Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 3.2.264

Āndhra Mahābhāratamu 3.2.264

Language
Telugu

3.2.264

వ. అని పితృదేవతల వరంబునం బుణ్యతీర్థంబులఁ జేసె; నట్టి రామహ్రదంబు లాడినవారికి నశ్వమేధ ఫలంబగుఁ; గాయశోధనం బను తీర్థం బాడి కాయశుద్ధు లగుదు; రెందేని విష్ణుదేవుండు లోకంబుల నుద్ధరించె నట్టి లోకోద్ధారం బను తీర్థమాడి కులం బుద్ధరింతురు; శ్రీతీర్థం బాడి శ్రీమంతు లగుదురు; కపిలతీర్థం బాడి కపిల గో సహస్ర దాన ఫలంబుఁ బడయుదురు; సూర్యతీర్థం బాడి యం దుపవసించిన సూర్యలోక ప్రాప్తులగుదురు; గో భవనంబను తీర్థంబాడి గోసహస్రసమృద్ధు లగుదురు; శంఖినీ తీర్థంబాడి యుత్తమరూపంబు వడయుదురు; యక్షేంద్ర తీర్ధం బాడి తరండకుం డను ద్వారపాలకుం జూచినవారు సరస్వతీ స్నాతులైనవారు నగ్నిష్టోమఫలంబు వడయుదురు; మాతృతీర్థ దర్శనంబునం బ్రజావృద్ధి యగు; బ్రహ్మావర్తంబును, శరవణంబునుం జూచిన, సర్వవ్యాధి విముక్తు లగుదురు; శ్వావిల్లోమాపహం బను తీర్థంబునం దేకాదశతీర్థంబులు గల; వందుఁ బ్రాణాయామంబు సేసిన విప్రులకు స్వలోమాపనయనం బగు; నెఱుకుచేత నేయంబడి కృష్ణమృగంబు లెందేని నొక్కతీర్థంబు సొచ్చి మానుషత్వంబు వడసె నట్టి మానుష తీర్థం బాడి సర్వదురిత విముక్తులై దేవత్వంబు వడయుదురు; దాని తూర్పున నొక్కయిరవున నాపగ యను మహానదిం బితృతర్పణంబు సేసి పితృదేవోద్దేశంబున నొక్కబ్రాహ్మణునకుం గుడువం బెట్టినఁ గోటిబ్రాహ్మణులు గుడిచిన ఫలంబగుఁ, బితృదేవతలు దృప్తియు నొందుదురు; బ్రహ్మోదుంబరంబు సప్తర్షి కుండంబుఁ గేదారంబును జూచి బ్రహ్మలోకంబు వడయుదురు; కపిల కేదారంబుఁ జూచి పాపవిముక్తులై యదృశ్యు లగుదురు; సరకం బను తీర్థంబాడి కృష్ణచతుర్దశి నాఁ డీశ్వరుం బూజించి యెల్ల కోర్కులం బడయుదురు; మూఁడుకోట్ల కూపహ్రదంబులు గల యిలాస్పదం బను తీర్థంబాడి పితృతర్పణంబులు సేసినవారికి వాజపేయఫలం బగుఁ; గిందాన కింజప్యంబు లను తీర్థంబులందుఁ జేసిన దాన జపంబు లక్షయంబు లగు; నారదతీర్థం బైన యంబాజన్మంబునందుఁ బ్రాణత్యాగంబు సేసినవారు సర్వలోకంబులం బడయుదురు; శుక్లదశమిం బుండరీకం బను తీర్థంబాడి పౌండరీక ఫలంబు వడయుదు; రందు వైతరణీస్నాతులై రుద్రునకు నమస్కరించి సర్వపాపవిముక్తు లగుదు; రెందేని దేవత లనేకసహస్రవర్షంబులు దపంబు సేసి రట్టి ఫలకీవనం బను తీర్థంబాడి యగ్నిష్టోమాతిరాత్రఫలంబులు వడయుదురు; ద్వైపాయనుం డనేకతీర్థంబులు మిశ్రీకరించుటం జేసి మిశ్రకం బనఁబరఁగిన తీర్థం బాడినవారికి సర్వతీర్థస్నానఫలం బగు; వ్యాస వనంబును మనోజవంబును మధువటియు నను తీర్థంబుల నాడిన గో సహస్రదాన ఫలంబు వడయుదురు; కౌశికీ దృషద్వతీ సంగమంబున స్నాతులై సర్వపాప విముక్తు లగుదురు; కిందత్తంబునఁ దిలప్రస్థదానంబు సేసి పితరుల ఋణంబు నీఁ గుదు; రహస్సుదిన తీర్థంబుల నాడి సూర్యలోకప్రాప్తు లగుదురు; మృగధూమంబున గంగాస్నాతులై మహాదేవు నర్చించిన మహాత్ము లశ్వమేధ ఫలంబు వడయుదురు; వామనం బను తీర్థంబాడి వామను నర్చించినవారు విష్ణులోకప్రాప్తు లగుదురు; పావనంబను తీర్థంబాడి కులంబు పవిత్రంబు సేయుదురు; శ్రీకుంజంబున సరస్వతీ స్నాతులై యగ్నిష్టోమ ఫలంబు వడయుదురు; ఋషు లెందే నుండి యాత్రాపరులై కురుక్షేత్రంబునకుం బోదు రట్టి నైమిశకుంజం బాడి ఋషితృప్తి సేయుదురు; బ్రహ్మతీర్థం బాడి వర్ణాంతరులు బ్రాహ్మణు లగుదురు; బ్రాహ్మణులు బ్రహ్మలోక ప్రాప్తు లగుదురు.