Andhra Mahabharatamu 1.6.231
Āndhra Mahābhāratamu 1.6.231
- Language
- Telugu
1.6.231
వ. ‘దీని నెఱింగి మీకు హితోపదేశంబు సేయ వచ్చితి; నిఖిల ధర్మవిదుల రయి వినీతుల రయిన మీకు బాంధవవియోజనం బయిన యీ కర్మంబు పురాకృతంబు; దీనికి శోకింపవలవదు; కొండొకకాలంబునకు మీరును బాంధవులం గలసి యెప్పటియట్ల రాజ్యంబు సేయుదు; రిది శాలిహోత్రుతపఃప్రభావంబున నైన కొలను; దీని జలంబు లుపయోగించినవారికి బుభుక్షాపిపాసలు లే; వివ్వనస్పతియును శీతవాతాతపవర్షంబువలన రక్షించు; నిం దొరు లెఱుంగకుండఁ గార్యార్థుల రై కతిపయదినంబు లుండి యేకచక్రపురంబున కేఁగి బ్రాహ్మణభావంబున బ్రాహ్మణగోష్ఠి నుండి నారాక ప్రతీక్షించియుండు నది’ యని కఱపి తనకు వినయావనతులయి కృతాంజలు లయిన మనుమల దీవించి కౌఁగలించుకొని, బాష్పపూరితనయన యయి మ్రొక్కియున్న కోడలి నూరార్చి; ‘నీకొడుకు ధర్మనిత్యుం; డీ యుధిష్ఠిరుండు నారాయణుభుజంబులంబోని తననలువురుదమ్ములబలంబున సర్వపార్థివుల శాసించి సార్వభౌముం డై రాజసూయాశ్వమేధాదిక్రతువులు సేసి పితృపైతామహం బైన రాజ్యలక్ష్మి ననుభవించుచుం గురుకులంబునెల్లఁ బవిత్రంబు సేయు’ నని శోకోపశమనంబుఁ జేసి; హిడింబం జూచి ‘దీనిపేరు కమలపాలిక యిది భీమునకు వశవర్తి యయి పరిచరించి మహాసత్త్వుం డయిన కొడుకుం గాంచు; నాతండు మి మ్మందఱ నాపద్విషయంబున నుద్ధరించు’ నని చెప్పి మునివరుండు తిరోహితుం డైన.