Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 1.5: ఆదిపర్వము — పంచమాశ్వాసము

Āndhra Mahābhāratamu 1.5

Language
Telugu

ఆదిపర్వము — పంచమాశ్వాసము

1.5.1

క. శ్రీనాథమూర్తి! విబుధని | ధాన! మహాదాన తర్పితద్విజవర! వేం
గీనాథ! పార్థనిభ! యభి | మానమహార్ణవ! మహేంద్రమహిమాతిశయా!

1.5.2

వ. అక్కథకుండు శౌనకాదిమహామునులకుం జెప్పె: నట్లు ధృతరాష్ట్రపాండువిదురులు భీష్మాభిరక్షితులై పెరుఁగుచు, నుపనయనానంతరంబున నధ్యయనం బొనరించి రాజవిద్యలయందు జితశ్రము లై యున్నంత.

1.5.3

సీ. అమరాపగాసుతు ననుశాసనంబునఁ| గౌరవ రాజ్యంబు గడు వెలింగెఁ,
గురుభూము లుత్తరకురువులకంటెను | నధికలక్ష్మీయుక్తి నతిశయిల్లె,
ధర్మాభిసంరక్షితం బైన భూప్రజ | కెంతయు నభివృద్ధి యెసఁగుచుండె,
వలసినయప్పుడు వానలు గురియుట | సస్యసమృద్ధి ప్రశస్త మయ్యెఁ,
ఆ. బాలు సేఁపెఁ బుష్పఫలభరితంబు లై | తరువనంబు లొప్పె, ధర్మకర్మ
నిరతిఁ జేసి కరము నెమ్మితో నన్యోన్య | హితముఁ జేయుచుండి రెల్ల జనులు

1.5.4

మ. అమలాచారపవిత్రభూసురవరేణ్యాగార పుణ్యప్రదే
శములం దధ్యయనారవంబు విధివత్స్వాహాస్వధాస్వస్తిశ
బ్దములున్‌ మంగళతూర్యఘోషములు నుద్యత్కౌతుకాశీర్నినా
దములున్‌ రమ్యతరంబు లయ్యె ధరణిం దద్రాజ్యసంవృద్ధితోన్‌.

1.5.5

వ. ఇట్లు బ్రహ్మోత్తరంబుగాఁ బ్రజాభివృద్ధియు సస్యసమృద్ధియు నగుచుండ, నాంబికేయు ధృతరాష్ట్రు రాజ్యాభిషిక్తుం జేసి, భీష్ముండు దనకు విల్లును విదురుబుద్ధియును సహాయంబులుగా రాజ్యంబు రక్షించుచున్నంత.

1.5.6

ఉ. ఆయము గర్వమున్‌ విడిచి యన్యపతుల్‌ పనిసేయ నిట్లు గాం
గేయభుజాబలంబున నికృత్తవిరోధిసమాజుఁ డై కుమా
రాయితశక్తిశాలి ధృతరాష్ట్రుఁడు రాజ్యము సేయుచుండె న
త్యాయతకీర్తితోఁ దనకు హస్తిపురం బది రాజధానిగన్‌.

1.5.7

వ. ఇట్లు రాజ్యంబు సేయుచు నారూఢ యౌవనుం డైన యా ధృతరాష్ట్రునకు వివాహంబు సేయ సమకట్టి, భీష్ముండు గాంధారపతి యయిన సుబులుకూఁతు గాంధారి యనుదాని, నతిశయ రూపలావణ్య శీలాభిజాత్య సమన్వితఁగా బ్రాహ్మణులవలన విని విదురున కి ట్లనియె.

1.5.8

క. ఈ వంశము విచ్ఛేదము | గావచ్చినఁ గులము నిలుపఁగా సత్యవతీ
దేవి వచనమున సంతతి | గావించెను వ్యాసుఁ డను జగత్కర్త దయన్‌.

1.5.9

క. ఈ కులము వివర్ధింపఁగ | నా కభిమత; మేను వింటి నలినేక్షణ దా
నేకశత సుతులఁ బడయఁగ | నా కన్యక వరము వడసె నటె హరుచేతన్‌.

1.5.10

వ. ‘కావున ధృతరాష్ట్రునకు గాంధారిని వివాహంబు సేయుదము; గాంధారపతి మనతోడి సంబంధమునకుం దగు’ నని నిశ్చయించి సుబలు పాలికిఁ దగుముదుసళ్ళం బంచిన, సుబలుండును సుముఖుం డై ‘కురుకులవిస్తారకుం డయిన ధృతరాష్ట్రుండ యిక్కన్యకకు నర్హుండు గావున నా రాజునకు గాంధారి నిచ్చితి’ ననిన, వాని బంధుజనంబు లెల్లఁ దమలో ని ట్లనిరి.

1.5.11

తే. అంగములలోన మే లుత్తమాంగ, మందు | నుత్తమంబులు గన్నుల యుర్విజనుల,
కట్టి కన్నులు లే వను నదియకాక | యుత్తముఁడు గాఁడె సద్గుణయుక్తి నతఁడు.

1.5.12

వ. అనిన వారిపలుకులు విని గాంధారి ధృతరాష్ట్రునకుఁ బితృవచనదత్తఁగాఁ దన్ను నిశ్చయించి, ‘నాకుఁ బతి యిమ్మహీపతియ కాని యొరుల నొల్ల’ నని యప్పరమపతివ్రత పరపురుషదర్శనంబు పరిహరించి, పతి కను గుణంబుగా నేత్రపట్టంబునఁ దన నేత్రంబులు గట్టికొని యుండె; నంత నక్కన్యం దోడ్కొని దాని సహోదరుం డయిన శకుని మహావిభూతితో హస్తిపురంబునకు వచ్చిన, ధృతరాష్ట్రుండును బరమోత్సవంబున గాంధారిని వివాహంబై దానితోఁ బుట్టిన కన్యకల సత్యవ్రతయు సత్యసేనయు సుదేష్ణయు సంహితయుఁ దేజశ్శ్రవయు సుశ్రవయు నికృతియు శుభయు శంభువయు దశార్ణయు నను పదుండ్ర నొక్కలగ్నంబున వివాహం బయి మఱియును.

1.5.13

క. కులమును రూపము శీలముఁ | గల కన్యలఁ దెచ్చి తెచ్చి గాంగేయుం డీ
నలఘుఁడు ధృతరాష్ట్రుఁడు కుల | తిలకుండు పరిగ్రహించె దేవీశతమున్‌.

1.5.14

వ. అంత.

1.5.15

సీ. వేదంబులందుఁ బ్రవీణుఁడై మఱి సర్వ | శాస్త్రంబులందుఁ గౌశలము మెఱసి
యసికుంత కార్ముకాద్యాయుధ విద్యల | యందు జితశ్రముఁ డై తురంగ
సింధురారోహణశిక్షల దక్షుఁడై | నీతిప్రయోగముల్‌ నెఱయ నేర్చి
యతిమనోహర నవయౌవనారూఢుఁడై | కఱలేని హిమరశ్మికాంతి దాల్చి
ఆ. పెరుఁగుచున్న కొడుకుఁ బృథువక్షు నాయత | బాహు దీర్ఘదేహుఁ బాండుఁ జూచి
వీనివలనఁ గులము వెలుఁగు నంచును నెడ | జాహ్నవీసుతుండు సంతసిల్లి.

1.5.16

వ. ఇ క్కుమారున కెందు వివాహంబు సేయుద మని విదురుతో విచారించుచుండె; నంతఁ దొల్లి.

1.5.17

సీ. యాదవకులవిభుఁ డగు శూరుఁ డను నాతఁ | డాత్మతనూజలయందుఁ బెద్ద
దాని నంబుజముఖి ధవళాక్షి వసుదేవు | చెలియలిఁ బృథ యను చెలువఁ బ్రీతిఁ
దనమేనయత్తనందనుఁ డపుత్త్రకుఁ డైన | యా కుంతిభోజున కర్థితోడఁ
గూఁతుఁగా నిచ్చినఁ గోమలి యాతని | యింటఁ దా నుండి యనేక విప్ర
తే. వరుల కతిథిజనులకు నవారితముగఁ | దండ్రి పనుపున నిష్టాన్నదాన మొనరఁ
జేయుచున్న దుర్వాసుఁ డన్‌ సిద్ధమౌని | వచ్చె నతిథి యై భోజనవాంఛఁ జేసి.

1.5.18

వ. కుంతియు న మ్మునివరు కోరిన యాహారంబు వెట్టిన సంతుష్టుం డై యమ్మునివరుం డి ట్లనియె; ‘నీమంత్రంబున నీ వే వేల్పుల నారాధించి తవ్వేల్పులు నీకోరినయట్టి పుత్త్రకుల నిత్తు’ రని యాపద్ధర్మంబుగా నొక్కదివ్యమంత్రంబుఁబ్రసాదించి చనిన, నమ్మంత్రశక్తి యెఱుంగ వేఁడి కుంతి యొక్కనాఁ డేకాంతంబ గంగకుం జని యవగాహనంబు సేసి.

1.5.19

క. అ మ్మంత్రముఁ దనదగు హృద | యమ్మున నక్కన్య నిలిపి యాదిత్యున క
ర్ఘ్యమ్మెత్తి ‘ నాకు నిమ్ము ప్రి | యమ్మున నీ యట్టి పుత్త్రు నంబుజమిత్త్రా! ’

1.5.20

క. అని కేలు మొగిచి నిలిచిన | వనజాయతనేత్ర కడకు వచ్చెను గగనం
బున నుండి కమలమిత్త్రుఁడు | తన తీవ్రకరత్వ ముడిగి తరుణద్యుతితోన్‌.

1.5.21

వ. అ క్కన్యకయు నట్టి తేజోరూపంబు సూచి విస్మయంబునను భయంబునను గడు సంభ్రమించి నడునడ నడుంగుచున్నదాని ‘నోడకుండు’ మని సూర్యుండు ప్రసన్నుండై ‘నీకోరినవరం బీ వచ్చితి’ ననిన గొంతియు లజ్జావనతవదనయై’ యొక్కబ్రహ్మవిదుండు నాకుం గరుణించి యిమ్మంత్రం బుపదేశించిన దానిశక్తి నెఱుంగ వేఁడి యజ్ఞానంబున నిన్నుం ద్రిలోకైకదీపకుం ద్రిపురుషమూర్తిఁ ద్రివేదమయు రావించిన యీయపరాధంబు నాకు సహింపవలయు.’

1.5.22

ఆ. ‘ఎఱుకలేమిఁ జేసి యింతు లెప్పుడు నప | రాధయుతలు సాపరాధ లయిన
వారిఁ గరుణ నెల్లవారును రక్షింతు’ | రనుచు సూర్యునకు లతాంగి మ్రొక్కె.

1.5.23

వ. సూర్యుండును ‘నీకు దుర్వాసుం డిచ్చిన వరంబును మంత్రంబుశక్తియు నెఱుంగుదు; మదీయదర్శనంబు వృథగాదు; నీ యభిమతంబు సేయుదు’ ననిన గొంతి యి ట్లనియె.

1.5.24

ఆ. ఏను మంత్రశక్తి యెఱుఁగక కోరితిఁ | గన్య కిదియు కోరఁగాదు నాక;
నాకు గర్భమయిన నాతలిదండ్రులుఁ | జుట్టములును నన్నుఁ జూచి నగరె?

