Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 1.8: ఆదిపర్వము — అష్టమాశ్వాసము

Āndhra Mahābhāratamu 1.8

Language
Telugu

ఆదిపర్వము — అష్టమాశ్వాసము

1.8.1

క. శ్రీవిభవనిత్యనిలయ! ద | యావర్ధితధారుణీసురాన్వయ! వేంగీ
భూవల్లభ! నిఖిలజగ | త్పావనశుభచరిత! భావభవనిభసుభగా!

1.8.2

వ. అ క్కథకుండు శౌనకాదిమహామునులకుం జెప్పె; నట్లు పాండవు లేవురకుం బాంచాలిం బరమోత్సవంబున వివాహంబు సేయించి ద్రుపదుం డయ్యేవురకు వేఱువేఱ యనర్ఘ్యమణిఖచితంబులైన యాభరణంబులను నపరిమితంబు లైన యర్థరాసులను, సౌవర్ణంబు లయిన శయ్యాసనపరికరంబులను, నూఱేసిభద్రగజంబులను, నూఱేసి కాంచనరథంబులను, వేయేసికాంభోజహయంబులను, పదివేవురేసి వరవస్త్రాభరణభూషితు లగు దాసదాసీజనంబులను, నూఱేసివేలు పాఁడిమొదవులను నగ్నిసాక్షికంబుగా నరణం బిచ్చిన.

1.8.3

క. చతురుదధివలయ నిఖిల | క్షితితలసామ్రాజ్యలక్షి క్మిని మూలం బై
సతి యాజ్ఞసేని పతులకు | నతిముద మొనరించెఁ దుల్యమగు శుశ్రూషన్‌.

1.8.4

సీ. కోడలి యుత్తమ గుణముల కెంతయు | సంతుష్టచిత్త యై కుంతిదేవి
‘లలితాంగి! హరియందు లక్ష్మిని, మఱి చంద్రు | నందు రోహిణి, నింద్రునందు శచిని
నవ్వసిష్ఠమునీంద్రునం దరుంధతిఁ బోలి | సుందరి! నీపతులందుఁ బ్రీతిఁ
బతిభక్తి యొప్ప నపత్యంబుఁ బడయుము; | గురు వృద్ధబాంధవాతుర విశిష్ట
ఆ. జనుల నతిథిజనుల సతతంబుఁ బూజింపు, | మన్నదానమున ధరామరేంద్ర
వరులఁ దనుపు, మఖిలవసుమతీప్రజ కెల్లఁ | గరుణ గలుగు మమ్మ కమలనేత్ర!

1.8.5

ఉ. పూని పరాక్రమం బెసఁగ భూతలనాథుల నోర్చి, వీరు లై
యీ నవఖండమండితమహీతల మేలుచు, నీపతుల్‌ పయో
జానన! రాజసూయమఖ మాదిగ నధ్వరపంక్తి సేయుచో
మానుగఁ బత్ని వీ వగుము మానితధర్మవిధానయుక్తితోన్‌.

1.8.6

క. ‘ఇందీవరలోచన! నీ | యం దే నభినందితాత్మ నైనట్టులు నీ
నందనులయందుఁ బౌత్రుల | యందును నభినంద్య వగుమ’ యని దీవించెన్‌.

1.8.7

వ. అట వాసుదేవుండు ద్రౌపదిని బాండవు లేవురు వివాహం బగుట విని సంతసిల్లి, వా రేవురకు వజ్ర వైడూర్య మరకత మౌక్తిక విభూషణంబులును, నానాదేశవిచిత్రవస్త్రంబులును, ననేకకరితురంగరథరత్న శిబికావిలా సినీనివహంబులుం బుత్తెంచిన.

1.8.8

చ. విలసిత రాజ్యలీలఁ బరవీరభయంకరు లై గుణంబులన్‌
వెలయుచుఁ బాండవుల్‌ విదితవిక్రము లుండుటఁజేసి దేవతా
దులవలనన్‌ భయంబు ద్రుపదుం డెఱుఁగండ; తదీయదేశముల్‌
దలరక యొప్పె రోగ భయ తస్కర డామర వర్జితంబు లై.

1.8.9

వ. ఇట్లు పాండవులు ద్రుపదుపురంబున నఖిలరాజ్యవిభవసమన్వితు లయి యొక్క సంవత్సరం బుండునంత నంతయు నెఱింగి దుర్యోధనగూఢచారు లరిగి కర్ణదుశ్శాసనసౌబలసోమదత్తపరివృతుం డయి యున్న దుర్యోధనునకు మ్రొక్కి యి ట్లనిరి.

1.8.10

సీ. కర్ణశల్యులు మొదల్‌గాఁ గల భూపతు | లత్యంత బలవంతు లస్త్రవేదు
లుద్ధతుల్‌ మోపెట్టనోపని చాప మ | శ్రమమున మోపెట్టి, చదలఁ దిరుగు
నయ్యంత్ర మేసి, మీయందఱముందరఁ | గృష్ణఁ దోడ్కొని యొక్క కృష్ణవర్ణుఁ
డెక్కటి రణములో నేపునఁ గానీను | నోడించి జయలీల నున్న యాతఁ
ఆ. డర్జునుండు; మఱిమహాబాహుబలమున | శల్యుఁ ద్రెళ్ల వైచి శత్రువరుల
నెల్లఁ దల్లడిల్ల నెగచిన యాతండు | భీమసేనుఁ డమితభీమబలుఁడు.

1.8.11

చ. ‘అనిమొన నట్లు దాఁకిన మహారథులన్‌ ధృతరాష్ట్రరాజనం
దనుల బలాఢ్యులన్‌ దళితదర్పులఁ జేసినవారు ధర్శనం
దనయము లుగ్రవీరు’ లని తద్విధమంతయు నేర్పడంగఁ జె
ప్పిన విని కౌరవప్రభుఁడుఁ బెల్కుఱి తద్దయు దుఃఖితాత్ముఁ డై.

1.8.12

వ. ‘అక్కట! పురోచనుం డొక్కరుండ లక్కయింట దగ్ధుం డయ్యెం గా కేమి; దైవానుకూల్యంబు లేక మానుషం బెంతయయ్యు నేమి సేయుఁ; బాండవు లేమిదైవసంపన్నులైరో యని వగచి, యీ యవసరంబున ద్రుపదు భేదించి పాండవుల నుత్సాదింపవలయు నె ట్లనిన.

1.8.13

ఉ. యాదవవృష్ణిభోజవరు లందఱుఁ బాండవపక్షపాతు; ల
చ్చేదివిభుండు వారలన చేకొనువాఁడగు; వీరలెల్ల నా
త్మోదయవృద్ధి పొంటెను దదున్నతిఁ గోరుదు; రట్లు గావునన్‌
భేదము సేయఁగావలయుఁ బెల్చన యందఱుఁ గూడకుండఁగన్‌.

1.8.14

వ. అని దుర్యోధనుండు పాండవ పాంచాల విభేదనోపాయంబుఁ జింతించుచుండె; నంత విదురుండు పాండవాభ్యుదయంబును బాంచాలీస్వయంవరంబును దుర్యోధనాదులు భగ్నదర్పు లగుటయు విని సంతసిల్లి, పాండవులు ద్రుపదరాజపుత్త్రిం బెండ్లి యై ద్రుపదుపురంబున సుఖంబున్న వా రని ధృతరాష్ట్రునకుం జెప్పిన నతం డి ట్లనియె.

1.8.15

ఆ. యజ్ఞసేనుకూఁతు నభిజాత నాతని | యజ్ఞవేది నుదిత యయినదాని
ననఘవిధి వివాహ మయి పాండునందనుల్‌ | మిగుల మిత్రబలసమృద్ధు లయిరి.

1.8.16

క. కొడుకుల యభ్యుదయము విని | కడు సంతస మయ్యె నిపుడు; కౌరవకుల మే
ర్పడ వెలిఁగె నెల్లరాజుల | నొడిచిన భుజవీర్యమున మహోత్సాహమునన్‌.

1.8.17

వ. అని విదురునకు మనఃప్రియంబుగాఁ బలికి, యంతఃపురంబునకుం జని యంతస్తాపం బేర్పడకుండ నుండునంత; గర్ణ దుర్యోధనులు ధృతరాష్ట్రు పాలికిం జని యి ట్లనిరి.

1.8.18

క. రేయును బగలును విదురుఁడు | నీయొద్దన యునికిఁజేసి నేరము పలుకన్‌
మాయిష్టం బెఱిఁగింపఁగ | ధీయుత! యెడఁ గంటి మిన్ని దివసంబులకున్‌.

1.8.19

క. విదురుఁడు పాండవహితుఁ డని | మొదలన యెఱిఁగియును నతి విమోహంబున న
వ్విదురువచనంబ నిలుపుదు | హృదయంబున; నతఁడు పెద్దయిష్టుఁడు మీకున్‌.

1.8.20

వ. అనిన వారలకు ధృతరాష్ట్రుం డి ట్లనియె.

1.8.21

సీ. ‘పలుకులఁ జెయ్వులఁ బాండవులకుఁ బ్రీతి | గలయట్ల యుండుదుఁగాని నాదు
హృదయంబు విదురున కెన్నండు నెఱిఁగింప | నేను మీతలఁచిన యివ్విధంబ
తలఁచుచు నుండుదు; దైవసంపద గల | వారలఁ బాండవవరుల నేమి
సేయంగ నగు? నెద్ది చెప్పుఁ డిష్టం బింక?’ | ననిన విచిత్రవీర్యాత్మజునకు
ఆ. దుష్టచేష్టితుండు దుర్యోధనుం డిట్టు | లనియెఁ ‘జిత్తగింపు మవనినాథ!
పాండురాజసుతులఁ బాంచాలపతియొద్ద | నుండకుండఁ జేయు టుచిత మిపుడు’

1.8.22

వ. అది యె ట్లనినం బుత్త్ర మిత్త్ర బాంధవ బలసంపన్నుం డైన ద్రుపదునొద్దఁ బాండవు లుండువా ‘రైన వారలం గృష్ణబలదేవులు యదువృష్ణిభోజాంధకవర్గములతో వచ్చి కూడిన నెవ్వరు సాధింపనోపరు; గావున, నెడసేయక ద్రుపదుండు పాండవుల విడుచునట్లుగా భేదింత; మొండె, వలనుగలవారలం బంచి కౌంతేయమాద్రేయులను దమలో విరక్తు లగునట్లుగాఁ జేయింత; మొండె నతిలలితప్రమదాజనంబులఁ బ్రత్యేకంబ యేవురకుం బ్రయోగించి ద్రౌపదివలన విరక్తిఁ బుట్టింత; మొండె, నేవురకు నొక్కతియ యా లగుట కష్టం బని ద్రోవదిఁ బాండవులవలన విగత స్నేహఁ గావింత; మొండె, నుపాంశుప్రయోగంబుల భీము వధియించి తక్కినవారల బలహీనులం జేయుదము.

1.8.23

ఆ. గాడ్పుచూలి పిఱుఁదుఁ గావంగ నర్జును | నోర్వ నమరులైన నోప రాజి;
నతఁడు నిహతుఁ డగుడు నశ్రమంబునఁ | బార్థు నొక్కరుండ కర్ణుఁ డోర్వ నోపు.

1.8.24

వ. ‘ఈ యుపాయంబులలో నెయ్యది యుచితంబును నపగతదోషంబును నదీర్ఘసూత్రంబును నగు నట్టి దానిం జెచ్చెర ననుష్ఠించు నది’ యనినఁ గర్ణుం డి ట్లనియె.

