Andhra Mahabharatamu 3.2: అరణ్యపర్వము — ద్వితీయాశ్వాసము
Āndhra Mahābhāratamu 3.2
- Language
- Telugu
అరణ్యపర్వము — ద్వితీయాశ్వాసము
3.2.39
సీ. హంసచేఁ దన వినినంతకంటెను రూప | విభవాతిశయమున వెలయుదాని,
సురకన్యకలయట్టి సురుచిర శతకన్య | కాళిచేఁ బరివృతయైన దాని,
హృదయేశుఁడైన తన్నెప్పుడు వినుచున్కి | నలయ కాశ్వాసిత యైనదాని,
దమయంతిఁ జూచి కందర్పశరావిద్ధుఁ | డయ్యె నలుం; డంత నతనిఁ జూచి
ఆ. ‘యితఁ డపూర్వ మనుజుఁ డెందుండి వచ్చెనో’? | యనుచు నుదరిపడి లతాంగు లెల్ల
నాసనములు డగ్గి యప్పు డభ్యుద్గత | లైరి మనములందు హర్ష మెసఁగ.
3.2.40
వ. అంత.
3.2.41
క. దమయంతి మనోభవనిభు | నమరేంద్రుప్రతిము దినకరాభు సుధారుక్
సము వరుణసదృశు ధనదో | పము నశ్విసమాను నిషధపతిఁ జూచి నలున్.
3.2.42
క. వారిరుహనేత్ర మదన | ప్రేరితయై లజ్జ యుడిగి భీతిల్లక బృం
దారకమూర్తికి రాజకు | మారున కిట్లనియె మందమందమృదూక్తిన్.
3.2.43
వ. ‘నీవు మహానుభావుండ వెవ్వండ? విందుల కేమి కారణంబున నేకతంబ వచ్చితి? విది యత్యుగ్రశాసనుండైన మదీయ జనకుచేత సురక్షితంబగుట నెవ్వరికిఁ జొర నశక్యంబు; దీని నెవ్వరు నెఱుంగకుండ నెవ్విధంబునం జొచ్చితివి? నాకు మనోజ వేదనా వివర్ధనుండవైన నీ తెఱం గెఱింగింపు’ మనిన దానికి నలుం డిట్లనియె.
3.2.44
ఆ. ‘ఏను దేవదూత నింతి! నలుం డను | వాఁడ; నింద్రదహన వరుణ యములు
నీ స్వయంవరంబు నెమ్మితోఁ జూడంగ | నరుగుదెంచి నన్ను నబల! మున్న.
3.2.45
క. నీ యొద్దకుఁ బుత్తెంచిరి; | మాయం దొక్కరు నభీష్టమతి వరియింపం
దోయజముఖిఁ బ్రార్థింపుము; | మాయందఱకును బ్రియం బమర్పుము ప్రీతిన్.’
3.2.46
వ. అని పంచినఁ దత్ప్రసాదంబున నన్యులచేత నలక్షితుండనై వచ్చితి; నింద్రాదులకుఁ బ్రియంబు సేయు’ మనిన నవనతవదనయై దమయంతి దొల్లి హంసచేత నలుని విని వానియందు బద్ధానురాగయై నవయుచున్న యది యపు డతని నలుంగా నెఱింగి తద్వచన శ్రవణ దుఃఖాయమాన మానస యగుచు నిట్లనియె.
3.2.47
తరువోజ. ‘ఏ నేడ? నింద్రాదు లేడ? వారలకు | నెప్పుడు మ్రొక్కుదు; నేను నీ ధనమ
భూనాథ! నీ గుణంబులు హంసచేతఁ | బొలుపుగా విని మనంబున నిల్పియున్న
దాన; భవన్నిమిత్తమున ని ట్లఖిల | ధారుణినాథ సార్థంబు రావింపఁ
గా నిప్డు వలసె లోకఖ్యాతకీర్తి! | కరుణించి పతిబుద్ధిఁ గావింపు మిందు.
3.2.48
వ. నీవు దీని కొడంబడనినాఁడు రజ్జు విషాగ్ని జలంబులం బ్రాణ పరిత్యాగంబు సేసికొందు’ ననిన దానిం జూచి నలుం డిట్లనియె.
3.2.49
మత్తకోకిల. ‘భూరిసత్త్వులు సర్వలోకవిభుల్ విభూతిసమృద్ధు లి
ద్ధోరుతేజులు నిన్నుఁ గోరుచు నున్నవా రమరోత్తముల్;
వారి పాదరజంబుఁ బోలనివాని నన్ను మనుష్యు సం
సారిఁ గోరఁగఁ జన్నె? నీకుఁ బ్రసన్నులై సుర లుండఁగన్.
3.2.50
క. దేవతల కప్రియంబులు | గావించు మనుష్యు లధమగతు లగుదు రిలం;
గావున వారి కభీష్టము | గావింపుము; నన్నుఁ బ్రీతిఁ గావుము తరుణీ!’
3.2.51
వ. అనిన దమయంతి నయనాంతర్గళిత బాష్పధారాకలిత కపోలయుగళ యగుచుం బెద్దయుంబ్రొద్దు చింతించి ‘నీయభిప్రాయంబునకు నిరపాయంబైన యుపాయంబు గంటి; నింద్రాదులు నా స్వయంవరంబునకు వచ్చెదరేని వారి సన్నిధిని నిన్నువరియించెద; నట్లయిన నీకు నిర్దోషంబగు’ ననిన నలుండు లోకపాలురపాలికిం బోయి దమయంతికిం దన పలికిన విధంబును దనకు దమయంతి పలికిన విధంబును జెప్పె; నంతఁ బుణ్యతిథి నక్షత్ర శుభముహూర్తంబున దమయంతీ స్వయంవరంబు ప్రవర్తిల్లిన.
3.2.52
ఆ. ‘నలున కాని నలినదళనేత్ర వరియింప | దట్టె చూత’ మనుచు నమరవరులు
నలువురును గడంగి నలరూపమున వచ్చి | రా స్వయంవరమున కతిరయమున.
3.2.53
వ. అంత.
3.2.54
సీ. దమయంతి సితపుష్ప దామాభిశోభిత | హస్తయై చనుదెంచి యంబుజాక్షి
యమ్మహోత్సవ దర్శనాగత రాజన్య | నివహంబు నీక్షించి నెమ్మితోడ
నలువురు వేల్పులు నలుఁదొట్టి యప్పు డే | కాకారులై యున్న నందు నలుని
నేర్పరింపఁగ నేర ‘కింద్రాదులను నలు | నెఱుఁగు నుపాయ మిం కెద్ది యొక్కొ?’
ఆ. యనుచు సంశయాకులాత్మయై ‘సురలార! | నలు నెఱుంగువిధము నాకుఁ జేయుఁ
డాత్మరూపధరుల రగుఁ’ డని పరిదేవ | నంబు సేసెఁ దన మనంబులోన.
3.2.55
వ. దేవతలు దాని పరిదేవనంబు విని కరుణించి, యనిమిషలోచనంబులు నస్వేదగాత్రంబులు నొప్ప నవనీ తలంబు ముట్టక యాసన్నులై నిలిచి; రంత లోకపాలురును భూలోకంబునఁ గల రాజలోకంబు నవలోకించు చుండఁ బుణ్యశ్లోకుండయిన నలు ధర్మవిధానంబున వరియించి, దమయంతి తదీయ స్కంధంబున సుగంధి కుసుమ దామకంబు వెట్టిన.
3.2.56
క. దేవతల సాధువాదము | తో విప్రాశీరవంబుతో బహు తూర్యా
రావంబులు సెలఁగెను, బా | రావార రవంబుఁబోలె ననివార్యములై.
3.2.57
వ. ఇ ట్లపూర్వ స్వయంవర లబ్ధయైన దమయంతి నత్యంత విలాసంబుతో వివాహంబైన యా నలునకు నింద్రుండు వానియజ్ఞంబులయందు నిజరూపంబుఁజూపను, నగ్నియు వరుణుండును వాని వలచిన చోటన యగ్ని జలంబు లుత్పాదింపను, ధర్ముండు ధర్మువునంద వానిబుద్ధి వర్తిల్లను వరంబు లిచ్చి దేవలోకంబున కరుగువా రెదుర ద్వాపరంబుతో వచ్చు కలిం గని’ యెందులకుం బోయెద?’ వని యడిగిన నింద్రాదులకుఁ గలి యిట్లనియె.
3.2.58
తే. ‘అవనిలో దమయంతీ స్వయంవరంబు | విస్తరిల్లుట విని కడు వేడ్కతోడ
నేను దమయంతిచే వరియింపఁబడుదు | నని తదర్థినై యరిగెద నాసఁ జేసి.’
3.2.59
వ. అనిన నందఱు నగి‘నీ వందుల కేల పోయె? దది ముందర నిర్వృత్తంబయ్యె; నక్కోమలి యొరుల నెవ్వరి మెచ్చక నలుం డను వాని వరియించె’ ననినం గలి కరం బలిగి, ‘యన్నలునకు దమయంతికి రాజ్య విభవ పరిత్యాగంబును బరస్పర వియోగంబునుం జేసెద’ నని నిశ్చయించి, వాని నక్షరతుంగా నెఱింగి, యక్షంబులం జొచ్చి యుండ ద్వాపరుం బనిచి, నలు సేయుచున్న యశ్వమేధాది కానేక భూరి దక్షిణ మహాక్రతువులయు జపహోమ దానాది వివిధ పుణ్యకర్మంబులయుఁ గారణంబునం జొర నవసరంబుఁ గానక, యంతరం బన్వేషించుచుఁ బెద్దకాలం బుండి, యొక్కనాఁ డతండు కృతమూత్రుండయి జలోపస్పర్శనానంతరంబునం బాదశౌచంబు సేయమఱచి సంధ్యోపాసనంబు సేసిన, నుపలబ్ధావసరుం డయి కలి నలునందుఁ బ్రవేశించి, పుష్కరుం డను వాని పాలికిం బోయి త న్నెఱింగించి ‘నీవు నలునితో జూదంబాడి వాని రాజ్యంబును సర్వస్వంబును నొడిచికొ’ మ్మని చెప్పి తానును వానికి విప్రవేషంబున సహాయుండై యక్షంబులు గొని పుష్కరునితో నొక్కటం జని నలుం గాంచి ‘నీవు మాతో జూదం బాడు’ మనిన.
3.2.60
క. ద్యూతార్థము తత్కితవా | హూతుఁడనై జూద మాడకుండుట ధర్మా
పేతం బని యభిముఖుఁడై | యాతనితో నలుఁడు జూదమాడఁ గడంగెన్.
3.2.61
క. కలధనము లెల్ల నొడ్డుచు | నలయక జూదమున విజితుఁడగుచుండె ని జా
ప్తులు వారించిన నుడుగక | నలుఁడు కలిప్రేరణంబునను హతమతియై.
3.2.62
వ. ఇ ట్లనేక మాసంబులు దుర్వ్యసనాసక్తుం డయిన యన్నలుండు వివిధ వస్తువాహన నివహంబు లొడ్డి పుష్కరున కోటువడం బోయిన నెఱింగి పౌర బ్రాహ్మణ ప్రధాన వరులు దమయంతీ పురస్కృతులయి వచ్చి వారించి, కలి సమావేశపరవశుండైన యన్నలుచేతం బ్రతిహతు లయి వలుక కుండి; రంత దమయంతి చింతాక్రాంత చిత్తయై.
3.2.63
ఆ. ‘ఎంత యోటువడిన నంతియ జూదంబు | నందుఁ దగులుఁ, జలము నతిశయిల్లు,
నేమి సేయు దాన ? నిది యెగ్గునకు మూల’ | మని లతాంగి దుఃఖితాత్మ యగుచు.
3.2.64
సీ. అక్షముల్ పుష్కరునందు వశ్యంబులై | యునికియు, నలునియం దొండువిధము
లగుటయు నెఱిఁగి, నిజాధీశ్వరున కప | జయమ కా లక్షించి, సరసిజాక్షి
భర్తయనుజ్ఞ మున్ బడసి వార్ష్ణేయుఁడన్ | సారథిఁ బిలిచి ‘యీ స్యందనమున
నింద్రసేనుండను నిక్కుమారకు నింద్ర | సేన య న్కూఁతుఁ జెచ్చరను దోడు
ఆ. కొని విదర్భ కరిగి గుఱుకొని మద్బంధు | జనులయొద్దఁ బెట్టి చట్ట రమ్మ’
యంచు నెమ్మిఁ బుచ్చె నాప్తపురోహిత | మంత్రిబాంధవాభిమతము గాఁగ.
3.2.65
క. నలుఁడును ధరణీరాజ్యము | దలఁగఁగ సర్వంబు నపహృతం బైనఁ గడుం
దలరి దమయంతిఁ దోడ్కొని | వెలువడియె నశేషరాజ్యవిభవచ్యుతుఁడై.
3.2.66
తే. పురమువెలి మూఁ డహోరాత్రములు వసించి | యున్న నలుపాలి కెవ్వరు నోడి రరుగ
జనవిభుం డైన పుష్కరుశాసనమునఁ | గలికృత ద్యూతవిద్వేష కారణమున.