1.5.25

వ. అనిన విని సూర్యుండు దానికిఁ గరుణించి ‘నీకు సద్యోగర్భంబునఁ బుత్త్రుఁ డుద్భవిల్లు; నీకన్యాత్వంబును దూషితంబుగా’ దని వరం బిచ్చినఁ, దత్‌క్షణంబ యక్కన్యకకు నంశుమంతునంశంబునఁ గానీనుం డై.

1.5.26

చ. సలలిత మైన పుట్టుఁగవచంబు నిసర్గజ మైన కుండలం
బుల యుగళంబు నొప్పఁగ సుపుత్త్రుఁడు కర్ణుఁడు పుట్టె సూర్యమం
డలమొకొ భూతలంబున బెడంగయి దీప్తిసహస్రకంబుతో
వెలుఁగెడు నా నిజద్యుతి సవిస్తరలీల వెలుంగుచుండఁగన్‌.

1.5.27

వ. అంత నాదిత్యుం డాకాశంబున కరిగినఁ, గొడుకుం జూచి కుంతి దద్దయు విస్మయం బంది యెద్దియుం జేయునది నేరక.

1.5.28

తరువోజ. ఏల యమ్ముని నాకు నిచ్చె నిమ్మంత్ర? మిమ్మంత్రశక్తి యే నెఱుఁగంగ వేఁడి
యేల పుత్త్రకుఁ గోరి యెంతయు భక్తి నినుఁ దలంచితిఁ బ్రీతి? నినుఁడును నాకు
నేల సద్యోగర్భమిచ్చెఁ? గుమారుఁ డేల యప్పుడ యుదయించె? నిం కెట్టు
లీ లోకపరివాద మే నుడిగింతు? నింతకు నింతయు నెఱుఁగరె జనులు!

1.5.29

వసంతతిలకము. ‘ఈ బాలు నెత్తుకొని యింటికిఁ జన్న, నన్నున్‌
నా బంధు లందఱు మనంబున నేమనా? రె
ట్లీ బాలసూర్యనిభు నిట్టుల డించి పోవం
గా బుద్ధిపుట్టు?’ నని కన్య మనంబులోనన్‌.

1.5.30

వ. వందురి వగచుచున్న దాని పుణ్యంబున నాదిత్యప్రేరితం బయి యనర్ఘరత్నవసుభరితంబయిన యొక్కమంజస నదీప్రవాహవేగంబునం దనయొద్దకు వచ్చిన, దానిలోఁ జెచ్చెరఁ దనకొడుకుం బెట్టి, కుంతి నిజగృహంబునకు వచ్చె; నంత.

1.5.31

ఆ. ఘనభుజుండు రాధ యను దానిపతి యొక్క | సూతుఁ డరుగుదెంచి చూచి రత్న
పుంజభరిత మయిన మంజసలో నున్న | కొడుకు దానితోన కొనుచు వచ్చి.

1.5.32

క. తన భార్యకు రాధకు ని | చ్చిన నదియును గరము సంతసిల్లి కుమారుం
గని చన్నులు సేఁపి ముదం | బునఁ బెనిచెను సుహృదు లెట్టిపుణ్యమొ యనఁగన్‌.

1.5.33

వ. ఇట్లు వసునివహంబుతో వచ్చుటంజేసి వసుషేణుం డను నామంబునం బరగి కర్ణుండు రాధేయుం డై సూతగృహంబునం బెరుఁగుచుండె; నంత నిట.

1.5.34

సీ. యదుకులవిమలపయఃపయోనిధిసుధా | కరరేఖఁ, గమనీయకాంతినిలయ,
ననవరతాన్నదానాభితర్పితముని | విప్రజనాశీఃపవిత్రమూర్తి,
వినయాభిమానవివేకసౌజన్యాది | సదమలగుణరత్నజన్మభూమిఁ,
బరమపతివ్రతాభరణాభిశోభితఁ | దామరసేక్షణఁ, దాల్మియందుఁ
ఆ. బృథివిఁ బోనిదానిఁ బృథయను కన్యక | నధికవీరుఁ డై స్వయంవరమునఁ
బడసి పరనరేంద్రపరిభావి పాండు భూ | వరుఁడు పేర్మితో వివాహ మయ్యె.

1.5.35

వ. మఱియు భీష్మానుమతంబున మద్రరాజతనయ మాద్రి యనుదాని మహోత్సవంబున వివాహంబై పాండురాజు భరతకులరత్నాలంకారుం డై పరాక్రమంబున నెవ్వరిని మెచ్చక యపారచతురంగబలసమన్వితుం డై.

1.5.36

మ. ధ్వజినీ పాత భరంబునం దలరఁగా, ధాత్రీధరాహీంద్ర మూ
ర్ధజరత్నప్రకరంబు లున్నతగజేంద్రస్యందనప్రోల్లస
ద్ధ్వజ వాతాహతిఁ దూలఁగా జలదబృందం బీక్రియన్‌ సర్వది
గ్విజయార్థం బరిగెం గురుప్రభుఁడు దోర్వీర్యప్రకాశార్థి యై.

1.5.37

క. అతులప్రతాపలీలా | యుతుఁ డై ప్రాగ్దక్షిణాపరోత్తర దిగ్భూ
పతుల నిజశాసన వశీ | కృతులం గావించెఁ దనదుకీర్తి వెలుంగన్‌.

1.5.38

మహాస్రగ్ధర. అతిరౌద్రాకారకీలాయతదవదహనోగ్రాగ్ర సేనానిపీడా
హతు లై నానావిధోపాయనములు గొని సౌహార్దవాంఛన్‌ జయశ్రీ
శ్రితబాహుం గానఁగా వచ్చిరి సకలజగత్సేవ్యమానున్‌ మహేంద్ర
ప్రతిముం గౌరవ్యవంశప్రభు నఖిలమహీపాలు రాంబాలికేయున్‌.

1.5.39

చ. లలిత హయ ద్విపంబుల విలాసినులన్‌ మణిరౌప్య కాంచనా
వలుల నజావిగోమహిష వర్గములన్‌ బహుభూషణంబులన్‌
బలువిడిఁ గప్పముల్‌ ధరణిపాలురచేఁ గొని నూఱువేల్‌గజం
బులఁ బెఱికించి తెచ్చెఁ గురుముఖ్యుఁ డకుప్యధనమ్ము లిమ్ముగన్‌.

1.5.40

క. శరనిధిపరివృత విశ్వం | భరఁ గల భూపతులు పాండుపతికృతమునఁ గిం
కరు లై ప్రతిసమకల్పిత | కరు లై రది మొదలుగాఁగఁ గౌరవ్యులకున్‌.

1.5.41

వ. ఇట్లు పాండురాజు దిగ్విజయంబు సేసి తదుపార్జితంబు లైన యపరిమితధనంబులఁ దెచ్చి ధృతరాష్ట్రుననుమతంబున భీష్మునకు సత్యవతికిం దమతల్లు లైన కౌసల్యలకు విదురునకు సుహృజ్జనులకు బ్రాహ్మణులకు నిచ్చి, వారివలన ననేకాశీఃప్రశంసలు వడసి సుఖం బున్నంత.

1.5.42

చ. వినుతయశుండు పాండునృపవీరుఁడు దిగ్విజయంబు సేసి పెం
పునఁ గొనివచ్చి యిచ్చిన యపూర్వ మహా ధనరాశి పేర్మి వా
రని విభవంబుతోడ ధృతరాష్ట్రుఁడు సేసె శతాశ్వమేధముల్‌
దనిసన భూసురేశులకు దక్షిణ లిచ్చి యథోచితంబుగన్‌.

1.5.43

వ. మఱియు నప్పాండురాజు వినయవిధేయత్వంబున ధృతరాష్ట్రునకు, నభిమతకార్యకరణంబున బాంధవులకు, ననుకూలత్వంబున సుహృజ్జనులకుఁ, బరిశ్రమజ్ఞానంబున విద్వాంసులకుఁ, గారుణ్యదానంబున ననాథులకు, నభయంకరత్వంబున మహీప్రజలకు సంతోషంబు సేయుచు.

1.5.44

క. ‘మండిత గుణ సంపద నధి | కుం డగుచున్‌ బూరు భరత కురు పతులకుఁ దు
ల్యుం డయి వంశకరుం డగుఁ | బాండుమహీశుఁ’ డని బుధసభలు దనుఁ బొగడన్‌.

1.5.45

క. నానాద్రవ్య నిరంతర | దానముల ననూనయజ్ఞదక్షిణలను ధా
త్రీనాథుఁడు బ్రాహ్మణులను | శ్రీనిలయులఁ జేయుచుండె శిష్టప్రియుఁ డై.

1.5.46

వ. మఱియు ననేకవినోదంబులను ననవరతకామానురూపవిషయసుఖానుభవంబులనుం బ్రొద్దు పుచ్చుచు నాతండు మృగయావ్యసనంబునం దగిలి.

1.5.47

ఉ. వాసవసన్నిభుండు హిమవన్నగదక్షిణపార్శ్వభూములన్‌
శ్రీసతిఁ బోని కుంతియును జెల్వగు మాద్రియుఁ దోడ రాఁగ బా
ణాసన బాణ భాసిత మహాభుజుఁడై విహరించుచుండె ని
చ్ఛాసదృశంబుగా గజవశాద్వయమధ్య గజేంద్ర లీలతోన్‌.

1.5.48

వ. మఱియుఁ దనకు ధృతరాష్ట్రుం డిష్టాన్నపాన మాల్యానులేపన భూషణాదులు నిత్యంబునుం బుత్తెంచుచుండ నిట్లు వనవాసవ్యాసంగంబున నుండి, యొక్కనాఁడు పెక్కుమృగంబుల నెగిచి యొక్కటి నేనియు నేయంగానక కినిసి యొక్కయెడ.

1.5.49

క. మనసిజరాగంబునఁ బెనఁ | గిన యిఱ్ఱిని లేడిఁ జూచి కృతహస్తుఁడు పె
ల్చన యే నమ్ముల నారెం | టిని ద్రెళ్ళఁగ నేసెఁ గడుఁ గఠినహృదయుం డై.

1.5.50

వ. ఇ ట్లేసి యబ్బాణంబులు పుచ్చికొనియున్న యప్పాండురాజుం జూచి యమ్మృగమిథునంబునం దల్పావశిష్టజీవం బై పడియున్న మృగంబు మనుష్యవచనంబుల ని ట్లనియె.

1.5.51

తరలము. హరిపరాక్రమ! యేను గిందముఁ డన్మునిన్‌, మృగముల్‌ నిరం
తరము నిట్లు రమింపఁగాఁ గని తద్రతం బెడఁ గోరి సుం
దర మృగాకృతి నేను భార్యయు దారుణాటవిఁ గామ భో
గరతి నుండితి మిష్టచారిమృగవ్రజంబుల పొత్తునన్‌.

1.5.52

వ. మృగముల మై యున్న మమ్ము వధియించిన దీన నీకు పాతకంబు లేదు; వేటలాడుటయు, మృగంబులఁ జంపుటయు రాజులకు ధర్మంబ; యయినను.

1.5.53

తే. పఱవనోపక యున్న, మైమఱచి పెంటిఁ | బెనఁగియున్నను, బ్రసవింప మొనసియున్నఁ,
దెవులు గొనియున్న మృగములఁ దివిరి యేయ | రెఱచి యాహారముగ మను నెఱుకు లయిన.