1.8.25

సీ. ఆర్యవృత్తుండు రాజాన్వయసమ్మతుఁ | డభిమతసంబంధుఁ డయినవాఁడు
గుణవంతు లగుచున్న కొడుకులు గలవాఁడు | పాంచాలుఁ డేల యప్పాండుసుతుల
వినయసంపన్నుల విడుచువాఁడగు?; మఱి | పాండునందను లేకపత్నియంద
కర మనురక్తులు గావునఁ దమలోన | నేల భేదిల్లుదు?; రెన్నఁడయ్యు
ఆ. నొక్కసతికిఁ బతులు పెక్కండ్రు రగు టిది | సతులకోర్కిగాన యతివ కృష్ణ
సుందరాంగి వారియం దేల యపరక్త | యగు మనోముదంబుఁ దగులుఁ గాక.

1.8.26

వ. మఱి భీమసేనుండు దొల్లి మీచేసిన యుపాంశువధల నేమి యయ్యె? నింకను నట్ల కావున నీ యుపాయప్రయోగంబు లన్నియు నుడిగి యిప్పుడ పాండవులయందు విక్రమంబు ప్రయోగించుట కార్యంబు.

1.8.27

చ. ఘన మగు విక్రమంబునన కాదె జగత్త్రితయంబుఁ బాకశా
సనుఁడు జయించె; భూతలము సర్వము మున్‌ భరతుండు విక్రమం
బునన జయించె; విక్రమము భూరి యశఃప్రియు లైన రాజనం
దనులకు సర్వసాధనము, ధర్మువు శత్రునిబర్హణంబులన్‌.

1.8.28

వ. ‘కావునఁ జతురంగ బల సాధనసన్నద్ధుల మయి యుద్ధంబునం బాంచాలు భంజించి పాండవుల నొండుగడ నుండనీక తోడ్కొనితెత్త’ మనినఁ గర్ణుపలుకు లాకర్ణించి ధృతరాష్ట్రుం ‘డిది యకార్యం బగు; నయినను మతిమంతులతో విచారించి చేయుద మని భీష్మద్రోణవిదురశల్యకృపాశ్వత్థామసోమదత్తాదులం బిలువంబంచి యంతయు నెఱింగించిన భీష్ముండు దుర్యోధనుం జూచి యి ట్లనియె.

1.8.29

మత్తకోకిల. ధీరు లౌ ధృతరాష్ట్రపాండు లతిప్రశస్తగుణుల్‌ ప్రసి
ద్ధోరుకీర్తులు; నాకు నిద్దఱు నొక్కరూప; తలంపఁగా
వీరు వా రను నట్టిబుద్ధివిభేద మెన్నఁడు లేదు గాం
ధారిపుత్త్రశతంబునందుఁ బృథాతనూజులయందునున్‌.

1.8.30

వ. అ ప్పాండవులతోడి విగ్రహంబుసేఁత కెన్నండును నొడంబడనేరఁ; బితృపైతామహం బయిన రాజ్యంబునకు నీయట్లు వారు నర్హులు; గావున వారికి నర్ధరాజ్యం బిచ్చిన నీకును నీ బాంధవులకును లోకంబులకును బ్రియం బగు; నట్లు గానినాఁ డపకీర్తి యగుఁ; గీర్తి నిలుపుటయ కాదె రాజులకు జన్మఫలంబు.

1.8.31

ఆ. కీర్తి లేనివానికిని జీవనంబు ని | రర్థకంబ చూవె! యవనిమీఁద
నిత్య మయిన ధనము నిర్మల కీర్తియ; | యట్టి కీర్తి వడయు టశ్రమంబె?

1.8.32

క. ఇలఁ గీర్తి యెంత కాలము | గలిగి ప్రవర్తిల్లె నంతకాలంబును ని
త్యుల కారె కీర్తి గల పు | ణ్యులు; కీర్తివిహీనుఁ డెందునుం బూజ్యుండే.

1.8.33

వ. ‘కీర్తియు నపకీర్తియు జనులకు స్వర్గ నరక నిమిత్తంబులు గావున, నపకీర్తి పరిహరించి, కీర్తిం బ్రతిష్ఠించి, పైతృకం బగు రాజ్యంబు పాండవుల కిచ్చి, వారితోడ బద్ధప్రణయుండవయి కీర్తి నిలుపు’ మనిన భీష్ముపలుకులకు సంతసిల్లి ద్రోణుండు దుర్యోధనున కి ట్లనియె.

1.8.34

చ. బహుగుణ ముత్తమోత్తమము పథ్యము ధర్మ్యము సాధుసమ్మతం
బహిత బలప్రమాథివిపులార్థయుతం బగుటన్‌ భవత్పితా
మహువచనంబుఁ జేకొనుము; మానుగ వారలతోడ నీవు వి
గ్రహ మొనరింప నేమిటికిఁ గౌరవసౌబలకర్ణశిక్షలన్‌.

1.8.35

మ. విలసద్ధర్మవిశుద్ధవృత్తులు వయోవృద్ధుల్‌ కుశాగ్రీయబు
ద్ధులు మధ్యస్థులు కార్యనిర్ణయసమర్థుల్‌ మానమాత్సర్యదూ
రులు నాఁ జాలినవారిపల్కులకు వైరుద్ధ్యంబు గావించున
జ్ఞులు భూనాథున కాప్తులున్‌ సఖులు నై శోషింతు రత్యంతమున్‌.

1.8.36

చ. తనరుచు దైవయుక్తి మెయి ధర్మువు సత్యముఁ దప్పకున్న య
య్యనఘుల పైతృకం బయిన యంశము మిన్నక వజ్రపాణి కై
నను గొనఁబోలు నయ్య కురునందన! పాండుతనూజు లున్న వా
రని విని వారికిం దగు ప్రియం బొనరింపక యున్కి ధర్మువే?

1.8.37

వ. ‘వారితో విగ్రహించుట కార్యంబు గాదు; ‘కావునఁ బాండవద్రుపదధృష్టద్యుమ్నకుంతీద్రౌపదులకుఁ బ్రియపూర్వకంబున నుచితభూషణాంబరావళులు వేఱు వేఱ యిచ్చిపుచ్చి, పాండవుల నిందులకుఁ దోడ్కొనివచ్చువారుగా దుశ్శాసనవికర్ణ ప్రభృతుల సమకట్టి పంపు’ మనిన ద్రోణుపలుకు లవకర్ణించి కర్ణుం డి ట్లనియె.

1.8.38

తే. ముదుసళులు దమ కిమ్ముగాఁ జదివికొండ్రు | గాక పతులకు హిత మగు కర్జ మేల
యొలసి చెప్పుదు? రహితుఁ గలపికొనుట | ధర్ము వని; రిది నయవిరుద్ధంబు గాదె?

1.8.39

వ. ‘మంత్రులు దమ తమ బుద్ధిదోషంబులు నెట్లునుం బలుకుదురు. వారల సాధుత్వంబును నసాధుత్వంబును నెఱుంగవలయు; నె ట్లనినఁ దొల్లి నితంతు వను మగధరాజు వికలేంద్రియవర్గుం డయి శ్వాసమాత్రంబ తక్కి రాజ్యతంత్రంబునం దసమర్థుం డై యున్న నాతనిమంత్రి యేకప్రధానుం డయి రాజ్యతంత్రం బెల్లఁ దనవశంబ యగుటంజేసి వాని నవమానించి తదీయరాజ్యవిభవం బెల్లఁ జేకొనియె; వాఁడును విక్రమహీనుం డయి రాజ్యంబు గోల్పడియెం; గావున మంత్రులు హితులపోలె నుండి యహితం బాచరింతురు; మీ యిద్దఱపలుకులు మాకుం జూడ నహితంబు’ లనిన నలిగి వానికి ద్రోణుం డి ట్లనియె.

1.8.40

క. ఉడుగక యే మహితముఁ బలి | కెడు వారము; నీవు హితవు క్రియ గొనఁగాఁ బ
ల్కెడు వాఁడవు; మాకంటెను | గడు హితుఁడవు నీవ కావె కౌరవ్యులకున్‌.

1.8.41

క. నీకఱపుల నిక్కురుకుల | మాకులతం బొందు టేమి యాశ్చర్యము? సౌ
మ్యాకృతులు గానివారల | వాకులు శిక్షలు నుపద్రవంబుల కావే!

1.8.42

వ. అనుచున్న సమయంబున నయ్యిద్దఱ వారించి విదురుండు ధృతరాష్ట్రున కి ట్లనియె.

1.8.43

సీ. ధర్మార్థవిత్తముల్‌ తథ్యవాదులు వయో | వృద్ధులు మధ్యస్థవిమలమతులు
ద్రోణగాంగేయులు దురితవిదూరులు | ని న్నెద్దిగఱపిరి నెమ్మితోడ
దానిన చేయుట ధర్మువు; వారల | కంటె హితుల్‌ నీకుఁ గలరె యొరులు;
దుర్యోధనుండును దుశ్శాసనుండును | గర్ణుండు శకునియుఁ గరము బాలు;
ఆ. రెఱుఁగ రిదియు ధర్ము విది యధర్మం బని; | యట్టివారిపలుకు లాదరించి
వినక పాండుసుతుల వేగ రావించి వా | రలకుఁ బ్రీతి నర్ధరాజ్య మిమ్ము.

1.8.44

మ. తమకుం దార యజేయు లెవ్వరికి దోర్దర్పంబునన్‌, దానిపై
శమితారాతి బలుండు వారలకుఁ బాంచాల ప్రభుం డిప్డు సు
ట్టము దా నయ్యెఁ; దదాత్మజుండయిన ధృష్టద్యుమ్నుడున్‌ వారితో
సమవీర్యుం డొడఁగూడె నిష్ట సఖుఁ డై సంబంధబంధంబునన్‌.

1.8.45

మ. బలదేవాచ్యుతసాత్యకుల్‌ దమకు నొప్పన్‌ మిత్రులుం గూర్చు మం
త్రులుఁగా దైవము మానుషంబుఁ గల నిత్యుల్‌, నీకు దుర్యోధనా
దులకంటెం గడుభక్తు లెంతయు వినీతుల్‌, వీరు లప్పాండుపు
త్త్రులు నీపుత్త్రుల కారె! వారిఁ దగునే దూరస్థులం జేయఁగన్‌.

1.8.46

ఉ. ఆహవభూమిలోనఁ బరమార్థము పార్థుఁడు వైరివాహినీ
వ్యూహము వ్రచ్చుచోట మఘవుండును వానికి మార్కొనంగ ను
త్సాహముసేయఁ డన్న; లఘుసారు లధీర లసాహసుల్‌ నిరు
త్సాహులు ద్రోహులై యెదిరి చత్తురొ మందురొ మానవేశ్వరా!

1.8.47

ఉ. ఆయతబాహుఁ డాతనికి నగ్రజుఁ డగ్రణి పోరులందు నా
గాయుతసత్త్వుఁ డుద్ధతయుగాంతకృతాంతనిభుండు భీముఁ డ
వ్వాయుజసవ్యసాచుల నవార్యబలోన్నతిఁ బోలుచున్న మా
ద్రేయు లజేయు లెవ్వరికి దేవసముల్‌ సమరాంతరంబునన్‌.

1.8.48

క. తమ్ములయట్టుల తనకు వ | శమ్మయి ధర్మువును ధృతియు సత్యముఁ గారు
ణ్యమ్మును నొప్పఁగఁ బేర్మి ని | జమ్ముగ మను ధర్మజున కసాధ్యము గలదే!

