Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 1.6: ఆదిపర్వము — షష్ఠాశ్వాసము

Āndhra Mahābhāratamu 1.6

Language
Telugu

ఆదిపర్వము — షష్ఠాశ్వాసము

1.6.1

క. శ్రీ జయవిభాసి! వినమ | ద్రాజన్య కిరీటమణి విరాజిత పాదాం
భోజ! భువనైకసుందర | రాజాన్వయతిలక! రాజరాజనరేంద్రా!

1.6.2

వ. అ క్కథకుండు శౌనకాది మహామునులకుం జెప్పె; నట్లు కృతాస్త్ర శస్త్రులయిన రాజకుమారుల విద్యాకౌశలంబు వ్యాస గాంగేయ విదుర కృప శల్య శకుని సోమదత్తాదుల సమక్షంబునం జూప సమకట్టి యొక్కనాఁడు ద్రోణుండు ధృతరాష్ట్రున కి ట్లనియె.

1.6.3

క. ఘోరాస్త్రశస్త్రవిద్యల | నారూఢత మిగుల నిపుణు లైరి కుమారుల్‌
మీరలు వీరల విద్యా | పారము సను టెఱుఁగవలయు భవదీయ సభన్‌.

1.6.4

వ. అనిన నట్ల చేయుదు నని ధృతరాష్ట్రుండు ‘గుమారుల విద్యాసందర్శనరంగంబు రమ్యంబుగాఁ జేయింపు’ మని విదురుం బంచిన, నతండును దాని శాస్త్రవిహిత ప్రమాణోపేత వృత్తాయామంబును, నపాకృత వృక్ష గుల్మ వల్మీకంబును, నంగీకృత పూర్వోత్తరప్లవంబును, సమీకృత నిమ్నోన్నత ప్రదేశంబును, దూరీకృత కంటక పాషాణ శల్య శకలంబును, విరజీకృత రజోధూసర స్థలంబును, విరచిత బహువిధ ప్రేక్షాగారాంచిత మణిమయమంచ ప్రపంచంబును,నానాధ్వజనవపల్లవరంభాస్తంభమాలాలంకృతద్వారతోరణంబును, బ్రతిదిశనిర్వర్తిత శాంతిక బలి విధానంబునుంగాఁ జేయించినం, బంచాంగశుద్ధదినశుభముహూర్తంబున ధృతరాష్ట్రుండు గాంధారీ పురస్కృత దేవీశతపరివృతుం డై, వివిధభూషణ భూషితానేక విలాసినీనివహంబుతోఁ జనుదెంచి, విలంబిత కదంబక స్థూలముక్తాఫలదామ రమణీయం బై, యాబద్ధమరకత వజ్రవైడూర్య పద్మరాగప్రభాప్రకర వ్యతికర విరచితా పూర్వ సురచాపచారుగౌరవం బై, యతిమనోహరం బైన శాతకుంభమయ ప్రేక్షాగారంబున నున్న.

1.6.5

తే. అందుఁ గరమొప్పి సుందరీబృంద మఖిల | రత్నరాజితకనకధరాధరేంద్ర
కందరాంతరమున నున్న సుందరామృ | తాశనాంగనాబృందంబు ననుకరించె.

1.6.6

తే. సుతులవిద్యాప్రవీణతఁ జూచువేడ్క | నెంతయును సంతసంబునఁ గుంతిదేవి
రాజసన్నిధి గాంధారరాజపుత్రి | కెలన నుండె నున్మీలితనలిననేత్ర.

1.6.7

వ. మఱియును.

1.6.8

సీ. వ్యాసపురస్కృతావనిదేవనివహంబుఁ | గృప శల్య శకుని గాంగేయ విదుర
సోమదత్తాది భాసురగురుబాంధవ | మిత్త్రవర్గంబు, నమేయ మంత్రి
సామంత మండలేశ్వరసమూహంబును | గాయక వైతాళికప్రవరులుఁ
దమతమ నియమిత స్థానంబులం దోలి | నుండిరి; బోరన నులిసె భేరు;
ఆ. లస్త్రదర్శనాగతాఖిల క్షత్రియ | వైశ్యశూద్రవివిధవర్ణజనుల
కలకలంబు ప్రళయకాలసంక్షోభితాం | భోనిధిస్వనంబుఁ బోలెఁ జెలఁగె.

1.6.9

వ. అట్టియవసరంబున నాచార్యుండు శుక్లాంబరాభరణమాల్యానులేపన యజ్ఞోపవీతపలితకేశశ్మశ్రు శోభిత దేహుం డై రంగమధ్యంబున నశ్వత్థామసహితుం డై, విముక్తజలదజాలవియన్మధ్యంబున నంగారకసహితుం డైన యాదిత్యుండునుంబోలె నున్న నగణ్యభూసురవరేణ్యపుణ్యాహవాచనానంతరంబున.

1.6.10

శా. ద్రోణాచార్యుపిఱుంద నొప్పి దృఢహస్తుల్‌, బద్ధగోధాంగుళీ
త్రాణుల్‌, మార్గణపూర్ణతూణులు, మహాధన్వుల్‌ కుమారుల్‌ తను
త్రాణోపేతులు రంగమధ్యమున నంతన్‌ నిల్చి రుద్యద్గుణ
శ్రేణీరమ్యులు ధర్మజప్రముఖు లై జ్యేష్ఠానుపూర్వంబుగన్‌.

1.6.11

వ. అట్లు నిలిచి, రక్తచందనదిగ్ధాంగులు రక్తమాల్యాంబరాభరణులు రక్తపతాకులు రక్తాంతలోచను లై యాచార్యు ననుమతంబున.

1.6.12

సీ. అసిచర్మకౌశలం బమరంగఁ జూపెడు | వారును, దృఢసౌష్ఠవంబు లొప్పఁ
దమతమనామాంకితము లైన శరముల | నేర్పడ లక్ష్యంబు లేయువారు,
హయ మదద్విరద రథారూఢ దక్షతఁ | బ్రకటించువారును, బ్రాసశక్తి
కుంత తోమర గదాకుశలత్వ మెఱిఁగించు | వారునుగా నిట్లు వసుధలోని
ఆ. రాజసుతులతోడ రమణఁ బాండవధృత | రాష్ట్రసుతులు వృద్ధరాజులొద్దఁ
దద్దయును ముదమునఁ దమతమవిద్యలు | మెఱసి రెల్లజనులు మెచ్చి పొగడ.

1.6.13

వ. అంత ననంతబలపరాక్రము లగు భీమదుర్యోధను లుద్యద్గదాహస్తు లయి మహామత్సరంబుతో నేక శృంగసముత్తుంగశైలద్వయంబు ననుకరించుచు వశానిమిత్తక్రుద్ధగంధసింధురంబులుంబోలె నొండురులం దాఁకి సవ్యాపసవ్యచిత్రమండలమార్గంబుల గదాకౌశలంబు మెఱయునెడ.

1.6.14

మ. అవనీచక్రము పాదఘాతహతి నల్లాడంగ నత్యుగ్రభై
రవహుంకార రవంబునన్‌ వియదగారంబెల్ల భేదిల్లఁ బాం
డవకౌరవ్యగదావిఘట్టన మకాండప్రోత్థమై భావిపాం
డవకౌరవ్యరణాభిసూచన పటిష్ఠం బయ్యె ఘోరాకృతిన్‌.

1.6.15

క. ఆ రాజసుతులవిద్యా | పారగపటు చేష్టితములఁ బరువడి నగ్గాం
ధారీధృతరాష్ట్రుల కతి | ధీరుఁడు విదురుండు సెప్పి తెలుపుచునుండెన్‌.

1.6.16

వ. అంత భీమదుర్యోధనుల గదా కౌశలంబు సూచుజనులపక్షపాతజనిత పరస్పర క్రోధ వచనంబులు విని ద్రోణుండు రంగభంగభయంబున నశ్వత్థామంబంచి వారి నిద్దఱ వారించి, వారాశియుంబోలె బోరన మ్రోయుచున్న వాదిత్రశబ్దంబు లుడిపి, ‘నా ప్రియశిష్యుండయిన యర్జును ధనుర్విద్యాకౌశలంబుఁ జూడుం’ డనిన నయ్యాచార్యు వచనానంతరంబున.

1.6.17

ఉ. హారివిచిత్రహేమకవచావృతుఁ, డున్నతచాపచారుదీ
ర్ఘోరుభుజుండు, భాస్వదసితోత్పలవర్ణుఁడు, సేంద్రచాపశం
పారుచిమేఘమో యనఁగ బాండవమధ్యముఁ డొప్పి బద్ధతూ
ణీరుఁడు రంగమధ్యమున నిల్చె జనంబులు దన్నుఁ జూడఁగన్‌.

1.6.18

క. నరు నింద్రాత్మజు నింద్రా | వరజసఖున్‌ వీరుఁ బాండవప్రవరు ధను
ర్థరుఁ జూచి, చూపఱెల్లం | బరమాద్భుతచిత్తు లగుచుఁ బలికిరి తమలోన్‌.

1.6.19

తే. వీఁడె కృతహస్తుఁ డఖిలాస్త్రవిద్యలందు | వీఁడె యగ్రగణ్యుఁడు ధర్మవిదులలోన,
వీఁడె భరతవంశం బెల్ల వెలుఁగఁ గుంతి | కడుపు చల్లఁగాఁ బుట్టిన ఘనభుజుండు.

1.6.20

క. అని పలుకుజనులపలుకులు | విని గొంతి యనంతహర్షవిస్తారితలో
చన యై నందను నృపనం | దనసంఘములోనఁ జూచి తద్దయుఁ బొంగెన్‌.

1.6.21

క. చారుమనస్సమ్మదరస | పూరము వెలివేర్చునట్లు పొలఁతికి విగళ
ద్భూరిస్తనజనితపయో | ధారలు నానందబాష్పధారలు నొప్పెన్‌.

1.6.22

వ. అయ్యర్జునుస్తుతివచనంబు లొక్కట జనసంఘంబువలన నెగసి వియత్తలవిదళనం బయిన నమ్మహాధ్వని విని యదరిపడి ధృతరాష్ట్రుం ‘డిది యేమి రభసం?’ బని విదురు నడిగిన నాతం డి ట్లనియె.

1.6.23

క. భూరిభుజుం డర్జునుఁ డతి | శూరుఁడు దనయస్త్రవిద్యఁ జూపఁగ రంగ
త్ప్రారంభుఁ డయిన నతని న | వారితముగఁ బొగడుజనరవం బిది యధిపా!

1.6.24

క. అనవుడు ధృతరాష్ట్రుఁడు దన | మనమున సంతోషమంది మానుగ వీనుల్‌
గనిన ఫల మిపుడు గంటిన్‌ | వినఁ గంటినిఁ బాండుసుతుల విద్యాశక్తుల్‌.

1.6.25

క. భూరినిజద్యుతితోడఁ బృ | థారణిసంభూతపాండవాగ్నిత్రితయం
బారఁగ నస్మత్కులదురి | తోరుతరారణ్యదాహ మున్నతిఁ జేయున్‌.

1.6.26

వ. అని పొగడుచుండ నర్జునుం డాచార్యుననుమతంబున నస్త్రలాఘవవైచిత్ర్య ప్రకాశనపరుం డయి యెల్లవారును జూచుచుండ.