3.2.67
వ. ఇట్లు సర్వజన సత్కారార్హుం డయ్యును నలుండు విధికృతంబున నెవ్విరివలనను సత్కారంబు గానక జలంబు లాహారంబుగాఁ దత్పురసమీపంబున దమయంతీ ద్వితీయుండై యుండి, బుభుక్షాపీడ సహింప నోపక, ‘హిరణ్యపక్షంబులతోఁ దమముందటఁ దిరుగుచున్న పక్షులం గని యవి భక్ష్యంబు లగు నని యప్పక్షులం బట్టికొన సమకట్టి తనకట్టిన పుట్టంబు వానిపై వైచిన, నవి పుట్టంబుతోన గగనంబున కెగసి నగుచు విగతవస్త్రుండైన నలున కి ట్లనియె.
3.2.128
వ. నన్ను రక్షించిన నీకుం బ్రియంబు సేయ నోపుదు’ ననిన వాని నెత్తికొని పోవం జులుక నై యంగుష్ఠ ప్రమాణ దేహుండైయున్న నెత్తికొని, నలుం డతిత్వరితగతి నరిగి తాపవర్జితంబైన యొక్క సరోవర సమీపంబున విడువం బోయిన ‘నింకను బదియడుగు లరుగుము నీకు శ్రేయఃప్రాప్తిఁ జేసెద ననిన నడుగు లెన్నికొనుచు నరిగి పదియగు నడుగునప్పు డప్పాముచేత దష్టుండై తనరూపంబు విడిచి వికృతరూపంబుతో నున్న నన్నలునకుం గర్కోటకుం డాత్మరూపంబు సూపి యిట్లనియె ‘నయ్యా! నీవు నా చేత విషపీడితుండ నైతి నని దుఃఖింపవలదు; ని న్నొరు లెఱింగిన నెగ్గగుం గావున వికృతశరీరుం జేసితి; నెంతకాలంబు నీ శరీరంబున నా విషం బుండు నంతకాలంబును నీకు విషోరగ రాక్షస పిశాచ శత్రునివహంబువలని భయంబు లేదు; సర్వ సంగ్రామజయంబును భార్యాసంగమంబును నెప్పటిరాజ్యవిభవంబును నగు; నీ కెప్పుడేని నిజరూపంబు సేకొన నిష్టం బయ్యె నప్పుడ నన్నుం దలంపు; మీ వస్త్రంబు నీయొద్దకు వచ్చు; దీని ధరియించుడు నిజరూప ప్రాప్తి యగు’ నని వరం బిచ్చి వెండియు నిట్లనియె.
3.2.129
మధ్యాక్కర. ‘ఇలఁ బ్రసిద్ధుఁడు ఋతుపర్ణుఁ డనెడు మహీశుఁ డిక్ష్వాకు
కులజుండు నీకు సేవ్యుం డగు; నతనిఁ గొలిచి యం దుండు;
నెలకొని యతనికి నశ్వహృదయ మనెడి విద్య యిచ్చి,
వెలయ నతనిచేత నక్షహృదయ మ న్విద్యఁ జేకొనుము.
3.2.130
వ. మఱియు బాహుకుం డను నామంబుతో సూతవృత్తి నుండు’ మని హితోపదేశంబు సేసి కర్కోటకుం డదృశ్యుం డైనఁ, దద్వచనంబున నలుం డయోధ్యాపురంబునకుం జని ఋతుపర్ణుం గని ‘యేను బాహుకుం డనువాఁడ నశ్వశిక్షయందుఁగుశలుండ; నన్నసంస్కారంబులు శిల్పంబులుఁబెక్కువిధంబులరచియింప నేర్తు; భవత్సేవార్థినై వచ్చితి’ ననిన ఋతుపర్ణుం డిట్లనియె.
3.2.131
క. ‘నాయొద్ద నుండుదేని మ | దీయ రథాశ్వములకును ద్రుతిని శీఘ్రముగాఁ
జేయుము’ నావుడు ‘నట్టుల | చేయుదు’ నని నలుఁడు వాని సేవించెఁ దగన్.
3.2.132
వ. ఇట్లు ఋతుపర్ణునొద్దనశ్వాధ్యక్షుండయి దుష్టాశ్వంబుల వశంబుఁజేయుచు, నశ్వారోహకుల నారోహణంబుల శిక్షించుచు, రసవంతంబుగ నన్నసంస్కారంబు సేయుచు, ఋతుపర్ణుచేత నియుక్తు లయిన వార్ష్ణేయ జీవలులు దనకు సహాయులుగాఁ బ్రచ్ఛన్నుండై యుండి యొక్కనాఁడు.
3.2.133
సీ. ‘ఇభరాజగమన! నీ వెందుల కరిగి? త | త్యురుకుచభార! యెందున్నదాన?
వబల! యెవ్వరిచేత నడవులలోఁ బట్టు | వడి? తశనాపేక్షఁ బఱచుచున్న
యుగ్రమృగంబుల యుదరంబులో నున్న | దానవే? నీ తల్లిదండ్రులొద్ద
ధృతి నున్న దానవే? దేశాంతరంబుల | నున్న దానవె?’ యంచు నుదితమదన
ఆ. హతి విమోహితాత్ముఁడై హృదయేశ్వరిఁ | దలఁచి రాత్రు లెల్లఁ దాపమునను
నిద్రలేక వంది నిట్టూర్పు లూర్చుచు | నుండె నలుఁడు శోక ముత్కటముగ.
3.2.134
వ. అతని ప్రలాపంబు విని యొక్కనాఁడు జీవలుం డాత్మగతంబున.
3.2.135
క. ‘అఱపొఱడు కుఱుచ చేతులు, | నొఱవ శరీరంబుఁ గలిగి యొరులకుఁ జూడం
గొఱగా కుండియు, మన్మథు | నొఱపులఁ బడియెడు నితండు యువతీప్రియుఁడై.
3.2.136
వ. వీనిచేతఁదలంపంబడియెడు వనిత వీనికంటె లెస్స కాకున్నె!’ యనుచు బాహుకునొద్దకు వచ్చి ‘నీ తలంచుచున్న భార్యకు, నీకు నేల వియోగం బయ్యె?’ నని యడిగిన వానికి బాహుకుం డిట్లనియె.
3.2.137
ఆ. ‘నన్నుఁ జూచి నగరె? నలినాక్షి నా కేల? | విప్రయోగ మేల? వినవె తొల్లి
యేలయో యెఱుంగ నేను, మందప్రజ్ఞుఁ | డను భటుండు దన లతాంగిఁ బాసి.
3.2.138
వ. దాని నన్వేషించి యెందునుం గానక దుఃఖితుండై ప్రలాపించినం దత్ప్రలాపం బేను ననుకరించితి’ నని చెప్పి యి ట్లయోధ్యాపురంబునఁ బ్రచ్ఛన్నుండై బాహుక నామంబుతో నలుం డుండె; నంత నిట విదర్భేశ్వరుండు నలురాజ్యభ్రంశంబు విని కూఁతురు నల్లుండు నెట వోయిరో? యెందున్నవారో? యని శోకించి.
3.2.139
క. వారల రోయఁగఁ బంచె న | పారబలుం డిష్టులైన బ్రాహ్మణుల సదా
చారుల విద్వాంసుల స | త్కారంబులఁ దనిపి వారిఁ గడు నెయ్యమునన్.
3.2.140
వ. మఱియు నలదమయంతు లున్నచో టెఱింగి వచ్చిన వారికి వెయ్యేసి గద్యాణంబు లిత్తు ననియు, వారలం దోడ్కొని వచ్చినవారికి గోసహస్రంబులు నగ్రహారంబులు నిత్తు ననియుఁ బలికి పంచిన.
3.2.141
క. జగతీచక్రమునం గల | నగర మహాగ్రామ పట్టణంబులు కలయన్
జగతీదేవోత్తము లి | మ్ముగ రోసిరి నిఖిల దేశముల కరిగి వడిన్.
3.2.142
వ. అందు సుదేవుం డను బ్రాహ్మణుండు చేదిపతియైన సుబాహుపురంబునకుం జని పుణ్యాహంబు సేయింపం బోవు బ్రాహ్మణులతో రాజగృహంబు సొచ్చి; యంతఃపురంబున సునందా సహితయై యున్నదాని ధూమజాల నిబద్ధం బైన యగ్నిప్రభయునుం బోలె నీలాభ్రసంవృతం బైన చంద్రరేఖయుంబోలె బహుపంకనిమగ్నం బైన మృణాళియుంబోలె నేర్పడ కున్ననుం దదీయ భ్రూయుగ మధ్యగతంబైన సూక్ష్మలక్షణం బిమ్ముగా నిరీక్షించి, దాని దమయంతిఁగా నెఱింగి, యాత్మగతంబున ‘నిది పతి విముక్తయై శుష్కప్రవాహ యైన నదియునుంబోలె శూన్యకమలయైన నళినియుం బోలె నపేతచూతంబైన వనభూమియుం బోలె నొప్పకుండియుఁ దన పతివ్రతాగుణంబునం జేసి యొప్పుచున్నయది.
3.2.143
తే. అనపహార్యంబు తేజోమయంబు సర్వ | గుణములకు నలంకారంబు గురుతరంబు
భామలకుఁ బతిభక్తియ పరమ మైన | భూషణం; బిట్టివే పెఱ భూషణములు?
3.2.144
వ. రోహిణికిఁ జంద్రసమాగమంబునుంబోలె దీనికి భర్తృసమాగమం బెన్నం డయ్యెడునో? తుల్యశీల వయోరూపాభిజాత్యులైన నలదమయంతు లొక్కట నుండం జూచి విదర్భేశ్వరుం డెన్నఁడు కృతార్థుం డయ్యెడునో?’ యంచు నల్లనల్లన డాయవచ్చి దమయంతి కిట్లనియె.
3.2.145
తే. ‘అవ్వ! నీ తల్లిదండ్రుల కాత్మజులకు | బంధుజనులకుఁ గుశలంబు; భామ! నీదు
కుశల మెఱుఁగునంతకు వంతగూరి వగుచు | చున్నవారు; వారికి వంత యుడుగు నింక.
3.2.146
వ. దేవీ! యేను భవద్భ్రాతృసఖుండ; సుదేవుండను బ్రాహ్మణుండ; విదర్భేశ్వరుండు నీ యున్నచో టెఱుంగం బెక్కండ్రు బ్రాహ్మణులం బుచ్చిన నిందులకు వచ్చి నా పుణ్యంబున నిన్నుం గంటి’ ననిన దమయంతి వాని నెఱింగి తన పుత్త్రులఁ దల్లిదండ్రుల బాంధవులం బ్రత్యేకంబ యడిగి, యశ్రుజలంబు లురల నేడ్చుచున్నం జూచి ‘యేలకో యిప్పుడు సైరంధ్రి యేడ్చుచున్నయది’ యని సునంద తన జననికిం జెప్పి పుచ్చిన.
3.2.147
క. చనుదెంచె నంతిపురమున | వనితానివహంబుతోడ వారిజదళలో
చన రాజమాత నృపనం | దన యగు దమయంతికడకుఁ దద్దయు వేడ్కన్.
3.2.148
వ. ఇట్లు వచ్చి తమలో మాటలాడుచున్న బ్రాహ్మణుని దమయంతిం జూచి రాజమాత బ్రాహ్మణున కిట్లనియె; ‘నయ్యా! ఇది యెవ్వని కూఁతు? రెవ్వని భార్య? యేమి కారణంబునం దనభర్తను బాంధవులనుం బాసి పుణ్యవ్రతంబులు సలుపుచున్నయది? నీ వె ట్లెఱింగి? తిక్కోమలి నామం బేమి?’ యని యడిగిన సుదేవుం డిట్లనియె.
3.2.149
మధ్యాక్కర. ‘నలినాక్షి! యిది విదర్భేశుతనయ, పుణ్యశ్లోకుఁ డైన
నలుదేవి దమయంతి సుమ్ము; విధి కారణమ్మున రాజ్య
చలితుఁడై నిజనాథుఁ డరిగినం దోన చనియె; నవ్వార్త
వెలయంగ విని వీరి రోయఁబంచె భూవిభుఁడు బ్రాహ్మణుల.
3.2.150
వ. ఏ నిందులకు వచ్చి, మీచేత సురక్షితయై యున్న యిక్కోమలిం జూచి, దీని భ్రూమధ్యంబునం బద్మప్రభంబై విభూత్యర్థంబుగా విధాతృనిర్మితం బైన పుణ్యలక్ష్మంబు పాంసుపటలచ్ఛన్నం బై యున్న నుపలక్షించి మారాజు పుత్త్రింగా నెఱింగితి’ ననిన సునంద శుద్ధోదకంబుల దాని భ్రూమధ్యంబు గడిగిన నది విస్పష్టంబగుడు నందఱు నాశ్చర్యం బంది; రంత.
