Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.1.377

Āndhra Mahābhāratamu 5.1.377

Language
Telugu

5.1.377

వ. ఏము కలహం బొల్లక పొందుగోరుట తనకు మేలు; తన మనంబున దరికొను తృష్ణానలం బార్ప నొరు లడ్డంబు సొరమింజేసి, యేన బుద్ధి సెప్పవలసెఁ; దనయొద్దం గల యోధవీరులె య్యెడల లేమి దెల్లంబయినను, మాకుఁ జేదోడు ధర్మంబు గల; దదియునుంగాక యఖిలలోక సేవితుండైన కృష్ణుండు పెనుఁబ్రాపు గావునఁ దమకు మమ్ము గెలువం గొలఁదిగా; దదియట్లుండె; నేను భీమసేనాదులకుం దమకుం బెద్దవాఁడ నగుట వీరును వారును మదీయ ప్రార్థనా భంగంబు సేయక, నాదగు శాంతియు దాంతియుఁ జెల్లించి; న న్నలజడిఁ బెట్టక, పోరితం బుడిగి తమతమ ధనంబులు గుడిచి సుఖంబుండుట మన పెద్దలకుం దక్కటి బుద్ధిమంతులకును సంతోషంబగుఁ; బెద్దయీ నోపఁడయ్యెనేనిఁ గుశస్థలంబును; వృకస్థలంబును; వాసంతియు; వారణావతంబును జాలుఁ; గాదేని మఱియు నెందేనియు నొక్కటి యగునట్లుగాఁ దన తోడఁబుట్టువు లేవురకు నిలువఠావు లయి దిచ్చిన సర్వశాంతి యగు; నట్లయిన నిందలి యందలి బంధు మిత్త్ర సహాయజనంబులు గలసి నవ్వుచుం దెగడుచు నునికి మన మనంబులకుఁ బ్రియంబుసేయుఁ; గురు పాంచాల యాదవ మాత్స్యులు పరస్పర ప్రీతి సంపాదకత్వ సంపన్నులై బ్రదుకుట నాకుం గోర్కి; యింతయు నమ్మహాపురుషునకుం దెలియం జెప్పు’ మనిన విని ‘దేవా! నీ యానతిచ్చిన మార్గంబంతయు నడపెద; మీ తండ్రి నీకును దమ్ములకును వాసుదేవునకు నెట్లు ప్రియం బట్లు సేయువాఁడ కాక’ యనుచుం బ్రణామంబు సేసిన, సంజయునకు ధనంజయుం డిట్లనియె.