Andhra Mahabharatamu 4.2.240
Āndhra Mahābhāratamu 4.2.240
- Language
- Telugu
4.2.240
వ. తదనంతరంబ యల్ల నల్లన తెఱపి యిచ్చి యవులవులం జను నంధకారంబు దూరంబుల యందును లేకునికి వలనం గడళ్ళప్పళించి నెరసి విరసినం బొలుచు కలుకట్టలుంబోని దిక్తటంబులును, దమపాసిన కందువలు రోసి యెత్తిన మెడలను బచరించిన చూడ్కులు వేడ్కలం గ్రందైన డెందంబులుం దమము పాసినం గలిగి మెలంగుచు నొండొంటి బిట్టుగాంచి యొదవు సమ్మదంబునం బొదలు మేనులు బెరయించి పరమానందం బునం జొక్కుచు జక్కవకవలు గలసి పొలసి నలిరేఁగి చెలఁగుచు రేయింటి యాఁకటి పెల్లునం గొదగొని కమిచి చంచువులం దిగిచి త్రుంచి యానుచు నిక్కడక్కడఁ బఱచినం జిక్కువడి యున్న మృణాల శకలంబుల వలన బాల చంద్ర శతాభిరామంబులగు శంభు జలమూర్తి విశేషంబులంబోని సరోవరంబులును, జీఁకటి వాసినం బ్రభాతం బను వింత మానిసి మెలంగి ముసుంగు వుచ్చినట్లు మేలుకని యెఱకలు పొదల విదిర్చి కూర్చికొని కలగొనం బలుకు పులుఁగుల యెలుంగుల వలన నొండొంటిం దెలుపుకరణి నొప్పు ధరణీరుహంబులును, బరఁగు నరుణోదయ రాగపటలంబు నెనయు కెంజాయ రంజిల్ల వికసిల్లు రక్తారవిందంబుల దందడి నెగసి చరించు చంచరీకంబుల యెఱకల నెఱుల గిఱికొని క్రొత్తయగు కాంతి ప్రవాహంబులం గడలుకొల్పు పుప్పొళ్ళు డుల్చి రాల్చుచుం బొలయు మలయానిలంబునం గ్రాలు మవ్వంపుఁదీవలఁ గడివోయి తొరఁగిన విరుల వలన మీనకేతన పురాతన బాణశాలలం బోని లతా మండపంబులును, మొగిడియు జనంబు సంధ్యాంజలిపుటకరణంబుల ననుకరించు విధంబునం దర్శనీయంబులగు కుముద వనంబులును, నేమేని నెపంబున నొండొరుల మేలుకొలుపు రమణ రమణీ జనంబుల నర్మాలాపంబులం బెరయు దరహాసంబుల కాంతిఁ దెలుపెక్కునట్లు వెలరారు దీపంబులును, మునుకడ వచ్చి యెఱుక సేయమికి వాతాయన పవనుని పయిం బుట్టిన యలుక విధంబున వేగుఁబోకట నంకురించు మదంబునఁ గెంపు గదురుట నిద్రలేమినని శంకింపక యింపునం గదియు విదగ్ధ విటజనంబుల మనంబులం దిగుచు లలనాలోచనంబులును, రేపకడ వనలక్ష్మి పురశ్రీ నలంకరించు వడువున నెడపడక యెల్లెడల నిగుడు విభాత కుసుమ కదంబ పరిమళంబును నై యున్నంత.