Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 4.5: విరాటపర్వము — పంచమాశ్వాసము

Āndhra Mahābhāratamu 4.5

Language
Telugu

విరాటపర్వము — పంచమాశ్వాసము

4.5.1

క. శ్రీ సంపాదన చాతు | ర్యా! సేవ్య పదారవింద! యౌగిక విద్యో
ద్భాసిత మూర్తి మయాత్మ! | వ్యాస సమాసైక రూప! హరిహరనాథా!

4.5.2

వ. దేవా! వైశంపాయనుండు జనమేజయున కిట్లనియె: నివ్విధంబున విరోధివర్గం బుక్కు దక్కి వెక్కసపడి చూచుచుండ నిరర్గళ భుజార్గళ సంరంభ విజృంభణంబు శోభిల్లఁ బసులం బెట్టించి యనతిదూరవర్తియగు కౌరవచక్రవర్తిదెసం గనుంగొని ధనంజయుండు భూమింజయు నక్కడఁ దేరు వఱుపం బనుప నప్పళించు నప్పుడు కురువీరులు గూడుకొని మూఁడువేల రథంబులతోడను గాంగేయకర్ణు లొక్కొక్కరుండు వేయింటి తోడను దలకడచి రాజున కడ్డుపడి కవ్వడిదిక్కు మొగంబుగాఁ దిరిగి; రట్టియెడఁ గదుపులు పట్టువడుటకు నిట్టూర్పు నిగిడించుచు మగిడి మనుజపతియు ననుజసహితుండై సహస్రస్యందనములతోడ వెన్ను దన్ని నిలిచె; నంతఁ దక్కటి బలంబులు నెయిదికొని యమ్మెయిన దళంబుగాఁ గవిసిన.

4.5.3

క. కనుఁగొని యెలన వ్వొలయు వ | దనమున గరువంపుఁ జెన్ను దలకొనఁగా న
ర్జునుఁడు విరాటసుతున కి | ట్లనుఁ గేవల వీరరసమయాత్మకుఁ డగుచున్‌.

4.5.4

సీ. ‘కాంచనమయ వేదికా కనత్కేతనో | జ్జ్వల విభ్రమమువాఁడు కలశజుండు;
సింహ లాంగూల భూషిత నభోభాగ కే | తు ప్రేంఖణమువాఁడు ద్రోణసుతుఁడు;
కనక గోవృష సాంద్రకాంతి పరిస్ఫుట | ధ్వజ సముల్లాసంబువాఁడు కృపుఁడు;
లలితకంబుప్రభాకలిత పతాకా వి | హారంబువాఁడు రాధాత్మజుండు;
తే. మణిమయోరగ రుచిజాల మహితమైన | పడగవాఁడు కురుక్షితిపతి; మహోగ్ర
శిఖరఘన తాళతరువగు సిడమువాఁడు | సురనదీసూనుఁ; డేర్పడఁ జూచికొనుము.

4.5.5

క. గురునకుఁ బ్రదక్షిణంబుగ | నరదముఁ బోనిత్త; మిమ్మహాపురుషు నెడం
బరిభవము వలవ; దీతఁడు | కురుకుల నృపతనయ శిక్షకుఁడు సు మ్మనఘా!

4.5.6

క. శస్త్ర ప్రకార నిపుణుం, | డస్త్ర విదుఁడు, దూరపాతనాభీలుఁడు, వ
ర్చస్త్రాసిత రిపుఁడు, ధను | శ్శాస్త్రపరిజ్ఞానఘనుఁ డసదృశుఁడు శక్తిన్‌.

4.5.7

ఉ. ఈతనితోడి కయ్యమున కియ్యకొనం దగ; దేను దుష్పథ
ద్యూత జయోద్ధతుండగు సుయోధనునిం బరిమార్పఁ బోవుచో
శాతశరోత్కరం బితఁడు చక్కఁగ నేయునొ? నన్ను నేయఁడో?
చూతము; తాన ము న్ననికిఁ జొచ్చినఁ జొత్తముగాక పిమ్మటన్‌.

4.5.8

క. గురుపుత్త్రుఁడు తేజోనిధి; | సురాసురులకైనఁ దేఱి చూడ నరిది సం
గరమున నీతని; నీశ్వర | వరజనితుఁడు; మేటి కౌరవవ్యూహమునన్‌.

4.5.9

క. ధైర్యధనుఁ డితఁడు ద్రోణా | చార్యుల కెనవచ్చు దివ్యశరవిదుఁడు కృపా
చార్యుఁడు; మత్పితృసఖుఁ డా | చార్యక మొనరించె మాకు శైశవముతఱిన్‌.

4.5.10

తే. వీర లిరువురు మాన్యులు; వీరి తోడి | కయ్యమున కిప్డు మన మంత గాలుద్రవ్వ
వలవ; దెచ్చోట నెదురుగా మెలఁగి రచట | మన రథం బల్లనల్లన చనఁగ నిమ్ము.

4.5.11

శా. యోధాగ్రేసరుఁ డిద్ధతేజుఁడు, రణోద్యోగానురక్తుండు, దు
స్సాధ ప్రక్రమ బాహు వీర్యుఁడు, కురుక్ష్మాపాల వాల్లభ్య ల
క్ష్మీ ధామాత్ముఁడు, జామదగ్న్య కలిత శ్రేష్ఠాస్త్ర విద్యాఢ్యుఁ డీ
రాధేయుం డొక చీరికిం గొనఁడు వీరవ్రాతముం బోరులన్‌.

4.5.12

క. శౌర్యాటోపంబున దో | ర్వీర్యంబున, నస్త్ర శస్త్ర విత్త్వమునను మా
త్సర్యంబు సేయు నాకును | దుర్యోధనుఁ డెపుడుఁ ద న్నెదురు సేయంగన్‌.

4.5.13

చ. అతిదృఢవేధి పేరుగలయట్టి మగండు రణంబు గల్గె నేఁ
డితనికి నాకుఁ దెల్లముగ నిట్టియెడం బరికించి చూడుమీ!
మతి గలఁగంగనీక యనుమానము వాయఁగ నీవు సాయకో
ద్ధతిఁ బ్రకటించుచో బహువిధంబుల నిద్దఱ తారతమ్యముల్‌.

4.5.14

క. ఈయన ననుఁ గని సైరణ | సేయం డితఁ డగ్గమైనఁ జిచ్చఱపిడుగై
పోయి పయిఁబడుదు; నీ వర | వా యించుక లేక పఱపవలయు రథంబున్‌.

4.5.15

ఉ. ఉగ్రుఁ, డనూన మాన మహిమోన్నత చిత్తుఁ, డజయ్య విక్రమో
దగ్రుఁడు, హస్తలాఘవ సమన్వితుఁ డేయునెడన్‌, సమగ్ర కో
పాగ్రహబుద్ధి మా దెస, ననార్యుఁడు గార్యమునందు ధార్తరా
ష్ట్రాగ్రజుఁ డీతనిం గదిసినప్పుడు పండువు నాకు నుత్తరా!

4.5.16

తే. అరసికొని యెన్నిభంగులనైన నితని, | తేరు మనబారి కగపడు తెఱఁగు గాంచి
యడరి బాసటయై యెవ్వ రడ్డపడిన | మెఱపు మెఱసిన చాడ్పునఁ దఱియఁ జొరుము.

4.5.17

క. అస్మత్పితామహుం డతి | విస్మయ జనన ప్రతాప విభవాగ్ని శిఖా
భస్మీభూత ప్రతిప | క్షస్మయ కాననుఁడు, ప్రథమగణ్యుఁడు బుద్ధిన్‌.

4.5.18

క. బహు మహితాయుధ విద్యా | రహస్య సంవేది, ధార్తరాష్ట్రులకును మా
కు హితంబ కోరు సముఁడై, | సహాయ మగు వారలకు నచటఁ దా నునికిన్‌.

4.5.19

క. వివిధము లగు లక్ష్యంబుల | నవలీలం దునియ నాట నవియఁగ నేయున్‌;
భువనైక ధన్వి నత్యు | గ్ర విచేష్టితు నోర్చెఁ బరశురాముం బోరన్‌.

4.5.20

క. శంతనునందను నరదము | పొంతం బోవలవ; దలుక పుట్టి యతఁడు భూ
కాంతునకు సైన్యమునకుం | జెంతలఁ జేరంగనీక సిలుగులఁ బెట్టున్‌.’

4.5.21

వ. అని యిట్లు వేఱు వేఱం జూపి, క్రమంబున నేర్పడం జెప్పి సవ్యసాచి సమరోన్ముఖుం డగు సమయంబున సస్మితుం డగుచు నశ్వత్థామ రవితనయు నవలోకించి యిట్లనియె.

4.5.22

క. ‘నిను నీవ పొగడికొని పలి | కిన పలుకులు పెక్కు గలవు; క్రీడి యనికి వ
చ్చినవాఁ డిదె పులివలె; మా | ర్కొన రాదే కర్ణ! సేనకుం బ్రియ మెసఁగన్‌.

4.5.23

క. తలఁకు గలదేని శకునిం, | బిలిచి విచారింపఁ బొమ్ము; పృథివీపతి నీ
తలన తన కార్యఖడ్గం | బుల మోపెక్కించె; రిత్తవోవునె నీకున్‌?

