Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 4.3: విరాటపర్వము — తృతీయాశ్వాసము

Āndhra Mahābhāratamu 4.3

Language
Telugu

విరాటపర్వము — తృతీయాశ్వాసము

4.3.1

క. శ్రీత్వ శివాత్వాలంబన | తత్త్వాశ్లేషాత్త శబలతా సంగత క
ర్తృత్వాదికలీలాత్త మ | హత్త్వాహంకారభావ! హరిహరనాథా!

4.3.2

వ. దేవా! వైశంపాయనుండు జనమేజయున కిట్లనియెఁ - బవనతనయుం డట్లు సని మహానసమందిరంబు పరిసరంబున శరీరప్రక్షాళనంబు సేసికొని, యనులేపనంబున నసృగ్గంధం బుడిపికొని, కృతకృత్యుండై, శయ్యాతలంబునం గూర్చుండె; నిట యాజ్ఞసేనియుం భీమసేనుం డింతకు వంట యింటికిం బోయి నిశ్చింతంబున నుండునని నిశ్చయించి, నర్తనశాల వెలువడి కావలివారలం బిలిచి.

4.3.3

క. ‘నా పతులగు గంధర్వుల | చేపడి మృతిఁబొందె వీఁడె సింహబలుం; డీ
పాపాత్మునిఁ జూడుఁడు దు | ర్వ్యాపారఫలంబుఁగాంచె’ నని పలుకుటయున్‌.

4.3.4

ఆ. వారు సంభ్రమించి వడిఁ గోల దివియలు | గొనుచు నులివు మిగులఁ గూడఁబాఱి
నృత్తశాలఁ జొచ్చి రత్తఱి నా కల | కల మెఱింగి కీచకవ్రజంబు.

4.3.5

చ. కడు వెస వచ్చి రూపఱినకాయము నున్నతెఱంగుఁ జూచి బి
ట్టడలు మనంబులం గదిరి హా యనువారును, జోద్యమంది మ్రా
న్పడియెడువారు, నగ్రజునిపైఁ బడి మూర్ఛలఁ బొందువారు న
య్యెడ కరుగంగ నోర్వక మహిం బెఱచోఁ బలవించువారు నై.

4.3.6

వ. ఉన్నంత బంధుజనంబులు గూడంబాఱి కీచక శవంబు గనుంగొని.

4.3.7

ఉ. ‘మానవకోటి నిట్టి విసుమానపుఁ బీనుఁగు లైనవారి నెం
దైనను గంటిమే? యకట! యాఱడి వమ్మయిపోయె; దుర్జయం
బైన బలంబు గానితెరువై తన కిత్తఱిఁ దోడు గాద; యు
క్కీని మనంబు కీడు పరికించునె? క్రొవ్వినఁ జేటు తప్పునే?’.

4.3.8

వ. అనుచు దాయం జని.

4.3.9

తే. ‘కరము లెయ్యవి? శిర మేది? గాళు లెచటఁ | జొచ్చె? గంధర్వవరులచేఁ జచ్చువార
లెల్ల నిట్టుల యగుదురో? యితనితోడి | యలుకఁ జేసిరొ? యిది కడు నక్కజంబు’.

4.3.10

వ. అని వెండియు బహుప్రకారంబులం బలుకుచు శోకవిస్మయ పరీత చేతస్కులయి యున్నంత నొక యుపకీచకుండు నిజ సహోదరులం జూచి.

4.3.11

క. ‘మన మెంత పనవి పిలిచిన | విననేర్చునె సింహబలుఁడు? వేగమ యితనిం
గొని పోవఁగ వలయుంగా’ | కని యందఱఁ దేర్చె ననునయా లాపములన్‌.

4.3.12

ఉ. సూతులు దాని కియ్యకొనుచుం దమ యన్నకు నగ్ని యేర్చు వా
రై తగ వాచరించునెడ నల్లన ద్రౌపది ‘వీరి చందముల్‌
చూతముగాక’ యంచు నొకచోఁ దమ చేరువ నున్నఁ గాంచి, సం
జాత మహోగ్రకోపులయి చారువిలోచనఁ బట్టి క్రూరతన్‌.

4.3.13

క. పెడకేలు గట్టి ‘పాపపుఁ | బొడవగు నిది గాదె యితనిఁ బొడ వడఁగించెన్‌!
గెడకూడఁ దీని నీతని | యొడలిపయిం బెట్టి కాల్చు టుచితం బరయన్‌.’

4.3.14

వ. అని విరాటున కెఱింగించి చేయువారై, యంతకుమున్న యీ వృత్తాంతం బంతయు విని సంక్షుభిత హృదయుండై యున్న యతనిపాలికిం బోయి.

4.3.15

తే. ‘ఎల్లభంగుల సైరంధ్రి నేము సింహ | బలునితోఁ జంపువారమై తలఁచి నీకు
నెఱుఁగఁ జెప్పంగ వచ్చితి; మీవు నింత | వట్టు మన్నన మాకు నీ వలయు’ ననిన.

4.3.16

వ. అతండును దన మనంబున ‘నియ్యుపకీచకుల చందంబు సూడ నేను వారించితి నేనియు నుడుగం గలవారుగా రని (యు గంధర్వులు బలవంతులు గావునఁ దద్రక్షితయైన సైరంధ్రి కపాయంబు వొంద’దని) యు నూహించి, వారలం గలయం గనుంగొని ‘యట్లకాక మీకుం బోలిన తెఱంగు సేయుం’ డనిన నదియ యనుమతిగాఁ గైకొని సరభసంబునం జనుదెంచి.

4.3.17

ఉ. ‘అంగజరాగమత్తుఁడగు నన్నకు నిమ్మెయినైనఁ బ్రీతిసే
యంగలవార, మీ జఱభి యాతనితోడన తీఱుఁగాక’ యం
చుం గొనిపోయి దైన్యమున సూతునిపీనుఁగు మీఁదఁ బాండుపు
త్రాంగనఁ బెట్టి, కట్టిరి దయాపరివర్జితచిత్తవృత్తులై.

4.3.18

చ. అశుచియుఁ గష్టుఁడున్‌ లఘువునైన నిజాగ్రజుమేనితోడ ని
త్య శుచియుఁ బుణ్యశీలయు నుదాత్తయు నాఁ జను నింతిఁ గొంచుఁ గ
ర్కశమతిఁ గీచకుల్‌ బహుముఖంబుల బాంధవ విప్రలాపముల్‌
దిశ లద్రువం జెలంగఁ గరదీపనికాయము ప్రజ్వరిల్లఁగన్‌

4.3.19

క. పితృవణము దెసకుఁ జన న | య్యతివ భయభ్రాంతచిత్తయై బాష్పజలో
ద్గతి మొగముఁగప్ప నిట్లని | యతిరావముగా నొనర్చె నాక్రందనమున్‌.

4.3.20

ఆ. ‘అనదనైతి నిచట; నాలి కుయ్యాలింపుఁ | డ కట! మీరు గలుగ నాక్రమించి
నన్నుఁ గట్టి సూతనందను లిమ్మెయి | వెఱపులేక భంగపఱుచువారు.

4.3.21

ఉ. ఆనతవైరి యో జయ! మహాద్భుతవిక్రమ యో జయంత! దు
ర్మానవిఘూర్ణమానరిపుమర్దన యో విజయాభిధాన! తే
జోనిహతాహిత ప్రకటశూర గుణప్రతిభాస యో జయ
త్సేన! విరోధి బాహుబల జృంభణభంజన యో జయద్బలా!

4.3.22

సీ. తొడఁగిన పని చలం బెడపక యతి దుష్క | రంబైనఁ గడతేర్చు ప్రభువులార!
పెనఁగిన వైవస్వతునినైనఁ గడిమిమై | వ్రేల్మిడిఁ బరిమార్చు వీరులార!
శరణార్థియగు దుష్ట శాత్రవునైనను | గరుణ రక్షించు సత్పురుషులార!
యర్థికిఁ బ్రాణంబు లైనను దాఁపక | తమకించి యిచ్చు నుదారులార!
తే. నాథులార! గంధర్వ రత్నంబులార | నన్ను నుపకీచకులు తమ యన్న శవము
నందు బంధించికొని వెస నరుగుచున్న | వారు; రక్షింప వేగ రావలయు మీరు.

4.3.23

చ. అని పలవించు నయ్యెలుఁగు లాపవమానతనూజుఁ డేర్పడన్‌
విని, మది ‘నాదు వల్లభకు వీండ్రును గ్రమ్మఱ నింతసేసిరే!’
యనుచు సరోష సంభ్రమత నాయితమై వెసఁబాఱి వప్ర లం
ఘన మొనరించె గుప్తముగ గ్రక్కున ముట్టెడుదానికిం దగన్‌.

4.3.24

తే. ఇట్లు లంఘించి పోయి పరేతభూమి | యొద్ద నలుదిక్కులును జూచి యొక్క యున్న
తావనీజంబు వెఱికి రౌద్రాతిరేక | మడర భుజశిఖరంబునయం దమర్చి.