1.5.54

చ. ఇనసమతేజు లై ధరణి నెన్నడు ధర్మపథంబు దప్పఁ ద్రొ
క్కని భరతాదిరాజుల జగన్నుతవంశమునందుఁ బుట్టి నీ
కనఘచరిత్ర | యిట్లు దగునయ్య యధర్మువు సేయ? నీ యెఱుం
గని నృపధర్మువుల్‌ గలవె? కౌరవపుంగవ! గౌరవస్థితిన్‌.

1.5.55

వ. అని తన్ను నిందించి పలికిన నామృగంబు పలుకుల కలిగి పాండురా జి ట్లనియె.

1.5.56

తే. పగఱఁ గని సైఁతురేనియు మృగకులంబు | గని సహింపరు రాజులు; మొనసి వాని
గ్రచ్చఱగఁ జంపుదురు; నమ్మి కిచ్చి చంపఁ | జనదు; మాయాబలంబునఁ జనదు చంప.

1.5.57

వ. ‘తొల్లి యగస్త్య మహామునీంద్రుండు మృగ మాంసంబున నిత్యశ్రాద్ధంబు సేయుచుండి రాజులకు మృగవధ దోషంబు లేకుండ నిర్మించె; దీని నీకు నిందింపఁదగునే?’ యనుచున్న నమ్మృగంబులు బాణఘాతక్షతవేదన సహింపనోపక ‘సర్వప్రాణులకు సాధారణం బయి యిష్టం బగు సుఖావసరంబున నున్న మమ్ము ననపరాధుల వధించితి గావున నీవునుం బ్రియాసంగమం బయిన యప్పుడ పంచత్వం బొందెడు’ మని, ‘నీ ప్రియయు నిన్ను ననుగమించు’ నని పాండురాజునకు శాపం బిచ్చి, గతప్రాణము లై పడియున్న మృగంబులం జూచి శోకించి పాండురాజు పరమ నిర్వేదనపరుం డయి.

1.5.58

క. ఎట్టి విశిష్టకులంబునఁ | బుట్టియు, సదసద్వివేకములు గల్గియు, మున్‌
గట్టిన కర్మఫలంబులు | నెట్టన భోగింపకుండ నేర్తురె మనుజుల్‌?

1.5.59

వ. కామవ్యామోహితుం డయి కొండుకనాఁడు మదీయజనకుండు పరలోకగతుం డైనఁ దత్‌క్షేత్రంబున ధర్మమయుం డయిన కృష్ణద్వైపాయనమునివలన నుద్భవిల్లి, ధర్మప్రవృత్తుండ నై యున్న నా కిట్టి దుర్వ్యసనంబు కర్మవశంబున సంభవించె; నింక మునివృత్తియ యుచితంబు గావున సర్వసంగంబులు విడిచి, సర్వభూతంబులయందు సమచిత్తుండనై, హింస దలంపక నిత్యంబు నొక్కొక్కవనస్పతియందు నొక్కొక్కవన్య ఫలంబు భిక్ష గొని, యసంభవం బయిననాఁ డుపవాసంబు సేసి, వృక్షమూలంబున నుండి పాంసుపరిచ్ఛన్నదేహుండ నయి.

1.5.60

సీ. ఇంద్రియార్థంబులం దింద్రియవ్యాపార | ముడిగించి; క్రియ లెల్ల విడిచి, పుణ్య
పాపబంధంబుల నోపి బంధింపంగఁ | బడక మనోవృత్తి నొడిచి, నాకు
నిది ప్రియం బప్రియం బిది నింద యిది మహా | స్తుతి యిది యనక, సంతత నితాంత
సంతోషయుతుఁడనై వంతయు భయమును | శీతాతపంబులు వాతగతియు
ఆ. నెఱుఁగ కివ్విధమున మఱచి, శరీరంబు | మరణజీవితముల కురువిషాద
తోషవృత్తు లుడిగి, భీషణాటవి నుండి | చేసెదను దపంబు భాసురముగ.

1.5.61

వ. అని నిశ్చయించి, గొంతిని మాద్రినిం జూచి; ‘మీర లిందుండి నవయక హస్తిపురంబునకుం జని నాతపోవృత్తి నునికి రాజునకు సత్యవతీదేవికి భీష్మునకు విదురనకుం గౌసల్యలకు వృద్ధపురోహిత బ్రాహ్మణులకుం జెప్పి యం దుండుం’ డనిన, వారలు బాష్పపూరితనయన లయి ‘యిట్టి యుగ్రతపంబు విడిచి, మమ్ము విడువనియట్టి యాశ్రమంబున నుండి తపంబు సేయు నది; యేము నిన్ను విడిచి పోవనోపము; మమ్ము విడిచితేని యిప్పుడ ప్రాణంబులు విడుతు’ మనిన వారల నిశ్చయం బెఱింగి ‘యట్లేని నాయొద్దన యుండుం; డేను వానప్రస్థాశ్రమంబున వల్కలంబులు గట్టి, రేపును మాపును మధ్యాహ్నంబునప్పుడును స్నానంబు సేసి వేల్చుచుం గందమూలఫలాశనుండనై, పితృదేవతల వాక్సలిలవన్యఫలంబులం దనుపుచుఁ, గ్రమంబున దేహమోక్షణంబు సేయుదు’ నని యప్పుడు.

1.5.62

పృథ్వీవృత్తము. అమూల్య మణి భూషణంబులు గజాశ్వ బృందంబులున్‌
సమృద్ధ ధన ధాన్యరాసులుఁ బ్రశస్తగోవర్గముం
గ్రమంబునను భూసురేశుల కగణ్యపుణ్యార్థి యై
యమర్త్యనిభుఁ డిచ్చెఁ బాండువిభుఁ డత్యుదారస్థితిన్‌.

1.5.63

వ. మఱియుం గల వస్తువు లెల్లను ధృతరాష్ట్రున కిచ్చి పుచ్చి, మమత్వాహంకారవిముక్తుండై, ధర్మపత్ను లయ్యిరువురుఁ దనయట్ల తపస్వినులై తోడరా నుత్తరాభిముఖుండై యరిగి, నాగశైలంబును జైత్రరథంబును బారిషేణంబును హిమవంతంబునుం గడచి, సురసిద్ధసేవితం బయిన గంధమాదనంబునం గొండొక కాలం బుండి, యింద్రద్యుమ్నం బను కొలనును హంసకూటంబును నతిక్రమించి.

1.5.64

మ. యతిసంఘంబుల సంగతిన్‌ దురితకర్మాపేతుఁడై యేఁగి సం
తతసిద్ధామరయక్ష సేవితసముద్యచ్ఛృంగ మై యున్న యా
శతశృంగం బను పర్వతంబున శుభాచారుండు నిత్యవ్రతో
ద్యతుఁ డై ఘోరతపంబు సేసె మునిబృందం బద్భుతం బందఁగన్‌.

1.5.65

వ. ఇట్లు శతశృంగంబున నుత్తరభాగంబునందుఁ దపంబు సేయుచు బ్రహ్మఋషి సమానుండై, దివ్యవిమానంబు లెక్కివచ్చుచుం బోవుచున్న దేవగణంబులచేత సంకీర్ణం బైన స్వర్గమార్గంబున నుత్తరాభిముఖు లై యూర్థ్వలోకంబున కనాయాసంబున నరిగెడు మునిసహస్రంబుం జూచి, ‘మీర లెందులకుఁ బోయెద’రని యడిగిన నప్పాండురాజునకు వార లి ట్లనిరి.

1.5.66

క. అమవస గావున నేఁ డ | క్కమలజుఁ గొలువఁగ మహర్షిగణములు పితృసం
ఘములును బోదురు బ్రహ్మాం | డమునం గలవార లం దొడంగూడంగన్‌.

1.5.67

వ. ‘అది కారణంబుగా నేమును బ్రహ్మలోకంబునకుం బోయెద’ మనిన నమ్మునుల పిఱుంద భార్యాద్వయసహితుండై సమవిషమప్రదేశంబులం జనుచున్న య ప్పాండురాజుం జూచి ఋషు లి ట్లనిరి.

1.5.68

క. వీర లతిలలిత మృదులా | కారలు, గిరివిషమగహనగహ్వరముల రా
నేరరు గావున నిట చను | దేరక మీ రుండుఁ డివియు దేవపథంబుల్‌.

1.5.69

క. అనిన విని నరుల కక్కడఁ | జనఁబోలమి యెఱిఁగి పాండుజనపాలకుఁ డి
ట్లనియెను ‘స్వర్గద్వారం | బనపత్యులు గాన నోపరటె మును లయ్యున్‌.’

1.5.70

వ. ‘అపుత్త్రస్య గతి ర్నాస్తి’ యను వేదవచనంబుం గలదు గావున నే నపుత్త్రకుండ నేమి సేయుదు? ననిన మునులును గరుణించి యోగదృష్టి ననాగతం బెఱింగి. ‘నీ వపుత్త్రకుండవు గావు; దైవాధిష్ఠితం బైన సంతానంబు నీకు ధర్మానిలశక్రాశ్వినులవరంబున నగు; నక్షయలోకంబులుం బడయుదువు గావున సంతానార్థంబు యత్నంబుఁ సేయు’ మనిన విని పాండురా జాత్మగతంబునఁ ‘బురుషుండు పుట్టుచుండి దేవఋషి పితృమనుష్యులఋణంబులు నాలుగింటితోడం బుట్టి యథాకాలవిధుల వానివలన విముక్తుండు గావలయు; నట్లుగాని వానికిఁ బుణ్యలోకంబులు లేవు; యజ్ఞంబులంజేసి దేవతలఋణంబును, దపస్స్వాధ్యాయ బ్రహ్మచర్యవ్రతంబులంజేసి ఋషుల ఋణంబును, శ్రాద్ధపుత్త్రలాభంబులం జేసి పితరుల ఋణంబును, నానృశంస్యంబునం జేసి మనుష్యుల ఋణంబునుం బాపవలయు; నందుఁ బితరుల ఋణంబు దక్కఁ దక్కిన మూఁడుఋణంబులవలన విముక్తుండ నయితి.

1.5.71

తే. దేహనాశంబుతోడన తీఱు నెల్ల | ఋణములును మఱి పితరులఋణము దేహ
నాశ మయినను దీఱదు నాకు నదియ | తక్కియున్నది యే నెట్లు దానిఁ బాతు.

1.5.72

వ. అని దుఃఖించి మృగశాపంబు దలంచి, తనవలన సంతానం బయ్యెడి విధంబు లేమి యెఱింగి యొక్కనాఁ డేకాంతంబ గొంతి కి ట్లనియె.

1.5.73

ఉ. దానములం దపంబుల సదక్షిణ యజ్ఞములన్‌ విహీన సం
తానుల కూర్ధ్వలోక సుపథంబు లవశ్యము గావు; లబ్ధ సం
తానుల యెందుఁ బుణ్యు; లిది తథ్యము గావున నొండు దక్కి సం
తానము నాకు నయ్యెడువిధం బొనరింపుము ధర్మసంస్థితిన్‌.

1.5.74

క. అనపత్యుఁడ నై జీవిం | చిన, మృతిఁ బొందినను నిర్విశేషంబ; యిహం
బును బరమును నఫలమ; గా | వున సంతతి వడయు ధర్మువున ధర్మసతీ!

