Andhra Mahabharatamu 4.5.367
Āndhra Mahābhāratamu 4.5.367
- Language
- Telugu
4.5.367
వ. అని నిశ్చయించి పలికిన విరాటుండును ‘గౌరవాన్వయ సంబంధంబున మాత్స్యవంశంబు పావనం బయ్యె’ నని పలుకుచు ధర్మజ భీమార్జున నకుల సహదేవులకుఁ గ్రమంబున నుత్తరఁ బ్రణామంబు చేయించిన, వారు దీవించి యంతఃపుర గమనంబునకు ననుజ్ఞసేయ, నచ్చెలువ నెచ్చెలులుం దానును దత్సమయసముచితపరివార పరివృతయై యరిగిన యనంతరంబ, మౌహూర్తికుల రావించి లగ్న నిరూపణంబు సేసి యాదవ పాంచాలాది బంధుజనంబుల నెల్లఁ బెండ్లికిం బిలువ రెండు దెఱంగుల వారును గాలరులం బనిచి; రజాతశత్రుండును విరటు గారవించి తా రతనిపాల నజ్ఞాతవాసంబు సుఖవృత్తి నడపికొనుట వాక్రుచ్చి పలికి, యతని గుణంబులు గొనియాడి ‘నీవు మాకు వాసుదేవునట్ల కాక సామాన్య బంధుండవే?’ యని సంభావించి, వినయ నిభృతుం డగు నతనిం దిగిచి పునఃపున రాలింగనంబు సేసిన, నతండును ససంభ్రమ పరిజన సముపనీయ మానంబు లగు నానా విధోపకరణంబులం గౌంతేయుల వివిధోపచారంబు లాచరించి, మహార్హ మజ్జన భోజనంబులు నడపె; నంత, నక్కడ దుర్యోధనుండు నిజపురంబునకుం జనిచని నడుమ విడిసిన యెడం గర్ణశకుని దుశ్శాసనుల దుర్మంత్రంబుఁ బట్టి గాంగేయుని వచనంబు లప్రమాణంబులు సేసి, ధర్మతనయుం డసత్యంబున కియ్యకొనమి యెఱింగి యాతనిపాలికి దూతం బుత్తెంచిన, వాఁడు నేతెంచి కాంచి యిట్లనియె.