1.8.49

వ. ‘వారల బలపరాక్రమంబు లెల్లవారికి దృష్టపూర్వంబుల; యట్టివారితోడ విగ్రహంబు సేయు దుర్బుద్ధులుం గలరె? నీపుణ్యమ్మున నమ్మహాత్ములు జననీసహితంబు లక్కయింట బ్రతికిరి; నీయందుఁ బురోచనదిగ్ధం బయిన దుర్యశః పంకంబుఁ బాండవానుగ్రహజలంబులం జేసి కడిగికొనుము; దుర్యోధనాపరాధంబున నఖిల మహీప్రజకు నపాయం బగు నని తొల్లియు నీకుం జెప్పితి; నట్లు గాకుండ రక్షింపు’ మనిన ధృతరాష్ట్రుండు విదురున కి ట్లనియె.

1.8.50

క. నీవును భీష్ముఁడు ద్రోణుఁడు | భూ వినుత విశుద్ధ ధర్మబుద్ధుల రగుటన్‌
మీ వచనమున కవజ్ఞత | గావింపఁగ నంత కార్యగతి మూఢుఁడనే?

1.8.51

వ. ‘మీపంచినవిధంబున నప్పాండవుల కర్ధరాజ్యం బిచ్చెద’ నని భీష్మవిదురద్రోణాదు లయిన బాంధవప్రధానులయు దుర్యోధనాదు లయిన పుత్త్రులయు సమక్షంబున నిశ్చయించి, యప్పుడ పాండవులం దోడ్తేర విదురుం బంచిన, నాతండును ధృతరాష్ట్రుశాసనంబున ద్రుపదుపురంబునకుం జని, పుత్త్రభ్రాతృపరివృతుం డై యున్న ద్రుపదుని వాసుదేవసహితులై యున్న పాండవులనుం గాంచి ధృతరాష్ట్రుండు పుత్తెంచిన వివిధరత్నభూషణాదుల వేఱువేఱ యిచ్చి తానును వారిచేతఁ బ్రతిపూజితుం డై కేశవపాండవసమక్షంబున విదురుండు ద్రుపదున కి ట్లనియె.

1.8.52

మ. అభిజాతుండవు ధర్మశీలుఁడవు నీయం దైన సంబంధ మిం
దభిరమ్యం బనురూప మిష్ట మని సౌహార్దంబునన్‌ జాహ్నవీ
ప్రభవుండున్‌ ధృతరాష్ట్రుఁడుం గృపుఁడుఁ గుంభప్రోద్భవుండున్‌ యశో
విభవాలంకృత! సంతసంబువడి రుర్వీవంద్యు లిష్టంబునన్‌.

1.8.53

ఉ. తల్లియుఁ బుత్త్రులేవురు నుదాత్తమతుల్‌ దమయొద్ద వాసినం
దల్లడమంది యందఱును దద్దయు దుఃఖితచిత్తు లైరి, నీ
యల్లురఁ బాండుపుత్త్రులఁ బ్రియంబునఁ జూడఁగఁ గోరుచున్న వా
రెల్ల జనంబులుం గురుకులేశ్వరుఁ డాదిగ బంధువర్గమున్‌.

1.8.54

క. గురుగుణయుతు లగు కొడుకులఁ | గురుకులము వెలుంగ నయిన కోడలిఁ గృష్ణం
బరమపతివ్రత గొంతిని | గరుణను రాఁ బనిచె రాజు గజపురమునకున్‌.

1.8.55

వ. ‘నీచేత ననుజ్ఞాతు లై కాని వీరలు రా నేరరు గావున వీరలం బుత్తెంచు నది’ యనిన విదురునకు ద్రుపదుం డి ట్లనియె.

1.8.56

చ. రవినిభతేజుఁ డైన ధృతరాష్ట్రుఁడు పంపఁగ నీవు కార్యగౌ
రవమున వచ్చినప్పుడ తిరంబుగ వీరికి నిష్టసిద్ధి దా
నవు టది యేమి సందియమె; యంబుజనాభుఁడు నీవుఁ బాండవ
ప్రవరుల కెల్లప్రొద్దును శుభంబ తలంతురుకాదె నెమ్మితోన్‌.

1.8.57

క. నీవును ద్రోణుండును వసు | దేవతనూజుండు భీష్మధృతరాష్ట్రులు స
ద్భావమున నెద్ది సేయం | గా వగచితి రది హితంబ కా కొం డగునే?

1.8.58

వ. అనిన వాసుదేవుం డి ట్లనియె.

1.8.59

క. ఎవ్వరును నేమి సేయుదు | రివ్విదురుఁడు పాండవులకు హిత మొనరింపన్‌
నెవ్వగ నొండు దలంపకుఁ | డివ్వీరుల కగు నభీష్ట మిది మొదలుంగాన్‌.

1.8.60

వ. అనిన నందఱకు ధర్మనందనుం డి ట్లనియె.

1.8.61

క. కురు ముఖ్యులు ధృతరాష్ట్రవి | దుర భీష్ములు గురులు మాకు; ద్రుపదప్రభుఁడున్‌
గురుఁడు; మురాంతకుఁడు జగ | ద్గురుఁ; డిందఱ మతమునను నగున్‌ శుభయుక్తుల్‌.

1.8.62

వ. అని యుధిష్ఠిరుండు వారి యనుమతంబు వడసి, తమ్ములు దానును హస్తిపురంబునకుఁ బోవ నిశ్చయించి, ద్రుపదు వీడ్కొని ప్రయాణోన్ముఖుం డయ్యె; నిట్లు విదురుండు పాండవులఁ బాంచాలిని గుంతీదేవినిం దోడ్కొని వాసుదేవ ధృష్టద్యుమ్ను లపరిమిత సేనాసమన్వితు లై తోడ రాఁగా వచ్చునంత, వారలరాక విని ధృతరాష్ట్రుండు వికర్ణ చిత్రసేన ద్రోణ కృపాచార్యుల నెదురు పుత్తెంచినం దత్‌సైన్యసమేతులయి మహోత్సవంబుతోఁ బాండవులు గజపురప్రవేశంబు సేయునప్పుడు వారలం జూచి.

1.8.63

సీ. పుర జను లెల్లను గర మనురక్తు లై | ‘ధర్మస్వరూపుఁ డీ ధర్మతనయుఁ
డనుజులుఁ దానును జనుదెంచెఁ; బాండుభూ | జనపతి జీవించి మనలఁ గావఁ
బ్రీతితోఁ దా నిప్పు డేతెంచె, మే లయ్యె; | నిమ్మహాత్ములకు దైవమ్ముఁ బురుష
కారంబుఁ గలుగంగ ధారుణీరాజ్యంబు | వాయునే యాపదల్‌ వాయుఁగాక;
ఆ. దాన హోమ జప విధానముల్‌ మన కివి | గలవయేని ధరణివలయరాజ్య
మింద యుండి ధర్మనందనుఁ డొనరించు | చుండుఁ గావుతమ యఖండితముగ.

1.8.64

వ. అని పౌరులెల్ల దీవించుచుండఁ బౌరవకులనందను లయిన పాండునందనులు వచ్చి, భీష్మధృతరాష్ట్రాది కురువృద్ధులకు మ్రొక్కి, సకలజనానురాగం బొనరించుచు దుర్యోధనాదులతోఁ గలసి యెప్పటియట్ల రాజ్యవిద్యా వినోదంబుల నేను సంవత్సరంబు లుండు నంత, నొక్కనాఁడు ధృతరాష్ట్రుండు భీష్మవిదురద్రోణ దుర్యోధనాదుల సమక్షంబునఁ బాండవుల కి ట్లనియె.

1.8.65

ఆ. సర్వలోక కర్మసాక్షి, యీకృష్ణుండు | సాక్షి గాఁగ మీకు సకలవృద్ధ
రాజు లొద్ద నర్ధరాజ్య మిచ్చితిఁ బాండు | రాజవిభవ మెల్ల రమణఁ గొనుఁడు.

1.8.66

వ. అని ధర్మరాజు నభిషిక్తుం జేసి.

1.8.67

క. ‘నెమ్మిఁ జని ఖాండవప్ర | స్థమ్ము నివాసమ్ముఁ జేసి తద్దయు ననురా
గ మ్మెసఁగ నుండుఁ డందుఁ ది | రమ్ముగ’ నని పనిచెఁ బాండురాజాత్మజులన్‌.

1.8.68

వ. పాండవులును ధృతరాష్ట్రుశాసనంబునను, భీష్మాదులయనుమతంబునను వాసుదేవసహితు లయి ఖాండవప్రస్థమ్మునకుం జని రంత.

1.8.69

క. హరి యింద్రుఁ దలఁచె; నింద్రుఁడు | కర మనురాగమున విశ్వకర్మను బనిచెన్‌
‘సురపురమున కెన యగు పుర | మరుదుగ నిర్మింపు ముర్వి’ నని కడుఁ బ్రీతిన్‌.

1.8.70

సీ. ద్వైపాయనుండును ధౌమ్యుండు నాదిగా | భూసురుల్‌ సూత్రవిన్యాస మమరఁ
జేసి, శాంతికవిధుల్‌ సేయంగ, సుప్రశ | స్తం బైన రమ్యదేశంబునందు,
వాసవాదిష్టుఁ డై వసుధకు నేతెంచి | పేర్మితో నవ్విశ్వకర్మ పురము
నిర్మించె, నదియును నిరుపమలీలలఁ | దనరి యింద్రప్రస్థ మనఁగ నింద్రు
ఆ. పురముతోఁ గుబేరుపురముతో వరుణేంద్రు | పురవరంబుతోడ నురగరాజ
పురవిభూతితోడ నురువిలాసంబుల | సరి యనంగ నొప్పు ధరణిమీఁద.

1.8.71

ఉ. ఇమ్ముగ విశ్వకర్మ రచియించిన కాంచన హర్మ్య తుంగ శృం
గమ్ముల రశ్మిరేఖలు ప్రకాశములై కడుఁ బర్వి, తత్సమీ
పమ్మునఁ బాఱుచున్న ఘన పంక్తులయం దచిరద్యుతి ప్రతా
నమ్ములఁ గ్రేణి సేయుచు ననారతమున్‌ విలసిల్లుఁ దత్పురిన్‌.

1.8.72

చ. అలఘుతరంబు లై తుహినహారిసుధారుచి నిందురోచిరా
కులశశికాంతవేది పృథుకుంజగళ జ్జలనింఝరంబులన్‌
విలసిత జాహ్నవీ విమలవీచి విలోల లసత్పతాకలం
బొలుపగుఁ దత్పురీభవనముల్‌ హిమశైలముఁ బోలి యున్నతిన్‌.

1.8.73

చ. వననిధిలోని రత్నములు వాసుకిమూర్ధజరత్నసంఘముల్‌
గొనఁగ నవశ్యమున్‌ జనులకున్‌ సమకూరదు గాన నెప్పుడుం
గొనుఁడు పరార్థ్యరత్నములు గోరినవానిన యిత్తు మన్తెఱం
గునఁ బచరింతు రంగడులఁ గోమటు లప్పురి నిద్ధరత్నముల్‌.

1.8.74

సీ. వలరాజు సచివుల వడువున బెడఁగగు | కర్కశస్తనములఁ గరమువాఁడి
చూడ్కుల నతిరాగసురుచిరాధరముల | మదవిలాసాలసమందగతుల
వక్రాలకంబుల వలుఁదపిఱుందుల | దర్పగద్గదభాషితములఁ జేసి
జనులచిత్తములకు సంక్షోభ మొనరించు | కామినీజనములు గలిగి, సకల
తే. కామభోగములకు సదేకాంతగృహముఁ | బోలి పొలిచియు, ధర్మార్థములకు నిదియ
యాస్పదంబు నా వర్గత్రయావిరుద్ధు | లైన జనుల కెంతయు నొప్పు నప్పురంబు.

