Andhra Mahabharatamu 4.2.235
Āndhra Mahābhāratamu 4.2.235
- Language
- Telugu
4.2.235
వ. దుర్యోధన దుశ్శాసన కర్ణ శకుని సైంధవ ప్రముఖంబగు దుష్ట లోకంబు నధోలోకంబున కనుచునంతకు మదీయాంతరంగంబు చింతాభర భుగ్నంబును, నవమాన పంకమగ్నంబును, గోపోద్విగ్నంబును నై వేగిరపడుచున్నయది; ధార్తరాష్ట్రులకుం గాలావసానం బైనయట్లు మనకు సమయ కాలావసానం బయ్యె; నజ్ఞాత వాసంబునకుం జొచ్చి పదునొండు నెలలు సని పండ్రెండవనెల వర్తిల్లుచున్నది. దీని కొఱంత దీఱిన నీదు వంతయుం దీఱు; నూఱడిల్లి యుండుము; సింహబలుండు నిన్నుఁ బరిభవించి మై మైతోన యునికింజేసి యెల్లియుం జెనక వచ్చు; నీవునుం గ్రమంబున నొడంబడుట భావించికొని వానికి నర్తనశాల సంకేత ప్రదేశంబుగాఁ జెప్పి యొంటిమెయిం జనుదేర నియమింపుము; వాఁడు వచ్చిన నా సొబగునిం దెగఁజూచి, నీకుం జూపి నీ చిత్తంబు వడసెద; నిత్తెఱంగు దప్ప నొండు విధంబు గర్జంబుగా; దిదియె నిశ్చయం; బిట్ల చేయు వార; మిమ్మాటలవలనం దప్పవు గాని, వేగుచున్నయది; జనులు మేలుకాంచి మనలం గాంచి రేని వంచన బయలు పడినం గార్యంబు దప్పుఁ; గీచక వధంబునకుం బూనిన నా మనోరథంబు దుది ముట్టవలయు; నిజశయన స్థానంబునకుం బొ’ మ్మని శయ్యాతలంబు విడిచి యత్తన్విం దఱిమి కొన్ని యడుగు లనిచి, మరలి మారుతాత్మజుండు కలుషితాత్ముండగుచు సెజ్జకు వచ్చె; నచ్చెలువయుం దన నిద్రించు నెడకుం బోయి పర్యంక భాగంబునం దనువు వైచి, యంకిలి దేఱని దెందంబునఁ గొందలంబుతోడి నిశ్చయంబున నిద్రంబొరయని కనుదోయి మొగిడ్చి యుండె; నంత.