1.5.75

వ. ‘ఔరస క్షేత్రజ దత్తక కృత్రిమ గూఢోత్ప న్నాపవిద్ధు లను నార్వురుపుత్త్రులు బంధువులు దాయాదులు నగుదురు, కానీన సహోఢక్రీత పౌనర్భవ స్వయందత్త జ్ఞాతు లను నార్వురుపుత్త్రులు బంధువు లగుదురు గాని దాయాదులు గా; రట్టి పుత్త్రులలో నౌరసున కించుకయ తక్కువగాని తక్కటి పుత్త్రులకంటె క్షేత్రజుం డుత్కృష్టుం; డందును దేవరన్యాయ జాతుం డుత్తముం డండ్రు గావున నస్మన్నియోగంబునంజేసి ధర్మమార్గంబున క్షేత్రజులం బడసిన నేనును బుత్త్రవంతుల పుణ్యలోకంబులు వడయనేర్తు; నె ట్లనినఁ; దొల్లి గేకయరా జైన శారదండాయని పుత్త్రోత్పాదనంబునం దశక్తుం డయి తనధర్మపత్ని నీచెలియలి శ్రుతసేనం బుత్రార్థంబు నియోగించిన నది బ్రాహ్మణవచనంబునం బుణ్యస్నాతయై పుంసవనహోమంబు సేయించి ఋత్విజులవలన దుర్జయాదు లయిన కొడుకుల మువ్వురం బడసెఁ; బుత్త్రలాభంబున ననంతపుణ్యఫలం బగుట నది ధర్మ్యం బయిన యాచారం’ బనిన విని కుంతి యి ట్లనియె.

1.5.76

క. భరతకులశ్రేష్ఠుఁడ వయి | పరఁగిన నీ కేము ధర్మపత్నుల మయి యిం
కొరుల మనుష్యుల నంతః | కరణంబులఁ దలఁపఁ బొందఁగా నోపుదుమే?

1.5.77

వ. ‘భవత్ప్రసాదంబున మాయందుఁ బుత్త్రోత్పత్తి యగు నె ట్లనిన; దీని కనుగుణం బయినది యొక్క పుణ్యకథఁ దొల్లి పౌరాణికులవలన నా వినిన దానిం జెప్పెదఁ జిత్తగించి విను’ మని పాండురాజునకుఁ గుంతి యి ట్లనియె.

1.5.78

చ. అతుల బల ప్రతాప మహిమాధికుఁ డై వ్యుషితాశ్వుఁ డన్మహీ
పతి నయధర్మతత్పురుఁడు పౌరవవంశజుఁ డశ్వమేధముల్‌
శత మొనరించుచుండి భుజశక్తి జయించె మహీశులం బ్రవ
ర్ధితుయశుఁ డై ప్రతీచ్యుల నుదీచ్యులఁ బ్రాచ్యుల దాక్షిణాత్యులన్‌.

1.5.79

క. ఆతని యజ్ఞంబునఁ బురు | హూత పురస్సర మరుద్గణోత్తము లధిక
ప్రీతిఁ జనుదెంచి హవ్యము | లాతత హస్తములఁ గొందు రగ్నిముఖమునన్‌.

1.5.80

వ. అట్టి వ్యుషితాశ్వుండు కాక్షీవతి యైన భద్ర తన భార్యయందు ననవరత కామాసక్తిం జేసి యక్ష్మ
రుజాక్రాంతుం డయి యస్తమించిన నది పుత్త్రాలాభదుఃఖిత యయి పతివియోగంబు సహింప నోపక.

1.5.81

తే. పతియులేక జీవించు నయ్యతివ కయిన | జీవనముకంటె దానికిఁ జావ లగ్గు
కాన నీతోన చనుదెంతుఁ గాని నిన్నుఁ | బాసి యిం దుండఁగా నోప వాసవాభ!

1.5.82

వ. ‘కాదేని నాకు నీ పుణ్యమూర్తిప్రతిమూర్తులైన పుత్త్రులం బ్రసాదింపు’ మని దర్భాస్తరణశాయిని యై యాశవంబుఁ గౌఁగిలించుకొని విలాపించుచున్న దానికి వాని శరీరముననుండి యొక్క దివ్యవాణి యి ట్లనియె.

1.5.83

క. విదితముగ నీకు వర మి | చ్చెద నోడకు లెమ్ము; గుణవశీకృతభువనుల్‌
సదమలచరిత్రు లాత్మజు | లుదయింతురు వగవకుండు ముదితేందుముఖీ!

1.5.84

వ. ‘ఋతుమతి వయిన యష్టమ దివసంబుననేనిం జతుర్దశ దివసంబుననేని శుచి వై శయనంబున నుండి నన్నుఁ దలంపు’ మనిన నదియుం దద్వచనానురూపంబు సేసి మువ్వురు సాల్వులును, నల్వురు మద్రులునుంగా నేడ్వురు కొడుకులం బడసె; నది గావున ‘నీవు మాయందు దైవానుగ్రహంబున నపత్యంబు వడయు’ మనినం గుంతిం జూచి పాండురాజు ధర్మ్యం బయిన యొక్క పురాణ కథఁ జెప్పెదఁ ‘దొల్లి స్త్రీలు పురుషులచేత ననావృత లయి స్వతంత్రవృత్తి నఖిలప్రాణిసాధారణం బైన ధర్మంబునం దమతమవర్ణంబులయందు ఋతుకాలంబు దప్పక నియతానియతపురుషు లయి ప్రవర్తిల్లుచున్న, నుద్దాలకుం డను నొక్కమహామునిభార్య నతిసాధ్వి నధికతపోనిధి యైన శ్వేతకేతుతల్లి ఋతుమతి యైన దాని నొక్క వృద్ధవిప్రుం డతిథి యై వచ్చి పుత్రార్థంబు గామించిన శ్వేతకేతుం డలిగి యిది ధర్మవిరుద్ధం బని యాక్రోశించి దాని సహింపనోపక.

1.5.85

సీ. ‘ఇది యాదిగా సతు లెన్నండుఁ బరపురు | షార్థినుల్‌ గాఁ జన; దన్యపురుషు
సంగమంబునఁ జేసి సకలపాతకములు నగుఁ | బరిగ్రహభూత లయిన సతుల
కిట్టిద మర్యాద యి మ్మనుష్యుల కెల్లఁ | జేసితి లోక ప్రసిద్ధి గాఁగ ’
నని ధర్మ్యమైన మర్యాద మానవులకుఁ | దద్దయు హితముగా ధర్మమూర్తి
ఆ. యబ్జభవసమానుఁ డగు శ్వేతకేతుండు | నిలిపె; నదియు ధారుణీ జనంబు
నందు లోకపూజ్యమై ప్రవర్తిల్లుచు | నుండె శిష్ట సంప్రయుక్తిఁ జేసి.

1.5.86

వ. మఱియుఁ ద్యిర్యగ్యోనులయందును నుత్తరకురుదేశంబులయందును మొదలింటి ధర్మంబ యిప్పుడుం బ్రవర్తిల్లుచుండునట్లు మనుష్యులయందు శ్వేతకేతుండు సేసిన ధర్మస్థితికారణంబున నాఁటంగోలె.

1.5.87

క. పురుషులచే ధర్మస్థితిఁ | బరిగ్రహింపంగఁ బడిన భార్యలకు నిరం
తరము నిజపురుషభక్తియుఁ | బరపురుషవివర్జనంబుఁ బరిచిత మయ్యెన్‌.

1.5.88

తే. భర్తచేత నియోగింపఁ బడక సతికి | నెద్దియును జేయఁగాఁ దగ; దెద్ది యైన
భర్తచేత నియోగింపఁ బడిన దానిఁ | జేయకునికి దోషం బని చెప్పె మనువు.

1.5.89

వ. పతి నియోగించిన దానిం జేయని నాఁడు భార్యకుం బాతకం బని యెఱింగి కాదె తొల్లి సౌదాసుం డైన కల్మాషపాదుం డను రాజర్షిచేత నియుక్తయై వానిభార్య మదయంతి యనునది వసిష్ఠువలన నశ్మకుం డను పుత్త్రుం బడసె; నస్మజ్జన్మంబు నిట్టిద; మహాముని యయిన కృష్ణద్వైపాయనువలనఁ గురుకులవృద్ధిపొంటె నే ముద్భవిల్లితిమి; కావున నీ విన్నికారణంబులు విచారించి నా నియోగంబు సేయుము.

1.5.90

చ. అలయక ధర్మశాస్త్రములయందుఁ బురాణములందుఁ జెప్ప ను
త్పలదళనేత్ర! విందుమ యపత్యము మే లని; కావునన్‌ యశో
నిలయులఁ బుత్త్రులం బడయు నీ కొనరించెద సంగతాంగుళీ
దళవిలసన్మదీయకరతామరసద్వయయోజితాంజలిన్‌.

1.5.91

వ. అని పుత్త్రముఖావలోకనలోలత్వంబున దీనవదనుం డై దేవిం బ్రార్థించినఁ గుంతియుం బుత్రోత్పాదనోన్ముఖి యై కుంతిభోజునింటఁ దనకొండుకనాఁడు దుర్వాసునిచేతం బడసిన మంత్రంబుతెఱంగు పతి కెఱింగించి ‘యమ్మంత్రంబున కిది యవసరం బయ్యె; నేవేల్పు నారాధింతు? నాన తి’ మ్మనిన సంతసిల్లి కుంతీదేవికిం బాండురా జి ట్లనియె.

1.5.92

క. లలితాంగి! యెల్లలోకం | బులు ధర్మువునంద నిలుచుఁ; బొలుపుగ ధర్ముం
దలఁపుమ; యాతఁడ మఱి వే | ల్పులలోపలఁ బెద్ద ధర్మమున సత్యమునన్‌.

1.5.93

వ. అని నియోగించినఁ, గుంతియుం బతికిఁ బ్రదక్షిణంబుఁ జేసి సమాహితచిత్త యై మహాముని యిచ్చిన మంత్రంబు విధివంతంబుఁ జేసి ధర్ముని నారాధించిన, నా ధర్ముండును యోగమూర్తి ధరుం డై వచ్చి, వరం బిచ్చినం, గుంతియుఁ దత్ప్రసాదంబున గర్భంబు దాల్చి, సంవత్సరంబు పరిపూర్ణం బైన.

1.5.94

ఉ. శాత్త్రవజైత్రతేజమున సర్వదిశల్‌ వెలుఁగంగ నైంద్ర న
క్షత్త్రయుతుండుగా శశి ప్రకాశజయోన్నత మైన యష్టమిన్‌
మిత్త్రముఖగ్రహప్రతతి మేలుగ నాభిజితోదయంబునం
బుత్త్రుఁడు ధర్మునంశమునఁ బుట్టె నతిస్థిరధర్మమూర్తి యై.

1.5.95

క. ధరణీసురు లాదిగ ను | ర్వరలోఁ గల సర్వభూత వర్గం బెల్లం
బరమోత్సవ మొందెను గుణ | శరణ్యుఁ డగు ధర్మజన్ము జన్మదినమునన్‌.