4.5.24

వ. అనిన విని యతండు క్రోధ ఘూర్ణమాన తారకుం డగుచు నిట్లనియె.

4.5.25

చ. ‘తలఁకెడు వానికిన్‌ మగఁడ తానటె నన్నడఁకించు వాఁ? డిసీ
పలుకకు; భీతున ట్లొదుఁగఁ బాఱునె శూరుఁడు? నిన్ను నచ్చి యే
కలనికి వచ్చితిన్‌; నరుఁడ కాఁ డట వాసవుఁడైన నేమి నా
బలముఁ జలంబు నేరిమియు బంటుతనంబును నీవ చూడుమీ!’

4.5.26

క. అని కడఁగు నినసుతునకు | న్మును ద్రోణుఁడు ద్రోణనందనుఁడుఁ గృపుఁడును శాం
తనవుఁడుఁ గడఁగుట దుర్యో | ధనుఁ డవలోకించి యత్యుదగ్రతఁ గడఁగెన్‌.

4.5.27

వ. ఇవ్విధంబున నయ్యేవురు దొరలును ధరణీశుండును సరభసంబుగా బరవసంబు సేసిన దుశ్శాసన దుష్ప్రహ దుర్ముఖ ప్రముఖ నిఖిల కురుకుమార నికాయంబును శకుని సైంధవ ప్రభృతి బంధు నివహంబును బాహ్లిక సోమదత్తాది సామంత నికురుంబంబును మఱియునుంగల వివిధ యోధ వీర నిచయంబును నొక్కటఁ గరటిఘటా ఘోటకధట్ట రథయూధ పదాతి వితతి సంరంభ శుంభత్సేనా సమూహ సహితంబుగాఁ ద్రోచి నడచిన.

4.5.28

చ. ధరణి వడంకె, ధూళి దివిఁ దన్నిన భానుని గానరాద, బం
ధుర వివిధప్రకార పటు తూర్యరవంబులఁ బొంగె దిక్కు లా
స్ఫురిత మహాయుధోగ్ర రుచిపుంజ విజృంభణ ఘోర మయ్యె నం
తరము సహస్రనేత్ర ముఖదైవత మండల దుర్నిరీక్షమై.

4.5.29

వ. అట్టియెడ నుద్భటహాసోల్లాస భాసురముఖుం డగుచు శతమఖ తనయుండు.

4.5.30

చ. గుణమున లస్తకంబునను గోటియుగంబునఁ గేలఁ దార భీ
షణముగ నుప్పతిల్లి రభసంబున రేఁగిన మాడ్కిఁ దీవ్ర మా
ర్గణనికరంబు లొక్కట నరాతి బలంబులఁ గప్ప, గాండివ
క్వణనము రోదసీకుహర కర్పరముం బగిలింప, నుగ్రతన్‌.

4.5.31

క. తలపడి తలమీఱిన కా | ల్బలములఁ బొడిసేయు; మఱియుఁ బైపైఁ బీనుం
గులఁ ద్రొక్కికొనుచు వెస ముం | గలిమొనఁ గవియుటకు వేడ్క గడలుకొనంగన్‌.

4.5.32

క. తన దృష్టియు ముష్టియుఁ దగు, | ననువున మున్నెత్తి యేయు; నతఁ డప్పుడు డిం
చినఁ గాయముల సపాటం | బునఁ బదియుఁ బదేను నుచ్చి పోయెం గోలల్‌.

4.5.33

చ. ఉడుగక వెండియున్‌ సుభటు లొక్క మొగిన్‌ వెస నంటఁ దాఁకి క
వ్వడి పటుబాణ భాస్వదనివార్య సముద్ధతిఁ జేసి మంటలో
మిడుతలు సొచ్చిన ట్లయిన మేటిమగల్‌ గని యీడఁబోక బ
ల్విడి మఱియున్‌ వడిం బొదువ వ్రేల్మిడిఁ ద్రుంచె నతండు దోడుతోన్‌.

4.5.34

తే. అంతకంతకుఁ గదిసి సైన్యములు సుట్టు | ముట్టి శ స్త్రాస్త్ర సంచయమున నభంబు
దీటు కొనునట్లు సేయఁ గిరీటి గాండి | వంబు పరిచాలనంబు దీవ్రంబు గాఁగ.

4.5.35

సీ. గోరఁ బోఁజిన మాడ్కిఁ గొన్నింటిఁ జక్కసాఁ | బాలుగా వ్రయ్యలు వాపి పాపి,
బాడిస నఱకిన భంగిఁ గొన్నింటిఁ దు | త్తునియలుగా బిట్టు త్రుంచి త్రుంచి,
వెస ఱంపమున నిడ్డవసిగఁ గొన్నిటి నిసు | మంతలుగా నుఱుమాడి యాడి,
పనివడి ఱోలఁ గొట్టినలీలఁ గొన్నింటిఁ | జిఱునుగ్గుగాఁ బొడి సేసి చేసి,
తే. యడరి పొదివిన బలము నానాయుధములఁ | బ్రతిహతంబులఁ గావించె నతిరయమున
నక్షత ధ్వజ సూత హయత్వ లస ద |ఫల్గురథవల్గనుం డగు ఫల్గునుండు.

4.5.36

క. ఆ మెయిన వివిధ వర్మ | స్తోమం బఱువుళ్ళు సేసి సునిశిత బాణో
ద్దామ ప్రసార విభవ | శ్రీ మార్తుర కద్భుతంబు సేసెం గడిమిన్‌.

4.5.37

క. గర్జద్గుణుఁడై పగతుర | జర్జరితాంగులుగఁ జేసె సాయకజాల
స్ఫూర్జన చూపఱు వొగడఁగ | నిర్జరవరనందనుండు నిమిషార్ధమునన్‌.

4.5.38

శా. శక్తిస్ఫార ధనంజయాయత భుజా సంరంభ గాండీవ ని
ర్ముక్త క్రూర శరావలీ దళిత శత్రువ్రాతముల్‌ శోణితా
సిక్తాకారతఁ బొంది సాంద్రకుసుమశ్రేణీ వికాసోల్లస
ద్రక్తాశోక తరువ్రజంబుల క్రియన్‌ రంజిల్లి యొప్పెం గడున్‌.

4.5.39

చ. తదవసరంబునన్‌ దొర లుదగ్రతఁ ద్రోచిన వజ్రధట్టముల్‌
మదమున నొక్కపెట్ట బలమర్దనుసూను రథంబు గ్రక్కునం
బొదివెఁ దురంగ కింకిణుల భూరిరవంబుఁ గరీంద్ర ఘంటికా
భ్యుదిత నినాదమున్‌ రథవరోత్థిత ఘోషము నుత్కటంబుగన్‌.

4.5.40

తే. అట్టియెడ వేల్పు వచ్చినయట్ల మేను | వొంగ నలి రేఁగి పాండవ పుంగవుండు
మత్స్యనృపనందనుని బలుమాట తోడి | యేపు సెవికిని జూడ్కికి నింపు నొసఁగ.

4.5.41

క. మేదుర దీర్ఘతరం బగు | నాదం బెడతెగక గుణమునను వడి నిగుడం
గోదండము సంతతవల | యోదాత్తస్ఫురణ వెలుఁగుచుండఁగ నేసెన్‌.

4.5.42

మ. ఒక మాత్రన్‌ వితతప్రసార నిబిడాత్యుగ్రాస్త్ర సంతానముల్‌
సకలానీకములందుఁ బర్వ నరు భాస్వన్మూర్తి శోభిల్లె దీ
ప్తికలాపంబులు లోక మంతటను విస్తీర్ణంబులై యౌగప
ద్యకృత వ్యాప్తి వెలుంగ నొప్పెసఁగు మార్తాండున్‌ విడంబించుచున్‌.

4.5.43

క. నరు లొరులు దృశ్యములపైఁ | బరఁగింపఁగఁ జూడ్కు లెట్లు వడుఁ దప్పక య
ప్పరుసున నరుఁ డేయు నిశిత | శరములు లక్ష్యములు దప్పి చన వించుకయున్‌.

4.5.44

క. గజ ఘోటక రథ సూత | ధ్వజకంకట యోధగాత్ర తతియం దెచటన్‌
విజయ ధనుర్ముక్త శర | వ్రజములు దవులంగఁ, బడ కవారణ నిగుడున్‌.

4.5.45

చ. కవదొన లేల పూనునొకొ కవ్వడి నా వల; దుగ్రసంగరో
త్సవమున సవ్యపాణి నపసవ్యకరంబున మార్చి, మార్చి గాం
డివము ధరింపఁగా శర పటిష్ఠతయుం బొరిఁ జేయి మార్చి చూ
పు వెరవుతోన వీడ్వడక పొం దొడఁగూడెడు నెప్డు సూచినన్‌.

4.5.46

క. సమ విషమ వినిమ్నోన్నత | సమీప దూర స్థలములు సదృశములుగఁ జి
త్తము క్రియ నవిహత గతులను | సమరమహిం గ్రీడిరథము సను నవితథమై.

4.5.47

వ. వెండియు నతండు.