3.2.151
సీ. ఆనందభరితాత్మయై రాజమాత య | క్కమలాక్షిఁ బ్రీతితోఁ గౌఁగిలించి
కొని, ‘తల్లి! నీవు నా కూతుర; వేను నీ | జననియుఁ బేర్మి దశార్ణరాజ
తనయల; మదియు విదర్భేశు సతి యయ్యె; | నే వీరబాహున కింతి నైతి’
ననిన నయ్యవ్వకు నతివినయంబుతో | నలుదేవి మ్రొక్కి, సునంద నెత్తి
ఆ. కొని, కరంబు నెమ్మిఁ గొన్నిదినంబు లం | దుండి యిట్టు లనియె నొక్కనాఁడు
‘దేవి! యిదియు నదియు ధృతి నాకుఁ బుట్టిన | యిండ్లు; కడుసుఖంబ యిందు నందు.
3.2.152
వ. అయినను దల్లిదండ్రుల ననుజుల నాత్మజులం జూడ వేడుక యైనది; విదర్భకుం బోయెద; నానతి’ మ్మని కృతాంజలి యైన దమయంతి నతిస్నేహంబున సుబాహుజనని సుతప్రేషితబలంబుతో సువర్ణమణిమయ విమానోపమానయానంబున నునిచి పుచ్చిన.
3.2.179
క. నలుఁ దొల్లి యాక్రమించిన | కలి గర్కోటకవిషంబు గ్రక్కుచు నొడలన్
వెలువడి, నలునకు విహితాం | జలియై త న్నెఱుఁగఁ జెప్పెఁ జంచలుఁ డగుచున్.
3.2.180
ఆ. వానిఁ జూచి నలుఁడు దా నల్గి శాప మీ | నున్నఁ, గలి యెఱింగి ‘నిన్నుఁ బొంది
యహివిషంబుచేత ననిశంబు దగ్ధుండ | నైతి; నింక నాకు నలుగ వలదు.’
3.2.181
వ. ‘నిన్నును నీ చెలువను గీర్తించిన జనంబులు నావలని భయంబు బొరయరు; నాకుం గరుణింపు’ మనిన నలుండు గోపం బుడిగెఁ; గలియు నవ్విభీతకవృక్షంబు నాశ్రయించె; నది మొదలుగా విభీతకం బప్రశస్తం బయ్యె; నట్లు నలుండు వికృత రూప మాత్రంబు దక్కఁ దక్కిన దుష్కృతంబులవలన విముక్తుండై రథం బెక్కి యతివేగంబున ఋతుపర్ణ వార్ష్ణేయ సహితుండై విదర్భకుం జనియె; నంత సాయాహ్నంబున.
3.2.182
క. మానుగ ఋతుపర్ణుఁడు భీ | మానుజ్ఞాతుఁడయి చొచ్చె నా ప్రోలు రథ
ధ్వానంబు మ్రోయుచుండఁగ | నానాదిఙ్ముఖములను ఘనధ్వనివోలెన్.
3.2.183
సీ. దమయంతి యా రథధ్వని విని, యిది నలు | రథఘోష మని యనురాగ మొంది,
‘నలు నిషధేశుఁ బుణ్యశ్లోకు లోకోప | కారకుఁ జూడంగఁ గాంతు నేఁడు;
ఘనభుజుఁ జూడంగఁ గాననినాఁడుఁ ద | ద్భుజ పరిరంభణోద్భూత సుఖముఁ
బడయని నాఁడును బ్రాణముల్ విడుతు నే’ | నని తలంచుచుఁ గమలాయతాక్షి
ఆ. యా రథాధిరూఢుఁడై వచ్చు ఋతుపర్ణుఁ | జూచి యప్పు డధికశోకతప్త
యగుచు నుండె; నంత నా ఋతుపర్ణుండు | భీముఁ గాన వచ్చెఁ బ్రియముతోడ.
3.2.184
వ. భీముండును వానిం బూజించి యొక్క రమ్యహర్మ్యంబున విడియించిన, ఋతుపర్ణుం డప్పురంబున స్వయంవరం బను శబ్దంబు మొదలుగా వినం గానక యాత్మగతంబున.
3.2.185
క. ‘ధరణిఁ గల రాజు లిట యె | వ్వరు వచ్చినవారు లేరు; వైదర్భి యొరున్
వరియించు నంత ధర్మే | తరచరితయె?’ యనుచు నుండెఁ దద్దయు లజ్జన్.
3.2.186
వ. బాహుకుండును రథశాల రథాశ్వంబుల బంధించి రథసమీపంబున విశ్రమించియుండె; నంత దమయంతి బాహుక వార్ష్ణేయులతోడ వచ్చిన ఋతుపర్ణుం జూచి విఫలమనోరథయై, యుండనోపక, కేశిని యను దానిం బిలిచి’ ‘ఋతుపర్ణు నయోధ్యాపతింగా వార్ష్ణేయు సూతపుత్త్రుంగా నెఱింగితి; బాహుకుం డను వాఁ డెవ్వండో? వానియందు నా హృదయంబు ముదితం బగుచున్నయది; మన పర్ణాదునకుఁ బ్రతివచనం బిచ్చినవాఁడు వాఁడ కావలయు; వానికడకుం బోయి యెఱింగి ర’ మ్మని పంచిన, నదియును బోయి బాహుకుం, గని ‘దమయంతి నీ కుశలం బడుగఁ బుత్తెంచె; నిందుల కేమి కారణంబున వచ్చి?’ తనిన దానికి బాహుకుం డిట్లనియె.
3.2.187
క. ‘ప్రియమున దమయంతి పున | స్స్వయంవరము సేయఁ గడఁగి సకలక్షత్త్రా
న్వయవీరుల రావించిన | నయనిధి ఋతుపర్ణుఁ డొక్కనాఁటన వేడ్కన్.
3.2.188
క. వినవె శతయోజనంబులు | సనుదెంచె నయోధ్యనుండి సరి నిందుల; కా
తని రథసారథినై యే | నును వచ్చితి నతనితో మనోవేగమునన్.’
3.2.189
వ. అనిన ‘మూఁడవవాఁ డెవ్వఁ?’ డని యడిగిన, నక్కేశినికి బాహుకుం డిట్లనియె.
3.2.190
క. ‘నలు రథచోదకుఁ; డతఁ డ | త్యలఘుఁడు వార్ష్ణేయ నాముఁ’ డనవుడు వాఁ డ
న్నలభూపాలకు పోయిన | వల నెఱుఁగండొక్కొ!’ యనిన వాఁ డిట్లనియెన్.
3.2.191
వ. ‘వార్ష్ణేయుండును నలుపుత్త్రుల విదర్భేశ్వరునొద్దఁ బెట్టిపోయి, నడుమ నలురాజ్యభ్రంశంబు విని ఋతుపర్ణుం గొలిచి యుండె; నాతండును నలు నెఱుంగఁడు.
3.2.192
క. నలుతో నొక్కట నరిగిన | నలినాయతనేత్ర భీమనందన యొండెన్
నలుఁ డొండె నెఱుఁగుఁగా; క | న్నలు నొరులకు నెఱుఁగఁ గారణము గలదె మహిన్.’
3.2.193
వ. అనిన విని కేశిని యిట్లనియె.
3.2.194
సీ. ‘అడవిలో వస్త్రార్ధహారియై దయలేక | ప్రాణేశ్వరుఁడు దనుఁ బాసి చనిన
నాఁటి వస్త్రార్ధంబు నలినాక్షి యిప్పుడుఁ | బరిధానముగఁ బాంసుపటల మలిన
మగుచున్న తనువుతో ననయంబు జడగొన్న | యలకావలులతోడ నవనితలము
శయనంబుగా ధర్మచారిణి దమయంతి | యనఘవ్రతం బిట్టు లాచరించు
ఆ. చున్న’ దనిన నవిరళోద్గత బాష్పపూ | ర్ణంబు లైన లోచనంబు లెఱుక
వడకయుండ వదనపద్మంబు వాంచి తా | నొండువలను సూచుచుండె నలుఁడు.
3.2.195
వ. కేశినియును బాహుకు పలుకులు నాకారంబును దమయంతి కెఱింగించిన, నది యాతని నలుంగా శంకించి ‘యింకను వాని కడ కేఁగుము; వాఁడు ఋతుపర్ణు వంటలవాఁడఁటె; పచనసమయంబున వాని చరితం బిమ్ముగా నెఱింగి ర’మ్మని పంచిన నప్పుడ చని కేశినియు బాహుకునందుల దైవమానుష నిమిత్తాద్భుత క్రియలు సూచి వచ్చి దమయంతి కిట్లనియె.
3.2.196
క. ‘అతని చరితంబు సెప్పఁగ | నతిమానుష మపగతప్రయాస మదృష్ట
శ్రుతపూర్వము; పరమార్థమ | యతనిని వే ల్పనఁగవలయు నంబుజనేత్రా!
3.2.197
సీ. వినవమ్మ! తృణముష్టిఁ గొని వాఁడు వీచుడు | నం దగ్ని యుదయించి యతని వంట
లమరునంతకు నింధనము లపేక్షింపక | యుడుగక మండుచునుండు; మఱియుఁ
గడఁకతో నంజుళ్ళు గడుగంగ సమకట్టి | జల మపేక్షించుడు సంభవిల్లి
కుంభముల్ నిండి దివ్యాంభఃప్రవాహ మ | క్షయ మగుచుండుఁ దత్క్షణమ చూడ;
ఆ. నతని కరతలద్వయావమర్దితములై | కందియును మహాసుగంధకుసుమ
తతులు దొంటియట్ల తమకంపు విడువక | యుండు; నతని తేజ మున్నతంబు.’
3.2.198
వ. అనిన విని దమయంతి వెండియుఁ గేశినిం బంచి బాహుకు వండిన నంజుళ్ళు తెప్పించి యాస్వాదించి, బాహుకునందు నలు లక్షణంబులు గలుగు టెఱింగియు, నూఱడనోపక వానిపాలికిం గొడుకునుం గూఁతునుం గేశినితోడం బుచ్చిన నక్కుమారులం జూచి.
3.2.199
ఆ. వశము గాక బాష్పవారి యొల్కుచు నుండఁ | గొడుకుఁ గూఁతు నెత్తికొని నలుండు
హర్షపులకితంబు లయిన నిజాంకంబు | లందు వారి నునిచి యాదరమున.
3.2.200
వ. అక్కేశినిం జూచి ‘యిక్కుమారు లిద్దఱు నా కొడుకునుం గూఁతునుం బోలిన వీరి నెత్తికొని దుఃఖించితి’ నని తన్నేర్పడకుండం బలికి దాని కిట్లనియె.
3.2.201
క. ‘నీ విట పలుమఱు వచ్చుచుఁ | బోవుచు నున్కిఁ గని చిత్తముల నొండుగ నన్
భావింతు రితరజనములు | గావున రావలవ దింకఁ గార్యార్థినివై.
3.2.202
వ. ఏము దేశాంతరంబున నుండివచ్చిన అతిథులము; నీకు మాతోడి దేమి?’ యనినఁ గేశిని గ్రమ్మఱి వచ్చి, బాహుకు మార్గంబంతయు దమయంతికిం జెప్పిన, నది సంతసించి నిజజనని కిట్లనియె.
3.2.203
ఉ. ‘సందియ మేల? సర్వగుణసంపదఁ జూడఁగ బాహుకుండు భూ
వందితుఁడైన నైషధుఁ డవశ్యముఁ దా నగు; నా మనంబు నా
నందముఁ బొందుచున్నది ఘనంబుగ; వాఁ డిట వచ్చువాఁడొ? యే
నందుల కేఁగుదాననొ? రయంబున నాపని నిశ్చయింపుమా!’
3.2.204
వ. అనిన నది యప్పుడ భీము ననుమతంబున దమయంతియొద్దకు బాహుకు రావించిన.
3.2.205
క. చనుదెంచి యందు దీనా | నన నవిరళపంకమలిననతగాత్రఁ దప
స్విని నతికృశ దమయంతిం | గనియె నలుం డుదితబాష్పకణకలితముఖిన్.
3.2.206
క. దమయంతి నలుని వికృతాం | గముఁ జూచియు నతని నన్యుఁగా వగవక నె
య్యమునను లజ్జను నతిసం | భ్రమమున వివశాత్మ యగుచుఁ బతి కిట్లనియెన్.
3.2.207
వ. ‘విజనంబైన విపినంబునందు నలసి నిద్రవోయినదాని నబల నతిసాధ్వి ననువ్రత నగ్నిసన్నిధిఁ బాణిగ్రహణవిధి లబ్ధ యైన దానిం బాసి నలునట్లు నిర్దయులై యరిగినవా రొరు లెవ్వరు లేరు.
3.2.208
క. సురవరులఁ దొఱఁగి తన్నున్ | వరియించితి; నన్నుఁ బుత్త్రవతి నేలొకొ చె
చ్చెర విడిచె? నాతనికి ని | ష్కరుణున కే నేమి యెగ్గు గావించితినో?
3.2.209
వ. ‘నిన్ను విడువ నోడకుండు’ మని పలికిన యప్పలుకు లేల మఱచెనో?’ యని శోకతప్తంబైన తన హృదయంబు దడుపుచున్నయదియునుంబోలె బాష్పధారలం గుచమండలంబు దడుపుచునున్న దమయంతిం జూచి శోకాకులుండై నలుం డిట్లనియె.