1.6.27

సీ. ఆగ్నేయశరమున నతిభీకరాగ్నియు | వారుణాస్త్రమున దుర్వారజలము
ననిలబాణంబున నధికానిలంబును | మేఘాస్త్రమున మహామేఘచయముఁ
బుట్టించు మఱియును భూమిబాణంబున | భూప్రవిష్టుం డగు, భూరిఘోర
శైలబాణంబున శైలరూపము దాల్చు | వీరుఁ, డదృశ్యాస్త్రవిద్యపేర్మిఁ
తే. దా నదృశ్యదేహుం డగుఁ, దత్‌క్షణంబ | హ్రస్వుఁ డగు దీర్ఘుఁ డగు సూక్ష్ముఁ డగు రయంబు
తోడ రథమధ్యగతుఁ డగు ధూర్గతుండు | నగు మహీతలగతుఁ డగు నద్భుతముగ.

1.6.28

వ. మఱియుం బాఱెడుసింహవ్యాఘ్రవరాహాదిమృగంబుల ముఖంబులం దొక్కొక్కయ మ్మేసినట్ల యేనేసి యమ్ము లతిలాఘవంబున నేసియు, రజ్జుసమాలంబితం బయిన గోశృంగంబునం దేకవింశతిశరంబులు వరుసన నాట నేసియు, ని ట్లస్త్రవిద్యావైచిత్ర్యంబు మెఱసి గదాఖడ్గాదివివిధాయుధదక్షతం జూపి యర్జునుండు జనుల కాశ్చర్యంబు సేయుచున్నంతఁ, గర్ణుండును నిజవిద్యాకౌశలంబు మెఱయ సమకట్టి రంగద్వారంబున నిలిచి భుజాస్ఫాలనంబు సేసిన.

1.6.29

మ. జనులెల్లం గడుసంభ్రమింపఁగ నజస్రంబై భుజాస్ఫాలన
ధ్వని శైలప్రకరంబుపైఁ బడు మహాదంభోళిశబ్దంబొకో
యన వీతెంచినఁ బాండవుల్‌ సనిరి ద్రోణాచార్యు డాయన్‌, సుయో
ధను వేష్టించిరి తమ్ము లందఱును దద్ద్వారంబు వీక్షించుచున్‌.

1.6.30

వ. అంత.

1.6.31

శా. సాలప్రాంశు నిజోజ్జ్వలత్కవచు శశ్వత్కుండలోద్భాసితున్‌
బాలార్క ప్రతిమున్‌ శరాసనధరున్‌ బద్ధోగ్రనిస్త్రింశు శౌ
ర్యాలంకారు సువర్ణవర్ణు ఘనుఁ గర్ణాఖ్యున్‌ జగత్కర్ణపూ
ర్ణాలోలద్గుణుఁ జూచి చూపఱు ప్రభూతాశ్చర్యులై రచ్చటన్‌.

1.6.32

వ. కర్ణుండును జనుల నందఱ నదల్చి చొత్తెంచి, రంగమధ్యంబున నిలిచి, కలయం జూచి, కృపద్రోణాచార్యులకు నమస్కరించి, సజలజలధరధ్వానగంభీరవచనంబుల నర్జును నాక్షేపించి యి ట్లనియె.

1.6.33

క. నీవ కడునేర్పుకాఁడవు | గా వలవదు; వీనిఁ గొన్ని గఱచితి మేమున్‌
నీవిద్యలెల్లఁ జూపుదు | మే వీరుల సూచి మేలుమే లని పొగడన్‌.

1.6.34

క. అనిన నినతనయుపలుకులు | జనులకు విస్మయము, సవ్యసాచికిఁ గోపం
బును సిగ్గును, మఱి దుర్యో | ధనునకుఁ బ్రీతియును జేసెఁ దత్‌క్షణమాత్రన్‌.

1.6.35

వ. అంత ద్రోణుచేత ననుజ్ఞాతుం డయి కర్ణుం డర్జునుచూపిన యస్త్రవిద్యావిశేషంబులెల్ల నశ్రమంబునఁ జూపినఁ జూచి, దుర్యోధనుండు దానుం దమ్ములును గర్ణునిం గౌఁగిలించుకొని ‘నాతో బద్ధసఖ్యుండ వయి నాకును బాంధవులకును హితంబు సేసి నారాజ్యభోగంబులను నీవును నుపయోగింపు’ మనిన ‘నట్ల చేయుదు’ నని కర్ణుం డాతనితోడి యిష్టసఖిత్వంబున కొడంబడి, ‘యిమ్మూఁగిన రాజలోకంబును నీవును జూడఁ బార్థుతో ద్వంద్వయుద్ధంబు చేయవలయు’ ననిన ధార్తరాష్ట్రమధ్యంబున నున్న యక్కర్ణుం జూచి పార్థుం డి ట్లనియె.

1.6.36

క. పిలువంగఁబడక సభలకు | బలిమిం జని పలుకు పాపభాగుల లోకం
బులకుఁ జన వేఁడి పలికెదు | పలువ! యెఱుంగవు పరాత్మపరిమాణంబుల్‌.

1.6.37

క. అనిన విని పార్థునకు ని | ట్లనియె నినాత్మజుఁడు ‘దుర్బలాశ్వాసక్షే
పనిబంధమ్ములు వలుకక | ఘననిశితాస్త్రములఁ బలుకఁ గడఁగుము నాతోన్‌’.

1.6.38

క. ఈ రంగభూమి యస్త్రవి | శారదు లగువారి కెల్ల సామాన్యముగా
కారయ వీరికిఁ జొర నగు | వీరికిఁ గా దను విచారవిషయము గలదే?

1.6.39

వ. అని గర్వించి దుర్యోధనానుమతంబునఁ బార్థుతో ద్వంద్వయుద్ధంబు సేయంబూని రణసన్నద్ధుం డయి రవితనయుండు రంగమధ్యంబున నున్నంత, నర్జునుండును నాచార్యభ్రాతృచోదితుం డై యుగాంత కాలానలుండునుంబోలెఁ బ్రతిఘటించి నిలిచిన.

1.6.40

మ. జనితామర్షణుఁ డంతఁ బార్థుపయిఁ బర్జన్యాస్త్ర మక్కర్ణుఁ డే
సె; నపారం బయి భూనభోంతరముఁ దజ్జీమూతయూథంబు గ
ప్పినఁ దద్ధ్వాంతతిరోహితాపఘనుఁ డై బీభత్సుఁ డుండెన్‌; విరో
చనుఁ డాత్మద్యుతి విస్తరించె సుతుపై సంప్రీతచేతస్కుఁ డై.

1.6.41

వ. అయ్యవసరంబున దుర్యోధనుందొట్టి ధృతరాష్ట్రనందను లందఱుఁ గర్ణువలన నుండిరి; భీష్మద్రోణకృప పాండవులు పార్థువలన నుండి రంత.

1.6.42

క. రవిసుతపార్థులఘోరా | హవమునకును వెఱచుచున్నయది కుంతి తదు
ద్భవఘనతరశరతిమిరౌ | ఘవృతాంగుఁ దనూజుఁ జూడఁ గానక వంతన్‌.

1.6.43

క. ధృతి దఱిఁగి మోహమూర్ఛా | న్విత యైనను సంభ్రమించి విదురుఁడు ప్రత్యా
గతజీవఁ జేసె నప్పుడ | యతిశీతలచందనోదకాసేకమునన్‌.

1.6.44

వ. అంత నర్జునుం డనిలబాణంబున నమ్మేఘపటలంబు పఱవనేసి యాదిత్యసమతేజుం డయి యుండె; నంత విదురదర్శితు లైన యక్కర్ణార్జునులం జూచి కుంతి సంతసిల్లె; నపుడు ధర్మవిదుం డఖిలద్వంద్వయుద్ధసమాచార నిపుణుండు కృపాచార్యుం డయ్యిద్దఱ నడుమ నిలిచి కర్ణున కి ట్లనియె.

1.6.45

చ. కురుకులజుండు పాండునకుఁ గుంతికిఁ బుత్త్రుడు, రాజధర్మబం
ధురచరితుండు; నీ వితనితోడ రణం బొనరించెదేని వి
స్తరముగ నీదువంశమును దల్లిని దండ్రిని జెప్పు,; చెప్పినన్‌
దొరయగుదేని నీ కెదిరి దోర్బలశక్తి నితండు సూపెడిన్‌.

1.6.46

వ. అనిన విని కర్ణుండు దనకులంబును దల్లిదండ్రులను జెప్ప సిగ్గుపడి తలవాంచి యున్నం జూచి దుర్యోధనుండు గృపున కి ట్లనియె.

1.6.47

క. కులముగలవాఁడు, శౌర్యము | గలవాఁడును, నధికసేన గలవాఁడును, భూ
తలమున రా జను నామము | విలసిల్లఁగఁ దాల్చు మూఁడువిధముల పేర్మిన్‌.

1.6.48

తే. రాజవరుఁ డైన పార్థుతో రాజు గాని | యీతఁ డని సేయఁగాఁ దగఁడేని వీని
నెల్లవారును జూడంగ నీక్షణంబ | రాజుఁ జేసెద నే నంగరాజ్య మిచ్చి.

1.6.49

వ. అని యప్పుడ భీష్మధృతరాష్ట్రులకుం జెప్పి వారియనుమతంబున మహామహీసురసహస్రంబునకు గోసహస్రా యుతంబు దానంబు సేసి ‘యంగరాజ్యంబునకు వీఁ డర్హుం డయ్యెడ| మను బ్రాహ్మణవచనంబు వడసి, కర్ణుం గాంచనపీఠంబున నునిచి యంగరాజ్యమున కభిషిక్తుం జేసినఁ, గర్ణుండును మణిమకుట కేయూర హారాది భూషణ భూషితుం డై సకలరాజచిహ్నంబుల నొప్పి పరమహర్షంబుతోడం గురుపతి కి ట్లనియె.

1.6.50

క. బృహదబ్ధిమేఖలాఖిల | మహీతలక్షత్త్రవరసమక్షమున మహా
మహిమాన్వితుఁగా నన్నును | మహీశుఁగాఁ జేసి తతిసమర్థత వెలయన్‌.

1.6.51

క. ‘దీనికి సదృశముగా మఱి | యే నేమి యొనర్తు నీకు నిష్టం?’ బనినన్‌
‘మానుగ నాతోఁ జెలిమి మ | హీనుతముగఁ జేయు; మిదియ యిష్టము నాకున్‌.’

1.6.52

వ. అనిన విని దుర్యోధనున కెంతయు సంతోషంబుగాఁ గర్ణుం డతనితోడి యిష్ట సఖిత్వంబున కొడంబడియె, నంతఁ గొడుకు రాజ్యాభిషేకోత్సవంబు సూచి హర్షపరవశుం డయి సూతుండు రథంబు డిగ్గి కర్ణునొద్దకుం బఱతెంచినఁ, గర్ణుండును బితృగౌరవంబున సంభ్రమించి వానికి వినయవినమితోత్త మాంగుండయిన.