1.5.96

క. శతశృంగ నిలయు లగు సం | శ్రితవ్రతులు విప్రవరులు సేసిరి ధర్మ
స్థితి జాతకర్మ మత్యు | న్నతిఁ బాండుప్రథమపుత్త్రునకు హర్షముతోన్‌.

1.5.97

క. కురుకుల విభుఁ డగు ధర్మ | స్థిరమతి యగు నీతఁ డనుచు ధృతిఁ జేసి యుధి
ష్ఠిరుఁ డను నామముఁ దా ను | చ్చరించె నాకాశవాణి జనవినుతముగన్‌.

1.5.98

వ. ఇట్లు పుత్త్రోదయంబునఁ బరమహర్ష సంపూర్ణ హృదయుం డై పాండురాజు కుంతీ మాద్రీ సహితుండై శతశృంగంబున నుండునంత, నట ముందఱ ధృతరాష్ట్రువలనన్‌ గాంధారి కృష్ణద్వైపాయనువరంబున గర్భంబు దాల్చి, యొక్క సంవత్సరంబు నిండినఁ బ్రసూతి కాకున్నం బదరుచుఁ బుత్త్రలాభలాలస యయి యున్న యది యప్పు డయ్యుధిష్ఠిరు జన్మంబు విని మనస్తాపంబున నుదరతాడనంబుఁ జేసికొనిన, గర్భపాతం బగుడును.

1.5.99

క. దాని నెఱింగి పరాశర | సూనుఁడు చనుదెంచి సుబలసుతఁ జూచి ‘మనో
హీన వయి గర్భపాతము | గా నిట్టులు సేయు టిదియుఁ గర్తవ్యం బే.’

1.5.100

క. ఇమ్మాంసపేశి నేకశ | త మ్ముదయింతురు సుతులు ముదమ్మున; నిది త
థ్య; మ్మింక నైన నతియ | త్నమ్మున రక్షింపు దీని నా వచనమునన్‌.

1.5.101

వ. అని గాంధారిం బదరి తొల్లివేదంబులు విభాగించిన మహానుభావుం డమ్మాంసపేశి నేకోత్తరశతఖండంబులుగా విభాగించి, ‘వీని వేఱు వేఱ ఘృత కుండలంబులం బెట్టి, శీతలజలంబులం దడుపుచు నుండునది; యిందు నూర్వురు గొడుకులు నొక్క కూతురుం బుట్టుదు’రని చెప్పి చనినఁ, దద్వచనప్రకారంబు చేయించి, గాంధారీ ధృతరాష్ట్రులు సంతసిల్లియున్న; నిట శతశృంగంబున.

1.5.102

చ. నిరుపమకీర్తి పాండుధరణీపతి వెండియుఁ గుంతిఁ జూచి ‘యం
బురుహదళాక్షి! యింక నొకపుత్త్త్రు నుదారచరిత్రు నుత్తమ
స్థిరజవసత్త్వు నయ్యనిలదేవుదయం జనియింపు పెంపుతోఁ;
గురుకులరక్షకుం డతఁ డగున్‌ బలవద్భుజవిక్రమోన్నతిన్‌.

1.5.103

వ. అని పనిచిన నెప్పటియట్ల కుంతీదేవి వాయుదేవు నారాధించి తత్ప్రసాదంబున గర్భంబు దాల్చి, సంవత్సరంబు సంపూర్ణం బగుడును.

1.5.104

చ. సుతుఁడు నభస్వదంశమున సుస్థిరుఁ డై యుదయించినన్‌ మహా
యతికృత జాతకర్ముఁ డగు నాతని కాతతవీర్యవిక్రమో
న్నతునకు భీమసేనుఁ డను నామముఁ దా నొనరించె దివ్యవా
క్సతి శతశృంగశైల నివసన్మునిసంఘము సంతసిల్లఁగన్‌.

1.5.105

క. అనిలజు పుట్టిన దివసము | నన యట దుర్యోధనుండు నరనుత! ధృతరా
ష్ట్రునకున్‌ గాంధారికి న | గ్ర నందనుఁడు ఘనుఁడు పుట్టెఁ గలియంశమునన్‌.

1.5.106

శా. ఆదుర్యోధనుఁ డుద్భవిల్లుడును గ్రవ్యాదారవంబుల్‌ శివా
నాదంబుల్‌ మదఘూకఘూంకృతులు నానారాసభధ్వానముల్‌
భూదిక్కంపముగాఁ జెలంగె విగతాంభోభృన్నభోవీథియం
దాదిత్యద్యుతి మాయఁగాఁ గురిసె నుగ్రాసృఙ్మహావర్షముల్‌.

1.5.107

వ. మఱియు దుర్యోధనజన్మానంతరంబున ధృతరాష్ట్రునకు వైశ్యాపుత్త్రుం డయిన యుయుత్సుండు పుట్టె; నంత గాంధారికి నొక్కొక్కదివసంబున నొక్కొక్కరుండుగాఁ గ్రమంబున దుశ్శాసన దుస్సహ దుశ్శల జలసంధ సమ సహ విందానువింద దుర్ధర్ష సుబాహు దుష్ప్రధర్షణ దుర్మర్షణ దుర్ముఖ దుష్కర్ణ కర్ణ వివింశతి వికర్ణ శల సత్త్వ సులోచన చిత్రోపచిత్ర చిత్రాక్ష చారుచిత్ర శరాసన దుర్మద దుర్విగాహ వివిత్సు వికటాన నోర్ణనాభ సునాభ నందోపనందక చిత్రబాణ చిత్రవర్మ సువర్మ దుర్విమోచనాయోబాహు మహాబాహు చిత్రాంగ చిత్రకుండల భీమవేగ భీమబల బలాకి బలవర్ధ నోగ్రాయుధ సుషేణ కుండధార మహోదర చిత్రాయుధ నిషంగి పాశి బృందారక దృఢవర్మ దృఢక్షత్త్ర సోమకీ ర్త్యనూదర దృఢసంధ జరాసంధ సద సువా గుగ్రశ్రవ ఉగ్రసేన సేనానీ దుష్పరాజ యాపరాజిత కుండశాయి విశాలాక్ష దురాధర దుర్జయ దృఢహస్త సుహస్త వాతవేగ సువర్చ ఆదిత్యకేతు బహ్వాశి నాగదత్తాగ్రయాయి కవచి క్రధన కుండి ధనుర్ధ రోగ్ర భీమరథ వీరబాహ్వ లోలు పాభయ రౌద్రకర్మ ధృడరథాశ్ర యానాధృష్య కుండభేది విరావి ప్రమథ ప్రమాథి దీర్ఘరోమ దీర్ఘబాహు వ్యూఢోరు కనకధ్వజ కుండాశి విరజసు లనంగా నూర్వురు గొడుకులు పుట్టిన.

1.5.108

తే. ఆ తనూజుల కందఱ కనుజ యై ల | తాంగి దుశ్శల యను కూఁతు రమరఁ బుట్టె;
నందు దౌహిత్రవంతుల దైన్య పుణ్య | గతియుఁ గాంతు నే నని పొంగెఁ గౌరవుండు.

1.5.109

వ. ఇట్లేకోత్తరశతపుత్త్రులం బడసి కృతార్థుండై యున్న ధృతరాష్ట్రుకడకు భీష్మవిదురాది బంధుజనంబులుఁ బురోహితప్రముఖ బ్రాహ్మణవరులును వచ్చి యొక్కనాఁ డేకాంతంబున ని ట్లనిరి.

1.5.110

క. మన దుర్యోధను జన్మం | బునఁ బెక్కులు దుర్నిమిత్తములు పుట్టె; జగ
జ్జనసంక్షయజననుం డగు | నని పలికెద రెఱుక గల మహాత్ములు వానిన్‌.

1.5.111

క. కులమునకు నఖిలలోకం | బులకు నపాయంబు సేయు పురుషాధము ని
మ్ముల దూషించి జగంబును | గులమును రక్షించు టుఱదె కువలయనాథా!

1.5.112

వ. ‘కావున నిప్పుడ దుర్యోధను దూషింతము; నీకు వెండియుఁ బుత్త్రశతంబు సంపూర్ణంబయి పెరుఁగుచున్నయది’ యనిన ధృతరా ష్ట్రుండు పుత్త్రమోహంబున నప్పలుకులు విన నొల్లకుండె; నంత నట శతశృంగంబునఁ గుంతీదేవి భీమసేను సుపుత్త్రుం బడసి, దశమదివసంబున వేల్పులకు మ్రొక్కఁ గొడుకు నెత్తుకొని దేవగృహంబునకుఁ బోవునెడ నతివిషమగహనగిరిగహ్వరంబుననుండి యొక్కపులి వెలువడి యామిషార్థి యయి పయికి లంఘించిన.

1.5.113

క. వీరుఁడు పాండుమహీపతి | దారుణ బాణ త్రయమునఁ దద్వ్యాఘ్రంబున్‌
ధారుణిఁ ద్రెళ్ళఁగ నడుమన | భూరిభుజుం డేసి కాచెఁ బుత్త్రుం దేవిన్‌.

1.5.114

క. ఉరు శార్దూల భయంబునఁ | బరవశ యయి కుంతి యున్న బాలకుఁడు శిలో
త్కరముపయిఁ బడియెఁ దన ని | ష్ఠురతనుహతిఁ జేసి రాలు చూర్ణంబులుగన్‌.

1.5.115

వ. దానిం జూచి పాండురాజు సంభ్రమంబునఁ బఱతెంచి విస్మితుం డై కొడుకు నెత్తికొని కుంతీదేవిం దోడ్కొని వేల్పులకు మ్రొక్కించి మగుడి నిజాశ్రమంబునకు వచ్చి సుఖం బుండి, గాంధారీధృతరాష్ట్రులకుఁ బుత్త్రశతంబు పుట్టుట విని, ఋషులవలన దివ్యమంత్రోపదేశంబుఁ గొని.

1.5.116

క. కొడుకుం ద్రిలోక విజయుం | బడయుదు నని ఘోర మగు తపం బొనరింపం
దొడఁగె సురరాజు నెడలో | నిడికొని యేకాగ్రబుద్ధి నేకాంతమునన్‌.

1.5.117

వ. ఇ ట్లతి నిష్ఠ నేకపాద స్థితుం డయి తపంబు సేయుచుఁ గుంతి నొక్క సంవత్సరంబు వ్రతంబు సేయం బంచియున్న నప్పాండురాజున కింద్రుండు ప్రత్యక్షం బై.

1.5.118

క. ‘పుత్త్రుఁడు నీ కుదయించు న | మిత్త్రక్షయకరుఁడు బంధుమిత్త్రాంబుజ స
న్మిత్త్రుం’ డని వర మిచ్చిన | ధాత్త్రీపతి పొంగి పృథకుఁ దా ని ట్లనియెన్‌.

1.5.119

క. ధనమున విద్యను సంతతిఁ | దనిసిన వా రెందుఁ గలరె? ధవళేక్షణ! కా
వున నా కింకను బలువురఁ | దనయులఁ బడయంగ వలయు ధర్మువు పేర్మిన్‌.

1.5.120

చ. అమరగణంబులోనఁ బరమార్థమ యింద్రుఁడు పెద్ద, సర్వలో
కములకు వల్లభుం డతఁడ కావున నయ్యమరాధిపప్రసా
దమున సుతున్‌ సురేంద్రసము ధర్మసమన్వితు నస్మదీయవం
శము వెలుఁగింపఁగాఁ బడయు సర్వజగత్పరిరక్షణక్షమున్‌.