3.2.210
తే. ‘కలిసమావిష్టమతి నయి కష్టవృత్తి | నట్టి యిడుమలఁ బడితి నే; నవి మదీయ
తపము బలమున, నీ దుఃఖదాహమునను | నష్టమై పోయెఁ; గలి యిప్డు నన్ను విడిచె.
3.2.211
వ. ఏ నిందులకు నీ తదర్థంబ వచ్చితి; నది యట్లుండె; నన్ను ననురక్తు ననువ్రతుఁ దలంపక యన్యాపేక్షంబున స్స్వయంవరంబు రచియించుట యిది కులస్త్రీధర్మంబు గాదు; రాజుల నెల్ల నీ స్వయంవరంబునకు రావించుటం జేసి కాదే ఋతుపర్ణుండు వచ్చె’ ననిన వెఱచి కృతాంజలియై దమయంతి యిట్లనియె.
3.2.212
తే. ‘నిన్ను రోయంగ విప్రులు నెమ్మి నరిగి | పలికి రెల్లచో నాచేతఁ బనుపఁబడియ;
యందుఁ బర్ణాదుఁ డను విప్రుఁ డయ్యయోధ్య | కేఁగి ప్రతివచనంబుల నెఱిఁగె నిన్ను.
3.2.213
వ. ఆ పర్ణాదువలన ని న్నెఱింగినదానినై ని న్నిట రావించునుపాయంబు దలంచి, యెల్లి దమయంతీ ద్వితీయ స్వయంవరం బగు నని ఋతుపర్ణునందుఁ బ్రకాశింప సుదేవుం డను బ్రాహ్మణుం బుత్తెంచితి.
3.2.214
క. నరవరుఁడు నలుఁడు గా కె | వ్వరు శతయోజనము లొక్కవాసరమున వ
త్తురు నరు లొరు? లని దీనిం | బరికింపఁగఁ గడఁగి యిట్ల వంచితి నధిపా!
3.2.215
ఉ. ఏ నతిపాపభావమును నెగ్గుఁ దలంపక యుండునట్లుగా
నానతవైరి! నీ యడుగు లంటఁగ నోపుదు; నట్టిదైన న
న్నీ నలినాప్తుఁ డీ యనలుఁ డీ మృగలాంఛనుఁ డీ సురోత్తముల్
జాను సెడంగ నీ క్షణమ చంపరె! కోపపరీతచిత్తులై.’
3.2.216
వ. అనుచున్న యవసరంబున నఖిలభూతాంతర్గతుం డయిన వాయుభట్టారకుం డెల్లవారలు విన నాకాశంబున నుండి నలున కిట్లనియె.
3.2.217
చ. ‘అమలచరిత్ర నిట్లు దమయంతిఁ బతివ్రతఁ బల్కుదే? నృపో
త్తమ! విను దీనియందు విదితంబగు శీలవిధిన్ సుధాంశుఁడున్
గమలహితుండు నేను నయి కాచితి మొక్కట మూఁడువర్షముల్;
గొమరుగ దీనిఁ జేకొనుము కోమలి నీ కనురక్త’ నావుడున్.
3.2.218
క. కురిసె మరుద్వచనానం | తరమున సురపుష్పవృష్టి; దడయక మ్రోసెన్
సురదుందుభి నాదంబులు; | గరము ప్రసన్నుఁడయి వీచె గంధవహుండున్.
3.2.219
వ. ఇ ట్లెల్ల వారికి నాశ్చర్యంబుగా వాయుదేవుండు దన్నెఱింగించి, దమయంతి పతివ్రతాగుణంబులును బతియందుల యకృత్రిమానురాగంబునుం జెప్పిన విని నలుండు పరమ ప్రమోద పరిపూర్ణ హృదయుండై తత్క్షణంబ కర్కోటకుం దలంచి వాని యిచ్చిన పుట్టంబు పైఁబెట్టుకొని నిజరూపంబు దాల్చిన.
3.2.220
ఉ. ఆయతబాహుఁ దప్తకనకాంచితవర్ణు మనోజరూపు నిం
ద్రాయితు సూర్యతేజు నిషధప్రభు నన్నలుఁ జూచి పద్మప
త్రాయతనేత్ర యప్డు దమయంతి గరంబు ముదంబు నొంది ల
క్ష్మీయుత యయ్యె బంధులకు మిత్త్రులకున్ హృదయప్రియంబుగన్.
3.2.221
వ. ఇట్లు సంగతులైన యయ్యిరువురకు విరహ పరితాపంబు తోడన శరీరమలినత్వంబు వాసెఁ, బర స్పరానురాగంబు తోడన విభూషణశ్రీవిశేష విలేపన యోగంబులు విస్తరిల్లె; నంత నంతయు విని భీముండు జాతసస్య యైన వసుధ తోయసంప్రాప్తి నాప్యాయిత యైన ట్లజ్ఞాతచర్యుం డైన తన పతిం బడసి పరమసంతుష్టహృదయయై చంద్రుతోఁగూడిన రోహిణియుంబోలెఁబతిం గూడి యొప్పుచున్న దమయంతిం జూచి సంతసిల్లి, తన పురంబునం దష్టశోభనంబులు దేవగృహంబులయందు విశేషపూజలు సేయించె; నట్టి మహోత్సవం బెఱింగి ఋతుపర్ణుండు నలునొద్దకు వచ్చి ‘నీవు నిఖిలలోక పూజ్యుండ వయ్యును నాయొద్ద బాహుకుం డనంగాఁ బ్రచ్ఛన్న వృత్తి నున్న నిన్ను నెఱుంగక నీచకర్మంబులయందు నియోగించితి; దీని క్షమియించునది’ యని నలుచేత సత్కృతుండై యశ్వహృదయోపదేశంబు గొని యయోధ్యకుం జనియె; నిట నలుండును విదర్భాపురంబున నొక్కమాసంబు నివాసంబు సేసి, విదర్భేశ్వరు వీడ్కొని దమయంతి నంద పెట్టి, యొక్క రథంబును బదియా ఱేనుంగులును, నేఁబది గుఱ్ఱంబులు, నాఱునూఱు కాల్బలంబులుఁ దనకుఁ దోడుగా నిషధపురంబున కరిగి, పుష్కరుం గని యిట్లనియె.
3.2.222
క. ‘దమయంతి రోయిగా జూ | దము నీతో నాడఁ గడఁగెదను, ధరణీరా
జ్యము నీవు నాకు రోయిడు, | మమరఁగ జూదంబు నీకు నభిమతమేనిన్.
3.2.223
మత్తకోకిల. వీరభోజ్యము సుమ్ము రాజ్యము వింటె? నీవును నేను దు
ర్వారవృత్తి రథంబు లెక్కి యవంధ్యవిక్రమ మేర్పడన్
భూరివీరరణం బొనర్తము; పోర నోర్చినవాఁడ యి
ద్ధారుణీతలరాజ్యసంపదఁ దాల్చు వీరగుణోన్నతిన్.
3.2.224
వ. ఈ రెంటిలో నీ కెయ్యది యిష్టంబు దానిన కడంగు’ మనినం, బుష్కరుండు రణంబునందుఁ బరాజితుండు గావున నలుం దొల్లియు జూదంబున నొడిచిన వాఁడై, యింకను నొడిచి దమయంతిం జేకొని కృతార్థుండ నగుదు నని సంతసిల్లి, ‘యేనోటు వడితినేని నఖిలమహీరాజ్యంబు నీయది; నీ వోటువడితేని దమయంతి నాయది’ యని పలికి యొడ్డి నలుతో జూద మాడి యోటువడిన.
3.2.225
క. ఘనముగ జంబూద్వీపం | బునఁ గలవా రెల్ల నెఱుఁగఁ బుష్కరుచేతం
గొనియెఁ బునర్ద్యూతంబున | ననఘుఁడు నలుఁ డఖిలరాజ్య మత్యున్నతితోన్.
3.2.226
వ. ఇట్లు జూదంబునఁ బుష్కరు నోడించి సకల మహీరాజ్యంబును జేకొని నలుండు వాని కిట్లనియె.
3.2.227
క. ‘కలిసంప్రాప్తుఁడనై కడు | బలమఱి నీ చేతఁ దొల్లి బలవద్ద్యూత
చ్ఛలజితుఁడ నైతి; నది నీ | బల మని గర్వింప వలదు బలవంతుఁడవై.
3.2.228
వ. నీవు నా పితృవ్యపుత్త్రుండవు; ని న్నెద్దియుం జేయనోపఁ బొ’ మ్మని పుష్కరుని విడిచిపుచ్చి పుష్కలంబయిన రాజ్యంబుతో నలుం డున్నంత.
3.2.229
క. భీమ ప్రస్థాపిత యయి | కోమలి దమయంతి పుత్త్రకులుఁ దానును ల
క్ష్మీ మహిమ వెలుఁగుచుండఁగఁ | దామరసదళాక్షి వచ్చెఁ దనపతికడకున్.
3.2.230
వ. అట్లు తన మనోవల్లభయైన దమయంతింగూడి నలుండు విధివిహితానేకాచరితమఖుండైశతమఖు విలాసంబుతో సకలరత్నయుతంబైన రత్నగర్భాధిరాజ్యంబు సేసెఁ; గావున నక్షజితుండు నైతి నని వగవవలదు; నీవును దైవమానుషసంపన్నుండ వయి శత్రువుల జయించి సకలమహీసామ్రాజ్యంబు వడయుదు’ వని బృహదశ్వుండు ధర్మరాజునకు నక్షహృదయం బుపదేశించి.
3.2.231
సీ. ఇన్నలోపాఖ్యాన మెప్పుడు దత్తావ | ధానులై వినువారుఁ దవిలి సభలఁ
జదివెడువారును జగతీశ! కలిదోష | నిర్ముక్తు లగుదురు; నిఖిలపుణ్య
ఫలభాగు లగుదురు; బహుపుత్త్రపౌత్త్రాయు | రారోగ్యధనయుక్తు లగుదు; రెల్ల
విషములకును దుష్టవిషయమ్ములకు దూరు | లగుదురు; ధర్మాత్ము లగుదు; రుర్వి
ఆ. గడుఁ బ్రసిద్ధ మిదియుఁ; గర్కోటకుని, దమ | యంతిఁ, బుణ్యమూర్తియైన నలుని
ఋజుచరిత్రుఁ డైన ఋతుపర్ణుఁ గీర్తింపఁ | గలిభయంబు లెల్లఁ గ్రాఁగు నధిప!
3.2.232
వ. అని చెప్పి బృహదశ్వుం డరిగినం; బాండవులు గాండీవిరాకయ కోరుచుఁ దదాలోకనప్రీతి నుండునంత నంతరిక్షం బెల్లఁ దనతేజంబున వెలుంగుచుండ నారదుండు వచ్చి యనుజసహితుండైన ధర్మరాజుచేతం బూజితుండై యిట్లనియె.
3.2.233
ఆ. ‘ధర్మపుత్త్ర! నీ యుదారచరిత్రకు | ధర్మమతికిఁ దృప్తతముఁడ నైతి;
నడుగు మిష్ట మెద్ది?’ యనినఁ గృతాంజలి | యై మహీశుఁ డిట్టు లనియె భక్తి.
3.2.234
వ. ‘మునీంద్రా! నీవు తృప్తుండవైనం ద్రిజగంబులకుం దృప్తియగు; నిన్నుం జూచి కృతార్థుండ నైతి; నా కెప్పుడు నొక్క ధర్మసందేహంబు గలదు; దాని నిర్ణయించి యానతీయవలయు.
3.2.235
చ. ధరణిఁ బ్రదక్షిణంబుగ ముదంబునఁ గ్రుమ్మఱి తీర్థసేవనా
పరు లగుచున్న ధన్యులు శుభస్థితి నెట్టి ఫలంబు నొందఁ గాం
తురు బహుతీర్థకీర్తనముతో నెఱిఁగింపుము దీని’ నావుడున్
నరవరుఁ డైన పార్థునకు నారదుఁ డిట్లని చెప్పెఁ బ్రీతితోన్.
3.2.236
క. ధీరుఁడు భీష్ముఁడు గంగా | ద్వారమునం దొల్లి పితృహితమ్ముగ శుభక
ర్మారంభుఁ డగుచు నుండె ను | దారుం డధ్యయన సంతతవ్రతపరుఁడై.
3.2.237
వ. అతని పితృదేవతాభక్తికిఁ బరమధర్మచరితంబునకు మెచ్చి తద్దర్శనాపేక్షం బులస్త్యుండను మహాముని వచ్చిన నతిభక్తుండయి యా భీష్ముం డమ్మునిఁ గుశపీఠంబున నునిచి యర్ఘ్యపాద్యాదివిధులం బూజించి యతని యడుగులు తల నిడుకొని దక్షిణజానుస్పృష్ట మహీతలుండయి’ యేను భీష్ముండ భవద్దాసుండ’ నని ముకుళిత హస్తుం డయి యున్న వానికిఁ బులస్త్యుం డిట్లనియె.
3.2.238
క. ‘పితృదేవభక్తిఁ బుణ్య | వ్రతచర్యను నీవ యెల్లవారికి నత్యు
న్నతుఁడవు గావున నీచే | ధృతిఁ గానఁగఁబడితి నేఁ బ్రతీపకులేశా!