4.3.25

మ. వికట భ్రూకుటి ఘోర ఫాలకలిత స్వేదోద్భటుండుం, జల
ద్వికృతోష్ఠద్వయుఁడుం, బ్రవర్ధన దశావిర్భావ సంభావితాం
గకుఁడుం, జిత్త విదాహదోహల సమగ్రక్రోధ వేగుండు నై
బకవిధ్వంసకుఁ డయ్యెడన్‌ నిలిచె శుంభన్మూర్తి విస్ఫూర్తితోన్‌.

4.3.26

వ. తదనంతరంబ.

4.3.27

ఆ. సూతుశవముతోడ నేతెంచు నెరవులు | దవ్వు దవ్వులన యుదగ్రరూప
కలితుఁడైన భీముఁ గనుఁగొని నడవక | నిలిచి దంత నంతఁ గలఁగఁబాఱి.

4.3.28

మ. ‘ఇదె గంధర్వులు వచ్చి ముట్టికొని; రిం కెట్లొక్కొ! యంచున్‌ భయం
బొదవం బల్లములందు డాఁగియు, సమీపోర్వీజముల్‌ ప్రాఁకియుం,
జెదరం బాఱియు, నీరు సొచ్చియును, నిశ్చేష్టం బదద్వంద్వముల్‌
గుదివడ్డం బెగడొందియున్‌ భరిత సంక్షోభాత్ములై రత్తఱిన్‌’.

4.3.29

ఉ. సూతులు భీతులై ద్రుపదసూతి సమేతముగాఁగ నగ్రజ
ప్రేతమువైచి, వీటి దెసఁ బెల్లుగఁ బాఱఁ దొడంగినన్‌ వడిన్‌
వాతసుతుండు ముట్టికొని వారి బడల్పడ వ్రేసి యందఱం
జేతులతీఁట వో నుఱుము సేసె విశృంఖల విక్రమంబునన్‌.

4.3.30

వ. ఇవ్విధంబున నూటయేవు రుపకీచకులను సమయించి శమిత క్రోధుండై వచ్చి, పాంచాలికి బంధ మోక్షంబు గావించి, ‘యింక నిశ్చింతంబున సుదేష్ణ మందిరంబునకుం జను‘మని యవ్వెలందిని వీడుకొలిపి, తానును వేఱొక మార్గంబున మహానస గృహంబున కరుగుదెంచెఁ; దత్సమయంబున విరాటుండు కీచకానుజులు గంధర్వులచేత నిరవశేషంబుగా మృతిం బొందిరని విని, చకితచేతస్కుం డగుచు సహోదర మరణ శోకా యత్తచిత్త యయిన జీవితేశ్వరి నుచితాలాపంబుల ననునయించి యిట్లనియె.

4.3.31

ఆ. ‘చంద్రవదన! యింక సైరంధ్రి నిచ్చోటు | వాపవలయు నేమిభంగినైనఁ;
గాన నాదు పలుకుఁగాఁ జెప్పు వెడలుట | కనుగుణముగ నమ్మృగాక్షితోడ.

4.3.32

ఆ. పురుషు లా లతాంగి పొరువునఁ బోయినఁ | జేటువచ్చుఁ గానఁ జెప్ప నేను
వెఱతు; నాఁడువారు వెరవుతో మృదువచో | రచనఁ జెప్పు టరయ నుచిత వృత్తి.

4.3.33

ఉ. ఆ కమలాక్షి రూప మహిమాతిశయంబు మనోహరంబు; భో
గైక పరాయణుల్‌ పురుషు; లంగజుఁ డప్రతికార చేష్టెత
స్వీకృత లోకుఁ; డట్లగుటఁ జేటు పురంబునవారి కెప్పుడుం
గా కెటు లుండు? నిట్టి యవగాఢపుఁ బొత్తు మనంగ వచ్చునే?’

4.3.34

క. అని నిశ్చయించి పలికిన | విని కేకయరాజపుత్రి విభు తలఁపు మనం
బునకుఁ బ్రియం బగుటయుఁ గై | కొని యాపని యట్లచేఁతకుం బూనెఁ దగన్‌.

4.3.35

క. అంతం గుంతీనందన | కాంతా చింతా మహాంధకారముతో న
త్యంతంబు మచ్చరించెనొ | సంతమసం బనఁ బ్రభాత సమయం బయ్యెన్‌.

4.3.36

వ. పదంపడి పద్మినీ ప్రమోద సంపత్కరుం డగు నరుణకిరణుం డుదయించె; నట మున్న పాంచాలి సచేలస్నానంబుసేసి, రాగాది వికార నిరాసనంబునం బ్రసన్నయయిన బుద్ధియుంబోలె సింహబల ప్రభృతి కీచక విధ్వంసనంబునం దెలివొంది మంద మందయానంబునం బురంబు సొచ్చి రాజవీథి నరుగు దెంచునప్పుడు.

4.3.37

సీ. ‘మన కీచకుల కెల్ల మారియై పుట్టిన | సుదతి పోయెడు’ నని చూచువారు;
‘నద్దిరా! నీకుఁ గ్రొ వ్వఱుగదేఁ జూతుగా’ | కని తలసూపక యడఁగువారు;
నలవోకఁ గనుఁగొని యంతరంగము బిట్టు | బెదర మాఱుమొగంబు పెట్టువారు;
నెదురుగా వచ్చిన నెంతయేనియు దవ్వు | గలుగ వేఱొక త్రోవఁ దొలఁగువారు
తే. ముట్టఁబడి మేనఁ గంపంబు పుట్ట నొదిగి | యుండువారుఁ, గరంబున నుదర మప్ప
ళించి ‘యమ్మరొ! రక్కసి’ యంచు నుల్ల | ములుకువారునై పురజనంబులు తలంకి.

4.3.38

చ. పులిఁ గనుఁగొన్న లేడులునుబోలె విభీతిఁ గలంగఁబాఱ న
న్నెలఁతుక యంతరంగమున నిండిన హాస్యరసంబు మోముపై
వెలి విరియంగనీక చని వేచి మహానసశాల వాకిటన్‌
నిలిచిన భీమసేనుఁ గని నెయ్య మెదం జిగురొత్తుచుండఁగన్‌.

4.3.39

క. తన యంతన యటువలుకుచుఁ | జను విధమున నతని దిక్కు చక్కని చూడ్కిం
గనుఁగొనక ద్రుపదనృప నం | దన యిట్లను నిజ కృతార్థతం దెలుపుటకున్‌.

4.3.40

తే. ‘కీచకులదెసఁ బుట్టిన కిల్బిషంబు | పాచి నన్ను రక్షించిన పరమ ధర్మ
రతికి గంధర్వ పతికి నిరంతరంబు | భక్తి యుక్తిమైఁ బ్రణమిల్లి బ్రదుకుదాన.’

4.3.41

వ. అనిన విని యనిలనందనుండు నిగూఢవచన చాతుర్యధుర్యుండై యిట్లనియె.

4.3.42

చ. ‘అతివ! యపాయముం బొరయు నప్పుడు గావక తక్కెనేని నా
పతి పతియే? తలంప మగ పాడియె? లోకము పాడియే? భవ
త్పతు లిటు లాచరించుట గదా భవదీయ మనోనువర్తన
స్థితి కుచితంబు; వారల నుతింపఁగ నేల నిసర్గవృత్తులన్‌?’

4.3.43

తే. ఇట్లు దమ్ము నిరూపింప నితర జనము | లకు నశక్యంబుగాఁగ సల్లాపరసము
ననుభవించుచు నల్లనల్లన లతాంగి | యరిగె నర్తన మండపోపాంతమునకు.

4.3.44

వ. చని విరాట కన్యకల యాటఁ జూచు చందంబున నందుఁ బురందరనందనుం గనుంగొను నప్పాంచాలి నాలోకించి, యతండునుం దారును దదభిముఖంబుగా వచ్చి యక్కన్నియ లిట్లనిరి.

4.3.45

ఉ. ‘కీచకకోటిచేత నొక కీడును బొందక వచ్చితమ్మ? ని
న్వేచిన దుర్మదుండు జమునిం గొలువం జనెనమ్మ? యంతఁ బో
కేచిన సూతు లీయొడలి కింత యపాయ మొనర్తురమ్మ? వే
కాచి విరోధులం దునుమఁగా నిటు ముట్టుదురమ్మ నీ పతుల్‌?’

4.3.46

వ. అని తారు మున్ను విన్న కీచక వృత్తాంతంబున కనుగుణంబుగా నుపచారంబులు పలుకుచుండ నా బృహన్నల సైరంధ్రి కిట్లనియె.

4.3.47

క. ‘ఆ పాపాత్ముల నీచ | వ్యాపార క్రమము, వార లందఱు మృత్యు
ప్రాపితులైన తెఱంగును | నీ పలుకుల నెఱుఁగవలయు నెలఁతుక చెపుమా!’

4.3.48

వ. అనిన విని సైరంధ్రి సాభిప్రాయంబుగా బృహన్నల కిట్లనియె.

4.3.49

తే. ‘కన్నియల కాట గఱపుచు నున్న నీకు | నకట! సైరంధ్రి యిప్పు డేమయ్యెనేని
ఖేద మెద నించుకయు లేమిఁగాదె సస్మి | తాననంబుతో నన్నిటు లడుగుటెల్ల.’

4.3.50

వ. అనిన బృహన్నల యిట్లనియె.

