై పుట్టె; రాహువు క్రోధుం డై పుట్టెఁ; జంద్రహంత శునకుం డై పుట్టెఁ; నశ్వుం డనువా డశోకుండైపుట్టె; భద్రహస్తుండు నందుం డై పుట్టె; దీర్ఘజిహ్వుండు గాశిరాజై పుట్టెఁ; జంద్రవినాశనుండు జానకి యై పుట్టె; బలీనుండు పౌండ్రమత్స్యుం డై పుట్టె; వృత్రుండు మణిమంతుం డై పుట్టెఁ; గాలాపుత్త్రు లెనమండ్రు క్రమంబున జయత్సేనాపరాజితనిషధాధిపతి శ్రేణిమన్మ హౌజో -భీరు సముద్రసేన బృహత్తులై పుట్టిరి; క్రోధ వశగణంబువలన మద్రక కర్ణ వేష్ట సిద్ధార్థ కీటక సువీర సుబాహు మహావీర బాహ్లిక క్రథ విచిత్ర సురథ శ్రీమన్నీల చీరవాసో భూమిపాల దంతవక్త్ర రుక్మిజనమేజ యాషాఢ వాయువేగ భూరితేజ ఏకలవ్య సుమిత్ర వాటధాన గోముఖ కారూషకక్షేమ ధూర్తి శ్రుతాయు రుద్వహ బృహత్సేన క్షేమాగ్ర తీర్థకుహర మతిమ దీశ్వరాదు లనేకులు పుట్టిరి; కాలనేమి కంసుండై పుట్టె; స్త్రీ పుంసరూప ధరుం డైన గుహ్యకుండు శిఖండి యై పుట్టె; మరుద్గణాంశంబునఁ బాండురాజు పుట్టె.
1.3.81
క. మరుతులయంశంబునఁ బు | ట్టిరి మువ్వురు వివిధరణపటిష్ఠబలులు సు
స్థిరయశులు ద్రుపదసాత్యకి | విరాట భూపతులు భువనవిశ్రుతచరితుల్.
1.3.82
క. మాండవ్యుం డను మునివరు | చండతర క్రోధజనిత శాపంబున ధ
ర్ముం డఖిల ధర్మతత్త్వవి | దుం డనఁ విదురుఁ డనఁ బేర్మితో నుదయించెన్.
1.3.83
క. ప్రియ మొనరఁగ సిద్ధియు బు | ద్ధియు నను దేవతలు వసుమతిని గుంతియు మా
ద్రియు నై పుట్టిరి పాండు | ప్రియపత్నులు నిఖిలజగదభీష్టచరిత్రల్.
1.3.84
సీ. యమునంశమునఁ బుట్టె నధిపతి ధర్మజుం; | డనిలాంశమునఁ బుట్టె ననిలజుండు;
శక్రాంశమున ధనంజయుఁ డుదయించె; నా | శ్వినుల యంశముల నూర్జితులు నకుల
సహదేవు లనవద్యచరితులు పుట్టిరి; | శ్రీమూర్తి యై యాజ్ఞసేని పుట్టె;
నగ్నియంశమున జితారి ధృష్టద్యుమ్నుఁ | డనఁ బుట్టె ద్రుపదరాజాన్వయమున;
ఆ. ననఘ! యిది సురాసురాంశావతారకీ | ర్తనము; దీని వినినఁ దవిలి భక్తిఁ
జదివినను సమస్త జనులకు నఖిలదే | వాసురాదు లిత్తు రభిమతములు.
1.3.85
వ. అనిన విని జనమేజయుండు వైశంపాయనున కి ట్లనియె.
1.3.86
సీ. అభ్యస్తవేదవేదాంగులు, విధిదత్త | దక్షిణాప్రీణిత ధరణిదేవు,
లనవరతాశ్వమేధావభృథస్నాన | పూతమూర్తులు, కృతపుణ్యు, లహిత
వర్గజయుల్, ప్రాప్తవర్గచతుష్టయుల్, | సత్త్వాది సద్గుణజన్మనిలయు
లాభరతాది మహామహీపాలకు | లిద్ధయశోర్థు లెందేనిఁ బుట్టి
ఆ. రట్టి కౌరవాన్వయంబుఁ బాండవ నృప | రత్నములకు వారిరాశి యైన
దాని వినఁగ వలతుఁ దద్దయుఁ బ్రీతితో | విప్రముఖ్య! నాకు విస్తరింపు.
1.3.87
వ. అని యడిగిన జనమేజయునకు వైశంపాయనుం డి ట్లనియె.
1.3.88
చ. నిరుపమధర్మమార్గపరినిష్ఠితు లై మహి యెల్లఁ గాచుచుం
బరఁగిన తొంటి పూరు కురు పాండు మహీశుల పేర్మిఁ జేసి భూ
భరవహనక్షమం బగుచుఁ బౌరవ కౌరవ పాండవాన్వయం
బురుగుణసంపదం బెరిఁగి యొప్పె సమస్త జగత్ప్రసిద్ధ మై.
1.3.89
వ. అది యెట్లనినం: దొల్లి దాక్షాయణి యైన యదితికిఁ గశ్యపునకుం బుట్టిన వివస్వంతునకు వైవస్వతుం డను మనువును యముండును శనైశ్చరుండును యమునయుఁ దపతియు ననం బుట్టి; రందు వైవస్వతుం డను మనువు వలన బ్రహ్మక్షత్రియ వైశ్యశూద్రాదు లైన మానవులు పుట్టిరి; మఱియు వానికి వేనప్రముఖు లైన రాజు లేఁబండ్రు పుట్టి వంశకరు లై తమలోన యుద్ధంబు సేసి మడిసిరి; మఱియు నమ్మనుపుత్త్రి యైన యిల యనుదానికి సోమపుత్త్రుం డైన బుధునకుఁ బురూరవుండు పుట్టి చక్రవర్తి యై.
1.3.90
క. ఇమ్మహిఁ ద్రయోదశ ద్వీ | పమ్ములు దన శౌర్యశక్తిఁ బాలించి మదాం
ధ్యమ్మున విప్రోత్తమ వి | త్తమ్ములు దా నపహరించె ధనలోభమునన్.
1.3.91
క. విని దాని నుడుపఁగా బ్ర | హ్మనియుక్తుం డై సనత్కుమారుఁడు మహికిం
జనుదెంచె బ్రహ్మలోకం | బుననుండి యనేక దివ్యమునిసంఘముతోన్.