1.6.53

తే. కడఁగి సూతుండు పుత్త్రకుఁ గౌఁగిలించి | కొని తదీయమూర్ధాఘ్రాణ మొనరఁ జేసి
యంగరాజ్యాభిషేకార్ధ్రమైన శిరముఁ | దడిపె వెండియు హర్షాశ్రుతతుల నొప్ప.

1.6.54

వ. దానిం జూచి భీముండు గర్ణుని సూతకులసంభవుంగా నెఱింగి నగుచు ని ట్లనియె.

1.6.55

క. నీదు కులమునకుఁ దగఁగఁ బ్ర | తోదము గొని రథము గడపఁ దొరఁగుము నృపధ
ర్మోదయుఁ డగు నర్జునుతోఁ | గా దనక రణంబు సేయఁగా నీ కగునే?

1.6.56

వ. మఱి యదియునుం గాక.

1.6.57

తే. ఉత్తమక్షత్త్రియప్రవరోపయోగ్య | మైన యంగరాజ్యంబు నీ కర్హ మగునె?
మంత్రపూత మై గురుయజమానభక్ష్య | మగుపురోడాశ మది గుక్క కర్హ మగునె!

1.6.58

వ. అనినం గర్ణుండు వెల్లనయి యెద్దియుం జేయునది నేరక దీర్ఘోష్ణనిశ్వాసవ్యాకులిత వదనుం డయి యాకాశంబు వలన నున్న యాదిత్యుం జూచుచు మిన్నకుండె; నంత నంతర్విలులితుం డయిన యక్కర్ణుం జూచి భ్రాతృపద్మవన మధ్యంబుననుండి దుర్యోధనమదాంధగంధసింధురంబు వెలువడి వచ్చి కడు నలిగి భీమున కి ట్లనియె.

1.6.59

క. అనిలజ! నీ కి ట్లని ప | ల్కను దలఁపను నగునె? లేడి కడుపునఁ బులి పు
ట్టునె? యిట్టి దివ్యతేజం | బున వాఁ డధమాన్వయమునఁ బుట్టునె చెపుమా!

1.6.60

సీ. శూరులజన్మంబు సురలజన్మంబును | నేఱులజన్మంబు నెఱుఁగ నగునె?
మొగిని దధీచియెమ్మునఁ బుట్టదయ్యెనే | వాసవాయుధ మైన వజ్ర మదియు;
గాంగేయుఁ డన మఱి కార్తికేయుం డన | నాగ్నేయుఁ డన రౌద్రుఁ డనఁగ శరవ
ణోద్భవుం డన గుహుం డుద్భవిల్లఁడె? శర | స్తంబజన్ముఁడు గాఁడె ధర్మవిదుఁడు
తే. గృపుఁడు? ఘటసంభవుఁడు గాఁడె కీర్తిపరుఁడు | వరుఁడు ద్రోణుండు? విప్రులవలనఁ బుట్ట
రైరె సత్క్షత్రియుల్‌ ఘను లవనిఁ గావఁ? | గడఁగి మీ జన్మములు నిట్ల కావె వినఁగ.

1.6.61

వ. ‘వానితోడి దేమి? దివ్యలక్షణలక్షితుండును సహజకవచకుండలమండితుండును గాని ప్రకృతిపురుషుండు గాఁడు; తన బాహుబలంబున నీ యంగరాజ్యంబునక కాదు సకలమహీరాజ్యంబునకు నర్హుం డగు’ ననుచున్నయంత నాదిత్యుం డస్తంగతుం డైన, నస్త్రసందర్శనరంగంబు వెలువడి దుర్యోధనుండు గర్ణుం దోడ్కొని కరదీపికా సహస్రంబుతో నిజమందిరంబున కరిగెఁ; బాండవులును భీష్మద్రోణవిదుర కృపాచార్యులతో నిజనివాసంబుల కరిగిరి.

1.6.62

ఆ. కుంతి యంత సహజకుండలకవచాభి | రాముఁ గర్ణుఁ జూచి రవి సమానుఁ
బ్రత్యభిజ్ఞ నెఱిఁగి ప్రథమపుత్త్ర స్నేహ | మెఱుకపడక యుండ నింతి యుండె.

1.6.63

క. వినుతధనుర్విద్యావిదు | ఘనుఁ గర్ణు సహాయుఁ బడసి కౌరవవిభుఁ డ
ర్జునువలనిభయము సెడి ఱొ | మ్మునఁ జేయిడి నిద్రవోయె ముదితాత్ముం డై.

1.6.64

వ. అంతఁ బ్రభాతం బగుటయు సమయనియమంబులు దీర్చి యాచార్యుండు శిష్యులనెల్ల రావించి ‘మీరు నాకు గురుదక్షిణ యిం’ డనిన నందఱు మ్రొక్కి యెదుర నిలిచి ‘మీ కెద్ది యిష్టంబు సెప్పుం’ డనిన విని ‘యవివేక కారణ దారుణైశ్వర్యావలిప్తుం డైన ద్రుపదు నొడిచిపట్టి తెం; డిదియ నా కిష్టం బైన గురుదక్షిణ’ యని పంచిన.

1.6.65

క. వల్లె యని రాజనందను | లెల్లను సమకట్టి, రథము లెక్కి దిశల్‌ భే
దిల్లఁగ గర్జిల్లి, నిశా | తోల్లసిత కృపాణ కార్ము కోద్యతకరు లై.

1.6.66

ఉత్సాహము. ‘ఏల దీని నెడయుఁ జేయ? నీ క్షణంబ యేఁగి పాం
చాలుఁ బట్టి తెత్త మధికశౌర్యలీల మెఱయఁగాఁ
బోలు’ ననుచుఁ బెరిఁగి రాజపుత్త్రు లెల్ల నరిగి పాం
చాలుపురము ముట్టికొని రసంఖ్య బలసమేతు లై.

1.6.67

వ. పాండవులును రథంబు లెక్కి ద్రోణుం బరివేష్టించి పిఱుంద నరిగి; రంత నర్జునుం డాచార్యున కి ట్లనియె.

1.6.68

క. వడిగొని కౌరవు లొండొరుఁ | గడవఁగ మును చనిరి; వారిగర్వము సూడం
గడిమిని ద్రుపదాధిపుతోఁ | బొడువఁగఁ దమ కలవియగునె భుజవీర్యమునన్‌.

1.6.69

క. అతగులచే ద్రుపదుఁ డనవ | హితుఁ డై పట్టువడ నంతహీనుఁడె? శౌర్యో
న్నతుఁ డధికధనుర్విద్యా | న్వితుఁడు భవత్సఖుఁ డనంగ వినరొకొ వానిన్‌.

1.6.70

వ. అనుచుం బాంచాలుపురం బాసన్నంబు గాఁ జనుదెంచునంతకు ముందఱ చని దుర్యోధన యుయుత్సు దుశ్శాసనవికర్ణజలసంధాదు లైన ధార్తరాష్ట్రు లనేకనృపకుమారసహితు లై పాంచాలుపురం బవరోధించినఁ బాంచాలపతి యలిగి యపారచతురంగబలసమేతుం డై కౌరవులం దాఁకి.

1.6.71

క. శరనికరసహస్రంబులఁ | బరువడి నందఱను గప్పెఁ బ్రావృడ్ధారా
ధర మురుధారాజలముల | సరసిజములఁ గప్పునట్లు సంరంభమునన్‌.

1.6.72

క. కలయ నసిముసల దండం | బులు గొని కాంపిల్యనగరమున జను లెల్లన్‌
నలి రేఁగి యార్చి కౌరవ | బలసుభటులఁ బొడిచి రాజి బడలు వడంగన్‌.

1.6.73

క. ధృతరాష్ట్రకుమారకు లవ | హితు లై పాంచాలుమీఁద నేసిరి సాంద్రా
తతబాణప్రకరతిరో | హిత మై రవికిరణజాల మేర్పడకుండన్‌.

1.6.74

క. వారల శరములు నడుమన | వారించుచు నధికలాఘవంబున వారిన్‌
ఘోరశరవిద్ధమర్ములఁ | గా రణమున సోమకుండు ఘనుఁ డై యేసెన్‌.

1.6.75

క. నానావిధ మార్గణముల | నానామార్గముల నేసినం, గురువీరుల్‌
వానిం జూచి భయంపడి | నానాతనుఁగా మనంబునన్‌ వగచి రనిన్‌.

1.6.76

వ. ఇట్లు పాంచాలుబాణవృష్టికి నిలుపోపక కురుకుమారులు కుమారశరనిహత సురారికుమారులుంబోలె వెఱచఱిచి పాండవులయొద్దకుం బఱతెంచినం జూచి, యర్జునుం డాచార్యధర్మజులకు నమస్కరించి ‘మీర లింద యుండుం; డే నీక్షణంబ యప్పాంచాలుం బట్టి తెచ్చెద’ నని విజృంభించి, సంరంభంబున భీమసేనుండు దనకు సేనాగ్రచరుండుగా మాద్రేయులు రథచక్రరక్షకులుగా ద్రుపదరాజవాహినీసముద్రంబు దఱియం జొచ్చిన.

1.6.77

క. కరిఘటలఁ దాఁకి భీముఁడు | కరటికటీకుంభదంతకరముఖముల జ
ర్జరితములఁ జేసె నిష్ఠుర | తరవజ్రనిపాతపటుగదాఘాతములన్‌.

1.6.78

ఉ. దారుణమౌ వృకోదరు గదాకులిశాహతి నన్యవాహినీ
వారణసంచయం బభినవక్షతజారుణధార లొప్ప సం
చారితధాతునిర్‌ఝరవిశాలశిలోచ్చయ సంచయాభమై
వీరరణంబునం బడియె విక్షతహస్తిపవృక్షపంక్తితోన్‌.

1.6.79

చ. అనిలజుఁ డుగ్రుఁ డై ద్రుపదుహస్తిఘటావళి నశ్వసంహతిన్‌
ఘనరథకోటి భగ్నములుగా సమరంబునఁ జేసి పేదదు
ర్మనుజులఁ జంప నేల యని మానుగ గోపుఁడు గోగణంబులన్‌
గొనకొని రొప్పునట్టు లధికుం డెగిచెం బృథుదండహస్తుఁ డై.

1.6.80

స్రగ్ధర. అంతఁ గౌంతేయుఁ డత్యాయతభుజుఁడు నరుం డల్గి పాంచాలు దంతి
ధ్వాంతంబున్‌ వానివాహోత్తమతుహినతతిం దద్భటోదారతారా
సంతానంబున్‌ శరాంశూచ్చయవిభవమునన్‌ శాంతిఁ బొందించి యుద్య
ద్ధ్వాంతారాతిప్రభుం డై తనరుచు వెలిఁగెన్‌ దద్రణవ్యోమవీథిన్‌.

1.6.81

క. ఆతనిఁ జూచి సహింపక | యాతతకార్ముకుఁడు ద్రుపదుననుజుఁడు శౌర్యో
పేతుఁడు సత్యజితుం డను | నాతఁడు ధీరుఁ డయి తాఁకె నతిరభసమునన్‌.

1.6.82

క. కడఁగి ద్రుపదానుజుఁడు నె | వ్వడిఁ గవ్వడి నేసె నూఱువాఁడిశరములం
గడు నలిగి వాని నన్నియు | నడుమన తునియంగ నేసె నరుఁ డస్త్రములన్‌.