1.8.75

క. శరనిధినినాదనిభ మగు | పురఘోషముఁ గీడుపఱిచి పొలుపగుఁ గర మ
ప్పురి బ్రహ్మపురి మహీసుర | వరవేదాధ్యయనరవ మవార్యం బగుచున్‌.

1.8.76

చ. పరిఘజలంబులం దమలపంకరుహోత్పలకైరవాదిసుం
దరకుసుమంబులున్‌ ఘనపథంబున నుజ్జ్వలతారకానిరం
తరకుసుమంబులున్‌ వెలయుఁ దత్పురవప్రము పాదపీఠికా
శిరముల కొప్ప నర్చనలు సేసిన పువ్వుల యవ్విధంబునన్‌.

1.8.77

చ. తమము నడంచుచున్‌ వెలుఁగుతత్పురగోపురశాతకుంభకుం
భముల విచిత్రసన్మణిగభస్తివితానములన్‌ విచిత్రవ
ర్ణములగు నాత్మవాహముల నమ్మక పల్మఱుఁ జూచి యన్యవా
హము లని సంశయప్రణిహితాత్ముఁ డగున్‌ హరిదశ్వుఁ డెప్పుడున్‌.

1.8.78

చ. సరళ తమాల తాల హరిచందన చంపక నారికేళ కే
సర కదలీ లవంగ పనస క్రముకార్జున కేతకీలతా
గరుఘనసార సాల సహకార మహీరుహరాజ రాజి సుం
దర నవనందనావళులఁ దత్పురబాహ్యము లొప్పుఁ జూడఁగన్‌.

1.8.79

మ. అనిలం బప్పురిఁ బౌరచిత్తముల కత్యానంద మొందంగ నం
దిని యన్నేటితరంగలం బెనఁగుచున్‌ దివ్యద్రుమాకీర్ణ నం
దనసందోహముఁ దూఱుచున్‌ వికచకేతక్యాదినానాలతాం
తనవామోదముఁ బొందుచున్‌ సుడియు నిత్యంబుం గరం బిష్ట మై.

1.8.80

వ. ఇట్టి యింద్రప్రస్థపురంబున నింద్రవిలాసంబుతో వ్యాసవాసుదేవానుమతుం డై ధర్మతనయుండు ధౌమ్యపురస్సర మహీసురప్రవరవేదఘోషంబులు, సకలజనాశీర్వాదనాదంబులు, మృదుమధుర మంగళ సంగీత రవంబులు, వివిధ తూర్యధ్వనులు నతిసమృద్ధంబులై యెసంగ వర్గచతుష్టయంబునుం బోని యనుజవర్గంబుతో శుభముహూర్తం బునం బురప్రవేశంబు సేసి సర్వప్రకృతిజనానురాగకరుం డయి.

1.8.81

చ. అనుజులు నల్వురుం దనకు నత్యనురాగమునన్‌ విధేయు లై
తనరుచు నుండ వేదవిహితం బగు యజ్ఞమపోలె సర్వపా
వనశుభమూర్తి యై భువనవంద్యుఁడు ధర్మపరుండు ధర్మనం
దనుఁడు ధరాధిరాజ్యము ముదంబునఁ జేయుచునుండెఁ బేర్మితోన్‌.

1.8.82

సీ. అనఘు వేదాధ్యయనాసక్తు నారభ్య | మాణమహాధ్వరు మనుచరిత్రు
సర్వవర్ణాశ్రమసంరక్షణక్షము | సత్యసంధాను నజాతశత్రు
భరతవంశోత్తముఁ బ్రభు ధర్మనందను | రాజుఁగాఁ బడసి సురాజ యయ్యె
వసుధ, యధిష్ఠానవతి యయ్యె మఱి లక్ష్మి | బంధుమంతం బయ్యెఁ బరమధర్మ,
ఆ. మన్నరేంద్రునందు నాపూర్ణతరశర | దైందవాతపంబునందుఁ బ్రీతి
సమమ కా సమస్తజనులచిత్తంబు లా | నందరసభరంబు నొందఁ దాల్చె.

1.8.83

క. ధరణిప్రజ ధర్మసుతు సు | స్థిరనిర్మలధర్మచరితఁ జేసి రుజా త
స్కరపరరాష్ట్రవిబాధలఁ | బొరయక సంతతసమృద్ధిఁ బొందె విభూతిన్‌.

1.8.84

క. తనరిరి తద్దేశంబున | ననవరతము యజనయాజనాధ్యయనాధ్యా
పనదానములుఁ బ్రతిగ్రహ | మును నను షట్కర్మములను భూసురవంశ్యుల్‌.

1.8.85

క. పంబి యజనాధ్యయన దా | నంబుల వర్తిల్లె బ్రాహ్మణప్రియ మయి ధ
ర్మ్యం బయి క్షత్రియవైశ్యకు | లం బవిరతపుణ్యకర్మలాలస మగుచున్‌.

1.8.86

క. పరమద్విజశుశ్రూషా | పరు లయి శూద్రాదు లవనిఁ బరగిరి ధర్మ
స్థిరమతు లయి ధర్మజు ధ|ర్మరాజ్య మభివృద్ధిఁ బొందె మహిమాన్విత మై.

1.8.87

వ. అంత.

1.8.88

క. ‘నారదుఁడు వచ్చుఁ; దద్వచ | నారంభుల రగుఁడు మీర’ లని కఱపి మహో
దారుఁడు వారల వీడ్కొని | నారాయణుఁ డరిగెఁ దత్‌క్షణమ తనపురికిన్‌.

1.8.89

వ. పాండవులును పరాక్రమ, ప్రణయ, వశీకృతాఖిలరాజన్యు లయి సుఖం బుండు నంత నొక్కనాఁడు.

1.8.90

తరలము. ప్రవిమలాగమతత్త్వవేది తపఃప్రభాసి జగత్త్రయీ
శివకరుండు హితోపదేశము సేయఁగాఁ గడువేడ్కతో
దివిజవంద్యుఁడు ప్రీతితోఁ జనుదెంచె నారదుఁ డంబుజో
ద్భవతనూజుఁడు భానుతేజుఁడు పాండవేయులపాలికిన్‌.

1.8.91

మానిని. తమ్ములుఁ దానును ధర్మతనూజుఁడు తత్‌క్షణసంభృతసంభ్రముఁ డై
యమ్మునినాథవరేణ్యునకున్‌ వినయమ్మున మ్రొక్కి సమున్నతపీ
ఠమ్మున నుంచి యథావిధి పూజ లొడంబడఁ జేసి మునీశ్వర నె
య్యమ్మున నీ విట వచ్చుటఁజేసి కృతార్థుల మైతిమి యిందఱమున్‌.

1.8.92

వ. ‘మాపుణ్యంబునంజేసి భవద్దర్శనంబు సంభవించె’ నని పరమప్రీతిహృదయులై పలికి, పరమభక్తిం బాంచాలి మ్రొక్కించి యున్నంత, నందఱ నాశీర్వచనంబుల నభినందించి వారల కుశలం బడిగి నారదుండు ద్రౌపదిం బోవం బనిచి, వా రేవురకు నేకాంతంబున ని ట్లనియె.

1.8.93

సీ. సర్వధర్మజ్ఞుల రుర్వీశపూజ్యుల | రన్యోన్యనిత్యసౌహార్దయుతుల
రగణితగుణయుక్తిఁ బొగడంగఁ దగువార | లిట్టి మీ కేవుర కిపుడు ద్రుపద
సుత యొక్కతియ ధర్మమతి ధర్మపత్ని యై | నది; యీక్రమంబు లోకాగమంబు
లందు విరుద్ధ; మీసుందరికారణం | బున మీకు విప్రీతి పుట్టకుండ
ఆ. నుండవలయుఁ; బ్రియసహోదరుల్‌ దొల్లి సుం | దోపసుందు లొక్కయువతి కడరి
విగ్రహించి యసురవీరులు దమలోనఁ | బొడిచి మృత్యునిలయమునకుఁ జనిరి.

1.8.94

క. అనిన నది యెట్టు లని యమ | తనయుఁడు గడువేడ్కతోడఁ ద న్నడిగిన నా
తనికిఁ దదీయానుజులకు | నినసన్నిభుఁ డమ్మునీంద్రుఁ డి ట్లని చెప్పెన్‌.

1.8.95

వ. తొల్లి దితిపుత్త్రుండైన హిరణ్యకశిపువంశంబున నికుంభుం డనువానికి సుందోపసుందు లన నిద్దఱుగొడుకులు పుట్టి, నియతాత్ములయి తపంబునన కాని సర్వంబునుం బడయంగా దని యేకనిశ్చయులై, వింధ్యాచలంబున కరిగి నిగృహీతేంద్రియు లై నిదాఘకాలం బెల్లఁ బంచాగ్నిమధ్యంబున నిలిచి, వానకాలంబును శీతకాలంబును జలాశయంబుల వసియించి, మఱియు వాయుభక్షులు నేకపాదస్థితులు నూర్ధ్వబాహులు నధోముఖులును నై పెద్దకాలంబు తపంబు సేసిన.

1.8.96

సీ. వారిదారుణతపోవహ్నిదాహంబున | వింధ్యాద్రిదరుల నావిర్భవించి,
యత్యుచ్చ మయి ధూమ మాకాశమెల్లను | గప్పిన, నమరులు గరము వెఱచి,
రత్నంబులను వధూరత్నంబులను జేసి | తత్తపోవిఘ్నవిధాననిరతు
లయి ప్రబోధింపంగ నలవిగాకున్నఁ, దో | యజుగర్భుపాలికి నరిగి యసుర
ఆ. వరులతపముఁ జెఱుపవలయు నావుడుఁ, గమ | లాసనుండు త్రిభువనార్చితుండు
సురహితంబుపొంటె సుందోపసుందుల | కడకు వచ్చె వరము కరుణ నీఁగ.

1.8.97

వ. ఇట్లు పితామహుండు సుందోపసుందులతపంబునకు మెచ్చి సన్నిహితుం డయి ‘మీ కిష్టం బైన వరం బిచ్చెద వేఁడుం’ డనిన వారలు వారిజాసనునకు ముకుళితకరకమలు లయి ‘దేవా! మాయిష్టంబు దయసేయ మీ కిష్టం బేని, మాకుఁ గామరూపత్వంబును గామగమనత్వంబును సకలమాయావిత్వంబును నన్యులచేత నవధ్యత్వంబును నమరత్వంబునుం బ్రసాదింపుం’ డనిన.

1.8.98

ఆ. కమలభవుఁడు వారి కమరత్వ మొక్కటి | దక్కఁ గోర్కులెల్ల నక్కజముగఁ
గరుణ నిచ్చె, నిట్లు సరసిజగర్భుచే | వరము వడసి యసురవరులు పెఱిగి.

1.8.99

క. అనుపమరాజ్యవిభూతిం | దనరి జగద్విజయకాంక్ష దైత్యులకు ముదం
బొనరఁగ నకాలకౌముది | యను నుత్సవ మొప్పఁ జేసి రగణితబలు లై.

1.8.100

క. సురగరుడోరగకిన్నర | పురములు వడిఁ జూఱకొనుచు భూలోకమునం
బరఁగిన రాజర్షి మహీ | సురవరులకు బాధసేయుచును గర్వమునన్‌.