4.5.48

మ. బలమెల్లన్‌ వెఱ రెండుపాయలుగ శుంభద్వేగుఁడై చొచ్చి యా
వలగా నడ్డము వచ్చి నాలువుగ దుర్వారోద్ధతిం బోయి మూ
లల నానాశకలాకృతిం బొరయ లీలాయానదుర్దాంతుఁడై
వలయంబుల్‌ సని చించి చిక్కువఱుచున్‌ వైకల్య సంపాది యై.

4.5.49

వ. ఇవ్విధంబున నంబుధిలోన మహామత్స్యంబు విహరించు చందంబునఁ దదీయ రథంబు కౌరవసైన్యంబునందు సంచరించు నయ్యవసరంబున.

4.5.50

ఆ. రత్నకేతనములు రాజిత శేఖరం | బులును రుచిరఘంటికలును బార్థు
బాణ నిహతిఁ దునిసి పడుఁ గౌరవులచేటు | దెలుప డుల్లు నుల్కములను బోలె.

4.5.51

క. నరు భల్లంబుల నగ్రిమ | చరణంబులుఁ ద్రెస్సి మ్రొగ్గు జవనాశ్వంబుల్‌
కరుణమెయి రాహుతులకున్‌ | శరణం బగు మనుచు మ్రొక్కు చందం బొందెన్‌.

4.5.52

క. దంతి ఘటాసంతానము | కుంతీసుతు నారసములఁ గూలినతఱి న
త్యంతనిబిడాభ్రముల దివి | యెంతయు సొంపారు భంగి నిల సెలువొందెన్‌.

4.5.53

క. పలుపులుఁ గాండ్లుం బగ్గం | బులుఁ దన యస్త్రంబు లడరి పొడిచేసిన వి
చ్చలవిడిఁ బాఱెడు రథ్యం | బుల నేయఁడు దివిజరాజపుత్రుఁడు కృపతోన్‌.

4.5.54

ఆ. అర్జు నాస్త్ర ఖండితాతపత్ర ధ్వజ | చామరములు గాలిఁ జదలఁ దూలఁ
జిహ్నముల విభూతిఁ జెందంగఁ గడు నొప్పె | నప్పు డాడుచున్న యట్టు లచట.

4.5.55

క. ఒకమఱి కిరీటి కట్టెది | రికి నఱిముఱిఁ బోయి రేని రెండవమా ఱి
య్యకొనుట కోర్వఁగ లేరై | రొకళ్ళుఁ గురురాజ సేన యోధులలోనన్‌.

4.5.56

సీ. మండితధ్వజదండమండలంబులఁ గిట్టి | విటతాటనంబుగా విఱిచి విఱిచి,
చటులఖురోద్భటాశ్వ శ్రేణిఁ బొదివి ర | యంబునఁ దునిమి తూఁటాడి యాడి,
రాజిత బహువిధ రథ సమూహముఁ జొచ్చి | గలిబిలి యగునట్లు గలఁచి కలఁచి,
మదభర భీషణ మాతంగముల ముట్టి | చిందఱ వందఱ చేసి చేసి,
ఆ. పటు పదాతి చయముపై రౌద్రరస మహో | గ్రముగ నడరి నేలఁ జమరి చమరి
సవ్యసాచి బాణ సంఘంబు మత్తశుం | డాల ఘోరలీలఁ గేలి సలిపె.

4.5.57

ఉ. శిక్షిత చిత్రసంగర విశేషములం బ్రతిహేతి ఖండనా
దక్షత పెంపుసొంపునను దైవబలంబున నత్తఱిన్‌ సహ
స్రాక్షతనూజు సారథి రథాశ్వచయ ధ్వజముల్‌ పరాస్త్ర శ
స్త్రక్షతి లేక యొప్పెఁ గురుసైన్యము వెక్కస మంది బెగ్గిలన్‌.

4.5.58

క. తేజోధనుఁ డగు నరుఁడు | ద్భ్రా జితగతి నడుమ మెఱసి బడబాగ్ని దళం
బై జలనిధిఁ ద్రెక్కొనియెడు | నోజం గురుబలము పేర్మి యుడిపెం దోడ్తోన్‌.

4.5.59

తే. కాలపక్వంబులైన లోకముల జముఁడు | బారిసమరెడు చాడ్పున మారిమసఁగి
యుగ్రరూపుఁడై శౌర్యసమగ్ర బాహు | సంపదుద్దాముఁడగు క్రీడి చంపె రిపుల.

4.5.60

వ. అట్టియెడ మున్ను తురంగమఖురాదులం దూలిన కెంధూళియుం, బైపయి నెగయఁ బరబలంబు నెత్తుట జొత్తిల్లుచు నుచ్చి చను వివ్వచ్చు నిశితశర పరంపరలు సైనిక శరీరంబులపై సుడిసి తడిసి రుధిర శీకర నికర వికీర్ణ రవికిరణ పరిణతం బగు సమీరణంబును, ధారాళ కరాళ రక్తపరిషిక్త విశ్వంభరా భాగంబునుం గలయం గెంపు సంపాదించి యకాలసంధ్య నావహించినం దదుచిత వ్యాపార పారంగతంబులై పొడసూపిన యుడుగణంబులుంబోలెఁ బొలుచు ధనంజయసాయక దళిత కుంజర కుంభ వికీర్ణ మౌక్తిక విసరంబుల వలనను, సముదీర్ణ మద వేగ దుర్నివార వారణ విదారణంబు లగు నర్జునాస్త్ర పాతంబుల బెదరి తేం ట్లెగయుట పొగలెగయుటయుం, బ్రతిభట బాణఘట్టనంబునం బాండవమధ్యము కాండ ప్రకాండంబుల నిబిడ జ్వాలలు నిగుడుట మంటయునుగా, మూర్తం బగు తదీయ క్రోధ దవానలంబు చటచ్ఛటాశబ్దంబుల చాడ్పునం జెలంగుచున్న యుధిష్ఠిరానుజు నతినిష్ఠుర భల్లభజ్యమాన బలవదరాతి ఖరాస్థి నిస్వనంబుల వలనను, దొట్టి తొట్టి యెడనెడ మడువులు గట్టు శోణితంబు నీళ్ళునందుఁబడి తేలాడు వెలిగొడుగులు పుండరీకంబులును, వింజామరలు మరాళ పుంజంబునునై కొలంకుల చందంబు నొంద వాని కెఱఁగెడు కొదమతుమ్మెదల పదుపుల పగిదిఁ దొరఁగు నాఖండలతనయ ఖండిత పరవీరకాలాయస నారాచ శకలంబులవలనను, గిరీటి శర పాటవ పరిస్ఫోటిత రిపు కపాల గళిత మస్తిష్క పలల పంకంబునను, నలుదెసల నంతంతఁ గదియం జాఁగి పడియున్న కృత్తకరచరణంబులను, వెదపదనికి రొంపిఁ గలంచి వరుజులు పదిలంబుగా నమర్చిన కేదారంబు తెఱంగు దోఁచుటకు నీడై చతురహలికుండు సల్లు పరువంపు మొలకల చెలువునఁ బెల్లు డుల్లు ఫల్గునాశుగ సంతాడన వికీర్ణ శత్రుశేఖర వజ్రవ్రజంబుల వలనను, సంగ్రామం బభిరామం బయ్యును ఘోరప్రకారం బయ్యె; నమ్మహాభయంకర సంకుల సమరంబున.

4.5.61

చ. ఉఱక విరోధిసైన్యముల నుక్కుమడంగఁగ నుల్లసద్గతిం
బఱప రథద్విపాశ్వములు పాండవమధ్యము తేరి వీథియం
దఱవఱలై పడం గని భయంపడి యిద్దెస వచ్చెనేని న
త్తెఱఁ గయి పోమె యంచు నెడతెంపిగఁ గొందఱు పాయ వాఱఁగన్‌.

4.5.62

క. వాలమ్ములు దాఁక ధరన్‌ | వ్రాలు భటులఁ జూచి యెదలు వడఁకఁగ మేనుల్‌
దూలఁగఁ దముఁ దాఁకకయును | నాలము సాలించి కొంద ఱవలఁ జనంగన్‌.

4.5.63

తే. ‘ప్రొద్దు గ్రుంకిన మఱి కాని పోవఁ డొక్కొ | క్రీడి’ యని కొంద ఱాజికి నీడఁబోవ
‘బలమునెల్లను దెగటాఱఁ బఱపికాని | తక్కఁ డెట్టులు’ ననుచుఁ గొందఱు చలింప.

4.5.64

క. తరతరమ ప్రజలఁ దునిమెడు | నరు నప్పటి యెత్తికోలునకు సురవిద్యా
ధర ఖేచరులును భీతిం | బొరసిరి తమదెసకు నేమి పుట్టునొ యనుచున్‌.

4.5.65

క. తమ తమ యొద్ది బలంబులు | క్రమ విరళములైన దొరలు గాండివిపై ను
గ్రముగఁ దఱుముటయు నాతఁడు | సమరోల్లాసమున దివ్యశరతత్పరుఁడై.

