Andhra Mahabharatamu 1.1: ఆదిపర్వము — ప్రథమాశ్వాసము
Āndhra Mahābhāratamu 1.1
- Language
- Telugu
ఆదిపర్వము — ప్రథమాశ్వాసము
1.1.1
శా. శ్రీవాణీగిరిజా శ్చిరాయ దధతో వక్షోముఖాఙ్గేషు యే
లోకానాం స్థితి మావహ న్త్యవిహతాం స్త్రీపుంసయోగోద్భవామ్
తే వేదత్రయమూర్తయ స్త్రిపురుషా స్సంపూజితా వ స్సురై
ర్భూయాసుః పురుషోత్తమామ్బుజభవశ్రీకన్ధరా శ్శ్రేయసే.
1.1.2
వ. అని సకలభువనరక్షణప్రభువు లై యాద్యు లైన హరిహరహిరణ్యగర్భ పద్మోమావాణీపతుల స్తుతియించి, తత్ప్రసాదసమాసాదిత నిత్యప్రవర్ధమాన మహామహీరాజ్యవిభవుండును, నిజభుజవిక్రమ విజితారాతి రాజనివహుండును, నిఖిలజగజ్జేగీయమాన నానాగుణరత్న రత్నాకరుండును నై పరఁగుచున్న రాజరాజ నరేంద్రుండు
1.1.3
ఉ. రాజకులైకభూషణుఁడు, రాజమనోహరుఁ, డన్యరాజతే
జోజయశాలిశౌర్యుఁడు, విశుద్ధయశశ్శరదిందుచంద్రికా
రాజితసర్వలోకుఁ, డపరాజితభూరిభుజాకృపాణధా
రాజలశాంతశాత్రవపరాగుఁడు రాజమహేంద్రుఁ డున్నతిన్.
1.1.4
క. విమలాదిత్యతనూజుఁడు, | విమలవిచారుఁడు, కుమారవిద్యాధరుఁ, డు
త్తమచాళుక్యుఁడు, వివిధా | గమవిహితశ్రముఁడు, తుహినకరుఁ డురుకాంతిన్.
1.1.5
చ. ఘనదురితానుబంధకలికాలజదోషతుషారసంహతిం
దన యుదయప్రభావమున దవ్వుగఁ జోపి జగజ్జనానురం
జన మగు రాజ్యసంతతవసంతనితాంతవిభూతి నెంతయుం
దనరుఁ జళుక్యమన్మథుఁడు ధర్మనిబద్ధదయార్ద్రబుద్ధి యై.
1.1.6
ఉ. ఆశ్రితపోషణంబున, ననంతవిలాసమునన్, మనీషివి
ద్యాశ్రమతత్త్వవిత్త్వమున, దానగుణాభిరతిన్, సమస్తవ
ర్ణాశ్రమధర్మరక్షణమహామహిమన్, మహి నొప్పు సర్వలో
కాశ్రయుఁ, డాదిరాజనిభుఁ, డత్యకలంకచరిత్రసంపదన్.
1.1.7
సీ. నిజమహీమండలప్రజఁబ్రీతిఁ బెంచుచుఁ, | బరమండలంబుల ధరణిపతుల
నదిమి కప్పంబుల ముదముతోఁ గొనుచును, | బలిమి నీయని భూమివలయపతుల
నుక్కడఁగించుచు, దిక్కులఁ దనయాజ్ఞ | వెలిఁగించుచును, విప్రకులము నెల్లఁ
బ్రోచుచు, శర ణన్నఁ గాచుచు భీతుల, | నగ్రజన్ములకు ననుగ్రహమునఁ
ఆ. జారుతరమహాగ్రహారంబు లిచ్చుచు, | దేవభోగముల మహావిభూతిఁ
దనరఁజేయు, చిట్లు మనుమార్గుఁ డగు విష్ణు | వర్ధనుండు వంశవర్ధనుండు.
1.1.8
వ. అఖిలజలధివేలావలయవలయితవసుమతీవనితావిభూషణం బైన వేంగీదేశంబునకు నాయక రత్నంబునుం బోని రాజమహేంద్రపురంబునందు మహేంద్రమహిమతోఁ బరమానందంబున ననవరత మహామహీ రాజ్యసుఖంబు లనుభవించుచు, సకలభువనలక్ష్మీవిలాసనివాసం బయిన రమ్యహర్మ్యతలంబున మంత్రి పురోహిత సేనాపతి దండనాయక దౌవారిక మహాప్రధాన సామంత విలాసినీపరివృతుం డయి యపారశబ్దశాస్త్రపారగులైన వైయాకరణులును, భారత రామాయణాద్యనేక పురాణప్రవీణులైన పౌరాణికులును, మృదుమధుర రసభావభాసుర నవార్థవచనరచనా విశారదు లయిన మహాకవులును, వివిధతర్కవిగాహిత సమస్త శాస్త్రసాగరగరీయఃప్రతిభు లైన తార్కికులును నాదిగాఁ గలుగు విద్వజ్జనంబులు పరివేష్టించి కొలుచుచుండ విద్యావిలాసగోష్ఠీసుఖోపవిష్టుం డయి యిష్టకథావినోదంబుల నుండి యొక్కనాఁడు.
1.1.9
సీ. తనకులబ్రాహ్మణు, ననురక్తు, నవిరళ | జపహోమతత్పరు, విపులశబ్ద
శాసను, సంహితాభ్యాసు, బ్రహ్మాండాది | నానాపురాణవిజ్ఞాననిరతుఁ,
బాత్రు, నాపస్తంబసూత్రు, ముద్గలగోత్ర | జాతు, సద్వినుతావదాతచరితు
లోకజ్ఞు, నుభయభాషాకావ్యరచనాభి | శోభితు, సత్ప్రతిభాభియోగ్యు,
ఆ. నిత్యసత్యవచను, మత్యమరాధిపా | చార్యు, సుజను నన్నపార్యుఁ జూచి
పరమధర్మవిదుఁడు, వరచళుక్యాన్వయా | భరణుఁ డిట్టు లనియెఁ గరుణతోడ.
1.1.10
చ. విమలమతిం బురాణములు వింటి ననేకము, లర్థధర్మశా
స్త్రములతెఱం గెఱింగితి, నుదాత్తరసాన్వితకావ్యనాటక
క్రమములు పెక్కుసూచితి, జగత్పరిపూజ్యము లైన యీశ్వరా
గమములయందు నిల్పితిఁ బ్రకాశముగా హృదయంబు భక్తితోన్.
1.1.11
వ. అయినను నాకు ననవరతంబును శ్రీమహాభారతంబునందలి యభిప్రాయంబు పెద్ద యై యుండు.
1.1.12
మ. ఇవి యేనున్ సతతంబు నాయెడఁ గరం బిష్టంబు లై యుండుఁ బా
యవు భూదేవకులాభితర్పణమహీయఃప్రీతియున్. భారత
శ్రవణాసక్తియుఁ, బార్వతీపతిపదాబ్జధ్యానపూజామహో
త్సవమున్, సంతతదానశీలతయు, శశ్వత్సాధుసాంగత్యమున్.
1.1.13
వ. మఱి యదియునుంగాక.
1.1.14
చ. హిమకరుఁ దొట్టి పూరుభరతేశకురుప్రభుపాండుభూపతుల్
క్రమమున వంశకర్త లనఁగా మహి నొప్పిన యస్మదీయవం
శమునఁ బ్రసిద్ధులై, విమలసద్గుణశోభితు లైన పాండవో
త్తములచరిత్ర నాకు సతతంబు వినంగ నభీష్ట మెంతయున్.
1.1.15
చ. అమలసువర్ణశృంగఖుర మై కపిలం బగు గోశతంబు ను
త్తమబహువేదవిప్రులకు దానము సేసిన తత్ఫలంబు త
థ్యమ సమకూరు భారతకథాశ్రవణాభిరతిన్, మదీయచి
త్తము ననిశంబు భారతకథాశ్రవణప్రవణంబ కావునన్.
1.1.16
క. జననుత కృష్ణద్వైపా | యనమునివృషభాభిహిత మహాభారతబ
ద్ధనిరూపితార్థ మేర్పడఁ, | దెనుఁగున రచియింపు మధికధీయుక్తిమెయిన్.
1.1.17
క. బహుభాషల బహువిధముల | బహుజనములవలన వినుచు భారతబద్ధ
స్పృహు లగు వారికి నెప్పుడు | బహుయాగంబులఫలంబు పరమార్థ మిలన్.
1.1.18
వ. అని యానతిచ్చిన విని యక్కవివరుం డి ట్లనియె.
1.1.19
చ. అమలినతారకాసముదయంబుల నెన్నను, సర్వవేదశా
స్త్రముల యశేషసారము ముదంబునఁ బొందను, బుద్ధిబాహువి
క్రమమున దుర్గమార్థజలగౌరవభారతభారతీసము
ద్రముఁ దఱియంగ నీఁదను, విధాతృన కైనను నేరఁబోలునే.
1.1.20
వ. అయినను దేవా! నీయనుమతంబున విద్వజ్జనంబుల యనుగ్రహంబునంజేసి నానేర్చువిధంబున నిక్కావ్యంబు రచియించెద నని.
1.1.21
తరలము హరిహరాజగజాననార్కషడాస్యమాతృసరస్వతీ
గిరిసుతాదిక దేవతాతతికిన్ నమస్కృతి సేసి దు
ర్భరతపోవిభవాధికున్, గురుఁ బద్యవిద్యకు నాద్యు, నం
బురుహగర్భనిభుం, బ్రచేతసుపుత్త్రు భక్తిఁ దలంచుచున్.
1.1.22
ఉ. భారతభారతీశుభగభస్తిచయంబులఁ జేసి, ఘోరసం
సారవికారసంతమసజాలవిజృంభముఁ బాచి, సూరిచే
తోరుచిరాబ్జబోధనరతుం డగు దివ్యుఁ బరాశరాత్మజాం
భోరుహమిత్రుఁ గొల్చి మునిపూజితు భూరియశోవిరాజితున్.
1.1.23
వ. మఱియును.
1.1.24
చ. పరమవివేకసౌరభవిభాసిత సద్గుణపుంజవారిజో
త్కరరుచిరంబు లై, సకలగమ్యసుతీర్థము లై, మహామనో
హరసుచరిత్రపావనపయఃపరిపూర్ణము లైన సత్సభాం
తరసరసీవనంబుల, ముదం బొనరం గొనియాడి వేడుకన్.
1.1.25
ఉ. పాయక పాకశాసనికి భారతఘోరరణంబునందు నా
రాయణునట్లు, వానసధరామరవంశవిభూషణుండు నా
రాయణభట్టు, వాఙ్మయధురంధరుఁడుం, దన కిష్టుఁడున్, సహా
ధ్యాయుఁడు నైనవాఁ డభిమతంబుగఁ దోడయి నిర్వహింపఁగన్.
1.1.26
ఉ. సారమతిం గవీంద్రులు ప్రసన్నకథాకవితార్థయుక్తి లో
నారసి మేలునా, నితరు లక్షరరమ్యత నాదరింప, నా
నారుచిరార్థసూక్తినిధి నన్నయభట్టు తెనుంగునన్ మహా
భారతసంహితారచనబంధురుఁ డయ్యె జగద్ధితంబుగన్.
1.1.27
వ. తత్కథాప్రారంభం బెట్టి దనిన.
1.1.28
సీ. నైమిశారణ్యపుణ్యక్షేత్రమునఁ గుల | పతి శౌనకుం డను పరమమౌని,
బ్రహ్మర్షిగణసముపాసితుం డై సర్వ | లోకహితార్థంబు లోకనుతుఁడు
ద్వాదశవార్షికోత్తమసత్రయాగంబు | మొగిఁ జేయుచున్న నమ్మునులకడకు
వచ్చి, తా నుగ్రశ్రవసుఁ డను సూతుఁడు | రౌమహర్షణి సుపౌరాణికుండు
ఆ. పరమభక్తితోడఁ బ్రణమిల్లియున్న న | క్కథకువలన మునినికాయ మెల్ల
వివిధపుణ్యకథలు వినువేడ్క నతనిఁ బూ | జించి రపరిమితవిశేషవిధుల.
