Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 1.3.80

Āndhra Mahābhāratamu 1.3.80

Language
Telugu

1.3.80

వ. మఱియు నేకాదశరుద్రుల యంశంబునఁగృపుఁడు పుట్టె; సూర్యునంశంబునఁగర్ణుండు పుట్టె; ద్వాపరాంశంబున శకుని పుట్టె; నరిష్టాపుత్త్రుం డయిన హంసుం డను గంధర్వ విభుండు ధృతరాష్ట్రుం డయి పుట్టె; మతి యనువేల్పుగాంధారి యై పుట్టె; మఱియు నయ్యిద్దఱకుం గలియంశంబున దుర్యోధనుండు పుట్టెఁ; బౌలస్త్య భ్రాతృవర్గంబు దుశ్శాసనాది దుర్యోధనానుజ శతం బై పుట్టె; హిరణ్యకశిపుండు శిశుపాలుండై పుట్టె; సంహ్లాదుండు శల్యుం డై పుట్టె; ననుహ్లాదుండు ధృష్ణకేతుం డై పుట్టె; శిబి యనువాఁడు ద్రుమసేనుం డై పుట్టె; బాష్కళుండు భగదత్తుఁ డై పుట్టె; విప్రచిత్తి యను దానవుండు జరాసంధుం డై పుట్టె; నయశ్శిరుండును నశ్వశీర్షుండును నయశ్శంకుండును గగనమూర్ధుండును వేగవంతుండును ననువా రేవురు దానవులు గేకయరాజు లయి పుట్టిరి; కేతుమంతుండమితౌజుం డై పుట్టె; స్వర్భానుం డుగ్రసేనుండై పుట్టె; జంభుండు విశోకుండై పుట్టె; నశ్వపతి కృతవర్మ యై పుట్టె; వృషపర్వుండు దీర్ఘప్రజ్ఞుం డై పుట్టె; నజరుండు మల్లుం డై పుట్టె; నశ్వగ్రీవుండు రోచమానుం డై పుట్టె; సూక్ష్ముండు బృహద్రథుం డై పుట్టెఁ; దుహుం డనువాఁడు సేనాబిందుం డై పుట్టె; నేకచక్రుండు ప్రతివింధ్యుం డై పుట్టె; విరూపాక్షుండు చిత్రవర్మ యై పుట్టె; హరుండును నహరుఁడును సుబాహు బాహ్లికు లై పుట్టిరి; చంద్రవక్త్రుండు ముంజకేశుం డై పుట్టె; నికుంభుండు దేవాపి యై పుట్టె; శరభుండు సోమదత్తుం డై పుట్టెఁ; జంద్రుండు చంద్రవర్మ యై పుట్టె; నర్కుండు ఋషికుం డై పుట్టె; మయూరుండు విశ్వుం డై పుట్టె; సుపర్ణుండు క్రోధకీర్తి యై పుట్టె; రాహువు క్రోధుం డై పుట్టెఁ; జంద్రహంత శునకుం డై పుట్టెఁ; నశ్వుం డనువా డశోకుండైపుట్టె; భద్రహస్తుండు నందుం డై పుట్టె; దీర్ఘజిహ్వుండు గాశిరాజై పుట్టెఁ; జంద్రవినాశనుండు జానకి యై పుట్టె; బలీనుండు పౌండ్రమత్స్యుం డై పుట్టె; వృత్రుండు మణిమంతుం డై పుట్టెఁ; గాలాపుత్త్రు లెనమండ్రు క్రమంబున జయత్సేనాపరాజితనిషధాధిపతి శ్రేణిమన్మ హౌజో -భీరు సముద్రసేన బృహత్తులై పుట్టిరి; క్రోధ వశగణంబువలన మద్రక కర్ణ వేష్ట సిద్ధార్థ కీటక సువీర సుబాహు మహావీర బాహ్లిక క్రథ విచిత్ర సురథ శ్రీమన్నీల చీరవాసో భూమిపాల దంతవక్త్ర రుక్మిజనమేజ యాషాఢ వాయువేగ భూరితేజ ఏకలవ్య సుమిత్ర వాటధాన గోముఖ కారూషకక్షేమ ధూర్తి శ్రుతాయు రుద్వహ బృహత్సేన క్షేమాగ్ర తీర్థకుహర మతిమ దీశ్వరాదు లనేకులు పుట్టిరి; కాలనేమి కంసుండై పుట్టె; స్త్రీ పుంసరూప ధరుం డైన గుహ్యకుండు శిఖండి యై పుట్టె; మరుద్గణాంశంబునఁ బాండురాజు పుట్టె.