4.5.66

సీ. ఆచార్యు డెబ్బది యమ్ముల, నాచార్య | పుత్త్రు నేడింటఁ, గృపునిఁ బదింట,
దుష్ప్రహుఁ బండ్రెంట, దుశ్శాసనునిఁ బది | యేనింట, సౌబలు నెనిమిదింట,
నమరనదీసూను నఱువదింటను నేసి, | రవిసుతు రథ్యసారథుల నొంచి,
వర్మమంతయుఁ ద్రుంచివైచి మర్మాస్థి బం | ధములు భేదించి విక్రమము నెఱపి.
ఆ. యిట్లు దొరలు నొవ్వ నేడ్తెఱఁ దనచేతి | కొలఁది సూపి క్రీడి సెలఁగి దేవ
దత్త మొత్తుటయును దత్పైన్యములు సెడ | విఱిగి పాఱి భీష్ముమఱువు సొచ్చె.

4.5.67

క. గాంగేయుఁ డవష్టంభో | త్తుంగతనుం డగుచు నిట్లు దూలిన కురు సే
నాంగంబులఁ బురికొలిపి సు | సంగతములు సేసె సమరసమ్ముఖములు గాన్‌.

4.5.68

వ. ఇట్లు భగ్నబల సమాశ్వాసనోద్భాసి యగు భీష్ము భుజబలంబు ప్రాపున నేచి మాతంగ తురంగ స్యందన సందోహంబులతోఁ గుంభసంభవ కృపాశ్వత్థామ కర్ణ వికర్ణ ప్రముఖ నిఖిల యోధజనంబులు సుయోధను ముందటఁ బన్ని నిలిచినం జూచి, సవ్యసాచి ప్రత్యేక ప్రథన కుతూహలాయత్త చిత్తుం డగుచు నుత్తరున కిట్లనియె.

4.5.69

ఉ. ‘కందము లప్పళించి తురగంబుల నించుక నిల్పు; వైరి సే
నం దెలియంగఁ జూడుము ఘనప్రకరంబును బోలెఁ గాఱు కొం
చుం దఱచైన దంతి భట సుందరకేతన రాజి గ్రాలఁగా
ముందర గట్టిమై నిలిచి మోహర మున్నవిధంబు గాంచితే?

4.5.70

ఆ. కర్ణు కేతనంబు గ్రాలెడు నల్లదె | యాతఁ డాజికేళి కౌతుకమునఁ
గడఁగి వచ్చుటయును గలిగియున్నది మున్న | తొడరవలయు నతనితోడ మనము.’

4.5.71

వ. అని మఱియును.

4.5.72

చ. ‘రయమునఁ గిట్టి యీతని పరాక్రమలీల యడంచి నొంచి దు
ర్జయుఁ డని నమ్మియున్న కురురాజునకున్‌ వగ పుట్టఁ జేసెదన్‌
హయములఁ బోవని’ మ్మనుఁడు నాతఁడు నాతని లావు నచ్చి ని
ర్భయమునఁ దేరు వే నడపె భాస్కరసూతికి సమ్ముఖమ్ముగన్‌.

4.5.73

వ. ఇవ్విధంబున వృషభంబున కాదికొను బెబ్బులియునుం బోలె రాధేయుదెస నడచు కవ్వడిం గని చిత్రాంగదుండును చిత్రరథుండును సంగ్రామజిత్తును దుష్ప్రహుండును జిత్రసేనుండును వివింశతియును దుర్ముఖుండును దుర్జయుండును వికర్ణుండును శత్రుంతపుండును దుశ్శాసనుండును లోనుగాఁ గల కురుకుమార వర్గంబు నిరర్గళ ప్రకారంబులగు రథ చిత్ర ప్రచారంబులు మెఱయ మొనకుం దలకడచి చటుల పటు బాణ వేణికా పరంపరలు నిగుడ నొక్క పెట్ట కవిసిన నతండును గుణధ్వని తంత్రీనాదంబుగా నావిండ్ల వారొత్తుకాఱుగా గాండీవంబు వీణగా వినోదంబు సలిపె; నట్టియెడ వికర్ణుండు.

4.5.74

క. తల మీఱి నిశిత శరమం | డలిఁ గప్పెం బార్థు నుత్కట క్రోధమునన్‌
విలు విఱుగ నేసి యతనిం | దొలఁగంగాఁ జేసె నరుఁడు దోర్బలలీలన్‌.

4.5.75

క. ఇంతయుఁ గనుఁగొనియును శ | త్రుంతపుఁ డోసరిల కాజిదోహల మలరం
గౌంతేయుతోడఁ దలపడి | వింత లయిన కూర్మ నఖర విశిఖము లేసెన్‌.

4.5.76

వ. అర్జునుండును.

4.5.77

క. సూతుఁ బదింటను నైదిట | నాతని యంగంబు నొంచి యంత నిలువమిన్‌
శాతఘనశరము వే కొని | యాతల వెడలంగ నేసి యసువులఁ బాపెన్‌.

4.5.78

తే. ఇట్లు శత్రుంతపునిఁ ద్రుంచి యివ్విధమున | నొక్కఁ డొక్కఁడ తలపడు టుడుపఁ దలఁచి
వివిధ బాణపరంపర వెల్లిఁ గొలిపె | భయరసము వఱ్ఱు పెట్టునఁ బగఱు వాఱ.

4.5.79

క. ‘అందఱు రథికులు పఱవఁగ | నిం దేటికి మున్ను వచ్చి రిస్సీ’ యని సం
క్రందనసుతు మార్కొనియెఁ ద | గం దెగి సంగ్రామజిత్తు గర్వోద్ధతుఁడై.

4.5.80

క. తలపడి వాలమ్ములు పై | నల వేర్పడ నినుచుటయును నలుక వొడమినం
దలఁ దునిమివైచె నాతని | బలసూదనసూనుఁ డొక్క పటుభల్లమునన్‌.

4.5.81

తే. అపుడు రాధేయుఁ డిమ్మెయి ననుజుపాటుఁ | జూచి యేనుంగునకు సిళ్ళు సూపినట్లు
కవిసి హయముల మత్స్యభూకాంతు తనయు | నేసి, పండ్రెండు శరముల నేసె నరుని.

4.5.82

ఉ. కేసరివిక్రముండు కపికేతనుఁ డత్తఱి వైరివీరసం
త్రాసకర ప్రకార మగు దర్ప మెలర్పఁగ బాణజాల వి
న్యాసమునన్‌ వెసం బొదివె నర్కసుతున్‌ గరుడుండు పాము ను
ద్భాసితపక్షుఁడై పొదువు భంగి సురావలి పిచ్చలింపఁగన్‌.

4.5.83

క. ఇరువురు వీరులు ని ట్లొం | డొరువులఁ దలపడుట సూచి యుత్కట మగు న
చ్చెరువాటుఁ గౌతుకంబు న | డర నూరక యుండె నయ్యెడం గురుసేనల్‌.

4.5.84

మ. ప్రళయాంభోధరముక్త సాంద్ర విసరత్పాషాణ వర్షంబు మి
క్కిలియై శైలముఁ గప్పునట్లు నరు నక్షీణాస్త్ర సంతాన మి
ట్టల మై కప్పినఁ దీవ్రమారుతము గాఢవ్యాప్తి జీమూత మం
డలిఁ బోలెన్‌ విరియించె భానుజుఁ డవష్టంభోజ్జ్వలాకారుఁడై.

4.5.85

క. విల్లును దానును శిఖ రా | జిల్లఁగ వెలుఁగొందు వహ్ని చెలువంబున శో
భిల్లుటఁ గని కురుసైన్యము | లెల్లను దూర్యములు మ్రోయ నేడ్తెఱఁ జెలఁగెన్‌.

4.5.86

క. రవితనయు బాణములు వా | సవనందనుఁ బొదివినపుడు సంతోషముఁ,ద
ద్వివిధాస్త్రము లాతనిపైఁ | గవియ విషాదంబు నొందుఁ గౌరవసేనల్‌.

4.5.87

వ. ఇవ్విధంబున నేట్లాడుచుం గదిసి గాండీవి కర్ణున కిట్లనియె.

4.5.88

ఆ. ‘సభలఁ బలుకు దీవు సరిలేరు నా కని; | యిదె రణంబు వచ్చె; నెల్లవారి
కెఱుఁగవచ్చు దీనఁ; బెఱచోట రజ్జైన | యట్లు పూరగింప నగునె యిచట?

4.5.89

క. మాటలు పె క్కా డితి వీ | పోటుమగలు వినఁగ నింకఁ బోవుట దగ దె
ప్పాట; నదిగాక తమ్ముని | పాటును గన్నారఁ గంటి పాఱకు మింకన్‌.

4.5.90

ఆ. పలుకవచ్చుఁగాక పలికిన యట్టుల | చేయ వచ్చు నెట్లు? దాయ! యెందుఁ
బోయె దట్లు ద్రుపదపుత్రికఁ బఱుపంగఁ | గాంచి నగిన ఫలముఁ గందు గాక!

4.5.91

క. ఏ నపుడు ధర్మపాశా, | ధీనుఁడనై కోపమునకు దీకొనరింపం
గా నేరకున్న మెయిమెయిఁ | బో నయ్యెం గాక యింకఁ బొమ్మా యిచటన్‌.’

4.5.92

వ. అనిన విని రాధేయుం డిట్లనియె.

4.5.93

ఉ. ‘అప్పుడు ధర్మహానికి భయంపడి నిల్చితివో? కడంకతో
నిప్పుడు వచ్చినాఁడ; విట యెల్లను జేయుదు గాక; యన్నపైఁ
దప్పు ఘటించి నీవు నొక తాలిమి గల్గినవాఁడవై నెపం
బొప్పినఁ జెల్లె; నీదు నిలుపోపును జూతము గాక యిచ్చటన్‌.