1.3.92
వ. పురూరవుండును రాజ్యగర్వంబున నమ్మునులకు దర్శనం బీనొల్లక పరిహసించిన నలిగి వారలు వాని నున్మత్తుంగా శపియించిన, వాఁడు గంధర్వలోకంబున నూర్వశీ సహితుం డై యుండె; నట్టి పురూరవునకు నూర్వశికి నాయువు ధీమంతుండు నమావసువు దృఢాయువు వనాయువు శతాయువు నను నార్వురు గొడుకులు పుట్టి; రం దాయువునకు స్వర్భానవి యను దానికి నహుష వృద్ధశర్మ రజి గయానేనసు లనంగా నేవురు పుట్టిరి; వారి యందు నహుషుండు రాజ్యాభిషిక్తుం డై.
1.3.93
మ. చతురంభోధిపరీతభూవలయమున్ సద్వీప సారణ్యస
క్షితిభృత్కం బగుదాని భూరిభుజశక్తిం జేసి పాలించుచుం
గ్రతువుల్ నూ ఱొనరించి కీర్తి వెలయంగా దిక్కులన్ నిర్జితా
హితుఁ డై యా నహుషుండు దాఁ బడసె దేవేంద్రత్వముం బేర్మితోన్.
1.3.94
వ. అట్టి నహుషునకుఁ బ్రియంవద యనుదానికి యతి యయాతి సంయా త్యాయా త్యయతి ధ్రువు లనంగా నార్వురు పుట్టి; రందు యయాతి రా జై యనేకయాగంబులు సేసి శుక్రపుత్త్రి యయిన దేవయానియందు యదుతుర్వసులును వృషపర్వపుత్త్రి యయిన శర్మిష్ఠయందు ద్రుహ్య్వనుపూరులు ననంగా నేవురు కొడుకులం బడసి రాజ్యంబు సేయుచు శుక్రశాపంబున జరాభారపీడితుం డై కొడుకుల నందఱం బిలిచి యి ట్లనియె.
1.3.95
సీ. ‘విషయోపభోగాభిలషణ మింకను నాకు | వదలక పెరుఁగుచున్నదియుఁ గాన
నందనులార! మీయం దొక్కరుండు నా | దగు జరాభారంబు దగిలి తాల్చి
తనజవ్వనంబు నా కొనరంగ నెవ్వఁ డీ | నోపు నాతండ సద్వీపసకల
ధారుణీసామ్రాజ్యభారయోగ్యుం డగు’ | నని యడిగిన నగ్రతనయుఁ డయిన
ఆ. యదువుఁ దొట్టి సుతులు ముదిమికి నోపక | తలలు వాంచి యున్న వెలయఁ దండ్రి
పనుపుఁ జేసి ముదిమి గొని జవ్వనం బిచ్చెఁ | బూరుఁ డనుసుతుండు భూరికీర్తి.
1.3.96
వ. అనిన విని జనమేజయుండు వైశంపాయనున కి ట్లనియె.
1.3.97
తే. వర్ణధర్మముల్ గాచుచు వసుధ యెల్ల | ననఘ చరితుఁ డై యేలిన యయ్యయాతి
భూసురోత్తమ! భార్గవపుత్త్రి యైన | దేవయానిని దా నెట్లు దేవిఁ జేసె?
1.3.98
తే. విపులతేజంబునను దపోవీర్యమునను | జగదనుగ్రహనిగ్రహశక్తియుక్తుఁ
డయినయట్టి యయాతికి నలిగి యేమి | కారణంబున శాపంబు కావ్యుఁ డిచ్చె?
1.3.99
వ. మఱియు నస్మద్వంశకరుం డయిన యయాతిచరితంబు విన వలతుం జెప్పు మని యడిగిన వానికి వైశంపాయనుం డి ట్లనియె.
1.3.100
క. మనుజాధిప! వృషపర్వుం | డను దానవపతికి శుక్రుఁ డా చార్యుం డై
యనిమిషవిరోధులకుఁ బ్రియ | మొనరించుచు వివిధ విధినయోపాయములన్.
1.3.101
క. దేవాసుర రణమున గత | జీవితు లగు నసురవరులఁ జెచ్చెర మృతసం
జీవని యను విద్యఁ బున | ర్జీవులఁగాఁ బ్రతిదినంబుఁ జేయుచు నుండెన్.
1.3.102
వ. దాని నెఱింగి దేవతలెల్ల నతి భీతు లై యసురుల నోర్వ నోపక శుక్రువలన మృతసంజీవని వడసి తేనోపునట్టి మహాసత్త్వుం డెవ్వం డగునో యని విచారించి బృహస్పతిపుత్త్రుండయిన కచునికడకుం జని యిట్లనిరి.
1.3.103
క. పోరను మృతసంజీవని | కారణమున నిహతు లయ్యుఁ గా రసురవరుల్
వారల నోర్వఁగ మన కతి | భారము దుర్వారవీర్యబలయుతు లగుటన్.
1.3.104
క. మనపక్షంబున వా ర | ద్దనుజులచే నిహతు లయ్యుఁ దగ మృతసంజీ
వని లేమిఁ జేసి యమసా | దనమున కరుగుదురు వీర్యదర్పితు లయ్యున్.
1.3.105
క. కావున మృతసంజీవనిఁ | దేవలయును శుక్రువలన ధృతిఁ బడసి తప
శ్రీవ్శిభవ! దాని బలమునఁ | గావంగావలయు సురనికాయబలంబున్.
1.3.106
క. బాలుండవు, నియమవ్రత | శీలుండవు, నిన్నుఁ బ్రీతిఁ జేకొని, తద్వి
ద్యాలలనాదానముఁ గరు | ణాలయుఁ డై చేయు నమ్మహాముని నీకున్.
1.3.107
వ. ‘దుహితృస్నేహంబునం జేసి యద్దేవయాని పలుకులు శుక్రుం డతిక్రమింపండు గావున నీనేర్చువిధంబున దాని చిత్తంబు వడసి శుక్రు నారాధించిన నీ కిష్టసిద్ధి యగు’ నని దేవతలు ప్రార్థించి పంచినం, గచుండును దేవహితార్థంబు వృషపర్వుపురంబునకుం జని యచ్చట వేదాధ్యయనశీలుం డయి సకలదైత్యదానవ గణోపాధ్యాయుం డయి యున్న శుక్రుం గని నమస్కరించి యి ట్లనియె.
1.3.108
క. ఏను గచుం డనువాఁడ, మ | హానియమసమన్వితుఁడ, బృహస్పతిసుతుఁడన్,
మానుగ వచ్చితి నీకును | భానునిభా! శిష్యవృత్తిఁ బని సేయంగన్.
1.3.109
వ. అనిన నమ్మునికుమారుని సుకుమారత్వంబును, వినయ ప్రియవచన మృదుమధురత్వంబును, ననవరత నియమవ్రత ప్రకాశిత ప్రశాంతత్వంబునుం జూచి శుక్రం డతిస్నేహంబున ‘వీనిం బూజించిన బృహస్పతిం బూజించిన యట్ల’ యని యభ్యాగతపూజల వాని సంతుష్టుంగాఁ జేసి శిష్యుంగాఁ జేకొని యున్నంత, నక్కచుండు.