4.3.51

క. ‘నీ వలుగులఁ బడుటకు దుః | ఖా వేశము నొందెనే నిరర్థక మగు ని
య్యేవపుఁ బుట్టువు పుట్టిన | నా వగ పెవ్వరికి నెక్కు నలినదళాక్షీ!

4.3.52

క. నీతోడి పరిచయము లే | దే? తలపోయఁగ ననింద్య వెందును; నీ వి
ట్లాతుర వగుటకు నా మది | నే తాపము లేదు? నైజ మెఱుఁగవు కంటే!’

4.3.53

వ. అని తాను నిజసహోదరుల యట్లపోలె వేషాంతరంబు దాల్చిన యంతియకాక యూర్వశి యిచ్చిన శాపం బనుభవించుటకు శరీరాంతర పరిగ్రహంబు చేయుటం జేసి రిపుమర్దనంబు తనకు వెరవు గాకునికి గుప్తసాభిజ్ఞానంబుగాఁ దెలిపిన బలసూదనసూను పలుకులు విని పాంచాలి యంతస్స్మిత కమనీయ కపోల యగుచు నిట్లనియె.

4.3.54

ఆ. ‘అట్లకాక యింత యననేల? నీ మది | తెఱఁగుఁ గొంత యేను నెఱుఁగకున్న
దానఁగాను; నగరఁ దగవుమై నీవు వ | ర్తించుటయ కరంబు ప్రియము నాకు.’

4.3.55

వ. అనుచుం గన్యకాజన పరివృతయై యరిగి యంతఃపురంబు సొచ్చి సహోదర మరణ శోకాతురయగు కైకేయి కడకుం జనునప్పుడు.

4.3.56

సీ. ముదమున నెలమి సొంపొదవి నెమ్మొగమునఁ | దోఁపంగ వచ్చినఁ ద్రోచి త్రోచి,
లలి నుల్లసిల్లుచు లలితలోచనదీప్తు | లడర నుంకించిన నాఁగి యాఁగి,
సంతసంబున బాలిశము లగు చెయ్వులు | దొడరఁ జూచినఁ జేయ కుడిగి యుడిగి,
మనమున నుబ్బుమై మాట నాలుకకు రాఁ | గడఁగిన నాడక కడపి కడపి.
తే. ధీరయై యిట్లు సమ్మదపూరమునకు | గఱువతన మను బలితంపుఁ గట్ట వెట్టి
వెలఁది యెఱుఁగనియదివోలె వికృతిలేక | యల్ల నెప్పటియట్టుల యరుగుటయును.

4.3.57

క. భయశోకంబులు తనదు హృ | దయమునఁ బిరిగొన విరాట ధరణీనాథ
ప్రియ సంభావనసేసి వి | నయపూర్వము గాఁగ ద్రుపదనందనకుఁ దగన్‌.

4.3.58

వ. ఇట్లు సంభావించి యత్తరుణిం దన పరిసరంబున నునిచికొని తదీయ వదనం బవలోకించి.

4.3.59

తే. ‘నీవు చక్కనిదానవు నెలఁత! ధైర్య | రహితచిత్తులు మగవారు; రాజు దీనిఁ
దలఁచి భయమంది నిన్ను నీ వలచు నెడకు | నరుగునట్లుగఁ బ్రార్థించి యనుపు మనియె.’

4.3.60

వ. అని తన మనంబునం గదిరిన యనుజ వియోగతాపం బుత్కటం బగుటయు వెండియు నిట్లనియె.

4.3.61

క. ‘బిరుదు గల మగలు గలరని | తరమిడి చంపింపఁ జూచెదవు; జనములు నీ
పొరువునఁ బో వెఱతురు, మా | పురమును రాష్ట్రంబు వెడలి పొమ్మెందైనన్‌.’

4.3.62

వ. అనిన విని విరాటవల్లభకు సైరంధ్రి యిట్లనియె.

4.3.63

ఉ. ‘ముందటియట్ల యింకఁ బదుమూఁడు దినంబుల మాత్రకున్‌ భవ
న్మందిరవాస మియ్యకొనినం గడతేఱు మదీయవాంఛ; యం
తం దగఁ దోఁచి మత్పతు లుదాత్తమతిన్‌ భవదీయ వాంఛితం
బుం దలకొల్పఁ జాలుదు; రపూర్వ మనఃప్రమదంబు సేకుఱున్‌.

4.3.64

క. కృత మెఱుఁగుదు, రుపకార | వ్రతమున వర్తింతు, రెపుడు వదలరు, కరుణా
న్వితు, లీ నరపతికి శుభ | ప్రతిపాదకు లగుదు రేమిభంగుల నైనన్‌.

4.3.65

వ. కావున.

4.3.66

క. సైరంధ్రి యిట్టు లనుటకుఁ | గారణము దలంప నేమిగా నోపునొ? యం
చారసి బహుప్రకార వి | చారములకుఁ జొచ్చు టుడుగు సరసిజవదనా!

4.3.67

క. ఇది యేమియైన నేమగు? | మది నా కీ చింతయేల? మన్నన యెల్లం
దుదిఁ జెఱుపక ప్రార్థన సే | యుదుఁగా కని నిశ్చయించు టుచితమె నీకున్‌?’

4.3.68

చ. అనిన సుదేష్ణ యిట్లనియె ‘నంతవునంతకు మద్గృహంబునం
దునికికి సమ్మతించితి; నిజోచితవృత్తిఁ జరింపు; నాదు నం
దనుల మదీయ వల్లభు నుదాత్తమతిం బరికించికొమ్ము; నీ
మనమున కెట్టు లూఱట సమస్తము నట్టుల చేసెదం దగన్‌.’

4.3.69

క. అని యూఱడిల్లఁ బలికిన | విని తొల్లిటియట్ల యుచితవృత్తి ద్రుపద నం
దన యుండె; నట్టియెడ ని | ట్లని మ్రోసిరి జనులు పురమునందును భూమిన్‌.

4.3.70

చ. ‘విరటు మఱంది కీచకుఁడు విక్రమ దుర్దముఁ, డన్యసైన్య భీ
కర మహనీయమూర్తి, బలగర్వ సముద్ధత చిత్తుఁ, డెందు నె
వ్వరు సరిలేరు వీని కన వాలిన దండి మగండు; సూడ న
చ్చెరు వగు చావు చచ్చె; నటుసేసిన వారట యెట్టి వీరులో!

4.3.71

తే. సింహబలుఁడు గంధర్వులచేత నొక్క | సతికిఁగా నిట్లు ఘోరంపుఁ జావు చచ్చె;
నకట! రిత్తకు రిత్త మత్స్యావనీశు | లావు గోల్పోయె; సూతకులంబు పొలిసె.’

4.3.72

వ. ఇవ్విధంబునం బ్రవర్తిల్లు జనవాదంబు గ్రమక్రమంబున సమస్తదేశంబుల నెరసి చెల్లుచుండె; నట్టియెడ.

4.3.73

ఉ. పాతకియై సుయోధనుఁడు పాండుతనూజులు సల్పుచున్న య
జ్ఞాత విధి వ్రతంబు కలుషంబుగఁ జేయఁదలంచి పంచినన్‌
భూతలమెల్లఁ జూచి మును వోయెడు నప్పుడు చెప్పుకొన్న సం
కేతపుఁ జోటఁ గూడఁబడి ఖేదముఁ బొందుచుఁ జారు లందఱున్‌.

4.3.74

వ. మగుడి వచ్చి హస్తిపురంబు చొత్తెంచి.

4.3.75

సీ. వరుస నేనుంగులు గురిసిన దాన ధా | రావలి దగు కలయంపి గాఁగ,
రాజులసందడి రాసిన తొడవులు | మురిసి రాలిన పొడి మ్రుగ్గుగాఁగఁ,
గాంతల సంకుల గతిఁ ద్రెస్సి తొరఁగిన | హారముల్‌ పుష్పోపహారములుగ,
నేమేమ యని యోలినెత్తిన పరదేశి | దొరల పావడములు తోరణముగ,
తే. సహజమైన యలంకార మహిమ నతిశ | యిల్లి మహనీయ వైభవ మెసక మెసఁగ
వఱలు నరపతి మందిర ద్వారభూమి | సేర నరిగి యా వేగులవారు ప్రీతి.

4.3.76

వ. సముచితంబుగాఁ బ్రవేశించి.

4.3.77

తే. ద్రోణ గాంగేయ భానుమత్సూను కృప సు | శర్మ దుశ్శాసనులు సర్వ సైన్యపతులు
నార్య జనములుఁ గొలువ మహార్హకాంచ | నోన్నతాసనమునఁ గొలువున్నవాని.

4.3.78

స్రగ్ధర మౌళిస్రక్సంగ రంగ న్మధుకరపటలీ మానసా కృష్టి విద్యా
శాలి స్ఫారాబ్జరేఖాంజలి పుట ఘటనాచారు ఫాలస్థల క్ష్మా
పాలశ్రేణీ విశా లాంబక కుముదవనీ బాంధవాయత్తచంద్ర
శ్రీలీలాగాఢ కాంతి స్మితవదనరుచి స్ఫీతు నాగేంద్ర కేతున్‌.

4.3.79

వ. కని జయజయశబ్దపూర్వంబుగా సాష్టాంగ దండ ప్రణామంబు సేసి.