1.1.29
వ. అక్కథకుండ వెండియు నమ్మునిసంఘంబునకు నమస్కారంబు సేసి, ‘యే ననేకపురాణపుణ్యకథా కథనదక్షుండ, వ్యాస శిష్యుండైన రోమహర్షణునకుఁబుత్త్రుండ; నావలన నెక్కథ విన వలతు?’ రనిన, నమ్మును లతని కి ట్లనిరి.
1.1.30
క. ఏయది హృద్య, మపూర్వం | బేయది, యెద్దాని వినిన నెఱుక సమగ్రం
బై యుండు, నఘనిబర్హణ | మే యది? యక్కథయ వినఁగ నిష్టము మాకున్.
1.1.31
వ. అనిన నుగ్రశ్రవసుం డట్లేని ‘మీకు నభిమతం బైన పుణ్యకథఁ జెప్పెద, దత్తావధానుల రై వినుం’ డని శౌనకాదిమహామునుల కిట్లని చెప్పందొడంగె: ‘కృష్ణద్వైపాయనుండను బ్రహ్మర్షి తొల్లి వేదంబు లేకీభూతంబు లై యేర్పడకున్న ఋగ్యజుస్సామాథర్వంబులుగా విభాగించి, తన శిష్యులయిన పైలవైశం పాయన సుమంతు జైమినులం బంచి క్రమంబునఁ జతుర్వేదసూత్రంబులఁ జేయించి, వేదవ్యాసుండై నిజతపోమహత్త్వంబునం జేసి బ్రహ్మచేత ననుజ్ఞాతుం డై యష్టాదశ పురాణంబులును, నీతిధర్మ శాస్త్రార్థతత్త్వంబులును జతుర్వేద వేదాంతాభిప్రాయంబులును, జతుర్వర్గవర్గాను బంధబంధుర కథేతిహాసంబులును, జతుర్యుగ మహర్షి రాజవంశచరితంబు లును, జతుర్వర్ణాశ్రమధర్మక్రమంబులును, జతుర్ముఖప్రముఖనిఖిలసురముని గణపూజితుం డైన శ్రీకృష్ణునిమాహాత్త్వంబును, బాండవాది భారతవీరుల మహాగుణంబులును దనవిమల జ్ఞానమయం బైన వాగ్దర్పణంబునం దేర్పడి వెలుంగుచుండ.
1.1.32
సీ. ధర్మతత్త్వజ్ఞులు ధర్మశాస్త్రం బని, | యధ్యాత్మవిదులు వేదాంత మనియు
నీతివిచక్షణుల్ నీతిశాస్త్రం బని, | కవివృషభులు మహాకావ్య మనియు,
లాక్షణికులు సర్వలక్ష్యసంగ్రహ మని, | యైతిహాసికు లితిహాస మనియుఁ,
బరమపౌరాణికుల్ బహుపురాణసముచ్చ | యం బని, మహిఁ గొనియాడుచుండ.
ఆ. వివిధవేదతత్త్వవేది వేదవ్యాసుఁ | డాదిముని పరాశరాత్మజుండు
విష్ణుసన్నిభుండు విశ్వజనీన మై | పరఁగుచుండఁ జేసె భారతంబు.
1.1.33
వ. అదియునుంబౌష్యంబు, పౌలోమం, బాస్తీకం, బాదివంశావతారంబు, సంభవపర్వంబు, జతుగృహదాహంబు, హైడింబంబు, బకవధ, చైత్రరథంబు, ద్రౌపదీస్వయంవరంబు, వైవాహికంబు, విదురాగమనంబు, రాజ్యార్ధలాభం, బర్జునతీర్థయాత్ర, సుభద్రాకల్యాణంబు, హరణహారిక, ఖాండవదహనంబు, మయదర్శనంబు, సభాపర్వంబు, మంత్రపర్వంబు, జరాసంధవధ, దిగ్విజయంబు, రాజసూయం, బర్ఘ్యాభిహరణంబు, శిశుపాలవధ, ద్యూతం, బనుద్యూతం, బారణ్యంబు, కిమ్మీరవధ, కైరాతం, బింద్రలోకాభిగమనంబు, ధర్మజతీర్థయాత్ర, జటాసురవధ, యక్షయుద్ధం, బాజగరంబు, మార్కండేయోపాఖ్యానంబు, సత్యాద్రౌపదీసంవాదంబు, ఘోషయాత్ర, ప్రాయోపవేశంబు, వ్రీహిద్రోణకాఖ్యానంబు, ద్రౌపదీహరణంబు, కుండలాహరణం, బారణేయంబు, వైరాటంబు, కీచకవధ, గోగ్రహణం, బభిమన్యువివాహం, బుద్యోగంబు, సంజయయానంబు, ధృతరాష్ట్రప్రజాగరణంబు, సానత్సుజాతంబు, యానసంధి, భగవద్ధ్యానంబు, సేనానిర్యాత్ర, యులూకదూతాభిగమనంబు సమరథాతిరథసంఖ్యానంబు, కర్ణభీష్మవివాదం, బంబోపాఖ్యానంబు, జంబూఖండవినిర్మాణంబు, భూమిపర్వంబు, భీష్మాభిషేకంబు, భగవద్గీత, భీష్మవధ, ద్రోణాభిషేకంబు, సంశప్తకవధ, అభిమన్యువధ, ప్రతిజ్ఞాపర్వంబు, జయద్రథవధ, ఘటోత్కచవధ, ద్రోణవధ, నారాయణాస్త్రప్రయోగంబు, కర్ణపర్వంబు, శల్యపర్వంబు, హ్రదప్రవేశంబు, గదాయుద్ధంబు, సారస్వతంబు, సౌప్తికపర్వం, బైషీకంబు, జలప్రదానంబు, స్త్రీపర్వంబు, శ్రాద్ధపర్వంబు, రాజ్యాభిషేకంబు, చార్వాకనిగ్రహంబు, గృహప్రవిభాగంబు, శాంతిపర్వంబు, రాజధర్మానుకీర్తనం, బాపద్ధర్మంబు, మోక్షధర్మం, బానుశాసనికంబు, భీష్మస్వర్గారోహణం, బాశ్వమేధికం, బనుగీత, యాశ్రమవాసంబు, పుత్త్రసందర్శనంబు, నారదాగమనంబు, మౌసలంబు, మహాప్రస్థానికంబు, స్వర్గారోహణంబు, హరివంశంబు, భవిష్యత్పర్వంబు నను శతపర్వంబులు గలిగి.
1.1.34
సీ. ఆయురర్థులకు దీర్ఘాయు రవాప్తియు | నర్థార్థులకు విపులార్థములును
ధర్మార్థులకు నిత్యధర్మసంప్రాప్తియు | వినయార్థులకు మహావినయమతియుఁ
బుత్త్రార్థులకు బహుపుత్త్రసమృద్ధియు | సంపదర్థుల కిష్టసంపదలును
గావించు నెప్పుడు భావించి వినుచుండు | వారికి నిమ్మహాభారతంబు
ఆ. భక్తియుక్తులైన భాగవతులకు శ్రీ | వల్లభుండు భక్తవత్సలుండు
భవభయంబు లెల్లఁ బాచి యిష్టార్థసం | సిద్ధిఁ గరుణతోడఁ జేయునట్లు.
1.1.35
వ. మఱియుఁ బౌష్యోదంకమాహాత్మ్యంబును, భృగువంశకీర్తనంబును, నాగగరుడసంభవంబును, సముద్రమథనంబు, నుచ్చైశ్శ్రవోజన్మంబును, సౌపర్ణోపాఖ్యానంబును, నాస్తీకచరితంబును, జనమేజయ సర్పయాగంబును, శ్రీమహాభారతకథాశ్రవణప్రవృత్తియు, వ్యాసజన్మంబును, దేవదైత్యదానవముని యక్షపక్షిగంధర్వాది నానావిధభూతసంభవంబును, దదంశావతారంబును, రాజవంశానుకీర్తనంబును, యయాతిచరితంబును, భారతవంశానుకీర్తనంబును, గంగాశంతనుసమాగమంబును, వసూత్పత్తియు, స్వర్గగమనంబును, దదంశసంఘాతంబున గాంగేయజన్మంబును, దద్రాజ్యనివర్తనంబును, బ్రహ్మచర్యప్రతిజ్ఞాపరిపాలనంబును, సత్యవతీవివాహంబును, జిత్రాంగదావిచిత్రవీర్యజన్మంబును, జిత్రాంగదరాజ్యాభిషేకంబును, జిత్రాంగదమరణానంతరంబున భీష్ముండు విచిత్రవీర్యుం గౌరవరాజ్యంబున నభిషిక్తుం జేయుటయు, వానిపరోక్షంబునఁ గృష్ణద్వైపాయనమునివలన ధృతరాష్ట్రపాండురాజుల జన్మంబు, నాణిమాండవ్యో పాఖ్యానంబును, ధర్ముండు మాండవ్యశాపంబున శూద్రయోనియందు విదురుం డై పుట్టుటయును, ధృతరాష్ట్రపాండురాజుల వివాహంబును, బాండవధార్తరాష్ట్ర సంభవంబును, బాండునిర్యాణంబును, గృపద్రోణజన్మకథనంబును, గుమారాస్త్రవిద్యాగ్రహణంబును, గుమారాస్త్ర సందర్శనంబును, గర్ణార్జునుల పరస్పరక్రోధంబును, ద్రుపదగ్రహణమోక్షణంబును, యుధిష్ఠిరు యౌవరాజ్యాభిషిక్తుం జేయుటయు, దుర్యోధనుదుర్మంత్రంబును, వారణావత యాత్రయు, జతుగృహదాహంబును, విదురోపదిష్టద్వారంబునఁ బాండవాపక్రమణంబును, హిడింబాదర్శనంబును, హిడింబువధయును, ఘటోత్కచసంభవంబును, బాండవుల కేకచక్రపురంబున విప్రగృహంబున నజ్ఞాతచర్యయు, బకవధయు, ధృష్టద్యుమ్నద్రౌపదీ జన్మకథనంబును, గృష్ణద్వైపాయన సందర్శనంబును, గంగాతీరంబున నంగారపర్ణు నర్జునుండు జయించుటయుఁ, దాపత్యవసిష్ఠ్ఠౌర్వోపాఖ్యానంబును, బాండవులు పాంచాలదేశంబునకుం జనుటయు, ద్రౌపదీస్వయంవరంబును, బంచేంద్రోపాఖ్యానంబును, ద్రౌపదీవివాహంబును, విదురాగమనంబును, గృష్ణసందర్శనంబును, రాజ్యార్థలాభంబును, ఖాండవప్రస్థ నివాసంబును, సుందోపసుందోపాఖ్యానంబును, నారదువచనంబున, ద్రౌపదియందు సమయ క్రియయును నర్జునుతీర్థాభిగమనంబును, నులూపీసమాగమంబును, జిత్రాంగదయందు బభ్రువాహను జన్మంబును, ద్వారకాగమనంబును, వాసుదేవానుమతంబున నర్జునుఁడు సుభద్రను వివాహం బగుటయు, సుభద్రాహరణంబును, హరణహారికయు, నభిమన్యుసంభవంబును, గాండీవదేవదత్త దివ్యరథాశ్వ లాభంబును, ఖాండవదహనంబు, నగ్నిభయంబువలన మయభుజంగమోక్షణంబును, మందపాలోపాఖ్యానంబును నను వృత్తాంతంబుల నొప్పి తొమ్మిదివేలుం దొమ్మన్నూటయెనుబదినాలుగు శ్లోకంబులు గలిగి.
1.1.36
క. మదిఁ బౌష్యపర్వ మాదిగఁ| బదునెనిమిదిపర్వములను బర్వి మనఃప్రీ
తిద మగుచు నాదిపర్వం | బది వినఁగా నొప్పు భారతాద్యం బగుచున్.