1.3.110
సీ. పని యేమి పంచినఁ బదపడి చేసెద | ననక తన్ బంచిన యాక్షణంబ
చేయుచు నిజగురు చిత్తవృత్తికిఁ గడు | ననుకూలుఁ డై వినయంబుతోడ
మనమునఁ జెయ్వుల మాటలభక్తి నే | కాకారుఁ డై, మఱి యంతకంటె
దేవయానికి సువిధేయుఁ డై ప్రియహిత | భాషణములఁ బుష్పఫలవిశేష
ఆ. దానములను సంతతప్రీతిఁ జేయుచు | నివ్విధమునఁ బెక్కులేండ్లు నిష్ఠ
గురుని గురుతనూజఁ గొలిచి యయ్యిరువుర | నెమ్మి వడసెఁ దనదునేర్పుపేర్మి.
1.3.111
వ. ఇట్లు గురుశుశ్రూషాకౌశలంబునఁ గచుండు శుక్రునకుం బ్రియశిష్యుం డై యున్న నెఱింగి, దానవులు సహింపనోపక బృహస్పతితోడి యలుకనక్కచు నొక్కనాఁడు హోమధేనువులం గాచుచు వనంబున నేకతంబ యున్న వాని వధియించి, విశాల సాలస్కంధంబున బంధించి చని; రంత నాదిత్యుం డస్తగిరి శిఖరగతుం డగుడు మగుడి హోమధేనువు లింటికి వచ్చిన, వానితోడన కచుండు రాకున్న, దేవయాని తనమనంబున మలమల మఱుంగుచుం బోయి తండ్రి కి ట్లనియె.
1.3.112
ఉ. వాఁడిమయూఖముల్ గలుగువాఁ డపరాంబుధిఁ గ్రుంకె, ధేనువుల్
నేఁ డిట వచ్చె నేకతమ, నిష్ఠమెయిన్ భవదగ్నిహోత్రముల్
పోఁడిగ వేల్వఁగాఁ బడియెఁ, బ్రొద్దును బోయెఁ, గచుండు నేనియున్
రాఁడు, వనంబులోన మృగరాక్షసపన్నగబాధ నొందెనో!
1.3.113
వ. అనిన విని శుక్రుండు దనదివ్యదృష్టి నసురవ్యాపాదితుం డైన కచుం గని, వానిం దోడ్కొని తేర మృతసంజీవనిం బంచిన, నదియును బ్రసాదం బని యతి త్వరితగతిం జని, విగతజీవుం డయిన కచు నప్పుడ సంజీవితుం జేసి తోడ్కొని వచ్చినం జూచి శుక్రుండును దేవయానియు సంతసిల్లి యున్నంతఁ, గొన్నిదినంబులకు వెండియు నొక్కనాఁడు.
1.3.114
క. అడవికిఁ బువ్వులు దేరఁగ | వడి నరిగినకచునిఁ జంపి, వారక దనుజుల్
పొడవు సెడఁ గాల్చి, సురతోఁ | దడయక యబ్బూది శుక్రుఁ ద్రావించి రొగిన్.
1.3.115
వ. శుక్రుండును సురాపానమోహితుం డయి యున్నఁ, దొల్లింటియట్ల దేవయాని గచుం గానక దుఃఖిత యై ‘నేఁడును గచుండు రాక మసలె; నసురులచేత నిహతుం డయ్యెఁ గావలయు’ నని శోకించిన దానిం జూచి శుక్రుం డి ట్లనియె.
1.3.116
క. వగవక సంజీవని పెం | పగణిత గర్వమున నసురు లా కచుతోడం
బగఁ గొని చంపెద; రాతఁడు | సుగతికిఁ జనుఁగాక; యేల శోకింపంగన్?
1.3.117
వ. అనిన దేవయాని యి ట్లనియె.
1.3.118
మ. మతిలోకోత్తరుఁ డైన యంగిరసుమన్మం, డాశ్రితుం, డాబృహ
స్పతికింబుత్త్రుఁడు, మీకు శిష్యుడు, సురూప బ్రహ్మచర్యాశ్రమ
వ్రత సంపన్నుఁ, డకారణంబ దనుజవ్యాపాదితుం డైన న
చ్యుతధర్మజ్ఞ! మహాత్మ! యక్కచున కే శోకింప కె ట్లుండుదున్?
1.3.119
వ. ‘వానిం జూచి కాని కుడువనొల్ల’ నని దేవయాని యేడ్చుచున్నఁ, బెద్దయుంబ్రొద్దునకుఁ బ్రసన్నుం డై శుక్రుండు దనయోగదృష్టిం జూచి లోకాలోకపర్యంతభువనాంతరంబునఁ గచుం గానక సురాసమ్మిశ్ర భస్మ మయుం డై తనయుదరంబున నున్న యక్కచుం గని, సుర సేసిన దోషంబును, నసురులు సేసిన యపకారంబును నెఱింగి.
1.3.120
ఆ. మొదలి పెక్కు జన్మములఁ బుణ్యకర్మముల్ | పరఁగఁ బెక్కుసేసి పడయఁబడిన
యట్టి యెఱుక జనుల కాక్షణ మాత్రన | చెఱుచు మద్యసేవ సేయ నగునె?
1.3.121
క. భూసురు లాదిగఁ గల జను | లీసుర సేవించిరేని యిది మొదలుగఁ బా
పాసక్తిఁ బతితు లగుదురు; | చేసితి మర్యాద; దీనిఁ జేకొనుఁడు జనుల్.
1.3.122
వ. అని శుక్రుండు సురాపానంబు మహాపాతకంబుగా శపియించి, తనయుదరంబున నున్న కచు నప్పుడ సంజీవితుం జేసిన, నంద యుండి కచుండు శుక్రున కి ట్లనియె.
1.3.123
క. తనువును జీవము సత్త్వం | బును బడసితి నీ ప్రసాదమున; నీయుదరం
బనఘా! వెలువడు మార్గం | బొనరింపుము నాకు భూసురోత్తమ! దయతోన్.
1.3.124
వ. అనిన ‘నాయుదరంబుభేదిల్లినంగాని యిమ్మునికుమారుండు వెలువడ నేరం; డుదరభేదనంబున మూర్ఛితుండ నయిన నన్ను సంజీవితుంజేయ వలయు’ నని శుక్రుండు కచునకు సంజీవని నుపదేశించిన.
