Andhra Mahabharatamu 1.3.71
Āndhra Mahābhāratamu 1.3.71
- Language
- Telugu
1.3.71
వ. మఱియు బ్రహ్మకు ధాతయు విధాతయు ననంగా నిద్దఱు మనుసహాయులై పుట్టిరి; వారితోడను లక్ష్మి పుట్టె; లక్ష్మికి మానసపుత్త్రు లనేకులు పుట్టిరి; వరుణునకు జ్యేష్ఠకు బలుండును సుర యను కూఁతురునుం బుట్టిరి; సురయం దధర్ముండు పుట్టె; నా యధర్మునకు నిరృతికి భయ మహాభయ మృత్యువు లనఁగా మువ్వురు పుట్టిరి; మఱియుఁ దామ్రకుఁ గాకియు శ్యేనియు భాసియు ధృతరాష్ట్రియు శుకియు నన నేవురుకన్యలు పుట్టిరి; యందుఁ గాకి యనుదానికి నులూకంబులు పుట్టె; శ్వేని యను దానికి శ్యేనంబులు పుట్టె; భాసి యనుదానికి భాసగృధ్రాదులు పుట్టె; ధృతరాష్ట్రి యను దానికి హంస చక్ర వాకంబులు పుట్టె; శుకియను దానికి శుకంబులు పుట్టె; మఱియుం గ్రోధునకు మృగియు మృగమందయు హరియు భద్రమనసయు మాతంగియు శార్దూలియు శ్వేతయు సురభియు సురసయు ననఁ దొమ్మండ్రు పుట్టి; రందు మృగి యనుదానికి మృగంబులు పుట్టె; మృగమంద యనుదానికి ఋక్ష చమర సృమరాదులు పుట్టె; హరి యనుదానికి వానరగణంబులు పుట్టె భద్రమనస యనుదానికి నైరావణంబు పుట్టె; నైరావణంబునకు దేవనాగంబులు పుట్టె; మాతంగి యనుదానికి గజంబులు పుట్టె; శార్దూలి యనుదానికి సింహవ్యాఘ్రంబులు పుట్టె; శ్వేత యనుదానికి దిగ్గజంబులు పుట్టె; సురభి యనుదానికి రోహిణియు గంధర్వియు ననలయు ననం బుట్టి; రందు రోహిణికిఁ బశుగణంబులు పుట్టె; గంధర్వి యనుదానికి హయంబులు పుట్టె; ననలకు గిరి వృక్షలతా గుల్మంబులు పుట్టె; సురసకు సర్పంబులు పుట్టె; నిది సకలభూత సంభవప్రకారంబు.