4.3.80

క. మొగిచిన చేతులు ముందల | నిగిడించి నితాంత వినయ నిరతిం జారుల్‌
తగ విన్నవించి రిట్లని | జగతీశ్వరునకు నిజ ప్రచారం బెల్లన్‌.

4.3.81

క. ‘దేవర యానతిఁ బాండవు | లేవురు ద్రౌపదియు నున్న యెడ యే మరయం
గా వెడలి వారు సనిన మ | హావిపినంబులకుఁ దొలుత నరిగితిమి వెసన్‌.

4.3.82

వ. అందు.

4.3.83

ఆ. పరఁగు పొదరు పొదరు, పల్లంబు పల్లంబు | మ్రాను మ్రాను, దుర్గమంపుఁ జోటు
దుర్గమంపుఁ జోటు, దొన దొన, గుహ గుహ | యాదిగాఁగ నెందు నరసి యరసి.

4.3.84

వ. ఒక్క యెడ నరదంబు లరిగిన చొప్పు గాంచి దాని వెంబడిం జని చని.

4.3.85

క. కేవలసూతుల తోడన | పోవుట గని వానిఁ జేరఁ బోవక యవి యిం
కే వంకఁ బోవునొకొ! యను | భావనఁ బోయితిమి వానిపజ్జన యేమున్‌.

4.3.86

వ. అవియును ద్వారకా నగరంబున కరిగిన.

4.3.87

క. అందుల నుండుదు రను నా | సం దెల్లముగాఁగఁ బెక్కు చందంబుల ము
ట్టం దిరిగి తడవి కుంతీ | నందనులం గాన లేక నానా భంగిన్‌.

4.3.88

వ. విచ్చి పోయి సమస్త దేశంబులుం గలయం గ్రుమ్మరి, కొండొకయు నుపేక్షలేక వెరవుతోడిదకాఁ బరికించుచు. బయలనునాలస్యంబు దక్కియోలంబునట్ల శోధించుచుఁ గీడయిన నుదాసీనత యుడిగి మేలి చందంబునం భావించుచు, వివిధ ప్రకారంబు లయిన బహు ప్రదేశంబులు రోసి, కౌంతేయులం గానక సంకేత స్థలంబునం గూడికొని, మా వర్తించిన తెఱంగు దేవరకు నెఱింగించి, యట దివ్యచిత్తంబున నవధరించిన భంగి సేయువారమై చనుదెంచితిమి; మాకుం జూడఁ బాండవులు పొడ వడంగి లేకపోయిరిగాని యీ లోకంబున నునికి గలిగిన నగపడకుండ నేర; రిది యిక్కార్యంబు నున్నరూపు; మఱియొక్క విశేషంబునం బ్రియం బంది వచ్చితిమి; చిత్తగింపుము.

4.3.89

సీ. మత్స్యదేశాధీశు మఱఁదిఁ గీచకునిఁ బు | ణ్యోజ్జ్వలాకృతి యగు నొక్క వనిత
కతమున నడురేయి గంధర్వు లతిరహ | స్య ప్రకారంబునఁ జంపి; రదియు
నక్కజం బాయుధవ్యవహార మేమియు | లేదు, శిరంబు కా ల్గేలు డొక్క
లోనికిఁ జొరఁద్రోచి పీనుంగు ముద్దగాఁ | జేసివైచిరి దుష్టచిత్తులైన
తే. యతని తమ్ముల నొక్కరినైనఁ దప్పి | పోవనీక యా రాత్రియ పొదివి చిత్ర
నిహతిఁ దెగఁజూచి యనిరూపణీయ దుర్ని | వారవృత్తిమై నరిగిరి కౌరవేంద్ర!

4.3.90

వ. విరాటుండు పగతుండు గావునఁ దదీయవ్యసనం బెఱిఁగింపవలయు నని విన్నవించితి; మది యట్లుండె; బాండవులనన్వేషించుపని యిటమీఁదంజిత్తగించు తెఱంగానతిచ్చునది, యనిన విని ‘యట్ల చేయుదము గాక!’ యని వారలఁ బోవం బనిచి, కొంతసేపు చింతాక్రాంతుండై, య మ్మహీకాంతుండు మంత్రులం జూచి యిట్లనియె.

4.3.91

తే. ‘సమయ సముచిత కృత్యంబు చక్కఁ జేసి | పాండవులు రాజ్యమున కాసపడకమున్న
యరసి యెఱిఁగి యరణ్యంబు నందుఁ దొంటి | యట్ల యిడుమలఁ గుడువఁ బో నడుపవలయు.

4.3.92

క. ఎఱుఁగుట దుర్ఘట; మెవ్విధి | నెఱుఁగంగా వచ్చు? మీర లెల్లను మీమీ
యెఱిఁగిన చందంబున నా | కెఱిఁగింపుఁడు వారి వెదకి యెఱుఁగు తెఱంగుల్‌.’

4.3.93

వ. అనిన రాధేయుం డిట్లనియె.

4.3.94

ఆ. ‘వివిధ దుర్నిరూప వేషముల్‌ గైకొని | నిఖిల దిశలయందు నిపుణవృత్తి
నెఱుఁగునట్లుగా ననేకులఁ బుచ్చిన | నెల్లి నేఁటిలోన నెఱుఁగఁబడరె?’

4.3.95

క. అను పలుకులు విని దుశ్శా | సనుఁ డేమియు సరకుగొనక సమదవిలాసా
ననుఁడై నిజాగ్రజన్మునిఁ | గనుఁగొని యిట్లనియె గాఢ గర్వ స్ఫూర్తిన్‌.

4.3.96

చ. ‘వలవదు రోయఁ బాండవుల; వా రొక యూఱట లేని త్రిమ్మటన్‌
బల మఱి వన్య సత్త్వముల పాల్పడి చచ్చినచోటఁ బూరియు
న్మొలవదె యింత! కిం కిట మనోముద మస్ఖలితంబు గాఁగ వి
చ్చలవిడి రాజ్యలక్ష్మిఁ దగు చందమునం గొనియాడు మున్నతిన్‌.’

4.3.97

వ. అనిన విని దరహసితవదనుం డగుచుఁ గుంభసంభవుం డిట్లనియె.

4.3.98

ఉ. క్షాత్రసమగ్రు, లార్యనుత గౌరవదీప్త్తులు, వర్ణనీయ సౌ
భ్రాత్రు, లుదాత్త దైవబలభవ్యులు, దివ్యసమాను, లా పృథా
పుత్రులు; వారి నాపదలు వొందునె? యోపిన నింకనైన నీ
ధాత్రిఁ గడంగి యారయు విధంబులు సెప్పుఁడు నేర్పు లేర్పడన్‌.’

4.3.99

వ. అనిన నాతని మాట లాదరించి భీష్ముం డిట్లనియె.

4.3.100

ఉ. ‘నల్లవొ! నిక్క మాడె నృపనందను ముందట ద్రోణుఁ డొక్కఁడుం;
దెల్లము; వారు బాహుబల ధీబల దైవబలంబు లొప్ప వ
ర్తిల్లుదు; రమ్మహాత్ముల కరిష్టము లేమిట నెందు నేల పా
టిల్లెడు? వారిఁ గాన్పను గడింది తదీయ మహానుభావతన్‌.

4.3.101

క. వారలును వీరలును నా | కారయఁగా నొక్కరూప యైనను గార్యం
బీ రెఱిఁగింప వలయునని | కౌరవపతి నన్ను నడిగెఁ గాన యితనికిన్‌.

4.3.102

క. కలరూ పెఱిఁగింపంగా | వలయుం; జెప్పెద మదీయ వచనములు హితం
బులు గాఁగ నిశ్చయ స్థితిఁ | దలఁచి యనుష్ఠింప బుద్ధి దలకొను నేనిన్‌.

4.3.103

సీ. బ్రాహ్మణభక్తియుఁ, బరహిత శక్తియు | నిర్మల మతియును, నీతి రతియు,
సత్యభాషణమును, సాధుపోషణమును | జిరవితరణమును, సేవ్యగుణము,
సన్మార్గరక్షయు, నున్మత్తశిక్షయు | నంచితోదయముఁ, గృపాతిశయము,
బంధు సంప్రీతియు, భవ్య విభూతియు | శాస్త్రోపగమము, నస్ఖలితదమము
తే. సజ్జన స్తవనీయ సౌజన్యములును | ధర్మసంచిత బహు ధన ధాన్యములును
గలుగు నక్షీణ పుణ్యదోహలుఁడు ధర్మ | సూనుఁ డున్న దేశంబున మానవులకు.

4.3.104

క. మఱియును నొక్క విశేషం | బెఱిఁగించెద; నతని యున్న యెడ గోధనముల్‌
మెఱుఁగెక్కి పాఁడి నేమిం | గొఱఁతవడక యుండఁజేఁపి కురియుచు నుండున్‌

4.3.105

వ. కావున నిట్టి దేశం బిప్పు డెయ్యది యగు నందుఁ గుంతీ తనయుల నరయం బనుపవలయు’ ననినఁ గృపాచార్యుం డిట్లనియె.

4.3.106

క. ‘అరయఁగ నయ్యెడు తెఱఁగుల | నరయుట కార్యంబు; వారి నాలస్యము లే
కరయునది; పెక్కు భంగుల | నరసినఁ దోఁచెదరుగాక! యది యట్లుండెన్‌.