1.6.83

క. వివిధాస్త్రకోవిదుఁడు వా | సవి వానిరథంబుఁ బార్‌ష్ణిసారథుల మహిం
గువలు వడ నేసె నుగ్రా | హవమునకును వాఁడు విముఖుఁడై చెడి పఱవన్‌.

1.6.84

వ. అంత.

1.6.85

క. శరమోక్షణవేగనిరం | తరమండలితోరుచాపదండుఁ డకాండో
ద్ధురదండధరుఁడపోలెను | హరినందనుఁ దాఁకె ద్రుపదుఁ డత్యుద్ధతుఁ డై.

1.6.86

మ. పరమాస్త్రైకవిశారదుల్‌ బలయుతుల్‌ పాంచాలకౌంతేయు లొం
డొరులన్‌ మార్కొని యేయునప్పుడు తదీయోగ్రాజిరంగంబు దు
స్తర నీరంధ్ర నిశాత సాయక తమస్సంఛన్న మైనం బర
స్పరయుద్ధంబులు దక్కి యోధులు నిశాభ్రాంతాత్ము లై రచ్చటన్‌.

1.6.87

వ. అట్టి మహాద్వంద్వయుద్ధంబున విజిగీషుం డయి పాంచాలుండు పాండవమధ్యముధనుర్మధ్యంబు భగ్నంబుగా నొక్కబాణంబున నేసి యార్చిన, నలిగి వాసవసుతుం డుద్యతాసిహస్తుం డయి శైలస్థలంబుమీఁదికి లంఘించుకొదమసింగంబునుంబోలె ద్రుపదురథంబుమీఁదికి లంఘించి వానిం బట్టికొనినఁ దత్సైన్యంబు హాహాకారంబు లెసంగ మహార్ణవంబునుంబోలె మ్రోయుచుండె నంత.

1.6.88

క. ప్రక్షీణదర్పు ద్రుపదు ర | థాక్షముతోఁ గట్టి తెచ్చి యర్జునుఁడు క్రియా
దక్షుం డయి గురునకు గురు | దక్షిణగా నిచ్చి చేసెఁ దత్సమ్మదమున్‌.

1.6.89

వ. ద్రోణుండును నర్జునుచేసిన పరాక్రమంబునకుఁ బరమహృష్టహృదయుం డై ద్రుపదుం జూచి నగుచు ని ట్లనియె.

1.6.90

క. వీ రెవ్వ రయ్య? ద్రుపదమ | హారాజులె! యిట్లు కృపణు లయి పట్టువడన్‌
వీరికి వలసెనె? యహహ! మ | హారాజ్యమదాంధకార మది వాసెనొకో?

1.6.91

ఆ. ‘ఇంక నైన మమ్ము నెఱుఁగంగ నగునొక్కొ!’ | యనుచు నుల్లసంబు లాడి ద్రుపదు
విడిచిపుచ్చె గురుఁడు; విప్రులయలుకయుఁ | దృణహుతాశనంబు దీర్ఘ మగునె?

1.6.92

వ. ఇట్లు ద్రుపదుండు ద్రోణుచేత విముక్తుం డయ్యుఁ గోపపాశబద్ధుం డయి యప్పరిభవంబునకుం బ్రతీకారంబు సేయ సమకట్టి బ్రాహ్మణోపాస్తి సేయుచుండె; నంత నిట ధృతరాష్ట్రుండు యుధిష్ఠిరు రాజ్యభారధురంధరుంగా నెఱింగి భీష్మవిదురులతో విచారించి యౌవరాజ్యాభిషిక్తుం జేసిన.

1.6.93

చ. నలువురు దమ్ములున్‌ బలిమి నాలుగుదిక్కులు నోర్చి సర్వభూ
తలమున రాజనందనులదర్ప మడంచుచు భూరివస్తురా
సులు గొనివచ్చి యీఁగొని విశుద్ధయశోనిధి యొప్పె ధర్మజుం
డలఘుఁడు యౌవరాజ్యయుతుఁ డయ్యును బెంపున సార్వభౌముఁ డై.

1.6.94

వ. మఱియును.

1.6.95

క. బద్ధపరంపర నొప్పె మ | దోద్ధతగజరథతురంగయుద్ధముల గదా
యుద్ధములఁ జూడ నెందుఁ బ్ర | సిద్ధుఁడు మధ్యముఁడ యను విశిష్టస్తవముల్‌.

1.6.96

చ. అనుపమకార్ముకాదివివిధాయుధవిద్యలయందుఁ గోవిదుం
డనఁగ నజయ్యుఁ డై పరఁగు నర్జునుఁ బోలఁగ నన్యు లెందు లే
రను జనఘోష ముచ్చరిత మయ్యె మరుచ్చలితోచ్చవీచి ని
స్వనముఖరాబ్ధివేష్టిత విశాలమహీవలయాంతరంబునన్‌.

1.6.97

క. యము లమితశౌర్యు లరినృప | యము లమలచరిత్రనిరతు లనఁగా నత్యు
త్తమభక్తి నన్నలకు విన | యము మెఱయుచు నుండి రధికు లై బహుకళలన్‌.

1.6.98

వ. ఇట్లు పాండుకుమారు లపారగుణంబుల నెల్లవారికి నారాధ్యు లయి పరఁగుచున్న నందు ధనుర్విద్య నర్జును దృఢముష్టిలాఘవలక్ష్యవేధిత్వదూరాపాత జితశ్రమత్వంబులకు నసిగదాశక్తితోమరాదిప్రహరణప్రవీణతకుం బరమహీపాల పరాజయోత్పాదన పరాక్రమంబునకుఁ దనవలని భక్తిస్నేహంబులకు మెచ్చి భారద్వాజుండు వానికి బ్రహ్మశిరం బను దివ్యబాణంబు సప్రయోగనివర్తనంబుగా నిచ్చి యి ట్లనియె.

1.6.99

ఉ. దీని నగస్తి నాఁ బరగు దివ్యమునీంద్రుఁడు దొల్లి ప్రీతితో
భూనుత! యగ్నివేశుఁ డను భూరిమునీంద్రున కిచ్చె; వారలున్‌
మానుగ నాకు నిచ్చిరి; క్రమంబున నేనును నీకు నిచ్చితిన్‌;
దీనికి నీవ యర్హుఁడవు తేజమునం గడుఁ బెద్ద గావునన్‌.

1.6.100

వ. ‘దీని మానవులయందుఁ బ్రయోగింపకుండునది; యల్పతేజులయందుఁ బ్రయుక్తం బయి యిది జగంబులఁ గాల్చు; నిన్ను బాధించు నట్టి మానవులు గలిగిరేని ప్రయోగించునది; వారి నశ్రమంబున సాధించు’ నని దాని మహిమ చెప్పి ‘నీవు నీ బంధుసమక్షంబున నాకు గురుదక్షిణ యి; మ్మిది యెయ్యది యనిన నాయుద్ధంబుసేయునపుడు నాతో నెన్నడుఁ బ్రతియుద్ధంబు సేయకుండు; మిదియ నాకు గురుదక్షిణ’ యనిన నర్జునుండు వల్లె యని యాచార్యునకు నమస్కరించి దాని కొడంబడియె; నంత దుర్యోధనుండు యుధిష్ఠిరుయౌవరాజ్యాభిషేకంబునకు భీమార్జునయములపరాక్రంబునకు మనంబున సహింపనోపక కర్ణశకునిదుశ్శాసనులతో మంతనం బుండి యి ట్లనియె.

1.6.101

సీ. ‘ఆయుధవిద్యలయందు జితశ్రము | లనియును రణశూరు లనియు సంత
తోత్సాహు లనియు నత్యుద్ధతు లనియును | భయమందుచుండుదుఁ బాండవులకు;
దానిపై నిప్పుడు ధర్మజు యువరాజుఁ | జేసె రా; జే నేమి సేయువాఁడ?
నృపనీతి యెయ్యది? నిరతంబుగా మీర | నా కెఱిఁగింపుఁడు నయముతోడ’
ఆ. ననిన వినియుఁ గణికుఁ డనువాఁడు, సౌబలు | నాప్తమంత్రి, నీతులందుఁ గరము
కుశలుఁ డైనవాఁడు కురుకులవల్లభు | నిష్టమునకుఁ దగఁగ నిట్టు లనియె.

1.6.102

తరువోజ. ధరణీశుఁ డుద్యతదండుఁ డై యుచిత | దండవిధానంబుఁ దప్పక ధర్మ
చరితులఁగా మహీజనుల రక్షించి | సద్వృత్తుఁ డగునది; సర్వవర్ణములు
వరుసన తమతమ వర్ణధర్మముల | వర్తిల్లుదురు గడవక దండభీతి
నరిమిత్రవర్జితుఁ డై సమబుద్ధి | యగు మహీవల్లభు ననుశాసనమున.

1.6.103

క. గుఱుకొని కార్యాకార్యము | లెఱుఁగక దుశ్చరితుఁ డై యహితుఁ డగు నేనిన్‌
మఱవక గురు నైనను జను |లెఱుఁగఁగ శాసించునది మహీశుఁడు బుద్ధిన్‌.

1.6.104

క. ధీరమతియుతులతోడ | విచారము సేయునది మును, విచారితపూర్వ
ప్రారబ్ధమైన కార్యము | పారముఁ బొందును విఘాతపదదూరం బై.

1.6.105

క. జనపాలుఁడు మృదుకర్మం | బున నైనను గ్రూరకర్మమున నైనను నే
ర్పున నుద్ధరించునది త | న్ననపాయతఁ బొంది చేయునది ధర్మంబుల్‌.

1.6.106

క. అమలినమతి నాత్మచ్ఛి | ద్రము లన్యు లెఱుఁగకుండఁ దా నన్య చ్ఛి
ద్రము లిమ్ముగ నెఱుఁగుచు దే | శముఁ గాలము నెఱిఁగి మిత్రసంపన్నుం డై.

1.6.107

క. బలహీను లైనచో శ | త్రులఁ జెఱచుట నీతి, యధిక దోర్వీర్య సుహృ
ద్బలు లైన వారిఁ జెఱుపఁగ | నలవియె యక్లేశ సాధ్యు లగుదురె మీఁదన్‌.

1.6.108

క. అలయక పరాత్మ కృత్యం | బులఁ బతి యెఱుఁగునది దూతముఖమునఁ, బరభూ
ముల వృత్తాంతము లెఱుఁగఁగఁ | బలుమఱుఁ బుచ్చునది వివిధ పాషండ తతిన్‌.

1.6.109

క. నానావిహార శైలో | ద్యాన సభా తీర్థ దేవతాగృహ మృగయా
స్థానముల కరుగునెడ మును | మానుగ శోధింపవలయు మానవపతికిన్‌.

1.6.110

తే. వీరు నమ్మంగఁ దగుదురు వీరు నమ్మఁ | దగరు నాకు నా వలవదు; తత్త్వబుద్ధి
నెవ్వరిని విశ్వసింపక యెల్ల ప్రొద్దు | నాత్మరక్షాపరుం డగు నది విభుండు.