3.2.239
వ. నీ యిష్టంబు సెప్పు; మే నమోఘదర్శనుండ’ ననిన భీష్ముండు ముదితహృదయుండై ‘మునీంద్రా! నాయందు నీకుఁ బ్రసాదబుద్ధి గలదేనిఁ జెప్పు’ మని.
3.2.240
క. ‘మనుజేంద్ర! నన్ను నీ యడి | గిన యట్ల పులస్త్యుఁ బుణ్యకీర్తను గంగా
తనయుం డడిగిన నతనికి | ననఘచరిత్రునకు నిట్టు లని ముని సెప్పెన్.
3.2.241
సీ. కడఁగి బుద్ధీంద్రియ కర్మేంద్రియంబుల | యందు సంయతచిత్తు లైనవారు
ధృతి నహంకారప్రతిగ్రహాపేక్షల | యందు నివృత్తాత్ము లైనవారు
నల్పభోజనులు ననారంభకులు నయ్యు | నత్యంతసంతోషు లైనవారు
సత్యవ్రతులు శుభాచారు లక్రోధను | లగుచు ధర్మాన్వితు లైనవారు
ఆ. నఖిలతీర్థశతము లాడిన ఫలములు | నఖిలయజ్ఞవిధుల నైన ఫలముఁ
బడయుదురు విహీనభాగ్యదుష్కృతులకుఁ | బరమతీర్థసేవఁ బడయ నగునె?
3.2.242
క. తిల గో సువర్ణ దానం | బులు నుపవాసములుఁ దీర్థముల సేవయు ని
మ్ములఁ జేయనివారు దరి | ద్రులు రోగులు నగుదు రాత్మదోషము పేర్మిన్.
3.2.243
క. క్రతుఫలములు వడయఁగ దు | ర్గతులకు దొరకొనదు తీర్థగమనంబునఁ ద
త్క్రతుఫలము లందుదురు దు | ర్గతులును నిది మునులమతము కౌరవవృషభా!
3.2.244
వ. తీర్థగమనఫలం బెల్లపుణ్యంబులకు విశేషంబు; దీని వినుము.
3.2.245
చ. నమితవిరోధి! పుష్కర మనంగ జగద్విదితంబు పుణ్య తీ
ర్థము మునిసిద్ధసేవ్యము; ముదంబున నందుఁ బయోజసంభవుం
డమరులతోడ సన్నిహితుఁడై వసియించుఁ; ద్రిపుష్కరంబులున్
సమములు; వాని నెప్పుడును సంస్మృతి సేసినఁ బాయుఁ బాపముల్.
3.2.246
క. పదివేలకోట్లతీర్థము | లుదితములై పుష్కరముల నుండు మునీంద్ర
త్రిదశవరు లందుఁ జేసిరి | మదిఁ గృతకృత్యు లయి తపము మఖములుఁ బ్రీతిన్.
3.2.247
వ. అందుఁ గృతస్నానులై దేవర్షిపితృతర్పణంబులు సేసినవారు దశాశ్వమేధఫలంబులు వడయుదురు; కార్తిక మాసంబున నొక్కదివసంబు పుష్కరసేవ సేయుటయు నొకయేఁ డగ్నిహోత్రంబు వేల్చుటయు సమంబు.
3.2.248
క. అమరవరులందుఁ ఋరుషో | త్తముఁ డెట్లు విశేషుఁ డట్లు ధరణిం గల తీ
ర్థములందుఁ బుష్కరత్రిత | యము గరము విశేష మభిమతార్థప్రదమై.
3.2.249
వ. పుష్కరంబునఁ బదియేండ్లు వసియించినవారికి సర్వక్రతుఫలంబును బ్రహ్మలోకప్రాప్తియు నగు; మఱియు జంబూమార్గంబు దండులికాశ్రమంబున నగస్త్యవటంబను తీర్థంబు లాడి యశ్వమేధఫలంబు వడయుదురు; కణ్వాశ్రమంబును ధర్మారణ్యంబును యయాతి పతనంబునుం జూచిన సర్వపాపక్షయంబగు; మహాకాళంబును గోటితీర్థంబును నశ్వమేధ ఫలప్రదంబులు; భద్రవటంబను రుద్రస్థానంబున రుద్రుం బూజసేసి గణపతిత్వంబు వడయుదురు; నర్మదాస్నానంబున దక్షిణసింధుస్నానంబునఁ జర్మణ్వతీ తీర్థ స్నానంబున నగ్నిష్టోమ ఫలంబు లగు.
3.2.250
క. అనవద్య వసిష్ఠాశ్రమ | మున నొక దివసంబు శాకమూలాశనులై
జను లుండి పడయుదురు బహు | ధనసంపద గోసహస్రదాన ఫలంబుల్.
3.2.251
వ. మఱి పింగం బను తీర్థంబు సేవించి శతకపిలగోదానఫలంబు వడయుదు; రెందేని నగ్నిదేవుండు ప్రత్యక్షంబై యుండునట్టి ప్రభాసతీర్థం బాడి యగ్నిష్టోమాతిరాత్రఫలంబు వడయుదురు; దుర్వాసునకు విష్ణుదేవుండు వరం బిచ్చుటంజేసి వరదానం బనంబరఁగిన తీర్థం బాడియు, సరస్వతీసాగరసంగమం బాడియు గోసహస్రదాన ఫలంబు వడయుదురు.
3.2.252
క. ద్వారవతీపురమునఁ బిం | డారక మను తీర్థమును బెడంగై ముద్రా
కారంబులై త్రిశూలా | కారములై పంకజములు గానంగఁబడున్.
3.2.253
వ. అందుఁ బరమేశ్వరుం బూజించి పాపవిముక్తు లగుదురు; సాగర సింధు సంగమ స్నాతులైనవారు వరుణలోక గతు లగుదురు; శంకుకర్ణేశ్వరంబున నీశ్వరుం బూజించి దశాశ్వమేధ ఫలప్రాప్తు లగుదురు; వసుధారయును వసుసరంబు నను తీర్థంబు లాడి వసుప్రాప్తు లగుదురు; సింధూత్తమస్నానంబున బహుసువర్ణదానఫలం బగు; బ్రహ్మతుంగసేవనంబున బ్రహ్మలోకప్రాప్తి యగు; శక్రకుమారీ విలోకనంబున శక్రలోకగతి యగు; శ్రీ కుండంబునఁ బితామహునకు నమస్కరించియు, సౌవర్ణరాజితంబులైన మత్స్యంబులు గల విమలం బను తీర్థంబాడియు వాసవసాయుజ్యంబు వడయుదురు; బడబ యను తీర్థంబున నగ్నిదేవునకు నైవేద్యం బిచ్చిన నది యక్షయంబై పితృదేవతలకుఁ దృప్తిఁ జేయు, గోసహస్ర దానంబునకు నశ్వమేధ సహస్రంబునకు విశేషంబు.
3.2.254
క. దేవిక యను తీర్థంబున | దేవసమూహంబుతోడఁ ద్రినయనుఁ డుండున్;
సేవితమై జనులకు నది | గావించు ననూనధర్మకామార్థంబుల్.
3.2.255
వ. అర్ధయోజన విస్తృతంబై పంచయోజనాయామంబైన యద్దేవికానదియును, గామాఖ్యంబును, రుద్రతీర్థంబును, యజన యాజన బ్రహ్మ వాలుకంబులును, బ్రహ్మాది దేవతల దీర్ఘ సత్రస్థానంబైన దీర్ఘసత్రంబును సేవించినవారికి నిష్టసిద్ధి యగు; వినశనంబను తీర్థంబున నదృశ్యంబై మేరువునకుం బోవు నెడ నాగోద్భేద, శివోద్భేద, చమసోద్భేదంబుల నెందేని సరస్వతి గానం బడియె నట్టి సరస్వతియందు నభిషిక్తులైనవారు నాగలోకంబు వడయుదురు; శశరూప పుష్కరంబులు గల శశయానం బను తీర్థంబున స్నానంబును గోసహస్రదానంబును సమంబు.
3.2.256
మధ్యాక్కర. ఏ మేమ మున్ను పూజింపుదుము రుద్రు నిం దని వేడ్క
తో మునికోటి దారున్న, నీశుఁ డందొఱకును బ్రీతి
గా మతిలోఁ గోటిరుద్రరూపముల్ గావించె నదియు
భూమిఁ బ్రసిద్ధమై రుద్రకోటి నాఁ బొలిచి వెలింగె.
3.2.257
వ. అందు రుద్రుఁ బూజసేసి రుద్రలోకప్రాప్తు లగుదురు.
3.2.258
క. నరనుత! నైమిశమునఁ బు | ష్కరముల మూఁటను జగత్ప్రకాశితమై యి
ద్ధరణిఁ గురుక్షేత్రము దు | స్తరదురితౌఘముల కెల్ల దవ్వగుచుండున్.
3.2.259
తే. అమరలోకనివాసుల యండ్రు విబుధు | లా కురుక్షేత్రవాసుల; నదియు వినఁగ
నుత్తమంబు దృషద్వతి యుత్తరమునఁ | దపనతేజ! సరస్వతి దక్షిణమున.
3.2.260
వ. అక్కురుక్షేత్రశమంత పంచకంబుల నడుమ రామహ్రదంబు నడుమఁ బితామహు నుత్తరవేది యనంబడునట్టి కురుక్షేత్రంబు ముట్టిన వారికిఁ, గురుక్షేత్రంబునకుం బోయెద మనిన వారికిఁ, గురుక్షేత్రంబున వసియించెదమని తలంచినవారికి సర్వపాపక్షయం బగుఁ; దదనంతరంబున విష్ణుస్థానంబున విష్ణువు నర్చించిన నశ్వమేధ ఫలం బగుఁ; బారిప్లవం బను తీర్థమాడి యగ్నిష్టోమఫలంబు వడయుదురు; పృథివీతీర్థం బాడిన గోసహస్ర దానఫలం బగు; శాలూకిని యను తీర్థం బాడిన దశాశ్వమేధ ఫలం బగు; సర్పతీర్థం బాడి యందుఁ దరండకుం డను ద్వారపాలకునిం జూచినవారి కిష్టసిద్ధి యగు; నెందేని విష్ణుం డాదివరాహం బయ్యె నట్టి వరాహతీర్థం బాడినవారికి నగ్నిష్టోమ ఫలంబగు; నశ్వినీతీర్థం బాడిన రూపవంతు లగుదురు; జయంతి యందు సోమతీర్థ స్నానంబును, గృతశౌచతీర్థస్నానంబును రాజసూయ పౌండరీక సమంబు; లగ్నివటంబున, ముంజవటంబున నీశ్వరుం బూజించి గాణపత్యంబు వడయుదురు; యక్షిణీతీర్థమాడి యిష్టఫలంబులు వడయుదురు; కురుక్షేత్ర ద్వారంబుఁ బ్రదక్షిణంబు సేసినం బాపక్షయం బగు.
3.2.261
క. వీరుండు క్షత్త్రియులఁ దన | దారుణ పరశువున జామదగ్న్యుఁడు రౌద్రా
కారుఁడు వధియించి తదీ | యారుణమున నేనుమడువు లాపాదించెన్.
3.2.262
వ. అందుఁ బితృతర్పణంబు సేసినం బితృదేవత లాతనికిం బ్రత్యక్షంబయి ‘ నీ కిష్టంబైన వరంబు వేఁడు’ మనినఁ బరశురాముండు వారల కిట్లనియె.
3.2.263
తే. ‘క్షత్రవధనైన పాపంబు గ్రాఁగవలయుఁ; | గడఁగి సద్గతియును నాకుఁ బడయవలయు;
నివియుఁ బుణ్యతీర్థంబులై యిద్ధరిత్రిఁ | బరఁగుచుండంగవలయు మీ కరుణఁ జేసి.’
