Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 3.2.268

Āndhra Mahābhāratamu 3.2.268

Language
Telugu

3.2.268

వ. అందు శరీరత్యాగంబు చేసినవార లపారపాపవిముక్తులై ముక్తు లగుదురు; సురకన్యా సరస్వతీ సంగమ స్నాతులైనవారు బ్రహ్మహత్యాది పాతకంబులవలనఁ బాయుదురు; దర్భినిర్మితంబైన యర్థకీల తీర్థం బాడిన శూద్రులు బ్రాహ్మణు లగుదురు, బ్రాహ్మణులు పరమసిద్ధు లగుదురు; శతంబును సహస్రంబును నను తీర్థంబు లందుఁ జేసిన జపదానోపవాసంబులు శతసహస్రగుణంబులగు; వేల్పు లెల్లం గుమారు సేనాపతింగా నెందే నభిషేకించి రట్టితైజసం బను తీర్థంబును దాని తూర్పున నుండు కురుతీర్థంబును స్వర్గద్వారం బను తీర్థంబును జూచినవారికి స్వర్గద్వారంబు వివృతం బగు; రుద్రపత్ని యను తీర్థంబున శంకరనారాయణుల నర్చించి సర్వదుఃఖ విముక్తు లగుదురు; స్వస్తిపురంబుఁ బ్రదక్షిణంబు సేసి గో సహస్ర దాన ఫలంబు వడయుదురు; గంగమడువున నొక్క కూపంబున మూఁడుకోట్ల తీర్థంబుల సన్నిహితంబులై యుండు; నందుఁ గృతస్నాను లయినవారికి సర్వతీర్థస్నానఫలం బగు; బదరీవనంబునందు వసిష్ఠాశ్రమంబునం ద్రిరాత్రంబులు బదరీఫల భక్షణంబు సేసి పాపవిముక్తు లగుదు; రేకరాత్రం బను తీర్థంబున నేకరాత్రోపవాసంబు సేసి బ్రహ్మలోకంబు వడయుదు; రాదిత్యాశ్రమం బను వనంబున నాదిత్యుం బూజించి యాదిత్యలోకగతు లగుదురు; దధీచి తీర్థంబునం గన్యాశ్రమంబునందుఁ ద్రిరాత్రంబు వసియించినవారికి స్వర్గఫలం బగు.