1.1.37
వ. మఱియు ధర్మరాజునకు సభాప్రాప్తియుఁ, గింకరదర్శనంబును, నారదువలన లోకపాలసభాశ్రవణంబును, రాజసూయమహాధ్వరారంభంబును, జరాసంధవధయును, గిరివ్రజనిరుద్ధు లైన రాజులఁ గృష్ణుఁడు విడిపించుటయును, దిగ్విజయంబును, రాజసూయంబు, నర్ఘ్యాభిహరణంబును, శిశుపాలవధయును, రాజసూయవిభూతికి దుఃఖితుం డై సభాస్ఖలితుం డై యున్న దుర్యోధనుం జూచి ద్రౌపదీభీమసేనులు నగుటయును, దత్కారణంబున జూదం బాడుటయు, నందు శకునికైతవంబున ధర్మరాజపరాజయంబును, ద్యూతదుఃఖార్ణవమగ్ను లైన పాండవులం బాంచాలి యుద్ధరించుటయును, బునర్ద్యూతపరాజితు లై పాండవులు వనవాసగతు లగుటయు నను వృత్తాంతంబుల నొప్పి నాలుగువేలున్ మున్నూటపదునొకండు శ్లోకంబులు గలిగి.
1.1.38
క. పర్వి సభాప్రభృతిగ నవ | పర్వములను విస్తరిల్లి, పండితచేతో
నిర్వృతిఁ జేయుచు రెండవ | పర్వము నా రమ్య మగు సభాపర్వ మిలన్.
1.1.39
వ. మఱియు మహారణ్యంబునందుఁ గిమ్మీరవధయును, గృష్ణపాంచాలాగమనంబును, సౌభకాఖ్యానంబును, యుధిష్ఠిరభీమసేనసంవాదంబును, గురూపదేశంబున నర్జునుండు దివ్యాస్త్రంబులు వడయఁ దపశ్చరణంబు సేయుటయు, నీశ్వరుతోడియుద్ధంబును, లోకపాలసందర్శనంబును, దివ్యాస్త్రలాభంబును, స్వర్గగమనంబును, నిట బృహదశ్వుండను మహామునింగాంచుటయు, యుధిష్ఠిరాదులపరిదేవనంబును, నలోపాఖ్యానంబును, దమయంతీ పతివ్రతాస్తుతియు, యుధిష్ఠిరాదులకు నర్జునుకుశలవార్త రోమశుండు సెప్పుటయును, ధర్మజుతీర్థాభిగమనంబును, జటాసురవధయును, బాంచాలీనియుక్తుం డై భీముండు సౌగంధికపుష్పాహరణార్థంబుగంధమాదనంబునందలికొలనికిఁజని యందు మణిమంతుఁడు మొదలుగాఁగల యక్షరాక్షసులం జంపుటయు. నాజగరంబు, నగస్త్యోపాఖ్యానంబును, వాతాపిభక్షణంబు, నపత్యార్థం బగస్త్యమహాముని లోపాముద్ర నభిగమించుటయు. శ్యేనకపోతంబు లైన యింద్రాగ్నులు శిబిమాంసంబు గొనుటయు, ఋష్యశృంగుచరితంబును, బరశురామచరితంబును, గార్తవీర్యవధయును, మాంధాతృజన్మంబును, సౌకన్యాఖ్యానంబును, భార్గవుండయిన చ్యవనుండు శర్యాతియజ్ఞంబున నాశ్వినుల సోమపీథులం జేసి వారిచేత జవ్వనంబు వడయుటయు, జంతూపాఖ్యానంబును, యజ్ఞపుత్త్రుం డైన సోమకుండు బహుపుత్త్రార్థంబు యజ్ఞంబుసేసి పుత్త్రశతంబును బడయుటయు, వంద్యష్టావక్రుల వివాదంబును, సముద్రంబును జయించితిత్తిరియను మహర్షి తనతండ్రిం బడయుటయు, దివ్యాస్త్రంబులు వడసి యర్జునుండు హిరణ్యపురనివాసు లయిన పౌలోమ కాలకేయ నివాతకవచాదులం జంపుటయు, గంధమాదనంబున కందఱుం గూడవచ్చుటయు, మార్కండేయబహువిధోపాఖ్యానంబును, గృష్ణసందర్శనంబును, సత్యాద్రౌపదీసంవాదంబును, ఘోషయాత్రయుఁ, జిత్రసేనాదిగంధర్వులఁ బెక్కండ్ర జయించి దుర్యోధనుని విడిపించుటయు, దుర్యోధనుని ప్రాయోపవేశంబును, వ్రీహిద్రోణకాఖ్యానంబును, గలియుగధర్మంబును, వామ్యాశ్వహరణంబును, నింద్రద్యుమ్నోపాఖ్యానంబును, సరస్వతీగీతయు, ధుంధుమారుచరితంబును, జయద్రథుం డాశ్రమాంతరంబున ద్రౌపది నపహరించుటయు, భీముండు వానిం బరిభవించుటయు, నుద్దాలకోపాఖ్యానంబును, వైన్యోపాఖ్యానంబును, శ్రీరామాయణకథయును, సావిత్ర్యుపాఖ్యానంబును, బాండవులు క్రమ్మఱి ద్వైతవనంబునకు వచ్చుటయుఁ, గర్ణుకవచకుండలంబు లింద్రుండు గొనుటయు, నారణేయోపాఖ్యానంబును, యముండు ధర్మజు ననుశాసించుటయు, యమువలన వరంబులు వడసి పాండవులు పశ్చిమదిక్కునకుం జనుటయు ననువృత్తాంతంబుల నొప్పి పదుమూఁడువేలు నాఱునూటయఱువదినాల్గు శ్లోకంబులు గలిగి.
1.1.40
క. ఆరణ్యపర్వ మనఁగా | నారణ్యప్రముఖ షోడశాంతఃపర్వా
ధార మయి సకలసూరిస | భారమ్యం బగు తృతీయపర్వము వెలయున్.
1.1.41
వ. మఱియు విరాటనగరంబునకుం జనుచుండి తత్సమీపశమీవృక్షంబునఁ బాండవులు తమయాయుధంబులు నిక్షేపించి తమ్మెవ్వరు నెఱుంగకుండ విరాటుం గొలిచి యునికియు, నందు భీముండు సింహబలుం దొట్టి సకలకీచకుల వధించుటయు, గోగ్రహణంబునఁ గురుబలంబుల నెల్ల నొక్కరుండ జయించి ధనంజయుండు గోగణంబులఁగ్రమ్మఱించుటయు, విరాటరాజపుత్త్రియైన యుత్తర నభిమన్యుండు వివాహం బగుటయునను వృత్తాంతంబుల నొప్పి మూడువేలు నేనూఱుశ్లోకంబులు గలిగి.
1.1.42
క. పర్వుచు వైరాటాదిక | పర్వచతుష్టయమునను సభారంజన మై
సర్వమనోజ్ఞము నాలగు | పర్వమునాఁ దగి విరాటపర్వము వెలయున్.
1.1.43
వ. మఱియు భారతరణోద్యోగు లైన పాండవు లుపప్లావ్యంబున విడియుటయు, నర్జునదుర్యోధనులు ద్వారకానగరంబునకుం జని శ్రీకృష్ణునిం గని సహాయత్వంబునకుం బ్రార్థించుటయు, నారాయణుండు వారి నాశ్వాసించి నారాయణగోపాలబలంబుల నిరూపించి వారలం గోరికొం డనుటయు, నారాయణ గోపాల బలంబుల దుర్యోధనుండు గోరికొనుటయు. నారాయణుని నొక్కని నర్జునుండు గోరికొనుటయు, ధృతరాష్ట్రుండు వనుప నుపశమనార్థం బుపప్లావ్యంబున సంజయుండు పాండవులకడకుం బోవుటయు, వాసుదేవసహితులైన పాండవులరణప్రారంభంబు విని ధృతరాష్ట్రుండు నిద్రాహారంబులు విడిచి చింతా క్రాంతుండగుటయు, హితవచనుం డైన విదురుపల్కులు వినమియు, ధృతరాష్ట్రునకు మనస్తాపోప శమనంబుగా సనత్సుజాతుం డధ్యాత్మకథలు సెప్పుటయు, వాసుదేవార్జునుల యత్యంతసాంగత్యం బెఱింగి వచ్చిసంజయుండు సకలరాజసమక్షంబున విస్తరించుటయు, సర్వభూతహితుం డైన శ్రీకృష్ణుండు పాండవధార్తరాష్ట్రులకు సంధి గావింపం దలంచి హస్తిపురంబునకుం జని యందుఁ గర్ణాదిదుష్టశిక్షితుండైన దుర్యోధను దుర్మంత్రం బెఱింగి విశ్వరూపంబుఁ జూపుటయుఁ, గృష్ణుండు కర్ణునిం దనరథం బెక్కించుకొని యుపాయంబున ననునయించి యొడంబఱుపనేరక కర్ణుచేతం బ్రత్యాఖ్యాతుం డయి క్రమ్మఱి వచ్చుటయు, బలాతిబలసంఖ్యానంబు, నెల్లి యుద్ధంబు సేయవలయు నని కురుపతి పనుప నులూకుం డను దూత పాండవులపాలికి వచ్చి పరుసంబులు వలుకుటయు, సమరథాతిరథ సంఖ్యానంబు, నర్ధరథులలోనం గలయం ద న్నెన్నిన నలిగి కర్ణుండు భీష్ముపదిదినంబులు సమరపరాఙ్ముఖుం డగుటయు, రామభీష్ముల యుద్ధకీర్తనంబు, నంబోపాఖ్యానంబును, సంక్రందనోపాఖ్యానంబును, శ్వేతాభిషేకంబు నను వృత్తాంతంబుల నొప్పి యాఱువేలుం దొమ్మన్నూట తొంబదియెనిమిది శ్లోకంబులు గలిగి.
1.1.44
క. విదితం బై యుద్యోగము | మొదలుగఁ బదునొకఁడు పర్వముల నెంతయు నొ
ప్పిద మై యేనగు పర్వం | బిది నా నుద్యోగపర్వ మిమ్మగు సభలన్.
1.1.45
వ. మఱియు జంబూఖండవినిర్మాణంబు సంజయుండు ధృతరాష్ట్రునకుం జెప్పుటయు, భూవిస్తారంబును, భీష్మాభిషేకంబును, బాండవమధ్యమవిషాదంబును, వాసుదేవుండు మోక్షదర్శనహేతువులం జెప్పి యర్జును మోహభ్రాంతిఁ జెఱుచుటయు, శిఖండిం బురస్కరించుకొని యర్జునుండు భీష్ముని వధించుటయు నను వృత్తాంతంబుల నొప్పి యైదువేలునెనమన్నూటయెనుబదినాలుగు శ్లోకంబులు గలిగి.
1.1.46
క. జంబూఖండవినిర్మా | ణం బాదిగ హృదయరోచనము లగు నేన్ప
ర్వంబులను భీష్మపర్వము | పంబి వినం బొలుచు షష్ఠపర్వం బగుచున్.
1.1.47
వ. మఱియు ద్రోణాభిషేకంబును, సంశప్తకు లర్జునుం బాపికొనిపోయి యేకతంబు యుద్ధంబు సేయుటయు, నర్జునుచేత సుప్రతీకగజంబుతోడన భగదత్తుచావును. ద్రోణకర్ణాదులు పెక్కండ్రు గూడుకొని యధర్మయుద్ధంబున నభిమన్యుం జంపుటయు, నర్జునుప్రతిజ్ఞయు, నభిమన్యు వధకుం గ్రుద్ధుండై యర్జునుం డే డక్షౌహిణులబలంబుల నొక్కరుండ చంపి సైంధవుం దునుముటయును, దొమ్మిదికోట్లు సంశప్తకుల నర్జునుండు నిశ్శేషంబు సేయుటయు, నలంబస శ్రుతాయు జలసంధ సోమదత్త భూరిశ్రవో బాహ్లిక విరాట ద్రుపద ఘటోత్కచ ధార్తరాష్ట్ర నారాయణగోపాలాదివధయును, ద్రోణవధయు, నశ్వత్థామ నారాయణాగ్నేయాస్త్రకీర్తనంబును, గృష్ణార్జునులమాహాత్మ్యంబును నను వృత్తాంతంబుల నొప్పి పదివేలుందొమ్మన్నూట పందొమ్మిది శ్లోకంబులు గలిగి.