1.3.125
క. ఉదరభిదాముఖమున న | భ్యుదయముతో నిర్గమించె బుధనుతుఁడు కచుం
డుదయాద్రిదరీముఖమున | నుదితుం డగు పూర్ణహిమమయూఖుఁడ పోలెన్.
1.3.126
వ. అంత.
1.3.127
తే. విగతజీవుఁ డై పడియున్న వేదమూర్తి | యతనిచేత సంజీవితుఁ డై వెలింగె
దనుజమంత్రి యుచ్చారణదక్షుచేత | నభిహితం బగు శబ్దంబునట్ల పోలె.
1.3.128
వ. ఇ ట్లతిప్రయత్నంబునఁ గచుండు శుక్రువలన సంజీవని వడసి పెద్దకాలం బుండి, యొక్కనాడు శుక్రుచేత ననుజ్ఞాతుం డయి దేవలోకంబునకుం బోవుచుండి, దేవయాని కతిప్రియపూర్వకంబునం జెప్పిన, నదియును దద్వియోగదుఃఖిత యై కచున కి ట్లనియె.
1.3.129
ఉ. ‘నీవును బ్రహ్మచారివి, వినీతుఁడ, వేనును గన్యకన్; మహీ
దేవకులావతంస! రవితేజ! వివాహము నీకు నాకు మున్
భావజశక్తి నైనయది; పన్నుగ నన్నుఁ బరిగ్రహింపు సం
జీవనితోడ శుక్రుదయఁ; జేయుము నాకుఁ బ్రియంబు’ నావుడున్.
1.3.130
క. ఆ కచుఁ డత్యంతవిషా | దాకులుఁ డై ‘లోకనింద్య మగు నర్థము నీ
వాకునకుఁ దెచ్చు టుచితమె? | నాకు సహోదరివి నీవు నాచిత్తమునన్.’
1.3.131
క. గురులకు శిష్యులు పుత్త్రులు | పరమార్థమ లోకధర్మపథ మిది; దీనిం
బరికింపక యీ పలుకులు | తరుణీ! గురుపుత్త్రి! నీకుఁ దగునే పలుకన్.
1.3.132
వ. అనిన నా కచునకు దేవయాని కరం బలిగి ‘నీవు నా మనోరథంబు విఫలంబుగాఁ జేసిన వాఁడవు; నీకు సంజీవని పని సేయకుండెడు’ మని శాపం బిచ్చినఁ, గచుం ‘డేను ధర్మపథంబుఁ దప్పనివాఁడను; నీ వచనంబున నాకు సంజీవని పనిచేయదయ్యెనేనియు నాచేత నుపదేశంబు గొన్నవారికిఁ బనిసేయుంగాక; మఱి నీవు ధర్మ విరోధంబు దలంచితివిగావున నిన్ను బ్రాహ్మణుండు వివాహంబు గాకుండెడు’ మని దేవయానికిఁ బ్రతిశాపం బిచ్చి తత్క్షణంబ.
1.3.133
క. దేవగురునందనుం డమ | రావాసంబునకు నరిగి యమరులకును సం
జీవని యుపదేశించి, సు | ధీవినుతుఁ డొనర్చుచుండె దేవహితంబుల్.
1.3.134
వ. ఇట వృషపర్వుకూఁతురు శర్మిష్ఠయను కన్యక యొక్కనాడు కన్యకాసహస్రపరివృతయయి దేవయానీ సహితంబు వనంబునకుం జని, యొక్క సరోవర తీరంబునఁ దమతమ పరిధానంబులు పెట్టి జలక్రీడ లాడుచున్న, నవి సురకరువలిచేతం బ్రేరితంబు లయి కలిసిన నొండొరులం గడవఁ గొలను వెలువడు సంభ్రమంబున నక్కన్యక లన్యోన్యపరిధానంబులు వీడ్వడం గొని కట్టునెడ దేవయానిపుట్టంబు శర్మిష్ఠ గట్టిన, మఱి దాని పరిధానంబు దేవయాని పుచ్చుకొనక రోసి శర్మిష్ఠం జూచి యి ట్లనియె.
1.3.135
క. లోకోత్తరచరితుం డగు | నా కావ్యుతనూజ; నీకు నారాధిత; నేఁ
బ్రాకట భూసురకన్యక; | నీకట్టిన మైల గట్ట నేర్తునె చెపుమా.
1.3.136
వ. అనిన శర్మిష్ఠ యి ట్లనియె.
1.3.137
క. మా యయ్యకుఁ బాయక పని | సేయుచు దీవించి ప్రియము సెప్పుచు నుండున్
మీయయ్య; వెండి మహిమలు | నా యొద్దన పలుక నీకు నానయు లేదే?
1.3.138
వ. ‘నాకట్టిన పుట్టంబు నీకుం గట్టంగాదు గా కేమి’ యని గర్వంబున నెగ్గులాడి దేవయాని నొక్కనూతం ద్రోచి, శర్మిష్ఠ కన్యకాసహస్రపరివృత యయి క్రమ్మఱి వచ్చి నిజనివాసంబున నుండె; నంత.
1.3.139
ఉ. ఆనహుషాత్మజుం డగు యయాతి యధిజ్యధనుస్సహాయుఁ డై
యానతశాత్రవుండు మృగయారసలోలనిబద్ధబుద్ధిఁ ద
త్కానన మెల్లఁ గ్రుమ్మఱి నికామధృతశ్రముఁ డేగుదెంచె నం
దానలినాక్షి యున్న విపినాంతర కూపతటంబునొద్దకున్.
1.3.140
సీ. చనుదెంచి, యమ్మహాజనపతి జల మపే | క్షించి, యచ్చో విశ్రమించి, చూచి,
తత్కూపమున విలసత్కూలఘనవల్లి | యన్నిష్టసఖి నూఁదియున్న దాని,
గురుకుచయుగముపైఁ బరువడిఁ దొరఁగెడు | కన్నీరు పూరించుచున్న దానిఁ,
దనసమీపమునకు జనుల యాగమనంబు | పన్నుగాఁ గోరుచునున్న దాని,
ఆ. వరుణదేవుతోడఁ గర మల్గి జలనివా | సంబు విడిచి భూస్థలంబువలని
కరుగుదేర నున్న వరుణేంద్రుదేవియ | పోనిదాని దేవయానిఁ గనియె.
1.3.141
వ. కని ‘నీ వెవ్వరిదాన? వి ట్లేల యేకతంబ యివ్విపినాంతరకూపంబున నున్న దాన?’ వనిన విని దేవయాని యెప్పుడుం దమ విహరించుచున్న యవ్వనంబునకు మృగయావినోదార్థంబు యయాతి వచ్చుటంజేసి తొల్లియుఁజూచినది కావున నాతని నెఱింగి యి ట్లనియె.