1.5.121

వ. అని నియోగించినఁ గుంతియుఁ దొల్లిటి యట్ల దుర్వాసుం డిచ్చిన మంత్రంబున నింద్రు నారాధించినఁ, దత్ప్రసాదంబునఁ గుంతికి.

1.5.122

క. స్థిరపౌరుషుండు లోకో | త్తరుఁ డుత్తరఫల్గునీప్రథమపాదమునన్‌
సురరాజునంశమున భా | సురతేజుఁడు వంశకరుఁడు సుతుఁ డుదయించెన్‌.

1.5.124

సీ. ‘విను కార్తవీర్యుకంటెను వీరుఁ డగుట న | ర్జుననామ మీతండ యొనరఁ దాల్చు;
నీతండ యనిఁ బురుహూతాదిసురుల నో | డించి ఖాండవము దహించు బలిమి;
నీతండ నిఖిలావనీతలేశుల నోర్చి | రాజసూయము ధర్మరాజు నునుచు;
నీతండ వేల్పులచేత దివ్యాస్త్రముల్‌ | వడసి విరోధుల నొడుచుఁ గడిమి’
ఆ. ననుచు నవపయోదనినదగంభీర మై | నెగసె దివ్యవాణి గగనవీథిఁ,
గురిసెఁ బుష్పవృష్టి, సురదుందుభిధ్వనుల్‌ | సెలఁగె సకలభువనవలయ మద్రువ.

1.5.125

వ. మఱియు మరీచ్యాది ప్రజాపతులును, ధాత్రాది ద్వాదశాదిత్యులును, మృగవ్యాధాది రుద్రులును, ధరాది వసువులును, భరద్వాజాది మహర్షులును, భీమసేనాది గంధర్వులును, శేషాది మహానాగముఖ్యులును, వైనతేయాది ఖచరులును, మేనకాద్యప్సరసలును, నాశ్వినులును, విశ్వేదేవతలును, మఱియు స్వర్గంబున నున్నరాజులుం జను దెంచిన.

1.5.126

క. శతశృంగనగేంద్రము శత | ధృతి సర్గదినంబపోలెఁ ద్రిభువనభూత
ప్రతతిఁ బరిపూర్ణశోభా | ధృతి నింద్రతనూజుజన్మదినమున నొప్పెన్‌.

1.5.127

మాలిని. సరససురవధూలాస్యంబులున్‌ సిద్ధవిద్యా
ధరపటుపటహాతోద్యంబులుం గిన్నరీ కిం
పురుష లలితగీతంబుల్‌ మహారమ్య మయ్యెన్‌
వరముని దివిజాశీర్వాదనాదంబుతోడన్‌.

1.5.128

వ. పాండురాజును బరమోత్సవంబునం గుంతివలనఁ బురుషత్రయసమానం బయిన పుత్త్రత్రయంబు వడసి భువనత్రయరాజ్యంబు వడసినంతియ సంతసిల్లి, కుమారులతోడి వినోదంబులం దగిలి యున్నంత; మాద్రి దనయందుఁ బుత్త్రజన్మంబు వడయు నుపాయంబు లేమికి దుఃఖించి యాత్మగతంబున.

1.5.129

ఉ. కోరిన కోర్కికిం దగఁగఁ గుంతి సుతత్రయంబుఁ గాంచె; గాం
ధారియు నక్కడన్‌ సుతశతంబు ముదం బొనరంగఁ గాంచె; నేఁ
బోరచి యాఁడుఁబుట్టువునఁ బుట్టి నిరర్థకజీవ నైతి సం
సారసుఖావహం బయిన సత్సుతజన్మముఁ గానఁ బోలమిన్‌.

1.5.130

వ. అని వగచుచు నొక్కనాఁ డేకాంతంబునం బతియొద్ద గద్గద వచన యై తన మనోవాంఛితంబుఁ జెప్పి ‘కుంతీదేవి యనుగ్రహంబుం బడయ నగునేని కొడుకులం బడయుదు; నట్లయిన నాకును నీకును లోకంబులకును హితం బగుఁ గావున నాకుఁ బుత్త్రోత్పాదనంబు దయసేయం గుంతీదేవికి నానతి యి’ మ్మనిన మాద్రికిఁ బాండురా జి ట్లనియె.

1.5.131

క. నా వచనమున నపత్యముఁ | గావించును గుంతి నీకుఁ గడు నెయ్యముతో;
నీ వగచిన యీ యర్థమ | చూవె మనంబునఁ దలంచుచుండుదు నేనున్‌.

1.5.132

వ. అని పలికి యప్పుడ కుంతీదేవిం బిలిచి మద్రరాజపుత్త్రి దయిన మనోవాంఛితంబుఁ జెప్పి ‘సకలలోక కల్యాణ కారు లాశ్వినులు గావున వారి నారాధించి యపత్యంబు వడయు’ మనిన గొంతియుం బతివచనానురూపంబు సేసిన మాద్రికి.

1.5.133

తే. కవలవారు సూర్యేందుప్రకాశతేజు లా | శ్వినులయంశములఁ బుట్టి రమరగుణులు
వారలకుఁ బ్రీతి నాకాశవాణి సేసె | నకుల సహదేవు లనియెడు నామయుగము.

1.5.134

క. ఊర్జితులు యుధిష్ఠిర భీ | మార్జున నకుల సహదేవు లన నిట్లు వివే
కార్జితయశు లుదయించిరి | నిర్జరుల వరప్రసాదనిర్మితశక్తిన్‌.

1.5.135

వ. అంత నట.

1.5.136

సీ. మృగ శాప భయమున జగతీశుఁ డప్పాండు | పతి శతశృంగపర్వతమునందుఁ
బత్నీసమేతుఁడై యత్నంబుతో ఘోర | తప మొనరించుచు విపులశక్తి
నమరవరప్రసాదమున ధర్మస్థితిఁ | గొడుకుల నేవురఁ బడసె ననియు
విని వసుదేవుండు మనమున హర్షించి | యనుజను మఱఁదిని ఘనుఁడు చూడఁ
తే. దనపురోహితుఁ గశ్యపుం డను మహాత్ముఁ | జీరి పుత్తెంచె నవ్విప్రుచేత భాగి
నేయు లగు కుమారులకు నమేయరత్న | భూషణావళు లిచ్చి విశేషలీల.

1.5.137

వ. అ క్కశ్యపుండును జనుదెంచి పృథామాద్రీ సహితుం డయి యున్న యప్పాండురాజుం గని వసుదేవు సందేశంబుఁ జెప్పి యక్కుమారులకు రత్నభూషణాంబరంబు లిచ్చి, క్రమంబునఁ జౌలోపనయనంబు లొనరించి, వేదాధ్యయనంబు సేయించుచున్నంత వసంతసమయం బఖిలజీవలోకానందజననం బై యేర్పడం జనుదెంచిన.

1.5.138

లయగ్రాహి. కమ్మని లతాంతములకు మ్మొనసి వచ్చు మధుపమ్ముల సుగీత నినదమ్ము లెసఁగెం; జూ
తమ్ముల లసత్కిసలయమ్ముల సుగంధి ముకుళమ్ములను నానుచు ముద మ్మొనర వాచా
లమ్ము లగు కోకిల కులమ్ముల రవమ్ము మధుర మ్మగుచు విన్చె; ననిశమ్ము సుమనోభా
రమ్ముల నశోకనికరమ్ములును జంపకచయమ్ములును గింశుకవనమ్ములును నొప్పెన్‌.

1.5.139

లయగ్రాహి. చందన తమాలతరులందు నగరుద్రుమములందుఁ గదళీవనములందు లవలీ మా
కంద తరుషండములయందు ననిమీలదరవిందసరసీవనములందు వనరాజీ
కందళిత పుష్పమకరందరసముం దగులుచుం దనుపు సౌరభము నొంది జనచిత్తా
నందముగఁ బ్రోషితులడెందము లలందురఁగ మందమలయానిల మమందగతి వీచెన్‌.

1.5.140

వ. ఇట్లు సర్వభూతసమ్మోహనంబయిన వసంతసమయంబునం బాండురాజు మదనసమ్మోహనమార్గణబందీకృత మానసుం డై మద్రరాజపుత్త్రి దైన మనోహరాకృతియందు మనంబు నిలిపి యున్నంత; నొక్కనాఁడు కుంతీదేవి బ్రాహ్మణభోజనంబు సేయించుచుండి మాద్రీరక్షణంబునం దేమఱియున్న యవసరంబున.

1.5.141

ఉ. చారుసువర్ణహాసినవచంపకభూషయు సిందువారము
క్తా రమణీయయున్‌ వకుళదామవతంసయు నై యపూర్వ శృం
గారవిలాసలీల యెసఁగం దనముందట నున్న మాద్రి నం
భోరుహనేత్రఁ జూచి కురుపుంగవుఁ డంగజరాగమత్తుఁ డై.

1.5.142

క. కిందముశాపము డెందము | నం దలఁపక శాపభయమునన్‌ మాద్రి గడున్‌
వందురి వారింపఁగ బలి | మిం దత్సంభోగసుఖసమీహితుఁ డయ్యెన్‌.

1.5.143

వ. దానం జేసి విగతజీవుం డైన యప్పాండురాజుం గౌఁగిలించుకొని మాద్రి యఱచుచున్న, దాని యాక్రందన ధ్వని విని వెఱచి కుంతీదేవి గొడుకులుం దానునుం బఱతెంచి పతియడుగులపయిం బడి యేడ్చుచున్న నెఱింగి, శతశృంగ నివాసులగు మునులెల్లం దెరలివచ్చి చూచి శోకవిస్మయాకులితచిత్తు లయి; రంతఁ గుంతీదేవి మాద్రి కి ట్లనియె.

1.5.144

ఉ. ‘నా కెడ యిమ్ము, లెమ్ము, కురునాథుమనఃప్రియధర్మపత్ని నే
నేకత మెట్టు లుండుదు? మహీపతితోడన పోదుఁ; బుత్త్రులం
జేకొని పెన్పు; నా పసుపుఁ జేయుము’ నావుడు మాద్రి దద్దయున్‌
శోకపరీతచిత్త యగుచుం బృథ కి ట్లనియెం బ్రియంబునన్‌.

1.5.145

తరువోజ. కురువంశ నిస్తారకుల ధర్మయుక్తిఁ గొడుకులఁ బడసి యి క్కురుకుంజరునకుఁ
గరము మనఃప్రీతి గావించి పుణ్యగతికిఁ గారణమవై కమలాక్షి! నీవు
దిరముగా నిష్టంబు దీర్చి; తే నిందు ధృతిఁ బతియిష్టంబు దీర్పన; కాన
యరిగెదఁ బతితోడ నన్యలోకంబునం దైనఁ బ్రీతిసేయఁగఁ గాంతు ననియు.

1.5.146

వ. ‘మఱియు మృగశాపభయం బెఱింగియు ని ట్లేమఱిన యతిప్రమత్తురాల; నే నిందుండి పుత్త్రుల రక్షింప నేర; నన్ను వారింప వలవదు; కొడుకుల నేమఱక రక్షించునది’ యని చెప్పి కుంతీదేవి వీడ్కొని మునిసహస్రంబునకు మ్రొక్కి మద్రరాజపుత్త్రి పతితోడన చితారూఢ యై యగ్నిశిఖల నపగత ప్రాణ యయ్యె; నంత నయ్యిరువుర యంగంబులు సంగ్రహించుకొని మహామునులు కుంతీదేవిం గొడుకుల నూరార్చి.