1.1.48
క. విన నే డగుపర్వము మే | లనఁగా ద్రోణాభిషేక మాదిగఁ గల య
య్యెనిమిదిపర్వములను న | త్యనుపమ మై ద్రోణపర్వ మమరున్ సభలన్.
1.1.49
వ. మఱియుఁగర్ణాభిషేకంబును, గర్ణునకు రథంబు గడప శల్యుం బూన్చుటయుఁ, ద్రిపురదహనోపాఖ్యానంబును, గర్ణశల్యుల పరస్పరవివాదంబును, హంసకాకీయోపాఖ్యానంబును, యుధిష్ఠిరార్జునుల పరస్పర క్రోధవచనంబులు, నర్జునానునయంబును, వృషసేనువధయును, దుశ్శాసనుం జంపిభీముండు తద్వక్షోరక్తం బాస్వాదించుటయు, విప్రశాపనిమిత్తంబునఁ గర్ణురథచక్రంబు భూమియందుఁ గ్రుంగుటయు, నాగాస్త్రభయంబును, నర్జునురథంబు శ్రీకృష్ణుండు భూమియందుఁ జొనుపుటయు, నింద్రాదిత్యుల పరస్పరసంవాదంబును,గర్ణువధయును నను వృత్తాంతంబుల నొప్పినాలుగువేలుందొమ్మన్నూఱుశ్లోకంబులు గలిగి.
1.1.50
క. అనుపమబలు లగు కర్ణా | ర్జునవీరుల శౌర్యమహిమ శోభిల్లంగా
నెనిమిది యగు పర్వం బిది | యనఁ బరఁగుం గర్ణపర్వ మతిహృద్యం బై.
1.1.51
వ. మఱియుభారతవీరు లెల్లఁబరలోకగతులైన శల్యుండు రణభారంబుపూనుటయుఁ, గురుకుమారవధయును, ధర్మజురోషంబున శల్యుమరణంబును, గురుముఖ్యులవధయును, సహదేవునిచేత సపుత్త్రకుం డైన శకునిచావును, సంజయగ్రహణమోక్షణంబును, హ్రదప్రవేశంబును, భీమదుర్యోధనుల గదాయుద్ధంబును సరస్వత్యాదిపుణ్యతీర్థకీర్తనంబు నను వృత్తాంతంబుల నొప్పి మూఁడువేలు నిన్నూటయిరువది శ్లోకంబులు గలిగి.
1.1.52
ఆ. సభల విస్తరిల్లి శల్యాదికము లైన | నాల్గుపర్వముల వినంగఁ జాలి
నవమపర్వ మనఁగ నవ్యార్థరమణీయ | మగుచు శల్యపర్వ మతిశయిల్లు.
1.1.53
వ. మఱియు భీముగదాభిఘాతంబున దుర్యోధనుండు తొడలు విఱిగి పడినఁ, బాండవులు రణం బుపసంహరించి చనిన నాఁటిరాత్రి కృపకృతవర్మాశ్వత్థామలు పాండవశిబరంబుపయింజనుటయు, నం దశ్వత్థామ కోపోద్దీపితుండైతనప్రతిజ్ఞదీఱ ధృష్టద్యుమ్నపురోగములైన సర్వపాంచాలురను బ్రతివింధ్యాదిద్రౌపదేయులను బాండవామాత్యులను సుఖసుప్తులయినవారి వధించుటయు, నందు శ్రీకృష్ణప్రసాదంబునఁ బాండవులేవురు సాత్యకియుం దప్పుటయుఁ, బుత్త్రభ్రాతృవధ దుఃఖిత యై పాంచాలి యనశనంబు సంకల్పించుకొనుటయుఁ, దద్వచనంబున భీముం డశ్వత్థామపిఱుందం జనుటయు, భీమసేనభయార్తుండయి యశ్వత్థామ యపాండవం బయ్యెడుమని శరమోక్షణంబుసేయుటయు, నట్లుగాకుండెడు మని శ్రీకృష్ణుండు దానింబరిహరించుటయు, దానిం దునియ నర్జునుండు తనదివ్యబాణంబున నేయుటయు, వ్యాసాశ్వత్థామల యన్యోన్యశాపంబులు, నశ్వత్థామశిరోరత్నంబుఁబాండవులుగొనుటయు నను వృత్తాంతంబుల నొప్పి రెండువేలునెనమన్నూటడెబ్బది శ్లోకంబులు గలిగి.
1.1.54
క. నుతసౌప్తికాదిపర్వ | త్రితయంబునఁ దనరి వసుమతీసురవరస
మ్మత మై సౌప్తికపర్వము | ప్రతిభ వినం బొలుచు దశమపర్వం బగుచున్.
1.1.55
వ. మఱియు వీరపత్నీవిలాపంబును, గాంధారీధృతరాష్ట్రుల కోపప్రసాదంబులును, ధర్మజుండు రణనిహతు లైన పితృపితామహభ్రాతృ పుత్త్రభృత్యామాత్యమాతులాచార్యమిత్రాదులం బరీక్షించి యథావిధి సంస్కరింపందగు వారలం బంచుటయు, భారతవీరుల కుదకదానంబు సేయుటయుఁ, దత్సమయంబునఁ గుంతీదేవి పాండవులకుఁ గర్ణుండు గూఢోత్పన్నుం డని యెఱింగించుటయు, ధర్మజువిలాపంబును, ధర్మజురాజ్యాభిషేకంబును, చార్వాకనిగ్రహంబును, గృహప్రవిభాగంబును నను వృత్తాంతంబుల నొప్పి వేయునేడునూటడెబ్బదియైదు శ్లోకంబులు గలిగి.
1.1.56
క. పర్వుచు స్త్రీపర్వాదిక | పర్వంబుల నే నిటం గృపాయుత మై స్త్రీ
పర్వంబు పదునొకం డగు | పర్వము నా వెలయు సుకవిపండితసభలన్.
1.1.57
వ. మఱియు బంధువర్గంబు నెల్ల వధియించి పరమనిర్వేదనపరుం డై కృష్ణువచనంబుల శాంతుం డై యున్న ధర్మజునకు శరతల్పగతుం డైన భీష్ముండు ధర్మవిదు లయిన రాజులకెల్ల హితంబుగా రాజధర్మంబులు, నాపద్ధర్మంబులు, నేవాని నెఱింగిన సర్వజ్ఞానసంపన్ను లగుదు రట్టి మోక్షధర్మంబులుఁ జెప్పుటయు నను వృత్తాంతంబుల నొప్పి పదునాలుగువేలునేనూటయిరువది యైదుశ్లోకంబులు గలిగి.
1.1.58
క. సకలహితం బై శాంత్యా | దికపర్వచతుష్కమున విదిత మై సమబు
ద్ధికిఁ బండ్రెం డగు పర్వం | బ కడున్ మే లనఁగ శాంతిపర్వము వెలయున్.
1.1.59
వ. మఱియుఁ బితామహుం డగు గాంగేయువలన సర్వధర్మనిశ్చయంబును, దానివిధులును, నాచారవిధులును ధర్మరా జెఱుంగుటయుఁ, బుత్త్రానుశాసనంబును, భీష్మస్వర్గారోహణంబు నను వృత్తాంతంబుల నొప్పి పండ్రెండువేలశ్లోకంబులు గలిగి.
1.1.60
క. ఒనరుఁ ద్రయోదశపర్వం | బనఁగా ననుశాసనాద్య మగు పర్వయుగం
బున మే లై విబుధశ్రే | ణినుతం బై యానుశాసనిక పర్వ మిలన్.
1.1.61
వ. మఱియు నశ్వమేధారంభంబును, సంవర్తమరుత్తీయోపాఖ్యానంబును, స్వర్ణకోశసంప్రాప్తియు, నుత్తరగర్భంబున నశ్వత్థామాస్త్రదగ్ధుం డై శ్రీకృష్ణుచేత సంజీవితుం డయిన పరీక్షితుని జన్మంబు, నర్జును నశ్వానుసరణంబు, నెడనెడరాజులతోడి యుద్ధంబును, జిత్రాంగదపుత్త్రుండైన బభ్రువాహనుం డాహవంబున నర్జునుం బరిభవించుటయు, నశ్వమేధమహాయజ్ఞంబునందు నకులోపాఖ్యానంబును, ననుగీతయు, బ్రాహ్మణగీతయు, గురుశిష్యసంవాదంబును నను వృత్తాంతంబుల నొప్పి నాల్గవేలునన్నూటయిరువది శ్లోకంబులు గలిగి.
1.1.62
తే. అభిమతం బగు నశ్వమేధాదికద్వి | పర్వయుత మై చతుర్దశపర్వ మనఁగ
నాశ్వమేధికపర్వ మత్యంత నిబిడ | వస్తువిస్తార మై బుధవరుల సభల.
1.1.63
వ. మఱియు ధృతరాష్ట్రుండును గాంధారియు రాజ్యంబు విడిచి విదురసంజయసహితంబుగా నాశ్రమవాసంబునకుఁజనుటయు, సకలరాజ్యభారధౌరేయులైనకొడుకులవిడిచి కుంతీదేవి గురుశుశ్రూషాపరయయి వారిపిఱుందన పోవుటయు, సమరనిహతు లైన పుత్త్రపౌత్త్రుల నెల్ల ధృతరాష్ట్రుండు వ్యాసవరప్రసాదంబునఁ గాంచి విగతశోకుం డయి గాంధారీకుంతీవిదుర సంజయులతోఁ బరమసిద్ధికింజనుటయుఁ, బాండవులు నారదువలన నిఖిలయాదవవ్యసనం బెఱుంగుటయు నను వృత్తాంతంబుల నొప్పి వేయునూటయాఱుశ్లోకంబులు గలిగి.
1.1.64
క. అమితార్థయుక్తితో నా | శ్రమవాసాదిత్రిపర్వసహితం బయి యా
శ్రమవాసపర్వ మత్యు | త్తమ కథలను వెలయుఁ బంచదశపర్వం బై.
1.1.65
వ. మఱియు యాదవు లెల్ల మదిరాపానపరవశు లయి శాపనిమిత్తంబున సముద్రతీరంబునఁ దమలోఁ బోరి పొడిచికొని పరలోక గతు లగుటయు, దాని నెఱింగి రామకృష్ణాదియాదవ విరహితం బయిన ద్వారవతి కర్జునుం డరిగి విషణ్ణచిత్తుం డయి వసుదేవాదియాదవుల నెల్ల సంస్కరించి, యాదవకళత్రంబుల నెల్లఁదోడ్కొని వచ్చుచో గాండీవదివ్యబాణంబులశక్తి దఱిఁగిన వనచరభయంబువలనఁ దత్కళత్రంబుల రక్షింపనోపమియు, నర్జునుండు ధర్మరాజుకడకు వచ్చి వ్యాసవాక్యప్రబోధితుం డై సన్న్యసించుటయు నను వృత్తాంతంబుల నొప్పి మున్నూరుశ్లోకంబులు గలిగి పదియాఱవపర్వం బై మౌసలపర్వంబునాఁ బరఁగె; మఱియుఁ బరీక్షిద్రాజ్యాభిషేకంబును, రాజ్యపరిత్యాగము సేసి పాండవు లేవురు ద్రౌపదీసహితు లై పరమసిద్ధికిం జనుటయు నను వృత్తాంతంబుల నొప్పి నూటయిరువదిశ్లోకంబులు గలిగి పదియేడవపర్వం బై మహాప్రస్థానికంబునాఁ బరఁగె; మఱియుఁ గర్ణునరకప్రాప్తియుఁ దన్మోక్షణంబును, స్వర్గంబున భారతవీరులసంగమంబును, గర్మపరిపాకోపభోగంబు నను వృత్తాంతంబుల నొప్పి యిన్నూఱుశ్లోకంబులు గలిగి పదునెనిమిదవపర్వం బై స్వర్గారోహణంబు నాఁ బరఁగె; ని ట్లష్టాదశపర్వంబులు గలిగి.