1.3.142
తరలము. అమరసన్నిభ! యేను ఘోరసురాసురాహవభూమి న
య్యమరవీరులచేత మర్దితు లైన దానవులన్ గత
భ్రములఁగాఁ దన విద్యపెంపునఁ బ్రాప్తజీవులఁ జేసి య
త్యమితశక్తిమెయిన్ వెలింగినయట్టి భార్గవుకూఁతురన్.
1.3.143
వ. ‘దేవయాని యనుదానఁ బ్రమాదవశంబున నిన్నూతం బడి వెలువడ నేరకున్నదానను; న న్నుద్ధరించి రక్షింపు’ మనిన నవ్విప్రకన్యకయందుఁ దద్దయు దయాళుం డై.
1.3.144
చ. జలధివిలోలవీచి విలసత్కలకాంచి సమంచితావనీ
తలవహనక్షమం బయిన దక్షిణహస్తమునం దదున్నమ
ద్గళదురఘర్మవారికణక్రమకరాబ్జము వట్టి నూతిలో
వెలువడఁ గోమలిం దిగిచె విశ్రుతకీర్తి యయాతి ప్రీతితోన్.
1.3.145
వ. ఇట్లు దేవయాని నుద్ధరించి నిజపురంబున కరిగె; నిట దేవయానియు శర్మిష్ఠసేసిన యెగ్గువలన విముక్తయయి తన్ను రోయుచు వచ్చుదాని ఘూర్ణిక యను పరిచారికం గని ‘యేను వృషపర్వుపురంబు సొర నొల్ల; శర్మిష్ఠ చేత నా పడిన యవమానంబు మదీయ జనకున కెఱింగింపు’ మని పంచిన, నదియును నతిత్వరితగతిం జని తద్వృత్తాంతం బంతయు శుక్రునకుం జెప్పిన, శుక్రుండును నాక్షణంబ వచ్చి కోప ఘూర్ణిత బాష్ప పూరితనయన యై యున్న దేవయానిం గని యి ట్లనియె.
1.3.146
క. అనుపమ నియమాన్వితు లై | యనూనదక్షిణలఁ గ్రతుసహస్రంబులు సే
సినవారికంటె నక్రో | ధనుఁడ గరం బధికుఁ డండ్రు తత్త్వవిధిజ్ఞుల్.
1.3.147
క. అలిగిన నలుగక, యెగ్గులు | పలికిన మఱి విననియట్ల ప్రతివచనంబుల్
వలుకక, బన్నము వడి యెడఁ | దలఁపక యు న్నతఁడె చూవె ధర్మజ్ఞుఁ డిలన్.
1.3.148
వ. ‘కావున బుద్ధి గలవారికిఁ గ్రోధంబు గొనియాడం దగదు; శర్మిష్ఠ రాచకూఁతురు; గొండుక యది; దానితోడి దేమి ర’ మ్మనిన దేవయాని యి ట్లనియె.
1.3.149
క. కడు ననురక్తియు నేర్పును | గడఁకయు, గలవారి నుఱక కడవఁగ నెగ్గుల్
నొడివెడు వివేకశూన్యుల | కడ నుండెడు నంతకంటెఁ గష్టము గలదే.
1.3.150
వ. ‘ఈవృషపర్వుపురం బేను జొరనొల్ల; నెట యేనియుం బోదు’ ననిన శుక్రుండు ‘నాకు నీవ గతివి. నీతోడ నేనును వత్తు’ ననుచుఁగూఁతుం బట్టువఱుచుచున్నంత, నంతయుఁజారులవలన నెఱింగి వృషపర్వుండు శుక్రునొద్దకు వచ్చి నమస్కరించి యి ట్లనియె.
1.3.151
ఉ. దేవతలన్ జయించుచు నతిస్థిరసంపదలం ద్వదీయవి
ద్యావిభవంబు పెంపునన దానవు లుద్ధతు లైరి; కానినాఁ
డీ వనరాశిలోఁ జొరరె యింతకు నంతకకోపు లైన య
ద్దేవపతాకినీపతుల దివ్యనిశాతమహాయుధాహతిన్.
1.3.152
క. వారణ ఘోటక భాండా | గారంబులు మొదలుగాఁగఁ గల ధనములతో
సూరినుత! యిందఱము నీ | వారకములు గాఁగ మమ్ము వగవుము బుద్ధిన్.
1.3.153
వ. ‘ఈ దేవయాని కెద్ది యిష్టంబు దానిన యిత్తు, నడుగు’ మనిన దేవయాని సంతసిల్లి ‘యట్లేని శర్మిష్ఠ గన్యకా సహస్రంబుతో నాకు దాసి గావలయు, నిదియ నా కిష్టంబు; దీనిన యిచ్చునది’ యనిన వృషపర్వుం డప్పు డక్కూఁతు రావించి, కన్యకాసహస్రంబుతో దేవయానికి దాసిగా నిచ్చి శుక్రునకు మనఃప్రియంబు సేసిన, శర్మిష్ఠయు నగ్గురువచనంబునఁ గన్యకాసహస్రంబుతో నిత్యంబును దేవయానిం గొలుచుచుండె; నంత నొక్కనాఁడు.
1.3.154
క. వనకేళీ కౌతుకమునఁ | జనియెను శర్మిష్ఠఁ దొట్టి సఖులెల్ల ముదం
బునఁ గొలిచిరాఁగ విభవము | దన కమరఁగ దేవయాని తద్వనమునకున్.
1.3.155
వ. ఇ ట్లరిగి యవ్వనంబునఁ గన్యకలుం దానును బుష్పాపచయంబు సేయుచు, విమలజలప్రవాహ విలసితం బైన యొక్కసెలయేటి కెలన, నవవికచ కుసుమ సుకుమార కోరక నికర భరిత సహకార కురవక వకు ళాశోక తమాల సాల చ్ఛాయాశీతల సికతాతలంబున నిష్టవినోదంబుల నున్న యవసరంబున.
1.3.156
సీ. అంగనాజనుల యుత్తుంగ సంగత కుచ | కుంకుమ చందన పంకములయు
వారివ ధమ్మిల్లభారావకలిత ది | వ్యామోద నవపుష్పదామములయు
వారివ ముఖ సకర్పూరతాంబూలాది | వాసిత సురభి నిశ్శ్వాసములయు
వారివ పరిధాన చారుధూపములయు | విలసిత సౌరభావలులు దాల్చి
తే. యనిలుఁ డను దూత వోయి తోడ్కొనుచు వచ్చె | దేవయానిపాలికి మృగతృష్ణఁ జేసి
కాననంబునఁ గ్రుమ్మరువాని వీరు | నతిపరిశ్రాంతుఁ డైన యయాతి నంత.