4.5.94

క. సమయంబు నడపినను రా | జ్యము భాగం బీరె యెట్లు నను నాస నర
ణ్యమున వసించితి గాక ని | జమునకు నీయందు ధైర్యసారము గలదే?

4.5.95

క. మును నీ వచట నచటఁ జే | సిన బంటుతనంబు లెల్లఁ జెప్పఁగ విందుం
గనినఁ గదా నమ్ముదు; నవి | యనుమానము నాకు నీ భయస్థితిఁ గనుటన్‌.’

4.5.96

వ. అనుచు వాలమ్ములు గురిసిన నర్జునుండును గుపితుండై గాండీవవిక్షేప క్షోభిత నభోభాగుండగుచుం గానీను పై నానానిశిత విశిఖంబులు నినిచె; న ట్లయ్యిరువురును దేవాసుర సంగ్రామ సాదృశ్య విక్రమ ప్రక్రియం బొలిచి రట్టి సమయంబున.

4.5.97

క. రవిదీప్తులు సొర నేరమిఁ | గవిసెం జీఁకట్లు, పవనుగమనం బడఁగెన్‌,
వివిధాస్త్రంబుల నంబర | మవిరళముగఁ బొదువఁబడుట నద్భుతభంగిన్‌.

4.5.98

ఉ. అప్పుడు కర్ణుసైన్య మమరాధిపనందనుఁ జుట్టుముట్టఁ దే
రుప్పరవీథిమై వలయ మొప్ప వెసం బఱపించి క్రీడి పెం
గుప్పలుగా రథావలిని ఘోటతతిం గరిరాజిఁ గూల్చుచుం
దప్పక భానుసూను మెయిఁ దాఁకఁగ నేయుచు నుల్లసిల్లినన్‌.

4.5.99

వ. రాధేయుండును.

4.5.100

క. తఱిమి పయి నడరుటయు విలు | విఱుగంగా నేసె నరుఁడు విక్రమలీలం
గొఱఁతవడనీక కర్ణుఁడు | మెఱుఁగు లడరుశక్తి సురలు మెచ్చఁగ వైచెన్‌.

4.5.101

ఆ. వైచుటయును సవ్యసాచియుఁ గౌరవుల్‌ | విస్మయంబుతోడి వెఱపు వొంద
నధికరయము మెఱయ నది పెక్కుదునియలు, | చేసె నంతరమున శితశరముల.

4.5.102

వ. అట్టియెడ నినతనయు మన్నించు జోదులు దెగి పయిం బడినఁ గ్రోధారుణ నయన పల్లవితంబును దంత కాంతిస్తబకితంబును గుంభస్థల ఫలితంబును నగు తదీయ కరటి ఘటావికట విటపి పటలంబును నాత్మీయ విశిఖ వ్యాపార మహావాతంబునన్‌ బడలువడం గూల్చి చండమూర్తి దాల్చి శోభిల్లు బీభత్సుంగని యతండు బొమముడివడ నెక్కొని వేఱొక్క విల్లెత్తికొని.

4.5.103

క. తురగముల నాలుగిట ను | త్తరు నాఱిట నెనిమిదిట రథముఁ బదిటను వా
నరు నఱువది శరముల న | న్నరు నంగంబులను బెలుచ నాఁటఁగ నేసెన్‌.

4.5.104

వ. ఇత్తెఱంగున.

4.5.105

సీ. రోషంబు భీషణరూపమై చెలువొంద | నతులకేతువు శిఖయై వెలుంగ,
శరజాలములు పటుజ్వాలలై నిగుడ న | ర్కతనూభవోగ్రాగ్ని ప్రజ్వరిల్ల,
నుద్ధతి సైఁపక యుజ్జ్వలదివ్యప | తాక మెఱుంగుగా దళిత ధరణి
రథనేమిరవము గర్జనముగ శరపరం | పరలు ధారలుగాఁగఁ బరఁగి యడరె,
ఆ. నర్జునాంబుదం బనన్యసామాన్య స | ముద్యమమున ముఖపయోరుహముల
కాంతి దఱిఁగి యపుడు కౌరవసేనా స | రోవరంబు దీనభావ మొంద.

4.5.106

క. వెండియు నుడుగక రవిసుతుఁ | డొండొండ నిశాతసాయకోత్కరము సము
ద్దండతఁ బై నించిన నా | ఖండల నందనుఁడు కెంపు కనుఁగవఁ గదురన్‌.

4.5.107

క. శిరము లలాటంబును గం | ధరమును బాహువులు నురము దందడి వ్రయ్యన్‌
గిరిపైఁ బిడుగులు దొరఁగెడు, | పరుసున దృఢదీప్త శాత భల్లము లేసెన్‌.

4.5.108

క. అఱిముఱి నంగము లెల్లను | నుఱుముగ నిట్లడరు నర్జునుని యమ్ములకున్‌
వెఱచఱచి సూతపుత్రుఁడు | పఱచెఁ బుడమియద్రువ మత్స్యపతిసుతుఁ డార్వన్‌.

4.5.109

వ. ఇట్లు కర్ణుండు గయ్యంబు విడిచి పాఱినఁ బార్థుండు దేవదత్తంబు పూరించి యుత్తరున కిట్లనియె.

4.5.110

క. ‘వీఁ డొకఁడు కురుబలంబున | వాఁడిమగం డనఁగఁ జాలువాఁ డిబ్భంగిం
బోఁడిమి సెడియెను ద్రోణుల | వేఁడిమి యిట మనకు మునుము విక్రమమునకున్‌.’

4.5.111

వ. అనుచు వీరావేశంబునఁ గౌరవానీకంబు నాలోకించునప్పు డుత్తరుండు.

4.5.112

ఉ. ‘వెక్కసపాటు భీతియును విహ్వలభావము నొంది యిట్లను
‘న్మిక్కిలి యైన శౌర్యమును నిర్భరతేజము నంత కంత కి
ట్లెక్కెడులావుఁ జూచి మది యెంతయు బెగ్గిలె, మేను చేష్టలం
దక్కె; నశక్య మిం కిట రథవ్యవహారము నిర్వహింపఁగన్‌.

4.5.113

ఆ. పుట్టినంతనుండి యిట్టివి యెన్నఁడుఁ | గాన నెందు; నట్లు గాన చోద్య
మంది యంతరంగ మవశతఁ బొందిన | కతన నింద్రియముల కడఁక దక్కె .’

4.5.114

తే. అనినఁ గొండొక న వ్వొలయంగఁ జూచి | యింద్రనందనుఁ డాతని కిట్టు లనియె
‘నేను గలుగంగ నీకేమి యెలమి వాహ, | నముల కుబ్బుగ సంచోదనంబు సేయు.’

4.5.115

క. అనుటయు నాతఁడు దగ నూ | ల్కొనినం, దా నుదిత నినద కోదండుం డై
యనితర సులభోద్యమముగ | ధనంజయుం డిట్టులను నతనితో మఱియున్‌.

4.5.116

క. ‘అరుణాశ్వంబులఁ బూనిన | యరదంబున వీఁడె నిడుపులగు చేతులు బం
ధుర కంధరంబు వెడలుపు | టురమును నై ద్రోణుఁ డొప్పె నుత్తర కంటే?’

4.5.117

వ. అని చూపి వెండియు నిట్లనియె.

4.5.118

ఆ. ‘సకల కురుకుమార చాప శిక్షాచార్యుఁ, | డాజి దుస్సహుండు, సాంగవేద
వేది, నీతిశాస్త్ర విదుఁడు దివ్యాస్త్ర కో | విదుఁడు, సుజన హితుఁడు, విమల బుద్ధి.’

4.5.119

వ. అని యగ్గించి.

4.5.120

క. ‘తన తనయుకంటె నెమ్మన | మున నాకుం గూర్చు భావమున, గురులకు మా
ర్కొనియెదము; రాచధర్మం | బున కీడునఁ జేసి యింత పుట్టఁగ వలసెన్‌.

4.5.121

చ. ఎదురుగఁ బోవ నిమ్ము రథ మీతని తేరికి’ నన్న నాతఁడుం
బదిలముతోడ రథ్యముల పగ్గము లేడ్తెఱ నూలుకొల్పి యు
న్మదగతి నట్ల చేసిన నమానుషవిక్రముఁ డైన ద్రోణుఁడుం
గదిసి యిభం బిభంబుఁ జెనకం జనుదెంచిన లీల వచ్చినన్‌.

4.5.122

వ. నరుఁడు నమస్కరించి గురున కిట్లనియె.

4.5.123

క. ‘అడవులఁ బెద్దయుఁ గాలం | బిడుమలఁ గుడిచితిమి; మాకు నిది దఱి యని యి
ప్పుడు వచ్చితిమి; విపన్నుల | యెడఁ గృప సేయుటయ లెస్స; యీ రలుగకుఁడీ!

4.5.124

క. మును వెఱతు నేయ మీరలు | నను నేసినఁ గాని’ యనుడు నాకేశసుతున్‌
ధనురాచార్యుం డిరువది | సునిశిత బాణముల నేసెఁ జూపఱు వొగడన్‌.