3.2.264
వ. అని పితృదేవతల వరంబునం బుణ్యతీర్థంబులఁ జేసె; నట్టి రామహ్రదంబు లాడినవారికి నశ్వమేధ ఫలంబగుఁ; గాయశోధనం బను తీర్థం బాడి కాయశుద్ధు లగుదు; రెందేని విష్ణుదేవుండు లోకంబుల నుద్ధరించె నట్టి లోకోద్ధారం బను తీర్థమాడి కులం బుద్ధరింతురు; శ్రీతీర్థం బాడి శ్రీమంతు లగుదురు; కపిలతీర్థం బాడి కపిల గో సహస్ర దాన ఫలంబుఁ బడయుదురు; సూర్యతీర్థం బాడి యం దుపవసించిన సూర్యలోక ప్రాప్తులగుదురు; గో భవనంబను తీర్థంబాడి గోసహస్రసమృద్ధు లగుదురు; శంఖినీ తీర్థంబాడి యుత్తమరూపంబు వడయుదురు; యక్షేంద్ర తీర్ధం బాడి తరండకుం డను ద్వారపాలకుం జూచినవారు సరస్వతీ స్నాతులైనవారు నగ్నిష్టోమఫలంబు వడయుదురు; మాతృతీర్థ దర్శనంబునం బ్రజావృద్ధి యగు; బ్రహ్మావర్తంబును, శరవణంబునుం జూచిన, సర్వవ్యాధి విముక్తు లగుదురు; శ్వావిల్లోమాపహం బను తీర్థంబునం దేకాదశతీర్థంబులు గల; వందుఁ బ్రాణాయామంబు సేసిన విప్రులకు స్వలోమాపనయనం బగు; నెఱుకుచేత నేయంబడి కృష్ణమృగంబు లెందేని నొక్కతీర్థంబు సొచ్చి మానుషత్వంబు వడసె నట్టి మానుష తీర్థం బాడి సర్వదురిత విముక్తులై దేవత్వంబు వడయుదురు; దాని తూర్పున నొక్కయిరవున నాపగ యను మహానదిం బితృతర్పణంబు సేసి పితృదేవోద్దేశంబున నొక్కబ్రాహ్మణునకుం గుడువం బెట్టినఁ గోటిబ్రాహ్మణులు గుడిచిన ఫలంబగుఁ, బితృదేవతలు దృప్తియు నొందుదురు; బ్రహ్మోదుంబరంబు సప్తర్షి కుండంబుఁ గేదారంబును జూచి బ్రహ్మలోకంబు వడయుదురు; కపిల కేదారంబుఁ జూచి పాపవిముక్తులై యదృశ్యు లగుదురు; సరకం బను తీర్థంబాడి కృష్ణచతుర్దశి నాఁ డీశ్వరుం బూజించి యెల్ల కోర్కులం బడయుదురు; మూఁడుకోట్ల కూపహ్రదంబులు గల యిలాస్పదం బను తీర్థంబాడి పితృతర్పణంబులు సేసినవారికి వాజపేయఫలం బగుఁ; గిందాన కింజప్యంబు లను తీర్థంబులందుఁ జేసిన దాన జపంబు లక్షయంబు లగు; నారదతీర్థం బైన యంబాజన్మంబునందుఁ బ్రాణత్యాగంబు సేసినవారు సర్వలోకంబులం బడయుదురు; శుక్లదశమిం బుండరీకం బను తీర్థంబాడి పౌండరీక ఫలంబు వడయుదు; రందు వైతరణీస్నాతులై రుద్రునకు నమస్కరించి సర్వపాపవిముక్తు లగుదు; రెందేని దేవత లనేకసహస్రవర్షంబులు దపంబు సేసి రట్టి ఫలకీవనం బను తీర్థంబాడి యగ్నిష్టోమాతిరాత్రఫలంబులు వడయుదురు; ద్వైపాయనుం డనేకతీర్థంబులు మిశ్రీకరించుటం జేసి మిశ్రకం బనఁబరఁగిన తీర్థం బాడినవారికి సర్వతీర్థస్నానఫలం బగు; వ్యాస వనంబును మనోజవంబును మధువటియు నను తీర్థంబుల నాడిన గో సహస్రదాన ఫలంబు వడయుదురు; కౌశికీ దృషద్వతీ సంగమంబున స్నాతులై సర్వపాప విముక్తు లగుదురు; కిందత్తంబునఁ దిలప్రస్థదానంబు సేసి పితరుల ఋణంబు నీఁ గుదు; రహస్సుదిన తీర్థంబుల నాడి సూర్యలోకప్రాప్తు లగుదురు; మృగధూమంబున గంగాస్నాతులై మహాదేవు నర్చించిన మహాత్ము లశ్వమేధ ఫలంబు వడయుదురు; వామనం బను తీర్థంబాడి వామను నర్చించినవారు విష్ణులోకప్రాప్తు లగుదురు; పావనంబను తీర్థంబాడి కులంబు పవిత్రంబు సేయుదురు; శ్రీకుంజంబున సరస్వతీ స్నాతులై యగ్నిష్టోమ ఫలంబు వడయుదురు; ఋషు లెందే నుండి యాత్రాపరులై కురుక్షేత్రంబునకుం బోదు రట్టి నైమిశకుంజం బాడి ఋషితృప్తి సేయుదురు; బ్రహ్మతీర్థం బాడి వర్ణాంతరులు బ్రాహ్మణు లగుదురు; బ్రాహ్మణులు బ్రహ్మలోక ప్రాప్తు లగుదురు.
3.2.265
సీ. అనఘుఁడు మంకణుం డను నొక్క బ్రహ్మర్షి | తన చేయి వ్రయ్యంగ దర్భఁ గొనిన
సాంద్రమై శాకరసం బందు నిర్గతం | బగుడును హర్షించి యాడుచున్నఁ
జూచి సహింపక సురలును మునులును | హరుపాలి కరిగి ‘దేవాదిదేవ!
మునినృత్త మే విధంబున నివృత్తం బగు | నట్లుగాఁ జేయవే’ యనిన హరుఁడు
ఆ. దపసిరూప మపుడు ధరియించి యమ్ముని | కడకు వచ్చి, ‘యేమి కారణమున
నాడె? దేమి విస్మయం బిందుఁ జూచితి? | చెప్ప నుచిత మేనిఁ జెప్పు’ మనిన.
3.2.266
వ. ‘నా కరంబున శాకరసంబు వెలువడిన విస్మితుండ నయి హర్షించి యాడెద’ ననిన ‘నిది యేమి విస్మయంబు; దీనిం జూడు’ మని హరుండు తన యంగుష్ఠంబున యంగుళి తాడనంబు చేసిన నందు హిమసన్నిభం బయిన భస్మంబు వెలువడినం జూచి, లజ్జితుం డయి ‘నీవు పరమేశ్వరుండ’ వని నమస్కరించి, వేదమంత్రంబుల స్తుతియించి. ‘దేవా! నీ ప్రసాదంబున నాకుఁ దపోవర్ధనంబు గావలయు’ ననిన, నమ్మునివరునకు నీశ్వరుండు గరుణించి ‘నీకుఁ దపోవర్ధన మగు; నేను నీ యాశ్రమంబున నుండుదు’ ననియె; నట్టి సప్తసారస్వతతీర్థంబు లాడినవారికి సారస్వతసిద్ధి యగు; బ్రహ్మాదిదేవతలచే నధిష్ఠితంబు లయిన యౌశనసతీర్థంబును గపాలమోచనంబు, విశ్వామిత్రంబుఁ గార్తికేయంబు ననియెడు తీర్థంబుల నాడి పాపవిముక్తు లయి బ్రహ్మలోకంబు వడయుదురు.
3.2.267
క. వేదములయందు వినఁగఁ బృ | థూదకతీర్థంబ యుత్తమోత్తమము సురేం
ద్రాది సురవరులకును వ్యా | సాది మహాయోగివరుల కాస్పద మగుటన్.
3.2.268
వ. అందు శరీరత్యాగంబు చేసినవార లపారపాపవిముక్తులై ముక్తు లగుదురు; సురకన్యా సరస్వతీ సంగమ స్నాతులైనవారు బ్రహ్మహత్యాది పాతకంబులవలనఁ బాయుదురు; దర్భినిర్మితంబైన యర్థకీల తీర్థం బాడిన శూద్రులు బ్రాహ్మణు లగుదురు, బ్రాహ్మణులు పరమసిద్ధు లగుదురు; శతంబును సహస్రంబును నను తీర్థంబు లందుఁ జేసిన జపదానోపవాసంబులు శతసహస్రగుణంబులగు; వేల్పు లెల్లం గుమారు సేనాపతింగా నెందే నభిషేకించి రట్టితైజసం బను తీర్థంబును దాని తూర్పున నుండు కురుతీర్థంబును స్వర్గద్వారం బను తీర్థంబును జూచినవారికి స్వర్గద్వారంబు వివృతం బగు; రుద్రపత్ని యను తీర్థంబున శంకరనారాయణుల నర్చించి సర్వదుఃఖ విముక్తు లగుదురు; స్వస్తిపురంబుఁ బ్రదక్షిణంబు సేసి గో సహస్ర దాన ఫలంబు వడయుదురు; గంగమడువున నొక్క కూపంబున మూఁడుకోట్ల తీర్థంబుల సన్నిహితంబులై యుండు; నందుఁ గృతస్నాను లయినవారికి సర్వతీర్థస్నానఫలం బగు; బదరీవనంబునందు వసిష్ఠాశ్రమంబునం ద్రిరాత్రంబులు బదరీఫల భక్షణంబు సేసి పాపవిముక్తు లగుదు; రేకరాత్రం బను తీర్థంబున నేకరాత్రోపవాసంబు సేసి బ్రహ్మలోకంబు వడయుదు; రాదిత్యాశ్రమం బను వనంబున నాదిత్యుం బూజించి యాదిత్యలోకగతు లగుదురు; దధీచి తీర్థంబునం గన్యాశ్రమంబునందుఁ ద్రిరాత్రంబు వసియించినవారికి స్వర్గఫలం బగు.
3.2.269
క. జలరుహసంభవుఁ డాదిగఁ | గల వేల్పులు ఋషులు సిద్ధ గరుడోరగులున్
నెలనెల సేవింతురు భూ | తలమున సన్నిహిత యనఁగఁ దగు తీర్థంబున్.
3.2.270
వ. సూర్యగ్రహణంబున దాని నాడినవారు శతాశ్వమేధ ఫలంబు వడయుదురు; ధర్ముఁడు తపంబు సేసిన ధర్మతీర్థం బాడి ధర్మశీలు రగుదురు; జ్ఞానపావనంబును సౌగంధికంబును నను తీర్థంబుల నాడినం జూచిన సర్వపాప విముక్తు లగుదురు; దేవశ్రవ యను సరస్వతీహ్రదంబునందు వల్మీకంబున వెలువడు జలధార లాడి పితృతర్పణంబు సేసిన వా రశ్వమేధ ఫలంబు వడయుదురు; సుగంధయు, శతకుంభయుఁ, బంచయక్షయుఁ, ద్రిశూల ఖాతయు నను తీర్థంబు లాడి దుర్గతులవలనం బాయుదురు; తొల్లి పార్వతి యెందేని శాకాహారిణియై దివ్యసహస్రవర్షంబులు తపంబు సేసె నట్టి శాకంభరీతీర్థం బాడి యొక్కదివసంబు శాకాహారులైనవారు పండ్రెండేండ్లు శాకాహార తపంబు సలిపినవారి ఫలంబు వడయుదురు; సువర్ణాఖ్యం బను తీర్థంబున రుద్రుం బూజించి రుద్రలోక గతు లగుదురు; ధూమావతి యను తీర్థంబును రథావర్తం బను తీర్థంబును ధార యను తీర్థంబు నాడి శోకవిముక్తు లగుదురు.
3.2.271
క. ధారుణిలోపల స్వర్గ | ద్వారం బయి ఋషినిషేవితం బగు గంగా
ద్వారం బాడిన ధన్యులఁ | జేరును శతకోటితీర్థసేవాఫలముల్.
3.2.272
వ. మఱియు సప్తగంగా సంగమంబును ద్రిగంగా సంగమంబును శక్రావర్తంబును గనస్వలంబును గంగా సరస్వతీ సంగమంబు నాదిగాఁ గల పుణ్యతీర్థంబుల నాడి పుణ్యలోకంబులు వడయుదురు; భద్రకర్ణేశ్వరంబున రుద్ర పూజయు నరుంధతీవటంబును సింధుప్రభవంబును యమునాప్రభవంబు నను పుణ్యతీర్థంబుల సేవయు సర్వసిద్ధికరంబులు; వేదిక యను తీర్థంబును ఋషికుల్య యను తీర్థంబును గృత్తికా మఘ తీర్థంబులును విద్యాతీర్థంబును వేతసిక యను తీర్థంబునుం జూచి దురితంబులవలనం దొలంగుదురు; బ్రహ్మతీర్థం బాడి పద్మవర్ణయానంబుల బ్రహ్మలోకగతు లగుదురు.
3.2.273
చ. సురుచిరకీర్తి! నైమిశముఁ జూచిన మాత్రన పాయుఁ బాప మ
చ్చెరువుగ; నందు మాసము వసించి యనంతఫలంబు లొందఁ గాం
తురు; బహుతీర్థసేవనముతోడ సమానము నైమిశంబునం
దరుదుగ నొక్కనాఁడు శుచియై యుపవాసము సేయఁ గాంచినన్.
3.2.274
వ. మఱియు గంగోద్భేద తీర్థంబు నిందీవర తీర్థంబు గంగాద్వారంబు దిశాపతి తీర్థంబు లనియెడు తీర్థంబుల నాడి వాజపేయఫలంబుఁ బడయుదురు; బాహుద యను తీర్థం బాడిన ననేకసత్రయాగఫలం బగు; నెందేని రాముండు స్వర్గగతుం డయ్యె నట్టి సరయూప్రదేశంబున గోప్రదానం బాడియు, దేవతలకు ఋషులకు యజ్ఞ భూమియయిన తీరంబులు గల గోమతి నాడియు నశ్వమేధ ఫలంబు వడయుదురు; కోటితీర్థంబునం గుమారు నర్చించియు, వారణాసియందు రుద్రు నర్చించియుఁ, గపిలాహ్రదం బాడియు రాజసూయ ఫలప్రాప్తు లగుదురు; మార్కండేయ తీర్థం బయిన గంగాగోమతీ సంగమం బాడియు బ్రహ్మకల్పితం బయిన యూపంబుఁ బ్రదక్షిణంబు సేసియు వాజపేయఫలంబు వడయుదురు.