1.8.101

క. ద్విజవరవినిర్మితము లగు | యజనస్వాధ్యాయకవ్యహవ్యతపోదా
నజపంబులఁ బితృదేవత | లజస్రమును దృప్తు లగుదు రని కడునలుకన్‌.

1.8.102

వ. పుణ్యవంతుల నిత్యనైమిత్తికకర్మంబులకు విఘ్నంబులు సేయుచు, సింహవ్యాఘ్రగజరూపధరు లై వనంబులం దిరుగుచు, మునిపల్లియలు సొచ్చి మునులకుఁ బ్రాణభయంబు సేయుచున్న వారలక్రూరకర్మంబులకు వెఱచి వేల్పులును మునులును బురాణముని యైన బ్రహ్మపాలికిం జని కృతాంజలు లయి జగంబులకు సుందోపసుందులు సేయు నుపద్రవంబులు సెప్పిన విని విశ్వగురుండు విస్మితుం డయి వార లన్యులచేత వధ్యులు గారు గావున పరస్పర యుద్ధంబునఁ బంచత్వంబుఁ బొందవలయు నని విచారించి, విశ్వకర్మ రావించి ‘రూపలావణ్యవతియైన యొక్క యువతి సృజియింపు’ మని పంచినఁ బ్రసాదం బని మ్రొక్కి యప్పుడు.

1.8.103

పృథ్వీవృత్తము. తిలాణుమణికోటి సంఘటిత దివ్యదేహంబుతోఁ
దిలోత్తమ యనంగ నొక్కయువతీలలామంబు ను
త్పలాక్షి నొనరించె సర్వగుణభాసిరూపక్రియా
కలావిదుఁడు విశ్వకర్మ తనకౌశలం బేర్పడన్‌.

1.8.104

వ. అదియును సురేంద్రప్రముఖ బృందారక మునిబృంద పరివృతుండై యున్న పరమేష్ఠికిం బరమభక్తిం బ్రణమిల్లి పనియేమి యని ముందట నిలిచిన, నరవిందసంభవుం డాసుందరిం జూచి ‘సుందోపసుందు లను దైత్యులు దర్పితు లయి జగంబుల కహితంబులు సేయుచు వింధ్యాచలకందరంబున నున్నవారు; వార లిద్దరు నీకారణంబునం దమలో నొండొరులతోఁ బొడిచి దండధరుపురంబున కరుగునట్లుగాఁ జేయు’ మని పంచిన వల్లె యని.

1.8.105

సీ. అబ్జజు వీడ్కొని యది దేవసభకుఁ బ్ర | దక్షిణం బొనరించెఁ; దత్‌క్షణంబ
తద్రూపసౌందర్యదర్శనలోలుఁ డై | యజుఁడు నాలుగుదిక్కులందుఁ దనకు
గావించుకొనియె ముఖంబులు; మఱిరెండు | కన్నులఁ జూచినం గాదు తృప్తి
యని సురేంద్రుండు సహస్రాక్షుఁ డయ్యె; న | య్యమరులు కామమోహాంధు లైరి;
ఆ. ముదిత యిట్లు సర్వమోహిని యై మర్త్య | భువనమునకు మెఱుఁగుఁ బోలె నొప్పి
యరుగుదెంచె సుందరాంగి వింధ్యాచల | విపినదేశ మెల్ల వెలుఁగుచుండ.

1.8.106

క. అమ్ముదితఁ జూచి యన్నయుఁ | దమ్ముఁడు నొక్కట మనోజతాడితు లై, రా
గమ్మున నన్యోన్యస్నే | హమ్ములు చెడి దృష్ట్టు న్లిలిపి రయ్యువతిపయిన్‌.

1.8.107

క. ఘను లయ్యిరువురు నేకా | సనభోజనయాననిలయశయనక్రియలం
దనరెడువా రేకస్త్రీ | వినిహితకాము లయి రపుడు విధినియమమునన్‌.

1.8.108

క. ఇది నావల్లభ యిది నా | హృదయేశ్వరి యనుచుఁ గోరి యిరువురు మదనో
న్మదు లయి పరిగ్రహించిరి | తదీయ కమనీయ సవ్యదక్షిణకరముల్‌.

1.8.109

వ. ఇట్లు పట్టుకొని

1.8.110

క. ‘సుందరి! మాయిద్దఱలో | నిం దెవ్వరి వలతు చెప్పు మీ’ వనవుడుఁ బూ
ర్ణేందుముఖి వారి కను ‘మీ | యం దెవ్వఁడు వొడిచి యొడుచు నతనిన వలతున్‌’.

1.8.111

క. అనవుడు నిద్దఱుఁ దమలోఁ | బొనుపడ కొండొరులతోడ భుజబలు లలుకన్‌
ఘనవజ్రతనులు దాఁకిరి | తనరఁగ నటఁ గొండ గొండఁ దాఁకినభంగిన్‌.

1.8.112

క. విపరీతమతిని సుందుఁడు | నుపసుందుఁడుఁ దాఁకి పొడిచి రొండొరుతోడం
గుపితాత్ము లయి తిలోత్తమ | నెపమున దృఢముష్టిఘాతనిర్ఘాతములన్‌.

1.8.113

క. అన్యోన్యప్రియభాషణు | లన్యోన్యహితైషు లసుర లన్యులపోలెన్‌
మన్యుపరిప్రేరితు లై | యన్యోన్యాభిహతిఁ జనిరి యమపురమునకున్‌.

1.8.114

క. ఇంతుల నిమిత్తమున ధృతి | మంతులుఁ బొందుదురు భేదమతి గావున మీ
రింతయు నెఱింగి యొండులు | చింతింపక సమయ మిందు సేయుఁడు బుద్ధిన్‌.

1.8.115

సీ. అనిన నారదమహామునిపల్కు చేకొని | దమలో నొడంబడి విమలబుద్ధి
నేవురయందును ద్రోవది ప్రీతితో | నొక్కొక్కయింట దా నొక్కయేఁడు
క్రమమున నుండను; గమలాక్షి యెవ్వరి | యింటఁ దా నుండె నయ్యింటివలనఁ
బెఱవారు చనకుండ; నెఱుఁగక చనిరేని | వెలయఁగఁ బండ్రెండునెలలు తీర్థ
ఆ. సేవ సేయుచును విశేషవ్రతంబులు | ధీరవృత్తిఁ జలుపువారుగాను
సన్మునీంద్రునొద్ద సమయంబు సేసిరి | రాజనుతులు పాండురాజసుతులు.

1.8.116

వ. ఇట్లు హితోపదేశంబు సేసి నారదుం డరిగినం బాండవులు దమచేసినసమయస్థితిం దప్పక సలుపుచు సుఖంబుండఁ; గొండొకకాలంబున కొక్కనాఁ డొక్కబ్రాహ్మణుండు మ్రుచ్చులచేతఁ దనహోమధేనువు గోల్పడి వచ్చి యాక్రోశించిన, నశ్రుతపూర్వం బయిన యయ్యాక్రోశంబు విని విస్మితుం డయి విజయుండు విప్రులకయిన బాధ దీర్పక యుపేక్షించుట పాతకం బని యప్పుడ యవ్విప్రు రావించి ‘యిది యేమి కారణం?’ బని యడిగిన నర్జునునకు విప్రుం డి ట్లనియె.

1.8.117

క. యమతనయు ధర్మరాజ్యము | తమరాజ్యమ యని మహాముదంబున విప్రో
త్తము లున్నచోటనే బ | న్నమువడి కోల్పడితి గోధనము మ్రుచ్చులచేన్‌.

1.8.118

సీ. ‘వదలక మ్రుచ్చుల వధియించి నాహోమ | ధేనువుఁ గ్రమ్మఱఁ దెచ్చియిమ్ము
జననుత! దానివత్సంబు నిన్నటఁగోలె | నుడుగక యఱచుచునున్నయదియ;
పలుకుల కెడ లేదు; బాణాసనము గొని | చనుదెమ్ము నాతోడఁ జట్ట’ ననిన
ద్రౌపదీసహితుఁ డై ధర్మరాజాయుధా | గారంబునం దున్న గార్ముకంబుఁ
ఆ. బుచ్చికొనఁగఁ దనకుఁబోలమి యెఱిఁగియు | విప్రునార్తరవము వినఁగ నోప
కర్జునుండు నిజశరాసనగ్రహణార్థ | మాయుధాలయమున కరిగె నపుడు.

1.8.119

క. ‘ధరణీసురవరులకుఁ గడు| సెరగై నెడ నెఱిఁగి యెడయుఁ జేయుదురె మహా
పురుషు’ లని నరుఁడు విలుగొని | యరిగెను మ్రుచ్చులపిఱుంద నవ్విప్రుపనిన్‌.

1.8.120

వ. ఇ ట్లరిగి యర్జునుం డతివీరు లయిన చోరుల వధియించి, బ్రాహ్మణునకు గోధనంబు నిచ్చి క్రమ్మఱి వచ్చి ధర్మజునకు మ్రొక్కి, ‘లోకంబులమర్యాదలు విచారించి రక్షించుచున్న మనయందు మర్యాదాభంగం బయ్యె నను నింతకంటె దుర్యశం బొండెద్దియు లేదు గావున నాకు ద్వాదశమాసికవ్రతంబు సలుపవలయు’ నని పోవ సమకట్టి యున్న నర్జునునకు యుధిష్ఠిరుం డి ట్లనియె.

1.8.121

ఆ. క్రూర కర్ము లయ్యు గో బ్రాహ్మణుల కగు | బాధ లుడుచుజనులఁ బాపచయము
లెట్టియెడలఁ బొంద వింద్రనందన! నీకు | సమయభంగభీతిఁ జనఁగ నేల?

1.8.122

వ. ‘మఱి యట్లుంగాక తస్కరవధోపేక్షల నశ్వమేధ భ్రూణహత్యల ఫలం బగు నని వేదంబులయందు వినంబడుఁ; దస్కరుల వధియించి బ్రాహ్మణహితంబు చేసినవాఁడవు; నీకు సమయోల్లంఘనప్రాయశ్చిత్తంబు సేయ నేల?’ యనిన నర్జునుం డి ట్లనియె.

1.8.123

క. భూజనపరివాదం బ | వ్యాజంబునఁ బరిహరింపవలయును మనకున్‌
వ్యాజమున ధర్మలోపం | బాజిజయా! పరిహరింతురయ్య మహాత్ముల్‌.

1.8.124

వ. కావున వ్రతదానంబు నా కనుగ్రహింప వలయు’ నని మ్రొక్కి యర్జునుం డగ్రజు వీడ్కొని గురుజనానుమతుం డై యఖిలవేదవేదాంగపారగు లైన బ్రాహ్మణులు ననేకశాస్త్రవిదు లయి వివిధకథాకథనదక్షు లయిన పౌరాణికులును దనకు సహాయులుగా నరిగి సకలతీర్థసేవచేయుచు నయ్యైతీర్థంబులందు.

1.8.125

ఆ. ధరణిసురుల గురులఁ బరమయోగుల మహా | భాగు లయిన యట్టి భాగవతుల
రాజవంశవరుఁడు పూజించుచును వారి | వలనఁ బుణ్యకథలు వెలయ వినుచు.

1.8.126

క. గంగాధర పింగజటా | సంగమ మంగళ విశాల చటుల తరంగన్‌
గంగానది సేవించెను | గంగాద్వారమున విగతకల్మషుఁ డగుచున్‌.