1.3.157
క. తరళనయనాబ్జదళములు | నెరయఁగఁ బై మున్న చల్లి నృపసుతుఁ బూజిం
చిరి నవకుసుమమయాలం | కరణ విశేషముల నచటి కాంతలు ప్రీతిన్.
1.3.158
వ. అయ్యయాతియుఁ దత్ప్రదేశంబున సుఖోపవిష్టుం డై దేవయానిం దొల్లి యెఱింగినవాఁ డై యతిశయరూప లావణ్యగుణసుందరి యయిన శర్మిష్ఠ నెఱుంగ వేఁడి, ‘మీ రెవ్వరివారలు మీకులగోత్ర నామంబు లెఱుంగ వలతుం జెప్పుం’ డనిన నారాజునకు దేవయాని యి ట్లనియె.
1.3.159
తే. నన్ను మున్న యెఱుంగు; దిన్నాతి నాకు | దాసి, వృషపర్వుఁ డను మహాదానవేంద్రు
కన్య; నాయొద్ద నెప్పుడుఁ గదలకుండు | ననఘ! మఱి దీని శర్మిష్ఠ యండ్రు జనులు.
1.3.160
ఉ. నిగ్రహ మేది నన్నుఁ దరణిప్రభ! కూపము వెల్వరించునాఁ
డుగ్రమయూఖసాక్ష్యముగ నున్నతదక్షిణపాణిఁ జేసి భూ
పాగ్రణి! నాదు దక్షిణకరాగ్రము వట్టితి కాన మున్న పా
ణిగ్రహణంబు సేసి; తది నీయెడ విస్మృతిఁ బొందఁ బాడియే.
1.3.161
ఉ. ‘నన్ను వివాహ మై నహుషనందన! యీలలితాంగిఁ దొట్టి యీ
కన్నియలందఱున్ దివిజకన్యలతో నెన యైనవారు నీ
కున్నతిఁ బ్రీతి సేయఁగ నృపోత్తమ! వాసవుఁ బోలి లీలతో
నిన్నరలోకభోగము లనేకము లందుము నీవు’ నావుడున్.
1.3.162
వ. ‘క్షత్త్రియకన్యకల బ్రాహ్మణులు వివాహం బగుదురు గాక; యధర్మోత్తరంబుగా క్షత్త్రియులు బ్రాహ్మణకన్యకల వివాహం బగుదురే? నీపలుకులు ధర్మ విరుద్ధంబులు; మఱియు సర్వవర్ణాశ్రమధర్మంబులు సంకరంబులు గాకుండ రక్షించుచున్న యేన యిట్టి యధర్మంబున కొడంబడితినేని జగత్ప్రవృత్తి విపరీతం బగు’ ననిన నయ్యయాతికి దేవయాని యి ట్లనియె.
1.3.163
క. ‘వెలయఁగ ధర్మాధర్మం | బులు నడపుచు నిఖిలలోకపూజ్యుండై ని
ర్మలుఁ డగు శుక్రుఁడు పంచిన | నలఘుభుజా! నను వివాహ మగుదే?’ యనినన్.
1.3.164
వ. ‘అమ్మహాముని వచ్చి యిది ధర్మవిరుద్ధంబు గా దని చెప్పెనేని నిన్ను వివాహం బగుదు’ నని యయాతి యొడంబడిన దేవయాని యప్పుడ శుక్రు రావించిన.
1.3.165
క. తనదివ్యతేజమున న | వ్వన మెల్ల వెలుంగుచుండ వచ్చెను భృగునం
దనుఁడు నిజనందనకుఁ బ్రియ | మొనరింపఁగఁదలఁచి దానియొద్దకుఁ బ్రీతిన్.
1.3.166
క. అతిసంభ్రమమున నవనీ | పతి విహితోత్థానుఁ డై తపశ్శక్తిఁ బ్రజా
పతినిభుఁ డగు భార్గవునకు | నతిభక్తిం బ్రణమితోత్తమాంగుం డయ్యెన్.
1.3.167
వ. మఱియు దేవయానియు శర్మిష్ఠయుం గన్యకాసహస్రంబును నత్యంతభక్తితోఁ గ్రమంబున నమస్కరించి; రంత దేవయాని శుక్రున కి ట్లనియె.
1.3.168
ఆ. ఇన్నరేంద్రుచేత మున్న గృహీత మై | యున్న నాకరంబు గ్రన్న నింక
నొరున కర్హ మగునె పరిణయ విషయ మై | ధరఁ బరిగ్రహింపఁ బరమమూర్తి!.
1.3.169
వ. ‘కావున నాకు నీ జన్మంబునఁ బతి యయాతియ; యితండును భవద్వచనంబున నన్ను వివాహం బగుదు ననియె; నిందు ధర్మవిరోధంబు లేకుండు నట్లుగాఁబ్రసాదింపవలయు’ ననిన శుక్రుండు గరుణించి ‘యయాతికి నీకును నయిన యీ వివాహంబునం దపక్రమదోషంబు లేకుండెడు’ మని వరం బిచ్చి యయ్యిరువురకుం బరమోత్సవంబున వివాహంబు సేసి, శర్మిష్ఠం జూపి ‘యిది వృషపర్వుని కూఁతురు; దీనికిఁ బ్రియంబున నన్నపాన భూషణాచ్ఛాదన మాల్యానులేపనాదుల సంతోషంబు సేయునది; శయనవిషయంబునఁ బరిహరించు నది’ యని పంచి, కూఁతు నల్లునిం బూజించిన; నయ్యయాతియు శుక్రుని వీడ్కొని దేవయానిని శర్మిష్ఠను గన్యకా సహస్రంబును దోడ్కొని నిజపురంబునకుం జని యంతఃపురరమ్యహర్మ్యతలంబున దేవయాని నునిచి, తదనుమతంబున నశోకవనికాసమీపంబున నొక్క గృహంబునందుఁ గన్యకాసహస్రంబుతో శర్మిష్ఠ నునిచి, దేవయానియందు సుఖోపభోగపరుం డై యున్నఁ; గొండొకకాలంబునకు దేవయానికి యదుతుర్వసు లను కొడుకులు పుట్టి; రంత శర్మిష్ఠ సంప్రాప్తయౌవనయు ఋతుమతియు నై యాత్మగతంబున.
1.3.170
చ. అసదృశయౌవనం బిది యనన్యధనం బగు నొక్కొ! నాకు ని
క్కుసుమ సముద్గమంబును నగోచర దుర్గమ దుర్గవల్లరీ
కుసుమ సముద్గమం బగు నొకో! పతిలాభము లేమిఁ జేసి; యొ
ప్పెసఁగఁగ దేవయాని పతి నేమి తపం బొనరించి కాంచెనో!