1.6.111

ఉ. ఇమ్ముగ నాత్మరక్ష విధియించువిధంబున మంత్రరక్ష య
త్నమ్మునఁ జేయఁగావలయుఁ; దత్పరిరక్షణశక్తి నెల్ల కా
ర్యమ్ములు సిద్ధిఁ బొందుఁ బరమార్థము; మంత్రవిభేద మైనఁ గా
ర్యమ్ములు నిర్వహింపఁగ బృహస్పతికైనను నేరఁబోలునే.

1.6.112

క. పలుమఱు శపథంబులు నం | జలియును నభివాదనమును సామప్రియభా
షలు మిథ్యావినయంబులుఁ | గలయవి దుష్టస్వభావకాపురుషులకున్‌.

1.6.113

క. తన కిమ్మగు నంతకు దు | ర్జనుఁ డిష్టుఁడపోలె నుండి సర్పమపోలెం
దన కిమ్మగుడును గఱచును | ఘనదారుణకర్మగరళ ఘనదంష్ట్రములన్‌.

1.6.114

క. కడునలుకయుఁ గూర్మియు నే | ర్పడ నెఱిఁగించునది వాని ఫలకాలమునన్‌
బిడుగును గాడ్పును జనులకుఁ | బడుటయు వీచుటయు నెఱుకపడియెడుభంగిన్‌.

1.6.115

క. తఱియగునంతకు రిపుఁ దన | యఱకటఁ బెట్టికొనియుండునది; దఱియగుడుం
జెఱచునది ఱాతిమీదను | వఱలఁగ మృద్ఘటము నెత్తి వైచిన భంగిన్‌.

1.6.116

క. తన కపకారము మునుఁ జే | సిన జనుఁ డల్పుఁ డని నమ్మి చేకొని యుండం
జన; దొకయించుక ముల్లయి | నను బాదతలమున నున్న నడవఁగ నగునే.

1.6.117

క. బాలుఁ డని తలఁచి రిపుతో | నేలిదమునఁ గలిసియునికి యిది కార్యమె? యు
త్కీలానలకణ మించుక | చాలదె కాల్పంగ నుగ్రశైలాటవులన్‌.

1.6.118

క. మొనసి యపకారిఁ గడ నిడి | కొనియుండెడు కుమతి దీర్ఘకుజశాఖాగ్రం
బున నుండి నిద్రవోయెడు | మనుజునకు సమాన మగుఁ బ్రమత్తత్వమునన్‌.

1.6.119

చ. తడయక సామభేదముల దానములన్‌ దయతోడ నమ్మఁగా
నొడివియు సత్యమిచ్చియుఁ జనున్‌ జననాథ! కృతాపకారులం
గడఁగి వధింపఁగాఁ గనుట కావ్యుమతం బిది; గాన యెట్టులుం
గడుకొని శత్రులం జెఱుపఁగాంచుట కార్యము రాజనీతిమైన్‌.

1.6.120

వ. ‘కావున సర్వప్రకారంబుల నపకారకారణు లయిన వారిం బరుల నయిన బాంధవుల నయిన నుపేక్షింపక యాత్మరక్షాపరుండ వయి దూరంబుసేసి దూషించునది’ యనినఁ గణికుమతంబు విని దుర్యోధనుండు చింతాపరుం డై యొక్కనాఁడు ధృతరాష్ట్రున కేకాంతంబున ని ట్లనియె.

1.6.121

తే. వీరు లని పాండుసుతులకు వెఱతు నేను; | వెఱచుటకుఁ దోడుగా నిప్డు విభుఁడ వీవు
పాండవజ్యేష్ఠునకుఁ బ్రీతిఁ బరమయౌవ | రాజ్య మిచ్చితి కురువృద్ధరాజులొద్ద.

1.6.122

వ. ‘దాననచేసి పౌర జానపద బ్రాహ్మణ ప్రధానవరులు ధర్మజున కనురక్తు లయి, నిన్నును భీష్ముని నాదరింపక, ప్రజ్ఞాచక్షుండు రాజ్యరక్షణంబు సేయ సమర్థుండు గాఁడు, భీష్ముండు సమర్థుం డయ్యును ముందఱ రాజ్యభార నివర్తనంబునందుఁ గృతప్రతిజ్ఞం డయ్యెం; గావునఁ బాండవజ్యేష్ఠుం డైన యుధిష్ఠిరునకు రాజ్యాభిషేకంబు సేయుద; మతండు తరుణుం డయ్యును గుణవృద్ధుండు ధర్మశీలుండు పరాక్రమవంతు లైన తమ్ములుగలవాడు రాజ్యప్రతిష్ఠితుం డయ్యెనేని వృద్ధుల నమాత్యుల బంధుమిత్రులను దొల్లింటికంటె మిక్కిలిగాఁ బూజార్హుల నెల్లం బూజించుఁ, బితామహుండైన భీష్ముని సపుత్త్రకుండైన ధృతరాష్ట్రుని నతిభక్తి నభీష్టభోగానుభవపరులంగా సుఖంబున నునుచు, దీనికి విదురుండును నొడంబడు నని యెప్పుడుఁ దమలో విచారింతు రని వింటిఁ; గర్ణశూలాయమానంబు లైన మూర్ఖప్రకృతుల పలుకులు విననోపఁ; బాండవుల నిప్పురంబువలనఁ బాయునట్లుగాఁ జేయవలయు; నేమి సేయుదు?’ ననినఁ గొడుకునకు ధృతరాష్ట్రుం డి ట్లనియె.

1.6.123

చ. జనపతి యైనవానికిఁ బ్రచండమహాతుములాహవాంతరం
బున మృతిఁబొందియొండె, మఱి పుత్త్రులపైఁ దనరాజ్యభార మె
ల్లను నియమించి యేఁగి గిరులం దప మొప్పఁగఁ జేసి యొండెఁ గా
కనిమిషలోకభోగసుఖ మందఁగఁ బోలునె శాశ్వతంబుగన్‌.

1.6.124

వ. రా జయ్యెడువాఁడు తన రాజ్యభారంబు దాన చూచి యరయవలయు; నేను షడంగసహితంబుగా వేదాధ్యయనంబు సేసియు నర్థశాస్త్రంబునందుఁ గృతనిశ్చయుండ నయి బలంబు గలిగియు నంగవైకల్యంబునం బరచక్రంబులకుం బ్రతివ్యూహంబు రచియింప నేరమింజేసి రాజ్యంబునకుఁ దగకున్న.

1.6.125

ఉ. లోకనుతుండు పాండుఁ డమలుండు మహాగుణరత్నపూర్ణర
త్నాకరుఁ డత్యుదారమతి నంధుఁడ నైనను నన్ను రాజుఁగాఁ
జేకొని నాకు భక్తిఁ బనిసేయుచు సర్వజగజ్జిగీషుఁ డై
యీకురువంశరాజ్యభర మింతయుఁ దాల్చెఁ బరాక్రమంబునన్‌.

1.6.126

క. పరచక్రపతులచే భీ | కరుఁ డై ధనరాసు లదిమి కప్పము గొని చె
చ్చెరఁ దెచ్చియిచ్చి నన్నును | భరతకులశ్రేష్ఠుఁ డునిచె బహుయజ్ఞములన్‌.

1.6.127

వ. ‘మఱియు వానికంటె గుణంబుల మిక్కిలి యయి జనంబులకు ననురక్తు లై పరగుచున్నపాండురాజు కుమారుల నెవ్విధంబునఁ బాపనేర్తు’ నని దుఃఖించిన ధృతరాష్ట్రునకు దుర్యోధనుం డి ట్లనియె.

1.6.128

సీ. పైతృకం బగు లక్ష్మి పాండుభూపతి మున్ను | తాల్చుటఁజేసి తత్తనయుఁ డైన
ధర్మజుఁ డిప్పుడు దాల్చిన, నాతని | తనయుండు మఱి దానిఁ దాల్చు, మీఁద
నిప్పాటఁ బాండువంశేశుల వసుమతీ | రాజ్యార్హు లగుదురు; రాజ్యమునకుఁ
బరువడి మే మింతఁ బాసిన మాపుత్త్ర | పౌత్త్ర వర్గంబునుఁ బాయు; నింక
ఆ. నొరులఁ గొలిచి కుడువనోప మే; మట్లుగా | కుండ మమ్ముఁ జేయనోపుదేని
పాండురాజుతొంటిభక్తియు నప్పాండు | తనయులందు దయయుఁ దలఁపకుండు.

1.6.129

వ. ‘ఈరాజ్యంబు మొదలింటంగోలె భవదీయం బయినది; ప్రకృతిజనులు వశ్యులు గాకున్నను గ్రమాగతంబయి మాకు నప్రయత్నలభ్యంబగుఁ దొల్లి పాండురాజు రా జై గుణంబులం బ్రజానురాగంబు వడయుటంజేసి యెల్లవారును ధర్మరాజురాజ్యంబ వలతురు; దాని నెఱింగియ కాదె యేను నిత్యదానసమ్మానంబులం బ్రకృతిజనంబులకు సంతోషంబు సేయుచునుండుదు; నిందుల దుష్టజనులపక్షపాతవచనంబు లుడుగునంతకు నుపాయంబునఁ గొంతినిఁ బాండవులను దదీయభృత్యామాత్యవర్గంబుతో వారణావతంబునకుం బుత్తము; మనకు రాజ్యంబు సుప్రతిష్ఠితం బైన మఱి వార లిందులకు వత్తు’ రనిన దుర్యోధనునకు ధృతరాష్ట్రుం డి ట్లనియె.

1.6.130

తరువోజ. ‘ఏ నెల్లప్రొద్దు నా యెడ లోనఁ దలఁతు నీయభిప్రాయంబ; యిది దారుణంబు
గాన వాకునకుఁ జుల్కన తేరనోపఁ; గడఁగి పాండవుల నేకత మెట్టు లనుప
గా నగు? మఱి దీని గాంగేయవిదురకలశజాశ్వత్థామ గౌతముల్‌ బుద్ధి
గా నొడంబడుదురె? కా దయ్య!’ యనినఁ గౌరవజ్యేష్ఠుండు ఘనుఁ డిట్టు లనియె.

1.6.131

వ. ‘భవదనుజ్ఞాగౌరవంబున గాంగేయాదులు దీనికి నొడంబడుదురు; వారు కౌరవులకెల్ల సము లై యుండియు నావారల; యెట్లనిన; నశ్వత్థామ నా కిష్టుం డగుట నన్నుఁ బాయకుండు; పుత్త్రస్నేహంబున ద్రోణుండును భారద్వాజుని భాగినేయునిం బాయనేరమింజేసి కృపాచార్యుండును నాయొద్దన యుందురు; మఱి భీష్ముండు మధ్యస్థుం డగుటఁ బాండవులం బరిగ్రహింపఁడు; విదురుండు పాండవపక్షపాతి యయ్యును నొక్కరుండు నా కహితంబు సేయనోపండు; గావున నిక్కార్యంబున దోషంబు లేదు; వినిద్రకరణం బయిన నాహృదయశల్యంబు బాచి న న్నుద్ధరింపు’ మని ధృతరాష్ట్రు నెట్టకేలకు నొడంబఱిచి దుర్యోధనుం డప్పుడు.