1.8.127

వ. అందు నిత్యంబును గంగాస్నానంబు సేసి తత్తీరంబున హోమంబు సేయుచు వాసవసుతుండు మహీసురవర సహితుం డయి కొన్ని దివసంబులు వసియించి, యొక్కనాఁడు ప్రభాతంబ విధిపూర్వకంబునం గృతాభిషేకుం డయి దేవర్షి పితృతర్పణంబులు సేసి.

1.8.128

సీ. వేల్వంగ సమకట్టి వెలువడ నున్న న | య్యింద్రనందను రుచిరేంద్రనీల
సుందరశ్యామాంగు సురరాజకరికరా | కారమహాబాహుఁ గఱ్ఱిఁ జూచి
నలినాక్షి యం దొక్కనాగకన్యక కామ | పరవశ యై వానిఁ బట్టి తిగిచి
కొని నాగపురమునకును జని నిజరమ్య | హర్మ్యంబునందు నెయ్యమున నునిచె;
ఆ. నందు నగ్ని తొంటియట్టు లభ్యర్చితం | బయి వెలుంగుచున్న నర్జునుండు
హోమకార్య మొప్ప నొనరించి యప్పు డ | య్యింతిఁ జూచి నగుచు నిట్టు లనియె.

1.8.129

క. ‘తామరసనేత్ర! నీ పే | రేమీ? యెవ్వరితనూజ; వి ట్లేల మహా
వ్యామోహిత వై?’ తనవుడుఁ | గోమలి సురరాజపుత్త్రకున కి ట్లనియెన్‌.

1.8.130

వ. ఏ నులూచి యను నాగకన్యక; నైరావతకులసంభవుం డయిన కౌరవ్యుకూఁతుర; నిన్నుం జూచి మనోజబాణబాధిత నయితి; నామనోరథంబు సలుపుము.

1.8.131

క. నీ గుణములు దొల్లియు నా | గీగీతములందు విని తగిలి యిపుడు మనో
రాగమునఁ జూడఁ గంటిని | భాగీరథియందు నిన్నుఁ బరహితచరితా!

1.8.132

వ. అనిన దాని కర్జునుం డి ట్లనియె.

1.8.133

మధ్యాక్కర. ద్వాదశమాసికవ్రతము సలుపుదుఁ దరుణి! మాయన్న
యాదేశమునఁ జేసి సర్వతీర్థము లాడుచు బ్రహ్మ
వాదులసంగతి బ్రహ్మచర్యసువ్రతుఁడ నై యుండి
నీదుమనోరథ మెట్లు సలుపంగనేర్తు నే నిపుడు?

1.8.134

వ. అనిన నవనతానన యయి నాగకన్యక యర్జునుం జూచి ‘ ద్రుపదరాజపుత్త్రియందు మీచేసిన సమయంబును, భవత్తీర్థాగమననిమిత్తంబును వ్రతంబును నెఱుంగనిదానఁ గాను; సర్వతీర్థసేవనంబును సర్వవ్రతంబులు సలుపుటయును సర్వదానధర్మక్రియలును బ్రాణదానంబుతో సమానంబులు గావు; నామనోరథంబు విఫలం బయిన మనోజానలంబునం బ్రాణపరిత్యాగం బగుం గావున నన్ను రక్షింపుము; దీన నీకు వ్రతభంగంబు గా’ దనిన నర్జునుండు దానిమనోరథంబు సలిపి యారాత్రి నాగభువనంబున వసియించి నాగకన్యకయందు సద్యోగర్భంబున నిరావంతుం డను కొడుకుం బడసి, నాగలోకంబు వెలువడి యాదిత్యోదయంబుతోడన గంగాద్వారంబునకు వచ్చి, తద్‌వృత్తాంతం బంతయుఁ దనసహాయు లయిన విప్రులకుం జెప్పి, వారలకు హృదయానందంబు సేయుచు.

1.8.135

క. వితతయశుఁ డరిగి హిమప | ర్వతపార్శ్వంబున నగస్త్యవటమును నత్యు
న్నతభృగుతుంగముఁ జూచుచు | ధృతి నేఁగి హిరణ్యబిందుతీర్థంబునకున్‌.

1.8.136

వ. అందును గోదాన భూదాన హిరణ్యదానంబు లాదిగాఁ బెక్కుదానంబులు సేసి, యజ్ఞార్థంబుగా భూసురోత్తములకు గోసహస్రంబు లిచ్చి, ప్రాగ్దేశంబున కరిగి నైమిశారణ్యంబునందు జగన్నాథునారాయణు నారాధించి యుత్పలినియుఁ గౌశికియు నందయు నపరనందయు గయయు గంగయు గంగాసాగరసంగమంబును జూచుచు.

1.8.137

క. ఏలావనరమ్యము లగు | వేలావనములను బవనవిచలద్వీచీ
లాలితసముద్రవిద్రుమ | మాలాపులినస్థలముల మసలుచు లీలన్‌.

1.8.138

వ. కళింగవిషయంబు సొచ్చు నంతఁ దోడిబ్రాహ్మణులు కొందఱు కళింగద్వారంబునఁ గ్రమ్మఱి యుత్తర కురుదేశంబులకుం జనిన; నందుం గతిపయబ్రాహ్మణసహాయుం డయి పార్థుం డరిగి పూర్వసముద్రతీరంబునఁ బురుషోత్తమదేవరకు నమస్కరించి మహేంద్రపర్వతంబు చూచుచు.

1.8.139

సీ. దక్షిణగంగ నాఁ దద్దయు నొప్పిన | గోదావరియు, జగదాది యైన
భీమేశ్వరంబును, బెడఁగగుచున్న శ్రీ | పర్వతంబును జూచి, యుర్విలోన
ననఘ మై శిష్టాగ్రహారభూయిష్ఠ మై | ధరణీసురోత్తమాధ్వరవిధాన
పుణ్యసమృద్ధమై పొలుచు వేంగీదేశ | విభవంబుఁ జూచుచు విభుఁడు దక్షి
తే. ణాంబురాశితీరంబున కరిగి, దురిత | హారి యైన కావేరీమహాసముద్ర
సంగమంబున భూసురేశ్వరుల కభిమ | తార్థదానంబుఁ జేసి కృతార్థుఁ డగుచు.

1.8.140

వ. పదుమూఁడగు మాసంబున మణిపూరపురంబునకుంజని, యందున్న రాజుఁ జిత్రవాహనుం గని, వానిచేతం బూజితుం డయి, తత్పుత్త్రిఁ జిత్రాంగద యనుదాని వివాహంబుగా నపేక్షించిన, నయ్యర్జునునభిప్రాయం బాప్తులవలన నెఱింగి చిత్రవాహనుం డర్జునున కి ట్లనియె.

1.8.141

క. ధన్యుండ నైతి నీ కీ | కన్యక నీఁ గాంచి; యైనఁగలతెఱఁగు జగ
న్మాన్య! యెఱిఁగింపవలయు; న | నన్యమనస్కుండ వయి దయన్‌ విను మనఘా!

1.8.142

క. మా కులమునందుఁ దొల్లి ప్ర | భాకరుఁ డను రాజవరుఁ డపత్యము దనకున్‌
లేకున్న నుమేశ్వరునకుఁ | బ్రాకటముగ భక్తితోఁ దపం బొనరించెన్‌.

1.8.143

వ. పరమేశ్వరుండును వానికిం గరుణించి నీకు నొక్కపుత్త్రుం డుద్భవించు; నీకులంబున వారికెల్ల సంతానం బిట్ల యగు నని వరం బిచ్చిన; నది మొదలుగా మావంశంబునవారికెల్ల నొక్కొక్కపుత్త్రుండ కా జన్మించుచు వచ్చిన నిప్పుడు నాకు నిక్కన్యక పుట్టె; నేను దీనిం బుత్త్రీకరణంబునం బెనిచితి.

1.8.144

తే. ఇందుఁ బుట్టినసుతుఁడు మా కిందువంశ్య! | వంశవిస్తారకుండు గావలయు; నిదియ
యీలతాంగికి నుంకు; వి ట్లీఁగనోపు | దేని పెండిలియగుమ యీయింతిఁ బ్రీతి.

1.8.145

వ. అనిన నర్జునుండు చిత్రవాహనువచనంబున కొడంబడి చిత్రాంగద వివాహం బై.

1.8.146

ఉ. అంగజరాజ్యలక్షి పొడవైనదియొక్కొ యనంగ నొప్పు చి
త్రాంగదయందుఁ బార్థుఁడు మహాప్రణయప్రవణాంతరంగుఁ డై
యంగజభోగసంగమున నమ్మణిపూరపురిన్‌ సమస్తలో
కాంగణరంగసంగతవిహారయశోంగదుఁ డుండె లీలతోన్‌.

1.8.147

వ. ఇట్లుండి యొక్కనాఁడు తపోధనబ్రాహ్మణసమేతుం డై తత్సమీపంబున సముద్రతీరతీర్థంబులు చూచుచుం జని సౌభద్రం బను తీర్థంబుఁ గని యందు స్నానంబు సేయ సమకట్టిన నర్జునుం జూచి యందుల మును లి ట్లనిరి.

1.8.148

తరలము. ఇది సొరంగ నసాధ్య మెవ్వరి కిందువంశవరేణ్య! వి
న్మిదియ కా దివి యేనుతీర్థము లీసముద్రతటంబునన్‌
విదితముల్‌ దురితాపహంబులు వీని నెన్నఁడు నాడనో
డుదురు సన్మును లిందుఁ గోల్మొసళుల్‌ గొనున్‌ వడిఁ జొచ్చినన్‌.

1.8.149

వ. ‘సౌభద్ర పౌలోమ కారంధమ ప్రసన్న భారద్వాజంబు లను నామంబుల దక్షిణసముద్ర తీరంబునం బ్రసిద్ధంబు లయిన యిప్పంచతీర్థంబు లిప్పుడు నూఱేండ్లంగోలె నుగ్రగ్రాహగృహీతంబు లయి దుర్జనగృహీతంబు లయిన రాజులవిభవంబులుంబోలె సాధుజనవర్జితంబు లయి యుండు’ ననిన విని విజయుం ‘డశేషతీర్థసేవార్థి నయి వచ్చిన నాకు నీతీర్థంబు లాడకునికి పౌరుషంబు గా’ దని యందు.

1.8.150

క. సాహసికుం డై నరుఁ డవ | గాహము సేయుటయు జలము గ్రక్కదల మహా
గ్రాహము బీభత్సు బృహ | ద్బాహుబలుం బట్టికొనియెఁ బఱతెంచి వడిన్‌.

1.8.151

ఆ. దాని నశ్రమమునఁ దజ్జలాశయము వె | ల్వడఁగ వైచె నరుఁడు బాహుశక్తి;
నదియుఁ దత్‌క్షణంబ యభినవ యౌవనో | ద్భాసమాన దివ్యభామ యయ్యె.

1.8.152

ఉ. ఆ లలితాంగిఁ జూచి నరుఁ డద్భుత మంది ‘మృగాయతాక్షి! యి
ట్లేల జలేచరత్వమున నిజ్జలధిన్‌ వసియించి? తిప్పు డి
ట్లేల సురూప భామ వయి? తెందులదానవు నీవు?’ నావుడున్‌
బాలిక పాండుపుత్త్రునకుఁ బార్థున కి ట్లనియెం బ్రియంబునన్‌.