4.3.107

ఉ. వారలు పూనినట్ల వనవాసము సల్పిరి, వీరు వేచి త
మ్మారయఁగా బయల్పడని యట్లుగ నుండెడు వత్సరంబునుం
జేరువ చేరువల్‌ గడచెఁ; జిత్తములుం గలుషంబు లమ్మహా
వీరుల కీ నృపాలునెడ, వీరికి నూరక యున్కి గర్జమే?

4.3.108

క. అలుచైనను బగతుని దెసఁ | దలఁపు గలుగవలయుననిన, దర్పోజ్జ్వల దో
ర్బలు లగు కౌంతేయుల మన | మెలమి కలిమి నచ్చి యిట్టు లేమఱ నగునే?

4.3.109

చ. మన బలమెంత యంతయు సమగ్ర సముద్యమ దుర్ధరంబుగా
మును మును గూర్చి, తోడుపడు మూఁకలకుం దగుమైఁ గ్రమ క్రమం
బున నెఱిఁగించి రాఁబనిచి, భూరి సముజ్జ్వల సైన్య జృంభణం
బున వెరవొంది యున్కి కురుభూపతి కిప్పటికార్య మారయన్‌.

4.3.110

ఆ. పాండురాజసుతులు బాసమై నడవడి | గడచి కయ్యమునకుఁ గాలుద్రవ్వ
కున్న యట్టులైన నన్నరనాథుతో | సంధిసేయు టొప్పు సముచితముగ.

4.3.111

క. ఏచి చలంబున నొంటికిఁ | జూచిన, నప్పటికి మనకుఁ జూడం గార్యం
బే చందంబునఁ దెఱఁగగు | నా చాలుట కోర్వవలయు; నది యట్లుండెన్‌.

4.3.112

క. వారలు లేరట పో, పెఱ | వారలఁ దగు భంగి మనకు వశ్యులఁ జేయన్‌
భూరి బలయుతుల మగుటయుఁ | గారణమను టనుమతంబు గాదే మనకున్‌.’

4.3.113

తే. ఇవ్విధంబునఁ దమ తమ యెఱుఁగు తెఱఁగు | లందఱును జెప్ప విని కురునందనుండు
దగ విచారించి కార్యంబు తెగువ గాంచి | యెలమి వారలఁ గనుఁగొని యిట్టు లనియె.

4.3.114

ఆ. ‘సింహబలుఁడు భీమసేనుండు శల్యుండు | హలధరుఁడు సమాన బలమువార,
లొండొరులను గెలుచు నుత్సాహమును గల | రుద్ధతులును బాహుయుద్ధపరులు.

4.3.115

క. ఈ నలువుర భుజశక్తుల | తో నెనయఁగఁజాలునట్టి దోర్బల మెందుం
గానము కావున వీరల | లోనన యొండొరుల కని గెలుపు సమకూరున్‌.

4.3.116

ఉ. తక్కినవార లాతనికి దవ్వుల చోటులవారు; వాయుజుం
డొక్కఁడ యింక సింహబలు నుద్ధతి మాన్చిన మాన్చువాఁ; డతం
డక్కడ నిల్చెఁ గావలయు; నాసతి ద్రౌపది గాఁగ నోపు; వే
ఱొక్కరుఁ డాజిఁ గీచకుల నోర్వఁగఁ జాలమి మీ రెఱుంగరే?

4.3.117

క. గంధర్వు లను నెపంబున | నంధతమసగూఢవృత్తి ననిలసుతుఁడు గ
ర్వాంధమతియైన సూతు స | బాంధవముగఁ జంపెఁ గాక, పరులకు వశమే?

4.3.118

వ. పితామహుం డుపదేశించిన లక్షణంబు లద్దేశంబున గలిగి యుండునని విందుము; పాండవులు ప్రచ్ఛన్న వేషంబున విరటు ప్రోల వసియించినవారు గావలయు; నతండును బ్రతిభటుం డయి భంగించుచుండుం; గావున నతని పయి నెత్తిపోయి తదీయ గోధనంబుల గ్రహించిన ధర్మతనయుండును దమ్ములు నడ్డపడం బఱతెంతు; రయ్యవసరంబున మనము సమయ భంగంబు చెప్పి వారలం గ్రమ్మఱఁ బండ్రెండు వత్పరంబులు వనవాసంబు సలుపంబుత్త; మట్లైన నప్రతిహతంబుగాఁ జితురంతభూచక్రం బాక్రమించి కీర్తనీయులమై వర్తిల్లుదుము; కుంతీనందను లందులేక తక్కిన మత్స్యపతి సమస్త వస్తువులను జూఱగొంద; మదియును లాభంబ; యెల్లభంగుల నిప్పటి కిదియె కార్యంబు; మీకు నందఱకుం జూడఁబోలునేని దీని కనురూపం బగు నుద్యోగంబు సేయుం ‘డనినఁ ద్రిగర్తాధీశ్వరుండగు సుశర్మ తొలుతఁ గర్ణ దుశ్శాసనులతోఁ గొండొక ప్రసంగించి వారల యనుమతి నవనీపతితో నిట్లనియె.

4.3.119

క. ‘కేకయ సాల్వులు తోడుగ | నా కీచకుఁ డాజి నన్ను నపజితుఁ జేసెం;
జాకుండమున్న యొకపరి | నా కాతని తోడ భండనము లేదయ్యెన్‌.

4.3.120

ఉ. భంగముతోడ నున్న ననుఁ బంపు విరాటునిమీఁద; భూమికిం
జెంగట నుండు నా దయిన జీతపు టూళ్ళును; సంతతంబు వా
నిం గడు గాసిసేయు నతనిం జెఱుపం దఱి యయ్యె; ముట్టి స
ప్తాంగముఁ జూఱఁదెచ్చెద నహంకృతి యెల్ల నడంచి వచ్చెదన్‌.

4.3.121

ఆ. ఉద్దవిడిన పసుల నూఁచముట్టుగఁ దెత్తు | నతఁడు వెనుకవచ్చి యడ్డుపడిన
చోటఁ బాండురాజు సూనుల నరయుదు | నెల్ల భంగి దీని కేన తగుదు.’

4.3.122

వ. అనవుడుఁ గర్ణుం డిట్లనియె.

4.3.123

క. ‘బరవసముమైఁ ద్రిగర్తే | శ్వరుఁ డిట్లను టుచిత; మింక జననాయకుఁ డె
ప్పరుసున నానతి యిచ్చెను | దొర లేమని రట్లచేయఁ దుదిఁ గార్య మగున్‌.’

4.3.124

చ. అను నినసూనుమాట విని యందఱఁ గన్గొని పెద్దలెల్ల ని
న్ననుమతిసేయ సైన్యముల నన్నిటిఁ బన్నఁగఁ బంపు; రెండుమై
ల నడత; మీ త్రిగర్తుల బలంబుల ముందటఁ బంచి, వానిపో
యిన మఱునాఁడు పోద’ మనియెం గురునాథుఁడు దుస్ససేనుతోన్‌.

4.3.125

చ. అనుటయు ఫాలభాగ కలితాంజలియై యతఁ ‘డట్ల చేయువాఁ
డ‘ ననిన, మేదినీశుఁడు దృఢం బగు నిశ్చయ మెల్లవారుఁ గై
కొనుటకుఁ గార్య బోధమునకుం దగఁ జుట్టుల నున్న వారలం
గనుఁగొని యాదరాధిక సగౌరవ భావనతోడ నిట్లనున్‌.

4.3.126

ఉ. ‘మున్ను సుశర్మ దాను బలముం జని గోవులఁ బట్టుఁ; బట్టినన్‌
వెన్నడి వచ్చు మత్స్య పృథివీపతి సేనల నెల్లఁ గొంచు శౌ
ర్యోన్నతి సూపువాఁడయి; సముద్ధతిమై నిట వేఱ కౌరవుల్‌
కొన్నిటిఁ బట్టఁ గయ్యమునకుం బఱతెంతురు పాండునందనుల్‌.

4.3.127

ఉ. కందువ సెప్పి యొక్కెడఁ ద్రిగర్తులు దాడికిఁ గూడువారు; మీ
రందఱు వేఱ యొక్కయెడ నాజికి సేనల గూర్పుఁ; డెల్ల వాఁ
డుం దనవారిఁ దోకొని కడున్‌ రభసంబునఁ గూడి వార్తకున్‌
ముందఱఁబోయి గోధనము ముట్టుకొనన్‌ వలయున్‌ మహోగ్రతన్‌.’

4.3.128

వ. అని చెప్పి వెండియు సుశర్మం జూపి.

4.3.129

క. ‘బహుళాష్టమి నీతఁడు స | న్నహనముతోఁ బసులఁ బట్టు, నవమిని మన గో
గ్రహణ’మని నిశ్చయించిన | నహికేతను పలుకులకు మహాహ్లాదమునన్‌.

4.3.130

వ. సమస్త పరిజనంబులును సముద్యుక్తులై; రట్టి సమయంబున.

4.3.131

ఆ. పాండురాజసుతులుఁ బాంచాలియును దమ్ము | నొరు లెఱుంగకుండఁ దిరుగవలయు
దుష్కరంపుటేఁడు దుదిసేరఁబాఱె, నె | వ్వరును దీనిఁ దలఁప వలను లేర.