1.1.66
మ. అమితాఖ్యానకశాఖలం బొలిచి, వేదార్థామలచ్ఛాయ మై,
సుమహద్వర్గచతుష్కపుష్పవితతిన్ శోభిల్లి, కృష్ణార్జునో
త్తమనానాగుణకీర్తనార్థఫల మై, ద్వైపాయనోద్యానజా
త మహాభారత పారిజాత మమరున్ ధాత్రీసురప్రార్థ్య మై.
1.1.67
వ. ఇట్టి మహాభారతంబు ననేకవిధపదార్థప్రపంచసంచితంబు నుపపర్వమహాపర్వోపశోభితంబు నుపద్వీపసంభృతం బయిన భువనం బజుండు నిర్మించినట్లు కృష్ణద్వైపాయనుండు నిఖిలలోకహితార్థంబు దత్తావధానుం డై సంవత్సరత్రయంబు నిర్మించి, దాని దేవలోకంబునందు వక్కాణింప నారదుం బనిచెఁ; బితృలోకంబున వక్కాణింప నసితుం డైన దేవలుం బనిచె; గరుడ గంధర్వయక్ష రాక్షసలోకంబులందు వక్కాణింప శుకుం బనిచె; నాగలోకంబునందు వక్కాణింప సుమంతుం బనిచె; మనుష్యలోకంబున జనమేజయునకు వక్కాణింప వైశంపాయనునిం బనిచె; నే నా వైశంపాయన మహామునివలన విని వచ్చితిఁ; దొల్లి కృతత్రేతావసాన సమయంబుల దేవాసుర రామరావణ యుద్ధంబులునుంబోలె ద్వాపరాంతంబునం బాండవధార్తరాష్ట్రులకు మహాఘోరయుద్ధం బయ్యె; నందు.
1.1.68
తరలము పదిదినంబులు భీష్ముఁ డాహవభారకుండు, గురుండు పం
చదివసంబులు, గర్ణుఁడున్ దివసద్వయంబు, దినార్ధమం
దుదితతేజుఁడు శల్యుఁ, డత్యధికోగ్రవీరగదారణం
బది దినార్ధము గాఁగ నిట్లు మహాభయంకరవృత్తితోన్.
1.1.69
శా. ఏడక్షౌహిణు లెన్నఁ బాండవబలం; బేకాదశాక్షౌహిణుల్
రూఢిం గౌరవసైన్య; మీ యుభయమున్ రోషాహతాన్యోన్య మై
యీడంబోవక వీఁక మైఁ బొడువఁగా నేపారు ఘోరాజి న
ల్లాడెన్ ధాత్రి శమంతపంచకమునం దష్టాదశాహంబులున్.
1.1.70
వ. ఇట్టి మహాభారతంబు కృష్ణద్వైపాయనమహాముని విరచితం బై ప్రవర్తిల్లుచుండు.
1.1.71
సీ. ఇమ్మహాభారతం బిమ్ములఁ బాయక | విహితావధాను లై వినుచునుండు
వారికి విపుల ధర్మారంభసంసిద్ధి | యగుఁ బరమార్థంబ యశ్రమమున
వేదముల్ నాలుగు నాదిపురాణముల్ | పదునెనిమిదియుఁ దత్ప్రమితధర్మ
శాస్త్రంబులును మోక్షశాస్త్రతత్త్వంబులు | నెఱిఁగిన ఫల మగు, నెల్లప్రొద్దు
ఆ. దానములను బహువిధక్రతుహుతజప | బ్రహ్మచర్యములను బడయఁబడిన
పుణ్యఫలముఁ బడయఁబోలు, నశేషపా | పక్షయంబు నగు, శుభంబుఁ బెరుఁగు.
1.1.72
ఉ. సాత్యవతేయ విష్ణుపద సంభవ మై, విబుధేశ్వరాబ్ధి సం
గత్యుపశోభితం బయి, జగద్విదితం బగు భారతీయ భా
రత్యమరాపగౌఘము నిరంతర సంతత పుణ్యసంపదు
న్నత్యభివృద్ధి సేయు వినినం గొనియాడిన నెల్లవారికిన్.
1.1.73
వ. అనిన విని శౌనకాది మహామునులుశ్రీమహాభారత కథా శ్రవణ కుతూహల పరు లయి యక్కథకున కిట్లనిరి.
1.1.74
మ. అనఘా! మున్ను శమంతపంచకము నయ్యక్షౌహిణీ సంఖ్యయున్
వినఁగా మా కెఱిఁగించి భారత కథావిర్భూతికిం గారణం
బును దద్భారత విస్తరోక్తి విభవంబుం బాండవాడంబరం
బును భీష్మాదికురు ప్రవీర చరితంబుం జెప్పు ముద్యన్మతిన్.
1.1.75
క. అనిన విని రోమహర్షణ | తనయుం డమ్మునుల కతిముదంబున వినయా
వనతుఁ డయి గురులఁ దనహృ | ద్వనజంబున నిలిపి కొలిచి వాగ్గణపతులన్.
1.1.76
ఉ. ఇంబుగ సర్వలోకజను లెవ్వనియేని ముఖ్యామృతాంశుబిం
బంబున నుద్భవం బయిన భారతవాగమృతంబు కర్ణరం
ధ్రం బను నంజలిం దవిలి త్రావుదు రట్టి మునీంద్రలోకవం
ద్యుం బరముం బరాశరసుతుం బ్రణమిల్లి కరంబు భక్తితోన్.
1.1.77
వ. అమ్మును లడిగిన కథ యథాక్రమంబున సవిస్తరంబుగాఁ జెప్పందొడంగె.
1.1.78
శా. త్రేతాద్వాపర సంధి నుద్ధత మదాంధీభూత విద్వేషిజీ
మూతోగ్రశ్వసనుండు రాముఁ డలుకన్ ముయ్యేడుమాఱుల్ రణ
ప్రీతిన్ వైరిధరాతలేశ్వరులఁ జంపెం బల్వురన్ దీర్ఘని
ర్ఘాత క్రూరకుఠారలూన నిఖిలక్షత్త్రోరుకాంతారుఁ డై.
1.1.79
వ. అప్పరశురాముండు నిజనిశిత కుఠారధారా విదళిత సకల క్షత్త్రరుధిరాపూర్ణంబులుగా నేను మడుంగులు గావించి తద్రుధిరజలంబులఁ బితృతర్పణంబు సేసి తత్పితృగణప్రార్థన నుపశమితక్రోధుం డయ్యె; దాననచేసి తత్సమీప ప్రదేశంబు శమంత పంచకంబునాఁ బరఁగె; మఱి యక్షౌహిణీసంఖ్య వినుండు.
1.1.80
సీ. వరరథ మొక్కండు వారణ మొక్కండు | తురగముల్ మూఁడు కాల్వురును నేవు
రను సంఖ్య గల యది యగుఁ బత్తి, యది త్రిగు | ణం బైన సేనాముఖంబు, దీని
త్రిగుణంబు గుల్మంబు, దీని ముమ్మడుఁ గగు | గణము, తద్గణము త్రిగుణిత మైన
వాహిని యగు, దాని వడి మూఁట గుణియింపఁ | బృతన నాఁ బరఁగుఁ, దత్పృతన మూఁట
ఆ. గుణిత మైనఁ జము వగున్, మఱి దాని ము | మ్మడుఁ గనీకినీ సమాఖ్య నొనరు,
నదియుఁ బదిమడుంగు లైన నక్షౌహిణి | యౌ నిరంతర ప్రమాను సంఖ్య.
1.1.81
వ. ఇరువది యొక్కవేయు నెనమన్నూట డెబ్బది రథంబులు, నన్ని యేనుంగులు, నఱువదేనువేలు నాఱునూటపది గుఱ్ఱంబులు, లక్షయుం దొమ్మిదివేలున్ మున్నూట యేఁబండ్రు వీరభటులును గలయది యొక్క యక్షౌహిణి యయ్యె; నట్టి యక్షౌహిణులు పదునెనిమిదింట సన్నద్ధులై కురుపాండవులు యుద్ధంబు సేయుటం జేసి యా శమంతపంచకంబు కురుక్షేత్రంబు నాఁబరఁగె; నట్టి కురుక్షేత్రంబునందు.
1.1.82
చ. ప్రతిహతశత్రువిక్రముఁడు పాండవవంశ వివర్ధనుండు సు
వ్రతుఁడు పరీక్షిదాత్మజుఁ డవద్యవిదూరుఁ డుదారకీర్తిని
ర్మిత వివిధాధ్వరుండు జనమేజయుఁ డన్ జనపాలుఁ డుత్తమ
స్తుతమతి దీర్ఘసత్త్ర మజితుం డొనరించె శుభాభికాంక్షి యై.
1.1.83
వ. ఆ ప్రదేశంబునకు సరమ యను దేవశునికొడుకు సారమేయుం డను కుర్కురకుమారుండు క్రీడార్థంబు వచ్చి క్రుమ్మరుచున్న నలిగి జనమేజయు తమ్ములు శ్రుతసేనుండును భీమసేనుండును నుగ్రసేనుండును ననువార లా సారమేయు నడిచిన, నది యఱచుచుం బఱతెంచి తన తల్లికిం జెప్పిన, నా సరమయు నతికోపాన్విత యై జనమేజయునొద్దకు వచ్చి యి ట్లనియె.
1.1.84
క. క్షితినాథ! కడు నకరుణా | న్వితు లై నీతమ్ము లతివివేకవిదూరుల్
మతిఁ దలఁపక నా పుత్త్రకు | నతిబాలకు ననపరాధు నడిచిరి పెలుచన్.
1.1.85
క. తగు నిది తగ దని యెదలో | వగవక, సాధులకుఁ బేదవారల కెగ్గుల్
మొగిఁ జేయు దుర్వినీతుల | కగు ననిమిత్తాగమంబు లయిన భయంబుల్.
1.1.86
వ. అని సరమ యదృశ్యయైన, నతి విస్మితుండై జనమేజయుండు కొన్ని దినంబులకు దీర్ఘసత్త్రంబు సమాప్తంబుసేసి హస్తిపురంబునకుం జని, యందు సుఖం బుండి, యొక్కనాఁడు దేవశునీవచన ప్రతీకారార్థంబు శాంతిక పౌష్టిక క్రియలు నిర్వర్తింప ననురూపపురోహితు నన్వేషించుచు ననేక మునిగణాశ్రమంబులకుం జని యొక్కమునిపల్లెం గని, యందు శ్రుతశ్రవసుం డను మహామునిం గని నమస్కరించి యి ట్లనియె.
1.1.87
క. కరుణించి యిండు నాకుం | బురోహితుఁడు గాఁగ మీసుపుత్త్రుఁ బవిత్రుం
బరమతపోనైష్ఠికు భా | సురయమనియమాభిరాము సోమశ్రవసున్.
1.1.88
వ. అని యడిగి వాని యనుమతంబున సోమశ్రవసుం దనకుం బురోహితుం గావించుకొని వాని నభీష్ట సత్కా రంబుల సంతుష్టునిం జేసి తదుపదేశంబున.
1.1.89
ఉ. ఆయతకీర్తితో వివిధయాగములన్ సుర ధారుణీసురా
మ్నాయము నాహితాహుతి సమంచితదక్షిణ లిచ్చి తన్పుచుం
జేయుచునుండె రాజ్యము విశిష్ట జనస్తుత వర్ధమాన ల
క్ష్మీయుతుఁ డుత్తముండు జనమేజయుఁ డాదినరేంద్రమార్గుఁ డై.
1.1.90
వ. ఇట్లనవరత శాంతిక పౌష్టిక క్రియలు నిర్వర్తించుచు గురుదేవ మహీదేవతర్పణాభిరతుం డై యుండు నంత.
1.1.91
క. పంకజభవసన్నిభుఁ డఘ | పంకక్షాళన మహాతపస్సలిలుఁ డనా
తంకమతి పైలశిష్యుఁ డు | దంకుం డను మునివరుండు దద్దయు భక్తిన్.
1.1.92
క. గురుకులమునందు గురులకుఁ | బరిచర్య లొనర్చి తా నపరిమిత నిష్ఠా
పరుఁ డై జ్ఞానము వడసెను | గురుదయ నణిమాదికాష్టగుణములతోడన్.