4.5.125

ఆ. అర్జునుండు వాని నన్నింటి నడుమన | తునియ నేయుటయును ద్రోణుఁ డడరి
శతసహస్ర సంఖ్య శరములు గప్పిన | నతఁడు నతనిఁ గప్పెఁ బ్రతిశరముల.

4.5.126

చ. అతిరథు లస్త్రశస్త్రవిదు లద్భుతబాహుబలుల్‌ పరాక్రమో
ర్జితయశు లిట్లు దాఁకి గురుశిష్యులు కౌరవసేనలోని భూ
పతిసుతకోటికిన్‌ వెఱఁగుపా టొనరించిరి బాణజాల సం
వృత గగనాంగణంబగు నవీన మహాహవ విక్రమంబునన్‌.

4.5.127

వ. అట్టి యెడం గురుసైన్యంబు జనంబులు.

4.5.128

క. ‘గురుఁ డొక్కరుండు దక్కఁగ | నరుఁడు గడఁగినపుడు మార్కొనం జాపధరుం
డొరుఁడు గలఁడె! మఱి వెదకిన | హరుఁడు గలం; డింకఁ గలుగు ననరా దెందున్‌.

4.5.129

క. ద్రోణుఁడు రయమున నేసిన | బాణము లెడతెగక యొక్క బాణమ పోలెన్‌
శ్రేణి యయి వోవఁ బార్థుఁడు | రేణువు గావించుఁ గంటిరే చిత్రగతిన్‌?

4.5.130

క. గురుశరములు సితపక్ష | స్ఫురణంబున నంచపిండు పొలుపు వహించెన్‌;
నరుబాణతతి ఘనావలి | కరణి మిగుల నొప్పె నల్లగఱుల చెలువునన్‌.’

4.5.131

వ. అనుచుం గనుం గొనుచుండ.

4.5.132

శా. శ్రావ్యంబై చెలఁగన్‌ గభీర మధుర జ్యానాద ముద్దామ వీ
రవ్యాపార నిరూఢతం బ్రతిశరారంభంబు మర్దించుచున్‌
సవ్యప్రౌఢి దృఢాపసవ్యగతి నాశ్చర్యంబుగా నేయుచున్‌
దివ్యాస్త్రంబులఁ బోరి రిద్దఱును సాదృశ్యం బదృశ్యంబుగన్‌.

4.5.133

వ. ఇంద్రాగ్ని వాయు వరుణ దైవత్యంబులగు శరంబులు గురుం డేసిన, నరుండును దత్తద్దేవతాకంబు లగునంబ కంబులఁ బ్రతిహతంబులు సేయుచు వచ్చె; నయ్యిరువురుఁ బెల్లేయు సాయకంబు లంతరిక్షంబున దళంబై సంతమసంబు గలిగి యునికి నేబాణం బెక్కడఁ బాఱుటయుం దోఁప కుండె; నట్టియెడఁ గుంభసంభవు బలంబు సరభసంబుగా నతని కడ్డంబు సొచ్చిన వివ్వచ్చుండు వ్రేల్మిడిం బొడిసేసి సకేయూరంబు లగు బాహుదండంబులను సకుండలంబు లగు కర్ణపాశంబులను సకిరీటంబులగు శిరోభాగంబులను భూభాగం బలంకరించి యప్పు డావహిల్లిన రుధిరసాగరంబునకు రత్నాకరత్వం బలవరించె; నిట్లు దుర్జయుండగు నర్జునుండు సైన్యంబు దైన్యంబు నొందించుచు నాచార్యునకు భరంబుగ నేట్లాడుచున్నం జూచి గురుండు విస్మితుండై.

4.5.134

క. ‘అర్జునుని నాహవంబున | నిర్జింపఁగ నగునె ఫాలనేత్రున కైనం?
బర్జన్యసుతుఁడు శరవ | ర్షోర్జితమూర్తి యగు టరయ నుచితమ కాదే!’

4.5.135

వ. అని మఱియును దగిన పలుకుల నగ్గింప, నిలింపనికరంబు.

4.5.136

తే. ‘ఇంతప్రొద్దు కిరీటి కట్టెదుర నిలువ | వెఱవ కున్నప్డు ద్రోణుండ వింటివాఁడు
నల్లవో తన యున్న సేనకు నొకండ | బలిమిఁ దలమీఱునే? యిట్లు నిలువ వలదె!’

4.5.137

మ. అనుచుండం ద్రిదశేంద్రసూనుఁడు రయం బత్యంత ఘోరంబుగా
ఘనశాతోజ్జ్వల దుర్నివార విలసత్కాండంబులన్‌ ద్రోణు వా
హన సూతధ్వజ దేహముల్‌ వొదివె; ని ట్లస్త్రాబ్ధి నిర్మగ్నుఁ జే
సిన హాహా నినదంబు లొక్క మొగిఁ బేర్చెన్‌ సర్వసైన్యంబులన్‌.

4.5.138

క. ఈమెయి నిజజనకు భుజో | ద్దామబలము దోడుతోడఁ దఱుఁగుటయు రథ
స్తోమంబుఁ దాను నశ్వ | త్థామ వెసం దాఁకె బాండుతనయుని తోడన్‌.

4.5.139

చ. అతఁడును దీవ్రబాణముల నాతనిఁ గప్పుచు మాఱుకొన్న నా
శతమఖవృత్ర సంగరము చందము దోఁచె వడిం జటచ్ఛటా
యిత రవ మప్డు వేణువుల నేర్చు దవానలు మ్రోఁత భంగి ది
క్తతిఁ బరఁగెన్‌ మహాద్భుతము కౌరవసేనకు నావహిల్లఁగన్‌.

4.5.140

వ. అట్టి యెడ.

4.5.141

చ. ఉఱక నరుండు ద్రోణసుతు యుగ్యములన్‌ వెస నొంచె; నాతఁడుం
దెఱపి యొకింత గాంచి ఘనతీవ్రశరంబున నారిఁ ద్రుంచి, క
న్గిఱిపిన మాత్రలోన నతనిం బటుబాణ చతుష్కయుగ్మ మే
డ్తెఱఁ దొడి మౌర్విఁ గ్రమ్మఱ ఘటించునెడన్‌ వడి నేసి యార్చినన్‌.

4.5.142

క. ‘కురుసేనలోన ని ట్లె | వ్వరుఁ జేసినవారు లే; రవార్య భుజా వి
స్ఫురణోదగ్రుండు గదే | గురుపుత్రుం’ డనుచు నమరకోటి నుతించెన్‌.

4.5.143

చ. చిఱునగ వొప్ప గాండివము చెచ్చెర సజ్యము సేసి సేన లు
క్కఱ రభసంబుమై నడరెఁ గవ్వడి ద్రౌణియు నీడఁబోక య
త్తఱిఁ దఱుమంగ నస్త్రములు దందడి మార్కొని మండుచుండెఁ జి
చ్చఱపిడుగుల్‌ వడిం దొరఁగు చాడ్పున నంబరవీథి నుగ్రమై.

4.5.144

వ. ఇవ్విధంబున ధనంజయుండు రయంబున నేయ వేగంబున నేయు ద్రోణతనయు తూణీరంబులు శరశూన్యంబు లయ్యెఁ; దన తూణీరంబు లక్షయ బాణంబు లగుటం జేసి యంతకంతకు నతిశయిల్లు పెల్లున నేయుచు నధికుండగు నప్పాండవమధ్యముం గనుంగొని కృపాచార్యుండు సెంగటం దలమీఱిన.

4.5.145

క. గురుపుత్రుని రథము విడిచి | సరభసముగ నందు సవ్యసాచి గవియుడుం
దిరమై యాతఁడు శితశర | పరంపరలు గురిసె నుగ్రబంధురగతులన్‌.

4.5.146

వ. పాండుపుత్రుండును జిత్రసంచారంబుల మెఱయుచు.

4.5.147

క. పటు విశిఖపంక్తి యత్యు | త్కట రయమున నిగుడఁజేయఁగా నవ్విధ మూఁ
దుటయైన మండె దీప్తో | ద్భట భంగిఁ గృపానలంబు బలములు వొంగన్‌.

4.5.148

వ. ఇట్లు మండి శిఖిఁబోలెడి కనకలిప్త ఘనబాణంబు వనచర కేతువుం దాఁకించి వేఁడిమి సూపి వివిధాస్త్ర జ్వాలలు గవియించి దిక్కులు సెలంగ నార్చినం గోపంబున నాటోపంబు మిగిలి బలసూదనసూనుం డతని కేతనంబు దునిమి తరణి కిరణానుకార పారంగతంబు లగు నారాచంబులు దదీయాంగంబుల నినుపం దొడంగిన రథచక్రరక్షకు లగు చంద్రకేతుండును జిత్రాశ్వుండును మణిమంతుండును మంజుమౌళియు హేమవర్మయును సురథుండును సుషేణుండును నరిష్టుండును సుకేతుండును నుక్కు మెఱయ నొక్కటం దాఁకిన.

4.5.149

ఆ. అన్ని వెడఁద వాతియమ్ము లద్భుతముగ | నొక్క ముష్టిఁ దొడిగి గ్రక్కనంగ
నతఁడు లీలఁ దునిమె నందఱ తలలును | ఘోరభంగి రక్తధార లెగయ.