4.3.132

వ. సుశర్మయు నేలినవాని పనిఁ బూని జోడు పక్కెర కైదువు బిరుదు రవణంబు మొదలైన సవరణంబులం జూడ నక్కజంబుగాఁ గూడి, పరదేశం బాపోశనంబు గొనం దమకించు తన బలంబుల గజిబిజి యుడిపికొని, గోగణంబుల యగపా టూహించి, జతనంబుతో నడచుచుండియు వెసఁ గుందక వేగిరంపుఁ బయనంబు లయ్యును బ్రజల నోలాకుపడనీక, యెత్తెడుచోట్లను విడిదలల యందును లోనుగా నిస్సాణాదులైన యుద్భట చిహ్నంబులు ప్రకటింపక దాడిమెయిం జని, వేగులవారివలన విరాటు తొఱ్ఱులున్న యెడ యెఱింగి, గ్రద్దనం
గదుపులఁ గార్చిచ్చు చందంబునం బొదివి వెలిచిన.

4.3.133

శా. కూడంబాఱి సముద్ధతిం గడఁగి తద్గోపాలకుల్‌ మూఁక ల
ల్లాడం దాఁకి, నిశాతసాయక పటు వ్యాపార ఘోరంబుగా
నీడం బోక పెనంగినం గని, త్రిగర్తేశుండు చే వీచుడుం
గ్రీడాఘాత నిరూఢి నాశ్వికులు వారిం దున్మి తూఁటాడినన్‌.

4.3.134

వ. వారలలోన.

4.3.135

చ. అసదుగఁ దాఁకి మేనఁ దఱచై పొరి నెత్తురు గ్రమ్ము పోటులన్‌
వస మఱి తూలుచుండియును వారని భీతిఁ బదంబులం గడున్‌
వెస కలిమిం బురంబునకు వేగమె కొందఱు పాఱి, మత్స్యనా
థు సభకు నేఁగి, దీనదశతోఁ బ్రణమిల్లుచు నార్తమూర్తులై.

4.3.136

క. కారణ మెయ్యది యగు నొకొ! | వీరల దురవస్థ కనుచు వెఱఁగందెడు నా
భూరమణుఁడు సభయును విన | నీరెలుఁగు దలంకఁ బల్కి రిట్లని గోపుల్‌.

4.3.137

చ. ‘హయ రథ దంతి సంతతి నిరంతర దుర్దమలీలఁ బేర్చి నే
ల యవిసి మూఁగినట్లగుబలంబులతోడఁ ద్రిగర్తు లెంతయున్‌
రయమున గోవులం బొదివి, రక్షకు లొక్కట నార్చి తాఁకినన్‌
భయదమహాస్త్ర శస్త్ర పటుపాత పరంపరఁ దున్మి యుద్ధతిన్‌.

4.3.138

క. గోవులకు వెనుక యై వెసఁ | బోవుచునున్నారు; కడవఁబోవక యుండం
బోవలయు నడ్డపడియెడు | దీవసమెదఁ గలిగెనేని దేవర! కడఁకన్‌.’

4.3.139

వ. అనిన విని విరాటుం డదరిపడి.

4.3.140

శా. ‘ఏమీ నిక్కమె! మున్నెఱుంగఁడె త్రిగర్తేశుండు? మద్గోధన
స్తోమంబుం గొనిపోవు తెంపునకు నుద్యోగించెనే? మేలుమే;
లామై తోడనె పోవుఁగాక!’ యని వీరాలాపముల్‌ వల్కి యు
ద్దామ క్రోధ శిఖాకలాప వికటోద్య ద్భ్రూకుటి స్ఫూర్తియై.

4.3.141

చ. సచివులఁ జూచి ‘యిప్పుడ వెసన్‌ మన మెయ్దక తక్కినం బశు
ప్రచయము తప్పిపోవుఁ; దుది భంగము సేఁగియు వచ్చుఁగాక మీ
రుచిత విధాన సత్వరత నుద్ధతయోధ సమగ్రవాహినీ
ప్రచలిత భూమి భాగముగఁ బన్నఁగఁ బంపుఁడు దండనాథులన్‌.’

4.3.142

వ. అని నియోగించి.

4.3.143

శా. యాన ప్రక్రమ సూచకంబు లగు తూర్యంబుల్‌ దిశాపాటన
ధ్వానస్వైరవిహార కల్పిత సముద్ర క్షోభముల్‌గా ధరి
త్రీ నాథుండు రణోచితోద్యమము సంధిల్లంగ శస్త్రా స్త్రవ
ర్మానీతిక్రమ దక్షులం బనిచె నయ్యై వారికిం గ్రక్కునన్‌.

4.3.144

ఉ. సారథిఁ జూచి ‘నీవు రభసంబునఁ బూన్పుము ఘోటకంబులం
దేరఁ; దదీయ వర్మము లతిస్ఫుట బంధముఁగాఁగ బెట్టు; నీ
వీరవచోవిలాసములు విందుము ము; న్ని దె వచ్చెఁ గయ్య; మే
పారఁగఁ జూపు నీ దగు నహంకృతికిం దగు ధైర్య మియ్యెడన్‌.’

4.3.145

వ. అని పనిచి తానును యోధవీరోచిత ప్రకారంబున సింగారంబు సత్వరంబుగాఁ జేసికొని ఖచిత కాంచన బిందు సందోహంబగు సన్నాహంబు వెట్టికొని, విరచితాలంకార చక్రంబును బద్ధపరికర కూబరాక్షయుగాద్యవయవంబును బ్రతికల్పిత తురంగంబును సన్నివేశిత వివిధాయుధంబును సన్నద్ధ సారథికంబును నైన రథంబెక్కి గోగణ హరణ ప్రదేశంబు పశు పాలకులం దెలియ నడుగుచు వెడలునప్పు డమ్మత్స్యపతి యనుజన్ముండు.

4.3.146

శా. లోకస్తుత్య విభూతి నన్యపృతాలుంటాక బాహా బల
శ్రీకల్మిన్‌ రథ దంతి ఘోటక భటశ్రేణీ సముద్దాంత సే
నా కల్పధ్వజ విభ్రమంబున సుహృద్య ప్రోద్యముండై శతా
నీకుం దుద్ధతి నేఁగుదెంచె నఖిలానీకంబు నుప్పొంగఁగన్‌.

4.3.147

ఉ. ఆతని తమ్ముఁడైన మదిరాశ్వుడు కర్ణ ఝళంఝళా సము
ద్ధూత బలోత్థరేణు పరిధూసరితాంబరమైన వారణ
వ్రాతము గొల్చి రాఁ గడఁగి వచ్చె సముజ్జ్వల హేమవర్మని
ర్యాత రుచిచ్ఛటా పటల రంజిత హేతి మహోగ్ర సైన్యుఁడై.

4.3.148

తే. అతని యనుజుండు సూర్యదత్తాహ్వయుండు | సమద సైనిక నానాస్త్ర శస్త్ర బహుళ
దీప్తిజాలక ప్రతిహత దినకరాంశు | రాజియై చనుదెంచె సంరంభ మెసఁగ.

4.3.149

ఉ. తెల్లని జోడు పెట్టుకొని తీవ్రగతిం జనుదెంచె మత్స్య భూ
వల్లభు నగ్ర నందనుఁడు వైరి మదాపహ విక్రమ ప్రకా
రోల్లసితుండు వన్యబల ముద్ధతిఁ గొల్చు మృగేంద్రురేఖ శో
భిల్లుచు నుండ శంఖుఁడు విభీషణ శంఖనినాద మొప్పఁగన్‌.

4.3.150

వ. మఱియు ననేక యోధవీరులు వివిధ వాహనారూఢులై గాఢసన్నాహంబులగు నిజవ్యూహంబులతో నేతెంచు చుండిరి; విరాటుండు బలంబులం గూర్చికొను తలంపునం బురబహిరంగణంబునం గొండొకసేపు నిలిచె; నట్టి సమయంబున ధర్మతనయుం డనిలతనయ మాద్రీతనయుల ‘నంతంతం బొడసూపి నిలువుం’డని నిపుణంబుగా నియోగించి, తానును మత్స్యమహీవల్లభు నల్లనఁజేరి యిట్లనియె.

4.3.151

చ. ‘ఒక ఋషిచేత నాయుధ సముత్కర మెల్లను సప్రయోగమం
త్రకముగ నభ్యసించి సమరంబునకుం గొఱయైనవాఁడ; గో
ప్రకరములన్‌ మరల్చుటకు బంధులు నీవును బోవ నాకు నిం
టికడన యున్కిపాడియె? ఘటింపఁగఁ బంపు రథంబు సయ్యనన్‌.’

4.3.152

క. అనిన విని యియ్యకొను న | మ్మనుజాధీశ్వరునితోడ మఱియు నతం డి
ట్లనుఁ, బవనతనయుఁ గవలం | గొని సమరంబునకుఁ బోవఁ గోరెడు మదితోన్‌.