1.5.147

క. ధరణీరాజ్యవిభూతియు | పరిజనులను బాంధవులను బ్రజ విడిచి తప
శ్చరణతపస్వుల తనకున్‌ | శరణం బని నమ్మి పాండుజనపతి నెమ్మిన్‌.

1.5.148

క. కొడుకుల నిందఱ కిల్లడ | యిడి పరలోకమున కరిగె; నెడసేయక యి
ప్పుడ వీరలఁ గురువృద్ధుల | కడకుం గొని పోవ వలయు గజపురమునకున్‌.

1.5.149

వ. అని తమలో విచారించి, కుంతీదేవిని గుమారులం దోడ్కొని మునులెల్ల హస్తిపురంబునకు వచ్చి రంత.

1.5.150

చ. ‘సురల వరప్రసాదమునఁ జూవె సుపుత్త్రులఁ బాండురాజు భా
సురముగఁ గాంచెఁ; దత్సుతులఁ జూతము రం’ డని పౌరు లెల్ల నొం
డొరులకుఁ జెప్పుచుం దెరలి యొండొరులం గడవంగ వచ్చి చూ
చిరి భుజవిక్రమాధరిత సింహకిశోరులఁ బాండవేయులన్‌.

1.5.151

ఉ. ‘వీరలు దైవశక్తిఁ బ్రభవించిన వా రగు టేమి సందియం?
బీరమణీయకాంతి నుపమింపఁగ వేల్పుల కారె? యిట్టి యా
కారవిశేషసంపదఁ బ్రకాశితతేజముపేర్మిఁ జూడ సా
ధారణమర్త్యులే!’ యని ముదంబునఁ బౌరులు దమ్ముఁ జూడఁగన్‌.

1.5.152

వ. ముని సహస్ర పరివృతులయి జననీ సహితంబు పాండురాజ కుమారులు రాజమార్గంబు దఱియవచ్చి రాజమందిర ద్వారాసన్ను లగునంత, మంత్రి పురోహిత బ్రాహ్మణ నివహంబులు దుర్యోధన దుశ్శాసన ప్రముఖ ధార్తరాష్ట్రశతంబును నెదురు వచ్చి పాండవులం దోడ్కొని తెచ్చిన, భీష్మ విదుర ధృతరాష్ట్ర సత్యవత్యం బికాంబాలికలు మొదలుగా నమ్మునులకు నమస్కరించి; రంతం దమకు మ్రొక్కిన కుమారుల నతిస్నేహంబున నెత్తికొని. కుంతిని బ్రియపూర్వకంబున సంభావించి, పాండురాజవియోగదుఃఖితు లయి మహాశోకంబునం దేలుచున్న విదుర ధృతరాష్ట్రుల గాంధారీ సహితం బూరార్చి, యమ్మునులయం దొక్కవృద్ధతపస్వి ముని సహస్రానుమతంబున ని ట్లనియె.

1.5.153

ఉ. భానునిభుండు పాండుజనపాలుఁడు ఘోరతపంబు సేసి ధ
ర్మానిలవాసవాశ్వినుల దైనవరంబున శక్మిపేర్మితో
నీ నరనాథనందనుల నేవుర వంశవివృద్ధిపొంటెఁ బం
చాననసత్త్వులం బడసె నాశతశృంగమహానగంబునన్‌.

1.5.154

క. త్రిదశాధినాథసదృశుఁడు | ద్రిదశాలయమునకు మాద్రిదేవియుఁ దానున్‌
ముదమొనర నరిగె నేఁటికిఁ | బదియేడగునాఁడు దురితబంధచ్యుతుఁ డై.

1.5.155

క. కమనీయలీల నొక్కట | నమరపురంబునకుఁ జనిన యయ్యిరువుర యం
గము లివి; పితృమేధవిధి | క్రమ మొనరఁగ సంస్కరింపఁ గడఁగుఁడు వీనిన్‌.

1.5.156

వ. ‘ ఈ దేవియును బతితోడన పోవ సమకట్టినం బుత్త్రరక్షణార్థంబు మునిగణ ప్రార్థిత యై యెట్టకేనియు ధృతప్రాణ యయ్యె; నిక్కుమారులు కురుకులవిస్తారకులు, దేవమూర్తులు. యుధిష్ఠిరభీమార్జున నకులసహదేవు లనంగా దేవాధిష్ఠితనామంబులు దాల్చి, బ్రహ్మర్షి ప్రణీతోపనయను లై శ్రుతాధ్యయన సంపన్ను లగుచుఁ బెరుఁగుచున్నవారు వీరలం జేకొని కురువృద్ధులు ధర్మబుద్ధి రక్షించునది’ యని చెప్పి సిద్ధచారణగణంబులతో నమ్మహామును లంతర్ధానంబు సేసి; రంత వ్యాస భీష్మ ధృతరాష్ట్రుల యనుమతంబున.

1.5.157

సీ. వెలయంగఁ బితృమేధవిధి విచక్షణశీల | సద్భూసురోపదేశక్రమమున
నధికవిభూతితో నతిపవిత్రదే | శమున నయ్యంగముల్‌ సంస్కరించి,
పుణ్యస్వధామృతంబుల నొప్పఁగా | శ్రాద్ధవిధి యొనరించి, సద్విప్రతతికి
నగ్రహారములు దివ్యాంబరాభరణ శ | య్యాసనచ్ఛత్త్రగవాశ్వకరుల
ఆ. నిచ్చి, సర్వజనుల కెల్లను భోజన | దాన మొనరఁ జేసి, ధర్మవిదుఁడు
విదురుఁ డట్లు పాండువిభునకుఁ జేయించె | నన్యలోకహితంబు లైన విధులు.

1.5.158

వ. అంతఁ గృష్ణద్వైపాయనుండు వారి కందఱకు దుఃఖోపశమనంబుసేసి, యొక్కనాఁడు సత్యవతికి నేకాంతంబున ని ట్లనియె.

1.5.159

క. మతిఁ దలఁపఁగ సంసారం | బతి చంచల మెండమావులట్టుల సంప
త్ప్రతతు లతిక్షణికంబులు; | గతకాలము మేలు వచ్చుకాలముకంటెన్‌.

1.5.160

క. క్రూరులు విలుప్త ధర్మా | చారులు ధృతరాష్ట్రసుతు లసద్‌వృత్తులు ని
ష్కారణవైరులు వీరల | కారణమున నెగ్గు పుట్టుఁ గౌరవ్యులకున్‌.

1.5.161

వ. ‘దాని ధృతరాష్ట్రుండు తాన యనుభవించుంగాని మీ రీ దారుణంబుఁ జూడక వీరి విడిచి తపోవనంబున కరుగుం’ డని చెప్పి చనిన సత్యవతియుఁ బారాశర్యునుపదేశంబు భీష్మవిదురుల కెఱింగించి కోడండ్ర నంబికాంబాలికలం దోడ్కొని వనంబునకుం జని, తానును వారు నతిఘోరతపంబు సేసి కొండొక కాలమునకు శరీరంబులు విడిచి పుణ్యగతికిం బోయి; రిట ధృతరాష్ట్రుండును.

1.5.162

క. తన సుతులు పాండు సుతు లని | మనమున భేదింప కతిసమంజసభావం
బున నొక్క రూపకాఁ జే | కొని యుండెం బాండురాజుకొడుకులఁ బ్రీతిన్‌.

1.5.163

క. ధృతరాష్ట్రునెయ్యమున సం | తతవర్ధితు లగుచుఁ బాండుతనయులు వినయా
న్వితులు కుమారక్రీడా | రతు లయి యొడఁగూడి ధార్తరాష్ట్రులతోడన్‌.

1.5.164

క. గిఱుపునెడ నేయునెడ వడిఁ | బఱచునెడం బెనఁగునెడ నపార బలంబుల్‌
మెఱయునెడ భీమునకు నం | దొఱుఁ గీడ్పడఁ దొడఁగి రుద్ధతులు రాజసుతుల్‌.

1.5.165

క. వదలక పెనఁగి పదుండ్రం | బదియేవుర నొక్కపెట్ట పట్టి ధరిత్రి
జెదరఁ బడవైచి పవనజుఁ | డదయుండయి వీఁపు లొలియ నందఱ నీడ్చున్‌.

1.5.166

సీ. కూడి జలక్రీడ లాడుచోఁ గడఁగి యా | ధృతరాష్ట్రతనయుల నతులశక్తి
లెక్కించియుఁ బదుండ్ర నొక్కొక్క భుజమున | నెక్కించుకొని, వారి యుక్కడంగఁ
గ్రంచఱ నీరిలో ముంచుచు నెత్తుచుఁ | గారించి తీరంబు చేరఁ బెట్టుఁ;
గోరి ఫలార్థు లై వారల యెక్కిన | మ్రాఁకుల మొదళుల వీఁకఁ బట్టి
ఆ. వడిఁ గదల్చుఁ బండ్లు దడఁబడువారల | తోన ధరణిమీఁదఁ దొరఁగుచుండ;
నిట్టిపాట గాడ్పుపట్టిచే దుశ్శాస | నాదు లెల్ల బాధితాత్ము లైరి.

1.5.167

వ. దాని సహింపనోపక యొక్కనాఁడు దుర్యోధనుండు శకుని దుశ్శాసనాదులతో విచారించి యి ట్లనియె.

1.5.168

పృథ్వీవృత్తము. ఉపాంశువధఁ జేసి మధ్యము మదోద్ధతుం జంపి ని
స్సపత్నముగ ధర్మనందను నశక్తు బంధించి యే
నపాండవముగా సముద్రవలయాఖిలక్షోణి మ
త్కృపాణపటుశక్తి నత్యధికకీర్తి నై యేలెదన్‌.

1.5.169

వ. అని పాపబుద్ధియందుఁ గృతనిశ్చయుం డై దుర్యోధనుండు భీష్మ విదురు లెఱుంగకుండ భీమున కపాయంబు సేయ సమకట్టి, యంతరం బన్వేషించుచున్నంత నొక్కనాఁడు జలక్రీడావసరంబున.

1.5.170

ఉ. వేడుక నొక్కరుండు శతవీరకుమారులతోడఁ జల్లుఁ బో
రాడి జయించి యందఱ, ననంతపరిశ్రమపారవశ్యముం
గూడి ప్రమాణకోటి ననఘుండు సమీరణనందనుండు మే
యాడక నిద్రవోయె శిశిరానిలముల్‌ పయి వీచుచుండఁగన్‌.

1.5.171

క. ఆ పవనజు నతిఘనలతి | కాపాశావలుల నంటఁ గట్టించి మహా
కోపమున గంగమడువునఁ | ద్రోపించె సుయోధనుండు దురితకరుం డై.

1.5.172

క. అనిలసుతుం డంతన మే | ల్కని నీల్గుడు నతని వజ్రఘనకాయముఁ బొం
దినలతికాపాశము లె | ల్లను ద్రెస్సె మృణాళనాళలతికలపోలెన్‌.