1.3.171
క. పతిఁ బడసి సుతులఁ బడయఁగ | నతివలు గోరుదురు; గోరినట్టుల తనకుం
బతిఁ బడసి సుతులఁ బడసెను; | సతు లీభార్గవికి భాగ్యసంపద నెనయే.
1.3.172
తరువోజ. ఈ రాజునంద నా హృదయంబు దవిలి యెప్పుడు నుండు; న న్నీతఁడు గరము
కారుణ్యమునఁ బ్రీతిగలయట్లు సూచుఁ; గమలాక్షి భార్గవకన్య దా నెట్లు
గోరి యీతనిఁ దనకును బతిఁ జేసికొనియె నటుల యేను గోరి లోకైక
భారధురంధరుఁ బరహితు ధర్మపరు నహుషాత్మజుఁ బతిఁ జేసికొందు.
1.3.173
వ. అని విచారించుచున్న యవసరంబున దాని పుణ్యస్వరూపంబు సన్నిహితం బైన య ట్లొక్కనాఁడు యయాతి యశోకవని కాలోకనతత్పరుండైవచ్చువాఁ డేకతంబ యున్న శర్మిష్ఠం గనిన, నదియును సంభ్రమ వినయావనత యై తనవలన నమ్మహీపతి ప్రసన్నచిత్తుం డగుట యెఱింగి కరకమలంబులు మొగిచి యి ట్లనియె.
1.3.174
ఉ. నీలగళోపమాన! కమనీయగుణోన్నతిఁ జెప్పఁ జాలు న
న్నేలిన దేవయానికి నరేశ్వర! భర్తవు గాన నాకునుం
బోలఁగ భర్త వీవ; యిది భూనుత! ధర్మపథంబు; నిక్కువం;
బాలును దాసియున్ సుతుఁడు నన్నవి వాయనిధర్మముల్ మహిన్.
1.3.175
వ. ‘అద్దేవయానిం బరిగ్రహించినప్పుడ తద్ధనం బగుట నేనును భవత్పరిగ్రహంబ కావున నన్నుం గరుణించి నాకు ఋతుకాలోచితంబుఁ బ్రసాదింపవలయు’ ననిన నయ్యయాతి యి ట్లనియె.
1.3.176
క. లలితాంగి! శయన మొక్కఁడు | వెలిగా రుచిరాన్నపాన వివిధాభరణా
దుల శర్మిష్ఠకు నిష్టము | సొలయక చేయు మని నన్ను శుక్రుఁడు పంచెన్.
1.3.177
వ. ‘ఏ నమ్మహామునివచనంబున కప్పు డొడంబడితి; నెట్లు బొంకనేర్తు’ ననిన శర్మిష్ఠ యి ట్లనియె.
1.3.178
క. చను బొంకఁగఁ బ్రాణాత్యయ | మున, సర్వధనాపహరణమున, వధ గావ
చ్చిన విప్రార్థమున, వధూ | జన సంగమమున, వివాహసమయములందున్.
1.3.179
వ. ‘ఈ యేనింటియందు నసత్యదోషంబు లేదని మునివచనప్రమాణంబు గలదు; నీవు వివాహసమయంబున నొడంబడితివి కావున నసత్య దోషంబునం బొంద’ వనిన నయ్యయాతి యొడంబడి శర్మిష్ఠకు నభిమతం బొనరించె; నదియుఁ దత్సమాగ మంబున గర్భిణి యై కొడుకుం గనిన విస్మయపడి దేవయాని దానికడకు వచ్చి యి ట్లనియె.
1.3.180
తే. బాల వయ్యు నత్యుత్తమశీలవినయ | గౌరవాన్విత వై నిర్వికారవృత్తి
నున్న నీ కున్నయునికిన సన్నుతాంగి! | సుతుఁడు పుట్టుట యిది గడుఁజోద్య మయ్యె.
1.3.181
వ. అది యె ట్లని యడిగిన శర్మిష్ఠ లజ్జావనతవదన యయి యి ట్లను; ‘నెందేనినుండి యొక్కమహాముని నిఖిల వేదవేదాంగపారగుండు వచ్చి ఋతుమతినై యున్న నన్నుం జూచి నాకుఁ బుత్త్రోత్పత్తిఁ బ్రసాదించె’ ననిన విని దేవయాని నిజనివాసంబునకుం జనియె; శర్మిష్ఠయు నయ్యయాతివలనఁ గ్రమంబున ద్రుహ్వ్యను పూరు లనంగా మువ్వురు గొడుకులం బడసి యున్నంత, నొక్కనాఁడు.
1.3.182
సీ. కరువలిచేఁ దూలుకపిల జటాలియ | కరమొప్పు శిఖలుగాఁ గనకరత్న
మయజాల భూషణామలదేహదీప్తుల | తేజంబుగాఁ బ్రవిదీప్యమాన
యాగశతంబుల నర్చితం బైన మూఁ | డగ్నులు ప్రత్యక్ష మైన యట్లు
దనమ్రోల శర్మిష్ఠతనయులు గ్రీడించు | చుండంగ నున్న యయ్యుర్విఱేని
ఆ. కడకు నేఁగుదెంచెఁ గన్యలు దనుజాధి | రాజసుతయుఁ దోడరాఁగ నొప్పి
దేవి దేవయాని దేవేంద్రుదేవియ | పోలె నెంతయును విభూతి మెఱసి.
1.3.183
వ. ఇ ట్లరుగుదెంచి యధికతేజస్వులయి యయాతి ప్రతిబింబంబులుం బోని యబ్బాలకులం జూచి’ యిక్కుమారు లెక్కడి వా? రెవ్వరికొడుకు? లని యయాతి నడిగి యలబ్ధప్రతివచనయై ‘మీ తల్లిదండ్రులెవ్వ’ రని యక్కుమారుల నడిగిన.
1.3.184
క. తరుణప్రదేశినులు మా | సరముగ వారలు యయాతి శర్మిష్ఠలఁ జూ
పిరి తండ్రియుఁ దల్లియు నని | కర మనురాగిల్లెఁ గన్యకానివహంబున్.
1.3.185
వ. ఇట్లు ద న్నెఱుంగకుండ యయాతి శర్మిష్ఠవలన లబ్ధసంతానుం డగుట యప్పు డెఱింగి.
1.3.186
చ. పతివిహితానురాగమున భార్గవుపుత్త్రి యయాతిచేత వం
చిత యయి, వాఁడు దానవికిఁ జేసిన నెయ్య మెఱింగి, కోపదుః
ఖిత యయి, తండ్రిపాలి కతిఖేదమునం జని, దీర్ఘనేత్రని
ర్గతజలధారలం గడిగెఁ గాంత తదీయ పదాబ్జయుగ్మమున్.