4.5.150

సీ. తునిమి, తోడన యొక్క సునిశిత శరమునఁ | గాఁడియు, రెంట నక్షములఁ ద్రుంచి,
హరుల నాల్గిటఁ జంపి, యాలంపు టెలుఁగుతో | నొగలు మూఁడమ్ముల నుగ్గుసేసి,
ధనువును సూతుని తలయుఁ జెఱొక్క ట | నఱకి, లోచనముల నవ్వు మెఱయఁ
గృపుని నాలోకించి క్రీడి తద్వక్షః స్థ | లంబునఁ గ్రూరభల్లంబు నాఁట
ఆ. హతరథుండు నిపతితాశ్వుండు సంఛిన్న | చాపుఁడును నికృత్త సారథియును
నయ్యు, నొచ్చియును, భుజార్గళ సంరంభ | మతిశయిల్ల శక్తి నతఁడు వైచె.

4.5.151

ఉ. మండుచు వచ్చుదానిఁ బదిమార్గణముల్‌ గొని వేగ మొప్ప నా
ఖండల నందనుండు గడికండలు సేసినఁ జూచి యప్పు డా
తం డుడివోక లేక సమదంబున ఖడ్గము ఖేటకంబు ను
ద్దండతఁ గొంచుఁ దేరు డిగి తాఁ గవిసెన్‌ రయ ముల్లసిల్లఁగన్‌.

4.5.152

వ. ఇట్లు గవిసిన.

4.5.153

క. పలకయు వాలును నింతిం | తలు దునియలు సేసె బాణతతిఁ బాండవుఁ డి
ట్టల మైన వెఱఁగుపాటున | నిలిచి కృపుఁడు ద్రోణపుత్రుని రథం బెక్కెన్‌.

4.5.154

ఆ. అప్పు డే పడంగి యన్ని సేనలు భీష్ము | రథము పొంత కొదిఁగె రౌద్రరస వి
నోది యైన యర్జునుఁడు ధనుశ్చాలన | దీప్తమూర్తి యగుచుఁ దిట్ట కుఱికె.

4.5.155

వ. ఇత్తెఱంగున నుఱక తఱియ నుఱికిన.

4.5.156

క. బలములు దొరలుఁ బొదివి సం | కుల యుద్ధము సేయఁ గ్రోధ ఘోరాకృతి యై
యిలఁ బ్రోవుగఁ జతురంగం | బుల వ్రేల్మిడిఁ బాండురాజపుత్రుఁడు గూల్చెన్‌.

4.5.157

ఉ. చేతులతీఁట వో నిటు లశేషబలంబుల నుగ్గు సేసి మాం
సాతతపంక యై బహువిధాయుధమీనము లొప్పఁ జామర
వ్రాతము ఫేన భంగిగ నిరంతర వీరశిరస్సరోరుహ
స్ఫీత విభూతిఁ బొల్చు నది సేసె రణస్థలియందు నెత్తుటన్‌.

4.5.158

తే. ఇట్లు కౌరవానీకంబు నెల్లఁ గలఁచి | యాడి భీష్ముని దెసఁ బోవు క్రీడిఁ దాఁకెఁ
గొండతోఁ దాఁకు తగరు నుద్దండ వృత్తి | దోఁప వృషసేనుఁ డాహవదోహలమున.

4.5.159

వ. విజయుండును.

4.5.160

తే. భల్ల మొక్కట నాతని విల్లు దునిమి | యైదు నారసములు వక్ష మాడ నేసె;
నతఁడు సైరింపరాని నొ వ్వడరుటయును | బెగ్గలంబున నరదంబు డిగ్గి పాఱె.

4.5.161

వ. అట్టియెడ దుశ్శాసన శకుని దుర్ముఖ వివింశతి వికర్ణులు దన్నుం బొదివికొనిన వారల రథరథ్య కేతు వర్మంబులు జర్జరితంబులుగా నేసి గాసిచేసిన నందఱుం గనుకనిఁ బఱవం దొడంగినఁ బార్థుండును బ్రహాసోల్లాస భాసుర ముఖుండగుచు నుత్తరుం గనుంగొని.

4.5.162

తే. ‘కనకమయ తాల కేతువు క్రాలఁ జిర త | టిల్లతాలీలఁ గలిగి శోభిల్లు నంబు
దంబుచాడ్పున సురనదీ తనయుఁ డున్న | వాఁడు చూచితె మత్స్యభూవరతనూజ!

4.5.163

క. బలువిడి మన దివ్యాస్త్రం | బుల చవి చూపంగ వలయుఁ బోనిమ్ము రథం
బలసగతి నతనిదెస’ కని, | పలికిన నతఁ డట్లు చేసెఁ బరమ ప్రీతిన్‌.

4.5.164

ఉ. శాంతనవుండు నప్డు నిజశంఖము కౌరవరాజసైన్యముల్‌
సంతస మంద నొత్తుచు ససంభ్రమలీల నెదుర్కొనంగ దు
ర్దాంత భుజాబల ప్రకటదర్ప మెలర్ప నరుండు నొత్తె ది
గ్దంతినికాయ కర్ణపుట దారణ వృత్తము దేవదత్తమున్‌.

4.5.165

తే. మలసి ఱంకెలు వైచుచు మాఱుకొనిన | వృషభముల భంగి నక్కురువృషభు లిట్లు
సమదగతిఁ జేరునెడఁ జూచి రమరు లర్థి | ననిమిషత్వంబు దమ కప్పు డచ్చుపడఁగ.

4.5.166

వ. ఇవ్విధంబునం గనుంగొనుచు వారలు దమలోన.

4.5.167

క. ‘మనలను దానవులను గడ | చినయవి భుజ బలము లస్త్రశిక్షా విధముల్‌
గొనియాడఁ గొలఁది గా దీ | తని నాతఁడ యతని నితఁడ తగుఁ జెనయంగన్‌’.

4.5.168

సీ. అనుచుండ సైన్యంబు లార్పులుఁ బెడ బొబ్బ | లును దూర్యనాదంబులును జెలంగఁ
బేర్చి యొక్కుమ్మడి భీష్ము నగ్గింపంగ | నతఁడు నిశాత బాణాష్టకమునఁ
బడగపై హనుమంతు నొడలను బహుశరం | బుల నందుఁ జెలఁగెడు భూతములను
దశవిశిఖముల రథ్యములను సారథి | నేసె; వాసవియును నెసక మెసఁగు
తే. నగ్గలిక గాండివంబు చక్రాకృతి ప్ర | కాశవహ్ని స్వరూపత గలిగి విడుపు
తెఱపి గానంగ రాకుండ మెఱసి యొప్పు | సాంద్ర సాయకతతి నాకసంబు గప్పె.

4.5.169

తే. అర్జునుఁడు గవియించిన యంపమూడ | మంచు దళముగఁ గప్పిన మార్గణాంశు
జాలముల వెస విరియించె శాంతనవ ప | తంగుఁ డుద్ద్యోతమాన ప్రతాప లీల.

4.5.170

క. అమరేంద్రతనయుఁ డుగ్రా | స్త్రములు వడిం గురియఁ గురియఁ దరమిడి వానిం
దుమురుగఁ జేయుచు వచ్చెను | సమరోల్లాసంబు మెఱయ శంతనుసుతుఁడున్‌.

4.5.171

క. అర్జునుఁడు దివ్యబాణ | స్ఫూర్జిత దోశ్శక్తి తనకుఁ జూపిన నతఁ డ
త్యూర్జిత బలుఁడై నియమో | పార్జిత ఘోరాస్త్రవితతిఁ బ్రతిహతిఁ జేసెన్‌.

4.5.172

క. కవ్వడి యెమ్మెయి నేసిన | నవ్విధమున నాశరంబు లన్నియు దౌ దౌ
దవ్వులన నిలువరింపఁగ | వివ్వచ్చుఁడు కినిసి యేసె విలు విఱుగంగన్‌.

4.5.173

మ. తన కోదండము ఖండితం బగుడుఁ గ్రోధంబార మందాకినీ
తనయుం డప్డు సటా విలుంచన సముద్యత్క్రోధ సింహాకృతిన్‌
ధను వొం డుద్ధత లీల నెత్తికొని యస్త్రశ్రేణిఁ బర్వించె న
ర్జునుపైఁ దాఁకిరి చక్రరక్షకులు నార్పుల్‌ నింగి ముట్టన్‌ వడిన్‌.

4.5.174

చ. విజయుఁడు వారి నెల్ల నొక వ్రేల్మిడిఁ ద్రుంచియు, భీష్ము సాయక
వ్రజము నడంచియున్‌ రథము వాజుల నొంచియు, నాజికేళియం
దజిత విలాసముల్‌ మెఱయ నప్పుడు విస్మయ మందుచుండెఁ గుం
భజముఖ యోధ వీరతతి; ప్రస్తుతి సేసిరి సిద్ధఖేచరుల్‌.

4.5.175

క. కొండొకయెడఁ గని శాంతన | వుం డాఖండల తనూభవుని డా మూఁ పు
ద్దండ భుజబలము మెఱయఁ బ్ర | చండాస్త్రక్షతము సేసె సరభసవృత్తిన్‌.