1.5.173

ఆ. కర్మబంధనములు గ్రక్కునఁ బాయుడుఁ | బుణ్యగతికి నెగయు పురుషు నట్లు
బంధనంబు లెల్లఁ బాయుడు భీముండు | నీరిలోననుండి నెగయుదెంచె.

1.5.174

వ. మఱియు నొక్కనాఁడు.

1.5.175

క. జనపతి పనుపఁగ సారథి | ఘనవిషకృష్ణోరగములఁ గఱపించె శ్రమం
బున నిద్రితుఁ డైన ప్రభం | జనసుతుసర్వాంగమర్మసంధుల నెల్లన్‌.

1.5.176

క. అవిరళవిషఫణిదంష్ట్రలు | పవనజువజ్రమయతనువుపయితోలును నో
పవ భేదింపఁగఁ; బాప | వ్యవసాయులచెయ్వు లర్థవంతము లగునే?

1.5.177

చ. అలఘుబలుండు భీముఁడును నంతన మేల్కని యవ్విషోరగం
బులఁ జరణంబులం జమరి, ముక్కన వాతను నెత్తు రొల్కగాఁ
దలరఁగ సారథిం జఱచెఁ దా నపహస్తమునన్‌, వసుంధరా
తలమునఁ ద్రెళ్ళె సారథియుఁ దత్‌క్షణమాత్రన ముక్తజీవుఁ డై.

1.5.178

క. మఱియును నొకనాఁ డెవ్వరు | నెఱుఁగక యుండంగఁ గౌరవేంద్రుఁడు ధర్మం
బెఱుఁగక విష మన్నముతో | గుఱుకొని పెట్టించె గాడ్పుకొడుకున కలుకన్‌.

1.5.179

క. సముఁ డై యుయుత్సుఁ డయ్య | న్నము దుష్టం బగుటఁ జెప్పినను గుడిచె విషా
న్నము నాఁకటిపెలుచను; నది | యమృతాన్నం బయ్యె జీర్ణ మై మారుతికిన్‌.

1.5.180

వ. ఇట్లు దుర్యోధనుండు భీమునకుఁ దనచేసిన యెగ్గు లెల్లను గృతఘ్నునకుం జేసిన లగ్గులునుంబోలె నిష ల్ఫంబు లైన సిగ్గువడి, వెండియుఁ బాండవుల కెల్ల నపాయంబు సేయ నుపాయంబుఁ జింతించుచుండె; నంత భీష్మ నియోగంబున.

1.5.181

క. విలువిద్యఁ గఱచుచుండిరి | బలయుతులు కుమారకులు కృపద్రోణాచా
ర్యులతోడఁ గలసి యొక్కట | నలఘుపరాక్రమసమేతు లధికస్పర్ధన్‌.

1.5.182

వ. అనిన విని జనమేజయుండు వైశంపాయనున కి ట్లనియె.

1.5.183

తే. కృపుఁడు ద్రోణుండు ననఁగ సత్కీర్తులైన | వారిజన్మప్రకారంబు, వారు వచ్చి
కౌరవులకెల్ల గురు లైన కారణంబు | విప్రముఖ్య! నా కెఱుఁగంగ విస్తరింపు.

1.5.184

వ. అని యడిగిన వైశంపాయనుం డి ట్లనియె.

1.5.185

సీ. విన వయ్య! గౌతముం డనఁ బ్రసిద్ధుం డైన | మునికి శరద్వంతుఁ డను మహాత్ముఁ
డురుతరతేజుఁ డై శరసమూహంబుతో | నుదయించి, వేదముల్‌ చదువ నొల్ల
కతిఘోరతపమున నుతభూసురోత్తముల్‌ | వేదముల్‌ చదువున ట్లాదరమున
సర్వాస్త్రవిదుఁడు ధనుర్వేద మొప్పఁగఁ | బడసి, మహానిష్ఠఁ గడఁగి తపము
ఆ. సేయుచున్న దివిజనాయకుఁ డతిభీతి | నెఱిఁగి, వానితపముఁ జెఱుపఁ బనిచె
జలజనయనఁ దరుణి జలపద యనియెడు | దాని; నదియు వచ్చె వానికడకు.

1.5.186

క. అమ్ముదితఁ జూచి కాముశ | రమ్ములచే విద్ధుఁ డై శరద్వంతుఁడు చి
త్త మ్మలర మదనరాగర | సమ్మునఁ ద న్నెఱుఁగకుండెఁ జంచలతనుఁ డై.

1.5.187

క. ఆ తరుణికటాక్షేక్షణ | పాతము గౌతమున కపుడు పటుబాణధనుః
పాతముతోడన రేతః | పాతము గావించె రాగపరవశుఁ డగుటన్‌.

1.5.188

వ. దాని నెఱింగి శరద్వంతుం డయ్యాశ్రమంబు విడిచి చని యొండుచోటం దపంబు సేయుచుండె; నవ్వీర్యం బొక్క శరస్తంబంబున ద్వివిధం బయి పడిన, నందొక కొడుకునుం గూఁతురుం బుట్టి; రంత శంతనుండు మృగయా వినోదార్థం బరిగిన వానిసేనాచరుం డా శరస్తంబంబున నున్న కొడుకుం గూఁతుఁ దత్సమీపంబున నున్న శరచాప కృష్ణాజినంబులుం జూచి, యివి యెయ్యేనియు నొక్కధనుర్వేదవిదుం డయిన బ్రాహ్మణునపత్యం బగు నని శంతనునకుం జూపిన, శంతనుండును వారలఁ జేకొని కృపాయత్తచిత్తుం డయి పెనుచుటం జేసి యయ్యిరువురుఁ గృపుఁడును గృపియు ననం బెరుఁగుచున్నంత.

1.5.189

క. చనుదెంచి శరద్వంతుం | డనవద్యుఁడు దనయపత్య మని వారిని శం
తనున కెఱిఁగించి కృపు న | త్యనుపము నుపనీతుఁ జేసె నధికప్రీతిన్‌.

1.5.190

శా. వేదంబుల్‌ చదివించె భూసురులతో విఖ్యాతిగా, నాత్మసం
వేదిం జేసెఁ, జతుర్విధం బగు ధనుర్వేదంబు నానాస్త్రవి
ద్యాదాక్షిణ్యముతోడఁ దాన కఱపెం, దద్విత్తముల్‌ సూచి సం
వాదుల్‌గాఁ దననందనుం గృపు శరద్వంతుండు దాంతాత్ముఁ డై.

1.5.191

వ. అట్టి కృపాచార్యు రావించి భీష్ముం డతిభక్తిం బూజించి వానితోడఁ దన మనుమల నందఱ విలువిద్య గఱవం బంచిన.

1.5.192

క. సవిశేషముగ ధనుర్వే | దవిశారదు లైరి కడు జితశ్రములై పాం
డవ ధృతరాష్ట్రాత్మజ యా | దవు లాదిగ రాజసుతులు తత్‌కృపుశిక్షన్‌.

1.5.193

వ. ‘మఱియు వారల కాచార్యుం డైన ద్రోణుజన్మంబును వానిచరిత్రంబును జెప్పెద విను’ మని జనమేజయునకు వైశంపాయనుం డి ట్లనియె.

1.5.194

క. సద్వినుతచరిత్రుండు భ | రద్వాజుం డను మునీశ్వరప్రవరుఁడు గం
గాద్వారమునఁ దపంబు జ | గద్వంద్యుఁడు సేయుచుండె గతకల్మషుఁ డై.

1.5.195

సీ. అమ్ముని యొక్కనాఁ డభిషేచనార్థంబు | గంగకుఁ జని, మున్న కరము లీల
నందు జలక్రీడ లాడుచునున్న య | ప్సరస ఘృతాచి యన్సదమలాంగి
పటుపవనాపేత పరిధాన యైన య | య్యవసరంబునఁ జూచి, యమ్మృగాక్షిఁ
గామించి యున్నఁ, దత్కామరాగంబున | యతిరేకమునఁ జేసి యాక్షణంబ
తే. తనకు శుక్లపాతం బైన, దానిఁ దెచ్చి | ద్రోణమున సంగ్రహించిన, ద్రోణుఁ డనఁగఁ
బుట్టె శుక్రునంశంబునఁ బుణ్యమూర్తి | ధర్మతత్త్వజ్ఞుఁ డగు భరద్వాజమునికి.

1.5.196

వ. మఱియు ననంతరంబ భరద్వాజసఖుండైన పృషతుం డను పాంచాలపతి మహాఘోరతపంబు సేయుచు నొక్కనాఁడు దనసమీపంబున వాసంతికాపచయవినోదంబున నున్న యప్సరస మేనక యను దానిం జూచి, మదనరాగంబున రేతస్స్కందం బయిన దానిం దన పాదంబునఁ బ్రచ్ఛాదించిన, నందు ద్రుపదుం డనుకొడుకు మరుదంశంబునఁ బుట్టిన, వాని భరద్వాజాశ్రమంబునఁ బెట్టి చని పృషతుండు పాంచాలదేశంబున రాజ్యంబు సేయుచుండె, ద్రుపదుండును ద్రోణునితోడ నొక్కట వేదాధ్యయనంబు సేసి విలువిద్యయుం గఱచి యా పృషతు పరోక్షంబునం బాంచాలదేశంబున కభిషిక్తుం డయ్యె; ద్రోణుండును నగ్నివేశ్యుం డను మహామునివలన ధనుర్విద్వా పారగుం డై తత్ప్రసాదంబున నాగ్నేయాస్త్రం బాదిగా ననేకదివ్యబాణంబులు వడసి, భరద్వాజు నియోగంబునఁ బుత్రలాభార్థంబు కృపుని చెలియలిఁ గృపి యనుదాని వివాహం బయి, దానియం దశ్వత్థామ యను కొడుకుం బడసి, యొక్కనాఁడు.

1.5.197

క. అనవరతము బ్రాహ్మణులకుఁ | దనియఁగ ధన మిచ్చు జామదగ్న్యుఁడు రాముం
డను జనవాదపరంపర | విని యరిగెను వానికడకు విత్తాపేక్షన్‌.

1.5.198

క. అరిగి మహేంద్రాచలమునఁ | బరమతపోవృత్తి నున్న భార్గవు లోకో
త్తరు భూరికర్మనిర్మల | చరితుని ద్రోణుండు గాంచి సద్వినయమునన్‌.

1.5.199

వ. ‘ఏను భారద్వాజుండ, ద్రోణుం డనువాఁడ; నర్థారి నై నీకడకు వచ్చితి’ ననినఁ బరశురాముం డి ట్లనియె.

1.5.200

చ. కలధన మెల్ల ముందఱ జగన్నుత | విప్రుల కిచ్చి, వార్ధిమే
ఖలనిఖిలోర్వి యంతయును గశ్యపుఁ డ న్ముని కిచ్చితిన్‌, శరం
బులును శరీరశస్త్రములుఁ బొల్పుగ నున్నవి; వీనిలోన నీ
వలసినవస్తువుల్‌ గొను ధ్రువంబుగ నిచ్చెద నీకు నావుడున్‌.

1.5.201

క. ధనములలో నత్యుత్తమ | ధనములు శస్త్రాస్త్రములు; ముదంబున వీనిం
గొని కృతకృత్యుఁడ నగుదును | జననుత! నా కొసఁగు మస్త్రస్త్రశస్త్రచయంబుల్‌.

First 200 of 262 passages. Read on