Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 1.3.67

Āndhra Mahābhāratamu 1.3.67

Language
Telugu

1.3.67

వ. మఱియుఁ బులస్త్యుం డను మానసపుత్త్రునకు ననేకరాక్షసులు పుట్టిరి; పులహుం డను మానసపుత్త్రునకుఁ గిన్నర కింపురుషాదులు పుట్టిరి; క్రతు వను మానసపుత్త్రునకు సత్యవ్రత పరాయణు లైన పతంగ సహచరులు పుట్టిరి; పైతామహుం డైన దేవుం డను మునికిఁ బ్రజాపతి పుట్టె; వానికి ధూమ్రా బ్రహ్మవిద్యా మనస్వినీ రతాశ్వసాశాండిలీ ప్రభాత లనంగా నేడ్వురు భార్య లై; రందు ధూమ్రకు ధరుండును, బ్రహ్మవిద్యకు ధ్రువుండును, మనస్వినికి సోముండును, రతకు నహుండును, శ్వసకు ననిలుండును, శాండిలికి నగ్నియుఁ, బ్రభాతకుఁ బ్రత్యూష ప్రభాసు లనంగా నెనమండ్రు వసువులును బుట్టి; రందు ధరుం డను వసువునకు ద్రవిణుండును. హుతవావ్యవహుండునుం బుట్టిరి; ధ్రువుండను వసువునకుఁ గాలుండు పుట్టె; సోముం డను వసువునకు మనోహర యనుదానికి వర్చసుండును శిబిరుండును బ్రాణుండును రమణుండును బృథ యను కూఁతురునుం బుట్టిరి; పృథకుఁ బదుండ్రు గంధర్వసుతులు పుట్టిరి; యహుం డను వసువునకు జ్యోతి పుట్టె; ననిలుండను వసువునకు శివ యను దానికి మనోజవుండును నవిజ్ఞాతగతియునుం బుట్టిరి. అగ్ని యను వసువునకుఁ గుమారుండు పుట్టెఁ; బ్రత్యూషుం డను వసువునకు ఋషియైన దేవలుండు పుట్టెఁ; బ్రభాసుం డను వసువునకు బృహస్పతి చెలియ లైన యోగసిద్ధికి విశ్వకర్మ పుట్టె.