3.2.275
సీ. పలువురఁ గొడుకులఁ బడయంగ వలయు; నం | దొక్కరుం డయినను నోపి గయకు
నరుగునో యనియును, నశ్వమేధం బొప్పఁ | జేయునో యనియును, శ్వేత మైన
యాఁబోతు విడుచునో యనియును గోరుదు | రనవద్యు లైన గృహస్థు లట్టి
గయ కేఁగి యుభయ పక్షములు వసించిఁ | గడుఁ బుణ్యు లుభయపక్షములవారి
ఆ. నుద్ధరింతు; రంద యొగిఁ బిండ మిడిన వా | రనఘ! పితృదయను గృతార్థు లగుదు;
రందు ఫల్గుతీర్థ మాడినవారికిఁ | బరమసిద్ధితో శుభంబు పెరుఁగు.
3.2.276
వ. మఱి యక్షిణీతీర్థంబునందు జలపానంబు సేసి బ్రహ్మహత్యాది దోష విముక్తు లగుదురు; మణినాగం బను తీర్థం బాడినవారికి నాశీవిషవిషంబు లొందవు; గౌతమవనంబునం దహల్యాహ్రదం బాడి యుదపానం బను తీర్థం బాడియు నశ్వమేధ ఫలంబుఁ బడయుదురు; రాజర్షి జనక కూపం బాడి విష్ణులోకప్రాప్తు లగుదురు; కంపనయు మహానదియు నను తీర్థంబుల నాడినవారు పౌండరీక ఫలంబు నొందుదురు; దేవపుష్కరిణిని మహేశ్వరధారను మహేశ్వరపదంబున నాడిన నశ్వమేధఫలంబు వడయుదురు; తొల్లి కూర్మరూపుం డయిన యసురచేతం గోటితీర్థంబు లపహృతంబు లయిన వానిఁ దెచ్చి, విష్ణుఁ డెందేని నిలిపె నట్టి మహేశ్వరపథం బను తీర్థంబాడియు, విష్ణుస్థానం బయిన సాలగ్రామం బను తీర్థంబాడి విష్ణు నర్చించియు, నందు సన్నిహిత చతుస్సముద్రం బయిన కూపంబు నాడియు విష్ణులోకగతు లగుదురు; భరతాశ్రమంబునఁ, జంపకారణ్యంబున దేవీసహితు నీశ్వరుం బూజించి మిత్రావరుణలోకంబు వడయుదురు; కన్యాసంవేద్యం బను తీర్థంబునఁ గన్యాదానంబు చేసి యక్షయఫలప్రాప్తు లగుదురు; దేవకూటం బను తీర్థంబాడి బ్రహ్మలోకం బుఁబడయుదు; రెందేని విశ్వామిత్రుండు సిద్ధింబొందె నట్టి కౌశికహ్రదం బాడియుఁ, గుమారవీరాశ్రమంబున నొక్కమాసంబు వసించియు నశ్వమేధ ఫలంబు వడయుదు; రగ్నిధారయుఁ బితామహ సరంబునం బుట్టిన కుమార ధారయు నాడి, త్రిరాత్రోపవాసంబు సేసినవారు బ్రహ్మహత్యాది దోషవిముక్తు లగుదురు; గౌరీశిఖరకుండం బాడిన నందినీకూపం బాడిన నశ్వమేధఫలం బగుఁ; గాళికా కౌశికా సంగమంబునందుఁ ద్రిరాత్రోపవాసంబు సేసినవారు సర్వపాప విముక్తులగుదు; రూర్వశీతీర్థం బాడిన సర్వపూజార్హు లగుదురు; గోకర్ణంబను తీర్థంబాడి జాతిస్మరణంబు వడయుదురు; సరస్వతీ తీర్థస్నాతులయి వృషభ ద్వీపంబునం గుమారుఁ బూజించి దేవవిమానగతు లగుదురు; నందయు, నౌలకమును, గరతోయంబును, గంగాసాగరసంగమంబు నను తీర్థంబు లాడి శతాశ్వమేధ ఫలంబు వడయుదురు; శోణా నర్మదాప్రభవంబును, బదరీతీర్థంబును నాడి యాయుష్మంతు లగుదురు; మహేంద్రంబును రామతీర్థంబును, మతంగ కేదారమ్మును, వంశగుల్మంబు నను తీర్థంబుల నాడి యశ్వమేధఫలంబు వడయుదురు.
3.2.277
తే. పరమమైన తీర్థంబు శ్రీపర్వతంబు | నందు దేవహ్రదం బాడి యాదిదేవు
నీశు నర్చించి వడయుదు రిష్టఫలము | నశ్వమేధఫలంబును నవనిజనులు.
3.2.278
వ. తొల్లి శతక్రతుండు నూఱుక్రతువులు సేయుటంజేసి పవిత్రంబయిన కృష్ణవేణియందు దేవహ్రదం బాడిన సర్వపాపవినాశనం బగుఁ; బాండ్యపర్వతంబునం గావేరీతీర్థంబును, దుంగభద్రయు, సముద్రతీర్థంబును, గన్యాతీర్థంబును నాడి యశ్వమేధఫలంబు వడయుదురు; గాయత్రీస్థానంబునం ద్రిరాత్రంబు గాయత్రీజపంబు చేసినవారికి జన్మ దుఃఖంబులు లేవు; పెన్న యను మహానది నాడిన మయూరహంస విమానగతు లగుదురు; గోదావరీ స్నానంబు సేసిన దశాశ్వమేధ ఫలంబు వడయుదురు; పయోష్ణియు, దండకారణ్యంబును, శరభంగాశ్రమంబును, శుక్రాశ్రమంబును, జమదగ్నిసేవితంబయిన శూర్పారకంబును, సప్తగోదావరీ తీర్థంబును నాడిన పుణ్యులు పుణ్యలోకప్రాప్తు లగుదురు.
3.2.279
సీ. అసురుల భయమున నడఁగిన వేదంబు | లోంకారపూర్వమై యుండ నాంగి
రసుఁ డుద్ధరించి సారస్వత ప్రముఖులఁ | జదివించె నెందేని శాశ్వతముగ
నమరనియుక్తుఁడై యజియించె నెందేని | భృగుఁ డెల్లవారికిఁ బేర్మి నట్టి
రమణీయతుంగకారణ్యంబు సూచిన | మాత్రన దురితకర్మంబు లెల్లఁ
తే. బాయుఁ; గాలంజరం బను పర్వతంబు | నందు దేవహ్రదం బాడి యభిమతములు
వడయుదురు; మేధికంబునాఁ బరఁగు తీర్థ | మాడి మేధాసమన్వితు లగుదు రెందు.
3.2.280
వ. మఱి చిత్రకూటంబున మందాకిని సేవించి, పితృస్థానంబునం గుమారులం బూజించి, జ్యేష్ఠస్థానంబున రుద్రు నర్చించి రామనివాసం బైన శృంగిబేరపురంబున గంగాస్నాతు లయి గంగాధరు నర్చించియు సర్వపాప విముక్తు లగుదురు.
3.2.281
క. యాగశతంబులకంటెఁ బ్ర | యాగ నివాసము విశేష మని మునులు మహా
యోగులు సిద్ధులు సాధ్యులు | నాగులు నందుండుదురు మనఃప్రియ మెసఁగన్.
3.2.282
వ. అది ప్రజాపతి యజ్ఞవేది గావున నందు మూఁడగ్ని కుండంబు లెప్పుడుఁగానంబడు; మఱి వేదంబులు యజ్ఞంబులు మూర్తిమంతంబులై యఱువదికోట్లపదివేలు తీర్థంబులు సన్నిహితంబులై గంగా యమునా సంగమంబు సేవించియుండు; నందుఁ గృతస్నాను లైనవారు రాజసూయాశ్వమేధులయు సత్యవాదులయుఁ జతుర్వేదాధ్యయనులయుఁ బుణ్యలోకంబులు వడయుదురు; భోగవతియు వాసుకియు హంసవ్రతంబు నను తీర్థంబుల నాడి దశాశ్వమేధఫలంబులు వడయుదురు.
3.2.283
క. విదితముగఁ దీర్థకీర్తనఁ | జదివిన ధన్యులకు వినిన సజ్జనులకు న
భ్యుదయ మగు సర్వతీర్థస | ముదయ స్నాన బహుయాగముల ఫలము లగున్.
3.2.283a
క. సకలదురితముల వాయుదు | రకలంకమనస్కు లగుదు రార్యోత్తమవ
ర్తకు లగుదురు సజ్జనగుణ | నికరంబుల వెలయుదురు సునిశ్చితమతులై. 283 (ఆ)
3.2.284
చ. వ్రతములు లేనివారు, నుపవాస పరాఙ్ముఖు లైనవారు, దు
ర్మతులు, విహీనశౌచులుఁ గ్రమంబునఁ దీర్థము లాడనోప; రా
తతగుణశాలి వీ వఖిలధర్మవిదుండవు గావునన్ శుభ
స్థితిఁ జని తీర్థసేవనము సేయుము నీకు నభీష్టసిద్ధిగన్.
3.2.285
వ. అని సకల తీర్థ కథనంబు సెప్పిన, పులస్త్యువచనంబున భీష్ముండు దొల్లి యెల్ల తీర్థంబులు సేవించి కృతార్థుం డయ్యెఁ; గావున నీవును దీర్థసేవ చేసి.
3.2.286
క. పూరు పురూరవు లట్లు భ | గీరథ రఘుపతుల యట్లు కృతకృత్యుఁడ వై
ధారుణి రక్షింపుము వి | స్తారగుణాధార! ధీర! ధర్మతనూజా!
3.2.287
వ. రోమశుం డను దేవర్షి దేవలోకంబుననుండి నీకడకు వచ్చుఁ; దదుపదేశంబున ధౌమ్యానుమతుండ వయి తీర్థసేవనఁ జేయు’ మని చెప్పి నారదుం డరిగిన, నజాతశత్రుండు ధౌమ్యుం జూచి యిట్లనియె.
3.2.288
చ. ‘అలయక మాకు నందఱ కహర్నిశముం బ్రియకారి యైన య
త్యలఘుపరాక్రమాన్వితు మహాభుజు నర్జును దివ్యసాయకం
బులు వడయంగ నొక్కరున పుచ్చితిఁ దద్దయు వేడ్క నెద్దియుం
దలఁపక; యిప్డు దద్విరహితమ్మగు కామ్యక మొప్ప దయ్యెడిన్.
3.2.289
వ. అంబుదాగమనం బపేక్షించు చాతకంబు లట్లు మన మందఱ మర్జునాగమనంబు ప్రతీక్షించుచున్నవారము; వాఁడును దన పూనిన కార్యంబు నిర్వహించి కాని నివృత్తుండు గాఁ; డవశ్యంబును దివ్యాస్త్రంబులు వడసి యాతని వచ్చునంతకుఁ దీర్థసేవ చేయుద’ మనినఁ, ‘గరంబు లగ్గ్గగు, నట్ల చేయుద’ మని.
3.2.290
ఉ. నాలుగుదిక్కులందును వినన్ విదితంబగుచున్న పుణ్యతీ
ర్థాలి తెఱం గెఱుంగఁగ మహాత్ముఁడు ధౌమ్యుఁ డజాతవైరి కం
దోలిన చెప్పుచున్న తఱి నొప్పుగ రోమశుఁ డేఁగుదెంచెఁ దే
జోలలితుండు నిర్మలయశుం డగు ధర్మతనూజుపాలికిన్.
3.2.291
వ. ఇట్లు వచ్చిన మహాముని నతిభక్తి ననుజ బ్రాహ్మణ సహితుండై ధర్మజుండు పూజించి ‘మునీంద్రా! యెందుండి వచ్చితి?’ రని యడిగిన నాతనికి రోమశుం డిట్లనియె.
3.2.292
తే. ‘ఎల్లలోకంబులును జూచి యింద్రలోక | లోకనార్థినై యే నింద్రలోకమునకుఁ
బోయి సురరాజుచేఁ బ్రీతిఁ బూజితుండ | నై, మహీనాథ! యందు నీ యనుజు ననఘు.
3.2.293
ఉ. ఈసున నీశుఁ దొట్టి సురలెల్ల నభీష్టవరంబు లిచ్చుటం
జేసి కృతార్థుఁ డైన కురుసింహము నూర్జితశౌర్యు నర్జునున్
భాసురతేజు విశ్వపరిపాలకుఁ డైన మహేంద్రుతోడ నే
కాసన మెక్కియున్న మహిమాస్పదు నింద్రతనూజుఁ జూచితిన్.
3.2.294
క. బలవంతు లైన భీష్మా | దుల నర్జునుఁ డోర్చు నూర్జితుండై; మఱి పో
రులఁ గర్ణుండు పదారవ | కళకు సమానుండు గాఁడు కవ్వడితోడన్.