1.1.93
వ. అయ్యుదంకుండు గురుహిత కార్యధురంధరుం డయి గురుపత్నీనియోగంబునం బౌష్యుం డను రాజుదేవి కుండలంబులం బ్రతిగ్రహించి తేరంబూని, వనంబులో నొక్కరుండ చనువాఁ డెదుర నొక్క మహోక్షంబు నెక్కి చనుదెంచువాని నొక్క దివ్యపురుషుం గని, వాని పన్నిన వృషభగోమయ భక్షణంబు సేసి, యమ్మహాత్ము ననుగ్రహంబు వడసి, యతిత్వరితగతిం జని, పౌష్యమహారాజుం గాంచి, దీవించి, గృహీతసత్కారుం డై యి ట్లనియె.
1.1.94
తే. ఏను గుర్వర్థ మర్థి నై మానవేశ! | కడఁగి వచ్చితి నిపుడు నీకడకు వేడ్క;
దండితారాతి! నీ దేవికుండలమ్ము | లిమ్ము నా పూన్కి యిది సఫలమ్ము గాఁగ.
1.1.95
వ. అనినం బౌష్యుం డిట్టి మహాత్మున కీఁ గాంచితిఁ గృతార్థుండ నైతి నని సంతసిల్లి యుదంకున కి ట్లనియె: ‘నయ్యా! మదీయ ధర్మపత్ని యక్కుండలంబులు దొడిగి యున్నయది; మద్వచనంబున వాని నిప్పించుకొ’ మ్మనిన నుదంకుం డంతఃపురమునకుఁ జని పౌష్యుమహాదేవిం గానక క్రమ్మఱి పౌష్యుపాలికి వచ్చి. ‘నీదేవి నందులం గాన నీవ ‘యక్కుండలంబులు దెప్పించి యి’ మ్మనినఁ బౌష్యుం డి ట్లనియె.
1.1.96
క. భూవినుత! నిన్నుఁ ద్రిభువన | పావను నశుచి వని యెట్లు పలుకఁగ నగు? న
ద్దేవి పవిత్ర, పతివ్రత | గావున నశుచులకుఁ గానఁగా దనవద్యా!
1.1.97
వ. అనిన విని యుదంకుం డప్పుడు దలంచి ‘యావృషభగోమయభక్షణానంతరంబున నాచమింపమి నైన నా యశుచిభావంబునఁ గా కేమి యప్పరమ పతివ్రత మదీయదృష్టిగోచర గాకున్నదయ్యె’ నని పూర్వాభిముఖుం డయి శుద్ధోదకంబులంబ్రక్షాళితపాణిపాద వదనుండయి యాచమించి పౌష్యానుమతంబున నద్దేవియొద్దకుం జనిన, నదియును నమ్మహామునికి నమస్కరించి కుండలమ్ము లిచ్చి యి ట్లనియె.
1.1.98
క. తక్షకుఁ డీ కుండలము ల | పేక్షించుచు నుండు వాఁ డభేద్యుఁడు మాయా
దక్షుండు వానివలన సు | రక్షితముగఁ జేసి చనుము రవినిభతేజా!
1.1.99
వ. అనిన నుదంకుం ‘డట్ల చేయుదు’ నని యద్దేవి వీడ్కొని పౌష్యుపాలికిం బోయిన, నతం ‘డయ్యా! నీ వతిథివి మాయింటఁ గృతభోజనుండవై పొ’ మ్మని క్షణియించిన, నొడంబడి యుదంకుండు గుడుచుచో నన్నంబు కేశదుష్టం బైన రోసి, కరం బలిగి ‘యి ట్ల పరీక్షితం బైన యశుద్ధాన్నంబు పెట్టినవాఁడ వంధుండ వగు’ మని శాపం బిచ్చిన, నల్గి ‘యల్పదోషంబున నాకు శాపం బిచ్చినవాఁడవు నీ వనపత్యుండ వగు’ మని ప్రతిశాపం బిచ్చిన, నుదంకుండు ‘నే ననపత్యుండఁ గా నోప, దీనిఁ గ్రమ్మఱింపు’ మనినఁ బౌష్యుం డి ట్లనియె.
1.1.100
ఉ. నిండుమనంబు నవ్యనవనీతసమానము, పల్కు దారుణా
ఖండలశస్త్రతుల్యము జగన్నుత! విప్రులయందు; నిక్క మీ
రెండును రాజులందు విపరీతము; గావున విప్రుఁ డోపు, నో
పం డతిశాంతుఁ డయ్యు నరపాలుఁడు శాపము గ్రమ్మఱింపఁగన్.
1.1.101
వ. ‘కావున నా కశక్యంబు నీ యిచ్చిన శాపంబు గ్రమ్మఱింపు’ మనిన నుదంకుం ‘డట్లేని నీకు నల్పకాలంబున శాపమోక్షం బగు’ నని పౌష్యునకు ననుగ్రహించి, ‘మగుడి నేఁడ పోయి గురుపత్నికిఁ గుండలంబు లీఁగంటి’ నని సంతోషించి చనువాఁ డెదుర నొక్క జలాశయంబు గని శుచిప్రదేశంబునఁ దనచేతి కుండలంబులు పెట్టి యాచమించుచున్నంతఁ దనతోడన వచ్చి తక్షకుండు నగ్నవేషధరుండై యక్కుండలంబులు గొని పాఱిన, నుదంకుండును వాని పిఱుందన పాఱి పట్టికొనుడు.
1.1.102
క. విడిచి దిగంబరవేషము | విడువక మణికుండలములు విషధరపతి యే
ర్పడ నిజరూపముతో న | ప్పుడ యహిలోకమున కరిగె భూవివరమునన్.
1.1.103
వ. ఉదంకుండును వానితోడన తగిలి యవ్వివరంబున నురగలోకంబున కరిగి నాగపతుల నెల్ల నిట్లని స్తుతియించె.
1.1.104
చ. బహువన పాదపాబ్ధి కులపర్వత పూర్ణ సరస్సరస్వతీ
సహిత మహామహీభర మజస్ర సహస్ర ఫణాళిఁ దాల్చి దు
స్సహతర మూర్తికిన్ జలధిశాయికిఁ బాయక శయ్య యైన య
య్యహిపతి దుష్కృతాంతకుఁ డనంతుఁడు మాకుఁ బ్రసన్నుఁ డయ్యెడున్.
1.1.105
చ. అరిది తపోవిభూతి నమరారులబాధలు వొందకుండఁగా
నురగుల నెల్లఁ గాచిన మహోరగనాయకుఁ డానమత్సురా
సురమకుటాగ్రరత్నరుచిశోభితపాదున కద్రినందనే
శ్వరునకు భూషణం బయిన వాసుకి మాకుఁ బ్రసన్నుఁ డయ్యెడున్.
1.1.106
ఉ. దేవమనుష్యలోకములఁ ద్రిమ్మరుచున్ విపులప్రతాపసం
భావితశక్తిశౌర్యులు నపారవిషోత్కటకోపవిస్ఫుర
త్పావకతాపితాఖిలవిపక్షులు నైన మహానుభావు లై
రావతకోటి ఘోరఫణిరాజులు మాకుఁ బ్రసన్ను లయ్యెడున్.
1.1.107
ఉ. గోత్రమహామహీధర నికుంజములన్ విపినంబులం గురు
క్షేత్రమునం బ్రకామగతి ఖేలన నొప్పి, సహాశ్వసేనుఁ డై
ధాత్రిఁ బరిభ్రమించు బలదర్ప పరాక్రమదక్షుఁ డీక్షణ
శ్రోత్రవిభుండు తక్షకుఁడు శూరుఁడు మాకుఁ బ్రసన్నుఁ డయ్యెడున్.
1.1.108
వ. అనియి ట్లురగపతుల నెల్ల స్తుతియించి ‘యందు సితాసితతంతు సంతానపటంబు ననువయించుచున్నవారి నిద్దఱ స్త్రీలను, ద్వాదశారచక్రంబుం బరివర్తించుచున్న వారి నార్వురఁ గుమారుల, నతిప్రమాణ తురంగంబు నెక్కినవాని మహాతేజస్వి నొక్క దివ్యపురుషుం గని విపులార్థవంతంబు లైన మంత్రంబుల నతిభక్తియుక్తుం డై స్తుతియించినం బ్రసన్నుం డై యద్దివ్యపురుషుం డయ్యుదంకున కి ట్లనియె.
1.1.109
క. మితవచన! నీయథార్థ | స్తుతుల కతిప్రీతమానసుఁడ నైతి ననిం
దిత చరిత! నీకు నభివాం | ఛిత మెయ్యది దానిఁ జెపుమ చేయుదు ననినన్.
1.1.110
వ. ఉదంకుండు గరంబు సంతసిల్లి ‘యిన్నాగకులం బెల్ల నాకు వశం బగునట్టులుగ ననుగ్రహింపు’ మనిన నప్పురుషుం ‘డట్లేని నీయశ్వకర్ణరంధ్రాధ్మానంబు సేయు’ మనిన వల్లె యని తద్వచనానురూపంబు సేయుడుఁ దత్క్షణంబ.
1.1.111
శా. పాతాళైకనికేతనాంతరమునం బర్వెం దదశ్వాఖిల
స్రోతోమార్గ వినిర్గతోగ్ర దహనార్చుల్, పన్నగవ్రాతముల్
భీతిల్లెన్, భుజగాధినాథు మనమున్ భేదిల్లెఁ గల్పాంత సం
జాతప్రోద్ధత బాడబానల శిఖాశంకాధికాతంక మై.
1.1.112
క. శంకరనిభుఁ డగు విప్రుభ | యంకరకోపాగ్ని యొక్కొ! యనుచును జాతా
తంకుఁ డయి కుండలంబు లు | దంకునకును దెచ్చి యిచ్చెఁ దక్షకుఁ డంతన్.
1.1.113
వ. ఇట్లు నాగలోకంబున కెల్ల మహాక్షోభంబు గావించి తక్షకుచేతఁ గుండలంబులు గొని యుదంకుఁ డాత్మగతంబున.
1.1.114
సీ. ‘కుండలమ్ములు వేగ కొనిరమ్ము నాలవ | నాఁటికి నని పూని నన్నుఁ బనిచె
గురుపత్ని; నేఁడ యక్కుండలంబులు దొడ్గు | దివస; మీ దివస మతిక్రమింప
కుండంగఁబోక యె ట్లొడఁగూడు? ని న్నాగ | భవన మెప్పాట వెల్వడఁగఁ బోలు?
నేఁడు పోవనినాఁడు నిప్ఫలం బిమ్మహా | యత్నమంతయు’ నని యధికచింతఁ
ఆ. దవిలియున్న నయ్యుదంకు నభిప్రాయ | మెఱిఁగి దివ్యపురుషుఁ డిట్టు లనియె:
‘నీహయంబు నెక్కి యేఁగుమ; యిది వడి | గలదు మనముకంటె గాడ్పుకంటె’.
1.1.115
వ. అనవుడు నద్దివ్యపురుషువచనంబున నత్తురంగంబు నెక్కితత్క్షణంబ యయ్యుదంకుండు గురుగృహంబునకు వచ్చె; నిట గురుపత్నియు శుచిస్నాత యై నూతనపరిధానశోభిత యై యక్కుండలంబులు దొడువ నవసరం బైనఁ దదాగ మనంబు గోరుచున్నయది యప్పు డయ్యుదంకుం గని తద్దయు సంతసిల్లి, తదానీతరత్నకుండల భూషిత యై, బ్రాహ్మణులం బూజించి నిజసంకల్పిత మహోత్సవం బొనరించె; నట్లు గురుకార్యంబు నిర్వర్తించియున్న యుదంకుం జూచి గురుం డి ట్లనియె.
1.1.116
క. ఈయున్న పౌష్యుపాలికిఁ | బోయి కడుంబెద్దదవ్వు పోయిన య ట్ల
త్యాయత విమల తపోమహి | మా! యిన్ని దినంబు లేల మసలితి చెపుమా!