1.3.187
వ. అయ్యయాతియు దానిం బట్టువఱుచుచుఁ డోడన చని శుక్రుం గని నమస్కరించి యున్న నద్దేవయాని గద్గద వచన యై ‘యధర్మంబున ధర్మంబు గీడ్పఱిచి యిమ్మహీశుం డాసురంబున నాసురియం దనురక్తుం డై పుత్త్రత్రయంబు వడసి నాకవమానంబు సేసె’ ననిన విని శుక్రుండు యయాతి కలిగి ‘నీవు యౌవనగర్వంబున రాగాంధుండ వై నాకూఁతున కప్రియంబు సేసితివి కావున జరాభారపీడితుండవు గ’ మ్మని శాపం బిచ్చిన నయ్యయాతి శుక్రున కి ట్లనియె.
1.3.188
క. ఋతుమతి యై పుత్త్రార్థము | పతిఁ గోరిన భార్యయందుఁ బ్రతికూలుం డై
ఋతువిఫలత్వము సేసిన | యతనికి మఱి భ్రూణహత్య యగు నండ్రు బుధుల్.
1.3.189
క. దానికి భీతుఁడ నై య | మ్మానవతీ ప్రార్థనం గ్రమం బొనరఁగ సం
తానము వడసితి నెదలో | దీనికి నలుగంగఁ దగునె దివ్యమునీంద్రా!
1.3.190
వ. ‘ఏ నిద్ద్దేవయానియందు విషయోపభోగతృప్తుండఁ గాను, జరాభారంబుఁ దాల్పనోప’ నని ప్రార్థించిన విని వానికి శుక్రుండు గరుణించి ‘యట్లేని నీముదిమి నీకొడుకులయం దొక్కరునిపయిం బెట్టి వానిజవ్వనంబు నీవు గొని రాజ్యసుఖంబు లనుభవింపుము; నీవు విషయోపభోగ తృప్తుండ వైన మఱి నీముదిమి నీవ తాల్చి, వాని జవ్వనంబు వానికి నిచ్చునది; నీ ముదిమిఁ దాల్చిన పుత్త్రుండ రాజ్యంబున కర్హుండును, వంశకర్తయు నగు’ ననిన నయ్యయాతి శుక్రు వీడ్కొని దేవయానీసహితుం డై తనపురంబునకు వచ్చి శుక్రుశాపంబున జరాభారంబుఁ దాల్చిన, వానికి.
1.3.191
క. తల వడఁకఁ దొడఁగె, నింద్రియ | ముల గర్వ మడంగె, నంగములు వదలె, వళీ
పలితంబు లయ్యె, వగరును | దలయేరును నుక్కిసయును దరికొనుదెంచెన్.
1.3.192
వ. ఇట్లు జరాక్రాంతుం డైన యయాతి గొడుకులనెల్లరావించి ‘నాకు విషయసుఖతృప్తి లేకున్నయది గావున మీయందొక్కరుండు నా ముదిమి గొని తన జవ్వనంబు నా కిచ్చునది’ యనిన విని యదు తుర్వసు ద్రుహ్వ్యనులు దండ్రి కి ట్లనిరి.
1.3.193
ఆ. తగిలి జరయు రుజయు దైవవశంబున | నయ్యెనేని వాని ననుభవింత్రు
గాక యెఱిఁగి యెఱిఁగి కడఁగి యారెంటిఁ జే | కొందురయ్య యెట్టి కుమతు లైన.
1.3.194
క. నరలు గల కాము నైనను | దరుణులు రోయుదురు డాయ; ధనపతి యయ్యుం
బురుషుఁడు దుర్వారజరా | పరిభూతి నభీష్టభోగబాహ్యుఁడ కాఁడే.
1.3.195
వ. అని యొడంబడ కున్న నలిగి యయాతి ‘యదువంశంబునవారు రాజ్యంబున కయోగ్యులుగాఁ, దుర్వసు వంశంబునవారు ధర్మాధర్మవివేకశూన్యు లై సంకీర్ణవర్ణ కిరాతులకు రాజులుగా, ద్రుహ్యువంశంబునవారు డుపప్లవసంతార్యం బైన దేశంబునకు రాజులుగా, జరాదూషకుం డగుట ననువంశంబునవారు ముదియు నంతకు నుండక జవ్వనంబునన పంచత్వంబున కరుగు వారునుంగా శాపంబిచ్చి, యానలువురకుం గొండుక వాని శర్మిష్ఠాపుత్త్రుఁ బూరుం బిలిచి యడిగిన, వాఁడు దండ్రి కోరినయట్ల చేసిన నవయౌవనుం డై యయాతి యభిమతసుఖంబులు సహస్రవర్షంబు లనుభవించి తృప్తుం డై, పూరుజవ్వనంబు వానిక యిచ్చి, తన జరాభారంబుఁ దాన తాల్చి నిజాజ్ఞావిధేయ చతురంత మహీతల బ్రహ్మక్షత్త్రాది వర్ణముఖ్యుల నెల్ల రావించి మంత్రిపురోహితసామంత పౌరజన సమక్షంబున సకలక్షోణీ చక్రసామ్రాజ్యంబునకుఁ బూరు నభిషిక్తుం జేసిన సర్వప్రకృతిజనంబు లారాజున కి ట్లనిరి.
1.3.196
మ. అవిచారం బని పల్క నోడెదము ధర్మాభిజ్ఞ! నీయగ్రసం
భవుఁ డత్యున్నతశక్తియుక్తుఁడు మహీభారప్రగల్భుండు భా
ర్గవదౌహిత్రుఁడు పాత్రుఁ డీయదుఁడు లోకఖ్యాతుఁ డుండంగ నీ
భువనేశత్వభరంబుఁ బూన్పఁ దగునే పూరున్ జఘన్యాత్మజున్.
1.3.197
వ. అనిన వారల కయ్యయాతి యి ట్లనియె.
1.3.198
క. యదుఁ డగ్రతనూజుఁడు నా | హృదయ సముద్భవుఁడు దానయిన మద్వచనం
బిది యేటిది యని కడు దు | ర్మదుఁ డై చేయక కృతావ మానుం డయ్యెన్.
1.3.199
క. తనయుండు దల్లిదండ్రులు | పనిచినపని సేయఁడేని, పలు కెడలోఁ జే
కొనఁడేని, వాఁడు తనయుం | డనఁబడునే? పితృధనమున కర్హుం డగునే?
1.3.200
క. పూరుఁడు గొండుక యయ్యును | భూరిగుణజ్యేష్ఠుఁడును సుపుత్త్రుఁడు నవనీ
భారసహిష్ణుఁడు నాతఁడ | కోరినకార్యంబు దీర్చి కుశలుం డగుటన్.
First 200 of 230 passages. Read on