1.8.153

వ. ‘ఏను వంద యను నప్సరసఁ, గుబేరుననుంగ; నాసఖులు సౌరభేయియు సమీచియు బుద్బుదయు లతయు ననువారలు నలువురు నాయట్ల యత్తీర్థంబులం దున్నవారలు; వారిని శాపవిముక్తలం జేసి రక్షింపు’ మనిన దానికి నర్జునుం డి ట్లనియె.

1.8.154

క. ‘వనజాక్షి! యేమికారణ | మున నుగ్రగ్రాహరూపములు దాల్చితి రీ?’
రని యడిగిన వేడుక నా | తని కది యి ట్లనుచుఁ జెప్పెఁ దద్విధమెల్లన్‌.

1.8.155

వ. వినవయ్య! యే మేవురము నఖిలలోకపాలపురంబులు చూచుచు భూలోకంబునకు వచ్చి యొక్క వనంబునం దుగ్రతపంబు సేయుచున్నవాని నత్యంతశాంతు నేకాంతచారి నగ్నికల్పు నొక్కబ్రాహ్మణుం గని వానితపంబునకు విఘ్నంబు సేయ సమకట్టి.

1.8.156

క. వేడుక నమ్ముని ముందటఁ | బాడితి మాడితిమి; పెక్కుపరిహాసంబుల్‌
రూఢిగఁ బలికితి; మెట్లుం | జూడఁడు మావలను; నీరసుం డన నుండెన్‌.

1.8.157

క. ధృతిహీనులచిత్తము ల | ట్లతివలయం దేల తగులు నత్యంతదృఢ
వ్రతులమనంబులు వారల | మతులఁ దృణస్త్రైణములు సమంబుల కావే.

1.8.158

వ. ఏము రాగకారణవికారంబులు గావించిన నవి దనకుం గోపకారణంబు లయిన నతికుపితుం డయి బ్రాహ్మణుండు మమ్మేవురను మహాగ్రాహంబులుగా శపియించిన నమ్మునివరునకు ముకుళితహస్తల మై యి ట్లంటిమి.

1.8.159

చ. అలుగుదురయ్య విప్రులు ? మహాపురుషుల్‌ పరుషాపరాధముల్‌
దలిఁగెడువారు ధర్మువులు దప్పక సల్పెడువారు సత్యముల్‌
పలికెడువారు; వారల కపాయము డెందములం దలంచు మూ
ర్ఖులకు విధాతృచెయ్వున నగున్‌ దురితంబులు దుర్యశంబులున్‌.

1.8.160

వ. ‘కావున మాచేసిన యజ్ఞానంబు సహించి మాకు శాపమోక్షంబుఁ బ్రసాదింపు’ మనిన నవ్విప్రుండును గరుణించి ‘యెవ్వండేని మీచే గృహీతుం డయి మీయున్న జలాశయంబు మిమ్ము వెలువరించు నాతండ మీకు శాపమోక్షకారణుం డగు’ ననిన.

1.8.161

సీ. అట్టిమహాబాహుఁ డత్యంతబలుఁ డెవ్వఁ | డగునొక్కొ! యనుచు నే మరుగుదెంచు
వారము త్రైలోక్యవర్తి నంబుజభవ | ప్రభవు నారదుఁ గని భక్తితోడ
మ్రొక్కిన మమ్ము నమ్ముని చూచి ‘యి ట్లేల | వగఁ బొంది కందినవార?’ లనియు
నడిగి మావృత్తాంత మంతయు మాచేత | విని, ‘విప్రునలుకయు విధికృతంబుఁ
ఆ. గ్రమ్మఱింప లావె! కావున దక్షిణ | జలధితీరమునఁ బ్రశస్త పంచ
తీర్థములకు నేఁగి ధృతి నందు నూఱేఁడు | లుండుఁ డట్లు మీర లుండు నంత’.

1.8.162

క. ‘జననుతుఁడు పాండుతనయుఁడు | ధనంజయుఁ డశేషతీర్థదర్శనకాంక్షం
జనుదెంచి మీకు దయ న | మ్ముని చెప్పినయట్ల శాపమోక్షము సేయున్‌’.

1.8.163

వ. ‘అనిన నన్నారదువచనంబులు విని వచ్చి మహోగ్రగ్రాహముల మై భవదాగమనంబు ప్రతీక్షించుచు నిప్పంచతీర్థంబుల నుండి నేఁడు నీకారణంబునం గృతార్థుల మయితి’ మనిన నర్జునుండును గరుణాయత్తచిత్తుం డయి వంద చెప్పినయన్నలువురకు శాపమోక్షణంబు సేసిన, నమరకన్యక లతిహర్షంబున నమరేంద్రనందను దీవించి దేవలోకంబున కరిగి; రదిమొదలుగా నిప్పంచతీర్థంబులు నారీతీర్థంబులు నాఁ బరగె; నర్జునుండును గ్రమ్మఱి మణిపూరపురంబునకు వచ్చి రాజ్యలీల సుఖంబుండి చిత్రాంగదయందు బభ్రువాహనుం డను పుత్త్రుం బడసి చిత్రవాహనునకు వంశకరుంగా నిచ్చి, వాని వీడ్కొని గోకర్ణంబుఁ జూచుచుఁ బశ్చిమసముద్రపార్శ్వంబునఁ బ్రభాసం బను తీర్థంబునకుఁ జని, యందులకు ద్వారవతి పురంబు కుఱంగలి యని విని.

1.8.164

సీ. ‘అందుల కేఁగి యే నిందీవరశ్యాము | నరవిందనాభు నంబురుహనేత్రు
సన్మిత్రుఁ జూచి నాజన్మంబు సఫలంబు | సేయుదు నఘములు వాయుపొంటె;
నదియునుంగాక, మున్‌ గదుఁ డనువానిచే | వింటిఁ దిలోత్తమకంటె రూప
వతియట్టె సద్గుణాన్వితయట్టె నా కట్టి | భద్రేభగమన సుభద్రఁ జూచు
ఆ. వేడుకయును గలదు; విష్ణుభట్టారకు | దయ నభీష్టసిద్ధి దనరు’ ననుచుఁ
దద్ద సంతసిల్లి తద్ద్వారకాపురి | కరుగ నిశ్చయించె నర్జునుండు.

1.8.165

వ. మఱియు నప్పురంబునం ద న్నొరు లెఱుంగకుండ వలయు ననియు, యాదవులు యతుల కతిభక్తు లనియును మనంబునం దలంచి కృతకయతివేషధరుం డయి.

1.8.166

క. పరమబ్రహ్మణ్యు జగద్గురు | గరుడధ్వజు ననంతగుణు నేకాగ్ర
స్థిరమతి యై నిజహృదయాం | తరసుస్థితుఁ జేసి భక్తిఁ దలఁచుచు నుండెన్‌.

1.8.167

క. నరు నునికి యెఱిఁగి కృష్ణుడు | తిరముగ దయతోఁ బ్రభాసతీర్థమునకు నొ
క్కరుఁడ చనుదెంచె; సర్వే | శ్వరుఁ డెప్పుడు భక్తులకుఁ బ్రసన్నుఁడ కాఁడే.

1.8.168

వ. ఇట్లు దనకడకు వచ్చిన యాదిదేవునకు దేవకీనందనునకు నతిసంభ్రమంబున నమస్కరించి పురందరనందనుం డానందజలభరితనయనుం డయి యి ట్లనియె.

1.8.169

ఉ. ద్వాదశమాసికవ్రతము ధర్మవిధిం జలుపంగ నేఁగి గం
గాదిమహానదీహిమవదాదిమహాగిరిదర్శనంబు మీ
పాదపయోజదర్శనముఁ బన్నుగఁ జేయుటఁ జేసి పూర్వసం
పాదిత సర్వపాపములుఁ బాసె భృశంబుగ నాకు నచ్యుతా!

1.8.170

వ. అనిన విని నగుచు నబ్జనాభుం డర్జును నతిస్నేహంబునం గౌఁగిలించుకొని యెల్లవారల కుశలంబును నడిగి, యాతని తీర్థాభిగమననిమిత్తంబును సుభద్రయందు బద్ధానురాగుం డగుటయు నుపలక్షించి, ద్వారకాపురంబునకుఁ దోడ్కొని యరిగి.

1.8.171

ఉ. భ్రాజితశాతకుంభగృహపంక్తులఁ బుష్పితవల్లివేల్లితో
ర్వీజవనావృతిన్‌ విమలవిద్రుమవజ్రవిచిత్రవేదికా
రాజిఁ గరంబు రమ్య మగు రైవతకాచలకందరంబునన్‌
రాజకులైకసుందరుఁ బురందరనందను నుంచి లీలతోన్‌.

1.8.172

క. శ్రీపతి గడునెయ్యంబున | నాపోవక పార్థునొద్ద నారాత్రి ప్రియా
లాపములఁ దగిలి యుండెను | దీపమణుల్‌ వెలుఁగ భువనదీపుఁడు దానున్‌.

1.8.173

వ. ఇట్లు పరమపురుషు లయిన నరనారాయణులు దమ పూర్వజన్మ సహవాసంబున య ట్లప్పుడు పరమానందంబునఁ బరస్పరప్రియమధురసంభాషణంబుల నొక్కటనుండి యారాత్రి సలిపి; రంతఁ బ్రభాతంబ వాసుదేవుండు వాసవనందను నంద యుండం బంచి కాంచనరథారూఢుం డయి పురంబునకుం జని పౌరజనప్రధానసమక్షంబున రైవతకమహోత్సవంబు ఘోషింపం బంచిన.

1.8.174

చ. పొలుపుగఁ బూసి కట్టి తొడి భూరివిభూతిప్రకాశితంబుగాఁ
గలయఁగఁ దత్పురీజనులు కాంస్యమృదంగముకుందవేణుకా
హలపటహధ్వనుల్‌ చెలఁగ నాటలుఁ బాటలు నొప్పె నెల్లవా
రలుఁ జని చేసి రర్చనలు రైవతకాద్రికి నుత్సవంబుతోన్‌.

1.8.175

చ. గురు కుచ యుగ్మముల్‌ గదలఁ గ్రొమ్ముడులందుల పుష్పముల్‌ పయిం
దొరఁగ నిదాఘబిందువితతుల్‌ చెదరన్‌ మదిరామదంబునన్‌
బరవశ లయ్యు నింపెసఁగఁ బాడుచుఁ దాళము గూడ మెట్టుచుం
దరుణియ లొప్ప నాడిరి ముదంబునఁ దమ్ము జనాలి మెచ్చఁగన్‌.

1.8.176

సీ. సారణ సత్య కాక్రూర విదూరథ | సాంబ సంకర్షణ శంబరారి
భాను సుషే ణోగ్రసేన శైనే యాని | రుద్ధ హార్దిక్య గ దోద్ధవాది
యాదవు లధికప్రమోదు లై యొక్కటఁ | దరుణులుఁ దారును గరికరేణు
హయశిబికారూఢు లయి తదుత్సవమున | కరిగిరి; మఱి జగద్గురుఁడు గృష్ణుఁ
ఆ. డింద్రలీలతో నుపేంద్రుండు రుక్మిణీ | దేవి మొదలుగాఁగ దేవు లెల్ల
నొప్పుతోడ రాఁగ నప్పర్వతమునకుఁ | జనియె సకలజనులుఁ దనకు నెరఁగ.

1.8.177

వ. ఇ ట్లరిగి జనార్దనుండు ధనంజయుం దలంచి, తత్సమీపగతుం డై తోడ్కొని, యాతనికి న ప్పర్వత రమణీయ ప్రదేశంబులం జూపుచు విహరించి, యిద్దఱు నొక్కవిమలమణివేదికయం దభిమతసంభాషణంబుల నుండు నంత.