1.1.117
వ. అనిన నుదంకుం డి ట్లనియెః ‘నయ్యా! మీ యానతిచ్చినట్ల మసల వలవదు; తక్షకుం డను దుష్టోరగంబు సేసిన విఘ్నంబున నింత మసలవలసె; వినుఁడు: మిమ్ము వీడ్కొని చనువాఁడ నెదుర నొక్క మహోక్షంబు నెక్కి చనుదెంచువాని నొక్కదివ్యపురుషుం గని, వాని పన్నిన వృషభగోమయ భక్షణంబు సేసి చని పౌష్యుమహాదేవి కుండలంబులు ప్రతిగ్రహించి వచ్చుచోఁ దక్షకుచేత నపహృతకుండలుండ నై వాని పిఱుందన పాతాళలోకంబునకుం బోయి నాగపతుల నెల్ల స్తుతియించి, యందు సితాసితతంతు సంతానపటంబు ననువయించుచున్నవారి నిద్దఱ స్త్రీలను, ద్వాదశారచక్రంబుఁ బరివర్తించుచున్నవారి నార్వురఁ గుమారుల, నతిప్రమాణతురగారూఢుండైన యొక్క దివ్యపురుషుం గని, తత్ప్రసాదంబునఁ గుండలంబులు వడసి, తదాదేశంబున నత్తురంగంబు నెక్కివచ్చితి; నిది యంతయు నేమి? నా కెఱింగింపుఁ’ డనిన గురుం డిట్లనియె.
1.1.118
సీ. అప్పురుషుం డింద్రుఁ, డయ్యుక్ష మైరావ | తంబు, గోమయ మమృతంబు, నాగ
భువనంబులోఁ గన్న పొలఁతు లిద్దఱు ధాత | యును విధాతయు, వారి యనువయించు
సితకృష్ణతంతురాజిత తంత్ర మది యహో | రాత్రంబు, ద్వాదశారములు గలుగు
చక్రంబు మాసాత్మ సంవత్సరంబు, కు | మారు లయ్యార్వురు మహితఋతువు,
ఆ. లత్తురంగ మగ్ని, యప్పురుషుండు ప | ర్జన్యుఁ డింద్రసఖుఁడు సన్మునీంద్ర
యాది నింద్రుఁ గాంచి యమృతాశి వగుట నీ | కభిమతార్థ సిద్ధి యయ్యెనయ్య!
1.1.119
క. కర మిష్టము సేసితి మా | కరిసూదన! దీన నీకు నగు సత్ఫలముల్;
గురుకార్యనిరతు లగు స | త్పురుషుల కగు టరుదె? యధికపుణ్యఫలంబుల్.
1.1.120
వ. ‘నీవలనం బరమ సంప్రీత హృదయుండ నయితి; నీవును గుర్వర్థంబునందు ఋణవిముక్తుండ వయితివి; నిజేచ్ఛనుండు’ మనినఁ, దదనుజ్ఞ వడసి యుదంకుం డనేకకాలంబు దపంబు సేసె; నట్టి యుదంకుండు తక్షకు చేసిన యపకారంబునకుం బ్రతీకారంబు సేయం జింతించి యొక్కనాఁడు జనమేజయ మహీపాలుపాలికిం బోయి యి ట్లనియె.
1.1.121
చ. మితహితసత్యవాక్య! జనమేజయ! భూజనవంద్య! యేను సు
స్థితి గురుదేవకార్యములు సేయఁగఁబూను టెఱింగి, వంచనో
న్నతమతి యై యకారణమ నా కపకారము సేసెఁ దక్షకుం
డతికుటిలస్వభావుఁడు పరాత్మవిశేషవివేకశూన్యుఁ డై.
1.1.122
వ. అదియునుం గాక.
1.1.123
చ. అనవరతార్థ దాన యజనాభిరతున్, భరతాన్వయాభివ
ర్ధను, సకల ప్రజాహిత విధాను, ధనంజయ సన్నిభున్, భవ
జ్జనకుఁ బరీక్షితున్ భుజగజాల్ముఁ డసహ్య విషోగ్రధూమకే
తనహతిఁ జేసి చేసె నతిదాంతుఁ గృతాంతనికేతనాతిథిన్.
1.1.124
ఉ. కాదన కిట్టిపాటి యపకారముఁ దక్షకుఁ డేకవిప్రసం
బోధనఁ జేసి చేసె నృపపుంగవ! నీవు ననేకభూసురా
పాదిత సర్పయాగమున భస్మము సేయుము తక్షకాదికా
కోదరసంహతిన్ హుతవహోగ్ర సమగ్ర శిఖాచయంబులన్.
1.1.125
ఉ. ప్రల్లదుఁ డైన యొక్కకులపాంసను చేసినదానఁ దత్కులం
బెల్లను దూషితం బగుట యేమి యపూర్వము? గావునన్ మహీ
వల్లభ! తక్షకాధము నెపంబున సర్పము లెల్ల నగ్నిలోఁ
ద్రెళ్ళఁగ సర్పయాగ మతిధీయుత! చేయుము విప్రసమ్మతిన్.
1.1.126
వ. అని యి ట్లయ్యుదంకుండు జనమేజయునకు సర్పయాగంబునందు బుద్ధి పుట్టించె ననిన విని శౌనకాది మహామును లక్కథకున కి ట్లనిరి.
1.1.127
చ. అమితజగద్భయంకరవిషాగ్నియు నప్రతిహన్యమాన వీ
ర్యముఁ గలయట్టి సర్పముల కా జనమేజయు చేయు సర్పయా
గమున నుదగ్రపావకశిఖాతతులం దొరఁగంగఁ గారణం
బమలచరిత్ర! యేమి చెపుమయ్య వినం గడు వేడ్క యయ్యెడున్.
1.1.128
వ. అని యడిగిన వారికి నక్కథకుం డి ట్లని చెప్పెఁ ‘దొల్లి సర్పకుల జనని యైన కద్రువ శాపంబు కారణంబునం జేసి జనమేజయు సర్పయాగంబున సర్వభక్షకుం డైన యగ్నియందు సర్పంబుల కెల్ల నకాండప్రళయం బైన, దాని భృగువంశజుండైన రురుండు గావించు సర్పఘాతంబు సహస్రపాదుండుడిగించినట్లు జరత్కారుసుతుం డైన యాస్తీకుండుడిగించె; దీని సవిస్తరంబుగాఁ జెప్పెదవినుం’ డని భృగువంశకీర్తనంబు నాస్తీకు చరితంబును జెప్పం దొడంగె.
1.1.129
సీ. భృగుఁ డను విప్రుండు మగువఁ బులోమ యన్ | దాని గర్భిణిఁ దన ధర్మపత్ని
నగ్నిహోత్రమునకు నగ్నులు విహరింపు | మని పంచి యభిషేచనార్థ మరుగ,
నంతఁ బులోముఁ డన్ వింతరక్కసుఁ డగ్ని | హోత్రగృహంబున కొయ్య వచ్చి,
యత్తన్విఁ జూచి, యున్మత్తుఁడై ‘యెవ్వరి | సతి యిది సెప్పుమా జాతవేద!’
ఆ. యనఁగ, నగ్నిదేవుఁ డనృతంబునకు విప్ర | శాపమునకు వెఱచి‘శాపభయము
దీర్చుకొనఁగఁ బోలుఁ, దీర్పరా దనృతాభి | భాషణమున నైన పాపభయము.’
1.1.130
వ. అని విచారించి యప్పరమపతివ్రత భృగుపత్ని యని కలరూపుఁ జెప్పిన, నప్పులోముండు ‘నిది నాకుఁ దొల్లి వరియింపంబడిన భార్య, పదంపడి భృగుండుపెండ్లియయ్యె’ నని వరాహరూపంబున నాసాధ్వినతిసాధ్వసచిత్త నెత్తికొని పర్వం బర్వం, దద్గర్భంబున నున్న యర్భకుండు గరం బలిగి కుక్షిచ్యుతుం డై చ్యవనుండు నాఁ బరఁగె నమ్మునికుమారుని.
1.1.131
క. సముదిత సూర్య సహస్రో | పమ దుస్సహతేజు జగదుపప్లవ సమయా
సమదీప్తి తీవ్ర పావక | సముఁ జూచుచు నసుర భస్మసాత్కృతుఁ డయ్యెన్.
1.1.132
వ. పులోమయు నక్కొడుకు భృగుకులవర్ధను నెత్తికొని నిజాశ్రమంబునకు వచ్చె; నంతకు ముందఱ నా రక్కసునకు వెఱచి యక్కోమలి యేడ్చుచుం బోయినఁ దద్బాష్పధారాప్రవాహంబు మహానది యై తదాశ్రమసమీపంబునం బాఱిన దానికి వధూసర యను నామంబు లోకపితామహుండు సేసె; నంతఁ గృతస్నానుం డై భృగుండు సనుదెంచి బాలార్కుండునుంబోని బాలకు నెత్తికొనియున్న నిజపత్నిం జూచి యసుర సేసిన యపకారంబున కలిగి, ‘యయ్యసుర ని న్నె ట్లెఱింగె? నెవ్వరు సెప్పి’ రనినఁ బులోమ యి ట్లనియె.
1.1.133
క. ఈ యగ్నిదేవుఁ డసురకు | నో యన చెప్పుటయు విని మహోగ్రాకృతితో
నాయసుర నన్ను సూకర | మై యప్పుడ యెత్తుకొని రయంబునఁ జనుచోన్.
1.1.134
క. ‘కుక్షిచ్యుతుఁడై సుతుఁ డా | రాక్షసు భస్మంబు సేసి రాజితశక్తిన్
రక్షించె నన్ను’ ననవుడు | నక్షణమ మునీంద్రుఁ డగ్ని కతిరోషమునన్.
1.1.135
వ. ‘నీ వతిక్రూరుండవు సర్వభక్షకుండవు గ’ మ్మని శాపం బిచ్చిన నగ్నిదేవుం డి ట్లనియె.
1.1.136
క. తన యెఱిఁగిన యర్థం బొరుఁ | డనఘా! యిది యెట్లు సెప్పు మని యడిగినఁ జె
ప్పనివాఁడును సత్యము సె | ప్పనివాఁడును ఘోరనరకపంకమునఁ బడున్.
1.1.137
వ. కావున నే నసత్యంబునకు వెఱచి యక్కోమలి భృగుపత్ని యని కల రూపుఁ జెప్పితి; నఖిల జగత్కర్మసాక్షినై యుండి యసత్యం బెట్లు పలుక నేర్తు? నది నిమిత్తంబుగా నీవు నాకు శాపం బిచ్చిన, నే నలిగి నీకుఁ బ్రతిశాపం బీనోపనివాఁడను గాను; వినుము.
1.1.138
చ. అడిచినఁ, దిట్టినన్, మఱి మహాపరుషంబులు పల్కి యల్కతోఁ
బొడిచిన నుత్తమద్విజులు పూజ్యులు; వారల కెగ్గు సేసినం
జెడు నిహముం బరంబు, నిది సిద్ధము గావు టెఱింగి, భక్తి నె
ప్పుడు ధరణీసురోత్తములఁ బూజలఁ దన్పుదు, నల్గ నోడుదున్.
1.1.139
వ. ‘నీవు బ్రాహ్మణుండవు నీ వెద్ది సేసిన నీక చను; లోకహితుండ నయిన నాకు శాపం బిచ్చి లోకంబుల కెల్లఁజెట్ట సేసితి; వ దెట్లనిన వేదోక్తంబు లయిన నిత్యనైమిత్తిక బలివిధానంబులందు మహాద్విజులచేత నాయందు వేల్వంబడిన హవ్య కవ్యంబులు నాముఖంబునన దేవపితృగణంబు లుపయోగింతు; రట్టి యేను సర్వభక్షకుండ నై యశుచి నైనఁ గ్రియానివృత్తి యగుఁ; గ్రియానివృత్తి యైన లోకయాత్ర లేకుండు’ నని యగ్నిభట్టారకుండు నిఖిలలోకవ్యాప్తం బైన తనతేజోమూర్తి నుపసంహరించిన.