1.6.132

క. వలను గల మంత్రివరులం | బిలిచి పృథానందనులకుఁ బ్రియముగ మీ రి
మ్ముల వారణావతంబును | వెలయఁగఁ బొగడుండు వారు విని తగుల నెడన్‌.

1.6.133

వ. అని పంచిన వారును వారణావతంబు ననవరతసురభికుసుమఫలభారనమ్రశాఖావిశాలతరువనరేఖాలంకృతం బనియును, వనజలకేళీకందుకమృగయాదివివిధవిహారహారిప్రదేశాభిశోభితం బనియును, నవసుధా ధౌతసౌధ సుధాకరనికరప్రభాపటలప్రధ్వంసితాసితపక్షదోషం బనియును, నిరస్తదోషానుషంగమంగళ మహారత్న రాజివిరాజితవిపులవిపణివీథీవిహసితాలకావిలాసం బనియును, మనోరమానేకసుఖానుభోగ భోగిమహాభాగ జనసమృద్ధం బనియును, బుణ్యనదీప్రవాహశోభితం బనియును వర్ణించి యప్పురంబునంద పాండునందనుల జాతకౌతూహలచిత్తులం జేసి యున్నఁ, గొండొకకాలంబునకు ధృతరాష్ట్రుండు దుర్యోధనదుష్టవచనప్రబోధితుం డయి యొక్కనాఁడు.

1.6.134

ఉ. పాండుకుమారులం బిలువఁబంచి సుహృన్నివహంబు నొద్ద న
ప్పాండుఁ దలంచి నిర్గళితబాష్పకరాళకపోలయుగ్ముఁ డై
పాండుమహీశుకంటె నతిభక్తుల మి మ్మొకఁ డేను బంచెదం
బాండుయశో-ర్థులార! యిది పథ్యము కాఁగఁ దలంపుఁ డాత్మలోన్‌.

1.6.135

క. విదితంబుగఁ బుణ్యామర | నదీ సమీపమున వారణావత నగరం
బది సర్వసుఖాస్పద మని | వదలక వర్ణింతు రెల్లవారును దానిన్‌.

1.6.136

క. మీరును గుంతియు సహపరి | వారమహామాత్య భృత్యవర్గులరై నా
నారాజ్యలీలతోఁ జని | సారమతిం జేయుఁ డందు సతతోత్సవముల్‌.

1.6.137

వ. ‘పశుపతి నివాసం బయిన యప్పుణ్యస్థానంబునం బాండుహితంబుగా నగణ్యగోహిరణ్యాదిమహాదానంబుల బ్రాహ్మణసంతర్పణంబులు సేసి యందుఁ గొండొకకాలం బుండి వచ్చునది’ యని పంచిన వల్లె యని పాండవులు గాంధారీధృతరాష్ట్రులకు మ్రొక్కి వీడ్కొని, దుర్యోధనాదుల నందఱం బ్రియపూర్వకంబుగా సంభావించి, భీష్మద్రోణవిదురకృపాదులకు మ్రొక్కి యనేకవృద్ధబ్రాహ్మణులకు నమస్కారంబు సేసి వారలవలన దీర్ఘాయురారోగ్య స్వస్తివచనంబులతోఁ బునర్దర్శనం బయ్యెడ మని దీవనలు సేకొనుచు జననీసహితంబుగా వారణావతంబునకు గమనోన్ముఖు లయినంత.

1.6.138

క. తనవగచినకార్యము దొర | కొనుటకు ధృతరాష్ట్రపుత్త్రకుఁడు పొంగి పురో
చనుఁ బిలిపించి రహస్యం | బున వానికిఁ గరమునెయ్యమున ని ట్లనియెన్‌.

1.6.139

తరలము. అలఘుతేజుల వారణావత మన్పురంబునఁ బాండవే
యులఁ బ్రియంబున నుండఁబంచె గుణోన్నతుండు కురుప్రభుం;
డలయ కిప్పుడు నీవు మున్‌ చని యందు వారికి నుండఁగా
నిలయముల్‌ రచియింపు నీదగునేర్పుఁ జూతము చెచ్చెరన్‌.

1.6.140

వ. నాకుం బరమవిశ్వాసివి నీ వొక్కరుండవ; యిది యనన్యవిషయం బయిన కార్యంబు; కావున నీవ దీనిం జేయవలయు; వాయుజవంబు లయిన వేసడంబులఁ బూనిన యరదం బెక్కి, నేఁడ చని వారణావతంబున లాక్షాసర్జకరసమిశ్రం బై ఘృతతైలార్ద్రంబయిన మృత్తికాపుంజంబున నొక్క చతుశ్శాల విశాలంబుగా నాయుధశాల సమీపంబున మనోహరంబుగా నవిరళసుధాధవళితంబుగా నిర్మించి యందుఁ బాండవుల నునిచి వార లేమఱి నమ్మి కొండొకకాలం బుండ, ని న్నొరు లెఱుంగకుండ నిమ్మయినయవసరంబునం దద్గృహద్వారంబునందు ఘోరానలంబు దరికొలిపి పగఱ పంచత్వం బెఱింగి రమ్ము.

1.6.141

క. ఈ కార్య సిద్ధి యగుడును | నీ కతమున నఖిల ధారుణీ రాజ్యము నా
కేకాధిష్ఠిత మగు నిది | నీకును నిత్యోపభోగనిలయమ కాదే.

1.6.142

వ. అని పంచినం బురోచనుం డతిత్వరితగతి నరిగి దుర్యోధను కఱపిన రూపున వారణావతంబున లాక్షాగృహంబు రచియించుచుండె; నిట యుధిష్ఠిరభీమార్జునయములుం గ్రమంబునం దొల్లి షోడశపంచదశ చతుర్ద శత్రయోదశవర్షజాతు లయి శతశృంగంబున నుండి హస్తిపురంబునకు వచ్చి యందుఁ గౌరవులం గలసి యస్త్ర విద్యలం గఱచుచుం బదమూడేం డ్లుండి, యపుడు ధృతరాష్ట్రునియోగంబున వారణావతంబునకు జననీ సహితంబుగాఁ బోవ సమకట్టి మహాజవసత్త్వసమేతంబు లయిన హయంబులం బూనిన రథంబు లెక్కి ధనుర్ధరు లయి హస్తిపురంబు వెలువడు నపు డప్పురంబునం గల బ్రాహ్మణక్షత్రియప్రముఖానేక జనంబులు శోక సంతప్తహృదయు లయి.

1.6.143

సీ. ‘ఇప్పాండుపుత్త్రుల నేలకో ధృతరాష్ట్రుం | డేకత మనుపంగ నిచ్చగించె;
నిది యధర్మం బని యెఱిఁగి గాంగేయాదు | లేల వారింపరో యెఱుఁగరొక్కొ;
పితృపితామహులచే భృతపూర్వమై క్రమా | గత మైన రాజ్యంబుఁ గరము నెమ్మిఁ
బాండుసుతజ్యేష్ఠు భరతకులశ్రేష్ఠు | ధర్మజుఁ బూన్పక ధర్ము వుడిపి
ఆ. యేల వృద్ధరాజు లెడసేసిరో; పార్థుఁ | డరుగు నెడక మనము నరిగి యతని
యున్న చోన ప్రీతి నుండుద; మిం దుండ | నేల?’ యనుచుఁ బౌరు లెల్లఁ దెరలి.

1.6.144

వ. తన పిఱుందన వచ్చువారిం బ్రియపూర్వకంబున నూరార్చి ‘పితృవచనంబు సేయకునికి ధర్మవిరుద్ధంబు గావున వారణావతంబునకుం బోయి వచ్చెద’ మని యందఱం గ్రమ్మఱించి, చనుచున్న ధర్మనందను పిఱుంద నొక్కింతనేల యరిగి, విదురుం డొరులు వినియును నెఱుంగరాని వచనంబుల బహుప్రకారవచనరచనా విశారదుం డైన యుధిష్ఠిరున కెల్ల కార్యంబులు గఱపి, కొడుకులం గౌఁగిలించుకొని, కుంతీదేవికి మ్రొక్కి పాండురాజుం దలంచి బాష్పపూరితనయనుం డై క్రమ్మఱి చనియె; నిట కుంతియు ధర్మరాజు డాయ వచ్చి యి ట్లనియె.

1.6.145

తే. విదురుఁ డేతెంచి యొరులకు వినియు నెఱుఁగఁ| గానియ ట్లుండఁ బలికి నిన్‌ గఱపె బుద్ధి;
నట్ల చేయుదు నంటి వీ; వతని మతము | సెప్పనగునేని యెఱుఁగంగఁ జెప్పు మయ్య!

1.6.146

వ. అనిన నగుచు ధర్మతనయుండు విదురువచనంబుల యభిప్రాయంబులు దల్లి కి ట్లని చెప్పె.

1.6.147

ఆ. ఎల్లకార్యగతులు నెఱుఁగుదు; రయినను | నెఱుఁగఁ జెప్పవలయు నెఱిఁగినంత;
పనియులేక మిమ్ముఁ బనిచిన కురుపతి | హితుఁడపోలె మీఁద నెగ్గు సేయు.

1.6.148

వ. ‘కావున మీర లేమఱక విషాగ్నులవలన నప్రమత్తుల రై యెఱుక గలిగి యుండునది’ యని బుద్ధిగఱపి మఱియు’ దుర్యోధనుచేసెడు దుష్క్రియ లిమ్ముగా నెఱింగి వానికిం బ్రతీకారంబు సెప్పి పుత్తెంచెద ననియె’ నని చెప్పిన విని, విదురుబుద్ధికిఁ దమవలని నెయ్యంబునకు సంతసిల్లుచునిట్లు బాండవులు కతిపయప్రయాణంబుల వారణావతంబున కరుగునంత.

1.6.149

సీ. వారణావతమునవా రెల్లఁ బాండవా | గమనంబు విని సంతసమునఁ బెరిఁగి
కరమొప్పఁ గరిరథతురగబలాఢ్యు లై | యెదురు వచ్చిరి మహాముదముతోడఁ;
గలయంగ గృహములఁ గలువడములు గడు | విలసిల్లె నంబరతలము గప్పి
మలయజమృగమదావిలసలిలంబుల | నిమ్ముగా నార్ద్రీకృతమ్ము లయిన
తే. యంగళుల నొప్పెఁ గర్పూరరంగవల్లు | లంగనలు గయిసేసి యుత్తుంగహర్మ్య
తలము లెక్కిరి తత్పురీవిలసంబుఁ | జూచు పాండుకుమారులఁ జూచువేడ్క.

1.6.150

వ. పాండుకుమారులు ననేకభూసురాశీర్వాదనాదాభినందితు లై ఫాల్గునమాసంబున శుక్లపక్షమున నష్టమియు రోహిణినాడు వారణావతంబు సొచ్చి సర్వాలంకారసుందరం బయిన రాజమందిరంబున నున్న, కొన్ని దినంబులకుం బురోచనుండు దనచేసినచతుశ్శాల సకలజననయనాభిరామం బైన దానిం జూపినం జూచి పాండుసుతులు సంతసిల్లి, పురోచనశిల్పాచార్యులం, బూజించి పుణ్యాహరవపురస్సరంబుగా గృహప్రవేశంబు సేసి; రంతం బరాభిప్రాయమాయోపాయ ప్రయోగవిదుం డైన ధర్మతనయుండు దాని కృత్రిమరమణీయత నుపలక్షించి యల్లన భీమున కి ట్లనియె.