4.3.153

సీ. ‘మన వలలుండు లావున బంటుతనమున | జను లెఱుంగఁగ సడిసన్నవాఁడు;
మంచిమగండు దామగ్రంథి యసమసం | గ్రామకేళీ గాఢ కౌతుకుండు,
వినుము, తంత్రీపాలుఁడును దుర్దమారాతి | మర్దనచాతుర్య మహిత భుజుఁడు;
మున్నును వీరలు మువ్వుర కడఁకల | కొలఁదు లే నెఱుఁగుదుఁ గొంతకొంత;
తే. యెక్కఁదగునట్టి యరదంబు లిచ్చి వీరి | ననికిఁ దోకొనిపోక కార్యంబు నాకుఁ
జూడ!’ ననవుడు మేదినీశుండు హర్ష | నిర్భరాత్మకుఁ డై శతానీకుఁ జూచి.

4.3.154

వ. కంక వలల దామగ్రంథి తంత్రీపాలురం జూపి యిట్లనియె.

4.3.155

మ. ‘రథముల్‌ మంచివి గాఁగ నాలు గతిశీఘ్రవ్యాప్తి సత్త్వంబులం
బ్రథితంబైన తురంగమోత్కరము సంగ్రామర్హ చాపంబు ల
శ్లథవర్మంబులు వీరికిమ్ము; రణలీలాదక్షతన్‌ మన్మనో
రథముం దీర్పఁగ వీర లోపుదురు దోర్గర్వం బఖర్వంబుగన్‌.’

4.3.156

వ. అనిన నతం’డట్ల చేయుదు’నని వారలం దోడ్కొని చని సమస్తంబును సన్నద్ధంబు గావించి, యంగరాగ మాల్యాంబరాభరణంబుల నలంకృతులం జేసినం గైకొని, తమయంతవట్టునుం గూడుకొని సూతకృత్యంబులకుం దార చాలి, రథంబులు దోలికొని చనుదెంచిరి; తదనంతరంబ.

4.3.157

సీ. గంధ దంతావళ కర్ణమారుతహతిఁ | గాంతారములు చాఁపకట్టువడఁగ,
రథ ఘోషమునఁ బ్రతిరవమిచ్చునద్రులు | భయమున వాపోవు భంగి నుండఁ,
దురగ ఖురోద్ధూత ధూళి దన్బెరసిన | వననిధి పిండలివండు గాఁగ,
బహుళపదాతి దుర్భరభార మడరిన | నురగకూర్మంబు లొండొదంటిఁ బొంద
తే. సైన్యముల నడిపించె నుత్సాహలీల | యతిశయిల్లంగ సంరంభ మగ్గలింప
బరవసము మిక్కుటంబుగఁ బసులు సన్న | జాడఁ గై కొని యమ్మత్స్యజనవిభుండు.

4.3.158

వ. ఇట్లు చని కూడముట్టిన.

4.3.159

క. విరటు బలంబుఁ ద్రిగర్తే | శ్వరు బలముం జెలఁగ నార్చి వడిఁ దాఁకె భయం
కరనాద మేదురములగు | శరనిధు లొండొంటిఁ దాఁకుచందం బమరన్‌.

4.3.160

మ. గుణరావంబుఁ గృపాణ ఘట్టన రవక్షోభంబునుం, గింకిణీ
క్వణన వ్యావృత హేషితస్వనములున్‌, ఘంటా నినాదాత్త పో
షణ నానాపటు బృంహిత ధ్వనియు, శశ్వద్గాఢమై పేర్చినన్‌
రణనం బించుక దోఁప లేద బహుతూర్యశ్రేణి నా సేనలన్‌.

4.3.161

వ. అట్టి సమయంబున.

4.3.162

సీ. ఒండొంటితోఁ దాఁకి మండెడునవియును, | జిందముల్‌ పొడిపొడి సేయు నవియు.
గట్టి మైమఱువులు దట్టముల్‌ గావించు | నవియును, నెఱను నోనాడునవియు,
నెట్టుపైఁ బడి మేని నెగయించునవియును | దల నేల డొల్లంగఁ దాఁకు నవియు,
నిరుమెయిఁ దొలిచి బె ట్టిలఁ దూఱు నవియును, | నలువుర నేవుర నాఁటు నవియు.
తే. నైన శరములు గనుఁగొని యాడి యాడి | నారదుఁడు పిచ్చలింపంగ వీరకేళి
సలిపె నుద్ధతిమై ధనుర్బలము లడరి | లావు వెరవును నెఱయఁ జలంబు మెఱయ.

4.3.163

వ. అప్పుడు సుభటులు గడంగి.

4.3.164

ఉ. ఏటుల మ్రొగ్గువారిఁగని యించుక కొంకక యర్ము పెంపునం
బోటుల వాతఁ బోవు భటపుంగవులన్‌ మది మెచ్చుచున్‌ వడిన్‌
వ్రేటులఁ గ్రీడ సల్పి, పృథివిం బడు వీరులఁ ద్రొక్కి కొంచు నె
చ్చోటులనైన నగ్గలికఁ జొత్తురు నెత్తురు వఱ్ఱు సేయుచున్‌.

4.3.165

సీ. ఒక్కఁడు పెక్కండ్ర కెక్కిన విచ్చియుఁ | బొదివి చెఱొకపోటు వొడుచు నెడలుఁ,
బలువు రొక్కనిమీఁదఁ బఱపిన సైరించి | నళికి పైఁ బెట్టక నిలుచు నెడలు,
దళము దళంబుతోఁ దాఁకి యగ్గలికమై | నీడఁబోవక వ్రేటులాడునెడలు,
నోహరి సాహరి నుయ్యాలచేరుగా | వెనుకొంచుఁ దెరలుచుఁ బెనఁగునెడలు
ఆ. నై యనేకభంగి నాశ్విక సేనలు | బొమ్మ లాడినట్లు పోరుచుండె
నమరగణము సిద్ధ సమితియు వేడుకఁ | జదల నిలిచి చూచి సంస్తుతింప.

4.3.166

వ. ఒక్కయెడ.

4.3.167

ఉ. ఒండొరు మీఱు కోర్కిమెయి నొక్కట బాసలవారు సొచ్చినన్‌
రెండయి పాయ యిచ్చిన యరిప్రకరంబులు వేఱువేఱ యు
ద్దండ భుజాబలం బలరఁ దాఁకిన సంగడిఁ బాఱుచుండఁగా
గం డమరంగ నిల్చి చెలికాండ్రయి క్రమ్మఱ వత్తు రిద్దఱున్‌.

4.3.168

సీ. కరశీకరంబులుఁ గరట గళద్దాన | తోయంబులును ధరాధూళి మ్రింగఁ,
బొడవుల సడిసన్న యొడళులడెక్కియ | మ్ముల పెంపు గగనంబు గొలఁదివెట్ట
బృంహిత ధ్వనులును బృథుల ఘంటావలీ | రవములు దిక్కుల నవులఁద్రోవ
రోషారుణాక్షుల రుచులును సిందూర | కాంతియు రవి దీప్తిఁ గ్రమ్మఱింప
తే. జోదు లొక్కట వా లంపసోన గురియ | రౌద్ర రస మాకృతులఁ దాల్చి రణ మొనర్చు
కరణి నత్యుగ్రముగఁ గరి ఘటలు గడఁగి | కలను పీనుంగు పెంటగాఁ గలయ బెరసె.

4.3.169

ఉ. అక్కజమైన శౌర్యమును నద్భుత సంపద నొందు శక్తులుం
జిక్కని మేనులున్‌ మొనకుఁ జెల్వగు కైదువులుం దగంగ ను
క్కెక్కిన యట్టి మేటి మగ లించుక వారణలేక ఖేచరు
ల్వెక్కస మంద నొచ్చియుఁ జలింపక పోరిరి పెక్కు భంగులన్‌.

4.3.170

సీ. నొగనొగతోఁ దాఁకి పగులంగ నరదంబుఁ | బఱపి యా తేరిపై కుఱుకువారు.
రథ్యముల్‌ వడ్డ విరథులయ్యు నసి ముద్గ | రాదుల నడరి పోరాడువారు,
సారథి నొచ్చినఁ దేరును గడపుచు | నేయుచుఁ గయ్యంబు సేయువారు,
నరదంబుపైవ్రాలి యాలోన దెలిసి త | న్నేసినాతనిఁ బడ నేయువారు
తే. నగుచు రథికనికాయంబు లడరి యప్ర | మత్త నిజచిత్తవృత్తులై మగతనంబు
ఘోరమూర్తులు గైకొని పోరునట్లు | సలిపె సంగ్రామకేళి సంకులముగాఁగ

4.3.171

వ. ఇ ట్లిరువాఁగును నరవాయి గొనక పెనంగుచుండ.

4.3.172

ఉ. భీకరబాణ వర్షముల పెల్లున వైరులు పెల్లగిల్ల మౌ
ర్వీకృత గర్జితంబు పృథివీ వియదంతరమెల్ల నిండ ను
గ్రాకృతి కల్ప సంక్షయ మహాభ్రముచందము నొందుచున్‌ శతా
నీకుఁడు దాఁకెఁ గంకటమణిద్యుతి విద్యుదుపాంతకాంతియై.

4.3.173

తే. అతఁడు నానాప్రకార శస్త్రాస్త్ర నిహతి | నతుల విక్రమ విభవ మనర్గళముగ
యోధసారథి యుగ్యసంయుతము గాఁగ | నూఱు రథములు వ్రేల్మిడి నుగ్గుచేసె.