4.5.176

చ. కినుక మనంబునం గదిరి క్రీడి పితామహువిల్లు వ్రేల్మిడిం
దునిమి, నితాంత గాఢరయ దోర్విభవంబున నొండు విల్లు గై
కొనియెడు సందునన్‌ నినిచెఁ గ్రూరశరంబు లురంబునందు గ్ర
క్కున నతఁ డొల్లఁ బోయి రథకూబర మూఁతగ నిల్చె సోలుచున్‌.

4.5.177

క. కనుఁగొని సూతుం డరదముఁ | గొనిపోయెం దొలఁగ నపుడు కుంతీతనయుం
డనిఁ దనివి సనక గుంపులు | గొని యున్నెడ లరసెఁ గలయఁ గురుసైన్యములన్‌.

4.5.178

వ. ఇ ట్ల ఱ్ఱెత్తి చూచి గాండీవంబు దొడసి గుణంబు సారించి కవదొనలు బిగియించి.

4.5.179

క. ఆచార్య సూర్యతనయ కృ | పాచార్య ప్రభృతి రథికు లందఱుఁ బ్రోవై
జూచుచు నుండఁగ నద్దెస | కేచి భుజాబలము మెఱయ నింద్రజుఁ డరిగెన్‌.

4.5.180

వ. అప్పు డశ్వత్థామ కర్ణున కిట్లనియె.

4.5.181

ఆ. ‘వీఁడె వచ్చుచున్నవాఁడు పార్థుఁడు; మన | మేమి సేయువార? మీవు దక్క
నొరులు నిలువరింప నోపెడువారు లే; | రోట లేక తాఁకి యోర్వవలయు.’

4.5.182

క. అని తను నుల్లసమాడినఁ | గినిసి యినతనూజుఁ ‘డేను గ్రీడి నిచట మా
ర్కొను వీఁకఁ గన్నులారం | గనుఁగొనుమీ నిలిచి’ యనుచుఁ గవిసెం బెలుచన్‌.

4.5.183

క. దొరలును సుభటులుఁ గర్ణుని | యరదమునకు మున్న పొదివి; రర్జును నచటం
గరి సొచ్చిన తుంగ మడువు | పరుసున మొన చాఁపకట్టు వడియె నతనిచేన్‌.

4.5.184

తే. ఇవ్విధంబునఁ బోరెడు నింద్రతనయు | నుక్కులావును నంతంత కెక్కుడయ్యె
నలసి మేనులు తూలాడ నిలిచి రంత | నంత నయ్యోధముఖ్యు లాహవము దక్కి.

4.5.185

వ. అట్టియెడ నుత్తరుండు నరున కిట్లనియె.

4.5.186

చ. ‘ఉడుకువ లేని కయ్యమున కోర్వఁగ వచ్చునె? నాకు డప్పి వు
ట్టెడు; నొకమాటు నాగ్రహము డింపవు నీవును; జక్కుసేసి ప
చ్చడి గలపంగ వెండియును జండితనంబున వచ్చి వచ్చి పో
రెడు మొన, లింకఁ జాల నొనరింప భవద్రథసూతకృత్యమున్‌.’

4.5.187

వ. అనిన విని కవ్వడి నవ్వుచు ‘నేను గలుగ నీకు నోహటింప నేల? యంతియ; వలసినం దురంగంబులఁ దోడు గడపెద; నించుక సైరించి నిలువ వలయు; నెల్లపనులును జక్కనయ్యె; రా జొక్కరుండు కొఱంత; యాతం డభిమాని; మనలం గని సరకుగొనఁ; డిప్పుడున్న చందంబు మనతోడం దలపడం గడంగుట దోఁచుచున్న యది; తమ్ములు నాప్తభృత్యులు నిరుగెలంకుల నగ్గలిక మెఱసి డగ్గఱి యున్న వా’రని కౌరవేశ్వరుని గట్టి మోహరంబు సూపి యతనిం బురికొల్పి యద్దిక్కు తేరు పోవనిమ్మనుటయు నతండును దలకొని యట్ల చేయ నడరి యెడనెడ నడ్డుపడు కురుబలములఁ జిఱునగవు నిగుడ మెఱుంగు వాలమ్ములఁ దొలంగ జడియుచుం గదిసిన, నమ్మేదినీవల్లభుండు.

4.5.188

క. పులిఁ గోల వేసిన ట్టి | ట్టలపు రయంబునఁ గడంగుటయుఁ దద్వక్షః
స్థలమునఁ గిరీటి రెండ | మ్ముల నాఁటఁగ నేసె బొమలు ముడివడుచుండన్‌.

4.5.189

క. క్షతములఁ బెల్లు దొరఁగు శో | ణిత ధారలు మదముగా వినిర్గళకరి యా
కృతిఁ గవిసి యతం డేసెను | శతమఖసుతు ఫాలతలము శాతశరమునన్‌.

4.5.190

తే. రక్తధారలు వెడలంగ రశ్మి వెలుఁగఁ | బొలుచు బాలార్కు చాడ్పునఁ జెలువు మిగిలి
ఫల్గునుండు ప్రతాప సంభరిత మూర్తి | యగుచు శరకిరణంబులు నిగుడఁ జేసె.

4.5.191

శా. వానిం దీవ్రశరంబులం దునిమి గర్వం బెక్క నానాస్త్ర సం
తానంబుల్‌ గురిసెన్‌ సుయోధనుఁడు దుర్దాంతాకృతిన్‌ గోత్రభి
త్సూనుండుం బటు సాయకోత్కరమునం జూపెన్‌ భుజాటోప మి
ట్లేనుం గేనుఁగుఁ దాఁకునట్లు సమరం బేపారఁగా నయ్యెడన్‌.

4.5.192

తే. హస్తిపురిఁ బేరు గల మదహస్తి నెక్కి | క్రాలు కావలి రథములు గవియుఁదేర
నభ్రగజముపైఁ బర్జన్యుఁ డనఁగ నంప | వాన పరఁగ వికర్ణుండు వచ్చి తాఁకె.

4.5.193

ఉ. వీఁక నెదిర్చి యిట్లు కురువీరులకుం బ్రమదం బొనర్చుచుం
దాఁకినఁ గ్రోధవేగ సముదగ్రత నెఱ్ఱని చూడ్కిఁ జూచి పే
రాఁకలితోడ నున్న జమునాకృతి భీషణరేఖ యొప్పఁగా
వ్రేఁకని నారసంబుఁ దొడి క్రీడి కరిన్‌ దృఢముష్టి నేసినన్‌.

4.5.194

ఆ. ఫాలకుంభ సంధిఁ బడి వాలమున వెస | నుచ్చి పోవుటయును నుర్వి యద్రువఁ
గూలె నగ్గజంబు కులిశ చండాహతిఁ | బడు మహానగంబు భంగి దోఁప.

4.5.195

క. అరుణ మణి మాలికా వి | స్ఫురణంబున దంతితనువు చూడఁగ నొప్పెన్‌
ధరణిఁ బడియున్న బహుముఖ | పరిగత దావాగ్నిఁ బొల్చు పర్వతము క్రియన్‌.

4.5.196

వ. ఇవ్విధంబున నేనుంగు పీనుంగైన వికర్ణుండు వెఱ చఱచి పఱచి వివింశతిరథం బెక్కె; నాలోనన యట్టి నారాచంబున రారాజు నురంబు నోనాట నేసినఁ గరీంద్రుండు వడుటయు నరేంద్రుండు నొచ్చుటయుం గని ఱిచ్చపడు రథికుల వివ్వచ్చుం డనర్గళ ప్రసారం బగు మార్గణాసారంబున ముంచిన వెగడుపడి విఱిగి పాఱి; రిత్తెఱంగునఁ దనచుట్టును బయలైన నయ్యురగకేతనుండును మరలె; నిట్లు దొరయును విఱిగి కలను వాసి కాలు ద్రోసిపోవుటయు, నతిరథ మహారథు లెల్లం జెల్లాచెద రగుటయుం జూచి సైన్యంబు లున్నవి యున్నచోటన తెరలి కనుకనిం బఱవం దొడంగిన.

4.5.197

తే. యూథపతితోడి దంతిసముత్కరంబు | వెనుకఁ దగిలెడు సింగంబు విధము దోఁప
నార్పు నాదంబుగా నరుఁ డంటఁ దాఁకె | రాజుఁ దారును బాఱెడు రథిక వరుల.

4.5.198

క. వెనుకొని కర్ణుని పెడతల | యును దుశ్శాసనుని వీఁపు నొక్కొక్క శరం
బున నేసె నప్పు డయ్యిన | తనయుం డిట్లనియె నతిరథశ్రేష్ఠులతోన్‌.

4.5.199

ఆ. ‘కూడముట్టెఁ గ్రీడి కురువంశమున కెల్ల | మూలకంద మీ నృపాలుఁ డితని
నిచటఁ గాచికొనుట యెల్ల పౌరుషములు | జేఁత; నిలిచి లావు సేయవలయు.

4.5.200

క. అన వినుచుఁ గురుపితామహుఁ | డును ద్రోణుఁడు ద్రోణపుత్రుఁడును గృపుఁడును గ
ర్ణుని మాట సరకుసేయక | చనుచుండఁగ దీనవృత్తి జనపతి పలికెన్‌.

First 200 of 409 passages. Read on