1.6.151

క. ఈ గృహ కుడ్యంబులు లా | క్షాగర్భము లాజ్య తైలగంధులు మఱి శ
స్త్రాగారసమీపము మా | యాగృహ మగు నిది యవశ్య మాగ్నేయం బై.

1.6.152

క. దీని తెఱఁ గెఱిఁగినట్ల మ | హానిపుణుఁడు విదురుఁ డురువిషాగ్నులవలనన్‌
మానుగ నేమఱకుం డని | తాను బ్రబోధించె నేకతమ ననుఁ బ్రీతిన్‌.

1.6.153

వ. ‘కావున మన మిందు విశ్వసించియుండవలవ; దవశ్యం బగ్నిభయం బగు’ ననిన విని భీముం డి ట్లనియె.

1.6.154

ఆ. ‘ఇట్టిదేని మనకు నిం దుండఁగా నేల? | యరిగి ముందు నున్నయంద యుండి,
యెఱిఁగి దీనితోన యిప్పురోచనుఁ గాల్చి | పోద’ మనిన ధర్మపుత్త్రుఁ డనియె.

1.6.155

క. ఎఱిఁగితిమి దీని తెఱఁ; గే | మఱ కెఱుఁగనియట్లు గూఢమతి నుండుద మిం
దఱముఁ బురోచనుకృతకము | నెఱి నేర్పడునంతకును వినీతాత్ముల మై.

1.6.156

వ. ఇప్పాపగృహప్రకారంబు మన మెఱంగుట పురోచనుం డెఱింగెనేని దుర్యోధనునియోగంబు విఫలం బగు నట్లు గాకుండ శీఘ్రకారుల మై దీని దహించిన నక్కడ భీష్మవిదురులు విని కోపించినం గురుకులసముద్రక్షోభం బగు; మఱి దాహభయంబున మన మొండుగడకుం బోయిన నెఱింగి మనయంతరంబ రోయుచు నద్దురాత్ముండు దుర్యోధనుండు వెండియు మన కపాయంబు సేయు నె ట్లనిన.

1.6.157

సీ. ‘రాజ్యపదస్థుం డరాజ్యపదస్థులఁ | బక్షబలాఢ్యుఁ డపక్షబలుల
విపులార్థవంతుండు విగతార్థసార్థుల | నవసరం బెఱిఁగి వాఁ డశ్రమమున
దూష్యులఁ దుదిదాఁక దూషించు మనల న | న్నిష్ఠురునకు నది నీతిగాదె!
కావున నొరు లెఱుంగకయుండఁ గడు నమ్మి | నట్టుల యుండుద’ మని దినంబు
తే. లెల్ల వేఁటలాడుచు రాత్రులెల్ల నుద్య | తాయతాయుధహస్తు లై యనుదినంబు
నప్పురోచను వంచించి యనఘు లుండి | రప్రమాదు లై పాండవు లప్పురమున.

1.6.158

వ. అట హస్తిపురంబున విదురుండు దుర్యోధనుదుర్మంత్రం బంతయు నిమ్ముగా నెఱింగి, కడువిశ్వాసి నొక్క ఖనకు నతి కుశలుం బాండవులపాలికిం బుత్తెంచిన వాఁడును వచ్చి రహస్యంబునం బాండవులం గని తన్ను నమ్మునట్లుగా విదురుసాభిజ్ఞానవచనంబు లెఱింగించి ‘యీకృష్ణచతుర్దశినాఁటిరాత్రి పురోచనుండు లక్కయింట దహనంబు దరికొల్పుం గావున నిందుండి మీకు వెలువడిపోవునట్టియుపాయంబు మారాజు నియోగంబునం జేయవచ్చితి’ నని చెప్పి, లక్కయిల్లు వెలువడునట్లుగా నొక్కబిలంబు నెవ్వరు నెఱుంగకుండం జేసి, వారల కెఱింగించిన భీముండు దాని నిమ్ముగా శోధించి యెఱింగి యుండు నంత.

1.6.159

క. ధనదానములను బ్రియభో | జనదానములను విశిష్టసద్ద్విజతతులం
దనుపుచు నుండఁగఁ దత్పుర | మున షణ్మాసమున భరతముఖ్యుల కరిగెన్‌.

1.6.160

వ. ఆ కృష్ణచతుర్దశినాఁడు కుంతీదేవి యప్పురంబునం గల బ్రాహ్మణ పుణ్యాంగనా జనంబుల కెల్ల నిష్టాన్న పానదానంబులం దుష్టి చేసి దేవపూజ గావించి యున్నెడం, బురోచనుపంపిననిషాదవనిత సపుత్త్రయై బహువిధవన్యమూల ఫలంబులు దెచ్చి యిచ్చుచుం గుంతీదేవింబాయక సేవించి పాండవ కృత్యంబులు నిత్యంబును నెఱింగించు చుండెడు నది, నాఁటిరాత్రి యుత్సవంబునం గాలచోదిత యై తానునుం దన యేవురు కొడుకులు నధికమధుపాన మదంబున మెయి యెఱుంగక లక్కయింటి పక్కంబున నిద్రవోయిన, నర్ధరాత్రంబునప్పుడు భీముండు మేల్కని పురోచనుకంటె ముందఱఁ దాన యుత్సహించి వానిశయనగృహద్వారంబున ఘోరానలంబు దరికొలిపి, చెచ్చెరఁ దల్లిని నన్ననుం దమ్ములను బిలంబులోని కనిచి, యాయుధాగారంబుతోడన లాక్షాగారంబు హుతాశనున కశనంబు సేసి, ఖనకునకుం దమకుశలగమనం బెఱింగించి, బిలప్రవిష్టుం డయి కుంతిని ధర్మార్జుననకుల సహదేవులను బిలంబు వెలువరించి తోడ్కొని చనునప్పుడు.

1.6.161

సీ. కడునిద్రఁ గానక తొడరుచు వడిగొని | నడవంగ నేరక తడయుచున్న
నెఱిఁగి, చెచ్చెరఁ దల్లి నఱకట నిడి, ధర్మ | సుతవిజయులఁ దనవితతబాహు
యమళంబు నెక్కించి, యముల నుత్సంగంబు | లెక్కించుకొని భీముఁ డక్కజముగ
నరిగెడు రయమునఁ దరులు సాల్పడి మ్రొగ్గఁ | బదఘట్టనంబులఁ జదిసి ఱాలు
ఆ. నుఱుము గాఁగ నిట్లు నెఱయంగ సత్త్వంబు | మెఱసి రాతి రెల్ల నుఱక పవన
తనయుఁ డరిగెఁ బవలు సనినట్లు చీఁకటి | యనక ముండ్లు గండ్లు ననక తెరలి.

1.6.162

వ. ఇట వారణావతంబున.

1.6.163

చ. అనుపమనిత్యసత్యరతు లై వినయాన్వితు లైన పాండునం
దనులకు ధర్మమూర్తులకు ధర్ము వెఱుంగక యిట్టు లెగ్గు సే
సిన ధృతరాష్ట్రజాధము నశేషసుహృత్సుతబంధుదాహసూ
చనమయి లక్కయి ల్లతికృశానుశిఖాహతిఁ గ్రాఁగె గ్రక్కునన్‌.

1.6.164

వ. తదనంతరంబ ప్రభాతసమయం బగుడును.

1.6.165

చ. అతిదురితక్రియాభిరతుఁడైన పురోచనుతోన భస్మసా
త్కృత మయి చెడ్డ తద్విపులగేహముఁ దత్‌క్షణదగ్ధ మైనయా
కృతక విభూతి జాతుష నికేతనమున్‌ మఱి శస్త్ర వేశ్మమున్‌
ధృతి సెడి చూడఁగా నరుఁగుదెంచి జనుల్‌ గడు సంభ్రమంబుతోన్‌.

1.6.166

మధ్యాక్కర. ప్రో వైన భస్మంబు వాయఁ ద్రోచి య బ్బూదిలో నడఁగి
యేవురు గొడుకులతోడ నం దొక్క యింతి యత్యుగ్ర
పావకదగ్ధ యై యున్నఁ జూచి, యప్పౌరులు దాని
భావించి కుంతియు సుతులు నని శోకపరవశు లగుచు.

1.6.167

మ. ‘బలవంతుల్‌ భరతాన్వయస్థితికరుల్‌ భాస్వద్భుజావీర్యని
ర్దళితారాతులు భూరి భూభర మహాధౌరేయకుల్‌ పాండవే
యులు నిష్కారణ మిట్లు వచ్చి ధృతరాష్ట్రోపాయమాయోత్థిత
జ్వలనజ్వాలలఁ గ్రాఁగిరే’ యనుచు సంజాతార్తులై రెంతయున్‌.

1.6.168

వ. అంత విదుర ప్రేషితుం డయిన ఖనకుండు పౌరులం గలసి భస్మంబు వాయఁ ద్రోచువాఁడపోలె నెవ్వరు నెఱుంగకుండఁ దనచేసిన బిలంబుద్వారంబు గప్పి లక్కయింట నొక్కనిషాదవనిత యేవురుగొడుకులతో దగ్ధ యగుట యెఱింగి గజపురంబునకుం జని తద్వృత్తాంతంబును బాండవుల కుశలగమనంబును విదురునకుం జెప్పె; నిట వారణావతమ్మునవా రెల్ల నిట్టిదారుణంబు దుర్యోధనకారితంబకా నెఱింగి శోకించి, కుంతీ పాండవులపంచత్వంబు ధృతరాష్ట్రునకుం జెప్పి పుచ్చిన.

1.6.169

ఉ. బాధిత శత్రు వర్గు లగు పాండుకుమారుల దుఃఖవార్త మ
ర్త్యాధము లైన సౌబలదినాధిపసూనులయొద్ద నప్దు దు
ర్యోధనుఁ డాదిగాఁగ సుతు లున్న సభన్‌ విని దుఃఖితాత్ముఁ డై
యా ధృతరాష్ట్రుఁ డా వఱచిన ట్లఱచెన్‌ వివిధప్రలాపుఁ డై.

1.6.170

వ. మఱియు గాంధారిం దొట్టి దేవీజనులయాక్రందనధ్వను లంతఃపురంబున నెగసె; భీష్మాదికురువృద్ధులును విప్రులుం బౌరులును శోకాక్రాంతు లయిరి; విదురుండు పాండవులకుశలస్థితి యెఱింగియు నెఱుంగనియ ట్లందఱం గలసి దుఃఖితుండపోలె నుండె; నంత ధృతరాష్ట్రుండు గొడుకులుం దానును బాంధవులును గుంతీపాండవుల కుదకదానంబు సేసి సంస్కారాదిపరలోకక్రియలు గంగాతీరంబునం జేయ సమకట్టించి తగువారి బ్రాహ్మణుల నపారధనంబులతోడం బుచ్చిన.

1.6.171

క. మతిఁ బాండుకుమారుల పం | చత విని దుర్యోధనుండు సంతసపడియెన్‌;
హితుఁ డయిన పురోచను పం | చత కెంతయు జాతదుఃఖచంచలుఁ డయ్యెన్‌.