3.2.295
వ. అతని యున్న విలాసంబు సూచి విస్మితుండ నయిన నాకు నింద్రుండు తత్ప్రభావంబు సెప్పి ‘వీఁ డమృత సంభవం బయిన పాశుపతం బను దివ్యాస్త్రంబుఁ బరమేశ్వరుచేతను, నాచేతను యమ వరుణ కుబేరాదుల చేతను దివ్యాయుధంబులఁ బడసె; నితండు మనుష్యుండు గాఁడు; దివ్యపురుషుం; డన్యుల కశక్యం బయిన దేవకార్యంబు దీర్చి మసలక వచ్చు నని మర్త్యలోకంబునకుం బోయి భ్రాతృసహితుం డయిన ధర్మరాజునకుం జెప్పు’ మనిన వచ్చితి’ నని వెండియు నిట్లనియె.
3.2.296
క. ‘నిరతముగఁ దీర్థసేవా | పరులగు శాంతాత్ములకుఁ దపస్వులకును దు
ష్కర మెద్దియు లే దని చె | చ్చెర ధర్మజుఁ దీర్థసేవ సేయింపు మొగిన్.
3.2.297
క. అని పనిచిన నమరేశ్వరు | పనిఁ దత్పార్శ్వమున నుండి పన్నుగ నిట యేఁ
జనుదెంచితి నీ కార్యము | ధనంజయున కభిమతంబు ధరణీనాథా!
3.2.298
క. అనవద్య తీర్థసేవన | మును గపిలా స్వర్ణ దానములు నుగ్రతపం
బును జేయనివానికిఁ బో | లునె పడయఁగఁ బేర్మి నుభయలోకసుఖంబుల్.
3.2.299
వ. ఏను దొల్లి భూమిం గల తీర్థంబు లెల్ల నినుమాఱు సూచితి; నిప్పు డింద్రు నియోగంబున నీతోడన వచ్చి యఖిల తీర్థసేవ సేసెద’ ననిన ధర్మజుం డతని కిట్లనియె.
3.2.300
ఉ. ‘నన్నుఁ దలంచి తీర్థగమనం బొనరింపఁగఁ బంచె నట్టె వి
ద్వన్నుత! దేవవల్లభుఁడు; దానఁ గృతార్థుఁడ నైతి; దానిపై
నిన్ను సహాయుఁగాఁ బడసి నెమ్మి నశేషవిశేషతీర్థముల్
పన్నుగఁ జూడఁ గాంచి కడుభవ్యుఁడ నైతి మునీంద్ర! నీదయన్.
3.2.301
ఆ. విజయుకుశలవార్త వేడుక నీచేత | వినినయంతకంటె విస్తరిల్లె;
హృదయసంప్రమోద మీ రెంట నా’ కంచుఁ | దద్ద సంతసిల్లె ధర్మసుతుఁడు.
3.2.302
వ. ‘మునీంద్రా! యేను దొల్లియు నారద ధౌమ్యుల వచనంబులం దీర్థగమనోన్ముఖుండనై యున్నవాఁడ; నిప్పుడు భవన్నిదేశంబునం దీర్థసేవ సేసి కృతార్థుండ నగుదు’ నని కృతనిశ్చయుండై భిక్షాభుజు లయిన బ్రాహ్మణులను యతులను రోమశువచనంబున నివర్తించి, ధౌమ్యపురస్కృత కతిపయ బ్రాహ్మణులతో ననుజులుం దానును గృష్ణాసహితుం డయి కామ్యకవనంబున మూఁడుదినంబులు వసియించి మార్గశీర్ష మాసావసానంబునం దీర్థసేవార్థంబు గృతప్రస్థానుం డయిన యుధిష్ఠిరునకు బ్రాహ్మణు లిట్లనిరి.
3.2.303
ఉ. ‘నీ యనుజుల్ ధనుర్ధరు లనింద్యచరిత్రులు దీర్ఘ తీక్ష్ణకౌ
క్షేయకపాణు లత్యమలకీర్తులు గావఁగ రోమశుండు తే
జోయుతుఁ డెల్లతీర్థములుఁ జూపఁగఁ దీర్థము లాడువేడ్క ల
క్ష్మీయుత! యిప్డు ని న్ననుగమింపఁగఁ గంటిమి పుణ్యసంపదన్.
3.2.304
వ. రాక్షసపిశాచశ్వాపదంబుల కారణంబున నడవులలో నేకతంబ యరిగి తీర్థసేవ చేయ మాయట్టివారికి నశక్యంబు గావున మీతోడ వచ్చెద’ మని బ్రాహ్మణులు ధర్మరాజుచేత ననుజ్ఞాతు లై రంత.
3.2.305
క. పారాశర్యుఁడు బర్వత | నారదులును బాండురాజనందనుల గుణో
దారుల ననఘులఁ దీర్థ | ప్రారంభులఁ గానవచ్చి పరమప్రీతిన్.
3.2.306
క. వారలచేఁ బూజితులై | భూరి తపోధనులు లోకపూజ్యులు ధర్మ
ప్రారంభనిత్యమతులకు | వారల కిట్లనిరి సత్యవచనులు గరుణన్.
3.2.307
వ. ‘శారీరనియమంబులు మానుష వ్రతంబు లనంబడు; మనోబుద్ధి శౌచంబులు దేవవ్రతంబు లనంబడు; నట్టి సౌమ్యవ్రత విశేషంబులు సలుపుచు ఋజుమార్గులరై తీర్థంబులు సేవించునది; తీర్థాభిగమనంబున మహాభిష నాభాగ భరత భగీరథ ముచుకుంద మాంధాతృ సగర సార్వభౌమాష్టక రోమపాదుల యట్ల శత్రుజయంబును సర్వలోకసుఖంబులు వడయుదు’ రని చెప్పి మునివరులు మువ్వు రరిగి; రంత నజాతశత్రుండు రోమశున కిట్లనియె.
3.2.308
క. ‘ధరణి నధార్మికులగు కా | పురుషుల కభివర్ధనంబుఁ బుణ్యచరిత్రం
బరఁగెడు ధార్మికులకు దు | ర్ధర మగు నవివర్ధనంబుఁ దగునె మునీంద్రా!
3.2.309
వ. మఱియు నచేతనంబు లయ్యును గిరిసరిత్ సరోవరంబులు పుణ్యతీర్థంబులై జగత్పావనంబులై జనులకు దురితాపహరణంబు లైన కారణం బేమి?’ యని యడిగిన నతనికి రోమశుం డిట్లనియె.
3.2.310
చ. ‘వసుధ నధర్మవర్తు లగు వారల వర్ధన మెన్నడున్ సమం
జసమయి నిల్వనేరదు; భృశంబుగ నాశము వొందు; దుర్మద
వ్యసను లధర్మవర్తనఁ బ్రవర్ధితు లయ్యును నేము చూడ రా
క్షసులును దైత్యదానవులుఁ గ్రాఁగరె తొల్లి సహస్రసంఖ్యలన్.
3.2.311
క. దేవతలు ధర్మవర్తులు | గావున నభివృద్ధిఁ బొంది ఘన మగు నిత్య
శ్రీవిభవాన్వితు లయి ధర | ణీవల్లభ! యున్నవారు నిరుపమశక్తిన్.
3.2.312
క. ధర్మసుత! ధార్తరాష్ట్రుల | ధార్మికులై పెఱిఁగి రేనిఁ దడయక విధి చే
నిర్మూలితు లగుదురు దు | ష్కర్మంబున నసురు లట్ల కడు నస్థిరులై.
3.2.313
వ. అది యెట్లనిన నధర్మవర్తులయందు దర్పంబు పుట్టు; దర్పంబువలన మానంబు పుట్టు; మానంబువలనఁ గ్రోధంబు పుట్టుఁ; గ్రోధంబు వలనంజేసి లజ్జయు వృత్తంబునుం జెడు; నష్టలజ్జావృత్తులయినవారి నుపశమంబును లక్ష్మియు విడుచు.
3.2.314
క. మీ రమరసదృశులరు ధ | ర్మారంభవిశిష్టమతుల రగుటను సుచిర
శ్రీరమ్యు లగుదు రాజి; జి | తారాతుల రగుదు రుద్ధతాహవములలోన్.
3.2.315
వ. ధర్మవర్తులైన దేవతలు ఋషులు నాశ్రయించుటం జేసి తీర్థంబులు పవిత్రంబులై సర్వకామప్రదంబులై వర్తిల్లు చుండుఁ; దీర్థసేవను గ్రతువులను దానంబులను బ్రాహ్మణుల దీవనలను జనులు సర్వదుఃఖవిముక్తులయి శ్రేయఃప్రాప్తు లగుదు’ రని చెప్పిన నమ్మునివరునివలన నొండు ధర్మస్థితులు వించుఁబాండవు లరిగి నైమిశంబు, నశ్వతీర్థంబును, గంగాఘోషంబును, గన్యాతీర్థంబును, గోమతియును, బాహుదయును, మహానదియును, దేవ యజనం బయిన ప్రయాగయు, గంగా యమునా సంగమంబును నాడి, యందు బ్రాహ్మణులకు గో హిరణ్య దానంబులుసేసి, ప్రయాగం గొన్ని దినంబు లుండి, వేద విదులయిన బ్రాహ్మణులవలన వేదార్థంబు లెఱుంగుచుఁ జని, యనేక పుణ్యనదీసముద్భవం బయిన గయపర్వతంబును, రామసరంబును, బ్రహ్మసరంబును, వైవస్వత తీర్థంబునుం జూచి, గయయందు నక్షయవటంబున నార్షేయం బైన విధానంబునం జాతుర్మాస్యక్రతువులు సేసి, ఋషులవలనం బుణ్యకథలు వినుచున్న యవసరంబున శమఠుండను మహాముని ధర్మరాజున కిట్లనియె.
3.2.316
సీ. ‘సరవి నాధూతరజః ప్రియపుత్త్రుండు | గయుఁ డను రాజర్షి క్రతువు లిందు
బ్రహ్మసరంబునఁ బరఁగంగ మును చేసె; | నాతని యజ్ఞంబులందు సకల
జనభుక్తశేషాన్నశైలంబు లిరువది | యేనగు సంఖ్య దా నెఱుఁగ నయ్యెఁ;
దత్కృతక్రతుబహుదక్షిణాసంఖ్యయు | నుడు సికతా సంఖ్యయును నెఱుంగఁ
ఆ. గాదు జనుల; కట్టి గయునామమున గయ | యనఁగఁ బుణ్యతీర్థ మయ్యె నిదియుఁ;
బితృహితార్థ మిందుఁ బిండప్రదానంబు | సేయఁ గనిన నిష్టసిద్ధి గలుగు’.
3.2.317
వ. అని చెప్పిన శమఠువలన గయామాహాత్మ్యంబు విని యగస్త్యాశ్రమంబున కరిగి; రంత ధర్మరాజు రోమశున కిట్లనియె.
3.2.318
మధ్యాక్కర. ‘వాతాపి యనువాని నెట్లు సంపె సద్వంద్యుఁ డగస్త్యుఁ?
డాతతతేజో -ధికుండు నా విందు నమ్మునినాథుఁ;
బ్రీతిని దచ్చరితంబు వినఁగ నభీష్ట మిం’ దనిన
నాతని కిట్లని చెప్పె రోమశుం డన్ముని పేర్మి.
3.2.319
క. ‘వీతభయుఁ డిల్వలుండును | వాతాపియు ననఁగఁ బరఁగు వరదైత్యులు వి
ఖ్యాతబలులు వసియింతు ర | రాతిహరుల్ మణిమతీపురంబున నొప్పన్.
3.2.320
వ. అం దగ్రజుం డయిన యిల్వలుం డొక్కబ్రాహ్మణు నతిభక్తి నర్చించి, ‘నాకు సకలకామసిద్ధికరం బగు మంత్రం బుపదేశించు’ మని ప్రార్థించి విఫలప్రార్థనుండై యరిగి తన తమ్ముఁ గామరూపధరు వాతాపి నపుడు మేష రూపంబు సేసి వధియించి వాని మాంసం బిమ్ముగా వండించి దాని నా విప్రునకుఁ గుడువం బెట్టించి.
3.2.321
తే. విప్రుకడుపులో నున్న యవ్వీరు ననుజుఁ | బిలిచె ‘వాతాపి! ర’ మ్మని ప్రియముతోడ;
జీవితుం డయి వాఁడు చెచ్చెరను విప్రు | కడుపు వ్రచ్చుచు వెలువడి క్రాఁచె విప్రు.
3.2.322
వ. అది మొదలుగా నిల్వలుండు దనకడకు నతిథులై వచ్చు విప్రుల నప్పాట నంతకుపురంబున కతిథులం జేయు చున్నంత; నట నగస్త్యుండు బ్రహ్మచర్యాశ్రమంబునం బెద్దకాలం బుగ్రతపంబు సేయుచు వనంబునఁ బరిభ్రమించు వాఁ డొక్క సల్లకీపల్లవంబున నధోముఖులై వ్రేలుచున్న తన పితరులం జూచి’ యివ్విధంబున మీ రున్న కారణం బేమి?’ యని యడిగినఁ బితరు లిట్లనిరి.
3.2.323
తే. ‘అయ్య! యేము నీ పితరుల; మధికనిష్ఠ | బ్రహ్మచారివై నీవు తపంబు సేయు
చున్నవాఁడవు సంతతి నొల్ల; కదియ | కారణంబుగ మా కూర్ధ్వగతియు లేదు.
First 200 of 235 passages. Read on