4.3.174

మ. మదిరాశ్వుండు కడంగి యన్నకు బలోన్మాదంబు రెట్టింప స
ప్రదర జ్యా లతికాక్రియా సమభిహారక్రీడనం బప్పు డొ
ప్పిదమై యోగ వియోగ సంధులు నిరూపింపంగరాకుండఁ గ
ర్ణ దళోపాంతము వింతసేయ నడరెన్‌ రౌద్రంబు శోభిల్లఁగన్‌.

4.3.175

క. అడరివడి రథచతుశ్శతి | పొడిసేసి, పరాక్రమం బపూర్వంబై యే
ర్పడఁ గరిహయ నరనికరము | బడలుపడం దఱిమె నలి నభశ్చరు లార్వన్‌.

4.3.176

ఉ. మండలచారియై రథ మమానుషవిక్రమలీల నొప్ప ను
ద్దండ భుజాబలంబు ప్రథితంబుగ నత్తఱిఁ దాఁకి సూర్యద
త్తుం డనివార్య శౌర్యగుణ ధుర్యుఁడు వీఁడ యనంగఁ బేర్చి వే
దండ ఘటావిపాటనవిదగ్ధతఁ బొల్చె రణాంగణంబునన్‌.

4.3.177

ఉ. అప్పుడు శంఖుఁ డెంతయుఁ బ్రియంబునఁ బెండ్లికిఁ బోవునట్లు మో
మొప్పఁగ నస్త్రశస్త్రముల యుల్లసనంబున శత్రునేత్రముల్‌
కప్పఁగఁ జీఁకటుల్‌ రణముఖంబు సమస్తముఁ దానయై రథం
బుప్పర వీథిఁ దోలికొని యుగ్రగతిం బఱతెంచి తాఁకినన్‌.

4.3.178

తే. మందరాచల చటుల విమర్దనమున | ఘూర్ణమానమై గాఢ సంక్షోభ మెసఁగఁ
దలఁకు జలనిధి నాఁ ద్రిగర్తక్షితీశు | బలము తిరుగుడువడియె సంకులముగాఁగ.

4.3.179

వ. అయ్యవసరంబునం దక్కిన దొరలును దలపడి యతిభీమంబుగా సంగ్రామంబు సేయం దొడంగిన.

4.3.180

చ. అనుజ తనూజ మంత్రి సుభటాప్తజనంబుల పోరు చూచి నె
మ్మనమునఁ బొంగి మై పెనిచి మత్స్యమహీరమణుండు సారథిం
గనుఁగొని ‘యల్ల కంటె మొనఁ గ్రాలుచునున్న త్రిగర్తనాథు కే
తనమున చక్కటిన్‌ మన రథంబు వెసం జన నిమ్ము’ నావుడున్‌.

4.3.181

క. అగ్గలిక నతఁడు హయముల | పగ్గంబులు సడల విడిచి పటురయమున నా
మొగ్గరము దఱియఁ బఱపిన | మ్రగ్గెను రథపంచశతము మత్స్యాధిపుచేన్‌.

4.3.182

మ. అవనీనాయకుఁ జూచి యేచి నలి వీరావేశ దుర్దాంతమై
కవిసెం గుంత భుశుండి తోమర గదా ఖడ్గాది శస్త్రాస్త్ర తీ
వ్ర విహారంబు విరోధి దుర్విషహ సంరంభంబుగా నొక్క పె
ట్ట వడిం దద్బల మెల్ల నారదుఁడు వేడ్కం గుంచె సారింపఁగన్‌.

4.3.183

వ. ఇవ్విధంబున విరాటుండు తానును సేనయుం జేయం గలవారును, బరవసంబు సేసి యొక్కుమ్మడి నడరుటయుం, దెరలి మరలిన నిజసైన్యంబు దైన్యంబు గలయం గనుంగొని, కోపాటోపంబునం గెంపుగదురు లోచనంబులుం బెంపొలయు భుజశిఖరంబులుం గలిగి తానుం దమ్ముండును సంగడంబుగాఁ గోల్తలసేసి రథసమూహంబుతో విరాటవ్యూహంబు నెదురుకొని.

4.3.184

క. బలవిక్రమములు మెఱయఁగఁ | దలపడి రథ దంతి హయ పదాతి చయంబుల్‌
కలను సుడివడఁగఁ దామర | కొల నేనుఁగు సొచ్చినట్లు గురువుగఁ జొచ్చెన్‌.

4.3.185

ఉ. ఏలినవానిఁ గాంచి, మొనలెల్లను నెంతయు దర్ప మెక్కి యా
భీల నిశాత హేతిరుచి భీకరలీల నెదిర్చి, మత్స్య భూ
పాలక సైన్యరాజిఁ దలపడ్డ మహోగ్రతఁ బేర్చి, యా సమి
త్కేళి వియచ్చర ప్రతతికిన్‌ వెఱఁగందఁగఁ జేసె నెంతయున్‌.

4.3.186

తే. కడిమి మెఱయంగఁ బోరు త్రిగర్తనాథు | రథముఁ గనుఁగొని కడఁగి విరాటవిభుఁడు
వరవునకు నల్గినట్టుల సరకుగొనక | యతుల రభసాతిరేకత నతనిఁ దాఁకె.

4.3.187

వ. ఇట్లు దలపడి.

4.3.188

మ. పటువేగంబగు శాతభల్లచయ సంపాతంబునన్‌ మింట మి
క్కుటమై మంట ధగద్ధగద్ధగ యనం గోపంబు రూపంబులై
చటులక్రీడఁ జరించు న ట్లిరువురున్‌ శౌర్యోన్నతిం బోరి రు
త్కట దర్పోద్ధతులై పరస్పర జయాకాంక్షం బ్రచండంబుగన్‌.

4.3.189

క. తదవసరంబున నొక్కటఁ | బది యమ్ములు తొడి త్రిగర్తపతి వక్షంబున్‌
వదనంబు నేసి విరటుఁడు | మదమునఁ దురగములనేసె మఱియుఁ బదింటన్‌.

4.3.190

క. ఇంచుకయు నీడఁబోవక | కాంచన పుంఖప్రకాండ కాంతి స్ఫాయ
త్పంచాశద్బాణంబులు | నించె నతఁడు మత్స్య మేదినీపతి మేనన్‌.

4.3.191

తే. దొరలు తలపడ్డ నాహవదోహలమున | నుభయ బలములుఁ దమకించి యోర్వలేక
కలయబెరసి భూ రేణువు కతన రాత్రి | గాకమున్న యొండొరువులఁ గానరైరి.

4.3.192

క. క్షతములఁ బెల్లు తొరఁగు శో | ణితము రజఃపటల మడఁచి నెఱపిన నరుణ
ద్యుతిఁ దమము వాపు వేకువ | గతిఁ దత్సమయం బతి ప్రకాశత నొప్పెన్‌.

4.3.193

ఉ. దానికిఁ జిత్తవృత్తులు ముదంబునఁ బొందఁగ, మేను లుబ్బఁగా
సేనలు రెండు నుద్భట విజృంభణతన్‌ వివిధాస్త్ర ఘట్టన
ధ్వానము దిక్కులం బరఁగఁ దాఁకి రణం బొనరించె; నత్తఱిన్‌
భానుఁడు పశ్చిమాద్రిఁ గనుపట్టెఁ దలిర్చిన మావిమో కనన్‌.

4.3.194

క. సమరంబున భటులు కడున్‌ | శ్రమమొందిరి, తమము గవిసినంగాని సము
ద్యమ సంరంభ ముడుగ, రిది | సమయం బని తొలఁగినట్లు సవితృఁడు గ్రుంకెన్‌.

4.3.195

వ. తదనంతరంబ.

4.3.196

క. ముఱిముఱి చీఁకటియప్పుడు | నఱిముఱి భటు లుడుగ కడరి యని సేయంగా
నెఱసి తమ మెల్లయెడఁ గ్రి | క్కిఱిసిన మఱి పాసి నిలిచి రింతను నంతన్‌.

4.3.197

వ. ఇట్లుభయ సైనికులు సాంద్ర సంతమసంబునం జేయునది లేక సంగ్రామంబు దక్కి తమకం బెక్క నొక్కింత సే పూరకున్నంత.

4.3.198

క. తన మనుమలు పాండుతనయు | లనిసేఁతకు వేడ్కసేయు టాత్మఁ గని తమం
బున వారు మెఱయ రని వ | చ్చిన క్రియ శశి పూర్వశైలశిఖరం బెక్కెన్‌.

4.3.199

క. వెలుఁగు గని కడఁగి యిరువాఁ | గులుఁ బోరికిఁ జొచ్చె; మత్స్య కుంజరుఁడును న
గ్గలమగు మగఁటిమి సొంపునఁ | దలపడియె సుశర్మతోడఁ దదనుజు తోడన్‌.

4.3.200

చ. తలపడి పోర వారి యరదంబు లనేకము లొక్క పెట్ట యి
ట్టలపు రయంబునం బొదివి డాసెఁ గడంగి వడిం ద్రిగర్తనా
థులు నిరుతేరుఁ దద్రథముతోఁ గదియించి తదీయ సారథిన్‌
బలువిడిఁ గూల్చి రథ్యముల ప్రాణములుం గొని రుగ్రమూర్తులై.

First 200 of 242 passages. Read on