1.6.172

వ. అట పాండవులును భాగీరథి లంఘించి దక్షిణాభిముఖు లయి మారుతమార్తాండమరీచిగోచరంబు గాని గహనంబున నరుగుచు నధికక్షుత్పిపాసాపరవశు లయి నడవనోపకయున్న నెప్పటియట్ల యందఱ నెత్తికొని వాయుతనయుండు వాయువేగంబునఁ జని సాయాహ్నంబున నొక్కవటమహీజాతశీతల శిలాతలంబున నునిచి దాని యగ్రవిటపం బెక్కి నీ రారయుచున్నంత ననతిదూరంబున.

1.6.173

మ. ప్రమదాపాదిపయఃప్రపూర్ణ మిది యౌఁ బద్మాకరం బంచుఁ ద
త్కమలామోదసుగంధ మారుతము వీఁకన్‌ ము న్నెఱింగించినన్‌
రమణం బిల్చె సరోవరం బనిలజున్‌ రాజీవరాజీ వస
త్సముదాళివ్రజచక్రవాక బక హంస క్రౌంచ నాదంబులన్‌.

1.6.174

వ. ఆ దిక్కున కా క్షణంబ యరిగి య క్కొలను గని యందుఁ గృతావగాహుం డై కడుపునిండ నీళ్ళు ద్రావి యచ్ఛిద్ర కమల పత్త్ర పుటికల నీళ్ళు గొని భీముండు గ్రమ్మఱి వచ్చునంత.

1.6.175

క. ధరణీ దిశాప్రసారిత | గురుకరనికరంబు లుడిచికొని దీర్ఘనిరం
తరగతి ఖిన్నుఁడపోలెను | హరిదశ్వుఁడు విశ్రమించె నస్తాద్రిదరిన్‌.

1.6.176

ఉ. అంబురుహాప్తుఁ డస్తశిఖరాంతరితుం డగుడున్‌ సమస్త జీ
వంబులు నెల్లచో నిజ నివాసముఁ బొందునెడం దమిస్రపుం
జంబులపోలె వెల్వడియె శైలవిశాలగుహాలినుండి నా
గంబులయూధముల్‌ సరసఘాసపరిగ్రహణోత్సుకంబు లై.

1.6.177

వ. భీమసేనుండును దద్వటవృక్షంబుక్రింద నధికపథిశ్రాంతులై పయి పుట్టంబులు పఱచుకొని తమ బాహుదండంబులు దలగడలుగా నిద్రితులయియున్న సహోదరులం దల్లినిం జూచి పరమదుఃఖితుం డై యాత్మగతంబున.

1.6.178

క. త్రిభువనసామ్రాజ్యశ్రీ | ప్రభుఁ డగు ధర్మాత్మజుండు ప్రాకృతజనున
ట్లభిరూక్షతలంబున ని | ట్లభిభూతుం డగునె నిద్ర నతిఖిన్నుం డై.

1.6.179

సీ. కుంతిభోజాధిపుకూఁతురు వసుదేవు | చెలియలు మఱియు విచిత్రవీర్యు
కోడలు కౌరవకులవిభూషణుఁ డైన | పాండుమహాదేవి పరమధర్మ
పరు లైన కొడుకులఁ బడసినయది పుష్ప | సుకుమారతరమూర్తి శుచిపరార్థ్య
శయనతలంబున శయనించియును నిద్ర | వోవనియది దప్పిఁ బొంది కటికి
ఆ. నేల గుండ్లు లొత్త నిద్ర వోయిన యది; | తల్లికంటె నిద్రఁ దగిలి సుతులు
వాలుమృగము లున్న వన మని వగవక | మఱచియుండి; రేమి మాడ్కి యొక్కొ!

1.6.180

వ. ‘వీరికి నిద్రాభంగంబు సేయనోపఁ; దమకుం దార మేల్కొని నీళ్ళు ద్రావుదురుగాక!’ యని యక్కమలపత్త్ర పుటికల నీ ళ్ళిమ్ముగా సంగ్రహించి వెండియుం దనమనంబున.

1.6.181

క. ఖలుఁ డై ధృతరాష్ట్రుఁడు పు | త్త్రులుఁ దానును గూడి మమ్ము దూరస్థులఁ గా
నిలు వెలువరించి లాక్షా | నిలయంబున నునిచెఁ బాపనిష్ఠితబుద్ధిన్‌.

1.6.182

క. కులపాంసను లై యహితం | బులు సేయుచునుండుచుట్టములఁ బొందక యి
మ్ముల నుండువాఁడ పుణ్యుఁడు, | వెలయఁగ గ్రామస్థితైకవృక్షమపోలెన్‌.

1.6.183

క. పరహితఫలవంతులు సు | స్థిరమూలాన్వితు లపాపధీరతులు పర
స్పరసంశ్రయమున జీవిం | తురు మనుజులు వనములోని ద్రుమములపోలెన్‌.

1.6.184

వ. అని ధృతరాష్ట్రుబాంధవంబు నిందించుచు నిబిడాంధకారనీరంధ్రంబు లయిన దిశలు సూచి యున్నంత, జన రభసంబు దవ్వుల వీతెంచిన ముందటం బురంబు గలుగవలయు, వీరల మేల్కొనునంతకు నే నిచ్చోట నేమరకుండవలయు నని.

1.6.185

క. ఆ కాననాంతరంబునఁ | బ్రాకటభుజవిక్రముండు పాండవవజ్ర
ప్రాకారుఁడు జాగరమున | శోకమనస్కుఁ డయి పవనసూనుం డుండెన్‌.

1.6.186

వ. తత్సమీపంబున బాలసాలతరుషండమండపంబుననుండి హిడింబుఁ డను నొక్కరాక్షసుండు వారి దవ్వులం జూచి మైవెంచి రూక్షకేశంబులు విద్రిచి యావులించి నీల్గి ‘నీరసవన్యమృగమాంసఖాదనజాతనిర్వేదనపరుండ నయి పెద్దకాలంబునకు మానవమాంసం బాస్వాదింప గంటి’ నని తన చెలియలి హిడింబ యనుదానిం బిలిచి యి ట్లనియె.

1.6.187

ఉ. ఇందుల కిమ్మెయిన్‌ మనుజు లెన్నఁడు వత్తురె? వత్తురేని యా
నందముఁ బొంది నిర్భయమునన్‌ శయనింతురె? యిట్లు వంటయిల్‌
కుందెలు సొచ్చె; వేగ చని కోమలి! వారలఁ జంపి తెచ్చి నా
కొందగ వండి పెట్టుము రసోత్కట మానవ మాంస ఖండముల్‌.

1.6.188

వ. అని పంచిన నదియును నతి త్వరితగతిం జని, ముందఱ వారల డాయ శంకించి, యొక్క వృక్షంబు మఱువునం గొండొక ప్రొ ద్దుండి.

1.6.189

మ. వనజాతాయతనేత్రు నున్నతబృహద్వక్షఃస్థలున్‌ సింహసం
హననుం బాండవసింహమున్‌ హృదయజన్మాకారు నుద్యన్మహా
శనికల్పస్థిరబాహుఁ జూచుచు మనోజాతాగ్నిసంజాతవే
దన యై రాక్షసి కామరూపధర మర్త్యస్త్రీస్వరూపంబుతోన్‌.

1.6.190

క. వితత బహురత్నరుచిశో | భితభూషణములు వెలుంగ, బెడఁగగు నవపు
ష్పితజంగమలతక్రియ ను | న్నతకుచ సనుదెంచెఁ బవననందను డాయన్‌.

1.6.191

క. రమణి నిజభ్రాతృనియో | గముఁ దలఁపక యపుడు భీముఁ గదిసెఁ; బతిస్నే
హమ కామినులకు బలవం | తము; పెఱనెయ్యములు వేయుఁ దత్సదృశములే?

1.6.192

వ. ఇట్లు మన్మథవ్యధాశిథిలితమానమానస యయి తనయొద్దకు వచ్చుదానిం బవమానసూనుం డవమాన పూర్వకంబున ‘నీ వెందులదాన? వింతప్రొ ద్దిందుల కేల వచ్చి? తెటవోయె? దెడ గలిగి పొ’ మ్మనిన విని హిడింబ యి ట్లనియె.

1.6.193

క. జననుత! యేను హిడింబుం | డను రక్కసుచెలియలం బ్రియంబున నినుఁ జూ
చినయప్పటఁగోలెను గడు | మనోభవనిపీడ్యమానమానస నయితిన్‌.

1.6.194

క. నాకుఁ బతి వయిన నిన్నుం | జేకొని మాయన్న యెగ్గుసేయక కాచున్‌;
నాకు మఱి నీవ పతివి గు | ణాకర యి జ్జన్మమున మహాస్నేహమునన్‌.

1.6.195

చ. ఉఱఁడు సురేంద్రు నైన బలియుండు హిడింబుఁడు వానిబారికిన్‌
వెఱవనివారలుం గలరె? వీరలు ముంద రెఱుంగ రక్కటా!
యెఱిఁగిరయేని యిట్లు దమయిండులనుండిన యట్లు మెచ్చ కే
మఱి శయనింతురే; కడుఁ బ్రమాదము సేసిరి బుద్ధిహీను లై.

1.6.196

వ. ‘ఇది హిడింబువనంబు; దీనం జొచ్చి వెలువడుట జముకుత్తుకఁ జొచ్చి వెలువడునట్ల; యాతం డింతకు వచ్చు; వీరితోడి దేమి; నీవు నాకుఁ బతి వై ప్రాణంబు రక్షించుకొని నావలన నిష్టోపభోగంబు లందు; మేనును గామచారిణిని; నీ కిష్టం బైన చోటికి నిన్నుఁ దోడ్కొనిపోవనేర్తు ననిన దానికి భీముం డి ట్లనియె.

1.6.197

క. విను బేల! యెట్టికష్టుఁడుఁ | దన పురుష గుణంబు పెడఁగఁ దల్లిని దోఁబు
ట్టినవారి విడిచి రాగం | బునఁ జపల స్త్రీ సుఖంబుఁ బొందునె చెపుమా.

1.6.198

వ. అనిన విని హిడింబ వీరి ‘నందఱ రక్షించుట నీకుఁ బ్రియం బేని య ప్పురుషాదుండు రాకుండ ముంద వీరి నెత్తుకొని పోయెద; వీరలఁ బ్రబోధింపు’ మనిన భీముం డి ట్లనియె.

1.6.199

తే. అధికవీరుండు రక్కసుఁ డరుగుదెంచు | నని మనంబున భయమంది వనజనేత్ర!
వీరిసుఖసుప్తులై యున్నవారి నిద్ర | సెడఁగ బోధింప నోప; నాకడిమి వినుము.

1.6.200

ఉ. క్రచ్చఱ నొక్కరక్కసుఁడ కాఁడు సురాసురులెల్ల నొక్కటై
వచ్చిన నీవ చూడఁగ నవార్యబలోన్నతిఁజేసి వారలన్‌
వ్రచ్చి వధింతుఁగాక; యిటు వచ్చి శ్రమంపడియున్న నిచ్చట
న్మెచ్చగువీరి దైన సుఖనిద్రకు భంగము సేయనెర్తునే.

First 200 of 314 passages. Read on