1.8.178

చ. క్వణదణుకింకిణీకలితకాంచనకాంచికలాపమున్‌ రణ
న్మణికలనూపురంబులు సమధ్వని నొప్పఁగ భక్తిఁ బాదచా
రిణి యయి కన్యకాజనపరీత సుభద్ర తదద్రిపూజన
ప్రణతులు సేసె నింద్రసుతుఁ బార్థు నిజేశ్వరుఁగాఁ దలంచుచున్‌.

1.8.179

ఉ. దాని సుభద్రఁగా నెఱిఁగి తత్‌క్షణజాతమనోజసంచల
న్మానసుఁ డైన యవ్విజయు మానుగఁ జూచి ‘మునీంద్ర! నీకుఁ జ
న్నే నలినాక్షులందు మది నిల్పఁగ’ నంచును మందహాసగ
ర్భాననుఁ డై రథాంగధరుఁ డాతని కి ట్లనియెం బ్రియంబునన్‌.

1.8.180

వ. ‘నీవు సుభద్రయందు బద్ధానురాగుండ వగుట తొల్లియు నే నెఱుంగుదు; నోడకుండుము; నీ కోర్కి వసుదేవ దేవకీ దేవులకుం జెప్పి సఫలంబు సేయుదు’ నని యర్జునునకు హృదయానందంబుగాఁబలికి, యప్పుడ వడిగల చారుల రావించి ద్వారవతియం దర్జునుం డున్న వాఁ డనుకుశలవార్త ధర్మజున కెఱింగింప నింద్రప్రస్థపురంబునకుం బుచ్చియున్నంత; నచ్చటికి వచ్చి బలదేవాదియాదవు లతిభక్తులై యతియకా వగచి యర్జునునకు నమస్కరించి యాతనివలన సర్వతీర్థంబులుఁ దత్సేవాఫలంబులును విని సంతసిల్లి, యి వ్వర్షాకాలంబు మాయంద యుండి చాతుర్మాస్యంబు సేసి మమ్ముం గృతార్థులం జేయుం డని ప్రార్థించి, పార్థుం దోడ్కొని చని, వానికి నన్నపానాది విధులం బరిచరింప సుభద్రం బంచి, కన్యాపురంబునందు నివాసంబు సేసిన.

1.8.181

క. అందు ధృతిమందరుండు పు | రందర నందనుఁడు దనకు రమణి గుణశ్రీ
సుందరి సుభద్ర నెయ్యం | బొందఁగఁ బరిచర్య సేయుచుండఁగ నుండెన్‌.

1.8.182

క. ధీరుఁడు యతిరూపంబున | నారఁగ నిందున్నయాతఁ డర్జునుఁ డని స
త్యారుక్మిణులకుఁ జెప్పె ము | రారాతి రహస్యమున ననంత ప్రీతిన్‌.

1.8.183

చ. అలయక నాఁడు నాఁటికి లతాంగి యపూర్వము లైన భోజనం
బులు గడుభక్తిఁ బెట్టుచు, నపూర్వము లైన వపుర్విలాస యు
క్తులు వెలయించుచున్‌, ముదముతోఁ బెనిచెన్‌ మరి నాఁడునాఁటి క
గ్గల మగుచుండ నెయ్యమును గామవికారము సవ్యసాచికిన్‌.

1.8.184

వ. మఱియును.

1.8.185

సీ. అలినీలకుంతలుం డనియును హరినీల | సమవర్ణుఁ డనియు నాజానులంబి
తాయతస్థిరబాహుఁ డనియును రక్తాంత | నలినదళాకారనయనుఁ డనియు
నుత్తుంగఘనవిశాలోరస్కుఁ డనియును | గవ్వడి యనియును గరము వేడ్క
వివ్వచ్చు నెప్పుడు వినియెడునది; దన | వినినట్ల యతిఁ జూచి, ‘వీఁడు విజయుఁ
ఆ. డొక్కొ!’ యనుచు సంశయోపేతచిత్త యై | యుండి, యుండ నోప కొక్కనాఁడు
భోజనావసానమున నున్న యమ్ముని | కిందువదన ప్రీతి నిట్టు లనియె.

1.8.186

వ. మునీంద్రా! నీ యాడనితీర్థంబులుం జూడనిపురంబులు నెఱుంగనిరాజకులంబును లే వని విచారింతు.

1.8.187

సీ. ‘అమరావతికి నెన యనఁగ నివ్వసుమతిఁ | బరఁగు నింద్రప్రస్థపురవరంబు
చూచితిరే? పాండుసుతు లందు సుఖ మున్న | వారె? మాయత్త యంభోరుహాక్షి
కుంతీమహాదేవి కుశలయే? యమ్మహా | వీరుఁ డర్జునుఁడు జితారి తీర్థ
గమనోత్సుకుం డయ్యెఁ; గ్రమ్మఱి వచ్చెనే? | యెఱుఁగుదురేని నా కెఱుఁగఁ జెప్పుఁ ’
ఆ. డనిన నేన చూవె యయ్యర్జునుండ; నీ | యొద్ద నివ్విధమున నున్నవాఁడఁ;
దరుణి! నీకు నాకు ధరణీధరుం డను | జలజభవుఁడు సేసె సంగమంబు.

1.8.188

వ. ‘బ్రాహ్మంబు మొదలుగాఁ గల యెనిమిది వివాహంబులయందును గాంధర్వరాక్షసంబులు క్షత్త్రియులకు నుత్తమ వివాహంబులు గావున నిది గాంధర్వ వివాహంబున కవసరం’ బనిన సుభద్ర లజ్జావనతవదన యయి.

1.8.189

తే. ‘నన్ను నీ నర్హు లెల్ల నిం దున్నవారు; | వార యెఱిఁగి చేయుదురు వివాహ’ మనుచు
వనజనేత్ర యంతఃపురంబునకుఁ జనియె;| నరిగెఁ దన లతాగృహమున కర్జునుండు.

1.8.190

వ. అయ్యిరువుర యన్యోన్యప్రణయంబులు దనదివ్యజ్ఞానంబునం జేసి దివ్యపురుషుండు పురుషోత్తముం డెఱింగి, యర్జునునకు భోజనవిధు లమర్ప రుక్మిణీదేవిం బంచి, యొక్కనాఁ డేకాంతంబున దేవకీవసుదేవప్రద్యుమ్న సాంబసంకర్షణసారణసాత్యకు లకు నర్జును స్థితియును’ నాతనియందు సుభద్రనెయ్యంబును నెఱింగించి, తమతొల్లింటి విచారంబున కనుగుణం బగుటకు సంతసిల్లి, బలదేవాదు లెఱుంగకుండ సుభద్రార్జునుల వివాహంబు సేయ సమకట్టి, తమనిశ్చయం బయ్యిరువురకుం జెప్పి, పశుపతిపూజా మహోత్సవవ్యాజంబున నఖిలయాదవ భోజాంధకవృష్ణివరులతో నంతర్ద్వీపంబునకుం జని.

1.8.191

వ. అం దమరబృందవంద్యున | కిందుకళాభరణునకు నుమేశ్వరునకు నా
నందం బొందఁగ నందఱ | నందకధరుఁ డుత్సవం బొనర్పఁగఁ బంచెన్‌.

1.8.192

క. తగఁగ వివాహం బెన్నం | డగునొకొ, యెన్నండు సంగమావాప్తియు మా
కగునొకొ యని యెడఁ గోరుచు | నొగి నిట యుండిరి సుభద్రయును విజయుండున్‌.

1.8.193

క. హరిఁ దలఁచె సుభద్ర; పురం | దరుఁ దలఁచె ధనంజయుండు; దడయక వా ర
య్యిరువురఁ బెండిలి సేయఁగ | వరదులు తద్ద్వారవతికి వచ్చిరి ప్రీతిన్‌.

1.8.194

వ. ఇట్లు వాసుదేవుండు వసుదేవాక్రూరసారణసాంబసాత్యకిసహితంబుగా నంతర్ద్వీపంబుననుండి వచ్చిన యనంతరంబ యమరావతినుండి యమరసిద్ధసాధ్యమునిగణపరివృతుం డై యమరేంద్రుండు వచ్చె; నంత బృహస్పతి యిచ్చిన యుత్తమలగ్నంబున నగ్నియమనిరృతివరుణవాయుధనదేశానాదిసురవరులు, నత్రిభృగు నారద వసిష్ఠవామ దేవప్రభృతి మహామునులును సదస్యులుగాఁ, గశ్యపప్రజాపతి హోమకర్తగా, నరుంధతియు శచియు సత్యభామయు రుక్మిణియు నప్సరోగణంబులతోడం బురంధ్రీకార్యంబులు నిర్వహింప సుభద్రార్జునుల వివాహమహోత్సవం బతిరమ్యం బయ్యె నంత.

1.8.195

తరువోజ. అనిమిషప్రభుఁడు నిజాత్మజు ననఘు | నర్జునుఁ బ్రీతితో నభిషిక్తుఁ జేసి
మనుజేంద్రుఁ గాంచనమణిమయోత్తుంగ | మకుటవిభూషణమస్తకుఁ జేసి
యనుపమకేయూరహారాదిభూష | ణాభిశోభితుఁ జేసి యప్పు డానంద
జనితాంబుకణికార్ద్రచక్షుస్సహస్ర | జలరుహంబులు దాల్చె సమ్మదం బెసఁగ.

1.8.196

మాలిని. నరునకు దయ ని ట్లానంద మొందించి యింద్రుం
డరిగె దివికి దివ్యానంతరత్నాంశుజాల
స్ఫురితసురవిమానంబుల్‌ నభోభాగ మెల్ల
న్మెరసి వెలుఁగుచుండన్‌ నిర్జరశ్రేణితోడన్‌.

1.8.197

వ. ఇట్లు నారాయణుండు నిజారంభంబు సఫలం బగుటకు సంతసిల్లి, సంప్రాప్తమనోరథుం డయిన యప్పార్థుం గౌఁగిలించుకొని, ‘యక్షయబాణతూణీరబాణాసనసనాథం బయి పవనజవనహయంబులం బూన్చిన యక్కాంచనరథం బెక్కి సుభద్రం దోడ్కొని యింద్రప్రస్థపురంబున కరుగు’ మని పంచి, యనంతరం బంతర్ద్వీపంబున కరిగిన.

1.8.198

క. హరి పంచిన మార్గంబునఁ | గురువిభుఁడు సుభద్రఁ దోడుకొని చనునెడఁ ద
త్పురపరిరక్షకు లతిభీ | కరులు పృథుశ్రవసుఁ డాదిగాఁ గల వీరుల్‌.

1.8.199

ఉ. ‘వీరుఁడు వీఁడు పాండవుఁడు వృష్ణికులోత్తము లైన సీరిదై
త్యారు లెఱుంగకుండఁగ మహారథుఁ డై తరుణిన్‌ సుభద్ర నం
భోరుహనేత్రఁ దోడ్కొనుచుఁ బోయెడి; నీతనిఁ బోవనిచ్చినన్‌
ధీరుఁడు మాధవుండు బలదేవుఁడు నల్గుదు’ రంచు నడ్డ మై.

1.8.200

క. వీఁకఁ బఱతెంచి నలుగడఁ | దాఁకినఁ గడు నలిగి ఘోరతరశరహతి న
మ్మూఁకలు విరియఁగ నర్జునుఁ | డాఁకరమున నేసె నుగ్రుఁ డయి రణభూమిన్‌.

First 200 of 326 passages. Read on