1.1.140
సీ. త్రేతాగ్ను లెల్లను దేజరిల్లమిఁ జేసి | క్రతుకృత్యములు వినిర్గతము లయ్యె;
నగ్ని హోత్రములందు నౌపాసనాది సా | యంప్రాతరాహుతు లంత నుడిగె;
దేవతార్చనలందు దీపధూపాది స | ద్విధులు వర్తిల్లక విరతిఁ బొందెఁ;
బితృకార్యములఁ బితృపిండయజ్ఞక్రియ | లడఁగె విచ్ఛిన్నంబు లై ధరిత్రి;
ఆ. నంత జనులు సంభ్రమాక్రాంతు లై మహా | మునులకడకుఁ జనిరి, మునులు నమర
వరులకడకుఁ జనిరి, వారును వారును | బ్రహ్మకడకుఁ జనిరి భయము నొంది.
1.1.141
వ. బ్రహ్మయు భృగుశాప నిమిత్తంబున నగ్నిభట్టారకు నుపసంహారంబును, సకలలోక వ్యవహార విచ్ఛేదంబును నెఱింగి, యగ్నిదేవు రావించి యి ట్లనియె.
1.1.142
చ. ప్రకటిత భూత సంతతికి భర్తవు నీవ, చరాచర ప్రవృ
త్తికి మఱి హేతుభూతుఁడవు, దేవముఖుండవు నీవ, లోకపా
వకుఁడవు నీవ; యిట్టి యనవద్య గుణుండవు నీకు విశ్వభా
రక! భువనప్రవర్తనపరాఙ్ముఖభావముఁ బొందఁ బాడియే?
1.1.143
వ. ‘అమ్మహాముని వచనం బమోఘంబు గావున నీవు సర్వభక్షకుండ వయ్యును శుచులయం దెల్ల నత్యంతశుచి వై, పాత్రులయం దెల్లఁ బరమపాత్రుండ వై, పూజ్యులయం దెల్ల నగ్రపూజ్యుండ వై, వేదచోదిత విధానంబుల యందు విప్రసహాయుండ వై భువనంబుల నడుపు’ మని, విశ్వగురుండు వైశ్వానరుం బ్రార్థించి నియోగించి భృగువచనంబు ప్రతిష్ఠాపించె; నట్టి భృగునకుఁ బుత్త్రుం డై పుట్టి పరఁగిన.
1.1.144
క. చ్యవనునకు సుకన్యకు ను | ద్భవ మయ్యె ఘనుండు ప్రమతి; ప్రమతికి నమృతో
ద్భవ యగు ఘృతాచికిని భా | ర్గవ ముఖ్యుఁడు రురుఁడు పుట్టెఁ గాంతియుతుం డై.
1.1.145
వ. అట్టి రురుం డను మునివరుండు విశ్వావసుం డను గంధర్వరాజునకు మేనకకుం బుట్టినదాని, స్థూలకేశుం డను మునివరునాశ్రమంబునఁ బెరుఁగుచున్న దాని, రూపలావణ్య గుణంబులఁ బ్రమదాజనంబులయం దెల్ల నుత్కృష్ట యగుటం జేసి ప్రమద్వర యన నొప్పుచున్న కన్యక నతిస్నేహంబున వివాహంబుగా నిశ్చయించి యున్నంత.
1.1.146
తే. కన్నియలతోడ నాడుచు నున్నదానిఁ | బాదమర్దిత మై యొక్క పన్నగంబు
గఱచెఁ గన్నియ లందఱు వెఱచి పఱచి | యఱచుచుండఁ బ్రమద్వర యవనిఁ ద్రెళ్ళె.
1.1.147
వ. దాని నెఱింగి కరుణాకలిత హృదయు లై గౌతమ కణ్వ కుత్స కౌశిక శంఖ మేఖల భరద్వాజ వాలఖిల్యోద్దాలక శ్వేతకేతు మైత్రేయ ప్రముఖులు ప్రమతియు రురుండును స్థూలకేశాశ్రమంబునకు వచ్చి విషవ్యపగతప్రాణ యై పడియున్న యక్కన్యం జూచి దుఃఖితు లై యుండ, నచ్చోట నుండనోపక రురుండు శోకవ్యాకుల హృదయుం డై యేకతంబ వనంబునకుం జని.
1.1.148
చ. అలయక యేన దేవయజనాధ్యయన వ్రత పుణ్యకర్మముల్
సలుపుదునేని, యేన గురుసద్ద్విజభక్తుఁడనేని, యేన య
త్యలఘుతపస్వినేని దివిజాధిప భూసురులార! మన్మనో
నిలయకు నీ ప్రమద్వరకు నిర్విష మయ్యెడు నేఁడు మీదయన్.
1.1.149
చ. అపరిమితాజ్ఞఁ జేసియు మహాపురుషుల్ విషతత్త్వసంహితా
నిపుణులు మంత్రతంత్రములు నేర్చి విధించియు దీనికిన్ విష
వ్యపగత మైన జీవ మిది వచ్చునుపాయము సేయరొక్కొ! నా
తపముఫలంబు నధ్యయనదానఫలంబులు నిత్తు వారికిన్.
1.1.150
వ. అని దీనవదనుం డై యాక్రోశించు వానికి నాకాశంబుననుండి యొక్కదేవదూత యిట్లనియె: ‘నయ్యా! కాలవశంబయిన నెవ్వరికిం దీర్పఁ దరంబుగా; దొక్కయుపాయంబు గలదు; చేయనోపుదేనిఁ జెప్పెద వినుము; నీ యాయుష్యంబునం దర్ధం బిక్కన్య కి’ మ్మనిన రురుం డట్ల చేయుదు నని తన యాయుష్యంబునం దర్ధం బక్కన్య కిచ్చిన నక్కోమలి దొల్లింటికంటె నధికశృంగారసమన్విత యై విషనిర్ముక్త యయ్యె; నట్లు దేవదూత ధర్మరాజానుమతంబునఁ దనచెప్పిన యుపాయంబునం బ్రమద్వరను బంచత్వంబువలనం బాపె; రురుండును దాని వివాహం బై యిష్టోపభోగంబుల ననుభవించుచు నుండి.
1.1.151
క. తనసతి కపకారము సే | సిన పాముల కలిగి బాధ సేయుదు నని చి
క్కని దండము గొని పాములఁ | గనినప్పుడు యడువఁ దొడఁగె గహనములోనన్.
1.1.152
చ. తిరుగుచుఁ బుట్టలం బొదలఁ ద్రిమ్మరు పాముల రోసి రోసి ని
ష్ఠురతర దీర్ఘ దండమున డొల్లఁగ వ్రేయుచు, వచ్చి వచ్చి య
య్యిరవున డుండుభం బను నహిం గని వ్రేయఁగ దండ మెత్తుడున్
‘హరి హరి’ యంచు డుండుభమహాహి భయంపడి పల్కు భార్గవున్.
1.1.153
మత్తకోకిల. ‘ఏమి కారణ మయ్య పాముల కింత యల్గితి? వీవు తే
జోమయుండవు బ్రాహ్మణుండవు సువ్రతుండవు’ నావుడుం
‘బాము లెగ్గొనరించె మత్ప్రియభామ; కేను రురుండ ను
ద్దామసత్త్వుఁడ’ నిన్ను నిప్పుడు దండతాడితుఁ జేసెదన్.
1.1.154
వ. అని రురుం డలిగి కృతాంతకర దండంబుం బోని తనదండం బెత్తికొనుడుఁ దత్క్షణంబ డుండుభంబు ముని యై యెదుర నిలిచినం జూచి రురుం డి ట్లనియె.
1.1.155
క. ‘ఉరగమ వై యుండి మునీ | శ్వరవేషము దాల్చి యున్నవడు వెంతయు న
చ్చెరు; విది యెట్టులు?’ నావుడు | రురునకు ని ట్లనియె మునివరుం డనురక్తిన్.
1.1.156
వ. ‘ఏను సహస్రపాదుం డను మునిముఖ్యుండ; నా సహాధ్యాయుండు ఖగముం డను మునిముఖ్యుం డగ్నిహోత్ర గృహంబున నున్న నే నపహాసార్థంబు తృణమయసర్పం బమ్మునిపై వైచిన, నతం డులికిపడి నా కలిగి. ‘నీవు నిర్వీర్యంబైన యురగంబ వగు’ మని శాపం బిచ్చిన. నేనును ‘మేలంబు సేసిన నింత యలుగ నేల? క్షమియింపు’ మనినం, బ్రసన్నుం డై ఖగముండు నావచనం బమోఘంబు గావునఁ గొండొకకాలంబు డుండుభంబ వై యుండి, భార్గవకులవర్ధనుం డైన రురుం గనిన యప్పుడు శాపవిముక్తుండ వగుదు వనె’ నని సహస్ర పాదుండు రురునకుఁ దనవృత్తాంతం బంతయుం జెప్పి వెండియు ని ట్లనియె.
1.1.157
ఉ. భూనుతకీర్తి బ్రాహ్మణుఁడు పుట్టుడుఁ దోడన పుట్టు నుత్తమ
జ్ఞానము, సర్వభూతహిత సంహిత బుద్ధియుఁ జిత్తశాంతియున్,
మానమద ప్రహాణము, సమత్వము, సంతతవేదవిధ్యను
ష్ఠానము, సత్యవాక్యము, దృఢవ్రతముం, గరుణాపరత్వమున్.
1.1.158
వ. ‘అయ్యా! నీవు బ్రాహ్మణుండవు, భృగువంశ సముత్పన్నుండవు, సర్వగుణ సంపన్నుండ; విది యేమి దొడంగి? తిట్టి దారుణ క్రియారంభంబు క్షత్త్రియులకుం గాక బ్రాహ్మణులకుం జనునే? బ్రాహ్మణు లహింసాపరు; లొరులు సేయు హింసలు వారించు పరమకారుణ్య పుణ్యమూర్తులు: జనమేజయుం డను జనపతి చేయు సర్పయాగంబునందుఁగద్రూశాపంబున నయ్యెడు సర్పకుల ప్రళయంబును, భవత్పితృశిష్యుం డయిన యాస్తీకుండను బ్రాహ్మణుండ కాఁడె యుడిగించె’ నని చెప్పి సహస్రపాదుండు రురునకు సర్పఘాతంబునం దుపశమన బుద్ధి పుట్టించె ననిన విని శౌనకాదిమహామును లక్కథకున కి ట్లనిరి.
1.1.159
ఆ. ఒరులవలనఁ బుట్టు నోటమియును నెగ్గుఁ | బొరయకుండ నరసి పుత్త్రవరులఁ
దగిలి కాచునట్టి తల్లి సర్పములకు | నేల యలిగి శాప మిచ్చె నయ్య!
1.1.160
వ. అని సౌపర్ణాఖ్యాన శ్రవణ కుతూహలపరు లై యడిగిన.
1.1.161
ఉ. రాజకులాగ్రగణ్య! మృగరాజపరాక్రమ! రాజరాజ! వి
భ్రాజితశుభ్రకీర్తి పరిపాండుర సర్వదిగంతరాళ! ఘో
రాజి ముఖోపలబ్ధ విజయ ప్రమదాశ్రిత బాహుదండ! ని
స్తేజిత వైరివీర! కులదీప! మృడప్రియ! విష్ణువర్ధనా!
1.1.162
క. ఆదిక్షత్త్ర చరిత్ర! ధ | రాదేవాశీఃపరంపరావర్ధిత ని
త్యోదయ! సత్యోదిత! విమ | లాదిత్యతనూజ! విక్రమాదిత్యనిభా!
1.1.163
తోటకము. నిరవద్య! నరేశ్వర! నిత్యనిరం | తర ధర్మమతీ! గుణధామ! జగ
త్పరిపూరిత కీర్తి విభాసి! విభా | కరతేజ! నృపోత్తమ! కాంతినిధీ!
1.1.164
గద్య. ఇది సకల సుకవి జన వినుత నన్నయభట్ట ప్రణీతం బైన శ్రీ మహాభారతంబునం దాదిపర్వంబున ననుక్రమణికయును, బౌష్యోదంక మాహాత్మ్యంబును, భృగువంశకీర్తనంబు నన్నది ప్రథమాశ్వాసము.